ప్రేమ

Thursday, April 20, 2023

1 మార్చ్ 2023 నూర్ ముందు బస్ స్టాప్ లో బస్ ఎక్కుతుంది. మా బస్ స్టాప్ లో బస్ ఎక్కుతున్న వాళ్ల వరుసలో నేనున్నానా అని ఆమె కళ్ళు వెతుకుతాయిట. నన్ను చూడగానే నా కోసం ఎదురుచూస్తున్నట్టు సంతోషంగా నవ్వుతుంది. ఇద్దరం కలిసి ఒక గంట ప్రయాణం చేస్తాము. బోల్డు ముచ్చట్లు ప్రతి రోజూ.. "ఏమన్నాడు మహమ్మద్? వస్తాడటనా రోజూ? నిన్న చూసాను కదా? ఎంత బాగున్నాడో అసలు హీరోలా." అన్నాను. "నిన్న నీ దగ్గరి నించి వచ్చాక, కొంత సేపు చదివాడు రేపు పరీక్ష కదా" అంది. "చాలా ఇంటల్లిజెంట్ తను. కాస్త దారిలో పడితే బ్రహ్మాండంగా సెట్ అవుతాడు" అన్నాను ఆశగా. "మాషా అల్లా, అల్లా కరుణించి, నీ మాట నిజమైతే బాగుండు" అంది కొంత విచారంగా. "మారతాడులే బాధ పడకు. ఏది చెప్పినా ఇట్టే పట్టేశాడు" అన్నాన్నేను. "వాడు పాకిస్తాన్ వెళ్ళినా ఫర్వాలేదు నాకు, అసలు బతికి ఉంటే చాలు. వెల్లిపొదామా అని ఆలోచిస్తున్నాను. కానీ రావడానికి చాలా అప్పు చేశాము కదా.." "నువ్వెందుకు అంత డిప్రెస్ అవుతావు, అది వద్దనే కదా ఇన్ని రోజులు ఆపావు" "అంటే నీ దగ్గర ఒక విషయం దాచాను, మొన్న ఆదివారం నిద్ర మాత్రలు వేసుకున్నాడు.." తన కళ్ళ నిండా నీళ్ళు. "వ్వాట్? ఏమంటున్నావు నువ్వు? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారా" "లేదు, అదృష్టం కొద్దీ వాడంతట వాడికే మెలకువ వచ్చింది. నా మీద ఒట్టేయించుకున్నా అలాంటి పనులు చెయ్యద్దని. ఆ గిల్ట్ వల్లనే మొందెన్ని సార్లు చెప్పినా వినని వాడు, నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చాడు. నువ్వు షార్ట్కట్ గా పరీక్షకి కావలసినవి చెప్తావని నచ్చజెప్పి పంపాను. చాలా షుకురియా. అల్లా భలా కరే. విడిగా ట్యూషన్లూ అవీ పెట్టించే పరిస్థితి లేదు" అంది. "నేను విడిగా ఫేవర్ చేస్తున్నదేమీ లేదు నూర్. పిల్లలకి చదువు చెప్పే టైమే కాబట్టి, మా ఆదిత్య కూడా అకౌంటింగ్ తీసుకున్నాడు కనక కలిసి చదువుకోవచ్చు . గమ్మత్తేమిటంటే, రెండేళ్ళ నించీ ఒకే తరగతిలో చదువుతున్నా, నిన్ననే మొదటి సారి కలిసినట్టు మాట్లాడుకున్నారు ఆదిత్య, మహమ్మదు. మహమ్మద్ ఎవరితోనూ కలవడుట. క్లాస్ అయిపోతూనే వెళ్ళిపోతాడు అని చెప్పాడు ఆదిత్య. ఇక నించీ సాకర్ ఆడడానికి పిలవమని చెప్పా." "అవును సైతాను పట్టింది వాడికి! కెనడా వచ్చాక ఒక నిమిషం కులాసాగా ఉండనివ్వలేదు నన్ను.. ప్రాణం పోతోందసలు. అయినా ట్యూషన్ టీచర్ ని పెళ్లి చేసుకోవడమేంటి నువ్వు చెప్పు. అప్పటికి వీడికి ఇంకా 15 ఏళ్ళు కూడా లేవు. ముఖంలో పసితనం ఉన్నా, ఎత్తుగా, అందంగా పాతికేళ్ళ పైన ఉన్నట్టు కనబడతాడు. ఆ పాతికేళ్ళ అమ్మాయికి వీడి వయసు తెలిసినట్టు లేదో, తెలిసినా పట్టించుకోలేదో మరి అల్లాకే తెలుసు. చదువు పాడయిపోయింది. స్కూల్ మాని ఆ పిల్ల దగ్గర కూచోడం. చిన్న మాట అన్నా ఇంట్లోంచి పారిపోవడం. మొదట కెనడా పీ ఆర్ వచ్చినా, వద్దనుకుని పెద్దావిడని చూసుకుంటూ ఉండిపోయాము. వీడివల్ల ఆవిడని చావు మంచం మీద వదిలి రావలసి వచ్చింది. తలచుకోడానికే సిగ్గుగా ఉంటుంది. తోటికోడలు బావగారు చాలా మంచివారు కాబట్టి, ఇలా కొత్త దేశం అయితే మార్పు వస్తుందని, అత్తగారిని వాళ్ళు చూసుకుంటామని చెప్పి మమ్మల్ని పంపారు పాపం. అసలు ఎంత మంచి వాళ్లో తెలుసా. నా సొంత తోబుట్టువులు కూడా ఇంత ఆలోచించరు" "అవును అలా సహాయం చెయ్యడం అదృష్టమే..వాళ్లు అన్నది నిజమే. Out of site out of mind అంటారు కదా మర్చిపోతాడులే.. ఇంకా పసితనం అంతే" అన్నాను. "ఏమొనబ్బా. ఇంట్లో ల్యాండ్ లయిన్ లో ఇన్టర్నేషనల్ కాల్స్ పెట్టలేదు. వాళ్ల నాన్న సెల్ ఫోను, కాలింగ్ కార్డ్స్ ఉంటే తప్ప పాకిస్తాన్ కి ఫోన్ చేసే అవకాశం లేదు కదా? మరి ఎలా ఫోన్ చేస్తున్నాడో తెలియట్లేదు. వీడు ఫోన్ లో టచ్ లో ఉన్నాడని మా వీధిలో ఒకరితో చెప్పిందిట ఆ దయ్యం. ఇంక ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు నిజంగా. పాకిస్తాన్ పంపిస్తావా చచ్చిపోనా అని ఒకటే గొడవ. ఇప్పుడు వీడినే పోగొట్టుకుంటామేమో అని భయమేస్తోంది. ఈ ఉద్యోగాలు తప్పవు. ఇద్దరం పగలొకరు రాత్రొకరూ పని చేసుకుంటూ చూసుకుంటున్నా, ఒక క్షణం ఏమరుపాటుగా ఉన్నా, ఏం చేసుకుంటాడో అని భయమే. క్లాస్ అయే సమయానికి తండ్రి స్కూల్ దగ్గర నించుని ఇంటికి తీసుకొస్తాడు " అంటూ కన్నీరు మున్నీరవుతోంది నూర్. కాస్త ధైర్యం చెప్పడం తప్ప, నాకూ ఏమనాలో తెలియలేదు. * తరువాత నూర్ బస్సులో కనబడలేదు. తన ఇంటి నంబర్ కి ఫోన్ చేసినా ఎవ్వరూ తియ్యలేదు. మహమ్మద్ స్కూల్ కి రావట్లేదని పిల్లలు చెప్పారు. ఈ లోపు నేను ఉద్యోగం మారడంతో , ఇంకో వైపు వెళ్లే బస్ ఎక్కాల్సి వచ్చింది. * రెండు మూడు నెలల తరువాత ఇండియన్ గ్రాసరీ షాప్ లో కనబడింది నూర్ . అత్తగారు చనిపోయారని అప్పటికప్పుడు పాకిస్తాన్ వెళ్ళారుట. " రెండు మంచి విషయా లు చెప్పాలి నీకు. చివరి సమయంలో అత్తగారికి సేవ చేసుకునే అదృష్టం దొరికింది. ఆవిడ పిల్లలని చూసి ఎంతో సంతోష పడ్డారు. అల్లా దయనో, ఆవిడ దువానో కానీ, మేము వెళ్ళేటప్పటికి ట్యూషన్ టీచర్ భర్త దుబాయి నించి తిరిగి వచ్చేసాడు. అతను పెళ్లి చేసుకుని వెళ్ళాక అజా పజా లేడుట. అతను ఎక్క డున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేసి చేసి మోసం చేసాడు ఇంక రాడు అనుకుందిట. తీరా విషయం ఏంటంటే పాపం అతను ఏదో ప్రమాదంలో చిక్కుకున్నాడుట. పాస్పోర్ట్ పోలీసులు తీసుకున్నారుట, పడరాని పాట్లన్నీ పడి, మొత్తానికి బతుకు జీవుడా అని పాకిస్తాన్ కి వచ్చి పడ్డాడు. ఈ గ్యాప్ లో మన పిల్లాడు ప్రేమ దోమ అని ప్రాణాలు తీసుకోవడానికి తయారయ్యాడు" రిలీఫ్ గా చెప్తోంది. "ఓహ్.. ఇప్పుడు మహమ్మద్ ఎలా ఉన్నాడు?" "ఈ రెండు నెలలూ చాలా చాలా సతాయించాడు. వెళుతున్నప్పుడు ఇంక కెనడాకి రమ్మనద్దు అక్కడే ఉండిపోతా అంటూ వచ్చాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఆవిడ భర్త గురించి తెలిసి, నాలుగైదు సార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసాడు. చుట్టాలలో మానసిక వైద్యుడు ఉన్నాడు. అత్తగారు చనిపోయినప్పుడు వచ్చిన ఆయనని ఈ రెండు నెలలు ఇంట్లోనే ఉంచేశారు మా బావగారు. ఆయన ఏదో మాయ చేసాడు. మందులిచ్చాడు. తన వెంట తిప్పుకున్నాడు. ఇప్పుడు కొంత నయం.." అంది. " నూర్ నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రేమ కథ ఇలా ఇంత తొందరగా సుఖాంతం అవ్వడం నేను మొదటి సారి చూస్తున్నా. నిజానికి ఈ చివరి మలుపు దైవికం. ఇది నిజంగా జరిగింది అని చెప్పినా ఎవరూ నమ్మరేమో. ఇంక టెన్షన్ లేదులే. పిల్లాడిని సాకర్ లో కూడా చేర్పించు" అన్నాను. " చిన్న హెల్ప్ కావాలి, రేపటి నించి వస్తాడు. కొంచెం నీ షార్ట్కట్ చదువు చెప్పవా నీకు పుణ్యముంటుంది. పోయిన సారి పరీక్షలో పాస్ మార్కులు వచ్చాయి. అలా వస్తే చాలు, యూనివర్సిటీ లో చేరాలి కదా" అంది. "దానికేం భాగ్యం.. ఇంకో పది ఎక్కువే వస్తాయిలే ఈ సారి.. " అన్నాను నవ్వేస్తూ.. పరీక్ష ముందు రెండు రోజులు తప్ప మహమ్మద్ మళ్లీ రాలేదు. పిల్లల హై స్కూల్ అయిపోయాక, మా ఉద్యోగాలకి దగ్గరగా ఉండేలా ఇళ్ళు మారాము. కార్లు కొనుక్కున్నాక అప్పటి బస్ స్నేహాలు అక్కడితో తెగిపోయాయి. టీనేజ్ పిల్లలు చేసే చిన్న పొరపాట్ల వల్ల తలి తండ్రులు దేశాన్ని వదిలి పెట్టే అంత పెద్ద బాధలు . గుర్తొచ్చినప్పుడల్లా మహమ్మద్ బాగుండాలని కోరుకుంటుంటా..ఇప్పుడు తనెక్కడున్నాడో తెలియకపోయినా, నాకు ఖచ్చితంగా తెలుసు.. మీ ఆశీస్సు కూడా తనకి చేరుతుందని..

0 వ్యాఖ్యలు: