కూలి పని

Tuesday, November 15, 2022


  

చిత్రం: తూలిక 

17 ఆగస్టు 2022

"మరి మీ అమ్మ వాళ్ళని ఒక్క సారి తెచ్చి, ఊరంతా తిప్పి చూపించరాదూ.." బోర్ కొడుతోందని అంటున్న గౌతం తో అన్నాను. "అంటే, పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు కదా పిన్నీ కుదిరితే పెళ్ళి చేసేసుకుని అందరినీ తీసుకొస్తే బాగుంటుంది" అన్నాడు. "అలా కాదమ్మా.. అమ్మా వాళ్ళకి నువ్వొక్కడివని కళ్ళల్లో పెట్టుకున్నారు. ఇక్కడికొచ్చి నాలుగేళ్ళయింది, నీకా పెళ్ళి కుదిరితే కానీ వెళ్ళాలని లేదు. ఉద్యోగం వచ్చి స్థిరపడ్డావు. మరి వాళ్ళని తెస్తే వాళ్ళ ఇల్లు అన్నట్టు సొంతంగా తిరుగుతారు కదా. అమ్మ ఎంత కలవరిస్తోంది" అన్నాను. 'ఇదే విషయం మా ఓనరు ఆంటీ కూడా డిస్కస్ చేసారు పిన్నీ, ఇప్పుడు తేవడం అనవసరమైన ఖర్చు, ఇంకా కొద్దిగా సెటిల్ అయ్యాక తేవడం బెటర్ అన్నారు" అన్నాడు. నాకు ఒక నిమిషం ఆవిడెవరో చూడాలనిపించింది. "అవుననుకో కానీ పెళ్ళయ్యాక నీకు ఆఫీసు, ఇల్లు, కాక ఆ అమ్మాయితో గడిపే సమయం అవసరం కదా? అప్పుడు అమ్మా వాళ్ళని తిప్పడానికి అంతగా సమయం ఉండదు" అన్నాను. "అలా కాదు పిన్నీ అమ్మా నాన్న ఉంటే మాకు కాస్త ఇంటి పనుల నించి వెసులుబాటు కదా మేము ఫ్రీ గా ఉండచ్చు" అన్నాడు. నాకు సాధారణంగా తక్కువగా ఉండే రక్తపోటు తారస్థాయికి చేరింది. వాళ్ళు మాకు దూరపు  చుట్టాలు కాబట్టి వాళ్ళ తలితండ్రుల గురించి బాగా తెలుసు నాకు. వాళ్ళకి చుట్ట పక్కాలు అక్కరలేదు, గుడిగోపురాలక్కరలేదు, సినిమా షికార్లు అక్కరలేదు..ఈ పిల్లాడొక్కడే..వీడు ఆ అంటే ఆ.. ఊ అంటే ఊ అన్నమాట. నేను ఇంక మాట్లాడకుండా అన్నం వడ్డించా మౌనంగా. 

మర్నాడు లంచి సమయంలో  కొలీగ్ ముఖర్జీ కబుర్లు చెప్తూ "మా పారుల్ స్నేహితురాలు కమలిని తెలుసు కదా మీకు? వాళ్ళ ఇంటికి వెళ్ళాము రాత్రి, వాళ్ళమ్మ గారు వచ్చి ఆరు నెలలు కావొస్తోంది. వెళ్ళిపోయే ముందు ఒక సారి చూసొచ్చాము" అన్నాడు. "ఓహో బాగున్నారా ఆవిడ? ఆ మధ్య ఆరోగ్యం బాలేదన్నారు కదూ" అన్నాను. "ఏమి బాగులే తల్లీ.. ఆవిడ ఒక్క నిమిషం కూచుంటే ఒట్టు, కమలి మంచి నీళ్ళు కూడా తెచ్చుకోదు. అన్నీ ఆవిడనే అందించమని అడుగుతుంది. ఎంత సిజేరియన్ అయితే  మాత్రం ఇంత చేటా? పారుల్ కి నాకు చచ్చే సిగ్గేస్తుంది వాళ్ళింటికి వెళ్ళాలంటే, ఎవరు వెళ్ళినా, పని ఆవిడకే, ఆవిడ వెళ్ళిపోతే తనకి కష్టమని, ఎక్ష్టెండ్ చేద్దామని కమలి ప్రయత్నిస్తోంది" అన్నాడు. "అయ్యో.. ఆవిడకి ఇంకెవరూ లేరు కదా మళ్ళీ వస్తారా" అనడిగాను. "రాదుట. పూర్తిగా అలిసిపోయానని చెప్తూనే ఉంది, తల్లిని అలా ట్రీట్ చెయ్యడం చూస్తే మా ఇద్దరికీ తెగ చిరాకు, కానీ కొలీగ్ కదా ఏమనగలము" అన్నాడు ముఖర్జీ. గౌతం సంభాషణ చెప్పాను. హరే రామా అని తల కొట్టుకున్నాడు. ముఖర్జీది, అతని భార్య పారుది కూడా చాలా మెత్తని మనసులు. అతని తల్లి ఉన్నప్పుడు పారుల్ ఒక్క పని కూడా చెప్పకుండా చూసుకుంటుంది. ఆవిడని ఇక్కడే ఉంచేసుకుని జాగర్తగా చూసుకోవాలని వాళ్ళిద్దరూ అనుకుంటారు కానీ,  వాళ్ళ అమ్మకి ముఖర్జీ 11వ సంతానం. పెద్ద అన్నగారు తల్లిని అలా వదలడానికి ఒప్పుకోడు. ఎప్పుడో ఒకసారి బాగా బతిమాలితే పంపిస్తాడు "అమ్మ అన్ని గంటలు ఫ్లైట్ లో ఎలా కూచుంటుంది? ఆలోచించవా " అని కోప్పడుతూ. "మాకు అమ్మని ఉంచుకునే అదృష్టం లేదు. పారుల్ వాళ్ళమ్మ మంచం మీదే కదా? ఆవిడని ఎంత ప్రయత్నించినా తేవడం కుదరలేదు. తను పాపం ఏడుస్తూ ఉంటుంది" అన్నాడు ముఖర్జీ. 

"మీలా అలోచించేవాళ్ళు కోటికొకరు ఉంటారు భయ్యా. ఈ మధ్య ఎవరైనా పేరెంట్స్ ని తెచ్చారంటే అమ్మాయిలయితే వాళ్ళు కడుపుతో ఉండడం వల్ల, అబ్బాయిలు అయితే తన భార్య కానుపు సమయం వల్ల. పెళ్ళి కాక ముందో పిల్లలు పుట్టే ముందో అమ్మ నాన్నలని తీసుకొచ్చే వాళ్ళని వేళ్ళ మీద లెక్కించవచ్చు కదా" అన్నాన్నేను. "అలా తెచ్చేవాళ్ళంటే నాకెంత గౌరవమో.. కానీ అలా పిలిచి అభినందిద్దామంటే ఒక్కరూ దొరకట్లేదు. మొన్న కమ్మ్యూనిటీ గ్రూప్ పిక్నిక్ కి పిల్లల పురుళ్ళ కోసం ఇక్కడికి వచ్చిన తలితండ్రులు చాలా మంది వచ్చారు. అందరూ ఒకచోట కూచుని మాట్లాడుకుంటున్నారు. ఒక్కరూ మళ్ళీ రావాలని ఉద్వేగత కనబరచలేదని చూసి చాలా బాధ అనిపించింది" అన్నాను. "అవును తెలుసా.. కొందరు అమ్మా నాన్న వచ్చిన ఆరు నెలల్లోనే ఎంతో కొంత సంపాదిస్తే మంచిదని పక్కింటి పిల్లలని బేబీ సిట్టింగ్ పెట్టడమూ, కొన్ని డెలికసీస్ వండించి అమ్మడం చేస్తున్నారు, కడుపు మండిపోతోంది. మా బెంగాలీలలో మరీ" అన్నాడు. " ఏమో ముఖర్జీ, అందరూ అలా కాదులే.. చక్కగా చూసుకునే వారు లేకపోలేదు కానీ దురదృష్టవశాత్తూ, మనకి దొరికిన గుప్పెడూ అలా కనబడ్డారు ఖర్మ, ఏం చెయ్యలేము" అన్నాను కొద్ది తేలిక పరుస్తూ.  

"ఇన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ పెడుతున్నారు కదా, స్టూడెంత్స్  స్టూడెంత్స్ గా ఉన్నప్పుడే పేరెంట్స్ ని తీసుకొచ్చి, బాగా చూసుకుని అన్నీ తిప్పి చూపిస్తే, వాళ్ళకి ట్యాక్స్ డిడక్షన్ ఇస్తే బాగుంటుంది కదూ" అన్నాడు. "అవును ప్రయత్నిద్దామా" అన్నాను మాటలు ఉచితమే కదా మాట్లాడేవి కొంచెం ఘనంగా మాట్లాడితే తప్పేముందనుకుంటూ.

0 వ్యాఖ్యలు: