పుట్టిన రోజు -ఆహ్వానం

Wednesday, November 9, 2011

క్రిందటి సంవత్సరం ఇదే రోజు అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు "ఎన్నెల" అనే నేను ఉదయించాను. ఉదయించడమే తడవు అందరి మనసుల్నీ ఆనంద డొలికల్లో ఊగించెయ్యాలని నిర్ణయించేసుకున్నా కూడా...కొన్ని రోజులు ఆటలతో బాగానే పెరిగినా ఉన్నట్టుండి చిక్కిపోయా. అమ్మా అమ్మా అని పిలిచా..ఎవరూ పలకలేదు..పక్క ఇళ్ళల్లోంచి కమ్మని సిరిలాక్ వాసనలు , నేతి ఘుమఘుమలు ఉక్కిరిబిక్కిరి చేసేవి..మా అమ్మ ఎందుకు నాకు యేమీ పెట్టట్లేదని కొంచెం మనస్తాపం చెందుతుండగా..మా అమ్మ వచ్చి "ప్రేమకు నేను పేదను కానూ , ఆకలనీ దప్పికనీ అడగకు నాన్నా, వేకువవూ వెన్నెలవూ నీవే కన్నా" అని బుజ్జగించింది...సరేలే అనుకున్నా...మరీ పట్టించుకోకపోతే బాధేసిందేమో, .అప్పుడప్పుడూ రుచీ పచీ లేని యేదో ఆహారం కొన్ని సార్లు పెట్టింది కానీ నాకు పెద్దగా రుచించలే,,కేవలం అమ్మని బాధ పెట్టకూడదు అని ఊరుకున్నా. నేను పెద్దవుతున్నా కొద్దీ అమ్మ నా దగ్గరే ఉండాలని నాకు మంచి రుచిగల ఆహారం పెట్టి నన్ను మరింత అందంగా తీర్చిదిద్దాలని కలలు గన్నా. యీ లోపు మా భాగ్య లక్ష్మీ ఆంటీ నేను చిక్కిపోతున్ననేంటీ అని అమ్మని గాట్టిగా మందలించారు. అమ్మ వెంటనే ఇంటర్నెట్టు వెతికి రెండు మల్టీ విటమిన్ మాత్రలు నా  నోట్లో పడేసింది. నేను కొంచెం తేరుకున్నా. మళ్ళీ ఎవరో అడుగుతున్నారు ఏంటీ ఎన్నెల అలా పాలిపోయిందీ అని. అమ్మ చెప్పింది"ఎక్కడండీ దాన్ని చూడ్డానికి అసలు సమయం దొరకట్లేదు...యీ దిక్కుమాలిన అక్కవుంటింగ్ జాబ్ కాదు కాదుగానీ...మంత్ ఎండ్ , క్వార్టర్ ఎండ్, యియర్ ఎండ్ అంటూ ఎప్పుడూ యేదో ఒకటీ,, దానికి తోడు ప్రొఫెషనల్ డెవెలప్మెంట్ అంటూ ఒకటే గోల అని చెప్పింది..అన్ని ఎండులూ చెప్పింది మరి వీకెండులు ఉండవా అని అడుగుదామనుకుంటూనే ఎందుకొచ్చిన గొడవలే అవి నా సహోదరులకి అంకితం అని తెలిసి కూడా మాట్లాడ్డం అని ఊరుకున్నా..ఆ డెవెలప్మెంట్ కోర్సులేవో కంప్యూ కోర్సులు చెయ్యొచ్చుగా!! అమ్మ కూడా కంప్యూ ప్రొఫెషనల్ అయ్యుంటే ఎంచక్కా నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని మరీ పని చేసుకునేదిగా.

యీ మధ్య మా అమ్మ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు...(భాగ్యలక్ష్మీ ఆంటీ హెల్ప్ హెల్ప్ హెల్ప్)!!!
 ప్రతి సాయంత్రం కంప్యూటర్ గదిలోకి రాగానే నా దగ్గరకొస్తుందని ఎంత ఎదురు చూస్తానో!! కానీ కంప్యూటర్లో వెబినార్‌లో ఏంటొట అవి చూసుకుని వెళ్ళిపోతుంది.. అప్పుడప్పుడు గుర్తొస్తానేమో, ఒక సారి నన్ను తడిమి వెళుతుంది...ఆ స్పర్శకే నేను పులకించి అమ్మ తప్పులన్నీ క్షమించేస్తా...
పండుగ పూటా నిష్టూరలెందుకు గానీ అమ్మ బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నాపిల్లలకోసం సాయంత్రం చంద్రునికి పూజ చేసి, పిల్లల్ని చల్లగా చూడమని ఎలాగూ అడుగుతుంది కదా అలా నా సహోదరులతో పాటు నేను ఎప్పుడూ చల్లగా ఉంటానని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే మిమ్మల్నందరినీ నా పుట్టిన రోజుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. మీరు తప్పకుండా మీ బంధు మిత్ర సపరివార సమేతంగా రావాలి. చిన్న పిల్లని కాబట్టి, దయచేసి చాక్లెట్లు, కేకులూ, రిటర్ను గిఫ్టులూ అవీ అడక్కుండా తమ తమ శక్తి కొలదీ గ్రీటింగులూ, బహుమతులూ, ఆశీస్సులూ ఘనంగా అందజేయ ప్రార్థన. మాకేంటీ అంటారా...?? ఇక్కడ  బహుమతులిచ్చేసి పక్కనే షడ్ర సోపేతమయిన (వన) భోజనాలు యేర్పాటు చేసాము. వడ్డించేవారు మనవారే లెండి!! మీరు  మొహమాట పడకుండా కావలసినవన్నీ  కడుపు నిండా తిని,నన్ను చల్లగా ఉండమని మరొక్కసారి దీవించెయ్యండి.

బ్లాగ్వన భోజనం...

ఇంత మందిని భోజనానికి పిలిచేసానా మరి నా వంతు ఏంచేద్దామా అని ఆలోచిస్తుండగా...ఇంట్లో రెడీగా చిన్న చిన్న బుంగ మిరపకాయలు కనిపించాయి..నేను ఎప్పుడూ చేసే అందరి మెప్పూ పొందే బుంగ మిరపకాయల కూర కి డిసయిడ్ అయిపోయా..ఆఫీసులో కొందరు.." వీ ఆర్ ఆన్ ద ఫయర్ , బట్ వీ కెన్ నాట్ మిస్ ద ఫయర్,.ప్లీస్ గివ్ మీ సం మోర్ అండ్ బ్రింగ్ ద ఫయర్ అగెయిన్ అండ్ అగెయిన్ " అంటారు. ఆ మంట మనం వేసే కారం మంట అన్నమాట. మీరూ రుచి చూడండి..తప్పకుండా నచ్చుతుంది..
కావలసిన వస్తువులు:
బుంగ మిరపకాయలు (చిన్నవి)8
చింతపండు (కొంచెం)
శెనగ పిండి (100 గ్రాములు)
జీల కర్ర 1 స్పూను
ఉప్పు కారం సరిపడా (మీకు..నన్ను చెప్పమంటే..లెక్క నషాళానికంటుతుంది)
నూనె 100 గ్రాములు
ముందుగా మిరపకాయల్ని నాలుగు భాగాలుగా కొయాలి(గుత్తి వంకాయలొ వంకాయ కోసినట్టు)
వీటిని చింత పండు రసం లో 10 నిముషాలు ఉడికించాలి
మైక్రో వోవెన్ లో కూడా పెట్టచ్చు.
ఆవి ఉడికే లోపు శెనగ పిండిలో ఉప్పు, కారం, జీలకర్ర, ఒక స్పూను నూనె వేసి కలిపి ఉంచుకోవాలి.
తరువాత కాయల్లో నీళ్ళని పిండేసి (చాలా సుకుమారంగా పిడాలండొయ్!)
ఇందాకా కలిపి పెట్టుకున్న శెనగ పిండి మిక్స్ ని యీ కాయల్లో కూరి, కాగుతున్న నూనెలో వేసి మూతపెట్టాలి...మూత మీద కాసిని నీళ్ళు పోస్తే ఆవిరికి కూర మీద చిన్నగా నీళ్ళ చుక్కలు పడి కూర మాడకుండా ఉంటుంది....10 నిముషాలకొకసారి జాగర్తగా కలిపి మళ్ళీ మూత పెట్టెయ్యాలి...కాయలు బాగా వేగినట్టు అనిపించాక మీరైతే వెంటనే తినెయ్యొచ్చు వేడి వేడి అన్నంలో...మరి నేను వనాలకి తెస్తానని ప్రామిస్ చేసా కాబట్టి రుచీ అదీ చూడాలని టెంప్టు అవకుండా జాగర్తగా సర్ది తెచ్చేస్తున్నా....
సీతయ్య స్పెషల్....షార్జా...కూల్ కూల్
మేము మాల్దీవులకి వెళుతూ ట్రివేండ్రం వెళ్ళినప్పుడల్లా హోటెల్ పక్కన ఉన్న చిన్న ఫ్రూట్ జూస్ కొట్లో మా పిల్లలు షార్జా అని యేదో జూస్ తాగేవాళ్ళు. మొన్న సడెన్ గా మా వారు పిల్లల కోసం ఫ్రూట్ ప్యూరీ చేస్తే అది అచ్చు ఆ షార్జా టేస్టుతో వచ్చింది...దాని కథా కమామీషు

అరటి పండ్లు...కొంచెం ముగ్గినవి 2
స్ట్రాబెరీ పండ్లు 8
హార్లిక్స్/మైలో/బోర్నవిట 2 స్పూన్లు
పంచదార...మీ ఓపిక...(మాకయితే 2 స్పూన్లు)
పాలు 2 కప్పులు
ఇంకా చూస్తారేంటండీ...అన్నీ కలిపి మిక్సీలో గర్రుమని తిప్పేసి.....జుర్రుకుని తాగేయటమే...ఇదిగో ఇక్కడ సర్వ్ చేసా....తాగేయండి...
మా వారిని ఇది ఎందుకు చెయ్యమన్నానో తెలుసా...పైన నేను చేసిన కూర కారమని కంప్లయింట్ చెయ్యకుండా..తియ్య తియ్య తియ్యగా చల్ల చల్లగా షార్జా....కూల్ కూల్....ఎలా ఉంది?

ప్రవేశ పరీక్ష

Saturday, October 22, 2011

నిన్న పాత పుస్తకాలు తిరగేస్తున్నప్పుడు ఎప్పుడొ అంతర్జాలంలో చదివి చాలా చాలా నచ్చి ప్రింటు చేసి  పెట్టుకున్న కొన్నిఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రశ్నలు కనిపించాయి.
ఇవి చదివితే నేను 10వ తరగతి అయిపోయాక వ్రాసిన ఒక ప్రభుత్వ క్లరికల్  పరీక్షలోని కొన్ని జెనరల్ నాలెడ్జి ప్రశ్నలు కూడ గుర్తొచ్చాయి...ఆ పరీక్ష అయ్యాక ఆ ప్రశ్నలు తలుచుకుని ఎంత నవ్వుకున్నామో...!!! ఆ పేపర్ అప్పట్లో తిరుపతిలో లీక్(????) అయ్యిందని ఆ పరీక్ష క్యాన్సిల్ కూడా చేసారులెండి..అలా గుర్తొచ్చినవీ , ఇంటర్నెట్ లో చదివినవీ కలిపి ఇక్కడ ఇలా సరదాగా....ఇలాంటి ప్రశ్నలు ఇంకా మీకు గుర్తొస్తే హెల్ప్ చెయ్యరూ!!!

                                                        
                                                                ప్రవేశ పరీక్ష

Note: You can write this paper either in English or telugu or any other language you know.

Instructions:
1) ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా పదేసి సార్లు చదవవలెను. 
2) ప్రతి ప్రశ్నకు జవాబు వ్రాయవలెను.
3) సమయం: 3 వారములు
4)తక్షణమే  మొదలు పెట్టవలెను.Part -1 multiple choice questions

1. "ఫ్రెంచ్" దేశస్థులు మాట్లాడు భాష యేది?
అ. ఫ్రెంచ్
ఆ. ఇంగ్లిష్
ఇ. హింది
ఈ. మళయాలం

2. బిల్ క్లింటన్ యొక్క ఇంటి పేరును తెలుపుము.
అ. బుష్
ఆ. క్లింటన్
ఇ. ఒబామా
ఈ. లింకన్
 
3. విలియం షేక్స్పియర్ కనబడినచో యేమి చేయమని అడుగుదురు?
అ. సేతు నిర్మాణము చేయమని
ఆ. పడవ నడిపించమని
ఇ. విమాన చోదనము
ఈ. నాటకము రచింపుమని


 4. పోప్ యే మతస్థుడు?(ఒక మతము మాత్రమే గుర్తించవలెను)
అ. యూదుడు
ఆ. కేథలిక్
ఇ. హిందువు
ఈ. పోలిష్5. వర్షం ఎచటి నుండి వచ్చును?
అ. భూమి
ఆ. చంద్రుడు
ఇ. సూర్యుడు
ఈ. ఆకాశము

6. అమెరికా కు ఉత్తర భాగమును యేమందురు?
అ.ఉత్తర అమెరికా

ఆ. దక్షిణ అమెరికా
ఇ. పశ్చిమ అమెరికా
ఈ. తూర్పు అమెరికా


7. Which part of America produces the most Florida oranges?
(a) New York
(b) Florida
(c) Canada
(d) Wisconsin


8. ఒక బ్రిడ్జి 120 కిలోలు మాత్రమే మోయగలదు. 120 కిలొల ఒక బండి బ్రిడ్జి మీద ఉండగా బండిలోంచి 5 కిలోల సంచీ కింద పడింది.. బ్రిడ్జీ
అ. ఉంది
ఆ. కూలిపోయింది. 


9. Can you explain Einstein's Theory of Relativity?
(a) Yes
(b) No


10. భారత దేశములో మాట్లాడు భాషల సంఖ్య ఎంత?
అ. బొచ్చెడు

ఆ. ఒకటి మాత్రమే


11. మసీదు నుండి ఏమి వినిపించును?
అ. గుడి గంటలు
ఆ. నమాజు
ఇ. క్రీస్తు సువార్త
ఈ. బుధ్ధుని బోధలు


12. ఒక చెట్టుకు వ్రేలాడుతున్న.............ని చూసి ఒక వ్యక్తి పోలిస్ స్టేషనుకు వెళ్ళెను.అతను చూచినదేమి?
అ. పండు
ఆ. శవము
ఇ. తేనె పట్టు
ఈ. పిట్ట


13. ఒక ఇంటి కి వరుసగా వైద్యుడు, లాయరు, బ్రాహ్మణుడు వచ్చారు. ఆ ఇంటిలో జరుగుచున్నదేమి?
అ. పెళ్ళి
ఆ. చావు
ఇ. అన్న ప్రాశన
ఈ. నామకరణం


14. ఆసుపత్రిలో ఒక వ్యక్తి పై తెల్లని గుడ్డ పూర్తిగా కప్పబడి యున్నది..ఆ వ్యక్తికి ఏమియైనది?
అ. ఆపరేషను
ఆ. మరణము
ఇ. మూర్చ్చ
ఈ. పడిశముPart -2 Descriptive questions

15. ఒక బస్సులో 10 మంది ప్రయాణీకులు ఎక్కి  రెండవ స్టాపులో దిగిపోయారు. బస్సులో మిగిలి ఉన్న వారు ఎవరు?

16. బాబిలోనియా నాగరికత సమయంలో విద్య ,శిల్ప కళ, న్యాయశాస్త్రము, సామాజిక పరిస్థితులను విశదంగా వివరింపుము లేక మీ పూర్తి పేరును ఆంగ్లములో వ్రాయుము.

17. గడియారము చిన్న ముల్లు 5 మీదను పెద్ద ముల్లు 12 మీదను ఉన్నప్పుడు సమయమెంత?

18. మోసెస్ ఎన్ని కమాండుమెంట్లు ఇచ్చెను? (ఇంచుమించుగావ్రాసిన చాలును )

19. ఇంగ్లాండుని పాలించిన ఆరుగురు రాజులు వరుసగా జార్గి పేర్లతో పిలువబడెను... అందు ఆరవ వాడు జార్జి-6 అయిన మొదటి 5గురు రాజుల పేర్లను వ్రాయుము.
 

20. Give the spellings of Bush, Carter and Clinton.

21. What are coat hangers used for?

22. The Star Spangled Banner is the American National Anthem for what country?


23. Explain Le Chateliers Principle of Dynamic Equilibrium OR write your father's name in CAPITAL LETTERS

24. Where is the basement in a three-storey building located?

25. What does NBC (National Broadcasting Corp.) stand for?


Part -3 Advanced Mathematics


26. ఒక రైలు ప్రతి సారి 30 నిముషములు ఆలస్యముగా వచ్చును. 5 గంటలకు రావలసిన రైలు ఇప్పుడు వచ్చినచో ..ఇప్పుడు సమయమెంత?

27. మీ చొక్కాకు ఉన్న 5 గుండీల్లోంచి ఒక గుండీ వదులయ్యింది. మీ చొక్కాకు ఉన్న మొత్తం గుండీలెన్ని?

28. మీరు పొద్దున్నొక్క సారి, మద్యాహ్నమొక్కసారి రాత్రి ఒక్క సారి భోజనము చేసారు. మీకు మళ్ళీ ఆకలి ఎప్పుడేస్తుంది?

29. ఆరు గోళీలని రాముకి సోముకి సమంగా మూడేసి చొప్పున పంచినట్లైతే రాము వద్ద ఉన్న గోళీలెన్ని?

30. If you have three apples how many apples do you have?


31. 0.0 మీటర్లలో ఎన్ని సెంటి మీటర్లు కలవు?

32. ఒక బరువు కొలమానము మీరు ఎక్కినప్పుడు 60 కిలోలు సూచించుచున్నది. మీరు దిగిన తరువాత అది ఎంత బరువు సూచించును?****పరీక్షా ఫలితాలు తెలుసుకొనుటకు పరీక్ష అయిన నాలుగు వారముల తరువాత పరీక్షాధికారిని "ఉత్తరము"న కానీ "దక్షిణ"మున కానీ కలువవలెను.మౌఖిక పరీక్షకు యీ ప్రశ్నకు సమాధానము మాత్రము తెలుసుకుని వెళ్ళిన చాలును.
1. "ఫ్రెంచ్" దేశస్థులు మాట్లాడు భాష యేది?
 

  

నా భారత దేశ యాత్ర

Tuesday, September 13, 2011

మా ఇద్దరికీ కలిపి ఒకే సెట్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు.. నాన్న ఎండలకి బాగా నీరసపడి ఓపిక తగ్గిపోయి ఫోన్ లో కూడా మాట్లాడలేక పోతున్నారు. పైగా మనము అడిగే ప్రశ్నలేవీ ఆయనకి వినిపించట్లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన చెప్పాల్సిన నాలుగు మాటాలూ గబ గబా చెప్పేస్తున్నారు..చంటి పిల్లాడు జానీ జానీ యెస్ పాపా చెప్పినట్టు.."నేను బానే ఉన్నానమ్మా, నా ఆరోగ్యం బానే ఉంది, మీరు బెంగ పెట్టుకోకండి..నేను 24 గంటలూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, మీరు చల్లగా ఉండాలని. మీరు పిల్లలు జాగరత, ఇక్కడ విషయాల గురించి యేమీ ఆలోచించద్దు. ఇక్కడ అందరం సంతోషంగా ఉన్నాము...ఉంటా మరి."ఇవీ ఆయన చెప్పల్సిన నాలుగు మాటలూ. విషయం ఏంటంటే, నాన్నకి వినికిడి , కంటి చూపు తగ్గాయి.అత్తయ్య ఆరోగ్యం కూడా అంత బాగోట్లేదనీ చాలా బెంగ పెట్టుకున్నారని ఒక్కరైనా వచ్చి చూసి వెళితే బాగుంటుందనీ దగ్గర బంధువు ఒకావిడ తరచూ అంటూ ఉన్నారు యీ మధ్య. మేమిద్దరం ఇంటికి వెళ్ళడానికి సహకరించని పరిస్థితులని తలచుకుని చాలా బాధ ,బెంగ పడుతున్నాము. అందరం పెట్టుకుంటే అవదు, యీ కాంట్రాక్టు అవగానే నువ్వు వెళ్ళిరా, నేను తరవాత వెళతా అన్నారు మా సీతయ్య. మాటల్లో కాంట్రాక్టు అయిపోగానే ఇండియా వెళ్లాలనుందని మా బాసు గారితో అన్నా. మా మనసున్న మంచి బాసుగారు "అప్పటిదాకా ఎందుకు ఇప్పుడు వెళ్ళొచ్చెయ్ ..కాంట్రాక్టు పొడిగిద్దాం"అనేసారు. ..చెంగు చెంగు మని నేను ఇంటికి ఫోను కొట్టి విషయం చెప్పా..వెంట వెంటనే వీసా కి అప్లయి చెయ్యడం, గబ గబా టికెట్టు బ్లాక్ చెయ్యడం జరిగిపోయాయి.. ఆరేళ్ళ తర్వాత ఇండియా వెళ్ళడం..కలా నిజమా అని గిల్లి గిల్లి చూసుకున్నా...రేపు వెళుతున్నాననగా కూడా ఇంకా నమ్మకంగా లేదు...ఎక్సైటుమెంటూ లేదు...టెన్షనూ లేదు...అలా ఆనందాలకూ బాధలకూ ఒకేలా స్పందిచే యోగినిలా విమానమెక్కాను. కూడిక గుర్తులు (పాసిటివ్ మార్క్స్)(+): 1. నాన్న అత్తయ్యలతో సహా బంధువుల్లో పెద్దలందరినీ చూసి ఆశీర్వాదాలు తీసుకోవడం.. 2. ఉమ్మడి కుటుంబంలో వదిలి వచ్చిన ప్రాణాతిప్రాణమైన చిన్ని చిన్ని పిల్లలతో కలిసి ఉండడం..(కొంచెం పెద్దయి పోయారనుకోండి..అయిన్న ఇంకా ఒళ్ళో పడుకోవడం..కౌగిలించుకోవడం, అన్నం ముద్దలు కలిపి పెట్టించుకోవడం మర్చిపోలేదంటే...చిన్నగా ఉన్నట్టేగా..) 3. మా ఆల్వాల్ వెంకన్నని, సికందరాబాదు బుజ్జి గణేషుడ్ని కలిసి హెల్లొ బాగున్నావా అని పలకరించడం. 4. బోనాలపండుగ రోజున తోట్లో ఎల్లమ్మని , బూలచుమమ్మనీ ఖుషీ చేయ్యడం.. బోనస్ గా ....బొల్లారం జాతర, రంగం జరిగేటప్పుడు వెళ్ళే అవకాశం.. 5. చాలా యేళ్ళ తరువాత ఒక సీమంతం పండుగకు హాజరవడం.(పెళ్ళిళ్ళు, పేరంటాలు చూసి దాదాపు 12 యేళ్ళు అయింది మరి!!! ) 6. చిట్టి, అపరంజి, దీపు,హర్షులతో కలిసి రోడ్డు మీద చాట్, పానీ పూరీ తినడం ..(ఒకేసారి లెండి..అయినా అపురూపమే కదా!!.) 7. అరగంట టైం లో చిన్ననాటి స్నేహితుల్ని అనుకోకుండా కలవడం.(అలా అరేంజ్ చేసిన మా లల్లీకి కృతజ్ఞతలతో) 8. నాకు కొత్తగా దొరికిన సోదరుణ్ణి సతీ సమేతంగా కలవడం తీసివేతలు (నెగటివ్ మార్క్స్)(-): 1. మా అల్వాల్ గుడి ని పాత ముద్ర ఒక్కటి కూడా లేకుండా మొత్తం కొత్తగా కెట్టెయ్యడం...(ఇక్కడ 100 సంవత్సరాలు దాటిన యే భవనాన్నయినా ముట్టుకోనీయదు ప్రభుత్వం..అలాంటిది 400 యేళ్ళ చరిత్ర కలిగిన ఆ గుడి మచ్చుకి ఒక్కటంటే ఒక్క గుర్తు కూడా లేకుండా మార్చేసారు...కారణాలు తెసుసుకునే ఆసక్తి కలగలేదు..వెంకన్న విగ్రహం మార్చలేదు..అంతే చాలు అనుకుని తృప్తి పడాల్సి వచ్చింది అంతే...కానీ మనసులో ఎంత బాధ కలిగిందంటే, ఆ విషయం ఇంట్లో వాళ్ళతో ప్రస్తావించడానికి కూడా ఇష్టం లేనంతగా..... 2. ఉన్న మూడు వారాల్లో దాదాపు అన్ని రోజులూ బందులే... 3. ఎవ్వరికీ ఏమీ మనస్పూర్తిగా కొనియ్యలేకపోవడం (ఎందుకూ అంటారా...చెప్తాగా తొందరెందుకు?) 4. నేను కలవాలనుకున్న బ్లాగ్ మిత్రుల్లో ఒక్కళ్ళని కూడా కలవలేకపోవడం 5. మూడు వారాల్లో 333 చోట్లకి ప్రయిం మినిస్టర్ తిరిగినట్లు తిరిగి అందరికీ తలొక అర నిమిషం కేటాయించి తిట్టించుకోవడం.. 6. ముందు సూచన లేకుండా శమ్షా బాద్ విమానాశ్రయంలో 1500 రూపాయలు టోల్ ఫీసో ఏంటో సరిగా వివరాలు కూడ చెప్పకుండా కట్టించుకోవడం.. (మీ టికెట్ ఏజెంట్ ని అడుక్కో వివరాలు అన్నారు. పాపం మా ఇంట్లో వాళ్ళందరూ నేను వెళ్ళిపోతున్నారని బాధపడుతున్నారు కదా ఆ హడావిడిలో పెద్దగా పట్టించుకొలేదు నేను కూడా..."పోతే పోనీ పోతే పోనీ" అనుకున్నా..). తీసివేతలు ఇంకా ఉన్నాయి కానండీ...కూడికలని ఎక్కువ చూపించుకుంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుదన్నమాట...అందుకని ఇంక వ్రాయట్లేదు. ఇది కూడికా తీసివేతా..మీరే చెప్పండి..(+/-) : సమయానికి నగదు సర్దుబాటు కుదరక నేను వెళ్ళిన రెండో రోజు మా కృష్ణుల వారు వెస్టర్న్ యూనియన్ ద్వారా మనీ ట్రాన్స్ఫెర్ చేసారు. దీన్ని బ్యాంకులో డ్రా చెయ్యొచ్చని నాకు తెలియదు...వెస్టర్న్ మనీ వెతుక్కుంటూ వెళితే, వాళ్ళు చెక్కు ఇచ్చారు ..దాన్ని తీసుకెళ్ళి బాంకులో వెయ్యడానికి బందులు అడ్డమొచ్చాయి. ఒకసారి వెళితే బ్యాంకు మూసి ఉంది..రెండవసారి తెరిచి ఉందని కంఫర్మ్ చేసుకుని వెళితే, సరిగ్గా అప్పుడే మూసేయిస్తున్నారు. చాలా సేపు చూసి పక్కనున్న దుకాణంలో షాపింగు చేసి ఇంటికెళ్ళిపోయాము. బ్యాంకు తెరిచున్న సమయం చూసుకుని చచ్చీ చెడీ...వెళ్ళి డిపాసిట్ చేద్దామంటే, కవుంటర్లో చెక్కులు తీసుకోవట్లేదుట యీ మధ్య!!! అన్ని గంటలు లయిన్లో నిలబడ్డాక కవుంటర్ లో ఆవిడ విసుగులు...ఇక్కడికెందుకొచ్చావ్..అక్కడ డ్రాప్ బాక్స్ లో వెయ్యిపో (ఏక వచనం..పోనీలే ఆంగ్ల పద్దతిలో.."యూ" అంటున్నారులే అని సరిపెట్టుకుని..ఎప్పుడు రావాలండీ అని అడిగా..ఎగాదిగా చూసి 4 రోజుల తర్వాత రమ్మన్నారు. తీరా వేసిన చెక్కు 4 రోజుల తర్వాత చూసుకుంటే క్రెడిట్ అవలేదు. నా పాత అకవుంటు నంబర్ మారిందిట అందుకని వెనక్కి పంపించేసారుట (ఔరా...కొత్త ఫోన్ నంబర్ వచ్చాక పాత నంబరుకి డయల్ చేస్తే ఇది మారినది అని చెప్తారు కదా...బ్యాంకీ ఉద్యోగులకి యీ పాత నంబరుకి ఇది కొత్త నంబరు అని తెలియదా..అకటా హెంత అమాయకులు పాపం ఎవరు నియమించారో వీళ్ళని అని ఒక సారి కళ్ళు తుడుచుకుని మ్యానేజరు గారి కాళ్ళా వేళ్ళా పడి 4 విసుగులూ 8 కసుగులూ భరించి బతిమాలుతుండగా... అదిగో ప్రత్యక్షమయింది....ఎవలాలూ అంటారా... . సమయాభావం వల్ల ఇంటి దగ్గర కలవడానికి వీల్లేక బ్యాంకు దగ్గర ఉన్నానని తెలిసి అక్కడ కలవడానికొచ్చిన నా స్నేహితురాలు హెన్నాగ్లోరీ . దగ్గరకొచ్చి..."నువ్వు ఎన్నేండ్లయినా ఇట్లనే ఉంటవానే !మెత్తగ మాట్లాడితే పనులు గానీకి ఇది కెనడా గాదు..రా నేను మాట్లాడతా "అని బ్యాంకులో అందరినీ దడదడలాడించి , లాయర్ లా ప్రశ్నలడిగి "సరే తల్లీ డబ్బులు తిరిగి తెప్పిస్తాము 4 రోజులాగి రండి "అని వరమిప్పుంచుకుని .."యీ సారి మీరు రాకండి డబ్బులు తీసుకోడానికి ఆవిడొక్కరూ వస్తే చాలు "అనిపిచేంత గోల చేసింది. అప్పుడు నాతో ఉన్న మా కజిను " అక్కా యీవిణ్ణి మొదటి రోజునే తీసుకెళ్ళాల్సింది కదే బ్యాంకుకి..అనవసరంగా రెండు వారాల్నించీ తిరుగుతున్నాము..ఈవిడ వచ్చి ఉంటే రెండో రోజు డబ్బులొచ్చేసేవి చక్కగా..ఆ బ్యాంకు వాళ్ళు కొంచెం ఎక్కువేసి మరీ ఇచ్చేవారేమో అని..తన ఆశ్చర్యాన్ని ప్రకటించింది కూడా!! యీ లోగా ఇంటి దగ్గర పెద్ద వాళ్ళ బాంకులకి, జేబులకీ కన్నాలు పడడంతో పాటు, ఇటు వైపు అటువైపు చిన్న పిల్లల గల్లా కుండలూ, పిగ్గీ బాంకులూ కొబ్బరికాయలు పగిలినట్లు పగిలాయి..పిన్నీ నా దాగ్గర తీసుకొ, అత్తా ఇదిగో నా గల్లా, పెద్దమ్మ రా నా అకవుంటులో తెచ్చుకుందాం , అమ్మా ఇదిగో నా దగ్గరున్నడబ్బులు అని పిల్లలందరూ ఏడు కొండలవాడికిచినట్టు వాళ్ళ పొదుపుల్ని నిలువు దోపిడీ ఇచ్చేసారు..కాదేదీ ఖర్చు కనర్హం అని నేను ప్రతి పైసా అపురూపంగా అప్పు తీసుకున్నా. ...అయ్యో పాపం మా ఎన్నెలకి ఎంత కష్టమొచ్చిందీ డబ్బులు లేవని అస్సలు ఖర్చుపెట్టలేదు అన్నీ మిగులే అని ఇప్పటిదాకా మీరు అనుకుంటున్నారు కదా ? అయ్యయ్యో మీరు అంత అమాయకులేంటండీ!!! మీ లాగే పాపం పసి పిల్లలు అప్పులిచ్చేసి అదేదో పుణ్యకార్యం చేసినట్టు సంతృప్తి ఫీల్ అయితే, పెద్దలు మాత్రం...అసలు ఎందుకొచ్చినట్టురా బాబూ అనుకున్నట్టు చూచాయగా అనిపించింది..కానీ నేను పెద్దగా పట్టించుకునే మూడ్ లో లేనన్నమాట...ఏమయితేనేం...మా హెన్నా గ్లోరీ పుణ్యమాని ..తిరుగు ప్రయాణం రోజున డబ్బులు చేజిక్కించుకున్నా. హమ్మయ్యా అందరి అప్పులు తీర్చేసా. అదృష్టం చివరి రోజు డబ్బులు చేతికొచ్చాయి..లేకపోతే యీ పాటికి అప్పుల అప్పమ్మ లా మిగిలి ఉండేదాన్ని. (కథ వ్రాసినప్పుడు ఉంది కానీ 2021 లో హన్నా గ్లోరీ చనిపోయింది. ఈ కథ లోనూ, నా మనసులోనూ తను బతికుంటుంది ఎల్లకాలం.)

"మాలిక" పత్రికలో నా తొలి కథ- బొమ్మల పెండ్లి

Thursday, August 25, 2011

నేను మెల్లగ నడుస్తున్న. గౌను అంచు పైకి వట్టుకున్న. మెల్లగ లంబడోల్ల గుట్ట మీదికి నడిచిన. ఆల్లు జాకెట్ల మీన అద్దాలు కుడతరు. గుట్ట పురాగ ఎక్కక మునుపే రెండు అద్దం ముక్కలు దొరికినయి. గౌన్ల ఏసుకొని ఆండాలోల్ల ఇంటికి నడుస్తున్న. ఒక గాజు పెంక కాలికి తలిగింది. మందు సీసాది కావొచ్చు. అది భీ గౌన్ల ఎసుకున్న . బాగ ఎండున్నప్పుడు దాంట్ల కెంచి చూస్తే సల్లగ్గొడతది. ఆండాలోల్ల ఇంటి లోపటికి బొయ్యిన. అవ్వ పొద్దుగాల సావిడి అలికినట్టుంది. సావట్లకి పోంగనె, పెండ జాజు కలిపిన మంచి వాసనొస్తుంది. అండాలు ఉర్కొచ్చింది. “ఒచ్చినావె ఏందెచ్చినవ్ “అని నా గౌను గుంజింది. నేను మడత వెట్టి పట్టుకున్న గౌన్ల కెంచి అమ్మ చేతికున్న పంచ వొన్నెల గాజు ముక్కలు, పక్కింటి అర్వోల్ల పొల్ల సీరకు కుడుతున్న చెమ్కీలు, నాయిన సెల్ల అంచుకు ఉండేటి మెరుపు తీగెలు, అద్దాలు , గాజు పెంక అన్ని రాలి పడ్డయి. “అంత ఆత్రమేంది పొల్లా జెర్ర సైసు” అవ్వ అరిచింది. బొమ్మలేవే" అన్నది అండాలు. “మా అమ్మమ్మోల్ల ఊరికి పొయ్యినప్పుడు మా అత్త రెండు చెక్కబొమ్మలిచ్చింది. వాటి గురించడుగుతుంది. రెండు రాదారానోల్లకిచిన్నే పోయినయంటుర్రు "అన్నా. అట్లెట్లనే అన్నది అండాలు. రాదారానోల్ల నాయిన వొడ్ల పని చేస్తడు కద. ఆడ బొమ్మకి చెవులు కుట్టిపిస్తనని తీస్కుంది. నేను మెరుపు దారాలతోని కమ్మలు చేసిన. రేపు మాపు అనుకుంట ఇప్పుడు వాల్ల నాయిన కోపానికొచ్చి ఎటొ ఇసిరేసిండని చెప్తుంది.. నాకు మస్తు కోపమొస్తుంది” అన్న. “మొగ బొమ్మనెందుకిచ్చినవ్ “అన్నది. “ఆడ బొమ్మకి మంచిగ చేతులు దూరముంటయే. చీర కట్టనీకొస్తది. మొగ బొమ్మకి చేతులు మొండానికి అంటుకోనుంటయి. బట్టలు కట్టనీకొస్తల్లేదంటే చేతుల కాడ రంపం తోని కొయిపిచ్చి తీస్కొస్తనంటె ఇచ్చిన”. “అయ్యొ అవునావే. అవ్వ బట్ట బొమ్మలు చేస్తదే. ఆడుగుదాం, చిట్టీ నువ్వు రాజ్ కుమారక్క మిషీను కాడికెంచి బట్ట పేగులు తీస్కరా పో" అన్నది. ఇద్దరం అలికిన సావిడి మీద చెమక్కుమంటున్న చెమ్కీలు ఏరవట్టినం. అవ్వ నన్ను జూచి నవ్వింది. అక్కేది అవ్వా అన్న. జెర పానం సుస్తుందని పన్నది బిడ్డా,ఈడ గూకోని గమ్మున ఆడుకోన్రి, లొల్లి జెయ్యద్దు అన్నది అవ్వ. తమ్ముడెప్పుడొస్తడవ్వా అని అడిగిన. “ఇగ రెండు మూడు దినాలు గావొచ్చు” అన్నది అవ్వ. “అవ్వా బొమ్మల పెండ్లి చేస్తము బొమ్మలు చేసిస్తావా” అన్న. “బట్టలున్నై బిడ్డా పిండినంక జేద్దం “అన్నది అవ్వ. “ఎయ్ మనం బాసింగాలు చేద్దామావె “అన్నా. “ఎంత బాగుంది కదనె !అక్కా, ఆండాలక్కి పెండ్లికి బాసింగాలు కొనొద్దని మా నాయినకి చెప్తా..నువ్వే చేద్దువు” అన్నది అన్ను. .. “అవ్వా బొమ్మలు..” అండాలు నసిగింది. మా చెల్లొచ్చింది. రాజ్ కుమారక్క మిషీను కాడికెంచి బట్ట పేగులు తెచ్చింది. అవ్వ ఒక గలాసల లీల్లు తెచ్చింది. బట్ట పేగుల్ల మంచివి ఏరి లీల్లల్ల ముంచింది. పీట మీద బట్ట పేగు లేసి దాని మీద చీపురు పుల్లలు వెట్టి పేనింది. పెద్ద పుల్లకు జుట్టిన బట్ట పేగును నడిమిట్లకి మడతవెట్ట్, ఇంకో బట్ట పేగుని ఏసు కీస్తు సిలువ లెక్క వెట్టి కాల్ల కింద ఉన్న గోనె దారం పీకి గట్టిగ కట్టింది. అండాలు పలక బలపం తెచ్చింది. “ఎవలను పిలుద్దామె పెండ్లికి పేర్లు రాయి పలక మీద “అన్నది. “నువ్వు జెప్పు ఎవలని పిలుద్దాం” అన్న నేను పలక చేతికి తీసుకుంట. “అయితె రాయి, గజ్జి కుక్క, కోమటోడు, పెరుగుల బుడ్డి, నిమ్మి, రాదారాని, ఆనంది ఇంకా”.. ఆండాలు చెప్తా పోతుంది. “ఈల్లెవలక్కా” అన్నది అన్ను. “గజెందర్ గాన్ని గజ్జికుక్క అనవట్టిన్రు ఇస్కూల్ల. కోమటోడు ఎర్కలేదా నీకు..ఎంకటెంకటీ కోమటెంకటీ అంటవు గదనె” అన్నది అండాలు..”మరి పెరుగుల బుడ్డి ఎవలు” అన్నది అన్ను..”.ఆడేనే గోపాల్ రెడ్డి గాడు.. టీచర్లకు పాలు పెరుగు తెస్తడు అందుకే....గోపాల్ రెడ్డి పెరుగుల బుడ్డి అని అందరంటుంటె, నగీ నగీ సచ్చినం” అన్నది ఆండాలు. చిట్టి కి ,అన్నుకు మస్తు నవ్వొచ్చింది. “ఎక్వ మందిని చెయ్యకున్రి బిడ్డా నాయిన కోపానికొస్తడు పెద్ద సారు ఒస్తడంట ” అన్నది అవ్వ. “అవ్వా ఇయ్యాల ఆదివారం గదా.. సారు ఒచ్చుడేంది” అన్న నేను. “పెద్ద సారుకి పనుందంట మొగోల్లని పిలకున్రి.. లొల్లి జేస్తరు.. ఆడోల్లని పిలిచి ఆడున్రి. సారొస్తె కష్టమైతది “అన్నది అవ్వ. “మంచిది తియ్..అన్నూ నువ్వు, చిట్టి పొయ్యి అందర్ని తోల్క రా పొండ్రి ” అన్నది అండాలు. “అక్కా నువ్వొస్తెనే పోతా “అన్నది చిట్టి . “అట్లంటె ఎట్లనే ఈడెన్ని పనులున్నయ్! పిలగానికి పిల్లకు బట్టలెయ్యాలె, పీటలెయ్యాలె, అన్నమొండాలె ,లడ్డూలు జెయ్యాలె” అన్నది అండాలు. “బిరాన రన్రి, మల్ల ఆకలయితది” అన్నది అవ్వ. వాల్లు పోతున్రు. “ఓ పొల్ల, సుజాతోల్లను, విమలోల్లను పిలువు యాద్ మర్వకు “అండాలు అరిచింది..”మంచిది” అన్నది అన్ను. ఆవ్ గానీ పున్యవతి, బాగ్యవతోల్లని పిలుద్దమా” అన్నది. “వొద్దే వాల్లిల్లు బొందల గడ్డ దిక్కుంటది గద. ఒక పారి వాల్లింటికి బొందల గడ్డ మీదికెంచి పోతుంటె ఆనందన్న జూసి అమ్మకి చెప్పిండు. అటు దిక్కు పోవద్దని మా అమ్మ ఒట్టేసింది. ఒడ్లోల్ల మనెమ్మకి అటు తిరుగుతుండంగ దయ్యం బట్టిందంట. ఆనందన్నోల్ల గురువు కాడికి తోల్కబొయ్యిన్రంట” అని చెప్పిన.” అవునా” ఇగ మట్టి లద్దూలు చేసినం. అవ్వ ఉడుకుడుకు బువ్వొండి చింతకాయతొక్కు, సల్ల పోసి పెట్టింది. ఫెద్దోల్లు చూడకుంట మట్టి లడ్డులు తిన్నము. పోయిన నెల గొల్ల మల్లమ్మత్త బిడ్డ లలితక్క పెండ్లిల యేమేం చూసినమో అవన్ని చేసినం. అక్క మస్త్ మురిసింది. ఆమెకు చదువుకున్న పిల్లలంటే మస్త్ ఇష్టం. అండి గాన్ని 10 పాస్ చెయిపియ్యాలె అంటంది. సదువు మంచిగొస్తదని అండాలని పేరు పెట్టుకుందంట. అరునకి కాంపు చేసిన డాక్టరమ్మ పేరు పెట్టిందంట ఆమె లెక్క మంచిగ సద్వాలని. మంచిగ సద్వాలె బిడ్డా పెద్ద సారు బిడ్డ లెక్క అంటంది. అండాలోల్లకొక తమ్ముడు పుట్టిండు. టాం సవ్యెర్ లెక్క చింతపందు గొల్కలు, బిస్కట్ పుడీలకెంచి బిస్కట్లు, షివ్లింగాలు, పాన్ బీడాలు అన్ని అదుగుతుండె తమ్ముని తోని ఆడుకోనీకి. ఇంకొక కాంపుల ఆండాలోలమ్మకి ఆడవిల్ల పుట్టి, అక్క సచ్చిపోయింది. ఇగ ఆటపాటలు బంద్ జేసినం. ఇస్కూలుకు పోతున్నప్పుడు అండాలు కానొచ్చింది. “అండీ ఇస్కూలుకి రావానే” అన్న. “రానే అవ్వకు చాతనైతల్లేదు ఈ దయ్యాన్ని చూడనీకి ఇంట్లుండమన్నడు నాయిన” అని చిన్న పాపని కాల్లతోని తన్నుకుంట అన్నది అండాలు. “పేరేందే” అనుకుంట ఎత్తుకున్న.. “దాన్నెత్తుకోకు అది దయ్యం “అన్నది అండాలు. అవ్వొచ్చింది. “అవ్వా ఇగ ఇప్పుడెట్ల అండాలు ఇస్కూల్కి రాదా “అన్న. “అది జెర్ర సమజ్ జేస్కోని చెప్పిన మాటింటె ఇస్కూల్కి పోవచ్చు ఈ పిల్లకి దయ్యం పట్టింది ఎంత జెప్పిన ఇంటల్లేదు.. నువ్వైన జెర చెప్పు బిడ్డా ఇంటదేమొ” అన్నది అవ్వ . నాకేం సమజ్గాలే . “ఇస్కూలిడిసి ఇంట్ల ఎన్నిదిన్నాలుంటరు బిడ్డా, నాకేమొ చాతగాక పాయే. ఊర్లె ఒక పిల్లను మామకు మాట్లాడి వొచ్చినం. ఇటుదిక్కు రోజుల పిల్ల , అటుదిక్కు అంజి గాడు, ఇంకో దిక్కు ఆడ పిల్లలు. మామకు డూటి . పిల్లలకు ఆసరైతదని మామ ఒప్పుకుండు. ఇంత ఒండి, పిల్లలని చూసుకుంటె, నేను నిమ్మలంగ తాత తానికి పోత. ఆ ముసలోడు ఆ ఊరిడ్సవెట్టి రాదు. ఇట్లైతె నేనేంగావాలె బిడ్డా “అన్నది అవ్వ. “మంచిగనే చెప్తుందిగదనే అవ్వ, నువ్వు ఇస్కూల్కి రావచ్చు.. అవ్వ చెప్పింది ఇను” అనుకుంట చూసిన.” ఎ చీ.. అమ్మ పోతె ఇంకో అమ్మ ఒస్తదానే , నాకిష్టం లే ఒక దినం ఈ దయ్యం దాన్ని కొంచవొయ్యి బాయిల పడేస్త “అన్నది అండాలు . “చూసినావ్ బిడ్డ ఎట్ల మాట్లాడుతుందో! దేవునింట్ల పీనుగెల్ల ఆడు అమ్మని కొంచవొయ్యిండు ఏదో చేసి ఇంకో అమ్మని తెచ్చుకోవాలే” కండ్లు తూడ్సుకున్నది అవ్వ. అండాలు ఇస్కూలుకొస్తల్లేదు. మల్ల ఊరికి పొయ్యిన్రు. నెలయినంక తలుపు తీసుందని సూడబోయిన. ఎవలో కొత్తామె ఉంది.”ఎవులమ్మా” అన్నది.”అండాలు లేదా” అన్న. “అండాలూ ఎవలో ఒచ్చిన్రు బిడ్డా “అన్నది ఆమె. అండాలొచ్చింది. చీర కట్టింది. కొత్తగ్గొడుతుంది. “ఈమె నా దోస్తు “అన్నది అండాలు. ప్రభనెత్తుకోని అండాలు దిక్కు చూసిన. అండాలు మాట్లాడుతల్లేదు. “ఏందే మాట్లాడుతల్లేవు చీరగట్టినవేంది ఇస్కూల్కి రావా ఇగ” అన్న. “మీ దోస్తుకు పెండ్లయ్యిందమ్మా. రెండు రోజులల్ల అత్తగారింటికి తోలిస్తం. ఈ రెండ్రోజులు జెర అట్కాయించిపో” అన్నదామె. నేను అండాలు మొకం చూసిన. “అమ్మ పోయిన యాడాది లోపు పెండ్లి చేస్తె మంచిదంటనె” అండాలు అన్నది మెల్లగ. “పిలగాని తమ్ముడున్నడు. 9వది చదువుతుండు. అన్నుకి మంచిగుంటదని మాట ముచ్చట అయ్యింది. వొచ్చే యాడాది చెయ్యమంటున్రు ” అన్నది కొత్తామె. “అండాలోల్ల అమ్మ వొయసున్న మా అక్కకు మొన్న పెండ్లి చేసిన్రు. అన్నుకు అప్పుడే పెండ్లా” అన్న నేను పరెషాన్ అవుకుంట. “మిమ్ములను మీ నాయన చదివిపిస్తడు. మా నాయన అట్ల కాదు గద “అన్నది అండాలు. అన్ను పెండ్లికి పిలిచిన్రు. అండాలుని అన్నుని చూస్తుంటె బొమ్మల లెక్కనే ఉన్నరు. అన్ను పెండ్లి చూస్తె బొమ్మల పెండ్లి లెక్కనె ఉన్నది. మా నాయినకు వొరంగల్లుకు బదిలీ అయ్యింది. మల్ల ఇగ అండాలోల్ల ముచ్చట్లెవ్వి తెల్వలే. ఆడ 9 ఏండ్లుండి నా డిగ్రీ అయినంక మా ఊరొచ్చినం. మంచి కొలువే దొరికింది. అండాలోల్లింటికి పొయ్యిన.. మామొచ్చిండు “బాగున్నరామ్మా” అనుకుంట. “బాగున్నం మామా మీరెట్లున్నరు” అన్న. “మంచిగనె ఉన్నం, కొలువు చేస్తున్నవంట” అన్నడు. అవునన్న. ప్రభ ను చూసి,” అక్కను చూసినవా ఎంత మంచిగ సదివిందొ, కొలువు చేస్తుంది చూడు మస్త్ పైసలొస్తున్నయి” నవ్వుకుంట అన్నడు. “నేను భీ సదువుత నాయినా “అన్నది ప్రభ.” అవును మామ ప్రభని సదివిపియ్యాలె “అన్న . “నాకు సదివిపియ్యాలని ఉంటది బిడ్డా, కానీ ఏంజెయ్యాలె అంజిగాన్ని ఇస్కూల్కే మస్త్ పైసలైతున్నై, ఇగ ఈమె మీద పెడ్తె పెండ్లికెట్ల. పిల్లని అడగొచ్చిన్రు. మాట ముచ్చటకి పోవాలె రేపో మాపో “అన్నడు. “మామా అప్పుడే పొల్లకు పెండ్లేంది. ఇంక 10 ఏండ్లన్న లెవ్వు ” అన్న. “అండి గానికి , అన్నుకు చెయ్యలేదార ,అట్లనే “అన్నడు. “అవ్వు గానీ గీ 10 ఏండ్లల్ల ఎంత మారింది. ఈ ఊళ్ళె అందరు పిల్లలని సదివిపిస్తున్రు. నువ్వొక్కనివే” అన్న. “ఆడవిల్లలకు సదువెందుకు బిడ్డా” అన్నడు మామ. “అగో! ఇప్పటిదాంక నన్ను మీదికెత్తినవ్, ఇప్పుడు గిట్లంటున్నవ్ “అన్న. “మీది వేరేరా.. ఆడవిల్లలు ఎంత సదువుకుంటె అంతకన్న ఎక్కువ సదువుకున్నోన్ని తేవాలె..ఏడికెంచి తెద్దం, మా దాంట్ల పోరగాండ్లు అంత సద్వరు ,అవన్ని ఒద్దుతియ్ “అన్నడు. “మామ, ఇప్పుడు మీ కులపు పిలగాల్లు మంచిగనె సదువుతున్రు. దొరుకుతరు తియ్, అప్పటికి సూద్దారి “అన్న. “నా తోని కాదు బిడ్డా ,మస్త్ పైసలైతై . సూస్తల్లెవ్వా గీ పదేండ్ల సంది పురుల్లు ,పున్యాలు, పిల్లలు ,జెల్లలు మస్త్ కష్టమైతుంది బిడ్డా.. ఇల్లమ్మి ప్రభకు పెండ్లి చేసేస్తె ఇద్దరం ఇగ ఏడ్నో ఓ తాన క్రిష్నా రామా అనుకుంటం “అన్నడు. “ఫైసల్ కాకుంటె సదివిపిస్తవా “అన్న.” ఏంది నువ్వెత్తుకుంటవా..మీ నాయిన నిన్ను నన్ను కలిపి ఉతుకుతడు” అన్నడు. “నాయినేమంటడు మామా మీ కంటె ఎక్కువనా గానీ ,ఇప్పుడొక ఇస్కూలు పెట్టిన్రు సర్కరోల్లు. మంచిగ చదివే పిల్లలకు 12 దాంక ఉత్తగనే చెప్తరు. తిండి, బట్టలు, పుస్తకాలు అన్ని వాల్లవె. కాని పరీక్ష రాయాలె. అంద్ల పాస్ అయితెనె ఇస్కూల్ల జైన్ చేస్కుంటరు” అని చెప్పిన.” ఏయ్ పోనితియ్ బిడ్డా ఏడేడికి పంపుతరొ ఆడవిల్లలని ఎప్పుడు అట్ల ఇడ్వలే, ఒక్కతి ఎట్లుంటది” అన్నడు. “అయ్యో మామా ఏడ్కి పోవొద్దు లింగం పల్లి కాడ ఈడనే ఉంది. ఒక్కతి కాదు మా సిరిని తోలిద్దామనుకుంటున్నం. ఇద్దరుంటరు ముద్దుగ వారంకొక్క పారి పొయ్యి చూసి రావచ్చు. శెలవులల్ల పిల్లలు ఇంటికొస్తరు” అన్న. “అవునంట మా పెద్ద సారోల్ల పిలగాన్ని తోలిచ్చిన్రంట మంచిగనే ఉన్నదంట గానీ ఏమో బిడ్డ నాకు సమజ్ అయితల్లె “అన్నడు. “మామా, ఇప్పుడేం కాదు గదనె పరీక్ష పాస్ అయినప్పటి ముచ్చట. ఇది నవంబరు గద, పరీక్ష ఫిబ్రవరి రెండొ వారం ఉంటది. మే ల చెప్తరంట పాస్ అయిన్రా లేదా అని. జూన్ కి పొవ్వాలె ఇస్కూల్ల జైన్ కానీకి . డాక్టరు లెక్క సదువుతదని అన్నుకు అక్క డాక్టరమ్మ పేరు పెట్టలేదా.. పరీక్ష అయితె రాయనియ్యి రాదు చూద్దారి” అన్న. “సరె తియ్.. దాంట్లేం పొయ్యేడిది లేదు గద “అన్నడు. అప్పటికెంచి దినాం సిరి తోని ప్రభని కూసోబెట్టి పరీక్షకి చద్విపిస్తున్న. ఫరీక్ష రాసిన్రు ఇద్దరు. ఇద్దరు మంచిగనే రాసినమన్నరు. సూడాలె ఇద్దరికొస్తే మంచిది. ఫ్రభని ఎట్లన్న చదువుకోనియ్యాలె అనుకుని దేవునికి మొక్కిన. పెద్ద పరీక్షలు అయినయ్. “అక్కా మీరు బొమ్మల పెండ్లి మంచిగ చేస్తున్రంట కద అవ్వ చెప్పింది ,మల్ల చేసిన్రా ” అని అడిగింది ప్రభ. “లేదు చెల్లె, నువ్వు పుట్టక ముందు రోజు చేసిందే మల్ల చెయ్యలే, మనసిరిగింది చెల్లె ఇగ చెయ్యబుద్ది కాలే, మీ అక్కల పెండ్లుల్లు చూసినంక ఇగ బొమ్మలెందుకనిపిచ్చింది ” అన్న. మే నెలొస్తుంది. ఇగ రెండు రోజులల్ల నవోదయ రిసల్ట్స్ వొస్తయి. పాసయితె గిన 15 దినాలల్ల పొయ్యేది లేనిది చెప్పాల్నంట. ఒక దినం ఆఫీసుకెంచి ఒస్తున్నప్పుడు అమ్మ, నాయిన ఎదురయిన్రు. “ఏడికే అమ్మ చీకటైనంక పోతున్రు” అన్న. నర్సింలు మామ పోయిండని చెప్పిన్రు. “పాపం జెర సుస్తుందని పనికి పోలేదంట. 11 గంటలకింత తిని పండుకున్నోడు ఇగ లెవ్వలేదంట. రేపు బొయ్యి అండాలుని, అన్నుని మందలించి రా బిడ్డా “అన్నది అమ్మ. “నాకు పోబుద్ది అయితలేదమ్మా మనసు బాదయితుంద”న్న. “మంచిగుంటాది బిడ్డా పోకుంటె పొయిరా పో “అన్నది అమ్మ. పొయ్యొచ్చిన. పెద్దోల్లందరు మాట్లాడుతున్రు. అక్కను ఊరికి తోల్కపోతరంట. ప్రభకు చూసిన పిలగానోల్లు వొచ్చిన్రంట.. అంజి గానికి చదువెట్ల అని అనుకుంటున్రు. బోడింగు స్కూల్ల ఎయ్యచ్చనుకుంటున్రు. అన్ను, అండాలు మస్తు ఏడుస్తున్నరు. అన్ను చెక్కరొచ్చి పడ్డది. పిల్లలు దాని మీద పడి ఏడుస్తున్నరు. ఎవ్వలు తీస్కున్న ఒస్తల్లేరు. అన్ను బల్మీకి లేచి, పిల్లగాడ్నెత్తుకోని, పిల్లను దగ్గర కూసుండవెట్టుకుంది. అండాలు మొకం 50 ఏండ్ల దానిలెక్క ఉంది. బుచ్చెడ , పెద్ద బొట్టు, పెద్దోల్లు కట్టుకునేటి చీర. 20 తులాల కడియాలు, 20 తులాల పట్టగొలుసులు, 10 తులాల మట్టెలు దాని కాల్లు మొయ్యలేక పోతున్నయి. ఇంట్ల 10 మంది ఉంటరంట ఇది ఒండకుంటె ఒక్క రోజెల్లదంట. అందరు మొగ పిల్లలేనంట ఇది పెద్ద కోడలంట. పనోల్లు దొరకరంట. బర్రెలున్నయంట. అత్తకు బాలేని కాడికెంచి అన్ని పనులు ఇదొక్కతే చేస్తదంట. ఇంటుంటెనే కడుపుల తిప్పుతుంది. ఎట్ల చేస్తుందో అంత పని. నేను ఎవ్వలని మందలియ్యలె. జెర్రంత సేపు కూకోని బయటికొచ్చిన. నవోదయ పరీక్షల సిరి , ప్రభ పాస్ అయ్యిన్రు. ఎట్ల చెప్పాల్నో తెలుస్తల్లేదు. ఐదొద్దులు అయినంక మాపటికి టీచరమ్మని తోల్కపొయ్యిన .. “ప్రభకి పిలగాడిని చూస్తున్నం” అన్నది . “అదింక చిన్న బొమ్మ లాగుంది. దానికి పెండ్లేంది ” అన్నది టీచరమ్మ. “మరి దాన్ని చూసేటోల్లెవలు బిడ్డా తల్లి ,తండ్రి లేని బిడ్డ “అన్నది అవ్వ. “తల్లున్నది గదా.. ఎందుకు లేదు “అన్న నేను. “తల్లుంటే ఏమైతది బిడ్డా చదివిపిస్తదా..తండ్రి ఉన్నట్లైతదా” అన్నది అవ్వ. “తండ్రి ఉండంగ అండాలు, అన్ను ఏంచదివిన్రు” అన్నది టీచరమ్మ. “మీ కులపోల్ల లెక్క మా కులపోల్లు సదువుకుంటారు బిడ్డ.. ఏదో ఇంత బువ్వ ఒండి పిల్లలను చూసుకుంటె అదే ఎక్కువ, సూడు అండాలోల్ల అత్తకు బాగలేదంటె పదొద్దులు కాంగనె పొయ్యింది. ఆడ పిల్లలకు అదే ఉండాలె బిడ్డా.. అత్త , మామ, పిల్లలు” అన్నది అవ్వ. “అవ్వా దానికి 20 ఏండ్లయిన ఉన్నయా అంత బరువు మోస్తుంది , అన్నును చూడు పానాలు కండ్లల్లకొచ్చినయ్. దానికి నిల్వ చాతనయితల్లేదు కూసున చాతనయితల్లేదు. ఆస్పతాల్ల చూపిచ్చిన్రా” అన్నది టీచరమ్మ. “ఇగ పిల్లలతోని ఎట్లుంటరు బిడ్డా.. అదే మంచిగయితది తియ్యి” అన్నది అవ్వ. “అక్కనెవలు తోల్కపోతరు” అన్న నేను. “ఆ పొల్ల సుట్టాలేవలో ఉన్నరంట. ఆడ్నే ఉంటది ,దిక్కు మొక్కు ఎవలున్నరు దానికి “అన్నది అవ్వ. ” అన్న పించను ఒస్తది కదా.. ఈడ ఇల్లుండంగ అక్క సుట్టాల కాడికి పొవ్వుడెందుకు.. అంజి గాన్ని చదివించుకుంటె కాదా బోడింగు స్కూలుకెందుకు పోవాలె పిలగాడు ” అన్నది టీచరమ్మ. “ప్రభ పరీక్ష పాస్ అయ్యింది నవోదయ ఇస్కూల్కి పొవ్వచ్చు” అని చెప్పిన . ప్రభ కండ్లు మెరుస్తున్నై . అక్క నన్ను చూసింది. “అక్కా నువ్వుండగనె మామ ఒప్పుకుండు గద ప్రభను తోలియ్యనీకి” అన్న. ఎవ్వలేమి పట్టిచుకుంటలేరు. నేను చిన్నపిల్లనని తీసి పారేసిన్రు . మల్లొక్క పారి చెప్దారని చూసిన. ” ఓ పొల్ల ఏంది సదువు సదువు అని పట్టినవ్. దాని నాయిన పొయినంక ఇగ సదువేంది. పెండ్లి చేస్తె మగడు , అత్త, మామ చూస్తరు. ఈడెవలున్నరు” అన్నడొక పెద్దాయిన. ” ఎవ్వరు అవుసరం లేదు, సర్కారోల్లు చూస్తర”న్నది టీచరమ్మ.”సర్కారోల్లు చూసేదేంది ఆడువిల్లలని ఏడికి పంపేది లేదు. ఇటు తల్లిగారిల్లు అటు అత్త గారిల్లు సమజ్ అయ్యిందా”గట్టిగ అన్నడు. గమ్మున ఊకున్న గానీ ఎట్ల చెయ్యాలని మస్తు పరేషాన్ అయిన. అయ్యో దేవుడా, మాముంటె చెప్పి సంఝాయిస్తుంటి ఇప్పుడెట్ల అనుకున్న.. టీచరమ్మ చెప్పినంత చెప్పింది. ఈ ఊరోల్లైతె టీచరమ్మ మాట ఇంటరు. ఈడ అక్కనిడ్సవెడితె అందరు ఇంకో తాన్నుంచొచ్చినోల్లె. టీచరమ్మ మాట లెక్క చెయ్యలే. రాత్రంత నాకు నిద్ర రాలే. భగ్గ ఏడుపొచ్చింది. ఎంకన్నకు మొక్కుకుంట నిద్రలకి జారిన. కలల పంచాయతాఫీసుల పెద్ద సారు కానొచ్చిండు. ఉలికిపడి నిద్ర లేచిన. పొదుగాల 7 దాటింది. ఆయనెందుకొచ్చిండొ నా కలలకి అనుకున్న .మేము చిన్నగున్నప్పుడు ఆయన మమ్ములను మస్త్ బయపిస్తుండె. ఆ మీసాలు చూడంగనె బుగులయితుండె. ఎప్పుడు మేము ఆయనకెదురు పోకపోదుము.. “పెయ్యి ఉడుకుందని లేపలె బిడ్డా ,ఇంక జెర పండుకుంటవేమొ” అన్నది అమ్మ. “లేదమ్మా పనుంది” అని లేచిన. ఆఫీసుకి రానని స్రవంతి తోని చెప్పంపిన. తయారయ్యి పంచాయతాఫీసు కాడికి పొయ్యినరామయ్యొచ్చి సారు రమ్మంటుండని చెప్పిండు. బుగులయింతాంది గాని పని గావాలని తెగింపుతోని పొయ్యిన. నా గుండె కొట్టుకునుడు నాకే ఇనిపిస్తుంది. సారు రెండు మాటలు మాట్లాడంగనె భయమెగిరిపొయ్యింది. ఈన మంచోడే. “ఇంత ప్రయత్నం చేస్తున్నవు చూడు అది నాకు నచ్చింది.. ఆఫీసు కాంగనె నిర్సింలు ఇంటికాడికొస్త , ఆడుండుపొమ్మ”న్నడు. సగం పని అయినట్లే అనుకుంట ఇంటికి పొయ్యి, పొద్మీకి మల్ల అండాలొల్లింటి తాన నిలవడ్డ. లోపటికి పోలె. సారొచ్చిండని రామయ్య చెప్పొచ్చిండు. ఆందరు బయటకొచ్చి తోల్కపొయ్యిన్రు. గోడ పొంటి కుర్సీలేసి కూసోమన్నరు. చాయి చెయ్యుమని ఆడోల్లకి చెప్పొచ్చిన్రు. నేను బయట గోడ పక్కపొంటి నిలవడ్డ. సారెందుకొచ్చిండో అని చూస్తున్నరు. సారెంబడి నలుగురైదుగురొచ్చిన్రు. ఫొలీసు పటేలుని ఎంట తెచ్చిండు సారు ఎందుకో. “నర్సింలు పించను గురించి మాట్లాడదామని ఒచ్చిన. పెద్దోల్లు రండ్రి” అన్నడు. ఇద్దరు మొగోల్లు అక్క చుట్టాలు గావొచ్చు వచ్చిన్రు. “నర్సింలు దిక్కోల్లు ఎవ్వలు లేరా “అన్నడు సారు. ఒక పెద్దమనిషొచ్చిండు.. జగ్మోహనంట ఆయన పేరు. “ఫించను పెండ్లాం పేరుకే పోతది. ఇగ మిలిగిన పైసలొస్తయ్ అవేంచెయ్యాల్నో చెప్పున్రి ” అన్నడు సారు. “పిల్ల పెండ్లికున్నది గద సారూ దాని పెండ్లి మందమొస్తయా “అన్నడు జగ్మొహన్. “పిలగాన్నేం చేస్తరు “అన్నడు సారు. ” పిలగానికేం కావాలె పైసలొస్తె పిల్ల పెండ్లి చేసేస్తం “అన్నడు జగ్మోహన్. “ఏంది పిల్లను చదివిపియ్యర” అన్నడు సారు. “లేదు సారు ఇప్పుడందరమున్నము . ఇది అయినంక ముందుకి ఎవలకెవలో అందరున్నప్పుడైతె మంచిగుంటది “అన్నడు జగ్మోహన్. “ఇప్పుడేం ముంచుకొచ్చింది పిల్ల పెండ్లికి “అన్నడు సారు. “గదేంది దొరా ఎవ్వులైన ఆడువిల్లలనుంచుకుంటరా “అన్నడు జగ్మోహన్. ” నేను మా ఆఫీసుల మాట్లాడిన. అందరు ఒక్కటే అంటున్నరు. పైసల్ ఒక తాన పిల్ల పేరుమీదెస్తె, ఇటు సదువు కాంగనె పెండ్లికొస్తయ్.. ఏమంటరు” అన్నడు. ఎవ్వలేం మాట్లాడలె,. సారు చెప్పంపిండేమొ టీచరమ్మొచ్చింది.” ఏమ్మా నవోదయ పరీక్షలేమైనయ్ “అన్నడు సారు. “ఆరుగురికొచ్చింది సారూ మన ఇస్కూల్లకెంచి. మస్తు పేరొచ్చింది మన ఇస్కూల్కి “అన్నదామె. “మల్ల పిల్లలేమంటున్రు పోతరంటనా” అన్నడు. “ఐదుగురు పోతరంట , ఇగో నర్సింలు బిడ్డదే తెలుస్తల్లేదు. ఏంత మంది జైన్ అయితరో లీస్టు రేపటికి పంపుమన్నరు” అన్నది. “సూడున్రి, పొల్ల ముద్దుగ పాస్ అయింది. మీకేంది కష్టం సర్కారోల్లు ఇస్తమంటుంటే “అన్నడు సారు. “పైసలయిపోతయ్ పెండ్లికి మిల్గవు “అన్నడు జగ్మోహన్.” ఫైసలు నర్సింలు పెండ్లాము, ముగ్గురు బిడ్డలు, కొడుకు పేరు మీద 10 ఏండ్లకేద్దాం . మిత్తి కలుపుకుంట మూడింతలయితది. 10 ఏండ్లైనాంక అసలు ఎవరిది వాల్లు తీస్కోన్రి. మిత్తి మందం పిల్ల పెండ్లికియ్యున్రి , ఇంటి కిరాయిలల్ల తల్లి కొడుకులు బతుకుతరు” అన్నడు సారు. “ఇదంత ఆగామాగముంది, పెండ్లి చేద్దారి “అనుకుంట వొచ్చిండు తాత. “ఆవ్ మాకు గుడంగ గదే మంచిగ్గొడుతుంది “అన్నరు అందరు. ముందుకయితుంది ఎన్క కయితుంది. ఎటూ తెగుతల్లేదు. “మీ ఇష్టమయ్య నేను చెప్పినంత చెప్పిన ఇగ మీరు ఆలోచిచ్చుకోన్రి “అనుకుంట సారు లేచిండు. “పైసల కి ఎవలు రావాలె సారు , పిల్లలందరు ఉండాల్నా “అన్నడొకాయన.” ఆ ఉండాలె గద మల్ల అందరున్నప్పుడు చెప్పిపంపున్రి. కాగిదాలు చేపిద్దం” అన్నడు సారు. ఇగ మాటలన్ని పైసల మీదకు పొయ్యినయ్.. సారు కదిలిండు. ఏమయ్యిందో ఒకాయన గట్టిగ మాట్లాడవట్టిండు, ఇంకిద్దరు ఎగబడి మాట్లాడుతున్నరు. సారు కంపవుండు బయటికొచ్చిండు .ఇంతల పోలీసు మామ అందుకున్నడు. “అరే ఇక్కడున్నోల్లకొక్కల్లకైన తెల్వి ఉన్నాదయ్య. అంత పెద్ద సారు చెప్తుండు ఇనాలని తెల్వదా.. ఆయన తల్చుకుంటె పైసా రానియ్యకుంట జేస్తడు. ఏడ్చుకుంటరు మల్ల అన్నడు” అందరు ఖామూష్ అయ్యిన్రు. “ఇంకొక మాట ఇనున్రి. మీకు తెలుసు కావొచ్చు. ఆడవిల్లకు 18 రాకుంట పెండ్లి చేసుడు తప్పు. ఈడ నేనున్ననని మరిచి మాట్లాడుతున్నరు. అందరినీ బొక్కల ఏస్తా..ఏంది 10 ఏండ్ల పిల్లకి పెండ్లేంది “అన్నడు . నేను నవ్వుకున్న. అటు తిప్పి ఇటు తిప్పి ఆలోచన చేసిన గానీ పోలీసు మామ యాదికే రాలేదు. పోలీసులకి బయపడనోడుంటడా.. అవ్వ ఉర్కొచ్చి ” నీ బాంచను బిడ్డా నువ్వెట్లంటె అట్లనే అన్నది” అందరికి బుగులయ్యినట్టుంది. “మాకు తెల్వక మాటలయ్యా పిల్లను చదివిపిద్దాం గదే మంచిది”అన్నరు . “అమ్మా ఇగ నీ చెల్లె చదువు నీ బాధ్యత.. సల్లగుండు బిడ్డా. ఇగ పోతున్న” అన్నడు పెద్ద సారు. పదమూడో దినం కాంగనె మూడాలున్నయంట గవి రాకుంట అక్కను తోల్కపోనీకి తయారయ్యిన్రు. అంజి గాడు ఇప్పటికి అండాలోల్ల తానికి పోతడంట. పెద్ద సారు ఆస్టలు మాట్లాడి పిలిపిస్త అన్నడు. “ప్రభ మాతోనొస్తది” అన్నది అక్క. ఊరికి పొయ్యినంక పెండ్లి చెయ్యరని నమ్మకం లేదు. “ఒద్దక్క ఈడ ఇస్కూల్ల కాగిదాలు గిట్ల తీస్కోవాలె, ఫోట్వలు తీపియ్యాలె ,ఇగ వారమే ఉన్నది గద, ప్రభ మా తానుంటది తియ్యి. సిరి గూడ ఉన్నది గదా “అన్న. పాపం పోలీసు మామ రోజు ఒచ్చి పోతున్నడు ఎవలన్న మనసు మార్చుకుంటరేమో అని. ప్రభని తోల్కపోతా “మామకు మొక్కు చెల్లె “అన్న. ప్రభ మొక్కింది. మామ “సల్లగుండు బిడ్డా.. మంచిగ సదవాలే ,ఏంది” అన్నడు. ప్రభ బట్టల సంచి తీస్కోని నా చెయ్యి పట్టుకుంది. జూన్ 1 కి నవోదయకి ఇద్దరిని తోలిచ్చొచ్చినము. అమ్మా సాల్సాలయ్యింది అనుకుంటుండంగ అన్ను కి బాలేదని తెలిసింది. పురాగ పానం మీదికొచ్చిందంట. ఇద్దరు పిల్లలు ఆగమైతున్నరని అన్ను మొగనికి పిల్లనెవలనైన చూస్తున్నరంట. ప్రభ అయితె ఇంట్ల పిల్ల, పిల్లలను మంచిగ చూసుకుంటదని అనుకుంటున్రంట. నాకు డగ్గుమన్నది. అయ్యొ దేవుడా మల్ల మొదటికొచ్చిందనుకున్న. ఈ పిల్లకు పాపము దినామొక గండమొస్తదేందో అనుకున్నము. ఇస్కూల్ కి పొయ్యి తోలియ్యమని అడిగిన్రంట. నేను ఫారం నింపుతున్నప్పుడు గార్డియన్ అని ఉన్న కాడ నాయిన పేరు కాకుంట పోలీసు మామ పేరు రాసి సంతకం పెట్టిపిచ్చిన. ఇస్కూలోల్లు గార్డియను చెప్తే తోలిస్తము ఆయనను రమ్మన్నరంట. ఇగ ఎవ్వలు మల్ల ఇస్కూల్ తానికి పోలే. దసరా సెలవులకి సిరిని ప్రభని తోల్కొచ్చిన.. సుట్టుముట్టు పిల్లలు ఆడనీకొచ్చిన్రు. “అక్కా ఒకటడగాల్నా “అన్నది ప్రభ. “చదువు మానేస్తా అని కాకుంట ఇంకేమన్న అడుగు” అన్న.”బొమ్మల పెండ్లి చేద్దామా , అవ్వ చెప్తుంటె ఎంత బాగుంటదొ మీరు చేసిన బొమ్మల పెండ్లి” అన్నది. “మంచిది చేద్దాము గానీ మన బొమ్మలు అవ్వ చేసిన బట్ట బొమ్మలో ,మట్టి బొమ్మలో కావు. గట్టి బొమ్మలు . చదువుకోని కొలువు చేస్తున్న బొమ్మలు. కొలువొచ్చినంక మంచిగ చదువుకున్నోల్లని చూసి పెండ్లి చేసుకుంటయ్” అన్నా. అందరు నవ్విన్రు. ” అక్కా బొమ్మలు కొత్తవైతె మానె, పెండ్లయితె మీరు చేసిన అట్లనే చేస్తం గదా “అన్నది ప్రభ. నేను నవ్వుకుంట.. ” ఏడికెంచి షురూ చేద్దాం? చిట్టి చిట్టి మిరియాలు కాడికెంచా” అన్న. “కాదు కాదు మట్టి లడ్డూల కాడికెంచి “అన్నది సిరి. అమ్మ పిల్లలొచ్చిన్రని లడ్డూలు మురుకులు చేసింది. నాయిన కట్నాలప్పుడు అందరికి నోటు పుస్తకాలు , పెన్నులు ఇచ్చిండు పిల్లందరు ఆటలు పాటలు. ప్రభ సదువు పురాగ సాగుతదని చెప్పనీకి అయితల్లేదు గానీ ఎందుకో చాన దినాలకి మనసుల ఏడనో మంచిగ్గొడుటుంది. ప్రభ మొఖం ల అక్క నవ్వు కానొచ్చింది..ఈ దినం అక్క ఏడున్నా మురుస్తది ..బొమ్మల పెండ్లి చేసినందుకు కాదు ఒక బొమ్మ పెండ్లి ఆపినందుకు……….

పాలు -పంచ్

Thursday, May 26, 2011


మొన్న ఇండియన్ స్టోర్ లొ, మిల్కు మెయిడు కనిపించింది.. అ డబ్బా నన్ను టైం మిషన్ లో కొంచెం వెనక్కి తీసుకెళ్ళింది..... మీరూ నా వెంట రండి..మళ్ళీ జాగర్తగా ఇక్కడికి తీసుకొచ్చి దింపే పూచీ నాది.
మా చెల్లి పుట్టినప్పుడు యేదో పెద్ద యెత్తున ఉద్యమం జరుగుతోంది .ఊళ్ళో చాలా వస్తువులతో పాటు పాలు కూడా దొరికేవి కావుట. అలా మొదలయింది పాల-పంచ్..నాన్న గొల్లభామ మార్కు పాల డబ్బాలు తెచ్చేవారుట..నాకప్పుడు రెండవ ఏడు. విషయాలన్నీ తెలియవు గానీ..ఆ గొల్లభామ మార్కు పాల డబ్బా పైనున్న ప్లాస్టిక్ మూత తీసాక ఒక పలుచటి సిల్వర్ ఫాయిల్ కొంచెంగా తెరచి అమ్మ మొదట నా చిన్ని అర చేతిలో కొన్ని చుక్కల కండెన్స్డ్ పాలు వేసేది..ఆ వాసన , ఆ రుచినాకు అమృతం తో సమానం.
 
మా ఇంటి పక్కనే గొల్ల మల్లమ్మ గారింట్లో  చాలా పాడి..కానీ వాళ్ళింటి పాలన్నీ వాళ్ళ మిఠాయి దుకాణానికి వెళ్ళిపోతాయి..దాంతో మూల మలుపుకి అవతల ఉన్న మల్లా రెడ్డి గారి బావి మీద   రాం రెడ్డి తాత దగ్గర పాలు రాతం పెట్టించుకుంది అమ్మ. మల్లా రెడ్డి గారు మా రామ్‌రెడ్డి తాత కి అన్న కొడుకు...ఇద్దరూ   పక్క పక్కనే పాలు పోస్తారు..ఎవరి ఖాతాలు వాళ్ళవి.  ఎవరికీ వారు అన్ని గేదెల పాలు (+నీళ్ళు)  కలిపి అందరికీ పోస్తారు. నాన్నతెల్లవారి 5 కల్లా అక్కడుండి..భక్తి రంజని మొదలయ్యే సమయానికి ఇంటికి వచ్చేవారు.
సాయంత్రం అన్నయ్యలలో ఎవరికి కుదిరితే వాళ్ళు అక్కడికెళ్ళి పాలు తేవాలి..'అన్నా నేను వస్తా' అని వెంట పడి వెళ్ళడం..అక్కడ పాలు తీసే దాకా మల్లా రెడ్డి గారి  చిన్న తువ్వాయితో ఆడు కోవడం, సాయంసంధ్యలో పెద్ద పెద్ద కుండల్లో తీసి ఉంచిన పాలల్లో అమ్మ చెప్పిన వినాయక చవితి కథలో లా చంద్రుడు కనిపిస్తాడేమో, అని వెతికి వెతికి చూడ్డం..అన్న సైకిలు తొక్కుతున్నప్పుడు పాల చెంబు పట్టుకోవడం, కొండొక చోట  (అంటే కొండ దగ్గర టర్నింగులో ) బ్యాలన్సు తప్పి సగం   పాలు పారపోయడం ..ఆ రోజుకి  ఇంట్లో పాల-పంచ్.అమ్మ యేమీ అనదు. అన్నయ్య తిడుతుంటే, పోనీలే ఒలికి పోయిన వాటి కోసం బాధ పడి ఏం లాభం, రేపటి నుంచీ నడిచి వెళ్ళండి అనేది..ఏదో ఒక్క సారి అనుకునేరు...ఇది షరా మమూలు లాంటిదన్నమాట.

 కొన్ని రోజులకి, రామ్‌రెడ్డి తాత పాడిని అమ్మేస్తున్నా అని ప్రకటించేసాడు..మల్రెడ్డి గారివన్నీ  ధనికుల ఖాతాలు...రామ్‌రెడ్డి తాత- పేదల పాల దాత..మల్రెడ్డి గారు పెద్ద/పేద   కుటుంబాల వైపు కన్నెత్తి కూడా చూడరు..పాల వేట ప్రారంభం అయింది...డవుటన్ బజార్ నించి  ఆసామీ (అతని పేరు సామీ అటండీ అందుకని ఆ సామీ అని చెపుతున్నా...) ఇంటి దగ్గరకొచ్చి పాలు పోస్తాడని విని అందరు ఇళ్ళ వాళ్ళు కలిసి బేరం కుదుర్చుకున్నారు..కానీ చాలా ఖరీదెక్కువ..రామ్‌రెడ్డి తాత దగ్గర లీటరున్నర పాల ధరకి సామీ అర్ద లీటరు పోస్తాడట..
ఐతే  గేదె పాలు  చిక్కగా ఉంటాయి మనము నీళ్ళు కలుపుకుంటే..రామ్‌రెడ్డి తాత పోసే పాలకి సమానమవుతాయని రాజ్ కుమారక్క కన్విన్స్ చేసింది అందరినీ . అమ్మో , అర లీటరు పాలతో ఆరుగురు పెద్దవాళ్ళకి చాయిలు , ఇద్దరు పిల్లలకి పాలు (వంటివి), పెరుగు (మజ్జిగని పెరుగు అనడం నేర్పింది అమ్మ,లేకపోతే పెద్దమ్మ  పెద్దమ్మ పిల్లలకి పెరుగు వెయ్యట్లేదా అని అమ్మని కోప్పడేది..మేము ఎవ్వరడిగినా సింపుల్‌గా ..పెరుగన్నం తిన్నాం అని చెప్పేవాళ్ళం)ఎలా అని అమ్మ దిగులు పడేది.. నేను చెల్లి..మాకు చాయి కావాలి అని ఏడ్చి గగ్గోలు పెట్టి, "నేను పాలే ఇద్దమనుకున్నా కానీ వీళ్ళకి అస్సలు ఇష్టం లేదు" అని అమ్మని మాకు తెలియకుండానే  హ్యప్పీ చేసేసాం.

యీ లోపు దేవుని ఆల్వాల్ చెరువు గట్టు దగ్గర అద్దెకుంటున్న మేము...పాత ఆల్వాల్ చెరువు గట్టు దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఆ కాలనీలో రెండు మూడు ఇళ్ళు తప్ప లేవు.. అన్నలిద్దరూ  కొంచెం సంపాదించడం మొదలెట్టాక కొన్ని పాలు ఎక్కువ కొనుక్కునే స్తోమత  వచ్చింది కానీ పాలు దొరికేదెక్కడ? 
కొత్త ఇళ్ళు కట్టడం మొదలయింది. అందరినీ  మా బావిలో నీళ్ళు వాడుకోడానికి ఆహ్వానిస్తూ,  పూర్వ జన్మ సుకృతం వల్ల ఇలా జల-దానం చేసే యోగం వస్తుందని నాన్న, ఆ వచ్చిన ఇంటి ఓనర్లని నీడలో కూచోపెట్టి అన్నం, నీళ్ళు, టీలూ ఇచ్చే భాగ్యం కలిగినందుకు అమ్మా ప్రతి రోజూ లేవగానే దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకునేవారు.
 ..అంతా బానే ఉంది కానీ చల్లగా ఉన్నప్పుడు చాయిలకీ, వేడిగా ఉన్నప్పుడు మజ్జిగలకీ పాలు మళ్ళీ ఎలా? మాటల్లో  మా విమలా వాళ్ళ అమ్మ పెరుగు చేసి అమ్ముతారని తెలిసింది..(వాళ్ళకి గేదెలు, ఆవులు లేవు..మరి పాలు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు)..నేను, చెల్లీ సాయంత్రం స్కూల్ నించి వచ్చాక వెంకటా పురం చివర ఉన్న విమ్మీ వాళ్ళింటికెళ్ళి చీకటి పడే దాకా ఆడుకుని పెరుగు కొనుక్కొచ్చేవాళ్ళం..(ఇది నిజ్జం పెరుగండీ, మజ్జిగ కాదు). అప్పట్లో తెలిసేది కాదు కానీ చాలా దూరం.
కొన్ని కొత్త ఇళ్ళు కట్టడం పూర్తి అయి చిన్న కాలనీ లాగా అవుతున్నప్పుడు మా మల్లేషన్న ప్రత్యక్షం అయ్యాడు. రాత్రిళ్ళు ఇంటిదగ్గరకొచ్చి పాలు
పొయ్యడానికి ఒప్పుకున్నాడు. ...కొంచెం పాల కష్టాలు తీరుతున్నాయి. మల్లేషన్నని బతిమాలుకుంటే పొద్దున్న పూట కూడా పొయ్యడానికి ఒప్పుకున్నాడు..అయితే పెందరాళే రాడు..పొద్దున్న పదకొండు గంటలకీ, రాత్రి తొమ్మిది గంటలకీ మల్లేషన్న కోసం ఎదురు చూడాలి...ఏ గాలి వానో వచ్చి రాత్రి మల్లేషన్న రాకపోతే పొద్దున్న అందరికీ పాల-పస్తు/చాయి-పస్తు.ఈ ఒకే ఒక్కడు ఏం తెస్తే  అవే పాలు. ఎప్పుడొస్తే అదే పాలా టయిము..
చుట్టాలొచ్చినప్పుడు ..మల్లేషన్నా ఎక్కువ కావాలి అని అడిగితే, లెవ్వు చెల్లే అనేవాడు..అమ్మ లోపలి నుంచి వచ్చి అలాగైతే ఎలా మల్లేషయ్యా, నువ్వు కాదంటే మాకెవరు? అనేది..సరే సరే అని ఎక్కువ పాలు పోసి, తాగనీకి కొన్ని లీల్ దీస్కరా చెల్లే అనేవాడు..నీళ్ళు తీసుకురాగానే తాగ కుండా చెంబెడు నీళ్ళు పాల క్యాన్‌లో గుమ్మరించి నవ్వేవాడు...అమ్మ చూసి..అయ్యా, మా కంటే ముందు ఎవరైనా ఎక్కువ పాలు అడిగితే మా గతి నీళ్ళ పాలేనా అనేది...ఏంజెయ్యాలమ్మ నీ కాల్మొక్కుత అందర్ని ఖుష్ జెయ్యాలే గదా అనేవాడు..అమ్మ  ఒకొక్కసారి " ముందు కాలనీ వాళ్ళకి ఎక్కువ పాలు పోసావా రాత్రి పాలు తుర్రు నీళ్ళలాగున్నాయి "అనేది..."అమ్మమ్మా అదేం లేద్ తల్లీ, బర్రెలు జెరన్ని ఎక్కువ లీల్ తాగుతున్నయి..గర్మికి ఎక్కువ దూపయితుందో ఏమో..దవాఖానాకి తోల్కపోవాలే" అనేవాడు...అమ్మ నవ్వి..మాటలు బాగా నేర్చావు  మల్లేషా అనేది. ....మా నాన్న మరీ కామెడీ..వర్షం కురిసినప్పుడు మల్లేషన్నని లోపలికి రమ్మని 'దో చాయ్ ' అని ఆర్డర్ చేసేవారు.."అమ్మా చాయ్ మంచిగున్నది.పాలు మంచిగుంటే చాయ్ మంచిగుంటది...అయినా నీ చేతులల్ల అమ్రుతం ఉంటది తియ్" అని పాలనో అమ్మ చేతినో తెలీనీకుండా ఒక పొగుడు పొగిడి పారేసేవాడు...ఏ  మాటకా మాట చెప్పుకోవాలి. మా రామ్‌రెడ్డి తాత, మల్లేషన్న ఇద్దరూ కూడా మాకు అర గ్లాసుడు పాలు కొసరు పోసేవాళ్ళు.. 
రాత్రి పాలు పొద్దున్నకి బావుండాలంటె రెండు సార్లు కాచి, చల్ల నీళ్ళల్లో పెట్టాలి..పొద్దున్న పాలు కాచినా ఒకొక్కసారి మధ్యాహ్నానికల్లా విరిగి పోతాయి...మల్లేషా అందరి ఇళ్ళల్లో నీళ్ళు కలపకు నాయినా యెవరి బావిలోనో ఉప్పు నీళ్ళు ఉన్నాయి..పాలు విరిగిపోతున్నాయి అమ్మ గోల చేసేది..ఒక్క వారం బాగా   పోసేవాడు మళ్ళీ మామూలేఅక్క, అన్నల పెళ్ళిళ్ళకి మల్లేషన్నని బతిమాలడం తో పాటు సత్యా తాకీస్ దగ్గర బాలాజీ స్వీట్ హవుస్ వాళ్ళకి కొన్ని నెలల ముందు చెప్పుకుని, అడపా దడపా గుర్తు చెయ్యాల్సి వచ్చేది. అయినా పాలు వొచ్చేవరకు ఎక్కడ అభాసు అవుతుందో అని అమ్మ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకునేది.., మా పాల వాళ్ళని చల్లగా చూడు దేవుడా అని !.. 

మారెడుపల్లి లో మా పెదనాన్నగారింటికి వెళితే, పొద్దున్న లేచేటప్పటికి  మూడు పాల సీసాలు గడపట్లో ఉండేవి..వాటి మూతలు గా వాడిన ముచ్చిరేకుల్ని అగ్గిపెట్టెల్లో వేసి బయోస్కొపు చేసుకోడం మాకు ఎంత  ఇష్టమో. వాళ్ళ ఇంటి ముందుకి సాయంత్రం ఆరింటికల్లా జర్సీ గేదె తో ఒక మనిషి వచ్చి అటూ ఇటూ ఉన్న మూడు ఇళ్ళకీ చిక్కటి పాలు పోసేవాడు. ఇక్కడ వ్యవహారమంతా అపరిచితుల మధ్య జరుగుతున్నట్టు గంభీరమైన వాతావరణంలో జరిగేది..పాలు పితికే ముందు ఒక ఇంటి వాళ్ళు నీళ్ళు, చిన్న స్టీలు బిందె తెస్తారు. పాలబ్బయి సీరియస్ గా వాటిని అందుకుని చేతులు కడుక్కుని, పొదుగు కడిగి నీళ్ళు వంపేస్తాడు..ఆ చిన్న బిందె తిరగేసి చూపించి పాలు తీసి ఎవరి గిన్నెలోకి వాల్ల వంతు పోస్తాడు..అదేం చిత్రమో పాలు సరిగ్గా ఒక చుక్క కూడ ఎక్కువ తక్కువలు రావు. మా మల్లేషన్న లాగా కొసరు పోయడు. ఎవరూ అడగరు కూడా..అంత వీర గంభీరం నాకసలు నచ్చదు. ఆ చిక్కటి  పాలు రుచి కూడా గుర్తు లేదు.. 
ఒకే నండీ ! నేను ప్రస్తుతం లో కొచ్చేసి, అద్రక్ చాయ్ పెడుతున్నా! "బ్లూ సీ" చాయ్ లాగా చేద్దామని ప్రతిసారీ ప్రయత్నం చేస్తా..మీరూ జాగర్తగా ప్రస్తుతం లో కొచ్చేసి అర్జెంటుగా అద్రక్ చాయ్ తాగండి.

ప్రస్తుతం వారానికో మాటు పన్నెందు లీటర్ల పాలు తెచ్చి ఫ్రిడ్జ్ లో పడేసుకుంటున్నా,...ఆ చల్లని సాయంత్రాలు సీమ చింత కాయలు ఏరుకుంటూ పాలు పోయించుకోడానికెళ్ళినప్పుడు కలిగిన ఆనందం కలుగదు. అది కష్ట కాలమేమో కానీ నాకు అతి ఇష్ట కాలం .రామ్‌రెడ్డి తాత కాలం చేసాడు. రామిరెడ్డి తాత బతికున్నన్ని రోజులూ, బొల్లారం లోని వాళ్ళింటి నుంచి భూదేవి నగర్ దగ్గరున్న వాళ్ళ పొలాలకెళుతూ  సతీ సమేతంగా మా ఇంట్లో కొంత సేపు సేదదీరకుండా  వెళ్ళేవాడు కాదు. కూచున్నంత సేపు పొలం కబుర్లు చెప్పేవాడు. మాకు బియ్యం బస్తాలు
కూడా తనే  వేసేవాడు.   మల్లేషన్న రిటయిర్ అయి వాళ్ళ అబ్బాయి ప్రస్తుతం మా ఇంటికి  పాలు పోస్తున్నాడు.  ఇప్పుడు మా బదులు  మా అక్క గారి చిన్ని పాప గ్లాసు పట్టుకొచ్చి కొసరు పోయించుకుంటోందిట. ప్యాకెట్ పాలు తీసుకుంటున్నా,  ఎంత నీళ్ళ పాలు పోస్తున్నా, వాళ్ళు మమ్మల్నీ, మేము వాళ్ళనీ వదలట్లేదు. ముప్ఫై యేళ్ళ పైన అనుబంధం ఎలా వదిలెయ్యడం అంటారు నాన్న... నిజమే కదా!!!

అదృష్టం తలుపు తట్టింది

Wednesday, March 16, 2011చిన్నప్పుడు స్కూల్ లయిబ్రరీ లో ఉన్న చిన్న చిన్న కథల పుస్తకాలు, అప్పుడప్పుడు చందమామలు, బాల మిత్రలు తప్ప నాకు చిన్నప్పటి నుంచీ పెద్ద పెద్ద కథల పుస్తకాలు, పేరొందిన నవలలు  చదివే అవకాశం రాలేదు (మీరు నమ్ముతారు లెండి).  కొందరు మిత్రుల పుణ్యమాని యీ మధ్య ముళ్ళపూడి గారి రచనలు, బారిస్టరు పార్వతీశం (మ్యాడీ గారి బ్లాగులో) చదవగలిగా.

ఎవరైనా పుస్తకాల గురించి మాట్లాడుతున్నప్పుడు " అయ్యో నేను చదవలేదే, ఇక్కడ ఎలా దొరుకుతాయి? యీ సారి భారత్ వెళ్ళినప్పుడు తప్పకుండా తెచ్చుకోవాలి" అని ప్రతీ సారీ అనుకుంటూ ఉంటా. మంచి పుస్తకం అని ఎక్కడైనా చదివినప్పుడల్లా ఆ పుస్తకాన్ని నా లిస్టులో చేర్చుకుంటూ ఉంటా.   ఎవరైనా బోల్డు పుస్తకాలు చదివామని చెపితే, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఆరాధనగా ఉంటుంది..అబ్బా ఎంత అదృష్టం అనుకుంటా. అల్లాంటి కలలు గన్నఅదృష్టం నాకు వచ్చింది. మిస్సిస్సాగా వచ్చి,  మా రావు గారితో పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భం లో 'స్వీట్ హోం' లో పిల్లవాడి గురించి ప్రస్తావించి, 'మీరు స్వీట్ హోం చదివారా' అని అడిగారు. 'నేను పుస్తాకాలేమీ చదవలేదండీ అసలు' అని కొంచెం విచారం వ్యక్తం చేసాను. సాయంత్రం కల్లా రంగ నాయకమ్మ గారి "స్వీట్ హోం" 3 భాగాలూ, శరత్ గారి "పరిణిత", "నిష్కృతి", చలం గారి" స్త్రీ", "మైదానం", విశ్వ నాధుని "వేయి పడగలు", శంకరమంచి సత్యం గారి "అమరావతి కథలు", బీవీఎస్ రామారావు గారి  "గోదావరి కథలు", పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి "మహనీయుల చతురోక్తులు" తెచ్చిపెట్టారు. ఇంక నాకు పండగే పండగ!కంప్యూటర్, చాటింగ్, ఫోనింగ్, బ్లాగింగ్, వాగింగ్ అన్నీ మానేసి, జాబ్ అప్లికేషన్స్ కూడా పక్కన పడేసి, కొత్త బిచ్చగాడి టయిపులో చదివేస్తున్నా!

పతి, సుతుల్,బంధువుల్,స్నేహితుల్ పదాలు కూడా కొంచెం పక్కన పెట్టేసి, పుస్తకాల వెంట పరుగులు తీస్తున్నా !తప్పదు కాబట్టి వంట ఒక్కటీ చేసి-పడేస్తున్నా (లిటరల్ గా) . మా సీతయ్య అసలు 'త్రీ రోసెస్' టయిపు.  వంట చేస్తే రంగూ రుచి వాసనా అన్నీ బాగుండాలి. కొన్ని సార్లు రంగుదేముందీ
రుచి బాగుంది తినెయ్యండీ అంటే, ' చస్! నో వే!' అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. భోజనం రుచిగా వండటంతో పాటు ప్రెసెంటేషన్ ఇంపార్టెంట్ అని ఆయన ఉద్దేశ్యం.   మనదేమో కావలసినంత అన్నం ఒకేసారి పెట్టుకుని దానిమీద పప్పో, సాంబారో, పులుసో  పోసేసి,  కూరా, పచ్చడి, పప్పు అని తేడా తెలీకుండా కలగా పులగంగా తినే బ్యాచ్.  యీ పుస్తాకాలొచ్చాక కలలో ఇలలో కూడా హస్త భూషణం లేకుండా నేనెవ్వరికీ కనబడట్లేదు. మరింక చదువుతూ వంట చేస్తుంటే , రంగుంటే- రుచి లేదు, రుచి ఉంటే -చిక్కదనం లేదు అనిపించే చవక బారు టీ  లాగా ఉండక, 'రంగు-రుచీ-చిక్కదనం త్రీ రోసెస్' లా ఎలా ఉంటుంది చెప్పండి? అందుకన్నమాట వండి తినడం బదులు వండి పడెయ్యడం...కాకపోతే   ఇలాంటి సందర్భాల్లో తినగలిగేలా వండడం ఎలా కుదురుతుందండీ? ? మీరు అర్థం చేసుకున్నారు కదా నాకు అంతే చాలు.  

పిల్లలెప్పుడైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ,పిలిచినప్పుడు పలక్కపోతే ఒక్క చరుపు చరిచి మరీ 'అంత పరధ్యానమేంటీ' అని ఉరుములు ఉరిమే నన్ను ప్రస్తుతం పుస్తక పఠనం లో సమాధి స్థితిలో ఉండడం చూసి  "ఏంటమ్మా ఇలా అయిపోయావూ " అని దీర్ఘాలూ, కొమ్ము దీర్ఘాలూ తీస్తూ నిట్టూరుస్తున్నారు. నేను మాత్రం ఎవరినీ కేర్ చెయ్యకుండా నా కలాపోసన చేసుకుంటున్నా..ఆఖరికి   మొన్న ఇంటర్వ్యూ కి   వెళ్ళినప్పుడు కూడా వెయిటింగ్ టయిములో చదువుకోవచ్చని అన్నిట్లో చిన్ని పుస్తకం చూసి బ్యాగులో పెట్టేసుకున్నా . చూసే వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ లో  "పరిణిత" మీద క్వశ్చన్లు అడుగుతారేమో, పరీక్ష ప్యాసు అవాలంటే యీ మాత్తరం చదవాలేమో అనిపించేట్టు ఒక్క నిమిషం కూడా  వృధాచెయ్యలేదు.

"ఇంకా కొన్ని  ఉన్నాయండీ పుస్తకాలు, వెతికి ఒక చోట పెడతా   కావలసినన్ని తీసుకోండి.  ఇవి అవగానే చెప్తే అవీ తెచ్చిస్తా" అని రావు గారు చెప్పగానే, "నా భాగ్యమే భాగ్యమూ" అని నేనున్నూ ,పుస్తకం చదువుతూ "కనిపిస్తే కాల్చేస్తా" అని మా వారున్నూ ఎవరి ఫీలింగు వాళ్ళు ఫీలేసుకున్నాము.ఇలా మా ఫ్యామిలీ వెతల్..నా కతల్..మూడు పుస్తకాలు ఆరు కథలు గా సాగుతున్నాయి.  

ఇందుమూలంగా సమస్త స్నేహ గణానికీ తెలియ చేయునదేమనగా..నేను కొన్ని రోజులుగా కనిపించక, వినిపించక పోతున్న కా"రణం"బిదియే. "ఉన్నావా అసలున్నావా" అనీ, "కనిపించక పోవ కారణమే మమ్మా" అనీ మెయిల్సు, కామెంట్లూ పెట్టిన స్నేహితులందరికీ కృతజ్ఞతలు. మీ అందరి పోస్టుల మీదా రోజూ ఒక క్విక్  లుక్కేస్తున్నా. కానీ కామెంటట్లేదంతే.  మరి మీలో ఎవరికైనా పైన లిస్టులో పుస్తకాలు చదవాలనిపిస్తే, వెంటనే మా ఇంటికొచ్చెయ్యండే! ఆరు బయట మంచులో, గొంగళీ  కప్పుకుని పుస్తకాల సిలబస్ డిస్కస్ కూడా చెయ్యొచ్చు ఎంచక్కా! మీరు పుస్తకం చదివి వినిపిస్తుంటే ,మీ కోసం వేడి వేడి పకోడీలు చేసి పెడతాలెండి. ఇంక ఎందుకాలస్యం ?మీరొచ్చెయండి మరి , గొంగళ్ళు నేను సప్లయి చేస్తాగా! 

పిచ్చమ్మ , పిచ్చితల్లి

Friday, February 25, 2011


ఇదేం టాపిక్ అని ఆశ్చర్యంగా ఉందా! అవును మరి టాపిక్ పెడుతుంటే నాకు అదే అనిపించింది....కానీ వీళ్ళిద్దరి గురించి చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఎలా చెప్పాలో సరిగ్గా తెలియట్లేదు...ఏదో పిచ్చికి సంభందించిన పేర్లు కదా అని నేను పిచ్చి పిచ్చిగా చెపితే చదివే మీరు నన్ను పిచ్చిదాన్నను కోరు? అందుకే పోస్టాలా వద్దా అని తెగ చించాను చివరికి ఏమయితే అది అయిందని 'ధైర్యే సాహసే ఎన్నెలా' అనుకుని చెప్పేస్తున్నా. వీరు కవలలు కారు, జంట కవులు కారు, ఆ మాట కొస్తే అసలు ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేదు... మరి విషయం లోకి వచ్చేద్దాం.

మా జనరల్ మానేజర్ షోడశ కళలతో కళకళ  లాడుతుంటుంది..ఒక నిముషము గట్టిగా బ్రాండ్ డయిరెక్టర్స్ మీద అరుస్తూనే, నేను కనబడగానే నవ్వుతూ యోగ ధ్యానం గురించి కూల్ గా మాట్లాడుతుంది. నేను చాల సార్లు కంఫ్యూస్  అవుతాను. అసలేంటి అని -రెండు ఫోన్ కాల్స్ ఒకే సారి వస్తే, ఒక లయిన్లో తిట్టేస్తున్న ఆవిడ కాస్తా వాళ్ళని హోల్డ్ లొ పెట్టి ఇంకొకళ్ళతో హ్యాప్పీ గా నవ్వుతూ మాట్లాడుతుంది...ఇంక యీ లయిన్లో అవగానే మళ్ళీ తిట్ల దండకం కంటిన్యూ...యీ విద్య ఎలా వస్తుందీ..మన వల్లయితే కాదండొయ్. ఒక రోజు నేను ఇంటికి వచ్చే టైం లో...సేల్స్ టార్గెట్ పూర్తీ అవ్వలేదని ఎవరినో చచ్చేట్లా తిడుతోంది...అప్పుడే అక్కడకొచ్చిన ప్రమోషన్స్  మ్యానేజర్ తో  ఒకటే జోకులు..ఇంత కళాకళల మనిషేఏంటిరా  బాబూ అని ఆలోచిస్తూ బయటికి వస్తున్నా....మెట్లు   దిగగానే  ఒకాయన 'ఈస్ మ్యాడీ  స్టిల్ ఇన్ హెర్  ఆఫీస్' అని అడిగాడు....'ఎస్ ,షీ ఈస్'  అని బయటి కోస్తూ అనుకున్నా ఈవిడ పేరు విచిత్రంగా ఉంది  కదూ! అని.. ఆవిడ పేరు మ్యాడలిన్ . కొందరు  మ్యాడీ అని పిలుస్తారు...ఆవిడ సంతకం మ్యాడ్ అని పెడుతుంది..ఇలా పేరెందుకు పెడతారు ..పెట్టారనుకోండీ ఎవరైనా మ్యాడ్ అని వాళ్ళని వాళ్ళు పిలుచుకుంటారా...ఎంత ముద్దయితే మాత్రం వేరే వాళ్ళు మ్యాడ్ అని పిలిస్తే చూస్తూ ఊరుకుంటారా అని ఆలోచిస్తూ నడుస్తున్నా. సడెన్ గా  చిన్న నవ్వు నా మోమున చిగురించింది...మన దగ్గర పిచ్చమ్మ అని పెట్టుకుంటారు కదా అలా ఇక్కడ మ్యాడలీన్  అని పెట్టుకున్నారు.ఒక వేళ ఎవరి పేరన్న పిచ్చమ్మ అని ఉంటే మనం ముద్దుగా పిచ్చీ అని పిలుచుకోమూ ఇదీ అంతే  అని జీవిత సత్యం కనుక్కున్నాను..అప్పటి నుంచీ ఆవిడ మా పిచ్చమ్మ. మరి ఆవిడ గురించి మాట్లాడు కుంటున్నప్పుడు మా పిచ్చమ్మ గారు ఇవాళ ఇలా అన్నారు..మా బెట్టీ గురించి ఇలా చెప్పారు అని చెప్పుకుంటామన్న మాట..

పిచ్చితల్లి నాకు చదువుల్లో పరిచయమయ్యింది. చిన్కీ (చైనీ) పిల్ల . మొదటి సారి లయిబ్రరీ లో కలిసింది. ఒక శనివారం  రోజు మా గ్రూప్  మొదటి సారి కలుసుకున్నాం. ముందుగా అనుకున్న ప్రకారం ఆ రోజు ప్రెసెంటేషన్  నాది. నా డిస్కశన్సు బోల్డు నచ్చేసాయిట. మనిద్దరం కలిసి చదువుకున్దామా అంది...నాకు రోజు ఇక్కడికి రావడం కుదరదండీ అన్నాను..మీరు ఏమి అనుకోకపోతే నేను మీ ఇంటికి రావచ్చా అంది...దానికేమి భాగ్యం...రండి తప్పకుండా అన్నాను..తను చాలా పంక్చువల్ గా సోమ వారం సాయంత్రం సరిగ్గా నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే టయిముకి మా ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంది. నా కంటే ముందుగా వచ్చేసినందుకు నేను కొంచెం ఖంగారు పడ్డాను..ఇల్లు నరకంలా ఉంటుంది.. మొహమాటం గా చెప్పాను..ఇల్లు చూసి భయపడకండీ అని...డోంట్ వర్రీ అంది.  నేను లోపలికి వెళుతూనే కాలికి అడ్డం తగిలిన వస్తువులన్నీ గబా గబా తీసేసాను. తనని కూర్చోమని చెప్పి ఐదు  నిముషాల్లో సాధ్యమైనంత సర్దాను.. కాళ్ళు చేతులు కడుక్కుని పిల్లలకి తినడానికి పొద్దున్న చేసిన రొట్టెలు కూర వేడి చేసి ఇస్తూ తనకి కూడా ఇచ్చా.ఇంక మిగిలిన పనులు వదిలి రాత్రి పదిన్నర వరకు చదువుకున్నాము.మా వారు వచ్చే టయిముకి తను వెళ్ళిపోయింది పార్కింగ్ ప్రాబ్లెం అవుతుందని... . ఇంటికి వచ్చాక రెండో రోజు తను కూడా కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చింది. మీ పిల్లలకి చెప్తుంటే విన్నాను...కాళ్ళు చేతులు కడుక్కోకపోతే నాకు తిండి పెట్టవేమో అని కడుక్కుని వచ్చేసాను అంది.  అబ్బో తెలుగులో చెప్పినా భలే అర్థం అయ్యిందే అని నేను బోల్డు సంబరపడి పోయాను. మూడో రోజు నేను కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చే టయిముకి తను సింకు దగ్గర ఉండి అంట్లు కడగడానికి ట్రయి చేస్తోంది.. అరెరే అని నేను ఖంగారు పడ్డా . నిన్ను చూస్తె జాలేస్తోంది పాపం, ఇంటి పనంతా చేసుకుని, వర్కు నుంచి వచ్చీ మళ్ళీ చదువుకోవాలిగా. నేను ఇల్లు సర్ది ౩ ఏళ్ళు అయింది తెలుసా. సిబ్లింగ్స్ తో సహా ఎవ్వరినీ ఇంటికి పిలవను, నేనే వెళతాను అవసరమయితే. మా ఆయన చయినీస్ రెస్టారెంట్ లో షెఫ్..మా ఇద్దరి కోసం వంట తనే చేసేస్తాడు ..నేనే వంకలు పెట్టి తిడుతూ ఉంటాను ..శని వారాలు నేను లేచి మొహం కడుక్కుని లైబ్రరీ కి వచ్చేస్తానంతే ...తను లేచి నా కోసం వండి అక్కడికి పట్టుకొస్తాడు, అయినా  నేను అలిసిపోతాను. నువ్వు ఇవన్నీ ఎలా చేస్తావు, నేను రోజూ  నీకు అంట్లు కడిగి పెడతాలే అంది....నాకు మా ఫ్లోరా ఫీలింగ్స్ కి కళ్ళ నీళ్ళొచ్చాయి నాకు అలవాటేలే నువ్వు వర్రీ అవకు..అని చెప్పాను...తను నన్ను సూపర్ వొమన్ అంటుంది.. మా వారు ఇంటికొచ్చాక  ఫ్లోరా అంట్లు కడిగే ప్రయత్నం చెప్పాను, తన కామెంట్లు జత  చేసి...మీకు అర్థం అయ్యే ఉంటుంది...అయన కూడా ఫ్లోర లాగ ఆలోచించడం మొదలు పెడతారేమో అని  కొంచెం దురాశ. అన్నీ పక్కన పెట్టి ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి పదం 'అయ్యో పిచ్చి తల్లీ' అని. అది నన్ను గురించీ అనుకుంటే ప్రస్తుతం కంది పప్పు ధర ఎక్కువ కాబట్టీ వేస్టు  చెయ్యలేము కాబట్టీ మీరు చారులో కాలేసినట్టే ఆ పిచ్చితల్లి  బిరుదాన్కితురాలు మా ఫ్లోరా. తనకి చెప్పాను ఆ బిరుదు గురించి..దాని అసలు అర్థం..సందర్భానుసారం తనకి ఆ బిరుదు ఇయ్యడానికి మీనింగు తో సహా చెప్పాను లెండి...కొంచెం బై హార్ట్ చెయ్యడానికి ప్రయత్నిచింది.నిన్ను మేము ఏమని పిలుస్తామూ అంటే...పిచిటాలీ అంటుంది.ఇలా రోజూ నేను ఆఫీసు నుంచి వచ్చే లోపు బయట వెయిట్ చేస్తూ ఉండేది ప్రతి రోజూ..ఒకొక్కసారి బస్ స్టాప్ కి వచ్చేది పిక్ చేసుకోడానికి..ఇంకా ఆఫీసుకి వచ్చి పిక్ చేసుకుంటాను అనేది కూడా..అంత వద్దులే అని చెప్పేదాన్ని.

మా మూర్తి గారు వచ్చారు ఒక రోజు...తనని పరిచయం చేసాను...మీ ఇంటికి పిలవరా అని అడిగారు తనని ....ప్లీస్ మా ఇంటికి రావద్దు..కావాలంటే రెస్టారెంటుకి తీసుకెళతా అంటుంది...మా స్నేహితులెవరైనా తనని ఇన్వయిట్ చేస్తే బోల్డు సంబర పడి పోతుంది..వాళ్ళు నిజ్జంగా రమ్మన్నారా అని అడుగుతుంది..మా వాళ్ళు అలా ఊరికే రా అనరు..ఎప్పుడయినా తీసుకెళతాలే అని చెప్పేదాన్ని...ఒక్కోసారి రాగానే రొట్టెలు వద్దు అన్నం పెట్టు అంటుంది...తన కోసం కారం తగ్గించి చెయ్యటం తప్పలేదు కనీసం ఒక కూరలో..లేక పోతే కళ్ళు ముక్కూ వర్షిస్తాయి మరి..అన్నం చేత్తో కలుపుకుని తినడం..రొట్టెల్లో కూర పెట్టుకుని తినడం బాగా వచ్చేసాయి..చూడు చూడు నీ లాగే తింటున్నా అని కళ్ళు మెరిపిస్తుంది... అలా అలా పది రోజులకే ఇండియన్ తిండి అలవాటయ్యి ఇంక వేరే వంటలు నచ్చటం మానేసాయిట. కనిపించిన వాళ్లకల్లా 'ఆహా ఏమి రుచి..అనరా మయిమరచి' అని చెప్పేస్తోంది కూడా..అంతే కాకుండా మా కోర్సు పూర్తీ అయ్యాక పరీక్ష కి ముందు రోజు పెద్ద పెద్ద సంచీలతో వచ్చింది..ఏంటీ ఇవన్నీ అని అడిగితె...ప్రతి రోజు మీ ఇంట్లో అన్నము రొట్టెలు తింటున్నాగా వాటి రా మెటీరియల్స్ కొనుక్కొచ్చా అంది.నీకు ఎలా తెలుసు అని అడిగితే ఏదో ఇండియన్ షాప్ కి వెళ్ళి వాళ్ళకి నేను రోజూ ఏమేమి పెడతానో ఎక్స్ప్లెయిన్ చేసి కనుక్కుందిట..నాకు పిచ్చెక్కింది...ఒక బస్తా బాస్మతీ బియ్యం, ఒక  బస్తా పిండి , వివిధ రకములైన  రెడీ మేడ్ రొట్టెలు, కొన్ని ఫ్రోజెన్ కూరలు..బోల్డు  తెచ్చింది...తను మరీ హార్ట్ కాకుండా  ఫ్రోజెన్ కూరలు మాత్రం ఉంచుకుని మిగిలినవి ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పాను సున్నితంగా. పనిలో పని అన్నం వండడం నేర్పించి బియ్యంతో అన్నం వండుకో , ఇంకా రొట్టెలు వేడి చేసుకుని తిను.. కూర కావాలంటే మాత్రం మా ఇంటికి రావాల్సిందే అని చెప్పాను. పరీక్షకి వెళ్ళే రోజు మా ఇంటికి త్వరగా వచ్చేసింది. తీరా బయల్దేరే సమయంలో ఒకటే చలి. ఇంటికి వెళ్లి వచ్చే టయిము లేదు కదా అని మా పిల్లలది ఒక హుడీ ఇచ్చాను. పరీక్ష అయిన మర్నాడు ఫోన్ చేసింది.. ఆ హుడీ వెనక్కి ఇవ్వాలా అని. ఆ అడగటం లో ఇవ్వద్దు అని చెప్టే బాగుణ్ణు అని ఫీలింగ్ కనిపించింది.. వద్దులే ఉంచుకో అన్నాను.నువ్వు ఇమ్మన్నా  నేను ఇచ్చేదాన్ని కాదు..ఊరికే నామకహా అడిగాను అంతే అంది.. .ఆ హుడీ వల్లే తను పరీక్ష పాస్ అయ్యానని , ఇప్పటికీ ఏ పరీక్షకయినా అదే హూడీ వేసుకోవడం సెంటిమెంట్ అయిపోయిందనీ మొన్న  చెప్పింది. ఇంక కెనడా లో బూగీ వూగీ ప్రోగ్రాం అవుతుందని తెలుసుకుని నా కంటే ముందే టికెట్టు కొనేసుకుంది..చీర కట్టుకోవాలని తెగ ఎక్సయిటు అయ్యింది..నగలు, గోరింటాకు, బొట్టు, కాటుక పువ్వులు గాజులు..నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా మెట్టెల తో సహా  ..ఏవీ మిస్ అవ్వకుండా అడిగి అడిగి పెట్టించుకుంది..ఇంకా ఏమైనా మిస్ అయ్యానా అని ఆడుగుతూనే ఉంది వెళ్ళేదాకా. చూడండి మరి లచ్చిందేవి లా ఎంత అందంగా రెడీ అయ్యిందో..'ఎలా ఉన్నాను' అని అడిగింది బయలదేరుతున్నప్పుడు కనిపించిన ఒక పంజాబీ ఆవిడని . 'గాడెస్ ఆఫ్ వెల్త్ ' లా ఉన్నావు అని చెప్పారు....ఇంక ప్రోగ్రాం  కి వెళ్ళాక ...'సో క్యూట్' అని చూసిన వాళ్ళందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు..ఈ యని వాళ్ళని మేడం గారు వదులుతారా ఏంటీ...హెలో అని పలకరించడం...నేను ఇండియన్ లేడీ లా ఉన్నానా అని అడగడం. స్టేజి ఎక్కిన ప్రతి వాళ్ళతో ఫోటోలు ..భలే సరదాగ గడిచింది ఆ సాయంత్రం.  ఇంటికి తీసుకొచ్చి దిష్టి తీసి మరీ పంపించాము అమ్మగారిని. నగలు, వస్త్రములు జాతీయం చేసిందని వేరే చెప్పక్కరలేదనుకుంటా...లకీ మీ...అన్ని గిల్టువే...
మరి తను మా వారిని ఏమని పిలుస్తుందో తెలుసా? అచ్చ తెలుగులో "నాన్న"
మొన్న ఫోన్ చేసి చెప్పా తన గురించి నా బ్లాగ్ లో వ్రాస్తున్నా అని...మొదటి ఫొటో పంపింది..కాస్సేపాగి...ఉండు ఉండు పువ్వులు కనిపించట్లేదు..ఇది కూడా పెట్టు అనిరెండవ ఫోటో పంపింది.....మీకు పూలు కనబడ్డాయా? హమ్మయ్యా... ఇంక మా 'పిచి టాలీ' మస్త్ ఖుష్....
.

టికెట్ ప్లీస్

Monday, February 14, 2011
ఒక సారి ఆరుగురు అక్కవుంటెంట్లు, ఆరుగురు ఇంజనీర్లు కాంఫరెన్సుకి వెళ్ళాల్సి వచ్చింది..అందరు ట్రెయిన్ టికెట్స్ కొనడానికి కవుంటర్కి వెళ్ళారు...అకౌంటెంట్లలో ఒకరు "ఆగండి మన ఆరుగురికీ నేను కొంటాను" అని కవుంటర్ దగ్గరకెళ్ళి ఒక టికెట్ మాత్రం కొన్నాడు.ఇంజనీర్లలొ ఒకతను.."ఆగండి మనందరికీ  నేను కొంటాను" అని ఆరు టికెట్లు కొని ఐకమత్యాన్ని చాటుకున్నాడు.అయితే, టికెట్ కొన్న  అకౌంటెంట్ ఒక టికెట్ మాత్రం కొని వాళ్ళ గ్రూప్ కి ఏదో కీడు తలపెడుతున్నాడని అతనికి అర్థం అయ్యింది.వాళ్ళ టీం తో చెప్పాడు యీ విషయం..ఎప్పడి నుంచో అకౌంటెంట్ల మీద కోపం గా ఉన్న ఇంజనీర్లు "ఊరుకో వాళ్ళకి అలానే జరగాలి"  అని ఊరుకున్నారు...రైలెక్కాక వీళ్ళు ఫైన్ కట్టే టయిం కోసం ఇంజనీర్లు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు......యీ లోపు ఎవరొ ...టికెట్ కలెక్టర్ కమింగ్ అని అరిచారు..వెంటనే ఆరుగురు అకౌంటెంట్లూ బాత్రూం లోకి సర్దుకున్నారు..
టికెట్ కలెక్టరు తలుపు మీద తట్టి..టికెట్ ప్లీస్ అన్నాడు..వాళ్ళు తలుపు కింద నుండి టికెట్ బయటికి విసిరారు..అతను వెళ్ళిపోయాడు..ఇంజనీర్లు కొంచెం డిసపాయింట్ అయినా, ఒక విద్య నేరుచుకునే చాన్స్ వచ్చిందని మురిసిపోయారు..


తిరుగు ప్రయాణం లో ఇంజనీర్లు ఒకటంటే ఒకే టికెట్ కొనుక్కుని టికెట్ కలెక్టర్ వచ్చే టైం కోసం ఎదురు చూస్తున్నారు..యీ లోపు అక్కవుంటింగ్ టీం వాళ్ళు కొంచెం లేట్ రావడంతో టికెట్స్ కొనుక్కోకుండా పరుగెత్తుకొచ్చి రైలు ఎక్కేసారు...వీళ్ళకి యీ సారి తప్పకుండా తిక్క కుదురుతుందనీ అది వాళ్ళు కళ్ళారా చూడాలనీ ఒక వైపు, ఒక టికెట్ తో ఆరుగురు ప్రయాణం చేసె ట్రిక్కు ఉపయోగించటం లో థ్రిల్లు ని అనుభవించాలని ఒక వైపు తెగ ఉవ్విళ్ళూరుతూ కూర్చున్నారు ఇంజనీర్లు ..


ఇంతలో ఎవరో టికెట్ కలెక్టర్ కమింగ్ అని అరిచారు..యీ ఆరుగురు ఇంజనీర్లు గబ గబా బాత్రూం లోకి సర్దుకున్నారు...టికెట్ ప్లీస్..అనగానే టికెట్ బయటికి విసిరారు..కొంత సేపు అక్కడే ఆగి గర్వంగా తమ సీట్లల్లో వచ్చి కూర్చున్నారు..యీ లోపు...టికెట్ కలెక్టర్ కమింగ్ అని మళ్ళీ అరుపు వినిపించి చూసేంతలో..అక్కౌంటింగ్ బాచ్ బాత్రూం లోకి సర్దుకోవడం..మన ఇంజినీర్లు ఫైన్ కట్టడం గబ గబా జరిగి పోయాయి..


బ్రహ్మ రాత్రంతా చక్కగా నిద్ర పోయి, ఫ్రెష్ ఫ్రెష్ గా ఉదాయాన్నే లేచి మంచి మూడ్ లో ఉన్నప్పుడు అక్కవుంటెంట్లని తయారు చేస్తాడట..అందుకే మేధవైన వాడు అక్కౌంటెంట్ గా పుట్టునని వేదాలు ఘోషిస్తున్నాయి.


మిత్రులారా..ఇది ఒక పురాతనమైనా జోకు..మీలో చాల మందికి తెలిసే ఉంటుంది...నాగార్జున గారి రోబో  సినెమా పోస్ట్ చదివినప్పుడు ఇది గుర్తుకొచ్చి, మీతో కలిసి మళ్ళీ గుర్తు చేసుకుందామని ఇక్కడ పోస్టుతున్నాను...అన్నట్టు మా అక్కౌంటెంట్లని ఇంజనీర్లు చిన్న చూపు చూస్తున్నారని నేను ప్రత్యర్థి గా ఇంజనీర్లని ఎన్నుకున్నాను....ఇందులో మీరు ఏ బాచ్ వారయితే ఆ బాచ్ వారిని అక్కౌంటింగ్ బాచ్ ప్లేస్ లోను, మీరు బకరాలు అనుకునే ఇంకొక బాచ్ ని ఇంజనీర్ల బాచ్ లోను..పెట్టేసుకుని నవ్వు రాకపోయినా నవ్వేసుకోండి మరి......మీరు ఇంజనీర్లయితే అక్కౌంటెంట్లని ఎన్నుకోండి..కానీ నాకు చెప్పకండే...


హుర్రే!!!!!నాకూ చిన్న పోస్టు వ్రాయడం వచ్చేసిందొహో..ఓ..ఓ...ఓ..ఓ..ఓ...ఓ..ఓఓ

పరకాయ ప్రవేశం...

Sunday, February 6, 2011

జయుడుని చంపిన భటులు అతని శరీరాన్ని వెంటనే కాల్చి బూడిద చెసేశారు. జయుడి ఆత్మ చింతిస్తూ తిరుగుతుండగా, చెట్టు కింద ఒక కళేబరము కనిపించింది...అది రాజు శక్తివర్మ శరీరం గా గుర్తించిన జయుని ఆత్మ శక్తి వర్మ శరీరం లో ప్రవేశించి కోట వైపు నడవసాగెను....చంద మామ లో చదువుతున్న కథ చాలా ఆసక్తి గా ఉంది...మళ్ళీ మళ్ళీ చదివానేమో, రాత్రంతా అవే కలలు...

ఆ వారం లో మా గోపాల రావు మాస్టారు..చంద్రహాసుడి కథ పాఠం చెబుతూ ఆ రోజుల్లో పరకాయ విద్య ఉండేదని చెప్పారు....నేను పరకాయ ప్రవేశం కథ చందమామలో చదివానని చెప్పాను. మాస్టారు కూడా ఒక కథ చెప్పారు. అల్లరికి మారు పేరని స్కూల్లో ఫేమసు అయిన మా కొండ గాడికో డవుటు. 'మాస్టారండీ, పర కాయ అని ఎందుకంటారండీ,,...పర 'పండూ' అనొచ్చుగా అనడిగాడు..."గుడ్డి పీనుగా (మా మాస్టరికి ఇది ఊతపదం) ఎప్పుడూ తిండి గోల మాని కొంచెం బుధ్ధి ఉపయొగించు...కాయ అంటే మావిడి కాయో , పనస కాయో కాదు...కాయమంటే శరీరం..పర కాయ విద్య అంటే..ఆత్మ ఇతర శరీరాల్లోకి ప్రవేశించే విద్య. చాలా యేళ్ళు అడవిలో ఉండి, గురువులకి సేవ చేసి నేరుచుకునేవారు యీ విద్యని" ..అని చెప్పారు."మాస్టారండీ, మీరు అడవిలో ఉంటారా ? నేనొచ్చి మిమ్మల్ని సేవిస్తాను" అన్నాడు. మాస్టారికి డవుటు వచ్చ్చింది.. ఒరేయ్, సేవించడమంటే  ఏవిట్రా  అని అడిగారు...సేవించడమంటే తినడం లేక టాగటం అని గడ గడా చెప్పాడు మన కొండ గాడు... నిన్నొదిలేస్తే మమ్మల్ని అడవులకేంటీ యేకంగా స్వర్గానికే పంపేస్తావ్.గుడ్డి పీనుగా...ఇక్కడ మమ్మల్ని తింటున్నది చాలు గానీ....ఇంక కూచో...యే టీచరుని కదిపినా నీ లీలలే అన్నారు మాస్టారు...

 

 

మేమందరం ఇంక ఆ పరకాయ విద్య గురించి ఒకటే డిస్కషన్స్. ఆ విద్య ఒస్తే ఎంత బాగుంటుంది కదా..నేనైతే, నాకు చాలా ఇష్టమైన మా బుచ్చిరెడ్డి మామ దగ్గరున్న చిన్ని తెల్ల తువ్వాయి లోకి వెళ్ళిపోతా.అబ్బ ఎంత ముద్దుగా ఉంటుందో ఆ చిట్టి తువ్వాయి.మా విజ్జి కి పాలు పెరుగు అంటే తెగ ఇష్టం...మరి ఇంట్లో నేమో లిమిటెడ్ గా ఉంటాయిగా. అందుకని అది దానికిష్టమైన పిల్లి పిల్లలోకి వెళ్ళిఅందరి ఇంట్లో పాలు, పెరుగు  తాగేస్తుందిట.మా లల్లి కేమో దాని వీపు విమానం మోత మోగించే లెక్కల మాస్టారి పై పగ తీర్చుకోడానికి హెడ్ మాస్టర్ లోకి వెళ్ళడం ఇష్టం...

 

 

ఇంక చంద మామ పుస్తకాలు, చంపక్, అప్పుడప్పుడే పరిచయమవుతున్న కామిక్ పుస్తకాలు ప్రతి నెల తప్పకుండా కొనగల సత్తా ఉన్న రఘు గాడు అందరి కంటే సన్నగా కనబడే ఎవ్వరి శరీరం లోకి జంపమన్నాజంపెయ్యడానికి రెడీ. మా సత్య కి రఘుగాడి రిచ్ నెస్ మీద మోజు.వాడు తొక్కే చిన్ని సైకిల్, వాళ్ళ ఇంట్లో ఉన్న ఉయ్యాల బల్ల అంటే, దానికి పిచ్చి పిచ్చి ఇష్టం..సో, ఆ రిచ్ నెస్ కోసం బాడీ పెద్దదయినా, వాడి శరీరం లోకి ట్రాన్స్ ఫర్ అవడానికి అదీ పరకాయ విద్య ఎక్కడ నేర్చుకోవచ్చూ అని అందరు ట్యూషన్ మాస్టార్ల దగ్గరా కనుక్కుంటోందిట..

 

 

స్కూల్ కి ఎక్కువగా గుంపులు గుంపులుగా నడచి వెళ్ళేవాళ్ళం.. ఒకొక్కసారి సుగుణ కోసం వెయిట్ చేసి చేసీ అది రాదని డిసయిడు అయ్యి కొంచెం లేటు అయితే మంద మిస్స్ అయిన మేక పిల్లలా ఉండేది పరిస్థితి.. ఒక్కదాన్నీ కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం నడవడం  పరమ బోర్..కానీ యీ పరకాయ విద్య గురించి తెలుసుకున్నాకా దారిలో కనిపించే ప్రతి జంతువు/మనిషి లోకి వెళ్ళిపోతూ మూడు కిలో మీటర్లు అవలీలగా నడిచేసేదాన్ని..

 

 

ఇంట్లో పెద్దగా యేం చదువుతున్నామా అని పట్టించుకోరు.దీపాలు పెట్టే వేళకి కాళ్ళు కడుక్కుని, పుస్తకాలు ముందు వేసుకుని, దీపాల వెలుతురు లో కూచుంటే చాలు. అమ్మ పిలిచి అన్నం పెట్టగానే నిద్ర లోకి జారుకోవచ్చు.కానీ మూడు నెలల కోసారి యమ గండం,అదే ప్రోగ్రస్ కార్డులు ఇచ్చే రోజు అమ్మైతే సంతకం పెట్టేస్తుంది.యీ సారి నాన్న కి దొరికిపోయింది చెల్లి.. చెల్లికీ సయిన్స్ కీ చుక్కెదురు....

 

 

నాన్నకి కోపం రాలేదు కానీ చెత్త మార్కులకి రీసన్ తెలుసుకున్నారు.దానికి వాళ్ళ సయిన్సు టీచరంటె అస్సలు ఇష్టం లేదుట.ఆవిడ చాలా స్ట్రిక్టు ట. ఒక్క తప్పయినా మొత్తం మళ్ళీ వ్రాయమంటారుట.ఆవిడ మీద కోపం తో అది సయిన్సు చదవడం మానేసానంది.

నాన్న చెప్పారు...ఆవిడ అలా చెయ్యడం మాకే మంచిదట..అలా ఉండటం వల్ల ఆవిడకి యేమీ లాభం లేదుట.. ఆవిడ మనకి బాగా చదువు రావడం కోసమే అలా డ్రామా చేస్తారుట కానీ, ఆవిడకి అస్సలయితే పిల్లలందరూ చాల ఇష్టం ట..ఎవరి మీదయినా కోపం వస్తే, వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు...దాని వల్ల వాళ్ళకి లాభం ఏంటీ అని ఆలోచిస్తే చాలా సార్లు మనకి వాళ్ళ మీద కోపం రాదుట. నాన్న చిన్నప్పటి నుండీ చెపుతూనే ఉండేవారు  కోపం వద్దు, తన కోపమె తన శత్రువు అని..కానీ యీ సారి చెప్పినప్పుడు నాకు ప్రత్యేకంగా అనిపించింది..ఈ సారి వివరణ నాకు తెలిసిన పరకాయ విద్యకి అర్థం మార్చింది. అంటే కోపం వచ్చినప్పుడల్లా మనం పరకాయ ప్రవేశం చెయ్యాలన్నమాట.  అదిగో  అప్పటి నుంచి ప్రతి రోజు ఎవరో ఒకరి బుర్ర కాయలోకి పరకాయ ప్రవేశం చెయ్యడం తప్పలేదు.(మరి మనకి చీటికి మాటికి ఎవరో ఒకరి మీద కోపమొస్తుందిగా)..ఇలా క్రమంగా కోపమొచ్చినప్పుడు అనే కాకుండా సరదాగా ఎడ పెడా పర బుర్ర ప్రవేశం అలవాటయ్యిపోయింది..

 

 

వివాహం విద్యా నాశనం కదా? వచ్చిన అన్ని విద్యలతో పాటు.. పరకాయ విద్యా పత్తా లేకుండా పోయింది..పెళ్ళయిన కొత్తల్లో నాన్న దగ్గర ఒక  విషయాన్ని భూతద్దం లో చూపించి మరీ  చెప్పా..నాన్న చాల నిదానంగా పర కాయ విద్యని  క్రాష్ కోర్స్ బేసిస్ మీద రిఫ్రెష్ చేసి పంపారు. ఆ తర్వాత ఎప్పుడూ ఏ విషయం నాన్నతో చర్చించే అవకాశం రాలేదు. అందుకే నాన్నంటే నాన్నే మరి!

చిన్నప్పుడు చాలా యేళ్ళ వరకూ చెప్పులూ బూట్లూ లాంటి ఎగస్ట్రాఫిట్టింగ్స్ లేకుండా నా స్వంత పాదాలతో నడవడం నాకు అలవాటు.. దీనికి కారణాలున్నయి...

1.చెప్పులు కొనిచ్చిన రోజే సాయంత్రం సత్యా టాకీస్ వెనకున్న ఇసక మేటల్లో ఆడుకుంటూ పక్కన వదలడం/మర్చిపోవడం..అవి రెండో నిముషం మాయమవడం.

2.మా పాఠశాలలో యూనిఫారం అని పిలవబడే ఆకుపచ్చ తెలుపు కాంబినేషన్ లో బట్టలు యేదో ఒక రూపం లో కట్టుకురమ్మనడం తప్ప ఇంక ఒక్క ఇంచీ ఎక్కువ రూల్స్ పెట్టినా...స్కూల్‌నే అమ్యూస్మెంట్ పార్కూ, ఎంటర్ టైన్మెంటూ ప్లేసు అనుకుని స్కూల్‌కి రావడమంటే ప్రాణం పెట్టే కొండ గాడితో సహా ఎవ్వరూ స్కూల్‌కి రారు. అందుకని చెప్పులున్నాయా బూట్లున్నాయా లాంటి యక్ష ప్రశ్నలు మా పీటీ మాస్టరు అస్సలు వేసేవోరు కాదు.

ఇత్యాది కారణముల వల్ల నేను 'చెప్పులు జాగర్త' అనబడే అతి పెద్ద బాధ్యత నుంచి విముక్తి పొందడానికి బేర్‌ఫుట్ తొ తిరిగేదాన్ని...కొంచెం పెద్దయ్యాక కాలేజీ కి అలా వెళితే బాగుండదు కదా..అదిగో అప్పుడు చెప్పుల్లోకి ప్రమొషన్ తీసుకున్నా. విషయమేంటంటే..షూలూ గట్రా అలవాటు అసలు లేదు...అలా అలవాటు లేదూ అని వదిలేస్తే ఇక్కడ ఇంకేమైనా ఉందా..మంచుకి కాళ్ళు గడ్డ కట్టేసి కాళ్ళు తొలగించాల్సి వస్తుంది..యేదో అలవాటు చేసుకున్నా, మా ఫ్రెండ్

తో ప్రతి రోజు...'యీ బూట్లేంతో , యీ ప్యాంట్లేంటో,యీ పాట్లేంటో అని వాపోయేదాన్ని.

రామాయణం లో పిడకల వేటలా యీ చెప్పుల రామాయణమేంటీ అంటారా!అదిగో అక్కడికే వస్తున్నా..

ఇక్కడికొచ్చాకా ప్రతి ఒక్కరూ ‘be in his shoes'..అని అనడం విన్నాను...నా బూట్లతో నడవడమే నాకు చాతవట్లే ఇంక వేరే వాళ్ళ బూట్ల గొడవ నాకెందుకులే అనుకున్నా...కొంచమయ్యాక అలోచిస్తే.. కొత్త సీసాలో పాత సారాయి.సరేలే పరకాయ ప్రవేశం అని పబ్లిక్ లో పాత చింత కాయ మాటలెందుకూ స్టయిల్ గా ఉంటుందిలే అని నేను అందరి బూట్లల్లో కాళ్ళు పెట్టేప్రయత్నం చేసా...ఉహూ ..ఎవ్వరివీ పట్టాలా ! కొందరివి మరీ పెద్దవి, కొందరివి మరీ చిన్నవీ...మనకి పట్టవులే అని వదిలేదాన్ని వదిలేసి ఊరుకోకుండా మరి కొందరి బూట్లల్లో కాళ్ళు పెట్టి అనవసరంగా వాళ్ళ కాళ్ళకున్న అదేదో వ్యాధి కూడ అంటించేసుకున్నా..ఇంక ఇదంతా మనకెందుకులే అని అన్నీ వదిలేసి అన్నీ మరచి నా వ్యాపకాలతో నేను జీవించెయ్యడం మొదలు పెట్టా.

 

 

క్రమంగా కొంచెం విసుగు మొదలయ్యింది,అలసట వల్ల అనుకున్నా. చిరాకు నేనున్నానంది....కష్ట పడిపోతున్నా పాపం అని సరిపెట్టుకున్నా.కస్సుబుస్సు లాడ్డం జత కలిసింది..సహాయం చెయ్యడానికెవరూ లేరు అని నా మీద నేను జాలి పడ్డా... నిర్లిప్తత ఆవహించింది.ప్రపంచం లో నేను ఒంటరి దాన్ని అని గట్టి ఫీలింగ్. ‘నీకూ  నీ వారు లేరు నాకూ నా వారు లేరు ,మంచు లోనా ఇల్లు కడదామా చల్ మోహన రంగా’ అంటూ ఇక్కడికొచ్చినప్పుడు ఉన్న  ఉత్సాహం అంతా పోయి.”ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు..ఇల్లు నీకెక్కడిదె చిలుకా”...అనీ, “వస్తా వట్టిదె పోతా వట్టిదే ఆశ ఎందుకంటా” అనీ “నానాటి బ్రతుకు నాటకమూ” అనీ “స్థిరతా నహి నహి రే మానస, స్థిరతా నహి నహి రే” దగ్గర ఆగిపోయింది. అందరి మీదా విసుగు, కోపం, చిరాకు మనసుని మంచుతో కప్పేసింది..

 

దాన్లోభాగంగా ప్రతి వారం ఇంటికి ఫోన్ చెయ్యడం లో నిరాసక్తత..ఎప్పుడూ నేనేనా అని పంతం . జవాబు ఆశించకుండా ప్రతి చిన్న విషయానికీ మెయిల్స్ వ్రాసే నేను జవాబు రాదే అని ఎదురు చూడ్డం నిరాశ చెందడం.. చివరికి మొన్న పెద్ద పండక్కి ఇంట్లొ అందరి మీదా అలిగి “ఇంక యెవరికీ మెయిల్స్ రాయట్లేదు..ఇదే ఆఖరు” అని మెయిల్స్ కూడా పడేసా... నాలుగు రోజులు కస్సు బుస్సు ఇంట్లో బయటా అందరి మీదా....ఇంక మెయిల్స్ చూడ్డం కూడా మానేసా. ఐదో రోజున ఒక ఇంపార్టెంట్ మెయిల్ కోసం ఎదురు చూస్తూ ఇన్ బాక్స్ ఓపెన్ చేసా....ఖుల్ జా సిం సిం ఖజానా...!

  

అబ్బో ఎన్ని మెయిల్స్ అనుకున్నారూ? మెయిళ్ళు నెమళ్ళలా నాట్యం ఆడేసాయి ఇన్ బాక్స్ లో ..అవి చూసి విజయ గర్వం తో వికటాట్టహాసం చేసా....హహా...హ్హహ్హహ్హహ్హ...హహ్హహహ్హహ్హ్హ్హహ్హ్హ్హహ్హ్హ్హ . ఆ అట్టహాసం నాలో శక్తిని పెంచింది.. శక్తి వచ్చింది అన్న మాట అనుకోగానే నాకు అకస్మాత్తుగా శక్తి వర్మ గుర్తొచ్చాడు..దానితో పాటే పరకాయ విద్య., వెంటనే ఇతరుల బుర్రలోకి ప్రవేశించడం .., దాని వెనుక కొత్త సీసాలో పాత సారాయి..,, వెనువెంట be in others shoes...,,, చివరగా నాన్న.నాన్న, నాన్న.మత్తు వదిలి పోయింది. అందరి మీద కోపం హాంఫట్..

చాల కాలం తర్వాత పెదవుల మీద చిరు నవ్వు, మనసు లో ఉత్సాహం. సంతోషం గా వెంటనే ఫోన్ అందుకున్నాఇంటికి ఫోన్ చెయ్యడానికి.....

నాన్నా నీకు జోహార్లు..నువ్వు నేర్పిన పరకాయ విద్యకి జేజేలు...

సన్న జాజులోయ్....

Sunday, January 30, 2011

పెళ్ళప్పుడు మా అమ్మ నన్ను అప్పగిస్తూ  మా వారితో...' అమ్మాయి సెవెన్ జాస్మిన్ హయిటు నాయనా, జాగర్త గా చూసుకో ' అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది. మా వాళ్ళందరూ

అయోమయంగా మొహం పెట్టి, "పాపం బాధలో ఏదో  మాట్లాడుతోందిలే  పిచ్చి తల్లి" అని సర్దుకున్నా, తర్వాత  చుట్టూ చేరి,  మీ అమ్మ గారు ఏమన్నారు  ఇందాకా అప్పగింతలప్పుడూ" అని నన్నడిగారు."అదా....సెవెన్ జాస్మిన్స్ హయిటు అనగా 'ఏడు మల్లెల ఎత్తు' అని  కన్నులు తుడుచుకుని కల కల నవ్వాను.

 

నాలుగు రోజుల తరువాత మా సీతయ్య(అవును, ఎవరిమాటా వినడు)  “మీ ఊళ్ళొ ఏం పూలు పూస్తాయి” అనడిగారు. నేను ఉత్సాహంగా ”మల్లెలూ,చామంతులూ, బంతులూ..” అని లిస్ట్ చదవడం మొదలు పెట్టా."ఆగాగు,మల్లెల్లో ఏ రకాలు...సన్న జాజులా, బొండు మల్లెలా”? అన్నారు. సన్నజాజులే ఎందుకు? అన్నాన్నేను.

"నాకు చూడాలనుంది, మీ ఊరు వెళ్ళొద్దామా ఒక సారి" అన్నారు..నా మనసు మేఘాల్ని తాకిందీ 'హై హైలెస్సా' అంటూ. మా చిన్నాడు  లోపలికొస్తూ ' ఏంటీ ప్రయాణం అంటున్నారు ఎక్కడికీ' అన్నాడు..'నువ్వు కూడా బయల్దేరు చిన్నా, ప్రాజెక్టుకి ఏవో వింతలు విశేషాలూ కావాలన్నావుగా. మీ వదినా వాళ్ళ ఊళ్ళో వింత పూలు పూస్తాయిట. నా అభిప్రాయం ప్రకారం వీళ్ళ ఊరిలో పూచే మల్లెలేవో గిన్నిస్ బుక్ కి ఎక్కాల్సిందే' అని నా వైపు తిరిగి " మీ అమ్మ గారి లెక్క ప్రకారం ఏడు మల్లెలు డెబ్భయి కిలోలు ఉంటే, ఒక్కొక్క మల్లె పూవు కనీసం పది కిలోలైనా ఉంటుందేమో కదూ...భలే కాదా మీ ఊళ్ళో మల్లెలు" అని  వెటకారం బయట పెట్టేసారు. అవాక్కయి చూసా నేను, నలుగురిలో ఏమీ అనలేక. అదిగో అప్పటి నించీ గుర్తొచ్చినప్పుడల్ల సన్నజాజీ, మల్లెతీగ,  నాగమల్లీ అని పిలుపులొకటీ..

 

ఏదోలే, మా అమ్మని తలచుకొన్నట్టుంటుందని ఆ పిలుపులన్నీ లయిట్ తీసుకున్నా కానీ ఆ పిలుపులకి తగ్గట్టే ఆ మల్లె పూల బరువు మరీ ఎక్కువ కాకుండా రోజుకి కొన్ని గ్రాముల చొప్పున అవలీలగా పెరిగింది బంగారం ధర పెరిగినట్టు. అప్పటి నుంచీ మల్లెల ప్రస్తావన వచ్చిన ప్రతి సారీ, 'ఇలా అంటే నేను అన్నం తిననంతే'అని గారాలు పోయా. మా అత్తగారు కల్పించుకుని 'ఏవిట్రా అదీ, పిల్లని తిననీకుండా...పిల్లల్ని కనాల్సిన పిల్ల దిష్టి పెట్టకు అని వెనకేసుకొచ్చారు.

పైగా' వాడి ముందు తినకు' అని వారు లేనప్పుడు రెండు మూడు రోజులకి సరిపడా ఒక డోసులో పెట్టేసి తినిపించేసేవారు.  పాపం పెద్దావిడ అంత ప్రేమగా పెట్టినప్పుడు కాదనడం ఎలాగ మీరే చెప్పండి?

 

 

ఉమ్మడి కుటుంబంలో  పిల్లల సంఖ్య పెరిగాక, ఇంట్లో పిల్లలందరికీ అన్నం పెట్టడం నా వంతు. యీ పిల్లల్ని పెంచడమేమో కానీ, ప్రతి పూటా  వాళ్ళ కోసం  అన్నం కలపడం, వాళ్ళు తినకపోతే అయ్యో వేస్టు అయిపోతుందే అని బాధ పడి అలా నోట్లో పడేసుకోడం. అంతే కాక పిల్లలు సగం తిని వదిలేసిన బిస్కట్లూ, చాక్లెట్లూ, అరిశెలూ, అప్పచ్చులూ.......మరి సన్నజాజులు, విరజాజులు రూపాంతరం చెంది బొండుమల్లెలవక ఛస్తాయా!!!

 

మాకు ట్రాన్స్ఫర్ వచ్చి ఇంకో ఊరు చేరాక, ఉమ్మడి కుటుంబంలో ఉండే సుఖాలన్నీ ఉష్ కాకీ..

ఇంటి పని ముగించుకుని, పిల్లలని బడిలో దింపే పరుగుల్లో...పొద్దున్న హడావిడిగా ఏమీ తినకుండా ఆఫీసుకి వెళ్ళిపోయి,  లంచుకి తీసుకెళ్ళిన చిన్ని డబ్బాలో వస్తువుని నలుగురితో పంచుకుని తినడం వల్ల, పోనీలే ఏదో డైటింగు చేస్తున్నా అని ఫీలింగు వచ్చేది. ఆది వారం ఆరు రోజులకి సరిపడా లాగించేసినా... అబ్బ పోదురూ.. ఆ మాత్రం తినకపోతే ఎలా అసలు!!

 

 

కాల క్రమేణా అవేవో డయిటింగులవీ వచ్చాయి. తినడం మానేయక్కరలేదుట కానీ "ఒకే సారి తినకండి,  కొంచెం కొంచెంగా చాలాసార్లు తినమని"   డాట్రు గార్లు, డయిటీషియన్లూ టీవీల్లో అరచి అరచి మరీ చెప్తారు కాబట్టి వాళ్ళని ఇన్సల్ట్ చేసి వాళ్ళ మనసు బాధ పెట్టడం బాగుండదు కనుక , రెండు బ్రేకులు, ఒక లంచూ , డెస్క్ దగ్గర తినడానికి చిరు తిండీ, పళ్ళూ,  ఫలాలు  ( డ్రయి ఫ్రూట్స్ అన్నమాట) పట్టికెళ్ళేదాన్ని. ఈ మధ్య  అన్ని ఆఫీసుల్లో కాఫీ మిషన్లు ఉద్దరగా ఉండడంతో మధ్య మధ్యే పానీయాలతో మల్లె తీగ కళ లాడిపోతోంది.

 

ఇక పోతే వారంలో ఒక్కటంటే ఒక్క రోజు.. అదే శనివారాలు అందరికీ ఫుడ్ తెప్పిస్తారు ఆఫీసులో. (ఏబీవీపీ ..ఎవడి బిల్లు వాడే పే చేసే ప్రాతిపదికన)  ఏదో నలుగురితో నారాయణ... తినక పోతే బాగుంటుందా మీరు చెప్పండి! ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు తినడమే మానేసాను,  మీరు నమ్మాలంతే,నమ్మక పోతే నా మీదొట్టు.

 

కాస్త మోకాళ్ళు నెప్పిగా ఉన్నాయి ఎవరి పనులు వాళ్ళని చేసుకోమంటానో లేదో "అమ్మా జిమ్ముకి వెళ్ళచ్చు కదా" అని పిల్లలుమొదలెట్టారు. "ఛీ ఊరుకోండిరా,గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట, నాకు అవన్నీ ఎందుకు?  బోలెడు పని ఇంటా బయటా. ఇంట్లో పనే నాకు పెద్ద జిమ్ము తెలుసా ? పొద్దున్న లేచినప్పటి నుంచీ ఎంత పని. వంట, ఇల్లు-వాకిలీ, తుడుపుళ్ళు-కడుగుళ్ళు, అబ్బో "అంటూ,  ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలో ముత్యాల ముగ్గు కథానాయిక చేసిన పని లెవెల్లో చెప్పి చెప్పి ఊదరగొట్టేసా. ఇంక మల్లెలు, మల్లె తీగలు విషయాలు ఎప్పుడైనా డిస్కషన్ కి వచ్చాయంటే, గబ గబా ఫోను కలిపేసి, అత్తయ్యా...ఊ..ఊ.. అని షికాయత్ లు. అక్కడి నుండి వార్నింగులు...హహహ..మరి ఏటనుకున్నారు మనమంటే!!

 

“అసలు ఆడాళ్ళు ఇంట్లోనే పదమూడు కిలోమీటర్లు నడిచేస్తారట తెలుసా! ఇంటి పని చేసుకుంటే 1000 క్యాలరీలు కరుగుతాయట”! లాంటి ఆశ్చర్యకరమైన నిజాల్ని సేకరించి, ఎప్పటికప్పుడు మా ఇంట్లో అందరి మెదడు బోర్డ్ మీద స్క్రోల్ అయ్యే సదుపాయం కల్పించేసాను నేను. " నిను చూస్తూ మేముండలేమూ" అని వాళ్ళు., " తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్..." అని నేనూ హోరా హోరీ "ఇది సంగీత సంగ్రామమూ " అనే ప్రోగ్రాం  పెట్టేసుకున్నాం. విజేతనైన నేను ఒక పక్కా, వాళ్ళ నాన్న ఒక పక్కా ఎక్కువెక్కువ తిండి కుక్కి కుక్కి పెట్టేస్తున్నామని ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా  పిల్లలు అందరి దగ్గరా కంప్లెయింట్లు చేసారు. వీలు దొరికినప్పుడల్లా స్కూల్లో నేర్చుకున్న హెల్తీ ఫుడ్ హాబిట్స్ గురించి చిన్న చిన్న క్లాసులు పీకడం, ఎవరితోనైనా పీకించడం వృధా అని వాళ్ళకి త్వరలోనే అర్థం అయ్యింది. దాంతో అందరూ చెప్పినంత చెప్పి, మా వల్ల కాదు బాబోయ్ అని చూసీ చూడనట్టు వదిలేసారు.

 

మరి ఎవ్వరూ పట్టించుకోకపోతే ఎలా అండీ..అలా పట్టించుకోడం మానేసారని నేను తెగ బెంగ పెట్టుకున్నాను తెలుసా! మొన్న మా రాజీ  ఫోన్  చేసినప్పుడు చెప్పింది "ఎవరయినా బెంగ పెట్టుకున్నా, మానసికంగా ఆందోళనకు గురి అయినా బరువు పెరుగుతారంట"..చూసారా? ఇప్పుడు చెప్పండి మీరు అసలు నా సమస్యకి కారణమేంటో!!

 

యీ మధ్య అద్దంలో చూసుకుంటూ.."ఏంటో, మొహమంతా కళ తప్పింది, జుట్టు నెరిసి పోతోంది, కళ్ళ కింద నల్ల చారలొచ్చేసాయ్, బరువు పెరిగి పోయిందీ..చాలా డిప్రెసుడుగా ఉందీ...ఏమైనా కాంప్లిమెంటు ఇవ్వొచ్చుగా" అని అడిగా..."పోనీలే,అన్నీ ఎలా ఉన్నా నీ కళ్ళు మాత్రం చాలా పర్ఫెక్టుగా పని చేస్తున్నాయనుకుంటా" అన్నారు. మనసు చిన్నబోయింది, కానీ మల్లె తీగ మాత్రం బాగా వృద్ధి చెందిందండోయ్!

 

అలా దిగులు(వృద్ధి) చెందుతూ చెందుతూ ..దేవుడిని ప్రార్థించడం మొదలు పెట్టా...'లావొక్కింతయు లేదు...ధయిర్యము విలోలంబయ్యె'అని ఒకటే మొరలు , ప్రార్థనలూ. 'అమ్మా నాగ మల్లీ..నీ ప్రార్థనలో యేదో దోషములున్నవి సరి చూసుకో తల్లీ ' అని దేవుడు ఖంగారు పడ్డట్టనిపించింది ఎందుకో. 'అర్థం కావట్లేదు స్వామీ' అన్నాను, కానీ ఆయన పలకలేదు. ఎంత అడిగినా మౌనమే సమాధానం. ఏమయ్యుంటుందబ్బాబ్బా అని ఎంత ఆలో... చించినా అర్థం కాలేదు.

 

ఒక చిన్ననాటి స్నేహితురాలు కలిసిందీ మధ్య. " మా దగ్గర పూజలు చేస్తున్నారు రాకూడదూ" అంది. " రానే, దేవుడు నాతో పలకట్లేదు. దేవుడికీ నాకు కటీఫ్ అయ్యింది " అన్నా. ఆమె ఆతృతగా అడిగే ప్రశ్నలకి తట్టుకోలేక ఇలా ఒక పద్యం చదివితే దేవుడు ఏదో సరి చేసుకోమన్నాడనీ, ఏం సరి చేసుకోవాలో చెప్పలేదని , అదే పద్యం రోజూ చదువుతున్నాననీ చెప్పా. ఇంతకీ ఏం పద్యమది అని అడిగి, " లావొక్కింతయు లేకపోవడమేంటే, నీ మొఖం .. నీకు వచ్చు కదా అని ఏదో ఒకటి చదివితే  మరి దేవుడు మాత్రం ఖంగారు పడడా ?" అంది.. 'అదేంటీ చిన్నప్పటి నించి చదివే పద్యమే గా దేవుడి సిలబస్ మారిందా " అనడిగా అమాయకం గా.. ఒసేయ్ మొద్దూ, వద్దు వద్దు దేవుడిని నువ్వు కంఫ్యూస్  చెయ్యకు' అని మందలించి “నీ సమస్యకి ఆ పద్యం కాదు ఈ మంత్రం చదివాలి" అని చెప్పి మంత్రోపదేశం చేసింది.

 

యీ మంత్రం నాకు బాగా నచ్చేసింది...మీకు కూడా నచ్చుతుందనీ, మీరు కూడా ప్రార్థిస్తారనీ తలంచి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను...ముందుగానే చెప్పాను కదండీ మంచి మంచి వన్నీ మీతో పంచుకుంటానూ అని...అదన్న మాట విషయం...(అదిగో, మీరు మెచ్చుకుంటున్నారని నాకు తెలుసు..ఎక్కువ మెచ్చుకోకండే..యీ మధ్యనే మంత్రం పని చేస్తోందండీ...మళ్ళీ మీరు మెచ్చుకున్నారన్న ఆనందం తట్టుకోలేక ఉబ్బి తబ్బిబ్బయిపోతే..ఇంక మబ్బుల్లో నివసించాల్సి వస్తుంది మరి!)సరే, ఇప్పుడు క్రింది మంత్రం ప్రతి రోజూ 108 సార్లు చదవండి...ఇంక ఆనందమానందమాయెనూ..అని పాడుకుంటారు నాలాగే.

 

సన్నగా ఉన్నవారు  యీ మంత్రాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి చదువుకోవలసిందిగా విన్నపం..లేకపోతే తేడాలొచ్చేస్తాయండోయ్!! మంత్రాన్ని కస్టమైజ్  చేసుకునే విషయం లో ఎవరికి వారే బాధ్యులు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు  బాధ్యత లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. క్షమించెయ్యండి యీ మంత్రాన్ని తెలుగు లోకి అనువదించడం నాకు చేత కాలేదు.

 

////Dear God: For 2020 and there on, all I ask for is a big fat bank account,  and a slim body. Please do not mix up the two like you did last year. Amen////