టేకిటీజీ

Tuesday, November 15, 2022




చిత్రం: తూలిక

14 సెప్టెంబరు, 2022   

నా స్నేహుతురాలు మణి గత సంవత్సరం ఫోన్ చేసింది చాలా కాలం తరువాత. కుశల ప్రశ్నలలోనే వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకని అడిగితే, ఉన్న ఒక్క అక్కా తనని పట్టించుకోవట్లేదని, తలితండ్రులు పోయాక ఆస్తి గొడవల వల్ల మాట్లాడడం కూడా మానేసిందని,  మొన్నొకసారి ఏదో ప్రాణాల మీదకి వస్తే తన స్నేహితురాలు పరిమళ చూసుకుందని చెప్పింది. వివరాలు చెప్తూ, గర్భాశయ సమస్య వచ్చిందని, వైద్యులు ఏదో ప్రొసీజర్ చెయ్యాలని చెప్తే అక్క కి ఫోన్ చేసినా పలకలేదని, చివరికి పరిమళ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి ప్రొసీజర్ చేయించి, పదిహేను రోజులు మంచం దిగకుండా అన్నీ చేసి పెట్టిందని చెప్పింది. పోనీలే పరిమళనే నీకు దేవుడిచ్చిన అక్క అనుకో అని చెప్పి సముదాయించి, నాకూ అటువంటి సమస్య ఒకటి ఉందనీ, అసలు ఇక్కడ వైద్యుల ఆపాయింటుమెంటు దొరకడమే కష్టంగా ఉందని, సంవత్సరం పైగా వెయిటింగ్ లో ఉందనీ చెప్పాను.  తనదగ్గరికి వస్తే తను చూపించుకునే డాక్టరు తొందరగా చూస్తారని, నన్ను తను చూసుకుంటానని, వచ్చెయ్యమని మరీ మరీ చెప్పి జాగ్రత్తలు చెప్తూ ఫోన్ పెట్టింది.    

ఇది జరిగాక ఆరు నెలలకి నాకు డాక్టర్ ఆఫీస్ నించి ఫోన్ వచ్చింది. ఆ వచ్చేనెల 2వ తారీఖు సాయంత్రం 4.45 కి రావలసిందిగా సారాంశం. కోడి కుయ్యకపోతే  తెల్లారదు అనుకుంటుంది కదా నేను కూడా అలాంటి ఒక కోడిని. పని చేస్తున్నది చిత్రగుప్తుల వారి విభాగం కాబట్టి మంత్ ఎండూ, ఇయర్  ఎండూ అవీ ఉంటాయి. ఎప్పుడైనా, ఎవరైనా సెలవు తీసుకోవచ్చు గానీ, యముడు వచ్చినా సరే "ఆగు నాకు మంత్ ఎండ్ అయ్యాక వస్తా" అని చెప్పమంటారు మా ఆఫీసు వాళ్ళు. ఎందుకంటే, ప్రతి నెలలోనూ మొదటి 5 రోజులూ ఆ విభాగంలో ఎవరు చేసే పని వాళ్ళు సక్రమంగా  చేస్తేనే,  రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి 2 అవుతుంది.  ఇంక అటువంటి సమయంలో ఎవరైనా మానేసారో..తిరుమల గోవిందుడే దిక్కు. ఆ విషయం తెలుసు కాబట్టి ఎవరమూ ఆ రోజుల్లో సెలవు పెట్టము. కానీ ఇది ఎవరో క్యాన్సిల్ చేసుకోవడం వల్ల దొరికిన అపాయింట్మెంటనీ,  మిస్ అయితే మళ్ళీ ఎప్పటికి దొరుకుతుందో చెప్పలేననీ,  భలే మంచి చౌక బేరము, సమయమూ మించినా దొరకదూ అని  ఫోన్ లో ఉన్న డాక్టర్ అస్సిస్టెంటు. సంగతులు వేసి మరీ చెప్పేసరికి, డాక్టరు గారిని కలిసి సంప్రదించడమే కాబట్టి ఒప్పేసుకుని, మా బాసిణి కాళ్ళా వేళ్ళా పడి నేను 2వ తారీఖున సాయంత్రం 3.45 కి వెళ్ళి 6 కల్లా తిరిగి వచ్చి  Month End పని చేసేలా ఒప్పించుకున్నా.   

అది పెద్ద ఆసుపత్రి కాదు. కన్సల్టేషన్ కోసం మాత్రం ఏర్పాట్లు ఉన్న క్లినిక్ అంతే. పరీక్ష చేసి, తనకి ఏదో అనుమానంగా ఉందని, క్యాన్సర్ పరీక్ష చేయించుకుంటే మంచిదని చల్లగా చెప్పారు ఆ గైనిక్ డాట్రారు.  సరే మరి ఎప్పుడు చేయించుకోవాలో చెప్తే మా ఫ్యామిలీ డాక్టరు దగ్గరికి వెళ్ళి బుక్ చేయమంటానని చెప్పాను, ఇంకో రెండేళ్ళ తరువాత మాట కదా అని భరోసాగా. డాక్టరు ఒక నిమిషం ఆలోచించి, డిలే చెయ్యడం అంత సబబుగా తోచట్లేదని, అదృష్టం కొద్దీ ఇక్కడ బయాప్సీ చేసే బేసిక్ సెటప్ ఉందనీ, ఇది తన ఆఖరి అపాయింట్మెంట్ కాబట్టి, ఇంకో పావుగంట ఉండగలిగితే బయాప్సీ చెయ్యగలనని అన్నారు.  ఇప్పుడు కాదంటే మళ్ళీ ఎప్పటికో కానీ కుదరదని అనిపించి, ఏమీ ఆలోచించకుండా సరే అనేసా. నేను ముందుగా చెప్పినట్టు అక్కడ పెద్ద ఏర్పాట్లు ఏమీ లేవు. డాక్టర్ చెప్పిన వివరణ ప్రకారం.. చిన్నదంటే అతి చిన్న సూది మొన అంత ముక్క కట్ చేసి పరీక్షకి పంపడమే కదా అని సరే అనేసా. ఒక సారి సురుక్కుమంటుంది అంతే కదా అని నేను చాలా లైట్ తీసుకున్నా, కానీ వెనక్కి వెళ్ళే ముప్పావుగంట ప్రయాణంలో కొంత దూరం వెళ్ళగానే సన్నగా నెప్పి, రక్త స్రావం మొదలయ్యాయి. అర్రే ఈ విషయం చూచాయగా అయినా చెప్పలేదే డాక్టరూ, ఇప్పుడెలా? అనుకున్నా కానీ,  రోడ్డు మూడు లేన్లలో నేను నా కార్ లో మధ్య లేన్ లో ఉన్నా. ఏడుస్తూ యెగసాయం జేస్తె, కాడీ మోకూ దొంగలెత్తుకెళ్ళారన్నట్టు, ఎక్కడో ట్రాఫిక్ జాం అనుకుంటా, అటూ ఇటూ వెళ్ళలేనంత రద్దీగా ఉంది రోడ్డు. నేననుకున్నంత వీజీ కాకుండా నెప్పి కొద్ది కొద్దిగా ఎక్కువయింది. నెప్పి కంటే ఎక్కువ చెప్పలేని అనీజీనెస్. ఎక్సిట్ తీసుకునే వీలు లేదు గాక లేదు. కొంచెం ఓర్చుకుంటే వెళ్ళిపోవచ్చని అనుకుంటూ అనుకుంటూ  కొంచెం లేట్ గానే ఆఫీస్ కి వెళ్ళిపోయాను. ఆఫీసుకెళ్ళి, ఫ్రెష్ అయ్యి పనిలో పడి రాత్రి 3 దాటాక ఇంటికి చేరి, మళ్ళీ పొద్దున్న 8 కల్లా ఆఫీసులో ఉన్నా.  

ఇది చాలా సింపుల్ ఇష్యూ నాకు. పది రోజులకి గానీ రిపోర్టు రాదు. కాబట్టి మొదలు మంత్ ఎండ్ పని చకచకా చేసేసి, ఒక వేళ రిపోర్టులో గనక అటూ ఇటూ అయితే అప్పగించాల్సినవి, ఓపెన్ గా ఉండి ముగించాల్సినవి తెలుగు భాష  పనులు చాలా ఉన్నాయి కాబట్టి, ఫోకస్ చేసి అన్నీ లిస్ట్ వ్రాసి, ఒకొక్క పనీ ముగించుకుంటూనే, తెలుగు భాష మీద ఆసక్తి ఉన్న కొందరిని పత్రిక కమిటీలో ఆడ్ చెయ్యడం,  ఆ పై నెల, ఇంకో నెలా కూడా పత్రికకి కావలసిన మెటీరియల్ అంతా కలెక్ట్ చేసి, ఎడిట్ చేసి పెట్టెయ్యడం మొదలైన వాటితో మంత్ ఎండ్ కోసం చేసినట్టే రాత్రి 3/4 వరకు పని చేసా ఆ పది రోజులూ. పది రోజుల తరువాత రిపోర్టు వచ్చింది, ఏమీ లేదని తెలిసేటప్పటికే ఆ నెల, పై నెల చెయ్యాల్సిన  పనులన్నీ అయిపోయాయి, కాబట్టి చేతి దురద కొద్దీ ఇంకొన్ని పనులు తెచ్చి పెట్టుకున్నా టైం పాస్ కోసం...అది వేరే సంగతి.

కొంత కాలమయ్యాక మళ్ళీ మణి నించి ఫోను. మళ్ళీ అక్కిళ్ళు గుక్కిళ్ళు.. "ఒసేయ్.. చెప్పన్నా ఏడువు, ఏడిచన్నా చెప్పు" అన్నాను ఏమైందోనని కంగారు పడుతూ. గర్భ సంచీ తీసెయ్యాలన్నారని, పెద్ద ఆపరేషన్ కాబట్టి భయంగా ఉందనీ సారాంశం. "అమ్మా తల్లీ, చేసిన ఆపరేషన్ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు" అన్నాను. తనకి అర్థం కాక "ఏమంటున్నావు" అనడిగింది. "అప్పుడు పరిమళ , పదిహేను రోజులూ.. "అని గుర్తు చేస్తే "అదా.. అప్పుడు బయాప్సీ కదవే చేసారు" అంది. 

నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. మొదటిసారి నా మీద నాకు జాలేసిన మాట మాత్రం వాస్తవం.

0 వ్యాఖ్యలు: