తాతయ్య- తకతయ్య

Wednesday, November 23, 2022

- ఉష ఫోన్ చేసింది ఆ మధ్య. తను నాతో కాలేజీ లో కలిసి చదువుకుంది కెనడా వచ్చిన కొత్తల్లో. అప్పట్లో కలుస్తూ ఉండేవాళ్లం. ఈ మధ్య కలవలేదసలు. చాలా రోజులయ్యింది టిం హార్టన్స్ (Tim Hortons) లో కూచుందాం కాసేపు అంది. సరే అని వీలున్న రోజు వెళ్ళాము.. వచ్చాక కాసేపు మాటలవగానే ఏడుపు మొదలెట్టేసింది. నేను ఖంగారు పడిపోయే లోపు తమాయించుకుని..." నీకు గుర్తుందా పోయినేడాది మా చిన్న అన్నయ్యకి కొడుకు పుట్టాడని చెప్పా కదా" అంది.. "అయ్యో వాడికేమైనా అయిందా" అని అడిగా భయంగా.." కాదు వాడికి మాటలొచ్చాయి".. మళ్ళీ ఘొల్లుమంది. "అయితే సరిగా మాట్లాడట్లేదా.. ఊరుకో ఊరుకో వస్తాయిలే అవే " అని ఓదార్చా.. "కాదు కాదు.. మా వదిన వాడితో నన్ను అత్తా అని పిలిపించింది" అని భోరుమంది మళ్ళీ.. "అదేంటీ నువ్వు అత్తవే కదా" అన్నా ఆందోళనగా.."మా వదినకీ నాకూ పడదులే , అందుకే నా వయసు పెంచాలని అలా పిలిపిస్తోంది.. నాకు తనంటే అసహ్యం" అంది ముక్కు ఎగ పీలుస్తూ.. "పెద్ద వదిన పిల్లలతో ఎప్పుడూ దీదీ అని పిలిపించేది.. ఇదే చుప్పనాతి" అంది సాగదీస్తూ. "అప్పుడంటే నువ్వు చిన్న పిల్లవి, పెళ్ళి కాలేదు, నీకూ వాళ్ళకీ వయసులో పెద్ద తేడా లేదు అందుకే పెద్ద వదిన అలా దీదీ అని పిలిపించి ఉంటుంది. కానీ, ఇప్పుడు నీ పిల్లలకీ 20 ఏళ్ళు దాటాయి కదా.. ఇప్పుడు పుట్టిన పిల్లాడు నిన్ను అక్కా అని పిలిస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఇంకొన్నేళ్ళలో నువ్వు నానమ్మవి అవుతావు అప్పుడెలా" అన్నా సముదాయిస్తూ.. "నన్ను నానమ్మ అని పిలిస్తే అస్సలు ఒప్పుకోను, మా పెద్దన్న పిల్లల్లు మా అమ్మని పిలిచినట్టు అమ్మా అని పిలిపించుకుంటా" అంది. తనకి ఎలా చెప్పాలో తెలియక ఇంకో విషయానికి తిప్పి కొన్ని కబుర్లు చెప్పి వచ్చేసా.. ఇంటికొస్తూ అదే ఆలోచన.. అసలిలా ఆలోచిస్తే ఎవరికైనా ఎలా అని!!!.. ఈ మధ్య ఇంకో స్నేహితురాలి పెద్ద కొడుకు పెళ్ళయిందని కోడలిని చూడడానికి రమ్మని పిలిస్తే వెళ్ళాము. బుజ్జిగా, ముద్దుగా ఉందా కోడలు పిల్ల. “ఇంట్లో ఆడ పిల్లలు తిరిగితే భలే ఉంటుంది కదా? క్యూట్ గా భలే ఉందసలు. చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు” అంటూ, ఆ రోజు ఆఫీస్ లో ఏదో పోటీలో గెల్చుకున్న ఒక చాక్లెట్ బార్ ఆ పిల్లకి ఇవ్వబోయాను. ఆవిడ భర్త కలగజేసుకుని, "చిన్న పిల్ల ఎవరు? మా ఇంట్లో మా సరస్వతే చిన్న పిల్ల, ఎందరు వచ్చిపోయినా సరే" అన్నారు నా స్నేహితురాలిని చూపిస్తూ. ఒక నిమిషం అర్థం కానట్టయ్యి తరువాత అర్థమవుతుండగా, "ఇన్నేళ్ళుగా తనొక్కతే మాకు మహారాణి, తనొక్కతే మాకు చిన్నపిల్ల, అదెప్పటికీ మారదు తన తరువాతే ఎవరైనా" అంటూ నా చేతిలో చాక్లెట్ అందుకుని ఇచ్చారు తనకి నవ్వుతూ.. అదృష్టం కొద్దీ ఆ పిల్ల మంచినీళ్ళు తేవడానికి లోపలికి వెళ్ళబట్టీ పెద్దగా స్పందించకుండా పిల్లాడి చేతిలో గిఫ్ట్ పెట్టి, కాసేపు వాళ్ళతో (భయం భయంగా) గడిపి వచ్చాము.. నా ఆలోచనలు శరవేగంతో మా ఇంటికెళ్ళాయి. నాన్న ఐదుగురిలో ఆఖరి సంతానం కావటం వల్ల, తండ్రి గారు లేకపోవడం వల్ల, పెద్దన్న గారి ప్రాపులో వారి పిల్లలతో సమంగా పెరిగారు. పెదనాన్నలు వాళ్ళ ఆడపిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు చేయడం వల్లనూ, నేను 7 గురిలో 6వ సంతానం అవడం వల్లనూ, నేను పుట్టేటప్పటికే పిన్నినో, అత్తనో అవడంతో పాటు బోనస్ గా నా పెళ్ళి అవకముందే ఈ పిన్నీ, అత్తా అని పిలిచిన వాళ్ళ పిల్లలకి అమ్మమ్మనో , నానమ్మనో కూడా అయినట్టున్నా.. మా అక్కల పిల్లలు, అన్నల పిల్లలు వయసుతో నిమిత్తం లేకుండా పిన్నీ, అత్తా అని పిలవడమే మాకు అలవాటు. అందువల్ల నాకు ఎవరైనా నా వయసు వాళ్ళొచ్చి ఆంటీ అని పిలిచినా అసలేమీ అనిపించదు. పైగా వీరెవరో వరుస పెట్టి పిలుస్తున్నారే అని సంతోషిస్తానేమో కూడా.. ఫేస్బుక్ వచ్చిన కొత్తల్లో నా మనవరాలొకటి (నా ప్రొఫైల్ పిక్ చూడక్కరలేదు.. మళ్ళీ ఒక సారి మొదటి పేరా చదవండి..) ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ లో కూచుని నాతో చాట్ చేస్తుంటే ఫ్రెండ్స్ బయటకెళదాం రమ్మని పిలిచారుట. “కాసేపు ఉండండబ్బా, మా అమ్మమ్మతో చాటింగ్” అని చెప్పిందిట. వాళ్ళ ఫ్రెండ్స్ బుగ్గలు (అసలేమున్నాయి లెండి అన్నీ జీరో సైజులే, కొత్త ఫ్యాషన్ కదా.. డైటింగ్ అంటూ లొట్ట చెంపలే, నో బుగ్గలు) నొక్కుకుని, “దీని అమ్మమ్మకి కూడా ఫేస్ బుక్ ఉందిటే” అని వెక్కిరించారుట. అది బాగా ఉడుక్కుని, వాళ్ళందరినీ పిలిచి “మా అమ్మమ్మ ఇదిగో” అని నేను, నా చెల్లీ ఉన్న ఫొటో చూపించిందిట. “వీళ్ళు మీ అమ్మమ్మలేంటే” అని మళ్ళీ ఏడిపించారుట...”పొండే నా అమ్మమ్మలు ఆరుగురూ యంగూ” అనేసి నాకు ఫోన్ చేసినప్పుడు, “నిన్ను ఇంకేదైనా పిలవనా, ఇలా నచ్చట్లే”దంది.. “ఫర్వాలేదులే యంగ్ అమ్మమ్మలు దొరికే అదృష్టం అందరికీ ఉంటుందా, నువ్వు పట్టించుకోకు” అని చెప్పి ఒప్పించా.. ఇంకో వైపు ..మా సీతయ్య కి నలుగురు పిన్నిలు . వాళ్ళు సీతయ్య కంటే 5, 6 ఏళ్ళు పెద్ద, మా పిల్లలు వాళ్ళని నానమ్మ అని పిలిస్తే నాకే ఏదోగా ఉండేది, కానీ వాళ్ళు ఫర్వాలేదనేవారు. ఆ పిన్నిలలో ఒకరి తోటికోడలు మా ఇంటికి దగ్గరగా ఉండడంతో, మా అత్తగారిని అక్కయ్య అని పిలుస్తూ చనువుగా ఉండేవారు.... అవిడని మా వాళ్ళంతా పిన్ని అని పిలిచేవారు.. ఈ మధ్యనెప్పుడో ఆవిడ 50వ పుట్టినరోజని వాళ్ళ పిల్లలు వేడుక చేసి ఫొటోలు పెట్టారు. అప్పటి నుంచీ మా సీతయ్యకి ఒకటే మనాది, అయ్యో నా కంటే చిన్నావిడని పట్టుకుని ఇన్నేళ్ళూ పిన్నీ అని పిలిచేసానా అని...పోనీ అలా అని ఇప్పుడు పేరు పెట్టి పిలిస్తే బాగుంటుందా ఏంటి కానీ ఇప్పుడు కూడా ఇలా మరీ 15 , 16 లకి పెళ్ళిళ్ళయ్యి కాస్త పెద్దరికం గా కనిపించే 30 ఏళ్ళ అమ్మాయిలని చూస్తే మాత్రం పరమ జాలేస్తుంది.. వాళ్ళ పిల్లల వయసు చూసి అందరూ ఆంటీ అనేస్తారు.. పాపం వాళ్ళు ప్రతి సారీ.. అయ్యో నాకు 15 యేళ్ళకే పెళ్ళయిందని చెప్పుకుంటూ ఉండాల్సొస్తుంది కదా మరి!!! పైన చెప్పినట్టు మా సీతయ్య వైపు తనే ఇంటికి పెద్ద. ఇరు వైపులా వారే పెద్ద కొడుకు, నేనే పెద్ద కోడలు, నా పిల్లలే మొదటి మనవలు. మా పిల్లలు పెళ్ళీడుకొచ్చినా, మా వారి తమ్ముళ్లకి, చెల్లెళ్ళకీ (పిన్నిల పిల్లలు) ఇంకా పెళ్ళి ళ్ళు పేరంటాలు, సీమంతాలు బారసాలలు అవుతున్నాయి. పెళ్ళయ్యి పాతికేళ్ళు అయినా ఇంకా మేము పెద్దమ్మ పెదనాన్న, అత్తయ్య మావయ్యల లెవెల్ దాటట్లేదు.. మా వైపు చూస్తే, నేను మరి ఆఖరాఖరు కదా, మా అక్క మనవలకీ, అన్నయ్య మనవలకీ పెళ్ళిళ్ళు, పిల్లలు... వామ్మో మీకు అర్థం అవుతోందో లేదో.. ముత్తమ్మ, ముత్తాత వరుసన్నమాట...:) మా సీతయ్యకి మా వైపు అడుగు పెట్టాలంటే హడల్.. ఎవరో ఒకరు తాతయ్య అనో, ముత్తాతయ్యా అనో పిలిచి పారేయకుండా నేనే జాగర్త పడుతుంటా.. నా అతి జాగర్త కి ఉదాహరణ.. మా అక్క మనవరాలొక బుజ్జిది వాళ్ళ తాతగారిననుకరిస్తూ.. "రండి సీతయ్య గారూ, సిగరెట్ కాల్చుకుందాం" అంటుంటుంది.!! ఇక్కడ కూడా చాలా మంది స్టడీ వీసా మీద మా ఊరి నించి వచ్చిన చుట్టాల పిల్లలు నన్ను పిన్ని అనో , అత్త అనో పిలుస్తూ, పెళ్ళిళ్ళయ్యి, పిల్లలు పుట్టగానే తీసుకొచ్చి 'అమ్మమ్మ ఒడిలో వెయ్యడానికి' తీసుకొచ్చామని చెపుతుంటారు.. నేను సంతోష పడుతూనే పిల్లాడినెత్తుకుని.. "అదిగో చూడు నాన్నా, సీతయ్య గారిని చూడు" అని అన్యాపదేశంగా తాతయ్య అనే పదం రాకుండా కాపాడడానికి ప్రయత్నిస్తుంటా.. ఏముంది లెండి సీతయ్య అయినా తాతయ్య అయినా ఆ బుజ్జితండ్రికేం తెలుసు.. నా ప్రయత్నమల్లా బుజ్జోడి తలితండ్రులకి అర్థం కావాలనే... మీకూ అర్థం అయిందిగా.. నేను జేజమ్మనయినా, ముత్తమ్మనయినా ఫర్వాలేదు.. సీతయ్య మాత్రం. మిస్టర్ సీతయ్యే.. మీరూ జాగర్త.. గజి బిజి చెయ్యకండి సుమా...గల్లంతయిపోద్ది....:)

0 వ్యాఖ్యలు: