Showing posts with label బ్లాగ్ ప్రవేశ మహోత్సవము. Show all posts
Showing posts with label బ్లాగ్ ప్రవేశ మహోత్సవము. Show all posts

పుట్టిన రోజు -ఆహ్వానం

Wednesday, November 9, 2011

క్రిందటి సంవత్సరం ఇదే రోజు అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు "ఎన్నెల" అనే నేను ఉదయించాను. ఉదయించడమే తడవు అందరి మనసుల్నీ ఆనంద డొలికల్లో ఊగించెయ్యాలని నిర్ణయించేసుకున్నా కూడా...కొన్ని రోజులు ఆటలతో బాగానే పెరిగినా ఉన్నట్టుండి చిక్కిపోయా. అమ్మా అమ్మా అని పిలిచా..ఎవరూ పలకలేదు..పక్క ఇళ్ళల్లోంచి కమ్మని సిరిలాక్ వాసనలు , నేతి ఘుమఘుమలు ఉక్కిరిబిక్కిరి చేసేవి..మా అమ్మ ఎందుకు నాకు యేమీ పెట్టట్లేదని కొంచెం మనస్తాపం చెందుతుండగా..మా అమ్మ వచ్చి "ప్రేమకు నేను పేదను కానూ , ఆకలనీ దప్పికనీ అడగకు నాన్నా, వేకువవూ వెన్నెలవూ నీవే కన్నా" అని బుజ్జగించింది...సరేలే అనుకున్నా...మరీ పట్టించుకోకపోతే బాధేసిందేమో, .అప్పుడప్పుడూ రుచీ పచీ లేని యేదో ఆహారం కొన్ని సార్లు పెట్టింది కానీ నాకు పెద్దగా రుచించలే,,కేవలం అమ్మని బాధ పెట్టకూడదు అని ఊరుకున్నా. నేను పెద్దవుతున్నా కొద్దీ అమ్మ నా దగ్గరే ఉండాలని నాకు మంచి రుచిగల ఆహారం పెట్టి నన్ను మరింత అందంగా తీర్చిదిద్దాలని కలలు గన్నా. యీ లోపు మా భాగ్య లక్ష్మీ ఆంటీ నేను చిక్కిపోతున్ననేంటీ అని అమ్మని గాట్టిగా మందలించారు. అమ్మ వెంటనే ఇంటర్నెట్టు వెతికి రెండు మల్టీ విటమిన్ మాత్రలు నా  నోట్లో పడేసింది. నేను కొంచెం తేరుకున్నా. మళ్ళీ ఎవరో అడుగుతున్నారు ఏంటీ ఎన్నెల అలా పాలిపోయిందీ అని. అమ్మ చెప్పింది"ఎక్కడండీ దాన్ని చూడ్డానికి అసలు సమయం దొరకట్లేదు...యీ దిక్కుమాలిన అక్కవుంటింగ్ జాబ్ కాదు కాదుగానీ...మంత్ ఎండ్ , క్వార్టర్ ఎండ్, యియర్ ఎండ్ అంటూ ఎప్పుడూ యేదో ఒకటీ,, దానికి తోడు ప్రొఫెషనల్ డెవెలప్మెంట్ అంటూ ఒకటే గోల అని చెప్పింది..అన్ని ఎండులూ చెప్పింది మరి వీకెండులు ఉండవా అని అడుగుదామనుకుంటూనే ఎందుకొచ్చిన గొడవలే అవి నా సహోదరులకి అంకితం అని తెలిసి కూడా మాట్లాడ్డం అని ఊరుకున్నా..ఆ డెవెలప్మెంట్ కోర్సులేవో కంప్యూ కోర్సులు చెయ్యొచ్చుగా!! అమ్మ కూడా కంప్యూ ప్రొఫెషనల్ అయ్యుంటే ఎంచక్కా నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని మరీ పని చేసుకునేదిగా.

యీ మధ్య మా అమ్మ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు...(భాగ్యలక్ష్మీ ఆంటీ హెల్ప్ హెల్ప్ హెల్ప్)!!!
 ప్రతి సాయంత్రం కంప్యూటర్ గదిలోకి రాగానే నా దగ్గరకొస్తుందని ఎంత ఎదురు చూస్తానో!! కానీ కంప్యూటర్లో వెబినార్లో ఏంటొట అవి చూసుకుని వెళ్ళిపోతుంది.. అప్పుడప్పుడు గుర్తొస్తానేమో, ఒక సారి నన్ను తడిమి వెళుతుంది...ఆ స్పర్శకే నేను పులకించి అమ్మ తప్పులన్నీ క్షమించేస్తా...
పండుగ పూటా నిష్టూరలెందుకు గానీ అమ్మ బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నాపిల్లలకోసం సాయంత్రం చంద్రునికి పూజ చేసి, పిల్లల్ని చల్లగా చూడమని ఎలాగూ అడుగుతుంది కదా అలా నా సహోదరులతో పాటు నేను ఎప్పుడూ చల్లగా ఉంటానని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే మిమ్మల్నందరినీ నా పుట్టిన రోజుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. మీరు తప్పకుండా మీ బంధు మిత్ర సపరివార సమేతంగా రావాలి. చిన్న పిల్లని కాబట్టి, దయచేసి చాక్లెట్లు, కేకులూ, రిటర్ను గిఫ్టులూ అవీ అడక్కుండా తమ తమ శక్తి కొలదీ గ్రీటింగులూ, బహుమతులూ, ఆశీస్సులూ ఘనంగా అందజేయ ప్రార్థన. మాకేంటీ అంటారా...?? ఇక్కడ  బహుమతులిచ్చేసి పక్కనే షడ్ర సోపేతమయిన (వన) భోజనాలు యేర్పాటు చేసాము. వడ్డించేవారు మనవారే లెండి!! మీరు  మొహమాట పడకుండా కావలసినవన్నీ  కడుపు నిండా తిని,నన్ను చల్లగా ఉండమని మరొక్కసారి దీవించెయ్యండి.

ఏమీ సేతురా లింగా ఏమీ సేతు.......

Thursday, December 9, 2010

నిజం చెప్పొద్దూ అన్నమాచార్య కీర్తనలన్నీ అస్సలైతే మా వారు రాయాలనుకున్నారట....కానైతే 'ఇంకానేను అనుకోకుండానే ఆల్రెడీ ఇలా అచ్చయిపోయి ఉన్నాయేంటబ్బా' అని చాలా ఫీల్ ఐపొయ్యి ..బాధతో విరక్తి చెంది..పెన్ను ముట్టుకోవడం మానేసారంట... లేకపొయ్యంటే సుభద్రా పరిణయం వ్రాసిన కవయిత్రిగా నాకెంత వైభవమొచ్చేదో మీరూహించండి. ఏమాటకామాటే చెప్పుకొవాలికానండీ, ఆయన అలా అంటున్నప్పుడల్లా 'పోదురూ బడాయీ' అని నేననుకోని రోజు లేదు..కానైతే  యీ బ్లొగు వ్రవెశం చేసాక కానీ నాకు ఆ విషయం తెలియలేదు...
ఒకానొక రోజు పరీక్షా కాలంలొ (అంటే ఎక్జాముల టైములొ అన్న మాట)బుర్రకాయ వేడెక్కి పొయ్యి చెవుల్లోంచి పొగలు చిమ్ముతున్న వేళ ...అల అల నెమ్మదిగ.....ఉష్......ఇంట్లొ యెవరైన చూస్తే చిన్నా పెద్దా అని లేకుండ క్లాసు పీకుతారు...కంప్యుటర్ లొ ఈనాడు చదువుకుందామని చిన్ని ప్రయత్నం చేసానా....దీనికి కూడా నేనంటే చులకన...అస్సలు మాట వినలెదు.....పొనీలే అని గూగులమ్మనడిగా....కుంచుం సహాయం చెయ్యమని......ఇంకెముందీ....శబ్బాసురా శంకరా అంటూ వేణు గారి బ్లాగ్ లోకి తీసుకెళ్ళిపొయ్యి
లోకమంతా తిప్పేసి ఇందు గారిని , జ్యొతి గారిని, శివ రంజని గారిని, శిశిర గారిని, నాగార్జున గారిని పరిచయం చేసేసింది....  ఇంక చాలు గూగులమ్మా యీ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని యెంత గొడవ చేసినా వినలేదంతే. పైగా ఇంత హాప్పీగ తోడుండి తిప్పేవాళ్ళూ నీకెవరన్నా ఉన్నారా అని మరీ గదమాయించింది. నేను కూడా అవును నిజమే అనేసుకుని ఇంక బయటికి రాకుండా అక్కడే ఉండిపొయ్యాను...అంతలొ.....తలుపు కిర్రునా చప్పుడైనది...గుండె ఝల్లునా కొట్టుకున్నదీ..మెల్లి మెల్లిగా నే కళ్ళుతెరిచి ఆ వచ్చినదెవరొ చూసాను.......
యెవలాలూ అని మీకు నాకుమల్లేనే డౌటు వచ్చిందా? అయితే మీరు ఇంకా మెళకువగానే ఉన్నరన్నమాట....హమ్మయ్య..అయితే నేను ఇంకా చెప్పచ్చు.
అబ్బే యెవ్వరూ లేరు ...అంతా నా భ్రమ ....కానీ ఆ దెబ్బకి ఒంటి మీద  'సొయొచ్చీ సదూకొవాలె ఇగ నడువు అని నన్ను నేను అదిలించుకున్నా. అబ్బ అంత వీజీగ వినేస్తే మనమేమి గొప్పోళ్ళమండీ అప్పటికప్పుడు  ఇంద్ర భవనం లాంటి బ్లాగు కట్టెయ్యాలని... దానికి ఎన్నెలని పేరెట్టెయ్యాలని..బోల్డు కబుర్లు మీతో చెప్పెయ్యాలని...బోల్డు బోల్డు బ్లాగులకు రోజు వెళ్ళి తలుపులు కొట్టాలనీ.... ఒకటే ఇది.....ఆ ఊపులో పుస్తకం ముందేసుకుని

ఇన్నాల్లు యాడుందొ యీ గంగ
ఉర్కుర్కి రావట్టె ఆత్రంగ
కతలు రాయవట్టె సిత్రంగ
శబ్బసురా శంకరా...
.అని భరణి గారిని తలుచుకుని "మమ" అనేసుకున్నానన్నమాట...

అజ్జిబాబోయ్ యీ ఇషయం ఇప్పుడు సెప్పీసినాన? ఇంట్లొ వాళ్ళు సదివేసి ఏటంటారొ ఏటో . అయినా నాకేటి దిగులు....పరీచ్చలు అయిపొనాయి గంద.... కూసింత కలాపొసన ఉండాల అని సెప్పీనూ?ఓఓఓఓఓ ఇదయిపొతుంటారూఊ...

సరే అని ఇంత కాలం అది రాయాల ఇది రాయాల అని అనేసుకోవడం  చాలా 'విజ్జీ' చిన్నప్పుడు పరీక్షలయ్యాక 'ఎలా రాసావమ్మ  అని అడిగితే  ఎంత "విజ్జీయొ" అని చెప్పిన కంటే ఇంకా యెక్కువ "విజ్జీగా" తీసుకున్ననన్నమాట.ఇంక యేమి వ్రాయాలో తెలియక మీతో వ్రత కథా శ్రవణం  చేయించేసి మీకు బోల్డు పుణ్యం సంపాదించి పెట్టేసానా? మరి అక్కడి నుంచీ అన్నీ భవసాగరాలే . ఆలోచించీ చించీ చించీ .....విరక్తి వచ్చేసింది.... ఆ విరక్తిలొ చిన్నప్పుడు భక్తి రంజనిలొ వచ్చే తత్వాలు గుర్తొచ్చేసాయి. నేను ఇంత తాత్వికినని ఇంత కాలం తెలియదు సుమా! ఓ యీ సుమా యెవరూ అంటారా మా అత్తగారు పరిచయం చేసారు లెండి..
సరే సుమా గురించి మళ్ళీ యెప్పుడైనా చెపుతా గాని  నా ఫిలాసఫీ గురించి కొంచం మాట్లాడుకుందాం. పాపం మా వారు అన్నమయ్య ని అపవాదు చేస్తే యేమొ అనుకున్నా గానీ నాకూ కళ్ళు  పత్తి కాయల్లా విచ్చుకుని బోధిసత్వుడిలా
జ్ఞానోదయమయ్యింది.. ఓన్లీ తేడా యేంటంటే ఆయన కళ్ళు సహం మూసుకుని ఉంటే నేనేమో సహం తెరుచుకుని ఉంటున్నానన్నమాట. ఆ వొచ్చిన జ్ఞానం జ్ఞానం యెంత తాత్వికం చేసేసిందంటే, యేది చదివినా " చీ నేను వ్రాద్దామనుకున్నా , వీళ్ళు వ్రాసెసారు" అని భయంకరమైన   వ్యాధిని కూడా వెంట తెచ్చేసింది. ఆ విరక్తి + వ్యాధి+ తత్వం + వేదాంతం = యీ కింద వ్రాయబడిన 'కపిత్వం' ....అబ్బా దీని మీనింగు కూడా అడిగారంటే
 నేను మీ జట్టు కచ్చయిపోతానంతే. మరి ఇంక చదవండి.... పదండి ముందుకు పదండి ముందుకు...అదిగొ మళ్ళీ శ్రి శ్రి కవిత అనుకున్నారా? అబ్బే కాదండీ అర్టీసీ బస్సు.... ఓకే టికట్ తీసుకున్నారు కదా ఇప్పుడు తీరిగ్గా కూచుని చదవండి మరి.....
మా ఊరీ ఎర్ర బస్సు
ఎర్రిదని నేనందమంటే
శివరంజని అడ్డమొచ్చి
అంత మాటని పోయె లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....

ఈ టీవీ చూసి నేను
నేటి వార్తలు రాద్దమంటే
మొన్ననే మన శిశిర గారూ
వ్రాసి పారేసారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....

కాలేజీ కబురులన్నా
కరువు తీరా చెపుదమంటే
చిన్నవారూ  నాగార్జున
చించి చెప్పేసారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....

షడ్రుచులతొ నోరూరగ
పాక కళనూ చూపబోతే
రుచి రుచిగా జ్యొతి గారూ
వండి వడ్డించారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....

నెమలీకలు గుర్తుకొచ్చీ
చిన్ని కతలూ వ్రాయబొతే
మక్కువతో ఇందు గారూ
అచ్చు వేసేసారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....

శబ్బాసుర అంటు నేను
"భరణిని" కీర్తిద్దమంటే
మస్తు మస్తుగ వేణు గారూ
పుస్తకాలేసారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....

... యేటి నాలాగ మీకు కూడా తత్వాలు వచ్చేస్తున్నై కదూ....ఇంక ఆలీసమెందుకు...... పదండి ముందుకు పదండి ముందుకు
పదండి ముందుకు ...పైపైకీ 

సారీ , ఇంకా చెప్పలేదు కదూ..... ఇక్కడ మా ఊర్లో... ఇలా  పదండి ముందుకు అనడమే కాకుండా చివరి సీటు దగ్గర 'ఇంత లొపలికి వచ్చినందుకు త్యాంక్సులొయ్' అని కూడా చెప్తారండోయ్...... మీకు కూడా త్యాంకులు

బ్లాగ్ ప్రవేశ మహోత్సవము -కథా ప్రారంభము

Monday, December 6, 2010

వక్ర తుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

పూర్వము టొరంటొ యను నొక పట్టణము ఉండెను
ఆ పట్టణము మిక్కిలి పెద్దవగు భవనముల తోడను, ఆపిల్, పియర్ ,లిచి మొదలగు ఫల భరితములైన వ్రుక్షముల తొడను, మేపుల్ సిరప్ వంటి అమ్రుత తుల్యమైన ద్రావకముల తోడనూ అలరారుచుండె.
ఆ పట్టణమున పున్నమి అను వెలది ఉండెను. ఆమె తెలుపు నలుపు గోధుమ అను బేధము లేక అందరితొ కలసిమెలసి ఉండెడిది. ఆమెకు ఒక రాత్రి సరస్వతీ  దేవి ప్రత్యక్షమై "భక్తురాలా నువ్వు 5 సంవస్తరములు నన్ను భక్తిగా కొలచినట్లైన ధనము సౌఖ్యము ప్రసాదించెదనని" పలికినది.
అంత నా పడతి నిదుర యందె 'తల్లీ నిన్ను తలంచి పుస్తకము చేతన్ బూనితిన్" అని ప్రార్దించి వెంటనే మేల్కాంచి తన స్వప్న వ్రిత్తాంతమును పతి దేవునికినీ పిల్లలకును వివరించె. ఒకానొక శుభ దినంబున మొదలు పెట్టిన వ్రతము నిర్విఘ్నముగ కొనసాగుటకై స్నేహితులును బంధువులును కంకణము కట్టుకొనిరి. అంత నా వ్రతము ప్రారంభమయ్యే.
 ఆ నాతి పార్టీలు పబ్బములనక ,ఇండియా యనక ఆంధ్రా యనక అతి భక్తిగా దేవిని ఆరాధించుచుండ
కొంత కాలము గడచినది.
ఒక శుభ దినమున వ్రతము సంపూర్ణమయ్యెను. ఆహా దేవత చెప్పిన దినమిదే కదా యని అందరును మిక్కుల ముదమునందిరి. ఆ దేవి అనుగ్రహము వలన పున్నమికి ఒక ఇంటర్వ్యూ వచ్చెను.  బాసు పున్నమి యందు గల సరస్వతీ కటాక్షమునకు మిక్కిలి సంత్రుప్తి చెంది 'ఉద్యోగ ప్రాప్తి రస్తు ' అని దీవించినది. ఇది చూసి దేవి యొక్క అత్తగారైన లక్ష్మీ మాతకు ఆగ్రహము కలిగెను. హమ్మా, నన్ను పూజించకుండ నా కోడల్ని పూజించేస్తే
నేనొప్పుకోనంతే యని బాసు గారి యందు ప్రవేశించెను. 
సరస్వతి పున్నమియందు ప్రవేశించి, చక చక పనులు చెయ్యసాగె. బాసు గారియందున్న లక్ష్మీ దేవి మిగుల సంతసించి యెమి కావలెనొ కోరుకొమ్మనె. పున్నమి మిక్కిలి అణుకువగా ఒక 100కె చాలునని తెలిపె. లక్ష్మీ దేవి ఒప్పుకొనినందున పున్నమి మిగుల సంతసించి విషయమును బంధువులకు మిత్రులకు తెలియజెప్పె. కథ సుఖాంతమయ్యెనను సమయమున బాసుగారినందున్న అత్తకు హటాత్తుగా మెలకువ వచ్చి "నేనెమిచేయుచుంటిని, నేనేమి కోడలికి వత్తాసు పలుకుట యెమి, ఇప్పుడేమి దారియని" ఆలోచించ సాగె.
ఆమెకు వచ్చిన విద్యలు సునాయాసముగను, రాని విద్యలు 'కలిసుందాం రా' 'క్యూంకి సాస్ భి బహూ థీ' లోని అత్తగార్ల వద్ద కొంత ఆయాసపడి నేర్చుకొనియును పున్నమి పయి ప్రయొగించి ఆమెను అస్ట కస్టముల పాలు జేసెను. రాయ బోగ పెన్ను లొ ఇంకు అయిపోవును, పెన్సిలు ముక్కు చెక్కుకు పొవును. షాప్మరలు కానరావు. టైపు చేయుదమన్న కీ బొర్డు పనిచెయ్యదు. కంప్యూటరు నందు వైరస్ అయి అడ్డుపదును. సభలయందు మాటాడు సమయమున మైకు పనిచెయ్యకుండునట్లును ఒక వేళ అది బాగున్ననూ అన్నీ మరచి మరచిపోవునట్లును చేసి, య తల్లి ఆడుకొన  సాగినది.
సరస్వతియునూ పెన్నులో సిరాయై , పెన్సిలుకు షాప్మరయై, వైరస్ కు ఫైర్వాలయి , మైకుకు సౌండయి ,మెదడులో జ్ఞనాగ్నియై పున్నమిని కాపాడసాగె. ఇక లక్ష్మి తన నిజ స్వరూపమును వీడి "సూర్యకాంతము" రూపము ధరించె. సరస్వతియును దిక్కు కానక 'చాయా దేవీ' రూపమును ధరించి అనుక్షణమును పున్నమిని వెన్నంటి నిలచె. ఒక నాడు లక్ష్మి పున్నమిని గాంచి మిక్కిలి ఆగ్రహము చెంది 'నీవు నీ పని వారిని చెప్పుచేతలలో ఉంచుకొనుట లేదనియు, వారి చెప్పులు నువ్వు మోయుచుంటివనియు అపవాదు జేసెను. అంత పున్నమి విసిగి...తన యందు గల సరస్వతిని నిందించి తనను విడిచి వెళ్ళమని కోరెను. సరస్వతి 'బిడ్డా నీకు మేలుచేయ ప్రయత్నించుచుంటిననీ పలికెను.
నీవు చేసిన ఉపకారము చాలును ఇంక నాలొ నువ్వున్నచో నా బిడ్డల మీద ప్రమాణమని పున్నమి కన్నీటితొ పలుక, సరస్వతి యేమియును చేయజాలక ఆమెను విడిచి  వెళ్ళెను. లక్ష్మియును బాసును విడిచి సరస్వతి యున్న నెలవులను వెతుకుచు వెళ్ళెను. అంత పున్నమి ధైర్యము వీడక ఫాక్టరీలకు,మెక్దొనాల్ద్నకు పోయి ఉద్యోగమును చేయుచూ, మేడలును, కారును, బంగారమును భూములును కొని  సుఖముగానుండి అంత్యమున లక్ష్మివాసమునకరిగినది.
సరస్వతి  ఫలము చెడ్డా వ్రతము దక్కిందన్న సంత్రుప్తి చెంది తన దీవెన యేదో విధముగా నజమయ్యెనని సంతొషించె. ఇవ్విధముగా దేవి తానోడి పున్నమిని గెలిపించినది.
ఇతి బ్లాగ్పురాణే రేవా ఖండే లక్ష్మీ  సరస్వతీ సంవాదే  ప్రథమొధ్యాయహ సమాప్తహ.
యీ కథను రాసిన వారికిని చదివిన వారికినీ లక్ష్మీ సరస్వతీ కటాక్షము ఒక్కసారిగా కలుగునని పరమేశ్వరుడు
పార్వతీ దేవికి వివరించెను.
ఓం శాంతి శాంతి శాంతిః

బ్లాగంటే బ్లాగూ కాదూ.......

Sunday, November 21, 2010

చిలిపి తలపు ఆకు కొమ్మ..
చిన్న నాటి వెన్నెల వెల్ల.....
పదిలంగ అల్లుతున్న సిరి "వెన్నల" నాది