సంసారం గుట్టు.....

Wednesday, November 23, 2022

నేను ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా చుట్టాలో, స్నేహితులో ఎవరో ఒకరుంటారు... నాన్న పెద్దవారవడంతో ఇంటి ముందు నించి వెళ్ళే వాళ్ళందరూ ఒక సారి చూసి పలకరించి పోతుంటారు. వాళ్ళని పలకరించమని మా అక్క ఫోన్ ఇస్తూ ఉంటుంది. అటు అత్తయ్య కి ఫోన్ చేసినప్పుడు కూడా అంతే. ఇంటికి దూరంగా ఉండడం వల్లనేమో నాకు అలా అందరితో ఒక 5 నిముషాలు మాట్లాడే అవకాశం వచ్చినందుకు భలే ఇష్టం గా ఉంటుంది. అయితే గతం లో ఎవరినైనా బాగున్నారా అన్నప్పుడు బాగున్నాం అని చెప్పి ఎదో కష్టాలు సుఖాలూ చెప్పేవారు. ఈ మధ్య అందరూ ఒకే మాట సూపర్.. చాలా హ్యాప్పీ... ఇదేంటబ్బా అనుకున్నా.. అందరూ బాగుంటే అంతకన్నా ఏం కావాలి కానీ ఏదో తెచ్చిపెట్టుకున్నట్టుంటోంది.. విషయం ఏంటంటే ఈ మధ్య మా ఊరి పంతులు గారు చెప్పారుట ఎవరైనా మీరు ఎలా ఉన్నారు అన్నప్పుడు చాలా బాగున్నామని చెప్పాలి అప్పుడే మీకు పాసిటివ్ వయిబ్రేషన్స్ వస్తాయని.. అప్పటి నించీ అనుకుంటా "సూపర్, హ్యాప్పీ" తప్ప ఇంకేమీ లేదు. ఎవరితో మాట్లాడినా ఇదే జవాబు ఆశిస్తుంటా అదే వస్తుంటది.. రెండే ముక్కలు ఖేల్ ఖతం.. మా చుట్టాలొకావిడ ఉంటుంది.. ఆమెకి ఎవరు కలిసినా, ఆవిడ బీపీ గురిచి గంటలు గంటలు చెపుతూ ఉండేదిట ... ఈ మధ్యన బీపీ అన్నది సాధారణం అవ్వడమే కాకుండా అదున్న వాళ్ళకి శుగరూ గట్రా ఒక ప్యాకేజీ లా వచ్చేస్తున్నాయి కానీ అదృష్ట వశాత్తూ ఆవిడకవేమీ లేవుట .. కానీ ఆ ఉన్న దాన్నే చెప్పీ చెప్పీ చెప్పీ చెప్పీ ఆవిడనందరూ బీపీ సరూపమ్మ అని పిలుస్తుంటారుట. .. ఒకసారి దారిలో కలిసినప్పుడు ఎక్కడకెళుతున్నారందిట. ఎవరికో ఒంట్లో బాగాలేదని ఆస్పత్రికెళుతున్నామని చెప్పారుట మావాళ్ళూ.. అవునా నాకూ ఈ మధ్య బాగోట్లేదు.. అని మొదలెట్టి ఇంకోళ్ళని నోరెత్తనీయకుండా గంటన్నర నిలుచున్న చోట నించి కదలనీయకుండా మేము వెళ్ళాలి లేట్ అవుతోందన్నా వినకుండా చెపుతూనే ఉందిట . గూగులమ్మ లేని కాలంలో ఆవిడతో మాట్లాడితే చాలు బీపీ పుట్టుపూర్వోత్తరాలతో పాటు ఏ ఏ మందులు వాడాలో కూడా తెలిసిపొయ్యేది అని చెప్పింది మా చెల్లి. ఏమన్నా అంటే 'సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు.. నేనేమీ సంసారాన్ని బయట పెట్టట్లేదుగా' అని బుకాయిస్తుందిట... భలే ఇంటరెస్టింగ్ అనిపించింది నాకు. ఈవిడ మా చుట్టలబ్బాయి భార్య. నాకు పెళ్ళయ్యాక వాళ్ళ పెళ్ళయ్యింది, అందుకే నాకు ఆవిడని కలిసే సదవకాశం రాలేదు.. నేనెళ్ళినప్పుడు దూరంగా ఆవిడ కనబడిందని మా వాళ్ళు కొంచెం దూరమైనా సరే ఇంకో అడ్డదారిలో వెళదామంటారు.. అలా క్లోస్ గా ఉండేవాళ్ళు అరుదయిపోయారు కాబట్టి, ఇక్కడ అంతలా మాట్లాడే వాళ్ళు ఉండరు కాబట్టీ నాకు అయ్యో అనిపించింది..'