విలువ
Thursday, April 20, 2023
12 ఏప్రిల్ 2023
ఒక ప్రాజెక్టు కోసం సింగపూర్ వెళ్ళిన నిరాల్ పటేల్, భారతి ప్రేమలో పడ్డారు. తలితండ్రులని ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. అప్పటి నించి, జపాన్, థాయిలాండ్ లాంటి అనేక దేశాలు తిరిగి చివరగా అమెరికాకి వచ్చి చేరారు.
భారతి మాట ఏమో కానీ, నిరాల్ కి మాత్రం గుజరాతీ భాష మీద చచ్చేంత మమకారం. ఈ వంకతో అత్తగారొచ్చ్హి, పిల్లాడికి దగ్గర అయిపోతారని భారతికి కాస్త అపనమ్మకం. పిల్లాడికి గుజరాతీ భాష నేర్పించే సవాలే లేదంది. సందులో సందు, పిల్లాడికి మాటలు రావడం కొద్దిగా లేట్ అవడంతో, అన్ని భాషలు మాట్లాడి పిల్లాడిని కన్ ఫ్యూస్ చెయ్యద్దని డాక్టర్ చెప్పడంతో ఆ సలహా ఎంత వరకూ పనికొస్తుందని ఆలోచించకుండా ఇద్దరూ ఆంగ్లానికి ఫిక్స్ అయిపోయారు.
ఇప్పటి దాకా సుఖంగా సాగిన వారి జీవిత నౌకకి అమెరికా రాగానే చిన్న చిల్లు పడింది. దానికి కారణం మీరా. భారతి కొలీగ్. ప్రతి సోమవారం ఆఫీస్ కి వచ్చేటప్పటికి నిన్న ఏం చేసారు? అని మొదలు పెట్టి, పులిహోర, బొబ్బట్లు, చేపల పులుసు, రొయ్యల వేపుడు లాంటివేవో ఆ వారం చేసుకు తిన్నట్లు చెప్పి, చిన్నప్పుడు ఇంట్లో వంటావిడ చేసే వంద రకాల రుచులని గుర్తు చేస్తుంటుంది భారతికి. అవి తినేసి శని ఆది వారాల్లో మధ్యాహ్నాలు గుండమ్మ కథ, మల్లీశ్వరి లాంటి సినిమాలు చూస్తామని, తన భర్త రవికి పాత తెలుగు సినేమాలు ఇష్టమని చెప్తూ ఉంటుంది. "గుజరాతీ వంటల్లో చెక్కర వేస్తారని, చప్పచప్పగా ఉంటాయని నాకు నచ్చవు, ఆంధ్రా వంటల ఘాటు తన వల్ల కానే కాదని అంటాడు నిరాల్" అంది భారతి. అలా ఇప్పటి దాకా తెలుగు/ గుజరాతీ వంటలు వదిలేసి, ఇద్దరివీ కాని సీరియల్స్, బ్రెడ్డూ, జాం, సాండ్విచ్, చికెన్ బిర్యానీ, మిక్సుడు వెజిటబుల్ రైస్ మొదలైన వాటితో సర్దుకుంటున్న భారతికి మెల్లిగా ఒక అసంతృప్తి మొదలయింది. ఇద్దరం ఒకేభాష మాట్లాడుకుంటూ, ఒకే రకం తిండి ఇష్టపడుతూ, ఒకే భాషలో సినిమాలు చూసుకుంటూ ఉంటే జీవితం స్వర్గం కదా! ఆహా ఆహా.. మీరాది ఎంత చక్కని జీవితం! అని అసురు ఉసురు అనిపిస్తోంది భారతి మనసు. ఒకోవారం గడుస్తున్నా కొద్దీ ఇదీ అని చెప్పలేని అగడ్ బగడ్ బాధ ఎక్కువవుతూ వస్తోంది.
ఈ లోపు ఉగాది పండుగకి తెలుగు అసోసియేషన్ వాళ్ళ ప్రోగ్రాం కి వస్తావా అనగానే ఎగిరి గంతేసింది భారతి. చక్కటి తెలుగు భోజనం, చాలా ఏళ్ళ తర్వాత తెలుగు పాటలు, సినిమా డ్యాన్సులు.. జానపద నృత్యాలు.. ఆహా ఓహో అనుకునే లోపు ఇంత గందరగోళం, అంత గట్టి చప్పుళ్ళు అలవాటు లేను పిల్లాడు గుక్క పట్టి ఏడ్చాడు. ఒక సుదీర్ఘ నాటిక కామెడీకి అందరూ పకపకా నవ్వేస్తుంటె, భాష అర్థం కాని నిరాల్ కి విసుగ్గా ఉంది. "నేను బయట నించుంటా, నాటిక అవగానే వచ్చెయ్" అంటుంటే విని "ఏంటీ నిరాల్ కి తెలుగు రాదా?" అని ఆశ్చర్య పోయింది మీరా. "పోనీ నువ్వైనా గుజరాతీ నేర్చుకున్నావా" అని అడిగితే, లేదని, అలా వద్దు అనుకున్నామని చెప్పింది భారతి కొంచెం దిగులుగా. "అందుకేనా మీ పిల్లాడు అలా మందకొడిగా ఉన్నాడు.. ఎవరికి పుట్టిన బిడ్డవిరా అంటే ఎక్కి ఎక్కి ఏడ్చాడుట" అనేసి, గబుక్కున సారీ చెప్పేసింది మీరా. "ఫర్వాలేదులే.. అయినా వాళ్ళ భాష నాకెందుకు , తనకీ మన భాష మీద అంత ఆసక్తి లేదు" అంది కాస్త దెబ్బ తిన్నట్టు మీరాకి తెలిసేలా.
కార్యక్రమం జరుగుతున్నా కొద్దీ, ఒక దానికంటే ఇంకోకటి బాగున్నట్టు ఉత్సాహంగా సాగుతోంది. ఎంత సేపటికి భారతి బయటికి రాకపోవడంతో లోపలికి వచ్చిన నిరాల్ భారతి ఉత్సాహం చూసి, తను కదలదని తెలుసుకుని, పిల్లాడిని ఊరుకోబెడుతూ బయట ఇంకో గంట సేపు తిరిగాడు. భారతికి ప్రోగ్రాం మధ్య వదిలి వెళ్ళాలని లేదు. ఇంకో గంట బయట తిరిగి, "పిల్లాడికి నిద్దరొచ్చేస్తోంది ఇంటికి వెళ్ళిపోతున్నా" అని ఫోన్ కి మెసేజ్ చేసాడు నిరాల్. "నిరాల్ వెళ్ళిపోతాడుట..వెళ్ళనీ..తనకి తెలుగు రాదు ఎలాగూ. నేను ఊబర్ తీసుకుంటాలే" అంది మీరాతో. "మరి నీకు గుజరాతీ వచ్చా? వాళ్ళ వాళ్ళు ఇంగ్లిష్ మాట్లాడగలరా? వాళ్ళతో నీ కాన్వర్సేషన్ ఎలా?" అని అడిగిన మీరాతో.. "వాళ్ళ భాష ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు, బోర్" అనేసింది సింపుల్ గా భారతి. "భారతీ, మీకు పెళ్ళయి ఐదారేళ్ళు అయి ఉంటుంది. ఇలా ఉంటే, భవిష్యత్తులో జీవితం బోర్ కొట్టదా? మాకు పెళ్ళయి 20 ఏళ్ళు అయింది. నువ్వు నమ్మవేమో కానీ మా వారు మళయాళీ.. ఎంతో ఇష్టంగా తెలుగు నేర్చుకున్నారు" అనగానే అవాక్కయింది భారతి. "మరి నువ్వు?" అంది ఆశ్చర్యంగా. "తను మన భాష నేర్చుకుంటే, నేనూ నేర్చుకోవాలిగా మరి! ఎక్కువ సమయం పట్టనేలేదు. నేర్చేసుకున్నా. కొత్తల్లో కొంత ఇబ్బంది పడ్డా కానీ, ఇప్పుడు మా అమ్మ నాన్నలు వచ్చినా, వాళ్ళ బంధువులు వచ్చినా చాలా ఈసీ అయిపోయింది. మేము మొదటినించీ ఒక నెల మొత్తం వారాంతాల్లో తెలుగు వంటలు చేసుకుని, తెలుగు సినిమాలు చూస్తాము. నాకు వచ్చినవి, తనకి నచ్చినవి చేస్తాను. ఇంకో నెల మలయాళీ వంటలు, మళయాళీ సినిమాలు.. రవి చేస్తారన్నమాట" అంది. "తను నన్ను మొత్తంగా ప్రేమించాడుట భారతీ.. భాష, పద్ధతులతో సహా.. తన నించి ఆ మంచి సుగుణం నేనూ నేర్చుకున్నా.. ఇప్పుడు పిల్లలు మూడు భాషలూ హాయిగా మాట్లాడేస్తారు" అంది మాట పొడిగిస్తూ. "అంటే మా బాబుకి ఒకే భాష నేర్పమని డాక్టర్ చెప్పారు" అని భారతి అనగానే, "అమ్మాయ్, ఒక డాక్టర్ మాటకి ఇంత విలువ ఇస్తున్న మీరు, మీ ఇద్దరిని కని పెంచిన వాళ్ళకి విలువ ఇవ్వలేకపోతున్నారు, పిల్లాడు ఏం నేర్చుకుంటాడు మీ నించి?" అనగానే ఇప్పటి వరకూ ఆవహించిన మత్తేదో ఎగిరిపోయినట్టు, పిల్లాడి భవిష్యత్తు స్పష్టంగా కనిపించడం మొదలయింది భారతికి.
Posted by
Ennela
at
Thursday, April 20, 2023
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
ఉదయ కుంకుమ
29 మార్చ్ 2023
నా పెళ్ళి అయిన కొత్తలో ఒక ఇంట్లో మేడ మీద అద్దెకి ఉండేవాళ్ళం. వాళ్ళు కింద ఉన్న రెండు పోర్షన్లలో ఒకటి అద్దెకిచ్చి, ఇంకో దాంట్లో వాళ్ళు ఉంటూ, కొత్తగా కట్టిన మేడ మీద పోర్షన్ మొత్తం ఇల్లు అప్పు తీరేదాకా పెద్ద కుటుంబానికి అద్దెకి ఇద్దామని ఫిక్స్ అయిపోయారుట. ఆ ఇంటి యజమానులు ఇద్దరూ ఉద్యోగస్తులే . వాళ్ళకి ముత్యాల్లాంటి ఇద్దరు బుజ్జి బుజ్జి అమ్మాయిలు. భార్యా భర్తా ఆఫీసులకి వెళ్ళాక, ఈ బుజ్జి తల్లులని చూసుకోవడానికి వారి బంధువైన ఒక పెద్దావిడని తెచ్చి పెట్టుకున్నారు. ఇంటి పనీ, వంట పనీ, పిల్లల పనీ అంతా ఆవిడదే అజమాయిషీ. వాళ్ళు ఆవిడని సొంత మనిషిలాగే చూసుకునేవారు కూడా. ఆవిడకి చిన్న తనంలోనే వివాహమై, భర్త చనిపోవడంతో ఒక పిల్లాడిని పెంచుకుని, ఆ పిల్లాడు కూడా చనిపోగా, అతని పిల్లలని చదివించే బాధ్యత నెత్తినేసుకుని, దగ్గరి చుట్టాలైన వీళ్ళ ఇంట్లో ఇలా కుదిరారన్నమాట. ఏ వరసో తెలియదు కానీ, పిల్లలు పెద్దలూ అందరూ ఆవిడని పెద్దమ్మగారు అనేవారు. మేమూ అలాగే పిలిచేవాళ్ళం.
ఈ పెద్దమ్మ గారు ప్రతి రోజూ, భోజనం అయ్యాక, పిల్లలు స్కూల్ నించి వచ్చేలోపు మేడ మీదకి వచ్చి, మా అత్తగారితో కాసేపు మాట్లాడి ఆవిడకి తెలిసిన విషయాలు చెప్పి, తెలియనివి తెలుసుకుని వెళుతూ ఉండేవారు. అలా ఆవిడ చెప్పిన వాటిలో ఇంటి పెద్ద కోడలితో తప్పనిసరిగా చేయించవలసిన కొన్ని నోములు, వాటిల్లో ముఖ్యమైన ఉదయ కుంకుమ నోము. మా ఇంటా వంటా లేవని మా అత్తగారు చెప్తున్నా సరే, "అదేమంత పెద్ద విషయం జయలక్షమ్మా, కూసింత కుంకుమ తప్ప ఏమి నష్టం. పైగా పక్కింటికెళ్ళడానికి మా చిన్నప్పటిలా అర ఎకరం నడవాలా ఏంటి? నీ కోడలు రాణీ గారు అట్టా మేడ దిగి రావడమేంటి, ఇక్కడ నా కూతురు రాణీ గారు బొట్టెట్టించుకోదూ.. ఈ రెండిటికీ ఎంత అదృష్టముండాలీ. నాకుందా, నీకుందా ఆ అదృష్టం...." అన్నారు కళ్ళనీళ్ళు పెట్టుకుని, దుఃఖంతో గొంతు జీర పోతుండగా. ఆ సెంటిమెంట్ తో మా అత్తగారు నేను కాలేజ్ నించి వచ్చేసరికే, నోమి నోమన్నలో నోమన్నలాలో చందామామా చందామామా అని సంతోష పడి పోతూ, పెద్దమ్మ గారు చెప్పిన వస్తువులన్నీ తెప్పించి పెట్టారు.
ఇక అక్కడి నించీ అన్నీ పెద్దమ్మ గారి అనుజ్ఞతో జరిగినవే. సాయంత్రం పండూ తాంబూలం తీసుకుని, కుంకుమ భరిణ పట్టుకుని, మా ఆడపడుచు తోడురాగా, నెమ్మదిగా మెట్లు దిగి, పెద్దమ్మ గారి కూతురుగారైన (సొంతం కాదు, తెలుసుగా) ఇంటి యజమానురాలు రాధని పిలిచి, "రేపటి నుండి నేను చేసే ఉదయ కుంకుమ నోముకి మీకు బొట్టు పెట్టే భాగ్యాన్ని కలగజేయండి" అని వారు చెప్పిన మాటలు వల్లించి, ఆవిడకి బొట్టు పెట్టి, తాంబూలం ఇచ్చి, కాళ్ళకి దణ్ణం పెట్టి వెనుతిరిగాము. ఆవిడ కూడా ఆ నోము ఫలితం పెద్దమ్మగారి నోటి నుండి విని, "అబ్బ ఎంత సంతోషంగా ఉందో, చదువుకున్న పిల్లలు కూడా ఇలాంటి నోములు నొయ్యడం, అదీ నాకు ఇలాంటి భాగ్యం కల్పించడం నా జన్మ ధన్యం" అని చాలా ఇదయింది కూడా.
అగ్గడ్ బగ్గడ్ నించి ఆచారం వరకు ప్రమోషన్ వచ్చింది నాకు. ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయా..అని వేకువనే నిద్ర లేవడం అలవాటే కాబట్టి లేచేసి, ఇల్లూ వాకిలీ (మేడ మీద కాబట్టి, గడప ఎదురు గచ్చు) ఊడ్చేసి, ముగ్గేసి, బుడుంగుమని చల్ల నీళ్ళతో స్నానం చేసేసి, కుంకుమ భరిణతో మెట్లు దిగి వెళ్ళాను మొదటిరోజు. యజమానురాలు స్నానం చేసి నా కోసం ఎదురు చూస్తూ కనిపించింది. వహ్వా.. అని మురిసిపోయా నేను. ఎందుకంటే,.. తలుపు కొట్టి పిలవాలేమో అని మొహమాటం అనిపిస్తుంది కదా మరి. అలా మొదటిరోజు విజయవంతంగా బొట్టు పెట్టి, ఇంటికొచ్చి అత్తగారితో ఆవిడ నా కోసం ఎదురు చూస్తున్న సంగతి చెప్పి, ఖుషీ చేసా.
మర్నాడు, రాధ తలుపు తీస్తూ, "ఒక నిమిషం ఆగవా స్నానం చేసి వస్తా" అని వెళ్ళింది. నేను మళ్ళీ వస్తా అనగానే, వద్దు వద్దు పదే పది నిమిషాలు అంటూ పరిగెత్తింది. నేను "అత్తయ్య వంట మొదలెట్టారు, అత్తయ్యకి సహాయం చెయ్యాలి" అంటూ మొహమాట పడ్డా కూడా తప్పలేదు. బయటకి వచ్చి చూస్తే, చెట్లు బాగా నీరసించి, అలో లక్ష్మణా అని ఏడుస్తున్నట్టు ఉంటే, కాసిని నీళ్ళు పోసి, నాలుగు పూలు కోసుకున్నా ఆవిడ వచ్చేవరకు. అలా నా ఉదయకుంకుమ నోము ఆ చెట్లకి వరమై, కళకళలాడేసరికి, ధరణీ మాత సంతసించింది. అలా మూడో రోజు మూడు సార్లు కిందకీ మీదికీ తిరగడం, నాలుగో రోజు నాలుగో సారి నేను వెళ్ళేటప్పటికి ఆవిడ ఆఫీసుకి వెళ్ళిపోవడం, ఐదోరోజు బొట్టు పెట్టించుకోకూడదు ఐదు రోజులు రావద్దు అని చెప్పడం ఇత్యాదులతో పది రోజులు గడిచి పోయాయి. పదకొండవ రోజు మళ్ళీ పొద్దున్న వెళ్ళగానే.. ఆవిడ అబ్బా అంటూ కళ్ళు నులుముకుంటూ వచ్చి "పెట్టెయ్, బొట్టు పెట్టెయ్" అంది. నేను కొంచెం అయోమయంగా చూస్తుండగా పెద్దమ్మ గారొచ్చి, "అదేమిటి తల్లీ, అలా ఉదయ కుంకుమ నోము స్నానం చెయ్యకుండా పెట్టించుకోవచ్చా? తప్పు కదూ, బంగారు తల్లివి కదూ..వెళ్ళి స్నానం చేసి రా పో" అంటూ బుజ్జగించారు. మళ్ళీ నేను చెట్లకి నీళ్ళు, పూలు తెంపుకోవడం వగైరా..
మరునాటి నించి నాకు పొద్దున్నే కిందకి దిగడం తెగ మొహమాటం వేసేది. అసలు తలుపు కొట్టి ఆవిడని పిలవడం అన్న ఊహకి రాత్రిళ్ళు నిద్ర పట్టడం కూడా మానేసింది. అలా అని అత్తగారితో "ఇలా పొద్దున్నే వెళ్ళినప్పుడు ఆవిడ విసుగ్గా చూస్తోంది" అని ఎలా చెప్పడం? పైగా పెద్దమ్మగారు వ్రతం చెడకూడదని ఖచ్చితంగా చెప్పారాయె! ఇలా ఇంకెన్ని రోజులు? ఈ వ్రతం చూస్తే, ఒకటీ రెండు కాదు తండ్రోయ్.. అక్షరాలా 365 రోజులు. బెంగ వచ్చేసింది నాకు. నా గర్భంలో బిడ్డ పెరుగుతున్నా కొద్దీ, నాకు మార్నింగ్ సిక్నెస్సో, బొట్టు పెట్టడానికి అయిష్టతో తెలియక వాంతులు అయ్యేవి. "దేనికదే! బొట్టు పెట్టడం మాత్రం మానేదేలేద"ని పెద్దమ్మ గారు, "నెమ్మదిగా వెళ్ళి పెట్టేసి రా అమ్మలూ" అని అత్తగారు, "ఛీ! ఎందుకు ఒప్పుకున్నానా" అని యజమానురాలు.. "వామ్మో వామ్మో, ఇదేమి నోము రా దేవుడా! మా అమ్మ ఎందుకిలా నన్ను మేడ మీదికి పది సార్లు ఎక్కించి దించుతుంది పొద్దున్నే" అని కడుపులో బిడ్డ, "ద్యావుడా" అనుకుంటూ నేను :(
ఐదో నెల రాగానే అమ్మగారింట్లో నిద్ర చెయ్యడానికెళ్ళినప్పుడు, ఉదయకుంకుమ నోము విని మా ఇంటి పక్కన పూజారి గారి భార్య "వామ్మో! అసలే అర్భిణి, అందునా గర్భిణి, మా వంశం లో ఇంతమంది చెయ్యగా చూసా కానీ ఇలా ఎవ్వరూ చెయ్యలేదు తల్లీ" అంటూ నన్ను చూసి జాలి పడింది కూడా.
*
మర్నాడు నేను ఆటో దిగి గేట్ లోపలికి రావడం చూసిన రాధ భయంగా, విసుగ్గా, చిరాగ్గా నా వైపు చూడడం నా దృష్టిని దాటిపోలేదు. పిచ్చి తల్లీ, రేపు ఉదయాన్ని తలచుకుని నీకంటే ఎక్కువగా నాకూ అదే ఫీలింగ్ అని అనుకుని, నిట్టూరుస్తూ పైకి వెళ్ళాను.
మర్నాడు వెళ్ళేసరికి, నిద్ర మంచం మీంచి వచ్చి, "బొట్టు పెట్టెయ్ తొందరగా, మళ్ళీ పొయ్యి నిద్రపోతా" అంది రాధ. నేను గబ గబా బొట్టు పెడుతూ, పెద్దమ్మ గారు లేరా అని చూసాను. ఆవిడ లేదు అంది రాధ కొంచెం నవ్వీ నవ్వనట్టుగా. హమ్మయ్య అనుకుని పైకి వెళ్ళాను కానీ, ఈ విషయాలేమీ డిస్కషన్ పెట్టలేదు. ఆ వారం రోజులూ రాధ పెద్దగా రియాక్షన్ లేకుండా తలుపు కొట్టగానే, నిద్ర లేచి రావడం, బొట్టు పెట్టించుకోవడం హమ్మయ్య అనేట్టు ఉంది. వారంలో పెద్దమ్మ సెలవు చీటీ చెల్లిపోయి తిరిగొచ్చేసింది. పొద్దున్నే బిక్కు బిక్కుమంటూ కిందికి వెళ్ళాను. రాధ రోజూ లాగానే, నిద్ర లేచి బొట్టు పెట్టించుకుంది. "అయ్యొ అయ్యొ, పాచి మొహంతో బొట్టు పెట్టించుకుంటున్నావు. రేపు ఆ పిల్లకి ఏదైనా అయితే, ఎవరిది బాధ్యత?" అనే డైలాగ్తో నాకు ఎన్నడూ లేనంత భయం పెట్టేసారు పెద్దమ్మ గారు. వ్రతం చెడకూడదని పెద్దమ్మ మా అత్తగారికి చెప్పినందువల్ల వెళ్ళకుండా ఉండలేకనూ, అలా ఆవిడ బొట్టు పెట్టించుకోవడం వల్ల బిడ్డకి ఏమైనా అవుతుందేమో అని భయం వల్లనూ, నిద్ర లేపుతున్నాను పాపం తగులుతుందని గిల్ట్ వల్లనూ, పెద్దమ్మ చేత ఆమెని తిట్టిస్తానేమో అని బెంగ వల్లనూ, ప్రతి రోజూ తెల్లారుతుంటే నాకు దిగులు... అసలు నిజంగా దిగులు..!!
వేసవి సెలవులు అవడంతో రాధ పిల్లలని ఊరికి తీసుకెళ్ళడానికి వాళ్ళ అమ్మ వచ్చారు. ఇప్పుడు బొట్టు పెట్టించుకోవడానికి ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు. ఎవరో ఒకరు పెట్టించుకుంటారని కొంచెం రిలీఫ్. ఆవిడ, పెద్దమ్మ కాఫీ తాగుతుండగా నేను వెళ్ళడం తలుపు కొట్టడం, రాధ వచ్చి వాళ్ళ ముందు బొట్టు పెట్టించుకోవడం చూసిన పెద్దమ్మ ఏదో అనబోతూ ఆగిపోయింది. రాధ వెళ్ళి నిద్ర పోయింది. " అమ్మాయీ వెళ్ళిపోకు, మా ఊరి నించి నీ కోసం జీళ్ళు, బందరు లడ్డు తెచ్చాను, ఆగు ఇస్తాను, పాకెట్టు విప్పాలి ఐదు నిమిషాలు" అంటూ ఆవిడ వంటింట్లోకి వెళ్ళారు. "ఈ లోపు నేను ఇక్కడ పూలు కోసుకుంటానండీ అత్తగారి పూజకి" అంటూ చెట్లకి కాసిని నీళ్ళు పోసి, ముందు వైపు గన్నేరు కోసి, పక్క సందులో ఉన్న మందారాలు కోస్తున్నా. వాళ్ళ వంటింటి కిటికీ లోంచి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. " క్రమశిక్షణ నేర్పించమన్నాను కాదూ అక్కయ్యా.. ఈ ఉదయ కుంకుమ నోముతోనైనా కాస్త పొద్దున్నే లేచి స్నానం సంధ్య చేస్తుందని కదూ నీకు ఈ ఏర్పాటు పురమాయించిందీ... అదలా పాచి నోటితో బొట్టెట్టించుకుంటుంటే చూస్తూ ఊర్కున్నావేం.. నీ అండ చూసుకుని ఉన్న బధ్ధకం మరీ పెరిగిపోయింది. పాపం నువ్వు మాత్రం ఎంతని చేస్తావు అక్కయ్యా" అంటోందావిడ. "ఏం చేస్తామమ్మా, నేను ఖచ్చితంగా స్నానం చెయ్యాలని పై ఆవిడకి, కింద మన పిల్లకీ కూడా చెప్పి పెట్టా, అదిగో మీ ఆడపడుచు ఫోన్ చేసింది మొన్న. ఆవిడ వత్తాసు దీనికి. అత్తగారయ్యుండి ఆవిడ తల్లి అయినట్టు, నువ్వు అత్తవి అయినట్టు ఉంటుంది నాకు. 'ఉదయ కుంకుమ నోముకి స్నానం చెయ్యడమేమిటి, బొట్టు పెట్టే ఆ పిల్లా చెయ్యక్కరలేదు, నువ్వూ చెయ్యక్కరలేదు.. అలా లేచి రావడం బొట్టు పెట్టి వెళ్ళడం అంతే' అని నేను అక్కడ ఉండగానే ఫోన్ చేసింది. ఈవిడ నన్ను చురచురా చూసింది. అప్పటి నించీ ఆ కడుపుతో ఉన్న పిల్లని అవస్థ పెడుతున్నానే అని ఒకటే మనాదిగా ఉందమ్మాయ్. పోనీ ఇప్పుడు వెళ్ళి స్నానం చెయ్యక్కరలేదు, ఫర్వాలేదని వాళ్ళ అత్తగారికి చెప్దామన్నా, నా పెద్దరికం మంటగలసి పోదూ. అసలే దిక్కూ దివాణం లేని దాన్ని" మళ్ళీ ఆవిడ కన్నీళ్ళు, గద్గద స్వరం.
హమ్మ! హమ్మా! ఆ పిల్లకి డిసిప్లిన్ నేర్పమని తల్లి చెప్పడం, ఈ పెద్దమ్మ మాస్టర్ ప్లాన్ వేసి, మా అత్తగారికి చెప్పడం, హమ్మో హమ్మో! అనుకుంటూ మండే గుండెల్ తో ఉన్న నేను కూల్ గా ఉండడానికి ప్రయత్నిస్తూ మామూలుగా "పూలు తెంపుకున్నాను అండి, నేను వెళుతున్నాను" అని చెప్పడం ఆవిడ జీళ్ళు, లడ్డూలూ నా చేతిలో పెట్టి, "పొద్దున్నే స్నానం చేసిన వారికి దేవుడు ఆయురారోగ్యాలని, బంగారం లాంటి పిల్లలని ఇస్తాడు తల్లీ, నా కూతురికి ఎలాగూ నేర్పలేకపొయ్యాను. నువ్వు మాత్రం మానకు" అని చెప్పారు కూతురి గదిలో వినపడేలా.
చేతిలో లడ్డుల వైపు చూస్తూ, రోజూ పొద్దున్నే స్నానం చేస్తున్నా కదా..బుడ్డోడు లడ్డులాగా మెరిసిపోతూ ఉంటాడేమో అనుకుంటూ మెట్లెక్కా
Posted by
Ennela
at
Thursday, April 20, 2023
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
తోడు
15 మార్చ్ 2023
చిన్న కూతురి కూతురు పావని అంటే పంచప్రాణాలు రాఘవకి. ఉన్న ఊర్లోనే కాబట్టి పుట్టినప్పటి నించీ తనని చూడని రోజు ఉండేది కాదు. వర్ధని క్యాన్సర్ తో పోరాడి చనిపోయిన తర్వాత కొద్ది రోజులు తన దగ్గర ఉండి బడికి వెళ్ళింది కూడా. పావని స్కూల్ టాపర్ అయి రాఘవకి గర్వం కలిగిస్తూ ఉంటుంది. పెద్దమ్మాయి అపర్ణ పిల్లలతో ఇంత సన్నిహితత్వం రాలేదు దూరం వల్లనేమో. అపర్ణకి చిన్నతనం లోనే దూరపు చుట్టం, భూస్వామి అయిన కేశవతో పెళ్ళి చేసారు. పాడిపంటలతో తలమునకలైన వ్యవహారాల వల్ల వాళ్ళు గంగనకుదురు అనే గ్రామం నించి అరుదుగా వచ్చి పోతూ ఉండేవారు. రెండవ అమ్మాయి రత్నని ఊళ్ళోనే గొప్పింటి వాళ్ళకి ఇచ్చి చేసినప్పటి నించీ, తనకి చదువు తక్కువ కాబట్టి, తన పెళ్ళి ఇంత ఘనంగా చెయ్యలేదని అలుక వచ్చి కేశవ భార్యని పుట్టింటికి పంపడం తగ్గించడంతో రాకపోకలు మరీ తగ్గిపోయాయి. తండ్రి ఎంత చేసినా కేశవకి మనసులో తను తక్కువ అనే భావన పోవటం లేదు. అపర్ణ సద్ది చెప్పలేక సతమతమయ్యేది. అదొక్కటే బెంగ రాఘవకి.
ఈ మధ్య కొద్దిగా అనారోగ్యం పాలయిన రాఘవని తనదగ్గరికి వచ్చెయ్యమంటుంది అపర్ణ. అత్త మామలు, బంధు బలగాలు ఉన్న పెద్ద కుటుంబం అవడం వల్ల, తను వెళ్ళి అక్కడ ఉండడం ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది రాఘవకి. అల్లుడి ముభావం వల్ల ఇంకా ఇబ్బంది. రత్న చూసుకుంటుంది కాబట్టి బెంగ పడద్దని అపర్ణకి చెప్తూ ఉంటాడు ఫోన్లలో. తన ఇంట్లోనే తనకి బాగుందని అమ్మ జ్ఞాపకాలతో గడచిపోతుందని చెప్పి, అవసరమయితే రత్న ఇంటికి వెళతానని అంటుంటాడు. ప్రస్తుతానికి రత్న వాళ్ళు రావడమే కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అతి తక్కువే రాఘవకి. భార్యం అనారోగ్యం వల్ల వండుకోవడం, పనులు చేసుకోవడం అలవాటే కాబట్టి, ఎటువంటి బాధా లేదు.
రాఘవకి వచ్చిన జ్వరం తిరగబెడుతూ, బాగా డీలా చేసేస్తోంది కొద్ది కాలంగా . వైద్య పరీక్షలలో పెద్దగా ఏమీ లేదని కొట్టిపడేసారు డాక్టర్లు. ఇంత నీరసం ఎందుకో అర్థం కాక, పిల్లలని ఇబ్బంది పెట్టలేక, ఈ విషయం ఎవరికీ చెప్పకుండా గడిపేస్తున్నాడు రాఘవ. జ్వరంతో పాటు చెక్కర వ్యాధి వల్ల రాఘవ సీరియస్ అవడం తో కూతుర్లు ఇద్దరూ పరిగెత్తుకుని వచ్చారు. భర్తని బతిమాలుకుని నెల రోజులు ఉండి, పిల్లల పరీక్షలు కాబట్టి వెళ్ళిపోతూ, తను బతిమాలినా తనతో రాని తండ్రిని తీసుకెళ్ళి ఆయన కోలుకునేదాకా చూసుకోవాలని రత్నని బతిమాలింది అపర్ణ. ఈ నెల రోజులుగా రత్నకి ఆటవిడుపు. నువ్వున్నావు కదక్కా అనేది. సరే మిగతా సమయాల్లో చెల్లెలే కదా చూసుకుంటోంది అని, తనూ తృప్తిగా తండ్రిని చూసుకుంది అపర్ణ. పావని కూడా రావడం తక్కువయింది.
అపర్ణ వెళ్ళాక రత్న కానీ, పావని కానీ రాఘవ దగ్గరికి రాలేదుట. అపర్ణ ఫోన్ చేసినప్పుడు పావని పుట్టినరోజుకి కుక్కపిల్ల కొనడానికి వెళుతున్నామని, మరునాడు తండ్రిని తెచ్చుకుంటానని చెప్పింది రత్న. తండ్రికి కుక్కలంటే ఉన్న భయం, ఇంకా చెప్పాలంటే ఎలర్జీ తెలిసిన అపర్ణ అవాక్కయింది. నాన్నకి అనారోగ్యం పొడచూపాక ఇప్పుడు కుక్కపిల్ల ఏంటని నిలదీసినా, తీసి పారేసింది రత్న.
*
కుక్కపిల్ల సింబా రత్న వాళ్ళ కుటుంబ సభ్యురాలు అయింది. పావని కూడా సింబాని 24 గంటలూ తనతో తిప్పుకుంటూ తాత దగ్గరికి రావడం తగ్గించేసింది. ఒకవేళ రత్న, పావని తనని చూడడానికి వచ్చినా, సింబా లేకుండా రావడం అరుదే. తనకి కుక్కలంటే ఉన్న ఎలర్జీ వల్ల, అది ఇంట్లో తిరిగేస్తుంటే, తెలియని ఆందోళన కలిగేది రాఘవకి. రాను రాను కూతురూ మనవరాలు రాకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉందని అనిపించేది. ఈ విషయం విన్న అపర్ణకి దుఖం ఆగలేదు. తండ్రి తన దగ్గరికి ఎలాగూ రాడు, అవసరం వస్తే రత్న దగ్గరికి వెళతాడని ఆశ ఉండేది, ఈ సింబా పుణ్యమా అని అది ఇంక కల్ల. అదే విషయం ఎన్నిసార్లో సున్నితంగా రత్నకి చెప్పడానికి ప్రయత్నించింది. కుక్కపిల్లతో కన్నబిడ్డ లాంటి బంధం పెరిగిపోతున్న రత్నకి, దాని విషయంలో నెగటివ్ గా ఎవరేమన్నా పూర్తిగా వాళ్ళతో బంధం తెంచుకునే స్థాయి వచ్చింది. తండ్రి ఇబ్బంది పడుతున్నాడు అని తెలిసి కూడా సింబా రాలేని చోటికి తనూ రానని చెప్పి, పూర్తిగా రావడం మానేసింది. పావని కూడా సింబాని వదిలి ఉండదు అని తెగించి చెప్పేసింది. రాఘవ నిజంగా బెంగ పెట్టుకున్నాడు ఈ సారి. ఊరు వదిలి వెళ్ళలేడు, ఉన్న చోట ఉండలేడు. ఈ విషయమై అపర్ణ రత్నతో గొడవపడింది చాలా సార్లు. తను తండ్రిని తీసుకెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేదనీ, తన కుటుంబ పరిస్థితికి తగ్గట్టు తండ్రి కూడా సర్దుకుపోవాలని వాదించింది రత్న.
*
రాఘవకి స్పృహ తప్పిందని అందరూ పరుగు పరుగున వచ్చారొకరోజు. ఆయన్ని ఆస్పత్రి నించి తీసుకొచ్చేరోజు, అక్కచెల్లెళ్ళ గొడవ తీవ్రమై, వాదోపవాదాలు అయ్యాక ఏడవడం మొదలెట్టింది రత్న. పాపకి బడిలో మానసికంగా ఏదో ఇబ్బంది వచ్చిందని, దాని నించి కోలుకోవాలంటే పెట్ ని కొనిమ్మని వైద్యుడు సలహా ఇచ్చాడని, పావని ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఈ విషయం తండ్రికి చెప్పద్దని చెప్పి, వెక్కి వెక్కి ఏడుస్తున్న చెల్లిని ఏమనాలో తోచలేదు అపర్ణకి.
మర్నాడు "నాన్నా, మా పిన్నత్తగారి చుట్టాలొకరికి హైదరాబాద్ లో కోర్టు పనిట, పాపం హోటల్ లో ఉండే స్తోమత లేదు. ఈ రోజు వస్తున్నారు, మన ఇంట్లో ఉండమని చెప్తే, నీకేమైనా ఏమైనా అభ్యంతరమా" అంది. తప్పకుండా రమ్మన్నాడు రాఘవ. వాళ్ళు వచ్చాక ఇంకో వారం ఉండి, వాళ్ళకి అన్నీ చూపించి వెళ్ళింది అపర్ణ. అప్పటి నించీ వాళ్ళ కోర్టు కేసు అలా వాయిదా పడుతూనే ఉంది రెండేళ్ళుగా.
ఎప్పటినించో ఏదన్నా పని ఉంటే చెప్పమని బతిమాలుతున్న ఆ జంటకి జీతం ఇస్తున్నట్టు మాత్రం ఇటు భర్తకి గానీ అటు తండ్రికి కానీ చెప్పలేదు అపర్ణ. వాళ్ళు తోడుగా ఉండడంతో తండ్రి ప్రశాంతంగా ఉన్నాడు, అది చాలు తనకి.
Posted by
Ennela
at
Thursday, April 20, 2023
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
ప్రేమ
1 మార్చ్ 2023
నూర్ ముందు బస్ స్టాప్ లో బస్ ఎక్కుతుంది. మా బస్ స్టాప్ లో బస్ ఎక్కుతున్న వాళ్ల వరుసలో నేనున్నానా అని ఆమె కళ్ళు వెతుకుతాయిట. నన్ను చూడగానే నా కోసం ఎదురుచూస్తున్నట్టు సంతోషంగా నవ్వుతుంది. ఇద్దరం కలిసి ఒక గంట ప్రయాణం చేస్తాము. బోల్డు ముచ్చట్లు ప్రతి రోజూ..
"ఏమన్నాడు మహమ్మద్? వస్తాడటనా రోజూ? నిన్న చూసాను కదా? ఎంత బాగున్నాడో అసలు హీరోలా." అన్నాను.
"నిన్న నీ దగ్గరి నించి వచ్చాక, కొంత సేపు చదివాడు రేపు పరీక్ష కదా" అంది.
"చాలా ఇంటల్లిజెంట్ తను. కాస్త దారిలో పడితే బ్రహ్మాండంగా సెట్ అవుతాడు" అన్నాను ఆశగా.
"మాషా అల్లా, అల్లా కరుణించి, నీ మాట నిజమైతే బాగుండు" అంది కొంత విచారంగా. "మారతాడులే బాధ పడకు. ఏది చెప్పినా ఇట్టే పట్టేశాడు" అన్నాన్నేను.
"వాడు పాకిస్తాన్ వెళ్ళినా ఫర్వాలేదు నాకు, అసలు బతికి ఉంటే చాలు. వెల్లిపొదామా అని ఆలోచిస్తున్నాను. కానీ రావడానికి చాలా అప్పు చేశాము కదా.."
"నువ్వెందుకు అంత డిప్రెస్ అవుతావు, అది వద్దనే కదా ఇన్ని రోజులు ఆపావు"
"అంటే నీ దగ్గర ఒక విషయం దాచాను, మొన్న ఆదివారం నిద్ర మాత్రలు వేసుకున్నాడు.." తన కళ్ళ నిండా నీళ్ళు.
"వ్వాట్? ఏమంటున్నావు నువ్వు? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారా"
"లేదు, అదృష్టం కొద్దీ వాడంతట వాడికే మెలకువ వచ్చింది. నా మీద ఒట్టేయించుకున్నా అలాంటి పనులు చెయ్యద్దని. ఆ గిల్ట్ వల్లనే మొందెన్ని సార్లు చెప్పినా వినని వాడు, నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చాడు. నువ్వు షార్ట్కట్ గా పరీక్షకి కావలసినవి చెప్తావని నచ్చజెప్పి పంపాను. చాలా షుకురియా. అల్లా భలా కరే. విడిగా ట్యూషన్లూ అవీ పెట్టించే పరిస్థితి లేదు" అంది.
"నేను విడిగా ఫేవర్ చేస్తున్నదేమీ లేదు నూర్. పిల్లలకి చదువు చెప్పే టైమే కాబట్టి, మా ఆదిత్య కూడా అకౌంటింగ్ తీసుకున్నాడు కనక కలిసి చదువుకోవచ్చు . గమ్మత్తేమిటంటే, రెండేళ్ళ నించీ ఒకే తరగతిలో చదువుతున్నా, నిన్ననే మొదటి సారి కలిసినట్టు మాట్లాడుకున్నారు ఆదిత్య, మహమ్మదు. మహమ్మద్ ఎవరితోనూ కలవడుట. క్లాస్ అయిపోతూనే వెళ్ళిపోతాడు అని చెప్పాడు ఆదిత్య. ఇక నించీ సాకర్ ఆడడానికి పిలవమని చెప్పా."
"అవును సైతాను పట్టింది వాడికి! కెనడా వచ్చాక ఒక నిమిషం కులాసాగా ఉండనివ్వలేదు నన్ను.. ప్రాణం పోతోందసలు. అయినా ట్యూషన్ టీచర్ ని పెళ్లి చేసుకోవడమేంటి నువ్వు చెప్పు. అప్పటికి వీడికి ఇంకా 15 ఏళ్ళు కూడా లేవు. ముఖంలో పసితనం ఉన్నా, ఎత్తుగా, అందంగా పాతికేళ్ళ పైన ఉన్నట్టు కనబడతాడు. ఆ పాతికేళ్ళ అమ్మాయికి వీడి వయసు తెలిసినట్టు లేదో, తెలిసినా పట్టించుకోలేదో మరి అల్లాకే తెలుసు. చదువు పాడయిపోయింది. స్కూల్ మాని ఆ పిల్ల దగ్గర కూచోడం. చిన్న మాట అన్నా ఇంట్లోంచి పారిపోవడం. మొదట కెనడా పీ ఆర్ వచ్చినా, వద్దనుకుని పెద్దావిడని చూసుకుంటూ ఉండిపోయాము. వీడివల్ల ఆవిడని చావు మంచం మీద వదిలి రావలసి వచ్చింది. తలచుకోడానికే సిగ్గుగా ఉంటుంది. తోటికోడలు బావగారు చాలా మంచివారు కాబట్టి, ఇలా కొత్త దేశం అయితే మార్పు వస్తుందని, అత్తగారిని వాళ్ళు చూసుకుంటామని చెప్పి మమ్మల్ని పంపారు పాపం. అసలు ఎంత మంచి వాళ్లో తెలుసా. నా సొంత తోబుట్టువులు కూడా ఇంత ఆలోచించరు"
"అవును అలా సహాయం చెయ్యడం అదృష్టమే..వాళ్లు అన్నది నిజమే. Out of site out of mind అంటారు కదా మర్చిపోతాడులే.. ఇంకా పసితనం అంతే" అన్నాను.
"ఏమొనబ్బా. ఇంట్లో ల్యాండ్ లయిన్ లో ఇన్టర్నేషనల్ కాల్స్ పెట్టలేదు. వాళ్ల నాన్న సెల్ ఫోను, కాలింగ్ కార్డ్స్ ఉంటే తప్ప పాకిస్తాన్ కి ఫోన్ చేసే అవకాశం లేదు కదా? మరి ఎలా ఫోన్ చేస్తున్నాడో తెలియట్లేదు. వీడు ఫోన్ లో టచ్ లో ఉన్నాడని మా వీధిలో ఒకరితో చెప్పిందిట ఆ దయ్యం. ఇంక ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు నిజంగా. పాకిస్తాన్ పంపిస్తావా చచ్చిపోనా అని ఒకటే గొడవ. ఇప్పుడు వీడినే పోగొట్టుకుంటామేమో అని భయమేస్తోంది. ఈ ఉద్యోగాలు తప్పవు. ఇద్దరం పగలొకరు రాత్రొకరూ పని చేసుకుంటూ చూసుకుంటున్నా, ఒక క్షణం ఏమరుపాటుగా ఉన్నా, ఏం చేసుకుంటాడో అని భయమే. క్లాస్ అయే సమయానికి తండ్రి స్కూల్ దగ్గర నించుని ఇంటికి తీసుకొస్తాడు " అంటూ కన్నీరు మున్నీరవుతోంది నూర్. కాస్త ధైర్యం చెప్పడం తప్ప, నాకూ ఏమనాలో తెలియలేదు.
*
తరువాత నూర్ బస్సులో కనబడలేదు. తన ఇంటి నంబర్ కి ఫోన్ చేసినా ఎవ్వరూ తియ్యలేదు. మహమ్మద్ స్కూల్ కి రావట్లేదని పిల్లలు చెప్పారు. ఈ లోపు నేను ఉద్యోగం మారడంతో , ఇంకో వైపు వెళ్లే బస్ ఎక్కాల్సి వచ్చింది.
*
రెండు మూడు నెలల తరువాత ఇండియన్ గ్రాసరీ షాప్ లో కనబడింది నూర్ . అత్తగారు చనిపోయారని అప్పటికప్పుడు పాకిస్తాన్ వెళ్ళారుట.
" రెండు మంచి విషయా లు చెప్పాలి నీకు. చివరి సమయంలో అత్తగారికి సేవ చేసుకునే అదృష్టం దొరికింది. ఆవిడ పిల్లలని చూసి ఎంతో సంతోష పడ్డారు.
అల్లా దయనో, ఆవిడ దువానో కానీ, మేము వెళ్ళేటప్పటికి ట్యూషన్ టీచర్ భర్త దుబాయి నించి తిరిగి వచ్చేసాడు. అతను పెళ్లి చేసుకుని వెళ్ళాక అజా పజా లేడుట. అతను ఎక్క డున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేసి చేసి మోసం చేసాడు ఇంక రాడు అనుకుందిట. తీరా విషయం ఏంటంటే పాపం అతను ఏదో ప్రమాదంలో చిక్కుకున్నాడుట. పాస్పోర్ట్ పోలీసులు తీసుకున్నారుట, పడరాని పాట్లన్నీ పడి, మొత్తానికి బతుకు జీవుడా అని పాకిస్తాన్ కి వచ్చి పడ్డాడు. ఈ గ్యాప్ లో మన పిల్లాడు ప్రేమ దోమ అని ప్రాణాలు తీసుకోవడానికి తయారయ్యాడు" రిలీఫ్ గా చెప్తోంది.
"ఓహ్.. ఇప్పుడు మహమ్మద్ ఎలా ఉన్నాడు?"
"ఈ రెండు నెలలూ చాలా చాలా సతాయించాడు. వెళుతున్నప్పుడు ఇంక కెనడాకి రమ్మనద్దు అక్కడే ఉండిపోతా అంటూ వచ్చాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఆవిడ భర్త గురించి తెలిసి, నాలుగైదు సార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసాడు. చుట్టాలలో మానసిక వైద్యుడు ఉన్నాడు. అత్తగారు చనిపోయినప్పుడు వచ్చిన ఆయనని ఈ రెండు నెలలు ఇంట్లోనే ఉంచేశారు మా బావగారు. ఆయన ఏదో మాయ చేసాడు. మందులిచ్చాడు. తన వెంట తిప్పుకున్నాడు. ఇప్పుడు కొంత నయం.." అంది.
" నూర్ నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రేమ కథ ఇలా ఇంత తొందరగా సుఖాంతం అవ్వడం నేను మొదటి సారి చూస్తున్నా. నిజానికి ఈ చివరి మలుపు దైవికం. ఇది నిజంగా జరిగింది అని చెప్పినా ఎవరూ నమ్మరేమో. ఇంక టెన్షన్ లేదులే. పిల్లాడిని సాకర్ లో కూడా చేర్పించు" అన్నాను.
" చిన్న హెల్ప్ కావాలి, రేపటి నించి వస్తాడు. కొంచెం నీ షార్ట్కట్ చదువు చెప్పవా నీకు పుణ్యముంటుంది. పోయిన సారి పరీక్షలో పాస్ మార్కులు వచ్చాయి. అలా వస్తే చాలు, యూనివర్సిటీ లో చేరాలి కదా" అంది.
"దానికేం భాగ్యం.. ఇంకో పది ఎక్కువే వస్తాయిలే ఈ సారి.. " అన్నాను నవ్వేస్తూ..
పరీక్ష ముందు రెండు రోజులు తప్ప మహమ్మద్ మళ్లీ రాలేదు. పిల్లల హై స్కూల్ అయిపోయాక, మా ఉద్యోగాలకి దగ్గరగా ఉండేలా ఇళ్ళు మారాము. కార్లు కొనుక్కున్నాక అప్పటి బస్ స్నేహాలు అక్కడితో తెగిపోయాయి. టీనేజ్ పిల్లలు చేసే చిన్న పొరపాట్ల వల్ల తలి తండ్రులు దేశాన్ని వదిలి పెట్టే అంత పెద్ద బాధలు . గుర్తొచ్చినప్పుడల్లా మహమ్మద్ బాగుండాలని కోరుకుంటుంటా..ఇప్పుడు తనెక్కడున్నాడో తెలియకపోయినా, నాకు ఖచ్చితంగా తెలుసు.. మీ ఆశీస్సు కూడా తనకి చేరుతుందని..
Posted by
Ennela
at
Thursday, April 20, 2023
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
ఆఫీస్
14 ఫిబ్రవరి, 2023
"మరెలా ఆఫీసులో.." సందిగ్ధంగా అన్నాడు రవి. "ఒక్క సెలవు కూడా పెట్టకూడదని చెప్పారు మార్చ్ చివరి వరకూ. పని చాలా ఉంది" అంది రాధిక. "మరెలా" అన్నాడు రవి. "ఇంకేముంది సిక్ లీవ్ అని చెప్పెయ్యడమే, రాక రాక వచ్చారు రమా వాళ్ళు అంత దూరం నించి. మళ్ళీ మళ్ళీ వస్తారా ఏమిటి? అన్నయ్య పుట్టిన రోజని ఇప్పుడేగా తెలిసింది. ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా . ఫర్వాలేదులే"
"అంటే... అసలే మీ బాస్ తిక్కలోడు, నీ మీద పీకల్దాకా కోపం, జాబ్ పీకేస్తా అంటాడేమో"
"అయ్యా, నా మీద మీకు నమ్మకం లేదేమో కానీ, నా మీద నాకు నమ్మకం ఉంది. ఈ జాబ్ పోతే చిటికలో ఇంతకు మించిన జాబ్ తెచ్చుకోగలను. ఇది 1847 కాదు 2000"
"అవుననుకో, కానీ.. సరేలే నీ ఇష్టం, ఆఫీసుకి ఫోన్ చెయ్యి, టికెట్లు తీసి పెట్టమని శంభు కి ఫోన్ చేస్తా ఈ లోపు" అంటూ హాల్ లోకి వచ్చాడు.
బాత్రూంలో బాబుకి స్నానం చేయించి బయటికి తీసుకొచ్చింది అంజమ్మ. బాబుని చేతులోకి తీసుకుని " పౌడరూ, బట్టలూ తెచ్చి ఇవ్వు. నేను వేస్తా. నువ్వు ఇల్లు తుడిచెయ్, టిఫిన్ మాత్రమే చెయ్యి, ఈ రోజు లంచ్ బయట చేస్తాం" అంది రాధిక. పైన వివరాలు విన్నది కాబట్టి, "అయ్యో నేను చేస్తాలే అమ్మా, మీకు ఆఫీస్ టైం అవుతుంది " అనలేదు. పనులయ్యాక బాబుని అంజమ్మ చేతికిచ్చి, ఇంటికి వచ్చిన చుట్టాలతో సినిమాకి, అటునించి అటు లంచ్ కి వెళ్ళి వచ్చాక, అంజమ్మ మిగతా పని పూర్తి చేసి వెళ్ళింది. చాలా నిదానస్తురాలు ఆమె. గత మూడేళ్ళుగా బాబుని, ఇల్లుని జాగర్తగా చూసుకుంటూ నమ్మకంగా పని చేస్తోంది.
*
"రాధీ, ఇవాళ మమత వాళ్ళ పెళ్ళి రోజు కదా.. మర్చిపోయావా?" అన్నాడు రవి ఆఫీస్ నించి ఇంటికొచ్చిన రాధికతో. " వాళ్ళకి అర్థరాత్రి 12 అయినప్పుడు చేద్దామనుకున్నా ఆఫీస్ నించి. వాళ్లకి అలా నచ్చదు. తెల్ల వారితేనే ఆ రోజు లెక్క అంటారు. ఇప్పుడు మనకి రాత్రి 7 అంటే వాళ్ళకి పొద్దున్న 8.30 అయి ఉంటుంది! ఇంట్లో ఉండరు. అమెరికా వెళ్ళినా సుధాకర్ పెళ్ళి రోజున పొద్దున్నే గుడికెళ్ళి హోమాలు అవీ చేయించడం మానలేదుగా.. అవన్నీ అయి బయట లంచ్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి మనకి అర్థరాత్రి దాటుతుంది. నేను రేపు ఆఫీస్ కెళ్ళాక అక్కడినించి చేస్తా. అమెరికా క్లైంట్లు ఎలాగూ ఉన్నారు కాబట్టి ఆఫీస్ లో ఎవ్వరూ పట్టించుకోరు. రోజూ ఒక అరగంట మాట్లాడుకుంటాంగా అప్పుడు చెప్తాలెండి" అంది రాధిక. "సరే మరి, నా తరఫు నించి కూడా చెప్పు విషెసు , మళ్ళీ మరదలు అలిగితే కష్టం" అన్నాడు సరదాగా అంజమ్మ చేతిలోంచి బాబుని తీసుకుంటూ.
*
బాబు శ్రీకర్ మూడవ పుట్టినరోజు రాబోయే వారాంతంలో ఘనంగా ఏర్పాటు చేసారు. ఆఫీసులో కూడా ఉక్కిరిబిక్కిరిగా పని ఉండడంతో ఏర్పాట్లకి సతమతమవుతోంది రాధిక. గురువారం ఆఫీసుకెళ్ళే సమయానికి అంజమ్మ రాలేదు. తను ఆఫీసులో పంచ్ చెయ్యాలి కాబట్టి, అంజమ్మ వచ్చేదాకా ఉండి, పిల్లాడిని అప్పజెప్పి వెళ్ళమని రవికి చెప్పి, తను ఆటో లో ఆఫీసుకి వెళ్ళిపోయింది. సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి ఇల్లంతా పీకి పందిరేసినట్టు ఉంది. అలసటతో ఉన్న రవి, "తల నొప్పిగా ఉంది టీ పెట్టవా" అన్నాడు. ఏం జరిగిందో అర్థం కాకుండా చూస్తున్న రాధికని చూసి ఎత్తుకోమని గట్టిగా ఏడ్చాడు శ్రీకర్. ముట్టుకోగానే ఒళ్ళు కాలిపోతోంది. "అంజమ్మ రాలేదు.. వీడికి మోషన్స్, వాంతులు అవుతున్నాయి. ఒక్క నిమిషం చెయ్యి దిగలేదు. నువ్వొచ్చాక ఆస్పత్రికి తీసుకెళదామని ఆగాను" అంటున్న రవిని, ఎక్కడివక్కడే పడి ఉన్న ఇంటిని అయోమయంగా చూస్తూ ఉండిపోయింది రాధిక.
అంజమ్మ మర్నాడు కూడా రాలేదు. ఏమయిందో తెలియదు. తన ఇల్లు కాకతీయ నగర్ అని చెప్పింది కానీ, ఎక్కడ అన్నది వాళ్ళిద్దరికీ తెలియదు. ఇంటా బయటా పనులు చేసుకుంటూ, బాబుని జాగ్రత్తగా చూసుకుంటూ, ఫంక్షన్ చేసేటప్పటికి తల ప్రాణం అరికాలికొచ్చింది ఇద్దరికీ.
సోమవారం పొద్దున్నే బాబుని చూసుకోవడానికి మనిషిని పంపిస్తానన్న స్నేహితుడి భార్య శైలకి ఫోన్ చేద్దామని చూస్తే, ఫోన్ పని చెయ్యలేదు. ఏమయిందో అర్థం కాక, పక్కింటి వాళ్ళింట్లోంచి శైలకి చేసి, అలాగే ఫోన్ కంపెనీకి ఫోన్ చేసి, టెన్షన్ పడుతూ ఇంటికొచ్చాడు రవి. దేవతలా అంజమ్మ గేటు తీసుకుని ఇంట్లోకెళుతూ కనిపించేటప్పటికి సగం రిలీఫ్ అనిపించింది.
అంజమ్మని చూడగానే గయ్యిమని అరవడం మొదలెట్టింది రాధిక. "బాబు పుట్టినరోజని తెలియదా, చుట్టాలొస్తారని తెలియదా, ఇంటెడు పని ఉంటుందని తెలియదా.. ఇలా మానేసేటట్టయితే నువ్వు ఇంక పనికి రావక్కరలేదు" అంటూనే, మనసులో హమ్మయ్యా అనుకుంటోంది. కొత్త పని పిల్ల వచ్చినా, పిల్లాడికి అలవాటు లేదాయె. అసలే అనారోగ్యం నించి కోలుకుంటున్నాడు. ఎలాగా అని పడిన బెంగ వాడు నవ్వుతూ అంజమ్మ మీదకి ఉరకడంతో తీరిపోయింది. అంజమ్మ ఏమీ మాట్లాడకుండా నించుంది. "సరే... నువ్వు రావనుకుని పనంతా చేసేసుకున్నా. వీడిని తీసుకో, మేము వెళ్ళాలి" అని అక్కసుగా అంటూ, "శైలకి ఫోన్ చేసి చెప్పండి వాళ్ళ పని పిల్లని పంపద్దని, అన్నట్టు మన ఫోన్ ఏమయ్యింది" అడిగింది రాధిక. "ఏమో అర్థం కావట్లేదు, 2200 బిల్లు పంపారుట. కట్టలేదని కట్ చేసారుట" "ఏమిటీ రెండు వేలా, అదేంటీ?" "ఏమో నువ్వే పొరపాటున మమతకి చేసి ఉంటావనుకున్నా. కానీ కాదుట భోపాల్ కి చేసినట్టు ఉన్నాయి వివరాలు. లంచ్ లో వెళ్లి కనుక్కోవాలి" "భోపాల్ లో ఎవరున్నారు మనకి?" "మాకున్నారమ్మా, నా చెల్లి ఉంది. మా మరిదికి అక్కడికి బదిలీ అయింది" నిదానంగా అంది అంజమ్మ. రాధికకి అరికాలి మంట నెత్తికెక్కింది. "ఉంటే, ఎస్టీడీ చేసేస్తావా ఇంట్లోంచి రోజూ, ఇంక నిన్ను నమ్మి ఎలా ఉంచుకుంటాము. పని మానెయ్" గట్టిగా అరిచింది రాధిక.
"అదేంటంటే అమ్మా,.... ఆఫీసులో సెలవు పెట్టకూడదన్నప్పుడు మీరు సిక్ లీవులు పెట్టేస్తారు. మీ చెల్లి గారికి అమెరికా ఫోన్ చెయ్యాలంటే ఆఫీసు నించి చేస్తారు. మరి నాకు మాత్రం ఆఫీసంటే మీ ఇల్లే కదమ్మా. మా అమ్మమ్మ కాలం కాదు కదా , మీకు మల్లేనే మీరు తీసేసినా చిటికలో ఇంకో ఇల్లు సంపాదించుకోగలను. రేపొచ్చి డబ్బులు తీసుకుంటా" అంటూ వెనుతిరుగుతున్న అంజమ్మని మాటా పలుకూ లేకుండా చూసింది రాధిక. "నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి, పనిమనిషుల ముందే అన్నీ మాట్లాడుకుంటే ఇట్లాగే ఉంటుంది యవ్వారం.. " అంటున్న రవితో "నేను బతిమాలితే నెత్తికెక్కుతుంది గానీ, మీరే బుజ్జగించి తీసుకురండి.. ఇప్పట్లో బాబుకి నప్పే పని వాళ్ళు దొరకరు" అంది రాధిక ఇపుడు అంజమ్మతో ఎలా మాట్లాడాలా అని మొహమాటపడుతూ.
Posted by
Ennela
at
Thursday, April 20, 2023
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
కాయ కష్టం
1ఫిబ్రవరి 2023
"అరె వీళ్ళ ప్రాబ్లం ఏమిటి, కెనడాకి రాగానే నెల లోపే ఇద్దరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలొచ్చాయి. ఇంకో క్యాష్ ఉద్యోగం ఉంటే చూసి పెట్టు కష్టంగా ఉంది అంటాడేంటి" ఫోన్ వైపు చూపిస్తూ, అంటున్న మా సీతయ్య మాటలకి, మీటింగ్ లో ఉన్నా అని సైగ చేసాను. కళ్ళు కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్నా, చేతులు మీటింగ్ మినట్స్ వ్రాస్తున్నా, మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతోంది.
కెనడాకి వచ్చిన వారంలోపు నాకు టిం హార్టన్స్ లో పని దొరికింది. అక్కడ పనిచేస్తూ, సాయంత్రం ఆరు నించీ తొమ్మిది వరకూ 45 రోజుల టాక్సు కోర్సు పూర్తి చేసినందువల్ల, టాక్స్ ఆఫీస్ లో టాక్స్ లు సబ్మిట్ చేసే పని దొరికింది. రెండు నెలల తరువాత, టాక్స్ సీసన్ అయిపోవడంతో ఉద్యోగం అయిపోయింది. అప్పట్లో పిట్టను కొట్ట పొయిలో పెట్ట అన్నట్టు జీతం వస్తే గానీ, పొయ్యిలో పిల్లి లేవని పరిస్థితి. సీతయ్యకి కూడా రోజు వారీగా చేసే కూలి పని లాంటి బరువులు ఎత్తే ఫ్యాక్టరీ పని ఉన్నరోజు ఉన్నట్టు లేని రోజు లేనట్టూ. ఒకోసారి రమ్మని పిలిచి, అక్కడకి వెళ్ళాక పని లేదు అని చెప్పేవారు. తను, ఆ వారం సంపాదించిన డబ్బుతో ఎవరెవరో చెప్పిన చిన్న చిన్న కోర్సులు చేస్తూ ఉండేవారు కొంచెం మంచి పని దొరుకుతుండేమోనని.
టాక్స్ సీసన్ తర్వాత రెండువారాలు ఇద్దరికీ పని దొరక్క గిజగిజలాడిపోయాము. ఏ మాటకామాట పురుషుల కంటే ఆడవాళ్ళకి ఉద్యోగాలు తొందరగా వచ్చేవి. ఎందుకూ అంటే, భారత దేశంలో పెద్ద ఉద్యోగాలు చేసొచ్చిన పురుషుల మాట తీరు, బాడీ లాంగువేజ్ తొందరగా ఇక్కడివాళ్ళకి నచ్చదని చెప్పుకునేవారు. నిజమెంతో మనకి తెలియదు మరి.
జాబ్ ఏజెన్సీలని ఉంటాయి వాటికి వెళ్ళమని చెప్పారెవరో. అక్కడికి వెళ్ళి బయో డేటా అనేవాళ్ళం కదా అదేదో ఇచ్చాక, తీసుకుని "నీకు సరిపడే ఉద్యోగం కనబడగానే ఫోన్ చేస్తాం" అని చెప్పారు. ఆ రోజు నించీ పొద్దున్నే ఆదరాబాదరా రాత్రికి కూడా సరిపడేలా వంటా గింటా చేసేసుకుని, బేస్మెంట్ మెట్ల మీద కూచునేదాన్ని. ఎందుకంటే, వాళ్ళు పిలిచిన వెంటనే వెళ్ళకపోతే ఇక ఎన్నడూ పిలవరు అని చెప్పుకునేవారు ఆ రోజుల్లో.
ఈ లోపు ఇద్దరం పగలూ రాత్రీ కనబడిన బోలెడు ఉద్యోగాలకి అప్లై అప్ప్లై నో రెప్లై అన్నమాట.
ఇలా కాదని ఒకరోజు పొద్దున్నే ఏజెన్సీకి వెళ్ళి " పిలుస్తా అన్నారు పిలవలేదు" అని కడిగేసా.. అదేలెండి.. అడిగేసా. దానికి జవాబుగా రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి, "చూడమ్మా, నువ్వు గతంలో ఉపాధ్యాయురాలివి. ఇప్పుడు నువ్వు అప్ప్లై చేసింది లెక్కలూ పద్దులూ చూసే ఉద్యోగానికి... కాబట్టి, పొంతన లేదు పొమ్మం"ది. నేను కాసేపు వాదన చేస్తుండగా ఒక మ్యానేజర్ బయటికి వచ్చి ఉడ్వార్డ్స్ గ్రైప్ వాటర్ అమ్మమ్మ లాగా "ఏమిటి సంగతి" అనడిగింది. ఈవిడ కూడా అదే ప్రకటనలో లాగా " ఈ అమ్మాయి ఏడ్చింది" అని చెప్పి ఏదో గుసగుసలాడింది. ఆవిడ కూడా "అమ్మా నువ్వు గతంలో .." అనేలోపుగా నేను అందుకుని "అదే.. గతంలో ఉపాధ్యాయురాలినే.. కానీ, ఏ సబ్జెక్టూ" అని కొట్టినట్టు అడిగా.. ఆవిడా కాగితంలో చూసి" అక్కవుంట్సూ" అంది. "అద్ది, అదే నేను చెప్తున్నది, అదే సబ్జెక్టు పదిహేనేళ్ళు కేజీ నించి పీజీ వరకూ కనిపించిన అందరికీ చెప్పుకొచ్చా. ఇప్పుడా జాబ్ కి అప్ప్లై చేస్తే మీకేమి కష్టం" అన్నాను లా పాయింట్ లాగుతూ.. ఆ మ్యానేజర్ జెరంత బుర్ర గోక్కుని, "రా.. ఇలా రా" అని ఒక పెద్ద ఆఫీస్ రూం లోకి నన్ను పట్టుకెళ్ళి సీక్రెట్ గా "నువ్వెప్పుడైనా ఆఫీస్ లలో పని చేసావా" అంది." ఆ.. చేసాను. 'అర్న్ వైల్ లర్న్' ( earn while learn) అని డిగ్రీ కాలేజీలో ఉండగా పెద్ద పెద్ద లెడ్జర్లలో కూడికలు చెయ్యడానికి కెనరా బ్యాంక్ లో రోజూ 2 గంటలు పనిచేసేదాన్ని. నెలకి 150 రూపాయల జీతం ఇచ్చేవారు" అని చెప్పా. "హమ్మయ్య అది చాలు" అని అంటూ..ఆ రెండు గంటల ఉద్యోగమే నా జీవితం మొత్తం చేసినట్టు వ్రాసి పడేసి, "ఇదన్నమాట, అకవుంటెంట్ అంటే, పుట్టినప్పటి నించీ.. అంటే అసలు అకవుంటింగ్ డిపార్ట్మెంట్ లోనే నువ్వు పుట్టినట్టుగా.. గోడ కట్టినట్టుగా మాట్లాడాలి ఇక నించీ!తెలిసిందా?" అని కన్ను చికిలించి, హిత బోధ చేసింది. బరువులు మోసేటప్పుడు దెబ్బలు తగుల్చుకోకుండా ఎలా చూసుకోవాలి, నడుము విరుచుకోకుండా 50 పౌన్డ్ల బరువు ఎలా ఎత్తాలి లాంటి అంశాలతో బొమ్మలున్న ఒక ఫైల్ ఇచ్చి, అది చదివాక దాని మీద పరీక్ష ఒకటి వ్రాయించి, కొన్ని కాగితాల మీద సంతకం పెట్టించుకుని, "ఇంటర్వ్యూకి పిలిస్తే, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా.." అంటూ అబధ్ధాలు ఎలా ఆడాలి అనే అంశం మీద ముద్దుగా సుద్దులు చెప్పి పంపింది. వామ్మో ఇంతోటి అబధ్ధాలు ఎలా చెప్పాలిరా దేవుడా దేవుడా అనుకుంటూ ఇంటికొచ్చా.
ఒక రెండు రోజుల్లో పొద్దున్న ఏడింటికి ఫోనొచ్చింది. ఫలానా ప్రింటింగ్ ప్రెస్సులో అకవుంటింగ్ ఉద్యోగం 9 గంటలకల్లా ఉండాలి అక్కడ, గంటకి $7.35 జీతం అని సారాంశం. ఎప్పటిలాగే తయారుగా ఉన్నాను కాబట్టి దబా దబా బస్సెక్కేసా. పెద్దగా అబధ్ధాలు అవీ లేకుండా చిన్న ఇంటర్వ్యూ లాంటిది అయింది అనిపించి, "పని చూపిస్తా రా" అన్నారు. ఒక ఆఫీసు అవీ ఊహించుకున్న నన్ను లోపల 100 పెద్ద బ్యాంకర్ డబ్బాలు ఉన్న చోటకి తీసుకెళ్ళారు. "ఈ ఆఫీసులో ఆడిటింగ్ ఉంది ఈ వారం. వాళ్ళు 7 సంవత్సరాల క్రితం నించీ సంవత్సరానికి ఇన్నని సెలక్టు చేసి, ఫలానా నెల ఫలానా ఇన్వాయిస్ కావాలని లిస్ట్ ఇచ్చారు. ఈ వంద పెట్టెలూ నెలల వారీగా పేర్లు వ్రాసి ఉన్నాయి. నువ్వు ఒక్కొక్క పెట్టే దించి, లిస్టు ప్రకారం కావలసిన ఇన్వాయిస్ లాగి, మళ్ళీ పెట్టెలు ఒకదాని పైన ఒకటి పెట్టెయ్యడమే" అని చెప్పింది చులాగ్గా. బరువులు మొయ్యడం నాకొక లెక్కా ఏంటి? ఎన్ని వందల బిందెలతో నీళ్ళు మోసి ఉంటాను ఇంటి దగ్గర అనుకుంటూ అంతెత్తున ఉన్న ఒక్కొక్క డబ్బా దింపుతూ ఎత్తుతూ, ఒక అరగంట లంచి బ్రేకు, రెండు పావు గంటలు ఇంటర్వెల్ బ్రేకు.. వీటికి జీతం చెల్లించరు కాబట్టి, అది కలుపుకుని 9 గంటలు పనిచేసి రిక్షా తొక్కిన అబ్బాయిలా తూలుకుంటూ ఇంటికెళ్ళా. (అబ్బే అది కాదబ్బా,, అలసటకి తూలా అంతే).
అలా ఒక రెండు వారాలు ఎత్తే డబ్బా దింపే డబ్బా, ఒకో డబ్బాలో ఏమీ దొరకవు..! మొత్తానికి లిస్టులో ఉన్న అన్ని కాగితాలు కట్టగట్టి ఇచ్చాక, "తరువాతేం పని" అని అదేదో కథలో పని దెయ్యం అడిగినట్టు అడిగా. మస్త్ మజా వచ్చింది.. ఒక చిన్న ఆఫీసు గది, టేబులూ, కుర్చీ, ఒక ఫోనూ, ఒక కంప్యూటరూ అచ్చంగా నాకే ఇచ్చెయ్యడం చూసి. ఈ సారి ఇంకో పెద్ద లిస్ట్ ఇచ్చి , ఒక్కో నంబరుకీ ఫోన్ చేసి ప్రింటింగ్ ధరలు చెప్పి, "మీరు ప్రింట్ చేయించుకోండి" అని అడగాలి. అలా రోజంతా ఫోన్ లు చెయ్యడమే కదా.. సరదా సరదా అనుకునేరు. వారానికి ఇంతమందిని ఒప్పించి బిజినెస్ తేవాలని టార్గెట్ ఉంటుంది. రెండు వారాలు టార్గెట్ చేరకపోతే, ఇంక ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఇంతకన్నా ఆ బండలు.. అదే డబ్బాలు ఎత్తడమే బాగుందసలు. ఫోన్ చెయ్యగానే ఒక్కక్కళ్ళు చిరాకు పడడం, ఛీదరించుకోవడం, తిట్టడం, వెటకారం, వేళాకోళం, విసుగు! ఒక్కరన్నా సరిగా ఫోన్ మాట్లాడింది లేదు. ఇలా ఫోసి హలో అనగానే " పెట్టెయ్ " అనే వాళ్ళు కొందరైతే, "నీ వాయిస్ చాలా బాగుంది.. కాసేపు మాట్లాడుతూ ఉండు" అనేవాళ్ళ దాకా..యాక్ థూ.. అనిపించినా.. మళ్లీ... కాలే కడుపుకి మండే బూడిద..కాబట్టి ఆ ఉద్యోగం అప్పటికి ఎంత అవసరమో అని తలచుకుని కళ్ళనీళ్ళు వచ్చేవి. "రేపు ఫోన్ చెయ్యి" అంటూ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయించుకునేవారు కొందరు. వాళ్ళు ప్రింట్ చేయించుకుంటారేమో అని ఆశ. పదే పదే ఫోన్ చెయ్యడం, తిట్లు తినడం. భారతదేశం లోనూ, రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవుల్లోనూ పదిహేనేళ్ళు పెద్ద పిల్లలకి పాఠాలు చెప్పినట్టు అలా హాయిగా సాగిపోవాలంటే ఎలా? మనని కెనడాకి ఎవరైనా రమ్మని పిలిచారా? మనమే కదా వచ్చాం. వచ్చినవన్నీ తీసుకోవలసిందే అని సర్ది చెప్పుకోవడం. ఇలా మావే కాక స్నేహితులవి కూడా కలిపి ఎన్నెన్ని ఉద్యోగాలో, ఎన్నెన్ని అనుభవాలో.
ఎనిమిదేళ్ళ పాటు స్థిరమైన ఉద్యోగాలే దొరకలేదు రెసెషన్ వల్ల. ప్రతి మూడు నెలలకీ ఒకో కొత్త ఉద్యోగం. కానీ దాని వల్ల ఎన్ని కొత్త విషయాలు తెలిసాయనుకున్నారూ.... బోలెడన్నమాట.
అలా ఆఫీస్ పని చేస్తూనే, సీతయ్య ఇందాక చెప్పిన కొత్త జంట గురించి ఆలోచిస్తున్న నేను , ఫోన్ రింగ్ అవగానే, నంబర్ చూసుకోకుండా ఫోన్ తీసాను. "హెలో, నేను ట్యూషన్ సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నాను మేడం, సైన్సూ, మ్యాథ్సూ" అని చెప్తూ ఉండగానే, "మా పిల్లలు పెద్ద అయిపోయారు, ఇప్పుడు చదువు చెప్పించుకోవాలంటే నేను ఒక్కదాన్నే, మరి ఎవరూ లేరండి ధన్యవాదాలు" అని చెప్పాను నవ్వేస్తూ. "పోనీ పిల్లలున్న ఇంకెవరికైనా చెప్తారా మా గురించి" అని అడిగారు. "తప్పకుండా" అన్నాన్నేను నంబరు నోట్ చేసుకుంటూ. "ఎందుకే అంత సోది. వద్దు అని టక్కున పెట్టెయ్యక" అంటారు మా సీతయ్య ఇలాంటి ఫోన్ లకి నేను ఆన్సర్ చేస్తున్నప్పుడు. "అది వాళ్ళ ఉద్యోగం కదా, ఇంట్లో అతని మీద ఎందరు ఆధారపడ్డారో" అంటాన్నేను గతంలోకి తొంగి చూస్తూ. "మహాతల్లీ నీకో దణ్ణం" అంటారాయన. "దీర్ఘాయుష్మాన్ భవ" అంటాను ఆ దణ్ణం అందుకుంటూ.
Posted by
Ennela
at
Thursday, April 20, 2023
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
రెండవ పెళ్ళి
18 జనవరి 2023
సిటిజన్ షిప్ పరీక్ష అయ్యక ఇంటర్వ్యూ ఉంటుంది. దానికి వెళ్ళాలని సగం పూట సెలవు పెట్టి, ఆఫీసుకి వెళ్ళేటప్పటికి కొంత శ్మశాన వైరాగ్యం కనబడింది. మంత్ ఎండ్ ముందు మాకు ఇలాంటివి ఉండడం పరిపాటే. అంతకు మించి తుఫాను ముందు ప్రశాంతత లాంటి గంభీరమైనదేదో కూడా మనసుకి తెలుస్తోంది. ఎవరిని పలకరించినా పలకట్లేదు పెద్దగా. అసలైతే, ఇలా డ్రైవింగ్ పరీక్షలో , ఇంకేవైనా పరీక్షలో అని మాలో ఎవరం వెళ్ళినా, మా పెద్ద బాస్ గ్రెగ్ గారు గడపలోంచే.. "హే పాస్ అయ్యావా" అని అరిచి అడుగుతాడు. నలుగురూ నవ్విపోరూ ఫెయిల్ అని చెప్పడం ఎలాగా! ఈయనొకడు అరిచి అరిచి అడుగుతాడు అని బోలెడు సార్లు సతమతం అయ్యేవాళ్ళం కూడా. అయితే చెవిటి వాళ్ళు ఉన్నచోట పెరిగాడుట అతను అందుకే గట్టిగా మాట్లాడతాడు అలవాటుగా.
నా సిటిజన్ షిప్ విషయం ఎవరూ అడగనూ లేదు, నేను చెప్పనూ లేదు. కాసేపయ్యాక మా బాస్ మీనూ నన్ను తన ఆఫీస్ రూం లోకి పిలిచి "క్లోస్ ద డోర్" అంది. అంటే, అతి ముఖ్యమైన విషయం అన్నమాట. సాధారణంగా అన్నీ ఓపెన్ డిస్కస్షనులే మా దగ్గర. 'గ్రెగ్గుకి, డేవిడ్ కి పెద్ద గొడవయ్యింది" అంది. "అవునా ఏ విషయంలో" అనడిగాను. "ట్రేడింగ్ లో ఫారిన్ ఎక్ష్చేంగ్ లెక్కల్లో ఏదో తేడా కనబడిందిట గ్రెగ్గుకి. అది అడగగానే డేవిడ్ కి ఎక్కడ లేని కోపం పొంగుకొచ్చింది. ఆల్మోస్ట్ ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకునే వరకూ వచ్చింది" అని చెప్పింది. "మరెలాగ?" అన్నాను నేను కొంత విస్తు పోతూ.. ఎందుకంటే నేను ఇద్దరితోనూ పనిచెయ్యాలి మంతెండ్ సమయంలో. "నువ్వు వచ్చాక రిపోర్టు రన్ చేసే దాకా ఆగారు. రిపోర్ట్ రన్ చేసెయ్ తొందరగా" అంది.
అవి ప్రింట్ చేసి గ్రెగ్ ఆఫీస్ కి వెళ్ళాను. నా వెంటనే మా బాస్ కూడా వచ్చింది. ట్రేడింగ్ రిపోర్టుల ప్రకారం చాలా నష్టం వచ్చిందిట. హటాత్తుగా పూర్తి నష్టాలు చూపిస్తే ఎలా? యజమానుల దగ్గర అతనే జవాబుదారీ కాబట్టి టెన్షన్ పడడం సహజమే. ఒకోసారి ఇన్ని నెలలూ చూడనందుకు ఉద్యోగం పోవచ్చు కూడా. కానీ ఈ రిపోర్టులు పరిశీలించి కొంచెం చల్లబడ్డాడు. " మరి ట్రేడింగ్ రిపోర్ట్స్ అలా ఎలా రన్ అయ్యాయి? కొంచెం రికన్సైల్ చేస్తావా" అని, "సరే కానీ నువ్వు సిటిజన్ అయ్యావా? ఎలా అయింది ఇంటర్వ్యూ" అని అడిగాడు. "ఒక అబధ్ధం ఆడాల్సి వచ్చింది గ్రెగ్" అన్నాను నేను. "వ్వాట్?? నువ్వు అబధ్ధం ఆడావా?" ఎంత అపచారం అన్నట్టు గట్టిగా అరచి అడిగాడు "ఏంటది" అంటూ. "మా వారిని నన్ను విడివిడిగా అడిగిన ప్రశ్నల్లో భారత దేశంలో చిన్నప్పుడు ఎక్కడ ఉండేవారని అడిగారు. మా మావగారికి ట్రాస్ఫర్లు అయ్యే ఉద్యోగం అవడం చేత పర్మనెంటు అడ్రెస్స్ లేదు. తరువాత పర్మనెంటు అనగానే మా నాన్నగారి చిరునామా ఇస్తాము చాలా ఏళ్ళుగా. మొదట నన్ను అడిగినప్పుడు నేను నా పుట్టింటి చిరునామా చెప్పగానే, మా వారు కూడా అనుకోకుండా అదే చిరునామా చెప్పేసారు. అప్పుడిక వెనక్కి వెళ్ళి సరిచేసుకోడానికి లేదు. ఇద్దరూ ఒకే అడ్రెస్స్ చెప్పాము. 'ఇద్దరూ ఒకే ఇంట్లోనా' అనుమానంతో గట్టిగా అడిగింది ఆమె. మాకు సిటిజన్షిప్ రానట్టే అనుకున్నాము...కానీ ధైర్యం చేసి నేనే ఒక అబధ్ధం చెప్పేసా.." అన్నాను. గ్రెగ్ కి ఆత్రుతగా ఉంది..."ఏం చెప్పావు" అన్నాడు ముందుకి వంగి.. "అదే అతను మా కసిన్ అని, చిన్నప్పుడు మా ఇంట్లోనే పెరిగాడనీ" అన్నాను. "చీ కసిన్ ని పెళ్ళి చేసుకున్నట్టా..హ్హాహా..ఆమె ఏమంది మరి?" కొంచెం జుగుప్స అతని కంఠంలో 'ఓ ఐసీ.. ఇండియాలో కసిన్స్ ని పెళ్ళి చేసుకుంటారు నాకు తెలుసు' అంది" అని చెప్పా నవ్వేస్తూ.. "ఓహ్ మై గాడ్.. నువ్వు అబధ్ధం చెప్పావు.." అంటూ గట్టిగా నవ్వేసాడు గ్రెగ్. "నీ జీవితంలో ఇదే మొదటి సారా అబధ్ధం చెప్పడం" అన్నాడు కూడా. "అయ్యా నీకు ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చానో తెలియదు కానీ, మరీ అలా ఎలా అనేసుకుంటావు" అన్నాన్నేను. "యెహె.. నువ్వు అబధ్ధం ఆడవు అంతే" అన్నాడు చాలా నమ్మకంగా.
అతని మూడ్ మారినందుకు మా బాస్ చాలా సంతోషపడి "నువ్వు ఈవిడని తక్కువ అంచనా వేస్తున్నావు. అసలీమె రెండు సార్లు పెళ్ళి చేసుకుంది తెలుసా" అంది సరదాగా. ఇండియన్లు అన్నేళ్ళు ఒకే స్పౌస్ తో ఎలా ఉంటారు అనడుగుతూ జోక్ చేసే గ్రెగ్ కొంచెం ఉలిక్కి పడ్డాడు. ఆ రోజు ఎందుకో అతనికి అన్నీ ఉలికిపాటుగానే ఉన్నాయి. నిజమా అన్నట్టు కళ్ళింత చేసి చూసాడు.. "అంటే.. గ్రెగ్ అదేమిటంటే, మా దేశం లో పాతికేళ్ళ క్రితం పెళ్ళి జరిగినప్పుడు పెళ్ళి సర్టిఫికేట్ లూ అవీ ఇచ్చేవారు కాదు. కెనడా వచ్చేటప్పుడు తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే ఏం చెయ్యాలో తెలియలేదు. రిజిస్టర్ ఆఫీసులో ఇస్తారని అక్కడికి వెళ్ళాము. మా ఇద్దరి పేర్లు బోర్డు మీద పెట్టి, మూడు రోజుల వరకూ ఎవరికీ అభ్యంతరం లేకపోతే పెళ్ళి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. నాలుగవ రోజు ఇద్దరం సెలవు పెట్టి, పిల్లలని తీసుకుని వెళ్ళాము. అయితే సాక్షి సంతకం చేయడానికి ఎవరినైనా తీసుకువెళ్ళాలిట. ఆ విషయం మాకు తెలియనూ తెలియదు, ఎవరూ చెప్పనూ లేదు. మా దేశం లో అంత పద్దతిగా ఎవరూ చెప్పరు. కాబట్టి 'ఎవరినైనా తీసుకుని మళ్ళీ రండి' అన్నారు. నేను లెక్చరర్ గా పనిచేస్తున్నా అప్పట్లో. 'పరీక్షల సమయం నాకు కాలేజీలో సెలవు దొరకదు, ఈ సర్టిఫికేట్ వెంటనే కావాలీ అన్నాను నేను బేలగా. రూల్స్ ఒప్పుకోవండీ అన్నారు వాళ్ళు. కాసేపు ఉంటే, వాళ్ళలొ ఎవరైనా సంతకం పెట్టేసి, కాగితం ఇచ్చేస్తారేమో అని ఆశగా చాలా సేపు ఉన్నాము అక్కడే. ఈ లోపు పిల్లలకి దాహమేస్తోందని ఎదురు షాప్ లో కూల్ డ్రింకు కొనిద్దామని వెళితే అక్కడ తగిలాడు, నేను చిన్నప్పుడు ఎత్తుకు మోసిన మేనల్లుడి వరస బుడ్డోడు. అరె నువ్వేంట్రా ఇక్కడున్నావ్ అని ఆశ్చర్యపోయి, ఇలా సాక్షి సంతకం ఒకటి పడెయ్యవా అని అడిగాము. వాడు బోలెడు సంతోషపడి, మా అత్త పెళ్ళి నేనే చేసా అని చెప్పుకు తిరిగాడు. అలా మాకు పెళ్ళి సర్టిఫికేట్ వచ్చింది పెళ్ళయ్యి 15 ఏళ్ళ తరువాత" అని చెప్పాను. "వావ్" అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి, "రెండో సారి పెళ్ళి చేసుకుంటే చేసుకున్నావ్ కానీ యూ మేడ్ ఎ మిస్టేక్" అన్నాడు గ్రెగ్. ఏమిటీ అన్నట్టు చూసాను. "డామిట్.. మళ్ళీ పాత మొగుడేనా" అన్నాడు గట్టిగా నవ్వేస్తూ.."మంచిదేలే గ్రెగ్.. ఎన్ని జన్మలైనా నాకు ఈ భర్తే కావాలి. ఎందుకంటే.. మాటిమాటికీ కొత్త భర్తలకి ట్రైనింగ్ ఇవ్వడం నా వల్ల కాదు" అన్నాను ఆ రోజు ఫోన్ మెస్సేజెస్ లో చూసిన ఒక జోక్ గుర్తుచేసుకుంటూ
Posted by
Ennela
at
Thursday, April 20, 2023
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
రోల్ మాడల్
4 జనవరి 2023
"నువ్వు మాల్ కి వెళుతున్నావా? నాకోసం కార్ లో పెట్టుకునే ఫోన్ హోల్డర్ కొని తెస్తావా" అని అడగ్గానే " అమ్మా ఆర్ యూ ఆల్ రైట్" అనడిగింది పిల్లది. "అలాగే, అన్నలకి ఫోన్ చేసి, ఒకరిని ఇయర్ ఫోన్స్, ఇంకొకరిని నా ఫోన్ కి ఇంకో చార్జర్ తెమ్మని చెప్పవా ప్లీస్" అని అన్నాను. పిల్లది అవాక్కయ్యి, ఒక నిమిషం నా మొహం లోకి చూస్తూ ఉండిపోయింది. "అంటే,... నేను రియలైజ్ అవలేదు కానీ.. అవి మూడూ ఉంటే, డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా ఉపయోగం అనిపించింది" అన్నాను.
*
"మా అత్తగారి కమ్మలు, గాజులు, పలకసరులు పెద్దామె తీసుకుంది అక్కా, నేను వెళ్ళలేదు కదా! నాకొక చిన్న లాకెట్ మాత్రం పంపించారు, మిగతావి ఆడపడుచులు పంచుకున్నట్టున్నారు" అంది మేరి. "ఓహ్ పోనీలే మేరీ, అక్కడున్నవాళ్ళకి కష్టం కానీ, నువ్వు చిటికెలో కొనగలవు కదా? లాకెట్ ఆవిడ గుర్తుగా దాచుకో" అన్నాను. " అంటే నిజానికి అవన్నీ మా ఆయన కొనిచ్చినవే అక్కా, తర్వాత ఆవిడ నాకు ఇచ్చేస్తుందని నమ్మకంతో చాలానే కొన్నాము. ఆవిడ చిన్నవి ఎప్పుడూ అడగలేదు, పెద్ద బాండ్ వేసేది ప్రతిసారీ" అంది దుఖంగా. ఆమెని ఏమని ఓదార్చాలో నాకైతే తెలియలేదు. జోసెఫ్ కి వాళ్ళమ్మగారి మరణం పట్ల సంతాపం తెలియజేసి వచ్చేసాను.
*
డ్రైవ్ చేస్తున్నంత సేపూ ఏవో ఆలోచనలు. మాల్దీవుల్లో పని చేస్తున్నప్పుడు ఎక్కువగా మలయాళీ కొలీగ్స్ ఉండేవారు. వారి నించి నాకు ఎక్కువ ఇలాంటి సమస్యలే వినవచ్చేవి. కొడుకు, కోడలు విదేశాల్లో ఉండి సంపాదించి పంపితే, మావగారు ఇంటి దగ్గర విల్లా కట్టించడం, "పిల్లలని మేము చూసుకుంటాములే, మీరు అక్కడే ఉండండి ఫర్వాలేదు" అని చెప్పడం లాంటివే కాకుండా తలితండ్రులు అవి కొనియ్యి ఇవి కొనియ్యి అని సతాయించడం లాంటివి వినపడేవి ఎక్కువగా. మిమ్మల్ని పెంచి పెద్ద చేసాం కాబట్టి, ఇది మా హక్కు అని వాళ్ళ అభిప్రాయం. వాళ్ల హక్కు అనుకున్నాక వారు వాటిని ఎవరికైనా పంచవచ్చు కదా మరి.
వీళ్ళ సమస్య ఒకటైతే, నాకు ఇంకొక రకం సమస్య. చిన్న బహుమతి ఇచ్చినా పామునో, కొండచిలువనో చూసినట్టు భయపడేవారు మా నాన్న. అక్కడితో వదిలెయ్యకుండా, ఇవన్నీ అనవసరమైనవి అనీ, పెద్దయ్యాక జీవించడం కోసం తగిన ఏర్పాట్లు అందరూ చేసుకోవాలని, ఒక ఇల్లు సంపాదించి పెట్టుకుంటే తిన్నా తినకున్నా మన ఇంట్లో మనం పడి ఉండవచ్చుననీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆయన కోసం ఒక వస్తువు కొనడం కంటే, సన్యాసుల్లో కలిసిపోవడం మంచిదని మా అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు విరమించుకున్నా, నేను నాన్న కోసమని విదేశాల్లో ఏదో ఒకటి కొని తేవడం, దాన్ని ఇంకెవరికో ఇచ్చెయ్యడం బోలెడు సార్లు జరిగింది. మా అమ్మ చనిపోయేనాటికి బహుమతులు ఇచ్చే వయసూ, అవకాశమూ నాకెప్పుడూ రాలేదు. సంపాదించడం మొదలెట్టినప్పటి నించీ ఒక అసంతృప్తి వెంటాడుతూ ఉండేది.
మేరీ మాటలు గుర్తొచ్చాయి. "తల్లులు చిన్న చిన్న బహుమతులు అడగచ్చు కానీ ఇలా లక్షలు విలువ చేసేవి అడగడం, మిగతా పిల్లలకి పంచి పెట్టడం భావ్యమా" అని. నిజమే కదా? అలా అడగకూడదు కానీ మా నాన్న లాగా అసలు ఏమిస్తానన్నా వద్దనడం కూడా సరి కాదు కదా? అలాంటి తలితండ్రులతో చిన్న సరదాలైనా తీరవు అనుకుంటుండగానే నా మొహం మీద నవ్వు విరిసింది. మా అత్తగారు గుర్తొచ్చారు. ఆవిడంతట ఆవిడ ఏమీ అడగరు కానీ, చిన్న టేప్ రికార్డరో, ఎలక్త్రానిక్ వస్తువో, గడియారమో కొన్నామంటే అమితమైన సంతోషం వ్యక్తం చేస్తారు. సర్ప్రైజ్ లు చాలా ఇష్టం ఆవిడకి. చిన్నది పెద్దది అనేమీ లేదు, చిన్న పిప్పరమెంటు ప్యాకెట్ కొని ఆవిడ పర్స్ లో పెట్టినా, ఐస్క్రీం తెచ్చినా కూడా పండగే. ఆ సంతోషం ఎక్కువ కాలం లేదు లెండి. దానా దీనా.... ఏదైనా కావాలని అడిగి కొనిపించుకునే అమ్మా నాన్నలు/అత్తమామలు ఉంటే బాగుండుననే నా కోరిక తీరనేలేదు. అమ్మాలేదు నాన్నా లేరు అత్తా లేదు మామా లేరు ఏక్ నిరంజన్.. అని పాడుకుంటూ విచారంగా గులుగుతోంది మనసు. అలా గతం గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తుంటే చిన్నగా షాక్ కొట్టినట్టయింది.
సరదాగానైనా ఏమీ తీసుకోరని మా నాన్నని ఎన్ని సార్లు తిట్టుకుంటానో కానీ , నాకు తెలియకుండానే , నాకు కూడా అదే అలవాటు వచ్చేసిందని నేను గమనించలేదు. అసలే విందు..అందులోన మందు అన్నట్టు, గతంలో కొలీగ్స్ ప్రస్తావించిన విషయాలలో ఎక్కువగా ఇవే వినడం వల్లనేమో, పిల్లలతో సహా ఎవరైనా బహుమతి ఇస్తారంటే గుండెలో దగడు, బుగులు వచ్చేవి. అమ్మ దినాలు, నాన్న దినాలు లాంటి వాటికి పిల్లలు కానుకలు తెస్తే కసిరి కొట్టేదాన్ని, అవి మన ఇంటా వంటా లేవని. అలాగే పెళ్ళి దినాల వంటి వాటికి ఒకరికొకరు బహుమతులు కొనడం , సర్ప్రైస్ లు చేసెయ్యడం మాకు అలవాటు లేదు కాబట్టి నేను అప్పటివరకూ సేఫ్ అనుకునేదాన్ని. మరి నాన్నని అనుకుంటున్నా కానీ నేనేం చేస్తున్నాను? పిల్లలకి ఉద్యోగాలొచ్చాక నా కోసం ఏదో ఒకటి కొంటాననడం, నేను వద్దు పొమ్మనడం ఒకటైతే, మా సీతయ్యకి ఎవ్వరు ఏమిచ్చినా నచ్చదు. అందుచేత పిల్లలు తెచ్చిన వస్తువులని నచ్చచెప్పి రిటర్న్ చెయ్యడమో, ఎవరికైనా ఇచ్చెయ్యడమో మామూలయిపోయింది. దీన్ని ఇప్పటివరకూ సీరియస్ గా తీసుకోనేలేదు నేను. ఇది కరెక్టేనా? వాళ్ళూ నాలాగే బాధ పడరా భవిష్యత్తులో, చిన్న సరదా సంబరం కూడా లేకపోయాయని. అదీ కాక ఇప్పటికి "ఏది కొన్నా మా అమ్మ కోప్పడుతుంది, మా నాన్నకి నచ్చదు" అనుకుంటూ , బహుమతులు కొనే అలవాటు ఎప్పటికీ మానుకుంటేనో! మాకు అలవాటు లేదంటూ రానున్న కాలాల్లో భార్యా పిల్లలకీ కూడా కొనడం మానేస్తేనో.. హమ్మో..హమ్మో... అని ఆలోచిస్తూ వచ్చిన జ్ఞానోదయం వల్ల తీసుకున్న నిర్ణయానికి ఫలితమన్నమాట పైన పెట్టిన కోరికల చిట్టా.
*
మర్నాడు నా పుట్టినరోజు బహుమతిగా పిల్లలు తీసుకొచ్చిన చిన్న బహుమతులు నిజంగా చాలా పనికొస్తున్నాయి. వాళ్ళు కొనిచ్చిన వస్తువు వాడుతున్నాను అని చెప్పిన ప్రతిసారీ, తెగ సంబర పడుతున్నారు కూడా. "అలా అని మీరు కొనెయ్యకండి నాకు కావలసినవి అడుగుతా" అని చెప్తూ, యాడాదికొకటి రెండు మార్లు చిన్న చిన్న వస్తువులు కొనిపించుకుంటున్నా.
ఒకోసారి మనకి ఆత్మ విమర్శ కావాలి కదూ. కానీ ఏదో ఒక సందర్భం వస్తే తప్ప, కళ్లు తెరుచుకోవు. మేరీ అత్తగారిలా అతివృష్టి కాకుండానూ, మా నాన్నలా మరీ అనావృష్టి కాకుండాను మా అత్తగారిని రోల్ మాడల్ గా తీసుకున్న మూలంగా మా ఇంట సంబరాల రాంబాబుల సృష్టి జరిగిందన్నమాట. తేడా ఏంటంటే, ఆవిడ అడిగేవారు కాదు. నేను పాతిక డాలర్లు మించని వస్తువులు అవసరాన్ని బట్టి అడుగుతున్నా. శుభం పలకరా మల్లన్నా అంటే.. ఐరేని కుండ పర్రెబాసింది అనకుండా, మీకూ ఈ అవుడియా నచ్చితే ఫాలో అయిపోండి..ఈ సలహాకి పేటెంట్ రైట్ లేదు..ఉచితమే!
Posted by
Ennela
at
Thursday, April 20, 2023
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
నబ్రూయాత్ సత్యమప్రియం
21 Dec 2022
అక్కా ఇక్కడ మా ఆడపడుచుతో వేగలేకపోతున్నానే, నాకంటే ఆరేళ్ళు పెద్దది కదా.. అది చిన్న పిల్ల అంటూ చిన్న పిల్లలా చూడమంటారు.. ఆవిడ చేసే చిన్న పిల్ల పనులు చూస్తే నాకు చిర్రెత్తుతుంది. దాంతో ప్రతి రోజూ గొడవలే" చెప్పింది సత్య లత తో. " అయ్యో తల్లీ! మనింట్లో నువ్వు ఆఖరిదానివని మేమందరం నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాం. నువ్వు నీకంటే పెద్దదాన్ని చంటిపిల్లలా గారం చెయ్యమంటే ఎలా చేస్తావ్, సరేలే ఆ పిల్ల పెళ్ళి అయ్యేదాకానే కదా.. కొంచెం ఓర్చుకో తల్లీ, నేనూ సంబంధాలు చూస్తాలే, వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి చెయ్యమన్నారు, మంచి పిల్ల అని చెప్పి తెలిసిన వాళ్ళందరికీ సంబంధాలు చూడమని చెపుతాలే" అంది లత. కాసేపు ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుని ఫోన్ పెట్టేసాక కాస్త మనశ్శాంతి కలిగింది సత్యకి.
ఈ మాట చెప్పినప్పుడు "నీకంటే ఇంతమంది అక్కచెల్లెళ్ళు ఉన్నారు సత్యా, నేను ఒంటికాయ సొంటికొమ్ముని, నాకు ఏదైనా మనసులో బాధ కలిగితే మెరమెచ్చు మాటలు తప్ప మనసులో మాట పంచుకోడానికి ఎవరూ లేరు, స్నేహితులు ఉన్నారు కానీ, కొన్ని మాటలు పైకి చెపితే, భవిష్యత్తులో ఎప్పుడైనా జడ్జ్ చేస్తారని ఒక భయం ఉంటుంది" అంది సత్య పెద్ద తోటికోడలు శార్వాణి. "అక్కా, నీకు కసిన్స్ లేరా" అనడిగింది సత్య. "ఒకే ఒక్క కసిన్ ఉంది సత్యా. చాలా క్లోస్ గా ఉండేది. కొంత ఆధ్యాత్మికత వైపు మళ్ళింది. ఈ మధ్య ఎవరి గురించి ఏం చెప్పినా, పోనీలేవే ఏవైనా మంచి మాటలు మాట్లాడుకుందాం అంటోంది. అన్నీ మంచి మాటలే ఎలా వస్తాయి? నేను బాగున్నా, నువ్వు బాగున్నావా, ఫలానా వాళ్ళు ఎంత మంచి వాళ్ళో, ఎంత మంచి ఫుడ్డు తిన్నామో, ఎంత మంచి నగ చేయించుకున్నానో అని ఎన్నిసార్లు మాట్లాడుకుంటాము? అమ్మ లేదు, వదిన తో చెప్తే, నా పుట్టింటిని, మన ఇంటిని పోల్చి మాట్లాడుతుంది. మా కసిన్ కి చెప్పేదాన్ని ఇంతకు ముందు, ఇప్పుడు తనకి కూడా ఫోన్ చెయ్యడం మానేసా అందుకే" అని శార్వాణి చెప్పగానే, ఆలోచించడం మొదలెట్టింది సత్య. అలా అందరితోనూ, అందరి గురించీ, అన్నీ మంచి మాటలే చెప్పడం ఎవరికైనా సాధ్యమా అని. అత్తగారు రావడంతో మాటలు ఆపి, ఎవరి పనులలో వాళ్ళు పడ్డారు.
*
" సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం" అని టీవీలో వినిపిస్తున్న ప్రవచనం వింటూ బట్టలు మడత పెడుతోంది సత్య. సత్యం మాట్లాడడం, ప్రియమైన మాటలు మాట్లాడడం వరకు ఫర్వాలేదు మంచిదే, కానీ శార్వాణి లాంటి వాళ్ళు, ఎవరికీ ఏమీ చెప్పకుండా అన్నీ మనసులో దాచుకుంటే మానసిక సమస్యలు రావా? పాత కాలంలో పేరంటాలకి వెళ్ళినప్పుడో, నీళ్ళు తెచ్చుకోవడానికి బావి/చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడో, తమకి ఇంట్లో ఉన్న సమస్యని చర్చించుకుంటే, పరిష్కారం ఉన్నా లేకపోయినా మది లోని సొద పొదలో విడిచిపెట్టినట్టు ఇంకొకరు పంచుకున్నారనే తృప్తి ఉండేది అని చెప్పేది అమ్మ. ఆ అవకాశం ఇప్పుడు పోయింది కదా మరి నభూయాత్ సత్యమప్రియం అనే మాట ఈ కాలానికి చెల్లుతుందా అంటే, ఖచ్చితంగా చెల్లదు అనిపించింది. ఎప్పుడూ చెడు మాట్లాడాలని కాదు కానీ, మనసులో ఉన్న వ్యధ ఎవరితోనూ పంచుకోకుంటే ఎలా? అలా అని మన దేశం లో మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళడమూ కష్టమే కదా అనుకుంటూ, వంట ఇంట్లో ఉన్న శార్వాణి దగ్గరికి వెళ్ళి " అక్కా నీకున్న బాధల్లో సగం నాకు ఎలాగూ తెలుసు ఇద్దరి మెట్టిల్లూ ఒకటే కాబట్టి. నీ పుట్టింటి సమస్యలు నాకు చెప్పినా , నాకు వాళ్ళతో కనెక్షన్ లేదు కనుక నీకు ఎటువంటి సమస్యా రాదు. నన్ను తోబుట్టువు అనుకో అక్కా. నీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పు, నేను నా తల్లి మీద మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఆ విషయాలేవీ నా పెదవి దాటవు. ఇంకో విషయం.. నువ్వంటే నాకు చాలా ఇష్టం, మా పెద్దక్క ఎంతో నువ్వూ అంతే, నిన్ను జడ్జ్ చేసే ప్రసక్తే లేదు. ఇంకెప్పుడూ నీకు ఎవరూ లేరు అనుకోవద్దు. నాకు ఐదుగురు కాదు ఆరుగురు అక్కలు" అంటున్న సత్య మాటలు విని, మరిదికి పెళ్ళి కుదరగానే, ఉన్న కష్టాలతో పాటు వచ్చే కొత్త అమ్మాయితో ఇంకేమి భరించాలో అనుకున్న శార్వాణి సంతోషంతో కళ్ళు తుడుచుకుంది.
Posted by
Ennela
at
Thursday, April 20, 2023
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
డేంజర్
7 డిసంబరు, 2022
"ఒరేయ్.. శుంఠా! ఏం మాట్లాడుతున్నావసలు? నువ్వు చెప్పింది పరమ చెత్త అయిడియా. నాకసలు నచ్చలేదు. తింగరితనం ఆపి, కోతి అయిడియాలు ఇయ్యడం మాను" మూడవ మరిదిగారిని ఉద్దేశించి రెండవ తోటికోడలి ఫోన్ నించి వచ్చిన మెస్సేజ్ చూసి అదిరిపడింది సుమజ. ఈ అమ్మాయి ఇలా ఎప్పుడూ మాట్లాడదే! ఏమయింది? నిన్న ఏదో విషయంలో అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ అయిందే అనుకోండి, కానీ మరీ ఇలా చెట్టంత మరిదిని పట్టుకుని అరేయ్ ఒరేయ్ అంటుందా! బాబోయ్! అని బెంగపడి, వాళ్ళాయన దగ్గరికి పరిగెత్తింది, ఫ్యామిలీ గ్రూప్ చూసారా అంటూ. రవి కూడా తికమక పడ్డాడు, ఎటుపోతోంది వ్యవహారం అని. రవి చిన్న తమ్ముడు సూరి వెంటనే గ్రూప్ నించి ఎక్సిట్ అయ్యాడు. వెంటనే అతని భార్య సుధ కూడా. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తే ఏం గండమో అన్నట్టుంది రవి, సుమజలకి. సూరికి సుధకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు.
*
తన వంటల చానెల్ లో రోజూ లాగే పనీర్ పకపకా అనే కొత్త వంటకం పెట్టింది శ్రీజ. పూర్తిగా వండక్కరలేకుండా వండే వంట కాబట్టి పక్కాగా పకాయించకుండా ఉండే అర్థంతో పకపకా అని పేరు పెట్టింది. వంట బాగుందో లేదో కానీ, అది అందరికీ పకపకా నవ్వు తెప్పించిందని బోలెడు కామెంట్లు విసిరారు ఫాలోవర్లు. "పనీర్ పకపకా చాలా బాగుంది మరదలా" అని వచ్చిన ఒక కామెంట్ చూసి చాలా కన్ ఫ్యూస్ అయింది శ్రీజ. ఎందుకంటే అది తనకి అన్న వరసయ్యే వారి నించి వచ్చిన కామెంటు. అప్పటి దాకా యూట్యూబ్ కామెంట్లకి పడీ పడీ పకపకా నవ్వుతున్నదల్లా ఈ కామెంట్ చూసి మనసు కొంచెం బాధపడింది. ఆ కామెంటుకి లైకు, కామెంటూ పెట్టకుండా ఉండిపోయింది. ఫోన్ చేసి అడుగుదామా అని అనుకుంది కానీ, ఎందుకో ఫోన్ కూడా చెయ్యాలనిపించక, అన్యమనస్కంగా ఉండిపోయింది ఆ రోజంతా.
*
హారర్ మూవీ చూసి పడుకున్న సత్యకి అర్థరాత్రి ఫోన్ వచ్చింది. తీరా చూస్తే అది యాడాది క్రితం చనిపోయిన ఇస్తర్ నంబరు. ఒక్క నిమిషం అదిరిపడింది. ఈ లోపు మెసేజ్ "హవ్ ఆర్ యూ సత్యా డియర్" అని. వామ్మో అని గుండె అదురుపాటుకి మందుగా హనుమాన్ చాలీసా చదువుతూ వణికిపోయింది. అసలు ఒక్కతీ ఉన్నప్పుడు హారర్ అనే పేరు చెప్తేనే భయం తనకి. ఏదో చానెల్ తిప్పుతూ చూస్తున్న సినిమాలో అకస్మాత్తుగా శవం లేచే సీన్ దగ్గర ఆపేసి, నిద్ర పోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటే, గుండె ఆగిపోయేలా ఈ ఫోను, మెసేజీ.. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూసింది గుండె ఆగిపోకుండా ఉగ్గబట్టుకుంటూ..
*
"అదేంట్రా అన్నయ్యా సూరి, సుధ అలా గ్రూప్ నించి వెళ్ళిపోయారు? ఏం జరిగింది?" అని ఫోన్ చేసాడు రవి పెద్ద తమ్ముడు రాఘవ. " సుమతి అంత మాట అనకుండా ఉండాలిసిందిరా" అన్నాడు రవి. "సుమతి ఏమంది? నేను లేనప్పుడు గొడవ పడ్డారా? సూరి ఏమైనా చెప్పాడా" అడిగాడు రాఘవ అమాయకంగా. "మీరంటే దగ్గరలో ఉన్నారు. విడిగా ఏం జరిగిందో మాకెలా తెలుస్తుందిరా ఇంత దూరం నించి. వాడేమీ ఫోన్ చెయ్యలేదు, నేను చేసినా ఫోన్ తియ్యలేదు. నేను అంటున్నది గ్రూప్ లోనే" అన్నాడు రవి. "అదేమంది? అది అసలు ఇంట్లో లేదుగా? వాళ్ళమ్మకి ఒంట్లో బాగాలేదని చూసిరావడానికి వెళ్ళింది పొద్దున్నే" అన్నాడు. "మరి ఫోన్ లో ఆ మెస్సేజ్ ఏంటి" అన్నాడు రవి. "అయ్యో అదా! నేనెప్పుడూ వాడితో అలానే మాట్లాడతానుగా? నా ఫోన్ లో డేటా ఎక్కువ ఉందని, నా ఫోన్ దానికిచ్చి పంపాను. దాని ఫోన్ లోంచి నేను మెస్సేజ్ పెట్టాను" అన్నాడు రవి తేలిగ్గా. "ఈ విషయం ఋజువు చెయ్యడం కుదురుతుందో లేదో చూసుకో వెంటనే. ఇప్పుడు చెయ్యకపోతే బంధాలు తెగిపోతాయి, నేను పెట్టేస్తా. నువ్వు సుమతి ఫోన్ లోంచి సూరికి మెస్సేజ్ పెట్టు, సుమతితో కూడా నీ ఫోన్ తన దగ్గర ఉందని సుధకి చెప్పించు, తొందరగా చెయ్యి" అంటూ ఫోన్ పెట్టాడు రవి, కొంచెం గాభరాగా.
*
"ఏమిటి రోజూ ఫోన్ చేసేదానివి ఈ మధ్య ఫోన్ లేదూ" అంటూ పదే పదే ఫోన్ చేసినా తియ్యకపోవడంతో, శ్రీజ చెల్లికి చేసి, గ్రూప్ కాల్ కలపమని అడిగి, కాల్ లోకి రాగానే కంగారుగా అడిగింది రోజా శ్రీజని. కొంత ముభావంగా మాట్లాడి, "అన్నయ్య ఇలా కామెంటు పెట్టారు" అని బాధపడింది శ్రీజ. "ఓసి పిచ్చక్కా కామెంటు పెట్టినంది నేనే, కంప్యూటర్ లో మీ అన్నయ్య జీ మెయిల్ అక్కౌంట్ లాగిన్ అయి ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు" అనగానే నవ్వేసింది శ్రీజ.
*
"ఎట్లా ఉన్నావు బంగారూ, దుబాయి నించి నిన్న పర్మనెంటుగా వచ్చేసాను. నీ ఫ్రెండ్ ఫోన్ నంబరు మార్చలేదు, తన గుర్తుగా అదే నంబరు, అదే ఫోను వాడుతున్నా, రాత్రి ఫోన్ చేసాక గుర్తొచ్చింది, మీకు అర్థరాత్రి అని, అందుకే మెసేజ్ పెట్టి, సరేలే పొద్దున్న అయ్యాక ఫోన్ చెయ్యచ్చని ఊరుకున్నా" అంటున్న జాషువా మాటలకి "అన్నయ్యా, నేను చచ్చిపోబోయి బతికా, అంత భయపెట్టడం నీకు తగునా" అంది సత్య. "ఏమైంది బంగారూ? ఎందుకు భయపడ్డావ్" అంటున్న జాషువాతో "అర్థ రాత్రి ఇస్తర్ దగ్గరనించి ఫోన్ వస్తే గుండె ఆగిపోదా" అంది సత్య. "అంత క్లోస్ ఫ్రెండ్ వి , దోస్త్ దగ్గర నించి ఫోన్ వస్తే సంతోషపడాలి కానీ భయపడతారా ఎవరైనా" అంటున్న జాషువాకి ఏంచెప్పాలో అర్థం కాలేదు సత్యకి.
Posted by
Ennela
at
Thursday, April 20, 2023
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
వింత నాటకం
Wednesday, November 23, 2022
ఆ సంవత్సరం ఆ టైమ్ లో పిల్లలు యూనివర్సిటీ లో మిడ్టర్మ్ పరీక్షలతో బిజీ, సీతయ్య పనిమీద భారతయాత్ర. నాకు అకాణంగా అరికాళ్ళకి ఏదో ఇన్ఫెక్షన్/మెడికల్ రియాక్షన్. అడుగుతీసి అడుగెయ్యలేని పరిస్థితి. ఇంకోవైపు ఆఫీసు లో యూనియన్ ఎంప్లాయీస్ స్టైక్ కాబట్టి నాన్-యూనియన్ ఎంప్లాయీస్ ఏ వంకలు పెట్టకుండా ఆఫీసుకెళ్ళి పని ఆగకుండా చూడాలని మేనేజ్మెంట్ నుండి బేషరతు వార్నింగ్. ఎముకలు కొరికే చలి. డ్రైవ్ వే గంటలతరబడి క్లీన్ చేస్తే కానీ కారు కదలనంత మంచు. కాసేపు సీతలా కాసేపు పీతలా ఎలాగోలా అన్నీ చేసుకుంటూ పోతుంటే పురుగు మీద పుట్రలా నిమోనియా. డాక్టర్ ఇచ్చిన మందులేవో వేసేసుకుంటే అర్థరాత్రి ఏదో అయిపోయి అరదూరం ఆకాశం వైపు ప్రయాణించి దాదాపు 16 గంటల తరువాత నేనెక్కడున్నా అని చూడడానికి ఓపికలేక ఎవరైనా ఒకచుక్క నీళ్ళో పాలో పోస్తే బాగుండుననే తీరని ఆశ. పాక్కుంటూ మెట్లు దిగి దొరికిన పండు తినేసి స్పృహలో ఉండడానికి ప్రయత్నం. అంటువ్యాధని అనుమానంతో అవునూ కాదూ అంటూ అయిదు రోజుల సెలవు. అందులో రెండు వీకెండు రోజులు. అనగా మూడు రోజుల సెలవిచ్చారు అన్నమాట. పిల్లలకిి పరీక్షలు తెలిస్తే పరీక్షలు మానేసి వచ్చేస్తారని భయం , ఇండియాలో తెలిస్తే పనులు మానుకొని సీతయ్య వచ్చేస్తారని టెన్షన్...మంచుకురిసే వేళల్లో ఎవరిపనులు వారికే తీరవు కాబట్టి ఎవరికీ అనారోగ్యం గురించి చెప్పలేని మొహమాటం....అప్పుడొచ్చింది పుట్టినరోజు.
ప్రతి సంవత్సరం కొత్త చీర కట్టుకున్నావా అని అత్తయ్య అడిగినప్పుడు గుడికెళ్ళావా అని నాన్న అడిగినప్పుడు అవునని చెప్పి నవ్వుకునేదాన్ని ఎలా కుదురుతుంది అని..
ఆ సంవత్సరం ఆదివారం పుట్టిన రోజు వచ్చింది కాబట్టి ఆ రెండూ చెయ్యాలని పట్టుదల. అంటే చెప్పా కదా ఆకాశం వైపు ప్రయాణం. మళ్ళీ ఇంకో పుట్టిన రోజు వచ్చేనో రానో ఆ పెద్దోళ్ళిద్దరికీ ఒక్క సారన్నా నిజం చెప్పాలని తపన కావచ్చు . ఈలోపు మా శక్కు Shakuntala
ఫోన్ చేసింది. రేపు గుడికెళదామా అన్నా. రేపు కాదులే నాకు పనుంది ఎల్లుండి వెళదామా అంది. నా పుట్టినరోజు అసలు ఎల్లుండే. హమ్మయ్య అనుకోకుండా భలే కుదిరింది అనుకున్నా. నాకు బాగోలేదని తెలియదు కాబట్టి వాళ్ళింటి కొచ్చి పిక్ చేసుకోమంది.
మొత్తం ఆస్ట్రోనాట్ లా తలనించి పాదాల వరకూ కప్పుకుని వాక్ వే మాత్రం ఎలాగోలా క్లీన్ చేసొచ్చి పడుకుంటున్నా కానీ కార్ తీయాలంటే మంచుపర్వతాన్ని కదిలించాలెలాగో అనుకుంటూ బీరువా వెతికా. ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త బట్టల్లేవు. ఎలగెలగా అని ఆలోచిస్తూ..ఎప్పుడూ లేంది ఈ కోరికేంటి అని విసుక్కుంటూ తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నా.
మీరు నమ్ముతారో లేదో కానీ శనివారం రాత్రి 12 గంటలప్పుడు హాప్పీ బర్త్ డే టు యు అంటూ పిల్లలు సీతయ్య..కుటుంబం అంతా ఫోన్ చేసే దాకా పెయ్యిమీద సోయిలేదు. జవాబు చెప్పే ఓపికగా లేదు.
పొద్దున నెమ్మదిగా లేచి మంచుపర్వతాన్ని కదిలించే ఓపిక ఎలా వచ్చిందో మరి ..సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని గుర్తుచేసుకుంటూ పద్మవ్యూహం ఛేదించి బయటపడ్డా. శక్కు పది గంటలకి రమ్మంది. గుడినించొచ్చాకా అపాయింట్ మెంట్ ఉందిట తనకి. తను చాలా ఠంచను. తనెప్పుడూ ఎక్కడికీ లేట్ రాదు. లేట్ చేసేవాళ్ళని విసుక్కుంటుంది. ముందే చెప్తే ఇంకో పని చేసుకునే దాన్ని కదా సరిగ్గా టైమ్ చెప్పమంటుంది కానీ దుకాణాలు పదికి కానీ తెరవరు. ఎలా ఎలా అనుకుంటూ శక్కు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆగా అటూ ఇటూ చూస్తూ .కొట్టు తెరవగానే ఏదోటి కొనేసి రయ్యిమని 5 నిమిషాలలో వెళ్ళిపోవచ్చని మాస్టర్ ప్లాన్.
అబ్బ భలే ..ఈ కొట్టు వారెవరో 9.40 కే షాపు తెరిచారు. లోపలికెళ్ళి చూస్తే హెవీ వర్కున్న చీరలు సూట్లు.. చీరలు కట్టే వెదరు కాదు కాబట్టి అలవాటు లేని పంజాబీ సూట్లు చూద్దామని ముందే అనుకున్నదే కాబట్టి చూస్తుంటే ఎంతవెతికినా ఒక్కటంటే ఒక్క జత కూడా నా సైజుకానీ నేను వేసుకునే సింపుల్ వి కానీ లేవు. పెద్ద ఫంకషన్లకి పంజాబీ లు వాడే చమక్ ధమక్కులు. అయ్యో తెలియకుండా ఇరవై నిమిషాలు అయింది. శక్కు కి పావుగంట లేటు అని చెపుదామని ప్రయత్నిస్తే ఫోన్ ఎత్తలేదు. దగ్గరలో ఉన్న నిమ్మికి చెప్తే ఇన్ఫార్మ్ చేస్తుందని నిమ్మికి, సోదరులు
కిరణ్ గారికి ఎన్నిసార్లు చేసినా ఎవరూ ఫోన్ తీయలేదు. సరేలే గబగబా వెళ్ళి పోదాం ..జిగేల్మనేవైనా సరే కొత్త బట్టలు కావాలంతే అని డిసైడ్ అయినా ఒక్కొక్క జతలో నాలాంటి వారిద్దరు పట్టేట్టున్నాయి. ఈరోజు కొనుక్కుంటే రెండు రోజుల్లో సైజు చేయించి ఇస్తామన్నారు దుకాణదారులు. వద్దులెమ్మని నిరాశగా వెళ్ళి పోతుంటే ఫైనల్ సేల్ అని వ్రాసున్న వాటిలో ఒక్కటంటే ఒకటి నా సైజుది కనబడింది. మన స్టయిలు కాదు బట్ ఇట్సోకే...చాలా ఖరీదైనా 80%డిస్కవుంటుట..భలేమంచి చవక బేరమూ. ఒకసారి వేసుకుని గుడ్విల్ లో పడెయ్యచ్చు అనుకుంటూ ఛేంజ్ రూంలో చకచకా మార్చుకుని డబ్బులు కట్టేసి వెళ్ళి పోతున్న నన్ను వాళ్ళు కాస్త వింతగా చూసినా నేను పట్టించుకోలేదు.
ఈలోపు శక్కు గారమ్మాయి Anupama నించి ఫోను, ఆంటీ ఎక్కడున్నావని. 'పది నిమిషాలలో మీ అపార్టుమెంటు దగ్గరుంటా. అరికాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నాయి కిందకొచ్చెయ్యండి వెళ్ళిపోదాం' అన్నా. కానీ 'ఆంటీ అమ్మ ఇంట్లో లేదు. ఎక్కడికో వెళ్ళింది మీకేమైనా చెప్పిందా' అనడిగింది. 'లేదు రా ఏమైనా గొడవైందా' అన్నా అమ్మాయి గొంతులో పలికిన విషాదాన్ని గుర్తించి. 'అవును ఆంటీ పైకి వస్తారా మరి. అమ్మకి మీరు ఫోన్ చేద్దురుగాని నాకు భయంగా ఉంది' అంది. వాళ్ళు ఇద్దరూ ప్రేమ మీరినప్పుడు డిష్యుండిష్యుం అయితే నేనే జడ్జీని. అబ్బా ఇవాళ గుడి కాన్సిల్ అనుకుంటూ, అడుగుతీసి అడుగేస్తూ అపార్టుమెంటులోపలికి నడిచా. ఇంకోవైపు నించి శక్కు నాకెదురొచ్చింది. 'అదేంటి రెడీ కాలేదు. ఇక్కడ ఉన్నావేంటీ గుడికెళ్ళట్లేదా మనం' అన్నా ఏమీ తెలియనట్లు . 'మెయిల్ తీసుకుందామని మెయిల్ రూం కి వెళ్ళా' అంది నిర్లిప్తంగా. పెద్దగా మాట పలుకు లేదు..'రా' అంటూ లిఫ్టు వైపు దారి తీసింది. అయ్యో అమ్మో అని మనసులో అనుకుంటూ కాస్త తేలికపరుద్దామని 'శక్కూ ఈరోజు నా పుట్టినరోజు తెలుసా' అన్నా. నా పుట్టినరోజు కాబట్టి ఇద్దరూ సద్దుకు పోతారని ఆశ. 'ఓ అవునా' అంది నిరాసక్తంగా.
'హాప్పీ బర్త్ డే చెప్పవా మరి' అన్నా..'చెప్తాలే రా' అంది ఇంట్లో కి దారి తీస్తూ. ఓర్నాయనో పుట్టిన రోజు అని చెప్పినా కదలికలేదంటే ఈ డిష్యుండిష్యుం ఎప్పటిలా తాటాకుమంట కాదన్నమాట. ఇప్పుడు చిన్నది ఏడుస్తుందా. దాని కంట్లో నీరు చూస్తే నాకు మనసు అల్లకల్లోలం అయిపోతుంది..దేవుడా దేవుడా..అసలు భక్తీ గిక్తీ లేని నాకు గుడికెళ్ళాలని పట్టుదల ఏంటో...ఈ సారి తప్పకుండా వెళ్తా అని నాన్నకి చెప్పినందుకే కదా పోనీలే ఇప్పడేం కొంపలంటుకోవు వెళ్ళకపోతే టేకిటీజీ అని ఆలోచిస్తూ శక్కు ని ఫాలో అయిపోయా కామ్ గా.
తలుపు దగ్గర ఆగి 'నుప్వేపో లోపలికి' అంది. నీ అలకలు చిలకలెత్తుకెళ్ళా అనుకుంటూ తలుపుతోసా. ' హాప్పీ బర్త్ డే టు యు ' అనుకుంటూ అను, నిమ్మి, కిరణ్ గారు, వాళ్ళ మేనల్లుడు హేమంత్. నేను ఆశ్చర్యం లోంచి తేరుకుని ' ఈ వింతనాటకాలేంటమ్మా అసలు మీరందరూ ఎప్పుడొచ్చారసలు' అన్నా అయోమయంగా. 'నువ్వు శనివారం గుడికెళదామని అడిగినప్పుడే కావాలని ఆ రోజు కుదలదు ఆదివారం వెళదామన్నా . నిన్ను ఇంట్లోకెలా రప్పించాలో తెలియలేదు అందుకని' అంటూ నవ్వేసింది శక్కు. నిమ్మి కిరణ్ గారు కావాలని ఫోన్ తీయలేదని ఇష్టం గా ఒప్పుకున్నారు నవ్వేస్తూ.
జీవితంలో మొదటిసారి పుట్టినరోజు కి కేక్ కటింగ్ క్రెడిట్ అను అకౌంట్ లో పడింది. ఆ తర్వాత గుడి, భోజనం. అంత అలసటలోను బోలెడు ఆనందంతో ఇల్లు చేరా. మా సీతయ్య పిల్లలు సూపర్ థ్రిల్లింగ్గా విని బోలెడు అప్రషియేట్ చేసారు ఈ నాటకాన్ని.
మాకు సర్ప్రైజుల మీద ఎప్పుడూ ఆసక్తి లేదు కానీ అప్పుడున్న నా శారీరిక మానసిక పరిస్థితి కి ఒంటరితనానికీ అది టానిక్ లా పనిచేసిందని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. వాళ్ళు సరదా అనుకున్నా నాకు మాత్రం ఆ సహాయం ఎప్పటికి మరువలేనిది .
కొసమెరుపు: నేను ఎప్పుడూ వాడని ఆ విచిత్రమైన వస్రాలని నా స్నేహితులు పాకీజా సిండ్రెల్లా క్లియోపాట్రా మోనాలీసా డ్రెస్ అని వివిధ నామకరణాలతో నన్ను ఆటపట్టించినా ..మల్టీకల్చరల్ డే కి ఇండియన్ డ్రస్ వేసుకోవాలని కలలు గన్న ఫిలిప్పీనో పిల్లకి నేను తీసుకెళ్ళిన ఐదు జతల్లోకి ఈ జత అతికినట్టు సరిపోగా అంకితం చేసేస్తున్నా అంది. అంతకన్నానందమేమి అని ఆనందభాష్పాలు రాల్చింది నా మనసు.
ఈ ఫోటో ఎక్కడ నుంచొచ్చిందో మరి ఈ ఫోన్లో తీయలేదు కానీ collage your photos అంటూ పైకొచ్చి నన్ను ఐదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది.
Posted by
Ennela
at
Wednesday, November 23, 2022
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
సంసారం గుట్టు.....
నేను ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా చుట్టాలో, స్నేహితులో ఎవరో ఒకరుంటారు... నాన్న పెద్దవారవడంతో ఇంటి ముందు నించి వెళ్ళే వాళ్ళందరూ ఒక సారి చూసి పలకరించి పోతుంటారు. వాళ్ళని పలకరించమని మా అక్క ఫోన్ ఇస్తూ ఉంటుంది. అటు అత్తయ్య కి ఫోన్ చేసినప్పుడు కూడా అంతే. ఇంటికి దూరంగా ఉండడం వల్లనేమో నాకు అలా అందరితో ఒక 5 నిముషాలు మాట్లాడే అవకాశం వచ్చినందుకు భలే ఇష్టం గా ఉంటుంది. అయితే గతం లో ఎవరినైనా బాగున్నారా అన్నప్పుడు బాగున్నాం అని చెప్పి ఎదో కష్టాలు సుఖాలూ చెప్పేవారు. ఈ మధ్య అందరూ ఒకే మాట సూపర్.. చాలా హ్యాప్పీ... ఇదేంటబ్బా అనుకున్నా.. అందరూ బాగుంటే అంతకన్నా ఏం కావాలి కానీ ఏదో తెచ్చిపెట్టుకున్నట్టుంటోంది.. విషయం ఏంటంటే ఈ మధ్య మా ఊరి పంతులు గారు చెప్పారుట ఎవరైనా మీరు ఎలా ఉన్నారు అన్నప్పుడు చాలా బాగున్నామని చెప్పాలి అప్పుడే మీకు పాసిటివ్ వయిబ్రేషన్స్ వస్తాయని.. అప్పటి నించీ అనుకుంటా "సూపర్, హ్యాప్పీ" తప్ప ఇంకేమీ లేదు. ఎవరితో మాట్లాడినా ఇదే జవాబు ఆశిస్తుంటా అదే వస్తుంటది.. రెండే ముక్కలు ఖేల్ ఖతం..
మా చుట్టాలొకావిడ ఉంటుంది.. ఆమెకి ఎవరు కలిసినా, ఆవిడ బీపీ గురిచి గంటలు గంటలు చెపుతూ ఉండేదిట ... ఈ మధ్యన బీపీ అన్నది సాధారణం అవ్వడమే కాకుండా అదున్న వాళ్ళకి శుగరూ గట్రా ఒక ప్యాకేజీ లా వచ్చేస్తున్నాయి కానీ అదృష్ట వశాత్తూ ఆవిడకవేమీ లేవుట .. కానీ ఆ ఉన్న దాన్నే చెప్పీ చెప్పీ చెప్పీ చెప్పీ ఆవిడనందరూ బీపీ సరూపమ్మ అని పిలుస్తుంటారుట. .. ఒకసారి దారిలో కలిసినప్పుడు ఎక్కడకెళుతున్నారందిట. ఎవరికో ఒంట్లో బాగాలేదని ఆస్పత్రికెళుతున్నామని చెప్పారుట మావాళ్ళూ.. అవునా నాకూ ఈ మధ్య బాగోట్లేదు.. అని మొదలెట్టి ఇంకోళ్ళని నోరెత్తనీయకుండా గంటన్నర నిలుచున్న చోట నించి కదలనీయకుండా మేము వెళ్ళాలి లేట్ అవుతోందన్నా వినకుండా చెపుతూనే ఉందిట . గూగులమ్మ లేని కాలంలో ఆవిడతో మాట్లాడితే చాలు బీపీ పుట్టుపూర్వోత్తరాలతో పాటు ఏ ఏ మందులు వాడాలో కూడా తెలిసిపొయ్యేది అని చెప్పింది మా చెల్లి. ఏమన్నా అంటే 'సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు.. నేనేమీ సంసారాన్ని బయట పెట్టట్లేదుగా' అని బుకాయిస్తుందిట... భలే ఇంటరెస్టింగ్ అనిపించింది నాకు. ఈవిడ మా చుట్టలబ్బాయి భార్య. నాకు పెళ్ళయ్యాక వాళ్ళ పెళ్ళయ్యింది, అందుకే నాకు ఆవిడని కలిసే సదవకాశం రాలేదు..
నేనెళ్ళినప్పుడు దూరంగా ఆవిడ కనబడిందని మా వాళ్ళు కొంచెం దూరమైనా సరే ఇంకో అడ్డదారిలో వెళదామంటారు.. అలా క్లోస్ గా ఉండేవాళ్ళు అరుదయిపోయారు కాబట్టి, ఇక్కడ అంతలా మాట్లాడే వాళ్ళు ఉండరు కాబట్టీ నాకు అయ్యో అనిపించింది..'పాపం లేవే! ఏదో మనం కాబట్టి చెప్పుకుంటుందంటాను' నేను.. 'నీకు తెలియదు లే! నడువు' అని రెక్క పట్టుకుని లాక్కు పోతారు.
ఆ మధ్య మా పెదన్నన్న గారు చనిపోయారని తెలిసి అందరమూ ఆదరా బాదరా పరిగెత్తుతున్నాము. బీపీ సరూపమ్మ కనిపించి 'ఏమయ్యింది' అనడిగింది. పెదన్నన్న చనిపోయారని చెప్పాము.. 'అయ్యో అట్లనా..నేను వచ్చేదాన్ని కానీ రాలేకపోతున్నా' అంది.. ఫర్వాలేదు అనేలోపు ఆవిడ బీపీ తో సహా వాళ్ళ బుడ్డోడికి 4 రోజులుగా వచ్చిన జ్వరం గురించీ, ఏ ఏ మాత్రలు వాడిందీ ఏ ఏ డాక్టర్లకి చూపించిందీ.. ఆ డాక్టర్ల వైనం గురించీ అరగంట చెప్పింది.. 'పాపం బుడ్డోడి గురించి ఎంత మధన పడుతోందో ఆ తల్లి' అన్నాన్నేను.. మా చెల్లి చిరాగ్గా చూసి 'అవును గానీ సరూపొదినా బుడ్డోడేడీ' అనడిగింది.. 'ఇంట్లో ఉన్నాడు ఇక్కడెవరికో బాగాలేకపోతే మధ్యాహ్నం చూడ్డానికెళ్ళా కబుర్లలో పడి లేటయ్యింది' అని ఆ కబుర్ల చిట్టా చెప్పబోయింది.. 'అయ్యో అవునా బుడ్డోడు ఏడుస్తుండుంటాడు పోయి చూసుకో పాపం నీకెన్ని కష్టాలో' అని ఇంక ఒక్క నిముషం కూడా ఆగకుండా లాక్కు పొయ్యింది మా చెల్లెలు.. 'మాట్లాడుతుంటే లాక్కొస్తావెంటే నీ కసలు మర్యాద లేదు' అన్నాన్నేను.. 'నీ మొహం లే పద' అంది.. 'నాన్న చూసి ఉంటే ఎంత బాధ పడి ఉంటారో నీ కరుకు మాటలకన్నా.. 'ఇటువంటి వాళ్ళతో అలానే ఉండాలి పద పద' అంది...
చెప్పడం మరచిపోయా మేము ఇంటికెళ్ళింది మా మారిది గారి పెళ్ళని. అందరినీ కలిసినట్టుంటుందని పెళ్ళిపిలుపుల పని మాకిచ్చారు అత్తయ్య. దానిలో భాగం గా బీపీ గారింటికెళ్ళాము. ఒక రబ్బరు బొమ్మ లాంటి చిన్నారి ఇంట్లో ఆడుకుంటోంది.. సుతారంగా పాపని తాకుతూ 'ఎవరొదినా' అని అడిగా.. పక్కింట్లో జెయినులో ఎవరో అద్దెకి వచ్చారుట. 'ఆ పిల్ల అంటే మీ అన్నకి ప్రాణం రోజంతా ఇక్కడే ఆడుకుంటుంది' అంది. 'బావగారేరక్క' అని అడిగాడు మా సీతయ్య.. 'ఆయనకి ఒంట్లో బాగలేదు ఏదో మూలికల వైద్యుడి దగ్గరకెళ్ళాడ'ని చెప్పింది..అయ్యో ఏమయ్యింది అని మా సీతయ్య అనేలోపు పెళ్ళి పిల్ల ఊరూ పేరు వివరాలడిగి, నేను ఏమీ చెప్పకముందే వాళ్ళ చెల్లి కూతురి పెళ్ళి అనుకోవడం, పూల పండ్లు అయ్యాక అది కాన్సిల్ అవడం దాని కారణాలు వగైరా చెప్పుకుంటూ పొయ్యింది.. మేము వెళ్ళలేక ఉండలేక చిక్కుకుని.. మాటి మాటికీ గడియారం చూసుకుంటూ ఇబ్బందిగా నిలబడ్డాము, ఆవిడ ప్రవాహం పోతూనే ఉంది.. ఏ మాటకామాట ..మా చెల్లి ఆరోజు అన్న మాట కి అర్థం ఈ రోజు వెలిగింది నాకు . ఇంతలోకీ భాస్కరన్నొచ్చాడు..హమ్మయ్య అనుకున్నా.. 'అన్నా నీకు ఒంట్లో బాగాలేదంట కదా' అన్నా బీపీ గారి మాట కట్ చేస్తూ.. 'అంత చెప్పుకునే విషయం కాదులేమ్మా ఏదో చిన్నది' అన్నాడు.. ఆయనట్లానే అంటాడు అంటూ అందుకోబోయింది బీపీ.. భాస్కరన్న నవ్వుతూ ' చాయ్ పానీ ఇచ్చావా, ఆడబిడ్డని అట్లనే పంపుతున్నవా?' అంటూ అక్కడున్న పాపాయిని ఎత్తుకుని ఎగరేసి ముద్దు పెట్టుకుని జేబులోంచి చాక్లెట్ తీసిచ్చాడు. ....సరూపొదిన అయ్యో అసలు ఆలోచనే రాలేదని వంటింట్లోకి వెళ్ళబోయింది.. అమ్మో అవన్నీ అయితే ఆలస్యమవుతుంది మళ్ళీ వస్తామని అదను చూసి జారుకున్నాం..
ఇది జరిగొక రెండేళ్ళయింది..మేము ఈ రెండేళ్ళు ఇంటి మొహం చూడలేదు. ఇదిగో మళ్ళీ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి. మామూలుగా కలవని వాళ్ళని పిలుపుల వంకతో కలిసే సందర్భం . మళ్ళీ వెళ్ళాల్సొచ్చింది బీపీ గారింటికి...ఈ సారి దృశ్యం లో కొద్ది తేడా..
పోయిన సారి చూసిన పక్కింటి వాళ్ళ చిన్ని పాపాయి (కొద్దిగా పెద్దదయింది.. మూడేళ్ళు ఉంటాయి..) ఇంట్లోకి రావాలని ప్రయత్నం చేస్తోంది, భాస్కరన్న ఆ పిల్లని కళ్ళెర్రజేసి చూస్తూ వేలితో మీ ఇంటికి పో అన్నట్టు బెదిరిస్తున్నాడు.. మమ్మల్ని చూసి కొద్దిగా ఖంగుతిని రండి రండి అంటూ లోపలికి దారి తీసాడు. ఆ చిన్నిది మా వెంట సంతోషం గా లోపలికొచ్చేసింది.. భాస్కరన్నకి నచ్చలేదు.. తన వైపు గుర్రుగా చూసాడు.. నాకు కొద్ది వింతగా అనిపించింది. చిన్నప్పుడు భాస్కరన్నా వాళ్ళు మా ఇంటి పక్కన ఉండే వారు. అన్న కి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం మమ్మల్ని కూడా ఎత్తుకుని ముద్దు చెయ్యడం, తినడానికేమైనా తీసుకొచ్చి పెట్టడం,,సైకిలు మీద తిప్పడం , అవీ ఇవీ కొనివ్వడం చేసేవాడు.. చాలా తక్కువగా మాట్లాడతాడు కానీ పిల్లలంటే చాలా ప్రేమ .. అలా అలవాటైన అన్నని ఇలా చూడటం వింతగా ఉంది.. 'చూశ్నవా ఆ పిల్లనెట్ల బెదిరిస్తుండో పాపం చిన్న పిల్ల' అన్నది వదిన.. ..ఏమనాలో తెలియనట్లు చూసాను.. శుభలేఖ ఇవ్వబోతూ బొట్టు పెట్టాను.. ఆ లోపు అందుకుంది..'మొన్నటి దాంక ఆ పిల్లని సంకనేసుకుని తిరిగిండు.. దానికేమి తెలుసు అదే లెక్క ముద్దు చేస్తడనుకుంటుంది..పొమ్మన్నా సమజ్ చేస్కుంటల్లేదు..ఇల్లు అమ్మి పోదామంటడు.. ఎట్ల చెప్పాల్నో తెలుస్తల్లేదు.. నువ్వన్న చెప్పు మీ అన్నకి' అంది.. నాకు తప్పలేదు 'ఏమయ్యిందన్నా అన'డిగా. ఏంలేదమ్మా అన్నాడు భాస్కరన్న రండి బావగారు కూచుందాం అంటూ... భాస్కరన్న, సీతయ్య మాటల్లో పడడం చూసి బీపీ వదిన అందుకుంది.. పక్కన ఉన్నవాళ్ళు ఏదో గురువుని నమ్ముతారుట. అప్పుడప్పుడు గురువు గారొచ్చినప్పుడు వీళ్ళని భజనలకి పిలుస్తారుట .వదినకి వాళ్ళ భాష రాకపోవడం వల్లనున్నూ, ఆవిడకి భజన అయినంతసేపు మాట్లాడకుండా ఉండటం కుదరదు కావునన్నూ ప్రార్థన టయింలో వెళ్ళదుట. భజనలవీ అయ్యాక ప్రసాదం తీసుకుని వస్తుందిట.. . అయినా ఫర్వాలేదంటారుట వాళ్ళు . అలాగే వదినగారింట్లో పూజలు పునస్కారాలకి వాళ్ళొస్తారుట. అన్నయ్య కి దేవుళ్ళూ పూజలంటే గిట్టదు గానీ వాళ్ళింట్లో ఇలా హడావిడి జరిగినా , వాళ్ళెక్కడికైనా వెళ్ళినా పాప బాధ్యత తీసుకుని సహాయం చేస్తాడుట .. బుడ్డోడితో సమానం గా చూస్తాడుట పాపని .. ఆ పక్కింటావిడ వదినతో క్లోస్ అయిపోయి ఈవిడ మాటల వల్ల వాళ్ళ పుట్టింటి వాళ్ళు దగ్గర లేని లోటును తీర్చుకుంటొన్దిట.. అలా అలా ఆరునెల్ల సావాసం చేస్తే వారు వీరయినట్టు రెండేళ్ళల్లో వారువీరయ్యారుట..
ఛీ, అసలు మీరు నా స్నేహితులేనా అంట!!??? బీపీ సరూపొదిన మాట్లాడటం తగ్గించేసిందనుకున్నారు కదూ ...కికికి.. తప్పులో కాలేసారు.. సూర్యుడు ఇటు బదులు అటు ఉదయిస్తాడేమో కానీ బీపీ ముచ్చట్ల విషయం లో యమ ధర్మ రాజులా సరూపొదిన డవిలాగ్ ..."ఏదన్నా అడుగు ఆ ఒక్కటీ దక్క"!!!!!!
వదినమ్మ ఆ స్నేహ గాఢత ని వర్ణిస్తుందే తప్ప అసలు విషయం లోకి రాదని నిర్ధారించుకుని పోయొస్తామొదినా చాలా మందిని పిలవాలి అనేసా.. అయ్యొ మరింతకీ సమస్యేంటో తెలుసుకోవా అంది చాయ్ పానీ అంటున్న అన్న మాటలకడ్డం పడుతూ..
గబ గబా చెప్పు అత్తమ్మకి కోపమొస్తుంది లేట్ అయితే అన్నా.. ఇలా రా అని లోపలికి తీసుకెళ్ళింది.. 'మీరు పోయిన సారి వచ్చినప్పుడు మీ అన్నకి బాగలేదని చెట్ల మందుకోసమెళ్ళాడు గుర్తుందా అంది లో గుంతుకతో .. ఆ ఉంది అన్నా నేను గుస గుసగా.. ఆయన చెప్పడు కానీ పయిల్సో ఏదో అంటరు కదా అదొచ్చింది..దానికి తోడు దగ్గు దమ్ము ఉన్నయి చిన్నప్పటి నించీ నీకు తెలుసు కదా అది బాగా ముదిరింది' అంది. 'అవును అన్నయ్య బాగా ఆయాసపడుతున్నాడు అడిగితే నొచ్చుకుంటాడని అడగలేదు.., చిన్నప్పటి నించీ అంతే ఎంత నెప్పి ఉన్నా అసలేమీ బయటికి చెప్పడు' అన్నా గబ గబా నన్ను చెప్పనియ్యదని ఖంగారు పడుతూ.. ఆ అవునవును.. 'ఆయ నెవరికీ చెప్పడు నన్ను చెప్పొద్దంటడు. చెట్ల మందు తీసుకున్నాడు. దాని వల్ల కొద్ది గా కూడా తగ్గలేదు.. అదే బాధగా ఉంది' అంది.. అయ్యొ అన్నా ఏమీ చేయలేము కదా అని బాధ పడుతూ..
ఆవిడ మాటల్లో వినదానికి మీకూ టైపడానికి నాకూ తీరదు కానీ టూకీగా చెప్తా.. పక్కింట్లో మొన్న పూజయ్యిందిట.. వాళ్ళు అన్నని తీసుకురా అని బాగా బలవంత పెట్టారుట.. పక్కింటాయనొచ్చి మరీ మరీ మీరు ఈ సారి తప్పక రావాలి సార్ అందరిలోకీ పెద్ద గురువుగారొస్తున్నారని పిలిచి వెళ్ళారుట. వెళ్ళకపోతే ఏంబాగుంటుందని భాస్కరన్నని తీసుకెళ్ళిందిట. అక్కడికి ఆ రోజు కాలనీ కాలనీ మొత్తం కదిలి వచ్చిందిట. పూజ అయ్యాక ఒక్కొక్కరూ వచ్చి స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవచ్చని చెప్పారుట. పక్కింటావిడ అంత మందిలోను మొట్టమొదట అన్నా వదినలకి ప్రిఫరెన్స్ ఇచ్చి గుంపులో ఉన్న వదినని చేయిపట్టుకుని తీసుకెళ్ళిందిట. వదిన భాస్కరన్నని రమ్మనగానే ఇద్దరూ కలిసి స్వామీజీ ఆశీర్వాదం కోసం ఆయన పాదాలు తాకారుట . పక్కింటావిడ స్వామీజీతో 'స్వామీ ఇందాక చెప్పాను కదా వీళ్ళే ఆశీర్వదించండి' అందిట. స్వామీ జీ కళ్ళు మూసుకుని..' దైవమా ఈ భక్తుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇతనికి మనశ్శాంతి లేదు .ఇతను దగ్గు దమ్ముతో బాధ పడుతున్నాడు ఇతని భార్యకి బీపీ ఉంది.. అవన్నీ కాక ఇతనికి అతి దారుణమైన బాధ పయిల్స్ వ్యాధి.. అన్నీ భరించినా ఇది భరించడం కష్టం. ఋణాలతో బాధ పడుతున్నాడు. ఉద్యోగం పోతుందని భయపడుతున్నాడు. దయ ఉంచి ఈ కష్టాల్లోంచి ఇతన్ని కాపాడు, దంపతుల మధ్య సయోధ్య కుదుర్చు. ' అని ప్రార్థించి విభూతి ఇచ్చాడుట... ఆ రోజు నించీ వదినమ్మ బీపీ పోయిందిట కానీ అటునించి ప్రయాణం చేసి అన్నయ్యకొచ్చిందిట.. పక్క వాళ్ళతో మాట్లాడితే చంపేస్తా అని అరుస్తాడుట.. నేను ఇన్నేళ్ళుగా దాచుకున్న పరువు గంగపాలయ్యింది అంటాడుట.. బయటకెళ్ళడానికి సిగ్గుగా ఉంది అంటాడుట.. కాలనీ లో అందరూ తనని వింతగా చూస్తున్నట్టుంది అంటాడుట. ఇల్లు అమ్మేసి పోదామంటాడుట. అసలు ఇంట్లోంచి బయటికి రావట్లేదుట. ఆఫీసుకి కూడా పోవట్లేదుట. విసుగు కసుగుట . ఈ పిల్ల కనిపించిందంటే బీపీ మరీ పెరిగిపోతోందిట..
ఇదండీ.. ఇది విన్నాక ఎవరయినా బాగున్నారా అని అడిగితే సూపర్, హ్యాప్పీ అనడమే బెటర్ అని నాకనిపించింది.. మరి నాకు ఇంకా పిలవాల్సిన ఇళ్ళు చాలా ఉన్నాయి.. కాస్త మా బీపీ అన్నతో మాట్లాడి పెట్టరూ.. ప్లీస్...
Posted by
Ennela
at
Wednesday, November 23, 2022
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
వ్యాఖ్యలు
ఖుషీ ఖుషీగా నవ్వుతూ...
పెంపుడు పిల్లలు
"నిన్ను లంబాడీ తండా లోంచి ఎత్తుకొచ్చాము నువ్వు మా పిల్లవి/పిల్లాడివి కాదు" అని మీలో ఎంతమంది అనిపించుకున్నారో మొహమాటం లేకుండా చెప్పండి. .చెత్తకుండీ నించి ఎత్తుకొచ్చామని అనిపించుకున్న వారున్నారా.? . ఇలా అనిపించుకున్న పిల్లలు నిజం గా తమని ఈ ఇంటివాళ్ళు పెంచుకున్నారని అనుకునేవాళ్లు కదా.. అదృష్టం కొద్దీ ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటివి సాధారణం మూలాన ఒకళ్ళు ఏడిపించినప్పుడు ఇంకొకరు " కాదమ్మా నువ్వు నా బిడ్డవి " అని చెప్తుంటారు. అందు మూలాన ఇంట్లో అందరికీ అందరు బిడ్డలు పెంపుడు బిడ్డలే.
మొన్న ఇంటికి కొంత మంది చిన్న పెద్దలు వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఒక సమయం లో ఇలా అనిపించుకున్నామని ఇప్పటి వరకు తామొక్కరమే ఇలా అనిపించుకున్నట్టు భావిస్తున్నామని చెప్పారు. తమాషా ఏంటంటే, మా పాపాయిని " నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ పక్క మంచం మీద ఉన్నావిడ కి వరసగా 10 మంది అమ్మాయిలు పుట్టారుట . 11 వ సారి అమ్మాయి పుడితే వాళ్ళాయన వదిలేస్తా అన్నాడని ఆవిడ ఎక్కిళ్ళు గుక్కిళ్లు ఏడ్చిందిట. అందుకే మీ అమ్మకి అబ్బాయి పుడితే , పిల్లాడిని ఆవిడకి ఇచ్చి పిల్లదానివైన నిన్ను మీ అమ్మ పక్కలో పడుకో పెట్టేశామని' మా అక్క చెల్లెళ్లు చెప్పిన విషయం నమ్మి, ఇంటికొచ్చ్చి బోలెడు రాద్ధాంతం చేసింది..
ఇంత చిటుక్కుమని చెప్పేసేవారు ఒక మనవాళ్ళేనేమో అనుకునే దాన్ని కానీ కాదుట. ల్యాటిన్ అమెరికా వాళ్ళు, ఈస్ట్ యూరోప్ వాళ్ళు కూడా ఇలా చెప్పుకుంటుంటే ముక్కు మీద వేలేసుకున్నా. చిన్న పిల్లలని ఇలా ఏడిపించడం అక్కడ కూడా ఉందన్నమాట.
మా ఇంటికి ఒకాయన వచ్చి "మీ చెల్లిని తీసుకుపోనా " అంటుండే వాడు. పిల్లలు వద్దు అనగానే 'అయితే నిన్ను తీసుకుపోతా నేను పెంచుకుంటా 'అనేవాడు. వీళ్ళు భోరుమని ఒకటే ఏడుపు. ఆయన వస్తున్నాడనగానే పిల్లలంతా చిరాకు పడేవాళ్ళు.
ఉమ్మడి కుటుంబాల్లో ఇద్దరిద్దరు ఒకే సారి పుట్టినప్పుడు ఒక తల్లి బిడ్డలు కాకపోయినా రామ లక్ష్మణుల్లా పెరిగిన అన్నదమ్ములకు ఉన్న ప్రేమ సొంత అన్నదమ్ములకు కూడా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు తన తమ్ముడినో చెల్లినో ఎవరో ఎత్తుకుపోతుంటే ఊరుకుంటారేంటీ.. కండ ఊడొచ్చేటట్టు కొరకడమో , చెంప చెళ్లుమనిపించడమో, అరంగుళం గోళ్లు దిగేలా గిల్లడమో చేసి "బ్యాడ్ బాయ్స్ " అనిపించుకుంటారు కూడా.
ఇంట్లో 20 రోజుల తేడాతో పుట్టిన పిల్లలు కవలల్లాగా పెరిగినప్పుడు, అసలు అమ్మ నాన్నని పిన్ని బాబాయిలనీ పిలిచి, స్కూలుకెళ్ళినప్పుడు 'మై ఫాథర్ నేమ్ ఈస్ బాలు బాబాయ్, మై మథర్ నేమ్ ఈస్ వల్లి పిన్ని' అని చెప్పిన పిల్లలని " మీ అమ్మ ఈవిడ ,మీ నాన్న ఈయన అని సరిచేసేటప్పటికీ తల ప్రాణం మోకాల్లోకొస్తుంది కొన్ని సార్లు. అప్పటికీ ఆ పిల్లలు అసలు మా అమ్మ ఎవరు అని సందేహం తో చూస్తూనే ఉంటారు కూడా.. ఇలాంటి సంఘటనలు ఈ కాలం లో కూడా ఉన్నాయా అని ఆశ్చర్య పోవక్కరలేదు కూడా. ఇంట్లో మొదట పుట్టిన పిల్లలు నాన్నమ్మని అమ్మ అనీ, అమ్మ ని వదిన అనీ పిలిచి .. మీరందరు ఎక్కడైనా పోయి పడుకోండి అమ్మ నాది అని హుంకరించడం . "అమ్మ నాది అని ఎవరైనా అన్నారంటే టాపు లేచిపోయేలా చెయ్యడం ఉమ్మడి కుటుంబాల్లో మనం చూస్తూనే ఉంటాము. .
మా చిన్నోడొకసారి ఒక పిల్లని గట్టిగా కొరికేసాడని టీచర్ గారు కోప్పడి "ఎందుకు కొరికావలా తప్పు కదా అన్నారుట. " నా పుట్టలో వేలెడితే కుట్టనా అన్నంత వీజీగా " వీళ్ళ నాన్నొచ్చి మా చెల్లి చెవులు గట్టిగా కుట్టి ఏడిపిస్తే రెండు రోజుల నించీ ఏడుస్తోంది.. మరి నేను ఆయన కూతుర్ని కొరకనా " అన్నాడుట. ఆవిడ స్కూలు కి వచ్చిన వాళ్లందరికీ చెప్తుండేది.
సాయంత్రం మంచం మీద వేసిన ఆరేసిన బట్టల్లో నాన్నమ్మ చీర చూసి అక్కడ ఉన్నారనుకుని ఆ చీర మీదేసుకుని పడుకున్న చిన్నోడిని ఎవరో ఎత్తుకుపోయారని గుండెలవిసేలా ఏడ్చిన ఇంటిల్లిపాదీ ఆ సంఘటన మర్చిపొమ్మంటే పోతారా మరి.. ఆ రోజు నించీ వాడు అందరి కీ బిడ్డయిపోడూ
ఇంటికెవరో అనుకోకుండా వచ్చారు. వారు కింద దుకాణం లో 2చాకోలెట్లు కొంటున్నారు. మన బుడుగు గాడు వెళ్లి, 'ఆంటీ మీరు చాకోలెట్లు మా కోసం కొంటున్నారా' అని అడుగుతాడు. 'అబ్బే లేదురా' అంటుందావిడ.. 'అది కాదాంటీ మేము ఇద్దరమే అనుకున్నారేమో మా ఇంట్లో మాకు చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు కదా మీకు తెలుసో లేదో అని'..అంటాడు వీడు అమాయకంగా. ఆవిడ వచ్చి మనకి చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుందో మీకెవరికైనా తెలుసా.. ఎవరేమిచ్చినా కొరికి పంచుకునే పిల్లలు మీకు తెలుసా..??ఇలాంటి పిల్లలు ఇంట్లో అందరికీ పెంపుడు పిల్లలే కదా
మేము మాల్దీవుల్లో ఉన్నప్పుడు ఒక రెండు గదులు హాలు వంటిల్లు ఉన్న ఇల్లు ఇద్దరు దంపతులం కలిసి తీసుకున్నాము. వాళ్లకి ఒక పాప. ఆ చంటిది మాకు బాగా అలవాటయిపోయింది. మలయాళం వాళ్ళు.. పాపకి ముద్ద పప్పు చారు ఇష్టము. నేను నలుగు పెట్టి స్నానం చేయిస్తే ఇష్టము. నేను పాడి పడుకోపెడితే ఇష్టము. ఇవన్నీ చూసి వాళ్ళమ్మ మురిసిపోతుండేది. 'పోయిన జన్మలో నీ కూతురే' అనేది. పుట్టిన రోజు కి నేను పాపకి వెండి గజ్జలు కొన్నాను. అవి వేసుకుని ఘల్లు ఘల్లు మని లచ్చిమిదేవి లా తిరుగుతుండేది.. ఈ లోపు ఆ పిల్ల తల్లీ తండ్రికి ఎదో తగవులొచ్చాయి. వాళ్ళిద్దరి కీ గొడవ అయినప్పుడల్లా ఆ బుజ్జి వెండి గజ్జలు తలుపు కింద నించి లోపలికి పడేసేది వాళ్ళమ్మ... అదేంటో అర్థమయ్యేది కాదు నాకు.. మళ్ళీ బుజ్జగించి ఇచ్చేదాన్ని. అలా కనీసం 4 సార్లు జరిగింది.. తీరా ఎందుకలా చేస్తున్నావని మందలిస్తే, "ఇంట్లోంచి వెళ్లిపోదామనుకున్నా అప్పుడు మీ వస్తువు మీకు ఇచ్ఛేద్దామని " అని చెప్తూ. సింబాలిక్ గా పాపని మేము చూసుకోవాలని చెప్పడంట ..ఓరి దేవుడో ఏమి సింబాలిజం రా నాయనోయ్ అని భయపడిపోయాము.. నిజం చెప్పద్దు అప్పటి నించీ చంటి పిల్లలని చేరదీయాలంటే కాస్త జంకుతున్న మాట వాస్తవం...
Posted by
Ennela
at
Wednesday, November 23, 2022
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
వ్యాఖ్యలు
ఖుషీ ఖుషీగా నవ్వుతూ...
ముల్లు పొయ్యి కత్తొచ్చె….
“లే అమ్మా! సురేష్ పది సార్లు ఫోన్ చేసాడిప్పటికే” నెమ్మదిగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తోంది శారద. “అమ్మా ,, ఎన్ని సార్లయినా చెయ్యనియ్యి నువ్వూ ఎత్తకసలు. ఇంక అతనికీ నాకూ ఏ సంబంధమూ లేదు!! ” విసుగ్గా అటు తిరిగి పడుకుంది దివ్య. “అమ్మూ ,ఏమైందిరా బంగారూ, ” అంటూ ఆందోళనంగా దివ్యని లేపి కూచోబెట్టింది శారద.
సురేష్ బంగారం లాంటి పిల్లాడు, పిల్లలు పుట్టడం లేట్ అయితే దివ్య ని ఎవరూ ఏమీ అనకుండా తనే డాక్టరుకి చూపించుకుని ఒళ్ళు తగ్గించమన్నారని డయిటింగు చేస్తూ “10కిలోలు తగ్గితే చాలు పిల్లలు ఖాయం” అంటుంటాడు సరదాగా.. అంత మంచి పిల్లవాడిని తప్పు పట్టడమెలా అని సందేహించింది శారద.
“పోనీ ఫోన్ చేసి రమ్మను బాంగారు, మల్లె పువ్వుల్లాంటి ఇడ్లీ వేసి పెట్టి, నాన్నని మాట్లాడమంటా” అంది.
“చీ ఆ పేరెత్తకు, వాటి నించే గొడవలు మొదలయ్యాయి,, ముష్టి ఇడ్లీ .. ఆ డాక్టర్ననాలి. పొద్దున్నే 1ప్రొటీనుకి 2కార్బొహైడ్రేట్లు కలిపి తినాలని అమెరికా పరిశోధించి చెప్పిన విషయం మన తాతలనాడే కనిపెట్టారు ఇడ్లీ రూపంలో. Home made idlee evereyday, keep the doctor away అంటూ సోది కబుర్లు చెప్తాడు. రోజూ వేస్తా, ప్లేట్లో పెట్టిన రోజు 8 లాగిస్తాడు, ఒకవేళ, క్యాబ్ వచ్చి , నేను ఆఫీసుకి వెళ్ళిపోతే, అన్నీ అలానే ఉంచుతాడు, గొడవచేస్తే 3... ప్లేట్లో పెట్టిస్తే 8 తినేవాడు పెట్టకపోతే 3 తినడమెందుకో తెలుసా అమ్మా? 4 వ ఇడ్లీ తింటే ఆ రేకు కడగాల్సి వస్తుందని.. 3 తిని వదిలేసిన రేకు ఎండిపోయి రాత్రి వచ్చాక కడగలేక చేతులు పడిపోతున్నాయి. నేనేమైనా పనిమనిషినా? నేనూ పని చేస్తున్నా తన లాగే" వెక్కుతూ చెప్పింది దివ్య.
“ఓస్ అంతేనా.. అమ్ముకుట్టీ, నీకొక మందపాటి గిన్నె, 100 గ్లాస్కో పంచె ముక్కలూ ఇస్తాను.. గిన్నెలో నీళ్ళు పోసి, ఆ కాటన్ బట్ట దానికి కట్టి వాసినపోలె వేసుకుని సగం సగం తినండి.. ఆ క్లాత్ ని ఏరోజుకారోజు బయట పడెయ్.. అమ్మమ్మ అలాగే వేసేది . పిచ్చితల్లి! ఈ కాస్తకే విడిపోతారా ఎవరైనా.”. అంది ప్రశాంతంగా.
ఈ లోపు వంటింటి అటక మీద చప్పుడొచ్చి అటు వెళ్ళారిద్దరూ.. రామయ్యగారు నిచ్చెనెక్కి అటక మీదనించి ఏదో కవరు తీసుకుని కిందకి దిగారు.
“అప్పుడెప్పుడో శ్రీధరన్నయ్య అమెరికా నించి తెచ్చాడమ్మా, మన ఇంట్లో మైక్రో ఓవెన్ లేదని తెలియదనుకుంటా.. పైన పడేసి మరచిపోయా, ఇప్పుడు ఆఫీసు నించి లోపలికొస్తూ వెనక కాళ్ళు కడుక్కుంటుంటే, కిటికీ లోంచి అమ్మా, నువ్వూ మాట్లాడుకుంటున్న మాటలు వినబడ్డాయి.. ఇది గుర్తొచ్చింది.”. “అదేంటి నాన్నా”” అని ప్యాకెట్ విప్పింది దివ్య..చిన్న చదరం పెట్టెలో 3 ఇడ్లీ రేకులు.. చిన్నగా ముద్దొచ్చేలా. “ఈ డబ్బాలో నీళ్ళు పోసి , పిండి వేసి మైక్రో ఓవెన్లో పెట్టేస్తే చాలు.. పది నిమిషాల్లో మల్లెల్లాంటి ఇడ్డెన్లు రెడీ,కడగడం కూడా సులువు..డబ్బా పైనున్న 3 ఇన్స్ట్రక్షన్ లూ చూపిస్తూ నవ్వుతూ అన్నారు తరువాతసోఫాలో కూచుంటూ.., “చిన్నమ్మా, చిన్న విషయాలకి యువత విడిపోతున్నారని పేపర్లో చదివినప్పుడు అర్థంకాలేదు, కానీ ఇంత చిన్నవిషయాలకి కూడా విడిపోవచ్చని అర్థం అయ్యింది ఇప్పుడే,, అమ్మ తనలా కష్ట పడద్దని నిన్ను ఒక్క పని ముట్టుకోకుండా గారాబంగా పెంచిందే కానీ, ఆ గారాబం ఇలా చిన్న విషయాలని పెద్దగా చెయ్యడానికి కాదమ్మా.. నిజమైన కష్టం వచ్చినప్పుడు అమ్మా, నేనూ నీకు ఎప్పుడూ అండగా నిలబడతాము.. కానీ చిన్న సమస్యలకి నీ జీవితం నించే కాదు, పది మంది నించి పరిష్కారాలు దొరుకుతాయి.. సమస్య వచ్చినప్పుడల్లా విడిపోవడం పరిష్కారం కాదమ్మలూ అన్నారు..
“సారీ నాన్నా.. ఏదో విసుగులో తొందర పడ్డాను...మరి ఇలా అంట్లు తోమే విషయంలో అరుణక్కకి విడాకులిప్పియ్యలేదూ రఘు పెద్దనాన్న” అంది అమాయకంగా..
“అలా పెద్దవాళ్ళు ఆజ్యం పొయ్యడం వల్ల చాలా జీవితాలు కూలుతున్నాయమ్మా.. మళ్ళీ చెప్తున్నా పెద్ద సమస్యలకి అమ్మా, నాన్న తప్పకుండా వెనక ఉండాలి.. చిన్న వాటికి సర్ది చెప్పాలి.. పో, సురేష్ కి ఫోన్ చెయ్యి రమ్మని.. అమ్మ తెల్లటి చందమామ లాంటి.... “
“నాన్నోయ్.. చాలు బాబోయ్.. ఇంక ఆపెయ్..ఓ ..ఓ... అర్థమయ్యింది.. చందమామలాంటి తెల్లని వాసినకుడుము వేసి చూపిస్తుందనేగా.”. నవ్వుతూ ఫోన్ అందుకుంది దివ్య..
“సారీ అత్తయ్యా, నాకు ఇడ్లీ రేకులు కడగడం బధ్ధకం. కానీ దివ్య కోసం ఇప్పటి నించీ నేనే కడుగుతా” అన్నాడు వస్తూనే సురేష్...
“అబ్బే, అక్కరలేదు.. ముల్లు పొయ్యి కత్తొచ్చె ఢాం ఢాం ఢాం,” వాసినకుడుము ప్లేట్లో పెట్టి చేతికిస్తూ అంది దివ్య..
హాయిగా నవ్వుకున్నారు, అమ్మా నాన్నా..
Posted by
Ennela
at
Wednesday, November 23, 2022
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
వ్యాఖ్యలు
ఖుషీ ఖుషీగా నవ్వుతూ...
వియ్యాలవారి కయ్యాలు
“ఏం పని చేస్తరో?” అడిగాడు సురేశ్ తన పెళ్ళికొచ్చిన గోపాల్ ని. అతను అమ్మాయి వైపు చుట్టం కానీ రైలు తొందరగా వచ్చెయ్యడంతో, ఇంకా ఆడపెళ్ళివారు మంటపానికి రాక ముందే వచ్చిన మూలాన మాట కలిపాడు మర్యాదగా ఉంటుందని.
"వ్యాపారం" అన్నాడు గోపాలం.
"యాపారమా ఏం యాపారం?"అడిగాడు సురేశ్.
" కొట్టు" అన్నాడు గోపాల్.
"ఆ? ఏందీ" వినిపించనట్టు అడిగాడు సురేశ్
"కొట్టండీ.. కొట్టు కొట్టు" అని అన్నాడో లేదో గోపాల్ చెంప మీద ఫెళ్ళున కొట్టాడు సురేశ్. గోపాల్ ఈ దెబ్బకి నివ్వెరపోయాడు. పెళ్ళి కొడుక్కి కాస్త మెంటలా అని అనుమానమొచ్చేసింది ఒక నిమిషం లో.వాళ్ళ వాళ్ళు వచ్చారేమో అని చుట్టూ చూస్తున్నట్టు చేసి, నెమ్మదిగా జారుకున్నాడు.. చెప్పెయ్యాలి.. వాళ్ళ వాళ్ళు రాగానే చెప్పెయ్యాలని హాలు గేటు దగ్గరే నిరీక్షించాడు.
" అదేందయ్య ఈడికొచ్చినవ్? పెండ్లి పిల్ల సైడ్ కెంచి చుట్టపాయనొచ్చిండు చాయ్ బిస్కీట్ అరుసుకోమంటె ఏడున్నడో అని దోలాడలేక పరేషానయితున్న.. హమ్మ దొర్కవట్టిన్నన్నట్టు" సంతోషం గా చెప్పుకుపోతున్నాడు ఎల్లయ్య. చుట్టపాయిన, టీ బిస్కీట్ తప్ప ఏమర్థమయినా కాకపోయినా, అరుచుకోవడమేంటీ ఆయన కొట్టినా కుక్కినపేనల్లే నోరుమూసుకుని ఉంటే మళ్ళీ ఈయన తీసుకెళ్ళి అరుస్తాడేమో అని అయోమయం గా చూస్తున్నాడు గోపాల్. " కొర్కతింటామయ్య బీరిపోయినవ్.. .. నడ్వు పోదాంపా" అంటూ రమ్మని తొందర చేసాడు ఎల్లయ్య. ఇదెక్కడ గోలరా బాబూ, అసలు వాళ్ళు “రాజమండ్రి వచ్చెయ్ బావా అందరం కలిసి వెళదాం సరదాగా” అంటున్నా, ఎలాగూ ఏదో పనిమీద హైదరాబాదొచ్చాను కదా.. ఇటునించిటే అయితే టైం , టికెట్టు కలిసొస్తుందని కక్కుర్తి పడ్డాను అనవసరం గా " అనుకుంటూ ఎందుకో వెనుతిరిగి చూస్తే దూరం నించి వస్తూ కనిపించాడు అప్పా రావు. గోపాల్ ఎల్లయ్య వైపు తిరిగి.. " ఒక్క నిమిషం ఆగండి, మా చుట్టం ఇంకొకడు వస్తున్నాడు, ఇద్దరం కలిసొస్తాము చాయ్ బిస్కీట్ కి " చివరి పదం యాస మార్చి అనేసాడు సంతోషం గా.. " కానియ్యున్రి, మేమేమన్న కాదన్నాము.. " అన్నాడు ఎల్లయ్య.
గోపాల్, అప్పారావు ఒకరినొకరిని చూసుకుని చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టారు. దడ దడా మాట్లేసుకుంటున్న వాళ్ళని " గీ లొల్లెప్పటికొడిశేనో" అనుకుంటూ చూస్తున్న ఎల్లయ్యని సురేశ్ పిలవడంతో అటెళ్ళాడు. గోపాల్ , అప్పారావ్ కబుర్లలో పడి నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్న చోటకి నడవసాగారు. తను లేకుండా వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోవడం చూసిన ఎల్లయ్య.. " ఓ గోపాలూ, మీ చుట్టపాయన పెండ్లి పిలగాన్ని మందలించకుంటనే పోతడా" అని అరిచాడు. అప్పటి వరకూ పెళ్ళి పిలగాడు తనని కొట్టిన వైనం చెప్పి ఉన్న మూలాన కావచ్చు అప్పారావు చాన్స్ వదులుకోకుండా సురేశ్ దగ్గరగా వెళ్ళి " ఏం మనిషండీ మీరు, అసలు బుధ్ధుందా మీకు? మడిసన్నాక కూసింత కలాపోసనుండాల, .. లేదంతే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంది ? పొద్దున్నే ఇంత పచ్సగడ్డి తిని పెత్తెక్ష నారాయనుడి సేవ చేసుకోక..ఎందుకొచ్చిన గోలయ్యా , సెగట్రీ.. ఇలా సాగిపోతే మర్డర్రయిపోవూ " అన్నాడు. సురేశ్ ఉలిక్కిపడ్డాడు.. " ఏంది ఏమంటున్రు, దమాక్ గిట్ల ఖరాబయ్యిందా" అని ఊగిపోయాడు. "అయ్యో నేనేమన్నానయ్యా బాబూ, మీ వోడేదో మందలించమంటేనూ.." అని నీళ్ళు నములుతూ " మావైపు మందలించడమంటే ఇంతే" గబ గబా రావుగోపాల్రావు ఇష్టయిల్లో అనేసాడు అప్పారావ్.. " ఏందివయ్య? ఇదేందివయ్యా, మందలించుడంటే మర్డర్ చేసుడా ఏందయ్య? మా తాన మందలించుమంటె ముద్దుగా బాగున్నవా తమ్మీ అని మందలిస్తరు" అన్నాడు ఎల్లయ్య ఉడుకిపోతూ.
ఇంకేదో అనబోతుండగా గట్టిగా బాజాలు మోగాయి.
ఆడ పెళ్ళివారొచ్చారని, పెళ్ళి కొడుకుని పల్లకీ ఎక్కడానికి రమ్మని అడగ్గా, బావ మరుదులొచ్చి, భుజాల పైన ఎక్కించుకునెళ్ళాలని పెద్దలు పట్టుబట్టారు. సరిత కి అన్న వరసయ్యే పది మంది అతి కష్టమ్మీద సురేశ్ ని దాదాపు ఈడ్చుకెళ్ళి.. " అబ్బా.. అలవాటు లేని అవపోసన" అని ఆయాసపడ్డారు. ఈ క్రమంలో, సరిత అన్నగారి చేతిలో ఉన్న ఒక పుస్తకం పట్టుకోమని పక్కనున్న పిల్లడికిచ్చాడు.
పల్లకీ సంబరం లో మునిగిపోయి అప్పారావ్ సంగతప్పటికి మరచిపోయాడుసురేశ్ . అప్పారావునీ, గోపాల్ నీ అసలు ఎప్పుడొచ్చారని అడిగే సమయం కూడా ఇవ్వకుండానే "అమ్మా ముహూర్తానికి టైం అవుతోంది.. మీరేమో తిరుపతమ్మ గుడులనీ, వాళ్ళేమో గండి మైసమ్మ గుడులనీ తిరిగి తిరిగొచ్చి, ముహూర్తం దాటించేసేట్టున్నార"ని ఖంగారు పెట్టేసారు పంతులు గారు. పంతులు గారి ఆరాటం, ఫొటో గ్రాఫర్ల పోరాటం మధ్య పెళ్ళి అయింది.
సరిత అన్నగారి దగ్గర పుస్తకం తీసుకున్న పిల్లాడు పుస్తకం చూసేటప్పటికి అది బాపు రమణల "కోతి కొమ్మచ్చి". మొహమాస్తుడైన ఆ పిల్లాడికి ఎవరితోనూ పెద్దగా కలవడం ఇష్టం ఉండదు. పుస్తకం తీసి మెల్లగా చదవడం మొదలెట్టేసరికి పెళ్ళి అయిపోయి, ఆలస్యమైతే అందదన్నట్టు అందరూ పొలోమని భోయినాల వైపు పరుగులు తీసారు. పుస్తకం ఇచ్చేసి భోజనానికెళితే బెటర్ అనుకుంటూ ఎరుపు చొక్కా వేసుకున్న సరిత అన్నగారి కోసం వెతకడం మొదలెట్టాడు. అక్కడా ఇక్కడా దూరం నించి చూసి దగ్గరికెళ్ళేలోపు, అతను ఇంకేదో పని ఉండి మాయవడం జరిగింది రెండు సార్లు. ఈ లోపు భోజనం చేసి వచ్చి, కాస్త జనాలు పలచబడడం తో మళ్ళీ పందిరి వైపు ఎర్ర చొక్కా అబ్బాయి కోసం వెతకడం మొదలెట్టాడు.
చివరికి జంటకి స్నేహితులని పరిచయం చేస్తూ కనబడ్డాదు ఎర్ర చొక్కా వేసుకున్న సరిత అన్నగారు మురళి.
హమ్మయ్య అనుకుంటూ అటువెళ్ళి " సార్, మీ పుస్కం" అన్నాడు .
" ఓహ్ నీకిచ్చాను కదా, ఎవరి చేతులోనో పెట్టా కానీ, ఎవరి చేతులో గమనించలేదు" అన్నాడు మురళి .
" అస్సలనుకోలే సార్ బుక్ బాగుంటదని, నగీ నగీ సచ్చిన" అన్నాడు మల్లేష్.
" ఓహ్ నచ్చిందా అయితే" అన్నాడు మురళి.
" మస్త్ నచ్చింది సార్" అన్నాడు మల్లేష్ మురిపెంగా.
" నచ్చిందా , అయితే ఉంచు" అన్నాడు మురళి.
" అయ్యొ బాగుండదు సార్" అని మొహమాట పడ్డాడు మల్లేష్.
" ఏం ఫర్వాలేదు ఉంచెయ్" అన్నాడు మురళి.
" అయ్యొ సార్ ఎవరన్న చూస్తె ఏమనుకుంటరు" అన్నాడు మల్లేష్..
" దీన్లో అనుకోడానికేముంది, నా దగ్గరింకా 3 కాపీలున్నాయి, ఉంచెయ్ చెప్తాను" అని మురళి అంటుండగానే, మల్లేష్ ఖాండ్రించి పుస్తకం మీద ఉమ్మేసాడు. ఈ హటాత్పరిణామానికి ఉగ్రుడయిపోయాడు మురళి. " చదువుకున్నోడివనుకుని మర్యాద ఇస్తుంటే సంస్కారహీనంగా ప్రవర్తిస్తావా, పిచ్చెక్కిందా " అంటూ గుభీ గుభీ రెండు గుద్దులు గుద్ది "చీ" అంటూ వెళ్ళిపోయాడు.
మల్లేష్ ముక్కులోంచి రక్తం కారిపోతుండగా పెళ్ళికొడుకు తరఫు పెద్దలు పరిగెత్తుకొచ్చారు. సరిత వైపు వాళ్ళని దుమ్మెత్తిపోస్తూ, " బిడ్డనెట్లగొట్టిన్రు చూసిన్రా, ముక్కులల్ల రక్తమెలతాంది.. పిలగాడు పండుకొంటుండు బిరాన దవాఖానా కి తీస్కపోదాం పట్టున్రి” అని అరుపులు మొదలెట్టారు. సరిత మేన మామొచ్చి,, “చావు బతుకుల్లో ఉంటే ఇప్పుడు పండు కొనడం పువ్వులు కొనడం ఏంటండీ ఆసుపత్రికి తీసుకెళ్ళక “అంటూ వెటకారమాడాడు.
ఇంక సురేశ్ వైపు వాళ్ళు కోపానికొచ్చి అతన్ని ఒక్క పీకుడు పీకారు. వీళ్ళూరుకుంటారేంటీ,, కర్రలు, గునపాలూ, గొడ్డల్లూ, కత్తులు కటార్లూ పట్టుకుని తయారయిపోయారు.
ఓయ్య పిల్ల తండ్రిని తోల్కరండ్రి బిరాన అనరిచింది సురేష్ పెద్దమ్మ. ఆయ్ నేనేమైనా గొర్రెనా గాడిదనా తోలుకురావడానికంటూ వచ్చాడు వెంకట్రావు.
అరుంధతీ నక్షత్రం చూపించడానికి గేటు బయటకి జంటను తీసుకెళుతున్న పంతులు గారు ఈ గొడవకి ఆశ్చర్యపోయి "ఏంటండీ ఇది, ఏం జరుగుతోందిక్కడ? అనడిగాడు. “ ఇదేదో మంచి ఆరంభమనుకున్నాం కానీ ఈ పెళ్ళ్ళి వలన ఇప్పటికే ఇన్ని సమస్యలు, ఇంక. మంగళమే” అని అటువాళ్ళూ, ఇటువాళ్ళూ అంజలి సినిమాలో డవిలాగుల్లా అరిచి అరిచి చెప్పారు.
పంతులు కాస్త ఆలోచించి కొట్టడానికి కారణమడిగాడు. పుస్తకముంచుకోమంటే పుస్తకం మీద ఉమ్మడం గురించి చెప్పగానే నవ్వడం మొదలెట్టాడాయన.. ఎప్పుడో కోనసీమ నించి వచ్చిన పూర్వీకుల వల్ల అటూ ఇటూ రెండు యాసలనూ క్షుణ్ణం గా తెలుసుకున్నవాడై “ఉంచడమంటే ఉమ్మడమని “ టిప్పణి చెప్పాడు. ముక్కులో రక్తమోడుతున్న మల్లేష్ తో సహా అందరూ పక పకా నవ్వారు.
గోపాల్ కి పౌరుషమొచ్చి, పెళ్ళికొడుకు తనని దవడ వాచేట్టు కొట్టాడని, పెళ్ళికి un do బటన్ ఉంటే నొక్కెయ్యాలని గోల పెట్టాడు. “కొట్టమంటే మరి కొట్టనా” అని సురేశ్" నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా" అని కథ చెప్పే అబ్బాయంత అమాయకంగా చెప్పాడు. “నువ్వెందుకు కొట్టమన్నావ”ని అడిగిన పంతులు గిరిధర శర్మతో, “వ్యాపారమేంటంటే కొట్టు అని చెప్పాన”ని అమాయకంగా చెప్పాడు గోపాలు. “కొట్టంటే దుక్నమయ్యా బాబూ” అంటూ పడీ పడీ నవ్వాడు పంతులు గారు.
“అన్ని మంచిగనే గని ఈ దొంగమొకపోడు ఎన్ని తిట్లు తిట్టిండు” అని అందుకున్నాడు ఎల్లయ్య.
“చేపా చేపా ఎందుకెండలేదు” అని అడిగినట్టు “నీ కథ ఏంటయ్యా” అని నవ్వుతూ అడిగాడు గిరిధర శర్మ. “అయ్యా మందలించమని మరీ బలవంతం పెడితేనూ.”.. అంటున్న అప్పారావుని చూసి కడుపు పట్టుకుని " నేనింక నవ్వలేనయ్యా బాబూ, మందలించడమంటే, పలకరించడమని, పనిలో పనిగా పండుకొనడమంటే నిద్దరోడమనీ, తోల్కరావడమంటే తోడ్కొనిరావడానికి వికృతని చెప్పి..”ఇంతటితో అపార్థాల కథ కంచికి మనమింటికి.. ఇప్పుడైనా అర్థం తెలుసుకుని మాట్లాడుకోండి నాయనోయ్ “అంటూ అరుంధతిని చూపించడానికి దంపతులనిk తీసుకెళ్ళబోతున్నాడు పంతులు.
అంత మంచిగ జెప్పిండు పంతుల్ నోట్ల పేడ పెట్టున్రి... అనగానే మళ్ళీ రెచ్చిపోబోతున్న వెంకట్రావుకి.. అయ్యా పాలకోవాని పేడాలంటారు మీరు తొందరపడి మళ్ళీ మొదటికి తేకండయా.. కథాకళలో పదినిమెషాలే ఇచ్చారు అరిచాడు.
అయితే వాకే మళ్ళీ కలుద్దామంటూ వెళ్ళి పోయారు బంధుమిత్రులువియ్యాలవారి కయ్యాలు
రచన: ఎన్నెలమ్మ, కెనడా
“ఏం పని చేస్తరో?” అడిగాడు సురేశ్ తన పెళ్ళికొచ్చిన గోపాల్ ని. అతను అమ్మాయి వైపు చుట్టం కానీ రైలు తొందరగా వచ్చెయ్యడంతో, ఇంకా ఆడపెళ్ళివారు మంటపానికి రాక ముందే వచ్చిన మూలాన మాట కలిపాడు మర్యాదగా ఉంటుందని.
"వ్యాపారం" అన్నాడు గోపాలం.
"యాపారమా ఏం యాపారం?"అడిగాడు సురేశ్.
" కొట్టు" అన్నాడు గోపాల్.
"ఆ? ఏందీ" వినిపించనట్టు అడిగాడు సురేశ్
"కొట్టండీ.. కొట్టు కొట్టు" అని అన్నాడో లేదో గోపాల్ చెంప మీద ఫెళ్ళున కొట్టాడు సురేశ్. గోపాల్ ఈ దెబ్బకి నివ్వెరపోయాడు. పెళ్ళి కొడుక్కి కాస్త మెంటలా అని అనుమానమొచ్చేసింది ఒక నిమిషం లో.వాళ్ళ వాళ్ళు వచ్చారేమో అని చుట్టూ చూస్తున్నట్టు చేసి, నెమ్మదిగా జారుకున్నాడు.. చెప్పెయ్యాలి.. వాళ్ళ వాళ్ళు రాగానే చెప్పెయ్యాలని హాలు గేటు దగ్గరే నిరీక్షించాడు.
" అదేందయ్య ఈడికొచ్చినవ్? పెండ్లి పిల్ల సైడ్ కెంచి చుట్టపాయనొచ్చిండు చాయ్ బిస్కీట్ అరుసుకోమంటె ఏడున్నడో అని దోలాడలేక పరేషానయితున్న.. హమ్మ దొర్కవట్టిన్నన్నట్టు" సంతోషం గా చెప్పుకుపోతున్నాడు ఎల్లయ్య. చుట్టపాయిన, టీ బిస్కీట్ తప్ప ఏమర్థమయినా కాకపోయినా, అరుచుకోవడమేంటీ ఆయన కొట్టినా కుక్కినపేనల్లే నోరుమూసుకుని ఉంటే మళ్ళీ ఈయన తీసుకెళ్ళి అరుస్తాడేమో అని అయోమయం గా చూస్తున్నాడు గోపాల్. " కొర్కతింటామయ్య బీరిపోయినవ్.. .. నడ్వు పోదాంపా" అంటూ రమ్మని తొందర చేసాడు ఎల్లయ్య. ఇదెక్కడ గోలరా బాబూ, అసలు వాళ్ళు “రాజమండ్రి వచ్చెయ్ బావా అందరం కలిసి వెళదాం సరదాగా” అంటున్నా, ఎలాగూ ఏదో పనిమీద హైదరాబాదొచ్చాను కదా.. ఇటునించిటే అయితే టైం , టికెట్టు కలిసొస్తుందని కక్కుర్తి పడ్డాను అనవసరం గా " అనుకుంటూ ఎందుకో వెనుతిరిగి చూస్తే దూరం నించి వస్తూ కనిపించాడు అప్పా రావు. గోపాల్ ఎల్లయ్య వైపు తిరిగి.. " ఒక్క నిమిషం ఆగండి, మా చుట్టం ఇంకొకడు వస్తున్నాడు, ఇద్దరం కలిసొస్తాము చాయ్ బిస్కీట్ కి " చివరి పదం యాస మార్చి అనేసాడు సంతోషం గా.. " కానియ్యున్రి, మేమేమన్న కాదన్నాము.. " అన్నాడు ఎల్లయ్య.
గోపాల్, అప్పారావు ఒకరినొకరిని చూసుకుని చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టారు. దడ దడా మాట్లేసుకుంటున్న వాళ్ళని " గీ లొల్లెప్పటికొడిశేనో" అనుకుంటూ చూస్తున్న ఎల్లయ్యని సురేశ్ పిలవడంతో అటెళ్ళాడు. గోపాల్ , అప్పారావ్ కబుర్లలో పడి నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్న చోటకి నడవసాగారు. తను లేకుండా వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోవడం చూసిన ఎల్లయ్య.. " ఓ గోపాలూ, మీ చుట్టపాయన పెండ్లి పిలగాన్ని మందలించకుంటనే పోతడా" అని అరిచాడు. అప్పటి వరకూ పెళ్ళి పిలగాడు తనని కొట్టిన వైనం చెప్పి ఉన్న మూలాన కావచ్చు అప్పారావు చాన్స్ వదులుకోకుండా సురేశ్ దగ్గరగా వెళ్ళి " ఏం మనిషండీ మీరు, అసలు బుధ్ధుందా మీకు? మడిసన్నాక కూసింత కలాపోసనుండాల, .. లేదంతే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంది ? పొద్దున్నే ఇంత పచ్సగడ్డి తిని పెత్తెక్ష నారాయనుడి సేవ చేసుకోక..ఎందుకొచ్చిన గోలయ్యా , సెగట్రీ.. ఇలా సాగిపోతే మర్డర్రయిపోవూ " అన్నాడు. సురేశ్ ఉలిక్కిపడ్డాడు.. " ఏంది ఏమంటున్రు, దమాక్ గిట్ల ఖరాబయ్యిందా" అని ఊగిపోయాడు. "అయ్యో నేనేమన్నానయ్యా బాబూ, మీ వోడేదో మందలించమంటేనూ.." అని నీళ్ళు నములుతూ " మావైపు మందలించడమంటే ఇంతే" గబ గబా రావుగోపాల్రావు ఇష్టయిల్లో అనేసాడు అప్పారావ్.. " ఏందివయ్య? ఇదేందివయ్యా, మందలించుడంటే మర్డర్ చేసుడా ఏందయ్య? మా తాన మందలించుమంటె ముద్దుగా బాగున్నవా తమ్మీ అని మందలిస్తరు" అన్నాడు ఎల్లయ్య ఉడుకిపోతూ.
ఇంకేదో అనబోతుండగా గట్టిగా బాజాలు మోగాయి.
ఆడ పెళ్ళివారొచ్చారని, పెళ్ళి కొడుకుని పల్లకీ ఎక్కడానికి రమ్మని అడగ్గా, బావ మరుదులొచ్చి, భుజాల పైన ఎక్కించుకునెళ్ళాలని పెద్దలు పట్టుబట్టారు. సరిత కి అన్న వరసయ్యే పది మంది అతి కష్టమ్మీద సురేశ్ ని దాదాపు ఈడ్చుకెళ్ళి.. " అబ్బా.. అలవాటు లేని అవపోసన" అని ఆయాసపడ్డారు. ఈ క్రమంలో, సరిత అన్నగారి చేతిలో ఉన్న ఒక పుస్తకం పట్టుకోమని పక్కనున్న పిల్లడికిచ్చాడు.
పల్లకీ సంబరం లో మునిగిపోయి అప్పారావ్ సంగతప్పటికి మరచిపోయాడుసురేశ్ . అప్పారావునీ, గోపాల్ నీ అసలు ఎప్పుడొచ్చారని అడిగే సమయం కూడా ఇవ్వకుండానే "అమ్మా ముహూర్తానికి టైం అవుతోంది.. మీరేమో తిరుపతమ్మ గుడులనీ, వాళ్ళేమో గండి మైసమ్మ గుడులనీ తిరిగి తిరిగొచ్చి, ముహూర్తం దాటించేసేట్టున్నార"ని ఖంగారు పెట్టేసారు పంతులు గారు. పంతులు గారి ఆరాటం, ఫొటో గ్రాఫర్ల పోరాటం మధ్య పెళ్ళి అయింది.
సరిత అన్నగారి దగ్గర పుస్తకం తీసుకున్న పిల్లాడు పుస్తకం చూసేటప్పటికి అది బాపు రమణల "కోతి కొమ్మచ్చి". మొహమాస్తుడైన ఆ పిల్లాడికి ఎవరితోనూ పెద్దగా కలవడం ఇష్టం ఉండదు. పుస్తకం తీసి మెల్లగా చదవడం మొదలెట్టేసరికి పెళ్ళి అయిపోయి, ఆలస్యమైతే అందదన్నట్టు అందరూ పొలోమని భోయినాల వైపు పరుగులు తీసారు. పుస్తకం ఇచ్చేసి భోజనానికెళితే బెటర్ అనుకుంటూ ఎరుపు చొక్కా వేసుకున్న సరిత అన్నగారి కోసం వెతకడం మొదలెట్టాడు. అక్కడా ఇక్కడా దూరం నించి చూసి దగ్గరికెళ్ళేలోపు, అతను ఇంకేదో పని ఉండి మాయవడం జరిగింది రెండు సార్లు. ఈ లోపు భోజనం చేసి వచ్చి, కాస్త జనాలు పలచబడడం తో మళ్ళీ పందిరి వైపు ఎర్ర చొక్కా అబ్బాయి కోసం వెతకడం మొదలెట్టాడు.
చివరికి జంటకి స్నేహితులని పరిచయం చేస్తూ కనబడ్డాదు ఎర్ర చొక్కా వేసుకున్న సరిత అన్నగారు మురళి.
హమ్మయ్య అనుకుంటూ అటువెళ్ళి " సార్, మీ పుస్కం" అన్నాడు .
" ఓహ్ నీకిచ్చాను కదా, ఎవరి చేతులోనో పెట్టా కానీ, ఎవరి చేతులో గమనించలేదు" అన్నాడు మురళి .
" అస్సలనుకోలే సార్ బుక్ బాగుంటదని, నగీ నగీ సచ్చిన" అన్నాడు మల్లేష్.
" ఓహ్ నచ్చిందా అయితే" అన్నాడు మురళి.
" మస్త్ నచ్చింది సార్" అన్నాడు మల్లేష్ మురిపెంగా.
" నచ్చిందా , అయితే ఉంచు" అన్నాడు మురళి.
" అయ్యొ బాగుండదు సార్" అని మొహమాట పడ్డాడు మల్లేష్.
" ఏం ఫర్వాలేదు ఉంచెయ్" అన్నాడు మురళి.
" అయ్యొ సార్ ఎవరన్న చూస్తె ఏమనుకుంటరు" అన్నాడు మల్లేష్..
" దీన్లో అనుకోడానికేముంది, నా దగ్గరింకా 3 కాపీలున్నాయి, ఉంచెయ్ చెప్తాను" అని మురళి అంటుండగానే, మల్లేష్ ఖాండ్రించి పుస్తకం మీద ఉమ్మేసాడు. ఈ హటాత్పరిణామానికి ఉగ్రుడయిపోయాడు మురళి. " చదువుకున్నోడివనుకుని మర్యాద ఇస్తుంటే సంస్కారహీనంగా ప్రవర్తిస్తావా, పిచ్చెక్కిందా " అంటూ గుభీ గుభీ రెండు గుద్దులు గుద్ది "చీ" అంటూ వెళ్ళిపోయాడు.
మల్లేష్ ముక్కులోంచి రక్తం కారిపోతుండగా పెళ్ళికొడుకు తరఫు పెద్దలు పరిగెత్తుకొచ్చారు. సరిత వైపు వాళ్ళని దుమ్మెత్తిపోస్తూ, " బిడ్డనెట్లగొట్టిన్రు చూసిన్రా, ముక్కులల్ల రక్తమెలతాంది.. పిలగాడు పండుకొంటుండు బిరాన దవాఖానా కి తీస్కపోదాం పట్టున్రి” అని అరుపులు మొదలెట్టారు. సరిత మేన మామొచ్చి,, “చావు బతుకుల్లో ఉంటే ఇప్పుడు పండు కొనడం పువ్వులు కొనడం ఏంటండీ ఆసుపత్రికి తీసుకెళ్ళక “అంటూ వెటకారమాడాడు.
ఇంక సురేశ్ వైపు వాళ్ళు కోపానికొచ్చి అతన్ని ఒక్క పీకుడు పీకారు. వీళ్ళూరుకుంటారేంటీ,, కర్రలు, గునపాలూ, గొడ్డల్లూ, కత్తులు కటార్లూ పట్టుకుని తయారయిపోయారు.
ఓయ్య పిల్ల తండ్రిని తోల్కరండ్రి బిరాన అనరిచింది సురేష్ పెద్దమ్మ. ఆయ్ నేనేమైనా గొర్రెనా గాడిదనా తోలుకురావడానికంటూ వచ్చాడు వెంకట్రావు.
అరుంధతీ నక్షత్రం చూపించడానికి గేటు బయటకి జంటను తీసుకెళుతున్న పంతులు గారు ఈ గొడవకి ఆశ్చర్యపోయి "ఏంటండీ ఇది, ఏం జరుగుతోందిక్కడ? అనడిగాడు. “ ఇదేదో మంచి ఆరంభమనుకున్నాం కానీ ఈ పెళ్ళ్ళి వలన ఇప్పటికే ఇన్ని సమస్యలు, ఇంక. మంగళమే” అని అటువాళ్ళూ, ఇటువాళ్ళూ అంజలి సినిమాలో డవిలాగుల్లా అరిచి అరిచి చెప్పారు.
పంతులు కాస్త ఆలోచించి కొట్టడానికి కారణమడిగాడు. పుస్తకముంచుకోమంటే పుస్తకం మీద ఉమ్మడం గురించి చెప్పగానే నవ్వడం మొదలెట్టాడాయన.. ఎప్పుడో కోనసీమ నించి వచ్చిన పూర్వీకుల వల్ల అటూ ఇటూ రెండు యాసలనూ క్షుణ్ణం గా తెలుసుకున్నవాడై “ఉంచడమంటే ఉమ్మడమని “ టిప్పణి చెప్పాడు. ముక్కులో రక్తమోడుతున్న మల్లేష్ తో సహా అందరూ పక పకా నవ్వారు.
గోపాల్ కి పౌరుషమొచ్చి, పెళ్ళికొడుకు తనని దవడ వాచేట్టు కొట్టాడని, పెళ్ళికి un do బటన్ ఉంటే నొక్కెయ్యాలని గోల పెట్టాడు. “కొట్టమంటే మరి కొట్టనా” అని సురేశ్" నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా" అని కథ చెప్పే అబ్బాయంత అమాయకంగా చెప్పాడు. “నువ్వెందుకు కొట్టమన్నావ”ని అడిగిన పంతులు గిరిధర శర్మతో, “వ్యాపారమేంటంటే కొట్టు అని చెప్పాన”ని అమాయకంగా చెప్పాడు గోపాలు. “కొట్టంటే దుక్నమయ్యా బాబూ” అంటూ పడీ పడీ నవ్వాడు పంతులు గారు.
“అన్ని మంచిగనే గని ఈ దొంగమొకపోడు ఎన్ని తిట్లు తిట్టిండు” అని అందుకున్నాడు ఎల్లయ్య.
“చేపా చేపా ఎందుకెండలేదు” అని అడిగినట్టు “నీ కథ ఏంటయ్యా” అని నవ్వుతూ అడిగాడు గిరిధర శర్మ. “అయ్యా మందలించమని మరీ బలవంతం పెడితేనూ.”.. అంటున్న అప్పారావుని చూసి కడుపు పట్టుకుని " నేనింక నవ్వలేనయ్యా బాబూ, మందలించడమంటే, పలకరించడమని, పనిలో పనిగా పండుకొనడమంటే నిద్దరోడమనీ, తోల్కరావడమంటే తోడ్కొనిరావడానికి వికృతని చెప్పి..”ఇంతటితో అపార్థాల కథ కంచికి మనమింటికి.. ఇప్పుడైనా అర్థం తెలుసుకుని మాట్లాడుకోండి నాయనోయ్ “అంటూ అరుంధతిని చూపించడానికి దంపతులనిk తీసుకెళ్ళబోతున్నాడు పంతులు.
అంత మంచిగ జెప్పిండు పంతుల్ నోట్ల పేడ పెట్టున్రి... అనగానే మళ్ళీ రెచ్చిపోబోతున్న వెంకట్రావుకి.. అయ్యా పాలకోవాని పేడాలంటారు మీరు తొందరపడి మళ్ళీ మొదటికి తేకండయా.. కథాకళలో పదినిమెషాలే ఇచ్చారు అరిచాడు.
అయితే వాకే మళ్ళీ కలుద్దామంటూ వెళ్ళి పోయారు బంధుమిత్రులు
Posted by
Ennela
at
Wednesday, November 23, 2022
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
వ్యాఖ్యలు
ఖుషీ ఖుషీగా నవ్వుతూ...
బహుమతి
మాటిమాటికి ఖరీదైన బహుమతులిచిచిపుచ్చుకోవడం మేము పెరిగిన వాతావరణం లో లేదు. ఎవరింటికైనా వెళితే ఇంట్లో పూసిన పండ్లు, పువ్వులు, కరివేపాకు, మునగ కాయలు, ఉసిరికాయలతో పాటు బాలాజీ మిఠాయి బండార్ నించి పాలకోవాలో, కచోరీలో తీసుకెళ్ళడం అందరికీ ఎంత నచ్చేసేదో. పెళ్ళిళ్ళకో పుట్టినరోజులకో ఇచ్చే బహుమతి చిన్నదయినా సరే, ఇచ్చే వస్తువు పనికొచ్చేదో ఆర్టిస్టిక్ గానో ఉండాలని నా అభిప్రాయం. అన్నీ డబ్బుతో వెలకట్టడం నాకు ఇష్టం ఉండదు. ఖరీదైన బహుమతుల కంటే నాకు ఇష్టమైన వైలెట్ రంగు మట్టిగాజులిచ్చిన వాళ్ళు బహు ముఖ్యులైపోతారు నాకు. పనికిరాని పదివేల బహుమతి కన్నా, ఉపయోగపడే డాలరుస్టోర్ వస్తువు మిన్న అన్నది కూడా నాకు అనిపించేస్తుంటుంది మరి. పైగా చిన్నప్పటినించీ ఇంటా బయటా ఎవరికేమి ఇష్టమో కనిపెట్టి, దాన్ని కొని ఇవ్వడం ఇష్టం.
స్నేహితులొకరు ఇల్లు కొనుక్కున్నారు. పదిరోజుల్లో గృహప్రవేశం అనీ, తప్పకుండా రావాలనీ చెప్పారు. ఏం కొనాలి అని బాగా ఆలోచించాము. ఆవిడ మా సీతయ్యతో కలిసి పనిచేసేవారు. మా ఇంటికొచ్చినప్పుడు "మొహమాట పడకండి" అన్నప్పుడల్లా, ఆవిడ "నాతో అలాంటి ప్రాబ్లం ఎప్పుడూ రాదు. నాకు మొహమాటం లేకుండా ఏది కావాలన్నా అడిగి తీసుకుంటా, ఒకవేళ మొహమాట పడే పరిస్థితి వస్తే, హింట్ ఇస్తాగా" అనడమే కాకుండా, కావలసింది అడిగే చనువు కూడా ఉందనిపించేలా సరదాగా ఉండేవారు. "చనువు ఉంది కాబట్టి, ఆవిడనే అడుగుదాము ఏం కావాలో" అన్నాను నేను. సీతయ్యకి ఏదో తట్టింది. ఆఫీసులో మాట్లాడుతున్నప్పుడు " ఇంటికి అన్నీ కొనడం అయిపోయిందండీ, ఒక్క కంప్యూటర్ టేబుల్ ఒక్కటీ మిగిలింది " అన్నారని చెప్పారు. మేమిద్దరం దాన్ని ఒక హింట్ లాగా తీసుకుని, టేబుల్ కొనడానికెళ్ళాము. మా అదృష్టం కొద్దీ హోం డిపోలో $175 ఉన్న అందమైన టేబుల్ ని $75 కి సేల్ లో పెట్టారు. అలాంటప్పుడు గబ గబా అమ్ముడుపోతాయి. ఇంక రెండే పీస్ లు ఉన్నాయి. కార్నర్ టేబుల్ ఎల్ షేప్ లో చాలా పెద్దది. ఇంట్లో సగం సామాను వెళ్ళిపోతుంది ఆ అరల్లోకి. భలే నచ్చేసింది మా ఇద్దరికీ. సేల్ కాబట్టి రిటర్న్ తీసుకోము అని చెప్పారు. అయినా సరే, వాళ్ళకొకటి మాకొకటి అని కొన్నాము. రెండూ కార్లో పెట్టడానికి ప్రయత్నించారు కుదరలేదు. షాప్ లో పనిచేసే పిల్లలు ఒక తాడు తెచ్చి ట్రంక్ తలుపు తీసి ఉంచి, గట్టిగా కట్టేసారు. కాస్త దూరం వరకూ బానే ఉంది. తర్వాత ఒక డబ్బా జారి, తాడు వదులయి, తలుపు దడాలున పడబోయి ఆగింది. సాయంత్రం అవడంతో ఆఫీసు నించి ఇంటికెళ్ళే కార్లతో రోడ్డు కిటకిట, ఇంకో వైపు ముద్దలు ముద్దలుగా మంచు కురుస్తోంది. మధ్య లేన్ లో ఉండడం వల్ల, కార్ లోంచి దిగే పరిస్థితి లేదు. వెనక డబ్బా పడిపోతోంది చూసుకో అని పక్క కార్ వాళ్ళు అరచి చెప్పారు. డ్రయివింగ్ కొత్త. కంగారు. ఈ లోపే రైల్వే గేట్ వచ్చింది. అది దాటబోయేంతలో రెండో గేట్ పడబోతూ ఉంది. అదాటున దాటేటప్పటికి డబ్బా పడిపోయింది. పక్కకి ఆపుకుని ఆ డబ్బా ఎత్తి లోపల పెట్టేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చింది. అలా నెమ్మదిగా నడుపుకుంటూ చివరికి వాళ్ళింటికి వెళ్ళాము. ఇల్లు కాస్త ఎత్తుమీద ఉండి, 6 మెట్లున్నాయి. అవి చూసి ఈ వస్తువుని అక్కడికి ఎలా తీసుకెళ్ళడమా అని ఒకటే టెన్షన్ పడ్డాము. ఇంతలో మమ్మల్ని చూసి వాళ్ళు బయటికొచ్చారు. "కొంచెం సహాయపడతారా ఇది ఇంట్లోకి తీసుకెళ్ళడానికి" అని అడిగా మొహమాటాన్ని పక్కనుంచి. "ఏమిటిది" అంటూనే "అయ్యో ఇదే వస్తువు నిన్న రాత్రి కొనుక్కొచ్చాము. ఇల్లు బాగా చిన్నది అందుకని ఇంట్లోకి తీసుకువెళ్ళవద్దులెండి, మీరే తీసుకెళ్ళిపోండి ఏమీ అనుకోకుండా" అన్నారతను. మాకు ఏంచెయ్యాలో తెలియదు. వాళ్ళూ అక్కడే కొన్నారు కాబట్టి, వాళ్ళు కొన్నదే కాక, మేము కొన్నవి కూడా వెనక్కి తీసుకోరు. ఇప్పుడేం చెయ్యాలి? కనీసం ఒక టేబుల్ వీళ్ళకి ఇచ్చేస్తే, ఇంకొక్కదాన్నీ జాగర్తగా సర్దుకుని నిదానంగా ఇంటికెళ్ళచ్చనుకున్న ఆశ కూడా పోయింది. వచ్చిన పని మరచిపోయి, ఇంటికెళ్ళడమెలాగా అని దిగులు పట్టుకుంది. ఒక వైపు కుప్పలు తెప్పలుగా మంచు కురుస్తోంది. ఇంకో గంట ఆగితే చీకటి కూడా పడుతుంది. అదే విషయాన్ని చెప్పి, ఒక సారి ఇల్లు చూసామనిపించి, భోజనాలవీ కేటరింగ్ వారు తెచ్చేవరకూ ఆగకుండానే వెనుదిరిగాము. చాలా కాలానికి ఇంటి నుండి బయటికెళుతున్నామనుకున్న పిల్లలకి చాలా డిసపాయింటుమెంటు. అంతవరకూ చాలా అందంగా ముచ్చటగా అనిపించిన టేబుల్..ళ్ళు ఇప్పుడు చచ్చిన గేదెని మోసుకెళుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఆ మంచులో జారుతున్న కారు, కారులోంచి జారిపోతున్న డబ్బా, తాన్ని తట్టుకోలేక ఉండనా ఊడనా అని చూస్తున్న తాడు, ఏం మాట్లాడితే ఏం విపత్తో అని అరచేతులో ప్రాణాలతో నేను, ఒక్క మాట మాట్లాడినా ఆకాశం ఊడి నేల మీద పడుతుందని తెలిసి మసలుకుంటున్న పిల్లలూ..వెరసి ఎలాగోలా ఇల్లు చేరాము. అక్కడ నించి ఇవన్నీ బేస్మెంట్ లో ఉన్న నివాసానికి తీసుకెళ్ళాలి. ఒకటయితే బానే ఉండు. రెండు తీసుకెళ్ళాలి అదీ, చితికిన మనసులతో.. ద్యావుడా అనుకుంటూ చచ్చీ చెడీ, ఇంట్లోకి మోసుకెళ్ళినా, వాటికి పెట్టడానికి జాగా ఉన్నంత పెద్ద ఇల్లు కాకపోయె. పైగా పార్టీ అని కదా వెళ్ళాము. ఇప్పుడు వంట మొదలెట్టాలి. ఆకలెక్కువయిందంటే అదొక గోల అని నేను కాళ్ళు చేతులూ కడుక్కుని బట్టలు మార్చుకుని అన్నం గిన్నె పొయ్యికెక్కించేసా. "అసలు నీ వల్లే వచ్చింది ఇదంతా" అన్న మాట తో ఉలిక్కిపడ్డా. ఇది వస్తుందని తెలుసుకానీ కొంత పోస్ట్ పోన్ చేద్దామని ప్రయత్నం. అసలే అందరం ఎవరి రీసన్ లతో వాళ్ళం చిరాగ్గా ఉన్నాము కదా? కానీ వచ్చాక తప్పుతుందా? "వాళ్ళింట్లో కంప్యూటర్ టేబుల్ ఒక్కటే కొనాలిట అని చెప్పింది నేనా?" అన్నా తడుముకోకుండా. "మాటవరసకి చెప్పాకానీ, నీ చావు తెలివితేటలే ఆవిడ హింటిచ్చిందని చెప్పాయి" అన్నారు సీతయ్య. "అయ్యా అలా ఏదో లెక్కలేస్తుంటా... ఒకోసారి తప్పవచ్చు నేనేమైనా కలగన్నానా అన్నాన్నేను. "అదిగో అలాంటి తేడా లెక్కలే వెయ్యద్దని చెప్పేది, మళ్ళీ చూస్తే అకవుంటెంట్ అని పేరొకటి, ఒక్కటీ బాలన్స్ కాదు బాలన్స్ షీట్ తో సహా" అన్నారు సీతయ్య కచ్చగా. "అదిగో నన్నేమన్నా అనండి నా బ్యాలన్స్ షీట్ ని తీసుకొస్తే బాగుండదు" అన్నాన్నేను కుములుతూ. "అనక? దేనికైనా ఉపయోగపడిందా అసలు" అన్నారాయన. ఇంకా చాలా ఉన్నాయిలెండి అవన్నీ మీకు తెలిసినవే. అవన్నీ సద్దుమణగవు కానీ, ఈ టేబుల్ ని ఎవరైనా ఫ్రీగా తీసుకుంటారేమో వెతుకుదాం రండి.
***
చూసారా, నేను చెప్తూనే ఉన్నాగా, లేదంటే లేదనుకుంటారు కానీ, మనం ఫ్రీగా ఇస్తామన్న వస్తువు మాత్రం ఎంత మంచిదైనా తీసుకోవడానికి ఒక్కరూ దొరకరు. ఇల్లు చిన్నదనో, అది ఫిక్స్ చెయ్యడం రాదనో, దాన్ని మోసుకెళ్ళడం కష్టమనో, కారు లేదనో ఏదో ఒకటి చెప్పుకొస్తున్నారు, మీరే చూస్తున్నారుగా? పోనీ మనమే కార్ లో పెట్టుకెళ్ళి వాళ్ళ ఇంటిదగ్గర దింపి వస్తామని చెప్పినా ఎందుకో వద్దనేస్తున్నారు కదూ? మీకు తెలియదని కాదు కానీ, కెనడాలో అదన్నమాట విషయం.
గుడ్-విల్లని ఒకటి ఉంటుంది లెండి, మనకి అక్కరలేనివి అక్కడ పడేస్తే, వాళ్ళు సెకండ్ హ్యాండ్ రేటుకి అమ్ముకుంటారు. అవి అమ్మగా వచ్చిన డబ్బులో, నిర్వహణ ఖర్చులు పోను మిగిలినది ఏవో మంచి పనులకి ఖర్చు పెడతారన్నమాట. అక్కడికి తీసుకెళ్లి ఒకదాన్ని వదిలించుకున్నాక గానీ, రెండవది ఫిక్స్ చెయ్యడానికి చోటు రాలేదు. ఇది ఇలా గుడ్విల్ లో పడేసిన మర్నాడు బస్ లో కలిసిన ఒకావిడ మాట కలిపి, తాము కొత్తగా వచ్చామని, ఫలానా ఫలానా వస్తువులు ఎక్కడ దొరుకుతాయని అడిగిన వాటిలో కంప్యూటర్ టేబులొకటి. పిల్లలు కింద కూచుని చదువుకోలేకపోతున్నారని, కొనాలంటే డబ్బు లేదని, ఎక్కడైనా పాతవి దొరుకుతాయా అనీ అడిగారు. అప్పుడు మీకైతే ఏమనిపిస్తుంది అండీ. కడుపులో ఒక ఫీలీంగ్ .. కదా.. అదే నాకూ వచ్చింది మరి.. గట్టిగా ఏడ్వాలనిపించేంత.
ఇది జరిగాక, నా క్రియేటివిటీ పక్కన పెట్టి, గిఫ్ట్ కార్డులనే సాధనం కనిపెట్టి, చిన్నదో పెద్దదో అవే ఇచ్చెయ్యడం మొదలెట్టాం కానీ ఏదో అసంతృప్తి. చాలా మంది వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎవరో ఏదో వస్తువు తెచ్చి పడేస్తే, దాన్ని ఇంకొకళ్ళ ఇంటికి వెళుతున్నప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. అలా కొన్ని వస్తువులు రీసైకిల్ అవుతాయన్నమాట. వాటిలో జాకెట్ ముక్కలు కూడా ఒకటి, వాటి తో పాటు ఇచ్చే చిన్న పసుపు కుంకుమ డబ్బాలతో సహా. మీకొకటి చెప్పాలి. ఒకసారి నాకు ఇంట్లో పసుపు నిండుకుని (అబ్బా అలా అనాలని రూలు అంతే) గబ గబా ఒక చిన్న డబ్బా తెరిచి తెచ్చుకున్నా. మొత్తం పురుగులే. అప్పటి నించీ జాకెట్ ముక్కలు అవీ పక్కన పడేసి చలి కాలానికి పనికొచ్చే ష్రగ్గులో రగ్గులో ఇస్తున్నా. భేషుగ్గా ఉంది అవుడియా అంటున్నారు మా వాళ్ళు. మీరూ అంటారు లెండి నాకు తెలుసుగా. కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని అసలు దేనికి వాడతారో కూడా మనకి తెలియదు. బేకింగ్ సెట్టో, పోర్సిలిన్ బేకింగ్ ట్రే నో తెస్తే, బేకింగ్ అన్న కళ తెలియని నా లాంటి వాళ్ళు ఏం చేసుకుంటారండీ? స్టవ్వు కింద ఉన్న ఓవెన్, బాండ్లీలు, బూరెల మూకుళ్ళు పెట్టుకోవడానికేమో అని మాత్రమే అనుకునేదాన్ని చాన్నాళ్ళసలు. నాతో సమానమైన లోక జ్ఞానం కలిగిన వాళ్ళే నాకు తగిలిన వారు కూడా. దాంతో, వాళ్ళకి అర్థం కాని వస్తువులని, ఎవరింటికో వెళుతున్నప్పుడు గిఫ్ట్ బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళింట్లో పడేస్తే, గిఫ్ట్ కొనే ఖర్చూ తప్పుతుంది, ఫ్యాన్సీ గా ఇచ్చినట్టూ ఉంటుందని ఏవేవో వస్తువులు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం లాగా అన్నమాట. ఈ వస్తువులు చూసీ చూసీ చిరాకేసి, మా ఇంటికొస్తున్నప్పుడు ఏమైనా తెచ్చినవాళ్ళకి ఇంట్లోకి ప్రవేశం లేదనీ, పైగా ఒక కుటుంబం లాగా అయిపోయాము కాబట్టి, మనలో మనం ఇలా కొత్త ఫార్మాలిటీస్ మానేద్దామనీ నచ్చచెప్పేటప్పటికే, ఇంట్లో పేరు తెలియని బోలెడు వస్తువులు. పెప్పర్ సాల్ట్ సెట్లు, మూన్ లయిట్ డిన్నర్ క్యాండిల్ సెట్లూ, కింద మంటపెట్టి పైన చాక్లెట్ పాలు కాచుకునే సెట్లూ, కేక్ పళ్ళానికి మూతపెట్టుకునే సెట్లూ, మధ్యలో సాస్ వేసుకుని చుట్టూ చిప్స్ వేసుకుని తినే పోర్సిలిన్ పళ్ళాల్లాంటి సెట్లూ, ఒక షాట్, గాబ్లెట్స్ (ఏదో లెండి నాకే అర్థం కాదు మీకేం చెప్పను), బీరు గ్లాసులు, మంచి నీళ్ళ గ్లాసులు, వైను గ్లాసులు కాక ఎందుకు ఉపయోగిస్తారో తెలియని అనేకానేకమైన వస్తువులని సులువుగా గుడ్విల్ లో పడేసి వస్తే కానీ ప్రశాంతత లేకపోయింది.
ఒకసారి ఎవరో ఇంటికొస్తూ ఒక కప్పు పట్టుకొచ్హ్చారు. పాలో పెరుగో పోద్దామంటే, ఆ కప్పు ఒక వైపు సాగినట్టుంటుంది. " మీరు మొన్న ఇచ్చిన వస్తువు ఏంటండీ భలే ముద్దొచ్చేస్తోంది" అని అడిగా ఆవిడ ఫోన్ చేసినప్పుడు. "ఏమోనండీ తెలియదు, మా వారు కొనుక్కొచ్చారు" అన్నారావిడ, "ఇంకొకరు తెచ్చినది నాకు అర్థం కాక మీకు ఇచ్చాను" అంటే బాగుండదన్నట్టు. మ్యాన్యుఫాక్చరింగు డిఫెక్టేమో అని పరికించి చూసి, ఏదోలే అని గార్బేజ్ లో పడేసా. మరుసటి యాడాది బాక్సింగ్ డే షాపింగ్ కి వెళ్ళినప్పుడు వంట సామాన్ల దుకాణంలో డిస్కవుంట్లని, లోపలికి వెళ్ళగానే ఇలాంటి ఒక వైపు సాగిన కప్పులు బోలెడు కనిపించాయి. ఆ షాపులో పని చేస్తున్న వాళ్ళల్లో, నన్ను మరీ ఊరు దాన్ననుకోదనుకున్న ఒక చిన్న పిల్లని వెతికి పట్టుకుని, "అమ్మాయీ ఇదేంటీ" అనడిగా. నా వైపొకసారి ఎగాదిగా చూసి, "వంట చేస్తున్నప్పుడు అన్నమో కూరో కలిపే గరిటలు కిందా మీదా పెట్టకుండా, దీనిలో పెట్టుకోవచ్చు, సర్వింగ్ స్పూన్ హోల్డరు" అంది. "ఓహో అదన్నమాట. అరే ఇలా నేను పడేసిన చాలా వస్తువులకి అర్థం పర్థం ఉందన్నమాట! ఇలా నాకు అర్థం కాక చాలా పడేసానే" అని బాధ పడ్డా కూడా..
ఒక పాకీస్తానీ జంట పరిచయమయ్యారు ఆ మధ్య పార్కులో. ఒక్క రెండు వీధులవతల ఉంటారుట. మరీ కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు గానీ, మరీ పాత కూడా కాదు. పిల్లలు ఒకే వయసు వాళ్ళవడంతో సంతోషపడిపోయాము ఆడుకోవడానికి తోడుంటారని. ఎవరైనా కొత్త వాళ్ళు కనబడగానే "మా ఇంటికి ఎప్పుడైనా వచ్చెయ్యచ్చు. ఫోన్ లు గట్లా చెయ్యక్కరలేదు. మా ఇంటి ద్వారములు మీ కొరకు ఎల్లప్పుడూ తెరిచియే ఉండును " అనడం మా సీతయ్యకి అలవాటు. గ్రాసరీ చెయ్యడానికెళుతుంటే గుర్తొచ్చాముట, పదకండవుతుండగా వచ్చారు శనివారం. వాళ్ళు ఒక బరువైన వస్తువేదో తెచ్చారు. నా స్నేహితులకంటే చెప్పేసా గానీ, వీళ్ళు కొత్త కదా? "ఏమీ తేవద్దు" అని చెప్పే వీలు లేకపోయింది. వాళ్ళు వెళ్ళాక పిల్లలు అప్పటి దాకా ఆపుకున్న ఉత్సాహాన్ని ఆపుకోలేక " అమ్మా, చుట్టాలు వెళ్ళిపోయారుగా, ఇప్పుడు గిఫ్ట్ విప్పి చూడచ్చా " అని అడిగారు గౌరవంగా. సరే అన్నానో లేదో ఆ డబ్బాలోంచి వచ్చింది పెద్ద షాండ్లియర్, కళ్ళు జిగేలని మిరుమిట్లు గొలుపుతూ! ఎంత పెద్దదో, ఎంత బాగుందో అసలు! దాని అందానికి ముగ్ధురాలినైపోయాన్నేనొక్కసారిగా. అల్లప్పుడెక్కడో హైదరాబాదు నవాబుల ఇల్లు లాంటి ఒక పెద్ద హోటల్ కి వెళ్ళినప్పుడు చూసి ఆహా ఓహో అనుకున్న షాండ్లియర్.. నేను అలా గింగిరాలు తిరుక్కుంటూ అటు వెళ్ళిపోయా. సీతయ్యకొచ్చిన ఇర్రిటేషన్ ధాటికి మళ్ళీ మా బేస్మెంట్ లోకి వచ్చి పడ్డా. ఈ సీతయ్య అంతేనండీ... నేనెక్కడికో వెళదామనుకుంటా కలల్లో. ఆయన్నీ తీసుకుపోదామనుకుంటా. ఆయన ఆ రాగానికి, తాళానికీ తట్టుకోలేడు.. తకిట తకిట అంటూ నన్నూ లాక్కొచ్చేస్తాడు . "ఏమిటంత మురుపు, మైమరపూ ఏం చేస్తామిప్పుడు దీన్ని?" అని అడిగారు భయంగా. భయమెందుకంటారా? రాత్రి షిఫ్ట్ కి వెళ్ళాలి ఆయన. అసలే పగటి నిద్ర రాత్రి నిద్రతో సమానం కాదు. అయినా శనివారాలు పొద్దున్న పని నించి వచ్చాక పాలు కూరలు పళ్ళు అంటూ పిల్లలని తీసుకుని దుకాణాల చుట్టూ తిరుగుతారు. పగలు భోజనాలయాక నిద్రపోతారు. మరి వాళ్ళు వచ్చి వెళ్ళారాయె. కొంత సమయమే ఉంది. మూడు నాలుగు గంటలయినా పడుకోకపోతే రాత్రి నిద్ర ముంచుకురాదూ? ఇల్లేమో మరీ చిన్నది. ఇదేమో ఇంత పెద్ద డబ్బా. పనికొచ్చే వస్తువా అంటే కాదు. ఇంట్లో స్థలం లేదు కాబట్టి, గుడ్విల్ లో పడెయ్యడానికి ఈ సమయంలో వెళ్ళాలంటే కష్టమే కదా మరి. కాసేపాగి నేనొక నిర్ణయానికి వచ్చా. ఆ పాకిస్తానీ ఆవిడకి ఫోన్ చేసి, "భాభీ గారూ, అంత ఖరీదయిన వస్తువులు బహుమతులు తీసుకోవడం మాకు అలవాటు లేదు, కావాలంటే మీ ఇంటి పెరట్లో పూస్తున్న ఒక లిల్లీనో, గులాబీనో ఇచ్చి ఇది పట్టుకెళ్ళిపోరూ" అని గారంగా అడిగా. నీ గారం నయాగరాకెళ్ళా అన్నట్టు ప్రేమగా నవ్వి, "మీరు మాకు భలే నచ్చారు, మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు మా గుర్తుగా దీన్ని పెట్టుకోవాలి ఇది నా కోరిక" అంది. "అది ఇప్పటి మాట కాదు కదా, ఇల్లు కొనగానే, మిమ్మల్ని షాప్ కి తీసుకెళ్ళి అచ్చం ఇలాంటిదో, ఇంతకంటే మంచిదో అడిగి కొనిపించుకుంటా కదా మీకు ఎందుకు బెంగ, మా తల్లి కదూ ఇప్పుడు మాత్రం వద్దు, ఇల్లు చూసారుగా. స్థలం కూడా లేదు, దీన్ని దుకాణంలో ఇచ్చేద్దాం" అన్నాను . "నీకొక నిజం చెప్పనా? మేము చాలా చిన్న అపార్టుమెంటు కొన్నాము. గృహప్రవేశం పార్టీ సందర్భంగా వచ్చిన మా తెలిసున్నవాళ్ళలో ఇద్దరు షాండ్లియర్లే పట్టుకొచ్చారు. పెట్టుకుందామన్నా, ఇల్లు కొన్నప్పుడే ఫిక్చర్లన్నీ ఉన్నాయి, వీటిని ఏమిచేసుకోవాలో తెలియక, ఎవరింటికెళ్ళినా పట్టుకెళుతున్నాము. వాళ్ళు వద్దంటున్నారు. నువ్వు అలా వద్దనకు నేను బాధ పడతా" అంది. "నా తల్లే" అనుకుని, ఆ డబ్బాని ప్రస్తుతం డయినింగ్ టేబుల్ లా వాడుకుందామా బరువుగా పడి ఉంటుంది అని ఇంటి మధ్యకి పట్టుకొచ్చి , దానిమీద ఎంబ్రాయిడరీ ఉన్న ఒక చున్నీ పరిచా.. పిల్లలు సరదా పడిపోయి ప్లేట్లు పట్టుకుని దాని చుట్టూ కూచుని భోజనం చెయ్యడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. సీతయ్యకి ఇంక రెండు మూడు గంటలే ఉంది కాబట్టి, తనని పడుకోమని, ఆ డబ్బాని నెమ్మదిగా మెట్లెక్కించి డ్రయివ్ వే పక్కనున్న చెట్టు దగ్గర పెట్టాము.
ఇంకో విషయం చెప్పాలి. మనకి అక్కరలేని ఏదైనా వస్తువు ఉంటే, మన ఇంటి ముందు రోడ్డు వారగా పెడితే ఎవరికైనా కావలిస్తే తీసుకెళతారు. కానీ మేము ఉంటున్న ఇల్లు చిన్న చంద్రవంకలా ఉన్న వీధి లో మెయిన్ రోడ్డుకి కొంత దూరంలో ఉన్నమూలాన, ఈ నాలుగిళ్ళవాళ్ళు తప్ప ఈ వీధిలోకి బయటి వాళ్ళు వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ పెట్టి చూద్దాం, కనీసం రేపటి వరకైనా ఇరుకిరుకుగా ఇంట్లో ఉంచక్కరలేదు అని ముగ్గురం సంతోషపడ్డాము. రెండు రోజులు ఆశగా చూసా ఎవరైనా తీసుకెళ్ళారేమోనని! అదక్కడే ఉంది నన్ను హేళన చేస్తూ! రెండు రోజులు తెరిపిచ్చిన మంచు మళ్ళీ కురవడం మొదలయింది. పైన డబ్బా తడిసిందంటే, ఆ లోపలి అందమైన వస్తువు ఎవరికీ పనికిరాదన్న మధ్యతరగతి మనసు దాని చుట్టూనే తిరిగింది. మా ఇల్లుగల వాళ్ళకి ఇంటా బయటా బోళ్ళు సామాను. గారేజీ కూడా చెత్తా చెదారం తో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడూ ఏమీ అడగని దాన్ని ఇంటివాళ్ళని బతిమాలి వాళ్ళ గారేజీలో ఈ రెండు రోజులూ ఆ పెట్టెని పెట్టేటట్లూ, శనివారం పొద్దున్నే తీసుకెళ్ళి గుడ్విల్ లో పడేసేటట్ట్లు ఒక ఒడంబడిక చేసుకొచ్చా. దానికి ప్రతిఫలంగా శనివారం పూట పులిహారా రవ్వలడ్డులు నైవేద్యం ఇస్తానని మొక్కు పెట్టాననుకోండి, అది వేరే విషయం. అలా దాన్ని ఆ శనివారం గుడ్విల్ వైపు ప్రయాణం కట్టించినా, ఆ షాండ్లియర్ తాలూకు మెరుపులు నా కళ్ళల్లో తళుకుమంటూనే ఉండేవి చాలా రోజులు.
ఇలా ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, క్షణం తీరిక లేని, దమిడీ ఆదాయం లేని పనులు బోలెడు మాకు, గుడ్విల్ కీ మధ్య నడిచాయి, నడుస్తూనే ఉన్నాయి. అదొక తీరని బంధం అంతే..A
Posted by
Ennela
at
Wednesday, November 23, 2022
0
వ్యాఖ్యలు
Email This
BlogThis!
Share to X
Share to Facebook
వ్యాఖ్యలు
ఖుషీ ఖుషీగా నవ్వుతూ...
Subscribe to:
Posts (Atom)