నూతన సంవత్సర శుభాకాంక్షలు

Friday, December 31, 2010

బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు . కెనడా లో(Toronto) 3సంవత్సరాల క్రితం నిర్మించిన అక్షర ధామం ను పోలిన గుడి ఇది. 

http://www.scribd.com/doc/46121357

అందరిలో మావయ్య

Monday, December 27, 2010

చలి గారి రివ్వున వీస్తోంది. ఆటోమేటిక్ మాల్ తలుపులు వచ్చేపోయే వాళ్ళ అలికిడి  తగలగానే తెరుచుకుంటున్నాయి. అలా తలుపులు తెరుచుకున్నప్పుడల్లా చలికి ప్రాణాలు కొడగడుతున్నాయి.  ఇదొక పాత మాల్. హీటింగ్ సిస్టం సరిగా పని చేయదు."పని మాట దేవుడెరుగు చలికి గడ్డ కట్టేస్తున్నాను బాబోయ్ "అని చెప్పాను బాసాసురిడితో. చిన్న హీటర్ ఇస్తాడేమో అని నాకు ఆశ. ఇంకొక లేయర్ క్లోత్స్ వేసుకో అంటాడు'. ఇప్పటికే పెద్ద సయిజు గంగిరెద్దులా వేసుకుంటున్నాను. నేను నడిచేముందు నాకు అర గజం ముందు  గజం వెనక నా దుప్పట్లు రాజసంగా నడుస్తుంటాయి. ఇంక 'అమ్మగారికి దండం బెట్టు, అయ్యగారికి దండం బెట్టు' సీన్ వదిలేసి   'నీ  ఆశ, అడియాసా ...లంబాడోళ్ళ రామదాసా' అని అర్థం అయిపోయి అడగటం మానేసాను. 'నీకు ఎలా డ్రెస్ చేసుకోవాలో అర్థం అయిపొయింది, అందుకే చలి అని కంప్లయింట్ చెయ్యట్లేదు నువ్వు, వెరీ గుడ్ 'అని నవ్వుతూ అంటుంటాడు కనిపించినప్పుడల్లా.  ఒక వెర్రి నవ్వు విసురుతుంటాను, సమాధానంగా.

 

చైనీస్ షాప్ ఉండటంతో ఈ మాల్ రద్దీగా ఉంటుంది.  ఈ చైనా మార్కెట్ లో దొరకని వస్తువంటూ ఉండదు. ఇదే మాల్ లో ఒక శ్రీలంక వాళ్ళ బట్టల కొట్టు, డ్రయివర్ లైసెన్సులు ఇచ్చే  ఆఫీసు,  కొత్తగా వచ్చిన వాళ్లకి సహాయం చేసే కమ్మ్యునిటి సెంటరు, రెండు రెస్టారెంట్లు, రెండు బార్బర్ షాపులు, ఒక డాలర్  స్టోరు ఉన్నాయి. అందువలన మాల్ చిన్నదయినా ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అందుకే మా బాస్ ఇక్కడ ఈ టయిములో కొంత స్థలం అద్దెకి తీసుకుని క్యూబికల్ నిర్మించి ఆఫీస్ సెటప్ చేస్తారు.

 

ఇది టాక్స్ సమయం. ప్రతి ఒక్కరూ ఇన్ కం టాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చెయ్యాలి. అసలితే ఎవరి టాక్సు ఫారాలు వాళ్ళే ప్రభుత్వానికి పంపే వీలుగా, అందరికీ అర్థం అయ్యేలాగా ఉంటాయి ఫారాలు. కానీ కంప్యూటరైజేషన్ వచ్చాక, కొన్ని ప్రయివేటు సంస్థలు   ఇలా రద్దీగా ఉన్న స్థలాల్లో టెంపరరీ ఆఫీసులు పెట్టి జనాల దగ్గర ఫీజు వసూలు చేసి టాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసి పెడతారు. ఇదొక మంచి వ్యాపారము. ఫిబ్రవరి నించి మే రెండవ వారం వరకూ నడుస్తుంది. ఇది సీసనల్ వర్కు కాబట్టి ఈ మూడు నెలలు వదిలిపెట్టి, సంవత్సరం లో మిగిలిన నెలలన్నీ హెడ్ ఆఫీసులోనే పని. ఆఫీసులో  పనిచేసే పదిహేను  మంది  పర్మనెంటు ఎంప్లాయీస్ సంవత్సరం పొడుగునా హెడ్ ఆఫీసులో పని చేసినా ఈ టయిములో మాత్రం బాస్ సెట్ అప్ చేసే పదిహేను టెంపరరీ ఆఫీసుల్లో ఏదో ఒక చోట పని చెయ్యాలి. టాక్స్ సీజన్ మొదలయ్యే రెండు నెలల ముందుగా కొంత ఫీసుకి చిన్న శిక్షణ ఇచ్చి, మూడు నెలలకోసం చాలా మంది ఉద్యోగులని నియమిస్తారు. ఒక పర్మనెంట్ ఎంప్లాయీ పది మంది ఇలా శిక్షణ నించి   కానీ పర్మనెంటు ఎంప్లాయీ ఒకతను సడెన్ గా మానేయ్యడంతో పని బాగా అలవాటయిందని  ఒక్క వారం క్రితం నన్ను  మొదటి సారి ఇక్కడికి పంపారు.

 

కొత్త రూటు. మూడు బస్సులు మారి ఎనమిదకల్లా రావడం కష్టంగానే ఉంది.  రాత్రి  తేలిక పాటి మంచు జల్లులతో మొదలయి మంచు  వాన  పెద్దదయింది. అన్నిచోట్లా మోకాళ్ళ లోతు  మంచు. సయిడు వాక్స్ మాత్రం వీలయిననంత త్వరగా క్లియర్  చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. పొడి మంచులో నడవడం కొంచెం ఫర్వాలేదు. మంచు గట్టి పడిపోయి గ్లాస్ లా తయారయినప్పుడు మాత్రం చాలా జారుతూ ఉంటుంది. అంత చలిలో నెమ్మదిగా నడవాల్సి వస్తుంది. గడ్డ కట్టేస్తూ .  ఇంకా కెనడా వచ్చి మూడు నెలలు అయింది అంతే. ఇదే మొదటి జాబ్. ఇంకా చలికి అలవాటు పడలేదు. ఉదయం ఎనమిది నుండి రాత్రి ఎనమిది వరకు పని చెయ్యాలి కానీ ఒకొక్కసారి తొమ్మిది  గంటల వరకు  పని చెయ్యాలి. 'అధికస్య అధికం ఫలం' అని ఎన్ని గంటలయినా పని చెయ్యడానికి రెడీ, కానీ చలి, చలి చలి క్లయింట్లు వస్తూ ఉంటే  సమయం గడిచిపోతుంది చలీ పులీ తెలియకుండా. ఎవరూ లేకపోతే మాత్రం 'నా తరమా భవ సాగర మీదను నలిన దళేక్షణ రామా' అనుకుంటూనే చలి సాగరాన్ని రాత్రి తొమ్మిది గంటల వరకు ఈదేయ్యాలి.

టాక్స్ చెయ్యడం, టాక్స్ తగ్గడానికి కొన్ని సలహాలివ్వడం, బిల్ చెయ్యడం, ఫోను కాల్స్ అటెండ్ చెయ్యడం, సాయంత్రం డెబిట్/క్రెడిట్ కార్డ్లను క్లోసు  చెయ్యడం, బ్యాంకులో క్యాష్ డిపాసిట్ చెయ్యడం , అకౌంట్ రికన్సయిల్ చెయ్యడం, కాష్ సరిచూడడం, లాస్ట్ అండ్ ఫైనల్ హెడ్ ఆఫీసుకి రిపోర్ట్ పంపడం ఇదీ పూర్తి దినచర్య...

 

మొదట భయపడ్డాను కానీ ఇక్కడి వాళ్ళు  చాలా సరదాగా ఉంటారు. ఇంటిదగ్గర ఎవరూ వినేవారు లేకపోవడం వల్లనేమొ చాల మంది బాగా కబుర్లు చెపుతారు. ఆ కబుర్లలో కనీసం ఒక్కసారయినా "నేను నేటి మహిళను" పైన డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ బొట్టు పెట్టుకునే వారిని ఎవరినయినా శ్రీలంకన్లని అనేసుకుంటారు. బొట్టు పెట్టుకుని కనిపించేది ఎక్కువగా వాళ్ళే మరి. "కాదు బాబూ , భరత వర్షే, భరత ఖండే, మేరోర్ దక్షిణ దిగ్భాగే, గంగా గోదావరి మధ్య ప్రదేసే, శ్రీ శైలస్య  ఈశాన్య  దిగ్భాగే, నేను నా తెలుగు ప్రదేశం వెరసి పవిత్ర భారత దేశం...." అని చెప్పుకునే లోపు, పనిలో పనిగా "సింధూరం-దాని ప్రశస్తి" మీద కూడా ఒక క్లాసు వేసేసుకునే అవసరం  వస్తుంది.

 

ఇక్కడ  అందరికీ ప్రతి పే చెక్ లోంచీ నిర్నీతమయిన మొత్తంలో టాక్స్ కట్ చేసి ఎంప్లాయర్ గవర్నమెంటుకి కట్టేస్తాడు.  సంవత్సరం చివర లెక్కలు కట్టి, ఎక్కువ కట్ చేస్తే తిరిగి ఇయ్యడం, తక్కువ కట్ చేస్తే కట్టించుకోవడం జరుగుతుంది. రిఫండ్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాప్పీగా వెళతారు. తిరిగి డబ్బు కట్టాల్సిన వాళ్ళను కూడా నవ్వుతు పంపించడం బానే అలవాటయ్యింది. రిఫండ్ రాలేదుగా ఫీజు కట్టక్కర లేదా అని జోక్ చేస్తారు. సారీ సార్ నా సొంత కంపెనీ అయ్యుంటే మీకు ఫీజు చార్జీ చేసేదాన్ని కాదు అంటాన్నేను. చాలా మంది వర్క్ అయిపోయాక సాయంత్రం వస్తారు టాక్స్ రిటర్న్స్ చెయ్యడానికి. భోజనాలు అవీ కానిచ్చి చివరి నిముషంలో వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ. మళ్ళీ రండి అంటే, బిసినేస్స్ పోయినట్టే. అందుకని టయిము అయిపోయే సమయానికి వచ్చినా టాక్స్ చెయ్యాలి. అలాంటప్పుడు రిపోర్టులకి చాలా హడావిడి అయిపోతుంది. పైగా తొమ్మిది గంటలకి మాల్ క్లోస్.

 

 

ఒక బిజీ సాయంత్రం చివరి నిముషంలో వచ్చారు మిస్టర్ స్కెంబారిస్. డాకుమెంట్స్ అన్నీ నా చేతికిస్తూ, మీరు చేస్తూ ఉండండి పక్క దుకాణం లో  చిన్న పని ఉంది  పది నిముషాల్లో  వచ్చేస్తాను అన్నారు. నా టెన్షన్ నాది. ప్రతి అరగంటకీ ఒక బస్ ఉంది.  ఒకటి మిస్ అవుతే ఇంటికి వెళ్ళాల్సిన మూడు బస్సులూ మిస్ అవుతాయి, కానీ ఏమీ చెయ్యలేం. "అలాగే సార్, పదిహేను నిమిషాల్లో ఇక్కడుంటే చాలు, మరీ లేట్ అవకుండా" అన్నాన్నేను. "ఓ షూర్ , థ్యాన్ యూ" అంటూ వెళ్ళాడు ఆయన. పేపర్లన్నీ పొందిగ్గా అరేంజ్ చేసి ఉన్నాయి. అదృష్టం కొద్దీ ఇతను పాత క్లయింటే. పేరు కొట్టగానే డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. బతికానురా దేవుడా చాలా టయిము కలిసొచ్చిందని అనుకుంటూ కంప్లీట్ చేసే సమయానికి స్కెంబారిస్ గారు వచ్చేసారు. అయిపోయిందండీ, మీరు లేట్ అవుతారేమో అని భయపడ్డాను అన్నాను. నో నో మీకు లేట్ అవ్వనివ్వనుగా అని ఎదురు కుర్చీలో కూచున్నారు రిసల్ట్స్ కోసం చూస్తున్నట్టు. మీరు లకీ అండీ 2,112 డాలర్స్ రిఫండ్ వచ్చింది అన్నాన్నేను ప్రింట్స్ తీసుకోడానికి ప్రింటర్ వయిపు తిరిగి. ఈ లోపు ఆయనకి ఫోన్ వచ్చింది.

 

మా అబ్బాయికి ఎంత రిఫండ్ వచ్చిందండీ, ఫస్ట్ టయిం కదా చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాడు, వాడే ఫోను అన్నారాయన...నేను గబా గబా పేపర్లన్నీ చెక్ చేసాను. అన్నీ ఆయన డాకుమెంట్సే.  కంప్యూటర్లో డీటైల్స్ చూసాను. పిల్లవాడికి మొన్ననే పద్దెనమిది ఏళ్ళు నిండాయని చూపిస్తోంది పుట్టిన తేదీ. "సారీ అండీ, మీ అబ్బాయి డాకుమెంట్లు మరిచిపోయినట్లున్నారు. మీరు అన్నీ మీవే ఉన్నాయి అన్నాను. లేదండీ ఇక్కడే ఉందీ అంటూ ఒక కాగితం బయటికి లాగారాయన. పేరు ఊరు అన్నీ ఆయనవే. అదే అన్నాన్నేను. ఆయన నవ్వుతూ, వాడిదీ నాదీ ఒకటే పేరండీ. సోషల్ ఇన్సురెన్స్ నంబరు చూడండీ అన్నారు. అవును అప్పుడు చూసాను నంబరు. సారీ సార్ నేను ఇప్పటి వరకు తండ్రీ కొడుకులను ఒకే పేరుతొ చూడలేదు, అంటూనే అబ్బాయి రిటర్న్స్ చెయ్యడం మొదలెట్టాను. బస్సు 'ఏడుకొండల వాడా వెంకట రమణా' అయ్యింది కాబట్టి ఇంక లేట్ గా వెళ్ళడానికి  మెంటల్ గా ప్రిపేర్ అయ్యి, మాల్ మూసేస్తారు కాబట్టి, గబా గబా చేస్తున్నాను. "మీరు ఇక్కడికి కొత్తనుకుంటాను. ఇక్కడ ఇలా పేర్లుండటం కామన్. ఇంకా వింత ఏంటంటే మా నాన్నది ఖూడా ఇదే పేరు. అయితే నా పేరు చివర ఝూనియర్ అని ఆడ్ చేసారు.  నాకు అలా ఇష్టం లేదు తరవాత తీసేసాను" అన్నారు స్కెంబారిస్ గారు.

 

దేవుడా, ప్రపంచంలో పేర్లే లేనట్టు తాత తండ్రీ

 కొడుకు అందరికీ ఒకే పేరట బావుంది కత అనుకుంటూ తొందరగా కంప్లీట్ చేసాను. మీరు ఇక్కడ సంతకాలు పెట్టండీ, అబ్బాయిని సంతకాలు పెట్టడానికి రేపు తీసుకొస్తారా అన్నాన్నేను రిఫండ్ వివరాలు చెబుతూ..."తప్పకుండా, మీకు చాలా థ్యాంక్స్, మీకు లేట్ అయినట్లుంది. నేను డ్రాప్ చెయ్యనా సెంటర్ వరకు" అన్నారు.  "థ్యాంక్స్ సార్, నాకు క్లోసింగ్ వర్క్ ఉంది ఇంకా, మీరు వెళ్ళండి... గుడ్ నయిట్ అన్నాను. గుడ్ నయిట్ సీ యూ అగెయిన్" అని ఆయన వెళ్ళిపోయారు. నేను క్లోసింగ్ కంప్లీట్ చేసి మాల్ మూసే లోపు బయట పడ్డాను. తరవాత రెండు మూడు కేసులు వచ్చాయి ఇలాంటివి. (అబ్బ, పెద్ద డాక్టరులా పోసు కొట్టాను కదూ ఈ డయిలాగ్ కొట్టి). ఇది నాకొక పెద్ద లెసన్. అప్పటి నుండీ 'పేరులోనేముందీ' అనుకుంటూ పేర్లని పక్కన పడేసి,పేపర్లని సోషల్ ఇన్సురెన్స్ నంబరుతో కొలవడం మొదలు పెట్టాను.

 

తరవాత వారం క్యాష్ డిపాసిట్ చెయ్యడానికి బ్యాంకుకి వెళ్లాను. మెటర్నిటీ సెలవలో ఉన్న రిసెప్షనిస్టు జో-ఆన్ కనిపించింది, పిల్లాడితో సహా. వాడికి మూడో రోజు. వావ్ ఎలా ఉన్నావ్, ఐ మిస్ యు....అని కౌగిలించుకుని అరిచినంత పని చేసింది. ఈ అరుపులు కౌగిలింతలు నాకు కొత్త...మొహమాటంగా "ఐ యాం గుడ్...బేబీ చాల బాగున్నాడు ఏం పేరు పెట్టారు?" అన్నాను బేబీని మురిపం గా చూస్తూ. పేరు జకారియా అంది, అవునా మీ హస్బెండ్ పేరు అదే కదూ అన్నాను. అవును ఆయన పేరే పెట్టుకున్నాడు అంది. నేను నవ్వుతూ "కానీ జునియర్ అని చివరన కలిపారు కదూ" అన్నాను అస్సలు ఆశ్చర్య పోకుండా (స్కెంబారిస్ దెబ్బతో...బోల్డు లోక జ్ఞానం వచ్చేసింది మరి). "జాక్ వర్క్ కి వెళ్ళాడు. బాబుని మీ అందరకీ చూపిద్దామని ఆఫీసుకి  తీసుకెళ్ళాను, ఓకే మరి కొంచెం షాపింగ్ చెయ్యాలి" అని చెప్పి వెళ్ళిపోయింది. శాపింగా? ఇంత చలిలో! ఇక్కడ విచిత్రంగా ఏదో కొంపలు మునిగి పోయినట్లు మూడో రోజే ఇలా పిల్లాడ్ని తీసుకుని బయట తిరుగుతుంటారు. మా ఊర్లో అయితేనా, మూడు నెలలు బయటికి రాము అనుకుంటూ క్యాష్ డిపాసిట్ చేసి బయలుదేరాను.

 

నేను డిపాసిట్ చేసిన క్యాష్ తీసుకుని పల్లీలు, సమోసా షాపింగ్ చెయ్యండి మీరు. షాపింగ్ అయ్యాక దయచేసి మీ సీట్ నంబరులోనే కూర్చోండి. ఎదురు సీట్ల మీద కాళ్ళు పెట్టరాదు. గోడలపై ఉమ్మరాదు. మీ నగలు వస్తువులకి మీదే బాద్యత. సిగరెట్ తాగుట ఆరోగ్యానికి హానికరం. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. గోల్డ్ స్పాట్ ది జింగ్ థింగ్ .....గోల్డ్ స్పాట్.......

 

అర్థం కాలేదా......ఇంటర్వెల్ అండీ బాబూ.....

 

క్లినిక్.... మీరు పొరపాటున హాస్పిటల్ అంటారేమో. కొంపలు అంటుకున్నాయని  అనుకుంటారందరూ. పొరపాటున హాస్పిటల్ కెళ్ళాం అని చెప్పగానే ఎవరయినా చావు బతుకుల్లో ఉన్నారా అన్నట్టు ఎక్స్ప్రెషన్అం. అందుకని క్లినిక్ అని మాత్రం ఉపయోగించాలి సరేనా. అందులోనూ ఫ్యామిలీ క్లినిక్. మా ఊళ్ళో మా ఫ్యామిలీ డాక్టరు గారికి మా ఇంట్లో అందరి పేర్లు, జాతకాలు అన్నీ తెలుసు. ఎవరమయినా వెళితే అందరి గురించీ అడిగి తెలుసుకుంటారు. పిల్లలని తీసుకురా చూసి చాలా రోజులయింది అంటారు. ఇక్కడకు వచ్చిన కొత్తల్లో మేము పెట్టుకున్న ఫ్యామిలీ డాక్టరు కూడా ఇదే డైలాగ్. మురిసిపోయానో చెప్పలేను. ఇంటికి ఫోన్ చేసి మరీ చెప్పాను. తర్వాత్తర్వాత తెలిసింది అదేమీ పిల్లల పైన కాదు కార్డ్ గీకింగ్ మీద అని. ఆగండి దీని గురించి కొంచెం క్లియర్ గా  చెప్పాలి. రెసిడెంట్స్ కి అందరికీ గవర్నమెంట్ హెల్త్ కార్డ్ ఇస్తుంది దీన్ని ప్రతి సారి క్లినిక్ కి వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డ్ కి మల్లే గీకాలి. ఆ గీకుడుకి క్లినిక్ అక్కౌంట్లో డబ్బులు పడతాయన్న మాట. ఇక్కడ ఎప్పుడయినా డాక్టరుతో  మాట్లాడడాలూ అవీ చెయ్యల్సి వచ్చినా, కార్డ్ గీకాల్సిందే. ఇక్కడ కార్డ్ గీకాక ఒక గంట వెయిటింగ్. అక్కడ నుంచి ఒక అక్కడ ఇంకో గంట వెయిటింగ్. అక్కడ గోడల మీద ఉన్నవి చదివాను సరదాగా. ఒక సారి ఒక ప్రాబ్లం మాత్రమే డిస్కస్ చెయ్యండి. ఔరా ఒక వేళ నాకు తల నెప్పీ, ఇంకా అల్లప్పుడు మా టాంబాయ్ గిల్లిన గిల్లుడికి వచ్చిన ర్యాష్ తిరగబెట్టింది అనుకోండి. అప్పుడు ఏది డిస్కషన్ లో పెట్టాలా అని ఆలోచించీ ఆలోచించీ గంటకి గానీ ఒక నిర్ణయానికి రాలేక పోతానా. ఈ లోపు డాక్టర్  గారొచ్చి, పది నిముషాలుండీ వెళ్ళిపోతారు మళ్ళీ మందుల షాప్లో ఒక గంట. ఇలాంటి గంటలు గంటలు కూచోవడం విసుగొచ్చి పిల్లలు  అసలు రారు. ఆ నోటా ఈ నోటా విన్న విశేషాలేంటంటే, ఎవరికో చిన్నా చితకా పనులు చెయ్యడంతో  వెన్ను నొప్పి వచ్చి, ఎం ఆర్ ఐ టెస్ట్ చేయించారు. ఆ టెస్ట్ చెయ్యడానికి అపాయింట్మెంటు తొమ్మిది నెలల తర్వాత ఇస్తే రిసల్ట్స్ డిస్కస్ చెయ్యడానికి, స్పెషలిస్ట్ అపాయింట్మెంటు ఇంకో ఆరు నెలలక్కానీ దొరకలేదుట. అలాగే ఇంకొకరికి స్కిన్ అలర్జీ వస్తే స్కిన్ స్పెషలిస్ట్ అపాయింట్మెంటు ఎనిమిది నెలల తర్వాత ఇచ్చారుట. ఈ లోపు పేషంట్ బానే ఉంటే ఫర్వాలేదు. లేక పొతే 'శ్రీ మద్రమా రమణ గోవిందో హారి'. ఏ మాటకామాటే చెప్పుకోవాలి, ఎమర్జెన్సీ కేసులు మాత్రం 911 కి కాల్ చెయ్యగానే ఇంటికొచ్చి మరీ తీసుకెళతారు. ఇంకా మంచి వైద్య సదుపాయాలూ ఉంటాయిట.

 

ఇంత వెయిటింగ్ మన వల్ల కాదులే అని క్లినిక్కులకి దూరంగా ఉన్నాము కొద్ది రోజులు,

కానీ చిన్నాడికి హై ఫీవర్ రావడంతో రాక తప్పలేదు. ఇలాంటి వెయిటింగ్లన్నీ అయ్యాక డాక్టరు గారోచ్చి, వాడి ఫయిల్ చెక్ చేస్తున్నారు. ఆవిడ మోహంలో ఏదో గందరగోళం కనిపిస్తోంది. తల అటు ఇటు కదుపుతూ 'ఇంపాసిబుల్' అన్నారు. 'ఏంటి డాక్టర్, ఎనీ ప్రాబ్లం' అన్నాన్నేను ఖంగారుగా. ఇంత చిన్న పిల్లాడికి 140/90 ప్రెషర్ ఉండకూడదు. ఎక్కడో సం థింగ్ రాంగ్ అన్నారావిడ. నాకు లయిట్ వెలిగింది. ఒక్కసారి ఫయిల్ పయిన పేరు చెక్ చెయ్యొచ్చా అని అడిగాను. వెంకట కృష్ణ కార్తీక చచ్చీ చెడీ ఆ పేరుని అష్ట వంకర్లు, శత ఖూనీలు చేసి అరగంట టైము తీసుకుని చదివారావిడ. ఇంకా మిగిలిన పేరు రాయడానికి దాని పైన స్థలం లేదు. సారీ డాక్టర్...ఇది వీడి నాన్నగారి ఫైల్ అయి ఉంటుంది అన్నాన్నేను. ఉండండీ ఇప్పుడే వస్తాను అని ఆవిడ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి వచ్చారు. వాళ్ళని అడిగి ఫైల్ వెతికించి, దాని పైన ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సరి చూసి, కొంచెం వాళ్ళని 'ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయ్యండీ' అన్నట్టున్నారు కూడా (సరదాగా వ్రాసాను, ఇక్కడ అలా ఎవ్వరూ ఎవరినీ అనరని నా నమ్మకం..కానీ హూ నోస్) మందులు వ్రాయించుకుని బయటికి వచ్చాము. అక్కడ రిసెప్షన్ లో పని చేస్తున్న గుజరాతీ, పాకిస్తానీ అమ్మాయిలు. బయటికి రాగానే నేను మా వాళ్ళ ముగ్గురి ఫైల్సు తీయించి దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళ పేరు మధ్యన ఒక అక్షరం పెట్టించాను. వెంకటకృష్ణ.కే. కార్తీక, వెంకటకృష్ణ.ఎస్.కార్తీక, వెంకటకృష్ణ.జి.కార్తీక అని వెళ్ళబోతూ. కొంచెం అవతల పెట్టుకున్న మా గంగిరెద్దు సరంజామా తీసుకుంటున్నాను. వాళ్ళిద్దరూ నన్ను శ్రీలంకన్ అని డిసైడు చేసేసారు అందుకని హిందీలో మాట్లాడేసుకోవడం మొదలెట్టారు. 'ఏంటో ప్రపంచంలో పేర్లు లేనట్టు తండ్రికీ పిల్లలకీ ఒకటే పేరు హు అనవసరంగా మనకి తిట్లు పడ్డాయి. అని ఈ డయిలాగ్ ఎక్కడో విన్నట్టు ఉండే.....ఓ ఇది నా డయిలాగ్ కదూ! స్కెంబారిస్ ఫ్యామిలీ గురించీ...ఓరి దేవుడో...నా ఇంట్లో ఇలాంటి ప్రాబ్లం పెట్టుకునీ ఎవర్నో విమర్శించానా! దేవుడా నన్ను క్షమించేయి అని లెంపలేసుకుని, నేను నవ్వుతూ...'క్యా కరే మజబూరీ' అన్నాను. ఆ పిల్ల గతుక్కుమని..సారీ అండీ మీకు హిందీ ఎలా వచ్చు? అంది. నేను హిందుస్తానీనే తల్లీ, ఏంటో మనవాళ్ళని మన వాళ్ళు గుర్తు పట్టరు అన్నాను.'ఆహా బొట్టు పెట్టుకున్నారుగా అందుకు" అంటూనసిగింది. 'బొట్టు పెట్టుకోవడం మన జన్మ హక్కు' పైన ఒక క్లాసు పీకాను. ఇద్దరూ కొంచెం ఫ్రెండ్లీ ఫేసు పెట్టి  నవ్వుతూ మాట్లాడారు (కవరింగ్ అండీ ..అర్థమయ్యింది కదూ). చివరకి 'అవును అందరి పేర్లు ఒక్కటే ఉన్నాయేంటీ' అని అడిగారు నవ్వులు చిందిస్తూ. ..నేను నవ్వాను చిన్నగా...చరిత్ర లోకి  వెళితే...

 

మా వారి తాత గారు రావ్ బహద్దూర్ కార్తీక వెంకటకృష్ణ ప్రసాద్. ఈయన నాగ పూర్ రాజా వారి ఆస్థానంలో దీవాన్ గా పని చేసేవారట. గత 400 ఏళ్ళుగా వారి ఇంట్లో ప్రతి రెండవ తరం పెద్ద కొడుకు పేరు ఇదే. వారి సోదరి వెంకట కృష్ణ కుమారి. కృష్ణ ప్రసాద్ గారి అక్కకు పిల్లలు లేరు. కృష్ణప్రసాద్ గారి పెద్ద కొడుకు పుట్టినప్పుడు ఆవిడ తన పేరు పెట్టమని కోరారట. అలా మగ పిల్లలకి పేరు పెడితే ఆవిడ మరు జన్మలో అబ్బాయిగా పుడతారని నమ్మికట. ఆవిడ కోరిక మీద ఆ పిల్లవాని పేరు వెంకట కృష్ణ కుమార్ అని పెట్టారు. మళ్ళీ వెంకట కృష్ణ కుమార్ గారి పెద్ద కొడుకు వెంకట కృష్ణ ప్రసాద్. మిగిలిన నలుగురు  పిల్లలకి ఆయనకి తోచిన పేర్లు పెట్టుకున్నారు. ఈ నలుగురు కొడుకుల్లో తలొకరికి ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. మా పెద్ద బాబుకి మావయ్య గారి పేరు కలిపి శిరీష్ అని పేరు  పెట్టేశాం. రెండవ వాడికి మ్యాచ్ అయ్యేట్లు వెంకట కృష్ణతో మొదలెట్టి గణేష్ అనీ పెట్టాము. మిగిలిన తమ్ముళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఇద్దరికీ పెట్టాము కదా చాలు వేరే పేర్లు ఏవైనా పెడదాము అన్నారు మా వారు. నాన్న పేరు పెట్టాల్సిందే అని  ప్రతి ఒక్క పిల్లవాడికీ  మావయ్య  గారి పేరు కలుపుకుని వెంకట కృష్ణ తో మొదల్లయ్యి ,, హరీష్, మహేష్ , గిరీష్, నరేష్, సురేష్, సతీష్ అని పేర్లు పెట్టారు. ఇంటి పేరు కార్తీక. సో వీళ్ళందరి పేర్లల్లో కామన్ గా ఉన్న కార్తీక  వెంకట కృష్ణ  అనే పదాలు  కే  వీ కే గా మారి పేర్ల ముందర నిలిచి పోయాయి . కే  వీ కే  శిరీష్, కే  వీ కే హరీష్...అని పిలుచుకుంటారు స్కూల్ లో . అందరి పేర్లలోనూ మావయ్య గారి పేరున్నందుకు అందరికీ హ్యాప్పీ. మేము   కెనడాకి వచ్చేంత వరకు అంతా  ఒకే.  మరి ఇక్కడ కొచ్చాక అందరికీ మొదటి పేరు చివరి పేరు ఇంపార్టెంట్. బయట మనం ఇష్టమొచ్చిన పేరు చెప్పుకోవచ్చు పిలుచుకోవడానికి( మన మెకంజీ, జంబో,లకీ లాగా)  కానీ  గవర్నమెంటు డాకుమెంట్ల మీద అఫీషియల్ పేర్లు ఉంటాయి. సో,  ఎటు తిప్పినా ఇక్కడ ముగ్గురి మొదటి పేరు వెంకట కృష్ణ మరియు ఇంటి పేరు కార్తీక...

 

ఇంత వరకు ఒక మోస్తరుగా ఒకే...తొందరలో మా వారి తమ్ముల్లిద్దరు ఇక్కడికి రాబోతున్నారు...మా వారితో కలిపి ఏడుగురు వెంకట కృష్ణలు. ఇప్పటికే ఫోన్లోస్తే ఏ వెంకట్ కావాలి  ఆరో గ్రేడ్ వెంకటా, ఎనిమిదో  గ్రేడ్ వెంకటా, వాళ్ళ నాన్న వెంకటా అని అడగాల్సి వస్తోంది. ఇంకెంత గందరగోళం అవుతుందో ఊహించడానికే కష్టంగా ఉంది. మీరు నవ్వుతారేమో. 'నో వయిఫ్, నో స్టమక్, సన్ను నేము  సోమలింగం ' అని, కానీ ఈ ఎనిమిది మంది వెంకట కృష్ణలకి పుట్టబోయే పెద్ద కొడుకులందరి పేరు వంశ పారంపర్యంగా వెంకటకృష్ణ ప్రసాద్ అయి తీరాలి కదా?  తలచుకుంటేనే గందరగోళంగా ఉంది. మాతో పాటు మీకు గందర గోళంగా అనిపిస్తోందా?  అందుకే   నెక్స్ట్ జెనరేషన్ కి పేర్లు మార్చాలని మేము అనుకుంటూ ఉంటాము. కొన్నేళ్ళ తరువాత సంగతి అనుకోండి, కానీ ఇప్పటి నుంచే మా అత్తగారికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఈ విషయం తెలియ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ మా రాబోయే కోడళ్ళు వంశవృక్షానికి మరీ విలువ ఇచ్చేవారొస్తే, "వంశ పారంపర్యంగా వచ్చేది  ఎలా మారుస్తాం అత్తయ్య గారూ,  అందరిలో మావయ్య గారు ఉండ వద్దూ"  అంటారేమో...మరి మీరేమంటారు?

రంగు పడుద్ది

Sunday, December 19, 2010

''ఏం తిన్నావమ్మా, పిల్ల ఇలా వెన్న లాగ పుట్టిందీ' అని నర్సులు అనగానే మా వెర్రి తల్లి బోల్డు  సంబరపడిపొయ్యి మా నాన్నతో నరుసమ్మలందరికీ ఘనంగా ఈనాములిప్పించింది. పాపం ఆ పొగడ్తఈనాముల కోసమే అని కానీ, పుట్టిన ప్రతి బుజ్జాయి గురించీ నరుసమ్మలు అదే  డయిలాగ్  కొడతారని కానీ కనిపెట్టలేక పొయ్యింది. నేను చెపుదామని నోరు తెరిచేలోగా 'నా తల్లి ఏడవకు' అని దగ్గరికి తీసేసుకుంది.  స్వతాహా తల్లి ప్రేమ వల్లనో, నరుసమ్మల మాట బలమో, మా అమ్మ కళ్ళకి  నేను వెన్న రంగులో ఆనేసాను. ఇంకేముందీ ఎన్నెలని పేరు కుడా అప్పటికప్పుడు పెట్టేసి, నామకరణం తాలూకు ఖర్చుల్ని బ్యాన్కీలో  పడేసింది.

అమ్మకు తొందరెక్కువని చుట్టాలందరూ ఆడి పోసుకుంటారు. పిల్లలకి పేర్లు పెట్టడంలో అమ్మ అస్సలు శ్రధ్ధ తీసుకోదని అందరూ చెవులు కొరుక్కుంటుంటారు.

వాళ్ళ దృష్టిలో మా  శాంతక్కకి 'అశాంతి' ఎక్కువ.....ప్రకాశన్నయ్య   ఎప్పుడు 'డల్' గా ఉంటాడు... 'ధరణి అక్కకి 'అసహనం'...విద్యాధర్ అన్నయ్యకి పదుఎనిమిది ఏళ్ళకే ఐ.ఏ.ఎఫ్. ఐ .ఏ. ఎస్  అక్షరాలన్నీ పేరు పక్కకొచ్చి చేరాయి. మీకు మా అమ్మకు మల్లేనే కుంచెం తొందరెక్కువ అనుకుంటా. నేను చెప్పకుండానే ఈ డిగ్రీ ఏంటని కనిపెట్టేద్దామనే !!!అబ్బ అంత ఈసీ కాదండీ!!”ఇంటర్ అప్పియర్డ్ బట్ ఫెయిల్డ్   ఇన్ ఆల్ సబ్జెక్ట్స్” .....అదీ సంగతి!  ఇంక శ్యామలక్క 'బంగారం 'లాగ పచ్చగా ఉంటుంది. నేనే గనక పెద్దక్క ప్లేస్ లో ఉంది ఉంటే,,  ఈ పాటికి చిట్టి తమ్ముళ్ళు చిట్టి చెల్లెళ్ళ పేర్ల గురించి అమ్మకి బోల్డు సలహాలిచ్చేదాన్ని,  కానీ చెప్పా కదా దానికి అశాంతి అని... అది పెట్టే  గోలకి మనశ్శాంతి  ఉండదని చెపుతూనే  అమ్మ కొంచమైనా ఆగకుండా మిగిలిన వాళ్ళందరికీ తనకి తోచినపేర్లన్నీ పెట్టేసింది....తోచినవంటే తోచినవి అని కాదనుకోండీ, అమ్మమ్మనీ, నానమ్మనీ, అత్తనీ,  బాబాయ్ నీ , రెండు వయిపుల  తాతయ్యలనీ సాటిస్ఫై చేసేసిందన్నమాట ఆ పేర్లన్నిటితో. చివరాఖరుగా తనకి చాలా ఇష్టమయిన పేరు అట్టే ఉంచుకుని ఇలా వెన్నెల లాగా కనిపించిన నాకు అచ్చ తెనుగు సోయగాలద్ది  పెట్టేసి, ఎంతో మురిసిపోయింది. ఇలా అమ్మ దిల్ ఖుష్ నగర్ లో సెటిల్ అవుతున్న సమయంలో సడెన్ గా నాకు పెద్ద జ్వరం తగిలి దిల్ షుక్/షొక్/షేక్/శోక్ నగర్ లోకి తోసేసింది అమ్మని. జ్వరం ప్రభావమో, లేక నా ఒరిజినల్ కలరో తెలీదు కానీ అమ్మ మాత్రం ఇరుగు దిష్టి పొరుగు దిష్టి వల్ల  నా రంగు మారిపోయిందని తెగ బాధ పడిపోయేది.

రాగా రాగా 'ఎన్నెల-నల్లగా ఉంటుందీ 'అని ట్యాగ్ లైన్  నా పేరుతో సెటిల్ అయిపోయింది.         “ఏమే కళా, పై పిల్లలప్పుడంటే నీకు చిన్నతనం తెలియదనుకో, తరవాతయినా శ్యామలకి దీని పేరు, దీనికి శ్యామల పేరు పెట్టక పోయావా? బంగారం రంగు పిల్లకి శ్యామలనీ దీనికి ఎన్నెలనీ ! ఒక్కళ్ళకయినా తగ్గ పేరు పెట్టలేదు..గుణాలంటే పెద్దయ్యేవరకూ తెలియవు కానీ రంగు పుట్టగానే తెలుస్తుందిగా....” అంటూ చుట్టాలందరూ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది టైపులో క్లాసులు పీకేవారు. ' పుట్టగానే వెన్న లాగే ఉంది వదినా ' అని అమ్మ సంజాయిషీ ఇస్తూ ఉండేది . శ్యామలక్క పేరు గతం గతహా కాబట్టిన్నీ, నా పేరు ఇంకా గతం లోకి వెళ్ళలేదు కాబట్టిన్నీ నాకు ఎలాగయిన అమ్మనొప్పించి 'బొగ్గో' 'కొరివో' అని పేరు పెట్టించేసి నన్ను 'సార్థక నామధేయురాల్ని ' చేయ్యడానికి కృషి చేసిన ఘనత వహిద్దామని ఆరాట పడుతున్న బంధుగణాన్ని తోసి రాజని అమ్మ నా పేరుని అచ్చంగా నాకే వదిలెయ్యడం కాకుండా, నన్ను 'సార్ధక నామధేయురాలను’ చేయు పనికి తన దోవలో తాను కంకణం కట్టుకుంది...

పసుపు, చందనం , పాలూ పళ్ళూ మాత్రమే కాకుండా ఇసుక ఇటుకా కచికా గరికా ఏవి దొరికితే వాటితో నన్ను తోమెయ్యడం మొదలు పెట్టింది. అమ్మ బాధ అమ్మది. అబ్బ పేరుకి తగ్గట్టు ఎన్నెల్లా ఎంత తెల్లగా ఉందో అనిపించెయ్యాలని అమ్మ తాపత్రయం. అలా తోమీ  తోమీ, అలసి నన్ను మా (అ)శాంతక్క చేతిలో పెట్టేసేది. మా అక్కేమో నా చుట్టూ పౌడరు మేఘాల్ని సృష్టించేసి, కొంచెం పవుడర్ని ముక్కుల్లోకీ నోట్లోకీ కూడా పోసేసి, నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి తన శాంతి కపోతాన్ని ఎగురవేసేది...

 

 

పక్కింటిలో కొలువయి ఉన్న గురువు గారి సలహా మేరకు నాన్న తెచ్చిన విభూదిని క్రమం తప్పకుండా ఎవరో ఒకరు వంద గ్రాములు కొబ్బరి నూనెలో కలిపి పయి పూతగానున్నూ, వంద గ్రాములు పాలల్లో కలిపి లొపలికిన్నీ డోసు ప్రకారము పగలు పది మార్లున్నూ, రాత్రి (నా దురదృస్టం బాగుండీ గుర్తుంటే )రెండు మార్లున్ను వేసెడివారు. అమ్మ దిల్ మళ్ళీ 'ఖుష్ నగర్ వయిపు దారి తీసింది. ఆ విభూతి పూత చూసుకుని అమ్మ గొప్ప నమ్మకంతో ఉండేది.

యీ లోపు కలర్ మ్యాచ్ అయ్యిందని ఒక మాటు బాల కృష్ణుడి వేషం, ఒక మాటు చిన్ని కృష్ణుడి వేషం వేసేసి ఫుటోలు తీయించేసి 'అచ్చం కృష్ణుడిలా ఉంది కదూ' అని అమ్మ మురిసి పోయింది కూడా. స్కూలుకి వెళ్ళడం మొదలు పెట్టాక డాన్సుల్లొ రాక్షసుల వేషాలకీ, చిన్న చిన్న నాటకాల్లో కాకి , కోకిల వంటి వేషాలకీ బయట నుంచి సహజ నటుల్ని అద్దెకి తెప్పిచ్చే కష్టం , నష్టం మాస్టార్లకి తప్పించే భాగ్యం నాకు దక్కింది. అలా అలా చిన్న చిన్న వేషాల్లోంచి "నీళా" సూక్తం లో నీలా దేవి వేషంలో 'నీల మోహన రారా, నిన్ను పిలిచే నెమలి నెరజణా’ అనే పాత్ర వరకూ ఎదిగి పొయా.

పదహారేళ్ళ వయసులో గాడిదయినా అందంగా ఉంటుందని ఒక ఆంగ్ల కొటేషన్ చదివేసిన కాంఫిడెన్సుతో అలరారుతూ అలరారుతూ ఉన్న తరుణంలో ,నా పుట్టిన రోజున అమ్మ పట్టు పరికిణీ ఓణీ కొంది. అది వేసుకుని మా ఊరి నించి వచ్చిన పిన్ని దగ్గరికెళ్ళి 'పిన్నీ నేను అందంగా ఉన్నానా?' అని అడిగాను.  పోనీ పుట్టిన రోజు పాపాయి కదా అని వదిలెయ్యొచ్చుగా..కొంచెం మొహమాటం తక్కువయిన పిన్ని (అమ్మ అంటుండేది పిన్నికి మొహమాటం తక్కువని),             “ అందగత్తెవూ కాదు, అనాకారివీ కాదు... సంసార పక్షం , అంత రంగు కూడా కాదు కదా !” అంటూ మహేష్ బాబు త్రిషని కామెంటినట్టు కామెంటేసింది.  అది విన్న బాబాయ్ గతుక్కుమని 'అమ్మలూ నీకు యీ డ్రస్సు అద్దిరిందిరా" అని నన్ను కంఫ్యూసు చేసి  కొండెక్కించేసాడు. ఆ నాడు బాబాయే గనక అడ్డు పడక పొయ్యుంటే యీ లోకం ఎన్నెల్లో  అమావాస్యను కాకుండా ఒక పవుర్ణమిని చూసి ఉండేది. ఏంటో! మీరు బాగా తికమక పడ్డారు కదా?  నేను కూడా అంతే! అదే చెబ్దామని.

 

 

తెలిసీ తెలియని తనంలో అమ్మ ప్రొత్సాహంతో ఇసకల్లో ఆడుకుంటున్నప్పుడు అక్కడక్కడ ఫ్రీగా దొరికే బంక మట్టిని ఒక చెంచాడు నీళ్ళల్లో నానబెట్టి, మొహానికి పులుముకుని, పసి పిల్లలని, బోసి నవ్వుల పెద్దల్నీ కూడా భయపెట్టేసిన రోజులు కొన్నయితే, అదే మట్టిని ముల్తానీ మిట్టీ అనిన్నీ, దాంట్లో పన్నీరనిన్నీ, పాకమనిన్నీ, మసి పూసి మారేడు కాయ చేసి  సగం జీతానికి చిల్లు పెట్టి నాన్నని భయ పెట్టే బ్యూటీ పార్లర్ రోజులు కొన్నీ.

పాలు పెరుగు వాటి నుండి వచ్చు వాసన అంటే భయంకరమయిన అసహ్యమున్న నాకు... తెల్లనివి తింటే తెల్లగా అవుతావని బ్లాకు మెయిలు చేసి నాతో  కళ్ళు, ముక్కు , చెవులు, చివరికి నోరు కూడ మూయించి  అవన్నిటినీ తినిపించిన ధరణి అక్క మీద ప్రతీకారం లాగయిన యీ జన్మలోనే తీర్చుకుంటా. అందుకే ప్రతి రోజూ తప్పనిసరిగా గుడికి వెళ్ళి దానికి నాలాంటి నలుగురు  బ్లాక్ బ్యూటీలనిమ్మని సవినయంగా దేవుణ్ణి  కోరుకోవడం నా దిన చర్యలో భాగంగా ఉండేది.

అనగా అనగా డ్రమ్ముల్లో పాండ్స్ స్నోలూ, డ్రీంఫ్లవర్ పవుడర్లు, ఫెయిర్ అండ్ లవ్లీలు, బ్లీచింగులు, ఫేస్ మాస్కులు పాపం నాన్న ఆస్తిని 'ముల్లు పొయ్యి కత్తొచ్చె డాం డాం డాం' చేసేసాయ్. కట్నం కోసం దాచిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే కట్నం అక్కరలేదనే అల్లుడు వచ్చేస్తాడనే ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసేసి...నెట్ ప్రెసెంట్ వాల్యూ పోసిటివ్ అని లెక్కలేసీ , ఎలాంటి రిస్కీ ఇన్వెస్ట్మెంట్ కయినా సిద్దపడిపోయేది అమ్మ .  అమ్మ ప్రార్థనలు విన్న దేవుడు, అమ్మ మంచి ఫయినాన్షియల్ అనలిస్టని సర్టిఫై చేసేసి అమ్మని గెలిపించేసాడు...

అయితే అత్తగారు మాత్రం 'ఒరే అబ్బాయీ, కోడలు నలుపయితే కులం నలుపవుతుందిరా ,  అది ఇంకొంచెం తెల్లబడే మార్గం చూడమని చెపుతూనే,  ఆవిడ శాయశక్తులా కచోరాలు, ఛాయ పసుపు, తేనె, గంధం పొడి, అశ్విని వారి సున్ని పిండి, శెనగ పిండీ పెద్ద పెద్ద డబ్బాలలో నింపి ఉంచడమే కాక, అప్పుడప్పుడే మార్కెట్లోకొస్తున్న 'త్రీ సులసీ' సారీ....'అప్పు తచ్చయ్యింది... “శ్రీ తులసి” అను లేపనమును, రీజనల్ సేల్సు మానేజరు గారితో మాట్లాడి మూడు సంవత్సరముల వరకు ఆ కంపెనీ తయ్యారు చేయు ప్రొడక్షను అంతయూ వరికీ అమ్మరాదనిన్నీ, ఆ ప్రొడక్షను మొత్తమూ సరాసరి మా ఇంటికి రావలెననియున్నూ, కాంట్రాక్టు పైన సంతకము పెట్టించుకొనిరి. అదియును గాక టీవీలో ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైసుమెంటు వచ్చినప్పుడల్లా ' వీళ్ళ మొహం మండిరి....నా కోడలు ఇరవయి సంవత్సరాలు వాడింది... కూసింత మార్పు లేదు... కంపెనీ మూసుకుని అవతలకి పొండి.....ఏదో నేను పూనుకో బట్టి సరిపోయింది గానీ, లేక పోతే యీ వెర్రి మొహం మిమ్మల్ని నమ్ముకుని కాలం గడిపేసేది...’అంటూ నానా  విధములయిన శాపనార్ధములు పెట్టేస్తూ ఉండేవారు.

ఆవిడ చేసిన మూడు సంవత్సరముల కాంట్రాక్టు పుణ్యమాని , నేను నలుపు అనబడు బ్రాండు నుండి.. చామన ఛాయ యను ప్రమోషను పొందితినని మా అత్తయ్య ప్రగాఢ విస్వాసము. అంతియును గాక...”నలుపో తెలుపో నలుగురు బిడ్డలు, ముదురో ముతకో మూడు గుడ్డలు” అని చెపుతూ, మా వారితో వందల కొలది గుడ్డలునూ, నాతో ఇద్దరు బిడ్డలనూ రెస్పెక్టివ్ లీ కొనిపించి , కనిపించేసారు. ఆ గుడ్డల రంగుల నాణ్యత వాటి బ్రాండు పైనా, ఈ బిడ్డల రంగు  నేను వాడిన త్రీ సులసి పైనా ఆధారపడి ఉందని ఆవిడ డి సైడు అయిపొయ్యారు కాబట్టి  మనం కాదనలేము.

అత్తయ్య ఫిలాసఫీ అలా సాగుతుండగా మాకు అనుకోకుండా  కెనడా రావడానికి పర్మనెంటు రెసిడెన్సు కార్డు వచ్చింది. ఇది మంచు ప్రదేశము కాబట్టి మంచి రంగు వచ్చేస్తుందనీ, మంచు దేశాల్లో ఉన్నవాళ్ళంతా ఎక్కడ పుట్టినా సరే, ఇక్కడకొచ్చి దొర బాబుల్లా తెల్లహా అవుతారనీ , మనవలు దొర బాబుల్లా ఉండడానికోసం వాళ్ళని విడిచి ఉండడానికయినా ఆవిడ సిద్ధమేనని...కన్నీళ్ళతో పంపించారు.

ఇక్కడకొచ్చాక మొట్టమొదట ఎయిర్పోర్టులో  ఒక నల్ల జాతీయుడ్ని చూసి నా నోరు అమాంతం వైడు ఓపెన్.... సమయానికి యశోద సీన్లో లేదు కానీ ఉండుంటే ఉత్తర అమెరికా ఖండే, కెనడా దేశే, టొరంటొ నగరే, ఎయిర్పోర్టు స్థలే,  ఎన్నెల నామధేయస్య, 'మవుతు ఓపెనస్య' తో సహా అన్నీ  వీక్షించి ఉండేది..”ఏంటీ ఇక్కడ నల్లగా నా లాంటి వాళ్ళు కూడా ఉంటారా” అని అడిగాను            ఆశ్చర్య పోతూనే.  ”అబ్బే లేదే, నువ్వు ఒక్కదానివీ ఆకాశం లోంచి ఊడి పడ్డావు కదా అందుకని  ఎవరూ నీలాగా ఉండరు, పద పద” అని అన్న మా వారి నడకకి నా రన్నింగ్ తో ఈక్వేషన్ వేసాను. ఇంకా తెరుచుకున్న నా నోరు ఇంతింతై వటుడింతై లాగా చిన్నప్పటి తిరుపతి లడ్డూ పట్టే సయిజుకి చేరుకున్నా, ఇంకా నన్ను నల్ల జాతీయులు హాస్చర్య పరుస్తూనే ఉన్నారు.

లయిఫ్ అనగా జీవితమని చిన్నప్పుడు ఇంగ్లీషు మాస్టరు చెప్పడం వల్ల తెలియుట చేతనూ... హుడ్ అనగా తలపయి వేసుకొను ముసుగని ఇక్కడ పరిచయమయిన వారు చెప్పడం వల్లనూ తెలుసుకొనిన దాననయి, యీ జీవిత ముసుగును ప్రారంభించితిని (లయివ్ లీ హుడ్ అని టిప్పణి).

ఇక్కడకు రాగానే అందరూ “సిన్ కార్డ్” వచ్చిందా అని అడిగేవారు....ఇదేమి  పాపము రా బాబూ... అని మధన పడ్డాక... సోషల్ ఇన్శ్యురెన్స్ కార్డ్ ను సిన్ అందురని పాపముపశమించుకొంటిమి. ఆ దిక్కుమాలిన కార్డ్ ఏదో రాగానే,  కొండెక్కినంత సంబరపడిపోయి ఉద్యోగముల వేట ఆరంభించితిమి.

రాజు గారి చేపల వేటలో లాగ.... ఏదో ఒక చేప దొరికిందని సంబరపడి ఒక రోజు పనికి వెళ్ళేవాళ్ళం. రెండవ రోజు....'ఇయ్యాల పని లేదు ఉన్నప్పుడు పిలుస్తపో' అనే పెద్ద మేస్తిరి గడపట్లోంచే “ఇంటికి వొయ్యి రెస్టు తీస్కో” అని చెప్పేసేవాడు. మన గ్రూపులో జనాలేమో అందరు చదువు బాబులే! “నేను ఇంజనీరు, నేను డాక్టరు ,నేను పీ హెచ్ డీ, నేను ఎం ఫిల్”.......ఇలా వెనకింటి (బ్యాక్  హోం) కతలు చెప్పుకొని నొచ్చుకోవడమే తప్ప ఏంచెయ్యాలో ఎవరికీ తెలియదు. “మీ చదువులు తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఉన్న గోదారిలోనో, గంగలోనో, నర్మదలోనో అంతగా టికెట్ ఎందుకు వేస్టు అనుకుంటే అన్ని జలపాతముల కెల్ల గొప్ప జలపాతము నయాగరా జలపాతములోనో కలిపెయ్యండీ....అవేవీ ఇక్కడ నాలిగ్గీసుకోడానిక్కూడా పనికి రావు...మేము ఇస్పెషల్ టంగ్ క్లీనర్లు  తయారు చేసినం”  అని అందరూ చెప్పడంతో, నిశ్చేష్ట నైన నేను,  ముప్పది అయిదు సంవత్సరములు కాపాడుకున్న నా నలుపంతా విరిగి పోయి,  పాలిపోయి పాండు వర్ణము సంతరించుకొంటిని....

 

ఇంక వెంటనే ఇంటికి ఫోను చేసి... “అత్తయ్యా....రంగు పడిందీ” అని చెప్పేసాను. అత్తయ్య బోల్డు సంబరపడిపోయారు. “నేను చెప్పాను కదే 'కెనడా అంతే కెనడా అంతే అని!”

 

ఏతా వాతా తెలుసుకున్నదేమనగా “ఆఫీసు ఉద్యోగములన్నీ తెల్లవారిని వరించును. నల్లవారు ఎక్కువ బరువులు మోయగలుగు శ్రమ జీవులగుట వల్లను, హక్కుల కోసము పోరాటము సలిపి మా పెద్దక్కకు వలే ప్రపంచకంలో అశాంతి సృస్టించుదురేమోనన్న భయం వల్లను ఫ్యాక్టరీ ఉద్యోగములన్నియును ఇవ్వబడును.... ఇంక మిగిలిందెవ్వరయా అంటే

అటునిటు కాని బతుకును

పటుదయిన వెర్రినవ్వును, మొగమాటమునన్

అటు దిరిగి పోని వాడును ఇటు ఉంటకు జెడిన వాడు

బ్రవునుర......సుమతీ... 

అని సుమతీ శతకాన్ని మార్చి చదువుకున్నా కూడా లాభం పెద్దగా కనబడలేదు.

అయ్యో ఎంత పని జరిగింది! నా ఒరిగినల్ రంగు నాకుంటే చిన్నదో పెద్దదో ఉద్యోగం సంపాదించేదాన్నే!

ఛఛ, ఎంత తప్పు చేయించేసారు నాతో అమ్మ, అత్తయ్య కలిసి....నా సొంత రంగుని......ఏంటీ? నాదంటే నాదయిన సొంత రంగుని...పవుడరు డబ్బాల కంపేనీకీ, పాత సామన్లాడికీ కిలోల్లెక్కన అమ్మేసీ  నాకెంత అపకారం చేసేసారు?..ఛ, నాకయినా బుద్దుండక్కర్లే...అక్క దగ్గరి నుంచీ అత్తయ్య వరకూ అందరూ నా కలర్ తోటి ఆడుకుంటుంటే.....నా బుజ్జి కలర్ని ఇన్నాళ్ళుగా వాళ్ళందరి చేతుల్లో పెట్టేసానా? వీల్లేదు గాక వీల్లేదు..... చిన్న ఉద్యోగమైనా సంపాదించాలంటే, నా కలర్ నాక్కావాలంతే .....అందుకే నాకు అపకారం చేసిన వాళ్ళందరితో మాట్లాడ్డం మానేసి... నా రంగు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నా....ఏంటీ? రంగు పడుద్దంటారా?

(కెనడాకొచ్చిన కొత్తల్లో సరదాగా వ్రాసుకున్న కథ)

 

సీతయ్య-ఎవ్వరి మాటా వినడు

Saturday, December 11, 2010

మా సీతయ్య  చిన్నప్పటినుంచీ అంతేట. అందరూ పప్పూ అన్నం తింటే తనకేమో కూర కావాలనేవారట. అప్పటికప్పుడు కూర చెయ్యకపొతే అన్నం తినడం మానేసేవారట. కూరలొండిన రోజు పప్పు కావాలనేవారుట . చక్కగా ఇంజనీరింగ్ చదివావు కదా ఇంజనీరు ఉద్యోగం చెయ్యమంటే 'నలుగురికీ నచ్చినదీ నాకసలే నచ్చదురో' అని ఇంకో ఫీల్డు ఎంచుకున్నారట. సకుటుంబంగా సినేమాకి వెళితే చివ్వరి సీను చూసే అదృష్టం ఎప్పుడూ ఉండేది కాదు.. రోడ్డు చాలా రష్ అయిపోతుందని, ఇరవై నిముషాలు ముందే మా సీతయ్య లేచి బయటికి వచ్చేస్తారు. మేమందరం వరుసగా ఫాలో అయిపోవాలన్నమాట. చూసిన ప్రతి సినేమాకీ ముగింపు ఏమవుతుందని ఎవరినో ఒకళ్ళని అడగాల్సిందే. కొన్ని ముగింపులు ఊహించెయ్యొచ్చనుకోండి...కానీ పడమటి సంధ్యా రాగం సినేమా చూసొచ్చాక ఫ్రెండ్స్ అందరూ 'చివరికేమవుతుందే' అని ఏడిపించేవారు.

సకుటుంబంగా వెళ్ళిన సినేమాలో జోక్స్ వస్తే మనం ఇష్టం వచ్చినట్టు నవ్వకూడదన్నమాట. కొన్ని జోక్స్ మా సీతయ్యకి వెకిలిగా అనిపిస్తాయి . కొన్నిఎవ్వరికీ  జోక్స్ అనిపించవు కానీ మా సీతయ్యకి చాలా నవ్వు తెప్పించేస్తాయి. మరి మనం ప్రతి జోక్కీ సీతయ్యని చూసి నవ్వాలా వద్దా అని డిసైడు చేసుకోవాలన్నమాట. ఇంకో వరుసలో కూచున్న ముగ్గురు  మగ పిల్లలూ ఫర్వాలేదు కానీ, మా టాం బాయ్ కి(నలుగురి వెనుక సిరి) మాత్రం అన్నిటికీ నవ్వొచ్చేస్తుంటుంది.  ..నవ్వొచినప్పుడల్లా పక్కనున్నవాళ్ళని గట్టిగా గిల్లెయ్యడమో కొట్టెయ్యడమొ అతి సాధారణంగా తనకున్న చిన్ని సరదా. పక్కనున్నవాళ్ళకి యెముకలు విరిగినా, ఒళ్ళు ఎర్రగా కందిపొయినా,  ఎవరికి వారే భాద్యులు. తనకి పెళ్ళవ్వగానే మా అన్నయ్యగారికి మరిచిపోకుండా యీ విషయం చెప్పి గొప్ప ఉపకారం చేసినట్టు ఫీల్ అయ్యి, ఎముకలు విరగ్గొట్టుకోవడం, ఒంటి మీద ర్యాష్  తెచ్చుకోవడం అను బాధల నుండి పర్మనెంటుగా విముక్తురాలనయ్యానని వేరే చెప్పక్కరలేదనుకుంటా.

ఇంక యాత్రలు.... చాలా మంది, ప్రయాణాలు అనగానే పెద్ద యజ్ఞంలా రాకపోకలకి బోలెడు సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు కదా. మాకు అలా ఉండదు. అప్పటికప్పుడు మా సీతయ్యకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి హుటాహుటిన యుధ్ధ ప్రాతిపదికన బయల్దేరి వెళ్ళిపోతాం. కానీ వెళ్ళినంత వేగంగా తిరిగి వచ్చెయ్యడం కూడా. కారణం అందరికీ సెలవులు ఉన్నాయా లేదా వగైరా లెక్కలోకి తీసుకోకుండా ప్రయాణం కట్టడమే.  కొన్నిసార్లు పెద్దలకి సెలవు లేకపోవడమూ, కొన్నిసార్లు పిల్లలకి పరీక్షలు కూడా ఉండి ఉండవచ్చు. అయినా ఆగేది లేదు, లేడికి లేచిందే పరుగన్నట్టు, అనుకోగానే చల్ మోహన రంగా అని వెళ్ళిపోవడమే. క్షణాల్లో టికెట్లూ అవీ బుక్ అయిపోతాయి.  కాబట్టి శుక్రవారం రాత్రి అనుకుని ఎక్కడికైనా వెళితే, ఆదివారం రాత్రికో, సోమవారం పొద్దున్నకో తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సిందే.....తిరుపతికెళ్తే మీరు ఏం చూస్తారండీ, చక్కగా ఆకాశ గంగ, పాపనాశనం, మంగా పురం వగైరా వగైరా.. అవునా... కానీ మా సీతయ్యకి మాత్రం తిరుపతి వెళ్ళేది కేవలం వెంకన్నను చూచుట కొరకే...అటు దర్శనం అవడమేంటి ఇటు తిరుగు రైలు ఎక్కడమేంటి.... యీ రెండూ ఏక కాలంలో జరగాలి...సో, నన్ను వరైనా బాసరలో ఏముండును అనడుగగా నేను..'సరస్వతీ' దేవి అనీ.... అన్నవరంలో ఏముండును అని అడుగ 'శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ' అనియునూ, కంచిలో మున్నదన 'కామక్షీ దేవీ' అనియునూ ఏకవచన సమాధానములు మాత్రమే చెప్పగలను. 

మా సీతయ్యకి కొంచెం ప్రథమ కోపము... ప్రతి సంవత్సరమూ చాలా కొత్త డైరీలు వచ్చేవి ఇంటికి.  అందరూ పంచుకుని, మిగతా డైరీలు ఇంకెవరికో ఇచ్చేవారు. ఒకసారి నాకు కూడా ఒక డైరీ కావాలని అడిగా.  'మా ఆయన ఇవ్వాళ తిట్టారు, చాలా బాధగా ఉంది అని ఒక రోజూ, మా వారు ఇవ్వళ తిట్టలేదు... ఏదో వెలితిగా ఉండి అన్నం సహించలేదు అని ఒక రోజు అని తప్ప నీకు రాయడానికి ఏముంటాయి అని సరదాగా అనేవారు ఇంట్లో అందరూ.... నాకు కూడా నిజమే అనిపించేది..

పైన చెప్పిన వాటికి తోడు , మా సీతయ్య క్కడికీ రారు. ఎంత సేపూ ఇంట్లోనే . మన ఇంటికే అందరినీ పిలవమంటారు. నాకేమో కొంచెం నీరూ, కొంచెం నిప్పూ లాగ అప్పుడప్పుడు ఎవరింటికయినా వెళ్ళాలని సరదా. దిక్కుమాలిన చదువు పుణ్యమాని సరదాలన్నీ అటకెక్కాయ్. అయితే సరదాలకి శాపమైన చదువు మా సీతయ్యకి వరమయ్యింది. ఎవ్వరైనా "మా ఇంటికి రండీ' అని పిలవడం తరువాయి, నాకు అస్సైన్మెంట్లు ఉన్నాయి, నాకు పరీక్షలు ఉన్నాయి, నేను చదువుకోవాలి అంటూ జనాల్ని ఊదరగొట్టేసి, సారీ సారీ అని చెప్తూ, మా సీతయ్యని కాపాడుకోవటం నాకు అలవాటయిపోయింది. ఒకరిద్దరు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా వచ్చేవరకు వదలరనుకోండి.....బట్ ఇది చాలా రేర్. చాలా మంది ఫ్రెండ్స్” మేము చెప్తే సీతయ్య వస్తారులెండి” అంటారు. అలా ఆయన రారు కానీ ఎవరైనా మా ఇంటికి వస్తానంటే మాత్రం మహా సరదా. అతిధి సత్కారాలలో మా సీతయ్యకి ఎవరూ సాటి  రారు.

మాకున్న కొద్దిమంది మంచి స్నేహితులు ఫర్వాలేదని సర్దుకు పోతారు. "మీరు మా ఇంటికి వస్తే కాని మీ ఇంటికి రాం రాం ' అనే స్నేహితులు లేనందుకు నేను నిజ్జంగా గర్విస్తుంటాను. అందరూ వస్తారు సరే కానీ, వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళక పోతే ఏంబాగుంటుందని  నేను ఎప్పుడూ గొణుగుతూ ఉంటాను. ఈ విషయం మా సీతయ్య అస్సలు ఒప్పుకోరు. నన్ను బాగా పిలిచేవారు ఎవరూ లేరని, నేను రాకపోతే ఎవ్వరూ ఫీల్ కారనీ, నన్ను ఉడికిస్తారు. ఇది తప్పని ప్రూవ్ చెయ్యడానికి నాకు పది రోజులు చాలని నా నమ్మకం. ప్పటికైనా గెలుస్తానని గట్టి నమ్మకంతో నేను పరీక్షకీ. పరీక్షకీ వచ్చే పది రోజుల గ్యాప్ లో ముఖ్యులందరికీ 'నేను ఖాళీగా ఉన్నానోచ్...పిలుచుకుంటే పిలుచుకోండి" అని సీతయ్యకి తెలియకుండా అన్యాపదేశంగా ఇ-మెయిల్సు పడేస్తాను .

నా దురదృష్టం కొద్దీ ఆ పది రోజులూ ఎవ్వరూ టచ్ లో ఉండరు. నేను కొద్దిగా బాధపడి, పెద్దఎత్తున కృంగి  కృశిస్తాను. ఇదే మా సీతయ్యకి పసందయిన కాలం. కొండొక వీకెండ్ సాయంత్రం నా మీద చాలా జాలిపడి ' ఎవరిల్లైనా కోరుకో, తీసుకెళ్తాను., నీ కోరిక తీర్చడం నా కర్తవ్యం' అని శ్రీ కృష్ణుడి లెవెల్లో ఒక డైలాగ్  పడేస్తారు. ఆ బలహీన సమయంలో నేను నా ఫోనులో ఉన్న దోస్తుల నంబర్లన్నీ వరుస క్రమంలో నొక్కేసి, 'ఇంట్లో ఉన్నారా'? అని అడుగుతాను (మరీ అలా చూడకండి, మీ ఇంటికి రావొచ్చా అని అడిగితే బాగోదు కదా!) వాళ్ళు గుడికో, పార్టీకో, ఎవరింటికో వెళుతున్నమని చెప్తారుకదా?  అక్కడి నుండీ మా సీతయ్యకి భలే సరదా టైమన్న మాట. "ఏంటో  నీ తాపత్రయం" అని తాపీగా మొదలు పెట్టి...."ఏదో మాట వరసకి పిలుస్తారు కానీ, మనం రాకపోతే ఎవ్వరికీ పట్టింపు లేదని" జ్ఞానోపదేశం చేసేస్తారన్నమాట. నేను కుంచెం ఫీల్ అయ్యి, 'అబ్బే , మనం  వస్తామని చెప్పలేదు, చెప్పి ఉంటే,  ప్రోగ్రాము క్యాన్సిల్ చేసుకున్నాము వచ్చెయ్యండని ఉండేవారు" అని వకాల్తా పుచ్చేసుకుని బుకాయించేస్తానన్నమాట. అలా అలా ఆ వారం గడవగానే మళ్ళీ నా అస్సైన్మెంట్లు, పరీక్షలు, చదువులు. మళ్ళీ ఇన్విటేషన్లు, షరా మామూలే. ఐదేళ్ళు గడిచింది. కోర్స్ పూర్తి అయ్యి, ఇప్పుడింక పరీక్షలు, చదువులు అయిపోయాయి కాబట్టి, ఎవరైనా పిలిస్తే వెళ్ళకుండా ఉండడానికి ఏం వంకలు చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోయా.  వంక లేనమ్మ డొంకట్టుకునేడ్చిందన్నట్టు, ఏముందిలెండి, మా సీతయ్య ఒప్పుకుంటే వెళ్ళడం, లేక పోతే ప్రస్తుతానికి  నా దగ్గర  ఒకటే డైలాగ్. 'కుదరదండీ......సీతయ్య ఎవరి మాటా వినడు" 

ఏమీ సేతురా లింగా ఏమీ సేతు.......

Thursday, December 9, 2010

నిజం చెప్పొద్దూ అన్నమాచార్య కీర్తనలన్నీ అస్సలైతే మా వారు రాయాలనుకున్నారట....కానైతే 'ఇంకానేను అనుకోకుండానే ఆల్రెడీ ఇలా అచ్చయిపోయి ఉన్నాయేంటబ్బా' అని చాలా ఫీల్ ఐపొయ్యి ..బాధతో విరక్తి చెంది..పెన్ను ముట్టుకోవడం మానేసారంట... లేకపొయ్యంటే సుభద్రా పరిణయం వ్రాసిన కవయిత్రిగా నాకెంత వైభవమొచ్చేదో మీరూహించండి. ఏమాటకామాటే చెప్పుకొవాలికానండీ, ఆయన అలా అంటున్నప్పుడల్లా 'పోదురూ బడాయీ' అని నేననుకోని రోజు లేదు..కానైతే  యీ బ్లొగు వ్రవెశం చేసాక కానీ నాకు ఆ విషయం తెలియలేదు...
ఒకానొక రోజు పరీక్షా కాలంలొ (అంటే ఎక్జాముల టైములొ అన్న మాట)బుర్రకాయ వేడెక్కి పొయ్యి చెవుల్లోంచి పొగలు చిమ్ముతున్న వేళ ...అల అల నెమ్మదిగ.....ఉష్......ఇంట్లొ యెవరైన చూస్తే చిన్నా పెద్దా అని లేకుండ క్లాసు పీకుతారు...కంప్యుటర్ లొ ఈనాడు చదువుకుందామని చిన్ని ప్రయత్నం చేసానా....దీనికి కూడా నేనంటే చులకన...అస్సలు మాట వినలెదు.....పొనీలే అని గూగులమ్మనడిగా....కుంచుం సహాయం చెయ్యమని......ఇంకెముందీ....శబ్బాసురా శంకరా అంటూ వేణు గారి బ్లాగ్ లోకి తీసుకెళ్ళిపొయ్యి
లోకమంతా తిప్పేసి ఇందు గారిని , జ్యొతి గారిని, శివ రంజని గారిని, శిశిర గారిని, నాగార్జున గారిని పరిచయం చేసేసింది....  ఇంక చాలు గూగులమ్మా యీ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని యెంత గొడవ చేసినా వినలేదంతే. పైగా ఇంత హాప్పీగ తోడుండి తిప్పేవాళ్ళూ నీకెవరన్నా ఉన్నారా అని మరీ గదమాయించింది. నేను కూడా అవును నిజమే అనేసుకుని ఇంక బయటికి రాకుండా అక్కడే ఉండిపొయ్యాను...అంతలొ.....తలుపు కిర్రునా చప్పుడైనది...గుండె ఝల్లునా కొట్టుకున్నదీ..మెల్లి మెల్లిగా నే కళ్ళుతెరిచి ఆ వచ్చినదెవరొ చూసాను.......
యెవలాలూ అని మీకు నాకుమల్లేనే డౌటు వచ్చిందా? అయితే మీరు ఇంకా మెళకువగానే ఉన్నరన్నమాట....హమ్మయ్య..అయితే నేను ఇంకా చెప్పచ్చు.
అబ్బే యెవ్వరూ లేరు ...అంతా నా భ్రమ ....కానీ ఆ దెబ్బకి ఒంటి మీద  'సొయొచ్చీ సదూకొవాలె ఇగ నడువు అని నన్ను నేను అదిలించుకున్నా. అబ్బ అంత వీజీగ వినేస్తే మనమేమి గొప్పోళ్ళమండీ అప్పటికప్పుడు  ఇంద్ర భవనం లాంటి బ్లాగు కట్టెయ్యాలని... దానికి ఎన్నెలని పేరెట్టెయ్యాలని..బోల్డు కబుర్లు మీతో చెప్పెయ్యాలని...బోల్డు బోల్డు బ్లాగులకు రోజు వెళ్ళి తలుపులు కొట్టాలనీ.... ఒకటే ఇది.....ఆ ఊపులో పుస్తకం ముందేసుకుని

ఇన్నాల్లు యాడుందొ యీ గంగ
ఉర్కుర్కి రావట్టె ఆత్రంగ
కతలు రాయవట్టె సిత్రంగ
శబ్బసురా శంకరా...
.అని భరణి గారిని తలుచుకుని "మమ" అనేసుకున్నానన్నమాట...

అజ్జిబాబోయ్ యీ ఇషయం ఇప్పుడు సెప్పీసినాన? ఇంట్లొ వాళ్ళు సదివేసి ఏటంటారొ ఏటో . అయినా నాకేటి దిగులు....పరీచ్చలు అయిపొనాయి గంద.... కూసింత కలాపొసన ఉండాల అని సెప్పీనూ?ఓఓఓఓఓ ఇదయిపొతుంటారూఊ...

సరే అని ఇంత కాలం అది రాయాల ఇది రాయాల అని అనేసుకోవడం  చాలా 'విజ్జీ' చిన్నప్పుడు పరీక్షలయ్యాక 'ఎలా రాసావమ్మ  అని అడిగితే  ఎంత "విజ్జీయొ" అని చెప్పిన కంటే ఇంకా యెక్కువ "విజ్జీగా" తీసుకున్ననన్నమాట.ఇంక యేమి వ్రాయాలో తెలియక మీతో వ్రత కథా శ్రవణం  చేయించేసి మీకు బోల్డు పుణ్యం సంపాదించి పెట్టేసానా? మరి అక్కడి నుంచీ అన్నీ భవసాగరాలే . ఆలోచించీ చించీ చించీ .....విరక్తి వచ్చేసింది.... ఆ విరక్తిలొ చిన్నప్పుడు భక్తి రంజనిలొ వచ్చే తత్వాలు గుర్తొచ్చేసాయి. నేను ఇంత తాత్వికినని ఇంత కాలం తెలియదు సుమా! ఓ యీ సుమా యెవరూ అంటారా మా అత్తగారు పరిచయం చేసారు లెండి..
సరే సుమా గురించి మళ్ళీ యెప్పుడైనా చెపుతా గాని  నా ఫిలాసఫీ గురించి కొంచం మాట్లాడుకుందాం. పాపం మా వారు అన్నమయ్య ని అపవాదు చేస్తే యేమొ అనుకున్నా గానీ నాకూ కళ్ళు  పత్తి కాయల్లా విచ్చుకుని బోధిసత్వుడిలా
జ్ఞానోదయమయ్యింది.. ఓన్లీ తేడా యేంటంటే ఆయన కళ్ళు సహం మూసుకుని ఉంటే నేనేమో సహం తెరుచుకుని ఉంటున్నానన్నమాట. ఆ వొచ్చిన జ్ఞానం జ్ఞానం యెంత తాత్వికం చేసేసిందంటే, యేది చదివినా " చీ నేను వ్రాద్దామనుకున్నా , వీళ్ళు వ్రాసెసారు" అని భయంకరమైన   వ్యాధిని కూడా వెంట తెచ్చేసింది. ఆ విరక్తి + వ్యాధి+ తత్వం + వేదాంతం = యీ కింద వ్రాయబడిన 'కపిత్వం' ....అబ్బా దీని మీనింగు కూడా అడిగారంటే
 నేను మీ జట్టు కచ్చయిపోతానంతే. మరి ఇంక చదవండి.... పదండి ముందుకు పదండి ముందుకు...అదిగొ మళ్ళీ శ్రి శ్రి కవిత అనుకున్నారా? అబ్బే కాదండీ అర్టీసీ బస్సు.... ఓకే టికట్ తీసుకున్నారు కదా ఇప్పుడు తీరిగ్గా కూచుని చదవండి మరి.....
మా ఊరీ ఎర్ర బస్సు
ఎర్రిదని నేనందమంటే
శివరంజని అడ్డమొచ్చి
అంత మాటని పోయె లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....

ఈ టీవీ చూసి నేను
నేటి వార్తలు రాద్దమంటే
మొన్ననే మన శిశిర గారూ
వ్రాసి పారేసారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....

కాలేజీ కబురులన్నా
కరువు తీరా చెపుదమంటే
చిన్నవారూ  నాగార్జున
చించి చెప్పేసారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....

షడ్రుచులతొ నోరూరగ
పాక కళనూ చూపబోతే
రుచి రుచిగా జ్యొతి గారూ
వండి వడ్డించారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....

నెమలీకలు గుర్తుకొచ్చీ
చిన్ని కతలూ వ్రాయబొతే
మక్కువతో ఇందు గారూ
అచ్చు వేసేసారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....

శబ్బాసుర అంటు నేను
"భరణిని" కీర్తిద్దమంటే
మస్తు మస్తుగ వేణు గారూ
పుస్తకాలేసారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....

... యేటి నాలాగ మీకు కూడా తత్వాలు వచ్చేస్తున్నై కదూ....ఇంక ఆలీసమెందుకు...... పదండి ముందుకు పదండి ముందుకు
పదండి ముందుకు ...పైపైకీ 

సారీ , ఇంకా చెప్పలేదు కదూ..... ఇక్కడ మా ఊర్లో... ఇలా  పదండి ముందుకు అనడమే కాకుండా చివరి సీటు దగ్గర 'ఇంత లొపలికి వచ్చినందుకు త్యాంక్సులొయ్' అని కూడా చెప్తారండోయ్...... మీకు కూడా త్యాంకులు

బ్లాగ్ ప్రవేశ మహోత్సవము -కథా ప్రారంభము

Monday, December 6, 2010

వక్ర తుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

పూర్వము టొరంటొ యను నొక పట్టణము ఉండెను
ఆ పట్టణము మిక్కిలి పెద్దవగు భవనముల తోడను, ఆపిల్, పియర్ ,లిచి మొదలగు ఫల భరితములైన వ్రుక్షముల తొడను, మేపుల్ సిరప్ వంటి అమ్రుత తుల్యమైన ద్రావకముల తోడనూ అలరారుచుండె.
ఆ పట్టణమున పున్నమి అను వెలది ఉండెను. ఆమె తెలుపు నలుపు గోధుమ అను బేధము లేక అందరితొ కలసిమెలసి ఉండెడిది. ఆమెకు ఒక రాత్రి సరస్వతీ  దేవి ప్రత్యక్షమై "భక్తురాలా నువ్వు 5 సంవస్తరములు నన్ను భక్తిగా కొలచినట్లైన ధనము సౌఖ్యము ప్రసాదించెదనని" పలికినది.
అంత నా పడతి నిదుర యందె 'తల్లీ నిన్ను తలంచి పుస్తకము చేతన్ బూనితిన్" అని ప్రార్దించి వెంటనే మేల్కాంచి తన స్వప్న వ్రిత్తాంతమును పతి దేవునికినీ పిల్లలకును వివరించె. ఒకానొక శుభ దినంబున మొదలు పెట్టిన వ్రతము నిర్విఘ్నముగ కొనసాగుటకై స్నేహితులును బంధువులును కంకణము కట్టుకొనిరి. అంత నా వ్రతము ప్రారంభమయ్యే.
 ఆ నాతి పార్టీలు పబ్బములనక ,ఇండియా యనక ఆంధ్రా యనక అతి భక్తిగా దేవిని ఆరాధించుచుండ
కొంత కాలము గడచినది.
ఒక శుభ దినమున వ్రతము సంపూర్ణమయ్యెను. ఆహా దేవత చెప్పిన దినమిదే కదా యని అందరును మిక్కుల ముదమునందిరి. ఆ దేవి అనుగ్రహము వలన పున్నమికి ఒక ఇంటర్వ్యూ వచ్చెను.  బాసు పున్నమి యందు గల సరస్వతీ కటాక్షమునకు మిక్కిలి సంత్రుప్తి చెంది 'ఉద్యోగ ప్రాప్తి రస్తు ' అని దీవించినది. ఇది చూసి దేవి యొక్క అత్తగారైన లక్ష్మీ మాతకు ఆగ్రహము కలిగెను. హమ్మా, నన్ను పూజించకుండ నా కోడల్ని పూజించేస్తే
నేనొప్పుకోనంతే యని బాసు గారి యందు ప్రవేశించెను. 
సరస్వతి పున్నమియందు ప్రవేశించి, చక చక పనులు చెయ్యసాగె. బాసు గారియందున్న లక్ష్మీ దేవి మిగుల సంతసించి యెమి కావలెనొ కోరుకొమ్మనె. పున్నమి మిక్కిలి అణుకువగా ఒక 100కె చాలునని తెలిపె. లక్ష్మీ దేవి ఒప్పుకొనినందున పున్నమి మిగుల సంతసించి విషయమును బంధువులకు మిత్రులకు తెలియజెప్పె. కథ సుఖాంతమయ్యెనను సమయమున బాసుగారినందున్న అత్తకు హటాత్తుగా మెలకువ వచ్చి "నేనెమిచేయుచుంటిని, నేనేమి కోడలికి వత్తాసు పలుకుట యెమి, ఇప్పుడేమి దారియని" ఆలోచించ సాగె.
ఆమెకు వచ్చిన విద్యలు సునాయాసముగను, రాని విద్యలు 'కలిసుందాం రా' 'క్యూంకి సాస్ భి బహూ థీ' లోని అత్తగార్ల వద్ద కొంత ఆయాసపడి నేర్చుకొనియును పున్నమి పయి ప్రయొగించి ఆమెను అస్ట కస్టముల పాలు జేసెను. రాయ బోగ పెన్ను లొ ఇంకు అయిపోవును, పెన్సిలు ముక్కు చెక్కుకు పొవును. షాప్మరలు కానరావు. టైపు చేయుదమన్న కీ బొర్డు పనిచెయ్యదు. కంప్యూటరు నందు వైరస్ అయి అడ్డుపదును. సభలయందు మాటాడు సమయమున మైకు పనిచెయ్యకుండునట్లును ఒక వేళ అది బాగున్ననూ అన్నీ మరచి మరచిపోవునట్లును చేసి, య తల్లి ఆడుకొన  సాగినది.
సరస్వతియునూ పెన్నులో సిరాయై , పెన్సిలుకు షాప్మరయై, వైరస్ కు ఫైర్వాలయి , మైకుకు సౌండయి ,మెదడులో జ్ఞనాగ్నియై పున్నమిని కాపాడసాగె. ఇక లక్ష్మి తన నిజ స్వరూపమును వీడి "సూర్యకాంతము" రూపము ధరించె. సరస్వతియును దిక్కు కానక 'చాయా దేవీ' రూపమును ధరించి అనుక్షణమును పున్నమిని వెన్నంటి నిలచె. ఒక నాడు లక్ష్మి పున్నమిని గాంచి మిక్కిలి ఆగ్రహము చెంది 'నీవు నీ పని వారిని చెప్పుచేతలలో ఉంచుకొనుట లేదనియు, వారి చెప్పులు నువ్వు మోయుచుంటివనియు అపవాదు జేసెను. అంత పున్నమి విసిగి...తన యందు గల సరస్వతిని నిందించి తనను విడిచి వెళ్ళమని కోరెను. సరస్వతి 'బిడ్డా నీకు మేలుచేయ ప్రయత్నించుచుంటిననీ పలికెను.
నీవు చేసిన ఉపకారము చాలును ఇంక నాలొ నువ్వున్నచో నా బిడ్డల మీద ప్రమాణమని పున్నమి కన్నీటితొ పలుక, సరస్వతి యేమియును చేయజాలక ఆమెను విడిచి  వెళ్ళెను. లక్ష్మియును బాసును విడిచి సరస్వతి యున్న నెలవులను వెతుకుచు వెళ్ళెను. అంత పున్నమి ధైర్యము వీడక ఫాక్టరీలకు,మెక్దొనాల్ద్నకు పోయి ఉద్యోగమును చేయుచూ, మేడలును, కారును, బంగారమును భూములును కొని  సుఖముగానుండి అంత్యమున లక్ష్మివాసమునకరిగినది.
సరస్వతి  ఫలము చెడ్డా వ్రతము దక్కిందన్న సంత్రుప్తి చెంది తన దీవెన యేదో విధముగా నజమయ్యెనని సంతొషించె. ఇవ్విధముగా దేవి తానోడి పున్నమిని గెలిపించినది.
ఇతి బ్లాగ్పురాణే రేవా ఖండే లక్ష్మీ  సరస్వతీ సంవాదే  ప్రథమొధ్యాయహ సమాప్తహ.
యీ కథను రాసిన వారికిని చదివిన వారికినీ లక్ష్మీ సరస్వతీ కటాక్షము ఒక్కసారిగా కలుగునని పరమేశ్వరుడు
పార్వతీ దేవికి వివరించెను.
ఓం శాంతి శాంతి శాంతిః