విలువ

Thursday, April 20, 2023

12 ఏప్రిల్ 2023 ఒక ప్రాజెక్టు కోసం సింగపూర్ వెళ్ళిన నిరాల్ పటేల్, భారతి ప్రేమలో పడ్డారు. తలితండ్రులని ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. అప్పటి నించి, జపాన్, థాయిలాండ్ లాంటి అనేక దేశాలు తిరిగి చివరగా అమెరికాకి వచ్చి చేరారు. భారతి మాట ఏమో కానీ, నిరాల్ కి మాత్రం గుజరాతీ భాష మీద చచ్చేంత మమకారం. ఈ వంకతో అత్తగారొచ్చ్హి, పిల్లాడికి దగ్గర అయిపోతారని భారతికి కాస్త అపనమ్మకం. పిల్లాడికి గుజరాతీ భాష నేర్పించే సవాలే లేదంది. సందులో సందు, పిల్లాడికి మాటలు రావడం కొద్దిగా లేట్ అవడంతో, అన్ని భాషలు మాట్లాడి పిల్లాడిని కన్ ఫ్యూస్ చెయ్యద్దని డాక్టర్ చెప్పడంతో ఆ సలహా ఎంత వరకూ పనికొస్తుందని ఆలోచించకుండా ఇద్దరూ ఆంగ్లానికి ఫిక్స్ అయిపోయారు. ఇప్పటి దాకా సుఖంగా సాగిన వారి జీవిత నౌకకి అమెరికా రాగానే చిన్న చిల్లు పడింది. దానికి కారణం మీరా. భారతి కొలీగ్. ప్రతి సోమవారం ఆఫీస్ కి వచ్చేటప్పటికి నిన్న ఏం చేసారు? అని మొదలు పెట్టి, పులిహోర, బొబ్బట్లు, చేపల పులుసు, రొయ్యల వేపుడు లాంటివేవో ఆ వారం చేసుకు తిన్నట్లు చెప్పి, చిన్నప్పుడు ఇంట్లో వంటావిడ చేసే వంద రకాల రుచులని గుర్తు చేస్తుంటుంది భారతికి. అవి తినేసి శని ఆది వారాల్లో మధ్యాహ్నాలు గుండమ్మ కథ, మల్లీశ్వరి లాంటి సినిమాలు చూస్తామని, తన భర్త రవికి పాత తెలుగు సినేమాలు ఇష్టమని చెప్తూ ఉంటుంది. "గుజరాతీ వంటల్లో చెక్కర వేస్తారని, చప్పచప్పగా ఉంటాయని నాకు నచ్చవు, ఆంధ్రా వంటల ఘాటు తన వల్ల కానే కాదని అంటాడు నిరాల్" అంది భారతి. అలా ఇప్పటి దాకా తెలుగు/ గుజరాతీ వంటలు వదిలేసి, ఇద్దరివీ కాని సీరియల్స్, బ్రెడ్డూ, జాం, సాండ్విచ్, చికెన్ బిర్యానీ, మిక్సుడు వెజిటబుల్ రైస్ మొదలైన వాటితో సర్దుకుంటున్న భారతికి మెల్లిగా ఒక అసంతృప్తి మొదలయింది. ఇద్దరం ఒకేభాష మాట్లాడుకుంటూ, ఒకే రకం తిండి ఇష్టపడుతూ, ఒకే భాషలో సినిమాలు చూసుకుంటూ ఉంటే జీవితం స్వర్గం కదా! ఆహా ఆహా.. మీరాది ఎంత చక్కని జీవితం! అని అసురు ఉసురు అనిపిస్తోంది భారతి మనసు. ఒకోవారం గడుస్తున్నా కొద్దీ ఇదీ అని చెప్పలేని అగడ్ బగడ్ బాధ ఎక్కువవుతూ వస్తోంది. ఈ లోపు ఉగాది పండుగకి తెలుగు అసోసియేషన్ వాళ్ళ ప్రోగ్రాం కి వస్తావా అనగానే ఎగిరి గంతేసింది భారతి. చక్కటి తెలుగు భోజనం, చాలా ఏళ్ళ తర్వాత తెలుగు పాటలు, సినిమా డ్యాన్సులు.. జానపద నృత్యాలు.. ఆహా ఓహో అనుకునే లోపు ఇంత గందరగోళం, అంత గట్టి చప్పుళ్ళు అలవాటు లేను పిల్లాడు గుక్క పట్టి ఏడ్చాడు. ఒక సుదీర్ఘ నాటిక కామెడీకి అందరూ పకపకా నవ్వేస్తుంటె, భాష అర్థం కాని నిరాల్ కి విసుగ్గా ఉంది. "నేను బయట నించుంటా, నాటిక అవగానే వచ్చెయ్" అంటుంటే విని "ఏంటీ నిరాల్ కి తెలుగు రాదా?" అని ఆశ్చర్య పోయింది మీరా. "పోనీ నువ్వైనా గుజరాతీ నేర్చుకున్నావా" అని అడిగితే, లేదని, అలా వద్దు అనుకున్నామని చెప్పింది భారతి కొంచెం దిగులుగా. "అందుకేనా మీ పిల్లాడు అలా మందకొడిగా ఉన్నాడు.. ఎవరికి పుట్టిన బిడ్డవిరా అంటే ఎక్కి ఎక్కి ఏడ్చాడుట" అనేసి, గబుక్కున సారీ చెప్పేసింది మీరా. "ఫర్వాలేదులే.. అయినా వాళ్ళ భాష నాకెందుకు , తనకీ మన భాష మీద అంత ఆసక్తి లేదు" అంది కాస్త దెబ్బ తిన్నట్టు మీరాకి తెలిసేలా. కార్యక్రమం జరుగుతున్నా కొద్దీ, ఒక దానికంటే ఇంకోకటి బాగున్నట్టు ఉత్సాహంగా సాగుతోంది. ఎంత సేపటికి భారతి బయటికి రాకపోవడంతో లోపలికి వచ్చిన నిరాల్ భారతి ఉత్సాహం చూసి, తను కదలదని తెలుసుకుని, పిల్లాడిని ఊరుకోబెడుతూ బయట ఇంకో గంట సేపు తిరిగాడు. భారతికి ప్రోగ్రాం మధ్య వదిలి వెళ్ళాలని లేదు. ఇంకో గంట బయట తిరిగి, "పిల్లాడికి నిద్దరొచ్చేస్తోంది ఇంటికి వెళ్ళిపోతున్నా" అని ఫోన్ కి మెసేజ్ చేసాడు నిరాల్. "నిరాల్ వెళ్ళిపోతాడుట..వెళ్ళనీ..తనకి తెలుగు రాదు ఎలాగూ. నేను ఊబర్ తీసుకుంటాలే" అంది మీరాతో. "మరి నీకు గుజరాతీ వచ్చా? వాళ్ళ వాళ్ళు ఇంగ్లిష్ మాట్లాడగలరా? వాళ్ళతో నీ కాన్వర్సేషన్ ఎలా?" అని అడిగిన మీరాతో.. "వాళ్ళ భాష ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు, బోర్" అనేసింది సింపుల్ గా భారతి. "భారతీ, మీకు పెళ్ళయి ఐదారేళ్ళు అయి ఉంటుంది. ఇలా ఉంటే, భవిష్యత్తులో జీవితం బోర్ కొట్టదా? మాకు పెళ్ళయి 20 ఏళ్ళు అయింది. నువ్వు నమ్మవేమో కానీ మా వారు మళయాళీ.. ఎంతో ఇష్టంగా తెలుగు నేర్చుకున్నారు" అనగానే అవాక్కయింది భారతి. "మరి నువ్వు?" అంది ఆశ్చర్యంగా. "తను మన భాష నేర్చుకుంటే, నేనూ నేర్చుకోవాలిగా మరి! ఎక్కువ సమయం పట్టనేలేదు. నేర్చేసుకున్నా. కొత్తల్లో కొంత ఇబ్బంది పడ్డా కానీ, ఇప్పుడు మా అమ్మ నాన్నలు వచ్చినా, వాళ్ళ బంధువులు వచ్చినా చాలా ఈసీ అయిపోయింది. మేము మొదటినించీ ఒక నెల మొత్తం వారాంతాల్లో తెలుగు వంటలు చేసుకుని, తెలుగు సినిమాలు చూస్తాము. నాకు వచ్చినవి, తనకి నచ్చినవి చేస్తాను. ఇంకో నెల మలయాళీ వంటలు, మళయాళీ సినిమాలు.. రవి చేస్తారన్నమాట" అంది. "తను నన్ను మొత్తంగా ప్రేమించాడుట భారతీ.. భాష, పద్ధతులతో సహా.. తన నించి ఆ మంచి సుగుణం నేనూ నేర్చుకున్నా.. ఇప్పుడు పిల్లలు మూడు భాషలూ హాయిగా మాట్లాడేస్తారు" అంది మాట పొడిగిస్తూ. "అంటే మా బాబుకి ఒకే భాష నేర్పమని డాక్టర్ చెప్పారు" అని భారతి అనగానే, "అమ్మాయ్, ఒక డాక్టర్ మాటకి ఇంత విలువ ఇస్తున్న మీరు, మీ ఇద్దరిని కని పెంచిన వాళ్ళకి విలువ ఇవ్వలేకపోతున్నారు, పిల్లాడు ఏం నేర్చుకుంటాడు మీ నించి?" అనగానే ఇప్పటి వరకూ ఆవహించిన మత్తేదో ఎగిరిపోయినట్టు, పిల్లాడి భవిష్యత్తు స్పష్టంగా కనిపించడం మొదలయింది భారతికి.

0 వ్యాఖ్యలు: