కరివేపాకు

Tuesday, November 15, 2022

 చిత్రం: తూలిక, కెనడా

శ్రీ సాయి ప్రసాద్ సోమయాజుల గారి వాట్సాప్ కథల సంఖ్య: 193

21 సెప్టెంబర్, 2022 

1981 ప్రాంతాల్లో మా పెద్దక్క పెళ్ళి.  26 ఏళ్ళ చెట్టంత కొడుకు చనిపోయిన దుఖంలో అమ్మా నాన్నా. "వాడు పోతే మేము లేమా" అని అన్నయ్య జిగ్రీ దోస్తులు ఇద్దరు, వారితో పాటు వాళ్ళ దోస్తులు ఇంకో ఇద్దరు. ఆ నాటి నించీ సొంత అన్నల కంటే రెండాకులు ఎక్కువే. స్వంత అన్నలు ఉద్యోగ రీత్యా వేరే ఊర్లలో ఉండగా, ఇంట్లో అన్నిటికీ వాళ్ళే. ఈనాటిలా ఈవెంటు మ్యానేజ్మెంట్లు లేవుగా మరి! అన్నీ మనమే చేసుకోవాలి. కొంచెం పొదుపుగా సాగిపోవాలి అన్ని విషయాలూ. పాలు, పూలు బేరమాడి మాట్లాడడం దగ్గర నించీ అన్నిటిలో అన్నల చేదోడు.  

ఇంటి ముందు పెళ్ళి. పెళ్ళు ముందు రోజు పొద్దున్నే టెంట్ హౌస్ వాళ్ళు డేక్షాలు, గుండిగలూ, డ్రమ్ములూ పడేసి పోయారు. అవన్నీ తోమి, డ్రమ్ముల్లోనూ గంగాళాల్లోనూ బావి లోంచి తోడిన నీళ్ళు నింపి, టెంటు వేయించి, దాని లోపల కొబ్బరాకుల పందిరికి కావలసిన కొబ్బటి మట్టలు కొట్టి పట్టుకొచ్చి, సీరియల్ లైట్లు పెట్టడం, కూరగాయలు పట్టుకురావడం లాంటి పనులతో వాళ్ళు నలుగురూ బొంగరాల్లా తిరిగారు. అవసరమైనచోట్ల వాళ్ళ స్నేహితులని కూడా తెచ్చుకున్నారు. 

అమ్మకి ఉన్న అన్నదమ్ములు అందరూ చిన్నవయసులోనే చనిపోగా,   ఒక్క చిన్ని తమ్ముడు మిగిలాడు. తనకి ఏదో గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్ష ఉండడంతో పెళ్ళికి రానని ఉత్తరం వ్రాసి పడేసాడు. దాంతో, ఊర్లో ఉన్న ఇంటి అల్లుడు వరసయ్యే దూరపు చుట్టం ఒకాయన్ని మేనమామ తరఫు తంతులు పూర్తిచెయ్యడానికి పిలుస్తూ, నాలుగు రోజుల ముందే వస్తే, అమ్మ వైపు పెద్ద దిక్కుగా ఉండవచ్చని చెప్పి వచ్చారు అమ్మా, నాన్న. వాళ్ళు పెళ్ళికి ఒక రోజు ముందు సాయంత్రం వచ్చారు. అమ్మ బోలెడు సంబర పడింది. 

పెళ్ళి రోజు ముందు రాత్రి వరకూ పని చేసిన అన్నలు నలుగురూ పెళ్ళి అవుతున్నప్పుడు నామ మాత్రంగా కనబడి వెళ్ళిపోవడం గమనించిన అమ్మ, పెళ్ళి, అప్పగింతలూ అయ్యేదాకా ఆగి, వాళ్ళని రమ్మని చెప్పి పంపింది. వచ్చారు నలుగురూ.. అంతంత పనులు చేసి, పెళ్ళి ముగిసే సమయానికి ఎటు పోయారని చీవాట్లు పెట్టింది అమ్మ. వాళ్ళు మాట్లాడలేదు. అమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది, "ఆ మూడోవాడిని మీ రూపంలో చూసుకుంటున్నానని తెలుసుకదా? పెళ్ళి భోజనం చెయ్యకుండా ఎటు వెళ్ళారు" అంటూ. ఫర్వాలేదు ఫర్వాలేదు భోజనానిదేముందీ అని  మొహమాటపడిపోతూ ఉన్న వాళ్ళని విషయమేంటో చెప్పమని వత్తిడి చెయ్యగా చెప్పారు.  పెళ్ళి ముందు రోజు రాత్రి పందిరి పనులూ అవీ పూర్తి చేసి, కాసేపు గాలికి నించుని కబుర్లు చెప్తున్న వీళ్ళతో " తిండి కోసం వెయిట్ చూస్తున్నట్టున్నారు, తినేసి పొండి పనైపోతుంది, మళ్ళీ పొద్దున్నే లేవాలి కాబట్టి ఇంట్లో అందరూ పడుకోవాలి, మీరిక్కడ టైంపాస్ చేస్తుంటే వాళ్ళెలా పడుకుంటారు" అని ఆ మేనమామ గారు అన్నారని, వాళ్ళు మనసు కష్టపెట్టుకున్నామని చెప్పారు. అమ్మ చాలా బాధ పడింది. అతని తరఫున అమ్మా నాన్న వాళ్ళ నలుగురికీ క్షమాపణలు చెప్పినందుకు వాళ్ళు నొచ్చుకున్నారు. అయితే, ఆయన అన్న మాటలకి వాళ్ళు ఇంక రాకుండా కూడా ఉండవచ్చు, కానీ పెళ్ళి రోజు పొద్దున్నే వచ్చి, చెయ్యాల్సినవన్నీ చేసి, తినకుండా వెళ్ళిపోయారంతే. ఆ నిబధ్ధతని చనిపోయేవరకూ అమ్మ తలచుకుంటూనే ఉండేది, ఆ నాటి తప్పిదానికి బాధ పడుతూ. 

అప్పటి కాలమా, ఇప్పటి కాలమా అని కాదు కార్పొరేట్ సెక్టర్ల నించి, కాలేజీ వయసులో జరిగే  చిన్న చిన్న వ్యవహారాల్లో కూడా పని ఒకడిది, పవర్ ఒకడిదిగా ఉంటూనే ఉంటుంది. అలా ఎందరున్నా మా అన్నల లాంటి వారి నించి నేర్చుకున్న పాఠాలు తొందరగా మరచిపోలేము. ఏదేమైనా మన పని మనం చేసుకుంటూ పోవడమే అనుకునే పని తీరున్నవాళ్ళు ఇంకా ఉండబట్టే కార్పొరేషన్లు కానీ కరివేపాకు దుకాణాలు కానీ నడిచిపోతున్నాయంతే!  ఏమంటారు?

0 వ్యాఖ్యలు: