సన్న జాజులోయ్....

Sunday, January 30, 2011

పెళ్ళప్పుడు మా అమ్మ నన్ను అప్పగిస్తూ  మా వారితో...' అమ్మాయి సెవెన్ జాస్మిన్ హయిటు నాయనా, జాగర్త గా చూసుకో ' అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది. మా వాళ్ళందరూ

అయోమయంగా మొహం పెట్టి, "పాపం బాధలో ఏదో  మాట్లాడుతోందిలే  పిచ్చి తల్లి" అని సర్దుకున్నా, తర్వాత  చుట్టూ చేరి,  మీ అమ్మ గారు ఏమన్నారు  ఇందాకా అప్పగింతలప్పుడూ" అని నన్నడిగారు."అదా....సెవెన్ జాస్మిన్స్ హయిటు అనగా 'ఏడు మల్లెల ఎత్తు' అని  కన్నులు తుడుచుకుని కల కల నవ్వాను.

 

నాలుగు రోజుల తరువాత మా సీతయ్య(అవును, ఎవరిమాటా వినడు)  “మీ ఊళ్ళొ ఏం పూలు పూస్తాయి” అనడిగారు. నేను ఉత్సాహంగా ”మల్లెలూ,చామంతులూ, బంతులూ..” అని లిస్ట్ చదవడం మొదలు పెట్టా."ఆగాగు,మల్లెల్లో ఏ రకాలు...సన్న జాజులా, బొండు మల్లెలా”? అన్నారు. సన్నజాజులే ఎందుకు? అన్నాన్నేను.

"నాకు చూడాలనుంది, మీ ఊరు వెళ్ళొద్దామా ఒక సారి" అన్నారు..నా మనసు మేఘాల్ని తాకిందీ 'హై హైలెస్సా' అంటూ. మా చిన్నాడు  లోపలికొస్తూ ' ఏంటీ ప్రయాణం అంటున్నారు ఎక్కడికీ' అన్నాడు..'నువ్వు కూడా బయల్దేరు చిన్నా, ప్రాజెక్టుకి ఏవో వింతలు విశేషాలూ కావాలన్నావుగా. మీ వదినా వాళ్ళ ఊళ్ళో వింత పూలు పూస్తాయిట. నా అభిప్రాయం ప్రకారం వీళ్ళ ఊరిలో పూచే మల్లెలేవో గిన్నిస్ బుక్ కి ఎక్కాల్సిందే' అని నా వైపు తిరిగి " మీ అమ్మ గారి లెక్క ప్రకారం ఏడు మల్లెలు డెబ్భయి కిలోలు ఉంటే, ఒక్కొక్క మల్లె పూవు కనీసం పది కిలోలైనా ఉంటుందేమో కదూ...భలే కాదా మీ ఊళ్ళో మల్లెలు" అని  వెటకారం బయట పెట్టేసారు. అవాక్కయి చూసా నేను, నలుగురిలో ఏమీ అనలేక. అదిగో అప్పటి నించీ గుర్తొచ్చినప్పుడల్ల సన్నజాజీ, మల్లెతీగ,  నాగమల్లీ అని పిలుపులొకటీ..

 

ఏదోలే, మా అమ్మని తలచుకొన్నట్టుంటుందని ఆ పిలుపులన్నీ లయిట్ తీసుకున్నా కానీ ఆ పిలుపులకి తగ్గట్టే ఆ మల్లె పూల బరువు మరీ ఎక్కువ కాకుండా రోజుకి కొన్ని గ్రాముల చొప్పున అవలీలగా పెరిగింది బంగారం ధర పెరిగినట్టు. అప్పటి నుంచీ మల్లెల ప్రస్తావన వచ్చిన ప్రతి సారీ, 'ఇలా అంటే నేను అన్నం తిననంతే'అని గారాలు పోయా. మా అత్తగారు కల్పించుకుని 'ఏవిట్రా అదీ, పిల్లని తిననీకుండా...పిల్లల్ని కనాల్సిన పిల్ల దిష్టి పెట్టకు అని వెనకేసుకొచ్చారు.

పైగా' వాడి ముందు తినకు' అని వారు లేనప్పుడు రెండు మూడు రోజులకి సరిపడా ఒక డోసులో పెట్టేసి తినిపించేసేవారు.  పాపం పెద్దావిడ అంత ప్రేమగా పెట్టినప్పుడు కాదనడం ఎలాగ మీరే చెప్పండి?

 

 

ఉమ్మడి కుటుంబంలో  పిల్లల సంఖ్య పెరిగాక, ఇంట్లో పిల్లలందరికీ అన్నం పెట్టడం నా వంతు. యీ పిల్లల్ని పెంచడమేమో కానీ, ప్రతి పూటా  వాళ్ళ కోసం  అన్నం కలపడం, వాళ్ళు తినకపోతే అయ్యో వేస్టు అయిపోతుందే అని బాధ పడి అలా నోట్లో పడేసుకోడం. అంతే కాక పిల్లలు సగం తిని వదిలేసిన బిస్కట్లూ, చాక్లెట్లూ, అరిశెలూ, అప్పచ్చులూ.......మరి సన్నజాజులు, విరజాజులు రూపాంతరం చెంది బొండుమల్లెలవక ఛస్తాయా!!!

 

మాకు ట్రాన్స్ఫర్ వచ్చి ఇంకో ఊరు చేరాక, ఉమ్మడి కుటుంబంలో ఉండే సుఖాలన్నీ ఉష్ కాకీ..

ఇంటి పని ముగించుకుని, పిల్లలని బడిలో దింపే పరుగుల్లో...పొద్దున్న హడావిడిగా ఏమీ తినకుండా ఆఫీసుకి వెళ్ళిపోయి,  లంచుకి తీసుకెళ్ళిన చిన్ని డబ్బాలో వస్తువుని నలుగురితో పంచుకుని తినడం వల్ల, పోనీలే ఏదో డైటింగు చేస్తున్నా అని ఫీలింగు వచ్చేది. ఆది వారం ఆరు రోజులకి సరిపడా లాగించేసినా... అబ్బ పోదురూ.. ఆ మాత్రం తినకపోతే ఎలా అసలు!!

 

 

కాల క్రమేణా అవేవో డయిటింగులవీ వచ్చాయి. తినడం మానేయక్కరలేదుట కానీ "ఒకే సారి తినకండి,  కొంచెం కొంచెంగా చాలాసార్లు తినమని"   డాట్రు గార్లు, డయిటీషియన్లూ టీవీల్లో అరచి అరచి మరీ చెప్తారు కాబట్టి వాళ్ళని ఇన్సల్ట్ చేసి వాళ్ళ మనసు బాధ పెట్టడం బాగుండదు కనుక , రెండు బ్రేకులు, ఒక లంచూ , డెస్క్ దగ్గర తినడానికి చిరు తిండీ, పళ్ళూ,  ఫలాలు  ( డ్రయి ఫ్రూట్స్ అన్నమాట) పట్టికెళ్ళేదాన్ని. ఈ మధ్య  అన్ని ఆఫీసుల్లో కాఫీ మిషన్లు ఉద్దరగా ఉండడంతో మధ్య మధ్యే పానీయాలతో మల్లె తీగ కళ లాడిపోతోంది.

 

ఇక పోతే వారంలో ఒక్కటంటే ఒక్క రోజు.. అదే శనివారాలు అందరికీ ఫుడ్ తెప్పిస్తారు ఆఫీసులో. (ఏబీవీపీ ..ఎవడి బిల్లు వాడే పే చేసే ప్రాతిపదికన)  ఏదో నలుగురితో నారాయణ... తినక పోతే బాగుంటుందా మీరు చెప్పండి! ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు తినడమే మానేసాను,  మీరు నమ్మాలంతే,నమ్మక పోతే నా మీదొట్టు.

 

కాస్త మోకాళ్ళు నెప్పిగా ఉన్నాయి ఎవరి పనులు వాళ్ళని చేసుకోమంటానో లేదో "అమ్మా జిమ్ముకి వెళ్ళచ్చు కదా" అని పిల్లలుమొదలెట్టారు. "ఛీ ఊరుకోండిరా,గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట, నాకు అవన్నీ ఎందుకు?  బోలెడు పని ఇంటా బయటా. ఇంట్లో పనే నాకు పెద్ద జిమ్ము తెలుసా ? పొద్దున్న లేచినప్పటి నుంచీ ఎంత పని. వంట, ఇల్లు-వాకిలీ, తుడుపుళ్ళు-కడుగుళ్ళు, అబ్బో "అంటూ,  ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలో ముత్యాల ముగ్గు కథానాయిక చేసిన పని లెవెల్లో చెప్పి చెప్పి ఊదరగొట్టేసా. ఇంక మల్లెలు, మల్లె తీగలు విషయాలు ఎప్పుడైనా డిస్కషన్ కి వచ్చాయంటే, గబ గబా ఫోను కలిపేసి, అత్తయ్యా...ఊ..ఊ.. అని షికాయత్ లు. అక్కడి నుండి వార్నింగులు...హహహ..మరి ఏటనుకున్నారు మనమంటే!!

 

“అసలు ఆడాళ్ళు ఇంట్లోనే పదమూడు కిలోమీటర్లు నడిచేస్తారట తెలుసా! ఇంటి పని చేసుకుంటే 1000 క్యాలరీలు కరుగుతాయట”! లాంటి ఆశ్చర్యకరమైన నిజాల్ని సేకరించి, ఎప్పటికప్పుడు మా ఇంట్లో అందరి మెదడు బోర్డ్ మీద స్క్రోల్ అయ్యే సదుపాయం కల్పించేసాను నేను. " నిను చూస్తూ మేముండలేమూ" అని వాళ్ళు., " తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్..." అని నేనూ హోరా హోరీ "ఇది సంగీత సంగ్రామమూ " అనే ప్రోగ్రాం  పెట్టేసుకున్నాం. విజేతనైన నేను ఒక పక్కా, వాళ్ళ నాన్న ఒక పక్కా ఎక్కువెక్కువ తిండి కుక్కి కుక్కి పెట్టేస్తున్నామని ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా  పిల్లలు అందరి దగ్గరా కంప్లెయింట్లు చేసారు. వీలు దొరికినప్పుడల్లా స్కూల్లో నేర్చుకున్న హెల్తీ ఫుడ్ హాబిట్స్ గురించి చిన్న చిన్న క్లాసులు పీకడం, ఎవరితోనైనా పీకించడం వృధా అని వాళ్ళకి త్వరలోనే అర్థం అయ్యింది. దాంతో అందరూ చెప్పినంత చెప్పి, మా వల్ల కాదు బాబోయ్ అని చూసీ చూడనట్టు వదిలేసారు.

 

మరి ఎవ్వరూ పట్టించుకోకపోతే ఎలా అండీ..అలా పట్టించుకోడం మానేసారని నేను తెగ బెంగ పెట్టుకున్నాను తెలుసా! మొన్న మా రాజీ  ఫోన్  చేసినప్పుడు చెప్పింది "ఎవరయినా బెంగ పెట్టుకున్నా, మానసికంగా ఆందోళనకు గురి అయినా బరువు పెరుగుతారంట"..చూసారా? ఇప్పుడు చెప్పండి మీరు అసలు నా సమస్యకి కారణమేంటో!!

 

యీ మధ్య అద్దంలో చూసుకుంటూ.."ఏంటో, మొహమంతా కళ తప్పింది, జుట్టు నెరిసి పోతోంది, కళ్ళ కింద నల్ల చారలొచ్చేసాయ్, బరువు పెరిగి పోయిందీ..చాలా డిప్రెసుడుగా ఉందీ...ఏమైనా కాంప్లిమెంటు ఇవ్వొచ్చుగా" అని అడిగా..."పోనీలే,అన్నీ ఎలా ఉన్నా నీ కళ్ళు మాత్రం చాలా పర్ఫెక్టుగా పని చేస్తున్నాయనుకుంటా" అన్నారు. మనసు చిన్నబోయింది, కానీ మల్లె తీగ మాత్రం బాగా వృద్ధి చెందిందండోయ్!

 

అలా దిగులు(వృద్ధి) చెందుతూ చెందుతూ ..దేవుడిని ప్రార్థించడం మొదలు పెట్టా...'లావొక్కింతయు లేదు...ధయిర్యము విలోలంబయ్యె'అని ఒకటే మొరలు , ప్రార్థనలూ. 'అమ్మా నాగ మల్లీ..నీ ప్రార్థనలో యేదో దోషములున్నవి సరి చూసుకో తల్లీ ' అని దేవుడు ఖంగారు పడ్డట్టనిపించింది ఎందుకో. 'అర్థం కావట్లేదు స్వామీ' అన్నాను, కానీ ఆయన పలకలేదు. ఎంత అడిగినా మౌనమే సమాధానం. ఏమయ్యుంటుందబ్బాబ్బా అని ఎంత ఆలో... చించినా అర్థం కాలేదు.

 

ఒక చిన్ననాటి స్నేహితురాలు కలిసిందీ మధ్య. " మా దగ్గర పూజలు చేస్తున్నారు రాకూడదూ" అంది. " రానే, దేవుడు నాతో పలకట్లేదు. దేవుడికీ నాకు కటీఫ్ అయ్యింది " అన్నా. ఆమె ఆతృతగా అడిగే ప్రశ్నలకి తట్టుకోలేక ఇలా ఒక పద్యం చదివితే దేవుడు ఏదో సరి చేసుకోమన్నాడనీ, ఏం సరి చేసుకోవాలో చెప్పలేదని , అదే పద్యం రోజూ చదువుతున్నాననీ చెప్పా. ఇంతకీ ఏం పద్యమది అని అడిగి, " లావొక్కింతయు లేకపోవడమేంటే, నీ మొఖం .. నీకు వచ్చు కదా అని ఏదో ఒకటి చదివితే  మరి దేవుడు మాత్రం ఖంగారు పడడా ?" అంది.. 'అదేంటీ చిన్నప్పటి నించి చదివే పద్యమే గా దేవుడి సిలబస్ మారిందా " అనడిగా అమాయకం గా.. ఒసేయ్ మొద్దూ, వద్దు వద్దు దేవుడిని నువ్వు కంఫ్యూస్  చెయ్యకు' అని మందలించి “నీ సమస్యకి ఆ పద్యం కాదు ఈ మంత్రం చదివాలి" అని చెప్పి మంత్రోపదేశం చేసింది.

 

యీ మంత్రం నాకు బాగా నచ్చేసింది...మీకు కూడా నచ్చుతుందనీ, మీరు కూడా ప్రార్థిస్తారనీ తలంచి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను...ముందుగానే చెప్పాను కదండీ మంచి మంచి వన్నీ మీతో పంచుకుంటానూ అని...అదన్న మాట విషయం...(అదిగో, మీరు మెచ్చుకుంటున్నారని నాకు తెలుసు..ఎక్కువ మెచ్చుకోకండే..యీ మధ్యనే మంత్రం పని చేస్తోందండీ...మళ్ళీ మీరు మెచ్చుకున్నారన్న ఆనందం తట్టుకోలేక ఉబ్బి తబ్బిబ్బయిపోతే..ఇంక మబ్బుల్లో నివసించాల్సి వస్తుంది మరి!)సరే, ఇప్పుడు క్రింది మంత్రం ప్రతి రోజూ 108 సార్లు చదవండి...ఇంక ఆనందమానందమాయెనూ..అని పాడుకుంటారు నాలాగే.

 

సన్నగా ఉన్నవారు  యీ మంత్రాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి చదువుకోవలసిందిగా విన్నపం..లేకపోతే తేడాలొచ్చేస్తాయండోయ్!! మంత్రాన్ని కస్టమైజ్  చేసుకునే విషయం లో ఎవరికి వారే బాధ్యులు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు  బాధ్యత లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. క్షమించెయ్యండి యీ మంత్రాన్ని తెలుగు లోకి అనువదించడం నాకు చేత కాలేదు.

 

////Dear God: For 2020 and there on, all I ask for is a big fat bank account,  and a slim body. Please do not mix up the two like you did last year. Amen////

 

 

పిలచినా బిగువటరా......

Monday, January 24, 2011


చదువు అయిపోయాక నేను చేస్తున్న ఉద్యోగాల కంటే, ఒక మెట్టు పెద్ద ఉద్యోగం చేస్తే తప్ప, చదువు పూర్తి కాదని సెలవిచ్చారు. ఇక్కడ కాకుండా నయాగరా దగ్గర ఉన్న చిన్న ఊరిలో ఉద్యోగం దొరికింది నాకు. ఊరి పేరు సెయింట్ కాథరీన్స్ .  మొదటి వారమంతా కష్టపడి మామూలు బస్సు,  గో రెయిలు(ఆకు పచ్చ రంగులో ఉండే ప్రత్యెకమైన బస్సులు, రైళ్ళు)ఎక్కి,  బర్లింగ్టన్ లో దిగి, మళ్ళీ గో బస్సెక్కీ, సెయింట్ కాథరీన్స్ లో  దిగి మళ్ళీ సెయింట్ కాథరీన్స్ లో రెండు బస్సులెక్కి, 2 కిలొమీటర్లు నడిచి ఆఫీసుకి వచ్చేదాన్ని...మళ్ళీ వెళ్ళేటప్పుడు, ఇవన్నీ ఎక్కి ఇంటికెళ్ళి హమ్మయ్యా అనుకోకుండానే .. సింకు నిండా అంట్లు...ఇంటి నిండా..బూట్లు, బట్టలు..చెప్పులు...తిని పడేసిన అప్పచ్చుల ప్యాకీట్లు కనిపిస్తే...గృహమే కదా స్వర్గ సీమ అని అనిపించక చస్తుందా చెప్పండీ ....ఇక్కడ ఆఫీసులో బయల్దేరింది మొదలు ఆ స్వర్గ సీమ గురించీ తలచుకునీ, తలచుకునీ దిగులు...ఏం చూడాల్సి వస్తుందో అని. ఏదో శిశిరం గాబట్టి సరిపోయింది గానీ శీతా కాలమయితే ఇలా ప్రయాణం అసాధ్యమే..

 

ఇలా ప్రయాణం తోనే రోజులో ఆరేడు గంటలు పోవడంతో ఒక వారం లోపలే అక్కడే ఇల్లు దొరుకుతుందా అనీ వాకబు చేస్తే...శ్రీ లంకను తమిళుడెవరో "ఇరుకు ఇరుకు, అమ్మాసింగళ్ బెడ్రూం  అపార్ట్త్మెంట్ అవయిళబుళ్ అన్నాడు. హమ్మయ్యా అనుకుని తట్టా బుట్టా సర్దుకుని రెండు వారాల తర్వాత వచ్చి పడ్డాను పిల్లలతో సహా. అసలు వచ్చేటప్పుడు ఏమనుకున్నాం? నేను పిల్లల్తో ముందర వచ్చేస్తే,  సీతయ్య కూడా ఆఫీసులో అడిగి ట్రాన్స్ఫర్  పెట్టుకుంటారని...రోజూ చెవిలో గూడు కట్టి పోరాను..ట్రాన్స్ఫర్ మహా ప్రభో అని. ఈ దేశానికొచ్చాక, అందరూ ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. అదిగో ఈ సారి చదువు సీతయ్య వంతు. తను చేరిన చదువుకి క్లాసులు అక్కడికి దగ్గర..దాంతో...నేను కట్టిన గూడు చెవిలో వేలాడుతూ అందరికీ కనిపించడం తప్ప, నా పోరు ఎవరికీ వినిపించడం మానేసింది. దాంతో సీతయ్య ఇక్కడికొచ్చి ఉంటారనే ఆశ పూర్తిగా పోయింది.

 

 

ఇది డౌన్ టౌన్. ఇరుకు రోడ్లు, అర్థం పర్థం లేకుండా ఉన్న రోడ్డు రూల్స్, మీద మీదకొచ్చే ట్రాంలూ,బస్సులూనూ. పార్కింగ్ ఎక్కడ చెయాలో అని కూడా అలోచించడానికి వీల్లేని సందులు, కళ్ళు తిరిగి పడిపోయే పార్కింగ్ రేట్లూ, ఎవరు పొరపాటున రాంగ్ పార్క్ చేస్తారా అని చూసి, చిటుక్కుని టికట్ పెట్టే ట్రాఫిక్ పోలీసులు,  ఇంకా ధైర్యస్థులు ఎవరైనా బండి ఏమరి పాటుగా వదిలేస్తే మోసెయ్యడానికి తయారుగా ఉన్న టోయింగ్ ట్రక్కులూ. వింత వింత చేష్టలు చేస్తూ ,రెండు డాల్లర్లున్నాయా అని స్టయిల్ గా అడుక్కునే వారు, డబ్బు ఇవ్వకపోతే కాల్చి పడేస్తారని పుకార్లు, ఇవన్నీ డౌన్ టౌన్ పేరు వినగానే 70 ఎం ఎం లో కనిపించి..వంటికి చెమట తెప్పిస్తాయి సదరు తలచుకున్నవారికి. మాకూ, మా స్నేహితులకీ ఈ పేరంటేనే భయం.

ఇది అలా భయపెట్టే డౌన్ టౌన్. నావరకు నాకయితే ఒక పల్లెటూరు. చుట్టూ నాలుగు బాంకీలు. తెగ మురిసిపోయాను. హౌస్ క్లీనింగ్-నో ఫెస్టివల్ అని మున్నాభాయి గారు ఊరికే అన్నారా?  బాంకీలుండగానే సరా, బ్యాంకీలలో వెయ్యడానికో తియ్యడానికో తైలం ఉండాలిగా. పోనీలే అలా చుట్టూ బాంకీలుంటే ఎప్పటికయినా రిచ్ అయిపోవచ్చని రోజూ బ్యాంకీలని చూస్తూ ఉండడం అలవాటు చేసుకున్నా. పైగా  అమ్మకి ఇష్టమైన బంతి , చామంతీ కనిపిస్తాయి ఎటు చూసినా. ఎటొచ్చీ నచ్చనిదల్లా అపార్టుమెంటు బయట రోడ్డుకిరువైపులా పార్కింగ్ మీటర్లు ఉన్నచిన్న చిన్న స్థంబాలు, ఎంత అని చూసా మీటరు మీద రేట్లు...తరవాత ఎందుకు చూసానా  అని స్పృహ వచ్చాక బాధ పడ్డాననుకోండీ...కానయితే ఏంచేస్తాం....టూ లేటు ...

ఇక్కడ పచారీ కొట్టు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. అందులో తిను బండారాల కంటే బట్టలు ఎక్కువ అమ్ముతారు. అవసరానికి  పాలు కొంటే రెండు సార్లు విరిగిపోయాయి...బ్రెడ్డు కొంటే కొంచెం కొంచెం మరకలొచ్చాయి. సీతయ్యకి టెన్షన్..నేను, పిల్లలు అక్కడ కొన్న వస్తువులు తింటామేమో అని భయపడి, ప్రతివారం మిస్సిస్సాగా నించి  ఎక్కువ మొత్తంలో సరుకులు తెచ్చేవారు. ప్రతి శని వారం వచ్చేవారు, కానీ యీ ఉన్న అర గంట లోపలే పార్కింగుకి వేసిన డాలర్లు సరిపోతాయో  లేదో అని పది సార్లు అనుమానం. పార్కింగ్ బిల్ల్ విష్ణు చక్రం లాగా తిరిగిపోతుంది. సామాను ఇంట్లోకి తెచ్చిన పది నిముషాలకే సరే ఇంక వెళుతున్నా అంటారు. అయ్యొ రామా...వంట చేసేసా తిని వెళ్ళండీ అంటే...బాక్స్ లో సర్ది ఇచ్చెయ్యి ఇంటికెళ్ళి తింటా అంటారు. ఇది ఇల్లు కాదా అని గొడవపడ్డాను కొన్ని సార్లు... "ఇక్కడ నించోడానికీ కూచోడానికీ లేదు. ఊపిరాడదు. నాకేంటో హోటల్ రూముకొచ్చినట్టుంది...హాస్టల్ రూం లాగ ఉంది ..ఇంకా పొతే హాస్పిటల్ రూములాగా ఉంది" అని వెళ్ళిపోతారు. పోనీలే, మరీ చిన్న ఇల్లు కదా ..పైగా పార్కింగ్ బోల్డు ఖర్చు. అలా అనిపించడం సహజమే అనుకున్నా.

ఒక రోజు పిల్లలు చదూకోటానికి  వీలుగా లేదు నాన్నారూ అని చిన్ని కంప్లైంటు చేసారు ...వెంటనే వాల్మార్ట్ అడ్రెస్సు కనుక్కుని స్టడీ  టేబుల్ కొనుక్కొచ్చారు. టేబులంటే టేబులు కాదు అన్నట్లు 120 ముక్కలు. అవన్నీ అతికించి  జిగ్సా పజిల్ లాగా అమర్చేటప్పటికి చిన్న కుటీర పరిశ్రమ పెట్టిన ఫీలింగ్ ఇంట్లో. నాలుగైదు గంటలు పట్టేసింది కార్నర్ టేబుల్ ఫిక్స్ చెయ్యడానికి. హమ్మయ్య ఈ వంకతోనయినా ఉన్నారు అని ఆనందపడబోతున్న దాన్నల్లా ఆగిపోయాను. . అపార్ట్మెంట్ లో ఎవరో మగానుభావులు (మీరు కరెక్టుగానే చదివారు...అచ్చ్హు తప్పు లేదు) టోస్టు చేసుకునే సదుద్దేశ్యం  కలిగి, టోస్టరులో బ్రెడ్డు ముక్కలు పెట్టి ఏ కారణము చేతో ( నా దురదృష్టము కావొచ్చు)...ఆకలి మరిచి బయటకు అరుదెంచిరి....పొగలు ఎల్లెడల వ్యాపించ ఫయరు అలారమ్ము...టింగు టింగు మని సన్నని చిరు గంటల సవ్వడి  వలె మొదలై గుడి గంటల వలె వినబడి, తుదకు కర్ణ భేరికి చిల్లు పడునంత సందడి చేసినది. వెంటనే అందరునూ ఇల్లొదిలి భవనమునకు ఐదు వందల మీటర్ల దూరమున నిలువవలెనని హెచ్చరిక. ఫయరు ఇంజిను వచ్చి. అన్నీ సర్దు మణగుటకు అక్షరాలా తొంబది తొమ్మిది నిముషములు పట్టినది. ఇచట అతి సహనవంతులయిన మనుష్య జాతికి ఇది యొక మంచి పరీక్ష. ఇచట నీతి ఏమనగా సహనము లేని వారు ధన్యులు సుమతీ...అనగా భోజనము చేసి, ఒక గంట తరువాత ఇటునించి ఇటే ఆఫీసుకి వెళ్ళవలసిన వారు కాస్తా, యీ తొంబది తొమ్మిది నిముషములు ధాటికి నిలువలేక "ఇంటికి పోయి తినెద పొమ్ము "అని సెలవిచ్చి మిస్సిస్సాగా కు పయనమయిరి.

అప్పటి నుండీ ఎంత బిజీగా ఉన్నా, ఎంత కష్టమయినా,  ఎన్ని ట్రిప్ లయినా మా ముగ్గురినీ మిస్సిస్సాగా తీసుకెళ్ళి పది సార్లు దింపమన్నా దింపుతారు కానీ, సెయింటు కాథరిన్స్ లో ఉండమంటే మాత్రం ఊహు....

మా ముగ్గురికీ కూడా  అక్కడికి వెళ్ళడం ఇష్టమే, పిల్లలకి నాకు బోలెడు మంది పాత స్నేహితులు.  కానీ, సీతయ్య  వచ్చి తీసుకెళ్ళాలి, మల్లీమళ్ళీ వచ్చి దింపి వెళ్ళాలి. బోల్డు టయిము వేస్టు ఇంకా డబుల్ శ్రమ కదా? సీతయ్యకున్న బిజీ షెడ్యుల్ లో అంత కష్ట పడే అవసరమేంటీ అని..

అవన్నీ కాదు లెండి కానీ...ఎందుకో ఈ ఊరు తనకి నచ్చలేదు...ఇంతకి ముందు కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు   గమనించాగా... హైవే అంతా ఓకే, హైవే దిగి, ఊరికి చేరే ర్యాంప్ ఎక్కగానే ఎందుకో మూడు ఖరాబ్ అయిపోతుంది...ఏంటీ అంటే..ఏమీ లేదు.. మాట్లాడకు... క్వయిట్.. ఖాముష్... నిశ్శబ్దం....ఆ సయిలెన్సరు మళ్ళీ మమ్మల్ని దింపి  తిరిగి ' వెళ్ళిపోతున్నాను' అని చెప్పేవరకూ కంటిన్యూ అవుతుంది. ఆ ఒక్క మాట మాత్రమే నిశ్శభ్దాన్ని చేదిస్తుంది. నా మౌతు  యధావిధిగా వైడు ఓపెను... ఇంటికి జాగ్రత్తగా చేరాను అని ఫోను రింగ్ అయ్యేవరకూ

కొన్నాళ్ళకి ఈ  అపార్ట్మెంటులో టూ బెడ్రూం అపార్ట్మెంటు ఖాళీ అవుతోంది .  కానీ దాదాపు నెలకి ఖర్చు బాగా ఎక్కువ. " ఫరవాలే తీసుకుందాం, శనివారం వచ్చినప్పుడు మారదాం" అన్నారు. అనుకున్న రోజుకి రెండు రోజులు ముందు గానే ఇల్లు ఖాళీ అయింది. పిల్లలు నేను కలిసి ఒక రోజు ముందుగానే సామాను మొత్తము కొత్త పోర్షన్ కి మార్చేసి " నాన్నని సర్ప్రయిస్ చేద్దాం" అని గొప్ప ప్లాన్ చేసుకుని ఎదురు చూసాము. శనివారం వచ్చారు...

కాస్త విశాలం గా ఉన్న టూ బెడ్రూం ఇల్లు చూసి, హమ్మయ్య కాస్త కూచోడానికి స్థలం ఉందని  తెగ ఇదయి పోతారనుకున్నానా. రాగానే పచారీ సామాన్లు ఒక రౌండ్ ఇంట్లో పడేసి, మిగిలినవి తేవడానికి అందరం కార్ దగ్గరికి తిరిగి  వెళ్ళే లోగా. మా కారుకి ముందు పార్క్ చేసి ఉన్న కారు పచ్చడి పచ్చడి అయ్యి కనిపించింది. ఏంటీ అంటే, బస్సు గుద్దేసిందిట. ఇంకా నయం మన అదృష్టం బాగుంది అనుకుని, కొంచెం షేక్ అయ్యి, కార్ తీసుకుని పరుగో పరుగు.   ఆ పచ్చడిని చూసిన వాళ్ళెవరైనా అక్కడ పార్కింగ్ చెయ్యగలరా ఇంక? అప్పటి నుంచీ పార్కింగ్ టెన్షన్. దాంతో వారం వారం వచ్చేవారల్లా రెండు వారాలకొకసారి గబ గబా సామాన్లు ఇంట్లోకి తెచ్చేలోపు. పిల్లలో , నేనో కార్ ని ఎవరూ పచ్చడి చెయ్యకుండా కాపలా.

నా ఆఫీసు ఇంటికి 10 నిమిషాల నడక. ఉద్యోగం చేరాక 3 నెలలు ప్రొబేషన్ అయిపోగానే, నాకొక పార్కింగ్ లాట్ ఇచ్చారు. హమ్మయ్య ఇంక సామాను దించేసి, ఆఫీస్ దగ్గర కార్ పార్క్ చెయ్యచ్చు, పార్కింగ్ బిల్లూ ఉండదు, ఎవరూ వచ్చి కార్ పచ్చడి చేస్తాడని దిగులూ ఉండదు అని చాలా సంతోషపడిపోయా.

 

ఒక శనివారం సందె కాలం పచారీ సామాన్ల బండి వచ్చింది...(మరి ఇంత కంటే ఏం పేరు పెడతామండీ!). అప్పటికే మంచు తుఫాను మొదలయ్యింది..పొగ మంచు వలన దారి కూడా సరిగ్గా కనిపించట్లేదు. రోడ్లన్నీ స్లిప్పరీగా ఉన్నాయి. మంచు ముద్దలు కుప్పలు తెప్పలుగా పడుతున్నాయి. అయ్యో డ్రయివింగు కష్టం అవుతుందేమో  ఉండిపొమ్మని తెగ మొహమాటం పెట్టేశాం ముగ్గురం కలిసి...ఏదో కొల్పోయినట్టు మొహం పెట్టి సరే అన్నారు..మేము ముగ్గురం హుర్రే అని మనసుల్లో పండగ చేసుకున్నాం. చాలా నెలల తర్వాత, నలుగురం కలిసి భోజనం చేసి,  సినేమా కూడా చూసాం టీవీ లో. అలా సినేమా చూస్తూ చూస్తూ అందరికీ నిద్ర పట్టేసింది. రాత్రి రెండింటికి కొన్ని డయిలాగ్స్ గందరగోళంగా వినిపించాయి.టీవీ కట్టలేదేమో అని చెక్ చేసాను. కానీ పరీక్షగా చూస్తే ఇది ఇంట్లోంచి కాదు. బయట. గబ గబా మంచం పైకెక్కి కిటికీ లోంచి బయటికి చూసాను (కిటికీలు ఎత్తులో ఉన్నాయి). బయట 200 మంది దాకా స్టూడెంట్స్ ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు, పోలీసులూ. ఒక పిల్ల గట్టి గట్టిగా అరుస్తోంది. పోలీసులు ఆ పిల్లని అరెస్టు చేసి తీసుకెళ్ళారు. ఒక గంటకి అంతా సద్దు మణిగింది. నేను అందరూ వెళ్ళే వరకూ కిటికీకి వెళ్ళాడుతూనే ఉన్నా. ఇంకో అరగంట కల్లా  బయట నుంచి ఫ్లాష్ లయిట్ల వెలుగులు. మా పైన అపార్ట్మెంటులో అందరూ పరుగులు తీస్తున్న హడావిడీ. అలా రాత్రంతా బిక్కు బిక్కుమంటూ కూచున్నాము. పొద్దున్న లేచాక ఎవరిని అడిగినా 'మాకు తెల్వద్' అని జవాబు. పోనీలే మనకెందుకు అనుకున్నా కానీ... ఇంటికి చాలా గంటల డ్రయివింగు, ఉద్యోగం, చదువు ఇన్నిటి మీదా ఇంక మళ్ళీ ఈ ఊళ్ళో ఉండే ధైర్యం వారెప్పుడూ చెయ్యలేదు. పోనీ యీ పాడు గొడవ వదిలేసి, వెనక్కి వెళ్లి పోవడానికి పిల్లల చదువులు అడ్డమొస్తున్నాయి. ఇంకో నాలుగు నెలలు ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ ...ఇంక ఇష్ట్మయినా కష్టమయినా మేము వెళ్ళడమే గానీ వారిని ఇక్కడ ఉండమని అడిగే దమ్మూ ధైర్యం మేము ముగ్గురమూ కోల్పోయాం. ఇంక రారా, సరసకు రారా అనే పాట మరచిపోయా కానీ ఎప్పటిదో ఒక పాత పాట స్మృతిపథం లో మెదులుతూ ఉంటోందీమధ్య.. అదే అదే....

పిలిచినా బిగువటరా ...ఔరౌర....భళిరా.......!!!!!!!!!

 

 

ఓ స్త్రీ రేపు రా/ O woman come tomorrow

Wednesday, January 5, 2011


మా ఆల్వాల్ లో 400 ఏళ్ళ నాటి వెంకన్న గుడి. ఆ పక్కనే రాధా కృష్ణుల గుడి, పక్కన జగన్నాధ స్వామి గుడి, ఇంకో పక్క పాండు రంగడి గుడి, ఇంకాస్త దూరంలో శివుని గుడి. తిరుపతి వెళ్ళలేని వారు మా వెంకన్న దగ్గర మొక్కు తీర్చుకోవచ్చునని ఆళ్వార్ స్వామి దేవుని దగ్గర వరం తీసుకున్నాడుట. అందుకని చుట్టుపక్కల ఊర్ల వారందరూ వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. గుడి ముందు సత్రాలు, రాజా కిషన్ ప్రషాద్ గారి దేవిడీ. ఎంత మంది రాణులుండేవారో తెలియదు కానీ, 70,80 రూములున్నట్టుండేది దేవిడీ.

ఇంకాస్త ముందుకి ఒక పెద్ద మైదానం. ఆ మైదానంలో పోలిస్ స్టేషన్, ఇంకా ప్రైమరీ స్కూల్ (మా ఊర్లో దీన్ని ప్రేమ టీచర్ ఇస్కూల్ అనేవారు) ఉన్నా కూడా ఇంకా చాలా విశాలమైన మైదానం ఉంటుంది. మైదానం దాటాక ఒక మంటపం. దాటాక చాలా ఖాళీ స్థలం. మా ఊరు మెయిన్ రోడ్ కి కొద్దిగా లోపలికి ఉండేది. ఊరిని, మెయిన్ రోడ్డుని కలుపుతూ గుడి ముందు నుండి మెయిన్ రోడ్డు వరకు తారు రోడ్డు. రోడ్డుకి ఒక వైపు దట్టంగా కొన్ని చింత చెట్లు ఉండేవి.  చీకటి పడ్డాక ఇవి దాటి రావడం కొందరు ధైర్యవంతులు మాత్రమే చేయగలిగే సాహసం కింద లెక్క.

ప్రతి సంవత్సరం  డిసెంబరులో వెంకన్నకి బ్రహ్మోత్సవాలు. మా వెంకన్నకి భోగం...అక్కడ దద్యోజనం లేదా పులిహోర ప్రసాదం...ఇక్కడ ప్రసాదం గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి...మా పెద్ద పూజారి గారు చాలా ఫేమస్, యెందుకంటారా...గుప్పెడు పులిహార ఇచ్చి పంచమంటే, ప్రపంచం మొత్తం  పంచి ఇంకా చిటికెడు మిగులుస్తాడని ప్రతి ఒక్కరూ చెప్పుకునేవారు... సో, షాట్  కట్ గా ఎప్పుడయినా, ఎవరింట్లోనయినా, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి భోజనాలవీ పెట్టాలంటే, మా రాఘవాచారి మామని అధ్యక్షుడుగా ఉంచితే సరి! ఆయన ప్రసాదం పెట్టే తీరు గుర్తొస్తే చాల నవ్వొస్తుంది.. ఒకొక్క మెతుకు అందరి చేతిలో విదుపుతున్నత్తు పెట్టేవారు. విసుగు కూడా చాలా ఎక్కువ. గుడికెళ్ళీ ప్రసాదం తీసుకోగానే ఇంటికొచ్చేస్తామా ఏంటి? మా లల్లీ, విజ్జీ, గౌ రీలతో గుడి చుట్టూ ఉన్న ధర్మ శాలల పైకి మెట్ల మీంచి వెళ్ళి, కిందకి వాలిన చింత చెట్లకున్న కాయలు కోసుకోవాలి...అక్కడ గస్తీ తిరిగే మల్లన్న తాతకి కనపడకుండా మెట్లు దిగి రావాలి...మెట్లు అస్సలే బహు పురాతనమయినవి...మధ్యలో ఉండగా  తాత అరిచాడంటే, మన గుండె ఆగిపోవడమో, జారి పడడమో తధ్యం...

గుడి ముందు ఈ చివరి నించి మెయిన్ రోడ్డు ఆ చివరి వరకూ గుడి ముందు జాతర. మా ఊళ్ళో గాజులు దుకాణాలు, బొమ్మల దుకాణాలు లేవు. ఈ జాతరకి ఎక్కడెక్కడి నించో ఆట వస్తువులు అమ్మేవారు, గాజులు అమ్మేవారూ, రంగుల రాట్నాలు, సర్కసు వాళ్ళు వచ్చేవారు. గుర్రాలు, చిన్న రంగుల రాట్నం అప్పుడప్పుడూ ఎక్కేవాళ్ళం. వీటి కోసం  అమ్మ అప్పుడప్పుడూ డబ్బులు ఇచ్చేది. కానీ అస్సలు సంగతంతా పెద్ద ఉయ్యాలలోనే ఉంది.."అది చాలా ఖరీదు.. మీరు చిన్న పిల్లలు....చక్కరొస్తదీ, ఎక్కద్దు "అని అందరూ చెప్పేసే వారే! ...మరి  పిల్లలకి ఒద్దు అన్న వాటిమీదే కదండీ మక్కువంతా! మాకు జాతర మొత్తం 20 రోజుల్లో రెండు సార్లు రెండు చారానాలు మాత్రమే ఇచ్చేవారు కొనుక్కోవడానికి. దానిలో రెండు ఆప్షన్లు. పెద్ద తొట్టెల(రంగుల రాట్నం) ఎక్కామంటే, ఇంక చిరుతిళ్ళకి మిగలవు. కానీ బాల్య చాపల్యం వలన చారానతో, మల్లెపువ్వుల్లాంటి తిరుపతి మురుమురాలు, తియ్య బలపాలు, కొర్ర లడ్డూలు, సబ్జా గింజల షర్బత్ కొనుక్కునే వాళ్ళం నేనూ, మా చెల్లీ. తీరా ఉయ్యాల ఎక్కడం తీరని కోరిక , కల అయ్యేది. కానీ దానికొక ఉపాయం తట్టింది.

సాయంత్రాలు జాతర చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి గంటలు గంటలు క్యూలలో నిలబడక్కర లేకుండా తీరిగ్గా ఎక్కాలనుకునేవాళ్ళు పొద్దున్న 11-12 గంటల మధ్యలో వచ్చేవారు. అది సరిగ్గా మా ప్రేమ టీచర్ స్కూల్ కి అన్నం బెల్లు టైము. ఇంటికెళ్ళి రెండు బుక్కలు తిన్నామనిపించి పరుగెత్తుకెళ్ళి ఉయ్యాల దగ్గర పడిగాపులు పడేవాళ్ళం. దీన్ని ఎక్కాలంటే, చాలా ఓపిక, తీరిక ఉండాలసలు! ఒక్కొక్క ఉయ్యాల నిండుతుంటే,  దాన్ని పయికి పంపించి ఖాళీ  ఉయ్యాల కింద ఉంచి, జనాల కోసం ఎదురు చూస్తూ  ఉండేవాడు దాని ఓనర్,  నాలుగు ఉయ్యాలల్లో మూడు ఉయ్యాలలు నిండే వరకే మా వెయిటింగు  అంతా.. .ఆ మూడో ఉయ్యాల నిండే వరకు ఎక్కడైనా ఆడుకోవచ్చు. మూడు ఉయ్యాలలు నిండే దాకా ఆడుకునే ఆట దాల్ దడీ దచిన పొడీ.. ఆటంటే ఆడెసేవాళ్ళం కానీ పాట అర్థం తెలియదు. అందరినీ అడిగాక హైదరాబాదుకి చెందిన మిత్రులొకరు దాల దడీ అంటే, హీప్ ఆఫ్ పల్సెస్ అని చెప్పారు అంటే, పప్పుల కుప్ప అన్న మాట.. ఒప్పుల కుప్ప బదులు పప్పుల కుప్ప అన్న మాట.. రెండొ భాగానికి అర్థం తెలియలేదు. అలాగే ఉప్పిరి గింజలని ఇంకో ఆట ఆడేవాళ్ళం. సీతాఫలం గింజలు కడిగి దాచుకునేవాళ్ళం. 3 బొద్దీలు తీసి, ఒక దానిలో గింజలు పెట్టి, ఉష్కెతోని మూసేసాక దోస్తులని పిలవాలి. వాళ్ళొచ్చి, ఏ గుంటలో గింజలున్నాయో ఊహించాలి. ఒక వేళ వాళ్ళకి తెలిస్తే ఆ గింజలన్నీ వాళ్ళ సొంతం, ఒక వేళ కనిపెట్టలేకపోతే, వాళ్ళే మనకి బొద్దీలో పెట్టినన్ని గింజలు ఇవ్వాలన్నమాట. ఈ ఆటకి కూడా ఆక్ పాక్ కలేమాక్ డాం డూం డుస్, ఇస్క లడీ లాల్ చటాక్ దేఖో నికల్ గయా అని పాడే వాళ్ళం. ఈ పాటకి కూడా మాకు అర్థం తెలియదు. గోలీలాటల్లో కూడా మామూలు గోళీలు కాకుండా లిట్కీ గోళీలని చిన్న గోళీలు గెలవాలని ఆశ.

 

జాతర ఎదురుగ్గా ఉన్న శ్యాం బెనిగల్ గారమ్మాయి గౌరి, వాళ్ళింట్లో ఉండే ఇంకొకమ్మాయి నెమ్మదిగా వచ్చేవారు మాతో ఆడుకోవడానికి. కాన్వెంటుల్లో చదివే గొప్పింటి పిల్లలు దేవదూతల్లా మంచి బట్టలేసుకుని ఉండేవారు. వాళ్ళు మాతో ఆడడానికి ఇంట్లో వాళ్ళు పంపేవారు కాదు కానీ, ఊరి మీద పడి తిరుగుతూ ఆడుతున్న మమ్మల్ని చూసి వాళ్ళకి మాతో ఆడాలని , స్వేచ్చగా తిరగాలని కోరిక. పెద్దల కళ్ళలో పడకుండా అప్పడప్పుడు వచ్చేవారు. వచ్చిన పది నిమిషాల్లోనే పెద్దలు వచ్చి, కోప్పడుతూ తీసుకుపోయేవారు. అలా వచ్చినప్పుడు మేమొక ఆట వాళ్ళకి నేరిపితే వాళ్ళకి తెలిసిన పాట ఒకటి వాళ్ళు మాకు నేర్పేవారు. అలా నేర్పిన వాటిల్లో ఒకటి " డీబ్ డీబ్ డీబ్, మై బ్లూ షీప్, సెల్లికింద వాటర్, లక్క కప్ప సాసర్.. డీబ్ డీబ్ డీబ్.. " ఇలాంటి అంగ్రేజీ పదాలు లేవనే వాడు మా సీనన్న. చాలా పెద్దయ్యాక దాని అసలు స్వరూపం తెలిసి పడీ పడీ నవ్వుకున్నాము. Deep deep deep, My blue ship, Sailing in the water, like a cup and saucer , deep deep deep!!

సరే సరే 3 ఉయ్యాలలు నిండాయి రండి మళ్ళీ లేట్ అయిపోతుంది. మూడు ఉయ్యాలలు నిండే వరకు అందులో అప్పటికే ఎక్కి కూర్చున్న అందరికీ ఎక్కడ లేని ఓర్పు...ఆ తర్వాత, పైన ఉయ్యాల వాళ్ళకి కంగారు. " ఇగ కానీ భాయ్, పోవాల" అంటూ ఉండేవారు. కానీ నాలుగు ఉయ్యాలలు నిండకపోతే బ్యాలన్స్ అవదనుకుంటా!! అప్పటికి రీజన్లు లాజిక్లూ తెలియవు...ఓన్లీ గోల్ ఈస్ ..మూడు ఉయ్యాలలు నిండే టైముకి అక్కడ ఉండాలి అంతే!  నాలుగో ఉయ్యాలలో ఎక్కమని అక్కడ నిలబడ్డ పిల్లా పిచుకల్ని అడుగుతాడు. మనం అప్పుడు "పైసల్లేవన్నా" అనాలి. "పైసలడిగినాన్ చెల్లే, రాండ్రి" అంటాడతను.  "అమ్మో నాకు భయ్యం, నేను రాను " అనాలన్నమాట. అతను..."రాండ్రి  తల్లీ!  మా అమ్మలు  గదూ, జోర్గ తిప్పనులే" అని సముదాయించి , బతిమాలి మరీ ఫ్రీగా ఫ్రీగా ఎక్కించడమే కాక, గావురంగ అలగ్గున ఎత్తుకుని కూచోబెడతాడు కూడా.. "పూకట్ కి వచ్చేటివన్న సరే , ఇజ్జత్ తోని తీస్కోవాలె" అన్నది మా రూలు.  జాతర 20 రోజుల్లో రెండు సార్లన్నా వచ్చేది చాన్స్. ఇంక ఉయ్యాల ఎక్కగానే కీకలు పెట్టుకుంటూ, భయపడుతూ, కడుపులో తిప్పుతున్నా ఉగ్గబట్టుకుంటూ..అదే మజా. ఇలాంటి భయాన్ని మీతో పంచుకోవాలని ఉంది. 

అంటే మిమ్మల్ని భయపెట్టడమే నా లక్ష్యం అనుకుంటారేమో...ఛ్చ ఛ..నేనలాంటి దాన్ని కాదండీ. ...నేను సెల్ఫు లెస్సు..."మంచివేమన్నుంటె మందితోని పంచుకోవాల"ని అమ్మ చెప్పేది. మరి అన్నీ పంచుకోవడం కుదరదు కాబట్టీ, అప్పుడప్పుడు ఇలాంటి భయమనే  మంచి వస్తువుని అందరితో పంచుకుని, తుఛ్చమయిన డబ్బునీ, సుఖాన్నీ, బంగారాన్నీ, నేనే కష్ట పడి భరిస్తూ ఉంటాను..

సంతోషంగా జరిగిపోతున్న అల్వాల్ జీవితాల్లో ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. దాని కథా కమామీషూ ఏంటంటే,  వెంకన్న గుడి పక్కనున్న జగన్నాధ స్వామి గుడిలో పూజారులు కాపురముండే వారు. పూరీ నించి వచ్చిన వాళ్ళనుకుంటా హిందీ లాంటి భాష మాట్లాడేవారు. ఒక్క కుటుంబం మాత్రమే తెలుగు వారు . ఒక తండ్రి, ఇద్దరు ఆడ పిల్లలు ఉండేవారు. ఆ అమ్మాయిలిద్దరి పేర్లు ఉమ, ఉష. వాళ్ళిద్దరూ గుడికి వచ్చిన వాళ్ళందరినీ  నవ్వుతూ పలకరించే వారు . ఇద్దరికీ వయసులో రెండు మూడేళ్ళూ  తేడాయే అయినా, ఉమక్క ఉషక్కని తల్లిలా చూసుకుంటుందని అందరూ చెప్పుకునే వారు. మరి ఏం జరిగిందో. ఒక రోజు ఉమక్క, ఉషక్కని రోజూ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుందిట. జడలు వేసి, అన్నం పెట్టి,  ఒళ్లో కూడా కుర్చోపెట్టుకుందిట (ఉషక్క మరీ చిన్న పిల్ల కాదు పదహారేళ్ళు ఉంటాయేమో అప్పటికి ). సాయంత్రం అయ్యేటప్పటికి ఉమక్క నిప్పు అంటించుకుందని ఊరిలో వార్త! మా ఊర్లో దవాఖానాలు లేవు కాబట్టి గాంధి ఆస్పతాల్ కి తోల్కబొయ్యి, మర్నాడు హాస్పటల్ నించి శవాన్ని మాత్రమే తీసుకురాగలిగారు.

ఆ అమ్మాయి అంత్య క్రియలు మా ఇంటి దగ్గర చెరువు పక్కన ఉన్న స్మశానంలో చేసారు. అసలు మా ఇంటి వెనక వైపు బొందల గడ్డ, చెరువు ఉండడం వల్ల చావులన్నీ మా ఇంటి ముందు నించే వెళ్ళేవి. డప్పు, డ్యాన్స్ లతో , గులాల్ చల్లుకుంటూ, పండుగాలా తీసుకెళ్ళేవారు కానీ, ఆ డప్పు మోతకి గుండెల్లో దగడు పుట్టేది. ఏదైనా చావు అయిందంటే,  మాకు కొన్ని రోజుల వరకూ చెరువు గట్టు వయిపు ఆటలు బంద్. నాలుగు రోజులు అందరి నోట్లో ఇవే కబుర్లు. రాను రాను ఎలా కాలిపోయిందని టాపిక్ మారిపోయి, ఎందుకు కాల్చుకుని ఉంటుందీ అని స్టార్ట్ అయ్యింది. చిలవలు పలవలుగా ఏవేవో చెప్పుకున్నారు. చిన్నతనం వల్ల నాకు ఒక్క ముక్క కుడా అర్థం అయ్యేది కాదు, కానీ సీరియస్ మ్యాటర్ ఏదో ఉందని మాత్రం అర్థం అయ్యేది. మా ఊళ్ళో అందరూ డిటెక్టివులయ్యారు.

పదకొండో రోజు కర్మ కాండలు అవ్వగానే ఇంకొక న్యూసు, ఉమక్క దయ్యమయిందని...!! ఇంకేముందీ అందరూ చీకటి పడే వేళకి ఇంటికెళ్ళి పోవాలని రూల్ పాస్ చేసేసారు. పెద్దా, చిన్నా అని లేకుండా అందరికీ భయమే. భయమేమో గానీ ఊరికి ఒక డిసిప్లిన్ వచ్చింది. నా లాగా చదువు సంధ్య లేకుండా తారాడే పిల్లలందరూ ఇంట్లో ఉండి బుద్ధిగా చదువుకోవడం మొదలెట్టారు. సారా దుక్నం చెరువు గట్టు చివరన ఉండటం చేత గవుండ్లోల్ల  'గుడుంబా శంకరన్న' కూడా చీకటి పడే సమయానికి  'ఖేల్ ఖతం దుక్నం బంద్' అనేసాడు కాబట్టి మందు బాబులు  మాపటి కల్లా ఇంటికొచ్చేయ్యడం మొదలెట్టారు. కొంత మంది మాత్రం “దెయ్యం గియ్యం జాన్తా నై “ అని గోల్నాకా రోడ్డు మీదున్న మందు కొట్లో మందు(???) కొనుక్కుని " భయమా బుగులా, బాయిల బడితే లోతా, ఈతపల్లి సాటా, తుర్క పల్లి గేటా" అని షంగలిచ్చుకుంట,లేట్ గా రావడం మొదలెట్టారు.  అలా రాత్రిళ్ళు తిరగడానికి ట్రయి చేసిన వాళ్ళందరూ దయ్యాన్ని చూసామని, ఎవరో అమ్మాయి తల మీద కుంపటి పెట్టుకుని వీధుల్లో తిరుగుతోందని చలీ జ్వరం తెచ్చేసుకుని మంచమేక్కేసారు. భూత వైద్యుడొకడు " దయ్యాన్ని పట్టి సీసాలో బంధించి, బొందలగడ్డ దగ్గర పాతి పెట్టాన”ని చెప్పి, పైసల్ వసూల్ చేసాడు కానీ, మా ఊరిని దయ్యం వదల్లేదు.  స్వామీజీ ఒకరు “దయ్యం మన జోలికి రాకుండా ఉండాలంటే ఇంటి ఆడ వాళ్ళందరూ ఆకు పచ్చటి గాజులు ధరించాల”ని చెప్పి, మా గాజుల  కిష్టయ్యకి గిరాకీ పెంచాడు. గాజుల కిష్టయ్య చిన్న పిల్లలకి ఆకుపచ్చని లబ్బరు గాజులు తేవడంతో, మా అమ్మ  మా నలుగురికీ కూడా చేతుల నిండా పచ్చ గాజులు వేయించి ఎప్పటి నుండో నాకు తీరని కోరికని తీర్చేసింది. ఇంక దర్గా దగ్గర ఒకటే సందడి. మా ఖాన్ సాహేబు మామ చారానా తీసుకుని తాయెత్తు లిచ్చేవాడు. ఉమక్క పుణ్యమాని వాళ్ళింట్లో కొన్ని రోజులకు సరిపడా కాసుల గల గల.

ఈ దయ్యం గోల కాదు గానీ, 5 దాటాక ఎవ్వరూ ఇల్లు కదలకూడదు కాబట్టి, నాయసుంటి పిల్లలకి పెద్ద కష్టమే వచ్చ్హి పడింది. మాకు ప్రతి సాయంత్రం చాలా ఇంపార్టెంట్ మీటింగులు ఉండేవి. సోమవారం మీటింగు ప్రతాప్ రెడ్డి సారి ఇంటి కాడ. పిల్లల్లేని ప్రతపరెడ్డి సారు ప్రతి సోమవారం పిల్లలందరికీ పిప్పరమెంట్లు పంచేవారు...సో, మండే సాయంత్రం అక్కడ హాజరు. అప్పట్లో మా ఊర్లో అతి పెద్ద ధనికులు గుట్టమీది రామిరెడ్డి తాత. వాళ్ళకి చాలా పొలాలు అవీ ఉన్నాయి... వాళ్ళు ప్రతి శుక్రవారం గుడాలు (గుగ్గిళ్ళూ) ఉడికించి, దేవునికి సమర్పించి,  పిల్లలందరికీ పంచేవారు....ఫ్రయిడే  సాయంత్రం నుంచీ అక్కడే మకాం... మరి లలితత్తమ్మ  రెండు చేతులూ పట్టమని, పట్టినన్ని గుడాలు పెట్టేది. అప్పుడప్పుడు గౌను పట్టమని ఒడి నిండా పోసేది. అక్కడే అందరం గోడ పక్కన మోరీ దగ్గర కూచుని మట్టి చేతులు అవీ ఇవీ ఆలోచించకుండా బొజ్జ నిండా తినేవాళ్ళం. నాకొక్కదానికీ ప్రతి సాయంత్రం ప్రత్యేకమైన మీటింగ్ ఇంకోటి ఉండేది. మా గొల్లోళ్ళ అన్నదమ్ములవి పది కుటుంబాలు కలిసి ఒకే లోగిల్లో ఉండేవి. బావలు మరుదులు, మామలు ఉంటారు కాబట్టి, మగ పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే, కొత్త కోడళ్ళు కొన్నాళ్ళు బయటికి రారు. రామచందరన్నకి పెళ్ళయ్యింది.  రాంచందర్ అన్నకి వదిన మీద  జాలి వేసేదేమో..లోపల ఒక్క దానికే  బోర్ కొడుతుందని...నన్ను పిలిచి..' ఒదిన తోని మాట్లాడు పో చెల్లె 'అని పంపించేవాడు...నేను చాల గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని... వదిన మారెడ్పల్లి అనే పెద్ద సిటీ  నించి వచ్చిందని అందరూ చెప్పుకునేవారు...చేతికి దండ కడియాలు  , చెవులకి మకర కుందనాలు,  కాళ్ళకి  మెరిసి  పోతున్న పట్ట గొలుసులు పెట్టుకున్న ఆమె అంటే నాకు హీరోఇన్ లెక్క. వదినకి నేను పెద్ద కాలక్షేపం బఠానీ. స్కూల్ నించి వచ్చాక సాయంత్రం వరకూ కూచోపెట్టుకుని పాటలు పాడించుకునీ, పద్యాలు చదివించుకునీ, అందరి గురించీ అమాయకంగా నేను చెప్పేవన్నీ ఇంటరెస్టుగా విని పెట్టడమే కాక, వాళ్ళ పుట్టింటినుంచి తెచ్చిన మురుకులు, గర్జలూ, ఓడప్పలూ నాకు తినడానికి పెట్టేది. వదిన దగ్గర నించి నేను బయటికి వచ్చాక అందరికీ నన్ను చూసి అడ్మిరేషన్..నేను "హేమా మాలిని " దగ్గర నించో “రేఖ” దగ్గర నించో వచ్చినట్టు! అదే కదా మనకు కావలసిన ఫీలింగ్. ఇంక ఇంకో తప్పని సరి సాయన్ కాలం మీటింగ్ పంచాయతీ ఆఫీస్ దగ్గర. మా గోపాల్ సేట్ దుక్నం ...సాయంత్రం అవ్వంగానే లైట్ వేసి పిల్లలందరికీ పిలిచి బెల్లం ముక్కలు పెడతాడు. మధ్యాహ్నమనగా అమ్మగానీ, పక్కింటి  అత్తమ్మ గానీ  ఉప్పు , చాక్పత్తీ , కాఫీ బిళ్ళలూ  ఏమి తెమ్మన్నా సరే,  అప్పడి దాకా లేట్ చేసి ఆ సమయానికి వెళ్ళచ్చు....అవేమీ లేకపోతే కనీసం పంచాయతీ ఆఫీసు వాళ్ళు పొలం పనులు, వార్తలు వేస్తారు కదా, మాస్టారు గారు విని రమ్మన్నారు అని చెప్పగానే , మా అమ్మ నేను గోల్డ్ మెడలు తెచ్చుకున్నట్టో, అదేదో ఎవరెస్టు శిఖరము ఎక్కినట్టో సంతోష పడిపోయి, "పొయిరా బిడ్డా" అని ముద్దు పెట్టి మరీ పంపేది. గోపాల్ శేట్ కూడా చీకటి పడకుండానే కొట్టు కట్టేస్తాడు కాబట్టి,  కొనే వస్తువులేవో అందరూ ఆరు లోపే కోనేసుకుంటున్నారు.  ఇవన్నీ లేకుండా జీవితం ఎలా అని తలచుకుంటున్నాకొద్దీ మాకు జీవితం మీద విరక్తి వచ్చేసింది. వీటన్నిటికీ తోడు సాయంత్రం అవగానే మంగళవారాలు పెద్ద ఐసు ముక్క బండి మీద పెట్టుకుని దాన్ని చిద్రిక/దూగడ పట్టి , పుల్లకి పెట్టి ఎర్ర రంగు చల్లి ఇచ్చే బర్ఫ్ బండి రావట్లేదు. దోమ రక్తం పీల్చినట్టు, బర్ఫ్ మీద రంగు గబా గబా పీల్చేసి 'అన్నా  కొంచెం రంగేయ్యవా'  అంటూ, మన పుల్లకున్న ఐసు అయిపోయేవరకు ఆ బండితో ఎంత దూరమయినా  ప్రయాణించటం, తరవాత పరిగెత్తుకొంటూ ఇంటికి రావడం ఎంత బాగుంటుందనీ. ఎప్పటికో ఈ దయ్యం నించి విముక్తి !

ఎవరో ఇంకొక ఊరికి వెళ్ళొచ్చి “అక్కడ కూడా ఇలాంటి దయ్యం ఉండేదనీ, తలుపుల మీద 'ఓ స్త్రీ రేపు రా’ అని వ్రాస్తే,  ఎడ్యు కేటేడ్ దయ్యం అది చదివి' అయ్యో ఇవాళ మనని రమ్మని అనలేదు కదా రేపు వద్దాం లే' అని ప్రతి రోజూ అనుకుందనీ, అలా రోజూ చూసీ చూసీ, ‘ఛీ ఈ ఊర్లో అందరూ నన్ను  రేపు రమ్మంటారు ఒక్కళ్ళు కుడా నన్ను రమ్మనట్లేదు’ అని విసుక్కుని, ఫీల్ అయ్యి, ఊరు వదిలి పోయిందిట”  అని చెప్పారు. ఇది బాగా నచ్చి ఊళ్ళో వాళ్ళందరూ అందరూ ఇంక తలుపుల మీద 'ఓ స్త్రీ రేపు రా' అని పసుపు  తోనూ, కుంకుమ తోను, ఇంకా థిక్ గా  బొగ్గు, సున్నం తోనూ రాసి పడేసారు. ఇంకా కొంచెం మీరిన వాళ్ళు కోడినో, యాటనో ఏసేసి, ఆ నెత్తురుతో ప్రేమలేఖ వ్రాసినట్టు "ఓ స్త్రీ రేపు రా" అని వ్రాసేసి, అదే నెత్తురులో చేతులు ముంచి, తలుపుల మీదా, గోడల మీదా, ఇంకా ఇంటికి అన్ని వైపులా పంజాలు కొట్టి, పకడ్బందీ చేసుకున్నారు. ఆ పదం చూస్తే నాకు భయం.

మా ఇంట్లో జమా జెట్టీ ల్లాంటి  ముగ్గురు మగ పిల్లలున్నారని తలచి అమ్మ “మనింటి పయిన అక్కర్లేదులే” అనేసింది. (మీరేదో సుమో రేజ్లిలర్లని ఊహించేసుకుంటారేమో! మా అన్నలు ముగ్గురూ పిచ్చిక పిల్లల్లా ఉండేవారు.. అంతా మా మాతా శ్రీ భ్రమ)..... హమ్మయ్య బతికి పోయాను, లేక పొతే ఇల్లొదిలి బొందల గడ్డ మీద ఉండేదాన్నేమో!  ఓ స్త్రీ రేపు రా అనే ఆ పదం అంటే నాకు చాలా  భయం పట్టింది ఎందుకో !  తెలిసీ తెలియకా, బొందల గడ్డ మీద చాలా సార్లే వెళ్ళి ఆడుకున్నాము కదా మరి. అందుకే అదంటే భయం లేదన్నమాట.   బాగా భయపడుతున్నామని మా నాన్న నన్ను , చెల్లినీ పక్కలో పడుకో బెట్టుకుని 'రామ స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే యః పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నస్యతే ' అని వల్లె వేయించి, " మన ఇంటికి దయ్యాలు గియ్యాలు ఏమీ రావు గాక రావు, పీడ కలలు కూడా రావు హనుమంతుడు మనల్ని రక్షిస్తాడు"  అని ధైర్యం  చెప్పేవారు.   ఒక ఎండా కాలం , ఒక వానాకాలం గడిచాక  కొన్ని నెలలకి వర్షం వల్లనో, కాలం వల్లనో కానీ నెమ్మదిగా ఉమక్క దయ్యం తలపులతో పాటు, తలుపులపైన  ఉన్న ' 'ఓ స్త్రీ రేపు రా" కూడా కరగిపోయింది. మళ్ళీ చీకటి పడ్డాక  కూడా మా ఊర్లో సందడి మొదలయ్యింది....

సడన్ గా ఒక రాత్రి బస్సు దిగి ఇంటికొస్తున్న విమలక్కని పోలీసు స్టేషన్ దగ్గర ఎవరో గట్టిగా పట్టుకుని మెడలో గొలుసు కత్తిరించుకుపోయారు. దొంగలో, దయ్యమో తెలియ లేదు కానీ , ఆ అమ్మాయి నెల రోజులు మంచం దిగలేదు. దడుసుకుందనీ, దిష్టి తగిలిందనీ, దయ్యం పట్టిందనీ నానా విధములయిన దిష్టి మంత్రాలు, దిగదుడుపులూ , పూజలు అన్నీ  జరిగాయి...అందరూ బంగారు గొలుసులు మానేసి (నిజ్జం బంగారమనుకునేరు..మాకెవ్వరికీ అంత సీను లేదు. మా గాజుల కిస్టయ్య ఇరవై పైసల నాణాలతో  చేయించిన గొలుసులేవో అమ్మేవాడు...మా దగ్గర ఉన్న అత్యంత ధనవంతులు అవి కొనుక్కునేవారు...)ఏవో వెండి రంగు నగలేసుకోవడం మొదలెట్టారు...మళ్ళీ ఊరంతా గప్ చుప్ అయిపోయింది...రాత్రిళ్ళు తలుపులు చప్పుళ్ళయేవి...యెవరో  నడుస్తున్నట్టు అడుగుల శబ్దం..ఎప్పుడు తెల్లారుతుందా అని ఒకటే ఎదురు చూపు.

పనిలో పనిగా నాలుగు రోడ్లు కలిసిన చిన్న చిన్న కూడళ్ళలో నిమ్మకాయలు, పసుపు కుంకుమలు దర్శనమిచ్చేవి. అలాంటివి కనిపిస్తే వాటి వయిపు చూడకుండా, తొక్కకుండా, దాటకుండా వెళ్ళాలని అమ్మ చెప్పేది...దాంతో దూరంగా ఏ  వస్తువు కనిపించినా,  కొంచెం దూరం కళ్ళు మూసుకుని మనసులో జామెట్రీ లెక్కలు వేసుకుని, ఊహా పటం మ్యాప్ గీసుకుని, తొక్కకుండా, దాటకుండా, చూడకుండా అని అమ్మ చెప్పిన రూల్సు తూ. చా. తప్పకుండా పాటించేవాళ్ళం. ఇంక దార్లో ఎర్రగా పచ్చగా ఏం కనిపించినా భయమే...ఎవరిదో ఒక సారి ఎర్ర రుమాలు పడిపోయింది  రోడ్డు మీద..అప్పుడు  కుడా 'తొక్కకుండా, దాటకుండా, చూడకుండా' రూలుతో బాటు  మా జామెట్రీ పనికొచ్చింది మరి. అలా  ప్రాక్టిస్  అవ్వడం  వల్లనేనేమో, నేను  ఇప్పటికీ  నిద్రలో  ఎక్కడికయినా  నడిచి  వెళ్లి  మళ్ళీ  కరెక్టుగా  ఇంటికి ఒచ్చేస్తున్నానని  మా  సీతయ్య తిడుతుంటే, ఇదేంటి  ఇంత  మంచి  విషయానికి  మెచ్చుకోరు! నిజానికి   ఇంటర్ నేషనల్   లెవెల్  లో  ఉండాలి  నేను  అని  ఫీల్  అయ్యాను  కూడా.

ఇంకొద్ది రోజులవగానే సత్యా థియేటర్ వెనుక ఉన్న ఖాళీ మైదానంలో తల లేని మొండెములు తిరుగుతున్నాయని వార్త. అప్పట్లో ఊర్లోకి బస్సులు లేవు. మెయిన్ రోడ్డు మీద బస్సు దిగి,  చింత చెట్ల కింద నించి నడిచి రావాల్సి వచ్చేది...సో అందరికీ భయమే. లేట్ రాత్రిళ్ళు బస్సులు ఆపెస్కోవాల్సి వచ్చింది ఆర్టీసీకి. ఒకళ్ళు చూసామంటే, ఇంకొకళ్ళు వాళ్ళని వెంటాడిందని చెప్పుకునేవారు. ఎవ్వరికీ మొహం కనిపించలేదుట గానీ, పెద్ద పెద్ద గోళ్ళు చూసారుట. మొండెం డ్యాన్సు చేస్తూ వస్తుందిట వెంట .( మీరు అనుమానించకండి...అప్పటికి ఇంకా  ప్రభు దేవా చేసిన ముక్కాలా  డాన్సు రాలేదు ). ఎవ్వరు దొరికినా పట్టి రక్తం తాగేస్తుందని చెప్పుకున్నారు. (నోరు లేనిదే తాగటం ఏంటో ..పాపం మనం నమ్మేద్దాం లెండి ఈ సారికి) .  కొందరు నాస్తికులు మాత్రం ఇది దొంగల పనే అని పోలీసు స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చారు. కానీ ఈ కేసులో  పోలీసులు కూడా భయ పడి పోయారు. (వీళ్ళు భయపడ కూడదని సెక్షన్లు ఏమీ లేవుగా )మళ్ళీ మా ఊర్లో డిసిప్లిన్ తో పాటు 'ఓ స్త్రీ రేపు రా" రిపీటు....

యీ భయాలన్నిటితో పాటు...మా ఇంటి దగ్గరే పంచాయతీ ఆఫీసు. మా ఆండాళ్ వాళ్ళ నాన్న అక్కడ పని చేసేవారు. ఆది వారాలు మాత్రం మాకు ఆ ఆఫీసంతా ఆట స్థలమే. తలుపులు తియ్యకూడదు ,లయిట్లు వెయ్యకూడదు కొంచెం చీకట్లోనే దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం. సరదాగా టయిపు మిషన్లని టక టక లాడించడం, టీచర్ల ఆట...ఆఫీసు ఆట  ఆడుకునే వాళ్ళం కాబట్టి ఆ చీకటికి భయం వేసినా వెళ్ళే వాళ్ళం. కానీ అందరం గప్ చుప్ గా  దాక్కున్నప్పుడు సడన్ గా  ఫ్యాక్స్ మిషను వింత శబ్దం చేసేది. ఉలిక్కి పడేవాళ్ళం. చీకట్లో ఆ శబ్దం వచ్చినప్పుడెవరో.. “అగో ఉమక్క వచ్చింది” అని అరిచారు. అప్పటి నించీ ఆ శబ్దమంటే భయం పట్టింది.  చూసారా అన్ని శబ్దాలూ ఫ్యాషన్ గా మారాయి కానీ నా దురదృష్టం కొద్దీ  ఫ్యాక్సు మిషన్లు ఇప్పటికి కూడా కీచుమని  అదే  శబ్దం చేస్తాయి..నవ్వుకోకండి కానీ ఇప్పటికి కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్యాక్సు వచ్చిందంటే మాత్రం నా గుండె గుభేల్... ....

కొన్నేళ్ళయ్యాక నేను కెనడా వచ్చా. సప్త సముద్రాలు దాటి వచ్చా కదా, అల్వాల్ దెయ్యం నాకేం భయ్యం అనుకున్నా కానీ, మా దగ్గర ఒక సామెత ఉంది లెండి. గాచారం బాలేక నాచారమొస్తె, నాచారం దయ్యాలు నా ఎంట బడ్డయన్నట్టు, ఆరు నెలల క్రితం సెయింట్ కాథరిన్స్ అనే ఊర్లో ఒక రేడియో టేషన్లో కొన్ని నెలల కోసం కొలువుకి కుదిరా.  చాలా  పెద్ద అందమయిన పురాతన భవనం ఇది.  దీన్ని ముద్దుగా వైట్ హౌస్ అని పిలుచుకుంటారు.  ఇది ఒక హాంటెడ్ హౌసుట. ఒక సామంత రాజు యీ భవనంలో  ఉండేవాడట. ఈ భవనం బేస్మెంట్ లో అమెరికా నించి ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం నించి బానిసలని అమెరికా నించి కెనడా కి తీసుకుని వచ్చేవారుట. అలా వచ్చిన ఒక బానిస (బెట్టీ) నివాసముండడానికి భవనం  టాప్ ఫ్లోర్ లో అటక మీద అపార్ట్మెంట్ (ఆటిక్ అపార్ట్మెంట్ అంటారు) ఇచ్చారుట. ఆమె ఎలా చనిపోయిందో ఎవరికీ తెలియదు కానీ కుటుంబంతో సహా దయ్యాలయిపోయారుట అందరూ. మిగిలిన దయ్యాలు ఎక్కడికి పోయాయో కానీ, బెట్టీ దయ్యం మాత్రం ఈ భవనంలో తిరుగుతూ ఉంటుందని చెప్పుకుంటారు. రేడియో వాళ్ళు ఈ భవనం కొన్న కొత్తల్లో, మా జెనరల్ మ్యానేజర్ ని ఎవరో మెట్ల పైనుండి తోసేసినట్టు అనిపించిందిట చాలా సార్లు. అలాగే రేడియోలో ఒక ప్రోగ్రాం వేద్దామనుకుంటే, ఇంకొకటి రావడం.. రేడియో కాసేపు మూగబోవటం అవీ జరిగి, జనాలు ఎవ్వరూ పని చెయ్యడానికి ఒప్పుకోలేదుట.  అందుకే మ్యానేజర్ గారు, బ్లాక్ మ్యాజిక్ వాళ్ళనీ ఇంకా ఏవో క్షుద్ర పూజలు చేసే వాళ్ళనీ పిలిచి పూజలు చేయించిదిట. ఇప్పటికి కూడా ఇంకా నెల నెలా ఏవో పూజలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని లెక్కల్లో ఎక్కించమంటుంది నన్ను. “దయ్యాల లెక్కలో వెయ్యమంటారా” అనడుతాను కొంటెగా. “వద్దులే హెడ్ ఆఫీసు వాళ్ళు చూస్తే బాగోదు, రెపెయిర్ చేయించామని వ్రాయి” అనేవారు.

ప్రస్తుతం  నా ఆఫీసులో ఫయిలింగ్ కాబినెట్ అరలు కొంచెం లూసుగా ఉండి ఆటోమేటిగ్గా ఓపెన్ అవుతాయి ఒక్కొక్క సారి. ఆ సమయంలో ఎవరయినా నా  ఆఫీసులో ఉంటే 'బెట్టీ గో అవే ' అని జోక్ చేస్తారు. ఇంక ఆఫీసులో కంప్యూటర్లు పని చెయ్యక పోయినా , తలుపులు గాలికి ధడేల్మని మూసుకున్నా , డెస్క్ మీద ఏమైనా ఒలికినా ..ఇది బెట్టీ పనే అని అనేస్తారంతా. నా ఆఫీసు ముందే  బెట్టీ గది ఉన్న అటక మీదకి మెట్లు. బెట్టీ గనక కిందికి దిగితే మొదట నా ఆఫీసే కనబడుతుంది. అందరూ ఐదింటికల్లా వెళ్ళిపోతారు. నేను అక్కవుంటెంట్ ని నక, నెలలో రెండు మూడు రోజులు మంత్ ఎండ్ కి అన్ని బ్రాంచ్ ల నించీ వచ్చిన రిపోర్టులు హెడ్ ఆఫీస్ కి పంపించే దాకా ఉండాల్సి వస్తుంది. ఒకో సారి 12 అవుతుంది రాత్రి. చుట్టూ కిటికీ లోంచి చిక్కటి చీకటి. ఇంకొక వైపు బెట్టీ కిందకి దిగుతుందేమో అని భయం. ఒక్కదాన్నీ ఈ ఫ్లోర్ లో పని చెయ్యాలి. బేస్మెంటులో ఇద్దరు అనౌసర్లు  పని చేస్తారు ఎనిమిది వరకు . అంతకు తప్ప ఎవ్వరూ  ఉండరు. మొదట్లో భయం లేకుండా బాగానే పని చేసా. కానీ ఒక రోజు ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఈ ఫ్యాక్స్ మెషిను కీచుమని అరుపులు. దాంతో చిన్నప్పుడు పంచాయత్ ఆఫీసులో ఉమక్క వచ్చిందని ఎవరో అరిచిన అరుపు గుర్తొచ్చి గుండెల్లో దగడు పెట్టింది. పోనీ పని వదిలి వెళ్ళలేను డెడ్ లైన్స్ ఉంటాయి మరి. ఈ మధ్య క్లీనర్ని అప్పాయింటు చేసాము. "పగలు అందరికీ ఇబ్బంది కదా సాయంత్రం వస్తావా" అని అడిగాను ఇంటర్ వ్యూ చేస్తున్నప్పుడు. ఆ పిల్లోడు సంతోషంగా "పగలు కాలేజీకి వెళ్ళాలి, సాయంత్రమయితే ఒకే" అనేసాడు. రోజూ క్లీనర్ అబ్బాయిని "కొంచెం నువ్వు  వెళ్ళేటప్పుడు చెప్పవా" అనిబతిమాలుకుంటాను. అప్పటి దాకా ఆ పిల్లాడు చేసే చీపురు చప్పుళ్ళు , నీళ్ళ చప్పుళ్ళు, వ్యాక్యూం  చప్పుళ్ళు విని ఢైర్యంగా పని చేసుకుంటాను. ...ఆ పిల్లాడు వెళుతున్నానని చెప్పగానే, ఎంత పని ఉన్నా నేను కూడా బిల్డింగ్ లోంచి జంపు. (అయ్యో ఆత్మ హత్య కాదండీ ..తొందరగా బయట పడతానూ అని).

ఈ మధ్య ఆ పిల్లాడూ మానేసాడు. పగలు పని చేసి పోతున్నాడు కొత్త క్లీనరు. ఇక్కడ ఒక్క దాన్నీ కూచునప్పుడు, " నా వెనక ఎవ్వరో నడచినట్టుంటాది" అనీ, " నిను వీడని నీడను నేనే" అనీ వినిపిస్తున్నట్టు అనిపిస్తోంది. అదీ కాక మరి ఎలకలున్నాయో, పిల్లులున్నాయో కానీ బేస్మెంట్ లోంచి కొన్ని శబ్దాలు. ఒక్కో రోజు గుండె ఆగిపోతోందంటే నమ్మండి. అక్కడికీ హనుమాన్ చాలీసా          చదువుకుంటున్నా, గుళ్ళో తాయెత్తు కూడా కట్టించుకున్నా.

ఉద్యోగం చాలా అవసరం కాబట్టి మానలేను, పోనీ ఇంటికి తొందరగా వెళ్ళలేను, ఈ భయం తట్టుకోవడం ఎలాగా అని ఆలోచిస్తుంటే, ' ఓ  స్త్రీ  రేపు రా' గుర్తొచ్చింది. మా బెట్టీ అల్లరి రోజు రోజుకీ ఎక్కువయిపోతోంది. అంతెందుకు ఈ కథ రాసానా, మొత్తం రాసాక సేవు చేసిన టపా మొత్తం ఎగిరి పోయింది. ఇది బెట్టీ పనే అని నాకు అనిపిస్తోంది. ఇంకో మంత్ ఎండ్ వస్తోంది. తలచుకుంటేనే గుండె గాభరా పెట్టేస్తోంది. మరి  నా ఆఫీస్ తలుపు మీద ' ఓ  స్త్రీ  రేపు రా' అని రాద్దామని డిసయిడు అయ్యా! కానీ బెట్టీకి మన భాష రాదుగా? "పోనీ ఓ ఉమన్ కం  టుమారో అని వ్రాద్దామా?" ఏదో ఒకటి చెప్పి పుణ్యం కట్టుకోరాదురి!!!