ఉదయ కుంకుమ

Thursday, April 20, 2023

29 మార్చ్ 2023 నా పెళ్ళి అయిన కొత్తలో ఒక ఇంట్లో మేడ మీద అద్దెకి ఉండేవాళ్ళం. వాళ్ళు కింద ఉన్న రెండు పోర్షన్లలో ఒకటి అద్దెకిచ్చి, ఇంకో దాంట్లో వాళ్ళు ఉంటూ, కొత్తగా కట్టిన మేడ మీద పోర్షన్ మొత్తం ఇల్లు అప్పు తీరేదాకా పెద్ద కుటుంబానికి అద్దెకి ఇద్దామని ఫిక్స్ అయిపోయారుట. ఆ ఇంటి యజమానులు ఇద్దరూ ఉద్యోగస్తులే . వాళ్ళకి ముత్యాల్లాంటి ఇద్దరు బుజ్జి బుజ్జి అమ్మాయిలు. భార్యా భర్తా ఆఫీసులకి వెళ్ళాక, ఈ బుజ్జి తల్లులని చూసుకోవడానికి వారి బంధువైన ఒక పెద్దావిడని తెచ్చి పెట్టుకున్నారు. ఇంటి పనీ, వంట పనీ, పిల్లల పనీ అంతా ఆవిడదే అజమాయిషీ. వాళ్ళు ఆవిడని సొంత మనిషిలాగే చూసుకునేవారు కూడా. ఆవిడకి చిన్న తనంలోనే వివాహమై, భర్త చనిపోవడంతో ఒక పిల్లాడిని పెంచుకుని, ఆ పిల్లాడు కూడా చనిపోగా, అతని పిల్లలని చదివించే బాధ్యత నెత్తినేసుకుని, దగ్గరి చుట్టాలైన వీళ్ళ ఇంట్లో ఇలా కుదిరారన్నమాట. ఏ వరసో తెలియదు కానీ, పిల్లలు పెద్దలూ అందరూ ఆవిడని పెద్దమ్మగారు అనేవారు. మేమూ అలాగే పిలిచేవాళ్ళం. ఈ పెద్దమ్మ గారు ప్రతి రోజూ, భోజనం అయ్యాక, పిల్లలు స్కూల్ నించి వచ్చేలోపు మేడ మీదకి వచ్చి, మా అత్తగారితో కాసేపు మాట్లాడి ఆవిడకి తెలిసిన విషయాలు చెప్పి, తెలియనివి తెలుసుకుని వెళుతూ ఉండేవారు. అలా ఆవిడ చెప్పిన వాటిలో ఇంటి పెద్ద కోడలితో తప్పనిసరిగా చేయించవలసిన కొన్ని నోములు, వాటిల్లో ముఖ్యమైన ఉదయ కుంకుమ నోము. మా ఇంటా వంటా లేవని మా అత్తగారు చెప్తున్నా సరే, "అదేమంత పెద్ద విషయం జయలక్షమ్మా, కూసింత కుంకుమ తప్ప ఏమి నష్టం. పైగా పక్కింటికెళ్ళడానికి మా చిన్నప్పటిలా అర ఎకరం నడవాలా ఏంటి? నీ కోడలు రాణీ గారు అట్టా మేడ దిగి రావడమేంటి, ఇక్కడ నా కూతురు రాణీ గారు బొట్టెట్టించుకోదూ.. ఈ రెండిటికీ ఎంత అదృష్టముండాలీ. నాకుందా, నీకుందా ఆ అదృష్టం...." అన్నారు కళ్ళనీళ్ళు పెట్టుకుని, దుఃఖంతో గొంతు జీర పోతుండగా. ఆ సెంటిమెంట్ తో మా అత్తగారు నేను కాలేజ్ నించి వచ్చేసరికే, నోమి నోమన్నలో నోమన్నలాలో చందామామా చందామామా అని సంతోష పడి పోతూ, పెద్దమ్మ గారు చెప్పిన వస్తువులన్నీ తెప్పించి పెట్టారు. ఇక అక్కడి నించీ అన్నీ పెద్దమ్మ గారి అనుజ్ఞతో జరిగినవే. సాయంత్రం పండూ తాంబూలం తీసుకుని, కుంకుమ భరిణ పట్టుకుని, మా ఆడపడుచు తోడురాగా, నెమ్మదిగా మెట్లు దిగి, పెద్దమ్మ గారి కూతురుగారైన (సొంతం కాదు, తెలుసుగా) ఇంటి యజమానురాలు రాధని పిలిచి, "రేపటి నుండి నేను చేసే ఉదయ కుంకుమ నోముకి మీకు బొట్టు పెట్టే భాగ్యాన్ని కలగజేయండి" అని వారు చెప్పిన మాటలు వల్లించి, ఆవిడకి బొట్టు పెట్టి, తాంబూలం ఇచ్చి, కాళ్ళకి దణ్ణం పెట్టి వెనుతిరిగాము. ఆవిడ కూడా ఆ నోము ఫలితం పెద్దమ్మగారి నోటి నుండి విని, "అబ్బ ఎంత సంతోషంగా ఉందో, చదువుకున్న పిల్లలు కూడా ఇలాంటి నోములు నొయ్యడం, అదీ నాకు ఇలాంటి భాగ్యం కల్పించడం నా జన్మ ధన్యం" అని చాలా ఇదయింది కూడా. అగ్గడ్ బగ్గడ్ నించి ఆచారం వరకు ప్రమోషన్ వచ్చింది నాకు. ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయా..అని వేకువనే నిద్ర లేవడం అలవాటే కాబట్టి లేచేసి, ఇల్లూ వాకిలీ (మేడ మీద కాబట్టి, గడప ఎదురు గచ్చు) ఊడ్చేసి, ముగ్గేసి, బుడుంగుమని చల్ల నీళ్ళతో స్నానం చేసేసి, కుంకుమ భరిణతో మెట్లు దిగి వెళ్ళాను మొదటిరోజు. యజమానురాలు స్నానం చేసి నా కోసం ఎదురు చూస్తూ కనిపించింది. వహ్వా.. అని మురిసిపోయా నేను. ఎందుకంటే,.. తలుపు కొట్టి పిలవాలేమో అని మొహమాటం అనిపిస్తుంది కదా మరి. అలా మొదటిరోజు విజయవంతంగా బొట్టు పెట్టి, ఇంటికొచ్చి అత్తగారితో ఆవిడ నా కోసం ఎదురు చూస్తున్న సంగతి చెప్పి, ఖుషీ చేసా. మర్నాడు, రాధ తలుపు తీస్తూ, "ఒక నిమిషం ఆగవా స్నానం చేసి వస్తా" అని వెళ్ళింది. నేను మళ్ళీ వస్తా అనగానే, వద్దు వద్దు పదే పది నిమిషాలు అంటూ పరిగెత్తింది. నేను "అత్తయ్య వంట మొదలెట్టారు, అత్తయ్యకి సహాయం చెయ్యాలి" అంటూ మొహమాట పడ్డా కూడా తప్పలేదు. బయటకి వచ్చి చూస్తే, చెట్లు బాగా నీరసించి, అలో లక్ష్మణా అని ఏడుస్తున్నట్టు ఉంటే, కాసిని నీళ్ళు పోసి, నాలుగు పూలు కోసుకున్నా ఆవిడ వచ్చేవరకు. అలా నా ఉదయకుంకుమ నోము ఆ చెట్లకి వరమై, కళకళలాడేసరికి, ధరణీ మాత సంతసించింది. అలా మూడో రోజు మూడు సార్లు కిందకీ మీదికీ తిరగడం, నాలుగో రోజు నాలుగో సారి నేను వెళ్ళేటప్పటికి ఆవిడ ఆఫీసుకి వెళ్ళిపోవడం, ఐదోరోజు బొట్టు పెట్టించుకోకూడదు ఐదు రోజులు రావద్దు అని చెప్పడం ఇత్యాదులతో పది రోజులు గడిచి పోయాయి. పదకొండవ రోజు మళ్ళీ పొద్దున్న వెళ్ళగానే.. ఆవిడ అబ్బా అంటూ కళ్ళు నులుముకుంటూ వచ్చి "పెట్టెయ్, బొట్టు పెట్టెయ్" అంది. నేను కొంచెం అయోమయంగా చూస్తుండగా పెద్దమ్మ గారొచ్చి, "అదేమిటి తల్లీ, అలా ఉదయ కుంకుమ నోము స్నానం చెయ్యకుండా పెట్టించుకోవచ్చా? తప్పు కదూ, బంగారు తల్లివి కదూ..వెళ్ళి స్నానం చేసి రా పో" అంటూ బుజ్జగించారు. మళ్ళీ నేను చెట్లకి నీళ్ళు, పూలు తెంపుకోవడం వగైరా.. మరునాటి నించి నాకు పొద్దున్నే కిందకి దిగడం తెగ మొహమాటం వేసేది. అసలు తలుపు కొట్టి ఆవిడని పిలవడం అన్న ఊహకి రాత్రిళ్ళు నిద్ర పట్టడం కూడా మానేసింది. అలా అని అత్తగారితో "ఇలా పొద్దున్నే వెళ్ళినప్పుడు ఆవిడ విసుగ్గా చూస్తోంది" అని ఎలా చెప్పడం? పైగా పెద్దమ్మగారు వ్రతం చెడకూడదని ఖచ్చితంగా చెప్పారాయె! ఇలా ఇంకెన్ని రోజులు? ఈ వ్రతం చూస్తే, ఒకటీ రెండు కాదు తండ్రోయ్.. అక్షరాలా 365 రోజులు. బెంగ వచ్చేసింది నాకు. నా గర్భంలో బిడ్డ పెరుగుతున్నా కొద్దీ, నాకు మార్నింగ్ సిక్నెస్సో, బొట్టు పెట్టడానికి అయిష్టతో తెలియక వాంతులు అయ్యేవి. "దేనికదే! బొట్టు పెట్టడం మాత్రం మానేదేలేద"ని పెద్దమ్మ గారు, "నెమ్మదిగా వెళ్ళి పెట్టేసి రా అమ్మలూ" అని అత్తగారు, "ఛీ! ఎందుకు ఒప్పుకున్నానా" అని యజమానురాలు.. "వామ్మో వామ్మో, ఇదేమి నోము రా దేవుడా! మా అమ్మ ఎందుకిలా నన్ను మేడ మీదికి పది సార్లు ఎక్కించి దించుతుంది పొద్దున్నే" అని కడుపులో బిడ్డ, "ద్యావుడా" అనుకుంటూ నేను :( ఐదో నెల రాగానే అమ్మగారింట్లో నిద్ర చెయ్యడానికెళ్ళినప్పుడు, ఉదయకుంకుమ నోము విని మా ఇంటి పక్కన పూజారి గారి భార్య "వామ్మో! అసలే అర్భిణి, అందునా గర్భిణి, మా వంశం లో ఇంతమంది చెయ్యగా చూసా కానీ ఇలా ఎవ్వరూ చెయ్యలేదు తల్లీ" అంటూ నన్ను చూసి జాలి పడింది కూడా. * మర్నాడు నేను ఆటో దిగి గేట్ లోపలికి రావడం చూసిన రాధ భయంగా, విసుగ్గా, చిరాగ్గా నా వైపు చూడడం నా దృష్టిని దాటిపోలేదు. పిచ్చి తల్లీ, రేపు ఉదయాన్ని తలచుకుని నీకంటే ఎక్కువగా నాకూ అదే ఫీలింగ్ అని అనుకుని, నిట్టూరుస్తూ పైకి వెళ్ళాను. మర్నాడు వెళ్ళేసరికి, నిద్ర మంచం మీంచి వచ్చి, "బొట్టు పెట్టెయ్ తొందరగా, మళ్ళీ పొయ్యి నిద్రపోతా" అంది రాధ. నేను గబ గబా బొట్టు పెడుతూ, పెద్దమ్మ గారు లేరా అని చూసాను. ఆవిడ లేదు అంది రాధ కొంచెం నవ్వీ నవ్వనట్టుగా. హమ్మయ్య అనుకుని పైకి వెళ్ళాను కానీ, ఈ విషయాలేమీ డిస్కషన్ పెట్టలేదు. ఆ వారం రోజులూ రాధ పెద్దగా రియాక్షన్ లేకుండా తలుపు కొట్టగానే, నిద్ర లేచి రావడం, బొట్టు పెట్టించుకోవడం హమ్మయ్య అనేట్టు ఉంది. వారంలో పెద్దమ్మ సెలవు చీటీ చెల్లిపోయి తిరిగొచ్చేసింది. పొద్దున్నే బిక్కు బిక్కుమంటూ కిందికి వెళ్ళాను. రాధ రోజూ లాగానే, నిద్ర లేచి బొట్టు పెట్టించుకుంది. "అయ్యొ అయ్యొ, పాచి మొహంతో బొట్టు పెట్టించుకుంటున్నావు. రేపు ఆ పిల్లకి ఏదైనా అయితే, ఎవరిది బాధ్యత?" అనే డైలాగ్తో నాకు ఎన్నడూ లేనంత భయం పెట్టేసారు పెద్దమ్మ గారు. వ్రతం చెడకూడదని పెద్దమ్మ మా అత్తగారికి చెప్పినందువల్ల వెళ్ళకుండా ఉండలేకనూ, అలా ఆవిడ బొట్టు పెట్టించుకోవడం వల్ల బిడ్డకి ఏమైనా అవుతుందేమో అని భయం వల్లనూ, నిద్ర లేపుతున్నాను పాపం తగులుతుందని గిల్ట్ వల్లనూ, పెద్దమ్మ చేత ఆమెని తిట్టిస్తానేమో అని బెంగ వల్లనూ, ప్రతి రోజూ తెల్లారుతుంటే నాకు దిగులు... అసలు నిజంగా దిగులు..!! వేసవి సెలవులు అవడంతో రాధ పిల్లలని ఊరికి తీసుకెళ్ళడానికి వాళ్ళ అమ్మ వచ్చారు. ఇప్పుడు బొట్టు పెట్టించుకోవడానికి ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు. ఎవరో ఒకరు పెట్టించుకుంటారని కొంచెం రిలీఫ్. ఆవిడ, పెద్దమ్మ కాఫీ తాగుతుండగా నేను వెళ్ళడం తలుపు కొట్టడం, రాధ వచ్చి వాళ్ళ ముందు బొట్టు పెట్టించుకోవడం చూసిన పెద్దమ్మ ఏదో అనబోతూ ఆగిపోయింది. రాధ వెళ్ళి నిద్ర పోయింది. " అమ్మాయీ వెళ్ళిపోకు, మా ఊరి నించి నీ కోసం జీళ్ళు, బందరు లడ్డు తెచ్చాను, ఆగు ఇస్తాను, పాకెట్టు విప్పాలి ఐదు నిమిషాలు" అంటూ ఆవిడ వంటింట్లోకి వెళ్ళారు. "ఈ లోపు నేను ఇక్కడ పూలు కోసుకుంటానండీ అత్తగారి పూజకి" అంటూ చెట్లకి కాసిని నీళ్ళు పోసి, ముందు వైపు గన్నేరు కోసి, పక్క సందులో ఉన్న మందారాలు కోస్తున్నా. వాళ్ళ వంటింటి కిటికీ లోంచి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. " క్రమశిక్షణ నేర్పించమన్నాను కాదూ అక్కయ్యా.. ఈ ఉదయ కుంకుమ నోముతోనైనా కాస్త పొద్దున్నే లేచి స్నానం సంధ్య చేస్తుందని కదూ నీకు ఈ ఏర్పాటు పురమాయించిందీ... అదలా పాచి నోటితో బొట్టెట్టించుకుంటుంటే చూస్తూ ఊర్కున్నావేం.. నీ అండ చూసుకుని ఉన్న బధ్ధకం మరీ పెరిగిపోయింది. పాపం నువ్వు మాత్రం ఎంతని చేస్తావు అక్కయ్యా" అంటోందావిడ. "ఏం చేస్తామమ్మా, నేను ఖచ్చితంగా స్నానం చెయ్యాలని పై ఆవిడకి, కింద మన పిల్లకీ కూడా చెప్పి పెట్టా, అదిగో మీ ఆడపడుచు ఫోన్ చేసింది మొన్న. ఆవిడ వత్తాసు దీనికి. అత్తగారయ్యుండి ఆవిడ తల్లి అయినట్టు, నువ్వు అత్తవి అయినట్టు ఉంటుంది నాకు. 'ఉదయ కుంకుమ నోముకి స్నానం చెయ్యడమేమిటి, బొట్టు పెట్టే ఆ పిల్లా చెయ్యక్కరలేదు, నువ్వూ చెయ్యక్కరలేదు.. అలా లేచి రావడం బొట్టు పెట్టి వెళ్ళడం అంతే' అని నేను అక్కడ ఉండగానే ఫోన్ చేసింది. ఈవిడ నన్ను చురచురా చూసింది. అప్పటి నించీ ఆ కడుపుతో ఉన్న పిల్లని అవస్థ పెడుతున్నానే అని ఒకటే మనాదిగా ఉందమ్మాయ్. పోనీ ఇప్పుడు వెళ్ళి స్నానం చెయ్యక్కరలేదు, ఫర్వాలేదని వాళ్ళ అత్తగారికి చెప్దామన్నా, నా పెద్దరికం మంటగలసి పోదూ. అసలే దిక్కూ దివాణం లేని దాన్ని" మళ్ళీ ఆవిడ కన్నీళ్ళు, గద్గద స్వరం. హమ్మ! హమ్మా! ఆ పిల్లకి డిసిప్లిన్ నేర్పమని తల్లి చెప్పడం, ఈ పెద్దమ్మ మాస్టర్ ప్లాన్ వేసి, మా అత్తగారికి చెప్పడం, హమ్మో హమ్మో! అనుకుంటూ మండే గుండెల్ తో ఉన్న నేను కూల్ గా ఉండడానికి ప్రయత్నిస్తూ మామూలుగా "పూలు తెంపుకున్నాను అండి, నేను వెళుతున్నాను" అని చెప్పడం ఆవిడ జీళ్ళు, లడ్డూలూ నా చేతిలో పెట్టి, "పొద్దున్నే స్నానం చేసిన వారికి దేవుడు ఆయురారోగ్యాలని, బంగారం లాంటి పిల్లలని ఇస్తాడు తల్లీ, నా కూతురికి ఎలాగూ నేర్పలేకపొయ్యాను. నువ్వు మాత్రం మానకు" అని చెప్పారు కూతురి గదిలో వినపడేలా. చేతిలో లడ్డుల వైపు చూస్తూ, రోజూ పొద్దున్నే స్నానం చేస్తున్నా కదా..బుడ్డోడు లడ్డులాగా మెరిసిపోతూ ఉంటాడేమో అనుకుంటూ మెట్లెక్కా

0 వ్యాఖ్యలు: