కర్మ

Tuesday, November 15, 2022





చిత్రం:తూలిక, కెనడా


(శ్రీ సాయిప్రసాద్ సోమయాజుల గారు మొదలెట్టిన  వాట్సాప్ కథలకి వారానికొకటి చొప్పున వ్రాస్తున్న కథలలో ప్రతి బుధవారం నేను వ్రాస్తానని ఒప్పుకున్న కథలలో భాగంగా)  


కెనడా బస్సుల్లో  డ్రైవర్ పక్కనే ఒక మెషిన్ ఉంటుంది. అందులోకి సరిగ్గా 2.25 డాలర్లు వేస్తే ఒక టికెట్ వస్తుంది. దానిలో ప్రస్తుత సమయం, అక్కడి నించి ఇంకో రెండు గంటల సమయం వేసి ఉంటుంది. ఈ సమయం లోపు ఎన్ని బస్సులు ఎక్కినా ఇది చూపిస్తే చాలు. అప్పట్లో నేను ఆఫీసుకి వెళ్ళడానికి 2.00 గంటలు పట్టినప్పటికీ ఆఫీస్ నించి ఇంటికెళ్ళే సమయం లో ఒక కొలీగ్ కాస్త దూరం వరకూ తన కార్ లో రైడ్ ఇవ్వడం వలన గంటన్నర సమయం తగ్గేది. ఆ సహాయం చేసినందుకు ఆవిడకి డబ్బు ఇస్తే తీసుకోదు. "నేను దింపినా, దింపకపోయినా నీ బస్సు టికెట్ ఖర్చు తగ్గదు కదా" అనేవారు. అలా ఫ్రీగా సహాయం తీసుకోవడం ఇష్టం లేక తనకంటే ముందుగా ఆఫీస్ నించి బయలుదేరి, తను వెళుతున్న వైపు కాకుండా,  వేరే డైరెక్షన్ లో  నెక్స్ట్ బస్ స్టాప్ వరకు నడిచి అక్కడ బస్ ఎక్కేదాన్ని. ఒకరోజు  నేను నడిచే డైరెక్షన్ లో ఏదో పని ఉందని వెళుతూ నన్ను అక్కడ చూసి ఫుల్ పరేషాన్ అయ్యారు ఆవిడ. "పిచ్చక్కా, నీకు అంతగా మొహమాటం అయితే, ఇండియన్ మ్యాంగోస్ వచ్చినప్పుడు తెచ్చిపెట్టు,  మాకు అవి పరమ ఇష్టం" అన్నారు. దానితో పాటు నెలకి ఒకసారి ఆవిడ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆపేట్టు, బిల్ నేను పే చేసేట్టు ఒప్పందం కుదిరింది. ఆవిడ దింపాక, ఇంకో గంటలో ఇంటి దగ్గరగా ఉన్న బస్ స్టాప్ లో దిగి, అక్కడ నించి ఒక 20 నిమిషాలు ఇంటికి నడవాల్సి వచ్చేది. 


నేను బస్ దిగాక,  నా టికెట్ ఇంకో గంట వరకూ పనికొస్తుంది. అలాంటప్పుడు దాన్ని పడెయ్యాలనిపించదు. నేను దిగే చోట బస్సు ఎక్కడానికి ఎవరైనా నించుంటే, టికెట్ కావాలా అని అడగవచ్చు. ఒక రోజెప్పుడో అడిగి ఉంటా ఎవరికైనా టికెట్ కావాలా అని. కొందరు నెలకి పనికొచ్చే పాస్ తీసుకుంటారు. ఇంకొందరు 2 గంటలు ప్రయాణం చేస్తారు. అటువంటి వారికి ఇలా ఒక గంట సమయం ఉన్న టికెట్లు ఉన్నా, మళ్ళీ వాళ్ళు టికెట్ కొనాలి కాబట్టి, తీసుకోరు. ఎవరూ తీసుకోకపోతే, అక్కడే చెత్త పడెయ్యడానికి పెట్టిన డబ్బాలో పడెయ్యడమే కానీ,  ఒకమ్మాయి కావాలంది. ఆ అమ్మాయి ప్రతి రోజూ కనబడేది.  బస్ ఎక్కడానికి డ్రైవర్ ఉన్న వైపు  లైన్ లో నించుంటారు. దిగడం బస్ వెనక తలుపు నించి దిగాలి. నేను వెనక తలుపు నించి బస్ దిగుతూనే ఆ అమ్మాయి ఉందా అని చూసుకునేదాన్ని. ఆ అమ్మాయి కూడా నేను దిగుతున్నానా అని చూస్తూ ఉండేది. లైన్ లో మరీ మొదట్లో కాకుండా ఒక నలుగురైదుగురి తర్వాత నించునేది. నేను వెనక తలపు నించి దిగగానే, ఆ అమ్మాయి ఉన్న చోటికి వెళ్ళి టికెట్ తన చేతులో పెట్టేసేదాన్ని.  ఎక్కేవాళ్ళు ఎక్కవగా లేకపోతే, ఆఖరి వ్యక్తి దిగుతూ ఉండగానే బస్ కదిలిపోతుంది కాబట్టి, ఇలా టికెట్ ఇవ్వడం లాంటిది ఉంటే, బస్ మొదలు దిగేటట్టు చూసుకుని చాలా క్విక్ గా చెయ్యాలి, ఎక్కువ సమయం ఉండదు.     


అలా ఒక రోజు నేను బస్ దిగి, ఆ అమ్మాయి చేతిలో టికెట్ పెట్టగానే, తను బస్ ఎక్కకుండా అక్కడే నిలబడి, "ఒక నిమిషం మాట్లాడవచ్చా మీతో" అని అడిగింది. "బస్ వెళ్ళిపోతోంది" అన్నాను. "ఫర్వాలేదు నేను నెక్స్ట్ బస్ తీసుకుంటా" అంది. "చెప్పండి" అన్నాను ఆగుతూ. తన పర్స్ లోంచి కొంత డబ్బు తీసి, "ఇది తీసుకోండి" అంది. "ఎందుకు" అని ఆశ్చర్యపోయా నేను. "నేను ఫ్రాన్స్ నించి అంతర్జాతీయ విద్యార్థినిగా ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఆరు నెలలు ఇక్కడ చదవడానికి వచ్చాను, కోర్స్ అయిపోయింది రేపు వెళ్ళిపోతున్నాను" అంది. "ఓహ్ అవునా..మిమ్మల్ని కలవడం చాలా సంతోషం"  అన్నాను. "అయితే, ప్రతి రోజూ మీ టికెట్ వాడుకుంటున్నాను కదా? రేపు వెళ్ళిపోతున్నాను , నా దగ్గర ఉన్న కెనడియన్ డాలర్లు ఇంక నాకు పనికిరావు కాబట్టి మీరు తీసుకోండి" అంది. "భలే దానివే పిల్లా, నాకు పనికి వచ్చేది ఏమైనా ఇచ్చానా మీకు? మీకు ఇవ్వకపోతే ఆ టికెట్ గార్బేజ్ కదా? నాకు పనికి రాని వస్తువుకి నేనెలా డబ్బు తీసుకుంటాను" అన్నాను ఆ అమ్మాయి బాగా బతిమాలడం చూసి. "నిజమే అనుకోండి కానీ, రేపు తెల్లవారి 2 గంటలకే ఫ్లయిటు, ఈ లోపు నాకు ఖర్చులు కూడా ఏమీ లేవు" అంది. "అమ్మాయీ... ఈ కాయిన్లన్నీ పట్టుకెళ్ళి, మీ ఊరిలో ఉన్న చిన్న పిల్లలకి ఇచ్చి, ఇది కెనడా దేశం కరెన్సీ, మీ కోసమే తెచ్చాను అని చెప్తే ఎంత సంతోషపడతారో ఊహించండి. అక్కడికి తీసుకెళ్ళి అందరికీ పంచండి. మా ఇంటి దగ్గర పిల్లలైతే కలకాలం దాచుకుంటారు అలా ఎవరైనా ఇచ్చినవి" అన్నాను. "వావ్.. ఈ విషయం నాకు తట్టనే లేదు సుమా! ఈ కాయిన్ల బరువు దించుకుందామనే ఆలోచనే ఇప్పటి వరకూ.  మీకు ఇద్దామని ఆగాను" అంది. "వద్దు, ఇప్పుడు వాటితో ఏంచెయ్యాలో మీకు తెలుసు" అన్నాను నవ్వుతూ. "అఫ్కోర్స్, ఇట్ ఈస్ గుడ్ కర్మా ' అంది. అప్పట్లో ఇలా కర్మ అనే పదం ఈ దేశంలో ఎక్కడా విని ఉండకపోవడంతో "సారీ.." అన్నాను మళ్ళీ చెప్పమన్నట్టుగా. "అదే.. మంచి కర్మల వల్ల మనం కలిసాము, ఇప్పుడు నీ టికెట్ రోజూ నేను వాడుకోవడం వల్ల వచ్చిన చిన్న ఋణం వల్ల మళ్ళీ జన్మలో ఇంకో సారి కలుస్తాము" అంది నమ్మకంగా. వామ్మో అనుకుని, ఇవన్నీ తనకి ఎలా తెలుసని అడిగాను.  జాతక కథలు తాను చదివానని, దానిని ఎక్స్టెండ్ చేస్తూ పునర్జన్మల మీద కూడా కొంత తెలుసుకోవాలని ఆసక్తి కలిగి, ఇంకొన్ని పుస్తకాలు చదివానని చెప్పింది. చాలా చాలా విస్మయం కలిగింది నాకు. కాసేపు అవీ ఇవీ అన్నీ మాట్లాడుకున్నాక, "సారీ పిల్లలని పిక్ చేసుకోవాలి స్కూల్ నించి, ఇలా మిమ్మల్ని కలిసినందుకు సంతోషం" అని సెలవు తీసుకోబోతుండగా, "నేను కాయిన్లు తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పిల్లలకి ఇస్తా కానీ, ఈ 10 డాలర్ల బిల్ తీసుకోవూ ప్లీస్, నేను నీకు ఋణపడడం ఇష్టం లేదు" అంది. "నువ్వు ఋణపడ్డావని ఎవరు చెప్పారు? గత జన్మలో నేను నీకు ఋణమున్నానేమో, అందుకే ఇలా కలిసి ఉంటాము" అన్నాను కాస్త దబాయింపుగా. "నిజమేలే మళ్ళీ జన్మలో కలుద్దాం సెలవు" అంటూ తను వెళ్ళేవైపు వచ్చిన బస్ ఎక్కి, చెయ్యి ఊపింది సంతోషంగా

0 వ్యాఖ్యలు: