చిత్రం: తూలిక, కెనడా
జులై 20, 2022)
సాయంత్రం భోజనాలప్పుడు పిల్లలు కబుర్లు చెప్తున్నారు. మాల్ లో ఉన్న వాళ్ళ ఆఫీస్ ముందు ఉన్న సోఫా మీద ప్రతి రోజూ ఒక పంజాబీ సీనియర్ సిటిజన్ వచ్చి కూచుంటారని ఆయన తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటారని, ఆయనకి మతిభ్రమణమని వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళు అనుకుంటున్నారని చెప్పింది పాప. నేను గట్టిగా నవ్వాను అన్నం గిన్నె టేబుల్ మీద పెడుతూ. అందరూ నన్ను చూసారు ఏమిటన్నట్టు. నేను చెప్పడం మొదలెట్టాను.
"2006 లో నాలుగు బస్సులు ఎక్కి ఆఫీస్ కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు చివరి బస్ ఎక్కే బస్ స్టాప్ లో ఒక్కో సారి నేను ఎక్కాల్సిన బస్ 5 నిమిషాల ముందే వెళ్ళిపోయేది. అలాంటప్పుడు అక్కడ నించోకుండా పది నిమిషాలు నడిచి, మరో ఇంటర్సెక్షన్లో బస్సు ఎక్కితే ఆలస్యం అవకుండా ఆఫీస్ కి వెళ్ళచ్చు, కానీ ఇక్కడ ఎక్కాల్సిన బస్ వస్తుందో వెళ్ళిపోయిందో తెలిసేది కాదు"
"అదేంటీ బస్ అప్డేట్ ఫోన్ లో చూడచ్చు కదా" అడిగింది పాప అడ్డుపడుతూ.
"ఓయ్! చిక్కిరీ... నేను చెప్తున్నది 2006 లో, ఇప్పుడు కాదు. అప్పుడు నా దగ్గర ఫోల్డ్ చేసుకునే చిట్టి ఫోన్ ఉండేది. ఫోన్ లో టెక్స్ట్ మెస్సేజ్ ఉండడమే అప్పటికి మహా గొప్ప" అంటూ మళ్ళీ చెప్పడం మొదలెట్టాను. అక్కడ ప్రతిరోజూ ఒకాయన తల వంచుకుని తనలో తను మాట్లాడుకుంటూ బస్ షెల్టర్ లోపల ఉన్న బెంచీ మీద కూచునే వాడు. ఒకటి రెండు సార్లు 10వ నంబర్ బస్ వెళ్ళిపోయిందా సార్ అని అడిగినా, తల తిప్పి కూడా చూడలేదు. చలి కాలం మూలాన నాలాగే చాలా లేయర్స్ బట్టలు వేసుకున్నా, చలికి తట్టుకోలేనట్టు ముడుచుకుని కూచునేవాడు. ఏ భాష మాట్లాడుతున్నాడో తెలియదు. చాలా చిన్నగా గిణిగినట్టు మాట్లాడుకుంటూ ఉండేవాడు. అతనిని చూస్తే, మా చిన్నప్పుడు హనుమంతుడి గుడి వెనక పాతబట్టల మూట పెట్టుకుని అక్కడే పడుకునే కమ్లి గుర్తొచ్చేది. కమ్లికి ఎవరూ లేరనుకుంటా.. చెత్తకుండీలో నించి ఏవో ఏరుకుంటూ.. పారేసిన విస్తరాకుల్లో అన్నం అదీ తెచ్చుకునేది. ఎవరైనా అన్నం ఇస్తే మర్నాటికి దాచుకుని, పాడయిపోయాక తినేది. ఆమెని ఎవరూ మాట్లాడనియ్యనంతవరకూ.. తనలో తను మాట్లాడుకుంటూ తిరిగేది. ఎవరైనా పలకరిస్తే, వాళ్ళ మీద రాళ్ళు రువ్వేది. బూతులు తిట్టేది. తనంటే భయపడి అన్నం పెడతా అనడానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు. ఆమె గుర్తొచ్చాక ఇతన్ని ఇంకో సారి 10 వెళ్ళిపోయిందా అని అడిగితే, ఆమె లాగా రాళ్ళో ఏవో విసురుతాడని కొంచెం భయం వేసింది. అసలే ఆ బస్ స్టాప్ లో పెద్దగా జనాలు ఉండరు. ఎందుకొచ్చిన గొడవ అని ఒక రెండు నిమిషాలు 10 కోసం చూసి వేరే బస్టాప్ కి నడిచి వెళ్ళిపోయేదాన్ని.
ఒకరోజు నేను ఏదో పని ఉందని అరగంట పర్మిషన్ పెట్టుకున్నాను. పని అయ్యి నేను 10వ నంబరు బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆదరా బాదరాగా వచ్చాడు తనలో తనే మాట్లాడుకునే వ్యక్తి. 38 వెళ్ళిపోయిందా అని స్పష్టంగా అడిగాడు. 'ఇప్పుడే వెళ్ళిందండీ మీరు ఇవాళ ఆలస్యమయ్యారా' అన్నాను. 'అవును ప్రతిరోజూ మా కసిన్ ఇటు వెళుతూ అరగంట ముందుగా ఇక్కడ దింపుతాడు. ఈ స్టాప్ లో బస్ షెల్టర్ ఉంది కాబట్టి అరగంట ఇక్కడే కూచుంటా. మా ఆఫీస్ 8.30 కి గానీ తెరవరు. ఇండస్ట్రియల్ ఏరియా కదా. ఆఫీస్ బయట ఎక్కడా నించోడానికి లేదు చలికి గడ్డ కట్టెయ్యడమే' అన్నాడు నవ్వుతూ. 'అవునా.. రోజూ మిమ్మల్ని చూస్తాను ఇక్కడ. 10 ఎక్కరు, 38 ఎక్కరు మీరు. ఏ బస్సూ ఎక్కకుండా చలిలో ఇక్కడే కూచుంటారేంటో అనుకునేదాన్ని. మీరు నెక్స్ట్ బస్ తీసుకుంటారన్నమాట" అన్నాను జ్ఞానోదయమయినట్టుగా. "అవునా? నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే" అన్నాడు. "నేను ఇక్కడ వెయిట్ చెయ్యను అండీ, అల్లంత దూరం నించి 10 రావడం కనబడకపోతే బ్రిటానియా మెక్లాఫ్లిన్ ఇంటర్సెక్షన్ వైపు వెళ్ళిపోతా ఇంకో బస్ కోసం" అన్నాను, అతను అంత క్లియర్ గా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతూ. "ఏమిటో నేను పరిసరాలు గమనించటమే లేదు. పూర్తిగా ఈ లోకంలో ఉండట్లేదన్నమాట" అంటూ నవ్వేసాడు. "అవునండీ నేను రెండు మూడు సార్లు 10 వెళ్ళిపోయిందా అని అడిగాను కానీ మీరు... మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. పిలుస్తున్నా కూడా పట్టించుకోలేదు" అన్నాను మొహమాటం లేకుండా. ఈ లోపు 10 రావడంతో బస్ ఎక్కేసాను, గుడ్ డే అని చెబుతూ.
మరునాటి ఉదయం నన్ను చూడగానే.."గుడ్ మార్ణింగ్.. మీరు నా గురించి ఇన్నిరోజులూ ఏమనుకున్నారో తలుచుకోగానే నిన్నంతా నవ్వాగలేదు. నేను మతి స్థిమితం లేని వాడిని అనుకున్నారు కదా" అన్నాడు నవ్వేస్తూ. "అవునండీ మీలో మీరు గొణుక్కోవడం చూసి, మాట్లాడించడానికి కాస్త భయపడ్డాను కూడా" అన్నాను. "అయ్యో.. నాలో నేను మాట్లాడుకోడం కాదు బెహన్.. ఇదిగో" అని చెవిలో నించి చిన్న వస్తువు తీసాడు. "ఒహో వినబడదా అండీ? అయాం సో సారీ" అన్నాను అమాయకంగా. "కాదు కాదమ్మా దీన్ని బ్లూ టూత్ అంటారు. ఫోన్ జేబులో ఉండగానే వైర్లు అవీ లేకుండా దీనితో వినెయ్యడం మాట్లాడడం చేసెయ్యచ్చు. పొద్దున్నే తొందరగా వచ్చేస్తా కదా. ఇండియాలో ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ఇంక పరిసరాలు తెలియవు. అంతే" అన్నాడు. నా అజ్ఞానానికి నన్ను నేను తిట్టుకున్నాను, నొచ్చుకుంటూ. అప్పటి దాకా అలాంటిది ఒకటి ఉందని నాకు తెలియదు మరి. తరువాత రెండు రోజుల్లో జరిగిన రెండేసి నిమిషాల సంభాషణని బట్టి అతను కాగ్నిజెంట్ లో పెద్ద పొసిషన్ లో ఉన్నానని, డెప్యుటేషన్ మీద కెనడాకి 3 నెలల కోసం వచ్చి, కసిన్ ఇంట్లో ఉన్నానని, చలి తట్టుకోవడం కష్టంగా ఉందని, ఇంకో వారంలో వచ్చిన పని అయిపోతుందని తలచుకుంటే రిలీఫ్ గా ఉందని, పై వారం వెళ్ళిపోతున్నాననీ చెప్పారు. ఆ తరువాత వారం నాన్నకి పగటి షిఫ్ట్ అవడం వల్ల మిమ్మల్ని స్కూల్ లో దింపాక, వెళుతూ నన్ను ఆఫీస్ దగ్గర దింపి వెళ్ళారు. ఇంక అతన్ని కలవలేదు. అతనిలా ఈ పెద్దాయన కూడా బ్లూ టూత్ పెట్టుకుని ఉండి ఉంటారు సరిగ్గా చూడు" అన్నాను.
"అమ్మా.. 2006 ఎక్కడా? ఇప్పుడెక్కడా చెప్పవే..బీ సీ నాడు నువ్వున్నట్లు, ఇప్పుడు బ్లూ టూత్ కూడా తెలియకుండా ఉన్నానా నేను? పూర్తిగా వినకుండానే కంక్లూషన్ కి వచ్చేస్తావ్" అంటూ నా అంత డంబ్ తను కాదని నిరూపించుకుంది నా పిల్లది. "మా బాస్ లక్ష్మి పంజాబీలో మాట్లాడింది నిన్న ఆ పెద్దాయనతో. ఆయన వైఫ్ చనిపోయారుట ఈ మధ్య. ఆవిడ తనకి కనిపిస్తూ ఉంటారని, ఆవిడ తనతో మాట్లాడుతూ ఉంటారనీ చెప్పారుట ఆ పెద్దాయన. ఇంట్లో ఉండగా వాళ్ళావిడతో మాట్లాడితే వాళ్ళ పిల్లలు తిడతున్నారుట. అందుకే ఈ మాల్ కి వచ్చి ఆవిడతో రోజంతా మాట్లాడి, సాయంత్రం ఇంటికి వెళతానని చెప్పారుట" అని కొనసాగించింది.
"అయ్యో! ఇది బ్లూ టూత్ కథ కాదమ్మలూ.. కమ్లీలా ఇతనికీ మతి స్థిమితం లేదనుకుంటా. 2006 లో నాకు బ్లూటూత్ తెలియనట్టే, మా చిన్నప్పుడు మా ఊరి వాళ్ళకి ఏ విషయం మీదా అవగాహన లేదు కాబట్టి కమ్లీని పిచ్చి దాని కింద జమకట్టేసి, ఆమెతో సమానంగా ఆమె మీద రాళ్ళు రప్పలూ విసిరారు కానీ, ఇప్పుడు ఇంత అడ్వాన్స్ దేశంలో కూడా ఆయనని వాళ్ళ పిల్లలు అలా వదిలెయ్యడం నాకు నచ్చలేదు. హీ నీడ్స్ డాక్టర్స్ హెల్ప్ యూ నో" అన్నాను నిరాశగా. "అతనితో నెమ్మదిగా మాట్లాడి కొన్ని వివరాలు తీసుకుంది లక్ష్మి. వాళ్ళ ఇంటి పేరుని బట్టి వాళ్ళు కెర్రీ వాళ్ళకి తెలిసిన వారే అనిపిస్తోందిట. సాయంత్రం కెర్రీ తో ఫోన్ చేయిస్తుందిట వాళ్ళ వాళ్ళకి. లక్ష్మి అంత తొందరగా వదిలిపెట్టదులే.. చాలా మంచిది, వాళ్ళాయన కెర్రీ కూడా అంతే" అని చెప్పింది పాప.
ఆ పెద్దాయనకి మంచి జరగాలని కోరుకున్నాం అందరమూ
0 వ్యాఖ్యలు:
Post a Comment