రెండవ పెళ్ళి

Thursday, April 20, 2023

18 జనవరి 2023 సిటిజన్ షిప్ పరీక్ష అయ్యక ఇంటర్వ్యూ ఉంటుంది. దానికి వెళ్ళాలని సగం పూట సెలవు పెట్టి, ఆఫీసుకి వెళ్ళేటప్పటికి కొంత శ్మశాన వైరాగ్యం కనబడింది. మంత్ ఎండ్ ముందు మాకు ఇలాంటివి ఉండడం పరిపాటే. అంతకు మించి తుఫాను ముందు ప్రశాంతత లాంటి గంభీరమైనదేదో కూడా మనసుకి తెలుస్తోంది. ఎవరిని పలకరించినా పలకట్లేదు పెద్దగా. అసలైతే, ఇలా డ్రైవింగ్ పరీక్షలో , ఇంకేవైనా పరీక్షలో అని మాలో ఎవరం వెళ్ళినా, మా పెద్ద బాస్ గ్రెగ్ గారు గడపలోంచే.. "హే పాస్ అయ్యావా" అని అరిచి అడుగుతాడు. నలుగురూ నవ్విపోరూ ఫెయిల్ అని చెప్పడం ఎలాగా! ఈయనొకడు అరిచి అరిచి అడుగుతాడు అని బోలెడు సార్లు సతమతం అయ్యేవాళ్ళం కూడా. అయితే చెవిటి వాళ్ళు ఉన్నచోట పెరిగాడుట అతను అందుకే గట్టిగా మాట్లాడతాడు అలవాటుగా. నా సిటిజన్ షిప్ విషయం ఎవరూ అడగనూ లేదు, నేను చెప్పనూ లేదు. కాసేపయ్యాక మా బాస్ మీనూ నన్ను తన ఆఫీస్ రూం లోకి పిలిచి "క్లోస్ ద డోర్" అంది. అంటే, అతి ముఖ్యమైన విషయం అన్నమాట. సాధారణంగా అన్నీ ఓపెన్ డిస్కస్షనులే మా దగ్గర. 'గ్రెగ్గుకి, డేవిడ్ కి పెద్ద గొడవయ్యింది" అంది. "అవునా ఏ విషయంలో" అనడిగాను. "ట్రేడింగ్ లో ఫారిన్ ఎక్ష్చేంగ్ లెక్కల్లో ఏదో తేడా కనబడిందిట గ్రెగ్గుకి. అది అడగగానే డేవిడ్ కి ఎక్కడ లేని కోపం పొంగుకొచ్చింది. ఆల్మోస్ట్ ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకునే వరకూ వచ్చింది" అని చెప్పింది. "మరెలాగ?" అన్నాను నేను కొంత విస్తు పోతూ.. ఎందుకంటే నేను ఇద్దరితోనూ పనిచెయ్యాలి మంతెండ్ సమయంలో. "నువ్వు వచ్చాక రిపోర్టు రన్ చేసే దాకా ఆగారు. రిపోర్ట్ రన్ చేసెయ్ తొందరగా" అంది. అవి ప్రింట్ చేసి గ్రెగ్ ఆఫీస్ కి వెళ్ళాను. నా వెంటనే మా బాస్ కూడా వచ్చింది. ట్రేడింగ్ రిపోర్టుల ప్రకారం చాలా నష్టం వచ్చిందిట. హటాత్తుగా పూర్తి నష్టాలు చూపిస్తే ఎలా? యజమానుల దగ్గర అతనే జవాబుదారీ కాబట్టి టెన్షన్ పడడం సహజమే. ఒకోసారి ఇన్ని నెలలూ చూడనందుకు ఉద్యోగం పోవచ్చు కూడా. కానీ ఈ రిపోర్టులు పరిశీలించి కొంచెం చల్లబడ్డాడు. " మరి ట్రేడింగ్ రిపోర్ట్స్ అలా ఎలా రన్ అయ్యాయి? కొంచెం రికన్సైల్ చేస్తావా" అని, "సరే కానీ నువ్వు సిటిజన్ అయ్యావా? ఎలా అయింది ఇంటర్వ్యూ" అని అడిగాడు. "ఒక అబధ్ధం ఆడాల్సి వచ్చింది గ్రెగ్" అన్నాను నేను. "వ్వాట్?? నువ్వు అబధ్ధం ఆడావా?" ఎంత అపచారం అన్నట్టు గట్టిగా అరచి అడిగాడు "ఏంటది" అంటూ. "మా వారిని నన్ను విడివిడిగా అడిగిన ప్రశ్నల్లో భారత దేశంలో చిన్నప్పుడు ఎక్కడ ఉండేవారని అడిగారు. మా మావగారికి ట్రాస్ఫర్లు అయ్యే ఉద్యోగం అవడం చేత పర్మనెంటు అడ్రెస్స్ లేదు. తరువాత పర్మనెంటు అనగానే మా నాన్నగారి చిరునామా ఇస్తాము చాలా ఏళ్ళుగా. మొదట నన్ను అడిగినప్పుడు నేను నా పుట్టింటి చిరునామా చెప్పగానే, మా వారు కూడా అనుకోకుండా అదే చిరునామా చెప్పేసారు. అప్పుడిక వెనక్కి వెళ్ళి సరిచేసుకోడానికి లేదు. ఇద్దరూ ఒకే అడ్రెస్స్ చెప్పాము. 'ఇద్దరూ ఒకే ఇంట్లోనా' అనుమానంతో గట్టిగా అడిగింది ఆమె. మాకు సిటిజన్షిప్ రానట్టే అనుకున్నాము...కానీ ధైర్యం చేసి నేనే ఒక అబధ్ధం చెప్పేసా.." అన్నాను. గ్రెగ్ కి ఆత్రుతగా ఉంది..."ఏం చెప్పావు" అన్నాడు ముందుకి వంగి.. "అదే అతను మా కసిన్ అని, చిన్నప్పుడు మా ఇంట్లోనే పెరిగాడనీ" అన్నాను. "చీ కసిన్ ని పెళ్ళి చేసుకున్నట్టా..హ్హాహా..ఆమె ఏమంది మరి?" కొంచెం జుగుప్స అతని కంఠంలో 'ఓ ఐసీ.. ఇండియాలో కసిన్స్ ని పెళ్ళి చేసుకుంటారు నాకు తెలుసు' అంది" అని చెప్పా నవ్వేస్తూ.. "ఓహ్ మై గాడ్.. నువ్వు అబధ్ధం చెప్పావు.." అంటూ గట్టిగా నవ్వేసాడు గ్రెగ్. "నీ జీవితంలో ఇదే మొదటి సారా అబధ్ధం చెప్పడం" అన్నాడు కూడా. "అయ్యా నీకు ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చానో తెలియదు కానీ, మరీ అలా ఎలా అనేసుకుంటావు" అన్నాన్నేను. "యెహె.. నువ్వు అబధ్ధం ఆడవు అంతే" అన్నాడు చాలా నమ్మకంగా. అతని మూడ్ మారినందుకు మా బాస్ చాలా సంతోషపడి "నువ్వు ఈవిడని తక్కువ అంచనా వేస్తున్నావు. అసలీమె రెండు సార్లు పెళ్ళి చేసుకుంది తెలుసా" అంది సరదాగా. ఇండియన్లు అన్నేళ్ళు ఒకే స్పౌస్ తో ఎలా ఉంటారు అనడుగుతూ జోక్ చేసే గ్రెగ్ కొంచెం ఉలిక్కి పడ్డాడు. ఆ రోజు ఎందుకో అతనికి అన్నీ ఉలికిపాటుగానే ఉన్నాయి. నిజమా అన్నట్టు కళ్ళింత చేసి చూసాడు.. "అంటే.. గ్రెగ్ అదేమిటంటే, మా దేశం లో పాతికేళ్ళ క్రితం పెళ్ళి జరిగినప్పుడు పెళ్ళి సర్టిఫికేట్ లూ అవీ ఇచ్చేవారు కాదు. కెనడా వచ్చేటప్పుడు తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే ఏం చెయ్యాలో తెలియలేదు. రిజిస్టర్ ఆఫీసులో ఇస్తారని అక్కడికి వెళ్ళాము. మా ఇద్దరి పేర్లు బోర్డు మీద పెట్టి, మూడు రోజుల వరకూ ఎవరికీ అభ్యంతరం లేకపోతే పెళ్ళి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. నాలుగవ రోజు ఇద్దరం సెలవు పెట్టి, పిల్లలని తీసుకుని వెళ్ళాము. అయితే సాక్షి సంతకం చేయడానికి ఎవరినైనా తీసుకువెళ్ళాలిట. ఆ విషయం మాకు తెలియనూ తెలియదు, ఎవరూ చెప్పనూ లేదు. మా దేశం లో అంత పద్దతిగా ఎవరూ చెప్పరు. కాబట్టి 'ఎవరినైనా తీసుకుని మళ్ళీ రండి' అన్నారు. నేను లెక్చరర్ గా పనిచేస్తున్నా అప్పట్లో. 'పరీక్షల సమయం నాకు కాలేజీలో సెలవు దొరకదు, ఈ సర్టిఫికేట్ వెంటనే కావాలీ అన్నాను నేను బేలగా. రూల్స్ ఒప్పుకోవండీ అన్నారు వాళ్ళు. కాసేపు ఉంటే, వాళ్ళలొ ఎవరైనా సంతకం పెట్టేసి, కాగితం ఇచ్చేస్తారేమో అని ఆశగా చాలా సేపు ఉన్నాము అక్కడే. ఈ లోపు పిల్లలకి దాహమేస్తోందని ఎదురు షాప్ లో కూల్ డ్రింకు కొనిద్దామని వెళితే అక్కడ తగిలాడు, నేను చిన్నప్పుడు ఎత్తుకు మోసిన మేనల్లుడి వరస బుడ్డోడు. అరె నువ్వేంట్రా ఇక్కడున్నావ్ అని ఆశ్చర్యపోయి, ఇలా సాక్షి సంతకం ఒకటి పడెయ్యవా అని అడిగాము. వాడు బోలెడు సంతోషపడి, మా అత్త పెళ్ళి నేనే చేసా అని చెప్పుకు తిరిగాడు. అలా మాకు పెళ్ళి సర్టిఫికేట్ వచ్చింది పెళ్ళయ్యి 15 ఏళ్ళ తరువాత" అని చెప్పాను. "వావ్" అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి, "రెండో సారి పెళ్ళి చేసుకుంటే చేసుకున్నావ్ కానీ యూ మేడ్ ఎ మిస్టేక్" అన్నాడు గ్రెగ్. ఏమిటీ అన్నట్టు చూసాను. "డామిట్.. మళ్ళీ పాత మొగుడేనా" అన్నాడు గట్టిగా నవ్వేస్తూ.."మంచిదేలే గ్రెగ్.. ఎన్ని జన్మలైనా నాకు ఈ భర్తే కావాలి. ఎందుకంటే.. మాటిమాటికీ కొత్త భర్తలకి ట్రైనింగ్ ఇవ్వడం నా వల్ల కాదు" అన్నాను ఆ రోజు ఫోన్ మెస్సేజెస్ లో చూసిన ఒక జోక్ గుర్తుచేసుకుంటూ

0 వ్యాఖ్యలు: