నూతన సంవత్సర శుభాకాంక్షలు
Friday, December 31, 2010

అందరిలో మావయ్య
Monday, December 27, 2010
చయినీస్ షాప్ ఉండటంతో ఈ మాల్ రద్దీగా ఉంటుంది. ఈ చయినా మార్కెట్ లో దొరకని వస్తువంటూ ఉండదు.ఇదే మాల్ లో ఒక శ్రీ లంక వాళ్ళ బట్టల కొట్టు, డ్రయివర్ లయిసేన్స్ ఇస్స్యు ఆఫీసు, ఇంకా కొత్తగా వచ్చిన వాళ్లకి సహాయం చేసే కమ్మ్యునిటి సెంటరు , రెండు రెస్టారెంట్లు , రెండు బార్బర్ షాపులు, ఒక డాలర్ స్టోరు ఉన్నాయి....అందువలన మాల్ చిన్నదయినా ఎప్పుడు బిజీగా ఉంటుంది. అందుకే మా బాస్ ఇక్కడ ఈ టయిములో కొంత స్థలం అద్దెకి తీసుకుని క్యుబికాల్ నిర్మించి ఆఫీస్ సెటప్ చేస్తారు.
ఇది టాక్స్ సమయం. ప్రతి ఒక్కరు ఇన్ కం టాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చెయ్యాలి. ప్రయివేటు సంస్థలు ఈ మూడు నెలలు ఇలా రద్దీగా ఉన్న స్థలాల్లో టెంపరరీ ఆఫీసులు పెట్టి జనాల దగ్గర ఫీజు వసూలు చేసి టాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసి పెడతారు.
ఇది సీసనల్ వర్కు. ఇప్పటి వరకు నెల రోజులు గా హెడ్ ఆఫీసులోనే పని.
బాస్ దగ్గర పనిచేసే పదిహేను మందీ పర్మనెంటు ఎంప్లాయీస్ సంవత్సరం పొడుగునా హెడ్ ఆఫీసులో పని చేసినా ఈ టయిములో మాత్రం బాస్ సెట్ అప్ చేసే పదిహేను టెంపరరీ ఆఫీసుల్లో ఏదో ఒక చోట పని చెయ్యాలి. టాక్స్ సీసన్ స్టార్ట్ అయ్యే రెండు నెలల ముందు ఒక కోర్స్ పెట్టి, టెంపొరరీగా చాలామందిని మూడు నెలల కోసం అపాయింటు చేసుకుంటారు. మొదటి సంవత్సరం హెడ్ ఆఫీస్‌లోనే పని . కానీ పర్మనెంటు ఎంప్లాయీ ఒకతను సడెన్ గా మానేయ్యడంతో పని బాగా అలవాటయిందని ఒక్క వారం క్రితం నన్ను మొదటి సారి ఇక్కడికి పంపారు.
కొత్త రూటు. మూడు బస్సులు మారి ఎనమిది కల్లా రావడం కష్టంగానే ఉంది. రాత్రి తేలిక పాటి మంచు జల్లులతో మొదలయి మంచు వాన పెద్దదయింది. అన్నిచోట్లా మోకాళ్ళ లోతు మంచు. సయిడు వాక్స్ మాత్రం వీలయిననంత త్వరగా క్లియర్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. పొడి మంచులో నడవడం కొంచెం ఫర్వాలేదు. మంచు గట్టిపడిపోయిగ్లాస్ లా తయారయినప్పుడు మాత్రం చాలా జారుతూ ఉంటుంది. అంత చలిలో నెమ్మదిగా నడవాల్సి వస్తుంది, గడ్డ కట్టేస్తూ . ఇంకా కెనడా వచ్చి మూడు నెలలు అయింది అంతే. ఇదే మొదటి జాబ్. ఇంకా చలికి అలవాటు పడలేదు. ఉదయం ఎనమిది నుండి రాత్రి ఎనమిది వరకు పని చెయ్యాలి కానీ ఒకొక్కసారి తొమ్మిది గంటల వరకు పని చెయ్యాలి. 'అధికస్య అధికం ఫలం' అని ఎన్ని గంటలయినా పని చెయ్యడానికి రెడీ, కానీ చలి, చలి చలి.....క్లయింట్లు వస్తు ఉంటె సమయం గడిచిపోతుంది చలీ పులీ తెలియకుండా. ఎవరు లేకపోతె మాత్రం 'నా తరమా భవ సాగర మీదను నలిన దళేక్షణ రామా' అనుకుంటూనే చలి సాగరాన్ని రాత్రి తొమ్మిది గంటల వరకు ఈదేయ్యాలి.
టాక్స్ చెయ్యడం,టాక్స్ తగ్గడానికి కొన్ని సలహాలివ్వడం, బిల్ చెయ్యడం, ఫోను కాల్స్ అటెండ్ చెయ్యడం , సాయంత్రం డెబిట్/క్రెడిట్ కార్డ్లను క్లోసు చెయ్యడం, బ్యాంకులో క్యాష్ డిపాసిట్ చెయ్యడం , అకౌంట్ రికన్సయిల్ చెయ్యడం, కాష్ సరిచూడడం, లాస్ట్ అండ్ ఫైనల్ హెడ్ ఆఫీసుకి రిపోర్ట్ పంపడం ఇదీ పూర్తి దినచర్య...
మొదట భయపడ్డాను కానీ ఇక్కడి వాళ్ళు చాలా సరదాగా ఉంటారు. ఇంటిదగ్గర ఎవరూ వినేవారు లేకపోవడం వల్లనేమొ చాల మంది బాగా కబుర్లు చెపుతారు.ఆ కబుర్లలో కనీసం ఒక్కసారయినా "నేను నేటి మహిళను" పయిన డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ బొట్టు పెట్టుకునే వారిని ఎవరినయినా శ్రీ లంకన్లని అనేసుకుంటారు , బొట్టుపెట్టుకుని కనిపించేది ఎక్కువగా వాళ్ళే మరి . "కాదు బాబూ , భారత వర్షే, భారత ఖండే, మేరోర్ దక్షిణ దిగ్భాగే, గంగా గోదావరి మధ్య ప్రదేసే, శ్రీ శైలస్య ఈశాన్య దిగ్భాగే, నేను నా ఆంద్ర ప్రదేశం వెరసి పవిత్ర భారత దేశం...."అని చెప్పుకునే లోపు , పనిలో పనిగా 'సింధూరం-దాని ప్రశస్తి " మీద కూడా ఒక క్లాసు వేసేసుకునే అవసరం వస్తుంది లేకపోతె, నేనే తెప్పించుకుంటాను....
ఇక్కడ అందరికీ ప్రతి పే చెక్ లోంచీ నిర్నీతమయిన మొత్తంలో టాక్స్ కట్ చేసి ఎంప్లాయర్ గవర్నమెంటుకి కట్టేస్తాడు. సంవత్సరం చివర లెక్కలు కట్టి, ఎక్కువ కట్ చేస్తే తిరిగి ఇయ్యడం, తక్కువ కట్ చేస్తే కట్టించుకోవడం జరుగుతుంది. రిఫండ్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాప్పీగా వెళతారు. తిరిగి డబ్బు కట్టాల్సిన వాళ్ళను కూడా నవ్వుతు పంపించడం బానే అలవాటయ్యింది. రిఫండ్ రాలేదుగా ఫీజు కట్టక్కర లేదా అని జోక్ చేస్తారు. సారీ సార్ నా సొంత కంపెనీ అయ్యుంటే మీకు ఫీజు చార్జీ చేసేదాన్ని కాదు అంటాన్నేను. చాలా మంది వర్క్ అయిపోయాక సాయంత్రం వస్తారు టాక్స్ రిటర్న్స్ చెయ్యడానికి. భోజనాలు అవీ కానిచ్చి చివరి నిముషంలో వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ. మళ్ళీ రండి అంటే, బిసినేస్స్ పోయినట్టే. అందుకని టయిము అయిపోయే సమయానికి వచ్చినా టాక్స్ చెయ్యాలి. అలాంటప్పుడు రిపోర్టులకి చాలా హడావిడి అయిపోతుంది. పైగా తొమ్మిది గంటలకి మాల్ క్లోస్ .
ఒక బిజీ సాయంత్రం చివరి నిముషంలో వచ్చారు మిస్టర్ స్కేమ్బారిస్. డాకుమెంట్స్ అన్నీ నా చేతికిస్తూ, మీరు చేస్తూ ఉండండి , పక్క షాప్లో చిన్న పని ఉంది , పది నిముషాల్లో వచ్చేస్తాను అన్నారు. నా టెన్షన్ నాది. ప్రతి అరగంటకి ఒక బస్ ఉంది... ఒకటి మిస్ అవుతే ఇంటికి వెళ్ళాల్సిన మూడు బస్‌లూ మిస్ అవుతాయి...కానీ ఏమీ చెయ్యలేం. అలాగే సార్, పదిహేను నిమిషాల్లో ఇక్కడుంటే చాలు, మరీ లేట్ అవకుండా అన్నాన్నేను. ఓ శూర్ , త్యాంక్ యు అంటూ వెళ్ళాడు ఆయన. పేపర్లన్నీ పొందిగ్గా అరేంజ్ చేసి ఉన్నాయి. అదృష్టం కొద్దీ ఇతను పాత క్లాయింటే. పేరు కొట్టగానే డీటెయిల్స్ అన్నీ వచ్చాయి...బతికానురా దేవుడా....చాలా టయిము కలిసొచ్చిందని అనుకుంటూ కంప్లీట్ చేసే సమయానికి స్కేమ్బారిస్ గారు వచ్చేసారు. అయిపోయిందండీ, మీరు లేట్ అవుతారేమో అని భయపడ్డాను అన్నాను...నో నో మీకు లేట్ అవ్వనివ్వనుగా అని ఎదురు ఖుర్చీలో కూచున్నారు రిసల్ట్స్ కోసం చూస్తున్నట్టు. మీరు లకీ అండీ 2,112 డాలర్స్ రిఫండ్ వచ్చ్సింది అన్నాన్నేను ప్రింట్స్ తీసుకోడానికి ప్రింటర్ వయిపు తిరిగి. ఈ లోపు ఆయనకీ ఫోన్ వచ్చింది .
మా అబ్బాయికి ఎంత రిఫండ్ వచ్చిందండీ, ఫస్ట్ టయిం కదా చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాడు, వాడే ఫోను అన్నారాయన...నేను గబా గబా పేపర్లన్నీ చెక్ చేసాను. అన్నీ ఆయన డాకుమెంట్సే. కంప్యూటర్లో డీటైల్స్ చూసాను.పిల్లవాడికి మొన్ననే పద్దెనమిది యేండ్లు నిండాయని చూపిస్తోంది డేట్ ఒఫ్ బర్త్ కాలం.. సారీ అండీ మీ అబ్బాయి డాకుమెంట్లు మరిచిపోయినట్లున్నారు మీరు అన్నీ మీవే ఉన్నాయి అన్నాను. లేదండీ ఇక్కడే ఉందీ అంటూ ఒక కాగితం బయటికి లాగారాయన. పేరు ఊరు అన్నీ ఆయనవే. అదే అన్నాన్నేను. ఆయన నవ్వుతు,వాడిదీ నాదీ ఒకటే పేరండీ..సోషల్ ఇన్సురెన్స్ నంబరు చూడండీ అన్నారు..అవును అప్పుడు చూసాను నంబరు....సారీ సార్ నేను ఇప్పటి వరకు తండ్రీ కొడుకులను ఒకే పేరుతొ చూడలేదు అంటూనే అబ్బాయి రిటర్న్స్ చెయ్యడం మొదలెట్టాను. బస్సు 'ఏడుకొండల వాడా వెంకట రమణా' అయ్యింది కాబట్టి ఇంక లేట్ గా వెళ్ళడానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి, మాల్ మూసే లోపు అయితే చాలు అని గబా గబా చేస్తున్నాను...స్కేమ్బారిస్ గారన్నారు.. మీరు ఇక్కడికి కొత్తనుకుంటాను...ఇక్కడ ఇలా పేర్లుండటం కామన్...ఇంకా వింత ఏంటంటే మా నాన్నది కుడా ఇదే పేరు... అయితే నా పేరు చివర జునియర్ అని ఆడ్ చేసారు. నాకు అలా ఇష్టం లేదు తరవాత తీసేసాను అన్నారు.
దేవుడా...., ప్రపంచంలో పేర్లే లేనట్టు తాత తండ్ర కొడుకు అందరికీ ఒకే పేరట బావుంది కత అనుకుంటూ తొందరగా కంప్లీట్ చేసాను. మీరు ఇక్కడ సంతకాలు పెట్టండీ, అబ్బాయిని సంతకాలు పెట్టడానికి రేపు తీసుకొస్తారా అన్నాన్నేను రిఫండ్ వివరాలు చెబుతూ..."తప్పకుండా, మీకు చాలా థ్యాంక్స్ , మీకు లేట్ అయినట్లుంది..నేను డ్రాప్ చెయ్యనా సెంటర్ వరకు "అన్నారు. ఈ లోపు..."హహహ్హ తెలుండ!" యముండ టైపులో వినిపించింది..నాలో నాకు. తెలుండు మేల్కొని "అయ్యా మేము తెలుగు బాబూ, అంత తొందరగా ముక్కు మొఖం తెలియని వాడి దగ్గర హెల్పు తీసుకోవడమే..మేమెక్కడ ,మా ఆత్మాభిమానమెక్కడ!ఎల్లేల్లెహే -అనేసాడు నేను గబుక్కున వాణ్ని దాచేసి ...థ్యాంక్స్ సార్, నాకు క్లోసింగ్ వర్క్ ఉంది ఇంకా, మీరు వెళ్ళండి... గుడ్ నయిట్ అన్నాను...గుడ్ నయిట్ సి యు అగెయిన్ అని ఆయన వెళ్ళిపోయారు... నేను క్లోసింగ్ కంప్లీట్ చేసి మాల్ మూసే లోపు బయట పడ్డాను. తరవాత రెండు మూడు కేసులు వచ్చాయి ఇలాంటివి...(అబ్బ, పెద్ద డాక్టరు లా పోసు కొట్టాను కాదు ఈ డయిలాగ్ కొట్టి) ..ఇది నాకొక పెద్ద లెసన్.అప్పటి నుండీ 'పేరులోనేముందీ' అనుకుంటూ పేర్లని పక్కన పడేసి ,పేపర్లని సోషల్ ఇన్సురెన్స్ నంబరు తో కొలవడం మొదలు పెట్టాను.
తరవాత వారం కాష్ డిపాసిట్ చెయ్యడానికి బ్యాంకుకి వెళ్లాను. మెటర్నిటీ సెలవలో ఉన్న రిసెప్షనిస్టు జో-ఆన్ కనిపించింది, పిల్లాడితో సహా. వాడికి మూడో రోజు .. వావ్ ఎలా ఉన్నావ్, ఐ మిస్ యు....అని కవుగిలించుకుని అరిచినంత పని చేసింది...ఈ అరుపులు కవుగిలింతలు నాకు కొత్త...మొహమాటం గా "ఐ యాం గుడ్...బేబీ చాల బాగున్నాడు ఏం పేరు పెట్టారు? "అన్నాను బేబీ చేతుల్ని నెమ్మదిగా స్పృశిస్తూ (ముట్టుకోవచ్చ లేదా అని అనుమానం..మా అమ్మ అయితే పడేసి తన్నేది అలా చేతులు కడుక్కోకుండా ఎవరయినా పిల్లల్ని ముట్టుకుంటే ) . పేరు జకారియా అంది...అవునా మీ హస్బెండ్ పేరు అదే కదూ అన్నాను...అవును ఆయన పేరే పెట్టుకున్నాడు అంది...నేను నవ్వుతు "కానీ జునియర్ అని చివరన కలిపారు కదూ" అన్నాను అస్సలు ఆశ్చర్య పోకుండా( స్కేమ్బారిస్ దెబ్బతో...బోల్డు లోక జ్ఞానం వచ్చేసింది మరి)..."జాక్ వర్క్ కి వెళ్ళాడు .....బాబుని మీ అందరకీ చూపిద్దామని ఆఫీసుకి తీసుకెళ్ళాను, ఓకే మరి కొంచెం షాపింగ్ చెయ్యాలి " అని చెప్పి వెళ్ళిపోయింది. శాపింగా? ఇంత చలిలో! ఇక్కడ విచిత్రంగా ఏదో కొంపలు మునిగి పోయినట్లు మూడో రోజే ఇలా పిల్లాడ్ని తీసుకుని బయట తిరుగుతుంటారు..మా ఊర్లో అయితేనా, మూడు నెలలు బయటికి రాము అనుకుంటూ క్యాష్ డిపాసిట్ చేసి బయలుదేరాను.
నేను డిపాసిట్ చేసిన క్యాష్ తీసుకుని పల్లీలు, సమోసా షాపింగ్ చెయ్యండి మీరు...షాపింగ్ అయ్యాక దయచేసి మీ సీట్ నంబరు లోనే కూర్చోండి...ఎదుర్ సీట్ల మీద కాళ్ళు పెట్ట రాదు..గోడలపై ఉమ్మరాదు. మీ నగలు వస్తువులకి మీదే బాద్యత ...సిగరెట్ తాగుట ఆరోగ్యానికి హాని కరం...ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.... గోల్డ్ స్పాట్ ది జింగ్ థింగ్ .....గోల్డ్ స్పాట్. .....
అర్థం కాలేదా......ఇంటర్వెల్ అండీ బాబూ.....

మా ఊళ్ళో హాలొవీన్
Thursday, December 23, 2010
మా మార్లీన్ మొన్న ఒకటే నొచ్చుకుంటూ కనిపించింది. ఏంటా అని ఆరా తీస్తే హాలొవీన్ డే నాడు కొన్న చాకొలేట్లన్నీ అలాగే ఉండిపొయ్యాయిట...చాల బాధ పడిపోయింది.'నీకు తెలుసా మా చిన్నప్పుడయితే హాలొవీన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం, బోల్డు కొనేసాను చాలామంది పిల్లలోస్తారని , ఇద్దరంటే ఇద్దరు వచ్చారంతే 'అని చెప్పింది...నాకు యేదొ ఓదారుద్దామనిపించి..'"పొనీలే మార్లీన్, మన చిన్నప్పుడంటే మన పేరెంట్స్ యెక్కువ కొనిచ్చేవారు కాదు కాబట్టి మనకి ఏందొరుకుతాయా అని చూసేవాళ్ళం, ఇప్పుడు పిల్లలకి ఆ అవసరం ఏముందీ అన్నీ పేరెంట్స్ కొనిచ్చేస్తారుగా అడగ్గానే "అన్నాను..ఆ ఎక్సప్లనేషన్ కి ఆవిడ అద్దిరిపోయి( ఇక్కడందరూ ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు నిజ్జమా కాదా నాకు అర్థం కాదు...అర్థం చేసుకునే ప్రయత్నం అవసరమంటారా?) ..."అవును నిజమే, నాకు పిల్లలు లేరుగా అందుకే ఇలాంటి థాట్స్ రాలేదు " అని కళ్ళు తుడుచుకుంది....వెంటనే తేరుకుని, "అవును ఎన్నెలా, మీ ఊరిలో కూడా హాలొవీన్ జరుపుకుంటారా? పిల్లలకి ఫ్రీ ఫుడ్ పంచుతారా " అని అడిగింది......
ఇక్కడ అక్టోబర్ చివరన హాలోవీన్ పండుగ జరుపుకుంటారు. నాకు తెలిసీ దీన్ని మనం ఆల్ సెయింట్స్ డే అనీ, ఆల్ సోల్స్ డే అనీ, మా ఊర్లో అయితే ముద్దుగా "బొందల పండుగ"నీ పిలుచుకుంటాము. విశేషమేంటంటె సాయంత్రం పిల్లలందరూ అందంగా సీతాకోక చిలుకల్లగా, దేవ దూతల్లగ, ఇంకా మంచి మంచి మెరిసిపోయే దుస్తులు వేసుకుని అందరిళ్ళకీ వెళతారు. అందరూ దీపాలు వెలిగించి(ఎలట్రిక్ వే లెండి),పిల్లల కోసం ఎదురు చూస్తుంటారు. ఈ టయిముకల్లా కంపెనీలు చిన్న చిన్న చాకొలేట్ ప్యాకెట్లూ, చిప్స్ ప్యాకెట్లు అవీ ప్రత్యేకంగా తయారుచేస్తారు. పిల్లలు ప్రతి ఇంటికీ వెళ్ళి 'ట్రిక్ ఆర్ ట్రీట్' అని అడుగుతారు. ఇంటి వాళ్ళు 'ట్రిక్కులోద్దు బాబోయ్ ట్రీట్లు ఇవిగో ' అని కొని ఉంచిన చాకొలేట్లో, చిప్సో, ఇంకా యేవయిన తినుబండారాలో వాళ్ళ బాగ్ లొ వేస్తారు...ఇలా పిల్లలు ఇంటింటికీ వెళ్ళి చాలా రోజులకి సరిపడా తినుబండారాలు పోగేసుకుంటారు... కల్లెక్ట్ చేసే వరకూ ఓకే... తరువాత మాత్రం, పళ్ళు పుచ్చిపోతాయనీ, అందరూ మంచివస్తువులు ఇస్తారో లేదొ అనీ అందరు తల్లులకీ కొంచెం సందేహాలు...దాంతొ...ఆ దండుకొచ్చిన పదార్థాలన్నీ మరునాడు ఆఫీసులకి తీసుకొచ్చి పడేస్తుంటారు....మరి నాకేంగుర్తొచ్చాయంటే ...
మాదొక చల్లని ఊరు. నాలుగు వందల సంవత్సరాల పూర్వం ఎప్పుడో ఒక ముని తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి వెలసిన ఊరు. చిన్న తిరుపతి లేక్కన్నట్టు. మా వెంకన్నకి డిసెంబరులొ బ్రహ్మోత్సవాలు జాతర....అబ్బో సందడే సందడి.ఆ పది రోజులు అస్సలు ఇంట్లో ఉండేది లేదు. యెవరు జాతరకి వచ్చినా, తెలిసున్నచిన్న పిల్లలు కనిపిస్తే గాజులొ, మరమరాలో, చిన్న బొమ్మలో కొనియ్యడం ఆనవాయితీ. ఇంక మనకి పండగే మరి...ప్రతి ఒక్కరూ ఊరిలో తెలిసున్న వారే..అందునా మనమంటే కుంచెం ఎక్కువ ఇష్టం ఎందుకో.... చెల్లీ నేనూ ఇద్దరం ఆ పది రోజులూ నిద్ర పొవడానికి తప్ప ఇంటికెళితేనా!
మద్యాహ్నానికల్లా గుర్రాలు, చిన్న రంగుల రాట్నం ,పెద్ద తోట్టెల (పెద్ద రంగుల రాట్నం) దగ్గర పడిగాపులు . చిన్న రంగుల రాట్నం (మెర్రీ గో రవుండ్ ) నాట్ ఎట్ ఆల్ ఇంటెరెస్టింగ్, ఎందుకంటేచాలాసార్లు ఖాళీగా ఉండెది.మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు గబుక్కున ఎక్కచ్చు...ఇంకా అమ్మ ప్రతి రోజూ చిన్న రంగుల రాట్నం కి డబ్బులు ఇచ్చేది...అస్సలు సంగతంతా పెద్ద ఉయ్యలలో ఉంది.."అది చాలా ఖరీదు.. మీరు చిన్న పిల్లలు....చక్క రొస్తదీ, ఎక్కద్దు "అని అందరూ చెప్పేసే వారు...మరి ఒద్దు అన్న వాటిమీదే కదండీ మక్కువంతా ....నాలుగు ఉయ్యాలల్లో .మూడు ఉయ్యాలలు నిండే వరకే మా వెయిటింగు అంతా.. .ఆ మూడో ఉయ్యాల నిండే వరకు ఎక్కడైనా ఆడుకోవచ్చు...ఒక్కొక్క ఉయ్యాల నిండుతుంతే దాన్ని పయికి పంపించి ఖాళీ ఉయ్యాల కింద ఉంచి జనాల కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు దాని ఓనర్...మూడు ఉయ్యాలలు నిండే వరకు అందరికీ ఎక్కడ లేని ఓర్పు...ఆ తర్వాతా పయిన ఉన్నవాళ్ళు ఇగ కానీ భై పోవాల అంటు ఉండేవారు..కానీ నాలుగు ఉయ్యాలలు నిండకపోతే బ్యాలన్స్ అవదని అనుకుంట ,అప్పటికి రీజన్లు లాజిక్లూ తెలియవు...ఓన్లీ గోల్ ఈస్ ..మూడు ఉయ్యాలలు నిండే టైముకి అక్కడున్డాలి ...నాలుగో ఉయ్యాలలో ఇంక బతిమాలి మరీ ఫ్రీగా ఎక్కించుకుంటాడు... అప్పుడప్పుడు మనం "నాకు భయ్యం నేను రాను "అనాలన్నమాట.. అతను...రాండ్రి తల్లీ మా అమ్మలు గదూ,జోర్గ తిప్పనులే అని సముదాయించి మరీ అందరినీ యెక్కిస్తాడు..మనసులో మస్త్ సంతోషం.. బయటికి మాత్రం భయ్యం...రోజూ ఇదే సీను..... యీ జాతర సంగతి అటుంచితే..
పిల్లల్లేని ప్రతపరెడ్డి మాస్టారు ప్రతి సోమవారం పిల్లలందరికీ పిప్పరమెంట్లు పంచేవారు...సొ మండే సాయంత్రం అక్కడ హాజరు.... రామిరెడ్డి తాతకి చాలా పొలాలు అవీ ఉన్నాయి... వాళ్ళకి చిక్కుళ్ళు బాగా పండేవి....ప్రతి శుక్రవారం పెద్ద గుండిగతో గుడాలు (గుగ్గిళ్ళూ) ఉడికించి పిల్లలందరికీ పంచేవారు....ఫ్రయిడే సాయంత్రం నుంచీ అక్కడే మకాం... మరి లలితత్త నాకు రెండు చేతులూ పట్టమని, పట్టినన్ని గుడాలు పెట్టేది..అప్పుడప్పుడు గవును పట్టమని ఒడి నిండా పోసేది .అక్కడే అందరం గోడ పక్కన కూచుని మట్టి చేతులు అవీ ఇవీ ఆలోచించకుండా బొజ్జ నిండా తినేవాళ్ళం .
శనివారం మా వెంకన్నకి భోగం...అక్కడ దద్యోజనం లేదా పులిహోర ప్రసాదం...ఇక్కడ ప్రసాదం గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి...మా పెద్ద పూజారి గారు....రాఘవాచారి మామ...యీయన చాలా ఫేమస్, యెందుకంటారా...గుప్పెడు పులిహార ఇచ్చి పంచమంటే, ప్రపంచం మొత్తం పంచి ఇంకా చిటికెడు మిగులుస్తాడని ప్రతి ఒక్కరూ చెప్పుకునేవారు... సొ, షాట్ కట్ గా యెప్పుడయిన యెవరింట్లోనయిన తక్కువ ఖర్చుతో యెక్కువ మందికి భోజనాలవీ పెట్టాలంటె, మా రాఘవాచారి మామని అధ్యక్షుడుగా ఉంచిటే సరి.ఆయన ప్రసాదం పెట్టే తీరు గుర్తొస్తే చాల నవ్వొస్తుంది.. ఒకొక్క మెతుకు అందరి చేతిలో విదుపుతున్నత్తు పెట్టేవారు..విసుగు కూడా చాల ఎక్కువ...ఇంకా ప్రసాదం తీసుకోగానే ఇంటికొచ్చేస్తామా ఏంటి?. మా లల్లీ, విజ్జీ, గవురీలతో గుడి చుట్టూ ఉన్న దేవిడీ ల పయికి మెట్ల మీంచి వెళ్ళి కిందకి వాలిన చింత చెట్ల కున్న కాయలు కోసుకోవాలి...అక్కడ గస్తీ తిరిగే మల్లన్న తాతకి కనపడకుండా మెట్లు దిగి రావాలి...మెట్లు అస్సలే బహు పురాతనమయినవి...మధ్యలో ఉండగా తాత అరిచాడంటే, మన గుండె ఆగిపోవడమో, జారి పడడమో తధ్యం...
మరి హోలీ వచ్చిందంటే, నాకు గుర్తుండీ యెవ్వరూ ఫ్రీగా రంగు జల్లేవారు కాదు...రంగు జల్లి మెడలో మిఠాయిల దండ వేసేవారు... సో, ఎంత మంది రంగు జల్లితే, మనకి అంత మంచిదన్నమాట.రాఖీ పండక్కి అన్నయ్యలే కాకుండా అన్నయ్యల ఫ్రెండ్స్ అందరూ ఇంటికొచ్చి రాఖీలు కట్టించుకుని స్వీట్శ్, డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు ..అబ్బే, ఇందులో మన స్వార్థం యేమీ లేదండీ, వాళ్ళకి చేతికి ఎన్ని రాఖీలుంటే అంత 'ఇజ్జత్' అన్నమాట. మరి అన్నలు కదా! కట్టమంటే కట్టేస్తాం అంతే.
అంతేనా, ఇస్కూల్లో పెద్ద పెట్టెల్లో నెలకొక సారి వేఫర్లు వచ్చేవి.(అప్పటికి వాటి పేరు తెలియదు) అందరికీ పంచేవారు మధ్యాహ్నానికాల్లా.
ఇంక శ్రీరామ నవమి..ప్రతిరోజూ పొద్దున్న పూజలు-ప్రసాదాలు, చలువ పందిళ్ళు ..అక్కడ పగలంతా నాలుగ్గుంజలాటలు(నాలుగు స్నంభాలాటలు)..దాగుడు మూతలు.సాయంత్రం అవ్వంగానే ఏదొ ఒక ప్రోగ్రాం..ప్రోగ్రాం సంగతి అటుంచితే..ప్రసాదం ఇంపార్టెంట్ ఇక్కడ...ఇంక పదవ రోజు కళ్యాణం. మరీ చిన్నప్పుడు అందరికీ బొట్లు పెట్టడాలూ,కొంచెం పెద్దయ్యాక కొబ్బరి కోరడానికి సహాయం..వీటి వెనుక కమ్మని,వడపప్పు తీయని పానకం, గుడి వెనక అందరికీ భోజనాలు. యాక్తూ అంటున్నారా ? హూ కేర్స్...దాంట్లో మజా మీకేం తెలుసండీ తింటే కదా తెసుస్తుంది...
నాకు చాలా ఇష్టంగా గుర్తు తెచ్చుకునే చిరు తిళ్ళు రెండు....ఒకటి బర్ఫీ...మీ పాల బర్ఫీ కాదండోయ్. పెద్ద ఐసు ముక్క బండి మీద పెట్టుకుని దాన్ని చిద్రిక పట్టి , పుల్లకి పెట్టి ఎర్ర రంగు చల్లి ఇచ్చేవాడు....రంగు గబా గబా పీల్చేసి 'అన్నా కొంచెం రంగేయ్యవా' అంటే మళ్ళీ వేసేవాడు...మన పుల్లకున్న ఐసు అయిపోయేవరకు 'అన్న కొంచెం రంగేయ్యవా ' అన్టూ ఆ బండితో ఎంత దూరమయినా ప్రయాణించటం తరవాత పరిగెత్తుకొంటూ ఇంటికి రావడం..చాల థ్రిల్లింగ్...రెండవది బొంబాయి మిటాయి ..చెక్కర పాకం లో పింక్ కలర్ వేసి, ఆ ముదురు పాకాన్ని ఒక కర్రకి చుట్టి భుజం మీద పెట్టుకునీ వచ్చేవాడు...దానితో ఉంగరం, గడియారం/ గాజు చేసి చేతికి పెట్టేవాడు. అవి చూసుకుని, మురుసుకున్నంత సేపు మురుసుకుని తరవాత చటక్కుని తినేయ్యడమే తియ్యగా. ఎన్టీ ,మా సీతయ్యలా మొహం వెగటుగా పెట్టి చూస్తున్నారా , అబ్బా ఈగలు వాలవా, మూత పెట్టడు కదా దుమ్ము పడదా -
మరి అన్నిటికంటే నాకు ఇష్టమైన జ్ఞాపకాలు రెండు..ఒకటి..మా గొల్లోళ్ళ రామచందరన్నకి పెళ్ళయ్యింది...కొంచెం ఘోషా టయిపులో కొన్నాళ్ళ వరకు వదినమ్మ బయటికి వచ్చేది కాదు..అన్నదమ్ములవి పది కుటుంబాలు కలిసి ఒకే లోగిల్లో ఉండేవి అందుకని కొత్త కోడళ్ళు కొన్నాళ్ళు బయటికి రారు. రాంచందర్ అన్నకి వదిన మీద చాల చాల జాలి వేసేదేమో..లోపల ఒక్క దానికే బోర్ కొడుతుందని...నన్ను పిలిచి..'ఎన్నెల ఒదిన తోని మాట్లాడు పో చెల్లె 'అని పంపించేవాడు...నేను చాల గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని... వదిన మారెడ్‌పల్లి అనే పెద్ద సిటీ నించి వచ్చిందని అందరూ చెప్పుకునేవారు...చేతికి దండ కడియాలు , చెవులకి మకర కుందనాలు కాళ్ళకి మెరిసి పోతున్న పట్ట గొలుసులు పెట్టుకున్న ఆమె అంటే నాకు హీరోఇన్ లెక్క....మరి వదిన కి నేను పెద్ద కాలక్షేపం బఠానీ...సాయంత్రం వరకూ కూచోపెట్టుకునిపాటలు పాడించుకునీ, పద్యాలు చదివించుకునీ...అందరి గురించీ అమాయకంగా నేను చెప్పేవన్నీ ఇంటరెస్ట్‌గా విని పెట్టడమే కాక, నాకు తినడానికి వాళ్ళ పుట్టింటినుంచి తెచ్చిన మురుకులు, గర్జలూ..ఓడప్పలూ పెట్టేది... వదిన దగ్గర నించి నేను బయటికి వచ్చాక అందరికీ నన్ను చూసి అడ్మిరేషన్..నేను "హేమా మాలిని " దగ్గరుండి వచ్చినట్టు ..అదే కదా మనకు కావలసిన ఫీలింగ్...
రెండవది ... మా గోపాల్ సేట్ దుక్నం ...సాయంత్రం అవ్వంగానే లైట్ వేసి పిల్లలందరికీ పిలిచి బెల్లం ముక్కలు పెడతాడు... అమ్మకి తెలుస్తే కోప్పడుతుంది అలా తీసుకున్నందుకు... ఆక్చువల్ గా రామ్‌రెడ్డి తాత ఇంట్లొ గుడాలు కూడా అమ్మకి నచ్చవు వాళ్ళు ఆవులకి దిస్టి తీసి వండుతారేమోనని అమ్మకి పెద్ద అనుమానం.... అందుకని శుక్రవారం సాయంత్రాలు మమ్మల్ని బయటికి వెల్లనిచ్చేది కాదు..కానీ ఆ టయిముకి ఎలాగోలా జారుకోవడం పెద్ద విద్య యేమీ కాదు ... బయటికి వెళ్ళినా గుడాలు మాత్రం తీసుకోమని ఒట్టేసి మరీ చెప్పేస్తాముగా....మరి చీకటి పడే సమయానికి మనకి గోపాల్ సేట్ దుక్నం దగ్గర ఏదో ఒక పని ఉంటుంది అర్జెంట్‌గా... అంతగా లేకపొతే మధ్యాహ్నమనగా అమ్మగానీ పక్కింటి ఆదిలక్ష్మి అత్తమ్మ గానీ ఉప్పు , చాక్పత్తీ , కాప్పొడి యేం తెమ్మన్నా అప్పడి దాకా చేసి ఆ సమయానికి వెళ్ళచ్చు....అవేమీ లేకపోతే కనీసం పంచాయతీ ఆఫీసు వాళ్ళు పొలం పనులు ,వార్తలు వేస్తారు కదా, మాస్టారు గారు విని రమ్మన్నారు అని చెప్పి వెళ్ళడమే. అమ్మకి తెలుసేమొ,మేము ఎందుకు వెళతామో!పాపం తెలిసినా తెలియనట్టుండేది..
ఇంకా వెంకన్న గుడి పక్కనే ఉన్న పాండురంగడి గుడిలో పూజలు, జగన్నాధస్వామి గుడిలో మొలకల రధం పండుగ..దసరా పండక్కి జమ్మి పంచుకోవడం , పలారం బండ్లు...గనేశ్ చవితి ..డుప్కీ పున్నమికి గుండంలో స్నానాలు, ప్రసాదాలు , శివరాత్రి మర్నాడు శివుడి గుళ్ళో భోజనాలు,బతకమ్మ పండుగ , అక్కడ పంచుకునే సద్దులు ..ఇలా ఒక్క హాలోవీన్ ఏంటండీ...నాకు ప్రతి రోజూ పండగే....ఇలాంటి హాలోవీన్లు, జ్ఞాపకాలు మీకూ ఉన్నాయా ?...

రంగు పడుద్ది
Sunday, December 19, 2010
పాలు పెరుగు వాటి నుండి వచ్చు వాసన అంటే భయంకరమయిన అసహ్య మున్న నాకు... తెల్లనివి తింటే తెల్లగా అవుతావని బ్లాకు మెయిలు చేసి నాతో కళ్ళు, ముక్కు , చెవులు, చివరికి నోరు కూడ మూయించి అవన్నిటినీ తినిపించిన ధరణి అక్క మీద ప్రతీకారం యెలాగయిన యీ జన్మలోనే తీర్చుకుంటా..అందుకే ప్రతి రోజూ తప్పనిసరిగా గుడికి వెళ్ళి దానికి నాలాంటి నలుగురు బ్లాక్ బ్యూటీలనిమ్మని సవినయంగా దేవుణ్ణీ కోరుకోవడం నా దిన చర్యలో భాగంగా ఉండేది.
అనగా అనగా డ్రమ్ముల్లొ పాండ్స్ స్నోలూ, డ్రీంఫ్లవర్ పవుడర్లు, ఫెయిర్ అండ్ లవ్లీలు...బ్లీచింగులు, ఫేస్ మాస్కులు పాపం నాన్న ఆస్తిని 'ముల్లు పొయ్యి కత్తొచ్చె డాం డాం డాం' చేసేసాయ్.... అమ్మ మాత్రం కట్నం కోసం దాచిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే కట్నం అక్కరలేదనే అల్లుడు వచ్చేస్తాడనే ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసేసి...నెట్ ప్రెసెంట్ వాల్యూ పోసిటివ్ అని లెక్కలేసీ , ఎలాంటి రిస్కీ ఇన్వెస్ట్మెంట్ కయినా సిద్దపడిపోయేది...అమ్మ ప్రార్థనలు విన్న దేవుడు...అమ్మ మంచి ఫయినాన్షియల్ అనలిస్టని సర్టిఫై చేసేసి అమ్మని గెలిపించేసాడు...
ఇంక వెంటనే ఇంటికి ఫోను చేసి... అత్తయ్యా....రంగు పడిందీ..అని చెప్పేసాను...అత్తయ్య బోల్డు సంబరపడిపోయారు...నేను చెప్పాను కదే 'కెనడా అంతే కెనడా అంతే అని!
ఏతా వాతా తెలుసుకున్నదేమనగా.తెల్లీయులను ఆఫీసు ఉద్యోగములన్నియు ను వరించును. నల్లీయులు ఎక్కువ బరువులు మోయగలుగు శ్రమ జీవులగుట వల్లను, హక్కుల కోసము పోరాటము సలిపి మా పెద్దక్కకు వలే ప్రపంచకంలో అశాంతి సృస్టించుదురేమోనన్న భయం వల్లను ఫ్యాక్టరీ ఉద్యోగములన్నియును ఇవ్వబడును.... ఇంక మిగిలిందెవ్వరయా అంటే
పటుదయిన వెర్రినవ్వును, మొగమాటమునన్
అటు దిరిగి పోని వాడును ఇటు ఉంటకు జెడిన వాడు
బ్రవునుర......సుమతీ...
