ఆఫీస్

Thursday, April 20, 2023

14 ఫిబ్రవరి, 2023 "మరెలా ఆఫీసులో.." సందిగ్ధంగా అన్నాడు రవి. "ఒక్క సెలవు కూడా పెట్టకూడదని చెప్పారు మార్చ్ చివరి వరకూ. పని చాలా ఉంది" అంది రాధిక. "మరెలా" అన్నాడు రవి. "ఇంకేముంది సిక్ లీవ్ అని చెప్పెయ్యడమే, రాక రాక వచ్చారు రమా వాళ్ళు అంత దూరం నించి. మళ్ళీ మళ్ళీ వస్తారా ఏమిటి? అన్నయ్య పుట్టిన రోజని ఇప్పుడేగా తెలిసింది. ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా . ఫర్వాలేదులే" "అంటే... అసలే మీ బాస్ తిక్కలోడు, నీ మీద పీకల్దాకా కోపం, జాబ్ పీకేస్తా అంటాడేమో" "అయ్యా, నా మీద మీకు నమ్మకం లేదేమో కానీ, నా మీద నాకు నమ్మకం ఉంది. ఈ జాబ్ పోతే చిటికలో ఇంతకు మించిన జాబ్ తెచ్చుకోగలను. ఇది 1847 కాదు 2000" "అవుననుకో, కానీ.. సరేలే నీ ఇష్టం, ఆఫీసుకి ఫోన్ చెయ్యి, టికెట్లు తీసి పెట్టమని శంభు కి ఫోన్ చేస్తా ఈ లోపు" అంటూ హాల్ లోకి వచ్చాడు. బాత్రూంలో బాబుకి స్నానం చేయించి బయటికి తీసుకొచ్చింది అంజమ్మ. బాబుని చేతులోకి తీసుకుని " పౌడరూ, బట్టలూ తెచ్చి ఇవ్వు. నేను వేస్తా. నువ్వు ఇల్లు తుడిచెయ్, టిఫిన్ మాత్రమే చెయ్యి, ఈ రోజు లంచ్ బయట చేస్తాం" అంది రాధిక. పైన వివరాలు విన్నది కాబట్టి, "అయ్యో నేను చేస్తాలే అమ్మా, మీకు ఆఫీస్ టైం అవుతుంది " అనలేదు. పనులయ్యాక బాబుని అంజమ్మ చేతికిచ్చి, ఇంటికి వచ్చిన చుట్టాలతో సినిమాకి, అటునించి అటు లంచ్ కి వెళ్ళి వచ్చాక, అంజమ్మ మిగతా పని పూర్తి చేసి వెళ్ళింది. చాలా నిదానస్తురాలు ఆమె. గత మూడేళ్ళుగా బాబుని, ఇల్లుని జాగర్తగా చూసుకుంటూ నమ్మకంగా పని చేస్తోంది. * "రాధీ, ఇవాళ మమత వాళ్ళ పెళ్ళి రోజు కదా.. మర్చిపోయావా?" అన్నాడు రవి ఆఫీస్ నించి ఇంటికొచ్చిన రాధికతో. " వాళ్ళకి అర్థరాత్రి 12 అయినప్పుడు చేద్దామనుకున్నా ఆఫీస్ నించి. వాళ్లకి అలా నచ్చదు. తెల్ల వారితేనే ఆ రోజు లెక్క అంటారు. ఇప్పుడు మనకి రాత్రి 7 అంటే వాళ్ళకి పొద్దున్న 8.30 అయి ఉంటుంది! ఇంట్లో ఉండరు. అమెరికా వెళ్ళినా సుధాకర్ పెళ్ళి రోజున పొద్దున్నే గుడికెళ్ళి హోమాలు అవీ చేయించడం మానలేదుగా.. అవన్నీ అయి బయట లంచ్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి మనకి అర్థరాత్రి దాటుతుంది. నేను రేపు ఆఫీస్ కెళ్ళాక అక్కడినించి చేస్తా. అమెరికా క్లైంట్లు ఎలాగూ ఉన్నారు కాబట్టి ఆఫీస్ లో ఎవ్వరూ పట్టించుకోరు. రోజూ ఒక అరగంట మాట్లాడుకుంటాంగా అప్పుడు చెప్తాలెండి" అంది రాధిక. "సరే మరి, నా తరఫు నించి కూడా చెప్పు విషెసు , మళ్ళీ మరదలు అలిగితే కష్టం" అన్నాడు సరదాగా అంజమ్మ చేతిలోంచి బాబుని తీసుకుంటూ. * బాబు శ్రీకర్ మూడవ పుట్టినరోజు రాబోయే వారాంతంలో ఘనంగా ఏర్పాటు చేసారు. ఆఫీసులో కూడా ఉక్కిరిబిక్కిరిగా పని ఉండడంతో ఏర్పాట్లకి సతమతమవుతోంది రాధిక. గురువారం ఆఫీసుకెళ్ళే సమయానికి అంజమ్మ రాలేదు. తను ఆఫీసులో పంచ్ చెయ్యాలి కాబట్టి, అంజమ్మ వచ్చేదాకా ఉండి, పిల్లాడిని అప్పజెప్పి వెళ్ళమని రవికి చెప్పి, తను ఆటో లో ఆఫీసుకి వెళ్ళిపోయింది. సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి ఇల్లంతా పీకి పందిరేసినట్టు ఉంది. అలసటతో ఉన్న రవి, "తల నొప్పిగా ఉంది టీ పెట్టవా" అన్నాడు. ఏం జరిగిందో అర్థం కాకుండా చూస్తున్న రాధికని చూసి ఎత్తుకోమని గట్టిగా ఏడ్చాడు శ్రీకర్. ముట్టుకోగానే ఒళ్ళు కాలిపోతోంది. "అంజమ్మ రాలేదు.. వీడికి మోషన్స్, వాంతులు అవుతున్నాయి. ఒక్క నిమిషం చెయ్యి దిగలేదు. నువ్వొచ్చాక ఆస్పత్రికి తీసుకెళదామని ఆగాను" అంటున్న రవిని, ఎక్కడివక్కడే పడి ఉన్న ఇంటిని అయోమయంగా చూస్తూ ఉండిపోయింది రాధిక. అంజమ్మ మర్నాడు కూడా రాలేదు. ఏమయిందో తెలియదు. తన ఇల్లు కాకతీయ నగర్ అని చెప్పింది కానీ, ఎక్కడ అన్నది వాళ్ళిద్దరికీ తెలియదు. ఇంటా బయటా పనులు చేసుకుంటూ, బాబుని జాగ్రత్తగా చూసుకుంటూ, ఫంక్షన్ చేసేటప్పటికి తల ప్రాణం అరికాలికొచ్చింది ఇద్దరికీ. సోమవారం పొద్దున్నే బాబుని చూసుకోవడానికి మనిషిని పంపిస్తానన్న స్నేహితుడి భార్య శైలకి ఫోన్ చేద్దామని చూస్తే, ఫోన్ పని చెయ్యలేదు. ఏమయిందో అర్థం కాక, పక్కింటి వాళ్ళింట్లోంచి శైలకి చేసి, అలాగే ఫోన్ కంపెనీకి ఫోన్ చేసి, టెన్షన్ పడుతూ ఇంటికొచ్చాడు రవి. దేవతలా అంజమ్మ గేటు తీసుకుని ఇంట్లోకెళుతూ కనిపించేటప్పటికి సగం రిలీఫ్ అనిపించింది. అంజమ్మని చూడగానే గయ్యిమని అరవడం మొదలెట్టింది రాధిక. "బాబు పుట్టినరోజని తెలియదా, చుట్టాలొస్తారని తెలియదా, ఇంటెడు పని ఉంటుందని తెలియదా.. ఇలా మానేసేటట్టయితే నువ్వు ఇంక పనికి రావక్కరలేదు" అంటూనే, మనసులో హమ్మయ్యా అనుకుంటోంది. కొత్త పని పిల్ల వచ్చినా, పిల్లాడికి అలవాటు లేదాయె. అసలే అనారోగ్యం నించి కోలుకుంటున్నాడు. ఎలాగా అని పడిన బెంగ వాడు నవ్వుతూ అంజమ్మ మీదకి ఉరకడంతో తీరిపోయింది. అంజమ్మ ఏమీ మాట్లాడకుండా నించుంది. "సరే... నువ్వు రావనుకుని పనంతా చేసేసుకున్నా. వీడిని తీసుకో, మేము వెళ్ళాలి" అని అక్కసుగా అంటూ, "శైలకి ఫోన్ చేసి చెప్పండి వాళ్ళ పని పిల్లని పంపద్దని, అన్నట్టు మన ఫోన్ ఏమయ్యింది" అడిగింది రాధిక. "ఏమో అర్థం కావట్లేదు, 2200 బిల్లు పంపారుట. కట్టలేదని కట్ చేసారుట" "ఏమిటీ రెండు వేలా, అదేంటీ?" "ఏమో నువ్వే పొరపాటున మమతకి చేసి ఉంటావనుకున్నా. కానీ కాదుట భోపాల్ కి చేసినట్టు ఉన్నాయి వివరాలు. లంచ్ లో వెళ్లి కనుక్కోవాలి" "భోపాల్ లో ఎవరున్నారు మనకి?" "మాకున్నారమ్మా, నా చెల్లి ఉంది. మా మరిదికి అక్కడికి బదిలీ అయింది" నిదానంగా అంది అంజమ్మ. రాధికకి అరికాలి మంట నెత్తికెక్కింది. "ఉంటే, ఎస్టీడీ చేసేస్తావా ఇంట్లోంచి రోజూ, ఇంక నిన్ను నమ్మి ఎలా ఉంచుకుంటాము. పని మానెయ్" గట్టిగా అరిచింది రాధిక. "అదేంటంటే అమ్మా,.... ఆఫీసులో సెలవు పెట్టకూడదన్నప్పుడు మీరు సిక్ లీవులు పెట్టేస్తారు. మీ చెల్లి గారికి అమెరికా ఫోన్ చెయ్యాలంటే ఆఫీసు నించి చేస్తారు. మరి నాకు మాత్రం ఆఫీసంటే మీ ఇల్లే కదమ్మా. మా అమ్మమ్మ కాలం కాదు కదా , మీకు మల్లేనే మీరు తీసేసినా చిటికలో ఇంకో ఇల్లు సంపాదించుకోగలను. రేపొచ్చి డబ్బులు తీసుకుంటా" అంటూ వెనుతిరుగుతున్న అంజమ్మని మాటా పలుకూ లేకుండా చూసింది రాధిక. "నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి, పనిమనిషుల ముందే అన్నీ మాట్లాడుకుంటే ఇట్లాగే ఉంటుంది యవ్వారం.. " అంటున్న రవితో "నేను బతిమాలితే నెత్తికెక్కుతుంది గానీ, మీరే బుజ్జగించి తీసుకురండి.. ఇప్పట్లో బాబుకి నప్పే పని వాళ్ళు దొరకరు" అంది రాధిక ఇపుడు అంజమ్మతో ఎలా మాట్లాడాలా అని మొహమాటపడుతూ.

0 వ్యాఖ్యలు: