అచ్చెరువు

Tuesday, November 15, 2022
చిత్రం: తూలిక, కెనడా 

 28 సెప్టెంబర్ 2022

మంత్ ఎండ్ కోసం కొన్ని రిపోర్ట్స్ ప్రింట్ చేస్తూ ప్రమీల పక్కనున్న సీట్ లో కూచున్నాను. ప్రమీల ఫోన్ మోగింది. అటు నించి వాళ్ళ ఆయన అనుకుంటా. ల్యాండ్ లయిన్ అవడం వల్ల అతని గొంతు కూడా లైట్ గా వినిపిస్తోంది పక్కన కూచున్న నాకు. విషయం ఏమిటో  అర్థం కాలేదు గానీ, ఆయన గొంతులో తీవ్రత వినిపిస్తోంది. కోపంలో తనకి వచ్చిన తిట్లన్నీ తిట్టిపోస్తున్నారు. ప్రింట్ తియ్యడానికి వంగినప్పుడు ప్రమీలని చూసాను. ప్రమీలకి నవ్వొచ్చేస్తోంది. అతను చెప్తున్న మాటలకి, తిడుతున్న తిట్లకి ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. "మీరు ఫోన్ పెట్టెయ్యండి మీటింగ్ ఉంది" అని అబద్ధం ఆడేసి,  ఊబర్ ఈట్స్ లో పక్కనున్న విలేజ్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి సమోసాలు, స్వీట్లు ఆర్డర్ చేసింది. రిపోర్ట్ లలో ఏదో తేడా కనిపించడంతో నేను ఇహం వదిలి పూర్తిగా కళ్ళు కంప్యూటర్ కి అతికించేసా. 

                                                                   *

'మా అమ్మాయి ఇవాళ తన బాయ్ ఫ్రెండ్ తో వస్సాగా  బీచ్ కి వెళ్ళింది" అంది గ్రేస్.  "అవునా, చాలా బాగుంది. లాంగ్ వీకెండ్ కదా మరి!  మా అబ్బాయి కూడా తన్ ఫ్రెండ్స్ తో కలిసి బ్లూ మౌంటెయిన్ కి వెళ్ళాడు" అంది ప్రమీల.  "ఫ్రెండ్స్ అంటే?" అన్నాడు రికార్దో.  "ఫ్రెండ్స్ అంటే క్లాస్మేట్స్. కొంతమంది మగ పిల్లలు" అందామె. " నీకు తెలియదు కానీ అక్కడికి ఎవరెవరు వెళ్తారో ఏంటో" అన్నాడు చిలిపిగా.  "మాది సాంప్రదాయ కుటుంబమే అయినా, నాకు అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేదు రిక్కీ, వాడికి ఎవరైనా నచ్చితే, నాతో చెప్పే స్వతంత్రం ఇచ్చాను కాబట్టి వాడు ఇప్పుడు వెళ్ళేది మగ పిల్లలతోనే"  అంది ఖచ్చితంగా.  "మీ అబ్బాయికి గాళ్ ఫ్రెండ్స్ లేరంటే నేను నమ్మను గాక నమ్మను. మీ అబ్బాయికి డిగ్రీ కూడా అయిపోతోంది, ఇంకా లేకపోవడమేమీ లేదు. మీ వాళ్ళల్లో చాలా మందిని చూసాలే. ఇలాగే చెపుతారు, బయటికి వెళ్ళి చూస్తే కదా తెలిసేది" అంటుంటాడు మాటి మాటికీ. అంతే కాక గుర్తొచ్చిన ప్రతిసారీ 'ఎవరైనా  దొరికారా' అని విసిగిస్తుంటాడు కూడా. అలా అడిగినప్పుడల్లా అతను నవ్వే వెటకారపు నవ్వుకి నాకు కొంత చిరాకు వేస్తుంది కూడా.  "ఇంకా లేదు, తొందరేముంది మంచి జాబ్ రావాలి కదా " అంటుంది ప్రమీల  కూల్ గా.  "అలాంటి పప్పులేమీ ఉడకవు, ఇక్కడ పిల్లలకి ఐదవ తరగతి నుంచే గర్ల్ ఫ్రెండ్స్/ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. అలా ఉండకపోతే, పిల్లల్లో ఏదో తేడా ఉన్నట్టే " అన్నాడు నవ్వుతూ. ఈయన ఏంటి అసలు అని చిరాకు పడుతుంది ప్రమీల అప్పుడప్పుడు నాతో చెప్పి. వాళ్ళంతా ఒక డిపార్ట్మెంట్. సరదాగా జోకులేసుకుంటూ ఉంటారు. జోకులో జోకు అనుకున్నా నేను.

రిక్కీ ఇటాలియన్, లిండా హంగేరీ నించి, గ్రేసీ యూరప్ నించి, మియాద్ ఈజిప్ట్ నించి, ఇమరూ వెనిజ్వులా నించి, డయానా అమెరికా నించి, బర్తా పాకిస్తాన్ నించి, మేరీ శ్రీలంక నించి, అనామికా నేపాల్ నించి, ఆనబెల్ ఫిలిప్పైన్స్ నించి, ప్రమీలా నేనూ .. చెప్పక్కరలేదుగా. వాళ్ళ అందరికీ ఇంచు మించు ఒకే వయసు పిల్లలు ఉండడంతో మామూలుగా లంచ్ అవర్ లో పిల్లల గురించి,  వారి ఆడ/మగ స్నేహితుల గురించి సరదా కబుర్లు చెప్పడం, గొల్లుమని నవ్వుకోవడం షరా మామూలే.  అయితే ఎప్పుడూ విని నవ్వడం తప్ప  ప్రమీల దగ్గర నించి వాళ్ళ అబ్బాయి కబుర్లు రాకపోవడంతో రాను రానూ ఆ పిల్లాడికి జన్యుపరమైన శారీరిక లోపం ఉండి ఉండవచ్చని, వైద్యులకి చూపించమని ఆమెకి ఒక ఫీలింగ్ కలిగించారు.  "అదేమీ కాదు భారతదేశంలో 26 కి ముందు ఎవరూ వివాహం చేసుకోరు కాబట్టి, ఉద్యోగం వచ్చాక వెతుక్కుంటాడు" అని ఆమె దబాయిస్తున్నప్పటికీ, ఎక్కడో మనసులో కొంత దిగులు పట్టుకుంది తనకి. 

ఆనబెల్ ఒక రోజు ఒక వీడియో చూపించిందిట.  అందులో ఒకడు తన స్నేహితురాలి కొడుకని, ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ కాబట్టి పేరెంట్స్ కూడా ఒప్పుకుని, భారతీయ సంప్రదాయ పధ్ధతిలో ఘనంగా పెళ్లి చేసారని చెప్తూ చూపించిన ఆ వీడియో ఇద్దరు మగ పిల్లలు పెళ్లి చేసుకున్న వీడియోట! అక్కడి నుంచి గర్ల్ ఫ్రెండ్స్ లేని ప్రమీల  కొడుకు మీదికి టాపిక్ మరలిందిట మళ్ళీ. "ఈ రిక్కీ పిలగాడికి పనీ పాటూ లేదు ఎప్పుడూ నా పిల్లల మీదకి తెస్తాడు టాపిక్" అంది ఆ సాయంత్రం ఇంటికెళుతున్నప్పుడు నాతో. "ఏయ్.. చూసావా,  నీ కొడుకు ఎక్కువగా మగ పిల్లలతో తిరుగుతుంటాడు కదా, వాడు గే అయి ఉంటాడు" అన్నాడుట రిక్కీ  జోక్ లాగా. ఇక్కడ ఆఫీసులో ఎవరైనా ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే, హ్యూమన్ రిసోర్స్ కి ఫిర్యాదు చెయ్యవచ్చు. అదే మాట అన్నాను. "కానీ వీళ్ళంతా కొన్నేళ్ళుగా కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. కాస్త మనస్పర్థలు వచ్చినా, పనిలో చాలా సహాయం చేస్తారు. మంచి టీం" అంది తను.      నేనేమనాలో నాకు తెలియలేదు. 

తన కొడుకు యూనివర్సిటీ నించి వచ్చినప్పుడల్లా   అన్యాపదేశంగా వాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని కూపీ లాగానని, పిల్లాడు నొచ్చుకుని, విసుక్కున్నాడని చెప్పింది ప్రమీల.  ఎవరైనా ఉంటే చెప్పవచ్చని, తనకి కుల మత ప్రస్తావన లేదని నెమ్మదిగా నచ్చ చెప్పిందిట కూడా. "అసలు నువ్వు తల్లివేనా? చిన్న పిల్లలకి ఇలా నేర్పుతారా తల్లులు " అన్నాడుట అవినాష్. బయట ప్రెషర్ తట్టుకోవడానికే కష్టంగా ఉంటే, నీ ప్రెషర్ ఏంటమ్మా అని కూడా విసుక్కున్నాడుట. కొద్దిగా ఇంటికి రావడం తగ్గించాడని బెంగ పడిపోయిందా తల్లి ఈ రెండేళ్ళూ. 

                                                                            *

ఊబర్ ఈట్స్ అబ్బాయి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బెల్ కొడితే ఈ లోకం లోకి వచ్చాను. గబ గబా సమోసాలు అవీ తీసుకుని లంచ్ రూంలోకి పరిగెత్తింది ప్రమీల. "ఏమిటి విశేషం దీపావళి, బైసాఖీ కాదే ఇవాళ" అంటున్నారు అందరూ అక్కడే కూచున్న నా దగ్గరికి వచ్చి. "తెలియదు మరి ఎవరిదైనా పుట్టిన రోజేమో" అన్నాన్నేను పనిలో నించి తల ఎత్తకుండానే. "రండి రండి శుభవార్త చెప్తా" అంటూ నన్ను కూడా లాక్కుపోయింది ప్రమీల.  "ఇవాళ ఏమయింది తెలుసా? మా ఆయన్ ఫోన్ చేసి ఒకటే తిట్లు" అంటూ మొహమంతా సంతోషం నిండిపోగా తెరలు తెరలుగా నవ్వుతూ "నా పిల్లాడికి గాల్ ఫ్రెండ్ దొరికిందబ్బా" అంది  తట్టుకోలేని ఆనందంతో. "వావ్! కంగ్రాట్స్ ఎవరూ? ఎక్కడమ్మాయి?" అన్నారు అందరూ ఉత్సాహంగా.  "ఒక నల్ల పిల్లలే. తనకి ప్రపోస్ చేస్తే ఒప్పుకుందని ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టాడుట. కానీ, నేను చూసుకునే లోపు మా ఆయన ఫోన్ చేసి, నన్నూ వాడినీ తిట్టి తిట్టి పెట్టారు, ఇండియాలో తన పేరెంట్స్ ఎలా ఒప్పుకుంటారూ..తను కూడా ఒప్పుకునే ప్రశ్నే లేదంటూ" అంది కొద్ది విచారంగా. "మరి ఎలా?" అన్నాన్నేను ఆందోళనగా, వాళ్ళదెంత సాంప్రదాయ కుటుంబమో తెలిసు కాబట్టి .  "చూద్దాం లేబ్బా, వీళ్ళ అందరి మాటల వల్ల మూడేళ్ళ నించి పడ్డ బెంగ తీరిపోయింది నాకు. నల్ల గాని తెల్ల గాని హిందు ముస్లిమైన గాని, కిరస్తాని పిల్ల కాని కాని ఏమైనా.."అని రాగం తీసి, " పిల్లాడు కాకుండా పిల్ల  దొరికింది చాలు" అంది ప్రమీల. "కాలకూట విషమైనా గ్రక్కున మింగేటి ఆ నీలవర్ణుడే నీకు నిజ దైవము" అన్నాన్నేను మనస్పూర్తిగా అభినందిస్తూ.

0 వ్యాఖ్యలు: