కౌముది పత్రిక కథలపోటీలో బహుమతి పొందిన కథ "అదిగదిగో గగనసీమ"

Wednesday, November 23, 2022

నేను క్లాస్ కి వెళ్ళే సంకేతం గా బెల్ మోగింది. నాకు ఆందోళనతో అసలు కదలాలని లేదు. టేబుల్ మీద చేతులానించి తల చేతుల మధ్య పెట్టుకున్నా. సునీత వచ్చి మేడం మీ క్లాస్ టయిం అయింది అంది. సునీత మా కరెస్పాండెంట్ కి దగ్గరి చుట్టం. తను స్టాఫ్ రూంకి వచ్చిందంటే చాలు అయ్యో ఒక బ్లాక్ మార్క్ పడిందే అకవుంట్లో అని బాధ పడతారందరూ. అలా సునిత దృష్టిలో పడిన వాళ్ళకి మాధవ్ సార్ దగ్గరనించి పిలుపొస్తుంది. "క్లాస్ కి టయిం కి వెళ్ళకపోతే పిల్లలకి రెస్పెక్ట్ ఉండదండీ. వాళ్ళు ఎల్కేజీ పిల్లలో హై స్కూల్ పిల్లలో కాదు కదా ? డిగ్రీ కాలేజ్ పిల్లల్ని ఖాళీ సమయం లో కంట్రోల్ చెయ్యడం సునీత వల్ల కూడా కాదు. ఒక క్లాస్ అయేటప్పటికి ఇంకో లెక్చరర్ క్లాస్ ముందు నించోవాలి. ఇంక మీరు వెళ్ళచ్చు" అంటాడట సినిమాలో జగ్గయ్య గారి లెవెల్ లో.. నా అదృష్టం కొద్దీ ఇప్పటి దాకా అలా అనిపించుకోలేదు ఎప్పుడూ. చాలా గౌరవంగా మాట్లాడతారాయన. నాకు అసలు క్లాస్ కి వెళ్ళాలని లేదు. విషయం ముందే తెలిసుంటే వచ్చేదాన్ని కాదు సిక్ లీవ్ అని కాల్ చేసేదాన్ని. నేను ప్రతి సారీ నిరాశ పడుతున్నానని సుబ్బు ఈ విషయం నాకు చెప్పలేదు. దేవుడా దేవుడా అనుకుంటూ క్లాస్ కి వెళ్ళాను. దార్లో మిసెస్ సారా కనిపించింది. ఏంటండీ అంతా వోకేనా అంది నవ్వుతూ.. ఆ వాకే అండీ అన్నా నేను నవ్వు పులుముకుంటూ. "మేడం నిన్న ఇచ్చిన హోం వర్క్ చెయ్యలేదు ఇవాళ ఇంగ్లిష్ టెస్ట్ కి చదువుకున్నాము. ఇప్పుడు చెయ్యచ్చా" అన్నారు ముందు వరుసలోని ఇద్దరు పిల్లలు. ఎంత మంది చెయ్యలేదు అని అడిగాను. చేసిన వాళ్ళు చెయ్యని వాళ్ళకి హెల్ప్ చేసే పద్దతి మీద సరే అన్నాను. పిల్లలందరు గుంపులుగా విడిపోయి సాల్వ్ చేస్తున్నారు. అమ్మయ్య అనుకున్నా. అటూ ఇటూ పచార్లు చేస్తున్నా. భార్య నెప్పులు పడుతుంటె డెలివరీ రూం ముందు భర్త పచార్లు చెయ్యడం సీన్ గుర్తొచ్చింది సినిమా లోంచి. అనుకోకుండా నవ్వొచ్చింది పెదాల మీదకి. "మేడం ఏంటీ నవ్వుకుంటున్నారు "అనడిగింది ఒకమ్మాయి. "మేమూ ఇలాగే కలిసి చదువుకునేవాళ్ళం తెలుగు నించి ఇంగ్లిష్ మీడియం కి మారిన కొత్తల్లో! కొత్త పదం కనిపిస్తే ఆ పదం లో ఏదో కిటుకుంది ఆ కిటుకు తెలియకపోవడం వల్లనే లెక్క రావట్లేదు అనుకునేవాళ్ళం .అవి మామూలు పదాలని తెలిసాక ఆ పదాలు సరదా తిట్లా లా మారిపోయాయి మా స్నేహితుల మధ్య"అన్నాను. "అవేం పదాలు మేడం" అందరూ నా వైపు చూసారు ఆసక్తిగా. "ఇంటర్ ఆలియా(inter-alia) విస్ -అ - విస్ (vis-a-vis)అనే పదాలు. వాటి వల్ల లెక్కకి ఏ సంబంధం లేదని తెలిసాక వాటిని తిట్లుగా ఉపయోగించేవాళ్ళం "అని చెప్పాను. పిల్లలు సరదాగా నవ్వారు. "ఇంక మేము అలా తిట్టుకోవచ్చన్న మాట" అంటూ.. మనసు కొంచెం మళ్ళింది ఆందోళన నించి. ఎవరో డవుట్ అడగడం తో గంట ఎలా గడిచిందో తెలియలేదు. వెనక్కి వెళుతూనే "నాకు ఫోన్ వచ్చిందా" అని అడిగాను శైలని ."అవును నువ్వు రాగానే చెప్దామనుకున్నా సుబ్బు గారు చేసారు. వెంటనే చెయ్యమన్నారు" అంది. నేను ఎంత వేగం గా ఫోన్ అందుకున్నానో నాకే తెలియదు. కానీ ఫోన్ ఎంగేజ్ వస్తోంది. అదృష్టం కొద్దీ ఈ గంట ఫ్రీ. మళ్లీ మళ్ళీ చేయగా సుబ్బు ఎత్తాడు. ఏం చెప్తాడో అని ఒకటే టెన్షన్. "ఇంటికొచ్చెయ్ పావనీ పని అయిపోయింది" అన్నాడు. నా చెవులు నేనే నమ్మలేదు. ఒక నిమిషం మెదడు బ్లాంక్ అయింది. నో రియాక్షన్...!!! "పావనీ ఆర్ యూ ఓకే" శైలు అడిగింది. నేను గొంతు పూడుకుపోవడంతో ఏడ్చేస్తున్నాను.. తను దగ్గరకొచ్చింది. చేతి మీద చెయ్యేసి పావనీ అని ఖంగారు పడింది. మెల్లిగా "సుబ్బు వెళ్ళిన పని అయింది" అని చెప్పా.. శైలు మొఖం వెలిగిపోయింది.. "ఎవరికీ చెప్పకు మనిద్దరి మధ్యే "అన్నా. "ప్రామిస్ నేనెవ్వరికీ చెప్పను" అంది.. "ఐ యాం సో హాప్పీ "అంది సంతోషం గా.. "ఇంటికెళ్ళాలి ఎలా" అన్నా. "నువ్వు ఎవరితో ఏమీ చెప్పకుండా సునీత దగ్గరికెళ్ళి ఒంట్లో బాగాలేదని చెప్పెయ్. నీ క్లాస్ పద్దు తీసుకుంటుందిలే తనకి నెక్స్ట్ పీరియడ్ ఖాళీనే గా "అంది. "పాపం తనకి ఇబ్బంది కదా వరుసగా 3 క్లాస్ లు అయ్యాయి" అన్నా. "నీ మొహం లే అదేమీ అనుకోదు. పైగా సంతోష పడుతుంది. అందరూ వచ్చే ముందు నువ్వు పో.." నా పర్స్ చేతికిచ్చి గడప వైపు తోసింది.. ఒకే మరి బై అంటూ నేను రివ్వున పరిగెత్తాను. ఆఫీస్ దగ్గర ఆగగానే సునీత "ఏంటి మేడం అలా ఉన్నారు? ఒంట్లో బాగలేదా" అంది. నా కళ్ళు ఎర్రబారినట్లున్నాయి. "అవును సునీతా.. అందుకే ఇందాక కూడా క్లాస్ కి వెళ్ళలేకపోయా లస్ట్ క్లాస్ పద్మ మ్యానేజ్ చేస్తా అంది నేను ఇంటికి వెళ్ళనా" అన్నాను. "సరే వెళ్ళండి పద్మ మేడం కి నేను చెప్తాలే" అంది. మళ్ళీ నువ్వు చెప్పేదేంటి అన్నిట్లో నీ చెయ్యి ఉన్నట్టు ఫీలింగ్ కాకపోతే అనుకుంటూ పరుగు తీసాను. ఆటో తీసుకుని ఇంటికొచ్చేవరకూ మనసు మనసులో లేదు. సుబ్బు బయట రెడీ గా ఉన్నాడు "పద పోదాం "అన్నాడు . "అదే ఆటో లో వెళదాం బండి మీద రావడం కష్టం "అన్నాడు. సరే అన్నాను. "ఏమైనా తిని వస్తావా "అన్నాడు. "అక్కరలేదు ఆకలి దాహం ఏం లేవు పద . నేను ఉద్యోగం ఎప్పుడు మానాలి "అనడిగా.. "వెంటనే "అన్నాడు. "అసలెంత అదృష్టం తెలుసా 20 రోజులట" అన్నాడు. "నిజమా మరి ఎలా ఒప్పుకున్నారు" అన్నాను. "మనిద్దరం చాలా మంచివాళ్ళమని చెప్పాడుట చక్రవర్తి. అయినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేరుట" అన్నాడు. "సరిపోయింది లే" అన్నా సంతోషం గా. ఆటో దిగగానే ఒకతను ఇంట్లోంచి బయటికొచ్చి రండి రండి అని తీసుకెళ్ళాడు. కుర్చీలేసాడు ఒక పెద్దాయన. ఇద్దరు బుజ్జి బుజ్జి పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళ అక్క అజమాయిషీ చేస్తూ ఆట నేర్పిస్తూ ముద్దు చేస్తోంది. కుర్చీలో కూచుంటూ నేను పిల్లల్ని గమనిస్తూ దగ్గరికి రమ్మని పిలిచా. చిన్న వాళ్ళిద్దరూ నువ్వెవరు అన్నట్టు చూసారు. వాళ్ళక్క వాళ్ళని భుజాల మీద చేతులేసి నా దగ్గరికి తీసుకొచ్చింది. ఆంటీ పిలిస్తే వెళ్ళాలి అంటూ. అబ్బో పెద్ద ఆరిందానే అనుకున్న. నమస్తే పెట్టు అని తను కూడా నమస్తే అంది. 6 యేళ్ళు ఉంటాయేమొ అప్పుడే ఇద్దరు పిల్లలకి ట్రెయినింగ్ ఇస్తోంది నవ్వుకున్నా. చిన్న దాని చెయ్యి పట్టుకుని పేరేంటీ అన్నా. "చంద్ర వదన" అంటూ మా ఇద్దరికీ మంచి నీళ్ళు తెచ్చింది పెద్దది. అబ్బో నీ పీరేంటో అన్నా.. వెన్నెల అంది వెన్నెల కురిసినట్టు చిరునవ్వు నవ్వుతూ. భలే ఉన్నాయే మీ పేర్లు. మరి ఈ చిన్నారి పేరు పున్నమా అన్నా పిల్లని చూపిస్తూ కాదు ఉషా కిరణ్ అంది. అదేంటీ అది అబ్బాయిల పేరు కదా అన్నా తమాషాగా. ఉహూ కాదు. కిరణానికి ఆడ మగ తేడా ఉండదని తాతయ్య చెప్పాడు అంది పరిశోధన చేసినట్టు. అబ్బో నీకు చాలా తెలుసే అన్నా. ముఖం లో సిగ్గుతో కూడిన గర్వం తొంగి చూసింది. మా చేతుల్లో గ్లాస్ లు తీసుకుని వంటింట్లో పెట్టి వచ్చి చంద్ర వదన చేతులకి అంటిన మట్టి తన గవునుతో తుడిచింది. కుంచమంత కూతురుంటే మంచం దగ్గరికే కూడు అన్న గౌరీ మేడం మాటలు గుర్తొచ్చాయి. ఈ లోపు పెద్దాయన లోపలికెళ్ళాడు. నా సంతోషం ఒక్క నిమిషంలో ఎగిరిపోయింది. గదిలోంచి పెద్దగా ఏడుపులు వినిపిస్తున్నాయి. ఏమయి ఉంటుందో ఊహించగలను కానీ నో పెయిన్ నో గెయిన్ కదా. మనసు దిగులుతో నిండిపోయింది. వచ్చిన పని అవుతుందా కాదా. అనుమానం ఎక్కడో వేధిస్తొంది. దిగులుగా సుబ్బు వైపు చూసాను. ఫర్వాలేదు ఉండు అన్నట్టు చూసాడు. చూపు తిప్పి వెన్నెలని చూపించాడు. అ చిట్టిది నా కుచ్చెళ్ళు పట్టుకుని నా చీరపైనున్న పువ్వులని ఏరడానికి ప్రయత్నిస్తోంది. భలే క్యూట్ కదా అని సుబ్బుని చూసి నవ్వాను. చాలా సేపు నిరీక్షించాక పెద్దాయన బయటికి వచ్చాడు. అమ్మా లోపలికి పో అన్నాడు. కాళ్ళు వణుకుతుండగా వస్తావా అంటూ సుబ్బు వంక చూసాను. వద్దు నువ్వెళ్ళు అన్నట్టు సైగ చేస్తూ గది వైపు చేతులు చూపాడు. గుబులు గుబులుగా గుండె చెదరగా అన్నట్టు తడబడే అడుగులతో నా బిడ్డని కలవడానికి వెళ్ళాను. శోక దేవతలా ఉన్న స్త్రీమూర్తిని ఆమె చేతిలో మణి దీపంలా మెరిసిపోతున్న బంగారు తల్లిని చూసాను. పక్కనే ఉన్న ఆమె తల్లి ఆమె భుజం మీద చెయ్యేసి ఓదారుస్తోంది. కానీ ఆమెకి దుఖం కట్టలు తెంచుకుంటోంది. “నా కూతురి కాపురం నిలబెట్టడానికి మిమ్మల్ని దేవుడు పంపాడమ్మా నిన్ను నీ బిడ్డనీ దేవుడు వెయ్యేళ్ళు చల్లగా చూడనీ” అంది పెద్దావిడ. నా కళ్ళు ఆ బిడ్డని చూసి మిలమిలా మెరిసాయి. చేతులు జాపాను అప్రయత్నంగా. ఆ శోకమూర్తి వెక్కుళ్ళు పెడుతూ బిడ్డని నా చేతుల్లో పెట్టి రోదిస్తూ పక్క మీద వాలిపోయింది. తల్లి ఊరుకోబెడుతోంది. “పాడు దేవుడికి దయలేకపోతే ఏం చేస్తాం తల్లీ.. నీ కాపురం ముఖ్యం కదా కొంచెం ధైర్యం తెచ్చుకో. నీ పిల్లల జీవితాలు తండ్రి నీడన గడచిపోయే అదృష్టాన్ని వాళ్ళకి ప్రసాదించు. అదే నీ కర్తవ్యం” అన్నది ఆవిడ. నాకు గుండెల్లో చెయ్యిపెట్టి ఎవరో తిప్పినట్టయ్యింది. పాపని తల్లి వడిలో ఉంచి పెద్దావిడ చెయ్యి పట్టుకుని గబ గబా పక్కనున్న వంటింట్లోకి తీసుకుపోయాను చొరవగా. పిల్లని ఒళ్ళోకి లాక్కుంటూ తెల్లబోయి చూసిందా తల్లి. “అమ్మా 10 ఏళ్ళుగా పిల్లలు లేరని మొక్కని దేవుడు లేదూ ఎక్కని కొండా లేదు. ఎన్ని సార్లు ప్రయత్నించినా దొరికినట్టే దొరికి, కులం వల్లో, తలితండ్రులు మనసు మార్చుకోవడం వల్లో, ఇంకెవరో డబ్బున్న వాళ్ళు దొరికో ఏదో కాలణాల వల్ల దత్తత తీసుకోలేకపోయాము. అన్ని ఫలించి ఎవరో పిల్లని దత్తతకి ఇస్తారని ఒక స్నేహితుడి ద్వారా తెలిసి వచ్చాము. కొన్ని విషయాలు చెప్పాడు కానీ దత్తత ఎందుకిస్తున్నారంటే మాత్రం తెలీదన్నాడు. ఇక్కడ పరిష్తితి చూస్తే సగం అర్థం అయినట్టూ సగం కానట్టూ ఉంది. ఇంతకీ దత్తత ఎందుకిస్తున్నట్టు” అన్నాను. “ఉద్యోగం చెయ్యక్కరలేదు కానీ చదువుకున్న పిల్ల కావాలని చేసుకున్నారు. మొదటి మగ పిల్లాడు పుట్టలేదని సూటీ పోటీ మాటలు అన్నా మగ సంతానం ఉందని జాతకం లో ఉందని ఊరుకున్నారు. రెండో కానుపులో కవల పిల్లలు ఆడపిల్లలయ్యేసరికి అమ్మాయిని చాన్నాళ్ళు తీసుకెళ్ళలేదు. అల్లుడ్ని బతిమాలుకుంటే కవలల్ని తీసుకు రాకపోతే రమ్మన్నాడు. అది వెళ్ళనన్నా మేమే బలవంతంగా పంపించాము. 10 రోజుల్లో పిల్లలు బెంగ పెట్టుకున్నారని చెప్తే దింపి పోయాడు. మళ్ళీ కడుపొచ్చిందని తెలిసి “ఈ సారి మగ పిల్లాడు పుట్టకపోతే నలుగురు పిల్లలతో పుట్టింట్లోనే ఉండు రావక్కరలేద”ని చెప్పి వెళ్ళారు. ఆ నాటి నించీ వచ్చింది లేదు చూసింది లేదు. మగ పిల్లాడు పుడితే చెప్పి పంపండి అప్పుడొచ్చి చూస్తా. ఆడ పిల్ల పుడితే చెప్పక్కరలేదు నా పెళ్ళాం పిల్లలు పోయారనుకుంటా అని చెప్పి వెళ్ళాడు. ఆ నాటి నుండీ నా బిడ్డ తిండీ నిద్ర సరిగ్గా లేక ఒకటే బెంగ పెట్టుకుంది. దేవుడు కరుణించకపోతాడా అని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకున్నాం తీరా 20 రోజుల క్రితం మళ్ళీ మహలక్ష్మి పుట్టింది. దాని దురదృష్టం ఏం చేస్తాం..” కొంగుతో కళ్ళు తుడుచుకుంది పెద్దావిడ. “మరి ఇప్పుడెలా” అన్నాన్నేను అవాక్కయిపోతూ. “ఇద్దరు పెద్దమనుషుల్ని తీసుకుని భయం భయంగా వెళ్ళారు మా వారు విషయం చెప్పడానికి. అదృష్టం కొద్దీ వాళ్ళ ఊర్లో ఇద్దరు పెద్దమనుషులు కూడా వెంట వెళ్ళారుట. అసలు నవ్వు లేని ఈయన మొహం చూడగానే ఎందుకొచ్చారు చెప్పద్దన్నాగా అన్నాడుట. వచ్చిన పెద్దమనుషులు నలుగురు కూచుని చదువుకున్న వాడివి ఇలా చేస్తే ఊరికి చెడ్డపేరు కదా అని బాగా ప్రాధేయపడితే, ఇద్దరు పిల్లల్ని మించి భరించే శక్తి నాకు లేదు. ఒక పిల్లతో వస్తే మళ్ళీ ఇంకో ప్రయత్నానికి గడువిస్తాను. అప్పుడు పిల్లాడు పుట్టకపోతే ఇంక దానికీ నాకూ చెల్లు అని వరమిచ్చాడు. నలుగురు పిల్లల్ని భరించే శక్తి మా పేద కుటుంబానికి లేదు. ఈ పుట్టిన బిడ్డని మీకిస్తే ఇంకో ఇద్దరు ఎడ పిల్లల్ని నేను చూసుకుంటూ చంటిదాన్నిచ్చి పంపుతాము. ఏంచెయ్యగలం అంతకంటే” అంటూ ఆవిడ కళ్ళు తుడుచుకుంది. నాకు ఒళ్ళు దహించుకుపోతోంది. మగ పిల్లాడు పుట్టే దాకా వరమిచ్చాడా.. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళసలు. ఈ విషయం మా మావగారికి కనక తెలిస్తే ఎంత ఖర్చైనా ఫర్వాలేదు ఆ పురుష పుంగవుణ్ణి కటకటాల వెనక పెట్టిచ్చేదాక వదలరు. నేను పిల్లని తీసుకెళ్ళడానికొచ్చానని ఒక నిమిషం మర్చిపోయాను. ముందు గదిలోకి వచ్చి సుబ్బు పక్కని కుర్చీలో కూచుండిపోయా. “అమ్మా ఏమీ అనుకోకపోతే మీ అమ్మాయిని ఒక సారి ఇక్కడికి రమ్మంటారా” అన్నాను. ఆవిడ వెళ్ళి కూతురిని తీసుకొచ్చారు. ఇందాక చూడలేదు కానీ బంగారు బొమ్మలా ఉంది ఆ బాలెంత. అందుకే ఈ బుడి బుడి బుజ్జాయిలందరూ ఇంత కళగా ఉన్నారని అనిపించింది. ఎదురుగా ఉన్న కుర్చీలో కూచుంది. నా కంటే బాగా చిన్నది. “మాకు దేవుడి దయవలన ఆదాయానికి లోటు లేదు మీ పిల్లల్లో ఒకళ్ళని కాకుండా ఇద్దరిని తీసుకుంటే మీకు అభ్యంతరమా” అన్నాను. సుబ్బు ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ వాళ్ళు ఏమనుకుంటారో అని ఖంగారు పడ్డాడు. “నా భర్త, నేను మా ఇద్దరి మధ్య ఆడ మగ అని తేడా లేదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అతను కాదనడు. అది అతనికి నా నిర్ణయం మీద ఉన్న నమ్మకం అందుకే అతన్ని విడిగా అడగాల్సిన అవసరం రాలేదు. నాకు, మీకు ఇష్టమయితే ఇద్దరిని తీసుకుంటా” అన్నాను. ఆవిడ “కొంచెం టయిం కావాలి” అంది. పెద్దావిడ ముఖంలో ఇంకొంచెం బాధ్యత బరువు తీరుతాయని సంతోషం కనిపించింది. “పోనీలేమ్మా మీ దగ్గర పిల్లలు సలక్షణంగా పెరుగుతారని ధైర్యంగా ఉంది” అనేసింది భరోసా ఇస్తున్నట్టు. “సరే మరి మేము వెళ్ళి రామా” అన్నాను. బిడ్డని చేతికిస్తూ ఘొల్లున ఏడ్చింది ఆవిడ. బిడ్డని ఊరికే తీసుకెళ్ళకూడదని తెచ్చిన ప్యాకెట్ పురిటి మంచం మీద పెట్టి బిడ్డని ఎత్తుకున్నా. పాపాయికి సంబంధించిన కాసిని బట్టలు, దంచిన సామ్రాణి , 11 వ రోజు ఇంట్లో ఆముదపు దీపం పెట్టి చేసిన కాటుక, సగ్గుబియ్యంతో చేసిన చాదు బొట్టు డబ్బా, పాపాయి కోసం విసిరిన సున్నిపిండి సర్ది ఉంచిన బుట్టని చేతికిస్తూ వస్తువులని వివరించింది పెద్దావిడ. “అమ్మా ధన్యవాదాలు మమ్మల్ని ఆశీర్వదించండి” అని బిడ్డని ఎత్తుకుని ఆవిడ పాదాలు తాకాను. “నువ్వు కూడా ఈ నాటితో నా బిడ్డవయ్యావు తల్లీ ఏ నాటి బంధమో ఇది” అన్నారావిడా ఆర్ద్రతగా. ఇంటికి బయల్దేరిన మా ఇద్దరికీ కొండంత సంబరంగా ఉంది. ఎవరెస్టు శిఖరం ఎక్కినట్టు గాల్లో తేలుతున్నాట్టు, దేవుడు దిగి వచ్చి అద్భుతమైన మణిని మా చేతిలో పెట్టినట్టు అపూర్వంగా అనిపిస్తోంది. అసలు ఈ ఆనందాన్ని ఎలా వర్ణించాలో తెలియట్లేదు. కొంచెం ఎక్కడొ చిన్నగా బాధ లాంటిది కలుగుతోంది కానీ ఈ ఆనందం ముందు అది తేలిపోతోంది. పాపం ఆ తల్లి ఎంత బాధ పడుతోందో అన్నా. “మనం చీకట్లని వెనుక వదిలి ఈ ఆ లేత చంద్ర కిరణంతో ముందుకు పోయి వేల పున్నములు సృష్టిద్దాం, అవన్నీ తలుచుకోకు ఇంక మనకి వెలుగే వెలుగు” అన్నాడు సుబ్బు. అవును కదా అని పాపని దగ్గరికి తీసుకున్న.. ఆటోలొ పాపని నేను పొదివి పట్టుకుంటే సుబ్బు ఒక చేతిని నా భుజాల మీద వేసి నన్ను దగ్గరగా పొదువుకుంటూ ఇంకో చేయి పాప మీద వేసి అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నాడు.. ఏయ్ అలా చూడకు బిడ్డకి ద్రిష్టి తగులుతుంది అన్నా.. నాన్న ద్రిష్టి తగలదు పిల్లా తల్లి దృష్టి గడపదాటదంట నేను ఎంత చూసినా ఫర్వాలేదు నువ్వు మాత్రం చిట్టి తల్లిని తదేకం గా చూడబోకు అన్నాడు సుబ్బు నన్ను ఆటపట్టిస్తూ...హాయిగా నవ్వుకున్నాము ఇద్దరమూ. సుబ్బు వచ్చేముందు స్నేహితుడు సంపత్ కి ఏం పురమాయించి వచ్చాడో కానీ ఇంటికెళ్ళేటప్పటికి అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య గారు, బావ గారు, అక్క అందరూ వచ్చి ఉన్నారు. అత్తయ్య మా ముగ్గురికీ ఎర్రనీళ్ళు దిష్టి తీసి , మా ఇద్దరినీ పేర్లు చెప్పమన్నారు. నేను సుబ్బు పాపాయి వచ్చాం తలుపు తీయండి అంటూ సుబ్బు పేరు చెప్పడానికి బోల్డు సిగ్గుపడిపోయాను నేను. పాపాయిని అందరూ తనివితీరా చూసుకుంటున్నారు. బాల శశిరేఖలా ఉంది శశిరేఖ అని పెడదామా పేరు అన్నారు మావయ్య గారు. నాన్నా కొంచెం తేడా శశి కిరణ్ అని పెడదామన్నాడు సుబ్బు. బ్రహ్మాండంగా ఉందని అందరూ ఒప్పేసుకున్నారు. మర్నాడు శనివారం 21 వ రోజు కాబట్టి ఈ దేవత నాకే పుట్టినట్టు 21వ రోజు చేసే సంబరాలన్నీ చేయించారు అమ్మ అత్తయ్యా కలిసి. పేరు పెట్టడం ఉయ్యాల్లో వెయ్యడం తో బాటు దత్తత తీసుకోవడం కూడా పూర్తి అయింది. మా కుటుంబం కాక ఇంకో చుట్టుపక్కల ఉన్న 10 కుటుంబాలే అయినా ఒక రోజులో అన్ని ఏర్పాట్లు ఎలా జరిగాయో అసలది కలో నిజమో నాకు అర్థం కావట్లేదు. మెళకువ వస్తే కల పోతుందేమో అన్నట్టు నేను అదో ట్రన్స్లో ఉన్నట్టున్నా. నాన్న, మావయ్య గారు, బావగారు ,సుబ్బు బయట పనులు, అమ్మ, అత్తయ్య అక్క ఇంట్లో పనులూ చూసుకుంటే ఎందుకవవు. ఆదివారం పూర్తిగా పాపాయిని వదలకుండా ఉన్నా. వంటింట్లోకి అసలు వెళ్ళను కూడా లేదు. శుక్రవారం ఒంట్లో బాగోలేదని వచ్చేసా కాబట్టి శనివారం సిక్ లీవ్ అనేసుకుని ఉంటారు కానీ ఆదివారం దాటాక మర్నాడు సోమవారం కాలేజ్ కి వెళ్ళాల్సి వచ్చింది. స్వర్గం లోంచి ఎవరో బలవంతం గా లాక్కెళుతున్న ఫీలింగ్ వస్తోంది. ఇంక రానని చెప్పినా ఇంకొకళ్ళు దొరికేవరకైనా వెళ్ళాలి. ఒక వారం అయినా పడుతుంది. అమ్మని అత్తయ్యని ఒక వారం ఉండమన్నా. ఎందుకుండరూ బంగారు బొమ్మ దొరికితేనూ. అత్తయ్యని ఎప్పటినించో వచ్చెయ్యండి అత్తయ్యా అని అడిగేదాన్ని. మీ ఇద్దరి మధ్యలో ఎందుకమ్మా అవసరం వచ్చినప్పుడు వస్తాలే అనే వారు ఇంక వదులుతానేంటీ నా దగ్గరే అని అక్కతో గట్టిగా చెప్పేసా కూడా. అమ్మ సరే సరీ ఏదో వంక చెపుతుంది ఎప్పుడూ ఈ సారి ఆ పప్పులేం ఉడకవు. క్లాస్ కి వెళుతూ పద్దుతో ఈ క్లాస్ తర్వాత నీకు శైలు కీ నాకు ముగ్గురికీ ఖాళీయే కదా కింద క్యాంటీన్ కి వెళదాం అన్నా.. అలాగే అంది. క్యాంటీన్ లో కూచుని మళ్ళీ టయిం అయిపోకముందే అన్ని సంఘటనలూ గబ గబా చెప్పేస్తున్నా. వాళ్ళని అసలు మాట్లాడనియ్యకుండా మాట్లాడినా ఇంకా బోల్డు మాటలు పుట్టుకొచ్చేస్తున్నాయి వేగంగా. ఇద్దరూ అబ్బురబడి వింటున్నారు. వాడిని నరికెయ్యాలి అంది శైలు కోపంగా.. మళ్ళీ వెళతానంటోందా పతివ్రత అంది ఈసడింపుగా.. ఆ అమ్మాయి ఏమీ అనట్లేదే వాళ్ళమ్మ మాత్రం తండ్రిలేని పిల్లల లాగా పెరగడం ఇష్టం లేదు కాబట్టి పంపుదామనే అనుకుంటోంది అన్నా. ఇప్పుడు నలుగురిని భరించలేని వాళ్ళు మళ్ళీ పిల్ల పుడితే ఐదుగురిని ఎలా పెంచుతారుట అంది శైలు మళ్ళీ. మా ముగ్గురిలో పద్దు కి చాలా ఓర్పు. ఎవరినయినా కూల్ చేస్తుంటుంది. పెద్ద కుటుంబంలోంచి వచ్చి ఉమ్మడి కుటుంబం లో ఉంటుంది. శైలూ ఆగవే తల్లీ అంత కోపం తో ఇప్పుడు పిల్లలకి చదువేం చెప్తావు అంది. నాకు చెప్పు తాడో పేడో తేల్చిపడేస్తా కేస్ పెట్టేద్దాం వాడి మీద తెలిసాక మనకి కూడా బాధ్యత ఉంటుంది కదా మంచి పౌరులుగా అంది శైలు. తొందర పడకు శైలు నిదానం గా ఆలోచిద్దాం అంది పద్దు క్లాస్ అయ్యాక ఫ్రీ పీరియడ్ లో మాధవ్ సార్ దగ్గరికెళ్ళా. చెప్పండి మేడం అన్నారు. సార్ నేను ఉద్యోగం మానెయ్యాలనుకుంటున్న మీకు చెప్దామని వచ్చా అన్నాను. అయ్యో మీకు మేము ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నామా మేడం అన్నారాయన అయ్యో అదేం లేదు సార్. నేను పాపని దత్తత తీసుకుంటున్నా. మరి తనని చూసుకోవడానికి టయిం ఉండాలి కదా అన్నా. ఓహ్ అవునా.. హార్టీ కంగ్రాజులేషన్స్ మేడం అన్నారు. కానీ మాకు ఇంకోళ్ళు దొరికేవరకైతే చేస్తారుగా అన్నారు. ఒక వారం ఉంటానండీ అంతకంటే ఉండలేను క్షమించండి అన్నాను. సీనియర్ లెక్చరర్లు దొరకడం కష్టం మేడం. ఏదైనా ఆలోచించాలి అన్నారు. పద్మ మేడం చాలా యేళ్ళుగా పని చేస్తున్నారు కదా సార్ నా సబ్జెక్ట్లు ఆవిడకి ఇచ్చి ఇంటర్ కి చెప్పేవాళ్ళని చూద్దామా ఫ్రెషెర్స్ అయినా ఫర్వాలేదు కద సార్ అలా కొంచెం ఈసీ అవుతుందేమో అన్నాను. గుడ్ ఇయిడియా మేడం. మీరు వెళ్ళినప్పుడు పద్మా మేడం ని పంపండి. ఆవిడ ఒప్పుకుంటే ఇంటర్ లెక్చరర్ కి ఆడ్ వేయిస్తాను రేపు పేపర్ లో మీకు ఎవరైనా తెలిసినా చెప్పండి అన్నారు. తప్పకుండా సార్ థ్యాంక్ యూ అని వచ్చేసాను. పద్దుకి తెలిస్తే ఎగిరి గంతేస్తుంది కానీ, ఇస్తారో ఇవ్వరో తెలియకుండా నేను చెప్పడం బాగోదు. ఈ వారం లో గట్టిగా ప్రయత్నిస్తామండీ.. మీ లాంటి మేడం ని పోగొట్టుకోవడం మా దురదృష్టం.. మీరు మళ్ళీ ఎప్పుడు రావాలనుకున్నా రావచ్చు. మా కాలేజ్ తలుపులు మీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి అన్నారు మాధవ్ సార్. థ్యాంక్ యూ సార్. అని బయటికి వచ్చేసి పద్దుతో మాధవ్ సార్ నిన్ను కలవమన్నారు అన్నా.. అలాగే కానీ.. ఏంటే బాబూ శ్రీముఖం ఏమన్నా ఇస్తారా అంది.. ఏమో తెలీదు క్లాస్ ల గురించేదో అనుకుంటా అన్నా .... రెండు రోజుల పాటు లంచూ బ్రేకూ ఖాళీ పీరియడ్లలో బుర్ర తినేస్తున్నానేమో, బుధవారం సాయంత్రం అక్కడికెళదామా ఒక సారి అంది పద్దు. బస్ ల కోసం వెయిట్ చెయ్యద్దు ఆటో లో వెళదాం శశి ని చూడాలి అన్నాన్నేను. సరే అన్నరిద్దరూ. పెద్దవిడ వచ్చింది. అమ్మా మీ అమ్మాయితో మాట్లాడాలి అన్నాను. రండి అని కుర్చీలు చూపించింది. ఆ అమ్మాయి వచ్చింది. పూర్తిగా వాడిన మల్లె తీగలాగా కళా విహీనంగా ఉంది. అమ్మయ్య మీరు ఉన్నారు.. వెళ్ళిపోయి ఉంటారేమో అని భయపడ్డా అన్నా. పాప ఎలా ఉంది అని అడిగింది దీనంగా. బంగారం లా ఉంది అమ్మ అమ్మమ్మ పెద్దమ్మ ముగ్గు రి సేవలు పగలు, అమ్మ నాన్న మెళకువగా ఉండి రాత్రి సేవలు నవ్వించడానికి ప్రయత్నించా. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయామెకి. వీళ్ళు నా క్లోస్ ఫ్రెండ్స్. మిమ్మల్ని చూస్తానంటే తీసుకొచ్చా అన్నా. ఇంకో పిల్లని దత్తత అడగడానికొచ్చారేమో అన్నట్టు చూసిందామె. సారీ అండీ ఇంక పిల్లల్ని ఇవ్వను అంది. అదేమీ మీరు వెళ్ళరా అత్తగారింటింకి అన్నాను. లేదండీ వెళ్ళను అంది.. అదేమీ అంది పద్మ అనునయంగా. ఆడ మగ అని తేడా లేకుండా ఒకేలా కష్టపడి కన్న పిల్లని అందరూ ఆహ్వానించాలని తల్లికి ఆశగా ఉంటుంది కదండీ.. మళ్ళా పుట్టేది పిల్లా పిల్లాడా అని టెన్షన్ పడుతూ అక్కడ ఉండలేను అంది ఆమె. వెరీ గుడ్ అంది శైలు.. అసలు నేను అది చెప్దామనే వచ్చాను అంది. ఆమె సన్నగా నిర్వేదంగా నవ్వింది. కానీ నేను నా పిల్లలు అమ్మా నాన్న కి బరువు అందుకని.... ఆగిందామె. అందుకని.. రెట్టించింది పెద్దావిడ ఆమె నోటి నుంచి ఏంవస్తుందో అని ఖంగారు పడుతూ... ఉద్యోగం చేద్దామనుకుంటున్నా ఇక్కడే ఉండి కానీ.... అంది ఆ అమ్మాయి. చప్పట్లు కొట్టింది పద్దు, సెహబాష్ నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంటూ. కానీ ఏంటి మళ్ళీ అంది శైల .. అంటే ఇప్పటి వరకూ ఏమీ చెయ్యలేదు కదా ఇప్పటికిప్పుడు ఏం దొరుకుతాయని అంది .ఏం చదువుకున్నారు అని అడిగా. ఎం కాం అంది. ఎప్పుడైనా పని చేసారా అన్నా. లేదు ఫయినల్ పరిక్ష మర్నాడే పెళ్ళయింది తర్వాత వరసగా పిల్లలు అంది. ఇంటర్మీడియట్ కి అకవుంట్స్ చెప్పగలరా అన్నాను. చెప్పగలనండీ బీ కాం, ఎం కాం చేస్తున్నప్పుడు ట్యూషన్లు చెప్పేదాన్నండీ అంది నిదానం గా. అమ్మాయీ నువ్వలా ధైర్యంగా ఉండు.. వెంట మేము ముగ్గురం ఉంటాము. నీ తోబుట్టువులనుకో అంది పద్దు. వీళ్ళిద్దరి సహాయం తీసుకుని మెత్తగా ఆగిపోతావేమో నా సాహాయం తీసుకోవాలమ్మోయ్ వాడిని వదిలేది లేదు మళ్ళీ నేనొక్కదాన్నొస్తా మాట్లాడదాం అంది శైలు. మావయ్యగారిని కూడా పంపుతా నువ్వెప్పుడొస్తావో చెప్తే అన్నాన్నేను ధైర్యంగా. చీకటయింది వెళ్ళొస్తాం అన్నాన్నేను. ఆమె గడప దాకా వచ్చింది. ఆ అమ్మాయి కళ్ళళ్ళో నిబ్బరంతో మెరిసిన మెరుపుకి చందమామకి సందేహం వచ్చినట్టుంది .నన్ను చందమామ అంటూనే వచ్చింది పోయింది అని స్త్రీ లింగం తో పిలుస్తారు నేను స్త్రీలింగమా పుల్లింగమా అని మబ్బు చాటుకెళ్ళి తారతో గుసగుసలాడాడు . నువ్వు ఏ లింగమైనా ఆ అమ్మాయి కళ్ళలో మెరుపులా వెలుగియ్యడమే నీ పని ఆ వెలుగుకి లింగ బేధం లేదు అంటూ చెవి మెలిపెట్టి మబ్బు చాటు నుండి ఇవతలికి లాగింది తార. ఆకాశం లో వెన్నెల చల్లగా నవ్వింది.

0 వ్యాఖ్యలు: