కాపీలు తాగారా.. టిపినీలు తిన్నారా

Wednesday, November 23, 2022

మా పెద్దక్క పెళ్ళప్పుడు మధ్యవర్తి ఒక మాట మోసుకొచ్చాడు. ఆ మాట విని పెళ్ళి పెద్దలకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. అసలు ఇదేం కోరిక అంటూ ఇటువైపు మధ్యవర్తి విరుచుకుపడ్డాడు. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా పెళ్ళిలో ఉపాహారమంటే ఉప్మానే కదా. పెళ్ళి అవగానే భోజనాలే గనుకనూ, బ్రేక్ఫాస్టు బ్రేవుమనేలా తినేస్తే వండిన వంటలకి న్యాయం జరగదు కనుకనూ....పెళ్ళివారికి ఫోను, ఇంట్లో ఉన్నవారికి తలో పిడికెడూ వచ్చేట్లు పలుచటి ఉపమాలంకార ఉప్మా అనే ఉపాయాన్ని కనిపెట్టారుట మహర్షులు. అంతటి మహర్షులను కాదని ఈ కోరికలేంటట..అడిగొస్తా అంటాడాయన. "పెళ్ళి వారు చీరలడిగారా తారలడిగారా పూరీ కూరా అంతేగా.. పెళ్ళి తంతు మొదలవకుండానే గొడవలెందుకు చేయించేద్దా"మంటారు నాన్న.. "ఇదెక్కడ గోల ..అంబట్లో కుంభంలా ఇవి పెట్టుకుంటే ఆదివారంలో సోమవారమయేట్టుంద"ని ఆదుర్దాగా చూస్తున్న వంట వాళ్ళు . జూన్ నెల.. ఈదురు గాలులు, .. వర్షం.. ఇంటిముందు ఉండనా ఊడనా అంటూ ఊగిసలాడుతున్న టెంటు.. ఆ మధ్యన చిన్న కొబ్బరాకుల పందిరి... దాని చుట్టూ పిల్లల పరుగులు !! తర్జన భర్జనలయ్యాక వంటవాళ్ళ బెదురు కంటే పెళ్ళి వారి నదురే ముఖ్యం కాబట్టి "అలాగే కానిద్దాం" అన్నారు నాన్న. మా ఇంట్లోనూ, పక్క వాళ్ళ ఇళ్ళల్లోనూ ఉన్న గొడుగులన్నీ గాడి పొయ్యి మీద తెరుచుకున్నాయి. ఇంట్లో వత్తిన పూరీలు తడవకుండా పొయ్యి దగ్గరికి తేవడం గగనమవుతోంది. కూర చేసేసారు కానీ, నూనెలో నీళ్ళ చుక్కలు పడడంతో పూరీలు ఎక్కువ మొత్తంలో చేయలేకపోయారు . అందువల్ల యుధ్ధ ప్రాతిపదికన మా ఊరి రేషను షాపు గోవర్ధన్ లాగా యమా స్ట్రిక్ట్ గా ఉండే మా పిన్నిని ఏకగ్రీవంగా టిఫినీల సెక్షనుకి హెడ్డు గా ఎన్నుకున్నారు. పెళ్ళివారికి మాత్రమే దండిగా కావలసినన్ని పూరీలు వడ్డించే ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో పిల్లలకి పూరీలు అంటే మహా ప్రాణం కదా..అందరం గుటకలు వేస్తూ చూస్తుండగా వాళ్ళందరూ తిని వెళ్లే వరకు గుడ్లురిమి ఆపిన పిన్ని, మిగిలిన చల్లారిన పూరీలని లిమిట్ లిమిట్ అంటూ ఒకటీ అరా పిల్లలకి తినిపించి ఆటకి తోలేసింది. అప్పటినుంచీ నాకు పెళ్ళి లో బ్రేక్ఫాస్టు అనే మాట వింటే మా పిన్ని లిమిట్ గుర్తొచ్చి నవ్వొస్తుంది . అసలు మా ఊర్లో పెళ్ళి కొడుకు వైపు బలగం పెళ్ళికి కొన్ని గంటల ముందు వచ్చి, ఆంజనేయ స్వామి గుడిలో కూచుంటే ,బామ్మర్దులొచ్చి బతిమాలి బామాలి తీసుకెళ్ళి పెళ్ళి చెయ్యటమే తప్ప నాష్టాల నష్టాలు కష్టాలు మాకెర్కనే లెవ్వు. అయితే కొన్ని సార్లు దూరాభారాల లెక్కలో బ్రేక్ఫాస్టులు పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఉదాహరణకి. మా చుట్టాల పెళ్లి కి మహబూబ్ నగర్ వెళ్ళినప్పుడు పొద్దున పొద్దున్నే వేయించిన అటుకులు బ్రేక్ ఫాస్ట్ గా పెట్టారు. అయితే మరీ పెద్ద వాళ్ళు ఎవరూ ఆ బ్రేక్ ఫాస్ట్ తినలేక కేవలం కాఫీ తాగి, పెళ్లి అంతా అయ్యాక మూడింటి వరకు పస్తు ఉండేటప్పటికీ మరి నీరసం వచ్చి ఎక్కడికక్కడే ఒరిగిపోయారు తినడానికి కూడా ఓపికలేక! అసలు మగపెళ్ళివారు బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తినేసి పెళ్లికి ఒక గంట ముందుగా వస్తేనే మంచిదేమో .. .ఎందుకంటే.. మరీ పెళ్ళివారు ముందుగా అడిగితే తప్ప తెలుగు వాళ్ళ పెళ్లిళ్లలో బ్రేక్ ఫాస్ట్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదని చెప్పుకోవచ్చు. కొందరు పెళ్ళి లో మొక్కుబడులు ఉద్యాపనలూ చేసుకుంటూ బ్రేక్ ఫాస్ట్ అన్న పదాన్ని పూర్తిగా తీసేస్తూ ఉంటారు . దేవుని కల్యాణాలకి అయితే చెప్పనే అక్కరలేదు. అరే పెళ్ళి కదా టిఫిన్ తిని వెళదామంటే ఎవరూ ఒప్పుకోరు . మరీ మందులూ, మాకులూ వేసుకోవలసిన సీనియర్లు కూడా ఏ బిస్కెట్ లో ఏర్పాటు చేసుకోవాల్సిందే తప్ప తినేసి వెళ్ళే సవాలే ఉండదు మరి. పెళ్లి కొడుకు, పెళ్ళి కూతురూ సంగతి సరేసరి! పెళ్ళి తతంగం ఎంత లేట్ అయినా సరే... వాళ్లు అలా ఉపవాసం ఉండి నీరస పడి పోయి, అగ్నిహోత్రం దగ్గర కళ్ళు మంటలు పెట్టేస్తూ మొహం వేలాడేసుకుని ఎప్పుడో ఏ నాలుగింటికో అందరూ తిన్నాక భోజనం చేయడమే తప్ప ,చక్కగా కడుపునిండా తిని పెళ్లి చేసుకోవడం అనేది ఉండనే ఉండదు. మన దక్షిణం వైపేనేమో ఇదంతా.. ఇక్కడి కెనడాలో మనలా కనబడిన వారందరినీ " బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చెయ్యమని " పెళ్ళి కి పిలవరు . చాలా క్లుప్తంగా పాతిక యాభై మంది అంతే! ఇక పంజాబీ వారికి గుడిలోనూ, బడిలోనూ భోజనాలుంటాయి కదా! "భోజనం కోసం వచ్చినా సరే ..గుడికి రావడం ముఖ్యం" అంటారు వారి మత పెద్దలు. మరి వంట ఎవరంటారా? మొక్కు పెట్టుకున్నట్టు రోజూ గురుద్వారాకి తెల్లవారుజామున వెళ్ళి వందలకొలది రొట్టెలు చేస్తుంటారు కొందరు. సేవ చేయడానికి ఇష్టమైతే మనని కూడ గురుద్వారాకి ఆహ్వానిస్తారు. అలా ఆహ్వానించినప్పుడు అప్పటికే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు "ముందుగా కాళ్ళు చేతులు కడుక్కుని ప్రసాదం (ఫుల్లు మీలే) తినేసి రమ్మని ఆదేశము లాంటి అభ్యర్థన చేస్తారు. వారి ఉద్దేశ్యం ఏంటంటే మనము కడుపునిండా తిన్నప్పుడు మాత్రమే శ్రద్ధ ,భక్తితో ఇంకొకళ్ళకి సేవ చేసే మనసు కలిగి ఉంటామని. సరే మా అమ్మనిప్పుడు గుర్తు చేసుకోవడం అవసరమా? పోనీ చేసుకుందాం లెండి " చద్దన్నం తిన్నమ్మ మొగుడాకలి ఎరగదని చెప్తూ.. అందరూ తిన్నాక మాత్రమే తినాలి, కనపడిందని ముందు తినెయ్యకు అసలే పెద్ద కోడలివి అని చెప్పి పంపింది లెండి.. కానీ, మనకు కడుపు నిండి నప్పుడు మనము నిదానంగా తృప్తిగా ఇంకొకళ్ళకి చక్కని సేవచేసే అదృష్టం కలుగుతుంది కదా ! నాకు ఈ అభిప్రాయం సరియైనది అనిపిస్తుంది. కానీ మా అమ్మ శిక్షణ ఇచ్చింది కదా అలవాటయిపోయింది అలా. . సరే , మన పంజాబీలకి గుడిలోనే ఇంత ఉందంటే ఇంక పెళ్ళిలో ఊహించండి. స్నాక్సే చాలు ..పసందుగా పాతిక రకాలు. అందరూ తింటే కానీ పని మొదలెట్టరు. ఈ మధ్య ఆఫీసులో పెళ్ళి అనే అంశం మీద మాట్లాడుకుంటుంటే ఒక సహోద్యోగి " బాబోయ్ వీళ్ళ ఇళ్ళలో పిల్లలని పెళ్ళి చేసుకునేరు తల్లోయ్.. పెళ్ళి పీటలమీదే నిరాహారదీక్షతో హత్యకు పాల్పడతారు. అబ్బాయికి, అమ్మాయికి, వారి తల్లిదండ్రులకీ ఉపవాస దీక్ష... ఏమీ పెట్టకుండా పెళ్లి చేస్తారుట "అని చెపుతూ "కదా ? " అంది నా వైపు చూస్తూ. నేను అవునని చెప్పనా కాదని చెప్పనా అని ఆలోచిస్తూ ఉండగా " మరి ఆకలితో నకనకలాడుతూ పెళ్లి ని ఎలా ఎంజాయ్ చేస్తారు?" అని అడిగింది . నాకు ఆ పాయింట్ సరిఅయినదే అనిపించింది. కానీ అందరిలో ఏమనాలో తెలియక " ఏదో మంచికారణం చేత పెట్టి ఉంటార”ని సమర్థించడానికి ప్రయత్నం చేసా. ఈ అమ్మాయి అందుకుని " మాలో ఏ పరిస్థితిలోనైనా సరే ఆకలిగా ఉండడం నిషిద్ధం. పెళ్ళి, పేరంటం ,చావు, దినం ఏదయినా సరే..లోపలికి వస్తుండగానే గడపలో ఒక వ్యక్తి మనని స్నాక్స్ ఉన్న వైపు తీసుకువెళ్తారు. తిన్నాకే ఏదైనా" అంది. " మాలోనూ అంతే ..కానీ " అనబొయ్యా.. " నాకు కతలు చెప్పకు.. నా చిన్నప్పటి ప్రాణ ప్నేహితురాలు ప్రియ తెలుగమ్మాయే . ఆ అమ్మాయి పెళ్ళికి కుటుంబం మొత్తం రావాలని మరీమరీ చెప్పింది. ఆదివారం పెళ్లి. అసలే అందరూ ఆలస్యంగా లేచిన మూలాన పిల్లల్ని రెడీ చేసి భర్త అత్తమామలతో వివాహానికి హాజరయ్యాను. వెళ్ళి చూస్తే అక్కడ మా ఇళ్ళలో పెళ్ళికి మల్లే బ్రేక్ ఫాస్ట్ కు సంబంధించిన విషయాలేవీ కనబడలేదు. కాసేపు పలకరింపులు అయ్యాక మాకు సుఖాసీనులు అవమని స్థలం చూపించిన ప్రియ అన్నయ్య మాయమయ్యాడు. తర్వాత ఇంక తెలిసిన వాళ్ళు ఎవరూ కనబడలేదు . పిల్లలు ఆకలి అని అల్లరి మొదలెట్టారు. అత్తమామలు కూడా ఆకలి అనడంతో ఏమీ పాలుపోక నెమ్మదిగా చుట్టుపక్కల ఏమైనా చిన్న చిన్న రెస్టారెంట్స్ కానీ దుకాణాలు కానీ ఉన్నాయేమో ఏదైనా తినేసి వద్దామని బయటికి వెళ్ళబోయాము. ఆ పెళ్ళి హాలు రెండు మూడు సెక్షన్లుగా ఉంది. అంటే మూడు సెక్షన్లూ విడిగా అద్దెకిస్తారన్నమాట. ఆ రోజు అక్కడ ఒక వైపు తెలుగు పెళ్ళి, ఇంకొకవైపు పంజాబీవాళ్ల పెళ్లి అవుతోంది. మేము ఇలా బయటికి వెళ్లామో లేదో ఒక చుట్టాలతను కనబడి ఎక్కడికి వచ్చారని అడిగాడు. ఇలా సౌత్ ఇండియన్ ఫ్రెండ్ పెళ్లికి వచ్చామని, బ్రేక్ ఫాస్ట్ గట్రా ఉన్నట్లు లేవని, పిల్లలు, అత్తమామలు ఆకలిగా ఉన్నారు కాబట్టి బయట ఏమైనా తినడానికి బయలుదేరామని చెప్పాము. దానికతను " భలే వారే! ఇటు మన పంజాబీ కుటుంబమే ! మనకి బాగా తెలిసిన వాళ్లే ఇటు రండి అని చెప్పి , స్నాక్స్ తినడానికి అటువైపు తీసుకుని వెళ్ళాడు. మొహమాటపడుతూనే కొన్ని స్నాక్స్ పిల్లలకి ఇప్పించి వెనక్కి తిరిగి వస్తుండగా పెళ్లి కూతురు తల్లి ఏదో తేవడానికి వెనక్కి వెళుతూ ఎదురైంది .పట్టుబడి పోయిన దొంగల లాగా మేము చాలా మొహమాటం పడిపోయాము. ఆవిడ అదోరకంగా చూస్తూ "ఎక్కడికి వెళ్లారు "అని అడిగింది. పిల్లలు చేతుల్లో కొన్ని స్నాక్స్ ఉండనే ఉన్నాయి. ఇంకనిజం చెప్పక తప్పిందికాదు. ఇలా పక్కన స్నేహితుల పెళ్లి జరుగుతోందని , పిల్లలు ఆకలి తట్టుకోలేకపోతుండడంతో స్నాక్స్ తినడానికి వెళ్లామని, ఇలా వెళ్లినందుకు ఏమీ అనుకోవద్దు అని చాలా మొహమాటంగా చెప్పుకొచ్చాము. ఆవిడ " మంచి పని చేశారు. అసలు...నాదీ అదే పరిస్థితి. కడుపులో నక నక లాడిపోతోంది. మా పెద్దవాళ్ళు కన్యాదానం చేస్తున్నామని నిన్న రాత్రి నుంచి ఉపవాసం ఉంచారు . నాకా షుగరు. నేను ఇంక ఒక్క నిమిషము దాటినా ఏ పనీ చేసే పరిస్థితిలో లేను. కళ్ళు తిరిగి పోతున్నాయి. మా పెళ్ళి తంతు జరిగి భోజనాలు అయ్యేటప్పటికి ఇంకో గంట పైగా పట్టే ఉంది. అందుకే ఏమైనా దొరుకుతాయేమో అని నేను ఇటు వచ్చాను మీరు ఏమి అనుకోకపోతే నాకు కూడా ఏమైనా చిన్న స్నాకు తెచ్చి పెట్టగలరా అక్కడినుంచి "అని అడిగింది . ఆశ్చర్యపోవడం మా వంతయ్యింది. అప్పుడు కానీ తెలిసింది కాదు మాకు. వామ్మో ! ఆ ఉపవాసాలేమిటో....తిండిలేని పెళ్ళి ఏమిటో !" అంది. ఈ స్టోరీ విన్న తర్వాత మా ఇంట్లో ఏ పెళ్లి పేరంటం జరిగినా మొదట " స్నాక్స్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ అంటూ పాట పాడి ..కాపీలు త్రాగారా టిపినీలు తిన్నారా అని అడగడానికి ప్రత్యేకంగా అరవై మందిని అమర్చాలని డిసైడ్ చేస్కున్నాను. ఇండయాలో కాసిని రోజులు తిరిగొచ్చిన నా పిల్ల మాత్రం...అలా పస్తులుంచే పెళ్ళి ఇండియాలో చూడనేలేదనీ , అన్ని చోట్లా పోటీలు పడి బోలెడు ఐటెమ్స్ పడుతున్నారని చెప్పింది. ఏదిఏమైనా' మీరు కూడా తగిన తిండి ఏర్పాట్లు చేయండి. లేకపోతే నాలాంటి వాళ్లు చెక్కరొచ్చి పడిపోతే మళ్ళీ ఆంబులెన్స్ ఖర్చులు ఆస్పత్రి ఖర్చులు మీవే అని పత్రం రాసి ఇయ్యాల్సిందే....

0 వ్యాఖ్యలు: