వడ్లగింజ

Tuesday, November 15, 2022




చిత్రం: తూలిక, కెనడా

12 అక్టోబరు, 2022  

నాకు చిన్నప్పటి నించీ ఒక సారి చూసిన వాళ్ళని పేర్లతో సహా గుర్తుపెట్టుకోవడం చాలా అలవాటు. అలా ఎలా గుర్తుపెట్టుకుంటావూ అని అడిగేది సులోచన. "కళ్ళు చూసి గుర్తుపట్టేస్తా" అనేదాన్ని గర్వంగా. "ఏమోనే నాకు ఎవరి కళ్ళలోకైనా చూడాలంటే భయం అందుకని లక్ష్మణుడిలా పాదాలు చూడడం అలవాటు చేసుకున్నా. ఎవరి పాదాలన్నా చూసానంటే టక్కున చెప్పేస్తాను వాళ్ళెవరో" అనేది. "నీ మొఖం.. బూట్లు వేసుకుంటే ఎలా తెలుస్తుందే" అనేదాన్ని. ఆ సరదా సంభాషణ కెనడాకి వచ్చాక చాలా సార్లు గుర్తొస్తుంది నాకు. నేను కూడా అతిగా అనుకునేదాన్ని కానీ, అప్పట్లో కలువల్లా ఉండే కళ్ళు ఇప్పుడు ఒక కాటుక గీత అంత అయిపోయి, పాత స్నేహితులని పోల్చుకోవడం కష్టమైపోతోంది ఈ మధ్య. అడవిరాముడు సినిమాలో ముసుగు తీయగానే వావ్ అని గుర్తు పట్టేసే వ్యవహారం చూసి... జయప్రదని, జయసుధని గుర్తు పట్టని దొబ్బోడు (సారీ అండీ మా ఊర్లో ఇలాగే అంటాము ముద్దుగా) ఈరో ఎట్టవుతాడని కొట్లాడుకున్నవాళ్ళు ఈ మాస్కుల యవ్వారమొచ్చాక కిమ్మనకుండా ఉండిపోయారు. 

అవన్నీ ఒక రకమైతే, జనాల పేర్లని గుర్తు పెట్టుకునే విషయంలో ఇంకో రకమైన సమస్య ఉంటుంది. ఒక్కోసారి షాన్, రిక్ లాంటి పేర్లు ఇద్దరి ముగ్గురికి ఉంటాయి ఆఫీసుల్లో. ఉదాహరణకి ఒక షాన్ బ్రావర్, ఒక షాన్ పవర్ ఉండేవారు మా ఆఫీసులో. మా పిన్నత్తగారి ఇద్దరు కవలలని పెళ్ళయిన మొదటి రోజే సరిగ్గా గుర్తుపట్టేస్తున్నానని మా ఇంట్లోవాళ్ళు ఆశ్చర్యపోయినట్టే ఇక్కడ పదేళ్ళ నించి పని చేస్తున్న వాళ్ళు పవర్ ని, బ్రవర్ ని ఇంటిపేరుతో సహా పిలుస్తున్నానని తెగా ఆశ్చర్య పోయారు. నేను నాకిచ్చిన క్రెడిట్ ని తీసి పడేస్తూ, కంప్యూటర్  బ్రౌసర్లతో పని చేసేవారు బ్రవరు,  బరువులతో పని చేసేవారు పవర్ అని చెప్పేసా తేలిగ్గా.  జపానీ పేర్లు కూడా చెప్పిన వెంటనే నాకు గుర్తుండిపోతాయి. మాకు సీ ఈ ఓ గా వచ్చినాయన పేరు నేను పిలిచేసినంత చులాగ్గా ఎవరూ పిలవలేదు. మా బాస్ ఒక రోజు నాతో "ఆయన పేరేదో చెప్పాడు కానీ గుర్తుండట్లేదు, ఎదుట పడ్డప్పుడు పేరు గుర్తురాక మొహమాటమేస్తోంది" అంది.  "హిందీలో మీ అమ్మ అని ఎలా అంటావు" అని అడిగాను. "ఆప్ కే మా" అంది అతి గౌరవంగా. "కాస్త కోపంగా ఉన్నప్పుడు ఎలా అంటావో చెప్పబ్బా" అన్నాను. "తేరీ మా" అంది.. "అదే ఆయన పేరు" అన్నాను నవ్వుతూ. తెరియమా అతని పేరు. "హత్తెరికీ" అంది ఆనందంగా. "అదిగో చూసావూ వచ్చ్హే వారం రాబోతున్న ప్రెసిడెంట్ పేరు కూడా చెప్పేసావు" అన్నాను. అతని పేరు హత్తోరీ. అకీరాని ఆఖరున కూర్చునే వాడి గానూ, హీరోలా కళ్ళజోడు పెట్టుకునే ఉంటాడు కాబట్టి హీరోటో పేరు ఇట్టే గుర్తొచ్చే లాగా చెప్పగానే అందరికీ భలే ఆశ్చర్యం వేసేది. 

అన్ని వారాలూ ఆదివారాలు కావని సామెత. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అనీ, జారిపోయే బండకి జాజు అంటదనీ ఉన్న ఆంగ్ల/తెలుగు సామెతల్లా, పరిచయాలు పెరుగుతున్నా కొద్దీ మోకాల్లో (అదేలెండి మెదడులో) ఉన్న స్టోరేజీ సరిపోవట్లేదేమో... ఆఫీసులో ఒక్కరి పేరు కూడా రికార్డు కావట్లేదు. కోవిడ్ వల్ల ఆఫీసులకెళ్ళి ఎవరినీ కలవకపోవటం వల్లనో ఏమో గానీ చెల్సీ, కొనోర్, కెల్విన్, మోయిన్, ఏరాన్, ఆలిన్ లాంటి పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది. పేర్లు తెలిసినా, ఎవరెవరో తెలియడం లేదు.  ప్రత్యేకించి, ఒక పనికి ఎవరిని కాంటాక్ట్ చెయ్యాలో మీటింగుల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. 

ఈ రోజు కొలీగ్ తో ఫోన్ లో మాట్లాడుతూ, ఈ విషయం గురించి నొచ్చుకోవడం విని "స్పేసూ కాదు గీసూ కాదు ఓల్డ్ ఏజ్" అని నా పిల్ల పిచ్చిక నా గొంతులో కాసిని వడ్లగింజలు పడేసి పోయిందిప్పుడే

0 వ్యాఖ్యలు: