బహుమతి

Wednesday, November 23, 2022

మాటిమాటికి ఖరీదైన బహుమతులిచిచిపుచ్చుకోవడం మేము పెరిగిన వాతావరణం లో లేదు. ఎవరింటికైనా వెళితే ఇంట్లో పూసిన పండ్లు, పువ్వులు, కరివేపాకు, మునగ కాయలు, ఉసిరికాయలతో పాటు బాలాజీ మిఠాయి బండార్ నించి పాలకోవాలో, కచోరీలో తీసుకెళ్ళడం అందరికీ ఎంత నచ్చేసేదో. పెళ్ళిళ్ళకో పుట్టినరోజులకో ఇచ్చే బహుమతి చిన్నదయినా సరే, ఇచ్చే వస్తువు పనికొచ్చేదో ఆర్టిస్టిక్ గానో ఉండాలని నా అభిప్రాయం. అన్నీ డబ్బుతో వెలకట్టడం నాకు ఇష్టం ఉండదు. ఖరీదైన బహుమతుల కంటే నాకు ఇష్టమైన వైలెట్ రంగు మట్టిగాజులిచ్చిన వాళ్ళు బహు ముఖ్యులైపోతారు నాకు. పనికిరాని పదివేల బహుమతి కన్నా, ఉపయోగపడే డాలరుస్టోర్ వస్తువు మిన్న అన్నది కూడా నాకు అనిపించేస్తుంటుంది మరి. పైగా చిన్నప్పటినించీ ఇంటా బయటా ఎవరికేమి ఇష్టమో కనిపెట్టి, దాన్ని కొని ఇవ్వడం ఇష్టం. స్నేహితులొకరు ఇల్లు కొనుక్కున్నారు. పదిరోజుల్లో గృహప్రవేశం అనీ, తప్పకుండా రావాలనీ చెప్పారు. ఏం కొనాలి అని బాగా ఆలోచించాము. ఆవిడ మా సీతయ్యతో కలిసి పనిచేసేవారు. మా ఇంటికొచ్చినప్పుడు "మొహమాట పడకండి" అన్నప్పుడల్లా, ఆవిడ "నాతో అలాంటి ప్రాబ్లం ఎప్పుడూ రాదు. నాకు మొహమాటం లేకుండా ఏది కావాలన్నా అడిగి తీసుకుంటా, ఒకవేళ మొహమాట పడే పరిస్థితి వస్తే, హింట్ ఇస్తాగా" అనడమే కాకుండా, కావలసింది అడిగే చనువు కూడా ఉందనిపించేలా సరదాగా ఉండేవారు. "చనువు ఉంది కాబట్టి, ఆవిడనే అడుగుదాము ఏం కావాలో" అన్నాను నేను. సీతయ్యకి ఏదో తట్టింది. ఆఫీసులో మాట్లాడుతున్నప్పుడు " ఇంటికి అన్నీ కొనడం అయిపోయిందండీ, ఒక్క కంప్యూటర్ టేబుల్ ఒక్కటీ మిగిలింది " అన్నారని చెప్పారు. మేమిద్దరం దాన్ని ఒక హింట్ లాగా తీసుకుని, టేబుల్ కొనడానికెళ్ళాము. మా అదృష్టం కొద్దీ హోం డిపోలో $175 ఉన్న అందమైన టేబుల్ ని $75 కి సేల్ లో పెట్టారు. అలాంటప్పుడు గబ గబా అమ్ముడుపోతాయి. ఇంక రెండే పీస్ లు ఉన్నాయి. కార్నర్ టేబుల్ ఎల్ షేప్ లో చాలా పెద్దది. ఇంట్లో సగం సామాను వెళ్ళిపోతుంది ఆ అరల్లోకి. భలే నచ్చేసింది మా ఇద్దరికీ. సేల్ కాబట్టి రిటర్న్ తీసుకోము అని చెప్పారు. అయినా సరే, వాళ్ళకొకటి మాకొకటి అని కొన్నాము. రెండూ కార్లో పెట్టడానికి ప్రయత్నించారు కుదరలేదు. షాప్ లో పనిచేసే పిల్లలు ఒక తాడు తెచ్చి ట్రంక్ తలుపు తీసి ఉంచి, గట్టిగా కట్టేసారు. కాస్త దూరం వరకూ బానే ఉంది. తర్వాత ఒక డబ్బా జారి, తాడు వదులయి, తలుపు దడాలున పడబోయి ఆగింది. సాయంత్రం అవడంతో ఆఫీసు నించి ఇంటికెళ్ళే కార్లతో రోడ్డు కిటకిట, ఇంకో వైపు ముద్దలు ముద్దలుగా మంచు కురుస్తోంది. మధ్య లేన్ లో ఉండడం వల్ల, కార్ లోంచి దిగే పరిస్థితి లేదు. వెనక డబ్బా పడిపోతోంది చూసుకో అని పక్క కార్ వాళ్ళు అరచి చెప్పారు. డ్రయివింగ్ కొత్త. కంగారు. ఈ లోపే రైల్వే గేట్ వచ్చింది. అది దాటబోయేంతలో రెండో గేట్ పడబోతూ ఉంది. అదాటున దాటేటప్పటికి డబ్బా పడిపోయింది. పక్కకి ఆపుకుని ఆ డబ్బా ఎత్తి లోపల పెట్టేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చింది. అలా నెమ్మదిగా నడుపుకుంటూ చివరికి వాళ్ళింటికి వెళ్ళాము. ఇల్లు కాస్త ఎత్తుమీద ఉండి, 6 మెట్లున్నాయి. అవి చూసి ఈ వస్తువుని అక్కడికి ఎలా తీసుకెళ్ళడమా అని ఒకటే టెన్షన్ పడ్డాము. ఇంతలో మమ్మల్ని చూసి వాళ్ళు బయటికొచ్చారు. "కొంచెం సహాయపడతారా ఇది ఇంట్లోకి తీసుకెళ్ళడానికి" అని అడిగా మొహమాటాన్ని పక్కనుంచి. "ఏమిటిది" అంటూనే "అయ్యో ఇదే వస్తువు నిన్న రాత్రి కొనుక్కొచ్చాము. ఇల్లు బాగా చిన్నది అందుకని ఇంట్లోకి తీసుకువెళ్ళవద్దులెండి, మీరే తీసుకెళ్ళిపోండి ఏమీ అనుకోకుండా" అన్నారతను. మాకు ఏంచెయ్యాలో తెలియదు. వాళ్ళూ అక్కడే కొన్నారు కాబట్టి, వాళ్ళు కొన్నదే కాక, మేము కొన్నవి కూడా వెనక్కి తీసుకోరు. ఇప్పుడేం చెయ్యాలి? కనీసం ఒక టేబుల్ వీళ్ళకి ఇచ్చేస్తే, ఇంకొక్కదాన్నీ జాగర్తగా సర్దుకుని నిదానంగా ఇంటికెళ్ళచ్చనుకున్న ఆశ కూడా పోయింది. వచ్చిన పని మరచిపోయి, ఇంటికెళ్ళడమెలాగా అని దిగులు పట్టుకుంది. ఒక వైపు కుప్పలు తెప్పలుగా మంచు కురుస్తోంది. ఇంకో గంట ఆగితే చీకటి కూడా పడుతుంది. అదే విషయాన్ని చెప్పి, ఒక సారి ఇల్లు చూసామనిపించి, భోజనాలవీ కేటరింగ్ వారు తెచ్చేవరకూ ఆగకుండానే వెనుదిరిగాము. చాలా కాలానికి ఇంటి నుండి బయటికెళుతున్నామనుకున్న పిల్లలకి చాలా డిసపాయింటుమెంటు. అంతవరకూ చాలా అందంగా ముచ్చటగా అనిపించిన టేబుల్..ళ్ళు ఇప్పుడు చచ్చిన గేదెని మోసుకెళుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఆ మంచులో జారుతున్న కారు, కారులోంచి జారిపోతున్న డబ్బా, తాన్ని తట్టుకోలేక ఉండనా ఊడనా అని చూస్తున్న తాడు, ఏం మాట్లాడితే ఏం విపత్తో అని అరచేతులో ప్రాణాలతో నేను, ఒక్క మాట మాట్లాడినా ఆకాశం ఊడి నేల మీద పడుతుందని తెలిసి మసలుకుంటున్న పిల్లలూ..వెరసి ఎలాగోలా ఇల్లు చేరాము. అక్కడ నించి ఇవన్నీ బేస్మెంట్ లో ఉన్న నివాసానికి తీసుకెళ్ళాలి. ఒకటయితే బానే ఉండు. రెండు తీసుకెళ్ళాలి అదీ, చితికిన మనసులతో.. ద్యావుడా అనుకుంటూ చచ్చీ చెడీ, ఇంట్లోకి మోసుకెళ్ళినా, వాటికి పెట్టడానికి జాగా ఉన్నంత పెద్ద ఇల్లు కాకపోయె. పైగా పార్టీ అని కదా వెళ్ళాము. ఇప్పుడు వంట మొదలెట్టాలి. ఆకలెక్కువయిందంటే అదొక గోల అని నేను కాళ్ళు చేతులూ కడుక్కుని బట్టలు మార్చుకుని అన్నం గిన్నె పొయ్యికెక్కించేసా. "అసలు నీ వల్లే వచ్చింది ఇదంతా" అన్న మాట తో ఉలిక్కిపడ్డా. ఇది వస్తుందని తెలుసుకానీ కొంత పోస్ట్ పోన్ చేద్దామని ప్రయత్నం. అసలే అందరం ఎవరి రీసన్ లతో వాళ్ళం చిరాగ్గా ఉన్నాము కదా? కానీ వచ్చాక తప్పుతుందా? "వాళ్ళింట్లో కంప్యూటర్ టేబుల్ ఒక్కటే కొనాలిట అని చెప్పింది నేనా?" అన్నా తడుముకోకుండా. "మాటవరసకి చెప్పాకానీ, నీ చావు తెలివితేటలే ఆవిడ హింటిచ్చిందని చెప్పాయి" అన్నారు సీతయ్య. "అయ్యా అలా ఏదో లెక్కలేస్తుంటా... ఒకోసారి తప్పవచ్చు నేనేమైనా కలగన్నానా అన్నాన్నేను. "అదిగో అలాంటి తేడా లెక్కలే వెయ్యద్దని చెప్పేది, మళ్ళీ చూస్తే అకవుంటెంట్ అని పేరొకటి, ఒక్కటీ బాలన్స్ కాదు బాలన్స్ షీట్ తో సహా" అన్నారు సీతయ్య కచ్చగా. "అదిగో నన్నేమన్నా అనండి నా బ్యాలన్స్ షీట్ ని తీసుకొస్తే బాగుండదు" అన్నాన్నేను కుములుతూ. "అనక? దేనికైనా ఉపయోగపడిందా అసలు" అన్నారాయన. ఇంకా చాలా ఉన్నాయిలెండి అవన్నీ మీకు తెలిసినవే. అవన్నీ సద్దుమణగవు కానీ, ఈ టేబుల్ ని ఎవరైనా ఫ్రీగా తీసుకుంటారేమో వెతుకుదాం రండి. *** చూసారా, నేను చెప్తూనే ఉన్నాగా, లేదంటే లేదనుకుంటారు కానీ, మనం ఫ్రీగా ఇస్తామన్న వస్తువు మాత్రం ఎంత మంచిదైనా తీసుకోవడానికి ఒక్కరూ దొరకరు. ఇల్లు చిన్నదనో, అది ఫిక్స్ చెయ్యడం రాదనో, దాన్ని మోసుకెళ్ళడం కష్టమనో, కారు లేదనో ఏదో ఒకటి చెప్పుకొస్తున్నారు, మీరే చూస్తున్నారుగా? పోనీ మనమే కార్ లో పెట్టుకెళ్ళి వాళ్ళ ఇంటిదగ్గర దింపి వస్తామని చెప్పినా ఎందుకో వద్దనేస్తున్నారు కదూ? మీకు తెలియదని కాదు కానీ, కెనడాలో అదన్నమాట విషయం. గుడ్-విల్లని ఒకటి ఉంటుంది లెండి, మనకి అక్కరలేనివి అక్కడ పడేస్తే, వాళ్ళు సెకండ్ హ్యాండ్ రేటుకి అమ్ముకుంటారు. అవి అమ్మగా వచ్చిన డబ్బులో, నిర్వహణ ఖర్చులు పోను మిగిలినది ఏవో మంచి పనులకి ఖర్చు పెడతారన్నమాట. అక్కడికి తీసుకెళ్లి ఒకదాన్ని వదిలించుకున్నాక గానీ, రెండవది ఫిక్స్ చెయ్యడానికి చోటు రాలేదు. ఇది ఇలా గుడ్విల్ లో పడేసిన మర్నాడు బస్ లో కలిసిన ఒకావిడ మాట కలిపి, తాము కొత్తగా వచ్చామని, ఫలానా ఫలానా వస్తువులు ఎక్కడ దొరుకుతాయని అడిగిన వాటిలో కంప్యూటర్ టేబులొకటి. పిల్లలు కింద కూచుని చదువుకోలేకపోతున్నారని, కొనాలంటే డబ్బు లేదని, ఎక్కడైనా పాతవి దొరుకుతాయా అనీ అడిగారు. అప్పుడు మీకైతే ఏమనిపిస్తుంది అండీ. కడుపులో ఒక ఫీలీంగ్ .. కదా.. అదే నాకూ వచ్చింది మరి.. గట్టిగా ఏడ్వాలనిపించేంత. ఇది జరిగాక, నా క్రియేటివిటీ పక్కన పెట్టి, గిఫ్ట్ కార్డులనే సాధనం కనిపెట్టి, చిన్నదో పెద్దదో అవే ఇచ్చెయ్యడం మొదలెట్టాం కానీ ఏదో అసంతృప్తి. చాలా మంది వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎవరో ఏదో వస్తువు తెచ్చి పడేస్తే, దాన్ని ఇంకొకళ్ళ ఇంటికి వెళుతున్నప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. అలా కొన్ని వస్తువులు రీసైకిల్ అవుతాయన్నమాట. వాటిలో జాకెట్ ముక్కలు కూడా ఒకటి, వాటి తో పాటు ఇచ్చే చిన్న పసుపు కుంకుమ డబ్బాలతో సహా. మీకొకటి చెప్పాలి. ఒకసారి నాకు ఇంట్లో పసుపు నిండుకుని (అబ్బా అలా అనాలని రూలు అంతే) గబ గబా ఒక చిన్న డబ్బా తెరిచి తెచ్చుకున్నా. మొత్తం పురుగులే. అప్పటి నించీ జాకెట్ ముక్కలు అవీ పక్కన పడేసి చలి కాలానికి పనికొచ్చే ష్రగ్గులో రగ్గులో ఇస్తున్నా. భేషుగ్గా ఉంది అవుడియా అంటున్నారు మా వాళ్ళు. మీరూ అంటారు లెండి నాకు తెలుసుగా. కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని అసలు దేనికి వాడతారో కూడా మనకి తెలియదు. బేకింగ్ సెట్టో, పోర్సిలిన్ బేకింగ్ ట్రే నో తెస్తే, బేకింగ్ అన్న కళ తెలియని నా లాంటి వాళ్ళు ఏం చేసుకుంటారండీ? స్టవ్వు కింద ఉన్న ఓవెన్, బాండ్లీలు, బూరెల మూకుళ్ళు పెట్టుకోవడానికేమో అని మాత్రమే అనుకునేదాన్ని చాన్నాళ్ళసలు. నాతో సమానమైన లోక జ్ఞానం కలిగిన వాళ్ళే నాకు తగిలిన వారు కూడా. దాంతో, వాళ్ళకి అర్థం కాని వస్తువులని, ఎవరింటికో వెళుతున్నప్పుడు గిఫ్ట్ బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళింట్లో పడేస్తే, గిఫ్ట్ కొనే ఖర్చూ తప్పుతుంది, ఫ్యాన్సీ గా ఇచ్చినట్టూ ఉంటుందని ఏవేవో వస్తువులు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం లాగా అన్నమాట. ఈ వస్తువులు చూసీ చూసీ చిరాకేసి, మా ఇంటికొస్తున్నప్పుడు ఏమైనా తెచ్చినవాళ్ళకి ఇంట్లోకి ప్రవేశం లేదనీ, పైగా ఒక కుటుంబం లాగా అయిపోయాము కాబట్టి, మనలో మనం ఇలా కొత్త ఫార్మాలిటీస్ మానేద్దామనీ నచ్చచెప్పేటప్పటికే, ఇంట్లో పేరు తెలియని బోలెడు వస్తువులు. పెప్పర్ సాల్ట్ సెట్లు, మూన్ లయిట్ డిన్నర్ క్యాండిల్ సెట్లూ, కింద మంటపెట్టి పైన చాక్లెట్ పాలు కాచుకునే సెట్లూ, కేక్ పళ్ళానికి మూతపెట్టుకునే సెట్లూ, మధ్యలో సాస్ వేసుకుని చుట్టూ చిప్స్ వేసుకుని తినే పోర్సిలిన్ పళ్ళాల్లాంటి సెట్లూ, ఒక షాట్, గాబ్లెట్స్ (ఏదో లెండి నాకే అర్థం కాదు మీకేం చెప్పను), బీరు గ్లాసులు, మంచి నీళ్ళ గ్లాసులు, వైను గ్లాసులు కాక ఎందుకు ఉపయోగిస్తారో తెలియని అనేకానేకమైన వస్తువులని సులువుగా గుడ్విల్ లో పడేసి వస్తే కానీ ప్రశాంతత లేకపోయింది. ఒకసారి ఎవరో ఇంటికొస్తూ ఒక కప్పు పట్టుకొచ్హ్చారు. పాలో పెరుగో పోద్దామంటే, ఆ కప్పు ఒక వైపు సాగినట్టుంటుంది. " మీరు మొన్న ఇచ్చిన వస్తువు ఏంటండీ భలే ముద్దొచ్చేస్తోంది" అని అడిగా ఆవిడ ఫోన్ చేసినప్పుడు. "ఏమోనండీ తెలియదు, మా వారు కొనుక్కొచ్చారు" అన్నారావిడ, "ఇంకొకరు తెచ్చినది నాకు అర్థం కాక మీకు ఇచ్చాను" అంటే బాగుండదన్నట్టు. మ్యాన్యుఫాక్చరింగు డిఫెక్టేమో అని పరికించి చూసి, ఏదోలే అని గార్బేజ్ లో పడేసా. మరుసటి యాడాది బాక్సింగ్ డే షాపింగ్ కి వెళ్ళినప్పుడు వంట సామాన్ల దుకాణంలో డిస్కవుంట్లని, లోపలికి వెళ్ళగానే ఇలాంటి ఒక వైపు సాగిన కప్పులు బోలెడు కనిపించాయి. ఆ షాపులో పని చేస్తున్న వాళ్ళల్లో, నన్ను మరీ ఊరు దాన్ననుకోదనుకున్న ఒక చిన్న పిల్లని వెతికి పట్టుకుని, "అమ్మాయీ ఇదేంటీ" అనడిగా. నా వైపొకసారి ఎగాదిగా చూసి, "వంట చేస్తున్నప్పుడు అన్నమో కూరో కలిపే గరిటలు కిందా మీదా పెట్టకుండా, దీనిలో పెట్టుకోవచ్చు, సర్వింగ్ స్పూన్ హోల్డరు" అంది. "ఓహో అదన్నమాట. అరే ఇలా నేను పడేసిన చాలా వస్తువులకి అర్థం పర్థం ఉందన్నమాట! ఇలా నాకు అర్థం కాక చాలా పడేసానే" అని బాధ పడ్డా కూడా.. ఒక పాకీస్తానీ జంట పరిచయమయ్యారు ఆ మధ్య పార్కులో. ఒక్క రెండు వీధులవతల ఉంటారుట. మరీ కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు గానీ, మరీ పాత కూడా కాదు. పిల్లలు ఒకే వయసు వాళ్ళవడంతో సంతోషపడిపోయాము ఆడుకోవడానికి తోడుంటారని. ఎవరైనా కొత్త వాళ్ళు కనబడగానే "మా ఇంటికి ఎప్పుడైనా వచ్చెయ్యచ్చు. ఫోన్ లు గట్లా చెయ్యక్కరలేదు. మా ఇంటి ద్వారములు మీ కొరకు ఎల్లప్పుడూ తెరిచియే ఉండును " అనడం మా సీతయ్యకి అలవాటు. గ్రాసరీ చెయ్యడానికెళుతుంటే గుర్తొచ్చాముట, పదకండవుతుండగా వచ్చారు శనివారం. వాళ్ళు ఒక బరువైన వస్తువేదో తెచ్చారు. నా స్నేహితులకంటే చెప్పేసా గానీ, వీళ్ళు కొత్త కదా? "ఏమీ తేవద్దు" అని చెప్పే వీలు లేకపోయింది. వాళ్ళు వెళ్ళాక పిల్లలు అప్పటి దాకా ఆపుకున్న ఉత్సాహాన్ని ఆపుకోలేక " అమ్మా, చుట్టాలు వెళ్ళిపోయారుగా, ఇప్పుడు గిఫ్ట్ విప్పి చూడచ్చా " అని అడిగారు గౌరవంగా. సరే అన్నానో లేదో ఆ డబ్బాలోంచి వచ్చింది పెద్ద షాండ్లియర్, కళ్ళు జిగేలని మిరుమిట్లు గొలుపుతూ! ఎంత పెద్దదో, ఎంత బాగుందో అసలు! దాని అందానికి ముగ్ధురాలినైపోయాన్నేనొక్కసారిగా. అల్లప్పుడెక్కడో హైదరాబాదు నవాబుల ఇల్లు లాంటి ఒక పెద్ద హోటల్ కి వెళ్ళినప్పుడు చూసి ఆహా ఓహో అనుకున్న షాండ్లియర్.. నేను అలా గింగిరాలు తిరుక్కుంటూ అటు వెళ్ళిపోయా. సీతయ్యకొచ్చిన ఇర్రిటేషన్ ధాటికి మళ్ళీ మా బేస్మెంట్ లోకి వచ్చి పడ్డా. ఈ సీతయ్య అంతేనండీ... నేనెక్కడికో వెళదామనుకుంటా కలల్లో. ఆయన్నీ తీసుకుపోదామనుకుంటా. ఆయన ఆ రాగానికి, తాళానికీ తట్టుకోలేడు.. తకిట తకిట అంటూ నన్నూ లాక్కొచ్చేస్తాడు . "ఏమిటంత మురుపు, మైమరపూ ఏం చేస్తామిప్పుడు దీన్ని?" అని అడిగారు భయంగా. భయమెందుకంటారా? రాత్రి షిఫ్ట్ కి వెళ్ళాలి ఆయన. అసలే పగటి నిద్ర రాత్రి నిద్రతో సమానం కాదు. అయినా శనివారాలు పొద్దున్న పని నించి వచ్చాక పాలు కూరలు పళ్ళు అంటూ పిల్లలని తీసుకుని దుకాణాల చుట్టూ తిరుగుతారు. పగలు భోజనాలయాక నిద్రపోతారు. మరి వాళ్ళు వచ్చి వెళ్ళారాయె. కొంత సమయమే ఉంది. మూడు నాలుగు గంటలయినా పడుకోకపోతే రాత్రి నిద్ర ముంచుకురాదూ? ఇల్లేమో మరీ చిన్నది. ఇదేమో ఇంత పెద్ద డబ్బా. పనికొచ్చే వస్తువా అంటే కాదు. ఇంట్లో స్థలం లేదు కాబట్టి, గుడ్విల్ లో పడెయ్యడానికి ఈ సమయంలో వెళ్ళాలంటే కష్టమే కదా మరి. కాసేపాగి నేనొక నిర్ణయానికి వచ్చా. ఆ పాకిస్తానీ ఆవిడకి ఫోన్ చేసి, "భాభీ గారూ, అంత ఖరీదయిన వస్తువులు బహుమతులు తీసుకోవడం మాకు అలవాటు లేదు, కావాలంటే మీ ఇంటి పెరట్లో పూస్తున్న ఒక లిల్లీనో, గులాబీనో ఇచ్చి ఇది పట్టుకెళ్ళిపోరూ" అని గారంగా అడిగా. నీ గారం నయాగరాకెళ్ళా అన్నట్టు ప్రేమగా నవ్వి, "మీరు మాకు భలే నచ్చారు, మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు మా గుర్తుగా దీన్ని పెట్టుకోవాలి ఇది నా కోరిక" అంది. "అది ఇప్పటి మాట కాదు కదా, ఇల్లు కొనగానే, మిమ్మల్ని షాప్ కి తీసుకెళ్ళి అచ్చం ఇలాంటిదో, ఇంతకంటే మంచిదో అడిగి కొనిపించుకుంటా కదా మీకు ఎందుకు బెంగ, మా తల్లి కదూ ఇప్పుడు మాత్రం వద్దు, ఇల్లు చూసారుగా. స్థలం కూడా లేదు, దీన్ని దుకాణంలో ఇచ్చేద్దాం" అన్నాను . "నీకొక నిజం చెప్పనా? మేము చాలా చిన్న అపార్టుమెంటు కొన్నాము. గృహప్రవేశం పార్టీ సందర్భంగా వచ్చిన మా తెలిసున్నవాళ్ళలో ఇద్దరు షాండ్లియర్లే పట్టుకొచ్చారు. పెట్టుకుందామన్నా, ఇల్లు కొన్నప్పుడే ఫిక్చర్లన్నీ ఉన్నాయి, వీటిని ఏమిచేసుకోవాలో తెలియక, ఎవరింటికెళ్ళినా పట్టుకెళుతున్నాము. వాళ్ళు వద్దంటున్నారు. నువ్వు అలా వద్దనకు నేను బాధ పడతా" అంది. "నా తల్లే" అనుకుని, ఆ డబ్బాని ప్రస్తుతం డయినింగ్ టేబుల్ లా వాడుకుందామా బరువుగా పడి ఉంటుంది అని ఇంటి మధ్యకి పట్టుకొచ్చి , దానిమీద ఎంబ్రాయిడరీ ఉన్న ఒక చున్నీ పరిచా.. పిల్లలు సరదా పడిపోయి ప్లేట్లు పట్టుకుని దాని చుట్టూ కూచుని భోజనం చెయ్యడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. సీతయ్యకి ఇంక రెండు మూడు గంటలే ఉంది కాబట్టి, తనని పడుకోమని, ఆ డబ్బాని నెమ్మదిగా మెట్లెక్కించి డ్రయివ్ వే పక్కనున్న చెట్టు దగ్గర పెట్టాము. ఇంకో విషయం చెప్పాలి. మనకి అక్కరలేని ఏదైనా వస్తువు ఉంటే, మన ఇంటి ముందు రోడ్డు వారగా పెడితే ఎవరికైనా కావలిస్తే తీసుకెళతారు. కానీ మేము ఉంటున్న ఇల్లు చిన్న చంద్రవంకలా ఉన్న వీధి లో మెయిన్ రోడ్డుకి కొంత దూరంలో ఉన్నమూలాన, ఈ నాలుగిళ్ళవాళ్ళు తప్ప ఈ వీధిలోకి బయటి వాళ్ళు వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ పెట్టి చూద్దాం, కనీసం రేపటి వరకైనా ఇరుకిరుకుగా ఇంట్లో ఉంచక్కరలేదు అని ముగ్గురం సంతోషపడ్డాము. రెండు రోజులు ఆశగా చూసా ఎవరైనా తీసుకెళ్ళారేమోనని! అదక్కడే ఉంది నన్ను హేళన చేస్తూ! రెండు రోజులు తెరిపిచ్చిన మంచు మళ్ళీ కురవడం మొదలయింది. పైన డబ్బా తడిసిందంటే, ఆ లోపలి అందమైన వస్తువు ఎవరికీ పనికిరాదన్న మధ్యతరగతి మనసు దాని చుట్టూనే తిరిగింది. మా ఇల్లుగల వాళ్ళకి ఇంటా బయటా బోళ్ళు సామాను. గారేజీ కూడా చెత్తా చెదారం తో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడూ ఏమీ అడగని దాన్ని ఇంటివాళ్ళని బతిమాలి వాళ్ళ గారేజీలో ఈ రెండు రోజులూ ఆ పెట్టెని పెట్టేటట్లూ, శనివారం పొద్దున్నే తీసుకెళ్ళి గుడ్విల్ లో పడేసేటట్ట్లు ఒక ఒడంబడిక చేసుకొచ్చా. దానికి ప్రతిఫలంగా శనివారం పూట పులిహారా రవ్వలడ్డులు నైవేద్యం ఇస్తానని మొక్కు పెట్టాననుకోండి, అది వేరే విషయం. అలా దాన్ని ఆ శనివారం గుడ్విల్ వైపు ప్రయాణం కట్టించినా, ఆ షాండ్లియర్ తాలూకు మెరుపులు నా కళ్ళల్లో తళుకుమంటూనే ఉండేవి చాలా రోజులు. ఇలా ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, క్షణం తీరిక లేని, దమిడీ ఆదాయం లేని పనులు బోలెడు మాకు, గుడ్విల్ కీ మధ్య నడిచాయి, నడుస్తూనే ఉన్నాయి. అదొక తీరని బంధం అంతే..A

0 వ్యాఖ్యలు: