కాపీలు తాగారా.. టిపినీలు తిన్నారా
Wednesday, November 23, 2022
కౌముది పత్రిక కథలపోటీలో బహుమతి పొందిన కథ "అదిగదిగో గగనసీమ"
భూత యజ్ఞం
చీకటింట్లో చిక్కు తీసా
Tuesday, November 15, 2022
చిత్రం: తూలిక, కెనడా
'సరిగ్గా కూర్చోవే ఈ జడ వేయలేక చస్తున్నా' అంది పెద్దక్క. 'అబ్బా నెమ్మదిగా దువ్వు అన్నా నేను' వెనక్కి తిరిగి అక్కని చూస్తూ. 'ఏంటి నెమ్మదిగా దువ్వేది? జుట్టు చూడు ఎలా చిక్కులు చేసుకున్నావో' గట్టిగా దువ్వింది అక్క. 'నేనేం చేశాను' అన్నా నేను ఉక్రోషంగా. 'రిబ్బన్లు తీసేస్తావుగా' నెత్తి మీద మొట్టికాయ వేసింది. 'నేను జడ వేసుకోను పో' అన్నా నేను విసురుగా .
'బూచిలా ఎలా ఉన్నావో చూడు! అక్క చెప్పినట్టు జడ వేసుకో' అంది అమ్మ మురిపెంగా చూస్తూ. 'నువ్వు వెయ్యీ అంటూ అమ్మ దగ్గరికి పరిగెత్తాను. అమ్మ అయితే నెప్పెట్టకుండా నిదానంగా జాగ్రత్తగా చిక్కులు తీసి జడ వేస్తుంది. కానీ అమ్మకి తీరిక ఉండదు. ఎప్పుడు చూసినా వంట చేస్తూనో, బియ్యం విసురుతూనో, వడ్లు చెరుగుతూనో, పప్పు రుబ్బుతూనో ఉంటుంది. మాకు సింగారాలు చేసేది మా పెద్దక్క బాధ్యత. 'అన్నయ్య వాళ్ళు వచ్చేస్తారు , వంట చేస్తున్నా కదా బంగారూ, అక్కతో వేయించుకో పో' అంది అమ్మ.
ఉన్నవి రెండు గదులు. ఇంటి బయట ఒక అరుగు. అది పుష్పక విమానం లా ఎంత మంచి కూచున్నా సరిపోతుంది. ఇంటికి ఎవరైనా వస్తే, కుర్చీలు, బెంచీలు వెతుక్కునే అవసరం రాదసలు. ఇటూ అటూ వస్తూ పోతూ అందరూ మా అరుగు మీద కాసేపు కబుర్లు చెప్పుకుని వెళ్ళేవారు. ఆ అరుగు అలా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోడానికి మాత్రమే కాకుండా, చుట్టు పక్కల వాళ్ళు వచ్చి బియ్యం ఏరుకోవడం, బీన్నీసు (గోరు చిక్కుల్లో చిక్కుళ్ళో) వలుచుకోవడం, శామంగాలు (చేతితో చేసే సేమియా) చేసుకోవడం, అల్లం ఎల్లిగడ్డ వలుచుకొవడం మొదలైన వాటికి వేదిక.
ఇల్లు చిన్నది కాబట్టి జుట్టు ఇంట్లో కాకుండా బయట అరుగు మీద కూచుని దువ్వుకోడం అలవాటు. ఎందుకంటే, చిన్న అన్నయ్యకి అన్నంలో జుట్టు కనిపించిందో.. వీధి వీధి ఎగిరిపోయేలా దుమారం లేస్తుంది. అన్నంలో చెయ్యి కడిగేసుకుంటాడు. బియ్యంలో నలకలు పురుగులు స్లిప్ అయ్యి అన్నంలోకి వచ్చినా ఫర్వాలేదు కానీ, జుట్టు వస్తే మాత్రం టాప్ లేచిపొద్ది.. అంతే..! అమ్మ భయపడ్డట్టు.. చిన్న అన్నయ్యకే అన్నంలో ఏదో ఒకటి కనబడేది. మాట్లేసిన గిన్నెలో అన్నం వండితే ఆ మాటు ఊడిపోయి, తనకే వచ్చింది ఒక సారి. బియ్యంలో రాళ్ళు గాలించినా, కొన్ని వచ్చేసేవి. అవి కూడా ఎప్పుడూ మా చిన్న అన్నయ్య దంత సిరిని పరీక్ష చేసేందుకే సిధ్ధం అయ్యేవి. 'వాడికి చీకట్లో అన్నం పెట్టు, దీపాలు లేకుండా' అనే వారు మా నాన్న. చీకటైనా వెలుగైనా, ఇలాంటివేవో అన్నయ్యకే అగుపిస్తాయి ఎందుకో. మేము సరిగా చూసుకోకుండా తినేస్తున్నామని, మేము చూసుకోకుండా తినేసే పురుగుల బరువు ఏనుగు తలకాయతో సమానమనీ అనేవాడు కొంచెం మంచి మూడ్ లో ఉన్నప్పుడు. బాగా కోపిష్టి లెండి. అలా సరదాగా ఉండడం చాలా అరుదు. అన్నయ్యకి అన్నం వడ్డించాలంటే, అమ్మ దగ్గరి నించీ అందరికీ భయమే! అరుగు మీద జడలు వేస్తూ ఎప్పుడైనా జుట్టు తియ్యని దువ్వెన కనబడిందంటే దివ్వెన ఇంతి ఎదురుగా ఉన్న చెరువులోకో, ఆ పక్కన ఉన్న పొదల్లోకో దూసుకెళ్ళేది. ఆ రోజుల్లో మళ్ళీ దువ్వెనలు కొనాలంటే సూదులు దారాలు అమ్మే వాళ్ళు రావలసిందే. అందుకే అందరం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేవాళ్ళం జుట్టు విషయం లో.
అమ్మ ఉంగరాల జుట్టు నాకు, చెల్లికి వచ్చింది కానీ అమ్మ జుట్టులా పొడుగ్గా పెరగదు. విప్పుకుంటే జూజూ భూతంలా ఉంటుందని ఒకరు.. నూడుల్స్ లా ఉన్నాయని ఒకరు వారికి మా మీద ఉన్న విసుగునో ప్రేమనో వెళ్లగక్కే వారు. తల బిరుసు తగ్గాలని కుంకుడు కాయలతో పాటు ఇంట్లో చెట్టుకి ఉన్న మందార ఆకుల ముద్ద నూరి తలకు పట్టించి, కుంకుడు కాయ పులుసుతో స్నానం చేయించడం అక్కలకి ఎంతగానో అలవాటు అయ్యింది. ఆ ఆకులు, కుంకుడు పిప్పి అంటుకున్న జుట్టుని ఆరేదాకా దువ్వకూడదు, అలా దువ్వితే జుట్టుకున్న ఎలాస్టిసిటీ పోతుందని ఎవరో చెప్పారని మా చిన్నక్క పెట్టిన రూలొకటి. ఇక కెవ్వులు కేకలు. చిక్కు చిక్కు.. ఆ తరువాత మేము కొంచెం పెద్దయ్యాక ఒక యమా అవుడియా వచ్చింది. నీళ్ళు కాచుకునే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి, దానిలో సగానికి నీళ్ళు పోసి, అప్పటికప్ప్డు కుంకుడు చెట్టు నించి వేలాడుతున్న ద్రాక్ష గుత్తుల్లాంటి కుంకుడు కాయలు, ఆ పక్కనే చెట్టుకున్న మందార ఆకులు పడేసి ఒక అరగంట వదిలేస్తే అదే మరిగి మరిగి మరుగుతుంది. దాన్ని నెమ్మదిగా దించి, ఒక బట్టతో ఇంకో గిన్నె లోకి వడగట్టి పెడితే సేంద్రియ పద్ధతిలో షాంపూ తయారవ్వదూ? ఒక ఆదివారం పొద్దున్న పూట అలా ఉడికించామంటే, ఇంట్లో వాళ్ళకే కాదు పక్కన పది ఇళ్ళకి సరిపడా వస్తుంది. కానీ అది నిలవ ఉండదు. ఇంట్లో చెట్టుంటే, ఇంకెందుకు బెంగ మరి. (మీలో ఎవరైనా కుంకుడు చెట్లు చూసారో లేదో భలే ఉంటుంది తెలుసా)
ఇక మందార పువ్వులు ఎండబెట్టి వాటిని కొబ్బరి నూనెలో వేసి కాచి చల్లార్చి డబ్బాలో దాచిన నూనె ఎంత పట్టించినా జుట్టు తాగేస్తుందని నవ్వేది అమ్మ. మరీ పొట్టి జుట్టు కాదు కానీ ఆరగానే రింగులు తిరిగి పొట్టిగా కనిపించేది. 'ఎంత సమ్రక్షణ చేసినా ఇంతే, కాస్త పెరిగినా బాగుండేది' అని అమ్మ అన్నప్పుడల్లా, 'బుద్ది శాలుర జుట్టు భుజాలు దాటదు, అలా ఉండనియ్' అనేది మా బోయినపల్లి అమ్మమ్మ.
మా చెల్లి స్కూల్ లో పని చేసే నాగమణి టీచర్ కి రింగుల జుట్టు ఎంత ఇష్టమో. మా ఇంటి ముందు నించి వెళుతున్నప్పుడల్లా, అక్కడ ఆడుకుంటున్న మా ఇద్దరినీ పిలిచి, ఒక సారి తల మీద చెయ్యేసి మురుసుకుంటూ వెళ్ళేది. అదొక ఆనందం, ఆప్యాయత అనుకుంటా.
ప్రతి పూటా జడలు వేసినప్పుడు చిక్కులు పట్టి ఊడిన మా ఇద్దరి జుట్టూ అక్క జాగర్తగా వేలికి చుట్టుకుని, ఆ చుట్టని..ఒక సంచీలో పెట్టి, ఇంటి వెనక మెట్ల కింద ఉన్న చీకటి గదిలో చూరు కింద రేకుల మధ్య ఉన్న సందులో పెట్టేది. అక్కడ కొంచెం చీకటిగా ఉంటుంది అటు ఎవ్వరూ వెళ్ళరు ఎక్కువగా. అక్కడే ఎందుకు అంటే, మా చిన్న అన్నయ్య చూడడు కాబట్టి. వాడు చూసాడంటే, విసిరి కొడతాడు అసహ్యంతో.
దాచిన జుట్టు సవరాల వాళ్ళకి ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పుకునేవారు. పక్కింటి సావిత్రక్క దాచిన జుట్టు ఎన్ని రోజులైనా మా అక్క దాచినంత అయ్యేది కాదుట. రిబ్బన్లు పీకేసుకున్నామని మొట్టికాయలు వేస్తుంది కానీ, అలా ఆవిడ పోల్చి చూసినప్పుడల్లా మా అక్క ముఖం తెగ సంతోషంగా వెలిగిపోయేది.
నెలకో రెండు నెలలకో సవరాలు అల్లేవాళ్ళు వచ్చేవారు మా ఊరికి.
ఒకోసారి మా వీధిలో ఎవరికైనా అర్జెంట్ గా సవరం అవసరం అయితే, ఇరుగు పొరుగు వాళ్ళ జుట్టు మదుపు లోంచి అప్పు తీసుకుని తిరిగి చెల్లించే పథకం కూడా అమలులో ఉండేది. అయితే ఈ సవరాలు అల్లే వాళ్లతో తెగ చిక్కులు. వాళ్ళు చాలా మాటకారులు..మంత్ర గాళ్లు కూడా. ఎవరినీ తక్కువ చెయ్యడం నాకు ఇష్టం ఉండదు కానీ, ఇటు తిరిగి అటు చూసే లోపు సామాన్లు మాయం అయ్య్యేవి. వాళ్ళు వస్తే జాగర్తగా ఉండాలని పదే పదే చెప్పిన వాళ్ళే మోసపోయే వారు. వాళ్ళు పోట్లాట వేసుకున్నారంటే ..ఇక ఇంతే సంగతులు..చిత్తగించవలెను.. అంతే! ఒక్కరే ఉన్నప్పుడు ఊసుపోక వాళ్ళని పిలిచామో..మత్తుమందు చల్లి ఉన్నవి దోచుకుపోతారని చెప్పుకునే వారు. కాదు కూడదని పిలిచిన వారికి మనసు తీరింది కూడా. వాళ్ళ మంత్రాల మీదా మత్తు మందు మీదా వార్తా పత్రికలలో కూడా చాలా సార్లు వచ్చేది. కానీ సవరమవసరం కదా, పిలవడం తప్పేది కాదు జనాలకి.
ఈ సవరాల వాళ్ళు ఆ సవరం మీద ఏదో మందు చల్లి పోతారని, ఆ సవరం "రా... రా..." అని పిలుస్తూ ఇంటి వాళ్ళని కొండల్లోకో కోనల్లోకో తీసుకుపోతుందని వివిధ రకాల కథలు చెప్పుకునేవారు. ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నప్పుడు సవరాల వాళ్ళు వచ్చినా పిలవకూడదని ఒట్టేసుకున్న ఇంతులు, వాళ్ళు రాగానే మళ్ళీ ఎప్పటికి కళ్ళబడతారో అన్నట్టు పిలిచేసి, ఎక్కడెక్కడో మోసాలు జరుగుతాయి కానీ నా అంత తెలివి గలది మోసపోవడం ఏంటీ అనుకుంటూనే టపీమని మోసపోవడం చూస్తూనే ఉండేవారు అందరూ. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, మా ఇంట్లో అందరివీ పెద్ద జుట్లు కావడం వల్లనూ, రింగుల జుట్లు కావడం వల్లనూ సవరాల వాళ్ళని పిలిచే అవకాశం కానీ అవసరం కానీ రాదు, రాలేదు. మరి మా అక్క దాచిన చిక్కు జుట్టు ఎటుల ఏమి చేయవలెననే చిక్కు మాత్రం వీడేది కాదు. జుట్టు మనకి అక్కర లేకపోతే సవరాల వాళ్ళకి అమ్మితే డబ్బు వస్తుందని తెలుసు కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా, మా చిన్న అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడే వచ్చేవారు. అలాంటి బేరాలు మా అన్నకి అస్సలు నచ్చవు. 'ఎవరి పోలిక వచ్చిందో పరశు రాముడిలా' అని రాము అనే పేరున్న మా చిన్న అన్నయ్యని చూసి విసుక్కునేది అమ్మ.
వెంకన్న దగ్గర మొక్కు తీర్చిన జుట్టంతా ఫారెన్ దేశాలకి అమ్ముకుంటారని, అక్కడ సినేమా వాళ్ళు ఈ జుట్టుతో విగ్గులు చేయించి పెట్టుకుంటారని, దేవుడికి ఇచ్చిన పుణ్యం, సినిమా యాక్టర్ల తలమీద మనం సమర్పించుకునే జుట్టు ఎక్కే పురుషార్థం తీర్తుందని ఎవరో చెప్పేసరికి మా ఊళ్ళో ఉన్న బాలాజీ గుడిలో జుట్టు ఇచ్చేవాళ్ళ సంఖ్య ఎక్కువయింది. మా ఊళ్ళో గుడి 400 ఏళ్ళ క్రితం కట్టినది. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి వీలుగా ఇక్కడ వెలుస్తున్నానని, తిరుపతి మొక్కులు ఇక్కడ చెల్లించవచ్చుననీ, ఇక్కడ మొక్కు తిరుపతిలో చెల్లించినా తీరదనీ చెప్పాడుట స్వామి. అందుకే మా ఆల్వాల్ వెంకన్న గుడి జుట్టు తీసే కళ్యాణ కట్టతో కళకళలాడుతుండేది. వాళ్ళు అక్కడ తీసిన జుట్టు ఏంచేస్తారు అని అందరికీ అనుమానమే కానీ, వాళ్ళతో కబుర్లాడితే మా అన్నయ్యల లాంటి వాళ్ళు ఒప్పుకోరు.
ఎండాకాలం వచ్చేటప్పటికి ఉడుకు వల్లనో, మామిడి పళ్ళు ఎక్కువ తినడం వల్లనో ఉడుకు జ్వరాలు, వేడి గుల్లలు వేసేవి పిల్లలందరికీ. ఒత్తైన గుబురు జుట్టున్న పిల్లలకి తలలో కూడా వచ్చేసేవి. ఒకసారి అలా వచ్చిన గుల్లలు హోమియో లాంటివి వాడినా ఎంతకీ తగ్గక పోవడంతో డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళింది అమ్మ నన్నూ మా చెల్లినీ. ఇచ్చినన్ని ఇండీషన్లు అవీ ఇచ్చి, ఇంక లాభం లేదు జుట్టు కత్తిరించి పడేస్తే కానీ గుల్లలు ఆరవు అని తేల్చి పడేసాడాయన. వద్దు వద్దని మొత్తుకున్నా, గుండు చేయించి పడేసింది మా పెద్దక్క. చీకటింట్లో చూరుకింద ఉన్న జుట్టు పొట్లామిప్పుడు చూరు కింద పట్టనంత పెద్దదయింది. ఇదంతా అమ్మితే ఎంత వస్తుందో అని సంబర పడింది మా అక్క సవరాల వాళ్ళ కోసం వేచి చూస్తూ.
మా అక్క స్కూల్ కి వెళ్ళినప్పుడు ఊడి పడ్డారు నాగ మణి టీచరు. వాళ్ళ పెద్దక్కకి ఏదో ఆపరేషన్ అని అనుకోకుండా నెల్లూరు వెళ్ళారుట. అక్కడ నించి తిరుపతి వెళ్ళి గుండు చేయించుకోవడంతో ఆవిడ జుట్టు కొద్దిగా పెరుగుతూ ఉంది. టీచరు గారు కనబడలేదని అందరూ అనుకుంటున్నారని చెప్పింది మా అమ్మ. పిల్లలేరి అని అడగడం తో మా ఇద్దరినీ పిలిచింది అమ్మ. ఒక్క సారిగా షాక్ అయిందావిడ. మేమిద్దరం కూడా చిన్న కృష్ణుడి జడ వేసుకుని కనబడ్డాము. అయ్యో అని మా ఇద్దరి తలల మీదా చెయ్యి వేసారు ఒకే సారి. ఇంత మంచి జుట్టు ఎందుకు కత్తిరించారు అని మా అమ్మని అడిగారు కొంచెం నిరాశగా. ఇలా వేడి పొక్కులు వచ్చి మానట్లేదని చెప్పింది అమ్మ. 'ఒక మాట అడుగుతాను, ఆ కత్తిరించిన జుట్టు ఏం చేసారు?' అని మొహమాటం గా అడుగుతూ ' వీళ్ళిద్దరి జుట్టు నాకు ఎంత ఇష్టమో, ముందే చెప్పి ఉంటే నేను తీసుకుందును, నెల్లూరు తీసుకెళ్ళి, చక్కని సవరం అల్లించి తెచ్చుకునేదాన్ని" అన్నారు. ఎక్కడి నించి ఊడి పడ్డాడో మా చిన్న అన్నయ్య 'అమ్మా చూరు కింద జుట్టు దాచారేంటి అసహ్యంగా.. " అంటూ పెద్ద ప్యాకెట్ పట్టుకొచ్చాడు. నాగమణి టీచర్ కళ్ళు మెరిసాయి. 'టీచర్ గారు ఎప్పుడో చెప్పారు, పిల్లల జుట్టు దాచి ఉంచమని, సరియైన సమయానికే చూసావు, ఏదీ ఇలా ఇయ్యి" అని ఒక సారి సంచీ లోకి తొంగి చూసి, టీచర్ గారికి ఇచ్చేసింది. ఆవిడ మహదానంద పడింది. ఆవిడ ముందు ఏమీ అనలేక మా అన్నయ్య కాంగా బయటికి వెళ్ళిపోయాడు. అన్నయ్య విసుగు ఎవ్వరి మీదా పడనందుకు మా అమ్మ హాయిగా ఊపిరి పీల్చుకుంది. జుట్టు రహస్య స్థావరాన్ని మా అన్నయ్య పసి గట్టేసాడు కనక, మా అక్క ప్రతి రోజూ వేలికి చుట్టిన జుట్టు చెత్తతో పాటు ఊడ్చి పడెయ్యడం మొదలెట్టింది.
భవిష్యత్తులో ఇంకెప్పుడైనా మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదో తెలియదు కానీ, మా ఇద్దరి జుట్టుతో చేయించిన సవరం నాగమణి టీచర్ గారికి సరిగ్గా కుదురుకుందని ఊళ్ళో వాళ్ళు పది సార్లు అంటుంటే, మా అక్క కళ్ళు మెరిసిపోతుంటాయి సావిత్రి గారు సంపాదించెబోయే డబ్బుతో పోటీ పడుతూ.
తియ తీయని తేనెల మాటలతో..
చిత్రం: తూలిక, కెనడా
9 నవంబరు, 2022
మా ఇల్లు రెండు గదులు. అందులోనే వచ్చేవాళ్ళూ పోయేవాళ్ళు! ఇంటి బయట అరుగు.. వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకీ చాయ్ పానీకి అది నెలవు. పదవ తరగతి పరీక్షలైనా, డిగ్రీ పరీక్షలైనా చదువుకోవడానికి కాసింత ప్రశాంతమైన స్థలం దొరికేది కాదు. పార్వతి వాళ్ళ పోర్టికో పైన ఉన్న మూడు మెట్ల మీద పాకిన మల్లె పందిరి కింద కాసేపు చదువుకోగలిగినా, ఎందుకో ఎక్కువ సేపు కూచోటం అయ్యేది కాదు. నా స్నేహితురాలు మేఘమాల మా ఇంటికి రారాదే అనేది. వాళ్ళిల్లు మా ఇంటికి మూడు కిలోమీటర్ల దూరం. పొద్దున్నే అన్నం తిని వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. తను అన్నం తినేసి రెడీగా ఉండేది. అక్కడి నించి ఇంకో మైలు దూరంలో పూర్తి నిర్జనమైన ప్రదేశంలో వాళ్ళకి పొలాలు ఉన్నాయి. అందులో మోటబావి. ఊరి చివర అది. మనుషుల రాకపోకలు బాగా తక్కువే. ఆ పొలాల్లోకి పోయి చదువుకునేవాళ్ళం. ఆకలా దాహమా.. అవేం రోజులో మరి. మరీ ఆకలేస్తే, వాళ్ళ పొలంలో ఉన్న కొన్ని దోర దోర టమాటాలు కోసుకుని తినేసి, ఆ మోటబావిలోకి దిగి నీళ్ళు తాగేవాళ్ళం. భయమా బుగులా బాయిల బడితే లోతా ఈత పల్లి సాటా తుర్కపల్లి గేటా అన్నట్టుండేది.
ఈ రోజు ఆ విషయం తలచుకుంటే, అలా ఎలా వెళ్ళేవాళ్ళమా అని అనిపిస్తుంది. అక్కడ పిలిస్తే పలికే వాళ్ళు కూడా ఉండడం కష్టమే. మా అమ్మా నాన్నలకి కానీ, మేఘ వాళ్ళ అమ్మ నాన్నలకి కానీ పెద్దగా చదువులు లేవు. లోక జ్ఞానమూ తెలిసిన వాళ్ళు కాదు. అక్కడ చదువుకోవడానికి వెళుతున్నామని చెపితే, కాదనేవారు కూడా కాదు. వాళ్ళకి మా మీద నమ్మకం, మాకు మా మీద ధైర్యం అనుకుంటా.
అప్పట్లో మా ఊరికి ఒకటే బస్సు, రెండు గంటలకి ఒక సారి వచ్చేది. ఆఖరి బస్సు 7 గంటలకి. అది దాటితే, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్వాలు మెయిన్ రోడ్డు మీద దిగి, నిర్జన ప్రాంతం నించి నడవాలి. ఒక సారి పీ జీ లో ఉండగా, ఒస్మానియా యూనివర్సిటీలో దొరకని పుస్తకం ఒకటి కాకతీయ విశ్వవిద్యాలయంలో దొరుకుతోందని తెలిసింది. మా అన్న (కసిన్) ఒకరు వరంగల్ లో పనిచేస్తూ, ప్రతి శుక్రవారం బాలానగర్లో ఉన్న పెద్దక్క ఇంటికి వస్తూ ఉండేవాడు. తనతో తెప్పించుకుందామని ఆలోచన వచ్చింది. ఒక శుక్ర వారం వెళ్ళి కలిసి, పుస్తకం వివరాలు చెప్పి వస్తే, ఆ పై వారం తెస్తాడని నమ్మకం. అలా ఒక శుక్రవారం కాలేజీ అయ్యాక నేను అక్కా వాళ్ళింటికి వెళ్ళిన కొద్ది సేపటికే ఏదో పొలిటికల్ జులూస్ జరిగి, బస్సులు రద్దు అయ్యాయి. నేను సాయంత్రం అక్కా వాళ్ళింటికి వెళుతున్నా అని చెప్పి వెళ్ళాను కానీ ఇంటికి రాలేనని చెప్పడం కుదరదు కదా! మా నాన్న, అన్నలు, చివరి బస్సు వచ్చే దాకా మా బస్సు స్టాప్ కి, ఆ తరువాత, మెయిన్ రోడ్డు మీద ఉన్న బస్సు స్టాప్ కి వెళ్ళి అక్కడ చివరి బస్సు వెళ్ళిపోయేదాకా చూసి వెనక్కి వచ్చారుట. అసలు అక్కా వాళ్ళింటికి వెళ్ళానా లేక ఎక్కడైనా చిక్కుకున్నానా అని వాళ్ళెంత ఆందోళన పడతారో అని నేను, నేను క్షేమంగా ఉండాలని వాళ్ళు చేసిన ప్రార్థనలు తప్ప ఇంకో గత్యంతరం లేదు. మర్నాడు అటు నించే కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఇంటికెళ్ళేదాకా అజా పజా లేనట్టే లెక్క మరి.
ఇలాంటి కథలు చెప్పా కదా అని మేము మొత్తం సురక్షిత ప్రాంతంలో పెరిగినట్టు కాదు. బస్ లో వెళుతున్నప్పుడు వెనకనించి ముట్టుకోవడానికి ప్రయత్నించే వారికోసం చేతిలో సూదులు పెట్టుకుని బస్ ఎక్కడాలు, చీకట్లో రావాల్సినప్పుడు చిన్న డబ్బాలో కారం పొడి పెట్టుకోడాలు అవీ తప్పకుండా ఉండేవి. ఒకసారి కదలబోతున్న బస్సు ఎక్కుతున్నప్పడు వెనక నించి తాకిన వ్యక్తి వేగంగా బస్ దిగిపోయాడు కానీ వెనకే బస్ దిగి అతని వీపు మీద చురుక్కుమనేలా చరుపు చరుస్తానని ఎస్క్పెక్ట్ చేసి ఉండనంత వేగంగా కొట్టి, అదే వేగంతో తిరిగి వచ్చి బసు ఎక్కే శక్తి, ధైర్యం ఎలా వచ్చాయా అని ఇప్పటికీ అనుమానంగానే ఉంటుంది. అదంటే మరీ మరీ అతీ గతీ లేని కాలం కదా..
నిన్న మొన్న డీ ఏ వీ పబ్లిక్ స్కూల్ లో చిన్నారి మీద జరిగిన అత్యాచారం గురించి విని మనసు మనసులో లేదు. నలభై ఏళ్ళ క్రితం కెమేరాలు, అమ్మా నాన్నల అను నిత్య వీక్షణాలు మన మీద లేని సమయంలో కూడా ఇన్ని అఘాయిత్యాలు జరిగిన దాఖలాలు లేవు. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉండి కూడా ఈ రోజు ఏమిటి అన్న ఆలోచన మనసుని పట్టి వదలటం లేదు. అప్పటి రోజులకంటే ఇప్పుడు ఏ విధంగా సురక్షితమో తెలియట్లేదు. నిన్న ఒక డాక్టరు చెప్తున్నారు గుడ్ టచ్ బాడ్ టచ్ అని పిల్లలకి నేర్పించడం మంచిదే కానీ, మరీ చిన్నతనం నించీ అలా నేర్పించడం వల్ల పిల్లలు అనవసరమైన భయాలకి గురి అయ్యి, మానసిక వైకల్యానికి గురి అయ్యే ప్రమాదం ఉందిట. కొందరు ఇలాంటివి వినీ వినీ పురుష ద్వేషులుగా మారి పోతారుట. ఇంకొందరు తండ్రి, అన్న, బాబాయి దగ్గరికి కూడా వెళ్ళడానికి గానీ, వాళ్ళు ఇంట్లో ఉండగా నిద్ర పోవడానికి భయపడతారట. దీనికి పరిష్కారం ఏమిటో తెలియదు. పిల్లలని ఎలా కాపాడుకోవాలో తెలియదు. గాచారం బాలేక నాచారం బోతె, నాచారం దయ్యాలు నా ఎంట పడ్డాయి అన్నట్టుంది.
మూడు తరాల కిందటిలా పిల్లలని ఇంట్లోనే ఉంచి, అక్కడికే ఆడ టీచర్లని పిలిపించి చదివించాల్సిన పరిస్థితి వచ్చేట్టుంది. తలచుకుంటే భయమెయ్యట్లేదూ? పది మందినీ కలిసి పరిస్థితులు నేర్చుకునే మాట అంటుంచి, ఆన్ లైన్ విద్య బెస్ట్ అనిపిస్తోంది ప్రస్తుతానికి. మీరేమంటారో!
వేళకాని వేళా.. త్వరపడి..
చిత్రం: తూలిక, కెనడా
26 అక్టోబరు, 2022
ఈ మధ్య తగ్గాయి కానీ నేను కెనడా వచ్చిన కొత్తల్లో అప్పుడప్పుడే కలిసిన కొందరు, వాళ్ళ స్నేహితుల పుట్టిన రోజుకి సర్ప్ప్రయిస్ పార్టీ ఇస్తున్నాం అంటూ ఉండేవారు. పది మంది ఉన్న ఒక గుంపులో మొదటి సారి ఒకరికి చేసినప్పుడు సర్ప్రైజ్ కానీ, సంవత్సరంలో వచ్చే ప్రతి ఒక్కరి పుట్టినరోజుకీ ప్రతి సంవత్సరం ఒకేలా చేస్తే అదేం సర్ప్రైజ్ అని నేను అనుకునేదాన్ని. కానీ, పార్టీ చేస్తున్న వాళ్ళు సర్ప్రైజ్ అంటూ చేస్తుంటే, అందుకున్న వాళ్ళు సర్ప్రైజ్ అయిపోతూ, నన్ను సర్ప్రైజ్ చేస్తూ ఉండేవారు. ఇలాంటి సర్ప్రయిజ్ లు నా వంట పాడైనప్పుడు ఉంటాయేమో కానీ నా ఇంట అసలు లేవు. మా ఇంట్లో మిగతా వాళ్ళు కొద్దో గొప్పో ఓకే నేమో కానీ, మా సీతయ్యకి మాత్రం ఒక సంతోషం వచ్చినా, దుఖం వచ్చినా వెంట వెంటనే ప్రపంచమంతా పంచుకోవలసిందే. మీరు సర్ప్రైజ్ అవకండి గానీ మేము చాలా ఏళ్ళు అద్దె ఇళ్ళల్లో కష్టపడ్డాక, కెనడాలో ఇల్లు కొని, ఇంటి గృహప్రవేశానికి పిలవడానికి స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి, మా కొత్త ఇంటి చిరునామా చెపుతున్నప్పుడు సగానికి పైగా మంది స్నేహితులు, "మాకు తెలుసు, మేము ఆల్రెడీ మీ ఇల్లు చూసి వచ్చాము" అని చెప్పి నన్ను సర్ప్రైజ్ చేసారు. ఎలా అంటారా! ఎందుకు అడుగుతారు లెండి... ఇంకా ఫైనల్ అనుకోకుండానే.. ఊ.. సరే .. అదన్నమాట..!
పైన చెప్పినది చిన్న ఉదాహరణ మాత్రమే, పదేళ్ళ కింద జరిగిన ఇలాంటి చాలా విషయాలను చెప్తే, ఒక పుస్తకం అవుతుంది కాబట్టి వాటిని వదిలిపెట్టి ఇప్పటి కాలానికి వద్దాము.
అమెరికాలో ప్రస్తుతం చేస్తున్న తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చానని, వారం రోజులు నోటిస్ టైం కాబట్టి, 16 న బయలు దేరి కెనడా రావడానికి బుక్ చేసిన తన టికెట్ ఫొటో తీసి పంపారు మా సీతయ్య. ఆ బొమ్మ గుర్తుంచుకుని మేము తనని పిక్ చేసుకోవాలి అదీ ప్లాన్. ఫ్లైట్ టైం తో పాటు కింద ఉన్న ఆ టికెట్ రేట్ చూసి, "వామ్మో ఇంత ఖరీదా! ఇంత పెడితే ఇండియా వెళ్ళి రావచ్చు.. అయినా అమెరికన్ ఎయిర్ లైన్స్ ని పోషిస్తున్నది మీరు కాదూ, అందరూ 100 కీ పాతిక్కీ వెళ్ళి వస్తూ ఉంటారు, మనకే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి, ఇంకో ఎయిర్లైన్స్ చూడకపోయారా, రెండు రోజుల తరువాతైనా కాస్త తక్కువకి వచ్చేదేమో" అన్నాను విచారంగా.
నా అసలు విచారం అది కాదు. నాకు ప్రతి నెలా మొదటి రెండు వారాలూ ఊపిరి సలపని పని ఉంటుంది. 15 వ తారీఖుకల్లా నేను తెలుగుతల్లి కెనడా, గడుగ్గాయ్ అనే రెండు పత్రికలని తయారు చెయ్యాలి. వారాంతాల్లో యూట్యూబ్ ప్రోగ్రాములు ఉంటాయి. వాటికి ప్రిపరేషన్ ఉంటుంది. ఈ వర్షం రాకడ నాకు తెలియదు కాబట్టి, నేను హాజరు అవుతానని ఒప్పుకున్న సదస్సులు, సభలూ వగైరాలు, పేరంటాలూ, పుట్టినరోజు పండుగలూ అవీ ఉండనే ఉంటాయి మరి! వారు రాగానే నేను ఇలా బిజీగా ఉంటే, నా ప్రపంచం తలకిందులయిపోతుంది(ఎందుకు అన్న వివరాలు ఇంకెప్పుడైనా చెప్తా). అదీ కాక ఇల్లు అద్దంలా పెట్టాలి.(అలా పెట్టాననే అనుకుంటా కానీ, హోటల్ ని చూసిన కళ్ళతో ఇంటిని చూస్తే తిట్టబుద్ధేస్తుందనే సామెతలా ఉంటుంది యవ్వారం). ఇక్కడ కెనడాలో పోస్ట్ బాక్స్ లు ఇంటికి కాస్త దూరంగా ఉంటాయి. సీతయ్య ఇంట్లో లేకపోతే, "ఏ... మా కెవరు ఉత్తరాలు వ్రాస్తారు" అనుకుంటూ, మేము అటు పోము అసలు. వారు వస్తున్నారని తెలవగానే గబ గబా ఉత్తరాల బొత్తి తెచ్చుకుని, వాటిల్లో కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ ల వంటివి ఉంటే చెల్లింపు చేసేసి, మాలో ఎవరికైనా స్పీడింగ్ టికెట్ లాంటివి వస్తే దాచేసి.. ఉఫ్.. చాలా ఉంటుంది లెండి.
ఈ భయంతో కలిగే గౌరవం వల్ల వచ్చే టెన్షన్ మాకు ప్రతి సారీ ఉంటూనే ఉంటుంది. ఈ సారి కొంత ఎక్కువ ఎందుకంటే, అనుకున్న తేదీకి పది రోజులు ముందుగానే పుట్టిన మా మనవడిని వెంటనే చూడకుండా ఆసుపత్రి వాళ్ళు పెట్టిన 5 రోజుల ఆంక్షల వల్ల మేము 12 వ తారీఖున న బయల్దేరి 7 గంటల డ్రైవ్ దూరంలో ఉన్న మాంట్రియల్ కి వెళ్ళి రావాలన్నమాట. ఆ వారం ఆఫీసు పని వత్తిడి ఎక్కువగా ఉండడంతో ఆ ఒక్క రోజు వెళ్ళి వచ్చేటట్టు మా బాస్ ని ఒప్పించుకున్నా. 13, 14, 15 లలో పనులు పూర్తి చేసుకుంటే సీతయ్య వచ్చాక, తను మనవడి కోసం అమెరికాలో పీకిన జెండా పట్టుకెళ్ళి మాంట్రియల్ లో పాతాలన్నమాట.
స్టడీ వీక్ అంటూ వారం సెలవల కోసం యూనివర్సిటీ నించి వచ్చిన నా పిల్లది సోమవారం సాయంత్రం ఇల్లు సర్దటం మొదలెట్టి, అందరినీ వాళ్ళ వాళ్ళ గదులు సర్దెయ్యమని కొంచెం హడావిడి చేసి, నన్ను సర్ప్రైజ్ చేసింది. ఇదేమిటా ఈ పిల్లకి ఎప్పుడూ లేనిది ఇంత నీట్ నెస్ అని నేనూ, నా దత్త పుత్రిక హాశ్చర్యపోయాము. అదీ కాక, నేను చాలా పనులు పెట్టుకుని సరిగా పడుకోవట్లేదని ప్రతిరోజూ క్లాసులు పీకే పిల్ల "నువ్వు తెలుగుతల్లి పనులు ఈ రోజు రాత్రి మొత్తం మెలకువగా ఉండి చేసేసుకో, రేపు కొంచెం ఎర్లీ గా లేచి చేస్తే గడుగ్గాయి పనులు కూడా అయిపోతాయా? మేమిద్దరం వంట చేసేస్తాంలే" అని నా ద.పు (దత్త పుత్రిక) ని కూడా స్వచ్ఛందంగా కలిపేసుకుంది. పత్రిక పనుల్లోనూ, యూ ట్యూబ్ పనుల్లోనూ హెల్ప్ చెయ్యనా అని ఒకటే అడగడం. సూర్యుడు ఎటు పొడుస్తున్నాడా అని నేను నిజంగా చాలా సార్లు ఆకాశం కేసి చూసి వచ్చి, ఈ ప్రేమ తట్టుకోలేక కంట తడి కూడా పెట్టుకున్నా.
ఆ రాత్రి ఫోన్ చేసినప్పుడు మర్నాడు మాంట్రియల్ వెళ్ళే సంగతి ప్రస్తావించా సీతయ్యతో. వచ్చేవారం ఎలాగూ వస్తా కదా అప్పుడు వెళ్ళచ్చు, రేపటి ప్రయాణం క్యాన్సిల్ క్యాన్సిల్ అని తెగ బ్లాక్ మెయిల్ చేసారు. పసికందుని చూస్తున్నాని కంటున్న కలలు కూలిన నిరాశ కమ్ముకున్నా, "ఇదీ ఒకందుకు మంచిదే..ఆఫీసులో పని, పత్రిక పని కూడా అయిపోతుంది కాబట్టి, నాన్న వచ్చాక వెళ్ళడమే మంచిది" అని చెప్తూ, నేను సెలవు క్యాన్సిల్ చేసి, నా ద.పు. తోనూ, అబ్బాయితోనూ కూడా సెలవు క్యాన్సిల్ చేయించి, మాంట్రియల్ లో కొడుకుకీ, కోడలికీ ఫోన్ చేసి మారిన షెడ్యూల్ అంతా చెప్పేసా. తదనుగుణంగా వాళ్ళు డాక్టర్ అప్పయింటుమెంటులూ అవీ మార్చుకుంటామని చెప్పారు.
మర్నాడు సాయంత్రం 3 గంటలకి పిల్లది దోస్తులని కలవడానికి వెళతా అంది. స్టడీ బ్రేక్ సెలవులకని ఇంటికొచ్చింది కానీ స్టడీ లేదు బ్రేకూ లేదు ఊరి మీద పడి తిరుగుతోందని చిరాకేసి "నీకంటే సెలవులు కానీ, నీ దోస్తులు ఇంకా ఆఫీస్ నించి ఇంటికి వచ్చే టైం కాలేదు కదా? ఇప్పుడు నిన్ను కలవడానికి ఎవరుంటారు" అని వాదించాను. అది వినీ విననట్టుగా వెళ్ళిపోయింది. ఛీ! ఇవాళేమిటో ఎవరూ వినిపించుకోవట్లేదు అని, విసుగు విసుగ్గా ఆఫీసుపని చేసుకుంటూ, ఒక మీటింగ్ లో ఉండగా..తలుపు కిర్రునా చప్పుడైనది... గుండె ఝల్లనా కొట్టుకున్నది.... మెల్ల మెల్లగా కిందకెళ్ళి నే వచ్చినదెవరో చూసాను....వచ్చినదెవరో చూసాను..! అవును మీరు కరెక్ట్ గానే గెస్ చేసారు.. ఇంకెవరూ.. ఎవరూ.. మా సీతయ్యే!! ఈ సర్ప్రైజ్ సల్లగుండా..అప్పటికి ఒక అడుగు కూడా కదలని నా పనులన్నీ తలచుకుని.. ఒక నిమేషమునందే నయము, భయము, విస్మయము గదరా... శ్రీ మద్రమారమణ గోవిందో హారి.
నేను బుర్రలో తిరుగుతున్న పనుల సునామీని, చెత్తా చెదారాన్ని ఒడుపుగా ఒక పక్కకి జరిపి "ఇంతకీ.. ఇలా వచ్చేసారేంటీ" అంటూ సర్ప్రైజ్ అయినట్టు నటించా.. మనసులో మాత్రం "ఇంత ఝలక్ ఇచ్చారేంటీ" అని వేదన (ఈ మాట మీరు వినలేదంతే).
"చూసారా నాకూ సర్ప్రైజ్ చెయ్యడం వచ్చేసింది కదూ" అంటూ బోలెడు సంబరపడిపోతూ "పొద్దున్నే ఐదుకల్లా బయలుదేరితే ట్రాఫిక్ పెరగకుండా ఊరు దాటెయ్యచ్చు, వంకలు పెట్టకుండా పది రోజులు సెలవు పెట్టెయ్యి, మేనేజరుకి చెప్పెయ్యి.. సెలవు చీటీ రాసెయ్యి" అంటూ ఊపిరాడనియ్యకుండా దడదడలాడించేసారు సీతయ్య. ఇప్పుడు సెలవు పెట్టనంటే పాముకి కోపం, పెడతానంటే కప్పకి కోపం.. పైగా మాంట్రియల్ లో వాళ్ళు అన్ని ప్లాన్ లూ మార్చుకు కూచున్నారు. ఇప్పటికిప్పుడు మేమొచ్చేసాం అంటే, వాళ్ళేమి ఇబ్బంది పడతారో అని బెంగ, అబ్బాయి, ద.పు లు మళ్ళీ సెలవు అడగాలి.. అయ్యో నా తెలుగుతల్లి, అయ్యో నా గడుగ్గాయి, అయ్యో నా బుజ్జి పిల్లల కథల ప్రోగ్రాము, అయ్యో ఇన్స్ట్రుమెంటులు వాయించే పాటల ప్రోగ్రాము, అయ్యో ఆ సభ, ఈ సభ ఇప్పుడెలా???????
ఆ సంభ్రమంలో మునిగి తేలుతూ ఉండగా "హమ్మయ్యా. ఇప్పుడెంత రెలీఫ్ గా ఉందో తెలుసా అమ్మా. నాన్న ఈ రోజు వస్తున్నా అని నా ఒక్కదానికీ చెప్పి ఎవరికీ చెప్పద్దన్నారు. ఎవ్వరికీ చెప్పనని ప్రామిస్ చేసా. కానీ నువ్వు పనులు ముగించడానికి వేస్తున్న పల్టీలు, పిల్లిమొగ్గలు చూస్తుంటే జాలేసింది. హింట్ ఇద్దామనుకున్నా కానీ ఎలా ఇవ్వాలో తెలియలేదు సారీ అమ్మా" అంటోంది పిల్లది. నాకు ఒక వైపు తల తిరుగుతున్నా జాలేసింది పిల్ల దాని మీద.
"టికెట్లు చాలా ఖరీదు ఉన్నాయి కదా బాబాయ్" అని నా ద.పు అడిగితే, "లేదు చాలా చీప్ గా వచ్చింది 499 డాలర్లు అంతే"అని జవాబు. "అబ్బా బాగా చీప్ గా వచ్చిందే, 16 నాటి టికెట్ లో మూడవ వంతు. భలే మంచి పని చేసారు, 16 టికెట్ క్యాన్సిల్ చేసెయ్యండి మర్చిపోకుండా" అన్నాను వెయ్యి డాలర్లు మిగిల్చారు అనుకుంటూ కూల్ గా. "అబ్బే అది తిరిగిరాదు, పోయినట్టే" అన్నారు మామూలుగా. ఆ జవాబుకో, నా కళ్ళ ముందు తిరుగుతున్న పనుల గజిబిజికో తెలియదు కానీ నా మెదడు మోకాలు దాటుకుని, అరికాల్లోకి జారి పోయింది. ఈ సారు-ప్రైజ్ ల నించి నేను కోలుకుంటానంటారా?
వడ్లగింజ
చిత్రం: తూలిక, కెనడా
12 అక్టోబరు, 2022
నాకు చిన్నప్పటి నించీ ఒక సారి చూసిన వాళ్ళని పేర్లతో సహా గుర్తుపెట్టుకోవడం చాలా అలవాటు. అలా ఎలా గుర్తుపెట్టుకుంటావూ అని అడిగేది సులోచన. "కళ్ళు చూసి గుర్తుపట్టేస్తా" అనేదాన్ని గర్వంగా. "ఏమోనే నాకు ఎవరి కళ్ళలోకైనా చూడాలంటే భయం అందుకని లక్ష్మణుడిలా పాదాలు చూడడం అలవాటు చేసుకున్నా. ఎవరి పాదాలన్నా చూసానంటే టక్కున చెప్పేస్తాను వాళ్ళెవరో" అనేది. "నీ మొఖం.. బూట్లు వేసుకుంటే ఎలా తెలుస్తుందే" అనేదాన్ని. ఆ సరదా సంభాషణ కెనడాకి వచ్చాక చాలా సార్లు గుర్తొస్తుంది నాకు. నేను కూడా అతిగా అనుకునేదాన్ని కానీ, అప్పట్లో కలువల్లా ఉండే కళ్ళు ఇప్పుడు ఒక కాటుక గీత అంత అయిపోయి, పాత స్నేహితులని పోల్చుకోవడం కష్టమైపోతోంది ఈ మధ్య. అడవిరాముడు సినిమాలో ముసుగు తీయగానే వావ్ అని గుర్తు పట్టేసే వ్యవహారం చూసి... జయప్రదని, జయసుధని గుర్తు పట్టని దొబ్బోడు (సారీ అండీ మా ఊర్లో ఇలాగే అంటాము ముద్దుగా) ఈరో ఎట్టవుతాడని కొట్లాడుకున్నవాళ్ళు ఈ మాస్కుల యవ్వారమొచ్చాక కిమ్మనకుండా ఉండిపోయారు.
అవన్నీ ఒక రకమైతే, జనాల పేర్లని గుర్తు పెట్టుకునే విషయంలో ఇంకో రకమైన సమస్య ఉంటుంది. ఒక్కోసారి షాన్, రిక్ లాంటి పేర్లు ఇద్దరి ముగ్గురికి ఉంటాయి ఆఫీసుల్లో. ఉదాహరణకి ఒక షాన్ బ్రావర్, ఒక షాన్ పవర్ ఉండేవారు మా ఆఫీసులో. మా పిన్నత్తగారి ఇద్దరు కవలలని పెళ్ళయిన మొదటి రోజే సరిగ్గా గుర్తుపట్టేస్తున్నానని మా ఇంట్లోవాళ్ళు ఆశ్చర్యపోయినట్టే ఇక్కడ పదేళ్ళ నించి పని చేస్తున్న వాళ్ళు పవర్ ని, బ్రవర్ ని ఇంటిపేరుతో సహా పిలుస్తున్నానని తెగా ఆశ్చర్య పోయారు. నేను నాకిచ్చిన క్రెడిట్ ని తీసి పడేస్తూ, కంప్యూటర్ బ్రౌసర్లతో పని చేసేవారు బ్రవరు, బరువులతో పని చేసేవారు పవర్ అని చెప్పేసా తేలిగ్గా. జపానీ పేర్లు కూడా చెప్పిన వెంటనే నాకు గుర్తుండిపోతాయి. మాకు సీ ఈ ఓ గా వచ్చినాయన పేరు నేను పిలిచేసినంత చులాగ్గా ఎవరూ పిలవలేదు. మా బాస్ ఒక రోజు నాతో "ఆయన పేరేదో చెప్పాడు కానీ గుర్తుండట్లేదు, ఎదుట పడ్డప్పుడు పేరు గుర్తురాక మొహమాటమేస్తోంది" అంది. "హిందీలో మీ అమ్మ అని ఎలా అంటావు" అని అడిగాను. "ఆప్ కే మా" అంది అతి గౌరవంగా. "కాస్త కోపంగా ఉన్నప్పుడు ఎలా అంటావో చెప్పబ్బా" అన్నాను. "తేరీ మా" అంది.. "అదే ఆయన పేరు" అన్నాను నవ్వుతూ. తెరియమా అతని పేరు. "హత్తెరికీ" అంది ఆనందంగా. "అదిగో చూసావూ వచ్చ్హే వారం రాబోతున్న ప్రెసిడెంట్ పేరు కూడా చెప్పేసావు" అన్నాను. అతని పేరు హత్తోరీ. అకీరాని ఆఖరున కూర్చునే వాడి గానూ, హీరోలా కళ్ళజోడు పెట్టుకునే ఉంటాడు కాబట్టి హీరోటో పేరు ఇట్టే గుర్తొచ్చే లాగా చెప్పగానే అందరికీ భలే ఆశ్చర్యం వేసేది.
అన్ని వారాలూ ఆదివారాలు కావని సామెత. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అనీ, జారిపోయే బండకి జాజు అంటదనీ ఉన్న ఆంగ్ల/తెలుగు సామెతల్లా, పరిచయాలు పెరుగుతున్నా కొద్దీ మోకాల్లో (అదేలెండి మెదడులో) ఉన్న స్టోరేజీ సరిపోవట్లేదేమో... ఆఫీసులో ఒక్కరి పేరు కూడా రికార్డు కావట్లేదు. కోవిడ్ వల్ల ఆఫీసులకెళ్ళి ఎవరినీ కలవకపోవటం వల్లనో ఏమో గానీ చెల్సీ, కొనోర్, కెల్విన్, మోయిన్, ఏరాన్, ఆలిన్ లాంటి పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది. పేర్లు తెలిసినా, ఎవరెవరో తెలియడం లేదు. ప్రత్యేకించి, ఒక పనికి ఎవరిని కాంటాక్ట్ చెయ్యాలో మీటింగుల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఈ రోజు కొలీగ్ తో ఫోన్ లో మాట్లాడుతూ, ఈ విషయం గురించి నొచ్చుకోవడం విని "స్పేసూ కాదు గీసూ కాదు ఓల్డ్ ఏజ్" అని నా పిల్ల పిచ్చిక నా గొంతులో కాసిని వడ్లగింజలు పడేసి పోయిందిప్పుడే
అచ్చెరువు
చిత్రం: తూలిక, కెనడా
28 సెప్టెంబర్ 2022
మంత్ ఎండ్ కోసం కొన్ని రిపోర్ట్స్ ప్రింట్ చేస్తూ ప్రమీల పక్కనున్న సీట్ లో కూచున్నాను. ప్రమీల ఫోన్ మోగింది. అటు నించి వాళ్ళ ఆయన అనుకుంటా. ల్యాండ్ లయిన్ అవడం వల్ల అతని గొంతు కూడా లైట్ గా వినిపిస్తోంది పక్కన కూచున్న నాకు. విషయం ఏమిటో అర్థం కాలేదు గానీ, ఆయన గొంతులో తీవ్రత వినిపిస్తోంది. కోపంలో తనకి వచ్చిన తిట్లన్నీ తిట్టిపోస్తున్నారు. ప్రింట్ తియ్యడానికి వంగినప్పుడు ప్రమీలని చూసాను. ప్రమీలకి నవ్వొచ్చేస్తోంది. అతను చెప్తున్న మాటలకి, తిడుతున్న తిట్లకి ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. "మీరు ఫోన్ పెట్టెయ్యండి మీటింగ్ ఉంది" అని అబద్ధం ఆడేసి, ఊబర్ ఈట్స్ లో పక్కనున్న విలేజ్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి సమోసాలు, స్వీట్లు ఆర్డర్ చేసింది. రిపోర్ట్ లలో ఏదో తేడా కనిపించడంతో నేను ఇహం వదిలి పూర్తిగా కళ్ళు కంప్యూటర్ కి అతికించేసా.
*
'మా అమ్మాయి ఇవాళ తన బాయ్ ఫ్రెండ్ తో వస్సాగా బీచ్ కి వెళ్ళింది" అంది గ్రేస్. "అవునా, చాలా బాగుంది. లాంగ్ వీకెండ్ కదా మరి! మా అబ్బాయి కూడా తన్ ఫ్రెండ్స్ తో కలిసి బ్లూ మౌంటెయిన్ కి వెళ్ళాడు" అంది ప్రమీల. "ఫ్రెండ్స్ అంటే?" అన్నాడు రికార్దో. "ఫ్రెండ్స్ అంటే క్లాస్మేట్స్. కొంతమంది మగ పిల్లలు" అందామె. " నీకు తెలియదు కానీ అక్కడికి ఎవరెవరు వెళ్తారో ఏంటో" అన్నాడు చిలిపిగా. "మాది సాంప్రదాయ కుటుంబమే అయినా, నాకు అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేదు రిక్కీ, వాడికి ఎవరైనా నచ్చితే, నాతో చెప్పే స్వతంత్రం ఇచ్చాను కాబట్టి వాడు ఇప్పుడు వెళ్ళేది మగ పిల్లలతోనే" అంది ఖచ్చితంగా. "మీ అబ్బాయికి గాళ్ ఫ్రెండ్స్ లేరంటే నేను నమ్మను గాక నమ్మను. మీ అబ్బాయికి డిగ్రీ కూడా అయిపోతోంది, ఇంకా లేకపోవడమేమీ లేదు. మీ వాళ్ళల్లో చాలా మందిని చూసాలే. ఇలాగే చెపుతారు, బయటికి వెళ్ళి చూస్తే కదా తెలిసేది" అంటుంటాడు మాటి మాటికీ. అంతే కాక గుర్తొచ్చిన ప్రతిసారీ 'ఎవరైనా దొరికారా' అని విసిగిస్తుంటాడు కూడా. అలా అడిగినప్పుడల్లా అతను నవ్వే వెటకారపు నవ్వుకి నాకు కొంత చిరాకు వేస్తుంది కూడా. "ఇంకా లేదు, తొందరేముంది మంచి జాబ్ రావాలి కదా " అంటుంది ప్రమీల కూల్ గా. "అలాంటి పప్పులేమీ ఉడకవు, ఇక్కడ పిల్లలకి ఐదవ తరగతి నుంచే గర్ల్ ఫ్రెండ్స్/ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. అలా ఉండకపోతే, పిల్లల్లో ఏదో తేడా ఉన్నట్టే " అన్నాడు నవ్వుతూ. ఈయన ఏంటి అసలు అని చిరాకు పడుతుంది ప్రమీల అప్పుడప్పుడు నాతో చెప్పి. వాళ్ళంతా ఒక డిపార్ట్మెంట్. సరదాగా జోకులేసుకుంటూ ఉంటారు. జోకులో జోకు అనుకున్నా నేను.
రిక్కీ ఇటాలియన్, లిండా హంగేరీ నించి, గ్రేసీ యూరప్ నించి, మియాద్ ఈజిప్ట్ నించి, ఇమరూ వెనిజ్వులా నించి, డయానా అమెరికా నించి, బర్తా పాకిస్తాన్ నించి, మేరీ శ్రీలంక నించి, అనామికా నేపాల్ నించి, ఆనబెల్ ఫిలిప్పైన్స్ నించి, ప్రమీలా నేనూ .. చెప్పక్కరలేదుగా. వాళ్ళ అందరికీ ఇంచు మించు ఒకే వయసు పిల్లలు ఉండడంతో మామూలుగా లంచ్ అవర్ లో పిల్లల గురించి, వారి ఆడ/మగ స్నేహితుల గురించి సరదా కబుర్లు చెప్పడం, గొల్లుమని నవ్వుకోవడం షరా మామూలే. అయితే ఎప్పుడూ విని నవ్వడం తప్ప ప్రమీల దగ్గర నించి వాళ్ళ అబ్బాయి కబుర్లు రాకపోవడంతో రాను రానూ ఆ పిల్లాడికి జన్యుపరమైన శారీరిక లోపం ఉండి ఉండవచ్చని, వైద్యులకి చూపించమని ఆమెకి ఒక ఫీలింగ్ కలిగించారు. "అదేమీ కాదు భారతదేశంలో 26 కి ముందు ఎవరూ వివాహం చేసుకోరు కాబట్టి, ఉద్యోగం వచ్చాక వెతుక్కుంటాడు" అని ఆమె దబాయిస్తున్నప్పటికీ, ఎక్కడో మనసులో కొంత దిగులు పట్టుకుంది తనకి.
ఆనబెల్ ఒక రోజు ఒక వీడియో చూపించిందిట. అందులో ఒకడు తన స్నేహితురాలి కొడుకని, ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ కాబట్టి పేరెంట్స్ కూడా ఒప్పుకుని, భారతీయ సంప్రదాయ పధ్ధతిలో ఘనంగా పెళ్లి చేసారని చెప్తూ చూపించిన ఆ వీడియో ఇద్దరు మగ పిల్లలు పెళ్లి చేసుకున్న వీడియోట! అక్కడి నుంచి గర్ల్ ఫ్రెండ్స్ లేని ప్రమీల కొడుకు మీదికి టాపిక్ మరలిందిట మళ్ళీ. "ఈ రిక్కీ పిలగాడికి పనీ పాటూ లేదు ఎప్పుడూ నా పిల్లల మీదకి తెస్తాడు టాపిక్" అంది ఆ సాయంత్రం ఇంటికెళుతున్నప్పుడు నాతో. "ఏయ్.. చూసావా, నీ కొడుకు ఎక్కువగా మగ పిల్లలతో తిరుగుతుంటాడు కదా, వాడు గే అయి ఉంటాడు" అన్నాడుట రిక్కీ జోక్ లాగా. ఇక్కడ ఆఫీసులో ఎవరైనా ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే, హ్యూమన్ రిసోర్స్ కి ఫిర్యాదు చెయ్యవచ్చు. అదే మాట అన్నాను. "కానీ వీళ్ళంతా కొన్నేళ్ళుగా కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. కాస్త మనస్పర్థలు వచ్చినా, పనిలో చాలా సహాయం చేస్తారు. మంచి టీం" అంది తను. నేనేమనాలో నాకు తెలియలేదు.
తన కొడుకు యూనివర్సిటీ నించి వచ్చినప్పుడల్లా అన్యాపదేశంగా వాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని కూపీ లాగానని, పిల్లాడు నొచ్చుకుని, విసుక్కున్నాడని చెప్పింది ప్రమీల. ఎవరైనా ఉంటే చెప్పవచ్చని, తనకి కుల మత ప్రస్తావన లేదని నెమ్మదిగా నచ్చ చెప్పిందిట కూడా. "అసలు నువ్వు తల్లివేనా? చిన్న పిల్లలకి ఇలా నేర్పుతారా తల్లులు " అన్నాడుట అవినాష్. బయట ప్రెషర్ తట్టుకోవడానికే కష్టంగా ఉంటే, నీ ప్రెషర్ ఏంటమ్మా అని కూడా విసుక్కున్నాడుట. కొద్దిగా ఇంటికి రావడం తగ్గించాడని బెంగ పడిపోయిందా తల్లి ఈ రెండేళ్ళూ.
*
ఊబర్ ఈట్స్ అబ్బాయి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బెల్ కొడితే ఈ లోకం లోకి వచ్చాను. గబ గబా సమోసాలు అవీ తీసుకుని లంచ్ రూంలోకి పరిగెత్తింది ప్రమీల. "ఏమిటి విశేషం దీపావళి, బైసాఖీ కాదే ఇవాళ" అంటున్నారు అందరూ అక్కడే కూచున్న నా దగ్గరికి వచ్చి. "తెలియదు మరి ఎవరిదైనా పుట్టిన రోజేమో" అన్నాన్నేను పనిలో నించి తల ఎత్తకుండానే. "రండి రండి శుభవార్త చెప్తా" అంటూ నన్ను కూడా లాక్కుపోయింది ప్రమీల. "ఇవాళ ఏమయింది తెలుసా? మా ఆయన్ ఫోన్ చేసి ఒకటే తిట్లు" అంటూ మొహమంతా సంతోషం నిండిపోగా తెరలు తెరలుగా నవ్వుతూ "నా పిల్లాడికి గాల్ ఫ్రెండ్ దొరికిందబ్బా" అంది తట్టుకోలేని ఆనందంతో. "వావ్! కంగ్రాట్స్ ఎవరూ? ఎక్కడమ్మాయి?" అన్నారు అందరూ ఉత్సాహంగా. "ఒక నల్ల పిల్లలే. తనకి ప్రపోస్ చేస్తే ఒప్పుకుందని ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టాడుట. కానీ, నేను చూసుకునే లోపు మా ఆయన ఫోన్ చేసి, నన్నూ వాడినీ తిట్టి తిట్టి పెట్టారు, ఇండియాలో తన పేరెంట్స్ ఎలా ఒప్పుకుంటారూ..తను కూడా ఒప్పుకునే ప్రశ్నే లేదంటూ" అంది కొద్ది విచారంగా. "మరి ఎలా?" అన్నాన్నేను ఆందోళనగా, వాళ్ళదెంత సాంప్రదాయ కుటుంబమో తెలిసు కాబట్టి . "చూద్దాం లేబ్బా, వీళ్ళ అందరి మాటల వల్ల మూడేళ్ళ నించి పడ్డ బెంగ తీరిపోయింది నాకు. నల్ల గాని తెల్ల గాని హిందు ముస్లిమైన గాని, కిరస్తాని పిల్ల కాని కాని ఏమైనా.."అని రాగం తీసి, " పిల్లాడు కాకుండా పిల్ల దొరికింది చాలు" అంది ప్రమీల. "కాలకూట విషమైనా గ్రక్కున మింగేటి ఆ నీలవర్ణుడే నీకు నిజ దైవము" అన్నాన్నేను మనస్పూర్తిగా అభినందిస్తూ.
కరివేపాకు
చిత్రం: తూలిక, కెనడా
శ్రీ సాయి ప్రసాద్ సోమయాజుల గారి వాట్సాప్ కథల సంఖ్య: 193
21 సెప్టెంబర్, 2022
1981 ప్రాంతాల్లో మా పెద్దక్క పెళ్ళి. 26 ఏళ్ళ చెట్టంత కొడుకు చనిపోయిన దుఖంలో అమ్మా నాన్నా. "వాడు పోతే మేము లేమా" అని అన్నయ్య జిగ్రీ దోస్తులు ఇద్దరు, వారితో పాటు వాళ్ళ దోస్తులు ఇంకో ఇద్దరు. ఆ నాటి నించీ సొంత అన్నల కంటే రెండాకులు ఎక్కువే. స్వంత అన్నలు ఉద్యోగ రీత్యా వేరే ఊర్లలో ఉండగా, ఇంట్లో అన్నిటికీ వాళ్ళే. ఈనాటిలా ఈవెంటు మ్యానేజ్మెంట్లు లేవుగా మరి! అన్నీ మనమే చేసుకోవాలి. కొంచెం పొదుపుగా సాగిపోవాలి అన్ని విషయాలూ. పాలు, పూలు బేరమాడి మాట్లాడడం దగ్గర నించీ అన్నిటిలో అన్నల చేదోడు.
ఇంటి ముందు పెళ్ళి. పెళ్ళు ముందు రోజు పొద్దున్నే టెంట్ హౌస్ వాళ్ళు డేక్షాలు, గుండిగలూ, డ్రమ్ములూ పడేసి పోయారు. అవన్నీ తోమి, డ్రమ్ముల్లోనూ గంగాళాల్లోనూ బావి లోంచి తోడిన నీళ్ళు నింపి, టెంటు వేయించి, దాని లోపల కొబ్బరాకుల పందిరికి కావలసిన కొబ్బటి మట్టలు కొట్టి పట్టుకొచ్చి, సీరియల్ లైట్లు పెట్టడం, కూరగాయలు పట్టుకురావడం లాంటి పనులతో వాళ్ళు నలుగురూ బొంగరాల్లా తిరిగారు. అవసరమైనచోట్ల వాళ్ళ స్నేహితులని కూడా తెచ్చుకున్నారు.
అమ్మకి ఉన్న అన్నదమ్ములు అందరూ చిన్నవయసులోనే చనిపోగా, ఒక్క చిన్ని తమ్ముడు మిగిలాడు. తనకి ఏదో గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్ష ఉండడంతో పెళ్ళికి రానని ఉత్తరం వ్రాసి పడేసాడు. దాంతో, ఊర్లో ఉన్న ఇంటి అల్లుడు వరసయ్యే దూరపు చుట్టం ఒకాయన్ని మేనమామ తరఫు తంతులు పూర్తిచెయ్యడానికి పిలుస్తూ, నాలుగు రోజుల ముందే వస్తే, అమ్మ వైపు పెద్ద దిక్కుగా ఉండవచ్చని చెప్పి వచ్చారు అమ్మా, నాన్న. వాళ్ళు పెళ్ళికి ఒక రోజు ముందు సాయంత్రం వచ్చారు. అమ్మ బోలెడు సంబర పడింది.
పెళ్ళి రోజు ముందు రాత్రి వరకూ పని చేసిన అన్నలు నలుగురూ పెళ్ళి అవుతున్నప్పుడు నామ మాత్రంగా కనబడి వెళ్ళిపోవడం గమనించిన అమ్మ, పెళ్ళి, అప్పగింతలూ అయ్యేదాకా ఆగి, వాళ్ళని రమ్మని చెప్పి పంపింది. వచ్చారు నలుగురూ.. అంతంత పనులు చేసి, పెళ్ళి ముగిసే సమయానికి ఎటు పోయారని చీవాట్లు పెట్టింది అమ్మ. వాళ్ళు మాట్లాడలేదు. అమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది, "ఆ మూడోవాడిని మీ రూపంలో చూసుకుంటున్నానని తెలుసుకదా? పెళ్ళి భోజనం చెయ్యకుండా ఎటు వెళ్ళారు" అంటూ. ఫర్వాలేదు ఫర్వాలేదు భోజనానిదేముందీ అని మొహమాటపడిపోతూ ఉన్న వాళ్ళని విషయమేంటో చెప్పమని వత్తిడి చెయ్యగా చెప్పారు. పెళ్ళి ముందు రోజు రాత్రి పందిరి పనులూ అవీ పూర్తి చేసి, కాసేపు గాలికి నించుని కబుర్లు చెప్తున్న వీళ్ళతో " తిండి కోసం వెయిట్ చూస్తున్నట్టున్నారు, తినేసి పొండి పనైపోతుంది, మళ్ళీ పొద్దున్నే లేవాలి కాబట్టి ఇంట్లో అందరూ పడుకోవాలి, మీరిక్కడ టైంపాస్ చేస్తుంటే వాళ్ళెలా పడుకుంటారు" అని ఆ మేనమామ గారు అన్నారని, వాళ్ళు మనసు కష్టపెట్టుకున్నామని చెప్పారు. అమ్మ చాలా బాధ పడింది. అతని తరఫున అమ్మా నాన్న వాళ్ళ నలుగురికీ క్షమాపణలు చెప్పినందుకు వాళ్ళు నొచ్చుకున్నారు. అయితే, ఆయన అన్న మాటలకి వాళ్ళు ఇంక రాకుండా కూడా ఉండవచ్చు, కానీ పెళ్ళి రోజు పొద్దున్నే వచ్చి, చెయ్యాల్సినవన్నీ చేసి, తినకుండా వెళ్ళిపోయారంతే. ఆ నిబధ్ధతని చనిపోయేవరకూ అమ్మ తలచుకుంటూనే ఉండేది, ఆ నాటి తప్పిదానికి బాధ పడుతూ.
అప్పటి కాలమా, ఇప్పటి కాలమా అని కాదు కార్పొరేట్ సెక్టర్ల నించి, కాలేజీ వయసులో జరిగే చిన్న చిన్న వ్యవహారాల్లో కూడా పని ఒకడిది, పవర్ ఒకడిదిగా ఉంటూనే ఉంటుంది. అలా ఎందరున్నా మా అన్నల లాంటి వారి నించి నేర్చుకున్న పాఠాలు తొందరగా మరచిపోలేము. ఏదేమైనా మన పని మనం చేసుకుంటూ పోవడమే అనుకునే పని తీరున్నవాళ్ళు ఇంకా ఉండబట్టే కార్పొరేషన్లు కానీ కరివేపాకు దుకాణాలు కానీ నడిచిపోతున్నాయంతే! ఏమంటారు?
టేకిటీజీ
చిత్రం: తూలిక
14 సెప్టెంబరు, 2022
నా స్నేహుతురాలు మణి గత సంవత్సరం ఫోన్ చేసింది చాలా కాలం తరువాత. కుశల ప్రశ్నలలోనే వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకని అడిగితే, ఉన్న ఒక్క అక్కా తనని పట్టించుకోవట్లేదని, తలితండ్రులు పోయాక ఆస్తి గొడవల వల్ల మాట్లాడడం కూడా మానేసిందని, మొన్నొకసారి ఏదో ప్రాణాల మీదకి వస్తే తన స్నేహితురాలు పరిమళ చూసుకుందని చెప్పింది. వివరాలు చెప్తూ, గర్భాశయ సమస్య వచ్చిందని, వైద్యులు ఏదో ప్రొసీజర్ చెయ్యాలని చెప్తే అక్క కి ఫోన్ చేసినా పలకలేదని, చివరికి పరిమళ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి ప్రొసీజర్ చేయించి, పదిహేను రోజులు మంచం దిగకుండా అన్నీ చేసి పెట్టిందని చెప్పింది. పోనీలే పరిమళనే నీకు దేవుడిచ్చిన అక్క అనుకో అని చెప్పి సముదాయించి, నాకూ అటువంటి సమస్య ఒకటి ఉందనీ, అసలు ఇక్కడ వైద్యుల ఆపాయింటుమెంటు దొరకడమే కష్టంగా ఉందని, సంవత్సరం పైగా వెయిటింగ్ లో ఉందనీ చెప్పాను. తనదగ్గరికి వస్తే తను చూపించుకునే డాక్టరు తొందరగా చూస్తారని, నన్ను తను చూసుకుంటానని, వచ్చెయ్యమని మరీ మరీ చెప్పి జాగ్రత్తలు చెప్తూ ఫోన్ పెట్టింది.
ఇది జరిగాక ఆరు నెలలకి నాకు డాక్టర్ ఆఫీస్ నించి ఫోన్ వచ్చింది. ఆ వచ్చేనెల 2వ తారీఖు సాయంత్రం 4.45 కి రావలసిందిగా సారాంశం. కోడి కుయ్యకపోతే తెల్లారదు అనుకుంటుంది కదా నేను కూడా అలాంటి ఒక కోడిని. పని చేస్తున్నది చిత్రగుప్తుల వారి విభాగం కాబట్టి మంత్ ఎండూ, ఇయర్ ఎండూ అవీ ఉంటాయి. ఎప్పుడైనా, ఎవరైనా సెలవు తీసుకోవచ్చు గానీ, యముడు వచ్చినా సరే "ఆగు నాకు మంత్ ఎండ్ అయ్యాక వస్తా" అని చెప్పమంటారు మా ఆఫీసు వాళ్ళు. ఎందుకంటే, ప్రతి నెలలోనూ మొదటి 5 రోజులూ ఆ విభాగంలో ఎవరు చేసే పని వాళ్ళు సక్రమంగా చేస్తేనే, రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి 2 అవుతుంది. ఇంక అటువంటి సమయంలో ఎవరైనా మానేసారో..తిరుమల గోవిందుడే దిక్కు. ఆ విషయం తెలుసు కాబట్టి ఎవరమూ ఆ రోజుల్లో సెలవు పెట్టము. కానీ ఇది ఎవరో క్యాన్సిల్ చేసుకోవడం వల్ల దొరికిన అపాయింట్మెంటనీ, మిస్ అయితే మళ్ళీ ఎప్పటికి దొరుకుతుందో చెప్పలేననీ, భలే మంచి చౌక బేరము, సమయమూ మించినా దొరకదూ అని ఫోన్ లో ఉన్న డాక్టర్ అస్సిస్టెంటు. సంగతులు వేసి మరీ చెప్పేసరికి, డాక్టరు గారిని కలిసి సంప్రదించడమే కాబట్టి ఒప్పేసుకుని, మా బాసిణి కాళ్ళా వేళ్ళా పడి నేను 2వ తారీఖున సాయంత్రం 3.45 కి వెళ్ళి 6 కల్లా తిరిగి వచ్చి Month End పని చేసేలా ఒప్పించుకున్నా.
అది పెద్ద ఆసుపత్రి కాదు. కన్సల్టేషన్ కోసం మాత్రం ఏర్పాట్లు ఉన్న క్లినిక్ అంతే. పరీక్ష చేసి, తనకి ఏదో అనుమానంగా ఉందని, క్యాన్సర్ పరీక్ష చేయించుకుంటే మంచిదని చల్లగా చెప్పారు ఆ గైనిక్ డాట్రారు. సరే మరి ఎప్పుడు చేయించుకోవాలో చెప్తే మా ఫ్యామిలీ డాక్టరు దగ్గరికి వెళ్ళి బుక్ చేయమంటానని చెప్పాను, ఇంకో రెండేళ్ళ తరువాత మాట కదా అని భరోసాగా. డాక్టరు ఒక నిమిషం ఆలోచించి, డిలే చెయ్యడం అంత సబబుగా తోచట్లేదని, అదృష్టం కొద్దీ ఇక్కడ బయాప్సీ చేసే బేసిక్ సెటప్ ఉందనీ, ఇది తన ఆఖరి అపాయింట్మెంట్ కాబట్టి, ఇంకో పావుగంట ఉండగలిగితే బయాప్సీ చెయ్యగలనని అన్నారు. ఇప్పుడు కాదంటే మళ్ళీ ఎప్పటికో కానీ కుదరదని అనిపించి, ఏమీ ఆలోచించకుండా సరే అనేసా. నేను ముందుగా చెప్పినట్టు అక్కడ పెద్ద ఏర్పాట్లు ఏమీ లేవు. డాక్టర్ చెప్పిన వివరణ ప్రకారం.. చిన్నదంటే అతి చిన్న సూది మొన అంత ముక్క కట్ చేసి పరీక్షకి పంపడమే కదా అని సరే అనేసా. ఒక సారి సురుక్కుమంటుంది అంతే కదా అని నేను చాలా లైట్ తీసుకున్నా, కానీ వెనక్కి వెళ్ళే ముప్పావుగంట ప్రయాణంలో కొంత దూరం వెళ్ళగానే సన్నగా నెప్పి, రక్త స్రావం మొదలయ్యాయి. అర్రే ఈ విషయం చూచాయగా అయినా చెప్పలేదే డాక్టరూ, ఇప్పుడెలా? అనుకున్నా కానీ, రోడ్డు మూడు లేన్లలో నేను నా కార్ లో మధ్య లేన్ లో ఉన్నా. ఏడుస్తూ యెగసాయం జేస్తె, కాడీ మోకూ దొంగలెత్తుకెళ్ళారన్నట్టు, ఎక్కడో ట్రాఫిక్ జాం అనుకుంటా, అటూ ఇటూ వెళ్ళలేనంత రద్దీగా ఉంది రోడ్డు. నేననుకున్నంత వీజీ కాకుండా నెప్పి కొద్ది కొద్దిగా ఎక్కువయింది. నెప్పి కంటే ఎక్కువ చెప్పలేని అనీజీనెస్. ఎక్సిట్ తీసుకునే వీలు లేదు గాక లేదు. కొంచెం ఓర్చుకుంటే వెళ్ళిపోవచ్చని అనుకుంటూ అనుకుంటూ కొంచెం లేట్ గానే ఆఫీస్ కి వెళ్ళిపోయాను. ఆఫీసుకెళ్ళి, ఫ్రెష్ అయ్యి పనిలో పడి రాత్రి 3 దాటాక ఇంటికి చేరి, మళ్ళీ పొద్దున్న 8 కల్లా ఆఫీసులో ఉన్నా.
ఇది చాలా సింపుల్ ఇష్యూ నాకు. పది రోజులకి గానీ రిపోర్టు రాదు. కాబట్టి మొదలు మంత్ ఎండ్ పని చకచకా చేసేసి, ఒక వేళ రిపోర్టులో గనక అటూ ఇటూ అయితే అప్పగించాల్సినవి, ఓపెన్ గా ఉండి ముగించాల్సినవి తెలుగు భాష పనులు చాలా ఉన్నాయి కాబట్టి, ఫోకస్ చేసి అన్నీ లిస్ట్ వ్రాసి, ఒకొక్క పనీ ముగించుకుంటూనే, తెలుగు భాష మీద ఆసక్తి ఉన్న కొందరిని పత్రిక కమిటీలో ఆడ్ చెయ్యడం, ఆ పై నెల, ఇంకో నెలా కూడా పత్రికకి కావలసిన మెటీరియల్ అంతా కలెక్ట్ చేసి, ఎడిట్ చేసి పెట్టెయ్యడం మొదలైన వాటితో మంత్ ఎండ్ కోసం చేసినట్టే రాత్రి 3/4 వరకు పని చేసా ఆ పది రోజులూ. పది రోజుల తరువాత రిపోర్టు వచ్చింది, ఏమీ లేదని తెలిసేటప్పటికే ఆ నెల, పై నెల చెయ్యాల్సిన పనులన్నీ అయిపోయాయి, కాబట్టి చేతి దురద కొద్దీ ఇంకొన్ని పనులు తెచ్చి పెట్టుకున్నా టైం పాస్ కోసం...అది వేరే సంగతి.
కొంత కాలమయ్యాక మళ్ళీ మణి నించి ఫోను. మళ్ళీ అక్కిళ్ళు గుక్కిళ్ళు.. "ఒసేయ్.. చెప్పన్నా ఏడువు, ఏడిచన్నా చెప్పు" అన్నాను ఏమైందోనని కంగారు పడుతూ. గర్భ సంచీ తీసెయ్యాలన్నారని, పెద్ద ఆపరేషన్ కాబట్టి భయంగా ఉందనీ సారాంశం. "అమ్మా తల్లీ, చేసిన ఆపరేషన్ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు" అన్నాను. తనకి అర్థం కాక "ఏమంటున్నావు" అనడిగింది. "అప్పుడు పరిమళ , పదిహేను రోజులూ.. "అని గుర్తు చేస్తే "అదా.. అప్పుడు బయాప్సీ కదవే చేసారు" అంది.
నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. మొదటిసారి నా మీద నాకు జాలేసిన మాట మాత్రం వాస్తవం.
ఇది కథ కాదు..
చిత్రం: తూలిక
7 సెప్టెంబరు, 2022
చాలా కాలం క్రితం ఇక్కడి నివసించి, ఉద్యోగ రీత్యా ఆటవాకి వెళ్ళిపోయిన సుమ, వాళ్ళబ్బాయి పెళ్ళి టోరాంటోలో జరుగుతోంది కాబట్టి తప్పక రావాలని గట్టిగా కోరింది. తీరా చూస్తే పెళ్ళి శుక్రవారం. ముహుర్తం మధ్యాహ్నం 12.30కి. నేను PST టైంలో పని చేస్తా కాబట్టి ముహుర్తం వరకూ ఉండననీ, పొద్దున్నే వచ్చి, కలిసి వెళ్ళిపోతానని చెప్పాను. ఎందుకంటే ఆ రోజు 11 నించీ ఉన్న సమావేషాలకి స్నేహితులకి చెప్పి దొంగ హాజరు వేయించుకున్నా, 1.30 కి మాత్రం నాదే ప్రెసెంటేషను. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చెయ్యాలి తప్పదు. నేను కలవాలనుకుంటున్న మాతృ సమాన రత్న చెర్ల గారికి కూడా విషయం చెప్పి, అప్పటికల్లా వచ్చెయ్యమని అభ్యర్థించాను. స్నేహితులెవరూ అంత తొందరగా రారు కాబట్టి, ఇంకెవరినీ కలవలేనని కూడా రూఢి చేసుకున్నా. శుక్రవారం ఫుల్లు నిమిషం తీరికలేదన్నమాట.
గురువారం సాయంత్రం నాకు స్నేహితులు రాం గారి నించి ఫోన్ వచ్చింది. "న్యూ యార్క్ నించి మధు అన్న, రాజేశ్వరి ఫామిలీ కలిసి కెనడా వచ్చారు. మీరు కలవడానికి సాయంత్రం వస్తారా" అని. వాళ్ళందరూ మంచి సింగర్స్. అప్పట్లో ప్రతి గురువారం జూం లో గూడూరు శ్రీనివాస్ గారు, మధు గారు, రాజీ, రాం గారు పాడుతుంటే, నేను చప్పట్లు కొట్టి సంతోషపడి వాళ్ళకి డై హార్డ్ ఫ్యాన్ అయ్యాను. వాళ్ళు నా సెలబ్రిటీస్. ఎంత కాలానికో కెనడాకి, అది కూడా టొరాంటో కి వస్తుంటే కలవకపోతే ఎలా? కానీ నా ఉద్యోగం బాగా కొత్తది. చారానా కోడికి బారానా మసాలా లాగా, ఈ ఉద్యోగంలో పని తక్కువ పైత్యమెక్కువ. అంటే రోజులో 10 గంటలు ఒక గ్రూప్ మీటింగ్ లో పెట్టి చావ బాదతారు. ఆ తర్వాత ఆ పది గంటల మీటింగ్ తాలూకా సారాంశం అంతా మిక్సీ లో పడేసి తిప్పి, పిప్పి పడేసి గుజ్జు తీసే పని చెయ్యలేదని పగలూ రాత్రీ తోముతారు. రాత్రి 1 వరకూ టింగు టింగు అని మీటింగులే. ఏదో ఇంటి నించి పని అంటే, మౌస్ కదపమని పని పిల్లకి పది రూపాయలిచ్చి, వేలకి వేలు గుమ్మరించుకోవడం అనుకునేదాన్ని. కాదబ్బా..పగలూ రాత్రీ పని లోనే. కొత్త కాబట్టి, సెలవు పెట్టి పారిపోవడానికి కూడా లేదాయె. ఎలా ఎలా అని ఒకటే ఆలోచన.
శుక్రవారం రాత్రి పోదామంటే ఎంటర్ ద డ్రాగన్ అంటూ మా సీతయ్య సాయంత్రం ఫ్లైట్ కి వస్తున్నారు. అటు ఎయిర్పోరట్ కి పోయి పిక్ చేసుకోవడం ఒకటుంది. రాక రాక నువ్వు వచ్చినవంటే.. అని పాడుకోవాలే తప్ప.. దోస్తులని కల్వనీకి పోతున్నా అంటే..హమ్మో ఇంకేమైనా ఉందా?
"పోనీ శనివారం మా ఇంటికి రండి" అనగానే, "లేదు లేదు శనివారం తెల్లవారుతూనే బయల్దేరిపోతున్నారు వాళ్ళు" అన్నారు రాం గారు. "పోనీ నేను శుక్రవారం ఒక పెళ్ళికి వెళుతున్నాను.. అలా వెళుతూ మీరు ఉన్న చోట చెప్తే చిన్నగా పావుగంట అయినా చూసి పోతాను" అన్నాను బాగా మొహమాటంగా. ఇక్కడ అలా తెలియని వాళ్ళిళ్ళకో, పెళ్ళిళ్ళకో వెళ్ళము కదా మరి. పైగా వెళ్ళేటప్పుడు ఆఫీసు ట్రాఫిక్కు, వచ్చేటప్పుడు ట్రక్కుల ట్రాఫిక్కు. ఈ టైంలలో హైవే మీద ప్రయాణం సమయం తీసేస్తే, సుమ వాళ్ళ అబ్బాయి పెళ్ళిలో ఉండేదే చాలా కొంచెం సేపు, అందులో గంటు పెట్టడం కుదురుతుందా అని కూడా ఆలోచన. . "ఒక్కరోజు కోసమే వచ్చారండీ. ఉన్న కాసేపట్లో అలా బయటికి రావడం కుదరదు, సాయంత్రం కుదుర్చుకుని ఇంటికొచ్చెయ్యండి" అన్నారు. పైగా "ఆఖరి నిమిషంలో చెప్పా కాబట్టి, మీకు కుదురుతుందో లేదో అనే అనుమానంతో మీతో మాట్లాడుతున్న విషయం వాళ్ళకి చెప్పలేదు. మీరొస్తే సర్ప్రైస్. లేకపోతే ఏమీ ఫర్వాలేదు" అని కూడా వారే పరిష్కారం సూచించారు. కానీ.. ఎలా ఎలా ఎలా ఎలాఎలా ఎలా ఎలా ఎలా .... అసలు మీకు చెప్పినా అర్థం కాదులెండి.. అంతలా ఎలా ఎలా ఎలా ఎలా..అదన్నమాట.
ఆలో.. చించగా చించగా..చిన్న దారి దొరికింది. శుక్రవారం రాత్రి మా-టింగుల నించి 9 నించి 10 కి విరామం ఇచ్చారెందుకో. కాలెండర్ చూసుకోగానే ఎగిరి రెండు గంతులేసా. సీతయ్య ఫ్లైట్ 9.45 కి కాబట్టి, ఎయిపోర్ట్ కి పిల్లాడిని వెళ్ళవద్దని చెప్పేసి, 9 కి ఎల్పొచ్చేసి, 9.30కల్లా వాళ్ళని కలిసేసి, 9.45 కల్లా ఎయిర్పోరట్ లో దూకేసి... వామ్మొ ఫుల్ల్ టైట్, బట్ లెట్ అస్ వెయిట్ అనుకుని, ఎంత వేగంతో వెళితే అన్నీ కుదురుతాయని లెక్కలేయడంతోనే తెల్లారింది.
పొద్దున్నే పిల్లలకి వంటా గింటా చేసేసి, "సరిగ్గా సమయానికి వచ్చెయ్యాలి, నా ప్రెసెంటేషన్.. హమ్మో హమ్మో" అనుకుంటూ నా పిల్లదాన్ని పట్టుకుని పెళ్ళికి పోయా. అక్కడ అలా అలా సుమని, అమ్మని, కలిసిన ఒకరిద్దరు స్నేహితులని పలకరించి ఇంక వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి అనుకుంటూ కూచున్నా.
పెళ్ళి పందిట్లో పెళ్ళికూతురు రాలేదని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరెవరో వస్తున్నారు ఆటవా వాళ్ళనుకుంటా నాకెవ్వరూ తెలియదు. అనవసరంగా పిల్లదాన్ని కూడా తీసుకొచ్చా బోర్ అంటుందో ఏమిటో అని బిక్కు బిక్కుమని తలుపు వైపు చూస్తున్నా. ఆ వస్తున్న ఆవిడని ఎక్కడో చూసినట్టుంది. కొంచెం పరికించి చూస్తే.. ఎవలాలూ.. రాజేశ్వరి బుర్రా.. వాఅవోవోవావోవ్ ..పరిగెత్తుకుంటూ వెళ్ళి " మీరు. మీరు.. రాజీ .."అన్నానో లేదో కెవ్వుమంది తను "లక్ష్మి నువ్వేనా" అంటూ. వెనకే మధు గారు.. ఆ వెనకే రాం గారు సతీ సమేతంగా.. అందరూ ఒకో కెవ్వ్. జనాలు ఖంగారుగా చూసినా మనమేం తగ్గల్యా. మన ఇస్టైల్ లో అబ జబ దబ 😛. గూడూరు శ్రీనివాస్ గారు "మన లక్ష్మిని కలవకుండా రాకండి" అని చెప్పారని చెప్పి ఫుల్ ఖుష్ చేసేసారు. అలా అప్పుకి అప్పూ తీరించి అల్లుడి కోరికా తీరింది ..అదీ సంగతి.
అన్నట్టు ఈ కథ మీకు తెలుసా? చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే కాలంలో అత్తారింటికి వచ్చిన అల్లుడిని "నీకేమిష్టం" అని అడిగారుట. ఎదురుగా కనిపిస్తున్న సకినాలు (చక్కిలాలు) చూసి, "అవి పాలల్లో ముంచుకుని తినడం ఇష్టం" అన్నాడుట కానీ, ఆ టైంలో ఇంట్లో పాలు లేవు. పక్కింటి వాళ్ళింట్లో ఒక గ్లాసు పాలు అప్పుకి తెచ్చి, పిల్లాడి ముందు పెట్టారు. వాడు ఎన్ని చక్కిలాలు ముంచుకున్నా, చిన్న నూనె మరక పాలకి అంటడం తప్ప, పాలు ఒడ్వలేదు. అల్లుడు తినడం అయ్యాక ఆ పాల మీద నూనె తొలగించి, జాగ్రత్తగా తీసుకెళ్ళి తిరిగి ఇచ్చేసారుట. అదన్నమాట కథ. ఇది ఎందుకు చెప్పానో తెలిసిందిగా.
ఉపసంహరణ: మా ట్రాఫిక్ మీద నమ్మకం లేదు కాబట్టి ఫుల్ల్ చార్జ్ పెట్టుకున్న ఆఫీసు కంప్యూటరూ, ఫుల్ల్ చార్జీ పెట్టుకున్న రెండు ఫోన్ లూ, హాట్ స్పాట్ పెట్టుకోవడానికి ఇంటర్నెట్టూ అవీ తెలివిగా తెచ్చుకున్న దాన్నైనందున..ఒళ్ళూ పైనా తెలియకుండా ఎక్కువ సేపు ఉండిపోయినా, మీటింగ్ టైం కి కార్ లోకి లాంగ్ జంపూ, మీటింగ్ లోకి హై జంపూ చేసేసా. సాయంత్రం డ్రాగన్ తో సమస్యలూ/సరదాలు. అవి మల్లొకపారి చెప్పుకుందారి. వాకేనా
కాజా లడ్డూ మోరియా
31 ఆగస్టు 2022
"నా లెక్కల పుస్కం పెట్టిన లెక్కలు మంచిగ రావాలె" అన్నది సరూప.
"ఏయ్.. ఏ బుక్ పెట్టాల్నో తెలుస్తల్లేదే.. అట్ల బెట్టాల్నాంటే నాకు అన్నిట్ల ఎర్రయే ఒచ్చిపాడయినయి రిపోర్ట్ కారట్ల.." అన్నది చంద్రకల.
"బొమ్మలల్ల, ఫోట్వలల్ల సూడమాయే.. గణేశుని పక్క పొంటి సరస్వతీ దేవి ఉంటది గద.. గందుకే పుస్కాలు బెట్టాలే . ఏది వెట్టిన మంచిదే నంట.. నాయిన జెప్పిండు" అన్నది పంతులు బిడ్డ పద్మ.
"అన్నమయితేనేమిరా సున్నమయితేనేమిరా- పాడు పొట్టకు అన్నమే తిందాం అన్నట్టు నేనైతే లెక్కల బుక్కే పెడతనబ్బా.. జెర మంచిగ రాకుంటే ఇంజనీరింగ్ ల రాదంట.." అన్న నేను నగుకుంట..
"పెట్టు పో పొల్లా.. నువ్వు ఇంజినీరయ్యి మీ అయ్యకిన్ని గంజి నీరు పోస్తెనే మంచిగ..పెట్టు" అన్నది సరూప మజాక్ జేస్కుంట.
ఒకటే కంపౌండుల మస్తు ఇండ్లు. అమ్మలకి పర్ఫెక్ట్ గ పనులు పంచుడు ఎట్ల దెలుస్తుండెనో.. పెద్దక్క గిట్ల పొదుగాల్నే సానిపి జల్లి, ముగ్గులేసి, తానం జేస్కోని అమ్మ ఎన్క పొయ్యి కాడ ఉందురు. బయట కట్టెల పొయ్యి చూస్కుంట బగోనెల కెంచి లీలు బక్కెట్ల బోసి, బకెట్ తీస్కపొయ్యి బాత్రూం కాడ బెట్టుడు, బాయిల నీల్లు చేదుకొచ్చి సల్ల నీల్లు బగోన్ల ఇన్ని బకెట్ల ఇన్ని పోసుడు, అందరికి తానాలకి చూసుడు నాయిన పని. ఒకొక్కల్లకి తానం చెయ్పిచ్చి కొత్తబట్టలు తొడుగుడు చిన్నక్క పని. మొగపిల్లలు తానాలు జేసినంక ఆకులు తెంపుకరానీకి అడివికి బోదురు. ఇయాల లెక్క ఒక్కొక్క ఆకు దానికొక పేరు, ఇదే ఆకు బెట్టాలె అన్నట్టేమి లేకుండె. దొరికిన ఆకులు దొరికిన కాడికి తెంపుకొద్దురు. వస్త వస్తా జెరన్ని కల్వ పూలు తెద్దురు. ఇంటికాడ ఆడివిల్లలు ఇంట్ల చెట్లకి ఉన్న పువ్వులు తెంపుతుండంగనె నాయిన పాలవల్లి గట్టి మక్కబుట్టలు, చిత్తల పండ్లు, సేపులు పువ్వులు కడుతుండె. అయి కడుతున్నప్పుడె పూజ అయినంక ఎవలెవలేదేది తీస్కోవాల్నో లెక్కలు అయితుండె. భక్షాలు గిట్ల ఎక్కువేమి చేస్కోకపొయ్యేది. పులిగోర , షామంగాలు చేసుడే మస్తు మస్తు అయితుండె. కాంపౌండుల అందరు ఆడొల్లు ఒక వారం ముందు నించే షామంగాలు జేసి గాలికి ఆరబెడుదురు. ఇంట్ల పొదుగాల పూజ అయినంక పొద్మీకి అంద్రం గుడి కాడ్నే. రెండ్రోజుల ముందు నించే గుడికెంచి ధూం ధాం పాటలొస్తుండె. పండుగ అంటె ఇట్లుండాలె అన్నట్టుటుండె ఆ పాటలు. పొదుగాల ఏందిబై లొల్లి అని గుడి పక్కపొంటి ఉన్నోల్లు అంటున్రి. యాడాదికొక్కపారి సైసకుంటే ఎట్ల అని పెద్దోల్లు తిట్టిపెడుదురు. ఒక్కొక్క రూపాయి చందా ఇయ్యనీకి చాన మందికి ఎల్లకుండె. పదిపైసలిచ్చిన మంచిదే పరమాత్ముని శావకు అనుకుందురు. పంతులు మైకుల సదువుతుండంగా ఊరంత ఇనొస్తున్న పూజలు ధూం ధాం అయితుండె. ఇంట్ల జేసుకున్నది వేరే గుడికాడి పులిగోర బుక్కుడు మస్తు మంచిగ్గొడుతుండె.
యాడాది అయితనే ఉంది.. ఏప్రిల్ల పరీక్షలయినయి జూన్ ల రిసల్టులొచ్చినయి. అంద్రం కన్న కలలన్ని ఒక్కపారి కూలినయి. గదేందో కంప్యూటరంట ఇంటరు బోరుడుల దాని తోనే లెక్కలు జేసిన్రంట. మొద్దు మొద్దు మొకాలు పాసయ్యి కూకున్రు. చాన క్లెవరని టీచర్లు మెచ్చినోల్లు, ఇస్కూలు ఫస్ట్ ఒచ్చెటోల్లు ఫెయిలయ్యిర్రు. ఇప్పటి లెక్క ఆత్మఅత్యలు లేనిదే మంచిగయింది గని.. అందరికి మనాది వట్టింది. లెక్కల బుక్కు గనేషుని కాడ బెట్టి మొక్కినోల్లకి పాసు మార్కులన్న రాకపోతయా అని పరేషాన్ అయినోల్లు అయితున్నట్టే ఉన్నరు. ఊరంత ఒకటే చెప్పుకున్నరు గిట్ల గిట్లయిందంట.. గిసొంటి పిల్లలు ఎట్ల ఫెయిలయ్యిన్రో.. గీ కంప్యూటర్ నోట్ల మన్నువొయ్య అని తిట్టుకున్రు.
ఒక దిక్కు డాక్టర్లకు, ఇంజనీర్లకు ఎంట్రెన్స్ పరీక్షలు రాసి పాసయ్యి కూసున్నోల్లకి ఇంటరు ఫెయిలవుడేందో సమఝ్ గాక తీరు తెన్ను తెల్వకపాయె. "అయ్తె మానె తియ్యి, టైలరింగు, టైప్ షాట్ హాండ్ నేర్సుకుంటె మంచిగ" అని పెద్దోల్లు సెప్పినట్టు మొకాలు కిందికి జేస్కోని టైపు ఇన్స్టిట్యూట్ ల కాడికి పోవట్టిన్రు. అయ్యొ ఇట్లాయె గనేషుడేం జేస్తుండో అని దేవున్ని తిట్టవట్టిన్రు. గుడికి పోవుడు జెర తక్వజేషిన్రు.
యనకన్ని ఎర్కనే.. ఉత్తుత్తగ జెర పెరేషాన్ జేసి నగుకుంటడని పంతులు చెప్తుండె. గది నిజమే గావొచ్చు.. ఇట్ల కంప్యూటర్ తప్పులు చేసినందుగురించెలి ఫలితాలు గల్లంతయినయని పేపర్లల్ల రాసిన్రు. మల్ల రి వాల్యూ గిట్ల చేస్తరా అని అడగనీకి మా ఊర్ల ఎవ్వలకు తెల్వకుండె, తెల్వి లేకుండె. ఇస్కూలోల్లు గుడంగ అంత పెద్ద పనులల్ల చేతి బెట్టనీకి ఉర్కులాడకుంటుండె. సర్కారు ఇస్కూలు.. "సదువుకుంటె మీకె మంచిగ సద్వకుంటె బర్రెల గాస్కోండ్రి. మా జీతాలు మాకొస్తయి" అంటుండె మా సార్లు. ఇస్కూల్ పేరు పేపర్ల రావాల్నని ఉర్కులాట ఏ ఇస్కూలోల్లకి లేకుండె. ఇగ మా సదువులాడనే ఆగిపోతయో అనుకుంటుండంగ సావనం గుడంగ దాటిపోయింది.
ఒక దినం అంద్రం అరుగు మీద కూసోని ముచ్చట్లు వెడుతుండంగ పెద్దన్న పేపర్ దీస్కోని సైకిల్ దిగి, ఆగమాగం మాట్లాడిండు. అన్నిట్ల మంచిగొచ్చి ఒక దాంట్ల పోయినోల్లకి 3 మార్కులు గ్రేస్ ఇస్తనని పేపర్లల్ల ఏపిచ్చిండంట ఎంటీ రామారావు సారు. అగ్గ చూసిన్రా మా గనేష్ దేవుని మహిమ ! గనపతి బప్ప మోరియా కాజా లడ్డూ మోరియా అనుకుంట, మల్లొక్క పారి లెక్కల పుస్కాలు పూజల వెట్టి ఆ యాడాది గనేష్ పండుగ జేస్కున్నంక మా ఊళ్ళె చాన మందిమి డిగ్రీ కాలేజీ గేటు తొక్కినమన్నట్టు.
కూలి పని
చిత్రం: తూలిక
17 ఆగస్టు 2022
"మరి మీ అమ్మ వాళ్ళని ఒక్క సారి తెచ్చి, ఊరంతా తిప్పి చూపించరాదూ.." బోర్ కొడుతోందని అంటున్న గౌతం తో అన్నాను. "అంటే, పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు కదా పిన్నీ కుదిరితే పెళ్ళి చేసేసుకుని అందరినీ తీసుకొస్తే బాగుంటుంది" అన్నాడు. "అలా కాదమ్మా.. అమ్మా వాళ్ళకి నువ్వొక్కడివని కళ్ళల్లో పెట్టుకున్నారు. ఇక్కడికొచ్చి నాలుగేళ్ళయింది, నీకా పెళ్ళి కుదిరితే కానీ వెళ్ళాలని లేదు. ఉద్యోగం వచ్చి స్థిరపడ్డావు. మరి వాళ్ళని తెస్తే వాళ్ళ ఇల్లు అన్నట్టు సొంతంగా తిరుగుతారు కదా. అమ్మ ఎంత కలవరిస్తోంది" అన్నాను. 'ఇదే విషయం మా ఓనరు ఆంటీ కూడా డిస్కస్ చేసారు పిన్నీ, ఇప్పుడు తేవడం అనవసరమైన ఖర్చు, ఇంకా కొద్దిగా సెటిల్ అయ్యాక తేవడం బెటర్ అన్నారు" అన్నాడు. నాకు ఒక నిమిషం ఆవిడెవరో చూడాలనిపించింది. "అవుననుకో కానీ పెళ్ళయ్యాక నీకు ఆఫీసు, ఇల్లు, కాక ఆ అమ్మాయితో గడిపే సమయం అవసరం కదా? అప్పుడు అమ్మా వాళ్ళని తిప్పడానికి అంతగా సమయం ఉండదు" అన్నాను. "అలా కాదు పిన్నీ అమ్మా నాన్న ఉంటే మాకు కాస్త ఇంటి పనుల నించి వెసులుబాటు కదా మేము ఫ్రీ గా ఉండచ్చు" అన్నాడు. నాకు సాధారణంగా తక్కువగా ఉండే రక్తపోటు తారస్థాయికి చేరింది. వాళ్ళు మాకు దూరపు చుట్టాలు కాబట్టి వాళ్ళ తలితండ్రుల గురించి బాగా తెలుసు నాకు. వాళ్ళకి చుట్ట పక్కాలు అక్కరలేదు, గుడిగోపురాలక్కరలేదు, సినిమా షికార్లు అక్కరలేదు..ఈ పిల్లాడొక్కడే..వీడు ఆ అంటే ఆ.. ఊ అంటే ఊ అన్నమాట. నేను ఇంక మాట్లాడకుండా అన్నం వడ్డించా మౌనంగా.
మర్నాడు లంచి సమయంలో కొలీగ్ ముఖర్జీ కబుర్లు చెప్తూ "మా పారుల్ స్నేహితురాలు కమలిని తెలుసు కదా మీకు? వాళ్ళ ఇంటికి వెళ్ళాము రాత్రి, వాళ్ళమ్మ గారు వచ్చి ఆరు నెలలు కావొస్తోంది. వెళ్ళిపోయే ముందు ఒక సారి చూసొచ్చాము" అన్నాడు. "ఓహో బాగున్నారా ఆవిడ? ఆ మధ్య ఆరోగ్యం బాలేదన్నారు కదూ" అన్నాను. "ఏమి బాగులే తల్లీ.. ఆవిడ ఒక్క నిమిషం కూచుంటే ఒట్టు, కమలి మంచి నీళ్ళు కూడా తెచ్చుకోదు. అన్నీ ఆవిడనే అందించమని అడుగుతుంది. ఎంత సిజేరియన్ అయితే మాత్రం ఇంత చేటా? పారుల్ కి నాకు చచ్చే సిగ్గేస్తుంది వాళ్ళింటికి వెళ్ళాలంటే, ఎవరు వెళ్ళినా, పని ఆవిడకే, ఆవిడ వెళ్ళిపోతే తనకి కష్టమని, ఎక్ష్టెండ్ చేద్దామని కమలి ప్రయత్నిస్తోంది" అన్నాడు. "అయ్యో.. ఆవిడకి ఇంకెవరూ లేరు కదా మళ్ళీ వస్తారా" అనడిగాను. "రాదుట. పూర్తిగా అలిసిపోయానని చెప్తూనే ఉంది, తల్లిని అలా ట్రీట్ చెయ్యడం చూస్తే మా ఇద్దరికీ తెగ చిరాకు, కానీ కొలీగ్ కదా ఏమనగలము" అన్నాడు ముఖర్జీ. గౌతం సంభాషణ చెప్పాను. హరే రామా అని తల కొట్టుకున్నాడు. ముఖర్జీది, అతని భార్య పారుది కూడా చాలా మెత్తని మనసులు. అతని తల్లి ఉన్నప్పుడు పారుల్ ఒక్క పని కూడా చెప్పకుండా చూసుకుంటుంది. ఆవిడని ఇక్కడే ఉంచేసుకుని జాగర్తగా చూసుకోవాలని వాళ్ళిద్దరూ అనుకుంటారు కానీ, వాళ్ళ అమ్మకి ముఖర్జీ 11వ సంతానం. పెద్ద అన్నగారు తల్లిని అలా వదలడానికి ఒప్పుకోడు. ఎప్పుడో ఒకసారి బాగా బతిమాలితే పంపిస్తాడు "అమ్మ అన్ని గంటలు ఫ్లైట్ లో ఎలా కూచుంటుంది? ఆలోచించవా " అని కోప్పడుతూ. "మాకు అమ్మని ఉంచుకునే అదృష్టం లేదు. పారుల్ వాళ్ళమ్మ మంచం మీదే కదా? ఆవిడని ఎంత ప్రయత్నించినా తేవడం కుదరలేదు. తను పాపం ఏడుస్తూ ఉంటుంది" అన్నాడు ముఖర్జీ.
"మీలా అలోచించేవాళ్ళు కోటికొకరు ఉంటారు భయ్యా. ఈ మధ్య ఎవరైనా పేరెంట్స్ ని తెచ్చారంటే అమ్మాయిలయితే వాళ్ళు కడుపుతో ఉండడం వల్ల, అబ్బాయిలు అయితే తన భార్య కానుపు సమయం వల్ల. పెళ్ళి కాక ముందో పిల్లలు పుట్టే ముందో అమ్మ నాన్నలని తీసుకొచ్చే వాళ్ళని వేళ్ళ మీద లెక్కించవచ్చు కదా" అన్నాన్నేను. "అలా తెచ్చేవాళ్ళంటే నాకెంత గౌరవమో.. కానీ అలా పిలిచి అభినందిద్దామంటే ఒక్కరూ దొరకట్లేదు. మొన్న కమ్మ్యూనిటీ గ్రూప్ పిక్నిక్ కి పిల్లల పురుళ్ళ కోసం ఇక్కడికి వచ్చిన తలితండ్రులు చాలా మంది వచ్చారు. అందరూ ఒకచోట కూచుని మాట్లాడుకుంటున్నారు. ఒక్కరూ మళ్ళీ రావాలని ఉద్వేగత కనబరచలేదని చూసి చాలా బాధ అనిపించింది" అన్నాను. "అవును తెలుసా.. కొందరు అమ్మా నాన్న వచ్చిన ఆరు నెలల్లోనే ఎంతో కొంత సంపాదిస్తే మంచిదని పక్కింటి పిల్లలని బేబీ సిట్టింగ్ పెట్టడమూ, కొన్ని డెలికసీస్ వండించి అమ్మడం చేస్తున్నారు, కడుపు మండిపోతోంది. మా బెంగాలీలలో మరీ" అన్నాడు. " ఏమో ముఖర్జీ, అందరూ అలా కాదులే.. చక్కగా చూసుకునే వారు లేకపోలేదు కానీ దురదృష్టవశాత్తూ, మనకి దొరికిన గుప్పెడూ అలా కనబడ్డారు ఖర్మ, ఏం చెయ్యలేము" అన్నాను కొద్ది తేలిక పరుస్తూ.
"ఇన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ పెడుతున్నారు కదా, స్టూడెంత్స్ స్టూడెంత్స్ గా ఉన్నప్పుడే పేరెంట్స్ ని తీసుకొచ్చి, బాగా చూసుకుని అన్నీ తిప్పి చూపిస్తే, వాళ్ళకి ట్యాక్స్ డిడక్షన్ ఇస్తే బాగుంటుంది కదూ" అన్నాడు. "అవును ప్రయత్నిద్దామా" అన్నాను మాటలు ఉచితమే కదా మాట్లాడేవి కొంచెం ఘనంగా మాట్లాడితే తప్పేముందనుకుంటూ.
గులాబీ గుచ్ఛము
చిత్రం: తూలిక
10 ఆగస్టు 2022
"ఇవాళ షెర్రీ వాళ్ళు డౌన్ టౌన్ వెళుతున్నారు. వాళ్ల పెళ్లి రోజు కదా" అంది ఆనబెల్. "ఎన్ని రోజుల కోసం ?" అనడిగాను కొంచెం దూరంలో ఎక్కడికైనా వెళ్ళచ్చు కదా అని మనసులో అనుకుంటూ. "ఇవాళ ఆఫీస్ అయ్యాక హోటల్ కి వెళ్ళి, మళ్లీ పొద్దున్నే ఎవరి ఆఫీస్ కి వాళ్ళు వెళ్ళిపోతారు" అంది. ఈ దేశాల్లో ఎవరినీ వ్యక్తిగత ప్రశ్నలు అడక్కూడదని ఊరుకున్నా కానీ, ఆనబెల్ చెప్పిన వివరాలు విని, ఇదేమిటి? కొన్ని గంటల కోసం అంత ఖర్చు ఎందుకు? అని నాకు కొచ్చన్ల మీద కొచ్చన్ లు. ఆవిడ చెప్పిన లెక్క అంతా కేవలం కొన్ని గంటల కోసం అంతే! పదిగంటలన్నా లేదు! అయినా పూర్తి రోజుకి చార్జ్ చేస్తాడు, వేస్ట్ కదా? అమ్మో ఎంత ఖర్చో! డౌన్ టౌన్ లో హోటల్ అంటేనే బాగా ఎక్కువ. ఇంక వాలెంటైన్స్ డే లాంటి ఇలాంటి రోజుకి ఇటో వారం అటో వారం చెప్పనే అక్కర లేదు. ఉమ్మడి కుటుంబంలో ఉండి ప్రైవసీ దొరక్క వెళుతున్నారా అంటే అదీ కాదు. జేసన్ చదువుకుంటూ విద్యార్థిగా వచ్చాడు. అతని కుటుంబమంతా ఫిలిప్పైన్స్ లోనే. గత సంవత్సరం పెళ్ళి చేసుకుని, ఈ మధ్యే కొత్త అపార్ట్మెంట్ కొనుక్కున్నారు ఇద్దరూ. డబ్బు ఎక్కువైతే ఏం చేసుకోవాలో తెలియదేమో అనుకున్నా సరదాగా.
మా ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్ తలుపుకి దగ్గరగా నా డెస్కు. పని చేసుకుంటుండగా తలుపు దగ్గర తచ్చాడుతున్నారెవరో. షిప్పింగ్ ఏరియా మిస్ అయి ఇటు వచ్చేస్తారు ట్రక్ డ్రైవర్లు ఒక్కోసారి. కాబట్టి, షిప్పింగ్ కి దారి చూపిద్దామని వెళితే పూల బొకే తో ఫ్లవర్ షాప్ నించి పిల్లోడు. "ఇమరు" కోసం వచ్చాయి పూలు, ఇంకాసేపట్లో డయానా కోసం పూలు డెలివరీ చేసాడు ఇంకో పిల్లోడు. 11.30 అవుతుండగా ఆనామరియా భర్త నించి ఫోన్ వచ్చిందిట. "ఇద్దరం లంచ్ డేట్ అనుకున్నాం ఇవాళ, కాస్త లేట్ గా వస్తా మ్యానేజ్ చేసేస్తావుగా" అంటూ పరిగెత్తింది. ఈ నగరానికి ఏమయింది అన్నట్టు అయోమయంగా చూసాన్నేను.
ఏమిటీ పిచ్చి అసలు.. ఏదో తలా తోకా లేనోడెవడో పెట్టుకున్న రోజుకి ఇంత పడిపోతారా జనాలు. అమ్మో అమ్మో చిన్న చిన్న జీతాల వాళ్ళు కూడా ఇంత ఖర్చు ఎలా పెడుతున్నారు? ఇవన్నీ పెడితే మా భవానికి కీమోలన్నీ అయిపోవూ.. డబ్బులేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తోంది పాపం అనుకున్నా ఉస్సూరంటూ.
లంచ్ టైం అవడం తో మా సీతయ్య నించి ఫోన్.. పోస్ట్ డబ్బా చెక్ చేసావా అని. తను ఆ మధ్యే అమెరికాలో ఉద్యోగం అని వెళ్ళారు. మొత్తం వీధికి కలిపి వీధి మొగన ఉంటుంది పోస్ట్ డబ్బా. ఎవరి ఇంటి నుంబర్ ఉన్న డబ్బా కి ఆ డబ్బా తాలూకు తాళాలు ఇస్తారు ఇల్లు కొనుక్కున్నప్పుడే. పోస్ట్ మాన్ ఇల్లిల్లూ తిరక్కుండా ఎవరి ఉత్తరాలు వాళ్ళ డబ్బాలో పడేసి పోతాడు. ఆ తాళం పట్టికెళ్ళి ఎవరి ఉత్తరాలు వాళ్ళు తెచ్చుకోవాలి. ఉత్తరాలు తెచ్చుకోవడం ఎప్పుడైనా ఆలస్యం అయిందంటే, ఏ కరెంట్ బిల్లో కట్టడం ఆలస్యం అయిపోతుందని మా సీతయ్యకి టెన్షన్. అన్నీ లెక్క ప్రకారం జరిగిపోవాలి అనుకునే మనిషి కాబట్టి పోస్ట్ చెక్ చేసామో లేదో అని నన్ను చెక్ చేస్తూ ఉంటారిలా. 'అబ్బా.. రోజూ ఒకటే ప్రశ్నా" అని నీరసంగా నిట్టూర్చి, "ఇవాళ మా ఆఫీస్ లో ఎన్ని వింతలు జరిగాయో తెలుసా? అదేదో ప్రేమికుల రోజుట, ఆనబెల్ కూతురు షెర్రీ వాళ్ళు ఒకే ఒక పూట కోసం డౌన్ టౌన్ లో ఖరీదైన హోటల్ బుక్ చేసారుట. విచిత్రం ఏమిటంటే, మొన్న కొన్న అపార్ట్మెంట్ కూడా హోటల్ అంత సదుపాయం గానూ ఉంది. ఉండేదీ ఇద్దరే. పోనీ ఇంకో ఊరైనా కాదు అరగంట దూరం. అలాగే ఇమరూ కి, డయానా కి పూలు పంపారు వాళ్ళ వాళ్ళు వింతగా. ఇమరూ ని డ్రాప్ చేసి ఇంకా గంట కూడా కాలేదు, అవేవో ఇక్కడికి వచ్చేటప్పుడు కొనడమో, ఇంటికి వెళ్ళాక ఇవ్వడమో చెయ్యచ్చు కదా? డెలివరీ చార్జెస్ అదిరిపోతున్నాయి ఇవాళ! ఆనమరియాని వాళ్ళ ఆయన లంచికి తీసుకెళ్ళాడు ఇప్పుడొచ్చి. ఇవన్నీ ఏంటో విచిత్రం గా ఉన్నాయి. అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. మనకి చాలా విషయాలు తెలియవు తెలుసా" అన్నాను తెలియని కొత్త విషయాలేవో తెలుసుకున్న శాస్త్రజ్ఞురాలిలా. అవును నేర్చుకోవాలి అంటూ ఫోన్ పెట్టేసారు సీతయ్య.
ఒక అరగంటలో మళ్ళీ మొదట వచ్చిన పూల అబ్బాయి ఆఫీసు ఎంట్రన్స్ దగ్గర వేచి చూస్తూ కనిపించాడు. తలుపు దగ్గరికి వెళ్ళగానే 8 గులాబీలున్న గుత్తిని, చిన్న గుండెకాయ లాంటి ఎర్రసీసాలో పెట్టి నా పేరుతో వచ్చిందని నా చేతిలో పెట్టి పోయాడు. డెస్క్ దగ్గరకొచ్చి కూచోగానే బ్యాంక్ జాయింట్ అకౌంట్ నించి డబ్బు కట్ అయినట్టు మెసేజీ. చూస్తే.. ఫ్రెష్ ఫ్లవర్స్ షాప్ కి 185.73 డాలర్లు చెల్లింపు జరిగినట్టు వచ్చింది. గుండె ఆగిపోయింది నాకు. 8 పువ్వులకి 185 డాలర్లా.. వామ్మొ వామ్మొ అని మండే గుండెల్ సినేమా చూసినంత మసిలిపోయా. సీతయ్యకి ఫోన్ చేసి చెడామడా తిట్టిపోసా. " ఏమీ ఫర్వాలేదు, బంతిలో బలపక్షంలా ఆఫీసులో అందరికీ పూలు వస్తే, నీకెందుకు రాకూడదు. కొత్త సంప్రదాయాలు ఉంటే, మనమూ ఫాలో అవుదాం తప్పేముంది? అయితే, పూల షార్టేజ్ ట ఇవాళ. ఆ ఎనిమిది పువ్వుల గుత్తులే ఆఖరున మిగిలాయి అన్నిచోట్లా. చాలా దుకాణాలు వెతికా తెలుసా ఆన్లయిన్ లో. మధ్యాహ్నంకల్లా అన్నీ ఖాళీ అయిపోయాయిట. లకీగా ఇవన్నా దొరికాయి" అన్నారు కులాసాగా. నాకు మా భవాని గుర్తొచ్చి ఏడుపొచ్చేసింది. అందరం తలో చెయ్యీ వేస్తే కాన్సర్ ఆపరేషన్ జరిగింది మొన్న వారం. ఇంక 8 కీమోలకి ఒక్కో దానికి పదేసి వేలు, కొన్ని రేడియేషన్లూ మిగిలి ఉన్నాయి. అవి అయితే కానీ తను బయటపడ్డట్టు కాదు మరి. మనసంతా చేదు తిన్నట్టయి, థాంక్యూ అని చెప్పి పెట్టేసా.
మర్నాడు ఆనబెల్ చెప్తోంది " పిల్లలని చూసి చాలా నేర్చుకోవాలి అసలు. మన జెనరేషన్ కి తెలియని ఎన్ని కొత్త సిద్ధాంతాలో! షెర్రీ వాళ్ళు కొత్త ఇంట్లో ఇద్దరే ఉంటున్నప్పటికీ, రోజూ ఉండే ఇంట్లో అంట్లు తోమాలా బట్టలు ఉతకాలా అని పనులు గుర్తొస్తాయి తప్ప సంతోషంగా అన్నీ మరచిపోయి ఉండలేము కదా? అందుకే ప్రత్యేక దినాలు వచ్చాయంటే వాళ్ళు ఒక్క పూట కోసమైనా సరే, ఇంటికి పది అడుగుల దూరంలో ఉన్నా సరే, హోటల్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. చూడు అప్పుడే దింపి వెళ్ళిన జాషువా పూలు పంపితే ఇమరూ ఎంత ఆశ్చర్య పోయిందో.. సాయంత్రం కలిసి భోజనం చెయ్యడం మామూలే, కానీ ఎవరైనా ఆఫీస్ దగ్గరికొచ్చి మధ్యాహ్న భోజనానికి తీసుకెళితే అది ఎంత ప్రత్యేకత కదా మరి" అంది.
నాకు అవన్నీ బుర్రకి ఎక్కలేదు.. 8 పువ్వులు, డొక్కు హార్ట్ షేప్ సీసా, 185 డాలర్లు.. అంటే దాదాపు వారం జీతం..ఒకవేళ అటు పంపి ఉంటే, భవానికి ఒక కీమో ఖర్చు.. అదే గుర్తొస్తోంది మాటిమాటికీ ..
"థింక్ హై" అంటోంది ఆనబెల్. అలా థింక్ చెయ్యాలంటే మనమో మనసో ధనవంతులు అయి ఉండాలేమొ అనుకున్నా చిరునవ్వు చెదరకుండా జాగర్త పడుతూ!