పాపం లేవే! ఏదో మనం కాబట్టి చెప్పుకుంటుందంటాను' నేను.. 'నీకు తెలియదు లే! నడువు' అని రెక్క పట్టుకుని లాక్కు పోతారు. ఆ మధ్య మా పెదన్నన్న గారు చనిపోయారని తెలిసి అందరమూ ఆదరా బాదరా పరిగెత్తుతున్నాము. బీపీ సరూపమ్మ కనిపించి 'ఏమయ్యింది' అనడిగింది. పెదన్నన్న చనిపోయారని చెప్పాము.. 'అయ్యో అట్లనా..నేను వచ్చేదాన్ని కానీ రాలేకపోతున్నా' అంది.. ఫర్వాలేదు అనేలోపు ఆవిడ బీపీ తో సహా వాళ్ళ బుడ్డోడికి 4 రోజులుగా వచ్చిన జ్వరం గురించీ, ఏ ఏ మాత్రలు వాడిందీ ఏ ఏ డాక్టర్లకి చూపించిందీ.. ఆ డాక్టర్ల వైనం గురించీ అరగంట చెప్పింది.. 'పాపం బుడ్డోడి గురించి ఎంత మధన పడుతోందో ఆ తల్లి' అన్నాన్నేను.. మా చెల్లి చిరాగ్గా చూసి 'అవును గానీ సరూపొదినా బుడ్డోడేడీ' అనడిగింది.. 'ఇంట్లో ఉన్నాడు ఇక్కడెవరికో బాగాలేకపోతే మధ్యాహ్నం చూడ్డానికెళ్ళా కబుర్లలో పడి లేటయ్యింది' అని ఆ కబుర్ల చిట్టా చెప్పబోయింది.. 'అయ్యో అవునా బుడ్డోడు ఏడుస్తుండుంటాడు పోయి చూసుకో పాపం నీకెన్ని కష్టాలో' అని ఇంక ఒక్క నిముషం కూడా ఆగకుండా లాక్కు పొయ్యింది మా చెల్లెలు.. 'మాట్లాడుతుంటే లాక్కొస్తావెంటే నీ కసలు మర్యాద లేదు' అన్నాన్నేను.. 'నీ మొహం లే పద' అంది.. 'నాన్న చూసి ఉంటే ఎంత బాధ పడి ఉంటారో నీ కరుకు మాటలకన్నా.. 'ఇటువంటి వాళ్ళతో అలానే ఉండాలి పద పద' అంది... చెప్పడం మరచిపోయా మేము ఇంటికెళ్ళింది మా మారిది గారి పెళ్ళని. అందరినీ కలిసినట్టుంటుందని పెళ్ళిపిలుపుల పని మాకిచ్చారు అత్తయ్య. దానిలో భాగం గా బీపీ గారింటికెళ్ళాము. ఒక రబ్బరు బొమ్మ లాంటి చిన్నారి ఇంట్లో ఆడుకుంటోంది.. సుతారంగా పాపని తాకుతూ 'ఎవరొదినా' అని అడిగా.. పక్కింట్లో జెయినులో ఎవరో అద్దెకి వచ్చారుట. 'ఆ పిల్ల అంటే మీ అన్నకి ప్రాణం రోజంతా ఇక్కడే ఆడుకుంటుంది' అంది. 'బావగారేరక్క' అని అడిగాడు మా సీతయ్య.. 'ఆయనకి ఒంట్లో బాగలేదు ఏదో మూలికల వైద్యుడి దగ్గరకెళ్ళాడ'ని చెప్పింది..అయ్యో ఏమయ్యింది అని మా సీతయ్య అనేలోపు పెళ్ళి పిల్ల ఊరూ పేరు వివరాలడిగి, నేను ఏమీ చెప్పకముందే వాళ్ళ చెల్లి కూతురి పెళ్ళి అనుకోవడం, పూల పండ్లు అయ్యాక అది కాన్సిల్ అవడం దాని కారణాలు వగైరా చెప్పుకుంటూ పొయ్యింది.. మేము వెళ్ళలేక ఉండలేక చిక్కుకుని.. మాటి మాటికీ గడియారం చూసుకుంటూ ఇబ్బందిగా నిలబడ్డాము, ఆవిడ ప్రవాహం పోతూనే ఉంది.. ఏ మాటకామాట ..మా చెల్లి ఆరోజు అన్న మాట కి అర్థం ఈ రోజు వెలిగింది నాకు . ఇంతలోకీ భాస్కరన్నొచ్చాడు..హమ్మయ్య అనుకున్నా.. 'అన్నా నీకు ఒంట్లో బాగాలేదంట కదా' అన్నా బీపీ గారి మాట కట్ చేస్తూ.. 'అంత చెప్పుకునే విషయం కాదులేమ్మా ఏదో చిన్నది' అన్నాడు.. ఆయనట్లానే అంటాడు అంటూ అందుకోబోయింది బీపీ.. భాస్కరన్న నవ్వుతూ ' చాయ్ పానీ ఇచ్చావా, ఆడబిడ్డని అట్లనే పంపుతున్నవా?' అంటూ అక్కడున్న పాపాయిని ఎత్తుకుని ఎగరేసి ముద్దు పెట్టుకుని జేబులోంచి చాక్లెట్ తీసిచ్చాడు. ....సరూపొదిన అయ్యో అసలు ఆలోచనే రాలేదని వంటింట్లోకి వెళ్ళబోయింది.. అమ్మో అవన్నీ అయితే ఆలస్యమవుతుంది మళ్ళీ వస్తామని అదను చూసి జారుకున్నాం.. ఇది జరిగొక రెండేళ్ళయింది..మేము ఈ రెండేళ్ళు ఇంటి మొహం చూడలేదు. ఇదిగో మళ్ళీ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి. మామూలుగా కలవని వాళ్ళని పిలుపుల వంకతో కలిసే సందర్భం . మళ్ళీ వెళ్ళాల్సొచ్చింది బీపీ గారింటికి...ఈ సారి దృశ్యం లో కొద్ది తేడా.. పోయిన సారి చూసిన పక్కింటి వాళ్ళ చిన్ని పాపాయి (కొద్దిగా పెద్దదయింది.. మూడేళ్ళు ఉంటాయి..) ఇంట్లోకి రావాలని ప్రయత్నం చేస్తోంది, భాస్కరన్న ఆ పిల్లని కళ్ళెర్రజేసి చూస్తూ వేలితో మీ ఇంటికి పో అన్నట్టు బెదిరిస్తున్నాడు.. మమ్మల్ని చూసి కొద్దిగా ఖంగుతిని రండి రండి అంటూ లోపలికి దారి తీసాడు. ఆ చిన్నిది మా వెంట సంతోషం గా లోపలికొచ్చేసింది.. భాస్కరన్నకి నచ్చలేదు.. తన వైపు గుర్రుగా చూసాడు.. నాకు కొద్ది వింతగా అనిపించింది. చిన్నప్పుడు భాస్కరన్నా వాళ్ళు మా ఇంటి పక్కన ఉండే వారు. అన్న కి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం మమ్మల్ని కూడా ఎత్తుకుని ముద్దు చెయ్యడం, తినడానికేమైనా తీసుకొచ్చి పెట్టడం,,సైకిలు మీద తిప్పడం , అవీ ఇవీ కొనివ్వడం చేసేవాడు.. చాలా తక్కువగా మాట్లాడతాడు కానీ పిల్లలంటే చాలా ప్రేమ .. అలా అలవాటైన అన్నని ఇలా చూడటం వింతగా ఉంది.. 'చూశ్నవా ఆ పిల్లనెట్ల బెదిరిస్తుండో పాపం చిన్న పిల్ల' అన్నది వదిన.. ..ఏమనాలో తెలియనట్లు చూసాను.. శుభలేఖ ఇవ్వబోతూ బొట్టు పెట్టాను.. ఆ లోపు అందుకుంది..'మొన్నటి దాంక ఆ పిల్లని సంకనేసుకుని తిరిగిండు.. దానికేమి తెలుసు అదే లెక్క ముద్దు చేస్తడనుకుంటుంది..పొమ్మన్నా సమజ్ చేస్కుంటల్లేదు..ఇల్లు అమ్మి పోదామంటడు.. ఎట్ల చెప్పాల్నో తెలుస్తల్లేదు.. నువ్వన్న చెప్పు మీ అన్నకి' అంది.. నాకు తప్పలేదు 'ఏమయ్యిందన్నా అన'డిగా. ఏంలేదమ్మా అన్నాడు భాస్కరన్న రండి బావగారు కూచుందాం అంటూ... భాస్కరన్న, సీతయ్య మాటల్లో పడడం చూసి బీపీ వదిన అందుకుంది.. పక్కన ఉన్నవాళ్ళు ఏదో గురువుని నమ్ముతారుట. అప్పుడప్పుడు గురువు గారొచ్చినప్పుడు వీళ్ళని భజనలకి పిలుస్తారుట .వదినకి వాళ్ళ భాష రాకపోవడం వల్లనున్నూ, ఆవిడకి భజన అయినంతసేపు మాట్లాడకుండా ఉండటం కుదరదు కావునన్నూ ప్రార్థన టయింలో వెళ్ళదుట. భజనలవీ అయ్యాక ప్రసాదం తీసుకుని వస్తుందిట.. . అయినా ఫర్వాలేదంటారుట వాళ్ళు . అలాగే వదినగారింట్లో పూజలు పునస్కారాలకి వాళ్ళొస్తారుట. అన్నయ్య కి దేవుళ్ళూ పూజలంటే గిట్టదు గానీ వాళ్ళింట్లో ఇలా హడావిడి జరిగినా , వాళ్ళెక్కడికైనా వెళ్ళినా పాప బాధ్యత తీసుకుని సహాయం చేస్తాడుట .. బుడ్డోడితో సమానం గా చూస్తాడుట పాపని .. ఆ పక్కింటావిడ వదినతో క్లోస్ అయిపోయి ఈవిడ మాటల వల్ల వాళ్ళ పుట్టింటి వాళ్ళు దగ్గర లేని లోటును తీర్చుకుంటొన్దిట.. అలా అలా ఆరునెల్ల సావాసం చేస్తే వారు వీరయినట్టు రెండేళ్ళల్లో వారువీరయ్యారుట.. ఛీ, అసలు మీరు నా స్నేహితులేనా అంట!!??? బీపీ సరూపొదిన మాట్లాడటం తగ్గించేసిందనుకున్నారు కదూ ...కికికి.. తప్పులో కాలేసారు.. సూర్యుడు ఇటు బదులు అటు ఉదయిస్తాడేమో కానీ బీపీ ముచ్చట్ల విషయం లో యమ ధర్మ రాజులా సరూపొదిన డవిలాగ్ ..."ఏదన్నా అడుగు ఆ ఒక్కటీ దక్క"!!!!!! వదినమ్మ ఆ స్నేహ గాఢత ని వర్ణిస్తుందే తప్ప అసలు విషయం లోకి రాదని నిర్ధారించుకుని పోయొస్తామొదినా చాలా మందిని పిలవాలి అనేసా.. అయ్యొ మరింతకీ సమస్యేంటో తెలుసుకోవా అంది చాయ్ పానీ అంటున్న అన్న మాటలకడ్డం పడుతూ.. గబ గబా చెప్పు అత్తమ్మకి కోపమొస్తుంది లేట్ అయితే అన్నా.. ఇలా రా అని లోపలికి తీసుకెళ్ళింది.. 'మీరు పోయిన సారి వచ్చినప్పుడు మీ అన్నకి బాగలేదని చెట్ల మందుకోసమెళ్ళాడు గుర్తుందా అంది లో గుంతుకతో .. ఆ ఉంది అన్నా నేను గుస గుసగా.. ఆయన చెప్పడు కానీ పయిల్సో ఏదో అంటరు కదా అదొచ్చింది..దానికి తోడు దగ్గు దమ్ము ఉన్నయి చిన్నప్పటి నించీ నీకు తెలుసు కదా అది బాగా ముదిరింది' అంది. 'అవును అన్నయ్య బాగా ఆయాసపడుతున్నాడు అడిగితే నొచ్చుకుంటాడని అడగలేదు.., చిన్నప్పటి నించీ అంతే ఎంత నెప్పి ఉన్నా అసలేమీ బయటికి చెప్పడు' అన్నా గబ గబా నన్ను చెప్పనియ్యదని ఖంగారు పడుతూ.. ఆ అవునవును.. 'ఆయ నెవరికీ చెప్పడు నన్ను చెప్పొద్దంటడు. చెట్ల మందు తీసుకున్నాడు. దాని వల్ల కొద్ది గా కూడా తగ్గలేదు.. అదే బాధగా ఉంది' అంది.. అయ్యొ అన్నా ఏమీ చేయలేము కదా అని బాధ పడుతూ.. ఆవిడ మాటల్లో వినదానికి మీకూ టైపడానికి నాకూ తీరదు కానీ టూకీగా చెప్తా.. పక్కింట్లో మొన్న పూజయ్యిందిట.. వాళ్ళు అన్నని తీసుకురా అని బాగా బలవంత పెట్టారుట.. పక్కింటాయనొచ్చి మరీ మరీ మీరు ఈ సారి తప్పక రావాలి సార్ అందరిలోకీ పెద్ద గురువుగారొస్తున్నారని పిలిచి వెళ్ళారుట. వెళ్ళకపోతే ఏంబాగుంటుందని భాస్కరన్నని తీసుకెళ్ళిందిట. అక్కడికి ఆ రోజు కాలనీ కాలనీ మొత్తం కదిలి వచ్చిందిట. పూజ అయ్యాక ఒక్కొక్కరూ వచ్చి స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవచ్చని చెప్పారుట. పక్కింటావిడ అంత మందిలోను మొట్టమొదట అన్నా వదినలకి ప్రిఫరెన్స్ ఇచ్చి గుంపులో ఉన్న వదినని చేయిపట్టుకుని తీసుకెళ్ళిందిట. వదిన భాస్కరన్నని రమ్మనగానే ఇద్దరూ కలిసి స్వామీజీ ఆశీర్వాదం కోసం ఆయన పాదాలు తాకారుట . పక్కింటావిడ స్వామీజీతో 'స్వామీ ఇందాక చెప్పాను కదా వీళ్ళే ఆశీర్వదించండి' అందిట. స్వామీ జీ కళ్ళు మూసుకుని..' దైవమా ఈ భక్తుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇతనికి మనశ్శాంతి లేదు .ఇతను దగ్గు దమ్ముతో బాధ పడుతున్నాడు ఇతని భార్యకి బీపీ ఉంది.. అవన్నీ కాక ఇతనికి అతి దారుణమైన బాధ పయిల్స్ వ్యాధి.. అన్నీ భరించినా ఇది భరించడం కష్టం. ఋణాలతో బాధ పడుతున్నాడు. ఉద్యోగం పోతుందని భయపడుతున్నాడు. దయ ఉంచి ఈ కష్టాల్లోంచి ఇతన్ని కాపాడు, దంపతుల మధ్య సయోధ్య కుదుర్చు. ' అని ప్రార్థించి విభూతి ఇచ్చాడుట... ఆ రోజు నించీ వదినమ్మ బీపీ పోయిందిట కానీ అటునించి ప్రయాణం చేసి అన్నయ్యకొచ్చిందిట.. పక్క వాళ్ళతో మాట్లాడితే చంపేస్తా అని అరుస్తాడుట.. నేను ఇన్నేళ్ళుగా దాచుకున్న పరువు గంగపాలయ్యింది అంటాడుట.. బయటకెళ్ళడానికి సిగ్గుగా ఉంది అంటాడుట.. కాలనీ లో అందరూ తనని వింతగా చూస్తున్నట్టుంది అంటాడుట. ఇల్లు అమ్మేసి పోదామంటాడుట. అసలు ఇంట్లోంచి బయటికి రావట్లేదుట. ఆఫీసుకి కూడా పోవట్లేదుట. విసుగు కసుగుట . ఈ పిల్ల కనిపించిందంటే బీపీ మరీ పెరిగిపోతోందిట.. ఇదండీ.. ఇది విన్నాక ఎవరయినా బాగున్నారా అని అడిగితే సూపర్, హ్యాప్పీ అనడమే బెటర్ అని నాకనిపించింది.. మరి నాకు ఇంకా పిలవాల్సిన ఇళ్ళు చాలా ఉన్నాయి.. కాస్త మా బీపీ అన్నతో మాట్లాడి పెట్టరూ.. ప్లీస్...

0 వ్యాఖ్యలు: