చిత్రం: తూలిక, కెనడా
9 నవంబరు, 2022
మా ఇల్లు రెండు గదులు. అందులోనే వచ్చేవాళ్ళూ పోయేవాళ్ళు! ఇంటి బయట అరుగు.. వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకీ చాయ్ పానీకి అది నెలవు. పదవ తరగతి పరీక్షలైనా, డిగ్రీ పరీక్షలైనా చదువుకోవడానికి కాసింత ప్రశాంతమైన స్థలం దొరికేది కాదు. పార్వతి వాళ్ళ పోర్టికో పైన ఉన్న మూడు మెట్ల మీద పాకిన మల్లె పందిరి కింద కాసేపు చదువుకోగలిగినా, ఎందుకో ఎక్కువ సేపు కూచోటం అయ్యేది కాదు. నా స్నేహితురాలు మేఘమాల మా ఇంటికి రారాదే అనేది. వాళ్ళిల్లు మా ఇంటికి మూడు కిలోమీటర్ల దూరం. పొద్దున్నే అన్నం తిని వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. తను అన్నం తినేసి రెడీగా ఉండేది. అక్కడి నించి ఇంకో మైలు దూరంలో పూర్తి నిర్జనమైన ప్రదేశంలో వాళ్ళకి పొలాలు ఉన్నాయి. అందులో మోటబావి. ఊరి చివర అది. మనుషుల రాకపోకలు బాగా తక్కువే. ఆ పొలాల్లోకి పోయి చదువుకునేవాళ్ళం. ఆకలా దాహమా.. అవేం రోజులో మరి. మరీ ఆకలేస్తే, వాళ్ళ పొలంలో ఉన్న కొన్ని దోర దోర టమాటాలు కోసుకుని తినేసి, ఆ మోటబావిలోకి దిగి నీళ్ళు తాగేవాళ్ళం. భయమా బుగులా బాయిల బడితే లోతా ఈత పల్లి సాటా తుర్కపల్లి గేటా అన్నట్టుండేది.
ఈ రోజు ఆ విషయం తలచుకుంటే, అలా ఎలా వెళ్ళేవాళ్ళమా అని అనిపిస్తుంది. అక్కడ పిలిస్తే పలికే వాళ్ళు కూడా ఉండడం కష్టమే. మా అమ్మా నాన్నలకి కానీ, మేఘ వాళ్ళ అమ్మ నాన్నలకి కానీ పెద్దగా చదువులు లేవు. లోక జ్ఞానమూ తెలిసిన వాళ్ళు కాదు. అక్కడ చదువుకోవడానికి వెళుతున్నామని చెపితే, కాదనేవారు కూడా కాదు. వాళ్ళకి మా మీద నమ్మకం, మాకు మా మీద ధైర్యం అనుకుంటా.
అప్పట్లో మా ఊరికి ఒకటే బస్సు, రెండు గంటలకి ఒక సారి వచ్చేది. ఆఖరి బస్సు 7 గంటలకి. అది దాటితే, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్వాలు మెయిన్ రోడ్డు మీద దిగి, నిర్జన ప్రాంతం నించి నడవాలి. ఒక సారి పీ జీ లో ఉండగా, ఒస్మానియా యూనివర్సిటీలో దొరకని పుస్తకం ఒకటి కాకతీయ విశ్వవిద్యాలయంలో దొరుకుతోందని తెలిసింది. మా అన్న (కసిన్) ఒకరు వరంగల్ లో పనిచేస్తూ, ప్రతి శుక్రవారం బాలానగర్లో ఉన్న పెద్దక్క ఇంటికి వస్తూ ఉండేవాడు. తనతో తెప్పించుకుందామని ఆలోచన వచ్చింది. ఒక శుక్ర వారం వెళ్ళి కలిసి, పుస్తకం వివరాలు చెప్పి వస్తే, ఆ పై వారం తెస్తాడని నమ్మకం. అలా ఒక శుక్రవారం కాలేజీ అయ్యాక నేను అక్కా వాళ్ళింటికి వెళ్ళిన కొద్ది సేపటికే ఏదో పొలిటికల్ జులూస్ జరిగి, బస్సులు రద్దు అయ్యాయి. నేను సాయంత్రం అక్కా వాళ్ళింటికి వెళుతున్నా అని చెప్పి వెళ్ళాను కానీ ఇంటికి రాలేనని చెప్పడం కుదరదు కదా! మా నాన్న, అన్నలు, చివరి బస్సు వచ్చే దాకా మా బస్సు స్టాప్ కి, ఆ తరువాత, మెయిన్ రోడ్డు మీద ఉన్న బస్సు స్టాప్ కి వెళ్ళి అక్కడ చివరి బస్సు వెళ్ళిపోయేదాకా చూసి వెనక్కి వచ్చారుట. అసలు అక్కా వాళ్ళింటికి వెళ్ళానా లేక ఎక్కడైనా చిక్కుకున్నానా అని వాళ్ళెంత ఆందోళన పడతారో అని నేను, నేను క్షేమంగా ఉండాలని వాళ్ళు చేసిన ప్రార్థనలు తప్ప ఇంకో గత్యంతరం లేదు. మర్నాడు అటు నించే కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఇంటికెళ్ళేదాకా అజా పజా లేనట్టే లెక్క మరి.
ఇలాంటి కథలు చెప్పా కదా అని మేము మొత్తం సురక్షిత ప్రాంతంలో పెరిగినట్టు కాదు. బస్ లో వెళుతున్నప్పుడు వెనకనించి ముట్టుకోవడానికి ప్రయత్నించే వారికోసం చేతిలో సూదులు పెట్టుకుని బస్ ఎక్కడాలు, చీకట్లో రావాల్సినప్పుడు చిన్న డబ్బాలో కారం పొడి పెట్టుకోడాలు అవీ తప్పకుండా ఉండేవి. ఒకసారి కదలబోతున్న బస్సు ఎక్కుతున్నప్పడు వెనక నించి తాకిన వ్యక్తి వేగంగా బస్ దిగిపోయాడు కానీ వెనకే బస్ దిగి అతని వీపు మీద చురుక్కుమనేలా చరుపు చరుస్తానని ఎస్క్పెక్ట్ చేసి ఉండనంత వేగంగా కొట్టి, అదే వేగంతో తిరిగి వచ్చి బసు ఎక్కే శక్తి, ధైర్యం ఎలా వచ్చాయా అని ఇప్పటికీ అనుమానంగానే ఉంటుంది. అదంటే మరీ మరీ అతీ గతీ లేని కాలం కదా..
నిన్న మొన్న డీ ఏ వీ పబ్లిక్ స్కూల్ లో చిన్నారి మీద జరిగిన అత్యాచారం గురించి విని మనసు మనసులో లేదు. నలభై ఏళ్ళ క్రితం కెమేరాలు, అమ్మా నాన్నల అను నిత్య వీక్షణాలు మన మీద లేని సమయంలో కూడా ఇన్ని అఘాయిత్యాలు జరిగిన దాఖలాలు లేవు. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉండి కూడా ఈ రోజు ఏమిటి అన్న ఆలోచన మనసుని పట్టి వదలటం లేదు. అప్పటి రోజులకంటే ఇప్పుడు ఏ విధంగా సురక్షితమో తెలియట్లేదు. నిన్న ఒక డాక్టరు చెప్తున్నారు గుడ్ టచ్ బాడ్ టచ్ అని పిల్లలకి నేర్పించడం మంచిదే కానీ, మరీ చిన్నతనం నించీ అలా నేర్పించడం వల్ల పిల్లలు అనవసరమైన భయాలకి గురి అయ్యి, మానసిక వైకల్యానికి గురి అయ్యే ప్రమాదం ఉందిట. కొందరు ఇలాంటివి వినీ వినీ పురుష ద్వేషులుగా మారి పోతారుట. ఇంకొందరు తండ్రి, అన్న, బాబాయి దగ్గరికి కూడా వెళ్ళడానికి గానీ, వాళ్ళు ఇంట్లో ఉండగా నిద్ర పోవడానికి భయపడతారట. దీనికి పరిష్కారం ఏమిటో తెలియదు. పిల్లలని ఎలా కాపాడుకోవాలో తెలియదు. గాచారం బాలేక నాచారం బోతె, నాచారం దయ్యాలు నా ఎంట పడ్డాయి అన్నట్టుంది.
మూడు తరాల కిందటిలా పిల్లలని ఇంట్లోనే ఉంచి, అక్కడికే ఆడ టీచర్లని పిలిపించి చదివించాల్సిన పరిస్థితి వచ్చేట్టుంది. తలచుకుంటే భయమెయ్యట్లేదూ? పది మందినీ కలిసి పరిస్థితులు నేర్చుకునే మాట అంటుంచి, ఆన్ లైన్ విద్య బెస్ట్ అనిపిస్తోంది ప్రస్తుతానికి. మీరేమంటారో!
0 వ్యాఖ్యలు:
Post a Comment