డేంజర్

Thursday, April 20, 2023

7 డిసంబరు, 2022 "ఒరేయ్.. శుంఠా! ఏం మాట్లాడుతున్నావసలు? నువ్వు చెప్పింది పరమ చెత్త అయిడియా. నాకసలు నచ్చలేదు. తింగరితనం ఆపి, కోతి అయిడియాలు ఇయ్యడం మాను" మూడవ మరిదిగారిని ఉద్దేశించి రెండవ తోటికోడలి ఫోన్ నించి వచ్చిన మెస్సేజ్ చూసి అదిరిపడింది సుమజ. ఈ అమ్మాయి ఇలా ఎప్పుడూ మాట్లాడదే! ఏమయింది? నిన్న ఏదో విషయంలో అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ అయిందే అనుకోండి, కానీ మరీ ఇలా చెట్టంత మరిదిని పట్టుకుని అరేయ్ ఒరేయ్ అంటుందా! బాబోయ్! అని బెంగపడి, వాళ్ళాయన దగ్గరికి పరిగెత్తింది, ఫ్యామిలీ గ్రూప్ చూసారా అంటూ. రవి కూడా తికమక పడ్డాడు, ఎటుపోతోంది వ్యవహారం అని. రవి చిన్న తమ్ముడు సూరి వెంటనే గ్రూప్ నించి ఎక్సిట్ అయ్యాడు. వెంటనే అతని భార్య సుధ కూడా. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తే ఏం గండమో అన్నట్టుంది రవి, సుమజలకి. సూరికి సుధకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. * తన వంటల చానెల్ లో రోజూ లాగే పనీర్ పకపకా అనే కొత్త వంటకం పెట్టింది శ్రీజ. పూర్తిగా వండక్కరలేకుండా వండే వంట కాబట్టి పక్కాగా పకాయించకుండా ఉండే అర్థంతో పకపకా అని పేరు పెట్టింది. వంట బాగుందో లేదో కానీ, అది అందరికీ పకపకా నవ్వు తెప్పించిందని బోలెడు కామెంట్లు విసిరారు ఫాలోవర్లు. "పనీర్ పకపకా చాలా బాగుంది మరదలా" అని వచ్చిన ఒక కామెంట్ చూసి చాలా కన్ ఫ్యూస్ అయింది శ్రీజ. ఎందుకంటే అది తనకి అన్న వరసయ్యే వారి నించి వచ్చిన కామెంటు. అప్పటి దాకా యూట్యూబ్ కామెంట్లకి పడీ పడీ పకపకా నవ్వుతున్నదల్లా ఈ కామెంట్ చూసి మనసు కొంచెం బాధపడింది. ఆ కామెంటుకి లైకు, కామెంటూ పెట్టకుండా ఉండిపోయింది. ఫోన్ చేసి అడుగుదామా అని అనుకుంది కానీ, ఎందుకో ఫోన్ కూడా చెయ్యాలనిపించక, అన్యమనస్కంగా ఉండిపోయింది ఆ రోజంతా. * హారర్ మూవీ చూసి పడుకున్న సత్యకి అర్థరాత్రి ఫోన్ వచ్చింది. తీరా చూస్తే అది యాడాది క్రితం చనిపోయిన ఇస్తర్ నంబరు. ఒక్క నిమిషం అదిరిపడింది. ఈ లోపు మెసేజ్ "హవ్ ఆర్ యూ సత్యా డియర్" అని. వామ్మో అని గుండె అదురుపాటుకి మందుగా హనుమాన్ చాలీసా చదువుతూ వణికిపోయింది. అసలు ఒక్కతీ ఉన్నప్పుడు హారర్ అనే పేరు చెప్తేనే భయం తనకి. ఏదో చానెల్ తిప్పుతూ చూస్తున్న సినిమాలో అకస్మాత్తుగా శవం లేచే సీన్ దగ్గర ఆపేసి, నిద్ర పోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటే, గుండె ఆగిపోయేలా ఈ ఫోను, మెసేజీ.. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూసింది గుండె ఆగిపోకుండా ఉగ్గబట్టుకుంటూ.. * "అదేంట్రా అన్నయ్యా సూరి, సుధ అలా గ్రూప్ నించి వెళ్ళిపోయారు? ఏం జరిగింది?" అని ఫోన్ చేసాడు రవి పెద్ద తమ్ముడు రాఘవ. " సుమతి అంత మాట అనకుండా ఉండాలిసిందిరా" అన్నాడు రవి. "సుమతి ఏమంది? నేను లేనప్పుడు గొడవ పడ్డారా? సూరి ఏమైనా చెప్పాడా" అడిగాడు రాఘవ అమాయకంగా. "మీరంటే దగ్గరలో ఉన్నారు. విడిగా ఏం జరిగిందో మాకెలా తెలుస్తుందిరా ఇంత దూరం నించి. వాడేమీ ఫోన్ చెయ్యలేదు, నేను చేసినా ఫోన్ తియ్యలేదు. నేను అంటున్నది గ్రూప్ లోనే" అన్నాడు రవి. "అదేమంది? అది అసలు ఇంట్లో లేదుగా? వాళ్ళమ్మకి ఒంట్లో బాగాలేదని చూసిరావడానికి వెళ్ళింది పొద్దున్నే" అన్నాడు. "మరి ఫోన్ లో ఆ మెస్సేజ్ ఏంటి" అన్నాడు రవి. "అయ్యో అదా! నేనెప్పుడూ వాడితో అలానే మాట్లాడతానుగా? నా ఫోన్ లో డేటా ఎక్కువ ఉందని, నా ఫోన్ దానికిచ్చి పంపాను. దాని ఫోన్ లోంచి నేను మెస్సేజ్ పెట్టాను" అన్నాడు రవి తేలిగ్గా. "ఈ విషయం ఋజువు చెయ్యడం కుదురుతుందో లేదో చూసుకో వెంటనే. ఇప్పుడు చెయ్యకపోతే బంధాలు తెగిపోతాయి, నేను పెట్టేస్తా. నువ్వు సుమతి ఫోన్ లోంచి సూరికి మెస్సేజ్ పెట్టు, సుమతితో కూడా నీ ఫోన్ తన దగ్గర ఉందని సుధకి చెప్పించు, తొందరగా చెయ్యి" అంటూ ఫోన్ పెట్టాడు రవి, కొంచెం గాభరాగా. * "ఏమిటి రోజూ ఫోన్ చేసేదానివి ఈ మధ్య ఫోన్ లేదూ" అంటూ పదే పదే ఫోన్ చేసినా తియ్యకపోవడంతో, శ్రీజ చెల్లికి చేసి, గ్రూప్ కాల్ కలపమని అడిగి, కాల్ లోకి రాగానే కంగారుగా అడిగింది రోజా శ్రీజని. కొంత ముభావంగా మాట్లాడి, "అన్నయ్య ఇలా కామెంటు పెట్టారు" అని బాధపడింది శ్రీజ. "ఓసి పిచ్చక్కా కామెంటు పెట్టినంది నేనే, కంప్యూటర్ లో మీ అన్నయ్య జీ మెయిల్ అక్కౌంట్ లాగిన్ అయి ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు" అనగానే నవ్వేసింది శ్రీజ. * "ఎట్లా ఉన్నావు బంగారూ, దుబాయి నించి నిన్న పర్మనెంటుగా వచ్చేసాను. నీ ఫ్రెండ్ ఫోన్ నంబరు మార్చలేదు, తన గుర్తుగా అదే నంబరు, అదే ఫోను వాడుతున్నా, రాత్రి ఫోన్ చేసాక గుర్తొచ్చింది, మీకు అర్థరాత్రి అని, అందుకే మెసేజ్ పెట్టి, సరేలే పొద్దున్న అయ్యాక ఫోన్ చెయ్యచ్చని ఊరుకున్నా" అంటున్న జాషువా మాటలకి "అన్నయ్యా, నేను చచ్చిపోబోయి బతికా, అంత భయపెట్టడం నీకు తగునా" అంది సత్య. "ఏమైంది బంగారూ? ఎందుకు భయపడ్డావ్" అంటున్న జాషువాతో "అర్థ రాత్రి ఇస్తర్ దగ్గరనించి ఫోన్ వస్తే గుండె ఆగిపోదా" అంది సత్య. "అంత క్లోస్ ఫ్రెండ్ వి , దోస్త్ దగ్గర నించి ఫోన్ వస్తే సంతోషపడాలి కానీ భయపడతారా ఎవరైనా" అంటున్న జాషువాకి ఏంచెప్పాలో అర్థం కాలేదు సత్యకి.

0 వ్యాఖ్యలు: