చిత్రం: తూలిక, కెనడా
13 జూలై, 2022
కాలిఫోర్నియా సాన్ హోసే లో ఉండగా, ఒక సాయంత్రం ఇంటి ఓనరాణీ వచ్చి తన తమ్ముడి వివాహమని చెప్పి, ఐదురోజుల పెళ్ళి పత్రిక చేతిలో పెట్టి, తప్పక రావాలని పట్టుబట్టింది. ఆవిడ పుట్టిల్లు నేను ఉంటున్న ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐదురోజుల పెళ్ళిలో , మెహందీ లాంటి రెండు ప్రోగ్రాములు పొరుగూరిలో ఉన్న పెళ్ళికూతురు ఇంట్లోనూ, పెళ్ళి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుద్వారాలోనూ, రిసెప్షన్ ఇంకో ఊర్లో ఉన్న పంజాబీ హాల్ లోనూ అవగా, ఇంట్లో వాళ్ళతో మాత్రమే జరగబోతున్న లేడీ సంగీత్ మాత్రం పెళ్ళికొడుకు ఇంట్లో అని వ్రాసి ఉంది పత్రికలో. అప్పుడే కెనడా వెళ్ళిన మా సీతయ్యతో పాటు నా కార్ కూడా షిప్ చేసేసి ఉండడంతో దగ్గరగా ఉన్న సంగీత్ ఒక్కటీ అటెండ్ అవుతానని చెప్పి ఒప్పించాను కష్టపడి.
సాయంత్రం 6 గంటలకల్లా తయారుగా ఉండమని తమతో తీసుకువెళ్లారు. మేము వెళ్ళేసరికి మెహందీ పెట్టే అమ్మాయి అన్నీ సర్దుకుంటోంది. నన్ను చూసి మా ఓనరాణి తల్లితండ్రులు తెగ మురిసిపోయి నాకు ప్రత్యేకంగా మంచి డిసైన్ వెయ్యమని ప్రోత్సహించడంతో, ఒక చేతికి చాలంటున్నా వినకుండా ఆ పిల్ల నా రెండు చేతులకీ హెవీగా మెహందీ వేసేసింది ఆ రోజు తన వ్యాపారానికి బోణీగా. మెహందీ ఉంటుందని అస్సలు ఊహించలేదు నేను. పెళ్ళి పేరంటమండీ మళ్ళీ రాదండీ అని పాడుకుంటూ, పంజాబీ సంగీతం వినడానికని వచ్చిన నేను ఉన్న రెండు చీరల్లో ఎంచి కట్టుకున్న లేత గోధుమ రంగు పట్టు చీరకి మెహందీ అంటుకోకుండా కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఆ అమ్మాయి ముందునించి లేవబోతుండగా బిలబిలలాడుతూ 150 మంది ఇంట్లోకి వచ్చేసారు పిల్లా మేకా (కుక్కా)తో సహా. ఇంట్లో వాళ్ళు మాత్రమే అంటే, పది మంది అనుకున్నా.. ఒక్కరి మొఖాలకి కూడా మాస్కులు లేవు.
హాల్ లో మగవాళ్ళు కూచున్నారు. మెహందీ కార్యక్రమం బ్యాక్ యార్డ్ కి వెళ్ళే తలుపు ఉన్న చిన్న గదిలో పెట్టుకున్నారు. చేతులు కడుక్కోవడం లాంటి కోవిడ్ ఫార్మాలిటీలు ఏమీ లేకుండానే, ఆడవాళ్ళందరూ హుషారుగా ఆ చిన్న గదిలోకొచ్చేసారు. అందరూ నిలబడినా కూడా జాగా సరిపోనంత ఇరుకుగా ఉంది. కలిసి చాలా కాలం అయినట్లు వాళ్ళల్లో వాళ్ళు పెద్దగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు మీద మీద పడుతూ. ఆ ముందు వారం ఫంక్షన్ కి వెళ్ళొచ్చిన మా కొలీగ్స్ ఇద్దరికి కోవిడ్ సోకిందని, ఒక్కరే ఉండడం వల్ల మంచి నీళ్ళు కూడా ఇచ్చేవారు లేక, ఆస్పత్రిలో జాగా లేక.. బాబోయ్..వాళ్ళు చెప్పినవన్నీ గుర్తొచ్చి, వార్నాయనోయ్ అనుకుని గబగబా బాక్ యార్డ్ వైపు వెళ్ళాను అందరినీ దాటుకుంటూ. భలే ఉంది అన్నీ పళ్ళ చెట్లూ, పూల చెట్లూ అని సంబరపడుతుండగా ఆ చెట్ల మధ్యనించి వచ్చింది చిరుతపులి సైజ్ శునకరాజం. మెహందీ వల్ల చల్ల బడ్డ చేతులతో పాటు కాళ్ళు కూడా చల్లబడ్డాయి. కెవ్వుమని అరిచేంతలో ఒక రక్షకుడెవరో వచ్చి 'సింబా కమాన్' అంటూ పిలిచి గోడవారగా తాడుతో కట్టేసాడు. ఆ తాడు స్ట్రెచబుల్ అనుకుంటా.. పేరుకి కట్టేసినా ఆ గ్రామ సింబా నా చుట్టు తిరుగుతూ పండగ చేసుకుంటోంది. ముందు నుయ్యి వెనక గొయ్యి లాగా ఉంది నాకు.
"చెయ్యి కడిగేసుకుంటా నీళ్ళు కావాల"న్నా లోపలికి తొంగి చూసి.. "అబ్బెబ్బే ఐసా కైసా.. దాని మీద పంచదార నీళ్ళు చల్లుకోవాలి అప్పుడు కానీ పండదు" అని మైదాకు మీద చెక్కర పాకం చల్లి" ఈవిడ నీళ్ళడిగితే ఇవ్వకండి" అని అరుచుకుంటూ పోయిందొకావిడెవరో. ఒక్క పది నిమిషాలు ఉగ్గబట్టుకుని "భయ్యా, నాకు ఎక్కువసేపు మెహందీ పెట్టుకుంటే పడదు, స్కిన్ ఎలర్జీ" అని అక్కడ కనబడ్డ ఒకబ్బాయికి నచ్చచెప్పి, నీళ్ళు తెప్పించుకుని చేతులు కడిగేసుకున్నా. గోరింటాకు పండకుండా కడిగేసుకున్నానని ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న లేడీస్ అందరూ వచ్చి తొంగి చూసి నిట్టూర్చి పోయారు. పనిలో పనిగా "నాకు ఆఫీస్ నించి ఫోన్ వచ్చింది, పని ఉంది, ఇంటికి వెళ్ళిపోతా" అన్నా. "తినకుండా ఎలా? కేటరర్ ఫుడ్ తెచ్చేదాకా ఆగాల్సిందే, ఇంకో గంటలో వచ్చేస్తుంది. ఈ లోపు సంగీత్ కూడా మొదలవుతుంది" అన్నారు. "ఇవాళ నేను భోజనం చెయ్యను మంగళవారం" అనేసా చులాగ్గా. ఒక స్వీట్ అయినా తినమంటూ బర్ఫీ ఇచ్చారు టిష్యూ పేపర్ లో పెట్టి. "ఇంటికెళ్ళి తింటా, ఇంక పోతున్నా" అన్నాను హడావిడిగా. "అలా ఎలా వెళతావు 5 కిలో మీటర్లు, మెహందీ కడిగేసుకున్నాక దింపుతా" అంది ఓనరాణీ. "మీకు తెలుసుగా, ఆ మాత్రం రోజూ నడవడం అలవాటే, ఏం ఫర్వాలేదు" అన్నాను అక్కడ నించి బయటపడితే చాలని. "కుడీ (అమ్మాయీ), నువ్వేమొ మా వాళ్ళలా పంజాబీ సూట్లో, షార్ట్ లో, స్కర్టులో కాకుండా చీర కట్టుకున్నావాయె. చీర కట్టుకున్నవాళ్ళ మీద కొద్దో గొప్పో నగలుంటాయని తెలిసి, కమ్మల కోసం చెవులూ, గాజుల కోసం చేతులూ కత్తిరించుకుపోయారీమధ్య ఈ ఏరియాలో. మా పిల్లలు దింపేదాకా నువ్వు వెళ్ళడం కుదరనే కుదరదు" అన్నారు ఓనరాణీ తల్లిగారు . ఇదెక్కడి గోలరా ద్యావుడా అనుకుని, మేధావిలా ఆలోచించి "ఫర్వాలేదండీ ఊబర్ బుక్ చేసా" అనేసా ఊబరు ఆప్ గబగబా నొక్కేస్తూ. చాలా కొద్ది దూరం అవడం వల్లనో ఏమో, ఊబర్ బుక్ చేసిన ప్రతిసారీ పది నిముషాల్లో వస్తుంది అని చూపించడం, తరువాత కాన్సల్ అవడం చాలా సార్లు జరిగి ఇంకో గంట అక్కడే ఉండిపోయా. గడికొక్కరొచ్చి, లోపలికి రా అని పిలిచి తీసుకెళ్ళడం, నేను ఊబర్ వచ్చేస్తోందని చెప్పి బయటికి రావడం.. ఏడుస్తూ వ్యవసాయం చేస్తే కాడీ మోకూ దొంగలెత్తుకెళ్ళారుట అనీ, దరిద్రుడు తల కడగబోతే వడగళ్ళ వాన అనీ గుర్తొచ్చిన సామెతలు అన్నీ తలచుకుంటుండగా పై అంతస్థులో ఉన్న పాజీ డ్రింకులో ఐస్ కావాలని కిందకి దిగి, అతనితో పాటు వచ్చిన పిల్లాడిని సోడా తెమ్మని పురమాయించడం విని మెల్లగా "పాజీ.. ఆ పిల్లావాడెటు బోవుచున్నాడు" అని కనుక్కుని "నన్ను కాస్త ఆ వీధి చివర వరకు దింపి పోతారేమో" అన్నాను. మా ఓనరు పాజీ కరుణకలిగిన వాడై.. "పొమ్ము ఫరవా నహీ" అన్నాడు. బతుకు జీవుడా అనుకుని ఇంటికి వెళ్ళినా..ఆ చిన్న గదిలో గుమిగూడిన వేలమంది జనాల వల్ల కోవిడ్ వచ్చినట్టూ, బయటికి వెళితే వాడిగా చూస్తున్న సింబా చూపులు నన్ను గుచ్చినట్టు కలలు. అదీ కాక ఆ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళలో చాలా మందికి కోవిడ్ వచ్చిందని విన్నాక, ప్రతిరోజూ జ్వరమూ గొంతు నెప్పి వచ్చేసినట్టు భయపెట్టే భ్రమ 15వ రోజు దాకా ఊపిరి తీసుకోనివ్వలేదు. ఏమైనా, జనాలతో కలిసి ఉండాలని పడిచచ్చే నేను జనాల మధ్య ఉండడానికి భయపడిన మొదటిసారి అది.
పెళ్ళి హడావిడి అయ్యాక ఓనరాణీ తో మంచీ చెడూ మాట్లాడుతూ.. 'ఇంట్లో వాళ్ళంటే ఇంతమందేంటబ్బా' అన్నాను సరదాగా. ఓహ్.. మీకు తెలియదనుకుంటా మా పంజాబీ కుటుంబాల్లో అంతే. మేము ఆరుగురమా? మా ఆరుగురికీ ఒక్కొక్కరికి ఐదు నించి పది మంది ఆడపడుచులు, బావగార్లు, మరుదులూ ఉంటారు కదా? మా ఇళ్ళల్లో ఏది జరిగినా మా ఇరువైపుల సిబ్లింగ్స్ కుటుంబాలని (అంటే వాళ్ళ ఆడపడుచులతో సహా) పిలవాలి. మరి మా అమ్మ నాన్నల అన్నదమ్ముల పిల్లలని, వాళ్ళ కుటుంబాలనీ ఎలా వదిలేస్తాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో పరాయి వాళ్ళెవరూ లేరు. అందరూ ఇంట్లో వాళ్ళే' అంది కూల్ గా.
0 వ్యాఖ్యలు:
Post a Comment