పెన్నీ

Tuesday, November 15, 2022

 



చిత్రం:తూలిక, కెనడా


నేను కెనడాకి వచ్చిన కొత్త. ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీలలో రిజిస్టర్ చేసుకుంటే టెంపరరీ ఉద్యోగాలు చూపిస్తారని తెలిసి, రిజిస్టర్ చేసా. ఒక ఏజెన్సీ వాళ్ళు ఫోన్ చేశారు, మూడు నెలలు ఎవరో సెలవులో వెళుతున్నారు కవర్ చెయ్యమని. వెళ్ళగానే పెన్నీని పరిచయం చేశారు సెలవులో వెళ్లేది ఈవిడే అని. మనం బుడ్డి కాసు అని పిలుచుకున్నట్టు పేరు భలే ఉంది ఈవిడ పేరు అనుకున్నా. 


రెండు రోజులు పని నేర్పాక, మూడో రోజు పెన్నీ సగం పూట సెలవు పెట్టి వెళ్తుంటే "హావ్ ఎ గుడ్ డే" అన్నాను. "నథింగ్ గుడ్ స్వీటీ... బయాప్సీకి వెళుతున్నా. వచ్చే వారం బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ ఉంది అందుకే సెలవు పెట్టడం" అంది. అయ్యో పాపం అనుకుని "ఎవరొస్తున్నారు తోడు" అని అడిగా. ఆమె నవ్వింది. "నా ముసలి తండ్రి, నేను ఉంటాం అంతే.." అంది. "అయ్యో నేను రానా" అని అడిగా కానీ, తను లేనప్పుడు నేను ఉండాలని కదా నన్ను తీసుకున్నారు. ఎవరో ఒకరు కుర్చీలో ఉంటే కానీ కుదరని రోజువారీ చెల్లింపులు చేసే బిజీ జాబ్ అది.


ఇంటికెళ్ళి పెన్నీ విషయం మా సీతయ్యకి చెప్పాను.  తనకి రాత్రి షిఫ్ట్ కాబట్టి, పొద్దున్న పని నించి రాగానే ఆస్పత్రికి వెళ్ళి, డాక్టర్ వ్రాసిచ్చిన  మందు మాకులు కొనిచ్చి, నేను వండిన అన్నం టిఫిన్లు  పెన్నీకి, వాళ్ళ నాన్నకి అందజేయడానికి తను వెళతా అన్నారు. భలే సంతోషపడి పెన్నీకి మర్నాడు  చెప్దామనుకున్నా కానీ మర్నాటి నించీ పెన్నీ ఆఫీస్ కి రాలేదు. ఒక వారంలో సర్జరీ అని చెప్పింది కదా ఎవరినీ అడగాలి? ఏ హాస్పిటల్  అని ఎలా తెలుసుకోవాలి? పాపం తనకి తోడు ఎవరుంటారు? అని ప్రాణం విలవిల లాడింది.  హెచార్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే.. పెన్నీని అడగకుండా తన వివరాలు ఎవరికీ ఇవ్వకూడదని చెప్పారు. అసలు తనకి సర్జరీ అని కూడా ఎవరూ ఓపెన్ గా మాట్లాడుకోలేదు.  


అయ్యో అయ్యో అని బాధపడుతుండగా పెన్నీకి సర్జరీ విజయవంతంగా జరిగిందని హెచార్ అమ్మాయి రీటా నోరు జారింది లంచ్ టయింలో. నాకు తన వివరాలు వద్దు కానీ, నేను తనకి సహాయం చెయ్యాలనుకున్న విషయం నా మాటగా చెప్పి నా ఫోన్ నంబరు తనకి ఇవ్వమని బతిమాలాను.( మాకు బాగా కొత్త.. ఇక్కడ సిస్టమ్ అస్సలు తెలియదు మరి, ఇంటి దగ్గర లాగా పేషంట్ కి ఒకరు దగ్గర ఉండాలి కదా అని స్ట్రెస్ అయ్యా, తనకి క్లోస్ అనుకున్న ఫ్రెండ్స్ పట్టించుకోరేంటీ అని కోపం తెచ్చుకున్నా కూడా).    


నా మెసేజ్ చూసి పెన్నీ సంతోష పడింది అనీ, ఇక్కడ ఎవరూ ఒకరింటికి ఒకరు వెళ్ళరు కాబట్టి తను ఆస్పత్రిలో వుండగానే, తనకి క్లోస్ అయిన ఆఫీస్ స్టాఫ్ వెళ్లి చూసి రావాలని అనుకుంటూ ఉన్నట్టు కబురు పంపామని,  కానీ తను రెడీగా ఉన్నానని చెప్పే దాకా ఎవరూ  రావద్దు అని పెన్నీ చెప్పిందని చెప్పింది రీటా. "ఇదేంటి తను రెడీగా ఉండడమంటే.. అప్పుడు మన అవసరం తనకేం ఉంటుంది" అని నేను ఒకటే ఇదయ్యా.. 


చివరికి ఒకరోజు ఆఫీసులో ఉండగా పెన్నీ నించి నాకు ఫోన్ వచ్చింది. నేను చాలా ఎమోషనల్ అయ్యి.. అవసరానికి రాలేకపోయామని, తన  వివరాలు ముందే తీసుకోవలసి ఉండవలసింది అనీ బాధ పడ్డా. "నిజమే అనుకో.. కానీ, ఇంతవరకూ మేకప్ లేకుండా నేను నా ముఖం ఎవరికీ చూపలేదు. నీకు చూపుతానని ఎలా అనుకున్నావు" అంది పెన్నీ కూల్ గా. మేకప్పు లేని నా ముఖం పాలిపోయిందని,  స్పష్టంగా తెలిసీపోయింది నా చుట్టూ కూచున్నవాళ్లకి.

0 వ్యాఖ్యలు: