గులాబీ గుచ్ఛము

Tuesday, November 15, 2022

  


చిత్రం: తూలిక 

10 ఆగస్టు 2022

"ఇవాళ షెర్రీ వాళ్ళు డౌన్ టౌన్  వెళుతున్నారు. వాళ్ల పెళ్లి రోజు కదా" అంది ఆనబెల్. "ఎన్ని రోజుల కోసం ?" అనడిగాను కొంచెం దూరంలో ఎక్కడికైనా వెళ్ళచ్చు కదా అని మనసులో అనుకుంటూ. "ఇవాళ ఆఫీస్ అయ్యాక హోటల్ కి వెళ్ళి, మళ్లీ పొద్దున్నే ఎవరి ఆఫీస్ కి వాళ్ళు వెళ్ళిపోతారు" అంది. ఈ దేశాల్లో ఎవరినీ వ్యక్తిగత ప్రశ్నలు అడక్కూడదని ఊరుకున్నా కానీ, ఆనబెల్ చెప్పిన వివరాలు విని, ఇదేమిటి?  కొన్ని గంటల కోసం అంత ఖర్చు ఎందుకు? అని నాకు కొచ్చన్ల మీద కొచ్చన్ లు. ఆవిడ చెప్పిన లెక్క అంతా కేవలం కొన్ని గంటల కోసం అంతే! పదిగంటలన్నా లేదు! అయినా పూర్తి రోజుకి చార్జ్ చేస్తాడు, వేస్ట్ కదా? అమ్మో ఎంత ఖర్చో! డౌన్ టౌన్ లో  హోటల్ అంటేనే బాగా ఎక్కువ. ఇంక వాలెంటైన్స్ డే లాంటి ఇలాంటి రోజుకి ఇటో వారం అటో వారం చెప్పనే అక్కర లేదు.   ఉమ్మడి కుటుంబంలో ఉండి ప్రైవసీ దొరక్క వెళుతున్నారా అంటే అదీ కాదు. జేసన్ చదువుకుంటూ విద్యార్థిగా వచ్చాడు. అతని కుటుంబమంతా ఫిలిప్పైన్స్ లోనే. గత సంవత్సరం పెళ్ళి చేసుకుని, ఈ మధ్యే కొత్త అపార్ట్మెంట్ కొనుక్కున్నారు ఇద్దరూ. డబ్బు ఎక్కువైతే ఏం చేసుకోవాలో తెలియదేమో అనుకున్నా సరదాగా.

మా ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్ తలుపుకి దగ్గరగా నా డెస్కు. పని చేసుకుంటుండగా తలుపు దగ్గర తచ్చాడుతున్నారెవరో. షిప్పింగ్ ఏరియా మిస్ అయి ఇటు వచ్చేస్తారు ట్రక్ డ్రైవర్లు ఒక్కోసారి. కాబట్టి, షిప్పింగ్ కి దారి చూపిద్దామని వెళితే పూల బొకే తో ఫ్లవర్ షాప్ నించి పిల్లోడు. "ఇమరు" కోసం వచ్చాయి పూలు, ఇంకాసేపట్లో డయానా కోసం పూలు డెలివరీ చేసాడు ఇంకో పిల్లోడు. 11.30 అవుతుండగా ఆనామరియా భర్త నించి ఫోన్ వచ్చిందిట. "ఇద్దరం లంచ్ డేట్ అనుకున్నాం ఇవాళ, కాస్త లేట్ గా వస్తా మ్యానేజ్ చేసేస్తావుగా" అంటూ పరిగెత్తింది. ఈ నగరానికి ఏమయింది అన్నట్టు అయోమయంగా చూసాన్నేను. 


ఏమిటీ పిచ్చి అసలు.. ఏదో తలా తోకా లేనోడెవడో పెట్టుకున్న రోజుకి ఇంత పడిపోతారా జనాలు. అమ్మో అమ్మో చిన్న చిన్న జీతాల వాళ్ళు కూడా ఇంత ఖర్చు ఎలా పెడుతున్నారు?  ఇవన్నీ పెడితే మా భవానికి కీమోలన్నీ అయిపోవూ.. డబ్బులేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తోంది పాపం అనుకున్నా ఉస్సూరంటూ. 

లంచ్ టైం అవడం తో మా సీతయ్య నించి ఫోన్.. పోస్ట్ డబ్బా చెక్ చేసావా అని. తను ఆ మధ్యే అమెరికాలో ఉద్యోగం అని వెళ్ళారు. మొత్తం వీధికి కలిపి వీధి మొగన ఉంటుంది పోస్ట్ డబ్బా. ఎవరి ఇంటి నుంబర్ ఉన్న డబ్బా కి ఆ డబ్బా తాలూకు తాళాలు ఇస్తారు ఇల్లు కొనుక్కున్నప్పుడే. పోస్ట్ మాన్ ఇల్లిల్లూ తిరక్కుండా ఎవరి ఉత్తరాలు వాళ్ళ డబ్బాలో పడేసి పోతాడు. ఆ తాళం పట్టికెళ్ళి ఎవరి  ఉత్తరాలు వాళ్ళు తెచ్చుకోవాలి. ఉత్తరాలు తెచ్చుకోవడం ఎప్పుడైనా ఆలస్యం అయిందంటే, ఏ కరెంట్ బిల్లో కట్టడం ఆలస్యం అయిపోతుందని మా సీతయ్యకి టెన్షన్.  అన్నీ లెక్క ప్రకారం జరిగిపోవాలి అనుకునే మనిషి కాబట్టి పోస్ట్ చెక్ చేసామో లేదో అని నన్ను చెక్ చేస్తూ ఉంటారిలా. 'అబ్బా.. రోజూ ఒకటే ప్రశ్నా" అని నీరసంగా నిట్టూర్చి, "ఇవాళ మా ఆఫీస్ లో ఎన్ని వింతలు జరిగాయో తెలుసా? అదేదో ప్రేమికుల రోజుట, ఆనబెల్ కూతురు షెర్రీ వాళ్ళు ఒకే ఒక పూట కోసం డౌన్ టౌన్ లో ఖరీదైన హోటల్ బుక్ చేసారుట. విచిత్రం ఏమిటంటే, మొన్న కొన్న అపార్ట్మెంట్ కూడా హోటల్ అంత సదుపాయం గానూ ఉంది. ఉండేదీ ఇద్దరే. పోనీ ఇంకో ఊరైనా కాదు అరగంట దూరం. అలాగే  ఇమరూ కి, డయానా కి పూలు పంపారు వాళ్ళ వాళ్ళు వింతగా. ఇమరూ ని డ్రాప్ చేసి ఇంకా గంట కూడా కాలేదు, అవేవో ఇక్కడికి వచ్చేటప్పుడు కొనడమో, ఇంటికి వెళ్ళాక ఇవ్వడమో చెయ్యచ్చు కదా? డెలివరీ చార్జెస్ అదిరిపోతున్నాయి ఇవాళ!  ఆనమరియాని వాళ్ళ ఆయన  లంచికి తీసుకెళ్ళాడు ఇప్పుడొచ్చి. ఇవన్నీ ఏంటో విచిత్రం గా ఉన్నాయి. అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. మనకి చాలా విషయాలు తెలియవు తెలుసా" అన్నాను తెలియని కొత్త విషయాలేవో తెలుసుకున్న శాస్త్రజ్ఞురాలిలా. అవును నేర్చుకోవాలి అంటూ ఫోన్ పెట్టేసారు సీతయ్య.  

ఒక అరగంటలో మళ్ళీ మొదట వచ్చిన పూల అబ్బాయి ఆఫీసు ఎంట్రన్స్ దగ్గర వేచి చూస్తూ కనిపించాడు. తలుపు దగ్గరికి వెళ్ళగానే  8 గులాబీలున్న గుత్తిని, చిన్న గుండెకాయ లాంటి ఎర్రసీసాలో పెట్టి నా పేరుతో వచ్చిందని నా చేతిలో పెట్టి పోయాడు. డెస్క్ దగ్గరకొచ్చి కూచోగానే బ్యాంక్ జాయింట్ అకౌంట్ నించి డబ్బు కట్ అయినట్టు మెసేజీ. చూస్తే.. ఫ్రెష్ ఫ్లవర్స్ షాప్ కి 185.73 డాలర్లు చెల్లింపు జరిగినట్టు వచ్చింది. గుండె ఆగిపోయింది నాకు.  8 పువ్వులకి 185 డాలర్లా.. వామ్మొ వామ్మొ అని మండే గుండెల్ సినేమా చూసినంత మసిలిపోయా. సీతయ్యకి ఫోన్ చేసి చెడామడా తిట్టిపోసా. " ఏమీ ఫర్వాలేదు, బంతిలో బలపక్షంలా ఆఫీసులో అందరికీ పూలు వస్తే, నీకెందుకు రాకూడదు. కొత్త సంప్రదాయాలు ఉంటే, మనమూ ఫాలో అవుదాం తప్పేముంది? అయితే, పూల షార్టేజ్ ట ఇవాళ. ఆ ఎనిమిది పువ్వుల గుత్తులే ఆఖరున మిగిలాయి అన్నిచోట్లా. చాలా దుకాణాలు వెతికా తెలుసా ఆన్లయిన్ లో. మధ్యాహ్నంకల్లా అన్నీ ఖాళీ అయిపోయాయిట. లకీగా ఇవన్నా దొరికాయి" అన్నారు కులాసాగా. నాకు మా భవాని గుర్తొచ్చి ఏడుపొచ్చేసింది. అందరం తలో చెయ్యీ వేస్తే కాన్సర్ ఆపరేషన్ జరిగింది మొన్న వారం. ఇంక 8 కీమోలకి ఒక్కో దానికి పదేసి వేలు,  కొన్ని రేడియేషన్లూ మిగిలి ఉన్నాయి. అవి అయితే కానీ తను బయటపడ్డట్టు కాదు మరి. మనసంతా చేదు తిన్నట్టయి, థాంక్యూ అని చెప్పి పెట్టేసా. 

మర్నాడు ఆనబెల్ చెప్తోంది " పిల్లలని చూసి చాలా నేర్చుకోవాలి అసలు.  మన జెనరేషన్ కి తెలియని ఎన్ని కొత్త సిద్ధాంతాలో! షెర్రీ వాళ్ళు కొత్త ఇంట్లో ఇద్దరే ఉంటున్నప్పటికీ,  రోజూ ఉండే ఇంట్లో అంట్లు తోమాలా బట్టలు ఉతకాలా అని పనులు గుర్తొస్తాయి తప్ప సంతోషంగా అన్నీ మరచిపోయి ఉండలేము కదా? అందుకే ప్రత్యేక దినాలు వచ్చాయంటే వాళ్ళు ఒక్క పూట కోసమైనా సరే, ఇంటికి పది అడుగుల దూరంలో ఉన్నా సరే, హోటల్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. చూడు అప్పుడే దింపి వెళ్ళిన జాషువా పూలు పంపితే ఇమరూ  ఎంత ఆశ్చర్య పోయిందో.. సాయంత్రం కలిసి భోజనం చెయ్యడం మామూలే, కానీ ఎవరైనా ఆఫీస్ దగ్గరికొచ్చి మధ్యాహ్న భోజనానికి తీసుకెళితే అది ఎంత ప్రత్యేకత కదా మరి" అంది. 

నాకు అవన్నీ బుర్రకి ఎక్కలేదు.. 8 పువ్వులు, డొక్కు హార్ట్ షేప్ సీసా, 185 డాలర్లు.. అంటే దాదాపు వారం జీతం..ఒకవేళ  అటు పంపి ఉంటే, భవానికి ఒక కీమో ఖర్చు.. అదే గుర్తొస్తోంది మాటిమాటికీ .. 

"థింక్ హై" అంటోంది ఆనబెల్. అలా థింక్ చెయ్యాలంటే మనమో మనసో ధనవంతులు అయి ఉండాలేమొ అనుకున్నా చిరునవ్వు చెదరకుండా జాగర్త పడుతూ!

0 వ్యాఖ్యలు: