నబ్రూయాత్ సత్యమప్రియం

Thursday, April 20, 2023

21 Dec 2022 అక్కా ఇక్కడ మా ఆడపడుచుతో వేగలేకపోతున్నానే, నాకంటే ఆరేళ్ళు పెద్దది కదా.. అది చిన్న పిల్ల అంటూ చిన్న పిల్లలా చూడమంటారు.. ఆవిడ చేసే చిన్న పిల్ల పనులు చూస్తే నాకు చిర్రెత్తుతుంది. దాంతో ప్రతి రోజూ గొడవలే" చెప్పింది సత్య లత తో. " అయ్యో తల్లీ! మనింట్లో నువ్వు ఆఖరిదానివని మేమందరం నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాం. నువ్వు నీకంటే పెద్దదాన్ని చంటిపిల్లలా గారం చెయ్యమంటే ఎలా చేస్తావ్, సరేలే ఆ పిల్ల పెళ్ళి అయ్యేదాకానే కదా.. కొంచెం ఓర్చుకో తల్లీ, నేనూ సంబంధాలు చూస్తాలే, వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి చెయ్యమన్నారు, మంచి పిల్ల అని చెప్పి తెలిసిన వాళ్ళందరికీ సంబంధాలు చూడమని చెపుతాలే" అంది లత. కాసేపు ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుని ఫోన్ పెట్టేసాక కాస్త మనశ్శాంతి కలిగింది సత్యకి. ఈ మాట చెప్పినప్పుడు "నీకంటే ఇంతమంది అక్కచెల్లెళ్ళు ఉన్నారు సత్యా, నేను ఒంటికాయ సొంటికొమ్ముని, నాకు ఏదైనా మనసులో బాధ కలిగితే మెరమెచ్చు మాటలు తప్ప మనసులో మాట పంచుకోడానికి ఎవరూ లేరు, స్నేహితులు ఉన్నారు కానీ, కొన్ని మాటలు పైకి చెపితే, భవిష్యత్తులో ఎప్పుడైనా జడ్జ్ చేస్తారని ఒక భయం ఉంటుంది" అంది సత్య పెద్ద తోటికోడలు శార్వాణి. "అక్కా, నీకు కసిన్స్ లేరా" అనడిగింది సత్య. "ఒకే ఒక్క కసిన్ ఉంది సత్యా. చాలా క్లోస్ గా ఉండేది. కొంత ఆధ్యాత్మికత వైపు మళ్ళింది. ఈ మధ్య ఎవరి గురించి ఏం చెప్పినా, పోనీలేవే ఏవైనా మంచి మాటలు మాట్లాడుకుందాం అంటోంది. అన్నీ మంచి మాటలే ఎలా వస్తాయి? నేను బాగున్నా, నువ్వు బాగున్నావా, ఫలానా వాళ్ళు ఎంత మంచి వాళ్ళో, ఎంత మంచి ఫుడ్డు తిన్నామో, ఎంత మంచి నగ చేయించుకున్నానో అని ఎన్నిసార్లు మాట్లాడుకుంటాము? అమ్మ లేదు, వదిన తో చెప్తే, నా పుట్టింటిని, మన ఇంటిని పోల్చి మాట్లాడుతుంది. మా కసిన్ కి చెప్పేదాన్ని ఇంతకు ముందు, ఇప్పుడు తనకి కూడా ఫోన్ చెయ్యడం మానేసా అందుకే" అని శార్వాణి చెప్పగానే, ఆలోచించడం మొదలెట్టింది సత్య. అలా అందరితోనూ, అందరి గురించీ, అన్నీ మంచి మాటలే చెప్పడం ఎవరికైనా సాధ్యమా అని. అత్తగారు రావడంతో మాటలు ఆపి, ఎవరి పనులలో వాళ్ళు పడ్డారు. * " సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం" అని టీవీలో వినిపిస్తున్న ప్రవచనం వింటూ బట్టలు మడత పెడుతోంది సత్య. సత్యం మాట్లాడడం, ప్రియమైన మాటలు మాట్లాడడం వరకు ఫర్వాలేదు మంచిదే, కానీ శార్వాణి లాంటి వాళ్ళు, ఎవరికీ ఏమీ చెప్పకుండా అన్నీ మనసులో దాచుకుంటే మానసిక సమస్యలు రావా? పాత కాలంలో పేరంటాలకి వెళ్ళినప్పుడో, నీళ్ళు తెచ్చుకోవడానికి బావి/చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడో, తమకి ఇంట్లో ఉన్న సమస్యని చర్చించుకుంటే, పరిష్కారం ఉన్నా లేకపోయినా మది లోని సొద పొదలో విడిచిపెట్టినట్టు ఇంకొకరు పంచుకున్నారనే తృప్తి ఉండేది అని చెప్పేది అమ్మ. ఆ అవకాశం ఇప్పుడు పోయింది కదా మరి నభూయాత్ సత్యమప్రియం అనే మాట ఈ కాలానికి చెల్లుతుందా అంటే, ఖచ్చితంగా చెల్లదు అనిపించింది. ఎప్పుడూ చెడు మాట్లాడాలని కాదు కానీ, మనసులో ఉన్న వ్యధ ఎవరితోనూ పంచుకోకుంటే ఎలా? అలా అని మన దేశం లో మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళడమూ కష్టమే కదా అనుకుంటూ, వంట ఇంట్లో ఉన్న శార్వాణి దగ్గరికి వెళ్ళి " అక్కా నీకున్న బాధల్లో సగం నాకు ఎలాగూ తెలుసు ఇద్దరి మెట్టిల్లూ ఒకటే కాబట్టి. నీ పుట్టింటి సమస్యలు నాకు చెప్పినా , నాకు వాళ్ళతో కనెక్షన్ లేదు కనుక నీకు ఎటువంటి సమస్యా రాదు. నన్ను తోబుట్టువు అనుకో అక్కా. నీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పు, నేను నా తల్లి మీద మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఆ విషయాలేవీ నా పెదవి దాటవు. ఇంకో విషయం.. నువ్వంటే నాకు చాలా ఇష్టం, మా పెద్దక్క ఎంతో నువ్వూ అంతే, నిన్ను జడ్జ్ చేసే ప్రసక్తే లేదు. ఇంకెప్పుడూ నీకు ఎవరూ లేరు అనుకోవద్దు. నాకు ఐదుగురు కాదు ఆరుగురు అక్కలు" అంటున్న సత్య మాటలు విని, మరిదికి పెళ్ళి కుదరగానే, ఉన్న కష్టాలతో పాటు వచ్చే కొత్త అమ్మాయితో ఇంకేమి భరించాలో అనుకున్న శార్వాణి సంతోషంతో కళ్ళు తుడుచుకుంది.

0 వ్యాఖ్యలు: