తోడు

Thursday, April 20, 2023

15 మార్చ్ 2023 చిన్న కూతురి కూతురు పావని అంటే పంచప్రాణాలు రాఘవకి. ఉన్న ఊర్లోనే కాబట్టి పుట్టినప్పటి నించీ తనని చూడని రోజు ఉండేది కాదు. వర్ధని క్యాన్సర్ తో పోరాడి చనిపోయిన తర్వాత కొద్ది రోజులు తన దగ్గర ఉండి బడికి వెళ్ళింది కూడా. పావని స్కూల్ టాపర్ అయి రాఘవకి గర్వం కలిగిస్తూ ఉంటుంది. పెద్దమ్మాయి అపర్ణ పిల్లలతో ఇంత సన్నిహితత్వం రాలేదు దూరం వల్లనేమో. అపర్ణకి చిన్నతనం లోనే దూరపు చుట్టం, భూస్వామి అయిన కేశవతో పెళ్ళి చేసారు. పాడిపంటలతో తలమునకలైన వ్యవహారాల వల్ల వాళ్ళు గంగనకుదురు అనే గ్రామం నించి అరుదుగా వచ్చి పోతూ ఉండేవారు. రెండవ అమ్మాయి రత్నని ఊళ్ళోనే గొప్పింటి వాళ్ళకి ఇచ్చి చేసినప్పటి నించీ, తనకి చదువు తక్కువ కాబట్టి, తన పెళ్ళి ఇంత ఘనంగా చెయ్యలేదని అలుక వచ్చి కేశవ భార్యని పుట్టింటికి పంపడం తగ్గించడంతో రాకపోకలు మరీ తగ్గిపోయాయి. తండ్రి ఎంత చేసినా కేశవకి మనసులో తను తక్కువ అనే భావన పోవటం లేదు. అపర్ణ సద్ది చెప్పలేక సతమతమయ్యేది. అదొక్కటే బెంగ రాఘవకి. ఈ మధ్య కొద్దిగా అనారోగ్యం పాలయిన రాఘవని తనదగ్గరికి వచ్చెయ్యమంటుంది అపర్ణ. అత్త మామలు, బంధు బలగాలు ఉన్న పెద్ద కుటుంబం అవడం వల్ల, తను వెళ్ళి అక్కడ ఉండడం ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది రాఘవకి. అల్లుడి ముభావం వల్ల ఇంకా ఇబ్బంది. రత్న చూసుకుంటుంది కాబట్టి బెంగ పడద్దని అపర్ణకి చెప్తూ ఉంటాడు ఫోన్లలో. తన ఇంట్లోనే తనకి బాగుందని అమ్మ జ్ఞాపకాలతో గడచిపోతుందని చెప్పి, అవసరమయితే రత్న ఇంటికి వెళతానని అంటుంటాడు. ప్రస్తుతానికి రత్న వాళ్ళు రావడమే కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అతి తక్కువే రాఘవకి. భార్యం అనారోగ్యం వల్ల వండుకోవడం, పనులు చేసుకోవడం అలవాటే కాబట్టి, ఎటువంటి బాధా లేదు. రాఘవకి వచ్చిన జ్వరం తిరగబెడుతూ, బాగా డీలా చేసేస్తోంది కొద్ది కాలంగా . వైద్య పరీక్షలలో పెద్దగా ఏమీ లేదని కొట్టిపడేసారు డాక్టర్లు. ఇంత నీరసం ఎందుకో అర్థం కాక, పిల్లలని ఇబ్బంది పెట్టలేక, ఈ విషయం ఎవరికీ చెప్పకుండా గడిపేస్తున్నాడు రాఘవ. జ్వరంతో పాటు చెక్కర వ్యాధి వల్ల రాఘవ సీరియస్ అవడం తో కూతుర్లు ఇద్దరూ పరిగెత్తుకుని వచ్చారు. భర్తని బతిమాలుకుని నెల రోజులు ఉండి, పిల్లల పరీక్షలు కాబట్టి వెళ్ళిపోతూ, తను బతిమాలినా తనతో రాని తండ్రిని తీసుకెళ్ళి ఆయన కోలుకునేదాకా చూసుకోవాలని రత్నని బతిమాలింది అపర్ణ. ఈ నెల రోజులుగా రత్నకి ఆటవిడుపు. నువ్వున్నావు కదక్కా అనేది. సరే మిగతా సమయాల్లో చెల్లెలే కదా చూసుకుంటోంది అని, తనూ తృప్తిగా తండ్రిని చూసుకుంది అపర్ణ. పావని కూడా రావడం తక్కువయింది. అపర్ణ వెళ్ళాక రత్న కానీ, పావని కానీ రాఘవ దగ్గరికి రాలేదుట. అపర్ణ ఫోన్ చేసినప్పుడు పావని పుట్టినరోజుకి కుక్కపిల్ల కొనడానికి వెళుతున్నామని, మరునాడు తండ్రిని తెచ్చుకుంటానని చెప్పింది రత్న. తండ్రికి కుక్కలంటే ఉన్న భయం, ఇంకా చెప్పాలంటే ఎలర్జీ తెలిసిన అపర్ణ అవాక్కయింది. నాన్నకి అనారోగ్యం పొడచూపాక ఇప్పుడు కుక్కపిల్ల ఏంటని నిలదీసినా, తీసి పారేసింది రత్న. * కుక్కపిల్ల సింబా రత్న వాళ్ళ కుటుంబ సభ్యురాలు అయింది. పావని కూడా సింబాని 24 గంటలూ తనతో తిప్పుకుంటూ తాత దగ్గరికి రావడం తగ్గించేసింది. ఒకవేళ రత్న, పావని తనని చూడడానికి వచ్చినా, సింబా లేకుండా రావడం అరుదే. తనకి కుక్కలంటే ఉన్న ఎలర్జీ వల్ల, అది ఇంట్లో తిరిగేస్తుంటే, తెలియని ఆందోళన కలిగేది రాఘవకి. రాను రాను కూతురూ మనవరాలు రాకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉందని అనిపించేది. ఈ విషయం విన్న అపర్ణకి దుఖం ఆగలేదు. తండ్రి తన దగ్గరికి ఎలాగూ రాడు, అవసరం వస్తే రత్న దగ్గరికి వెళతాడని ఆశ ఉండేది, ఈ సింబా పుణ్యమా అని అది ఇంక కల్ల. అదే విషయం ఎన్నిసార్లో సున్నితంగా రత్నకి చెప్పడానికి ప్రయత్నించింది. కుక్కపిల్లతో కన్నబిడ్డ లాంటి బంధం పెరిగిపోతున్న రత్నకి, దాని విషయంలో నెగటివ్ గా ఎవరేమన్నా పూర్తిగా వాళ్ళతో బంధం తెంచుకునే స్థాయి వచ్చింది. తండ్రి ఇబ్బంది పడుతున్నాడు అని తెలిసి కూడా సింబా రాలేని చోటికి తనూ రానని చెప్పి, పూర్తిగా రావడం మానేసింది. పావని కూడా సింబాని వదిలి ఉండదు అని తెగించి చెప్పేసింది. రాఘవ నిజంగా బెంగ పెట్టుకున్నాడు ఈ సారి. ఊరు వదిలి వెళ్ళలేడు, ఉన్న చోట ఉండలేడు. ఈ విషయమై అపర్ణ రత్నతో గొడవపడింది చాలా సార్లు. తను తండ్రిని తీసుకెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేదనీ, తన కుటుంబ పరిస్థితికి తగ్గట్టు తండ్రి కూడా సర్దుకుపోవాలని వాదించింది రత్న. * రాఘవకి స్పృహ తప్పిందని అందరూ పరుగు పరుగున వచ్చారొకరోజు. ఆయన్ని ఆస్పత్రి నించి తీసుకొచ్చేరోజు, అక్కచెల్లెళ్ళ గొడవ తీవ్రమై, వాదోపవాదాలు అయ్యాక ఏడవడం మొదలెట్టింది రత్న. పాపకి బడిలో మానసికంగా ఏదో ఇబ్బంది వచ్చిందని, దాని నించి కోలుకోవాలంటే పెట్ ని కొనిమ్మని వైద్యుడు సలహా ఇచ్చాడని, పావని ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఈ విషయం తండ్రికి చెప్పద్దని చెప్పి, వెక్కి వెక్కి ఏడుస్తున్న చెల్లిని ఏమనాలో తోచలేదు అపర్ణకి. మర్నాడు "నాన్నా, మా పిన్నత్తగారి చుట్టాలొకరికి హైదరాబాద్ లో కోర్టు పనిట, పాపం హోటల్ లో ఉండే స్తోమత లేదు. ఈ రోజు వస్తున్నారు, మన ఇంట్లో ఉండమని చెప్తే, నీకేమైనా ఏమైనా అభ్యంతరమా" అంది. తప్పకుండా రమ్మన్నాడు రాఘవ. వాళ్ళు వచ్చాక ఇంకో వారం ఉండి, వాళ్ళకి అన్నీ చూపించి వెళ్ళింది అపర్ణ. అప్పటి నించీ వాళ్ళ కోర్టు కేసు అలా వాయిదా పడుతూనే ఉంది రెండేళ్ళుగా. ఎప్పటినించో ఏదన్నా పని ఉంటే చెప్పమని బతిమాలుతున్న ఆ జంటకి జీతం ఇస్తున్నట్టు మాత్రం ఇటు భర్తకి గానీ అటు తండ్రికి కానీ చెప్పలేదు అపర్ణ. వాళ్ళు తోడుగా ఉండడంతో తండ్రి ప్రశాంతంగా ఉన్నాడు, అది చాలు తనకి.

0 వ్యాఖ్యలు: