వేళకాని వేళా.. త్వరపడి..

Tuesday, November 15, 2022

 



చిత్రం: తూలిక, కెనడా

26 అక్టోబరు, 2022 

ఈ మధ్య తగ్గాయి కానీ నేను కెనడా వచ్చిన కొత్తల్లో అప్పుడప్పుడే కలిసిన కొందరు, వాళ్ళ స్నేహితుల పుట్టిన రోజుకి సర్ప్ప్రయిస్ పార్టీ ఇస్తున్నాం అంటూ ఉండేవారు. పది మంది ఉన్న ఒక గుంపులో మొదటి సారి ఒకరికి చేసినప్పుడు సర్ప్రైజ్ కానీ, సంవత్సరంలో వచ్చే ప్రతి ఒక్కరి పుట్టినరోజుకీ ప్రతి సంవత్సరం ఒకేలా చేస్తే అదేం సర్ప్రైజ్ అని నేను అనుకునేదాన్ని. కానీ, పార్టీ చేస్తున్న వాళ్ళు సర్ప్రైజ్ అంటూ చేస్తుంటే, అందుకున్న వాళ్ళు సర్ప్రైజ్ అయిపోతూ, నన్ను సర్ప్రైజ్ చేస్తూ ఉండేవారు. ఇలాంటి సర్ప్రయిజ్ లు నా వంట పాడైనప్పుడు ఉంటాయేమో కానీ నా ఇంట అసలు లేవు. మా ఇంట్లో మిగతా వాళ్ళు కొద్దో గొప్పో ఓకే నేమో కానీ, మా సీతయ్యకి మాత్రం ఒక సంతోషం వచ్చినా, దుఖం వచ్చినా వెంట వెంటనే ప్రపంచమంతా పంచుకోవలసిందే. మీరు సర్ప్రైజ్ అవకండి గానీ మేము చాలా ఏళ్ళు అద్దె ఇళ్ళల్లో కష్టపడ్డాక,  కెనడాలో ఇల్లు కొని, ఇంటి గృహప్రవేశానికి పిలవడానికి స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి, మా కొత్త ఇంటి చిరునామా చెపుతున్నప్పుడు సగానికి పైగా మంది స్నేహితులు, "మాకు తెలుసు, మేము ఆల్రెడీ మీ ఇల్లు చూసి వచ్చాము" అని చెప్పి నన్ను సర్ప్రైజ్ చేసారు. ఎలా అంటారా! ఎందుకు అడుగుతారు లెండి... ఇంకా ఫైనల్ అనుకోకుండానే.. ఊ.. సరే .. అదన్నమాట..!

పైన చెప్పినది చిన్న ఉదాహరణ మాత్రమే, పదేళ్ళ కింద జరిగిన ఇలాంటి చాలా విషయాలను చెప్తే, ఒక పుస్తకం అవుతుంది కాబట్టి వాటిని వదిలిపెట్టి ఇప్పటి కాలానికి వద్దాము. 

అమెరికాలో ప్రస్తుతం చేస్తున్న తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చానని,  వారం రోజులు నోటిస్ టైం కాబట్టి, 16 న బయలు దేరి కెనడా రావడానికి బుక్ చేసిన తన టికెట్ ఫొటో తీసి పంపారు మా సీతయ్య. ఆ బొమ్మ గుర్తుంచుకుని మేము తనని పిక్ చేసుకోవాలి అదీ ప్లాన్. ఫ్లైట్ టైం తో పాటు కింద ఉన్న ఆ టికెట్ రేట్ చూసి, "వామ్మో ఇంత ఖరీదా! ఇంత పెడితే ఇండియా వెళ్ళి రావచ్చు.. అయినా అమెరికన్ ఎయిర్ లైన్స్ ని పోషిస్తున్నది మీరు కాదూ, అందరూ 100 కీ పాతిక్కీ వెళ్ళి వస్తూ ఉంటారు, మనకే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి, ఇంకో ఎయిర్లైన్స్ చూడకపోయారా, రెండు రోజుల తరువాతైనా కాస్త తక్కువకి వచ్చేదేమో" అన్నాను విచారంగా.    

నా అసలు విచారం అది కాదు. నాకు ప్రతి నెలా మొదటి రెండు వారాలూ ఊపిరి సలపని పని ఉంటుంది. 15 వ తారీఖుకల్లా నేను తెలుగుతల్లి కెనడా, గడుగ్గాయ్ అనే రెండు పత్రికలని తయారు చెయ్యాలి. వారాంతాల్లో యూట్యూబ్ ప్రోగ్రాములు ఉంటాయి. వాటికి ప్రిపరేషన్ ఉంటుంది. ఈ వర్షం రాకడ నాకు తెలియదు కాబట్టి, నేను హాజరు అవుతానని ఒప్పుకున్న సదస్సులు, సభలూ వగైరాలు, పేరంటాలూ, పుట్టినరోజు పండుగలూ అవీ ఉండనే ఉంటాయి మరి! వారు రాగానే నేను ఇలా బిజీగా ఉంటే, నా ప్రపంచం తలకిందులయిపోతుంది(ఎందుకు అన్న వివరాలు ఇంకెప్పుడైనా చెప్తా). అదీ కాక ఇల్లు అద్దంలా పెట్టాలి.(అలా పెట్టాననే అనుకుంటా కానీ, హోటల్ ని చూసిన కళ్ళతో ఇంటిని చూస్తే తిట్టబుద్ధేస్తుందనే సామెతలా ఉంటుంది యవ్వారం). ఇక్కడ కెనడాలో  పోస్ట్ బాక్స్ లు ఇంటికి కాస్త దూరంగా ఉంటాయి. సీతయ్య ఇంట్లో లేకపోతే, "ఏ... మా కెవరు ఉత్తరాలు వ్రాస్తారు" అనుకుంటూ, మేము అటు పోము అసలు. వారు వస్తున్నారని తెలవగానే గబ గబా ఉత్తరాల బొత్తి తెచ్చుకుని, వాటిల్లో కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ ల వంటివి ఉంటే చెల్లింపు చేసేసి, మాలో ఎవరికైనా స్పీడింగ్ టికెట్ లాంటివి వస్తే దాచేసి.. ఉఫ్.. చాలా ఉంటుంది లెండి. 

ఈ  భయంతో కలిగే గౌరవం వల్ల వచ్చే టెన్షన్ మాకు ప్రతి సారీ ఉంటూనే ఉంటుంది. ఈ సారి కొంత ఎక్కువ ఎందుకంటే, అనుకున్న తేదీకి పది రోజులు ముందుగానే పుట్టిన మా మనవడిని వెంటనే చూడకుండా ఆసుపత్రి వాళ్ళు పెట్టిన 5 రోజుల ఆంక్షల వల్ల మేము 12 వ తారీఖున న బయల్దేరి 7 గంటల డ్రైవ్ దూరంలో ఉన్న మాంట్రియల్ కి వెళ్ళి రావాలన్నమాట. ఆ వారం ఆఫీసు పని వత్తిడి ఎక్కువగా ఉండడంతో ఆ ఒక్క రోజు వెళ్ళి వచ్చేటట్టు మా బాస్ ని ఒప్పించుకున్నా. 13, 14, 15 లలో పనులు పూర్తి చేసుకుంటే సీతయ్య వచ్చాక, తను మనవడి కోసం అమెరికాలో పీకిన జెండా పట్టుకెళ్ళి మాంట్రియల్ లో పాతాలన్నమాట. 

స్టడీ వీక్ అంటూ వారం సెలవల కోసం యూనివర్సిటీ నించి వచ్చిన నా పిల్లది సోమవారం సాయంత్రం ఇల్లు సర్దటం మొదలెట్టి, అందరినీ వాళ్ళ వాళ్ళ గదులు సర్దెయ్యమని కొంచెం హడావిడి చేసి, నన్ను సర్ప్రైజ్ చేసింది. ఇదేమిటా ఈ పిల్లకి ఎప్పుడూ లేనిది ఇంత నీట్ నెస్ అని నేనూ, నా దత్త పుత్రిక హాశ్చర్యపోయాము. అదీ కాక, నేను చాలా పనులు పెట్టుకుని సరిగా పడుకోవట్లేదని ప్రతిరోజూ క్లాసులు పీకే పిల్ల "నువ్వు తెలుగుతల్లి పనులు ఈ రోజు రాత్రి మొత్తం మెలకువగా ఉండి చేసేసుకో, రేపు కొంచెం ఎర్లీ గా లేచి చేస్తే గడుగ్గాయి పనులు కూడా అయిపోతాయా? మేమిద్దరం వంట చేసేస్తాంలే" అని నా ద.పు (దత్త పుత్రిక) ని కూడా స్వచ్ఛందంగా కలిపేసుకుంది. పత్రిక పనుల్లోనూ, యూ ట్యూబ్ పనుల్లోనూ హెల్ప్ చెయ్యనా అని ఒకటే అడగడం. సూర్యుడు ఎటు పొడుస్తున్నాడా అని నేను నిజంగా చాలా సార్లు ఆకాశం కేసి చూసి వచ్చి, ఈ ప్రేమ తట్టుకోలేక కంట తడి కూడా పెట్టుకున్నా. 

ఆ రాత్రి ఫోన్ చేసినప్పుడు మర్నాడు మాంట్రియల్ వెళ్ళే సంగతి ప్రస్తావించా సీతయ్యతో. వచ్చేవారం ఎలాగూ వస్తా కదా అప్పుడు వెళ్ళచ్చు, రేపటి ప్రయాణం క్యాన్సిల్ క్యాన్సిల్ అని తెగ బ్లాక్ మెయిల్ చేసారు. పసికందుని చూస్తున్నాని కంటున్న కలలు కూలిన నిరాశ కమ్ముకున్నా, "ఇదీ ఒకందుకు మంచిదే..ఆఫీసులో పని, పత్రిక పని కూడా అయిపోతుంది కాబట్టి, నాన్న వచ్చాక వెళ్ళడమే మంచిది" అని చెప్తూ, నేను సెలవు క్యాన్సిల్ చేసి, నా ద.పు. తోనూ, అబ్బాయితోనూ కూడా సెలవు క్యాన్సిల్ చేయించి, మాంట్రియల్ లో కొడుకుకీ, కోడలికీ ఫోన్ చేసి మారిన షెడ్యూల్ అంతా చెప్పేసా. తదనుగుణంగా వాళ్ళు డాక్టర్ అప్పయింటుమెంటులూ అవీ మార్చుకుంటామని చెప్పారు. 

మర్నాడు సాయంత్రం 3 గంటలకి పిల్లది దోస్తులని కలవడానికి వెళతా అంది. స్టడీ బ్రేక్ సెలవులకని ఇంటికొచ్చింది కానీ స్టడీ లేదు బ్రేకూ లేదు ఊరి మీద పడి తిరుగుతోందని చిరాకేసి  "నీకంటే సెలవులు కానీ, నీ దోస్తులు ఇంకా ఆఫీస్ నించి ఇంటికి వచ్చే టైం కాలేదు కదా? ఇప్పుడు నిన్ను కలవడానికి ఎవరుంటారు" అని వాదించాను. అది వినీ విననట్టుగా వెళ్ళిపోయింది. ఛీ! ఇవాళేమిటో ఎవరూ వినిపించుకోవట్లేదు అని, విసుగు విసుగ్గా ఆఫీసుపని చేసుకుంటూ, ఒక మీటింగ్ లో ఉండగా..తలుపు కిర్రునా చప్పుడైనది... గుండె ఝల్లనా కొట్టుకున్నది.... మెల్ల మెల్లగా కిందకెళ్ళి నే వచ్చినదెవరో చూసాను....వచ్చినదెవరో చూసాను..! అవును మీరు కరెక్ట్ గానే గెస్ చేసారు.. ఇంకెవరూ.. ఎవరూ.. మా సీతయ్యే!! ఈ సర్ప్రైజ్ సల్లగుండా..అప్పటికి ఒక అడుగు కూడా కదలని నా పనులన్నీ తలచుకుని..  ఒక నిమేషమునందే నయము, భయము, విస్మయము గదరా... శ్రీ మద్రమారమణ గోవిందో హారి. 

నేను బుర్రలో తిరుగుతున్న పనుల సునామీని, చెత్తా చెదారాన్ని ఒడుపుగా ఒక పక్కకి జరిపి "ఇంతకీ.. ఇలా వచ్చేసారేంటీ" అంటూ సర్ప్రైజ్ అయినట్టు నటించా.. మనసులో మాత్రం "ఇంత ఝలక్ ఇచ్చారేంటీ" అని వేదన (ఈ మాట మీరు వినలేదంతే). 

"చూసారా నాకూ సర్ప్రైజ్ చెయ్యడం వచ్చేసింది కదూ" అంటూ బోలెడు సంబరపడిపోతూ "పొద్దున్నే ఐదుకల్లా బయలుదేరితే  ట్రాఫిక్ పెరగకుండా ఊరు దాటెయ్యచ్చు, వంకలు పెట్టకుండా పది రోజులు సెలవు పెట్టెయ్యి, మేనేజరుకి చెప్పెయ్యి.. సెలవు చీటీ రాసెయ్యి" అంటూ ఊపిరాడనియ్యకుండా దడదడలాడించేసారు సీతయ్య. ఇప్పుడు సెలవు పెట్టనంటే పాముకి కోపం, పెడతానంటే కప్పకి కోపం.. పైగా మాంట్రియల్ లో వాళ్ళు అన్ని ప్లాన్ లూ మార్చుకు కూచున్నారు. ఇప్పటికిప్పుడు మేమొచ్చేసాం అంటే, వాళ్ళేమి ఇబ్బంది పడతారో అని బెంగ, అబ్బాయి, ద.పు లు మళ్ళీ సెలవు అడగాలి.. అయ్యో నా తెలుగుతల్లి, అయ్యో నా గడుగ్గాయి, అయ్యో నా బుజ్జి పిల్లల కథల ప్రోగ్రాము, అయ్యో ఇన్స్ట్రుమెంటులు వాయించే పాటల ప్రోగ్రాము, అయ్యో ఆ సభ, ఈ సభ ఇప్పుడెలా???????  

ఆ సంభ్రమంలో మునిగి తేలుతూ ఉండగా "హమ్మయ్యా. ఇప్పుడెంత రెలీఫ్ గా ఉందో తెలుసా అమ్మా. నాన్న ఈ రోజు వస్తున్నా అని నా ఒక్కదానికీ చెప్పి ఎవరికీ చెప్పద్దన్నారు. ఎవ్వరికీ చెప్పనని ప్రామిస్ చేసా. కానీ నువ్వు పనులు ముగించడానికి వేస్తున్న పల్టీలు, పిల్లిమొగ్గలు చూస్తుంటే జాలేసింది. హింట్ ఇద్దామనుకున్నా కానీ ఎలా ఇవ్వాలో తెలియలేదు సారీ అమ్మా" అంటోంది పిల్లది. నాకు ఒక వైపు తల తిరుగుతున్నా జాలేసింది పిల్ల దాని మీద. 

"టికెట్లు చాలా ఖరీదు ఉన్నాయి కదా బాబాయ్" అని నా ద.పు అడిగితే, "లేదు చాలా చీప్ గా వచ్చింది 499 డాలర్లు అంతే"అని జవాబు. "అబ్బా బాగా చీప్ గా వచ్చిందే, 16 నాటి టికెట్ లో మూడవ వంతు. భలే మంచి పని చేసారు, 16 టికెట్ క్యాన్సిల్ చేసెయ్యండి మర్చిపోకుండా" అన్నాను వెయ్యి డాలర్లు మిగిల్చారు అనుకుంటూ కూల్ గా. "అబ్బే అది తిరిగిరాదు, పోయినట్టే" అన్నారు మామూలుగా. ఆ జవాబుకో, నా కళ్ళ ముందు తిరుగుతున్న పనుల గజిబిజికో తెలియదు కానీ నా  మెదడు మోకాలు దాటుకుని, అరికాల్లోకి జారి పోయింది. ఈ సారు-ప్రైజ్ ల నించి నేను కోలుకుంటానంటారా?

2 వ్యాఖ్యలు:

Veena said...

bagundandi mee post. ippude annee chaduvuthunna mee bloglo. innaalluu na kallabadaledu

Unknown said...

Dhanyavaadaalu Veena gaaru. enduko blog credentials poyaayi andi. ee madhyane recover chesukunnaanu. mee blog kosam vetikaanu akkada yemee levu. link unte ivvandin please. Thank you so much andi. namaskaaram.