ముండా భిగడాజాయే

Thursday, May 28, 2015


మేము ఒక పంజాబీ వాళ్ళ ఇంట్లో బేస్మెంట్ లో అద్దెకి ఉండేవాళ్ళము.  ఇంటి ఆవిడ తల్లి చిన్నప్పుడే భర్తని కోల్పోయి, ఉన్న ఒక్క పిల్లకి కష్టపడి ఇటలీ లో ఉన్న పిల్లాడికిచ్చి పెళ్ళి చేసిందిట. అక్కడ కొన్నాళ్ళుండి కూతురూ అల్లుడూ కెనడా వచ్చారు. మొదట రమ్మంటే రానన్న ఆవిడ తల్లి, కూతురికి పురుడు పోయాలి కాబట్టి వచ్చారు. ఈ లోపు పెద్దావిడ నలుగురు చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు  పిల్లల ద్వారా కెనడాకొచ్చి ఉన్నారు. ఆరు నెలల తర్వాత ఇంటికెళ్ళిపోతా అంటే అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ ఇక్కడుంటే అక్కడేంచేస్తావ్ అని అందరూ అనడంతో ఇక్కడే ఉండిపోయేలా ఏర్పాట్లు చేసారు. పిల్లలిద్దరినీ పెంచుతూ ఇక్కడే ఉండిపోయారావిడ. కొన్ని సంవత్సరాల తరువాత ఆవిడకి పక్షవాతం వచ్చింది. అయినా కూతురికి వండి పెడుతూ, పిల్లలని చూసుకుంటూ, తోడు నీడగా ఉంటూ ఉంటారు. కూతురు అల్లుడు పనికి , పిల్లలు బడికి వెళ్ళగానే అక్కో , చెల్లో మరదలో ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు... అలా 3 వరకు.  అప్పుడు పిల్లలు ఇంటికొస్తారు. వాళ్ళకి తిండి పెట్టి , సాయంత్రం వంటకి తయారు చేసేటప్పటికి చీకటైపోతుంది. చుట్టాలిళ్ళకి మాత్రం అందరూ కలిసే వెళతారు. ఏతా వాతా ఆవిడకి పంజీబీ తప్ప ఇంకే భాషా రాదు.

 

సంవత్సరమంటా మంచు, వానలు కాబట్టి, ఎండాకాలం మాత్రం  సాయంత్రాలు నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆవిడ బయట కూర్చుని ఉంటారు. నన్ను అస్సలు కదలనీయరు. పక్కనే ఉన్న కుర్చీ చూపించి కూర్చో అంటారు. పెద్దవిడ కదా అని ఆగుతాను. ఆవిడ పంజాబీలో ఏంటో అడుగుతారు.  పంజాబీ రాదు కాబట్టి నేను  ఏంటో చెప్తాను. "చాయ్ తాగారా" అంటాను. అవును కాదు కాకుండా ఆవిడ పెద్ద పెద్దగా నాలుగైదు నిముషాలు మాట్లాడతారు. అందులో రెండు సారులు చాయ్ అని, ఒక సారి రోటీ అనీ, ఇంకో రెండు సార్లు పిల్లల పేర్లూ వినిపిస్తాయి. "పిల్లలు రొట్టెలు తిని చాయ్ తాగారు. మా అమ్మాయి వచ్చాక వంట చేస్తాము" అంటున్నారనుకుని ఆహా అంటా..ఆవిడ నన్నేదో అడుగుతారు. "ఏంటండీ" అన్నట్టు మొహం పడతా. మళ్ళీ అడుగుతారు. ఒక పదమేదో పట్టుకుని నాకు తోచిన సమాధానం అవును కాదు, లేదు, ఉంది లాంటి పదాలతో సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒక రోజు "గడ్డి కహా" అన్నారు. బాహర్ హై అన్నా. "నహీ "అన్నారావిడ. నేను బయటకొచ్చి గడ్డి చూపించి "గడ్డీ గడ్డీ" అన్నా.." నహీ నహీ" అంటారావిడ. ఇంకో రోజు పిన్నీ అంటారు. ఎవరి  పిన్ని? ఈవిడేం అడుగుతుందో అనుకుంటా. ఇంకో రోజు క్రీం క్రీం  అంటారు..ఒక అరగంట/గంట ఎలా గడిచిపోతుందో తెలియదు. పెద్దావిడ పాపం ముఖాముఖి మాట్లాడ్డానికి ఎవరు లేకపోయేసరికి నా అవును కాదులకే బహుత్ ఖుష్. "చంగే కుడీ" అని కూడా అంటారు. ఇది ఏంటో అర్థం కాదు. కొన్ని తమిళ పదాలు తెలుసు నాకు, కుడీ అంటున్నారు ఏమన్నా తాగమంటున్నారేమో అని "నహీ నహీ "అంటా, ఆవిడ నవ్వుతారు. వాళ్ళమ్మాయిని అడిగా "చంగే కుడీ అంటే ఏమైనా తాగడమా" అని. "కాదు మంచి అమ్మాయి" అని చెప్పింది. చిన్నప్పుడు వచ్చిన ఫేమస్ పాట "అమ్మా దేఖ్ దేఖ్, తెర ముండా భిగడా జాయే" పాట వల్ల "ముండా" అంటే అబ్బాయి అని తెలుసు  కాబట్టి,  అమ్మాయిలని "ముండీ" అంటారనుకున్న నా అపోహకి నవ్వుకుని.   ఓహో నన్ను "మంచి అమ్మాయి" అని ఆవిడ అన్నప్పుడల్లా నేను కాదు కాదు అంటున్నానా ఇన్ని రోజులనించీ అని నవ్వుకున్నా. తర్వాత్తర్వాత చంగే కుడీ అనగానే ఎగిరి గంతేసి మరీ హా హా అంటున్నా  లెండి!! పనిలో పని గడ్డి అంటే బండి /కారు అనీ, పిన్ని అంటే డ్రై ఫ్రూట్స్ తో చేసిన మినపసున్ని లాంటి లడ్డూ అనీ, క్రీం అంటే పక్క వీధిలో ఉండే కరీం అనీ ఙ్ఞానోదయమయింది.

 

ఒక రోజు ఆఫీస్ నించి వస్తూ గ్రాసాలు (గ్రాసరీలు) కొన్నా. ఇంటి దాకా అన్ని సంచీలు మోసుకొచ్చా కానీ, అన్నీ పట్టుకుని మెట్లు దిగడం కష్టం కాబట్టి, గడప ముందు పెట్టి కొన్ని కొన్ని లోపలికి తీసుకెళదామని అనుకుంటుండగా ఆవిడ కుర్చీ చూపించి కూర్చో అన్నారు. మళ్ళీ వస్తా అని సైగ చేసి..సంచీలన్నీ ఇంట్లో పెట్టి ఆఖరి ట్రిప్ లో ఆవిడ పక్కన కూచున్నా. "చదువు ఎప్పటికి అవుతుంది" అని అడిగారు. స్కూల్ ఖతం అనే పదాలు అర్థమయ్యి "అగ్లే సాల్" అని చెప్పా. "ఇంటి పని బయట పని ఒక్క దానివే చేస్తావు. ముండే కుచ్ నహీ కర్తే" అన్నారు (అలా అర్థం అయ్యిందంతే). "కర్తే కర్తే" అన్నా. ముండే అంటే అబ్బాయిలు అని తెలుసు కానీ ఎందుకో  నాకు నవ్వాగట్లేదు.. ఇంట్లో ఫోన్ మోగటంతో మళ్ళీ వస్తా అని ఇంట్లోకొచ్చేసా.  పిల్లలు ఆడుకోడానికెళ్ళారు.  సీతయ్య నిద్ర లేవగానే స్నానానికెళుతూ "10 నిమిషాల్లో వస్తా అన్నం పెట్టెయ్, నా బట్టలు ఇస్తిరీ చేసావా, బాక్స్ సర్దేసావా, బ్యాగ్లో చార్జర్ పెట్టు, నేను చదువుతున్న పుస్తకం కూడా పెట్టమన్నా పెట్టావా" అంటూ ఊదరగొట్టేసారు. నేనూ ఆఫీస్ లో పని చేసి వచ్చాగా కొన్ని పనులైనా ఎవరైనా పంచుకుంటే బాగుణ్ణు అనుకుంటూ "ఆ ఆ పెట్టా పెట్టా" అన్నా నిదానంగా. భోజనం వడ్డిస్తూ "మీ నయిటు షిఫ్ట్ లు కాదు కానీ అన్ని పనులూ చేసి మీరు వెళ్ళాక చదువుకోవడానికి అస్సలు అవట్లే, అలసటతో కళ్ళు మూతలు పడుతున్నాయి. మీకు పగలు పని దొరికితే బాగుణ్ణు , రాత్రి రెండో సారి వండటం సర్దటం తప్పుతాయి. మా ముగ్గురితో పాటు మీకూ పొద్దున్నే బాక్స్  సర్దిస్తే సరిపోతుంది. సాయంత్రం ఇంటికొచ్చి ఉన్నవి తిని హాయిగా చదువుకోవచ్చు. పొద్దున్న కూడా పిల్లల పనులన్నీ ఒక్క దాన్నీ చేసుకోవాల్సి వస్తోంది. ఇందాక పెద్దావిడ కూడా అదే అన్నారు" అన్నా. "ఏమన్నారు" అనడిగారు. "ముండే కుచ్ నహీ కర్తే అన్నారు" అని  సరదాగా నోరు జారేసి నన్ను నేను తిట్టుకున్నా. అసలే కోపమెక్కువ. జోకులు అర్థం కావు. ఇప్పుడు పనికెళ్ళే ముందర కొపమొస్తే రాద్ధాంతమే! ఎప్పుడూ లేనిది ఇలా నోరు జారేసా ఏమవుతుందో దేవుడా అని భయపడుతూ పెరుగు వడ్డించా. " పిల్ల ముండలు కాస్త ఫర్వాలేదు కానీ, మొగుడు ముండ అసలేం చెయ్యడని చెప్పకపోయావా" అన్నారు నిదానంగా. నేను ఉలిక్కి పడ్డా. జోకా సీరియస్సా అర్థం కాలే. లోపలినించి నవ్వు తన్నుకొచ్చింది కానీ ఆయన నవ్వట్లేదు సీరియస్ గానే అన్నారు. హమ్మయ్య ఇంతటితో సరిపోయిందని నేను స్టవ్ తుడవడానికన్నట్టు అటు తిరిగి పని చేసుకున్నా.

 

 

ఆ మర్నాడు శనివారం కొందరు స్నేహితులొచ్చారు. రాత్రి నించీ ఎవరితోనన్నా చెప్తే బాగుండుననే నా ఉత్సుకతని ఆపుకోలేక వాళ్ళకి ఈ "ముండా కుచ్ నహీ కర్తే "కహానీ చెప్తుండగా ఫోనొచ్చింది. స్నేహితులందరూ "నా మొగుడు ముండ మంచోడు, నా పిల్ల ముండ అల్లరోడు" అంటూ "మొగుడు ముండ,పిల్ల ముండలు" అని రిపీట్ చేసి పడీ పడీ నవ్వుతున్నారు. మా సీతయ్య కూడా చిరునవ్వులు చిందించారు. అబ్బో సార్ కి కూడా జోక్ అర్థమయినట్టుందే  అనుకుంటూ ఫోన్ తీసా. జయంతి ఫోను.  కోయంబత్తూరు వాళ్ళు.

 

ఈవిడ పరిచయమైన కొత్తల్లో ఫోన్ చేసినప్పుడల్లా మొదటి వాక్యం " చిన్నా అవుడ అబ్బ లేడా" అని అడిగేది. చిన్నా వాళ్ళ నాన్న ఇంట్లో లేరా అనిట. కొత్తల్లో తెగ నవ్వొచ్చేది. మీ నాన్న లేరా అని అడగాలంటే నీ అబ్బ లేడా అంటుందేమొ అని!  బాగా క్లోస్ అయ్యాక "చిన్నా అవుడ అబ్బ" అనడం మానేసి  "అన్న లేడా" అంటోంది హమ్మయ్య అనుకున్నా. "చపాతీలు చేస్తున్నా రెండు చేతులూ బిజీ.. నిన్ను స్పీకర్ లో పెట్టానబ్బా" అన్నా. బ్యాక్ గ్రవుండులో మాటలు వినిపించి ఆవిడ " ఏమిది నన్ను పిలవలేదు మీ అన్నను కొనుక్కొచ్చేనా" అంది. "అల్రెడీ మా అన్నని కొన్నావు మళ్ళీ కొనకు, తీసుకుని వస్తానంటే రా ఫర్వాలేదు"  అన్నా. "ఎప్పుడు కొనింది?" అనడిగింది. "పెళ్లప్పుడు కొన్నావుగా" అన్నా.  "ఓ తీసానంటున్నావా" అని నవ్వింది. తనతో ఒక  తికమక ఉందిలెండి. మనం ఏదైనా కొనుక్కొస్తా అంటే తను " సరే" అంటుంది ,ఏమైనా తీసుకొస్తా అంటే "వద్దు వద్దు యేల దుడ్డు వేస్ట్ సేసేవు" అంటుంది. ఇది చాలా సార్లు అయ్యాక నాకు అర్థమయ్యిందేంటయ్యా అంటే వాళ్ళకి తీయడం/తీసుకురావడమంటే కొనడంట. కొనుక్కురావడమంటే కొనితేవడం లాగా తీసుకురావడంట. నాకు చెప్పడం రాక మిమ్మల్ని తికమక పెట్టానా.. పోనీ లెండి ఈ సారి మీరు మా ఇంటికొచ్చేప్పుడు ఏమీ తీసుకురాకండి కానీ ఎవరినైనా కొనుక్కురండి. 

 

ఇంతకీ మా జయంతి ఫోన్ చేసిన విషయం చెప్పలేదు కదూ. మా సీతయ్య ఇండియా వెళుతున్నారని గుర్తొచ్చి ఏదో వస్తువు పంపుదామని అనుకుందిట. కానీ ఈయన ఎప్పుడు వెళ్ళేదీ గుర్తు లేదుట. అందుకని "ఇంతకీ  అన్న ఉండాడా పోయి పూడిసిండా" అంది. వెనక నించి మా సీతయ్య " పోయాడు కానీ ఇంకా పూడవలేదని చెప్పు" అన్నారు. అటు జయంతి అర్థం అయ్యీ అవనట్టు నవ్వితే ఇటు ఇంట్లో ఉన్న మిగిలిన స్నేహితులందరూ గట్టిగా నవ్వేసారు.  ఎప్పుడూ సీరియస్ గా ఉండే మా సీతయ్య ఇలా అనడం విన్న మా స్నేహితురాలు మా సీతయ్యనుద్దేశించి " ముండా భిగడాజాయే" అంది. "ఏ ముండా" అని మా సీతయ్య ఆశ్చర్యం వ్యక్తం చేసి మా అందర్నీ మరొక్క సారి ఆశ్చర్యంలో ముంచేసారు!

 

 

 

 

 

 !