సత్తెకాలపు సత్తయ్య

Wednesday, November 23, 2022

మా జనక మారాజు మరీ సత్తెకాలం మనిషి. ఆడపిల్లల సొమ్ము తినకూడదనే మాటకి పేటెంట్ హక్కు తీసుకున్నట్టు, కొండొకచోట తినవలసి వస్తే కొంపలంటుకున్నట్టు భయపడి తడబడే టయిపు. దానికి తోడు గాంధీ గారి మార్గంలో సింపుల్ లయిఫ్ . ఎక్కడా హంగూ ఆర్భాటమూ ఉండవు. కష్టమొస్తే బాగా కుంగిపోవడమో, ఆనందమొస్తే బాగా పొంగిపోవడమో ఉండవు. అయినా అంతటి ఆనందాలు రావడానికి అంబానీ కుటుంబమా ఏంటీ , ఏగానీ జీతంతో ఏడుగురిని పెంచడం మరి! కొత్త చొక్కా వేసుకుంటే డిపార్ట్మెంట్ లో అందరికీ చాయ్ ఇప్పించాలని రూల్ పెట్టారుట ఆఫీస్ లో ఉన్న కుర్ర కారు.. ఆ చాయ్ పార్టీ ఖర్చుతో ఒక పిల్లాడికి పరీక్ష ఫీజు కట్టడమో, ఒక ఆడ పిల్లకి పరికిణీ కుట్టించడమో వచ్చేస్తుందని కొత్త చొక్కా వేసుకోవడానికి దాదాపు భయపడిపోయేవారని గుర్తు. బస్ ఖర్చు ఎందుకనేమో అల్వాల్ నించీ AOC సెంటర్ కి రెండు పూటలా కాలి నడకే. బస్ ఎక్కమని బలవంతపెడితే "బస్ చాలా రష్ గా ఉంటుంది. కాళ్ళు తొక్కేస్తారమ్మా, కదుము కడితే తొందరగా మానదు. నిదానంగా నడచి వెళితే సుఖం , గాంధీ గారు నడక మంచిదని చెప్పేవారు" అనేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరు తండ్రుల్లాగానే త్యాగాల లిస్ట్ పెద్దగానే ఉంటుంది... అందుకే చదువులయ్యి ఉద్యోగాలొచ్చాక అయినా, ఆయనకి ఏదైనా కొనిద్దామని అందరం తాపత్రయ పడతాం. కానీ, ఏది కొన్నా తీసుకోరు. మరీ బతిమాలినా వినరు. ఆయనకి చెప్పకుండా ఏదైనా కొనిస్తే, రెండో రోజునే ఆ వస్తువుని ఎవరికో ఒకళ్ళకి ఇచ్ఛేస్తారు. ఇవన్నీ తనకు అలవాటు లేవనో , పుచ్చుకున్న వాడికి ఆ వస్తువు ఎక్కువ అవసరమనో అంటారు. పైగా, అనవసరమైన వాటికి ఖర్చు చేస్తున్నామని కోప్పడతారు కూడా! అందుకే ఆయన కోసం ఏం కొనాలన్నా మాకు భయమే. వయసు రీత్యా ఈ మధ్య వినిపించటం లేదుట, మేము ఫోన్ చెయ్యగానే ఆయన మాట్లాడాల్సినవి చెప్పేస్తారు. కానీ, మేము చెప్పేవి పక్కనున్న వాళ్ళు గట్టిగా చెప్పాలి. దూరాలనున్న తలితండ్రులతో మాట్లాడలేక పోవడం విదేశాల్లో ఉన్న పిల్లలకి ఎంత దుఃఖ తరమో కదా. ఫోనులో మాట్లాడడం అటుంచితే, రోజు మొత్తంలో నాన్నకి ఇష్టమైన పని రేడియో వినడం. క్రమేపీ వినికిడి తగ్గితే ఎలా? ఆ రేడియో వినకుండా నాన్నని ఊహించుకోవడమే కష్టమసలు. అదే ఆయన చెలిమీ కలిమీ. ఈ రేడియో కి చిన్న కథ ఉంది లెండి. మాల్దీవుల నించి వస్తూ ఎయిర్పోర్ట్ లో చూస్తుంటే పది డాలర్లకి కనబడింది అరచేతిలో పట్టే ఈ బుజ్జి పాకెట్ రేడియో. నన్నకి ఇస్తే వాడగలరో లేదో అనుకుంటూ కొన్నా. ఇప్పటి వరకూ, పెద్ద పెద్ద యుద్ధాలు జరగకుండా, ఆయన స్వీకరించిన వస్తువు ఈ రేడియో ఒక్కటే. ఇంట్లో టీవీలొచ్చాక పెద్దగా రేడియో వినేవారుండరుగా. అదీ కాక , పిల్లల చదువులూ సంధ్యలూ కూడానూ. ఆ కారణం కావచ్చు. ఇవ్వగానే తీసుకున్నారు అందరూ ఆశ్చర్యపోయేలా. మొహమాట పడుతూ తీసుకున్నా, భలే నచ్చేసిందిట నాన్నకి. ఇంట్లో ఎవరినీ డిస్టర్బ్ చెయ్యకుండా చెవి దగ్గర పెట్టుకుని వినడానికి, ఇంట్లో ఎవరూ లేనప్పుడు తోడుగా ఉండడానికీ భలేగా పనికొస్తుంది అన్నారు నవ్వుతూ. అది కొని పదిహేనేళ్ళయింది. బాటరీలు వేసే బటన్ వదులు అవడం లాంటివే కాక, చిన్నగా ఒక పక్క విరిగింది కూడా. ఆయనకి కళ్ళు మూసుకుని ముళ్ళు తిప్పడం అలవాటయిందేమో , ఇంకోటి కొనిచ్చినా తీసుకోరు, దాన్ని వదలరు. ఆయనకి ఒక వస్తువు అలవాటయితే మార్చడం ఇష్టం ఉండదు విరిగినా, తరిగినా. ఓల్డ్ ఈస్ గోల్డ్ అనుకునే వారిలో నాన్న కూడా ఒకరు. ఈ రేడియో మీద మమకారం పెరిగిపోయి , దాని గుణగణాలని మెచ్చుకోవడమే కాకుండా, అమ్మాయి అల్లుడు కొనిచ్ఛారని అందరికీ చెప్పుకుంటుంటే మా సీతయ్యకి చెడ్డ మొహమాటం. "ఇల్లో , పొలమో రాసిచ్చిన లెవెల్లో చెప్తుంటారు, కాస్త మంచిదైనా కొన్నావు కాదు" అంటుంటారు. "ఏదో ఒకటి లెండి, అసలు తీసుకుని వాడుకుంటున్నారు అదే పదివేలు" అంటాను నేను. అలా రోజు మొత్తంలో ఎక్కవ వాడే రేడియో వినలేక పొతే కష్టమే కదా మరి? పోనీ చెవి మిషన్ కొందామా అని అడిగామనుకోండి ఠక్కున ఒద్దు అంటారంతే!! ఒక సారి వద్దు అనే పదం వచ్చిందంటే బ్రహ్మ గారొచ్చి చెప్పినా వినడం కల్ల. బంగ్లాదేశ్ నించి వచ్చిన కొలీగ్ నాకు ఒక కథ చెప్పాడోసారి. ఒక కోర్ట్ దగ్గర గేటుకీపర్ గా ఒక జవాన్ నిలబడ్డాడుట. ఒక వ్యక్తి లోపల ఎవరినో కలవాల్సి వచ్చి, లోపలికెళ్లాలని పర్మిషన్ అడిగాడట. జవాన్ అతన్ని లోపలికి పంపడానికి ఒప్పుకోలేదుట. ఆ వ్యక్తి ప్రతి పావుగంటకీ బతిమాలినా జవాన్ ససేమిరా అనేసాడుట. కాసేపు అక్కడే నించుని గమనించిన ఆ వ్యక్తికి లోపలికి బోలెడు మంది వెళుతూ కనిపించారుట. "మరి వాళ్ళు వెళుతున్నారు కదా నన్నెందుకు ఆపుతున్నావని" కోపంగా అడిగాడట. "వాళ్ళల్లో నన్నెవరైనా లోపలికి వెళ్ళచ్ఛా అని అడిగారా? ఎవరైనా అడిగితే పంపకూడదని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు . నువ్వు అడిగావు కాబట్టి నిన్ను లోపలికి వెళ్లకుండా చూడడమే నా కర్తవ్యం" అన్నాడుట జవాను. ఆ కథ గుర్తొచ్చి, ఇప్పటికి ఊరుకోవడమే ఉత్తమం అనిపించింది. నాన్నకి ఒక వస్తువు కొనియ్యమనే పదం వినగానే నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఏదో దయ్యాన్ని చూసినట్టో, పర్వతం మీద నించి దూకమన్నట్టో బిల్డప్ ఇస్తారు. "వద్దులేమ్మా నువ్వు వచ్చినప్పుడు ప్రయత్నించు" అంటూ. ఆ సంవత్సరం ఇండియా వెళ్ళినప్పుడు, భోజనాలు చేస్తుండగా, నాన్నగారికి చెవులు సరిగ్గా వినిపించట్లేదని, ఈ మధ్య ఫోన్ చేసినా సంతృప్తిగా ఉండట్లేదని, చెవి మిషన్ కొనాలంటే కుదురుతుందేమో చూస్తున్నా అనీ అన్నాను. అనగనగా ఒక చెవి డాక్టరు ఉన్నాడనీ, అతను పెద్దవాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ చక్కగా అమరుస్తాడనీ, తన ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి అక్కడే చెవి మిషను కొన్నారనీ చెప్పి, మా శ్యామ్ అతని దగ్గరికి తీసుకెళ్లాడు . సికందరాబాదు జనరల్ బజార్ లో ఒక ఇరుకు సందులో మూడో అంతస్తులో ఉన్న అతన్ని కలిసి, మా నాన్న గారి పరిస్థితి ఇదీ అని చెప్పాము. "తీసుకురండి చూస్తా" అన్నారు. "ఇన్ని మెట్లెక్కి రాలేరండీ బాగా పెద్దాయన" అని చెప్పా. " ట్యాక్సీ లో తీసుకొద్దాం వదినా, నేను జాగర్తగా ఎత్తుకుని పైకి తీసుకొస్తా మావయ్యని" అన్నాడు శ్యామ్. "అసలు ఆయన కదలాలిగా" అన్నా నేను బెంగగా. "డాక్టరు గారూ, మీరు మాఇంటికి రాగలరా" అని అడిగాను. "కష్టం అండీ, నేను పగలూ రాత్రీ బిజీ " అన్నారు ఆయన. "అంటే...నేను ఇంకో వారం రోజులుంటా. నేను ఉండగా అయితే కాస్త ఒప్పించే ప్రయత్నం చెయ్యచ్చు, నేను వెళ్ళాక ఆయనని ఒప్పించడం ఇంక కష్టం" అన్నాన్నేను. బిసినెస్స్ పోతుందని కొంచెం సేపు ఆలోచించి "సరే.. వచ్చేవారం చూద్దాం" అన్నారు డాక్టరు గారు. "కానీ డాక్టరు గారూ, మా నాన్నగారు ఇలా చెవి మిషను అవీ అని చెప్తే ఒప్పుకోరండీ, చిన్న అడ్జస్ట్మెంటు చెయ్యాలీ" అన్నా నేను మొహమాట పడుతూ. "అలాగా ఏమి చేద్దామంటారూ" అన్నారు. "మీరు ఏమీ అనుకోకపోతే చిన్న డ్రామా" ....మళ్లీ నా మొహమాటం . డ్రామా పదం వినగానే డాక్టరు గారి మొహంలో ఉత్సాహం తొంగి చూసింది. "చెప్పండీ నన్నేం చెయ్య మంటారూ" ...డాక్టరు గారు తొందర పెట్టారు. " ఏం లేదండీ , మీరు మా వారి స్నేహితుణ్ణని చెప్పండి చాలు నేను మ్యానెజ్ చేస్తా" అని చెప్పా . అప్పటి దాకా అస్సలు ఖాళీ లేదన్న మనిషి కాస్తా "అయితే రేపు రానా" అని అత్యుత్సాహం ప్రకటించారు. అప్పటికే వారిలో మా వారి స్నేహితుడు జీవం పోసుకుని జీవించెయ్యడానికి రెడీ అయిపోయాడు. " ఇంకో విషయం… నాన్నగారి ముందు డబ్బు ప్రసక్తి తేకూడదు, కాబట్టి ఫీసు విషయాలు గట్రా ఇప్పుడే మాట్లాడేసుకుందాం " అన్నాన్నేను. కన్సల్టేశనుకి ఇంత , ఇంటికి వచ్చినందుకు ఇంత , మెషినుకి ఇంత అని మాట్లాడేసుకున్నాము. పైకి చెప్పలేదు కానీ, “డ్రామా ఆక్టరుకి ఇంకో వెయ్యి” అని నేను మనసులో అనుకున్నా. "సరే మరి వెళ్లి వస్తాము, రేపు సరిగ్గా 5 గంటలకి కలుద్దాం , ఇదిగో మా ఇంటి అడ్రస్సు" అని అడ్రస్సు వ్రాసి ఇచ్చాన్నేను. "నాకు ఆల్వాల్ మెయిన్ రోడ్డు వరకు తెలుసండీ అక్కడి నుంచీ తెలియదు" అని చెప్పారాయన . "సరే సత్యా టాకీసు దగ్గరకొస్తున్నప్పుడు ఫోన్ చెయ్యండి మా మేనల్లుడిని పంపుతా"అని ఫోన్ నంబరు కూడా వ్రాసి ఇచ్చాను. వెళుతుండగా గుర్తొచ్చింది " డాక్టరు గారూ మా వారి పేరు "రాజు " గారండీ అని చెప్పి బయలుదేరాము. ఇంటికెళ్ళాక ఇంట్లో అందరినీ సమావేశపరచి విషయం చెప్పాను. "ఏమో నీ చాదస్తం , ఆయన పెట్టుకున్నప్పటి సంగతి" అన్నారు పెద్దగా ఉత్సాహ పడకుండా. " మై హూ నా" అంటూ ఎప్పుడో ఒకసారొస్తా కాబట్టి, నా మాట కాదనరన్న నమ్మకాన్ని కాస్త ఓవర్ గానే ప్రదర్శించి, నాన్న దగ్గరికెళ్ళి, "నాన్నా, ఈయన స్నేహితుడొకరు, నేను వచ్చానని తెలిసి ఫోన్ చేసారు. రేపు సాయంత్రం ఇక్కడికి వచ్చి చూసి పోతానని అన్నారు. ఆ టయింకి నువ్వు ఇంట్లోనే ఉంటావా గుడికెళతావా" అని అడిగా. "అయ్యో తప్పకుండా రమ్మను ,గుడికి తరవాత వెళ్ళచ్చులే " అన్నారు. నేను మనసులోనే బోల్డు సంతోష పడిపొయ్యా . వచ్చేది అల్లుడు గారి స్నేహితులు కాబట్టి, టిపినీలు అవీ ఘనంగా చెయ్యమన్నారు నాన్న. " ఆయన ఒక అరగంట ఉంటారుట అంతే . ఇటు వైపు ఏదో పార్టీకి వెళుతూ దారిలో మనింటికొస్తున్నారుట. దయచేసి ఫార్మాలిటీస్ పెట్టుకోకండి టీ కి మాత్రం వస్తాను అని చెప్పారుట. అంతగా అయితే మిక్చరు, స్వీట్ పెడదాములే" అంది అక్క. నేను అక్కని మెచ్చుకోలుగా చూసా. మరునాడు సరిగ్గా 5 గంటలకి ఫలానా చోట ఉన్నానని డాక్టరు గారు చెప్పడం, అక్కడ వెయిట్ చేస్తున్న మా మేనల్లుడు దారి చూపించి తీసుకురావడం జరిగాయి. వస్తూనే "నమస్కారం అండీ నేను నాయుడు గారి ఫ్రెండ్ ని" అన్నాడాయన. అత్యవసరమైన విషయాలు అరచి చెప్పినా కూడా వినపడని నాన్నకి ఆ పదాలన్నీ చక్కగా వినిపించేసాయి. “నాయుడు గారెవ”రన్నారు. "మన రాజు గారికీ, వీరికీ కామన్ ఫ్రెండ్ సికందరాబాద్ లో ఉంటారులే ఆయన గురించి చెప్తున్నారు" అంటూ, "నాన్న గారికి నాయుడు గారు పరిచయం లేదండీ , మా రాజు గారు వారినెప్పుడూ ఇంటికి తీసుకురావడం కుదరలేదు" అన్నాన్నేను "రాజు గారన్న" పదం గట్టిగా నొక్కుతూ . "రాజు, నాయుడూ, నేనూ చిన్న నాటి స్నేహితులమండీ" అని నాన్నకి వినపడేట్టు చెప్పారు డాక్టరు గారు. "ఏ ఊళ్ళోనండీ" అనడిగారు నాన్న. “చచ్చింది గొర్రె అనుకుంటూ " మన రాజు గారు మదరాసులో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వీరు ENT చేశారట. కొద్ది రోజులు ఒకే రూమ్ లో ఉన్నారట, వీరు చెవి డాక్టర్" అని గబగబా చెప్పా గట్టిగా.. ఇంకో రెండు మాటలు మెల్లగా మాట్లాడారు డాక్టరు గారు. ఆయన చెప్పిన వాటిని నేను నాన్నతో గట్టిగా చెప్పా. "మీతో అందరూ గట్టిగా మాట్లాడుతున్నారెందుకూ? మీకు సరిగా వినబడుతున్నట్టు లేదు, ఏదీ ఒక సారి చూడనీయండి" అని చనువుగా జీవించేసారు డాక్టరు గారు. అల్లుడు అన్న పదం బాగానే వర్క్ అవుట్ అయింది. మరో మాట లేకుండా చెవులప్పగించారు నాన్న. ఆయన కార్ దగ్గరికెళ్లి పరికరాలన్నీ తెచ్చుకుని, పావు గంటలో టెస్టులు ముగించి, టీ తాగి "పని ఉంది అండీ మళ్ళీ వస్తా" అని చెప్పి వెళ్లిపోయారు. మూడవ రోజు హియరింగ్ ఎయిడ్ తీసుకొచ్చ్చి, చెవిలో పెట్టేసి, టెస్ట్ చేసేసి, ఎలా వాడాలో చూపించారు. " అయ్యో బాగా ఖరీదైన వస్తువు .. నాకెందుకండీ" అన్నారు నాన్న. "అవన్నీ మర్చిపొండి , మీకు బాగా వినిపిస్తే మాకు అదే చాలు" అన్నారు డాక్టరు. "అలా కాదండీ" అంటున్న నాన్నతో "నేను, రాజు చూసుకుంటాం మీరు వర్రీ అవకండి, నాకు పేషంట్ అపాయింట్మెంట్ ఉంది వెళ్ళాలి" అని లేచారు డాక్టరు గారు, ఇంకో మాట మాట్లాడనీయకుండా. అతని సహాయానికి అందరం బోలెడు కృతజ్ఞతలు చెప్పుకున్నాము. అంతకు ముందే అనుకున్న విధంగా శ్యాము అతన్ని సాగనంపే వంకతో బయటి వరకు వెళ్లి, అతనికి ఇవ్వాల్సిన డబ్బు ముట్టచెప్పి వచ్చాడు. నాన్నకి బాగా ఇబ్బందిగా, మొహమాటంగా ఉంది.. ఆయనటు వెళ్ళగానే "దీనికి ఖర్చు ఎంత? ఆయనలా ఇచ్చేసి వెళ్లిపోయారు. నువ్వు అడగలేదు. అలా ఏం బాగుంటుంది" అంటూ షరా మామూలు మొదలెట్టారు. "అలా ఎంతా అని అడిగితే ఏం బాగుంటుంది నాన్న, రాజు గారు ఇస్తారులే ఏదో ఒక రూపంలో " అన్నాన్నేను కూల్ గా. "రాజు గారి దగ్గర తీసుకుంటే బాగుండదు మనమే ఇచ్చేద్దాం, వారి ఇల్లు తెలుసా నీకు, రేపు బ్యాంక్ నించి తెప్పిస్తా. శ్యాము, నువ్వు వెళ్ళి ఇచ్చేసి రండి" అన్నారు నాన్న. " అయ్యో మావయ్యగారూ, డాక్టరు గారు పెద్ద వాళ్లకి ఫ్రీగా చెవి మిషన్లు పంచుతున్నారుట ఈ మధ్య . ఖర్చు ఏమీ లేదు ఉత్తినే ఇటొస్తూ తెచ్చారుట అదే చెప్పారు, నేను బయటికి వెళ్ళినప్పుడు" అన్నాడు మా శ్యామడు తెలివిగా. "ఓహో అవునా? ఎంత మంచి మనసు" అని నాన్న మెచ్చుఁకున్నారు. మా చెల్లి నా చేయి గిల్లింది "ఇంకా ఏమేం అడుగుతారో శ్యామ్ ని పిలువు" అని.. "శ్యామా భోజనానికి రా" అని పిలిచా. డాక్టర్ గారి మంచితనం ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికే కాక, గుడి దగ్గర కూడా పాకింది. ఇండియా వస్తే నాకు ఒక చోట రెండు రోజులు వరుసగా కూడా ఉండడం కుదరదు. పుట్టింటి వైపు, మెట్టింటి వైపు, చుట్టాలలో పెద్దవారిని చూడడానికి ఆ ఊరు, ఈ ఊరు వెళ్లి వచ్చేటప్పటికి పది రోజుల సెలవు ఇట్టే అయిపోతుంది. అలా ఇంక తిరిగొచ్చే ముందు రోజు మళ్ళీ నాన్నని చూడడానికెళ్ళా. అప్పటికే చెవి మిషను వాడట్లేదని కంప్లెయింట్లు. "చెవిలో హోరుగా ఉంటోందమ్మా" అన్నారు నాన్న. నాకు జాలేసి "అలాగేలే నెమ్మదిగా రోజుకో గంట పెట్టుకుని అలవాటు చేసుకో" అన్నా. మరునాడు ప్రయాణం కాబట్టి పిల్లలకి కావలసిన వస్తువులేవో కొనాలని బయటకెళ్ళి వచ్చ్చేలోపు, సూర్య నారాయణ గారు వచ్చి ఉన్నారు. "అమ్మలూ వీరికి, శాంతమ్మ గారికీ చెవి వినపడదు, బాగా ఇబ్బంది పడుతున్నారు. డబ్బు కట్టే పరిస్థితి లేదు పాపం, డాక్టరు గారి దగ్గరికి తీసుకెళతావా" అన్నారు నాన్న. "డాక్టరు గారి దగ్గర అప్పాయింట్మెంట్ తీసుకోవాలి నాన్నా, ఆయన చాలా బిజీ కదా" అన్నాను. "అయ్యో, నీకు ఇంక టయిం కూడా లేదు కదా, మళ్ళీ డిసంబరులో పెళ్ళికి వస్తావుగా అప్పుడు తీసికెళతావుగా " అన్నారు నాన్న. “తప్పకుండా” అని చెప్పి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. నేను ఫ్లయిటు దిగిన మర్నాటి నించీ మొదలయ్యింది టార్చరు. చెవి మిషన్ పెట్టుకోమని వాళ్ళు పోరడం, ఆయన పెట్టుకోకపోవడం. “వద్దన్నా పెట్టుకోమంటున్నారు, నాకు ఇబ్బందిగా ఉంది” అని నాన్న, “ఇన్ని వేలు పెట్టిన వస్తువు వేస్ట్ అవుతోందని” బాధ పడుతూ వాళ్ళు, డాక్టరు గారు ఉచితంగా ఇచ్చారని నమ్మేసిన ఆయన, ఇన్ని వేలు ఖర్చయ్యాయని చెప్పేస్తే అయినా పెట్టుకుంటారేమో అని ఆశతో వాళ్ళు, ఆ విషయం తెలిస్తే, ఆడపిల్ల చేత అంత ఖర్చు పెట్టించినందుకు బెంగ పెట్టుకుంటారేమో అని నేను సతమతమయ్యాము. "నాకు పనీ పాటా లేక ఖర్చు చేశానని, ఆ కర్ణాభరణం డబ్బుతో నా చెవులకి అందమైన మకర కుందనాలు వచ్ఛేవని, కనీసం అవి చూసైనా సంతోషపడేవాళ్ళమనీ...అక్కలూ వదినలూ బాధ పడ్డారు. " అంత పెద్దగా ఆలోచించకండి, కనీసం ప్రయత్నం చేసాము కదా .. ప్రయత్నం చెయ్యకపోతే ..అయ్యో ప్రయత్నమైనా చెయ్యలేదే అని భవిష్యత్తులో బాధపడి ఉండేవాళ్ళం కదా" అన్నాన్నేను వాళ్ళని ఓదారుస్తూ. వినిపించలేదనే మాట అంటే చెవి మిషన్ పెట్టుకోమంటారని భయపడి నాన్న అసలు ఆ విషయమే తేవట్లేదని, రేడియో కూడా వినట్లేదని తెలిసి దుఖం తన్నుకొచ్చింది నాకు. నెమ్మదిగా అలవాటు చేసుకోమని చెప్పీ చెప్పీ అందరూ మరచిపోయారు ఆ విషయం గురించి. నాన్న చనిపోయాక నాన్న వస్తువులు ఎవరికో ఇచ్ఛేస్తూ "దీన్నేం చేద్దాం" అంది అక్క చెవి మిషన్ ఉన్న డబ్బాని చూపించి. " దాన్ని ఎలాగోలా, తన స్నేహితుల్లో వినబడని వారికి ఇచ్చేద్దామని ఉండేది మావయ్యగారికి. ఇంకెవరికైనా ఇస్తే పనికొస్తుందా? అని నన్ను అడిగారు. ఎవరి వినికిడి శక్తిని బట్టి వాళ్ళకే ఇస్తారని, అలా ఒకళ్ళవి ఒకళ్ళు వాడడం కుదరదనీ చెప్పాను, అది ఎవ్వరికీ పనికిరాదు వదినా పడెయ్యడమే" అన్నాడు శ్యాము బాధ పడుతూ. "తనకు చెవిలో అది పెట్టుకోగానే బాగా హోరు వస్తోందని చెపుతూ, ఇంకెవరికైనా ఇవ్వచ్చా అని నన్ను కూడా పదే పదే అడిగారు అటెండరు పిల్ల మేరీ సహాయంతో" అన్నాను నేను కూడా. డబ్బా తీసి చూస్తే అది ఖాళీగా ఉంది. "ఏమయిందో" అనుకుంటూ ఆ డాక్టరు గారి డ్రామా గురించి గుర్తు చేస్కున్నాము.. నాన్న చనిపోయారని తెలిసి, మమ్మల్ని చూడడానికి వచ్చిన మేరీ తల్లి, నాన్న గురించి ఏవేవో చెపుతూ పాట పాడినట్టు ఏడుపు అందుకుంది. "ఎంత మంచోడివయ్య మా రాజా మారాజా నీ రునమెట్ల దీస్కోవాలె మా రాజా మారాజా పిల్లలంటెంత పానం మా రాజా మారాజా నా మేరీ నీ బిడ్డాయే గద మా రాజా మారాజా" అని పాట పాడుతున్నట్టు ఏడుస్తూ ఇంకా ఏవో ఏకరువు పెడుతోంది. పదవ రోజు అయిపోయి, అప్పుడప్పుడే కాస్త కుదుట పడుతున్న అందరికీ వెక్కి వెక్కి ఏడుపొచ్చింది ఆమె పాట/ఏడుపులో తవ్వుతున్న జ్ఞాపకాలు విని. కాసేపు అలా ఏవేవో పాడి ఆమె అలసినట్టు కూచుండి పోయింది. "నువ్వు బాగున్నవా కమలమ్మా" అనడిగా కళ్ళు తుడుచుకుని మంచి నీళ్ళందిస్తూ. "బాగున్న బిడ్డా ,అప్పుడు ఇనరాకుండె, నాయిన ఇది ఇప్పించిండంట. ఇప్పుడు మంచిగినొస్తుంది" అంది చెవి తడుముకుని చూపిస్తూ. ఆ చెవిలో ఉన్న మిషన్ చూసి అందరం ఫక్కున నవ్వాము. “బాగ వినిపిస్తుందా అవ్వా” అనడిగాడు చిన్నన్నయ్య. “మంచిగ ఇనొస్తుందయ్యా” అంది కమలమ్మ చెవి లోంచి మిషను తీసి చూపిస్తూ. "ఇలా ఒకళ్ళ చెవి మిషన్ ఇంకొకళ్ళకి పని చేసినట్టు యెప్పుడూ వినలేదు కదా" అన్నాడు మా పెద్దన్నయ్య ఆశ్చర్యంగా. "అవును భలే వింతగా ఉంది" అన్నాడు శ్యాము నమ్మలేనట్టు. మేమందరం ఏదో అద్భుతం జరిగినట్టు సంబరపడ్డాము. "పోనీలే, డ్రామా డాక్టరు గారి డ్రామా పుణ్యమాని మా కమలమ్మకి చెవులినిపిస్తున్నాయి" అంది మా చెల్లి సరదాగా. అర్థం కానట్టు చూసింది కమలమ్మ. " నీకు చెవులినొస్తున్నయని అందరం ఖుష్ అయితున్నం" అంది మా అక్క. నిజంగానే మాకందరికీ ఏదో సంతృప్తి... నలుగురు కూచుని నవ్వేవేళల్లో, మిగిలిన విషయాలు గుర్తున్నా, లేకపోయినా... ఆ డ్రామా మాత్రం ఎవరు గ్రీన్ గా మమ్మల్ని అలరిస్తుంటుంది నాన్న జ్ఞాపకాలలో...

0 వ్యాఖ్యలు: