కాయ కష్టం

Thursday, April 20, 2023

1ఫిబ్రవరి 2023 "అరె వీళ్ళ ప్రాబ్లం ఏమిటి, కెనడాకి రాగానే నెల లోపే ఇద్దరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలొచ్చాయి. ఇంకో క్యాష్ ఉద్యోగం ఉంటే చూసి పెట్టు కష్టంగా ఉంది అంటాడేంటి" ఫోన్ వైపు చూపిస్తూ, అంటున్న మా సీతయ్య మాటలకి, మీటింగ్ లో ఉన్నా అని సైగ చేసాను. కళ్ళు కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్నా, చేతులు మీటింగ్ మినట్స్ వ్రాస్తున్నా, మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతోంది. కెనడాకి వచ్చిన వారంలోపు నాకు టిం హార్టన్స్ లో పని దొరికింది. అక్కడ పనిచేస్తూ, సాయంత్రం ఆరు నించీ తొమ్మిది వరకూ 45 రోజుల టాక్సు కోర్సు పూర్తి చేసినందువల్ల, టాక్స్ ఆఫీస్ లో టాక్స్ లు సబ్మిట్ చేసే పని దొరికింది. రెండు నెలల తరువాత, టాక్స్ సీసన్ అయిపోవడంతో ఉద్యోగం అయిపోయింది. అప్పట్లో పిట్టను కొట్ట పొయిలో పెట్ట అన్నట్టు జీతం వస్తే గానీ, పొయ్యిలో పిల్లి లేవని పరిస్థితి. సీతయ్యకి కూడా రోజు వారీగా చేసే కూలి పని లాంటి బరువులు ఎత్తే ఫ్యాక్టరీ పని ఉన్నరోజు ఉన్నట్టు లేని రోజు లేనట్టూ. ఒకోసారి రమ్మని పిలిచి, అక్కడకి వెళ్ళాక పని లేదు అని చెప్పేవారు. తను, ఆ వారం సంపాదించిన డబ్బుతో ఎవరెవరో చెప్పిన చిన్న చిన్న కోర్సులు చేస్తూ ఉండేవారు కొంచెం మంచి పని దొరుకుతుండేమోనని. టాక్స్ సీసన్ తర్వాత రెండువారాలు ఇద్దరికీ పని దొరక్క గిజగిజలాడిపోయాము. ఏ మాటకామాట పురుషుల కంటే ఆడవాళ్ళకి ఉద్యోగాలు తొందరగా వచ్చేవి. ఎందుకూ అంటే, భారత దేశంలో పెద్ద ఉద్యోగాలు చేసొచ్చిన పురుషుల మాట తీరు, బాడీ లాంగువేజ్ తొందరగా ఇక్కడివాళ్ళకి నచ్చదని చెప్పుకునేవారు. నిజమెంతో మనకి తెలియదు మరి. జాబ్ ఏజెన్సీలని ఉంటాయి వాటికి వెళ్ళమని చెప్పారెవరో. అక్కడికి వెళ్ళి బయో డేటా అనేవాళ్ళం కదా అదేదో ఇచ్చాక, తీసుకుని "నీకు సరిపడే ఉద్యోగం కనబడగానే ఫోన్ చేస్తాం" అని చెప్పారు. ఆ రోజు నించీ పొద్దున్నే ఆదరాబాదరా రాత్రికి కూడా సరిపడేలా వంటా గింటా చేసేసుకుని, బేస్మెంట్ మెట్ల మీద కూచునేదాన్ని. ఎందుకంటే, వాళ్ళు పిలిచిన వెంటనే వెళ్ళకపోతే ఇక ఎన్నడూ పిలవరు అని చెప్పుకునేవారు ఆ రోజుల్లో. ఈ లోపు ఇద్దరం పగలూ రాత్రీ కనబడిన బోలెడు ఉద్యోగాలకి అప్లై అప్ప్లై నో రెప్లై అన్నమాట. ఇలా కాదని ఒకరోజు పొద్దున్నే ఏజెన్సీకి వెళ్ళి " పిలుస్తా అన్నారు పిలవలేదు" అని కడిగేసా.. అదేలెండి.. అడిగేసా. దానికి జవాబుగా రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి, "చూడమ్మా, నువ్వు గతంలో ఉపాధ్యాయురాలివి. ఇప్పుడు నువ్వు అప్ప్లై చేసింది లెక్కలూ పద్దులూ చూసే ఉద్యోగానికి... కాబట్టి, పొంతన లేదు పొమ్మం"ది. నేను కాసేపు వాదన చేస్తుండగా ఒక మ్యానేజర్ బయటికి వచ్చి ఉడ్వార్డ్స్ గ్రైప్ వాటర్ అమ్మమ్మ లాగా "ఏమిటి సంగతి" అనడిగింది. ఈవిడ కూడా అదే ప్రకటనలో లాగా " ఈ అమ్మాయి ఏడ్చింది" అని చెప్పి ఏదో గుసగుసలాడింది. ఆవిడ కూడా "అమ్మా నువ్వు గతంలో .." అనేలోపుగా నేను అందుకుని "అదే.. గతంలో ఉపాధ్యాయురాలినే.. కానీ, ఏ సబ్జెక్టూ" అని కొట్టినట్టు అడిగా.. ఆవిడా కాగితంలో చూసి" అక్కవుంట్సూ" అంది. "అద్ది, అదే నేను చెప్తున్నది, అదే సబ్జెక్టు పదిహేనేళ్ళు కేజీ నించి పీజీ వరకూ కనిపించిన అందరికీ చెప్పుకొచ్చా. ఇప్పుడా జాబ్ కి అప్ప్లై చేస్తే మీకేమి కష్టం" అన్నాను లా పాయింట్ లాగుతూ.. ఆ మ్యానేజర్ జెరంత బుర్ర గోక్కుని, "రా.. ఇలా రా" అని ఒక పెద్ద ఆఫీస్ రూం లోకి నన్ను పట్టుకెళ్ళి సీక్రెట్ గా "నువ్వెప్పుడైనా ఆఫీస్ లలో పని చేసావా" అంది." ఆ.. చేసాను. 'అర్న్ వైల్ లర్న్' ( earn while learn) అని డిగ్రీ కాలేజీలో ఉండగా పెద్ద పెద్ద లెడ్జర్లలో కూడికలు చెయ్యడానికి కెనరా బ్యాంక్ లో రోజూ 2 గంటలు పనిచేసేదాన్ని. నెలకి 150 రూపాయల జీతం ఇచ్చేవారు" అని చెప్పా. "హమ్మయ్య అది చాలు" అని అంటూ..ఆ రెండు గంటల ఉద్యోగమే నా జీవితం మొత్తం చేసినట్టు వ్రాసి పడేసి, "ఇదన్నమాట, అకవుంటెంట్ అంటే, పుట్టినప్పటి నించీ.. అంటే అసలు అకవుంటింగ్ డిపార్ట్మెంట్ లోనే నువ్వు పుట్టినట్టుగా.. గోడ కట్టినట్టుగా మాట్లాడాలి ఇక నించీ!తెలిసిందా?" అని కన్ను చికిలించి, హిత బోధ చేసింది. బరువులు మోసేటప్పుడు దెబ్బలు తగుల్చుకోకుండా ఎలా చూసుకోవాలి, నడుము విరుచుకోకుండా 50 పౌన్డ్ల బరువు ఎలా ఎత్తాలి లాంటి అంశాలతో బొమ్మలున్న ఒక ఫైల్ ఇచ్చి, అది చదివాక దాని మీద పరీక్ష ఒకటి వ్రాయించి, కొన్ని కాగితాల మీద సంతకం పెట్టించుకుని, "ఇంటర్వ్యూకి పిలిస్తే, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా.." అంటూ అబధ్ధాలు ఎలా ఆడాలి అనే అంశం మీద ముద్దుగా సుద్దులు చెప్పి పంపింది. వామ్మో ఇంతోటి అబధ్ధాలు ఎలా చెప్పాలిరా దేవుడా దేవుడా అనుకుంటూ ఇంటికొచ్చా. ఒక రెండు రోజుల్లో పొద్దున్న ఏడింటికి ఫోనొచ్చింది. ఫలానా ప్రింటింగ్ ప్రెస్సులో అకవుంటింగ్ ఉద్యోగం 9 గంటలకల్లా ఉండాలి అక్కడ, గంటకి $7.35 జీతం అని సారాంశం. ఎప్పటిలాగే తయారుగా ఉన్నాను కాబట్టి దబా దబా బస్సెక్కేసా. పెద్దగా అబధ్ధాలు అవీ లేకుండా చిన్న ఇంటర్వ్యూ లాంటిది అయింది అనిపించి, "పని చూపిస్తా రా" అన్నారు. ఒక ఆఫీసు అవీ ఊహించుకున్న నన్ను లోపల 100 పెద్ద బ్యాంకర్ డబ్బాలు ఉన్న చోటకి తీసుకెళ్ళారు. "ఈ ఆఫీసులో ఆడిటింగ్ ఉంది ఈ వారం. వాళ్ళు 7 సంవత్సరాల క్రితం నించీ సంవత్సరానికి ఇన్నని సెలక్టు చేసి, ఫలానా నెల ఫలానా ఇన్వాయిస్ కావాలని లిస్ట్ ఇచ్చారు. ఈ వంద పెట్టెలూ నెలల వారీగా పేర్లు వ్రాసి ఉన్నాయి. నువ్వు ఒక్కొక్క పెట్టే దించి, లిస్టు ప్రకారం కావలసిన ఇన్వాయిస్ లాగి, మళ్ళీ పెట్టెలు ఒకదాని పైన ఒకటి పెట్టెయ్యడమే" అని చెప్పింది చులాగ్గా. బరువులు మొయ్యడం నాకొక లెక్కా ఏంటి? ఎన్ని వందల బిందెలతో నీళ్ళు మోసి ఉంటాను ఇంటి దగ్గర అనుకుంటూ అంతెత్తున ఉన్న ఒక్కొక్క డబ్బా దింపుతూ ఎత్తుతూ, ఒక అరగంట లంచి బ్రేకు, రెండు పావు గంటలు ఇంటర్వెల్ బ్రేకు.. వీటికి జీతం చెల్లించరు కాబట్టి, అది కలుపుకుని 9 గంటలు పనిచేసి రిక్షా తొక్కిన అబ్బాయిలా తూలుకుంటూ ఇంటికెళ్ళా. (అబ్బే అది కాదబ్బా,, అలసటకి తూలా అంతే). అలా ఒక రెండు వారాలు ఎత్తే డబ్బా దింపే డబ్బా, ఒకో డబ్బాలో ఏమీ దొరకవు..! మొత్తానికి లిస్టులో ఉన్న అన్ని కాగితాలు కట్టగట్టి ఇచ్చాక, "తరువాతేం పని" అని అదేదో కథలో పని దెయ్యం అడిగినట్టు అడిగా. మస్త్ మజా వచ్చింది.. ఒక చిన్న ఆఫీసు గది, టేబులూ, కుర్చీ, ఒక ఫోనూ, ఒక కంప్యూటరూ అచ్చంగా నాకే ఇచ్చెయ్యడం చూసి. ఈ సారి ఇంకో పెద్ద లిస్ట్ ఇచ్చి , ఒక్కో నంబరుకీ ఫోన్ చేసి ప్రింటింగ్ ధరలు చెప్పి, "మీరు ప్రింట్ చేయించుకోండి" అని అడగాలి. అలా రోజంతా ఫోన్ లు చెయ్యడమే కదా.. సరదా సరదా అనుకునేరు. వారానికి ఇంతమందిని ఒప్పించి బిజినెస్ తేవాలని టార్గెట్ ఉంటుంది. రెండు వారాలు టార్గెట్ చేరకపోతే, ఇంక ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఇంతకన్నా ఆ బండలు.. అదే డబ్బాలు ఎత్తడమే బాగుందసలు. ఫోన్ చెయ్యగానే ఒక్కక్కళ్ళు చిరాకు పడడం, ఛీదరించుకోవడం, తిట్టడం, వెటకారం, వేళాకోళం, విసుగు! ఒక్కరన్నా సరిగా ఫోన్ మాట్లాడింది లేదు. ఇలా ఫోసి హలో అనగానే " పెట్టెయ్ " అనే వాళ్ళు కొందరైతే, "నీ వాయిస్ చాలా బాగుంది.. కాసేపు మాట్లాడుతూ ఉండు" అనేవాళ్ళ దాకా..యాక్ థూ.. అనిపించినా.. మళ్లీ... కాలే కడుపుకి మండే బూడిద..కాబట్టి ఆ ఉద్యోగం అప్పటికి ఎంత అవసరమో అని తలచుకుని కళ్ళనీళ్ళు వచ్చేవి. "రేపు ఫోన్ చెయ్యి" అంటూ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయించుకునేవారు కొందరు. వాళ్ళు ప్రింట్ చేయించుకుంటారేమో అని ఆశ. పదే పదే ఫోన్ చెయ్యడం, తిట్లు తినడం. భారతదేశం లోనూ, రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవుల్లోనూ పదిహేనేళ్ళు పెద్ద పిల్లలకి పాఠాలు చెప్పినట్టు అలా హాయిగా సాగిపోవాలంటే ఎలా? మనని కెనడాకి ఎవరైనా రమ్మని పిలిచారా? మనమే కదా వచ్చాం. వచ్చినవన్నీ తీసుకోవలసిందే అని సర్ది చెప్పుకోవడం. ఇలా మావే కాక స్నేహితులవి కూడా కలిపి ఎన్నెన్ని ఉద్యోగాలో, ఎన్నెన్ని అనుభవాలో. ఎనిమిదేళ్ళ పాటు స్థిరమైన ఉద్యోగాలే దొరకలేదు రెసెషన్ వల్ల. ప్రతి మూడు నెలలకీ ఒకో కొత్త ఉద్యోగం. కానీ దాని వల్ల ఎన్ని కొత్త విషయాలు తెలిసాయనుకున్నారూ.... బోలెడన్నమాట. అలా ఆఫీస్ పని చేస్తూనే, సీతయ్య ఇందాక చెప్పిన కొత్త జంట గురించి ఆలోచిస్తున్న నేను , ఫోన్ రింగ్ అవగానే, నంబర్ చూసుకోకుండా ఫోన్ తీసాను. "హెలో, నేను ట్యూషన్ సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నాను మేడం, సైన్సూ, మ్యాథ్సూ" అని చెప్తూ ఉండగానే, "మా పిల్లలు పెద్ద అయిపోయారు, ఇప్పుడు చదువు చెప్పించుకోవాలంటే నేను ఒక్కదాన్నే, మరి ఎవరూ లేరండి ధన్యవాదాలు" అని చెప్పాను నవ్వేస్తూ. "పోనీ పిల్లలున్న ఇంకెవరికైనా చెప్తారా మా గురించి" అని అడిగారు. "తప్పకుండా" అన్నాన్నేను నంబరు నోట్ చేసుకుంటూ. "ఎందుకే అంత సోది. వద్దు అని టక్కున పెట్టెయ్యక" అంటారు మా సీతయ్య ఇలాంటి ఫోన్ లకి నేను ఆన్సర్ చేస్తున్నప్పుడు. "అది వాళ్ళ ఉద్యోగం కదా, ఇంట్లో అతని మీద ఎందరు ఆధారపడ్డారో" అంటాన్నేను గతంలోకి తొంగి చూస్తూ. "మహాతల్లీ నీకో దణ్ణం" అంటారాయన. "దీర్ఘాయుష్మాన్ భవ" అంటాను ఆ దణ్ణం అందుకుంటూ.

0 వ్యాఖ్యలు: