ఫారం

Tuesday, November 15, 2022

 



3 ఆగస్టు 2022

ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి, ఫైనల్ గా టికెట్లు కొనే ముందు  మాల్దీవ్స్ గవర్నమెంటుకి సంబంధించిన ఒక ఫారం నింపాలి. మన భాషా పరిజ్ఞానం మీద అంత నమ్మకం లేదు కాబట్టి ఉధ్ధండులైన ఇద్దరు కూచుని ఒక్కో ప్రశ్నా పైకి చదువుతూ, నాకు సంబంధించిన విషయాలు కూడా నన్ను అడగకుండా వాళ్ళే సమాధానాలు చెప్పుకుంటూ నింపుతున్నారు. వాళ్ళుండబట్టి సరిపోయింది కానీ మెయిడెన్ నేం అని ఉన్న చోట నా పనిమనిషి పేరు వీళ్ళకెందుకా అని ఆలోచించా నిజంగా.  ఆడవాళ్ళ పుట్టింటి పేరుకి విదేశాల్లో అంత ప్రాధాన్యత ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు నేను. 'ఎక్కడికక్కడే ఎంకటలక్ష్మి అన్నట్టు' పెళ్ళయ్యాక ఇంటిపేరు మార్చడం అనవసరమైన పని, సమయం వృధా అనుకుని వదిలేయడం వల్ల పెద్దగా ఆధారాలు అవీ పెట్టక్కరలేకుండానే సరిపోయింది. తరువాతి రెండు మూడు పేజీల్లో కుటుంబ, విద్యా సమాచారాలు ఇచ్చేసి నాలుగో పేజీలోకి వెళ్ళాక వచ్చిన ప్రశ్నకి అందరికీ తల తిరిగింది. 'నీకు మరణం సంభవిస్తే అక్కడే పూడ్చాలా? మీ దేశం పంపాలా' అన్నది ప్రశ్న. 'మంచి మాట పలుకు మల్లన్నా అంటే, ఐరేణి కుండ పర్రెబాసింది అన్నట్టు' ఇదేం ప్రశ్న అని ఇంటిల్లిపాదీ తల్లడిల్లిపోయారు. "ఏ దేశం వెళ్ళక్కరలేదు.." గంభీరంగా అన్నారు అత్తగారు.. "అయ్యొ అది ముందు జాగర్త అమ్మా. ఉతుత్తినే ఊతూతీ బ్యాంక్ లాగా" అని సర్ది చెప్పాక, ఇంకో రెండు ప్రశ్నల తరువాత ప్రశ్నగా "మీరు చనిపోతే ఇన్షురెన్స్ ఉందా? అది ఎవరికి చెల్లించాలి" అంటూ దాని వివరాలు అడిగారు.. అందరూ భోరుమని ఏడుపు మొదలెట్టారు. "ఛీ ఊర్కోండెహే" అని సీతయ్య గదమాయించడంతో కళ్ళల్లో నీళ్ళు కుక్కుకుంటూ అందరం నిష్క్రమించాము. 

ఇన్షురెన్స్ మీద మా ఇంట్లో వాళ్ళకెందుకో అంత దృష్టి పోదు. ఒక స్నేహితుడొచ్చి "ఇన్షురెన్స్ కట్టు అన్నా" అని అడిగితే "ఏమిటి ఇప్పుడే పోతాననుకున్నావా" అని జోక్స్ వేసుకోవడం కూడా పరిపాటి. 

                                                                           ***

విమానం దిగి అక్కడికి వెళ్ళగానే ఎయిర్పోర్ట్లో ఆంగ్లంలో కాకుండా వాళ్ళ భాషలో ఉన్న ఆరోగ్య పత్రాలు నింపడానికి ఒకతన్ని నియమించారు.  మనమక్కడ చనిపోతే ఏమేమి డొనేట్ చేస్తామో చెప్పమన్నాడతను. మాకు మరీ మిడి మిడి జ్ఞానమబ్బా..కొంచెం టైం ఇమ్మన్నాము. ఆ పేపర్ మా చేతికి ఇచ్చి "ఇవి ఇంగ్లిష్ లోనే ఉన్నాయి టిక్కులు పెట్టి తెండి, నేను రెస్ట్ రూం కి వెళ్ళి వస్తా" అన్నాడు.  ఇద్దరమూ ఒక పక్కకొచ్చి గుసగుసగా మాట్లాడుకున్నాము.  "ఎముకలు వద్దు అవి గంగలో కలపడానికి కావాలి కదా? స్కిన్ కూడా వద్దు.. స్కిన్ తీసేస్తే పిల్లలు చూసి తట్టుకోలేరు.. కళ్ళు ఫర్వాలేదు.. కిడ్నీలు, గుండె ఫర్వాలేదు" అని చాలా మేధావిత్వంతో గబగబా చెప్పాను. అసలెప్పుడూ చెల్లని నా మాట ఈ చావు కబుర్ల దగ్గరైనా చెల్లిందని నేను ఒకటే ఉత్సాహపడి అన్నిటికీ నాకు తోచినట్టు టిక్కులు పెట్టా. ఇవి తీసుకెళ్ళి కౌంటర్ లో ఇచ్చాక, మళ్ళీ హెల్త్ ఇన్షురెన్స్ పత్రాలు వచ్చాయి. ఈ సారి ప్రశ్నలు వేరు. "నేను పోతే మొత్తం మీరే తీసుకోండి ఇంకెవ్వరికీ అవసరం లేదు.. అర్థమయ్యిందా? అచ్చంగా  100% మీరే" బాగా త్యాగం చేస్తున్న లెవెల్ లో చెప్పా భరోసాగా. తన పేరు దగ్గరకి వచ్చేటప్పటికి "పిల్లలు ముఖ్యం వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ, వ్రాసెయ్యండి" అనేసా చులాగ్గా. పిల్లల పేర్లు వచ్చినప్పుడు మాత్రం దుఖం తన్నుకొచ్చింది. "ఓయ్ ఓయ్ పేపర్ల మీద నీళ్ళు పడుతున్నాయి. మళ్ళీ మొదటి నించీ నింపడం నా వల్ల కాదు" అని ఆయన అరుస్తుండగా బయటికి పరిగెత్తా కారిపోతున్న కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ. 

                                                                    ***

మొన్నెవరో చనిపోతే వారి అవయవాలు దానం చెయ్యవచ్చని డాక్టర్లు ప్రపోస్ చేసినప్పుడు, అతనికి ఆర్గాన్ డొనేషన్ కార్డ్ లేదని , ఇంటి వాళ్ళ అనుమతితో ఇవ్వవచ్చునని తెలుసుకున్నాము. అతని ఆర్గాన్స్ కెనడా ఆస్పత్రిలో ఇవ్వడానికి అతని పక్కన  ఉన్న అతని భార్య కాంతం ఒప్పుకున్నా, ఇంటి దగ్గర ఉన్న అతని తల్లి, తమ్ముళ్ళు ఒప్పుకోలేదు. అవన్నీ తీసేసిన దేహం వాళ్ళకి అక్కరలేదని తమ సోదరుణ్ణి ఉన్న పళంగా తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అతని సోదరులు. సినిమాలలో చూపించినట్టు తన భర్త కళ్ళ రూపంలోనో, కిడ్నీ రూపంలోనో, గుండె రూపంలోనో ఇంకొకళ్ళకి ప్రాణ దానం చేస్తాడని ఆశించిన కాంతం కూడా కుటుంబ సభ్యులకి భయపడి అవన్నీ వద్దు అని చెప్పేసింది డాక్టర్లకి.  ఆర్గాన్ల కోసం ఏళ్ళ తరబడి వేచి ఉన్న కొందరు దగ్గరి స్నేహితులు ఉన్నందువల్ల, అయ్యో అనిపించింది మాకు. పనిలో పనిగా వాళ్ళ ఇన్షురెన్స్ పేపర్లు సరిగా లేనందున జరిగిన కుటుంబ కలహాలు చూసాక అర్థమయ్యింది పై పత్రాలు ఎంత ముఖ్యమో. 

పై సంఘఠన జరిగాక తరువాత చూద్దాంలే అని కాలయాపన చేస్తున్న మాకు కనువిప్పు కలిగింది. అవయవ దానం కార్డ్ అప్పటికే ఉండడంతో, ఇన్షురెన్సు ఏజెంటుకి కబురుపెట్టాము ఆ రోజే. 

మీరు కూడా సెంటిమెంటు కి పోకుండా ఆర్గాన్ డొనేట్ చెయ్యడానికి అర్జీ పెట్టండి దయచేసి. మేము అనుకున్నట్టు చర్మం వలిచెయ్యడమో, కళ్ళు పీకెయ్యడమో ఉండదు. అవి తీసుకున్నట్టు ఎవరికీ తెలియను కూడా తెలియదు.🙏

0 వ్యాఖ్యలు: