వింత నాటకం

Wednesday, November 23, 2022

ఆ సంవత్సరం ఆ టైమ్ లో పిల్లలు యూనివర్సిటీ లో మిడ్టర్మ్ పరీక్షలతో బిజీ, సీతయ్య పనిమీద భారతయాత్ర. నాకు అకాణంగా అరికాళ్ళకి ఏదో ఇన్ఫెక్షన్/మెడికల్ రియాక్షన్. అడుగుతీసి అడుగెయ్యలేని పరిస్థితి. ఇంకోవైపు ఆఫీసు లో యూనియన్ ఎంప్లాయీస్ స్టైక్ కాబట్టి నాన్-యూనియన్ ఎంప్లాయీస్ ఏ వంకలు పెట్టకుండా ఆఫీసుకెళ్ళి పని ఆగకుండా చూడాలని మేనేజ్మెంట్ నుండి బేషరతు వార్నింగ్. ఎముకలు కొరికే చలి. డ్రైవ్ వే గంటలతరబడి క్లీన్ చేస్తే కానీ కారు కదలనంత మంచు. కాసేపు సీతలా కాసేపు పీతలా ఎలాగోలా అన్నీ చేసుకుంటూ పోతుంటే పురుగు మీద పుట్రలా నిమోనియా. డాక్టర్ ఇచ్చిన మందులేవో వేసేసుకుంటే అర్థరాత్రి ఏదో అయిపోయి అరదూరం ఆకాశం వైపు ప్రయాణించి దాదాపు 16 గంటల తరువాత నేనెక్కడున్నా అని చూడడానికి ఓపికలేక ఎవరైనా ఒకచుక్క నీళ్ళో పాలో పోస్తే బాగుండుననే తీరని ఆశ. పాక్కుంటూ మెట్లు దిగి దొరికిన పండు తినేసి స్పృహలో ఉండడానికి ప్రయత్నం. అంటువ్యాధని అనుమానంతో అవునూ కాదూ అంటూ అయిదు రోజుల సెలవు. అందులో రెండు వీకెండు రోజులు. అనగా మూడు రోజుల సెలవిచ్చారు అన్నమాట. పిల్లలకిి పరీక్షలు తెలిస్తే పరీక్షలు మానేసి వచ్చేస్తారని భయం , ఇండియాలో తెలిస్తే పనులు మానుకొని సీతయ్య వచ్చేస్తారని టెన్షన్...మంచుకురిసే వేళల్లో ఎవరిపనులు వారికే తీరవు కాబట్టి ఎవరికీ అనారోగ్యం గురించి చెప్పలేని మొహమాటం....అప్పుడొచ్చింది పుట్టినరోజు. ప్రతి సంవత్సరం కొత్త చీర కట్టుకున్నావా అని అత్తయ్య అడిగినప్పుడు గుడికెళ్ళావా అని నాన్న అడిగినప్పుడు అవునని చెప్పి నవ్వుకునేదాన్ని ఎలా కుదురుతుంది అని.. ఆ సంవత్సరం ఆదివారం పుట్టిన రోజు వచ్చింది కాబట్టి ఆ రెండూ చెయ్యాలని పట్టుదల. అంటే చెప్పా కదా ఆకాశం వైపు ప్రయాణం. మళ్ళీ ఇంకో పుట్టిన రోజు వచ్చేనో రానో ఆ పెద్దోళ్ళిద్దరికీ ఒక్క సారన్నా నిజం చెప్పాలని తపన కావచ్చు . ఈలోపు మా శక్కు Shakuntala ఫోన్ చేసింది. రేపు గుడికెళదామా అన్నా. రేపు కాదులే నాకు పనుంది ఎల్లుండి వెళదామా అంది. నా పుట్టినరోజు అసలు ఎల్లుండే. హమ్మయ్య అనుకోకుండా భలే కుదిరింది అనుకున్నా. నాకు బాగోలేదని తెలియదు కాబట్టి వాళ్ళింటి కొచ్చి పిక్ చేసుకోమంది. మొత్తం ఆస్ట్రోనాట్ లా తలనించి పాదాల వరకూ కప్పుకుని వాక్ వే మాత్రం ఎలాగోలా క్లీన్ చేసొచ్చి పడుకుంటున్నా కానీ కార్ తీయాలంటే మంచుపర్వతాన్ని కదిలించాలెలాగో అనుకుంటూ బీరువా వెతికా. ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త బట్టల్లేవు. ఎలగెలగా అని ఆలోచిస్తూ..ఎప్పుడూ లేంది ఈ కోరికేంటి అని విసుక్కుంటూ తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నా. మీరు నమ్ముతారో లేదో కానీ శనివారం రాత్రి 12 గంటలప్పుడు హాప్పీ బర్త్ డే టు యు అంటూ పిల్లలు సీతయ్య..కుటుంబం అంతా ఫోన్ చేసే దాకా పెయ్యిమీద సోయిలేదు. జవాబు చెప్పే ఓపికగా లేదు. పొద్దున నెమ్మదిగా లేచి మంచుపర్వతాన్ని కదిలించే ఓపిక ఎలా వచ్చిందో మరి ..సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని గుర్తుచేసుకుంటూ పద్మవ్యూహం ఛేదించి బయటపడ్డా. శక్కు పది గంటలకి రమ్మంది. గుడినించొచ్చాకా అపాయింట్ మెంట్ ఉందిట తనకి. తను చాలా ఠంచను. తనెప్పుడూ ఎక్కడికీ లేట్ రాదు. లేట్ చేసేవాళ్ళని విసుక్కుంటుంది. ముందే చెప్తే ఇంకో పని చేసుకునే దాన్ని కదా సరిగ్గా టైమ్ చెప్పమంటుంది కానీ దుకాణాలు పదికి కానీ తెరవరు. ఎలా ఎలా అనుకుంటూ శక్కు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆగా అటూ ఇటూ చూస్తూ .కొట్టు తెరవగానే ఏదోటి కొనేసి రయ్యిమని 5 నిమిషాలలో వెళ్ళిపోవచ్చని మాస్టర్ ప్లాన్. అబ్బ భలే ..ఈ కొట్టు వారెవరో 9.40 కే షాపు తెరిచారు. లోపలికెళ్ళి చూస్తే హెవీ వర్కున్న చీరలు సూట్లు.. చీరలు కట్టే వెదరు కాదు కాబట్టి అలవాటు లేని పంజాబీ సూట్లు చూద్దామని ముందే అనుకున్నదే కాబట్టి చూస్తుంటే ఎంతవెతికినా ఒక్కటంటే ఒక్క జత కూడా నా సైజుకానీ నేను వేసుకునే సింపుల్ వి కానీ లేవు. పెద్ద ఫంకషన్లకి పంజాబీ లు వాడే చమక్ ధమక్కులు. అయ్యో తెలియకుండా ఇరవై నిమిషాలు అయింది. శక్కు కి పావుగంట లేటు అని చెపుదామని ప్రయత్నిస్తే ఫోన్ ఎత్తలేదు. దగ్గరలో ఉన్న నిమ్మికి చెప్తే ఇన్ఫార్మ్ చేస్తుందని నిమ్మికి, సోదరులు కిరణ్ గారికి ఎన్నిసార్లు చేసినా ఎవరూ ఫోన్ తీయలేదు. సరేలే గబగబా వెళ్ళి పోదాం ..జిగేల్మనేవైనా సరే కొత్త బట్టలు కావాలంతే అని డిసైడ్ అయినా ఒక్కొక్క జతలో నాలాంటి వారిద్దరు పట్టేట్టున్నాయి. ఈరోజు కొనుక్కుంటే రెండు రోజుల్లో సైజు చేయించి ఇస్తామన్నారు దుకాణదారులు. వద్దులెమ్మని నిరాశగా వెళ్ళి పోతుంటే ఫైనల్ సేల్ అని వ్రాసున్న వాటిలో ఒక్కటంటే ఒకటి నా సైజుది కనబడింది. మన స్టయిలు కాదు బట్ ఇట్సోకే...చాలా ఖరీదైనా 80%డిస్కవుంటుట..భలేమంచి చవక బేరమూ. ఒకసారి వేసుకుని గుడ్విల్ లో పడెయ్యచ్చు అనుకుంటూ ఛేంజ్ రూంలో చకచకా మార్చుకుని డబ్బులు కట్టేసి వెళ్ళి పోతున్న నన్ను వాళ్ళు కాస్త వింతగా చూసినా నేను పట్టించుకోలేదు. ఈలోపు శక్కు గారమ్మాయి Anupama నించి ఫోను, ఆంటీ ఎక్కడున్నావని. 'పది నిమిషాలలో మీ అపార్టుమెంటు దగ్గరుంటా. అరికాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నాయి కిందకొచ్చెయ్యండి వెళ్ళిపోదాం' అన్నా. కానీ 'ఆంటీ అమ్మ ఇంట్లో లేదు. ఎక్కడికో వెళ్ళింది మీకేమైనా చెప్పిందా' అనడిగింది. 'లేదు రా ఏమైనా గొడవైందా' అన్నా అమ్మాయి గొంతులో పలికిన విషాదాన్ని గుర్తించి. 'అవును ఆంటీ పైకి వస్తారా మరి. అమ్మకి మీరు ఫోన్ చేద్దురుగాని నాకు భయంగా ఉంది' అంది. వాళ్ళు ఇద్దరూ ప్రేమ మీరినప్పుడు డిష్యుండిష్యుం అయితే నేనే జడ్జీని. అబ్బా ఇవాళ గుడి కాన్సిల్ అనుకుంటూ, అడుగుతీసి అడుగేస్తూ అపార్టుమెంటులోపలికి నడిచా. ఇంకోవైపు నించి శక్కు నాకెదురొచ్చింది. 'అదేంటి రెడీ కాలేదు. ఇక్కడ ఉన్నావేంటీ గుడికెళ్ళట్లేదా మనం' అన్నా ఏమీ తెలియనట్లు . 'మెయిల్ తీసుకుందామని మెయిల్ రూం కి వెళ్ళా' అంది నిర్లిప్తంగా. పెద్దగా మాట పలుకు లేదు..'రా' అంటూ లిఫ్టు వైపు దారి తీసింది. అయ్యో అమ్మో అని మనసులో అనుకుంటూ కాస్త తేలికపరుద్దామని 'శక్కూ ఈరోజు నా పుట్టినరోజు తెలుసా' అన్నా. నా పుట్టినరోజు కాబట్టి ఇద్దరూ సద్దుకు పోతారని ఆశ. 'ఓ అవునా' అంది నిరాసక్తంగా. 'హాప్పీ బర్త్ డే చెప్పవా మరి' అన్నా..'చెప్తాలే రా' అంది ఇంట్లో కి దారి తీస్తూ. ఓర్నాయనో పుట్టిన రోజు అని చెప్పినా కదలికలేదంటే ఈ డిష్యుండిష్యుం ఎప్పటిలా తాటాకుమంట కాదన్నమాట. ఇప్పుడు చిన్నది ఏడుస్తుందా. దాని కంట్లో నీరు చూస్తే నాకు మనసు అల్లకల్లోలం అయిపోతుంది..దేవుడా దేవుడా..అసలు భక్తీ గిక్తీ లేని నాకు గుడికెళ్ళాలని పట్టుదల ఏంటో...ఈ సారి తప్పకుండా వెళ్తా అని నాన్నకి చెప్పినందుకే కదా పోనీలే ఇప్పడేం కొంపలంటుకోవు వెళ్ళకపోతే టేకిటీజీ అని ఆలోచిస్తూ శక్కు ని ఫాలో అయిపోయా కామ్ గా. తలుపు దగ్గర ఆగి 'నుప్వేపో లోపలికి' అంది. నీ అలకలు చిలకలెత్తుకెళ్ళా అనుకుంటూ తలుపుతోసా. ' హాప్పీ బర్త్ డే టు యు ' అనుకుంటూ అను, నిమ్మి, కిరణ్ గారు, వాళ్ళ మేనల్లుడు హేమంత్. నేను ఆశ్చర్యం లోంచి తేరుకుని ' ఈ వింతనాటకాలేంటమ్మా అసలు మీరందరూ ఎప్పుడొచ్చారసలు' అన్నా అయోమయంగా. 'నువ్వు శనివారం గుడికెళదామని అడిగినప్పుడే కావాలని ఆ రోజు కుదలదు ఆదివారం వెళదామన్నా . నిన్ను ఇంట్లోకెలా రప్పించాలో తెలియలేదు అందుకని' అంటూ నవ్వేసింది శక్కు. నిమ్మి కిరణ్ గారు కావాలని ఫోన్ తీయలేదని ఇష్టం గా ఒప్పుకున్నారు నవ్వేస్తూ. జీవితంలో మొదటిసారి పుట్టినరోజు కి కేక్ కటింగ్ క్రెడిట్ అను అకౌంట్ లో పడింది. ఆ తర్వాత గుడి, భోజనం. అంత అలసటలోను బోలెడు ఆనందంతో ఇల్లు చేరా. మా సీతయ్య పిల్లలు సూపర్ థ్రిల్లింగ్గా విని బోలెడు అప్రషియేట్ చేసారు ఈ నాటకాన్ని. మాకు సర్ప్రైజుల మీద ఎప్పుడూ ఆసక్తి లేదు కానీ అప్పుడున్న నా శారీరిక మానసిక పరిస్థితి కి ఒంటరితనానికీ అది టానిక్ లా పనిచేసిందని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. వాళ్ళు సరదా అనుకున్నా నాకు మాత్రం ఆ సహాయం ఎప్పటికి మరువలేనిది . కొసమెరుపు: నేను ఎప్పుడూ వాడని ఆ విచిత్రమైన వస్రాలని నా స్నేహితులు పాకీజా సిండ్రెల్లా క్లియోపాట్రా మోనాలీసా డ్రెస్ అని వివిధ నామకరణాలతో నన్ను ఆటపట్టించినా ..మల్టీకల్చరల్ డే కి ఇండియన్ డ్రస్ వేసుకోవాలని కలలు గన్న ఫిలిప్పీనో పిల్లకి నేను తీసుకెళ్ళిన ఐదు జతల్లోకి ఈ జత అతికినట్టు సరిపోగా అంకితం చేసేస్తున్నా అంది. అంతకన్నానందమేమి అని ఆనందభాష్పాలు రాల్చింది నా మనసు. ఈ ఫోటో ఎక్కడ నుంచొచ్చిందో మరి ఈ ఫోన్లో తీయలేదు కానీ collage your photos అంటూ పైకొచ్చి నన్ను ఐదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది.

సంసారం గుట్టు.....

నేను ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా చుట్టాలో, స్నేహితులో ఎవరో ఒకరుంటారు... నాన్న పెద్దవారవడంతో ఇంటి ముందు నించి వెళ్ళే వాళ్ళందరూ ఒక సారి చూసి పలకరించి పోతుంటారు. వాళ్ళని పలకరించమని మా అక్క ఫోన్ ఇస్తూ ఉంటుంది. అటు అత్తయ్య కి ఫోన్ చేసినప్పుడు కూడా అంతే. ఇంటికి దూరంగా ఉండడం వల్లనేమో నాకు అలా అందరితో ఒక 5 నిముషాలు మాట్లాడే అవకాశం వచ్చినందుకు భలే ఇష్టం గా ఉంటుంది. అయితే గతం లో ఎవరినైనా బాగున్నారా అన్నప్పుడు బాగున్నాం అని చెప్పి ఎదో కష్టాలు సుఖాలూ చెప్పేవారు. ఈ మధ్య అందరూ ఒకే మాట సూపర్.. చాలా హ్యాప్పీ... ఇదేంటబ్బా అనుకున్నా.. అందరూ బాగుంటే అంతకన్నా ఏం కావాలి కానీ ఏదో తెచ్చిపెట్టుకున్నట్టుంటోంది.. విషయం ఏంటంటే ఈ మధ్య మా ఊరి పంతులు గారు చెప్పారుట ఎవరైనా మీరు ఎలా ఉన్నారు అన్నప్పుడు చాలా బాగున్నామని చెప్పాలి అప్పుడే మీకు పాసిటివ్ వయిబ్రేషన్స్ వస్తాయని.. అప్పటి నించీ అనుకుంటా "సూపర్, హ్యాప్పీ" తప్ప ఇంకేమీ లేదు. ఎవరితో మాట్లాడినా ఇదే జవాబు ఆశిస్తుంటా అదే వస్తుంటది.. రెండే ముక్కలు ఖేల్ ఖతం.. మా చుట్టాలొకావిడ ఉంటుంది.. ఆమెకి ఎవరు కలిసినా, ఆవిడ బీపీ గురిచి గంటలు గంటలు చెపుతూ ఉండేదిట ... ఈ మధ్యన బీపీ అన్నది సాధారణం అవ్వడమే కాకుండా అదున్న వాళ్ళకి శుగరూ గట్రా ఒక ప్యాకేజీ లా వచ్చేస్తున్నాయి కానీ అదృష్ట వశాత్తూ ఆవిడకవేమీ లేవుట .. కానీ ఆ ఉన్న దాన్నే చెప్పీ చెప్పీ చెప్పీ చెప్పీ ఆవిడనందరూ బీపీ సరూపమ్మ అని పిలుస్తుంటారుట. .. ఒకసారి దారిలో కలిసినప్పుడు ఎక్కడకెళుతున్నారందిట. ఎవరికో ఒంట్లో బాగాలేదని ఆస్పత్రికెళుతున్నామని చెప్పారుట మావాళ్ళూ.. అవునా నాకూ ఈ మధ్య బాగోట్లేదు.. అని మొదలెట్టి ఇంకోళ్ళని నోరెత్తనీయకుండా గంటన్నర నిలుచున్న చోట నించి కదలనీయకుండా మేము వెళ్ళాలి లేట్ అవుతోందన్నా వినకుండా చెపుతూనే ఉందిట . గూగులమ్మ లేని కాలంలో ఆవిడతో మాట్లాడితే చాలు బీపీ పుట్టుపూర్వోత్తరాలతో పాటు ఏ ఏ మందులు వాడాలో కూడా తెలిసిపొయ్యేది అని చెప్పింది మా చెల్లి. ఏమన్నా అంటే 'సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు.. నేనేమీ సంసారాన్ని బయట పెట్టట్లేదుగా' అని బుకాయిస్తుందిట... భలే ఇంటరెస్టింగ్ అనిపించింది నాకు. ఈవిడ మా చుట్టలబ్బాయి భార్య. నాకు పెళ్ళయ్యాక వాళ్ళ పెళ్ళయ్యింది, అందుకే నాకు ఆవిడని కలిసే సదవకాశం రాలేదు.. నేనెళ్ళినప్పుడు దూరంగా ఆవిడ కనబడిందని మా వాళ్ళు కొంచెం దూరమైనా సరే ఇంకో అడ్డదారిలో వెళదామంటారు.. అలా క్లోస్ గా ఉండేవాళ్ళు అరుదయిపోయారు కాబట్టి, ఇక్కడ అంతలా మాట్లాడే వాళ్ళు ఉండరు కాబట్టీ నాకు అయ్యో అనిపించింది..'పాపం లేవే! ఏదో మనం కాబట్టి చెప్పుకుంటుందంటాను' నేను.. 'నీకు తెలియదు లే! నడువు' అని రెక్క పట్టుకుని లాక్కు పోతారు. ఆ మధ్య మా పెదన్నన్న గారు చనిపోయారని తెలిసి అందరమూ ఆదరా బాదరా పరిగెత్తుతున్నాము. బీపీ సరూపమ్మ కనిపించి 'ఏమయ్యింది' అనడిగింది. పెదన్నన్న చనిపోయారని చెప్పాము.. 'అయ్యో అట్లనా..నేను వచ్చేదాన్ని కానీ రాలేకపోతున్నా' అంది.. ఫర్వాలేదు అనేలోపు ఆవిడ బీపీ తో సహా వాళ్ళ బుడ్డోడికి 4 రోజులుగా వచ్చిన జ్వరం గురించీ, ఏ ఏ మాత్రలు వాడిందీ ఏ ఏ డాక్టర్లకి చూపించిందీ.. ఆ డాక్టర్ల వైనం గురించీ అరగంట చెప్పింది.. 'పాపం బుడ్డోడి గురించి ఎంత మధన పడుతోందో ఆ తల్లి' అన్నాన్నేను.. మా చెల్లి చిరాగ్గా చూసి 'అవును గానీ సరూపొదినా బుడ్డోడేడీ' అనడిగింది.. 'ఇంట్లో ఉన్నాడు ఇక్కడెవరికో బాగాలేకపోతే మధ్యాహ్నం చూడ్డానికెళ్ళా కబుర్లలో పడి లేటయ్యింది' అని ఆ కబుర్ల చిట్టా చెప్పబోయింది.. 'అయ్యో అవునా బుడ్డోడు ఏడుస్తుండుంటాడు పోయి చూసుకో పాపం నీకెన్ని కష్టాలో' అని ఇంక ఒక్క నిముషం కూడా ఆగకుండా లాక్కు పొయ్యింది మా చెల్లెలు.. 'మాట్లాడుతుంటే లాక్కొస్తావెంటే నీ కసలు మర్యాద లేదు' అన్నాన్నేను.. 'నీ మొహం లే పద' అంది.. 'నాన్న చూసి ఉంటే ఎంత బాధ పడి ఉంటారో నీ కరుకు మాటలకన్నా.. 'ఇటువంటి వాళ్ళతో అలానే ఉండాలి పద పద' అంది... చెప్పడం మరచిపోయా మేము ఇంటికెళ్ళింది మా మారిది గారి పెళ్ళని. అందరినీ కలిసినట్టుంటుందని పెళ్ళిపిలుపుల పని మాకిచ్చారు అత్తయ్య. దానిలో భాగం గా బీపీ గారింటికెళ్ళాము. ఒక రబ్బరు బొమ్మ లాంటి చిన్నారి ఇంట్లో ఆడుకుంటోంది.. సుతారంగా పాపని తాకుతూ 'ఎవరొదినా' అని అడిగా.. పక్కింట్లో జెయినులో ఎవరో అద్దెకి వచ్చారుట. 'ఆ పిల్ల అంటే మీ అన్నకి ప్రాణం రోజంతా ఇక్కడే ఆడుకుంటుంది' అంది. 'బావగారేరక్క' అని అడిగాడు మా సీతయ్య.. 'ఆయనకి ఒంట్లో బాగలేదు ఏదో మూలికల వైద్యుడి దగ్గరకెళ్ళాడ'ని చెప్పింది..అయ్యో ఏమయ్యింది అని మా సీతయ్య అనేలోపు పెళ్ళి పిల్ల ఊరూ పేరు వివరాలడిగి, నేను ఏమీ చెప్పకముందే వాళ్ళ చెల్లి కూతురి పెళ్ళి అనుకోవడం, పూల పండ్లు అయ్యాక అది కాన్సిల్ అవడం దాని కారణాలు వగైరా చెప్పుకుంటూ పొయ్యింది.. మేము వెళ్ళలేక ఉండలేక చిక్కుకుని.. మాటి మాటికీ గడియారం చూసుకుంటూ ఇబ్బందిగా నిలబడ్డాము, ఆవిడ ప్రవాహం పోతూనే ఉంది.. ఏ మాటకామాట ..మా చెల్లి ఆరోజు అన్న మాట కి అర్థం ఈ రోజు వెలిగింది నాకు . ఇంతలోకీ భాస్కరన్నొచ్చాడు..హమ్మయ్య అనుకున్నా.. 'అన్నా నీకు ఒంట్లో బాగాలేదంట కదా' అన్నా బీపీ గారి మాట కట్ చేస్తూ.. 'అంత చెప్పుకునే విషయం కాదులేమ్మా ఏదో చిన్నది' అన్నాడు.. ఆయనట్లానే అంటాడు అంటూ అందుకోబోయింది బీపీ.. భాస్కరన్న నవ్వుతూ ' చాయ్ పానీ ఇచ్చావా, ఆడబిడ్డని అట్లనే పంపుతున్నవా?' అంటూ అక్కడున్న పాపాయిని ఎత్తుకుని ఎగరేసి ముద్దు పెట్టుకుని జేబులోంచి చాక్లెట్ తీసిచ్చాడు. ....సరూపొదిన అయ్యో అసలు ఆలోచనే రాలేదని వంటింట్లోకి వెళ్ళబోయింది.. అమ్మో అవన్నీ అయితే ఆలస్యమవుతుంది మళ్ళీ వస్తామని అదను చూసి జారుకున్నాం.. ఇది జరిగొక రెండేళ్ళయింది..మేము ఈ రెండేళ్ళు ఇంటి మొహం చూడలేదు. ఇదిగో మళ్ళీ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి. మామూలుగా కలవని వాళ్ళని పిలుపుల వంకతో కలిసే సందర్భం . మళ్ళీ వెళ్ళాల్సొచ్చింది బీపీ గారింటికి...ఈ సారి దృశ్యం లో కొద్ది తేడా.. పోయిన సారి చూసిన పక్కింటి వాళ్ళ చిన్ని పాపాయి (కొద్దిగా పెద్దదయింది.. మూడేళ్ళు ఉంటాయి..) ఇంట్లోకి రావాలని ప్రయత్నం చేస్తోంది, భాస్కరన్న ఆ పిల్లని కళ్ళెర్రజేసి చూస్తూ వేలితో మీ ఇంటికి పో అన్నట్టు బెదిరిస్తున్నాడు.. మమ్మల్ని చూసి కొద్దిగా ఖంగుతిని రండి రండి అంటూ లోపలికి దారి తీసాడు. ఆ చిన్నిది మా వెంట సంతోషం గా లోపలికొచ్చేసింది.. భాస్కరన్నకి నచ్చలేదు.. తన వైపు గుర్రుగా చూసాడు.. నాకు కొద్ది వింతగా అనిపించింది. చిన్నప్పుడు భాస్కరన్నా వాళ్ళు మా ఇంటి పక్కన ఉండే వారు. అన్న కి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం మమ్మల్ని కూడా ఎత్తుకుని ముద్దు చెయ్యడం, తినడానికేమైనా తీసుకొచ్చి పెట్టడం,,సైకిలు మీద తిప్పడం , అవీ ఇవీ కొనివ్వడం చేసేవాడు.. చాలా తక్కువగా మాట్లాడతాడు కానీ పిల్లలంటే చాలా ప్రేమ .. అలా అలవాటైన అన్నని ఇలా చూడటం వింతగా ఉంది.. 'చూశ్నవా ఆ పిల్లనెట్ల బెదిరిస్తుండో పాపం చిన్న పిల్ల' అన్నది వదిన.. ..ఏమనాలో తెలియనట్లు చూసాను.. శుభలేఖ ఇవ్వబోతూ బొట్టు పెట్టాను.. ఆ లోపు అందుకుంది..'మొన్నటి దాంక ఆ పిల్లని సంకనేసుకుని తిరిగిండు.. దానికేమి తెలుసు అదే లెక్క ముద్దు చేస్తడనుకుంటుంది..పొమ్మన్నా సమజ్ చేస్కుంటల్లేదు..ఇల్లు అమ్మి పోదామంటడు.. ఎట్ల చెప్పాల్నో తెలుస్తల్లేదు.. నువ్వన్న చెప్పు మీ అన్నకి' అంది.. నాకు తప్పలేదు 'ఏమయ్యిందన్నా అన'డిగా. ఏంలేదమ్మా అన్నాడు భాస్కరన్న రండి బావగారు కూచుందాం అంటూ... భాస్కరన్న, సీతయ్య మాటల్లో పడడం చూసి బీపీ వదిన అందుకుంది.. పక్కన ఉన్నవాళ్ళు ఏదో గురువుని నమ్ముతారుట. అప్పుడప్పుడు గురువు గారొచ్చినప్పుడు వీళ్ళని భజనలకి పిలుస్తారుట .వదినకి వాళ్ళ భాష రాకపోవడం వల్లనున్నూ, ఆవిడకి భజన అయినంతసేపు మాట్లాడకుండా ఉండటం కుదరదు కావునన్నూ ప్రార్థన టయింలో వెళ్ళదుట. భజనలవీ అయ్యాక ప్రసాదం తీసుకుని వస్తుందిట.. . అయినా ఫర్వాలేదంటారుట వాళ్ళు . అలాగే వదినగారింట్లో పూజలు పునస్కారాలకి వాళ్ళొస్తారుట. అన్నయ్య కి దేవుళ్ళూ పూజలంటే గిట్టదు గానీ వాళ్ళింట్లో ఇలా హడావిడి జరిగినా , వాళ్ళెక్కడికైనా వెళ్ళినా పాప బాధ్యత తీసుకుని సహాయం చేస్తాడుట .. బుడ్డోడితో సమానం గా చూస్తాడుట పాపని .. ఆ పక్కింటావిడ వదినతో క్లోస్ అయిపోయి ఈవిడ మాటల వల్ల వాళ్ళ పుట్టింటి వాళ్ళు దగ్గర లేని లోటును తీర్చుకుంటొన్దిట.. అలా అలా ఆరునెల్ల సావాసం చేస్తే వారు వీరయినట్టు రెండేళ్ళల్లో వారువీరయ్యారుట.. ఛీ, అసలు మీరు నా స్నేహితులేనా అంట!!??? బీపీ సరూపొదిన మాట్లాడటం తగ్గించేసిందనుకున్నారు కదూ ...కికికి.. తప్పులో కాలేసారు.. సూర్యుడు ఇటు బదులు అటు ఉదయిస్తాడేమో కానీ బీపీ ముచ్చట్ల విషయం లో యమ ధర్మ రాజులా సరూపొదిన డవిలాగ్ ..."ఏదన్నా అడుగు ఆ ఒక్కటీ దక్క"!!!!!! వదినమ్మ ఆ స్నేహ గాఢత ని వర్ణిస్తుందే తప్ప అసలు విషయం లోకి రాదని నిర్ధారించుకుని పోయొస్తామొదినా చాలా మందిని పిలవాలి అనేసా.. అయ్యొ మరింతకీ సమస్యేంటో తెలుసుకోవా అంది చాయ్ పానీ అంటున్న అన్న మాటలకడ్డం పడుతూ.. గబ గబా చెప్పు అత్తమ్మకి కోపమొస్తుంది లేట్ అయితే అన్నా.. ఇలా రా అని లోపలికి తీసుకెళ్ళింది.. 'మీరు పోయిన సారి వచ్చినప్పుడు మీ అన్నకి బాగలేదని చెట్ల మందుకోసమెళ్ళాడు గుర్తుందా అంది లో గుంతుకతో .. ఆ ఉంది అన్నా నేను గుస గుసగా.. ఆయన చెప్పడు కానీ పయిల్సో ఏదో అంటరు కదా అదొచ్చింది..దానికి తోడు దగ్గు దమ్ము ఉన్నయి చిన్నప్పటి నించీ నీకు తెలుసు కదా అది బాగా ముదిరింది' అంది. 'అవును అన్నయ్య బాగా ఆయాసపడుతున్నాడు అడిగితే నొచ్చుకుంటాడని అడగలేదు.., చిన్నప్పటి నించీ అంతే ఎంత నెప్పి ఉన్నా అసలేమీ బయటికి చెప్పడు' అన్నా గబ గబా నన్ను చెప్పనియ్యదని ఖంగారు పడుతూ.. ఆ అవునవును.. 'ఆయ నెవరికీ చెప్పడు నన్ను చెప్పొద్దంటడు. చెట్ల మందు తీసుకున్నాడు. దాని వల్ల కొద్ది గా కూడా తగ్గలేదు.. అదే బాధగా ఉంది' అంది.. అయ్యొ అన్నా ఏమీ చేయలేము కదా అని బాధ పడుతూ.. ఆవిడ మాటల్లో వినదానికి మీకూ టైపడానికి నాకూ తీరదు కానీ టూకీగా చెప్తా.. పక్కింట్లో మొన్న పూజయ్యిందిట.. వాళ్ళు అన్నని తీసుకురా అని బాగా బలవంత పెట్టారుట.. పక్కింటాయనొచ్చి మరీ మరీ మీరు ఈ సారి తప్పక రావాలి సార్ అందరిలోకీ పెద్ద గురువుగారొస్తున్నారని పిలిచి వెళ్ళారుట. వెళ్ళకపోతే ఏంబాగుంటుందని భాస్కరన్నని తీసుకెళ్ళిందిట. అక్కడికి ఆ రోజు కాలనీ కాలనీ మొత్తం కదిలి వచ్చిందిట. పూజ అయ్యాక ఒక్కొక్కరూ వచ్చి స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవచ్చని చెప్పారుట. పక్కింటావిడ అంత మందిలోను మొట్టమొదట అన్నా వదినలకి ప్రిఫరెన్స్ ఇచ్చి గుంపులో ఉన్న వదినని చేయిపట్టుకుని తీసుకెళ్ళిందిట. వదిన భాస్కరన్నని రమ్మనగానే ఇద్దరూ కలిసి స్వామీజీ ఆశీర్వాదం కోసం ఆయన పాదాలు తాకారుట . పక్కింటావిడ స్వామీజీతో 'స్వామీ ఇందాక చెప్పాను కదా వీళ్ళే ఆశీర్వదించండి' అందిట. స్వామీ జీ కళ్ళు మూసుకుని..' దైవమా ఈ భక్తుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇతనికి మనశ్శాంతి లేదు .ఇతను దగ్గు దమ్ముతో బాధ పడుతున్నాడు ఇతని భార్యకి బీపీ ఉంది.. అవన్నీ కాక ఇతనికి అతి దారుణమైన బాధ పయిల్స్ వ్యాధి.. అన్నీ భరించినా ఇది భరించడం కష్టం. ఋణాలతో బాధ పడుతున్నాడు. ఉద్యోగం పోతుందని భయపడుతున్నాడు. దయ ఉంచి ఈ కష్టాల్లోంచి ఇతన్ని కాపాడు, దంపతుల మధ్య సయోధ్య కుదుర్చు. ' అని ప్రార్థించి విభూతి ఇచ్చాడుట... ఆ రోజు నించీ వదినమ్మ బీపీ పోయిందిట కానీ అటునించి ప్రయాణం చేసి అన్నయ్యకొచ్చిందిట.. పక్క వాళ్ళతో మాట్లాడితే చంపేస్తా అని అరుస్తాడుట.. నేను ఇన్నేళ్ళుగా దాచుకున్న పరువు గంగపాలయ్యింది అంటాడుట.. బయటకెళ్ళడానికి సిగ్గుగా ఉంది అంటాడుట.. కాలనీ లో అందరూ తనని వింతగా చూస్తున్నట్టుంది అంటాడుట. ఇల్లు అమ్మేసి పోదామంటాడుట. అసలు ఇంట్లోంచి బయటికి రావట్లేదుట. ఆఫీసుకి కూడా పోవట్లేదుట. విసుగు కసుగుట . ఈ పిల్ల కనిపించిందంటే బీపీ మరీ పెరిగిపోతోందిట.. ఇదండీ.. ఇది విన్నాక ఎవరయినా బాగున్నారా అని అడిగితే సూపర్, హ్యాప్పీ అనడమే బెటర్ అని నాకనిపించింది.. మరి నాకు ఇంకా పిలవాల్సిన ఇళ్ళు చాలా ఉన్నాయి.. కాస్త మా బీపీ అన్నతో మాట్లాడి పెట్టరూ.. ప్లీస్...

పెంపుడు పిల్లలు

"నిన్ను లంబాడీ తండా లోంచి ఎత్తుకొచ్చాము నువ్వు మా పిల్లవి/పిల్లాడివి కాదు" అని మీలో ఎంతమంది అనిపించుకున్నారో మొహమాటం లేకుండా చెప్పండి. .చెత్తకుండీ నించి ఎత్తుకొచ్చామని అనిపించుకున్న వారున్నారా.? . ఇలా అనిపించుకున్న పిల్లలు నిజం గా తమని ఈ ఇంటివాళ్ళు పెంచుకున్నారని అనుకునేవాళ్లు కదా.. అదృష్టం కొద్దీ ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటివి సాధారణం మూలాన ఒకళ్ళు ఏడిపించినప్పుడు ఇంకొకరు " కాదమ్మా నువ్వు నా బిడ్డవి " అని చెప్తుంటారు. అందు మూలాన ఇంట్లో అందరికీ అందరు బిడ్డలు పెంపుడు బిడ్డలే. మొన్న ఇంటికి కొంత మంది చిన్న పెద్దలు వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఒక సమయం లో ఇలా అనిపించుకున్నామని ఇప్పటి వరకు తామొక్కరమే ఇలా అనిపించుకున్నట్టు భావిస్తున్నామని చెప్పారు. తమాషా ఏంటంటే, మా పాపాయిని " నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ పక్క మంచం మీద ఉన్నావిడ కి వరసగా 10 మంది అమ్మాయిలు పుట్టారుట . 11 వ సారి అమ్మాయి పుడితే వాళ్ళాయన వదిలేస్తా అన్నాడని ఆవిడ ఎక్కిళ్ళు గుక్కిళ్లు ఏడ్చిందిట. అందుకే మీ అమ్మకి అబ్బాయి పుడితే , పిల్లాడిని ఆవిడకి ఇచ్చి పిల్లదానివైన నిన్ను మీ అమ్మ పక్కలో పడుకో పెట్టేశామని' మా అక్క చెల్లెళ్లు చెప్పిన విషయం నమ్మి, ఇంటికొచ్చ్చి బోలెడు రాద్ధాంతం చేసింది.. ఇంత చిటుక్కుమని చెప్పేసేవారు ఒక మనవాళ్ళేనేమో అనుకునే దాన్ని కానీ కాదుట. ల్యాటిన్ అమెరికా వాళ్ళు, ఈస్ట్ యూరోప్ వాళ్ళు కూడా ఇలా చెప్పుకుంటుంటే ముక్కు మీద వేలేసుకున్నా. చిన్న పిల్లలని ఇలా ఏడిపించడం అక్కడ కూడా ఉందన్నమాట. మా ఇంటికి ఒకాయన వచ్చి "మీ చెల్లిని తీసుకుపోనా " అంటుండే వాడు. పిల్లలు వద్దు అనగానే 'అయితే నిన్ను తీసుకుపోతా నేను పెంచుకుంటా 'అనేవాడు. వీళ్ళు భోరుమని ఒకటే ఏడుపు. ఆయన వస్తున్నాడనగానే పిల్లలంతా చిరాకు పడేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాల్లో ఇద్దరిద్దరు ఒకే సారి పుట్టినప్పుడు ఒక తల్లి బిడ్డలు కాకపోయినా రామ లక్ష్మణుల్లా పెరిగిన అన్నదమ్ములకు ఉన్న ప్రేమ సొంత అన్నదమ్ములకు కూడా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు తన తమ్ముడినో చెల్లినో ఎవరో ఎత్తుకుపోతుంటే ఊరుకుంటారేంటీ.. కండ ఊడొచ్చేటట్టు కొరకడమో , చెంప చెళ్లుమనిపించడమో, అరంగుళం గోళ్లు దిగేలా గిల్లడమో చేసి "బ్యాడ్ బాయ్స్ " అనిపించుకుంటారు కూడా. ఇంట్లో 20 రోజుల తేడాతో పుట్టిన పిల్లలు కవలల్లాగా పెరిగినప్పుడు, అసలు అమ్మ నాన్నని పిన్ని బాబాయిలనీ పిలిచి, స్కూలుకెళ్ళినప్పుడు 'మై ఫాథర్ నేమ్ ఈస్ బాలు బాబాయ్, మై మథర్ నేమ్ ఈస్ వల్లి పిన్ని' అని చెప్పిన పిల్లలని " మీ అమ్మ ఈవిడ ,మీ నాన్న ఈయన అని సరిచేసేటప్పటికీ తల ప్రాణం మోకాల్లోకొస్తుంది కొన్ని సార్లు. అప్పటికీ ఆ పిల్లలు అసలు మా అమ్మ ఎవరు అని సందేహం తో చూస్తూనే ఉంటారు కూడా.. ఇలాంటి సంఘటనలు ఈ కాలం లో కూడా ఉన్నాయా అని ఆశ్చర్య పోవక్కరలేదు కూడా. ఇంట్లో మొదట పుట్టిన పిల్లలు నాన్నమ్మని అమ్మ అనీ, అమ్మ ని వదిన అనీ పిలిచి .. మీరందరు ఎక్కడైనా పోయి పడుకోండి అమ్మ నాది అని హుంకరించడం . "అమ్మ నాది అని ఎవరైనా అన్నారంటే టాపు లేచిపోయేలా చెయ్యడం ఉమ్మడి కుటుంబాల్లో మనం చూస్తూనే ఉంటాము. . మా చిన్నోడొకసారి ఒక పిల్లని గట్టిగా కొరికేసాడని టీచర్ గారు కోప్పడి "ఎందుకు కొరికావలా తప్పు కదా అన్నారుట. " నా పుట్టలో వేలెడితే కుట్టనా అన్నంత వీజీగా " వీళ్ళ నాన్నొచ్చి మా చెల్లి చెవులు గట్టిగా కుట్టి ఏడిపిస్తే రెండు రోజుల నించీ ఏడుస్తోంది.. మరి నేను ఆయన కూతుర్ని కొరకనా " అన్నాడుట. ఆవిడ స్కూలు కి వచ్చిన వాళ్లందరికీ చెప్తుండేది. సాయంత్రం మంచం మీద వేసిన ఆరేసిన బట్టల్లో నాన్నమ్మ చీర చూసి అక్కడ ఉన్నారనుకుని ఆ చీర మీదేసుకుని పడుకున్న చిన్నోడిని ఎవరో ఎత్తుకుపోయారని గుండెలవిసేలా ఏడ్చిన ఇంటిల్లిపాదీ ఆ సంఘటన మర్చిపొమ్మంటే పోతారా మరి.. ఆ రోజు నించీ వాడు అందరి కీ బిడ్డయిపోడూ ఇంటికెవరో అనుకోకుండా వచ్చారు. వారు కింద దుకాణం లో 2చాకోలెట్లు కొంటున్నారు. మన బుడుగు గాడు వెళ్లి, 'ఆంటీ మీరు చాకోలెట్లు మా కోసం కొంటున్నారా' అని అడుగుతాడు. 'అబ్బే లేదురా' అంటుందావిడ.. 'అది కాదాంటీ మేము ఇద్దరమే అనుకున్నారేమో మా ఇంట్లో మాకు చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు కదా మీకు తెలుసో లేదో అని'..అంటాడు వీడు అమాయకంగా. ఆవిడ వచ్చి మనకి చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుందో మీకెవరికైనా తెలుసా.. ఎవరేమిచ్చినా కొరికి పంచుకునే పిల్లలు మీకు తెలుసా..??ఇలాంటి పిల్లలు ఇంట్లో అందరికీ పెంపుడు పిల్లలే కదా మేము మాల్దీవుల్లో ఉన్నప్పుడు ఒక రెండు గదులు హాలు వంటిల్లు ఉన్న ఇల్లు ఇద్దరు దంపతులం కలిసి తీసుకున్నాము. వాళ్లకి ఒక పాప. ఆ చంటిది మాకు బాగా అలవాటయిపోయింది. మలయాళం వాళ్ళు.. పాపకి ముద్ద పప్పు చారు ఇష్టము. నేను నలుగు పెట్టి స్నానం చేయిస్తే ఇష్టము. నేను పాడి పడుకోపెడితే ఇష్టము. ఇవన్నీ చూసి వాళ్ళమ్మ మురిసిపోతుండేది. 'పోయిన జన్మలో నీ కూతురే' అనేది. పుట్టిన రోజు కి నేను పాపకి వెండి గజ్జలు కొన్నాను. అవి వేసుకుని ఘల్లు ఘల్లు మని లచ్చిమిదేవి లా తిరుగుతుండేది.. ఈ లోపు ఆ పిల్ల తల్లీ తండ్రికి ఎదో తగవులొచ్చాయి. వాళ్ళిద్దరి కీ గొడవ అయినప్పుడల్లా ఆ బుజ్జి వెండి గజ్జలు తలుపు కింద నించి లోపలికి పడేసేది వాళ్ళమ్మ... అదేంటో అర్థమయ్యేది కాదు నాకు.. మళ్ళీ బుజ్జగించి ఇచ్చేదాన్ని. అలా కనీసం 4 సార్లు జరిగింది.. తీరా ఎందుకలా చేస్తున్నావని మందలిస్తే, "ఇంట్లోంచి వెళ్లిపోదామనుకున్నా అప్పుడు మీ వస్తువు మీకు ఇచ్ఛేద్దామని " అని చెప్తూ. సింబాలిక్ గా పాపని మేము చూసుకోవాలని చెప్పడంట ..ఓరి దేవుడో ఏమి సింబాలిజం రా నాయనోయ్ అని భయపడిపోయాము.. నిజం చెప్పద్దు అప్పటి నించీ చంటి పిల్లలని చేరదీయాలంటే కాస్త జంకుతున్న మాట వాస్తవం...

ముల్లు పొయ్యి కత్తొచ్చె….

“లే అమ్మా! సురేష్ పది సార్లు ఫోన్ చేసాడిప్పటికే” నెమ్మదిగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తోంది శారద. “అమ్మా ,, ఎన్ని సార్లయినా చెయ్యనియ్యి నువ్వూ ఎత్తకసలు. ఇంక అతనికీ నాకూ ఏ సంబంధమూ లేదు!! ” విసుగ్గా అటు తిరిగి పడుకుంది దివ్య. “అమ్మూ ,ఏమైందిరా బంగారూ, ” అంటూ ఆందోళనంగా దివ్యని లేపి కూచోబెట్టింది శారద. సురేష్ బంగారం లాంటి పిల్లాడు, పిల్లలు పుట్టడం లేట్ అయితే దివ్య ని ఎవరూ ఏమీ అనకుండా తనే డాక్టరుకి చూపించుకుని ఒళ్ళు తగ్గించమన్నారని డయిటింగు చేస్తూ “10కిలోలు తగ్గితే చాలు పిల్లలు ఖాయం” అంటుంటాడు సరదాగా.. అంత మంచి పిల్లవాడిని తప్పు పట్టడమెలా అని సందేహించింది శారద. “పోనీ ఫోన్ చేసి రమ్మను బాంగారు, మల్లె పువ్వుల్లాంటి ఇడ్లీ వేసి పెట్టి, నాన్నని మాట్లాడమంటా” అంది. “చీ ఆ పేరెత్తకు, వాటి నించే గొడవలు మొదలయ్యాయి,, ముష్టి ఇడ్లీ .. ఆ డాక్టర్ననాలి. పొద్దున్నే 1ప్రొటీనుకి 2కార్బొహైడ్రేట్లు కలిపి తినాలని అమెరికా పరిశోధించి చెప్పిన విషయం మన తాతలనాడే కనిపెట్టారు ఇడ్లీ రూపంలో. Home made idlee evereyday, keep the doctor away అంటూ సోది కబుర్లు చెప్తాడు. రోజూ వేస్తా, ప్లేట్లో పెట్టిన రోజు 8 లాగిస్తాడు, ఒకవేళ, క్యాబ్ వచ్చి , నేను ఆఫీసుకి వెళ్ళిపోతే, అన్నీ అలానే ఉంచుతాడు, గొడవచేస్తే 3... ప్లేట్లో పెట్టిస్తే 8 తినేవాడు పెట్టకపోతే 3 తినడమెందుకో తెలుసా అమ్మా? 4 వ ఇడ్లీ తింటే ఆ రేకు కడగాల్సి వస్తుందని.. 3 తిని వదిలేసిన రేకు ఎండిపోయి రాత్రి వచ్చాక కడగలేక చేతులు పడిపోతున్నాయి. నేనేమైనా పనిమనిషినా? నేనూ పని చేస్తున్నా తన లాగే" వెక్కుతూ చెప్పింది దివ్య. “ఓస్ అంతేనా.. అమ్ముకుట్టీ, నీకొక మందపాటి గిన్నె, 100 గ్లాస్కో పంచె ముక్కలూ ఇస్తాను.. గిన్నెలో నీళ్ళు పోసి, ఆ కాటన్ బట్ట దానికి కట్టి వాసినపోలె వేసుకుని సగం సగం తినండి.. ఆ క్లాత్ ని ఏరోజుకారోజు బయట పడెయ్.. అమ్మమ్మ అలాగే వేసేది . పిచ్చితల్లి! ఈ కాస్తకే విడిపోతారా ఎవరైనా.”. అంది ప్రశాంతంగా. ఈ లోపు వంటింటి అటక మీద చప్పుడొచ్చి అటు వెళ్ళారిద్దరూ.. రామయ్యగారు నిచ్చెనెక్కి అటక మీదనించి ఏదో కవరు తీసుకుని కిందకి దిగారు. “అప్పుడెప్పుడో శ్రీధరన్నయ్య అమెరికా నించి తెచ్చాడమ్మా, మన ఇంట్లో మైక్రో ఓవెన్ లేదని తెలియదనుకుంటా.. పైన పడేసి మరచిపోయా, ఇప్పుడు ఆఫీసు నించి లోపలికొస్తూ వెనక కాళ్ళు కడుక్కుంటుంటే, కిటికీ లోంచి అమ్మా, నువ్వూ మాట్లాడుకుంటున్న మాటలు వినబడ్డాయి.. ఇది గుర్తొచ్చింది.”. “అదేంటి నాన్నా”” అని ప్యాకెట్ విప్పింది దివ్య..చిన్న చదరం పెట్టెలో 3 ఇడ్లీ రేకులు.. చిన్నగా ముద్దొచ్చేలా. “ఈ డబ్బాలో నీళ్ళు పోసి , పిండి వేసి మైక్రో ఓవెన్లో పెట్టేస్తే చాలు.. పది నిమిషాల్లో మల్లెల్లాంటి ఇడ్డెన్లు రెడీ,కడగడం కూడా సులువు..డబ్బా పైనున్న 3 ఇన్స్ట్రక్షన్ లూ చూపిస్తూ నవ్వుతూ అన్నారు తరువాతసోఫాలో కూచుంటూ.., “చిన్నమ్మా, చిన్న విషయాలకి యువత విడిపోతున్నారని పేపర్లో చదివినప్పుడు అర్థంకాలేదు, కానీ ఇంత చిన్నవిషయాలకి కూడా విడిపోవచ్చని అర్థం అయ్యింది ఇప్పుడే,, అమ్మ తనలా కష్ట పడద్దని నిన్ను ఒక్క పని ముట్టుకోకుండా గారాబంగా పెంచిందే కానీ, ఆ గారాబం ఇలా చిన్న విషయాలని పెద్దగా చెయ్యడానికి కాదమ్మా.. నిజమైన కష్టం వచ్చినప్పుడు అమ్మా, నేనూ నీకు ఎప్పుడూ అండగా నిలబడతాము.. కానీ చిన్న సమస్యలకి నీ జీవితం నించే కాదు, పది మంది నించి పరిష్కారాలు దొరుకుతాయి.. సమస్య వచ్చినప్పుడల్లా విడిపోవడం పరిష్కారం కాదమ్మలూ అన్నారు.. “సారీ నాన్నా.. ఏదో విసుగులో తొందర పడ్డాను...మరి ఇలా అంట్లు తోమే విషయంలో అరుణక్కకి విడాకులిప్పియ్యలేదూ రఘు పెద్దనాన్న” అంది అమాయకంగా.. “అలా పెద్దవాళ్ళు ఆజ్యం పొయ్యడం వల్ల చాలా జీవితాలు కూలుతున్నాయమ్మా.. మళ్ళీ చెప్తున్నా పెద్ద సమస్యలకి అమ్మా, నాన్న తప్పకుండా వెనక ఉండాలి.. చిన్న వాటికి సర్ది చెప్పాలి.. పో, సురేష్ కి ఫోన్ చెయ్యి రమ్మని.. అమ్మ తెల్లటి చందమామ లాంటి.... “ “నాన్నోయ్.. చాలు బాబోయ్.. ఇంక ఆపెయ్..ఓ ..ఓ... అర్థమయ్యింది.. చందమామలాంటి తెల్లని వాసినకుడుము వేసి చూపిస్తుందనేగా.”. నవ్వుతూ ఫోన్ అందుకుంది దివ్య.. “సారీ అత్తయ్యా, నాకు ఇడ్లీ రేకులు కడగడం బధ్ధకం. కానీ దివ్య కోసం ఇప్పటి నించీ నేనే కడుగుతా” అన్నాడు వస్తూనే సురేష్... “అబ్బే, అక్కరలేదు.. ముల్లు పొయ్యి కత్తొచ్చె ఢాం ఢాం ఢాం,” వాసినకుడుము ప్లేట్లో పెట్టి చేతికిస్తూ అంది దివ్య.. హాయిగా నవ్వుకున్నారు, అమ్మా నాన్నా..

వియ్యాలవారి కయ్యాలు

“ఏం పని చేస్తరో?” అడిగాడు సురేశ్ తన పెళ్ళికొచ్చిన గోపాల్ ని. అతను అమ్మాయి వైపు చుట్టం కానీ రైలు తొందరగా వచ్చెయ్యడంతో, ఇంకా ఆడపెళ్ళివారు మంటపానికి రాక ముందే వచ్చిన మూలాన మాట కలిపాడు మర్యాదగా ఉంటుందని. "వ్యాపారం" అన్నాడు గోపాలం. "యాపారమా ఏం యాపారం?"అడిగాడు సురేశ్. " కొట్టు" అన్నాడు గోపాల్. "ఆ? ఏందీ" వినిపించనట్టు అడిగాడు సురేశ్ "కొట్టండీ.. కొట్టు కొట్టు" అని అన్నాడో లేదో గోపాల్ చెంప మీద ఫెళ్ళున కొట్టాడు సురేశ్. గోపాల్ ఈ దెబ్బకి నివ్వెరపోయాడు. పెళ్ళి కొడుక్కి కాస్త మెంటలా అని అనుమానమొచ్చేసింది ఒక నిమిషం లో.వాళ్ళ వాళ్ళు వచ్చారేమో అని చుట్టూ చూస్తున్నట్టు చేసి, నెమ్మదిగా జారుకున్నాడు.. చెప్పెయ్యాలి.. వాళ్ళ వాళ్ళు రాగానే చెప్పెయ్యాలని హాలు గేటు దగ్గరే నిరీక్షించాడు. " అదేందయ్య ఈడికొచ్చినవ్? పెండ్లి పిల్ల సైడ్ కెంచి చుట్టపాయనొచ్చిండు చాయ్ బిస్కీట్ అరుసుకోమంటె ఏడున్నడో అని దోలాడలేక పరేషానయితున్న.. హమ్మ దొర్కవట్టిన్నన్నట్టు" సంతోషం గా చెప్పుకుపోతున్నాడు ఎల్లయ్య. చుట్టపాయిన, టీ బిస్కీట్ తప్ప ఏమర్థమయినా కాకపోయినా, అరుచుకోవడమేంటీ ఆయన కొట్టినా కుక్కినపేనల్లే నోరుమూసుకుని ఉంటే మళ్ళీ ఈయన తీసుకెళ్ళి అరుస్తాడేమో అని అయోమయం గా చూస్తున్నాడు గోపాల్. " కొర్కతింటామయ్య బీరిపోయినవ్.. .. నడ్వు పోదాంపా" అంటూ రమ్మని తొందర చేసాడు ఎల్లయ్య. ఇదెక్కడ గోలరా బాబూ, అసలు వాళ్ళు “రాజమండ్రి వచ్చెయ్ బావా అందరం కలిసి వెళదాం సరదాగా” అంటున్నా, ఎలాగూ ఏదో పనిమీద హైదరాబాదొచ్చాను కదా.. ఇటునించిటే అయితే టైం , టికెట్టు కలిసొస్తుందని కక్కుర్తి పడ్డాను అనవసరం గా " అనుకుంటూ ఎందుకో వెనుతిరిగి చూస్తే దూరం నించి వస్తూ కనిపించాడు అప్పా రావు. గోపాల్ ఎల్లయ్య వైపు తిరిగి.. " ఒక్క నిమిషం ఆగండి, మా చుట్టం ఇంకొకడు వస్తున్నాడు, ఇద్దరం కలిసొస్తాము చాయ్ బిస్కీట్ కి " చివరి పదం యాస మార్చి అనేసాడు సంతోషం గా.. " కానియ్యున్రి, మేమేమన్న కాదన్నాము.. " అన్నాడు ఎల్లయ్య. గోపాల్, అప్పారావు ఒకరినొకరిని చూసుకుని చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టారు. దడ దడా మాట్లేసుకుంటున్న వాళ్ళని " గీ లొల్లెప్పటికొడిశేనో" అనుకుంటూ చూస్తున్న ఎల్లయ్యని సురేశ్ పిలవడంతో అటెళ్ళాడు. గోపాల్ , అప్పారావ్ కబుర్లలో పడి నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్న చోటకి నడవసాగారు. తను లేకుండా వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోవడం చూసిన ఎల్లయ్య.. " ఓ గోపాలూ, మీ చుట్టపాయన పెండ్లి పిలగాన్ని మందలించకుంటనే పోతడా" అని అరిచాడు. అప్పటి వరకూ పెళ్ళి పిలగాడు తనని కొట్టిన వైనం చెప్పి ఉన్న మూలాన కావచ్చు అప్పారావు చాన్స్ వదులుకోకుండా సురేశ్ దగ్గరగా వెళ్ళి " ఏం మనిషండీ మీరు, అసలు బుధ్ధుందా మీకు? మడిసన్నాక కూసింత కలాపోసనుండాల, .. లేదంతే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంది ? పొద్దున్నే ఇంత పచ్సగడ్డి తిని పెత్తెక్ష నారాయనుడి సేవ చేసుకోక..ఎందుకొచ్చిన గోలయ్యా , సెగట్రీ.. ఇలా సాగిపోతే మర్డర్రయిపోవూ " అన్నాడు. సురేశ్ ఉలిక్కిపడ్డాడు.. " ఏంది ఏమంటున్రు, దమాక్ గిట్ల ఖరాబయ్యిందా" అని ఊగిపోయాడు. "అయ్యో నేనేమన్నానయ్యా బాబూ, మీ వోడేదో మందలించమంటేనూ.." అని నీళ్ళు నములుతూ " మావైపు మందలించడమంటే ఇంతే" గబ గబా రావుగోపాల్రావు ఇష్టయిల్లో అనేసాడు అప్పారావ్.. " ఏందివయ్య? ఇదేందివయ్యా, మందలించుడంటే మర్డర్ చేసుడా ఏందయ్య? మా తాన మందలించుమంటె ముద్దుగా బాగున్నవా తమ్మీ అని మందలిస్తరు" అన్నాడు ఎల్లయ్య ఉడుకిపోతూ. ఇంకేదో అనబోతుండగా గట్టిగా బాజాలు మోగాయి. ఆడ పెళ్ళివారొచ్చారని, పెళ్ళి కొడుకుని పల్లకీ ఎక్కడానికి రమ్మని అడగ్గా, బావ మరుదులొచ్చి, భుజాల పైన ఎక్కించుకునెళ్ళాలని పెద్దలు పట్టుబట్టారు. సరిత కి అన్న వరసయ్యే పది మంది అతి కష్టమ్మీద సురేశ్ ని దాదాపు ఈడ్చుకెళ్ళి.. " అబ్బా.. అలవాటు లేని అవపోసన" అని ఆయాసపడ్డారు. ఈ క్రమంలో, సరిత అన్నగారి చేతిలో ఉన్న ఒక పుస్తకం పట్టుకోమని పక్కనున్న పిల్లడికిచ్చాడు. పల్లకీ సంబరం లో మునిగిపోయి అప్పారావ్ సంగతప్పటికి మరచిపోయాడుసురేశ్ . అప్పారావునీ, గోపాల్ నీ అసలు ఎప్పుడొచ్చారని అడిగే సమయం కూడా ఇవ్వకుండానే "అమ్మా ముహూర్తానికి టైం అవుతోంది.. మీరేమో తిరుపతమ్మ గుడులనీ, వాళ్ళేమో గండి మైసమ్మ గుడులనీ తిరిగి తిరిగొచ్చి, ముహూర్తం దాటించేసేట్టున్నార"ని ఖంగారు పెట్టేసారు పంతులు గారు. పంతులు గారి ఆరాటం, ఫొటో గ్రాఫర్ల పోరాటం మధ్య పెళ్ళి అయింది. సరిత అన్నగారి దగ్గర పుస్తకం తీసుకున్న పిల్లాడు పుస్తకం చూసేటప్పటికి అది బాపు రమణల "కోతి కొమ్మచ్చి". మొహమాస్తుడైన ఆ పిల్లాడికి ఎవరితోనూ పెద్దగా కలవడం ఇష్టం ఉండదు. పుస్తకం తీసి మెల్లగా చదవడం మొదలెట్టేసరికి పెళ్ళి అయిపోయి, ఆలస్యమైతే అందదన్నట్టు అందరూ పొలోమని భోయినాల వైపు పరుగులు తీసారు. పుస్తకం ఇచ్చేసి భోజనానికెళితే బెటర్ అనుకుంటూ ఎరుపు చొక్కా వేసుకున్న సరిత అన్నగారి కోసం వెతకడం మొదలెట్టాడు. అక్కడా ఇక్కడా దూరం నించి చూసి దగ్గరికెళ్ళేలోపు, అతను ఇంకేదో పని ఉండి మాయవడం జరిగింది రెండు సార్లు. ఈ లోపు భోజనం చేసి వచ్చి, కాస్త జనాలు పలచబడడం తో మళ్ళీ పందిరి వైపు ఎర్ర చొక్కా అబ్బాయి కోసం వెతకడం మొదలెట్టాడు. చివరికి జంటకి స్నేహితులని పరిచయం చేస్తూ కనబడ్డాదు ఎర్ర చొక్కా వేసుకున్న సరిత అన్నగారు మురళి. హమ్మయ్య అనుకుంటూ అటువెళ్ళి " సార్, మీ పుస్కం" అన్నాడు . " ఓహ్ నీకిచ్చాను కదా, ఎవరి చేతులోనో పెట్టా కానీ, ఎవరి చేతులో గమనించలేదు" అన్నాడు మురళి . " అస్సలనుకోలే సార్ బుక్ బాగుంటదని, నగీ నగీ సచ్చిన" అన్నాడు మల్లేష్. " ఓహ్ నచ్చిందా అయితే" అన్నాడు మురళి. " మస్త్ నచ్చింది సార్" అన్నాడు మల్లేష్ మురిపెంగా. " నచ్చిందా , అయితే ఉంచు" అన్నాడు మురళి. " అయ్యొ బాగుండదు సార్" అని మొహమాట పడ్డాడు మల్లేష్. " ఏం ఫర్వాలేదు ఉంచెయ్" అన్నాడు మురళి. " అయ్యొ సార్ ఎవరన్న చూస్తె ఏమనుకుంటరు" అన్నాడు మల్లేష్.. " దీన్లో అనుకోడానికేముంది, నా దగ్గరింకా 3 కాపీలున్నాయి, ఉంచెయ్ చెప్తాను" అని మురళి అంటుండగానే, మల్లేష్ ఖాండ్రించి పుస్తకం మీద ఉమ్మేసాడు. ఈ హటాత్పరిణామానికి ఉగ్రుడయిపోయాడు మురళి. " చదువుకున్నోడివనుకుని మర్యాద ఇస్తుంటే సంస్కారహీనంగా ప్రవర్తిస్తావా, పిచ్చెక్కిందా " అంటూ గుభీ గుభీ రెండు గుద్దులు గుద్ది "చీ" అంటూ వెళ్ళిపోయాడు. మల్లేష్ ముక్కులోంచి రక్తం కారిపోతుండగా పెళ్ళికొడుకు తరఫు పెద్దలు పరిగెత్తుకొచ్చారు. సరిత వైపు వాళ్ళని దుమ్మెత్తిపోస్తూ, " బిడ్డనెట్లగొట్టిన్రు చూసిన్రా, ముక్కులల్ల రక్తమెలతాంది.. పిలగాడు పండుకొంటుండు బిరాన దవాఖానా కి తీస్కపోదాం పట్టున్రి” అని అరుపులు మొదలెట్టారు. సరిత మేన మామొచ్చి,, “చావు బతుకుల్లో ఉంటే ఇప్పుడు పండు కొనడం పువ్వులు కొనడం ఏంటండీ ఆసుపత్రికి తీసుకెళ్ళక “అంటూ వెటకారమాడాడు. ఇంక సురేశ్ వైపు వాళ్ళు కోపానికొచ్చి అతన్ని ఒక్క పీకుడు పీకారు. వీళ్ళూరుకుంటారేంటీ,, కర్రలు, గునపాలూ, గొడ్డల్లూ, కత్తులు కటార్లూ పట్టుకుని తయారయిపోయారు. ఓయ్య పిల్ల తండ్రిని తోల్కరండ్రి బిరాన అనరిచింది సురేష్ పెద్దమ్మ. ఆయ్ నేనేమైనా గొర్రెనా గాడిదనా తోలుకురావడానికంటూ వచ్చాడు వెంకట్రావు. అరుంధతీ నక్షత్రం చూపించడానికి గేటు బయటకి జంటను తీసుకెళుతున్న పంతులు గారు ఈ గొడవకి ఆశ్చర్యపోయి "ఏంటండీ ఇది, ఏం జరుగుతోందిక్కడ? అనడిగాడు. “ ఇదేదో మంచి ఆరంభమనుకున్నాం కానీ ఈ పెళ్ళ్ళి వలన ఇప్పటికే ఇన్ని సమస్యలు, ఇంక. మంగళమే” అని అటువాళ్ళూ, ఇటువాళ్ళూ అంజలి సినిమాలో డవిలాగుల్లా అరిచి అరిచి చెప్పారు. పంతులు కాస్త ఆలోచించి కొట్టడానికి కారణమడిగాడు. పుస్తకముంచుకోమంటే పుస్తకం మీద ఉమ్మడం గురించి చెప్పగానే నవ్వడం మొదలెట్టాడాయన.. ఎప్పుడో కోనసీమ నించి వచ్చిన పూర్వీకుల వల్ల అటూ ఇటూ రెండు యాసలనూ క్షుణ్ణం గా తెలుసుకున్నవాడై “ఉంచడమంటే ఉమ్మడమని “ టిప్పణి చెప్పాడు. ముక్కులో రక్తమోడుతున్న మల్లేష్ తో సహా అందరూ పక పకా నవ్వారు. గోపాల్ కి పౌరుషమొచ్చి, పెళ్ళికొడుకు తనని దవడ వాచేట్టు కొట్టాడని, పెళ్ళికి un do బటన్ ఉంటే నొక్కెయ్యాలని గోల పెట్టాడు. “కొట్టమంటే మరి కొట్టనా” అని సురేశ్" నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా" అని కథ చెప్పే అబ్బాయంత అమాయకంగా చెప్పాడు. “నువ్వెందుకు కొట్టమన్నావ”ని అడిగిన పంతులు గిరిధర శర్మతో, “వ్యాపారమేంటంటే కొట్టు అని చెప్పాన”ని అమాయకంగా చెప్పాడు గోపాలు. “కొట్టంటే దుక్నమయ్యా బాబూ” అంటూ పడీ పడీ నవ్వాడు పంతులు గారు. “అన్ని మంచిగనే గని ఈ దొంగమొకపోడు ఎన్ని తిట్లు తిట్టిండు” అని అందుకున్నాడు ఎల్లయ్య. “చేపా చేపా ఎందుకెండలేదు” అని అడిగినట్టు “నీ కథ ఏంటయ్యా” అని నవ్వుతూ అడిగాడు గిరిధర శర్మ. “అయ్యా మందలించమని మరీ బలవంతం పెడితేనూ.”.. అంటున్న అప్పారావుని చూసి కడుపు పట్టుకుని " నేనింక నవ్వలేనయ్యా బాబూ, మందలించడమంటే, పలకరించడమని, పనిలో పనిగా పండుకొనడమంటే నిద్దరోడమనీ, తోల్కరావడమంటే తోడ్కొనిరావడానికి వికృతని చెప్పి..”ఇంతటితో అపార్థాల కథ కంచికి మనమింటికి.. ఇప్పుడైనా అర్థం తెలుసుకుని మాట్లాడుకోండి నాయనోయ్ “అంటూ అరుంధతిని చూపించడానికి దంపతులనిk తీసుకెళ్ళబోతున్నాడు పంతులు. అంత మంచిగ జెప్పిండు పంతుల్ నోట్ల పేడ పెట్టున్రి... అనగానే మళ్ళీ రెచ్చిపోబోతున్న వెంకట్రావుకి.. అయ్యా పాలకోవాని పేడాలంటారు మీరు తొందరపడి మళ్ళీ మొదటికి తేకండయా.. కథాకళలో పదినిమెషాలే ఇచ్చారు అరిచాడు. అయితే వాకే మళ్ళీ కలుద్దామంటూ వెళ్ళి పోయారు బంధుమిత్రులువియ్యాలవారి కయ్యాలు రచన: ఎన్నెలమ్మ, కెనడా “ఏం పని చేస్తరో?” అడిగాడు సురేశ్ తన పెళ్ళికొచ్చిన గోపాల్ ని. అతను అమ్మాయి వైపు చుట్టం కానీ రైలు తొందరగా వచ్చెయ్యడంతో, ఇంకా ఆడపెళ్ళివారు మంటపానికి రాక ముందే వచ్చిన మూలాన మాట కలిపాడు మర్యాదగా ఉంటుందని. "వ్యాపారం" అన్నాడు గోపాలం. "యాపారమా ఏం యాపారం?"అడిగాడు సురేశ్. " కొట్టు" అన్నాడు గోపాల్. "ఆ? ఏందీ" వినిపించనట్టు అడిగాడు సురేశ్ "కొట్టండీ.. కొట్టు కొట్టు" అని అన్నాడో లేదో గోపాల్ చెంప మీద ఫెళ్ళున కొట్టాడు సురేశ్. గోపాల్ ఈ దెబ్బకి నివ్వెరపోయాడు. పెళ్ళి కొడుక్కి కాస్త మెంటలా అని అనుమానమొచ్చేసింది ఒక నిమిషం లో.వాళ్ళ వాళ్ళు వచ్చారేమో అని చుట్టూ చూస్తున్నట్టు చేసి, నెమ్మదిగా జారుకున్నాడు.. చెప్పెయ్యాలి.. వాళ్ళ వాళ్ళు రాగానే చెప్పెయ్యాలని హాలు గేటు దగ్గరే నిరీక్షించాడు. " అదేందయ్య ఈడికొచ్చినవ్? పెండ్లి పిల్ల సైడ్ కెంచి చుట్టపాయనొచ్చిండు చాయ్ బిస్కీట్ అరుసుకోమంటె ఏడున్నడో అని దోలాడలేక పరేషానయితున్న.. హమ్మ దొర్కవట్టిన్నన్నట్టు" సంతోషం గా చెప్పుకుపోతున్నాడు ఎల్లయ్య. చుట్టపాయిన, టీ బిస్కీట్ తప్ప ఏమర్థమయినా కాకపోయినా, అరుచుకోవడమేంటీ ఆయన కొట్టినా కుక్కినపేనల్లే నోరుమూసుకుని ఉంటే మళ్ళీ ఈయన తీసుకెళ్ళి అరుస్తాడేమో అని అయోమయం గా చూస్తున్నాడు గోపాల్. " కొర్కతింటామయ్య బీరిపోయినవ్.. .. నడ్వు పోదాంపా" అంటూ రమ్మని తొందర చేసాడు ఎల్లయ్య. ఇదెక్కడ గోలరా బాబూ, అసలు వాళ్ళు “రాజమండ్రి వచ్చెయ్ బావా అందరం కలిసి వెళదాం సరదాగా” అంటున్నా, ఎలాగూ ఏదో పనిమీద హైదరాబాదొచ్చాను కదా.. ఇటునించిటే అయితే టైం , టికెట్టు కలిసొస్తుందని కక్కుర్తి పడ్డాను అనవసరం గా " అనుకుంటూ ఎందుకో వెనుతిరిగి చూస్తే దూరం నించి వస్తూ కనిపించాడు అప్పా రావు. గోపాల్ ఎల్లయ్య వైపు తిరిగి.. " ఒక్క నిమిషం ఆగండి, మా చుట్టం ఇంకొకడు వస్తున్నాడు, ఇద్దరం కలిసొస్తాము చాయ్ బిస్కీట్ కి " చివరి పదం యాస మార్చి అనేసాడు సంతోషం గా.. " కానియ్యున్రి, మేమేమన్న కాదన్నాము.. " అన్నాడు ఎల్లయ్య. గోపాల్, అప్పారావు ఒకరినొకరిని చూసుకుని చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టారు. దడ దడా మాట్లేసుకుంటున్న వాళ్ళని " గీ లొల్లెప్పటికొడిశేనో" అనుకుంటూ చూస్తున్న ఎల్లయ్యని సురేశ్ పిలవడంతో అటెళ్ళాడు. గోపాల్ , అప్పారావ్ కబుర్లలో పడి నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్న చోటకి నడవసాగారు. తను లేకుండా వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోవడం చూసిన ఎల్లయ్య.. " ఓ గోపాలూ, మీ చుట్టపాయన పెండ్లి పిలగాన్ని మందలించకుంటనే పోతడా" అని అరిచాడు. అప్పటి వరకూ పెళ్ళి పిలగాడు తనని కొట్టిన వైనం చెప్పి ఉన్న మూలాన కావచ్చు అప్పారావు చాన్స్ వదులుకోకుండా సురేశ్ దగ్గరగా వెళ్ళి " ఏం మనిషండీ మీరు, అసలు బుధ్ధుందా మీకు? మడిసన్నాక కూసింత కలాపోసనుండాల, .. లేదంతే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంది ? పొద్దున్నే ఇంత పచ్సగడ్డి తిని పెత్తెక్ష నారాయనుడి సేవ చేసుకోక..ఎందుకొచ్చిన గోలయ్యా , సెగట్రీ.. ఇలా సాగిపోతే మర్డర్రయిపోవూ " అన్నాడు. సురేశ్ ఉలిక్కిపడ్డాడు.. " ఏంది ఏమంటున్రు, దమాక్ గిట్ల ఖరాబయ్యిందా" అని ఊగిపోయాడు. "అయ్యో నేనేమన్నానయ్యా బాబూ, మీ వోడేదో మందలించమంటేనూ.." అని నీళ్ళు నములుతూ " మావైపు మందలించడమంటే ఇంతే" గబ గబా రావుగోపాల్రావు ఇష్టయిల్లో అనేసాడు అప్పారావ్.. " ఏందివయ్య? ఇదేందివయ్యా, మందలించుడంటే మర్డర్ చేసుడా ఏందయ్య? మా తాన మందలించుమంటె ముద్దుగా బాగున్నవా తమ్మీ అని మందలిస్తరు" అన్నాడు ఎల్లయ్య ఉడుకిపోతూ. ఇంకేదో అనబోతుండగా గట్టిగా బాజాలు మోగాయి. ఆడ పెళ్ళివారొచ్చారని, పెళ్ళి కొడుకుని పల్లకీ ఎక్కడానికి రమ్మని అడగ్గా, బావ మరుదులొచ్చి, భుజాల పైన ఎక్కించుకునెళ్ళాలని పెద్దలు పట్టుబట్టారు. సరిత కి అన్న వరసయ్యే పది మంది అతి కష్టమ్మీద సురేశ్ ని దాదాపు ఈడ్చుకెళ్ళి.. " అబ్బా.. అలవాటు లేని అవపోసన" అని ఆయాసపడ్డారు. ఈ క్రమంలో, సరిత అన్నగారి చేతిలో ఉన్న ఒక పుస్తకం పట్టుకోమని పక్కనున్న పిల్లడికిచ్చాడు. పల్లకీ సంబరం లో మునిగిపోయి అప్పారావ్ సంగతప్పటికి మరచిపోయాడుసురేశ్ . అప్పారావునీ, గోపాల్ నీ అసలు ఎప్పుడొచ్చారని అడిగే సమయం కూడా ఇవ్వకుండానే "అమ్మా ముహూర్తానికి టైం అవుతోంది.. మీరేమో తిరుపతమ్మ గుడులనీ, వాళ్ళేమో గండి మైసమ్మ గుడులనీ తిరిగి తిరిగొచ్చి, ముహూర్తం దాటించేసేట్టున్నార"ని ఖంగారు పెట్టేసారు పంతులు గారు. పంతులు గారి ఆరాటం, ఫొటో గ్రాఫర్ల పోరాటం మధ్య పెళ్ళి అయింది. సరిత అన్నగారి దగ్గర పుస్తకం తీసుకున్న పిల్లాడు పుస్తకం చూసేటప్పటికి అది బాపు రమణల "కోతి కొమ్మచ్చి". మొహమాస్తుడైన ఆ పిల్లాడికి ఎవరితోనూ పెద్దగా కలవడం ఇష్టం ఉండదు. పుస్తకం తీసి మెల్లగా చదవడం మొదలెట్టేసరికి పెళ్ళి అయిపోయి, ఆలస్యమైతే అందదన్నట్టు అందరూ పొలోమని భోయినాల వైపు పరుగులు తీసారు. పుస్తకం ఇచ్చేసి భోజనానికెళితే బెటర్ అనుకుంటూ ఎరుపు చొక్కా వేసుకున్న సరిత అన్నగారి కోసం వెతకడం మొదలెట్టాడు. అక్కడా ఇక్కడా దూరం నించి చూసి దగ్గరికెళ్ళేలోపు, అతను ఇంకేదో పని ఉండి మాయవడం జరిగింది రెండు సార్లు. ఈ లోపు భోజనం చేసి వచ్చి, కాస్త జనాలు పలచబడడం తో మళ్ళీ పందిరి వైపు ఎర్ర చొక్కా అబ్బాయి కోసం వెతకడం మొదలెట్టాడు. చివరికి జంటకి స్నేహితులని పరిచయం చేస్తూ కనబడ్డాదు ఎర్ర చొక్కా వేసుకున్న సరిత అన్నగారు మురళి. హమ్మయ్య అనుకుంటూ అటువెళ్ళి " సార్, మీ పుస్కం" అన్నాడు . " ఓహ్ నీకిచ్చాను కదా, ఎవరి చేతులోనో పెట్టా కానీ, ఎవరి చేతులో గమనించలేదు" అన్నాడు మురళి . " అస్సలనుకోలే సార్ బుక్ బాగుంటదని, నగీ నగీ సచ్చిన" అన్నాడు మల్లేష్. " ఓహ్ నచ్చిందా అయితే" అన్నాడు మురళి. " మస్త్ నచ్చింది సార్" అన్నాడు మల్లేష్ మురిపెంగా. " నచ్చిందా , అయితే ఉంచు" అన్నాడు మురళి. " అయ్యొ బాగుండదు సార్" అని మొహమాట పడ్డాడు మల్లేష్. " ఏం ఫర్వాలేదు ఉంచెయ్" అన్నాడు మురళి. " అయ్యొ సార్ ఎవరన్న చూస్తె ఏమనుకుంటరు" అన్నాడు మల్లేష్.. " దీన్లో అనుకోడానికేముంది, నా దగ్గరింకా 3 కాపీలున్నాయి, ఉంచెయ్ చెప్తాను" అని మురళి అంటుండగానే, మల్లేష్ ఖాండ్రించి పుస్తకం మీద ఉమ్మేసాడు. ఈ హటాత్పరిణామానికి ఉగ్రుడయిపోయాడు మురళి. " చదువుకున్నోడివనుకుని మర్యాద ఇస్తుంటే సంస్కారహీనంగా ప్రవర్తిస్తావా, పిచ్చెక్కిందా " అంటూ గుభీ గుభీ రెండు గుద్దులు గుద్ది "చీ" అంటూ వెళ్ళిపోయాడు. మల్లేష్ ముక్కులోంచి రక్తం కారిపోతుండగా పెళ్ళికొడుకు తరఫు పెద్దలు పరిగెత్తుకొచ్చారు. సరిత వైపు వాళ్ళని దుమ్మెత్తిపోస్తూ, " బిడ్డనెట్లగొట్టిన్రు చూసిన్రా, ముక్కులల్ల రక్తమెలతాంది.. పిలగాడు పండుకొంటుండు బిరాన దవాఖానా కి తీస్కపోదాం పట్టున్రి” అని అరుపులు మొదలెట్టారు. సరిత మేన మామొచ్చి,, “చావు బతుకుల్లో ఉంటే ఇప్పుడు పండు కొనడం పువ్వులు కొనడం ఏంటండీ ఆసుపత్రికి తీసుకెళ్ళక “అంటూ వెటకారమాడాడు. ఇంక సురేశ్ వైపు వాళ్ళు కోపానికొచ్చి అతన్ని ఒక్క పీకుడు పీకారు. వీళ్ళూరుకుంటారేంటీ,, కర్రలు, గునపాలూ, గొడ్డల్లూ, కత్తులు కటార్లూ పట్టుకుని తయారయిపోయారు. ఓయ్య పిల్ల తండ్రిని తోల్కరండ్రి బిరాన అనరిచింది సురేష్ పెద్దమ్మ. ఆయ్ నేనేమైనా గొర్రెనా గాడిదనా తోలుకురావడానికంటూ వచ్చాడు వెంకట్రావు. అరుంధతీ నక్షత్రం చూపించడానికి గేటు బయటకి జంటను తీసుకెళుతున్న పంతులు గారు ఈ గొడవకి ఆశ్చర్యపోయి "ఏంటండీ ఇది, ఏం జరుగుతోందిక్కడ? అనడిగాడు. “ ఇదేదో మంచి ఆరంభమనుకున్నాం కానీ ఈ పెళ్ళ్ళి వలన ఇప్పటికే ఇన్ని సమస్యలు, ఇంక. మంగళమే” అని అటువాళ్ళూ, ఇటువాళ్ళూ అంజలి సినిమాలో డవిలాగుల్లా అరిచి అరిచి చెప్పారు. పంతులు కాస్త ఆలోచించి కొట్టడానికి కారణమడిగాడు. పుస్తకముంచుకోమంటే పుస్తకం మీద ఉమ్మడం గురించి చెప్పగానే నవ్వడం మొదలెట్టాడాయన.. ఎప్పుడో కోనసీమ నించి వచ్చిన పూర్వీకుల వల్ల అటూ ఇటూ రెండు యాసలనూ క్షుణ్ణం గా తెలుసుకున్నవాడై “ఉంచడమంటే ఉమ్మడమని “ టిప్పణి చెప్పాడు. ముక్కులో రక్తమోడుతున్న మల్లేష్ తో సహా అందరూ పక పకా నవ్వారు. గోపాల్ కి పౌరుషమొచ్చి, పెళ్ళికొడుకు తనని దవడ వాచేట్టు కొట్టాడని, పెళ్ళికి un do బటన్ ఉంటే నొక్కెయ్యాలని గోల పెట్టాడు. “కొట్టమంటే మరి కొట్టనా” అని సురేశ్" నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా" అని కథ చెప్పే అబ్బాయంత అమాయకంగా చెప్పాడు. “నువ్వెందుకు కొట్టమన్నావ”ని అడిగిన పంతులు గిరిధర శర్మతో, “వ్యాపారమేంటంటే కొట్టు అని చెప్పాన”ని అమాయకంగా చెప్పాడు గోపాలు. “కొట్టంటే దుక్నమయ్యా బాబూ” అంటూ పడీ పడీ నవ్వాడు పంతులు గారు. “అన్ని మంచిగనే గని ఈ దొంగమొకపోడు ఎన్ని తిట్లు తిట్టిండు” అని అందుకున్నాడు ఎల్లయ్య. “చేపా చేపా ఎందుకెండలేదు” అని అడిగినట్టు “నీ కథ ఏంటయ్యా” అని నవ్వుతూ అడిగాడు గిరిధర శర్మ. “అయ్యా మందలించమని మరీ బలవంతం పెడితేనూ.”.. అంటున్న అప్పారావుని చూసి కడుపు పట్టుకుని " నేనింక నవ్వలేనయ్యా బాబూ, మందలించడమంటే, పలకరించడమని, పనిలో పనిగా పండుకొనడమంటే నిద్దరోడమనీ, తోల్కరావడమంటే తోడ్కొనిరావడానికి వికృతని చెప్పి..”ఇంతటితో అపార్థాల కథ కంచికి మనమింటికి.. ఇప్పుడైనా అర్థం తెలుసుకుని మాట్లాడుకోండి నాయనోయ్ “అంటూ అరుంధతిని చూపించడానికి దంపతులనిk తీసుకెళ్ళబోతున్నాడు పంతులు. అంత మంచిగ జెప్పిండు పంతుల్ నోట్ల పేడ పెట్టున్రి... అనగానే మళ్ళీ రెచ్చిపోబోతున్న వెంకట్రావుకి.. అయ్యా పాలకోవాని పేడాలంటారు మీరు తొందరపడి మళ్ళీ మొదటికి తేకండయా.. కథాకళలో పదినిమెషాలే ఇచ్చారు అరిచాడు. అయితే వాకే మళ్ళీ కలుద్దామంటూ వెళ్ళి పోయారు బంధుమిత్రులు

బహుమతి

మాటిమాటికి ఖరీదైన బహుమతులిచిచిపుచ్చుకోవడం మేము పెరిగిన వాతావరణం లో లేదు. ఎవరింటికైనా వెళితే ఇంట్లో పూసిన పండ్లు, పువ్వులు, కరివేపాకు, మునగ కాయలు, ఉసిరికాయలతో పాటు బాలాజీ మిఠాయి బండార్ నించి పాలకోవాలో, కచోరీలో తీసుకెళ్ళడం అందరికీ ఎంత నచ్చేసేదో. పెళ్ళిళ్ళకో పుట్టినరోజులకో ఇచ్చే బహుమతి చిన్నదయినా సరే, ఇచ్చే వస్తువు పనికొచ్చేదో ఆర్టిస్టిక్ గానో ఉండాలని నా అభిప్రాయం. అన్నీ డబ్బుతో వెలకట్టడం నాకు ఇష్టం ఉండదు. ఖరీదైన బహుమతుల కంటే నాకు ఇష్టమైన వైలెట్ రంగు మట్టిగాజులిచ్చిన వాళ్ళు బహు ముఖ్యులైపోతారు నాకు. పనికిరాని పదివేల బహుమతి కన్నా, ఉపయోగపడే డాలరుస్టోర్ వస్తువు మిన్న అన్నది కూడా నాకు అనిపించేస్తుంటుంది మరి. పైగా చిన్నప్పటినించీ ఇంటా బయటా ఎవరికేమి ఇష్టమో కనిపెట్టి, దాన్ని కొని ఇవ్వడం ఇష్టం. స్నేహితులొకరు ఇల్లు కొనుక్కున్నారు. పదిరోజుల్లో గృహప్రవేశం అనీ, తప్పకుండా రావాలనీ చెప్పారు. ఏం కొనాలి అని బాగా ఆలోచించాము. ఆవిడ మా సీతయ్యతో కలిసి పనిచేసేవారు. మా ఇంటికొచ్చినప్పుడు "మొహమాట పడకండి" అన్నప్పుడల్లా, ఆవిడ "నాతో అలాంటి ప్రాబ్లం ఎప్పుడూ రాదు. నాకు మొహమాటం లేకుండా ఏది కావాలన్నా అడిగి తీసుకుంటా, ఒకవేళ మొహమాట పడే పరిస్థితి వస్తే, హింట్ ఇస్తాగా" అనడమే కాకుండా, కావలసింది అడిగే చనువు కూడా ఉందనిపించేలా సరదాగా ఉండేవారు. "చనువు ఉంది కాబట్టి, ఆవిడనే అడుగుదాము ఏం కావాలో" అన్నాను నేను. సీతయ్యకి ఏదో తట్టింది. ఆఫీసులో మాట్లాడుతున్నప్పుడు " ఇంటికి అన్నీ కొనడం అయిపోయిందండీ, ఒక్క కంప్యూటర్ టేబుల్ ఒక్కటీ మిగిలింది " అన్నారని చెప్పారు. మేమిద్దరం దాన్ని ఒక హింట్ లాగా తీసుకుని, టేబుల్ కొనడానికెళ్ళాము. మా అదృష్టం కొద్దీ హోం డిపోలో $175 ఉన్న అందమైన టేబుల్ ని $75 కి సేల్ లో పెట్టారు. అలాంటప్పుడు గబ గబా అమ్ముడుపోతాయి. ఇంక రెండే పీస్ లు ఉన్నాయి. కార్నర్ టేబుల్ ఎల్ షేప్ లో చాలా పెద్దది. ఇంట్లో సగం సామాను వెళ్ళిపోతుంది ఆ అరల్లోకి. భలే నచ్చేసింది మా ఇద్దరికీ. సేల్ కాబట్టి రిటర్న్ తీసుకోము అని చెప్పారు. అయినా సరే, వాళ్ళకొకటి మాకొకటి అని కొన్నాము. రెండూ కార్లో పెట్టడానికి ప్రయత్నించారు కుదరలేదు. షాప్ లో పనిచేసే పిల్లలు ఒక తాడు తెచ్చి ట్రంక్ తలుపు తీసి ఉంచి, గట్టిగా కట్టేసారు. కాస్త దూరం వరకూ బానే ఉంది. తర్వాత ఒక డబ్బా జారి, తాడు వదులయి, తలుపు దడాలున పడబోయి ఆగింది. సాయంత్రం అవడంతో ఆఫీసు నించి ఇంటికెళ్ళే కార్లతో రోడ్డు కిటకిట, ఇంకో వైపు ముద్దలు ముద్దలుగా మంచు కురుస్తోంది. మధ్య లేన్ లో ఉండడం వల్ల, కార్ లోంచి దిగే పరిస్థితి లేదు. వెనక డబ్బా పడిపోతోంది చూసుకో అని పక్క కార్ వాళ్ళు అరచి చెప్పారు. డ్రయివింగ్ కొత్త. కంగారు. ఈ లోపే రైల్వే గేట్ వచ్చింది. అది దాటబోయేంతలో రెండో గేట్ పడబోతూ ఉంది. అదాటున దాటేటప్పటికి డబ్బా పడిపోయింది. పక్కకి ఆపుకుని ఆ డబ్బా ఎత్తి లోపల పెట్టేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చింది. అలా నెమ్మదిగా నడుపుకుంటూ చివరికి వాళ్ళింటికి వెళ్ళాము. ఇల్లు కాస్త ఎత్తుమీద ఉండి, 6 మెట్లున్నాయి. అవి చూసి ఈ వస్తువుని అక్కడికి ఎలా తీసుకెళ్ళడమా అని ఒకటే టెన్షన్ పడ్డాము. ఇంతలో మమ్మల్ని చూసి వాళ్ళు బయటికొచ్చారు. "కొంచెం సహాయపడతారా ఇది ఇంట్లోకి తీసుకెళ్ళడానికి" అని అడిగా మొహమాటాన్ని పక్కనుంచి. "ఏమిటిది" అంటూనే "అయ్యో ఇదే వస్తువు నిన్న రాత్రి కొనుక్కొచ్చాము. ఇల్లు బాగా చిన్నది అందుకని ఇంట్లోకి తీసుకువెళ్ళవద్దులెండి, మీరే తీసుకెళ్ళిపోండి ఏమీ అనుకోకుండా" అన్నారతను. మాకు ఏంచెయ్యాలో తెలియదు. వాళ్ళూ అక్కడే కొన్నారు కాబట్టి, వాళ్ళు కొన్నదే కాక, మేము కొన్నవి కూడా వెనక్కి తీసుకోరు. ఇప్పుడేం చెయ్యాలి? కనీసం ఒక టేబుల్ వీళ్ళకి ఇచ్చేస్తే, ఇంకొక్కదాన్నీ జాగర్తగా సర్దుకుని నిదానంగా ఇంటికెళ్ళచ్చనుకున్న ఆశ కూడా పోయింది. వచ్చిన పని మరచిపోయి, ఇంటికెళ్ళడమెలాగా అని దిగులు పట్టుకుంది. ఒక వైపు కుప్పలు తెప్పలుగా మంచు కురుస్తోంది. ఇంకో గంట ఆగితే చీకటి కూడా పడుతుంది. అదే విషయాన్ని చెప్పి, ఒక సారి ఇల్లు చూసామనిపించి, భోజనాలవీ కేటరింగ్ వారు తెచ్చేవరకూ ఆగకుండానే వెనుదిరిగాము. చాలా కాలానికి ఇంటి నుండి బయటికెళుతున్నామనుకున్న పిల్లలకి చాలా డిసపాయింటుమెంటు. అంతవరకూ చాలా అందంగా ముచ్చటగా అనిపించిన టేబుల్..ళ్ళు ఇప్పుడు చచ్చిన గేదెని మోసుకెళుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఆ మంచులో జారుతున్న కారు, కారులోంచి జారిపోతున్న డబ్బా, తాన్ని తట్టుకోలేక ఉండనా ఊడనా అని చూస్తున్న తాడు, ఏం మాట్లాడితే ఏం విపత్తో అని అరచేతులో ప్రాణాలతో నేను, ఒక్క మాట మాట్లాడినా ఆకాశం ఊడి నేల మీద పడుతుందని తెలిసి మసలుకుంటున్న పిల్లలూ..వెరసి ఎలాగోలా ఇల్లు చేరాము. అక్కడ నించి ఇవన్నీ బేస్మెంట్ లో ఉన్న నివాసానికి తీసుకెళ్ళాలి. ఒకటయితే బానే ఉండు. రెండు తీసుకెళ్ళాలి అదీ, చితికిన మనసులతో.. ద్యావుడా అనుకుంటూ చచ్చీ చెడీ, ఇంట్లోకి మోసుకెళ్ళినా, వాటికి పెట్టడానికి జాగా ఉన్నంత పెద్ద ఇల్లు కాకపోయె. పైగా పార్టీ అని కదా వెళ్ళాము. ఇప్పుడు వంట మొదలెట్టాలి. ఆకలెక్కువయిందంటే అదొక గోల అని నేను కాళ్ళు చేతులూ కడుక్కుని బట్టలు మార్చుకుని అన్నం గిన్నె పొయ్యికెక్కించేసా. "అసలు నీ వల్లే వచ్చింది ఇదంతా" అన్న మాట తో ఉలిక్కిపడ్డా. ఇది వస్తుందని తెలుసుకానీ కొంత పోస్ట్ పోన్ చేద్దామని ప్రయత్నం. అసలే అందరం ఎవరి రీసన్ లతో వాళ్ళం చిరాగ్గా ఉన్నాము కదా? కానీ వచ్చాక తప్పుతుందా? "వాళ్ళింట్లో కంప్యూటర్ టేబుల్ ఒక్కటే కొనాలిట అని చెప్పింది నేనా?" అన్నా తడుముకోకుండా. "మాటవరసకి చెప్పాకానీ, నీ చావు తెలివితేటలే ఆవిడ హింటిచ్చిందని చెప్పాయి" అన్నారు సీతయ్య. "అయ్యా అలా ఏదో లెక్కలేస్తుంటా... ఒకోసారి తప్పవచ్చు నేనేమైనా కలగన్నానా అన్నాన్నేను. "అదిగో అలాంటి తేడా లెక్కలే వెయ్యద్దని చెప్పేది, మళ్ళీ చూస్తే అకవుంటెంట్ అని పేరొకటి, ఒక్కటీ బాలన్స్ కాదు బాలన్స్ షీట్ తో సహా" అన్నారు సీతయ్య కచ్చగా. "అదిగో నన్నేమన్నా అనండి నా బ్యాలన్స్ షీట్ ని తీసుకొస్తే బాగుండదు" అన్నాన్నేను కుములుతూ. "అనక? దేనికైనా ఉపయోగపడిందా అసలు" అన్నారాయన. ఇంకా చాలా ఉన్నాయిలెండి అవన్నీ మీకు తెలిసినవే. అవన్నీ సద్దుమణగవు కానీ, ఈ టేబుల్ ని ఎవరైనా ఫ్రీగా తీసుకుంటారేమో వెతుకుదాం రండి. *** చూసారా, నేను చెప్తూనే ఉన్నాగా, లేదంటే లేదనుకుంటారు కానీ, మనం ఫ్రీగా ఇస్తామన్న వస్తువు మాత్రం ఎంత మంచిదైనా తీసుకోవడానికి ఒక్కరూ దొరకరు. ఇల్లు చిన్నదనో, అది ఫిక్స్ చెయ్యడం రాదనో, దాన్ని మోసుకెళ్ళడం కష్టమనో, కారు లేదనో ఏదో ఒకటి చెప్పుకొస్తున్నారు, మీరే చూస్తున్నారుగా? పోనీ మనమే కార్ లో పెట్టుకెళ్ళి వాళ్ళ ఇంటిదగ్గర దింపి వస్తామని చెప్పినా ఎందుకో వద్దనేస్తున్నారు కదూ? మీకు తెలియదని కాదు కానీ, కెనడాలో అదన్నమాట విషయం. గుడ్-విల్లని ఒకటి ఉంటుంది లెండి, మనకి అక్కరలేనివి అక్కడ పడేస్తే, వాళ్ళు సెకండ్ హ్యాండ్ రేటుకి అమ్ముకుంటారు. అవి అమ్మగా వచ్చిన డబ్బులో, నిర్వహణ ఖర్చులు పోను మిగిలినది ఏవో మంచి పనులకి ఖర్చు పెడతారన్నమాట. అక్కడికి తీసుకెళ్లి ఒకదాన్ని వదిలించుకున్నాక గానీ, రెండవది ఫిక్స్ చెయ్యడానికి చోటు రాలేదు. ఇది ఇలా గుడ్విల్ లో పడేసిన మర్నాడు బస్ లో కలిసిన ఒకావిడ మాట కలిపి, తాము కొత్తగా వచ్చామని, ఫలానా ఫలానా వస్తువులు ఎక్కడ దొరుకుతాయని అడిగిన వాటిలో కంప్యూటర్ టేబులొకటి. పిల్లలు కింద కూచుని చదువుకోలేకపోతున్నారని, కొనాలంటే డబ్బు లేదని, ఎక్కడైనా పాతవి దొరుకుతాయా అనీ అడిగారు. అప్పుడు మీకైతే ఏమనిపిస్తుంది అండీ. కడుపులో ఒక ఫీలీంగ్ .. కదా.. అదే నాకూ వచ్చింది మరి.. గట్టిగా ఏడ్వాలనిపించేంత. ఇది జరిగాక, నా క్రియేటివిటీ పక్కన పెట్టి, గిఫ్ట్ కార్డులనే సాధనం కనిపెట్టి, చిన్నదో పెద్దదో అవే ఇచ్చెయ్యడం మొదలెట్టాం కానీ ఏదో అసంతృప్తి. చాలా మంది వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎవరో ఏదో వస్తువు తెచ్చి పడేస్తే, దాన్ని ఇంకొకళ్ళ ఇంటికి వెళుతున్నప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. అలా కొన్ని వస్తువులు రీసైకిల్ అవుతాయన్నమాట. వాటిలో జాకెట్ ముక్కలు కూడా ఒకటి, వాటి తో పాటు ఇచ్చే చిన్న పసుపు కుంకుమ డబ్బాలతో సహా. మీకొకటి చెప్పాలి. ఒకసారి నాకు ఇంట్లో పసుపు నిండుకుని (అబ్బా అలా అనాలని రూలు అంతే) గబ గబా ఒక చిన్న డబ్బా తెరిచి తెచ్చుకున్నా. మొత్తం పురుగులే. అప్పటి నించీ జాకెట్ ముక్కలు అవీ పక్కన పడేసి చలి కాలానికి పనికొచ్చే ష్రగ్గులో రగ్గులో ఇస్తున్నా. భేషుగ్గా ఉంది అవుడియా అంటున్నారు మా వాళ్ళు. మీరూ అంటారు లెండి నాకు తెలుసుగా. కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని అసలు దేనికి వాడతారో కూడా మనకి తెలియదు. బేకింగ్ సెట్టో, పోర్సిలిన్ బేకింగ్ ట్రే నో తెస్తే, బేకింగ్ అన్న కళ తెలియని నా లాంటి వాళ్ళు ఏం చేసుకుంటారండీ? స్టవ్వు కింద ఉన్న ఓవెన్, బాండ్లీలు, బూరెల మూకుళ్ళు పెట్టుకోవడానికేమో అని మాత్రమే అనుకునేదాన్ని చాన్నాళ్ళసలు. నాతో సమానమైన లోక జ్ఞానం కలిగిన వాళ్ళే నాకు తగిలిన వారు కూడా. దాంతో, వాళ్ళకి అర్థం కాని వస్తువులని, ఎవరింటికో వెళుతున్నప్పుడు గిఫ్ట్ బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళింట్లో పడేస్తే, గిఫ్ట్ కొనే ఖర్చూ తప్పుతుంది, ఫ్యాన్సీ గా ఇచ్చినట్టూ ఉంటుందని ఏవేవో వస్తువులు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం లాగా అన్నమాట. ఈ వస్తువులు చూసీ చూసీ చిరాకేసి, మా ఇంటికొస్తున్నప్పుడు ఏమైనా తెచ్చినవాళ్ళకి ఇంట్లోకి ప్రవేశం లేదనీ, పైగా ఒక కుటుంబం లాగా అయిపోయాము కాబట్టి, మనలో మనం ఇలా కొత్త ఫార్మాలిటీస్ మానేద్దామనీ నచ్చచెప్పేటప్పటికే, ఇంట్లో పేరు తెలియని బోలెడు వస్తువులు. పెప్పర్ సాల్ట్ సెట్లు, మూన్ లయిట్ డిన్నర్ క్యాండిల్ సెట్లూ, కింద మంటపెట్టి పైన చాక్లెట్ పాలు కాచుకునే సెట్లూ, కేక్ పళ్ళానికి మూతపెట్టుకునే సెట్లూ, మధ్యలో సాస్ వేసుకుని చుట్టూ చిప్స్ వేసుకుని తినే పోర్సిలిన్ పళ్ళాల్లాంటి సెట్లూ, ఒక షాట్, గాబ్లెట్స్ (ఏదో లెండి నాకే అర్థం కాదు మీకేం చెప్పను), బీరు గ్లాసులు, మంచి నీళ్ళ గ్లాసులు, వైను గ్లాసులు కాక ఎందుకు ఉపయోగిస్తారో తెలియని అనేకానేకమైన వస్తువులని సులువుగా గుడ్విల్ లో పడేసి వస్తే కానీ ప్రశాంతత లేకపోయింది. ఒకసారి ఎవరో ఇంటికొస్తూ ఒక కప్పు పట్టుకొచ్హ్చారు. పాలో పెరుగో పోద్దామంటే, ఆ కప్పు ఒక వైపు సాగినట్టుంటుంది. " మీరు మొన్న ఇచ్చిన వస్తువు ఏంటండీ భలే ముద్దొచ్చేస్తోంది" అని అడిగా ఆవిడ ఫోన్ చేసినప్పుడు. "ఏమోనండీ తెలియదు, మా వారు కొనుక్కొచ్చారు" అన్నారావిడ, "ఇంకొకరు తెచ్చినది నాకు అర్థం కాక మీకు ఇచ్చాను" అంటే బాగుండదన్నట్టు. మ్యాన్యుఫాక్చరింగు డిఫెక్టేమో అని పరికించి చూసి, ఏదోలే అని గార్బేజ్ లో పడేసా. మరుసటి యాడాది బాక్సింగ్ డే షాపింగ్ కి వెళ్ళినప్పుడు వంట సామాన్ల దుకాణంలో డిస్కవుంట్లని, లోపలికి వెళ్ళగానే ఇలాంటి ఒక వైపు సాగిన కప్పులు బోలెడు కనిపించాయి. ఆ షాపులో పని చేస్తున్న వాళ్ళల్లో, నన్ను మరీ ఊరు దాన్ననుకోదనుకున్న ఒక చిన్న పిల్లని వెతికి పట్టుకుని, "అమ్మాయీ ఇదేంటీ" అనడిగా. నా వైపొకసారి ఎగాదిగా చూసి, "వంట చేస్తున్నప్పుడు అన్నమో కూరో కలిపే గరిటలు కిందా మీదా పెట్టకుండా, దీనిలో పెట్టుకోవచ్చు, సర్వింగ్ స్పూన్ హోల్డరు" అంది. "ఓహో అదన్నమాట. అరే ఇలా నేను పడేసిన చాలా వస్తువులకి అర్థం పర్థం ఉందన్నమాట! ఇలా నాకు అర్థం కాక చాలా పడేసానే" అని బాధ పడ్డా కూడా.. ఒక పాకీస్తానీ జంట పరిచయమయ్యారు ఆ మధ్య పార్కులో. ఒక్క రెండు వీధులవతల ఉంటారుట. మరీ కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు గానీ, మరీ పాత కూడా కాదు. పిల్లలు ఒకే వయసు వాళ్ళవడంతో సంతోషపడిపోయాము ఆడుకోవడానికి తోడుంటారని. ఎవరైనా కొత్త వాళ్ళు కనబడగానే "మా ఇంటికి ఎప్పుడైనా వచ్చెయ్యచ్చు. ఫోన్ లు గట్లా చెయ్యక్కరలేదు. మా ఇంటి ద్వారములు మీ కొరకు ఎల్లప్పుడూ తెరిచియే ఉండును " అనడం మా సీతయ్యకి అలవాటు. గ్రాసరీ చెయ్యడానికెళుతుంటే గుర్తొచ్చాముట, పదకండవుతుండగా వచ్చారు శనివారం. వాళ్ళు ఒక బరువైన వస్తువేదో తెచ్చారు. నా స్నేహితులకంటే చెప్పేసా గానీ, వీళ్ళు కొత్త కదా? "ఏమీ తేవద్దు" అని చెప్పే వీలు లేకపోయింది. వాళ్ళు వెళ్ళాక పిల్లలు అప్పటి దాకా ఆపుకున్న ఉత్సాహాన్ని ఆపుకోలేక " అమ్మా, చుట్టాలు వెళ్ళిపోయారుగా, ఇప్పుడు గిఫ్ట్ విప్పి చూడచ్చా " అని అడిగారు గౌరవంగా. సరే అన్నానో లేదో ఆ డబ్బాలోంచి వచ్చింది పెద్ద షాండ్లియర్, కళ్ళు జిగేలని మిరుమిట్లు గొలుపుతూ! ఎంత పెద్దదో, ఎంత బాగుందో అసలు! దాని అందానికి ముగ్ధురాలినైపోయాన్నేనొక్కసారిగా. అల్లప్పుడెక్కడో హైదరాబాదు నవాబుల ఇల్లు లాంటి ఒక పెద్ద హోటల్ కి వెళ్ళినప్పుడు చూసి ఆహా ఓహో అనుకున్న షాండ్లియర్.. నేను అలా గింగిరాలు తిరుక్కుంటూ అటు వెళ్ళిపోయా. సీతయ్యకొచ్చిన ఇర్రిటేషన్ ధాటికి మళ్ళీ మా బేస్మెంట్ లోకి వచ్చి పడ్డా. ఈ సీతయ్య అంతేనండీ... నేనెక్కడికో వెళదామనుకుంటా కలల్లో. ఆయన్నీ తీసుకుపోదామనుకుంటా. ఆయన ఆ రాగానికి, తాళానికీ తట్టుకోలేడు.. తకిట తకిట అంటూ నన్నూ లాక్కొచ్చేస్తాడు . "ఏమిటంత మురుపు, మైమరపూ ఏం చేస్తామిప్పుడు దీన్ని?" అని అడిగారు భయంగా. భయమెందుకంటారా? రాత్రి షిఫ్ట్ కి వెళ్ళాలి ఆయన. అసలే పగటి నిద్ర రాత్రి నిద్రతో సమానం కాదు. అయినా శనివారాలు పొద్దున్న పని నించి వచ్చాక పాలు కూరలు పళ్ళు అంటూ పిల్లలని తీసుకుని దుకాణాల చుట్టూ తిరుగుతారు. పగలు భోజనాలయాక నిద్రపోతారు. మరి వాళ్ళు వచ్చి వెళ్ళారాయె. కొంత సమయమే ఉంది. మూడు నాలుగు గంటలయినా పడుకోకపోతే రాత్రి నిద్ర ముంచుకురాదూ? ఇల్లేమో మరీ చిన్నది. ఇదేమో ఇంత పెద్ద డబ్బా. పనికొచ్చే వస్తువా అంటే కాదు. ఇంట్లో స్థలం లేదు కాబట్టి, గుడ్విల్ లో పడెయ్యడానికి ఈ సమయంలో వెళ్ళాలంటే కష్టమే కదా మరి. కాసేపాగి నేనొక నిర్ణయానికి వచ్చా. ఆ పాకిస్తానీ ఆవిడకి ఫోన్ చేసి, "భాభీ గారూ, అంత ఖరీదయిన వస్తువులు బహుమతులు తీసుకోవడం మాకు అలవాటు లేదు, కావాలంటే మీ ఇంటి పెరట్లో పూస్తున్న ఒక లిల్లీనో, గులాబీనో ఇచ్చి ఇది పట్టుకెళ్ళిపోరూ" అని గారంగా అడిగా. నీ గారం నయాగరాకెళ్ళా అన్నట్టు ప్రేమగా నవ్వి, "మీరు మాకు భలే నచ్చారు, మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు మా గుర్తుగా దీన్ని పెట్టుకోవాలి ఇది నా కోరిక" అంది. "అది ఇప్పటి మాట కాదు కదా, ఇల్లు కొనగానే, మిమ్మల్ని షాప్ కి తీసుకెళ్ళి అచ్చం ఇలాంటిదో, ఇంతకంటే మంచిదో అడిగి కొనిపించుకుంటా కదా మీకు ఎందుకు బెంగ, మా తల్లి కదూ ఇప్పుడు మాత్రం వద్దు, ఇల్లు చూసారుగా. స్థలం కూడా లేదు, దీన్ని దుకాణంలో ఇచ్చేద్దాం" అన్నాను . "నీకొక నిజం చెప్పనా? మేము చాలా చిన్న అపార్టుమెంటు కొన్నాము. గృహప్రవేశం పార్టీ సందర్భంగా వచ్చిన మా తెలిసున్నవాళ్ళలో ఇద్దరు షాండ్లియర్లే పట్టుకొచ్చారు. పెట్టుకుందామన్నా, ఇల్లు కొన్నప్పుడే ఫిక్చర్లన్నీ ఉన్నాయి, వీటిని ఏమిచేసుకోవాలో తెలియక, ఎవరింటికెళ్ళినా పట్టుకెళుతున్నాము. వాళ్ళు వద్దంటున్నారు. నువ్వు అలా వద్దనకు నేను బాధ పడతా" అంది. "నా తల్లే" అనుకుని, ఆ డబ్బాని ప్రస్తుతం డయినింగ్ టేబుల్ లా వాడుకుందామా బరువుగా పడి ఉంటుంది అని ఇంటి మధ్యకి పట్టుకొచ్చి , దానిమీద ఎంబ్రాయిడరీ ఉన్న ఒక చున్నీ పరిచా.. పిల్లలు సరదా పడిపోయి ప్లేట్లు పట్టుకుని దాని చుట్టూ కూచుని భోజనం చెయ్యడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. సీతయ్యకి ఇంక రెండు మూడు గంటలే ఉంది కాబట్టి, తనని పడుకోమని, ఆ డబ్బాని నెమ్మదిగా మెట్లెక్కించి డ్రయివ్ వే పక్కనున్న చెట్టు దగ్గర పెట్టాము. ఇంకో విషయం చెప్పాలి. మనకి అక్కరలేని ఏదైనా వస్తువు ఉంటే, మన ఇంటి ముందు రోడ్డు వారగా పెడితే ఎవరికైనా కావలిస్తే తీసుకెళతారు. కానీ మేము ఉంటున్న ఇల్లు చిన్న చంద్రవంకలా ఉన్న వీధి లో మెయిన్ రోడ్డుకి కొంత దూరంలో ఉన్నమూలాన, ఈ నాలుగిళ్ళవాళ్ళు తప్ప ఈ వీధిలోకి బయటి వాళ్ళు వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ పెట్టి చూద్దాం, కనీసం రేపటి వరకైనా ఇరుకిరుకుగా ఇంట్లో ఉంచక్కరలేదు అని ముగ్గురం సంతోషపడ్డాము. రెండు రోజులు ఆశగా చూసా ఎవరైనా తీసుకెళ్ళారేమోనని! అదక్కడే ఉంది నన్ను హేళన చేస్తూ! రెండు రోజులు తెరిపిచ్చిన మంచు మళ్ళీ కురవడం మొదలయింది. పైన డబ్బా తడిసిందంటే, ఆ లోపలి అందమైన వస్తువు ఎవరికీ పనికిరాదన్న మధ్యతరగతి మనసు దాని చుట్టూనే తిరిగింది. మా ఇల్లుగల వాళ్ళకి ఇంటా బయటా బోళ్ళు సామాను. గారేజీ కూడా చెత్తా చెదారం తో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడూ ఏమీ అడగని దాన్ని ఇంటివాళ్ళని బతిమాలి వాళ్ళ గారేజీలో ఈ రెండు రోజులూ ఆ పెట్టెని పెట్టేటట్లూ, శనివారం పొద్దున్నే తీసుకెళ్ళి గుడ్విల్ లో పడేసేటట్ట్లు ఒక ఒడంబడిక చేసుకొచ్చా. దానికి ప్రతిఫలంగా శనివారం పూట పులిహారా రవ్వలడ్డులు నైవేద్యం ఇస్తానని మొక్కు పెట్టాననుకోండి, అది వేరే విషయం. అలా దాన్ని ఆ శనివారం గుడ్విల్ వైపు ప్రయాణం కట్టించినా, ఆ షాండ్లియర్ తాలూకు మెరుపులు నా కళ్ళల్లో తళుకుమంటూనే ఉండేవి చాలా రోజులు. ఇలా ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, క్షణం తీరిక లేని, దమిడీ ఆదాయం లేని పనులు బోలెడు మాకు, గుడ్విల్ కీ మధ్య నడిచాయి, నడుస్తూనే ఉన్నాయి. అదొక తీరని బంధం అంతే..A

ప్రొఫైల్

ఈ మధ్య మా ఊరి పిల్లలో చుట్టాల పిల్లలో చాలా మందే వస్తున్నారు. అప్పట్లో కెనడా పంపమంటే యేముందక్కడ యూ ఎస్ పోతున్నాం అనేవారు. ముల్లు పొయ్యి కత్తొచ్చె లాగా ఇప్పుడు యూ ఎస్ తగ్గి కెనడా రాకలు పెరిగాయి... వచ్చిన పిల్లలు నెలో రెండు నెలలో ఉండి కాలేజికి దగ్గరగా వెళుతుంటారు.. పిల్లలు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నించి పిక్ చేసుకోవడం ఒక్కటే కష్టం మాకు. విమానాలు వచ్చే టయిము మా పని వేళలు ఎప్పుడూ క్లాష్ అవుతుంటాయి. ఎక్కువగా కార్ పార్కింగ్ లో పెట్టి గంటలు గంటలు వెయిట్ చెయ్యడానికి ఇంట్లో ఎవరూ ఇష్టపడరు. పిల్లలకి మా ఫోన్ నంబరు తెలుసు కాబట్టి ల్యాండ్ అయ్యాక కాల్ చేస్తే లగేజీ పిక్ చేసుకునేలోపు అక్కడుంటాము. మేము వెళ్ళేటప్పటికి బయటికి వచ్చి ఉంటారు. 30 వ నంబరు పిల్లర్ లాంటి బండ గుర్తులు చెప్పేస్తామన్నమాట.. లగేజ్ తీసుకున్నాక వైఫై ఉండగా ఫోన్ చేసి బయటకొచ్చి నించుంటే సెక్యూరిటీ వాళ్ళు తరిమే లోపు మనవాళ్ళని చూసి కార్ ఎక్కించుకురావడమే. దూరపు చుట్టాలబ్బాయి వస్తున్నాడుట. పొయిన సంవత్సరమెప్పుడో ఎలా ఉంటుందీ ఏంటీ అని ఫోన్ చేసి మాట్లాడారు కానీ మళ్ళీ వస్తున్న విషయం తెలియలేదు. పాపం బాధ పెట్టొద్దు అనుకున్నారేమో ముందే ఆ పిల్లోడి సీనియర్ ల సహాయం తో వాళ్ళతో పాటు ఉండడానికి ఇల్లూ అవీ మాట్లాడేసుకున్నారుట. ఇంటి ఓనరొచ్చి తీసుకెళతా అన్నాడుట. తీరా చివరలో నాకు ఇంకో పని పడింది ట్యాక్సీ తీసుకుని వచ్చెయ్ అన్నాడుట..అబ్బాయి తలితండ్రులు బోలెడు ఖంగారు పడిపోయారు. అసలే కొత్త ఊరు. ట్యాక్సీ వాళ్ళూ అదీ మంచివాళ్ళుంటారో పెట్టే బేడా తో సహా పిల్లడిని ఎత్తుకుపోతారో అని భయపడి అప్పటికప్పుడు వాళ్ళ చుట్టాల దగ్గర మా నంబరు తీసుకుని ట్యాక్సీలవీ ఖంగారు గా ఉంది. మా అబ్బాయిని ఎయిర్పోర్ట్ నించి పిక్ చేసుకుంటారా అని అడిగారు.. సరే అన్నాను కానీ ఖంగారు పడ్డాను. ఇంట్లో ఎవరెవరు ఏ ఏ టయిం లో ఖాళీ ఉంటారో ఉండరో ఎవరు పిక్ చేసుకుంటారో తెలియదు.. నెమ్మదిగా అందరినీ గీకా.. గీకేడప్పుడు కొద్దిగా గీస్తున్న పుల్లకి బటర్ రాసా.. కుదరలేదు బిస్కట్ క్రీం పూసా . వర్కవుటయింది.. పెద్దోడు సరే నేనెళతాలే అన్నాడు . హమ్మయ్య అనుకున్నా. ఎప్పుడు అని అడిగాడు.. నిన్న రాత్రి బయల్దేరాడు ఈ రోజే వచ్చేది సాయంత్రం అని చెప్పాను. అబ్బా కాస్త ముందు చెప్పచ్చు కదా అన్నాడు. లేదమ్మా వాళ్ళు ఏదో అర్రేంజ్ చేసుకుంటున్నారుట కానీ అది కుదరలేదుట. ఈ రోజు పొద్దున్న ఫోన్ చేసి " మా వాడు బయల్దేరాడు, ఆ అరేంజ్మెంట్ కుదరలేదుట పిక్ చేసుకుంటారా అని అడిగారు" అన్నాను. సరే అయితే ఆఫీస్ నించి వెళతాలే అన్నాడు. హమ్మయ్య అనుకున్నా .. ఆ పిల్లోడికి లగేజ్ పిక్ చేసుకున్నాక ఫలానా నుంబర్ కి ఫోన్ చేసి చెప్పమని వచ్చి తీసుకెళతామని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. లండన్ లో ఆగాక ఫోన్ చేస్తాడండీ.. మా అబ్బాయి నంబర్ ఇదిగో అని చెప్పారు ఆ నంబర్ ని అలాగే పెద్దోడికి పంపేసి చేతులు దులుపుకున్నా..దులుపుకోవడమంటే ఎలా దులుపుకుంటాలెండి ఇంటికెళ్ళి వంట ప్రయత్నాలు చేసా.. పాపం ఆ పిల్లోడు ఎంత ఆకలిగా వస్తాడొ 23 గంటలు ప్రయాణం కదా అనుకుంటూ.. పెద్దోడి నంబర్ ఇచ్చాకానీ ఆ పిల్లోడి నించి ల్యాంద్ లయిన్ కి ఫోన్ వచ్చింది. ఎయిపోర్ట్ లో ఎవరి ఫోన్ లో నించో చేసాడు . నువ్వు ఉన్న చోట గేట్ నంబరు చెప్పమన్నా చెప్పాడు సరే అక్కడే నించో మా అబ్బాయి వస్తాడు అని చెప్పి పెద్దోడికి ఫోన్ చేసా. సరే అమ్మా ఆ గేట్ దగ్గరకెళుతున్నా అన్నాడు. ఇంకో పది నిమిషాల్లో పెద్దోడి నించి ఫోన్ వచ్చింది. అమ్మా ఎయిర్పోర్ట్ దగ్గరున్నా ఆ అబ్బాయి ఫొటో ఉంటే పంపు ఎలా గుర్తించడం అన్నాడు. అయ్యో నేను ఎప్పుడూ చూడలేదమ్మా.. పెద్దత్తయ్య తోటికోడలి చెల్లికి బావగారి కసిన్ కొడుకుట , అన్నాను.. అవన్నీ నాకు అర్థం కావులే కానీ ఫొటో పంపు అన్నాడు. సరే గబ గబా పిల్లోడికి వాట్సాప్ ఉందా అని చూసా.. హమ్మయ్య ఉంది.. కానీ రాముడు బాణం సంధిస్తున్న బొమ్మ ఉంది.. వాళ్ళ నాన్న కి అమ్మకి ఉందేమో అని చూసా.. తండ్రికి వినాయకుడి బొమ్మ, తల్లి కి లక్ష్మీ దేవి బొమ్మ ఉన్నాయి. గబ గబా ఫేస్బుక్ లో పేర్లు వెతికా.. ఒక వంద పేర్లొచ్చాయి.. ఊరు వాడ అన్నీ చూసి చూసి వీళ్ళే అని గుర్తించా... తీరా చూస్తే పిల్లోడి ప్రొఫైల్ లో ప్రభాస్ బొమ్మ, తల్లి కి అనుష్క బొమ్మ, తండ్రి కి ...అబ్బ పొండి! నాకు లోకజ్ఞానం తక్కువ.. ఆ బొమ్మ ఎవరిదో అర్థం కాలేదు.. పెద్దోడు ఒకొక్క కుర్రోడిని చూసి నువ్వేనా నువ్వేనా అని అడిగేలోపు సెక్యూర్టీ వాళ్ళు తోలేస్తుంటే 4 5 రవుండులేసి అమ్మా నా వల్ల కావట్లేదు , ఆ పిల్లోడిని తెలుసుకోలేకపోతున్నాను బిలబిల్లాడుతూ 150 మంది స్టూడెంట్స్ వచ్చేస్తున్నారని చెప్పాడు.. చాలా ఖంగారు పడిపోయాను, ఆడపడుచు దగ్గర మాట పోతుంది కదా... నాన్న ఇంకో రవుండు వెయ్యమ్మా అని బతిమాలుకున్నా.. 'అలా ఎలా వచ్చేస్తానే , ఏదో ఊరికే అన్నాలే' అన్నాడు.. ఇంకో రెండు రవుండ్లు వేసేసరికి పిల్లలందరు వెళ్ళిపోయి, నలుగురైదుగురు మిగిలారు. వాళ్ళల్లో ఆతృతగా , ఆందోళనగా చూస్తున్న పిల్లాడిని చూసి ఫలానా నువ్వేనా అని అడిగి గుర్తుపట్టి తీసుకొచ్చాడు. రాగానే 'బాబూ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ మార్చు అన్నా, ఎందుకన్నాడు , నిన్ను వెతుకుతూ రాముడి లాగా బాణము చేత ధరించి ఉన్నవాళ్ళ కోసం వెతికాడుట మా అబ్బాయి.. అందుకు అన్నా.. హహ్హహహహ్.. పిన్నీ ప్రయాణం కదా దేవుడి దీవెనల కోసమని మార్చుకున్నా కానీ అసలు నా పిక్ యే ఉంటుంది అన్నాడు.. పోనీలే అవసరం తీరాక రాముడైనా కృష్ణుడైనా ఒకటే ఏదో ఒకటి ఉంచుకో అన్నా..సరే అన్నాడు.... ఇంకో తెలిసున్న పిల్లకి చదువయ్యి పూర్తయ్యి ఉద్యోగాలు వెతుకుతోంది.. మొన్నొకడు ఇంటర్వ్యూ కి పిలిచాడుట.. . ఆ పిల్లకి తన కుక్కపిల్ల భలే ఇష్టం ట. దాన్ని వదిలొచ్చింది కదా బెంగ పోతుందని తన కుక్కపిల్ల మొహం లింకుడిన్ (LinkedIn)ప్రొఫైల్ పిక్ పెట్టుకుంది..ఇంటర్వ్యూ కి ముందు ఈ మధ్య లింకుడిన్ ప్రొఫయిల్ చూస్తున్నారు హయరింగ్ మేనేజర్ లు(Hiring managers) .. మొహం చూసి ముచ్చటపడితే ఉద్యోగాలిస్తారెవరైనా. చీ ఫో అనుకున్నట్టున్నాడు ఫొటో నచ్చలేదు ఇంటర్వ్యూ కాన్సెల్ అన్నాడుట. అయ్యొ అది నా మొహం కాదయ్య బాబూ అంటే, నాకేం తెలుసు నీ పేరు పక్కన అదే కదా పెట్టావు అన్నాడుట.. ఇంటి దగ్గర పిల్లల ఫొటోలు పెట్టడానికి భయపడుతుంటారు నేను అర్థం చేసుకుని అమ్మలు 10 మంది ఉన్న గ్రూప్ ఫోటో పెట్టచ్చు అందులో మీరుంటారు కదా అది చాలు అంటుంటా.. ఇంక ఈ మధ్య చిన్నప్పటి స్నేహితుల వివరాలు దొరుకుతాయేమో అని తెగ వెతికేస్తుంటామా... అదేదో వయసు చెప్పకూడదనో ఏంటో పారాడుతున్న ఫొటోలు, గౌన్లు వేసుకున్నప్పటి ఫొటోలో పెడుతున్నారు కొందరు. ఇంకొందరు మరీ.. మనవడు పుట్టగానే ఆసుపత్రి లో చేతికిస్తున్నప్పుడు తీసిన ఫొటో పెట్టుకుంటున్నారు. ఆ ఫుటో లో నవజాత శిశువు , ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం లా రెండు జతల చేతులు తప్ప ఏమీ కనబడవు.. ఆ శిశువుని చూసి అమ్మమ్మనో నానమ్మనో గుర్తుపట్టేద్దామంటారా.. సరే మీరుండండి ఆ పనిలో.. నా వల్ల కాదు బాబూ. నాకు పిల్లలందరూ ఒకే లాగా ఉంటారు పువ్వుల్లాగా..! అవునబ్బా నాకూ తెలుసు, మీ పిల్లలు, పిల్లులు, కుక్క పిల్లలూ , గాజులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలు కావేవీ ప్రొఫయిలు పిక్ కి అనర్హం కానీ చూసుకోండబ్బా... అక్కడ ఉన్నది మీ ముఖారవిందం చూపమని కదా ....నగుమోము కనలేనీ నా జాలీ తెలిసీ నను బ్రోవరాదా అని పాడే వాళ్ళకోసమైనా.. ప్లీస్ అబ్బా...

డోంట్ కాల్ మి బేబి ఎనిమోర్

మాకు చిన్నప్పటి నుంచీ రేడయోలో విన్న పాటలని మాకున్న భాషా పరిఙ్ఞానంతో అర్థం చేసుకని పాడడం ఇష్టం. మా ఇంట్లో తెలుగు పాటలేకానీ పక్కింటీ మామీగారింట్లో వాళ్ళ పెద్దబ్బాయి హిందీ తప్ప వినే వాడు కాదు. పక్క పక్కనే గడపలున్న మూడు వాటాల ఇల్లు. ఉన్న రెండేసి గదుల్లో వాళ్ళు ఆరుగురు పిల్లలు మేమేడుగురమూ. ..ఇంట్లో కంటే ఇంటిముందున్నట్టే ఎక్కుప గుర్తు. మా పెద్దన్నయ్య పెళ్ళి లో సరదాగా పాడడం కోసం 'ఏమమ్మో జగడాల వదినమ్మో' పాట నేర్పించారెవరో నాకూ మా చెల్లికీ.. ఆ పాట నేర్పతున్నప్పుడు పోగైన గుంపులో వాళ్ళ వదినలు పెళ్ళవగానే ఎలా విడిపోయిందీ చెప్పుకున్నారు సందర్భానుసారంగా... అవన్నీ 7, 8 ఏళ్ళ వయసులో కాస్తకాస్తే అర్థం అయీఅవకుండా ఉండేవి. ఈలోపు ఫూలోంకా తారోంకా సబ్ కా కెహనా హై.. ఏక్ హజారోమే మేరీ బెహనా హై.. సారీ ఉమంగ్ హమే సంగ్ రెహనాహై పాట వినిపిస్తుండేది పక్కింట్లో. మేము పాడినప్పుడు అర్థం అయినదేమనగా.." పూలకీ నక్షత్రాలకీ వాటివాటి కష్టాలుంటే ఉంటాయి. నాకు మాత్రం వెయ్యి మంది చెల్లెళ్ళున్నారు. సారీ వుమెన్ (sorry women) నేను వాళ్ళతో కలిసుండాలి..నీతో రాలేను" .అని. ఎంత చక్కని అన్నగారు! "విడిగా పోదాము చల్ మోహన రంగా " అని భార్య అంటే చెల్లెళ్ళనొదిలి రానుపొమ్మన్నాడన్నమాట.. గురు సాక్సాక్ పరబ్రహ్మ... అంటూ తనలా కాకుండా గురూగారు స్కూలుకెళ్ళేటప్పుడు రెండేసి సాక్సులు వేసుకుంటాడని టీకా తాత్పర్యాలు చెప్పే మా అక్క కూతురికి ఇన్ని తెలివితేటలెక్కడినుంచొచ్చాయని చుట్టాలన్నప్పుడు మా అక్క నావైపు సీరియస్ గా చూసేదెందకో!!!!..ఒట్టండీ నేను నేర్పలేదు. నాకు దొరికేవారందరూ ఇంతే... మా అత్తగారింట్లో పిల్లలు (అత్తయ్య గారి సిబ్లింగ్స్) పక్కనే ఉన్న సినిమా హాల్లో విని పాడిన సినిమా పాట అప్పట్లో చాలా ఫేమస్ ట. పాటేంటంటే " రాజారావూ ఊఊఊఊ అప్పారావూ ఊఊఊఊ". గుర్తు పట్టేసారా..ఆవారాహూ ఊఊఊఊ..... మా ఇల్లు రెండేగదులు కాబట్టి మా పెద్దన్నయ్య కుటుంబం 500 మీటర్ల దూరంలో ఉండేవారు. మా నాన్న పొద్దున్నే ఆఫీసుకి వెళ్లే టప్పుడు పిల్లలని చూసి వెళ్ళేవారు. ఇంటి చుట్టూ పెద్ద నీళ్ళ గుంటలుంటాయి కాబట్టి.. బుజ్జి తల్లిని బయటికి పంపద్దని చెప్పి ఆఫీసుకి బయల్దేరారొకరోజు. 10నిమిషాలయ్యాక ఎవరూ చూడకుండా ఇంట్లోంచి బయటకొచ్చి ఒక అరమైలు దూరంలో ఉన్న తాతని పిలుస్తూ వెంబడిస్తోంది పాపాయి. అనుకోకుండా వర్షం మొదలయింది. నేను ఇంకో వైపు నించి వస్తూ తాతా తాతా అని పిలుస్తూపోతున్న పిల్ల ని చాటుగా చూస్తున్నా. కొద్ది దూరం పరుగులాంటి నడకతో ఏడుస్తూ వెంబడించిన రెండేళ్ళ బుజ్జాయి వర్షం పెద్దదవడంతో వెనుదిరిగి ..గాలి మానలో మాననీటిలో అని విచారంగా సిటువేషనల్ సాంగ్ పాడుతూ పోతుంటే ..ఆ దృశ్యం 30 ఏళ్ళయినా పచ్చబొట్టులా ఉండిపోదూ!!! మాబుజ్జిది తాను LKG చదువుతోంది కాబట్టి బినాపాయెల్కేజీ( LKG) భజే గుంఘురూ అని పాడినప్పుడు మదిఅరలో ఎప్పటికీ ఆ ఎల్కేజీ మువ్వలు గలగలమంటూ ఉండిపోవూ!! "దూరానదూరాన సారాదీపమనీ"...".నీయానతే లేకున్నచో విడలేను ఓ పిరికోడా" అనీ.."ఆరనిజ్వాలాల దాహము సుడిగాలిలోన నా గాయము" అనీ "తానేమారెనా నాన్నేమారెనా" అనీ .. ".చెలియా దక్కమ్మా బంద్ హై మోటర్కార్" అనీ "పగలేవెన్నెల జగమే ఊయల మదిలో ఊయలకే కన్నులుంటే "అనీ..... మనకొచ్చిన పదాలు పెట్టేసి స్నేహితులతో కలిసి చేసిన బృందగానాలకి ఎల్లలేవీ!!!. ఇక్కడకొచ్చిన కొత్తల్లో పనిచేసిన చోట జోయాన్ అనే కొలీగ్ విడాకులు తీసుకున్నప్పుడు పాప బాధ్యత తండ్రికిచ్చిందిట కోర్టు.. నిర్దేశించిన సమయాల్లో తప్ప పాపని చూడ్డానికీ మాట్లాడడానికీ అవకాశంలేదుట. ఒకసారి ఉండలేక పాప తల్లికి ఫోన్ చేస్తే పాప తండ్రి ఫోన్ లాక్కుని ఇంకోసారి పాపని ఫోన్ చెయ్యమంటే పోలీస్ కి కంప్లయింట్ చేస్తా అన్నాడని ఏడుస్తూ చెప్పింది. ఆ అమ్మాయి చెపుతుంటే కన్నీరాగలేదసలు. ఆ తరువాత నేను ఆఫీస్ మారాను. స్టాఫ్ చాలా కొద్ది మంది. ఎవరి పనులు వాళ్ళు తీసుకుపోతారు. మాటామంతీ ఉండదు. ఫోన్ కంపెనీ వినిపించే పాటలు వస్తూ ఉంటాయి సన్నగా..అదిగో అప్పుడు విన్న పాట dont call me baby anymore...పల్లవి మాత్రమే తెలుసు నాకు. జోయాన్ ని తలచుకుంటూ, తల్లీబిడ్డల కథ అన్వయించుకుంటూ దుఖంతో వింటూ ఉండేదాన్ని ఆ పాట వచ్చినప్పుడల్లా!. ఒకరోజు ఆ పాట పాడుతూ పనులుచేసుకుంటున్న నన్ను చూసి పిల్లలు.."అమ్మా ఈ పాటెలా తెలుసు నీకు" అని ఆశ్చర్యపోయాను. ఆఫీసు లో వస్తున్నప్పుడు పల్లవి మాత్రం క్యాచ్ చేసాననీ ఈ పాట చాలా నచ్చేసిన కారణం వెనకున్న రెబెక్కా..జోయాన్ ల కథ చెప్పేసా బాధ పడుతూ. అది విని పడి పడి నవ్వుతున్న పిల్లలిద్దరినీ గద్దించాను...బాధ విలువ తెలియట్లేదని. వాళ్ళు నవ్వాపుకుంటూ "అమ్మా అది పాప కోసం కాదు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కోసం పాడుకునే పాట" అని అన్నారు పకపకలాడుతూ!... "మరి బేబీ అంటుందెవరినీ" అంటున్న నా అమాయకమైన మొహం చూసి "ఇంక నవ్వలేము బాబోయ్" అంటూ బయటకెళ్ళారు సాకర్ బాల్ తన్నుకుంటూ .....

స్వర రాగ గంగా ప్రవాహమే

సుస్వరమో అపస్వరమో తెలియదు, అదొక రాగం . రాగం పేరు ఆరునొక్క రాగం.. ప్రవాహమంటారా అది జారుతూనే ఉంది. ఆకలా అంటే కాదు, నిద్రా అంటే అదీ లేదు. మరి ఇంక వంటి మీద రాష్ లాంటిదేమైనా ఉందేమో అని జాన్సన్, నైస్ లాంటి చెమట పొక్కుల పవుడర్లన్నీ వాడి పడేసారుట.. ఆముదం లాంటి నూనెలన్నీ రుద్దేసారుట.. అబ్బే..అయినా సరే ఆగదూ ఆగదూ ఆగితే సాగదూ లాగా "నేను నిదురించకుండా ఉన్నా సరే, ఇంట్లో వాళ్ళని నిదురపోనిస్తే మజా ఏముంటుంద"ని సాగ దీసీ దీసీ.. అప్పుడప్పుడో చిరునవ్వు విజయ గర్వంతో చిందించడం చూసి శివుడి నెత్తిన చుక్కలు చుక్కలుగా నీళ్ళు కారడానికి పెట్టే కుండలాంటిదేదో నా సిస్టం తయారీలో డిఫాల్ట్ గా వచ్చేసిందని మా అమ్మకి అనుమానమొచ్చిందిట. డిలీట్ బటన్ ఉందేమో అని వెతుకుతుంటే చెవి వెనుక ఏదో తగిలిందిట. డాట్రారుకి చూపించిందిట గాభరా పడుతూ. ఆయనేమో "అవునమ్మోయ్ ఆ ఆరునొక్క రాగానికి కారణం ఈ బటనే, ఇది అర్జెంట్ గా తీసేయాలన్నాడుట. ఆనడమే తరువాయి అటూ ఇటూ తిప్పి దాన్ని పుటుక్కున కోసి హమ్మయ్య అనుకున్నాడుట మా డాట్రారు.. అబ్బే అక్కడితో అయిపోయిందని , మీరు ఆనందించకండి. అంత వీజీగా అలా వదిలేస్తే మన విలువేముంటుందీ అంట!. గత యెదాదిగా అలా సాగదీసీ రాగాలాపన చెయ్యడం అలవాటయ్యిందంతే. మానమంటే ఎలాగమ్మా మరి? మా అమ్మకి మారేడుపల్లి భక్త రామదాసు సంగీహం కాలెజీ (ఆవిడ నేర్చుకునేటప్పుడు ప్రభుత్వ సంగీత నృత్యకళాశాలో ఏదో అనేవారు లెండి) లో వచ్చిన బగుమతులన్నీ నా రాగం ధాటికి తట్టుకుంటెనా అసలు.. మా అమ్మ తనకి వచ్చిన పాటలన్నీ పాడేసి, ఇంక పాడలెక మా చిన్నక్కని సంగీథం నేర్చుకోడానికి మళ్ళీ అదే కాలెజీలో చెర్చింది కూడా. మా చిన్నక్క మంచి పాటగత్తె. సంగీతం కాలేజీలో తరగతి లో మొదటి బహుమతిగా ఇచ్చే గంధం చెక్కతో చేసిన పెన్నులన్నీ మా ఇంట్లోనే ఉండేవి నిజంగా. నా వయసు మూడో నాలుగో. ఈ సారి కూడా దానికే ఫస్ట్ వచ్చింది క్లాసులో. అన్నూల్ దె ఫంక్షన్ లో శ్రీరంగం గోపాల రత్నం గారి చేతి మీదుగా బహుమతి అందుకుంటుందన్నమాట. ఆ రోజు బాగా సంతోషం గా ఉంది. ఏం బట్టలేసుకోవాలని మూడు రోజులుగా అవీ ఇవీ చూస్తూ.. జూకాలు, గాజులు అంటూ తెగ మురిసిపోతోంది. ఆ మురుపులో నువ్వు వస్తావా చిన్నిలూ అని నన్ను గారం చేసింది. అప్పటిదాకా అసలు అల్వాల్ దాటే అవసరం రాని నాకు అలా ఎవరన్నా తీసుకెళతానంటె భలే సంతొషం. ఆల్వాల్ నించి బస్ ఎక్కించి సికందరాబాదు లో దిగాక, దానికి రాబోయే బహుమతి ఎంత గొప్పదో, అక్కడికి వెళ్ళాక నాకు ఎవరెవరిని చూపిస్తుందో చెప్పి, అవే మళ్ళీ నన్ను ప్రశ్నల రూపం లో అడుగుతూ నాకు ఇష్టమైన పరమానందయ్య శిష్యుల కథలు చెప్తూ, సికందరాబాదు స్టేషన్ నించి మారేడు పల్లి వరకు నడిపించింది. కాలేజీ లోపల హాలు దగ్గర గడపలోనె వచ్చిన వాళ్ళందరికీ ఒక మిథ్తాయి పొట్లమిచ్చారు. అబ్బో భలే ఉందే, మా అక్క చదువయ్యేవరకూ ప్రతి యాడాదీ రావాలని ప్రతిజ్ఞ చేసుకున్నా. ప్రోగ్రాం మొదలయింది. బహుమతి ప్రదానం జరిగింది. మా అక్క నేలపైన నడుస్తున్నట్టు లేదసలు. మా అక్క బహుమతి తీసుకోవడానికి వరుసలో నిలబడ్డప్పుడు నన్ను దాని స్నేహితురాళ్ళకి అప్పచెప్పింది. వాళ్ళూ కూడా నన్ను భలే ముద్దు చేసి, వాళ్ళ పొట్లాల నించి కొంచెం మిథాయి ఇచ్చి మురిసిపోయారు. అవి తింటూ స్టేజీ మీదకి చూస్తున్నా. బహుమతి ప్రదానం అయ్యి, అర కొర నృత్యాలయ్యాయి. నేనూ చేతులు తిప్పుకుంటూ చూసేసా. ఆ తరువాత ఒకాయన రాగం అందుకున్నాడు.. ఆ రాగం , ఆ ఎక్స్ ప్రెషన్ లు చూసి భయపడిపొయ్యా!!… భయపడడం ఎందుకంటే ..నేను ఓడిపొయ్యినట్టనిపించింది!!.. అంతే నేనూ రాగం అందుకున్నా.. అక్క దోస్తులకి అర్థం కాలేదు. ఊరుకోబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేసారు. అబ్బా అలా ఆపమనగానే ఆపేస్తామేటీ.. అమ్మా చూడాలీ నిన్నూ నాన్నని చూడాలి అని గుర్తుకొచ్చి నేను రాగాలాపన చేస్తున్నా. మా అక్క తనకి వచ్చిన గంధం చెక్క పెన్నుని అందరికీ చూపిస్తూ, అందరూ అబ్బా భలే అంటుంటే గర్వ పడుతూ అక్కడక్కడే తిరుగుతోంది. వాసంతి వెళ్ళి అక్కని పిలుచుకొచ్చింది. మా అక్క ఆశ్చర్యంగా చూసి ఏమయ్యిందే అంది.. నాకు కాంపితితిఒన్ గా ఆయన ఎందుకేడుస్తున్నాడనడిగాను. దాన్ని హిందుస్తానీ సంగీతం రాగాలాపన అంటారనేదో చెప్పి అందరూ నవ్వారు. నాకు కోపమొచ్చి రాగం పెంచాను. అక్కడ ఉండడానికి ఇబ్బంది పడిన అక్క అక్కడే ఒక చాక్లెట్ కొనిచ్చి, మళ్ళీ సికందరాబాద్ స్టేషన్ వరకూ నడిపించి , బసెక్కించి ఇంటికి తీసుకుపోయింది. అలా ఆనాడు నా కంటే ఘనులున్నారని అర్థం చేసుకున్నా కాని ఓడిపోవడం ఇంటా వంటా లేదు. వంట అంటే ఆ వంట కాదు. తినడం తప్ప మనకి అలాంటివి చెయ్యడం రాదు. అసలే ఇంట్లో ఆరో దాన్ని, పైగా ఈ ఆరునొక్క రాగం అందుకునే టైపు, ఇంట్లో అందరూ వద్దులే తల్లీ నువ్వలా ఉంటే చాలనేసే వారు. పోను పోనూ, చదువుల్లో సారమెల్ల చదివితి తండ్రీ అని అందామని ఉండేది. ఏదీ,, అసలెవరూ సహకరించరు. అదే నాకు కోపం!.. మాస్టారు ఏదో చెపుతారు.. మనం నోట్ బుక్కులో వ్రాస్తున్నట్టు పక్క పిల్లకి జోకులో, కేకు బొమ్మలో వేసి చూపించడం అది కిసుక్కున నవ్వడం తోనే సరిపొయ్యేది.. మాస్టారు కోప్పడడం తప్ప నాకు సారాలు చదివే అవకాశం అసలు ఇస్తేనా.. అసలిలా అయితే మరి నాలాంటి జ్ఞానులకి ఎలాగో మీరే చెప్పండి. రిసల్ట్స్ వచ్చిన రోజు మాత్రం నన్ను ఏమీ అనకముందే…...అబ్బా!మీరు భలే క్యాచ్ చేస్తారు, అందుకే మీరంటే నాకిష్టం. ఇలా చదువు, సంగీతం, చేతి పనులు , కుట్టు పనులు, అల్లికలు, డ్యాన్సు ,వంటలు.. ఇవన్నీ రాకపోయినా ఫర్వాలేదు కానీ కాస్త నీటుగా గోటుగా అందరు అమ్మాయిల్లా రెడీ అవ్వమనేది మా అమ్మ. ఐదుగురి తరువాత పుట్టా కదా మరి పతంగులెగరెయ్యడం, గిల్లి దండా ఆడడం, గోలీలతో బొంబాయి ఆటలు, సీతాఫలం గింజలతో చీటింగులు నేర్చిన నాకు చుట్టాలు, పక్కాలు..(పక్కాలంటే ఇంటి పక్కన పక్కాగా ఉండేవాళ్ళని అర్థం) ఏమన్నా , ఎవరేం చెప్పినా ఆ ఆయుధం ఉందిగా.. అదే అండీ స్వర రాగ గంగా ప్రవాహమే…. ఎవడొస్తాడో దీనికి అని అమ్మ భయపడుతుండేది కానీ ఒక రోజు సీతయ్య మా నాన్న దగ్గరికొచ్చి "మీ అమ్మాయి నాకు నచ్చింది, మీకు అభ్యంతరం లేకపోతే పెళ్ళి చేసుకుంటా" అని చెప్పేసాడు. మా నాన్న ధ్యానంలో ఉన్న మహర్షిలా కళ్ళు తెరిచి, ఉచ్చ్వాస నిశ్శ్వాసములు సరిగ్గానే ఉన్నాయో లేదో అని సీతయ్యని పరీక్షించారు. అన్నీ బానే ఉన్నాయిట, మరి ఎందుకబ్బా .. అసలెలా.. వై..అని ఆలోచిస్తూ, తను నమ్మే గురువు గారి దగ్గరికి పరిగెత్తారు. ఆయన నాలుగు రోజులాగి రమ్మన్నారుట. "ఎక్కడో తేడా కొడుతుంది అసలిది ఎవరికైనా నచ్చడమేంటి, పాపం ఆ పిల్లాడు!! ఒక సారి చెప్పి చూడండ"ని అని అమ్మ మొత్తుకుంది. గురువుగారి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే, మా నాన్న మా అమ్మ మాట వినను గాక వినరు. అలా మా అమ్మ భయపడుతున్నా పెళ్ళయ్యింది.. ఏతా వాతా ఏందంటే సీతయ్య ఎవరి మాటా వినడు..!!!! కళ్ళల్లొ నీ బొమ్మ చూడు అంటాడు తను. నాకు నా కళ్ళల్లో నిండిన నీళ్ళు తప్ప బొమ్మ గిమ్మ ఏమీ కనపడదు. ముందు నీళ్ళు నిండిన నా కళ్ళ సంగతి చూడు అంటాను నేను. ఆ కనులు పండు వెన్నెల గనులా 24 గంటలూ చూడడానికి అవెప్పుడూ నీటి చెరువులే. పోనీలే రాగమో సరాగమో అంటాడు. అయ్యా నాకొచ్చింది ఒకటే రాగం, ఇవన్నీ నాకు తెల్వద్ అంటాన్నేను. సీతయ్యకి సినిమా కష్టాలు మొదలయ్యాయి అని అందరూ చెప్పుకునేవారుట. నాకు అన్నిటికీ ఏడుపొస్తుంది అంతే. నేనేం చేసేది? రేడియోలో అమ్మ పాటలొస్తే అమ్మ గుర్తొచ్చి ఏడుపొచ్చేస్తుంది. సినెమాకి తీసికెళితే ఆ కష్టాలు ఏంటో అని ఏడుపొచ్చేస్తుంది. పిల్లలకి లాలి పాట అంటూ నాకిష్టమైన చందురుని మించు అందమొలికించు పాట రెండు లైన్లు పాడగానే గొంతు పూడుకుపొయ్యి ఏడుపు..!! "పిల్లలు ఏడుస్తుంటే ఆపుతారా తల్లులే ఏడుస్తారా ఏంటిది" అని మందలిస్తాడాయన. మళ్ళీ ఏడుపొస్తుంది నాకు.. ఓ పాపా లాలీ అని పాడుకుని ఏడుస్తూ పడుకుంటా. ఒక్కోసారి జాలేస్తుంది. ఛీ పాపం ఆయనని బాధ పెట్టానా, అయ్యో అయ్యో అని మాళ్ళీ నాకేడుపొచ్చేస్తుంది. పిల్లలు పడినా, అత్త గారికి జొరమొచ్చినా, మావగారు వాంతి చేసుకున్నా అందరూ నన్ను ఊరుకోబెట్టడమే! అసలిదంతా ఎందుకు భరిస్తున్నారో అని మీకు ఆతృతగా ఉంది కదూ? అబ్బా చెప్పేస్తారేం.!!! ఆశ ..అప్పడం వడ దోశ…!!! కొత్తల్లో అప్పుడప్పుడు మా అమ్మకో నాన్నకో చెప్పేవాడు నేను కుండలు కుండలుగా కన్నీళ్ళొలకబోసే వైనం. "చిన్న పిల్ల బాబూ, కాస్త పెద్ద మనసు చేసుకో. తను కడుపులో ఉన్నప్పుడు మాకు నీటి కరువొచ్చింది. నీళ్ళు ధారాళంగా ఇయ్యి దేవుడా అని మొక్కుకున్నాము, ఆయనిలా అర్థం చేసుకున్నట్టున్నాడు, క్షమించు బాబూ" అని సర్దుకొచ్చారు. పాపం వినేసాడనుకునేరు. అసలాళ్ళ మాట ఇంటాడని మీరెలా అనుకుంటున్నారండీ బాబూ మరచిపోయారా? ఆయన అసలెవరి మాటా ఇనడు గందా!! హఠాత్తుగా అమ్మా నాన్న పూర్తి సమాధి స్థితికి వెళ్ళిపోయారు. నా ప్రవాహం కట్టలు తెంచుకుంది. చీటికి మాటికి కుళాయి కట్టెయ్యడం కష్టమయ్యి ఇంక సీతయ్యకు సర్దుకోక తప్పలేదు. ఏడ్చే వాళ్ళ ఎడమ చెయ్యి వైపు, కుట్టే వాళ్ళ కుడి చేతి వైపు కూచోకూడదని అంటారు గానీ అసలు జనాలు నాకు ఎటువైపు కూచోడానికీ ఇష్ట పడట్లేదు. ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండీ.. అనుకుంటూ. పక్కన ఉండి నా పనేదో చేసుకుపోతున్నా. అలా సాగిన ప్రవాహం అలా అలా చెరువులై, నదులై, వాగులై, వంకలై చుట్టూ 4 కాలనీలనీ, 10 ఊర్లనీ చుట్టబెట్టేసింది. అలాంటి ప్రవాహం ఒక రోజు గడ్డ కట్టేసింది. అబ్బ! చలికి కాదెహె! అదేంటంటారా వస్తున్నా వస్తున్నా. మా అక్కొంచిందోసారి ఇంటికి. కొత్త ఫోన్ కొందిట ఫుటోలు గట్రా చూపిస్తోంది. భలే భలే ఇంక ఎక్కడికెళ్ళినా కెమేరాలు తీసుకెళ్ళక్కరలేదు కదా అని బోల్డు హాస్చర్యపోయా. అప్పుడే ఏం చూసావు, వీడియోలు కూడా తియ్యచ్చు తెలుసా అంది. ఏవో చెట్లు, పక్షులు, పార్కులూ, పిల్లల తాడాట, డాన్సులు.. అబ్బో భలే ఉందే అని ఉత్సాహపడిపొయ్యా. వెంటనే మా అమ్మ గుర్తొచ్చింది. తాడాట ఆడుతుంటే ఎంత మురిపెంగా చూసేది కదా అంతేఅంటుండగానే ఏడుపొచ్చేసింది. వా....వా...ఆ... ఛీ ఊర్కో! అని మా అక్క కసిరి కొట్టింది. ఇది చూడు అని ఇంకో వీడియో నొక్కింది. ఎవరిదో చావు ఇల్లు. చావు పేరు వినగానే మళ్ళీ తన్నుకొచ్చింది దుఖం. ఏడుస్తూనే "ఛ! అదేంటక్క చావులు అలా వీడియోలు తీయకూడదు తెలుసా" అన్నాను వెక్కుతూ. "తెలుసులేవే, నీకో తమాషా చూపిద్దామని!" అంది. "చావులో తమాషా ఏంటే నీ ఎంకమ్మ" అని కళ్ళు తుడుచుకుని నవ్వా. వీడియోలో చనిపోయినావిడ కూతుళ్ళూ కోడళ్ళూ అనుకుంటా కప్పు మందం మేకప్పేసుకుని వచ్చిన జనాల్ని పలకరిస్తూ కాఫీలు గట్రా అందిస్తున్నారు. కొడుకులు బిజీగా చావు పనుల్లో పడున్నారు. ఇంటి అటు పక్క వాళ్ళు, ఇటు పక్క వాళ్ళు కొంచెం ఎడంగా కూచుని దిగులు మొహాలు పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. డేరాలేసేవాళ్ళు, పాడె కట్టేవాళ్ళూ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. బ్రాహ్మడు కాస్త దూరంగా నించుని అదీ ఇదీ తెమ్మని పురమాయిస్తున్నాడు. పోయినోళ్ళందరూ మంచోళ్ళనుకున్నారేమో, వీడియో తీసినోళ్ళు శవాన్ని మాత్రం తియ్యలేదు. "అబ్బో భలే క్లియర్ గా వచ్చిందే అక్కా నీ ఫోనులోనే తీసావా" అంటూ చూస్తున్నా. అంతా నిశ్శబ్దంగా ఉంది కానీ శవం పక్కనెవరో కట్టలు తెంచుకుని ఏడుస్తున్నారు. అందరివీ ఎక్స్ప్రెషన్ లే గానీ ఆ ఏడుపు మాత్రం అందరికీ సరిపడేలా ఉంది. పరిసరాలన్నీ కవర్ చేస్తూ వీడియో చివరికి శవం దగ్గరికొచ్చింది. "అక్కా, ఆ చీర నువ్వు నాకు కొనిచ్చిన చీరలాగా ఉంది కదూ" అన్నాన్నేను. "నీ చీర కాదు నువ్వే" చేతిమీదొకటేస్తూ చిరాగ్గా చూసింది. ఏంటి నేనా! అంటూ ఆతృతగా చూసాను. "అవును నేనే! అంతలా ఏడ్చానా? ఎందుకూ? ఆవిడేమైనా మన అమ్మా, అత్తా" అన్నాన్నేను. ఆవిడెవరో అసలు పరిచయం కూడా లేదు నాకు. 4 కాలనీల అవతల ఎవరో చనిపోయారు తోడొస్తావా చూసొద్దామని పక్కింటి పంకజం అడిగితే కదూ వెళ్ళాను. అసలు వీళ్ళెవరినీ చూడనేలేదా నేను. పోతూ పోతూనే శవం పక్కన పడి ఏడ్చానా. నిజమా అని ఆశ్చర్యంగా ఉంది నాకు. అందరూ ఏడవకుండా నేనొక్కదాన్నీ ఏడవడం ఎబ్బెట్టుగా ఉందసలు. "ఇంక ఆపు అక్కా చిరాగ్గా ఉంది. అయినా అక్కడికి నువ్వెప్పుడొచ్చావ్" అన్నాను. " నేను రాలేదు. ఈ మధ్య ఎవరో "ఓవర్ ఆక్షన్" అని వాట్సాప్ లో పెట్టారు. ఏంటా అని చూసి డెలీట్ చెయ్యబోతుంటే నువ్వు కనిపించావు. చాలా కోపమొచ్చేసింది. ఎన్ని సార్లు చెప్పాను నీకు? ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏడవద్దని? నువ్వింకా చిన్నపిల్లవా? ఇంక నువ్వు మాట వినవు, ఇలా చూపిస్తే అయినా బుద్ధి వస్తుందేమో "అంది కటువుగా..! అవును! ఈ మధ్య చుట్టాలెవరింట్లో విషాదాలు జరిగినా నన్ను పట్టుకుపోవడం మొదలెట్టారు. ఏదో నేనంటే ఇష్టం వల్ల అనుకున్నా కానీ అక్క చెప్పింది "నిన్ను తీసుకెళుతున్నారు, ఎందుకంటే ఈ మధ్య ఏడవడం బాగోదని ఎవరూ ఏడవట్లేదుట. మరీ చావన్నాక ఏడవకపోతే ఏంబాగుంటుందె అనుకోగానే, నువ్వే గుర్తొస్తున్నావుట. డబ్బులిచ్చి పెట్టుకోవచ్చుట కానీ ఎందుకు ఇక్కడ ఫ్రీగా వాగులు వంకలు ఏరులై పారుతుంటే డబ్బు దండుగ అనుకుంటున్నారుట" అనేసింది మొహం చాలా విసుగా పెట్టి. అది విని నేను షాక్ అవ్వడమే కాదు, కుత కుతా ఉడికిపోయా. ఎందుకంటే చుట్టాలంతా ఒక పక్క నా అమూల్య సంపదని వాడుకుంటూ, ఇంకో పక్క నవ్వుకుంటున్నారుట..!! అక్క ఎన్ని సార్లు చెప్పిందో నాకు అలా అందరి ఇళ్ళల్లో ఏడవకురా బాగోదు అని. కానీ మనం వినే రకం కాదుగా? అసలే సీతయ్య గారి తాలూకు మరి! నాకు ప్రవాహం అలా కట్టలు డ్యాంలు తెంచుకుంటుదని మీకు తెలిసిపొయ్యుంటాది కదా? ఇంక మా అక్క వదిలేలా లేదు. చెపుతూనే ఉంది. "ఎవరి ఇంట్లోనైనా చావులు అయినప్పుడు మనం ఎందుకు వెళతాము? వాళ్ళని ఓదార్చడానికి. కానీ నువ్వేం చేస్తున్నావూ? వాళ్ళకంటే ఎక్కువగా ఏడుస్తున్నావు. అప్పుడు పాపం వాళ్ళు వాళ్ళ బాధని మరచిపోయి నిన్ను ఓదారుస్తుంటే ఏమైనా బాగుంటుందా చెప్పు? నా తల్లివి కదూ, అలా ఎక్కడపడితే అక్కడ ఏడవకూడదు. సరేనా" అంటూ నెమ్మదిగా క్లాసులు తీసుకుంది. ప్రామిస్సులు చేయించుకుంది. ఆ దెబ్బతో ఇంక ఆరున్నొక్క చేస్బంద్… ఇందాకా ఉడికిన ఉడుక్కి నీళ్ళు మరిగి ఆవిరై గడ్డ కట్టేసాయి. ఇంక కరగవు గాక కరగవు. డిఫాల్టుగా వచ్చిన బిందె కరిగిపోయింది. "ఆ ఒక్క రాగమే! అది గనక లేకపోతే, ఏక్ తుహీ ధన్ వాన్ హై గోరీ.. బాకీ సబ్ కంగాల్" అని మా అక్క ముద్దు చేస్తోంది కూడా. ఈ రాగానికి పెట్టే ఓపిక పెడితే బోల్డు అందమైన రాగాలు పాడచ్చనేది మా అమ్మ. అందుకే ఈ మధ్య ఆ రాగం మార్చి ఇంకో రాగం అందుకున్నా లెండి!!!!! ..ఇదిగో ,.. ఒకసారొస్తారూ వినిపోదురు…!!!

సత్తెకాలపు సత్తయ్య

మా జనక మారాజు మరీ సత్తెకాలం మనిషి. ఆడపిల్లల సొమ్ము తినకూడదనే మాటకి పేటెంట్ హక్కు తీసుకున్నట్టు, కొండొకచోట తినవలసి వస్తే కొంపలంటుకున్నట్టు భయపడి తడబడే టయిపు. దానికి తోడు గాంధీ గారి మార్గంలో సింపుల్ లయిఫ్ . ఎక్కడా హంగూ ఆర్భాటమూ ఉండవు. కష్టమొస్తే బాగా కుంగిపోవడమో, ఆనందమొస్తే బాగా పొంగిపోవడమో ఉండవు. అయినా అంతటి ఆనందాలు రావడానికి అంబానీ కుటుంబమా ఏంటీ , ఏగానీ జీతంతో ఏడుగురిని పెంచడం మరి! కొత్త చొక్కా వేసుకుంటే డిపార్ట్మెంట్ లో అందరికీ చాయ్ ఇప్పించాలని రూల్ పెట్టారుట ఆఫీస్ లో ఉన్న కుర్ర కారు.. ఆ చాయ్ పార్టీ ఖర్చుతో ఒక పిల్లాడికి పరీక్ష ఫీజు కట్టడమో, ఒక ఆడ పిల్లకి పరికిణీ కుట్టించడమో వచ్చేస్తుందని కొత్త చొక్కా వేసుకోవడానికి దాదాపు భయపడిపోయేవారని గుర్తు. బస్ ఖర్చు ఎందుకనేమో అల్వాల్ నించీ AOC సెంటర్ కి రెండు పూటలా కాలి నడకే. బస్ ఎక్కమని బలవంతపెడితే "బస్ చాలా రష్ గా ఉంటుంది. కాళ్ళు తొక్కేస్తారమ్మా, కదుము కడితే తొందరగా మానదు. నిదానంగా నడచి వెళితే సుఖం , గాంధీ గారు నడక మంచిదని చెప్పేవారు" అనేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరు తండ్రుల్లాగానే త్యాగాల లిస్ట్ పెద్దగానే ఉంటుంది... అందుకే చదువులయ్యి ఉద్యోగాలొచ్చాక అయినా, ఆయనకి ఏదైనా కొనిద్దామని అందరం తాపత్రయ పడతాం. కానీ, ఏది కొన్నా తీసుకోరు. మరీ బతిమాలినా వినరు. ఆయనకి చెప్పకుండా ఏదైనా కొనిస్తే, రెండో రోజునే ఆ వస్తువుని ఎవరికో ఒకళ్ళకి ఇచ్ఛేస్తారు. ఇవన్నీ తనకు అలవాటు లేవనో , పుచ్చుకున్న వాడికి ఆ వస్తువు ఎక్కువ అవసరమనో అంటారు. పైగా, అనవసరమైన వాటికి ఖర్చు చేస్తున్నామని కోప్పడతారు కూడా! అందుకే ఆయన కోసం ఏం కొనాలన్నా మాకు భయమే. వయసు రీత్యా ఈ మధ్య వినిపించటం లేదుట, మేము ఫోన్ చెయ్యగానే ఆయన మాట్లాడాల్సినవి చెప్పేస్తారు. కానీ, మేము చెప్పేవి పక్కనున్న వాళ్ళు గట్టిగా చెప్పాలి. దూరాలనున్న తలితండ్రులతో మాట్లాడలేక పోవడం విదేశాల్లో ఉన్న పిల్లలకి ఎంత దుఃఖ తరమో కదా. ఫోనులో మాట్లాడడం అటుంచితే, రోజు మొత్తంలో నాన్నకి ఇష్టమైన పని రేడియో వినడం. క్రమేపీ వినికిడి తగ్గితే ఎలా? ఆ రేడియో వినకుండా నాన్నని ఊహించుకోవడమే కష్టమసలు. అదే ఆయన చెలిమీ కలిమీ. ఈ రేడియో కి చిన్న కథ ఉంది లెండి. మాల్దీవుల నించి వస్తూ ఎయిర్పోర్ట్ లో చూస్తుంటే పది డాలర్లకి కనబడింది అరచేతిలో పట్టే ఈ బుజ్జి పాకెట్ రేడియో. నన్నకి ఇస్తే వాడగలరో లేదో అనుకుంటూ కొన్నా. ఇప్పటి వరకూ, పెద్ద పెద్ద యుద్ధాలు జరగకుండా, ఆయన స్వీకరించిన వస్తువు ఈ రేడియో ఒక్కటే. ఇంట్లో టీవీలొచ్చాక పెద్దగా రేడియో వినేవారుండరుగా. అదీ కాక , పిల్లల చదువులూ సంధ్యలూ కూడానూ. ఆ కారణం కావచ్చు. ఇవ్వగానే తీసుకున్నారు అందరూ ఆశ్చర్యపోయేలా. మొహమాట పడుతూ తీసుకున్నా, భలే నచ్చేసిందిట నాన్నకి. ఇంట్లో ఎవరినీ డిస్టర్బ్ చెయ్యకుండా చెవి దగ్గర పెట్టుకుని వినడానికి, ఇంట్లో ఎవరూ లేనప్పుడు తోడుగా ఉండడానికీ భలేగా పనికొస్తుంది అన్నారు నవ్వుతూ. అది కొని పదిహేనేళ్ళయింది. బాటరీలు వేసే బటన్ వదులు అవడం లాంటివే కాక, చిన్నగా ఒక పక్క విరిగింది కూడా. ఆయనకి కళ్ళు మూసుకుని ముళ్ళు తిప్పడం అలవాటయిందేమో , ఇంకోటి కొనిచ్చినా తీసుకోరు, దాన్ని వదలరు. ఆయనకి ఒక వస్తువు అలవాటయితే మార్చడం ఇష్టం ఉండదు విరిగినా, తరిగినా. ఓల్డ్ ఈస్ గోల్డ్ అనుకునే వారిలో నాన్న కూడా ఒకరు. ఈ రేడియో మీద మమకారం పెరిగిపోయి , దాని గుణగణాలని మెచ్చుకోవడమే కాకుండా, అమ్మాయి అల్లుడు కొనిచ్ఛారని అందరికీ చెప్పుకుంటుంటే మా సీతయ్యకి చెడ్డ మొహమాటం. "ఇల్లో , పొలమో రాసిచ్చిన లెవెల్లో చెప్తుంటారు, కాస్త మంచిదైనా కొన్నావు కాదు" అంటుంటారు. "ఏదో ఒకటి లెండి, అసలు తీసుకుని వాడుకుంటున్నారు అదే పదివేలు" అంటాను నేను. అలా రోజు మొత్తంలో ఎక్కవ వాడే రేడియో వినలేక పొతే కష్టమే కదా మరి? పోనీ చెవి మిషన్ కొందామా అని అడిగామనుకోండి ఠక్కున ఒద్దు అంటారంతే!! ఒక సారి వద్దు అనే పదం వచ్చిందంటే బ్రహ్మ గారొచ్చి చెప్పినా వినడం కల్ల. బంగ్లాదేశ్ నించి వచ్చిన కొలీగ్ నాకు ఒక కథ చెప్పాడోసారి. ఒక కోర్ట్ దగ్గర గేటుకీపర్ గా ఒక జవాన్ నిలబడ్డాడుట. ఒక వ్యక్తి లోపల ఎవరినో కలవాల్సి వచ్చి, లోపలికెళ్లాలని పర్మిషన్ అడిగాడట. జవాన్ అతన్ని లోపలికి పంపడానికి ఒప్పుకోలేదుట. ఆ వ్యక్తి ప్రతి పావుగంటకీ బతిమాలినా జవాన్ ససేమిరా అనేసాడుట. కాసేపు అక్కడే నించుని గమనించిన ఆ వ్యక్తికి లోపలికి బోలెడు మంది వెళుతూ కనిపించారుట. "మరి వాళ్ళు వెళుతున్నారు కదా నన్నెందుకు ఆపుతున్నావని" కోపంగా అడిగాడట. "వాళ్ళల్లో నన్నెవరైనా లోపలికి వెళ్ళచ్ఛా అని అడిగారా? ఎవరైనా అడిగితే పంపకూడదని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు . నువ్వు అడిగావు కాబట్టి నిన్ను లోపలికి వెళ్లకుండా చూడడమే నా కర్తవ్యం" అన్నాడుట జవాను. ఆ కథ గుర్తొచ్చి, ఇప్పటికి ఊరుకోవడమే ఉత్తమం అనిపించింది. నాన్నకి ఒక వస్తువు కొనియ్యమనే పదం వినగానే నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఏదో దయ్యాన్ని చూసినట్టో, పర్వతం మీద నించి దూకమన్నట్టో బిల్డప్ ఇస్తారు. "వద్దులేమ్మా నువ్వు వచ్చినప్పుడు ప్రయత్నించు" అంటూ. ఆ సంవత్సరం ఇండియా వెళ్ళినప్పుడు, భోజనాలు చేస్తుండగా, నాన్నగారికి చెవులు సరిగ్గా వినిపించట్లేదని, ఈ మధ్య ఫోన్ చేసినా సంతృప్తిగా ఉండట్లేదని, చెవి మిషన్ కొనాలంటే కుదురుతుందేమో చూస్తున్నా అనీ అన్నాను. అనగనగా ఒక చెవి డాక్టరు ఉన్నాడనీ, అతను పెద్దవాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ చక్కగా అమరుస్తాడనీ, తన ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి అక్కడే చెవి మిషను కొన్నారనీ చెప్పి, మా శ్యామ్ అతని దగ్గరికి తీసుకెళ్లాడు . సికందరాబాదు జనరల్ బజార్ లో ఒక ఇరుకు సందులో మూడో అంతస్తులో ఉన్న అతన్ని కలిసి, మా నాన్న గారి పరిస్థితి ఇదీ అని చెప్పాము. "తీసుకురండి చూస్తా" అన్నారు. "ఇన్ని మెట్లెక్కి రాలేరండీ బాగా పెద్దాయన" అని చెప్పా. " ట్యాక్సీ లో తీసుకొద్దాం వదినా, నేను జాగర్తగా ఎత్తుకుని పైకి తీసుకొస్తా మావయ్యని" అన్నాడు శ్యామ్. "అసలు ఆయన కదలాలిగా" అన్నా నేను బెంగగా. "డాక్టరు గారూ, మీరు మాఇంటికి రాగలరా" అని అడిగాను. "కష్టం అండీ, నేను పగలూ రాత్రీ బిజీ " అన్నారు ఆయన. "అంటే...నేను ఇంకో వారం రోజులుంటా. నేను ఉండగా అయితే కాస్త ఒప్పించే ప్రయత్నం చెయ్యచ్చు, నేను వెళ్ళాక ఆయనని ఒప్పించడం ఇంక కష్టం" అన్నాన్నేను. బిసినెస్స్ పోతుందని కొంచెం సేపు ఆలోచించి "సరే.. వచ్చేవారం చూద్దాం" అన్నారు డాక్టరు గారు. "కానీ డాక్టరు గారూ, మా నాన్నగారు ఇలా చెవి మిషను అవీ అని చెప్తే ఒప్పుకోరండీ, చిన్న అడ్జస్ట్మెంటు చెయ్యాలీ" అన్నా నేను మొహమాట పడుతూ. "అలాగా ఏమి చేద్దామంటారూ" అన్నారు. "మీరు ఏమీ అనుకోకపోతే చిన్న డ్రామా" ....మళ్లీ నా మొహమాటం . డ్రామా పదం వినగానే డాక్టరు గారి మొహంలో ఉత్సాహం తొంగి చూసింది. "చెప్పండీ నన్నేం చెయ్య మంటారూ" ...డాక్టరు గారు తొందర పెట్టారు. " ఏం లేదండీ , మీరు మా వారి స్నేహితుణ్ణని చెప్పండి చాలు నేను మ్యానెజ్ చేస్తా" అని చెప్పా . అప్పటి దాకా అస్సలు ఖాళీ లేదన్న మనిషి కాస్తా "అయితే రేపు రానా" అని అత్యుత్సాహం ప్రకటించారు. అప్పటికే వారిలో మా వారి స్నేహితుడు జీవం పోసుకుని జీవించెయ్యడానికి రెడీ అయిపోయాడు. " ఇంకో విషయం… నాన్నగారి ముందు డబ్బు ప్రసక్తి తేకూడదు, కాబట్టి ఫీసు విషయాలు గట్రా ఇప్పుడే మాట్లాడేసుకుందాం " అన్నాన్నేను. కన్సల్టేశనుకి ఇంత , ఇంటికి వచ్చినందుకు ఇంత , మెషినుకి ఇంత అని మాట్లాడేసుకున్నాము. పైకి చెప్పలేదు కానీ, “డ్రామా ఆక్టరుకి ఇంకో వెయ్యి” అని నేను మనసులో అనుకున్నా. "సరే మరి వెళ్లి వస్తాము, రేపు సరిగ్గా 5 గంటలకి కలుద్దాం , ఇదిగో మా ఇంటి అడ్రస్సు" అని అడ్రస్సు వ్రాసి ఇచ్చాన్నేను. "నాకు ఆల్వాల్ మెయిన్ రోడ్డు వరకు తెలుసండీ అక్కడి నుంచీ తెలియదు" అని చెప్పారాయన . "సరే సత్యా టాకీసు దగ్గరకొస్తున్నప్పుడు ఫోన్ చెయ్యండి మా మేనల్లుడిని పంపుతా"అని ఫోన్ నంబరు కూడా వ్రాసి ఇచ్చాను. వెళుతుండగా గుర్తొచ్చింది " డాక్టరు గారూ మా వారి పేరు "రాజు " గారండీ అని చెప్పి బయలుదేరాము. ఇంటికెళ్ళాక ఇంట్లో అందరినీ సమావేశపరచి విషయం చెప్పాను. "ఏమో నీ చాదస్తం , ఆయన పెట్టుకున్నప్పటి సంగతి" అన్నారు పెద్దగా ఉత్సాహ పడకుండా. " మై హూ నా" అంటూ ఎప్పుడో ఒకసారొస్తా కాబట్టి, నా మాట కాదనరన్న నమ్మకాన్ని కాస్త ఓవర్ గానే ప్రదర్శించి, నాన్న దగ్గరికెళ్ళి, "నాన్నా, ఈయన స్నేహితుడొకరు, నేను వచ్చానని తెలిసి ఫోన్ చేసారు. రేపు సాయంత్రం ఇక్కడికి వచ్చి చూసి పోతానని అన్నారు. ఆ టయింకి నువ్వు ఇంట్లోనే ఉంటావా గుడికెళతావా" అని అడిగా. "అయ్యో తప్పకుండా రమ్మను ,గుడికి తరవాత వెళ్ళచ్చులే " అన్నారు. నేను మనసులోనే బోల్డు సంతోష పడిపొయ్యా . వచ్చేది అల్లుడు గారి స్నేహితులు కాబట్టి, టిపినీలు అవీ ఘనంగా చెయ్యమన్నారు నాన్న. " ఆయన ఒక అరగంట ఉంటారుట అంతే . ఇటు వైపు ఏదో పార్టీకి వెళుతూ దారిలో మనింటికొస్తున్నారుట. దయచేసి ఫార్మాలిటీస్ పెట్టుకోకండి టీ కి మాత్రం వస్తాను అని చెప్పారుట. అంతగా అయితే మిక్చరు, స్వీట్ పెడదాములే" అంది అక్క. నేను అక్కని మెచ్చుకోలుగా చూసా. మరునాడు సరిగ్గా 5 గంటలకి ఫలానా చోట ఉన్నానని డాక్టరు గారు చెప్పడం, అక్కడ వెయిట్ చేస్తున్న మా మేనల్లుడు దారి చూపించి తీసుకురావడం జరిగాయి. వస్తూనే "నమస్కారం అండీ నేను నాయుడు గారి ఫ్రెండ్ ని" అన్నాడాయన. అత్యవసరమైన విషయాలు అరచి చెప్పినా కూడా వినపడని నాన్నకి ఆ పదాలన్నీ చక్కగా వినిపించేసాయి. “నాయుడు గారెవ”రన్నారు. "మన రాజు గారికీ, వీరికీ కామన్ ఫ్రెండ్ సికందరాబాద్ లో ఉంటారులే ఆయన గురించి చెప్తున్నారు" అంటూ, "నాన్న గారికి నాయుడు గారు పరిచయం లేదండీ , మా రాజు గారు వారినెప్పుడూ ఇంటికి తీసుకురావడం కుదరలేదు" అన్నాన్నేను "రాజు గారన్న" పదం గట్టిగా నొక్కుతూ . "రాజు, నాయుడూ, నేనూ చిన్న నాటి స్నేహితులమండీ" అని నాన్నకి వినపడేట్టు చెప్పారు డాక్టరు గారు. "ఏ ఊళ్ళోనండీ" అనడిగారు నాన్న. “చచ్చింది గొర్రె అనుకుంటూ " మన రాజు గారు మదరాసులో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వీరు ENT చేశారట. కొద్ది రోజులు ఒకే రూమ్ లో ఉన్నారట, వీరు చెవి డాక్టర్" అని గబగబా చెప్పా గట్టిగా.. ఇంకో రెండు మాటలు మెల్లగా మాట్లాడారు డాక్టరు గారు. ఆయన చెప్పిన వాటిని నేను నాన్నతో గట్టిగా చెప్పా. "మీతో అందరూ గట్టిగా మాట్లాడుతున్నారెందుకూ? మీకు సరిగా వినబడుతున్నట్టు లేదు, ఏదీ ఒక సారి చూడనీయండి" అని చనువుగా జీవించేసారు డాక్టరు గారు. అల్లుడు అన్న పదం బాగానే వర్క్ అవుట్ అయింది. మరో మాట లేకుండా చెవులప్పగించారు నాన్న. ఆయన కార్ దగ్గరికెళ్లి పరికరాలన్నీ తెచ్చుకుని, పావు గంటలో టెస్టులు ముగించి, టీ తాగి "పని ఉంది అండీ మళ్ళీ వస్తా" అని చెప్పి వెళ్లిపోయారు. మూడవ రోజు హియరింగ్ ఎయిడ్ తీసుకొచ్చ్చి, చెవిలో పెట్టేసి, టెస్ట్ చేసేసి, ఎలా వాడాలో చూపించారు. " అయ్యో బాగా ఖరీదైన వస్తువు .. నాకెందుకండీ" అన్నారు నాన్న. "అవన్నీ మర్చిపొండి , మీకు బాగా వినిపిస్తే మాకు అదే చాలు" అన్నారు డాక్టరు. "అలా కాదండీ" అంటున్న నాన్నతో "నేను, రాజు చూసుకుంటాం మీరు వర్రీ అవకండి, నాకు పేషంట్ అపాయింట్మెంట్ ఉంది వెళ్ళాలి" అని లేచారు డాక్టరు గారు, ఇంకో మాట మాట్లాడనీయకుండా. అతని సహాయానికి అందరం బోలెడు కృతజ్ఞతలు చెప్పుకున్నాము. అంతకు ముందే అనుకున్న విధంగా శ్యాము అతన్ని సాగనంపే వంకతో బయటి వరకు వెళ్లి, అతనికి ఇవ్వాల్సిన డబ్బు ముట్టచెప్పి వచ్చాడు. నాన్నకి బాగా ఇబ్బందిగా, మొహమాటంగా ఉంది.. ఆయనటు వెళ్ళగానే "దీనికి ఖర్చు ఎంత? ఆయనలా ఇచ్చేసి వెళ్లిపోయారు. నువ్వు అడగలేదు. అలా ఏం బాగుంటుంది" అంటూ షరా మామూలు మొదలెట్టారు. "అలా ఎంతా అని అడిగితే ఏం బాగుంటుంది నాన్న, రాజు గారు ఇస్తారులే ఏదో ఒక రూపంలో " అన్నాన్నేను కూల్ గా. "రాజు గారి దగ్గర తీసుకుంటే బాగుండదు మనమే ఇచ్చేద్దాం, వారి ఇల్లు తెలుసా నీకు, రేపు బ్యాంక్ నించి తెప్పిస్తా. శ్యాము, నువ్వు వెళ్ళి ఇచ్చేసి రండి" అన్నారు నాన్న. " అయ్యో మావయ్యగారూ, డాక్టరు గారు పెద్ద వాళ్లకి ఫ్రీగా చెవి మిషన్లు పంచుతున్నారుట ఈ మధ్య . ఖర్చు ఏమీ లేదు ఉత్తినే ఇటొస్తూ తెచ్చారుట అదే చెప్పారు, నేను బయటికి వెళ్ళినప్పుడు" అన్నాడు మా శ్యామడు తెలివిగా. "ఓహో అవునా? ఎంత మంచి మనసు" అని నాన్న మెచ్చుఁకున్నారు. మా చెల్లి నా చేయి గిల్లింది "ఇంకా ఏమేం అడుగుతారో శ్యామ్ ని పిలువు" అని.. "శ్యామా భోజనానికి రా" అని పిలిచా. డాక్టర్ గారి మంచితనం ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికే కాక, గుడి దగ్గర కూడా పాకింది. ఇండియా వస్తే నాకు ఒక చోట రెండు రోజులు వరుసగా కూడా ఉండడం కుదరదు. పుట్టింటి వైపు, మెట్టింటి వైపు, చుట్టాలలో పెద్దవారిని చూడడానికి ఆ ఊరు, ఈ ఊరు వెళ్లి వచ్చేటప్పటికి పది రోజుల సెలవు ఇట్టే అయిపోతుంది. అలా ఇంక తిరిగొచ్చే ముందు రోజు మళ్ళీ నాన్నని చూడడానికెళ్ళా. అప్పటికే చెవి మిషను వాడట్లేదని కంప్లెయింట్లు. "చెవిలో హోరుగా ఉంటోందమ్మా" అన్నారు నాన్న. నాకు జాలేసి "అలాగేలే నెమ్మదిగా రోజుకో గంట పెట్టుకుని అలవాటు చేసుకో" అన్నా. మరునాడు ప్రయాణం కాబట్టి పిల్లలకి కావలసిన వస్తువులేవో కొనాలని బయటకెళ్ళి వచ్చ్చేలోపు, సూర్య నారాయణ గారు వచ్చి ఉన్నారు. "అమ్మలూ వీరికి, శాంతమ్మ గారికీ చెవి వినపడదు, బాగా ఇబ్బంది పడుతున్నారు. డబ్బు కట్టే పరిస్థితి లేదు పాపం, డాక్టరు గారి దగ్గరికి తీసుకెళతావా" అన్నారు నాన్న. "డాక్టరు గారి దగ్గర అప్పాయింట్మెంట్ తీసుకోవాలి నాన్నా, ఆయన చాలా బిజీ కదా" అన్నాను. "అయ్యో, నీకు ఇంక టయిం కూడా లేదు కదా, మళ్ళీ డిసంబరులో పెళ్ళికి వస్తావుగా అప్పుడు తీసికెళతావుగా " అన్నారు నాన్న. “తప్పకుండా” అని చెప్పి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. నేను ఫ్లయిటు దిగిన మర్నాటి నించీ మొదలయ్యింది టార్చరు. చెవి మిషన్ పెట్టుకోమని వాళ్ళు పోరడం, ఆయన పెట్టుకోకపోవడం. “వద్దన్నా పెట్టుకోమంటున్నారు, నాకు ఇబ్బందిగా ఉంది” అని నాన్న, “ఇన్ని వేలు పెట్టిన వస్తువు వేస్ట్ అవుతోందని” బాధ పడుతూ వాళ్ళు, డాక్టరు గారు ఉచితంగా ఇచ్చారని నమ్మేసిన ఆయన, ఇన్ని వేలు ఖర్చయ్యాయని చెప్పేస్తే అయినా పెట్టుకుంటారేమో అని ఆశతో వాళ్ళు, ఆ విషయం తెలిస్తే, ఆడపిల్ల చేత అంత ఖర్చు పెట్టించినందుకు బెంగ పెట్టుకుంటారేమో అని నేను సతమతమయ్యాము. "నాకు పనీ పాటా లేక ఖర్చు చేశానని, ఆ కర్ణాభరణం డబ్బుతో నా చెవులకి అందమైన మకర కుందనాలు వచ్ఛేవని, కనీసం అవి చూసైనా సంతోషపడేవాళ్ళమనీ...అక్కలూ వదినలూ బాధ పడ్డారు. " అంత పెద్దగా ఆలోచించకండి, కనీసం ప్రయత్నం చేసాము కదా .. ప్రయత్నం చెయ్యకపోతే ..అయ్యో ప్రయత్నమైనా చెయ్యలేదే అని భవిష్యత్తులో బాధపడి ఉండేవాళ్ళం కదా" అన్నాన్నేను వాళ్ళని ఓదారుస్తూ. వినిపించలేదనే మాట అంటే చెవి మిషన్ పెట్టుకోమంటారని భయపడి నాన్న అసలు ఆ విషయమే తేవట్లేదని, రేడియో కూడా వినట్లేదని తెలిసి దుఖం తన్నుకొచ్చింది నాకు. నెమ్మదిగా అలవాటు చేసుకోమని చెప్పీ చెప్పీ అందరూ మరచిపోయారు ఆ విషయం గురించి. నాన్న చనిపోయాక నాన్న వస్తువులు ఎవరికో ఇచ్ఛేస్తూ "దీన్నేం చేద్దాం" అంది అక్క చెవి మిషన్ ఉన్న డబ్బాని చూపించి. " దాన్ని ఎలాగోలా, తన స్నేహితుల్లో వినబడని వారికి ఇచ్చేద్దామని ఉండేది మావయ్యగారికి. ఇంకెవరికైనా ఇస్తే పనికొస్తుందా? అని నన్ను అడిగారు. ఎవరి వినికిడి శక్తిని బట్టి వాళ్ళకే ఇస్తారని, అలా ఒకళ్ళవి ఒకళ్ళు వాడడం కుదరదనీ చెప్పాను, అది ఎవ్వరికీ పనికిరాదు వదినా పడెయ్యడమే" అన్నాడు శ్యాము బాధ పడుతూ. "తనకు చెవిలో అది పెట్టుకోగానే బాగా హోరు వస్తోందని చెపుతూ, ఇంకెవరికైనా ఇవ్వచ్చా అని నన్ను కూడా పదే పదే అడిగారు అటెండరు పిల్ల మేరీ సహాయంతో" అన్నాను నేను కూడా. డబ్బా తీసి చూస్తే అది ఖాళీగా ఉంది. "ఏమయిందో" అనుకుంటూ ఆ డాక్టరు గారి డ్రామా గురించి గుర్తు చేస్కున్నాము.. నాన్న చనిపోయారని తెలిసి, మమ్మల్ని చూడడానికి వచ్చిన మేరీ తల్లి, నాన్న గురించి ఏవేవో చెపుతూ పాట పాడినట్టు ఏడుపు అందుకుంది. "ఎంత మంచోడివయ్య మా రాజా మారాజా నీ రునమెట్ల దీస్కోవాలె మా రాజా మారాజా పిల్లలంటెంత పానం మా రాజా మారాజా నా మేరీ నీ బిడ్డాయే గద మా రాజా మారాజా" అని పాట పాడుతున్నట్టు ఏడుస్తూ ఇంకా ఏవో ఏకరువు పెడుతోంది. పదవ రోజు అయిపోయి, అప్పుడప్పుడే కాస్త కుదుట పడుతున్న అందరికీ వెక్కి వెక్కి ఏడుపొచ్చింది ఆమె పాట/ఏడుపులో తవ్వుతున్న జ్ఞాపకాలు విని. కాసేపు అలా ఏవేవో పాడి ఆమె అలసినట్టు కూచుండి పోయింది. "నువ్వు బాగున్నవా కమలమ్మా" అనడిగా కళ్ళు తుడుచుకుని మంచి నీళ్ళందిస్తూ. "బాగున్న బిడ్డా ,అప్పుడు ఇనరాకుండె, నాయిన ఇది ఇప్పించిండంట. ఇప్పుడు మంచిగినొస్తుంది" అంది చెవి తడుముకుని చూపిస్తూ. ఆ చెవిలో ఉన్న మిషన్ చూసి అందరం ఫక్కున నవ్వాము. “బాగ వినిపిస్తుందా అవ్వా” అనడిగాడు చిన్నన్నయ్య. “మంచిగ ఇనొస్తుందయ్యా” అంది కమలమ్మ చెవి లోంచి మిషను తీసి చూపిస్తూ. "ఇలా ఒకళ్ళ చెవి మిషన్ ఇంకొకళ్ళకి పని చేసినట్టు యెప్పుడూ వినలేదు కదా" అన్నాడు మా పెద్దన్నయ్య ఆశ్చర్యంగా. "అవును భలే వింతగా ఉంది" అన్నాడు శ్యాము నమ్మలేనట్టు. మేమందరం ఏదో అద్భుతం జరిగినట్టు సంబరపడ్డాము. "పోనీలే, డ్రామా డాక్టరు గారి డ్రామా పుణ్యమాని మా కమలమ్మకి చెవులినిపిస్తున్నాయి" అంది మా చెల్లి సరదాగా. అర్థం కానట్టు చూసింది కమలమ్మ. " నీకు చెవులినొస్తున్నయని అందరం ఖుష్ అయితున్నం" అంది మా అక్క. నిజంగానే మాకందరికీ ఏదో సంతృప్తి... నలుగురు కూచుని నవ్వేవేళల్లో, మిగిలిన విషయాలు గుర్తున్నా, లేకపోయినా... ఆ డ్రామా మాత్రం ఎవరు గ్రీన్ గా మమ్మల్ని అలరిస్తుంటుంది నాన్న జ్ఞాపకాలలో...

నామకరణం

సంక్రాంతికి స్నేహితురాలు కిరణ్మయి బొమ్మల కొలువు చూడ్డానికి రమ్మందని వెళ్ళాను. అందమైన బొమ్మల కొలువు చూడ్డానికి తన స్నేహితురాళ్ళు ఇంకో నలుగురైదుగురు వచ్చారు పిల్లలని తీసుకుని. వాళ్ళలో నాకు పరిచయం లేని ఇద్దరిని మనోజ,సుమ అని పరిచయం చేసింది. " భలే ఉన్నాయండీ మీ పేర్లు.. చిన్నగా, పిలవడానికి ఈసీగా " అని ముచ్చట పడిపోయా.. ముద్దులొలికే పాపాయి పేరు సహస్ర అని చెప్పి 'తనకి కూడా పిలవడానికి వీలుగా ఉంటుందని అది పెట్టామండీ' అని చెప్పింది సుమ. నేను కొంచెం అయోమయంగా "పిలవడం ఎలా సులువు" అని అడిగా.. "సారా అని పిలవచ్చుగా"..అని నవ్వారావిడ. "అవును ఆ మధ్య ఒక చిన్నారి పేరు సరిత అని పెట్టారు.. ఆంగ్లం లో వ్రాసినప్పుడు ఇక్కడి వాళ్ళు వీలుగా రీటా అని చివరి రెండు అక్షరాలు పిలుచుకోవచ్చని పెట్టారుట" అన్నాను. అలా కబుర్లు చెప్పుకుంటూ ఒకావిడ "పేర్లు జాగర్తగా పెట్టాలండీ, మా పక్కింటి వాళ్ళు ఎంతో మక్కువతో పెట్టిన పేర్ల వల్ల వాళ్ళ పిల్లలెంత బాధ పడుతున్నారో , మీ భారతీయుల పేర్లలో షిట్ ఉంటుందని బుల్లీ చేస్తారుట స్కూల్ లో! ఆ పిల్లలు స్కూల్ కి వెళ్ళడం మానేసారు తెలుసా అసలు " అన్నారు. నాలో కుతూహలమ్మ లేచి "ఇంతకీ వాళ్ళ పేర్లేంటీ" అనడిగింది. "హర్షిత్ వర్షిత్ కానీ ఇక్కడ వీళ్ళకి త పలకదుగా హర్షిట్ వర్షిట్ అని షిట్ షిట్ అంటూ వేధిస్తారుట. చాలా సార్లు స్కూల్ లో కంప్లయింట్ చేసినా, ఎందరినని కంట్రోల్ చెయ్యగలరు వాళ్ళు మాత్రం.. ఊరు మారి స్కూల్ మార్చేస్తున్నప్పుడు ప్రిన్సిపల్ గారి సలహాతో కొత్త స్కూల్ లో హర్ వర్ అని వ్రాయించారుట ప్రిఫర్డ్ నేం లో" అని చెప్పారు. ఇది విని చిన్నప్పుడు మా స్నేహితురాలు మానసని మహనస అని పిలవడం, కుమారిని కుమ్మరీ అని పిలవడం గుర్తొచ్చి అలా ఏడిపించినందుకిపుడు సిగ్గుగా అనిపించింది. అప్పటికి మానసా, కుమారి సరదాగానే తీసుకున్నా, తప్పు తప్పే కదా మరి! అసలు ఇప్పడు పుడుతున్న పిల్లలకి పేరు పెట్టాలంటే ఎన్ని కష్టాలో అనిపిస్తుంది. ఆ కాలంలోలా 'సీతారామాంజనేయ వెంకట సత్య సూర్య పవన్ కుమార్' అని పెద్దలందరూ అందించిన పేర్లు పెట్టెయ్యడమో, పంతులు గారు 'జ్ఞ' తో రావాలన్నారని 'జ్ఞానేశ్వర్', 'సీగాన పెసూనాంబ' అని ఎవరికీ చెప్పా పెట్టకుండా పీటల మీద ఫిక్స్ చేసేంత తేలికగా లేదిప్పుడు. తేలికంటే తేలిక కాదనుకోండి అప్పట్లో కూడా బారసాల రోజున భారీగా పోట్లాటలయిన విషయాలు మనకి చూచాయగా తెలుసుగా. పురుషులు గుంభనంగా మొదటి వాడికి వారి తండ్రి గారి పేరు, రెండో వాడికి ఆవిడ తండ్రి గారి పేరు పెట్టి పడేసాక, ఆనక మేనత్త మొగుడి పేరో, ఆదుకున్న ఆదయ్య పేరో పెట్టినా,పెళ్ళాలు కిక్కురుమనరని తెలుసుకు మసలేవారుట. అప్పట్లో బారసాల పీటల మీదయిన పోట్లాటలు ఇప్పట్లో కడుపని కంఫర్మ్ అయిన రోజునుంచీ తొమ్మిది నెలల పాటు కొందరికి మూడవ ప్రపంచ యుద్ధం గాను, కొందరికి ఎవరికీ తెలియని కోల్డ్ వార్ గానూ జరుగుతూనే ఉన్నాయి. పుట్టగానే బిడ్డ పేరు ఆసుపత్రి వారికి చెప్పెయ్యాలి కాబట్టి ముందు నించీ పది మందిని అడిగో, గూగులమ్మనడిగ్), బాగా ట్రెండ్ లో ఉన్న పేరో చూసుకుని, భార్య ఒక పేరు కోసం, భర్త ఒక పేరు కోసం తగవులాడుకుంటూనే, 'పిల్లాడి పేరు సస్పెన్స్ పెట్టాము, పేరు కనుక్కున్న వారికి బహుమతులు ప్రకటిస్తాము' అని కాస్త తెలివైన జంటలు వాదులాటల్ని కాస్త ముందుకి తోసినా, నెప్పులు మొదలవ్వగానే పంతులు గారి దగ్గరికెళ్ళి నక్షత్రం ప్రకారం ఏ అక్షరమో కనుక్కునేసి, ఆ అక్షరం తో ఎవరు సెలెక్ట్ చేసారో ఆ పేరు పెట్టేసుకుని, వాళ్ళిద్దరిలో ఒకరు గెలిచినా, తలితండ్రులని నిరాశ పుచ్చక తప్పట్లేదు. పురిటి గదిలో భార్య భర్త మాత్రమే ఉంటారు కాబట్టి, నెప్పులు పడే బాధ కంటే తను అనుకున్న పేరు కాకుండా అత్తగారనుకున్న పేరుకి భర్త లొంగి పోతాడేమో అనే బాధ ఎక్కువగా ఉందని చెప్పిన అమ్మాయిలని చూసి ఔరా అనుకోక తప్పదు. నక్షత్రాల పేర్లంటే గుర్తొచ్చింది. 40 ఏళ్ళ క్రితం ఇంకా చదువుకున్న ఇళ్ళలో కూడా అప్పారావు సుబ్బలక్ష్మి అని పేర్లు పెడుతున్న కాలంలో ఎదురింట్లో పని చేస్తున్న అమ్మాయి కూతురికి మేఘన అని పేరు పెట్టింది. అప్పటికి మా ఊర్లో అది చాలా మాడర్న్ పేరు. అందరూ అభినందించాక, ఇంతకీ ఈ పేరెక్కడిది అని అడిగారు ఉండబట్టలేని జనాలు. పంతులు గారు పిల్ల పుట్టినది మిర్గం (మృగశిర) అన్నారుట, పిల్ల మే నాలుగో తారీఖున పుట్టింది కాబట్టి, మే నెల గుర్తుగా మే , మిర్గం నక్షత్రం గుర్తుగా గ నాలుగో తారీఖు కి న కలిపేసి 4వ తరగతి చదువుతున్న తన చెల్లెలు మేఘన అని పెట్టమని సూచించిదనీ, అదొక్కటే చదువుకున్న పిల్ల అయిన మూలాన అందరూ అమోదించడం వల్లనే ఈ రోజు మెప్పుకోలు కలిగిన పేరును పెట్టుకున్నాననీ కళ్ళు మెరిపిస్తూ చెప్పింది ఆ పిల్ల. అప్పటికింకా పిల్లలు ఫలాన టయిముకి పుట్టారని చెపితే, నక్షత్రాలు గుర్తుండాలని ఆ నక్ష్త్రానికి సంబంధించిన నాలుగు అక్షరాలతో వచ్చే పేర్లలో ఒకటి పంతులు గారే సూచించేవారు మా ఊర్లో. అలాంటి పంతులు గారిని తోసిరాజని, ఇంత తెలివిగా పేరు పెట్టిన ఆ ఎనిమిదేళ్ళ చిన్నారి కంటే శాస్త్రజ్ఞులు ఎవరుంటారని ఆశ్చర్య పోయా నేనైతే! మా ఇంటిపక్క ఒక పిల్ల పేరు అతియ అని ఉండేది. తన స్నేహితులు అత్తయ్య అనో హాతియా అనో పిలిచేవారు. మా ఇంటికొచ్చిన ఒకాయన విస్తుపోయి, ఇదేదో బానే ఉందండీ నాకు ట్విన్స్ పుడితే హత్య , ఆత్మ హత్య అని పెట్టెయ్యచ్చు అన్నందుకు మా అత్తగారి చేతిలో చచ్చేట్లా తిట్లు తిన్నాడు అప్రాచ్యం మాటలు మాట్లాడినందుకు. కొంత కాలం చాలా గమ్మత్తులు జరిగాయి. ఒక సంవత్సరంలో వంశీ, ఇంకో సంవత్సరంలో చైతన్య పేర్లు పాపులర్ అయిపోయి, చదువు చెప్తున్నప్పుడు ఒక బ్యాచ్ లో సగం మందికి పైగా అవే పేర్లుండడం చూసి ఖంగు తినేసా. మా బాబుని స్కూల్ లో వేసినప్పుడు ఏ తో పేర్లు పెట్టడం వల్ల అన్నిటిలోనూ మొదట ఉంటారనేమో 75% మంది పేర్లు ఏ తోనే, ఆదిత్య, ఆకాష్, ఆయుష్, అభిమన్యు, ఆంచల్, ఆరుష్, ఆరోహ్, అమృత, అఖిల్, అభినవ్, అభినందన్, అనిరుధ్ , ఆర్య, అర్జున్, అంజద్, అనన్య, అపూర్వ, అపురూప ఇలా వాడి స్నేహితులందరూ ఏ ప్లస్సులే! ఆర్య అంటే గుర్తొచ్చింది షారుఖ్ ఖాన్ కొడుకు పుట్టినప్పటి నించీ ఆర్యన్ పేరు తెగ ఫేమస్ అయిపోయింది. ఆర్యులు అయినా అనార్యులైనా ఆర్యన్ అని పెట్టేసారు. తైమూర్ లు టిప్పు సుల్తాన్ లూ సెలెబ్రిటీల ఇంట వెలిసారు కాబట్టి మనమూ పెట్టుకుంటామనుకోండి, అది వేరే సంగతి. మా స్నేహితురాలు బారసాల పిలుపులకొచ్చిందొకసారి. మూడో నెల చేద్దామనుకున్నరుగా ఇప్పుడు పిలుస్తోందేంటో అనుకునేంతలో , " పిల్లకి హడావిడిగా పేరు పెట్టేయ్యాల్సి వస్తోందండీ" అంది . ఎందుకలా అని అడిగితే, "మా వారి మేన మామ ఒకరు పిల్లలని చూడగానే చెంబు, తపేలా, బోడి లాంటి పేర్లు పెట్టేస్తారు. అదృష్టమో దురదృష్టమో అప్పటి వరకూ అందరికీ ఆయన పెట్టిన పేర్లే స్థిరపడిపోయాయి, ఇప్పుడాయన ఊరి నించి వస్తున్నానని ఉత్తరం వ్రాసాడు, ఆయనొచ్చేలోపు పేరు పెట్టలేదంటే, నా వెన్నెల మొగ్గకి బొగ్గొ, సుద్దో అని పేరు పెట్టి పడేస్తాడు అందుకే హడావిడి" అని చెప్పింది. నిజమేనండోయ్, మా చుట్టాల్లో కూడా ఒకరున్నట్టు గుర్తు ఇలాంటి వారు! ఇక్కడ ముద్దు పేర్ల గురించి కొంత చెప్పుకోవలసిందే. ఇంటికొక బుజ్జి ఉండడంతో, పెద్ద బుజ్జి, చిన్న బుజ్జి, బుజ్జిబుజ్జి కూడా ఉండడం చాలా మామూలు విషయమే కదా. మరి ఇందరు బుజ్జిలుంటే వాళ్ళ అసలు పేర్లు కాకుండా పిన్ని గారి పెద బుజ్జి, మావయ్య గారి చిన్న బుజ్జి అని పిలవడం మనలో చాలా మందికి విదితమే. ఇంట్లో పిల్లలకి పెద్దల పేర్లు పెట్టినప్పుడు, కోడల్లు ఆ పేరుతో పిలవకూడదు కాబట్టి చిట్టి, బుజ్జి, కన్న అని పిలిచెయ్యడం కొంత కారణం కావచ్చు. ఇలా పాతికేళ్ళుగా పిలవబడుతున్న పిల్లలని "విజయ వీర వెంకట సత్యనారాయణా" అని వాళ్ళ తల్లులు పిలుచుకోవడం నాకు తెగ ఆశ్చర్యాన్ని కలగజేసింది గత సారి నా భారత దేశ ప్రయాణం లో. నా హావభావాలని గమనించారేమో "గురువుగారు చెప్పారు, పిల్లలకి బియ్యంలో వ్రాసి పెట్టిన పేరు పూర్తిగా పిలిస్తేనే కానీ కలిసి రాదుట అందుకే ఇలా" అని చెప్పారు తల్లులు సర్దుకుంటూ. కొద్దిగా విచిత్రమేసినా పిల్లల క్షేమమూ, అభివృధ్ధే కదా తల్లులకి కావలసిందని అర్థం చేసుకున్నా మారు మాట్లాడకుండా.. కానీ నాకు మాత్రం అలా పిలవడం కష్టమే అయింది మరి. నేను మామూలుగా పిలుస్తుంటే, తల్లీ పిల్లలూ ఇబ్బందిగా చూసారు నా వైపు. ఇక్కడ తిప్పలిక్కడివి. అందరికీ పలికేలా చూసుకుని సహస్ర నామాలో, అష్టొత్తరాలో వెతికి పెట్టిన లాస్య , సౌమ్య, దివ్య, వరాళి, మరాళి, ఆర్ణ, రితిక, రుత్విక్ లు చక్కని పేర్లే అయినా అణాలు, అళాలు, అఋ లు చిలక్కొట్టుడు కొట్టబడతాయి . ఆన్యా కొందరి తుంటరి పిల్లల నోటిలో ఆనియనయిపోయిందని వాపోయిందో చిన్నారి. సరయు, నేహ , ఆద్య, అనన్య, విన్నీ, సన్నీ, బన్నీ, సోనీ , హర్ష, వర్ష, పూజ, తాం, లకీ, కరన్ కాస్త వరకు ఫర్వాలేదు. సంధ్య స్యాండీ అయ్యి, మాధవి మ్యాడ్డీ అయ్యి, లక్ష్మి లకీ అయ్యి కొంత మనశ్శాంతిగానే ఉన్నా, 'త' లు 'ద' లు పలకని దేశంలో తేజ, దీపు, వేద అంటూ పోటెత్తిన పొట్టి పేర్లు ఘోరంగా దెబ్బ తినేసాయి. ద లు త లు లేకుండా ఉన్న పేర్లు వెతికి అలసిన వారు ఏకాక్షరాలకి దిగి జే(జయ్), విజయ్, ఎన్(యెన్) అని సింపుల్ గా తేల్చేసే పేర్ల కోసం తీవ్ర పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడొక తమిళ స్నేహితురాలు వివేకానందా అనమంటే వివేగానందా అని, నాగ రాజు అనమంటే నాహ రాజు అనీ అంటుంది. ఇందాక గా పలికావు కదా అంటే అదంతే అంటుంది. మరి మనం ఇక్కడ వాళ్ళని తప్పెలా పడతాం చెప్పండి. మన పేర్లే కాకుండా వీళ్ళకీ జోషువా ని యోహువా అనడం జోస్ ని హోసే అనడం పరిపాటే. మొన్నొక జోకు చదివా. ఒకాయన ఏదో ఆఫీసులో కూచుని ఎంత సేపూ తన పేరు పిలవలేదని కౌంటరు దగ్గరికెళ్ళి వాపోయాడుట. వంద సార్లు పిలిచామయ్యా నీ పేరు నువ్వే పలకలేదని, మళ్ళీ రేపు రమ్మనీ అన్నారుట కౌంటర్ లో ఉన్న వాళ్ళు. అసలేం పిలిచారయా అంటే అనదర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అని పిలిచామని చెప్పారుట. అదెందుకంటే ఈయన పేరు అనంత రామన్ సుబ్బరామన్ కానీ మరి తమిళులకి బ వ్రాయడం లేదు కనుక సుప్పరామన్ అని వ్రాసి ఉందిట. వాళ్ళు కూడా ఈ చావులన్నీ ఎక్కడ చావమంటారూ, మీరే చూసుకుని పలకాలంతే అనేసారంటే, అనెయ్యరూ మరీ.. ఈ పేర్ల పరిశోధనలకి కాస్త విముక్తి వచ్చిందనిపిస్తోందీమధ్య. ఇప్పుడు పుట్టిన మన వాళ్ళ పిల్లలక్ కోవిద్, ఊహ అని పేర్లు పెట్టెయ్యచ్చు సింపుల్ గా.. మనకి కోవిదుడా అని విష్ణు నామము ఊహా అని అందమైన పేరు పెట్టుకున్నామన్న తృప్తి కాగా సందర్భానికి తగ్గట్టు కోవిడ్ ఊహాన్ అని పిలుచుకుంటారిక్కడి వాళ్ళు.. అప్పుకి అప్పూ తీరింది అల్లుడి కోరికా తీరింది అన్నట్టు. ఏమంటారు? అన్నట్టు దీనికీ ఒక కథ ఉందండోయ్. అప్పట్లో.. అంటే బాగా చిన్న పిల్లలకి పెళ్ళుళ్ళు చేసే కాలంలో అన్నమాట. పదేళ్ళ అల్లుడిని మొదటి పండగకి తీసుకొచ్చారుట అత్తవారు. సాయంత్రం తినడానికి సకినాలు (చక్కిలాలే లెండి. మా వైపు కొంచెం చప్పగా చేసుకుంటాము) పెట్టారుట అత్తగారు. అత్తయ్యా నాకు వీటిని పాలల్లో ముంచుకుని తినాలనుంది అన్నాడుట అల్లుడు. ఇంట్లో చూస్తే పాల చుక్కలు లేవు, ఇటు చూస్తే కొత్త అల్లుడు అడిగిన మొదటి కోరిక. ఉండు నాయనా అని, పక్కింట్లో గ్లాసుడు పాలు అప్పు తీసుకొచ్చింది అత్తగారు. ఆ పాలల్లో పిల్లాడు సకినాలు ముంచుకు తిన్నాడు. మీకు తెలియని విషయమేమిటంటే, ఈ సకినాలనబడే అతి మధురమైన తినుబండారం పాలల్లో వేసినా, నీళ్ళల్లో వేసినా, కరకరలాడటమే తప్ప, ఇసుమంతైనా వాటిని పీల్చుకోదు. దానితో అల్లుడు సకినాలు తిన్నాక చూస్తే కూడా గ్లాసుడు పాలు గ్లాసుడూ అలాగే ఉన్నాయి. పైగా ఈ సకినాలు అసలు నూనె పీల్చుకోవు కాబట్టి వాటిని పాలలో ముంచిన దాఖలాలు కూడా కనబడవు. అంచేత, ఆ గ్లాసుడు పాలూ ఆ పళంగా పట్టికెళ్ళి అప్పు తీర్చేసిందిట అత్త గారు. అదన్న మాట.. ఇవ్విధముగా అప్పుకి అప్పూ తీరింది అల్లుడి కోరికా తీరింది కదూ మరి మనం అనుకున్న పేర్లలాగే...

తాతయ్య- తకతయ్య

- ఉష ఫోన్ చేసింది ఆ మధ్య. తను నాతో కాలేజీ లో కలిసి చదువుకుంది కెనడా వచ్చిన కొత్తల్లో. అప్పట్లో కలుస్తూ ఉండేవాళ్లం. ఈ మధ్య కలవలేదసలు. చాలా రోజులయ్యింది టిం హార్టన్స్ (Tim Hortons) లో కూచుందాం కాసేపు అంది. సరే అని వీలున్న రోజు వెళ్ళాము.. వచ్చాక కాసేపు మాటలవగానే ఏడుపు మొదలెట్టేసింది. నేను ఖంగారు పడిపోయే లోపు తమాయించుకుని..." నీకు గుర్తుందా పోయినేడాది మా చిన్న అన్నయ్యకి కొడుకు పుట్టాడని చెప్పా కదా" అంది.. "అయ్యో వాడికేమైనా అయిందా" అని అడిగా భయంగా.." కాదు వాడికి మాటలొచ్చాయి".. మళ్ళీ ఘొల్లుమంది. "అయితే సరిగా మాట్లాడట్లేదా.. ఊరుకో ఊరుకో వస్తాయిలే అవే " అని ఓదార్చా.. "కాదు కాదు.. మా వదిన వాడితో నన్ను అత్తా అని పిలిపించింది" అని భోరుమంది మళ్ళీ.. "అదేంటీ నువ్వు అత్తవే కదా" అన్నా ఆందోళనగా.."మా వదినకీ నాకూ పడదులే , అందుకే నా వయసు పెంచాలని అలా పిలిపిస్తోంది.. నాకు తనంటే అసహ్యం" అంది ముక్కు ఎగ పీలుస్తూ.. "పెద్ద వదిన పిల్లలతో ఎప్పుడూ దీదీ అని పిలిపించేది.. ఇదే చుప్పనాతి" అంది సాగదీస్తూ. "అప్పుడంటే నువ్వు చిన్న పిల్లవి, పెళ్ళి కాలేదు, నీకూ వాళ్ళకీ వయసులో పెద్ద తేడా లేదు అందుకే పెద్ద వదిన అలా దీదీ అని పిలిపించి ఉంటుంది. కానీ, ఇప్పుడు నీ పిల్లలకీ 20 ఏళ్ళు దాటాయి కదా.. ఇప్పుడు పుట్టిన పిల్లాడు నిన్ను అక్కా అని పిలిస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఇంకొన్నేళ్ళలో నువ్వు నానమ్మవి అవుతావు అప్పుడెలా" అన్నా సముదాయిస్తూ.. "నన్ను నానమ్మ అని పిలిస్తే అస్సలు ఒప్పుకోను, మా పెద్దన్న పిల్లల్లు మా అమ్మని పిలిచినట్టు అమ్మా అని పిలిపించుకుంటా" అంది. తనకి ఎలా చెప్పాలో తెలియక ఇంకో విషయానికి తిప్పి కొన్ని కబుర్లు చెప్పి వచ్చేసా.. ఇంటికొస్తూ అదే ఆలోచన.. అసలిలా ఆలోచిస్తే ఎవరికైనా ఎలా అని!!!.. ఈ మధ్య ఇంకో స్నేహితురాలి పెద్ద కొడుకు పెళ్ళయిందని కోడలిని చూడడానికి రమ్మని పిలిస్తే వెళ్ళాము. బుజ్జిగా, ముద్దుగా ఉందా కోడలు పిల్ల. “ఇంట్లో ఆడ పిల్లలు తిరిగితే భలే ఉంటుంది కదా? క్యూట్ గా భలే ఉందసలు. చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు” అంటూ, ఆ రోజు ఆఫీస్ లో ఏదో పోటీలో గెల్చుకున్న ఒక చాక్లెట్ బార్ ఆ పిల్లకి ఇవ్వబోయాను. ఆవిడ భర్త కలగజేసుకుని, "చిన్న పిల్ల ఎవరు? మా ఇంట్లో మా సరస్వతే చిన్న పిల్ల, ఎందరు వచ్చిపోయినా సరే" అన్నారు నా స్నేహితురాలిని చూపిస్తూ. ఒక నిమిషం అర్థం కానట్టయ్యి తరువాత అర్థమవుతుండగా, "ఇన్నేళ్ళుగా తనొక్కతే మాకు మహారాణి, తనొక్కతే మాకు చిన్నపిల్ల, అదెప్పటికీ మారదు తన తరువాతే ఎవరైనా" అంటూ నా చేతిలో చాక్లెట్ అందుకుని ఇచ్చారు తనకి నవ్వుతూ.. అదృష్టం కొద్దీ ఆ పిల్ల మంచినీళ్ళు తేవడానికి లోపలికి వెళ్ళబట్టీ పెద్దగా స్పందించకుండా పిల్లాడి చేతిలో గిఫ్ట్ పెట్టి, కాసేపు వాళ్ళతో (భయం భయంగా) గడిపి వచ్చాము.. నా ఆలోచనలు శరవేగంతో మా ఇంటికెళ్ళాయి. నాన్న ఐదుగురిలో ఆఖరి సంతానం కావటం వల్ల, తండ్రి గారు లేకపోవడం వల్ల, పెద్దన్న గారి ప్రాపులో వారి పిల్లలతో సమంగా పెరిగారు. పెదనాన్నలు వాళ్ళ ఆడపిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు చేయడం వల్లనూ, నేను 7 గురిలో 6వ సంతానం అవడం వల్లనూ, నేను పుట్టేటప్పటికే పిన్నినో, అత్తనో అవడంతో పాటు బోనస్ గా నా పెళ్ళి అవకముందే ఈ పిన్నీ, అత్తా అని పిలిచిన వాళ్ళ పిల్లలకి అమ్మమ్మనో , నానమ్మనో కూడా అయినట్టున్నా.. మా అక్కల పిల్లలు, అన్నల పిల్లలు వయసుతో నిమిత్తం లేకుండా పిన్నీ, అత్తా అని పిలవడమే మాకు అలవాటు. అందువల్ల నాకు ఎవరైనా నా వయసు వాళ్ళొచ్చి ఆంటీ అని పిలిచినా అసలేమీ అనిపించదు. పైగా వీరెవరో వరుస పెట్టి పిలుస్తున్నారే అని సంతోషిస్తానేమో కూడా.. ఫేస్బుక్ వచ్చిన కొత్తల్లో నా మనవరాలొకటి (నా ప్రొఫైల్ పిక్ చూడక్కరలేదు.. మళ్ళీ ఒక సారి మొదటి పేరా చదవండి..) ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ లో కూచుని నాతో చాట్ చేస్తుంటే ఫ్రెండ్స్ బయటకెళదాం రమ్మని పిలిచారుట. “కాసేపు ఉండండబ్బా, మా అమ్మమ్మతో చాటింగ్” అని చెప్పిందిట. వాళ్ళ ఫ్రెండ్స్ బుగ్గలు (అసలేమున్నాయి లెండి అన్నీ జీరో సైజులే, కొత్త ఫ్యాషన్ కదా.. డైటింగ్ అంటూ లొట్ట చెంపలే, నో బుగ్గలు) నొక్కుకుని, “దీని అమ్మమ్మకి కూడా ఫేస్ బుక్ ఉందిటే” అని వెక్కిరించారుట. అది బాగా ఉడుక్కుని, వాళ్ళందరినీ పిలిచి “మా అమ్మమ్మ ఇదిగో” అని నేను, నా చెల్లీ ఉన్న ఫొటో చూపించిందిట. “వీళ్ళు మీ అమ్మమ్మలేంటే” అని మళ్ళీ ఏడిపించారుట...”పొండే నా అమ్మమ్మలు ఆరుగురూ యంగూ” అనేసి నాకు ఫోన్ చేసినప్పుడు, “నిన్ను ఇంకేదైనా పిలవనా, ఇలా నచ్చట్లే”దంది.. “ఫర్వాలేదులే యంగ్ అమ్మమ్మలు దొరికే అదృష్టం అందరికీ ఉంటుందా, నువ్వు పట్టించుకోకు” అని చెప్పి ఒప్పించా.. ఇంకో వైపు ..మా సీతయ్య కి నలుగురు పిన్నిలు . వాళ్ళు సీతయ్య కంటే 5, 6 ఏళ్ళు పెద్ద, మా పిల్లలు వాళ్ళని నానమ్మ అని పిలిస్తే నాకే ఏదోగా ఉండేది, కానీ వాళ్ళు ఫర్వాలేదనేవారు. ఆ పిన్నిలలో ఒకరి తోటికోడలు మా ఇంటికి దగ్గరగా ఉండడంతో, మా అత్తగారిని అక్కయ్య అని పిలుస్తూ చనువుగా ఉండేవారు.... అవిడని మా వాళ్ళంతా పిన్ని అని పిలిచేవారు.. ఈ మధ్యనెప్పుడో ఆవిడ 50వ పుట్టినరోజని వాళ్ళ పిల్లలు వేడుక చేసి ఫొటోలు పెట్టారు. అప్పటి నుంచీ మా సీతయ్యకి ఒకటే మనాది, అయ్యో నా కంటే చిన్నావిడని పట్టుకుని ఇన్నేళ్ళూ పిన్నీ అని పిలిచేసానా అని...పోనీ అలా అని ఇప్పుడు పేరు పెట్టి పిలిస్తే బాగుంటుందా ఏంటి కానీ ఇప్పుడు కూడా ఇలా మరీ 15 , 16 లకి పెళ్ళిళ్ళయ్యి కాస్త పెద్దరికం గా కనిపించే 30 ఏళ్ళ అమ్మాయిలని చూస్తే మాత్రం పరమ జాలేస్తుంది.. వాళ్ళ పిల్లల వయసు చూసి అందరూ ఆంటీ అనేస్తారు.. పాపం వాళ్ళు ప్రతి సారీ.. అయ్యో నాకు 15 యేళ్ళకే పెళ్ళయిందని చెప్పుకుంటూ ఉండాల్సొస్తుంది కదా మరి!!! పైన చెప్పినట్టు మా సీతయ్య వైపు తనే ఇంటికి పెద్ద. ఇరు వైపులా వారే పెద్ద కొడుకు, నేనే పెద్ద కోడలు, నా పిల్లలే మొదటి మనవలు. మా పిల్లలు పెళ్ళీడుకొచ్చినా, మా వారి తమ్ముళ్లకి, చెల్లెళ్ళకీ (పిన్నిల పిల్లలు) ఇంకా పెళ్ళి ళ్ళు పేరంటాలు, సీమంతాలు బారసాలలు అవుతున్నాయి. పెళ్ళయ్యి పాతికేళ్ళు అయినా ఇంకా మేము పెద్దమ్మ పెదనాన్న, అత్తయ్య మావయ్యల లెవెల్ దాటట్లేదు.. మా వైపు చూస్తే, నేను మరి ఆఖరాఖరు కదా, మా అక్క మనవలకీ, అన్నయ్య మనవలకీ పెళ్ళిళ్ళు, పిల్లలు... వామ్మో మీకు అర్థం అవుతోందో లేదో.. ముత్తమ్మ, ముత్తాత వరుసన్నమాట...:) మా సీతయ్యకి మా వైపు అడుగు పెట్టాలంటే హడల్.. ఎవరో ఒకరు తాతయ్య అనో, ముత్తాతయ్యా అనో పిలిచి పారేయకుండా నేనే జాగర్త పడుతుంటా.. నా అతి జాగర్త కి ఉదాహరణ.. మా అక్క మనవరాలొక బుజ్జిది వాళ్ళ తాతగారిననుకరిస్తూ.. "రండి సీతయ్య గారూ, సిగరెట్ కాల్చుకుందాం" అంటుంటుంది.!! ఇక్కడ కూడా చాలా మంది స్టడీ వీసా మీద మా ఊరి నించి వచ్చిన చుట్టాల పిల్లలు నన్ను పిన్ని అనో , అత్త అనో పిలుస్తూ, పెళ్ళిళ్ళయ్యి, పిల్లలు పుట్టగానే తీసుకొచ్చి 'అమ్మమ్మ ఒడిలో వెయ్యడానికి' తీసుకొచ్చామని చెపుతుంటారు.. నేను సంతోష పడుతూనే పిల్లాడినెత్తుకుని.. "అదిగో చూడు నాన్నా, సీతయ్య గారిని చూడు" అని అన్యాపదేశంగా తాతయ్య అనే పదం రాకుండా కాపాడడానికి ప్రయత్నిస్తుంటా.. ఏముంది లెండి సీతయ్య అయినా తాతయ్య అయినా ఆ బుజ్జితండ్రికేం తెలుసు.. నా ప్రయత్నమల్లా బుజ్జోడి తలితండ్రులకి అర్థం కావాలనే... మీకూ అర్థం అయిందిగా.. నేను జేజమ్మనయినా, ముత్తమ్మనయినా ఫర్వాలేదు.. సీతయ్య మాత్రం. మిస్టర్ సీతయ్యే.. మీరూ జాగర్త.. గజి బిజి చెయ్యకండి సుమా...గల్లంతయిపోద్ది....:)