కాజా లడ్డూ మోరియా

Tuesday, November 15, 2022

    31 ఆగస్టు 2022 

"నా లెక్కల పుస్కం పెట్టిన లెక్కలు మంచిగ రావాలె" అన్నది సరూప. 

"ఏయ్.. ఏ బుక్ పెట్టాల్నో తెలుస్తల్లేదే.. అట్ల బెట్టాల్నాంటే నాకు అన్నిట్ల ఎర్రయే ఒచ్చిపాడయినయి రిపోర్ట్ కారట్ల.." అన్నది చంద్రకల. 

"బొమ్మలల్ల, ఫోట్వలల్ల సూడమాయే.. గణేశుని పక్క పొంటి సరస్వతీ దేవి ఉంటది గద.. గందుకే పుస్కాలు బెట్టాలే . ఏది వెట్టిన మంచిదే నంట.. నాయిన జెప్పిండు" అన్నది పంతులు బిడ్డ పద్మ. 

"అన్నమయితేనేమిరా సున్నమయితేనేమిరా- పాడు పొట్టకు అన్నమే తిందాం అన్నట్టు నేనైతే లెక్కల బుక్కే పెడతనబ్బా.. జెర మంచిగ రాకుంటే ఇంజనీరింగ్ ల రాదంట.." అన్న నేను నగుకుంట.. 

"పెట్టు పో పొల్లా.. నువ్వు ఇంజినీరయ్యి మీ అయ్యకిన్ని గంజి నీరు పోస్తెనే మంచిగ..పెట్టు" అన్నది సరూప మజాక్ జేస్కుంట. 

ఒకటే కంపౌండుల మస్తు ఇండ్లు. అమ్మలకి పర్ఫెక్ట్ గ పనులు పంచుడు ఎట్ల దెలుస్తుండెనో.. పెద్దక్క గిట్ల పొదుగాల్నే సానిపి జల్లి, ముగ్గులేసి, తానం జేస్కోని అమ్మ ఎన్క  పొయ్యి కాడ ఉందురు. బయట కట్టెల పొయ్యి చూస్కుంట బగోనెల కెంచి లీలు బక్కెట్ల బోసి, బకెట్ తీస్కపొయ్యి బాత్రూం కాడ బెట్టుడు, బాయిల నీల్లు చేదుకొచ్చి సల్ల నీల్లు బగోన్ల ఇన్ని బకెట్ల ఇన్ని పోసుడు, అందరికి తానాలకి చూసుడు నాయిన పని. ఒకొక్కల్లకి తానం చెయ్పిచ్చి కొత్తబట్టలు తొడుగుడు చిన్నక్క పని. మొగపిల్లలు తానాలు జేసినంక ఆకులు తెంపుకరానీకి అడివికి బోదురు. ఇయాల లెక్క ఒక్కొక్క ఆకు దానికొక పేరు, ఇదే ఆకు బెట్టాలె అన్నట్టేమి లేకుండె. దొరికిన ఆకులు దొరికిన కాడికి తెంపుకొద్దురు. వస్త వస్తా జెరన్ని కల్వ పూలు తెద్దురు. ఇంటికాడ ఆడివిల్లలు ఇంట్ల చెట్లకి ఉన్న పువ్వులు తెంపుతుండంగనె  నాయిన పాలవల్లి గట్టి మక్కబుట్టలు, చిత్తల పండ్లు, సేపులు పువ్వులు కడుతుండె. అయి కడుతున్నప్పుడె పూజ అయినంక ఎవలెవలేదేది తీస్కోవాల్నో లెక్కలు అయితుండె.  భక్షాలు గిట్ల ఎక్కువేమి చేస్కోకపొయ్యేది. పులిగోర , షామంగాలు చేసుడే మస్తు మస్తు అయితుండె. కాంపౌండుల అందరు ఆడొల్లు ఒక వారం ముందు నించే షామంగాలు జేసి గాలికి ఆరబెడుదురు. ఇంట్ల పొదుగాల పూజ అయినంక పొద్మీకి అంద్రం గుడి కాడ్నే. రెండ్రోజుల ముందు నించే గుడికెంచి ధూం ధాం పాటలొస్తుండె. పండుగ అంటె ఇట్లుండాలె అన్నట్టుటుండె ఆ పాటలు. పొదుగాల ఏందిబై లొల్లి అని గుడి పక్కపొంటి ఉన్నోల్లు అంటున్రి. యాడాదికొక్కపారి సైసకుంటే ఎట్ల అని పెద్దోల్లు తిట్టిపెడుదురు. ఒక్కొక్క రూపాయి చందా ఇయ్యనీకి చాన మందికి ఎల్లకుండె. పదిపైసలిచ్చిన మంచిదే పరమాత్ముని శావకు అనుకుందురు. పంతులు మైకుల సదువుతుండంగా ఊరంత ఇనొస్తున్న పూజలు ధూం ధాం అయితుండె. ఇంట్ల జేసుకున్నది వేరే గుడికాడి పులిగోర బుక్కుడు మస్తు మంచిగ్గొడుతుండె.   

యాడాది అయితనే ఉంది.. ఏప్రిల్ల పరీక్షలయినయి జూన్ ల రిసల్టులొచ్చినయి. అంద్రం కన్న కలలన్ని ఒక్కపారి కూలినయి. గదేందో కంప్యూటరంట ఇంటరు బోరుడుల దాని తోనే లెక్కలు జేసిన్రంట. మొద్దు మొద్దు మొకాలు పాసయ్యి కూకున్రు. చాన క్లెవరని టీచర్లు మెచ్చినోల్లు, ఇస్కూలు ఫస్ట్ ఒచ్చెటోల్లు ఫెయిలయ్యిర్రు. ఇప్పటి లెక్క ఆత్మఅత్యలు లేనిదే మంచిగయింది గని.. అందరికి మనాది వట్టింది. లెక్కల బుక్కు గనేషుని కాడ బెట్టి మొక్కినోల్లకి పాసు మార్కులన్న రాకపోతయా అని పరేషాన్ అయినోల్లు అయితున్నట్టే ఉన్నరు.  ఊరంత ఒకటే చెప్పుకున్నరు గిట్ల గిట్లయిందంట.. గిసొంటి పిల్లలు ఎట్ల ఫెయిలయ్యిన్రో.. గీ కంప్యూటర్ నోట్ల మన్నువొయ్య అని తిట్టుకున్రు.  

ఒక దిక్కు డాక్టర్లకు, ఇంజనీర్లకు ఎంట్రెన్స్ పరీక్షలు రాసి పాసయ్యి కూసున్నోల్లకి ఇంటరు ఫెయిలవుడేందో సమఝ్ గాక తీరు తెన్ను తెల్వకపాయె.  "అయ్తె మానె తియ్యి, టైలరింగు, టైప్ షాట్ హాండ్ నేర్సుకుంటె మంచిగ" అని పెద్దోల్లు సెప్పినట్టు మొకాలు కిందికి జేస్కోని టైపు ఇన్స్టిట్యూట్ ల కాడికి పోవట్టిన్రు. అయ్యొ ఇట్లాయె గనేషుడేం జేస్తుండో అని దేవున్ని తిట్టవట్టిన్రు. గుడికి పోవుడు జెర తక్వజేషిన్రు. 

యనకన్ని ఎర్కనే..   ఉత్తుత్తగ జెర పెరేషాన్ జేసి నగుకుంటడని పంతులు చెప్తుండె. గది నిజమే గావొచ్చు.. ఇట్ల కంప్యూటర్ తప్పులు చేసినందుగురించెలి ఫలితాలు గల్లంతయినయని పేపర్లల్ల రాసిన్రు. మల్ల రి వాల్యూ గిట్ల చేస్తరా అని అడగనీకి మా ఊర్ల ఎవ్వలకు తెల్వకుండె, తెల్వి లేకుండె.  ఇస్కూలోల్లు గుడంగ అంత పెద్ద పనులల్ల చేతి బెట్టనీకి ఉర్కులాడకుంటుండె. సర్కారు ఇస్కూలు.. "సదువుకుంటె మీకె మంచిగ సద్వకుంటె బర్రెల గాస్కోండ్రి. మా జీతాలు మాకొస్తయి" అంటుండె మా సార్లు. ఇస్కూల్ పేరు పేపర్ల రావాల్నని ఉర్కులాట ఏ ఇస్కూలోల్లకి లేకుండె. ఇగ మా  సదువులాడనే ఆగిపోతయో అనుకుంటుండంగ సావనం గుడంగ దాటిపోయింది.   


ఒక దినం అంద్రం అరుగు మీద కూసోని ముచ్చట్లు వెడుతుండంగ పెద్దన్న పేపర్ దీస్కోని సైకిల్ దిగి,  ఆగమాగం మాట్లాడిండు. అన్నిట్ల మంచిగొచ్చి ఒక దాంట్ల పోయినోల్లకి 3 మార్కులు గ్రేస్ ఇస్తనని పేపర్లల్ల ఏపిచ్చిండంట ఎంటీ రామారావు సారు. అగ్గ చూసిన్రా మా గనేష్ దేవుని మహిమ ! గనపతి బప్ప మోరియా కాజా లడ్డూ మోరియా అనుకుంట, మల్లొక్క పారి లెక్కల పుస్కాలు పూజల వెట్టి  ఆ యాడాది గనేష్ పండుగ జేస్కున్నంక మా ఊళ్ళె చాన మందిమి డిగ్రీ కాలేజీ గేటు తొక్కినమన్నట్టు.

0 వ్యాఖ్యలు: