రోల్ మాడల్

Thursday, April 20, 2023

4 జనవరి 2023 "నువ్వు మాల్ కి వెళుతున్నావా? నాకోసం కార్ లో పెట్టుకునే ఫోన్ హోల్డర్ కొని తెస్తావా" అని అడగ్గానే " అమ్మా ఆర్ యూ ఆల్ రైట్" అనడిగింది పిల్లది. "అలాగే, అన్నలకి ఫోన్ చేసి, ఒకరిని ఇయర్ ఫోన్స్, ఇంకొకరిని నా ఫోన్ కి ఇంకో చార్జర్ తెమ్మని చెప్పవా ప్లీస్" అని అన్నాను. పిల్లది అవాక్కయ్యి, ఒక నిమిషం నా మొహం లోకి చూస్తూ ఉండిపోయింది. "అంటే,... నేను రియలైజ్ అవలేదు కానీ.. అవి మూడూ ఉంటే, డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా ఉపయోగం అనిపించింది" అన్నాను. * "మా అత్తగారి కమ్మలు, గాజులు, పలకసరులు పెద్దామె తీసుకుంది అక్కా, నేను వెళ్ళలేదు కదా! నాకొక చిన్న లాకెట్ మాత్రం పంపించారు, మిగతావి ఆడపడుచులు పంచుకున్నట్టున్నారు" అంది మేరి. "ఓహ్ పోనీలే మేరీ, అక్కడున్నవాళ్ళకి కష్టం కానీ, నువ్వు చిటికెలో కొనగలవు కదా? లాకెట్ ఆవిడ గుర్తుగా దాచుకో" అన్నాను. " అంటే నిజానికి అవన్నీ మా ఆయన కొనిచ్చినవే అక్కా, తర్వాత ఆవిడ నాకు ఇచ్చేస్తుందని నమ్మకంతో చాలానే కొన్నాము. ఆవిడ చిన్నవి ఎప్పుడూ అడగలేదు, పెద్ద బాండ్ వేసేది ప్రతిసారీ" అంది దుఖంగా. ఆమెని ఏమని ఓదార్చాలో నాకైతే తెలియలేదు. జోసెఫ్ కి వాళ్ళమ్మగారి మరణం పట్ల సంతాపం తెలియజేసి వచ్చేసాను. * డ్రైవ్ చేస్తున్నంత సేపూ ఏవో ఆలోచనలు. మాల్దీవుల్లో పని చేస్తున్నప్పుడు ఎక్కువగా మలయాళీ కొలీగ్స్ ఉండేవారు. వారి నించి నాకు ఎక్కువ ఇలాంటి సమస్యలే వినవచ్చేవి. కొడుకు, కోడలు విదేశాల్లో ఉండి సంపాదించి పంపితే, మావగారు ఇంటి దగ్గర విల్లా కట్టించడం, "పిల్లలని మేము చూసుకుంటాములే, మీరు అక్కడే ఉండండి ఫర్వాలేదు" అని చెప్పడం లాంటివే కాకుండా తలితండ్రులు అవి కొనియ్యి ఇవి కొనియ్యి అని సతాయించడం లాంటివి వినపడేవి ఎక్కువగా. మిమ్మల్ని పెంచి పెద్ద చేసాం కాబట్టి, ఇది మా హక్కు అని వాళ్ళ అభిప్రాయం. వాళ్ల హక్కు అనుకున్నాక వారు వాటిని ఎవరికైనా పంచవచ్చు కదా మరి. వీళ్ళ సమస్య ఒకటైతే, నాకు ఇంకొక రకం సమస్య. చిన్న బహుమతి ఇచ్చినా పామునో, కొండచిలువనో చూసినట్టు భయపడేవారు మా నాన్న. అక్కడితో వదిలెయ్యకుండా, ఇవన్నీ అనవసరమైనవి అనీ, పెద్దయ్యాక జీవించడం కోసం తగిన ఏర్పాట్లు అందరూ చేసుకోవాలని, ఒక ఇల్లు సంపాదించి పెట్టుకుంటే తిన్నా తినకున్నా మన ఇంట్లో మనం పడి ఉండవచ్చుననీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆయన కోసం ఒక వస్తువు కొనడం కంటే, సన్యాసుల్లో కలిసిపోవడం మంచిదని మా అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు విరమించుకున్నా, నేను నాన్న కోసమని విదేశాల్లో ఏదో ఒకటి కొని తేవడం, దాన్ని ఇంకెవరికో ఇచ్చెయ్యడం బోలెడు సార్లు జరిగింది. మా అమ్మ చనిపోయేనాటికి బహుమతులు ఇచ్చే వయసూ, అవకాశమూ నాకెప్పుడూ రాలేదు. సంపాదించడం మొదలెట్టినప్పటి నించీ ఒక అసంతృప్తి వెంటాడుతూ ఉండేది. మేరీ మాటలు గుర్తొచ్చాయి. "తల్లులు చిన్న చిన్న బహుమతులు అడగచ్చు కానీ ఇలా లక్షలు విలువ చేసేవి అడగడం, మిగతా పిల్లలకి పంచి పెట్టడం భావ్యమా" అని. నిజమే కదా? అలా అడగకూడదు కానీ మా నాన్న లాగా అసలు ఏమిస్తానన్నా వద్దనడం కూడా సరి కాదు కదా? అలాంటి తలితండ్రులతో చిన్న సరదాలైనా తీరవు అనుకుంటుండగానే నా మొహం మీద నవ్వు విరిసింది. మా అత్తగారు గుర్తొచ్చారు. ఆవిడంతట ఆవిడ ఏమీ అడగరు కానీ, చిన్న టేప్ రికార్డరో, ఎలక్త్రానిక్ వస్తువో, గడియారమో కొన్నామంటే అమితమైన సంతోషం వ్యక్తం చేస్తారు. సర్ప్రైజ్ లు చాలా ఇష్టం ఆవిడకి. చిన్నది పెద్దది అనేమీ లేదు, చిన్న పిప్పరమెంటు ప్యాకెట్ కొని ఆవిడ పర్స్ లో పెట్టినా, ఐస్క్రీం తెచ్చినా కూడా పండగే. ఆ సంతోషం ఎక్కువ కాలం లేదు లెండి. దానా దీనా.... ఏదైనా కావాలని అడిగి కొనిపించుకునే అమ్మా నాన్నలు/అత్తమామలు ఉంటే బాగుండుననే నా కోరిక తీరనేలేదు. అమ్మాలేదు నాన్నా లేరు అత్తా లేదు మామా లేరు ఏక్ నిరంజన్.. అని పాడుకుంటూ విచారంగా గులుగుతోంది మనసు. అలా గతం గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తుంటే చిన్నగా షాక్ కొట్టినట్టయింది. సరదాగానైనా ఏమీ తీసుకోరని మా నాన్నని ఎన్ని సార్లు తిట్టుకుంటానో కానీ , నాకు తెలియకుండానే , నాకు కూడా అదే అలవాటు వచ్చేసిందని నేను గమనించలేదు. అసలే విందు..అందులోన మందు అన్నట్టు, గతంలో కొలీగ్స్ ప్రస్తావించిన విషయాలలో ఎక్కువగా ఇవే వినడం వల్లనేమో, పిల్లలతో సహా ఎవరైనా బహుమతి ఇస్తారంటే గుండెలో దగడు, బుగులు వచ్చేవి. అమ్మ దినాలు, నాన్న దినాలు లాంటి వాటికి పిల్లలు కానుకలు తెస్తే కసిరి కొట్టేదాన్ని, అవి మన ఇంటా వంటా లేవని. అలాగే పెళ్ళి దినాల వంటి వాటికి ఒకరికొకరు బహుమతులు కొనడం , సర్ప్రైస్ లు చేసెయ్యడం మాకు అలవాటు లేదు కాబట్టి నేను అప్పటివరకూ సేఫ్ అనుకునేదాన్ని. మరి నాన్నని అనుకుంటున్నా కానీ నేనేం చేస్తున్నాను? పిల్లలకి ఉద్యోగాలొచ్చాక నా కోసం ఏదో ఒకటి కొంటాననడం, నేను వద్దు పొమ్మనడం ఒకటైతే, మా సీతయ్యకి ఎవ్వరు ఏమిచ్చినా నచ్చదు. అందుచేత పిల్లలు తెచ్చిన వస్తువులని నచ్చచెప్పి రిటర్న్ చెయ్యడమో, ఎవరికైనా ఇచ్చెయ్యడమో మామూలయిపోయింది. దీన్ని ఇప్పటివరకూ సీరియస్ గా తీసుకోనేలేదు నేను. ఇది కరెక్టేనా? వాళ్ళూ నాలాగే బాధ పడరా భవిష్యత్తులో, చిన్న సరదా సంబరం కూడా లేకపోయాయని. అదీ కాక ఇప్పటికి "ఏది కొన్నా మా అమ్మ కోప్పడుతుంది, మా నాన్నకి నచ్చదు" అనుకుంటూ , బహుమతులు కొనే అలవాటు ఎప్పటికీ మానుకుంటేనో! మాకు అలవాటు లేదంటూ రానున్న కాలాల్లో భార్యా పిల్లలకీ కూడా కొనడం మానేస్తేనో.. హమ్మో..హమ్మో... అని ఆలోచిస్తూ వచ్చిన జ్ఞానోదయం వల్ల తీసుకున్న నిర్ణయానికి ఫలితమన్నమాట పైన పెట్టిన కోరికల చిట్టా. * మర్నాడు నా పుట్టినరోజు బహుమతిగా పిల్లలు తీసుకొచ్చిన చిన్న బహుమతులు నిజంగా చాలా పనికొస్తున్నాయి. వాళ్ళు కొనిచ్చిన వస్తువు వాడుతున్నాను అని చెప్పిన ప్రతిసారీ, తెగ సంబర పడుతున్నారు కూడా. "అలా అని మీరు కొనెయ్యకండి నాకు కావలసినవి అడుగుతా" అని చెప్తూ, యాడాదికొకటి రెండు మార్లు చిన్న చిన్న వస్తువులు కొనిపించుకుంటున్నా. ఒకోసారి మనకి ఆత్మ విమర్శ కావాలి కదూ. కానీ ఏదో ఒక సందర్భం వస్తే తప్ప, కళ్లు తెరుచుకోవు. మేరీ అత్తగారిలా అతివృష్టి కాకుండానూ, మా నాన్నలా మరీ అనావృష్టి కాకుండాను మా అత్తగారిని రోల్ మాడల్ గా తీసుకున్న మూలంగా మా ఇంట సంబరాల రాంబాబుల సృష్టి జరిగిందన్నమాట. తేడా ఏంటంటే, ఆవిడ అడిగేవారు కాదు. నేను పాతిక డాలర్లు మించని వస్తువులు అవసరాన్ని బట్టి అడుగుతున్నా. శుభం పలకరా మల్లన్నా అంటే.. ఐరేని కుండ పర్రెబాసింది అనకుండా, మీకూ ఈ అవుడియా నచ్చితే ఫాలో అయిపోండి..ఈ సలహాకి పేటెంట్ రైట్ లేదు..ఉచితమే!

0 వ్యాఖ్యలు: