నామకరణం

Wednesday, November 23, 2022

సంక్రాంతికి స్నేహితురాలు కిరణ్మయి బొమ్మల కొలువు చూడ్డానికి రమ్మందని వెళ్ళాను. అందమైన బొమ్మల కొలువు చూడ్డానికి తన స్నేహితురాళ్ళు ఇంకో నలుగురైదుగురు వచ్చారు పిల్లలని తీసుకుని. వాళ్ళలో నాకు పరిచయం లేని ఇద్దరిని మనోజ,సుమ అని పరిచయం చేసింది. " భలే ఉన్నాయండీ మీ పేర్లు.. చిన్నగా, పిలవడానికి ఈసీగా " అని ముచ్చట పడిపోయా.. ముద్దులొలికే పాపాయి పేరు సహస్ర అని చెప్పి 'తనకి కూడా పిలవడానికి వీలుగా ఉంటుందని అది పెట్టామండీ' అని చెప్పింది సుమ. నేను కొంచెం అయోమయంగా "పిలవడం ఎలా సులువు" అని అడిగా.. "సారా అని పిలవచ్చుగా"..అని నవ్వారావిడ. "అవును ఆ మధ్య ఒక చిన్నారి పేరు సరిత అని పెట్టారు.. ఆంగ్లం లో వ్రాసినప్పుడు ఇక్కడి వాళ్ళు వీలుగా రీటా అని చివరి రెండు అక్షరాలు పిలుచుకోవచ్చని పెట్టారుట" అన్నాను. అలా కబుర్లు చెప్పుకుంటూ ఒకావిడ "పేర్లు జాగర్తగా పెట్టాలండీ, మా పక్కింటి వాళ్ళు ఎంతో మక్కువతో పెట్టిన పేర్ల వల్ల వాళ్ళ పిల్లలెంత బాధ పడుతున్నారో , మీ భారతీయుల పేర్లలో షిట్ ఉంటుందని బుల్లీ చేస్తారుట స్కూల్ లో! ఆ పిల్లలు స్కూల్ కి వెళ్ళడం మానేసారు తెలుసా అసలు " అన్నారు. నాలో కుతూహలమ్మ లేచి "ఇంతకీ వాళ్ళ పేర్లేంటీ" అనడిగింది. "హర్షిత్ వర్షిత్ కానీ ఇక్కడ వీళ్ళకి త పలకదుగా హర్షిట్ వర్షిట్ అని షిట్ షిట్ అంటూ వేధిస్తారుట. చాలా సార్లు స్కూల్ లో కంప్లయింట్ చేసినా, ఎందరినని కంట్రోల్ చెయ్యగలరు వాళ్ళు మాత్రం.. ఊరు మారి స్కూల్ మార్చేస్తున్నప్పుడు ప్రిన్సిపల్ గారి సలహాతో కొత్త స్కూల్ లో హర్ వర్ అని వ్రాయించారుట ప్రిఫర్డ్ నేం లో" అని చెప్పారు. ఇది విని చిన్నప్పుడు మా స్నేహితురాలు మానసని మహనస అని పిలవడం, కుమారిని కుమ్మరీ అని పిలవడం గుర్తొచ్చి అలా ఏడిపించినందుకిపుడు సిగ్గుగా అనిపించింది. అప్పటికి మానసా, కుమారి సరదాగానే తీసుకున్నా, తప్పు తప్పే కదా మరి! అసలు ఇప్పడు పుడుతున్న పిల్లలకి పేరు పెట్టాలంటే ఎన్ని కష్టాలో అనిపిస్తుంది. ఆ కాలంలోలా 'సీతారామాంజనేయ వెంకట సత్య సూర్య పవన్ కుమార్' అని పెద్దలందరూ అందించిన పేర్లు పెట్టెయ్యడమో, పంతులు గారు 'జ్ఞ' తో రావాలన్నారని 'జ్ఞానేశ్వర్', 'సీగాన పెసూనాంబ' అని ఎవరికీ చెప్పా పెట్టకుండా పీటల మీద ఫిక్స్ చేసేంత తేలికగా లేదిప్పుడు. తేలికంటే తేలిక కాదనుకోండి అప్పట్లో కూడా బారసాల రోజున భారీగా పోట్లాటలయిన విషయాలు మనకి చూచాయగా తెలుసుగా. పురుషులు గుంభనంగా మొదటి వాడికి వారి తండ్రి గారి పేరు, రెండో వాడికి ఆవిడ తండ్రి గారి పేరు పెట్టి పడేసాక, ఆనక మేనత్త మొగుడి పేరో, ఆదుకున్న ఆదయ్య పేరో పెట్టినా,పెళ్ళాలు కిక్కురుమనరని తెలుసుకు మసలేవారుట. అప్పట్లో బారసాల పీటల మీదయిన పోట్లాటలు ఇప్పట్లో కడుపని కంఫర్మ్ అయిన రోజునుంచీ తొమ్మిది నెలల పాటు కొందరికి మూడవ ప్రపంచ యుద్ధం గాను, కొందరికి ఎవరికీ తెలియని కోల్డ్ వార్ గానూ జరుగుతూనే ఉన్నాయి. పుట్టగానే బిడ్డ పేరు ఆసుపత్రి వారికి చెప్పెయ్యాలి కాబట్టి ముందు నించీ పది మందిని అడిగో, గూగులమ్మనడిగ్), బాగా ట్రెండ్ లో ఉన్న పేరో చూసుకుని, భార్య ఒక పేరు కోసం, భర్త ఒక పేరు కోసం తగవులాడుకుంటూనే, 'పిల్లాడి పేరు సస్పెన్స్ పెట్టాము, పేరు కనుక్కున్న వారికి బహుమతులు ప్రకటిస్తాము' అని కాస్త తెలివైన జంటలు వాదులాటల్ని కాస్త ముందుకి తోసినా, నెప్పులు మొదలవ్వగానే పంతులు గారి దగ్గరికెళ్ళి నక్షత్రం ప్రకారం ఏ అక్షరమో కనుక్కునేసి, ఆ అక్షరం తో ఎవరు సెలెక్ట్ చేసారో ఆ పేరు పెట్టేసుకుని, వాళ్ళిద్దరిలో ఒకరు గెలిచినా, తలితండ్రులని నిరాశ పుచ్చక తప్పట్లేదు. పురిటి గదిలో భార్య భర్త మాత్రమే ఉంటారు కాబట్టి, నెప్పులు పడే బాధ కంటే తను అనుకున్న పేరు కాకుండా అత్తగారనుకున్న పేరుకి భర్త లొంగి పోతాడేమో అనే బాధ ఎక్కువగా ఉందని చెప్పిన అమ్మాయిలని చూసి ఔరా అనుకోక తప్పదు. నక్షత్రాల పేర్లంటే గుర్తొచ్చింది. 40 ఏళ్ళ క్రితం ఇంకా చదువుకున్న ఇళ్ళలో కూడా అప్పారావు సుబ్బలక్ష్మి అని పేర్లు పెడుతున్న కాలంలో ఎదురింట్లో పని చేస్తున్న అమ్మాయి కూతురికి మేఘన అని పేరు పెట్టింది. అప్పటికి మా ఊర్లో అది చాలా మాడర్న్ పేరు. అందరూ అభినందించాక, ఇంతకీ ఈ పేరెక్కడిది అని అడిగారు ఉండబట్టలేని జనాలు. పంతులు గారు పిల్ల పుట్టినది మిర్గం (మృగశిర) అన్నారుట, పిల్ల మే నాలుగో తారీఖున పుట్టింది కాబట్టి, మే నెల గుర్తుగా మే , మిర్గం నక్షత్రం గుర్తుగా గ నాలుగో తారీఖు కి న కలిపేసి 4వ తరగతి చదువుతున్న తన చెల్లెలు మేఘన అని పెట్టమని సూచించిదనీ, అదొక్కటే చదువుకున్న పిల్ల అయిన మూలాన అందరూ అమోదించడం వల్లనే ఈ రోజు మెప్పుకోలు కలిగిన పేరును పెట్టుకున్నాననీ కళ్ళు మెరిపిస్తూ చెప్పింది ఆ పిల్ల. అప్పటికింకా పిల్లలు ఫలాన టయిముకి పుట్టారని చెపితే, నక్షత్రాలు గుర్తుండాలని ఆ నక్ష్త్రానికి సంబంధించిన నాలుగు అక్షరాలతో వచ్చే పేర్లలో ఒకటి పంతులు గారే సూచించేవారు మా ఊర్లో. అలాంటి పంతులు గారిని తోసిరాజని, ఇంత తెలివిగా పేరు పెట్టిన ఆ ఎనిమిదేళ్ళ చిన్నారి కంటే శాస్త్రజ్ఞులు ఎవరుంటారని ఆశ్చర్య పోయా నేనైతే! మా ఇంటిపక్క ఒక పిల్ల పేరు అతియ అని ఉండేది. తన స్నేహితులు అత్తయ్య అనో హాతియా అనో పిలిచేవారు. మా ఇంటికొచ్చిన ఒకాయన విస్తుపోయి, ఇదేదో బానే ఉందండీ నాకు ట్విన్స్ పుడితే హత్య , ఆత్మ హత్య అని పెట్టెయ్యచ్చు అన్నందుకు మా అత్తగారి చేతిలో చచ్చేట్లా తిట్లు తిన్నాడు అప్రాచ్యం మాటలు మాట్లాడినందుకు. కొంత కాలం చాలా గమ్మత్తులు జరిగాయి. ఒక సంవత్సరంలో వంశీ, ఇంకో సంవత్సరంలో చైతన్య పేర్లు పాపులర్ అయిపోయి, చదువు చెప్తున్నప్పుడు ఒక బ్యాచ్ లో సగం మందికి పైగా అవే పేర్లుండడం చూసి ఖంగు తినేసా. మా బాబుని స్కూల్ లో వేసినప్పుడు ఏ తో పేర్లు పెట్టడం వల్ల అన్నిటిలోనూ మొదట ఉంటారనేమో 75% మంది పేర్లు ఏ తోనే, ఆదిత్య, ఆకాష్, ఆయుష్, అభిమన్యు, ఆంచల్, ఆరుష్, ఆరోహ్, అమృత, అఖిల్, అభినవ్, అభినందన్, అనిరుధ్ , ఆర్య, అర్జున్, అంజద్, అనన్య, అపూర్వ, అపురూప ఇలా వాడి స్నేహితులందరూ ఏ ప్లస్సులే! ఆర్య అంటే గుర్తొచ్చింది షారుఖ్ ఖాన్ కొడుకు పుట్టినప్పటి నించీ ఆర్యన్ పేరు తెగ ఫేమస్ అయిపోయింది. ఆర్యులు అయినా అనార్యులైనా ఆర్యన్ అని పెట్టేసారు. తైమూర్ లు టిప్పు సుల్తాన్ లూ సెలెబ్రిటీల ఇంట వెలిసారు కాబట్టి మనమూ పెట్టుకుంటామనుకోండి, అది వేరే సంగతి. మా స్నేహితురాలు బారసాల పిలుపులకొచ్చిందొకసారి. మూడో నెల చేద్దామనుకున్నరుగా ఇప్పుడు పిలుస్తోందేంటో అనుకునేంతలో , " పిల్లకి హడావిడిగా పేరు పెట్టేయ్యాల్సి వస్తోందండీ" అంది . ఎందుకలా అని అడిగితే, "మా వారి మేన మామ ఒకరు పిల్లలని చూడగానే చెంబు, తపేలా, బోడి లాంటి పేర్లు పెట్టేస్తారు. అదృష్టమో దురదృష్టమో అప్పటి వరకూ అందరికీ ఆయన పెట్టిన పేర్లే స్థిరపడిపోయాయి, ఇప్పుడాయన ఊరి నించి వస్తున్నానని ఉత్తరం వ్రాసాడు, ఆయనొచ్చేలోపు పేరు పెట్టలేదంటే, నా వెన్నెల మొగ్గకి బొగ్గొ, సుద్దో అని పేరు పెట్టి పడేస్తాడు అందుకే హడావిడి" అని చెప్పింది. నిజమేనండోయ్, మా చుట్టాల్లో కూడా ఒకరున్నట్టు గుర్తు ఇలాంటి వారు! ఇక్కడ ముద్దు పేర్ల గురించి కొంత చెప్పుకోవలసిందే. ఇంటికొక బుజ్జి ఉండడంతో, పెద్ద బుజ్జి, చిన్న బుజ్జి, బుజ్జిబుజ్జి కూడా ఉండడం చాలా మామూలు విషయమే కదా. మరి ఇందరు బుజ్జిలుంటే వాళ్ళ అసలు పేర్లు కాకుండా పిన్ని గారి పెద బుజ్జి, మావయ్య గారి చిన్న బుజ్జి అని పిలవడం మనలో చాలా మందికి విదితమే. ఇంట్లో పిల్లలకి పెద్దల పేర్లు పెట్టినప్పుడు, కోడల్లు ఆ పేరుతో పిలవకూడదు కాబట్టి చిట్టి, బుజ్జి, కన్న అని పిలిచెయ్యడం కొంత కారణం కావచ్చు. ఇలా పాతికేళ్ళుగా పిలవబడుతున్న పిల్లలని "విజయ వీర వెంకట సత్యనారాయణా" అని వాళ్ళ తల్లులు పిలుచుకోవడం నాకు తెగ ఆశ్చర్యాన్ని కలగజేసింది గత సారి నా భారత దేశ ప్రయాణం లో. నా హావభావాలని గమనించారేమో "గురువుగారు చెప్పారు, పిల్లలకి బియ్యంలో వ్రాసి పెట్టిన పేరు పూర్తిగా పిలిస్తేనే కానీ కలిసి రాదుట అందుకే ఇలా" అని చెప్పారు తల్లులు సర్దుకుంటూ. కొద్దిగా విచిత్రమేసినా పిల్లల క్షేమమూ, అభివృధ్ధే కదా తల్లులకి కావలసిందని అర్థం చేసుకున్నా మారు మాట్లాడకుండా.. కానీ నాకు మాత్రం అలా పిలవడం కష్టమే అయింది మరి. నేను మామూలుగా పిలుస్తుంటే, తల్లీ పిల్లలూ ఇబ్బందిగా చూసారు నా వైపు. ఇక్కడ తిప్పలిక్కడివి. అందరికీ పలికేలా చూసుకుని సహస్ర నామాలో, అష్టొత్తరాలో వెతికి పెట్టిన లాస్య , సౌమ్య, దివ్య, వరాళి, మరాళి, ఆర్ణ, రితిక, రుత్విక్ లు చక్కని పేర్లే అయినా అణాలు, అళాలు, అఋ లు చిలక్కొట్టుడు కొట్టబడతాయి . ఆన్యా కొందరి తుంటరి పిల్లల నోటిలో ఆనియనయిపోయిందని వాపోయిందో చిన్నారి. సరయు, నేహ , ఆద్య, అనన్య, విన్నీ, సన్నీ, బన్నీ, సోనీ , హర్ష, వర్ష, పూజ, తాం, లకీ, కరన్ కాస్త వరకు ఫర్వాలేదు. సంధ్య స్యాండీ అయ్యి, మాధవి మ్యాడ్డీ అయ్యి, లక్ష్మి లకీ అయ్యి కొంత మనశ్శాంతిగానే ఉన్నా, 'త' లు 'ద' లు పలకని దేశంలో తేజ, దీపు, వేద అంటూ పోటెత్తిన పొట్టి పేర్లు ఘోరంగా దెబ్బ తినేసాయి. ద లు త లు లేకుండా ఉన్న పేర్లు వెతికి అలసిన వారు ఏకాక్షరాలకి దిగి జే(జయ్), విజయ్, ఎన్(యెన్) అని సింపుల్ గా తేల్చేసే పేర్ల కోసం తీవ్ర పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడొక తమిళ స్నేహితురాలు వివేకానందా అనమంటే వివేగానందా అని, నాగ రాజు అనమంటే నాహ రాజు అనీ అంటుంది. ఇందాక గా పలికావు కదా అంటే అదంతే అంటుంది. మరి మనం ఇక్కడ వాళ్ళని తప్పెలా పడతాం చెప్పండి. మన పేర్లే కాకుండా వీళ్ళకీ జోషువా ని యోహువా అనడం జోస్ ని హోసే అనడం పరిపాటే. మొన్నొక జోకు చదివా. ఒకాయన ఏదో ఆఫీసులో కూచుని ఎంత సేపూ తన పేరు పిలవలేదని కౌంటరు దగ్గరికెళ్ళి వాపోయాడుట. వంద సార్లు పిలిచామయ్యా నీ పేరు నువ్వే పలకలేదని, మళ్ళీ రేపు రమ్మనీ అన్నారుట కౌంటర్ లో ఉన్న వాళ్ళు. అసలేం పిలిచారయా అంటే అనదర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అని పిలిచామని చెప్పారుట. అదెందుకంటే ఈయన పేరు అనంత రామన్ సుబ్బరామన్ కానీ మరి తమిళులకి బ వ్రాయడం లేదు కనుక సుప్పరామన్ అని వ్రాసి ఉందిట. వాళ్ళు కూడా ఈ చావులన్నీ ఎక్కడ చావమంటారూ, మీరే చూసుకుని పలకాలంతే అనేసారంటే, అనెయ్యరూ మరీ.. ఈ పేర్ల పరిశోధనలకి కాస్త విముక్తి వచ్చిందనిపిస్తోందీమధ్య. ఇప్పుడు పుట్టిన మన వాళ్ళ పిల్లలక్ కోవిద్, ఊహ అని పేర్లు పెట్టెయ్యచ్చు సింపుల్ గా.. మనకి కోవిదుడా అని విష్ణు నామము ఊహా అని అందమైన పేరు పెట్టుకున్నామన్న తృప్తి కాగా సందర్భానికి తగ్గట్టు కోవిడ్ ఊహాన్ అని పిలుచుకుంటారిక్కడి వాళ్ళు.. అప్పుకి అప్పూ తీరింది అల్లుడి కోరికా తీరింది అన్నట్టు. ఏమంటారు? అన్నట్టు దీనికీ ఒక కథ ఉందండోయ్. అప్పట్లో.. అంటే బాగా చిన్న పిల్లలకి పెళ్ళుళ్ళు చేసే కాలంలో అన్నమాట. పదేళ్ళ అల్లుడిని మొదటి పండగకి తీసుకొచ్చారుట అత్తవారు. సాయంత్రం తినడానికి సకినాలు (చక్కిలాలే లెండి. మా వైపు కొంచెం చప్పగా చేసుకుంటాము) పెట్టారుట అత్తగారు. అత్తయ్యా నాకు వీటిని పాలల్లో ముంచుకుని తినాలనుంది అన్నాడుట అల్లుడు. ఇంట్లో చూస్తే పాల చుక్కలు లేవు, ఇటు చూస్తే కొత్త అల్లుడు అడిగిన మొదటి కోరిక. ఉండు నాయనా అని, పక్కింట్లో గ్లాసుడు పాలు అప్పు తీసుకొచ్చింది అత్తగారు. ఆ పాలల్లో పిల్లాడు సకినాలు ముంచుకు తిన్నాడు. మీకు తెలియని విషయమేమిటంటే, ఈ సకినాలనబడే అతి మధురమైన తినుబండారం పాలల్లో వేసినా, నీళ్ళల్లో వేసినా, కరకరలాడటమే తప్ప, ఇసుమంతైనా వాటిని పీల్చుకోదు. దానితో అల్లుడు సకినాలు తిన్నాక చూస్తే కూడా గ్లాసుడు పాలు గ్లాసుడూ అలాగే ఉన్నాయి. పైగా ఈ సకినాలు అసలు నూనె పీల్చుకోవు కాబట్టి వాటిని పాలలో ముంచిన దాఖలాలు కూడా కనబడవు. అంచేత, ఆ గ్లాసుడు పాలూ ఆ పళంగా పట్టికెళ్ళి అప్పు తీర్చేసిందిట అత్త గారు. అదన్న మాట.. ఇవ్విధముగా అప్పుకి అప్పూ తీరింది అల్లుడి కోరికా తీరింది కదూ మరి మనం అనుకున్న పేర్లలాగే...

0 వ్యాఖ్యలు: