భూత యజ్ఞం
Wednesday, November 23, 2022
చిత్రం: తూలిక, కెనడా
"నైష్టిక హిందువులకు కొన్ని నిత్య కర్మలు విధించి ఉన్నాయి. ఒకటి భూత యజ్ఞం- అంటే అల్పపరిణత జీవరూపాలకు మేత పెట్టడం. సృష్టిలో అల్పమైన అపరిణత జీవుల పట్ల మనిషి తనకున్న బాధ్యతల్ని గ్రహించుకోవాలన్న దానికి ఇది ప్రతీక. రెండవది పితృ యజ్ఞం- అంటే పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం. మూడవది నృ యజ్ఞం-అంటే ఆగంతకులకు గానీ, బీదవాళ్లకు గానీ అన్నం పెట్టడం. మానవుల విషయంలో ఇప్పుడు తనకున్న బాధ్యతలకు, సమకాలికుల విషయంలో తనకున్న విధులకు అది చిహ్నం" ఒక యోగి ఆత్మ కథ 44 అధ్యాయం చదువుతున్నప్పుడు, ఇవన్నీ తెలియకుండానే ఉత్తమ కర్మలు ఆచరించిన నా ఊరి మనుషులు నాకు గుర్తొచ్చారు. ఊరకుక్కలు అయినప్పటికీ, వాటిని తమ పెంపుడు కుక్కలుగా భావించి, వాటి కోసం అన్నం ఎక్కువ వండిన ఇల్లాళ్ళు, పాలు దొరకని దరిద్రంలో కూడా తాము తాగాల్సిన పాలలో చిటికెడు పాలు పిల్లిపిల్లకి పోయాలని తాపత్రయ పడే చిన్నారులు, పెత్తరమాస అంటూ అప్పో సొప్పో చేసి, బ్రాహ్మణులని ఇంటికి పిలిచి, పొత్తర్లు ఇచ్చే సాదా సీదా జనాలు, తమ కన్నా తక్కువ అనుకున్నవారికి తమకి ఉన్న దాంట్లోనే కొంత సర్దే సామాన్యులు గుర్తొచ్చారు. కంటి చెమ్మ గుండెకి అంటేలా గుర్తొచ్చారు. ఇక పిచికల కోసం ధాన్యం కంకులు గుమ్మానికి వేలాడదీసే రైతు కుటుంబాలు, పావురాలకి మూడుపూటలా నూకలు విసిరే ముస్లిము సోదరులూ ఎలా మరపుకి వస్తారు అసలు ఎవరికైనా. అదే కదా జీవితమంటే అనిపిస్తుంది కదూ..
20 ఏళ్ళక్రితం ఇల్లు, ఊరు దాటేసినా ఆ జ్ఞాపకాలు ఇప్పుడు చూసినంత తాజాగా ఉంటాయి మరి.
కెనడాకి వచ్చిన కొత్తల్లో ఒక పాకీస్తానీ వాళ్ళ ఇంట్లో అద్దెకి ఉండేవాళ్ళం. వాళ్ళు ప్రతి పూటా ఇలాగే పక్షుల కోసం ధాన్యం జల్లుతుంటే, పిల్లలు కూడా సరదా పడుతూ చల్లుతూ ఉండేవారు ఇంటి వెనక పెరట్లో. కొంత కాలానికి ఒక గుజరాతీ సహ ఉద్యోగి కూడా భోజనాల సమయంలో మాట్లాడుతూ, తనకి ఏ దేశంలో ఉన్నా తండ్రికి పిడచపెట్టకుండా, పక్షులకి ధాన్యం వెయ్యకుండా ఒక్క రోజు కూడా తోచదని చెప్పగానే భలే మురుపు అనిపించింది. నన్ను ముట్టుకోకు నామాల కాకి అనే ఈ రోజుల్లో, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఇలాంటి వాళ్ళు మంచి పనులు ఎప్పటికీ ఆపకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించి గర్వపడేలా చేసిన మాట వాస్తవం. అప్పుడు బేస్మెంట్లో నించి ఇంటి వెనక పెరట్లోకి (పైన ఇంటి వాళ్ళు ముద్దుపడి పిల్లలని పిలిస్తే తప్ప) వెళ్ళడం కుదరదు కాబట్టిన్నీ, ఇంటి ఎదురుగా మెయిన్ రోడ్డు హడావిడి కాబట్టిన్నీ, మనకంటూ స్వంత ఇల్లు కొనగానే పక్షులకి ధాన్యం వేసే ఈ మంచి అలవాటు మనం కూడా చేసుకోవాలని పక్కా నిర్ణయం తీసుకున్నాము పిల్లలతో కలిసి. 8 ఏళ్ళవరకూ ఇల్లు కొనడం అవలేదు కాబట్టి, ఆ ఇంటినించి ఇంకో బేస్మెంట్ లోకి మారగానే మరపున పడిపోయింది ఆ విషయం.
ప్రతి ఆరు నెలలకో కొత్త ఉద్యోగం ఆ రోజుల్లో. రెండేళ్ళ తర్వాత నేను పని చేస్తున్న ఆఫీసులో ఆఫ్రికా పెద్దావిడ మరియా ఒకటే చిరుబురులాడుతూ కనిపించింది ఒకరోజు. పని చేస్తున్నంత సేపూ జోకులేసినా మొహం విప్పారలేదు. నెమ్మదిగా లంచ్ టైముదాకా వేచి, శాంతి కపోతం ఎగురవేసే ప్రయత్నం చేసాను. అబ్బే, మాటా ఉలుకూ లేదు. "ఏంటి సంగతి? పాప ఏడ్చిందా? వుడ్వార్డ్స్ గ్రైప్ వాటర్ పట్టకపోయావూ" అన్న రేంజ్ లో నేనూ పట్టువదలని విక్రమార్కిలా వెంటపడ్డాను. నా డిపార్టుమెంట్ లో ఎవరైనా అలా ఉంటే నాకు తోచదు మరి! ఎట్టకేలకు చిరాకు పడితూ, "భారతీయులంటే నాకు అసహ్యం పుడుతోంది" అంటూ ఢామ్మని పేలే మందుగుండు లాంటి మాట పేల్చింది. వామ్మో ఏమయిందిరా బాబూ అనుకుంటూ, బుజ్జగించి అడిగాను.. "వాట్ ఈస్ ద మ్యాటర్? నాకు ఇప్పుడే తెలియాలి" అని. ఆమె చెప్పిన విషయం విని, నెమ్మదిగా తింటున్న అన్నం మూత పెట్టేసి చెయ్యి కడిగేసుకున్నాను. మనసు బాధగా మూల్గింది. పాత కంపెనీలో గుజరాతీ సహోద్యోగి తులసీ కుమార్ గుర్తొచ్చాడు.
విషయం ఏమిటి అంటే, ఇక్కడ ఇళ్ళకి ఇంట్లోంచి చలువ, వేడి తాలూకు గాలి బయటికి వెళ్ళే ఎక్సాస్ట్ ఫ్యాన్ ఒకటి ఎప్పటికీ తిరుగుతూ ఉంటుంది. ఇంకెక్కడా స్థలం లేనట్టు పిట్టలన్నీ ఆ ఫ్యాన్ కింద గూడు పెట్టుకుంటాయి. ఇంటి ఓనర్లు గమనిస్తే, అనిమల్ కంట్రోల్ వాళ్ళని పిలిపించి, అవన్నీ జాగ్రత్తగా తీయిస్తారు. అవి కేవలం పిట్టపిల్లల క్షేమం కోసం అని కాదు, అవి ఇంటిలోపలి దాకా వెళ్ళాయంటే, ఇంటికి కూడా అనర్థమే. అలాగే ఉడతలు. అవికూడా ఇంటికి చిన్న చిల్లు కనిపించినా కాపురం పెట్టేస్తాయి. అలా ఆ రోజు ఉదయం ఫ్యాన్ తాకిడికి పిట్టపిల్లలన్నీ ముక్కలయ్యి కింద పడిపోయాయిట మరియా ఇంట్లో. పిట్టలు ఎందుకు వస్తున్నాయని ఆరా తీస్తే, ఇంటి చుట్టు పక్కల ఉన్న భారతీయులు పక్షులకోసం గింజలు, దాణా వేస్తున్నారని తెలిసి, ఆ కాలనీలో అలా వెయ్యవద్దని ఒక నోటిస్ జారీ చేసారుట. కొంత వరకూ ఫర్వాలేదు అనుకున్నారట కానీ, కొందరు భారతీయులు దొంగ చాటుగా అయినాసరే పక్షులకి గింజలు వెయ్యడం మానట్లేదుట. ఏమైనా అంటే, భూత యజ్ఞం చేస్తున్నామని, పక్షులకి పెట్టకపోతే వారు భోజనం చేసినా దుఖంగా ఉంటుందని చెప్పారుట. అదేం భూత దయ అని చెడా మడా తిట్టిపోసింది మరియా.
అదన్నమాట సంగతి. అప్పట్లో తులసీ కుమార్ " నాకు పక్షులంటే ఇష్టము. రోజూ గింజలేస్తాను. మా తండ్రిగారు పిట్టల రూపంలో వచ్చి తినడానికి ఒక అన్నం ముద్ద వెనక పెరట్లో గోడ మీద పెడతాను. కానీ ఇంటి దగ్గర కొందరు ఆఫ్రికన్లు ఉన్నారు. వాళ్ళకి నన్ను చూస్తే కడుపుమంట. గింజలు దొంగతనంగా వెయ్యాల్సి వస్తోంది అని చెప్పినప్పుడు " అదేం మాయ రోగం " అని నేను కూడా తిట్టినట్టు గుర్తొచ్చి, సిగ్గుపడ్డాను.
భూత యజ్ఞం చెయ్యచ్చు కానీ , వాటి ప్రాణ హాని కలిగేలాగానో, జనాల ఇళ్ళకి డ్యామేజ్ జరిగేలాగానో చెయ్యడం అవసరమా? ఈ దేశంలో ఉన్నప్పుడు, ఇక్కడి దేశ కాల పరిస్థితుల ప్రకారం ఇచ్చిన పద్ధతులు ఆర్డర్స్ పాటించాలి కదా అనిపించింది. మీరేమంటారు?
వ్యాఖ్యలు
జోరుగా హుషారుగా ..
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు:
Post a Comment