చీకటింట్లో చిక్కు తీసా

Tuesday, November 15, 2022



చిత్రం: తూలిక, కెనడా 

'సరిగ్గా కూర్చోవే ఈ జడ వేయలేక చస్తున్నా' అంది పెద్దక్క. 'అబ్బా నెమ్మదిగా దువ్వు అన్నా నేను' వెనక్కి తిరిగి అక్కని చూస్తూ. 'ఏంటి నెమ్మదిగా దువ్వేది? జుట్టు చూడు ఎలా చిక్కులు చేసుకున్నావో' గట్టిగా దువ్వింది అక్క. 'నేనేం చేశాను' అన్నా నేను ఉక్రోషంగా. 'రిబ్బన్లు తీసేస్తావుగా' నెత్తి మీద మొట్టికాయ వేసింది. 'నేను జడ వేసుకోను పో'  అన్నా నేను విసురుగా .

'బూచిలా ఎలా ఉన్నావో చూడు! అక్క చెప్పినట్టు జడ వేసుకో' అంది అమ్మ మురిపెంగా చూస్తూ. 'నువ్వు వెయ్యీ అంటూ అమ్మ దగ్గరికి పరిగెత్తాను. అమ్మ అయితే నెప్పెట్టకుండా నిదానంగా జాగ్రత్తగా చిక్కులు తీసి జడ వేస్తుంది. కానీ అమ్మకి తీరిక ఉండదు. ఎప్పుడు చూసినా వంట చేస్తూనో, బియ్యం విసురుతూనో, వడ్లు చెరుగుతూనో, పప్పు రుబ్బుతూనో ఉంటుంది. మాకు సింగారాలు చేసేది మా పెద్దక్క బాధ్యత. 'అన్నయ్య వాళ్ళు వచ్చేస్తారు , వంట చేస్తున్నా కదా బంగారూ, అక్కతో వేయించుకో పో' అంది అమ్మ. 


ఉన్నవి రెండు గదులు. ఇంటి బయట ఒక అరుగు. అది పుష్పక విమానం లా ఎంత మంచి కూచున్నా సరిపోతుంది. ఇంటికి ఎవరైనా వస్తే, కుర్చీలు, బెంచీలు వెతుక్కునే అవసరం రాదసలు.  ఇటూ అటూ వస్తూ పోతూ అందరూ మా అరుగు మీద కాసేపు కబుర్లు చెప్పుకుని వెళ్ళేవారు. ఆ అరుగు అలా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోడానికి మాత్రమే కాకుండా, చుట్టు పక్కల వాళ్ళు వచ్చి బియ్యం ఏరుకోవడం, బీన్నీసు (గోరు చిక్కుల్లో చిక్కుళ్ళో) వలుచుకోవడం, శామంగాలు (చేతితో చేసే సేమియా) చేసుకోవడం, అల్లం ఎల్లిగడ్డ వలుచుకొవడం  మొదలైన వాటికి వేదిక. 

ఇల్లు చిన్నది కాబట్టి జుట్టు ఇంట్లో కాకుండా బయట అరుగు మీద కూచుని దువ్వుకోడం అలవాటు. ఎందుకంటే, చిన్న అన్నయ్యకి అన్నంలో జుట్టు కనిపించిందో.. వీధి వీధి ఎగిరిపోయేలా దుమారం లేస్తుంది. అన్నంలో చెయ్యి కడిగేసుకుంటాడు. బియ్యంలో నలకలు పురుగులు స్లిప్ అయ్యి అన్నంలోకి వచ్చినా ఫర్వాలేదు కానీ, జుట్టు వస్తే మాత్రం టాప్ లేచిపొద్ది.. అంతే..! అమ్మ భయపడ్డట్టు.. చిన్న అన్నయ్యకే అన్నంలో ఏదో ఒకటి కనబడేది. మాట్లేసిన గిన్నెలో అన్నం వండితే ఆ మాటు ఊడిపోయి, తనకే వచ్చింది ఒక సారి. బియ్యంలో రాళ్ళు గాలించినా, కొన్ని వచ్చేసేవి. అవి కూడా ఎప్పుడూ మా చిన్న అన్నయ్య దంత సిరిని పరీక్ష చేసేందుకే సిధ్ధం అయ్యేవి. 'వాడికి చీకట్లో అన్నం పెట్టు, దీపాలు లేకుండా' అనే వారు మా నాన్న. చీకటైనా వెలుగైనా, ఇలాంటివేవో అన్నయ్యకే అగుపిస్తాయి ఎందుకో.  మేము సరిగా చూసుకోకుండా తినేస్తున్నామని, మేము చూసుకోకుండా తినేసే పురుగుల బరువు ఏనుగు తలకాయతో సమానమనీ అనేవాడు కొంచెం మంచి మూడ్ లో ఉన్నప్పుడు. బాగా కోపిష్టి లెండి. అలా సరదాగా ఉండడం చాలా అరుదు. అన్నయ్యకి అన్నం వడ్డించాలంటే, అమ్మ దగ్గరి నించీ  అందరికీ భయమే! అరుగు మీద జడలు వేస్తూ ఎప్పుడైనా జుట్టు తియ్యని దువ్వెన కనబడిందంటే దివ్వెన ఇంతి ఎదురుగా ఉన్న చెరువులోకో, ఆ పక్కన ఉన్న పొదల్లోకో దూసుకెళ్ళేది. ఆ రోజుల్లో మళ్ళీ దువ్వెనలు కొనాలంటే సూదులు దారాలు అమ్మే వాళ్ళు రావలసిందే. అందుకే అందరం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేవాళ్ళం జుట్టు విషయం లో. 


అమ్మ ఉంగరాల జుట్టు నాకు, చెల్లికి వచ్చింది కానీ అమ్మ జుట్టులా పొడుగ్గా పెరగదు. విప్పుకుంటే జూజూ భూతంలా ఉంటుందని ఒకరు.. నూడుల్స్ లా ఉన్నాయని ఒకరు వారికి మా మీద ఉన్న విసుగునో ప్రేమనో వెళ్లగక్కే వారు.  తల బిరుసు తగ్గాలని కుంకుడు కాయలతో పాటు ఇంట్లో చెట్టుకి ఉన్న మందార ఆకుల ముద్ద నూరి తలకు పట్టించి, కుంకుడు కాయ పులుసుతో స్నానం చేయించడం అక్కలకి ఎంతగానో అలవాటు అయ్యింది. ఆ ఆకులు, కుంకుడు పిప్పి అంటుకున్న జుట్టుని ఆరేదాకా దువ్వకూడదు, అలా దువ్వితే జుట్టుకున్న ఎలాస్టిసిటీ పోతుందని ఎవరో చెప్పారని మా చిన్నక్క పెట్టిన  రూలొకటి. ఇక కెవ్వులు కేకలు. చిక్కు చిక్కు.. ఆ తరువాత మేము కొంచెం పెద్దయ్యాక ఒక యమా అవుడియా వచ్చింది. నీళ్ళు కాచుకునే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి, దానిలో సగానికి నీళ్ళు పోసి,  అప్పటికప్ప్డు కుంకుడు చెట్టు నించి వేలాడుతున్న ద్రాక్ష గుత్తుల్లాంటి కుంకుడు కాయలు, ఆ పక్కనే చెట్టుకున్న మందార ఆకులు పడేసి ఒక అరగంట వదిలేస్తే అదే మరిగి మరిగి మరుగుతుంది. దాన్ని నెమ్మదిగా దించి, ఒక బట్టతో ఇంకో గిన్నె లోకి వడగట్టి పెడితే సేంద్రియ పద్ధతిలో షాంపూ తయారవ్వదూ? ఒక ఆదివారం పొద్దున్న పూట అలా ఉడికించామంటే, ఇంట్లో వాళ్ళకే కాదు పక్కన పది ఇళ్ళకి సరిపడా వస్తుంది. కానీ అది నిలవ ఉండదు. ఇంట్లో చెట్టుంటే, ఇంకెందుకు బెంగ మరి. (మీలో ఎవరైనా కుంకుడు చెట్లు చూసారో లేదో భలే ఉంటుంది తెలుసా)  


ఇక మందార పువ్వులు ఎండబెట్టి వాటిని కొబ్బరి నూనెలో వేసి కాచి చల్లార్చి డబ్బాలో దాచిన నూనె ఎంత పట్టించినా జుట్టు తాగేస్తుందని నవ్వేది అమ్మ. మరీ పొట్టి జుట్టు కాదు కానీ ఆరగానే రింగులు తిరిగి పొట్టిగా కనిపించేది. 'ఎంత సమ్రక్షణ చేసినా ఇంతే, కాస్త పెరిగినా బాగుండేది' అని అమ్మ అన్నప్పుడల్లా, 'బుద్ది శాలుర జుట్టు భుజాలు దాటదు, అలా ఉండనియ్' అనేది మా బోయినపల్లి అమ్మమ్మ.


మా చెల్లి స్కూల్ లో పని చేసే నాగమణి టీచర్ కి రింగుల జుట్టు ఎంత ఇష్టమో. మా ఇంటి ముందు నించి వెళుతున్నప్పుడల్లా, అక్కడ ఆడుకుంటున్న మా ఇద్దరినీ పిలిచి, ఒక సారి తల మీద చెయ్యేసి మురుసుకుంటూ వెళ్ళేది. అదొక ఆనందం, ఆప్యాయత అనుకుంటా. 


ప్రతి పూటా జడలు వేసినప్పుడు చిక్కులు పట్టి ఊడిన మా ఇద్దరి జుట్టూ అక్క జాగర్తగా  వేలికి చుట్టుకుని, ఆ చుట్టని..ఒక సంచీలో పెట్టి, ఇంటి వెనక మెట్ల కింద ఉన్న చీకటి గదిలో చూరు కింద రేకుల మధ్య ఉన్న సందులో పెట్టేది. అక్కడ కొంచెం చీకటిగా ఉంటుంది అటు ఎవ్వరూ వెళ్ళరు ఎక్కువగా. అక్కడే ఎందుకు అంటే, మా చిన్న అన్నయ్య చూడడు కాబట్టి. వాడు చూసాడంటే, విసిరి కొడతాడు అసహ్యంతో. 


దాచిన జుట్టు సవరాల వాళ్ళకి ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పుకునేవారు.  పక్కింటి సావిత్రక్క దాచిన జుట్టు ఎన్ని రోజులైనా మా అక్క దాచినంత అయ్యేది కాదుట.  రిబ్బన్లు పీకేసుకున్నామని మొట్టికాయలు వేస్తుంది కానీ, అలా ఆవిడ పోల్చి చూసినప్పుడల్లా మా అక్క ముఖం తెగ సంతోషంగా వెలిగిపోయేది. 


నెలకో రెండు నెలలకో సవరాలు అల్లేవాళ్ళు వచ్చేవారు మా ఊరికి. 

ఒకోసారి మా వీధిలో ఎవరికైనా అర్జెంట్ గా సవరం అవసరం అయితే, ఇరుగు పొరుగు  వాళ్ళ జుట్టు మదుపు లోంచి అప్పు తీసుకుని తిరిగి చెల్లించే పథకం కూడా అమలులో ఉండేది. అయితే ఈ సవరాలు అల్లే వాళ్లతో తెగ చిక్కులు. వాళ్ళు చాలా మాటకారులు..మంత్ర గాళ్లు కూడా. ఎవరినీ తక్కువ చెయ్యడం నాకు ఇష్టం ఉండదు కానీ, ఇటు తిరిగి అటు చూసే లోపు సామాన్లు మాయం అయ్య్యేవి. వాళ్ళు వస్తే జాగర్తగా ఉండాలని పదే పదే చెప్పిన వాళ్ళే మోసపోయే వారు. వాళ్ళు పోట్లాట వేసుకున్నారంటే ..ఇక ఇంతే సంగతులు..చిత్తగించవలెను.. అంతే! ఒక్కరే ఉన్నప్పుడు ఊసుపోక వాళ్ళని పిలిచామో..మత్తుమందు చల్లి ఉన్నవి దోచుకుపోతారని చెప్పుకునే వారు. కాదు కూడదని పిలిచిన వారికి మనసు తీరింది కూడా. వాళ్ళ మంత్రాల మీదా మత్తు మందు మీదా వార్తా పత్రికలలో కూడా చాలా సార్లు వచ్చేది. కానీ సవరమవసరం కదా, పిలవడం తప్పేది కాదు జనాలకి. 


ఈ సవరాల వాళ్ళు ఆ సవరం మీద ఏదో మందు చల్లి పోతారని, ఆ సవరం "రా... రా..." అని పిలుస్తూ ఇంటి వాళ్ళని కొండల్లోకో కోనల్లోకో తీసుకుపోతుందని వివిధ రకాల కథలు చెప్పుకునేవారు. ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నప్పుడు సవరాల వాళ్ళు వచ్చినా పిలవకూడదని ఒట్టేసుకున్న ఇంతులు, వాళ్ళు రాగానే మళ్ళీ ఎప్పటికి కళ్ళబడతారో అన్నట్టు పిలిచేసి, ఎక్కడెక్కడో మోసాలు జరుగుతాయి కానీ నా అంత తెలివి గలది మోసపోవడం ఏంటీ అనుకుంటూనే టపీమని మోసపోవడం చూస్తూనే ఉండేవారు అందరూ. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, మా ఇంట్లో అందరివీ పెద్ద జుట్లు కావడం వల్లనూ, రింగుల జుట్లు కావడం వల్లనూ సవరాల వాళ్ళని పిలిచే అవకాశం కానీ అవసరం కానీ రాదు, రాలేదు. మరి మా అక్క దాచిన చిక్కు జుట్టు ఎటుల ఏమి చేయవలెననే చిక్కు మాత్రం వీడేది కాదు. జుట్టు మనకి అక్కర లేకపోతే సవరాల వాళ్ళకి అమ్మితే డబ్బు వస్తుందని తెలుసు కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా, మా చిన్న అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడే వచ్చేవారు. అలాంటి బేరాలు మా అన్నకి అస్సలు నచ్చవు. 'ఎవరి పోలిక వచ్చిందో పరశు రాముడిలా' అని రాము అనే పేరున్న మా చిన్న అన్నయ్యని చూసి విసుక్కునేది అమ్మ. 


వెంకన్న దగ్గర మొక్కు తీర్చిన జుట్టంతా ఫారెన్ దేశాలకి అమ్ముకుంటారని, అక్కడ సినేమా వాళ్ళు ఈ జుట్టుతో విగ్గులు చేయించి పెట్టుకుంటారని, దేవుడికి ఇచ్చిన పుణ్యం, సినిమా యాక్టర్ల తలమీద మనం సమర్పించుకునే జుట్టు ఎక్కే పురుషార్థం తీర్తుందని ఎవరో చెప్పేసరికి మా ఊళ్ళో ఉన్న బాలాజీ గుడిలో జుట్టు ఇచ్చేవాళ్ళ సంఖ్య ఎక్కువయింది. మా ఊళ్ళో గుడి 400 ఏళ్ళ క్రితం కట్టినది. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి వీలుగా ఇక్కడ వెలుస్తున్నానని, తిరుపతి మొక్కులు ఇక్కడ చెల్లించవచ్చుననీ, ఇక్కడ మొక్కు తిరుపతిలో చెల్లించినా తీరదనీ చెప్పాడుట స్వామి. అందుకే మా ఆల్వాల్ వెంకన్న గుడి జుట్టు తీసే కళ్యాణ కట్టతో కళకళలాడుతుండేది. వాళ్ళు అక్కడ తీసిన జుట్టు ఏంచేస్తారు అని అందరికీ అనుమానమే కానీ, వాళ్ళతో కబుర్లాడితే మా అన్నయ్యల లాంటి వాళ్ళు ఒప్పుకోరు.  


ఎండాకాలం వచ్చేటప్పటికి ఉడుకు వల్లనో, మామిడి పళ్ళు ఎక్కువ తినడం వల్లనో ఉడుకు జ్వరాలు, వేడి గుల్లలు వేసేవి పిల్లలందరికీ. ఒత్తైన గుబురు జుట్టున్న పిల్లలకి తలలో కూడా వచ్చేసేవి. ఒకసారి అలా వచ్చిన గుల్లలు హోమియో లాంటివి వాడినా ఎంతకీ తగ్గక పోవడంతో డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళింది అమ్మ నన్నూ మా చెల్లినీ. ఇచ్చినన్ని ఇండీషన్లు అవీ ఇచ్చి, ఇంక లాభం లేదు జుట్టు కత్తిరించి పడేస్తే కానీ గుల్లలు ఆరవు అని తేల్చి పడేసాడాయన. వద్దు వద్దని మొత్తుకున్నా, గుండు చేయించి పడేసింది మా పెద్దక్క. చీకటింట్లో చూరుకింద ఉన్న జుట్టు పొట్లామిప్పుడు చూరు కింద పట్టనంత పెద్దదయింది. ఇదంతా అమ్మితే ఎంత వస్తుందో అని సంబర పడింది మా అక్క సవరాల వాళ్ళ కోసం వేచి చూస్తూ.  


మా అక్క స్కూల్ కి వెళ్ళినప్పుడు ఊడి పడ్డారు నాగ మణి టీచరు. వాళ్ళ పెద్దక్కకి ఏదో ఆపరేషన్ అని అనుకోకుండా నెల్లూరు వెళ్ళారుట. అక్కడ నించి తిరుపతి వెళ్ళి గుండు చేయించుకోవడంతో ఆవిడ జుట్టు కొద్దిగా పెరుగుతూ ఉంది. టీచరు గారు కనబడలేదని అందరూ అనుకుంటున్నారని చెప్పింది మా అమ్మ. పిల్లలేరి అని అడగడం తో మా ఇద్దరినీ పిలిచింది అమ్మ. ఒక్క సారిగా షాక్ అయిందావిడ. మేమిద్దరం కూడా చిన్న కృష్ణుడి జడ వేసుకుని కనబడ్డాము. అయ్యో అని మా ఇద్దరి తలల మీదా చెయ్యి వేసారు ఒకే సారి. ఇంత మంచి జుట్టు ఎందుకు కత్తిరించారు అని మా అమ్మని అడిగారు కొంచెం నిరాశగా. ఇలా వేడి పొక్కులు వచ్చి మానట్లేదని చెప్పింది అమ్మ. 'ఒక మాట అడుగుతాను, ఆ కత్తిరించిన జుట్టు ఏం చేసారు?' అని మొహమాటం గా అడుగుతూ ' వీళ్ళిద్దరి జుట్టు నాకు ఎంత ఇష్టమో, ముందే చెప్పి ఉంటే నేను తీసుకుందును, నెల్లూరు తీసుకెళ్ళి, చక్కని సవరం అల్లించి తెచ్చుకునేదాన్ని" అన్నారు. ఎక్కడి నించి ఊడి పడ్డాడో మా చిన్న అన్నయ్య 'అమ్మా చూరు కింద జుట్టు దాచారేంటి అసహ్యంగా.. " అంటూ పెద్ద ప్యాకెట్ పట్టుకొచ్చాడు. నాగమణి టీచర్ కళ్ళు మెరిసాయి. 'టీచర్ గారు ఎప్పుడో చెప్పారు, పిల్లల జుట్టు దాచి ఉంచమని, సరియైన సమయానికే చూసావు, ఏదీ ఇలా ఇయ్యి" అని ఒక సారి సంచీ లోకి తొంగి చూసి, టీచర్ గారికి ఇచ్చేసింది. ఆవిడ మహదానంద పడింది. ఆవిడ ముందు ఏమీ అనలేక మా అన్నయ్య కాంగా బయటికి వెళ్ళిపోయాడు. అన్నయ్య విసుగు ఎవ్వరి మీదా పడనందుకు మా అమ్మ హాయిగా ఊపిరి పీల్చుకుంది. జుట్టు రహస్య స్థావరాన్ని మా అన్నయ్య పసి గట్టేసాడు కనక, మా అక్క ప్రతి రోజూ వేలికి చుట్టిన జుట్టు చెత్తతో పాటు ఊడ్చి పడెయ్యడం మొదలెట్టింది.          


భవిష్యత్తులో ఇంకెప్పుడైనా మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదో తెలియదు కానీ, మా ఇద్దరి జుట్టుతో చేయించిన సవరం నాగమణి టీచర్ గారికి సరిగ్గా కుదురుకుందని ఊళ్ళో వాళ్ళు పది సార్లు అంటుంటే, మా అక్క కళ్ళు మెరిసిపోతుంటాయి సావిత్రి గారు సంపాదించెబోయే డబ్బుతో పోటీ పడుతూ.

0 వ్యాఖ్యలు: