సీతయ్య-ఎవ్వరి మాటా వినడు

Saturday, December 11, 2010

మా సీతయ్య  చిన్నప్పటినుంచీ అంతేట. అందరూ పప్పూ అన్నం తింటే తనకేమో కూర కావాలనేవారట. అప్పటికప్పుడు కూర చెయ్యకపొతే అన్నం తినడం మానేసేవారట. కూరలొండిన రోజు పప్పు కావాలనేవారుట . చక్కగా ఇంజనీరింగ్ చదివావు కదా ఇంజనీరు ఉద్యోగం చెయ్యమంటే 'నలుగురికీ నచ్చినదీ నాకసలే నచ్చదురో' అని ఇంకో ఫీల్డు ఎంచుకున్నారట. సకుటుంబంగా సినేమాకి వెళితే చివ్వరి సీను చూసే అదృష్టం ఎప్పుడూ ఉండేది కాదు.. రోడ్డు చాలా రష్ అయిపోతుందని, ఇరవై నిముషాలు ముందే మా సీతయ్య లేచి బయటికి వచ్చేస్తారు. మేమందరం వరుసగా ఫాలో అయిపోవాలన్నమాట. చూసిన ప్రతి సినేమాకీ ముగింపు ఏమవుతుందని ఎవరినో ఒకళ్ళని అడగాల్సిందే. కొన్ని ముగింపులు ఊహించెయ్యొచ్చనుకోండి...కానీ పడమటి సంధ్యా రాగం సినేమా చూసొచ్చాక ఫ్రెండ్స్ అందరూ 'చివరికేమవుతుందే' అని ఏడిపించేవారు.

సకుటుంబంగా వెళ్ళిన సినేమాలో జోక్స్ వస్తే మనం ఇష్టం వచ్చినట్టు నవ్వకూడదన్నమాట. కొన్ని జోక్స్ మా సీతయ్యకి వెకిలిగా అనిపిస్తాయి . కొన్నిఎవ్వరికీ  జోక్స్ అనిపించవు కానీ మా సీతయ్యకి చాలా నవ్వు తెప్పించేస్తాయి. మరి మనం ప్రతి జోక్కీ సీతయ్యని చూసి నవ్వాలా వద్దా అని డిసైడు చేసుకోవాలన్నమాట. ఇంకో వరుసలో కూచున్న ముగ్గురు  మగ పిల్లలూ ఫర్వాలేదు కానీ, మా టాం బాయ్ కి(నలుగురి వెనుక సిరి) మాత్రం అన్నిటికీ నవ్వొచ్చేస్తుంటుంది.  ..నవ్వొచినప్పుడల్లా పక్కనున్నవాళ్ళని గట్టిగా గిల్లెయ్యడమో కొట్టెయ్యడమొ అతి సాధారణంగా తనకున్న చిన్ని సరదా. పక్కనున్నవాళ్ళకి యెముకలు విరిగినా, ఒళ్ళు ఎర్రగా కందిపొయినా,  ఎవరికి వారే భాద్యులు. తనకి పెళ్ళవ్వగానే మా అన్నయ్యగారికి మరిచిపోకుండా యీ విషయం చెప్పి గొప్ప ఉపకారం చేసినట్టు ఫీల్ అయ్యి, ఎముకలు విరగ్గొట్టుకోవడం, ఒంటి మీద ర్యాష్  తెచ్చుకోవడం అను బాధల నుండి పర్మనెంటుగా విముక్తురాలనయ్యానని వేరే చెప్పక్కరలేదనుకుంటా.

ఇంక యాత్రలు.... చాలా మంది, ప్రయాణాలు అనగానే పెద్ద యజ్ఞంలా రాకపోకలకి బోలెడు సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు కదా. మాకు అలా ఉండదు. అప్పటికప్పుడు మా సీతయ్యకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి హుటాహుటిన యుధ్ధ ప్రాతిపదికన బయల్దేరి వెళ్ళిపోతాం. కానీ వెళ్ళినంత వేగంగా తిరిగి వచ్చెయ్యడం కూడా. కారణం అందరికీ సెలవులు ఉన్నాయా లేదా వగైరా లెక్కలోకి తీసుకోకుండా ప్రయాణం కట్టడమే.  కొన్నిసార్లు పెద్దలకి సెలవు లేకపోవడమూ, కొన్నిసార్లు పిల్లలకి పరీక్షలు కూడా ఉండి ఉండవచ్చు. అయినా ఆగేది లేదు, లేడికి లేచిందే పరుగన్నట్టు, అనుకోగానే చల్ మోహన రంగా అని వెళ్ళిపోవడమే. క్షణాల్లో టికెట్లూ అవీ బుక్ అయిపోతాయి.  కాబట్టి శుక్రవారం రాత్రి అనుకుని ఎక్కడికైనా వెళితే, ఆదివారం రాత్రికో, సోమవారం పొద్దున్నకో తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సిందే.....తిరుపతికెళ్తే మీరు ఏం చూస్తారండీ, చక్కగా ఆకాశ గంగ, పాపనాశనం, మంగా పురం వగైరా వగైరా.. అవునా... కానీ మా సీతయ్యకి మాత్రం తిరుపతి వెళ్ళేది కేవలం వెంకన్నను చూచుట కొరకే...అటు దర్శనం అవడమేంటి ఇటు తిరుగు రైలు ఎక్కడమేంటి.... యీ రెండూ ఏక కాలంలో జరగాలి...సో, నన్ను వరైనా బాసరలో ఏముండును అనడుగగా నేను..'సరస్వతీ' దేవి అనీ.... అన్నవరంలో ఏముండును అని అడుగ 'శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ' అనియునూ, కంచిలో మున్నదన 'కామక్షీ దేవీ' అనియునూ ఏకవచన సమాధానములు మాత్రమే చెప్పగలను. 

మా సీతయ్యకి కొంచెం ప్రథమ కోపము... ప్రతి సంవత్సరమూ చాలా కొత్త డైరీలు వచ్చేవి ఇంటికి.  అందరూ పంచుకుని, మిగతా డైరీలు ఇంకెవరికో ఇచ్చేవారు. ఒకసారి నాకు కూడా ఒక డైరీ కావాలని అడిగా.  'మా ఆయన ఇవ్వాళ తిట్టారు, చాలా బాధగా ఉంది అని ఒక రోజూ, మా వారు ఇవ్వళ తిట్టలేదు... ఏదో వెలితిగా ఉండి అన్నం సహించలేదు అని ఒక రోజు అని తప్ప నీకు రాయడానికి ఏముంటాయి అని సరదాగా అనేవారు ఇంట్లో అందరూ.... నాకు కూడా నిజమే అనిపించేది..

పైన చెప్పిన వాటికి తోడు , మా సీతయ్య క్కడికీ రారు. ఎంత సేపూ ఇంట్లోనే . మన ఇంటికే అందరినీ పిలవమంటారు. నాకేమో కొంచెం నీరూ, కొంచెం నిప్పూ లాగ అప్పుడప్పుడు ఎవరింటికయినా వెళ్ళాలని సరదా. దిక్కుమాలిన చదువు పుణ్యమాని సరదాలన్నీ అటకెక్కాయ్. అయితే సరదాలకి శాపమైన చదువు మా సీతయ్యకి వరమయ్యింది. ఎవ్వరైనా "మా ఇంటికి రండీ' అని పిలవడం తరువాయి, నాకు అస్సైన్మెంట్లు ఉన్నాయి, నాకు పరీక్షలు ఉన్నాయి, నేను చదువుకోవాలి అంటూ జనాల్ని ఊదరగొట్టేసి, సారీ సారీ అని చెప్తూ, మా సీతయ్యని కాపాడుకోవటం నాకు అలవాటయిపోయింది. ఒకరిద్దరు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా వచ్చేవరకు వదలరనుకోండి.....బట్ ఇది చాలా రేర్. చాలా మంది ఫ్రెండ్స్” మేము చెప్తే సీతయ్య వస్తారులెండి” అంటారు. అలా ఆయన రారు కానీ ఎవరైనా మా ఇంటికి వస్తానంటే మాత్రం మహా సరదా. అతిధి సత్కారాలలో మా సీతయ్యకి ఎవరూ సాటి  రారు.

మాకున్న కొద్దిమంది మంచి స్నేహితులు ఫర్వాలేదని సర్దుకు పోతారు. "మీరు మా ఇంటికి వస్తే కాని మీ ఇంటికి రాం రాం ' అనే స్నేహితులు లేనందుకు నేను నిజ్జంగా గర్విస్తుంటాను. అందరూ వస్తారు సరే కానీ, వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళక పోతే ఏంబాగుంటుందని  నేను ఎప్పుడూ గొణుగుతూ ఉంటాను. ఈ విషయం మా సీతయ్య అస్సలు ఒప్పుకోరు. నన్ను బాగా పిలిచేవారు ఎవరూ లేరని, నేను రాకపోతే ఎవ్వరూ ఫీల్ కారనీ, నన్ను ఉడికిస్తారు. ఇది తప్పని ప్రూవ్ చెయ్యడానికి నాకు పది రోజులు చాలని నా నమ్మకం. ప్పటికైనా గెలుస్తానని గట్టి నమ్మకంతో నేను పరీక్షకీ. పరీక్షకీ వచ్చే పది రోజుల గ్యాప్ లో ముఖ్యులందరికీ 'నేను ఖాళీగా ఉన్నానోచ్...పిలుచుకుంటే పిలుచుకోండి" అని సీతయ్యకి తెలియకుండా అన్యాపదేశంగా ఇ-మెయిల్సు పడేస్తాను .

నా దురదృష్టం కొద్దీ ఆ పది రోజులూ ఎవ్వరూ టచ్ లో ఉండరు. నేను కొద్దిగా బాధపడి, పెద్దఎత్తున కృంగి  కృశిస్తాను. ఇదే మా సీతయ్యకి పసందయిన కాలం. కొండొక వీకెండ్ సాయంత్రం నా మీద చాలా జాలిపడి ' ఎవరిల్లైనా కోరుకో, తీసుకెళ్తాను., నీ కోరిక తీర్చడం నా కర్తవ్యం' అని శ్రీ కృష్ణుడి లెవెల్లో ఒక డైలాగ్  పడేస్తారు. ఆ బలహీన సమయంలో నేను నా ఫోనులో ఉన్న దోస్తుల నంబర్లన్నీ వరుస క్రమంలో నొక్కేసి, 'ఇంట్లో ఉన్నారా'? అని అడుగుతాను (మరీ అలా చూడకండి, మీ ఇంటికి రావొచ్చా అని అడిగితే బాగోదు కదా!) వాళ్ళు గుడికో, పార్టీకో, ఎవరింటికో వెళుతున్నమని చెప్తారుకదా?  అక్కడి నుండీ మా సీతయ్యకి భలే సరదా టైమన్న మాట. "ఏంటో  నీ తాపత్రయం" అని తాపీగా మొదలు పెట్టి...."ఏదో మాట వరసకి పిలుస్తారు కానీ, మనం రాకపోతే ఎవ్వరికీ పట్టింపు లేదని" జ్ఞానోపదేశం చేసేస్తారన్నమాట. నేను కుంచెం ఫీల్ అయ్యి, 'అబ్బే , మనం  వస్తామని చెప్పలేదు, చెప్పి ఉంటే,  ప్రోగ్రాము క్యాన్సిల్ చేసుకున్నాము వచ్చెయ్యండని ఉండేవారు" అని వకాల్తా పుచ్చేసుకుని బుకాయించేస్తానన్నమాట. అలా అలా ఆ వారం గడవగానే మళ్ళీ నా అస్సైన్మెంట్లు, పరీక్షలు, చదువులు. మళ్ళీ ఇన్విటేషన్లు, షరా మామూలే. ఐదేళ్ళు గడిచింది. కోర్స్ పూర్తి అయ్యి, ఇప్పుడింక పరీక్షలు, చదువులు అయిపోయాయి కాబట్టి, ఎవరైనా పిలిస్తే వెళ్ళకుండా ఉండడానికి ఏం వంకలు చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోయా.  వంక లేనమ్మ డొంకట్టుకునేడ్చిందన్నట్టు, ఏముందిలెండి, మా సీతయ్య ఒప్పుకుంటే వెళ్ళడం, లేక పోతే ప్రస్తుతానికి  నా దగ్గర  ఒకటే డైలాగ్. 'కుదరదండీ......సీతయ్య ఎవరి మాటా వినడు" 

21 వ్యాఖ్యలు:

ఇందు said...

హ్మ్! ఏం చదువులండీ బాబూ..!పాపం చదివీ చదివీ అలసిపోయినట్టు ఉన్నారు.మా ఇంటికి రండీ..మీ కెనడాకి మా మిషిగన్ దగ్గరేగా :) మీ సీతయ్యకి చెప్పండీ...'ఇందు పిలిచారు వారింటికి తెల్సా!' అని.ఓకేనా?

ఇందు said...

మర్చిపోయా! మా మాట విని మంచిపిల్లలాగా సంకలినుల్లో మీ బ్లాగ్ చేర్చినందుకు ధన్యవాదాలు :)

శిశిర said...

అయ్యో పాపం మీ సీతయ్య ఎన్ని కష్టాలు పెడుతున్నారండి. :)
>>>కుదరదండీ......సీతయ్య ఎవరి మాటా వినడు>>>
ఒక సొల్యూషన్.. ఆయన మాట మీరు వినకండి. :)
చాలా బాగా రాశారు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

చాలా బాగుందండి మీబ్లాగు & రచనలు. బ్లాగు లోకానికి స్వాగతం.

Ennela said...

ఇందూ గారూ , పొద్దున్నే మీ ఇన్విటేషన్ చూసి, అవునా నిజమేనా అని సాఫ్ట్ పిచ్ లో ఒకసారీ హై పిచ్ లో ఇంకొకసారీ గిల్లి గిల్లి మరీ పాడుకున్నాను. మరి మేము అచ్చంగా వస్తామన్నాప్పుడు -సారీ అండీ మేము వేగాస్ వెళుతున్నామూ అనకూడదు మరి...కృతజ్ఞతలండీ.
సీతయ్యకి ఇప్పుడే ఫొను చేసి చెపుతాను యీ విషయం.
సమాహారం , మాలిక మొదలగు వాటికి మెయిలు పంపితిని కానీ గురువర్యా ! నాకు కొన్ని సందేహములు: దీని వలన ఉపయోగమేమి? నా బ్లాగునందు ఇవి కానరావేల?నేను లేబుళ్ళు పెట్టుకొనుట యెట్లు? సమాధానము కోసం సవినయంగా వేచి యుందును.

శిశిర గారూ,
కృతజ్ఞతలండీ, కానీ చూసారూ, అలాంటి ప్రయత్నం చాన్నాళ్ళుగా చేసీ చేసీ అలసిపోయానండీ. మిస్టర్ పెళ్ళాం లో లాగ డైరెక్షను మారుతుంది కానీ పోసు(pose) మాత్రం డిటో డిటో

కొత్త పాళీ said...

సీతయ్యని పెండాడిన రామమ్మకి కష్టమే మరి :)

జ్యోతి said...

ఎన్నెలగారు,

మీ సందేహాలన్నీ నాకు మెయిల్ చేయండి. నేను చెప్తాను. చాలా తెలుసుకోవాల్సి ఉంది మీకు.. నా ప్రొఫైల్ లో నా మెయిల్ ఐడి ఉంది..

ఇందు said...

వారు మీకు మెయిల్ పంపిస్తారు(లేదంటే ఆ సంకలినుల్లో...'మీ బ్లాగుకి లంకె వేయండీ' అని ఉంటుంది..అక్కడ కూడామీకు నచ్చిన బటన్ చూసి ఆ కోడ్ కాపీ చేసుకోవడమే)....అందులో హెచ్టీఎమెల్ కోడ్ కాపీ చేసుకుని...మీ బ్లాగ్ డిజైన్లో...'ఆడ్ గాడ్జెట్' అని ఉన్న చోట క్లిక్ చేసి...అందులో..'హెచ్టీఎమెల్/జావా స్క్రిప్ట్ ' అని ఉండే లింక్ నొక్కి అందులో ఈ కాపీ చేసిన కోడ్ పేస్ట్ చేసి 'సేవ్' కొట్టాలి. అంతే...అవి మీ బ్లాగ్లో వచ్చేస్తాయి :)

'గురువర్యా' అని అనకండీ..నేనూ ఈ మధ్యే బ్లాగుల్లోకి వచ్చా! నాకు మరీ అంతేమీ తెలీదు :) మీలాగే నేను అన్నీ ఆసక్తితో తెలుసుకుని చేసినవే...

ఇందు said...

ఇకపోతే సంకలునవల్ల ఉపయోగం ఏమిటి అంటే...దీనివల్ల మీరు పోస్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఆ సంకలినుల్లో కూడా పబ్లిష్ అవుతుంది.అప్పుడు మిగితావారు మీ పోస్ట్ చూసే అవకాసం ఉంటుంది.మీరు మీ బ్లాగ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపినప్పుడు అన్నారు కదా..మీ స్నెహితులకి చెప్పండీ అని..అల సంకలినుల్లో చేరిస్తే..మన బ్లాగ్ మిత్రులందరి చెంతకీ మీ బ్లాగ్ చేరినట్టే! అదే సంకలినులవల్ల ఉపయోగం :) మీ బ్లాగుని పాపులరైజ్ చేసుకోవడానికి ఇది ఒక ఊతం :)

Ennela said...

సుబ్రమణ్యం గారూ కృతజ్ఞతలండీ... మీ బ్లాగ్ అద్దిరింది....నేను ఫాలొ అయిపొతా......

కొత్తపాళీ గారూ కృతజ్ఞతలండీ, యేంచేస్తాం, సీతమ్మ కష్టాలు సీతమ్మవి, రామమ్మ కష్టాలు రామమ్మవి .ఇంకా నేను మీ బ్లాగ్ వైపు చూడలేదు...ఆ పనిలో ఉంటా

ఇందు గారూ మళ్ళీ కృతజ్ఞతలు.. యీ సారి ఎక్కువ మొత్త్త్త్తంలో. మరి నేను పీజీ అవ్వగానే పీజీ స్టూడెంట్స్ కి టీచ్ చెయ్యల్సి వచ్చింది...అప్పుడు నేను గురువునా కానా?హహహ

జ్యోతి గారూ కృతజ్ఞతలు. తప్పకుండా మీకు మెయిలు చేస్తాను.మీ పర్సనల్ టైము స్పెండ్ చేస్తున్నందుకు, ప్రత్యేక కృతజ్ఞతలు.

ఇందు said...

అయ్యొ! మీ ఇంకో సందేహం చూడలేదు..సారీ..'లేబుళ్ళు కూడా...నేను చెప్పినట్టు...'ఆడ్ గాడ్జెట్' లో..'లేబిల్స్ ' అని ఉంటుంది. అది ఆడ్ చేసుకోవడమే. ఇక మీ పోస్ట్ వ్రాసాక..కింద కుడి ప్రక్కన ఒక టెస్క్స్ట్ బాక్స్ ఉంటుంది. మీరు ఏ లేబుల్ పెట్టలనుకుంటే అది అక్కడ పేస్ట్ చేయండీ...

ఉదా: 'పాటలు ' అనే లేబిల్ పెట్తలనుకుంటే...మీరు 'పాటలు ' అని లేఖినిలో వ్రాసుకుని..అది కాపీ చేసి..ఆ బాక్స్ లో పేస్ట్ చేయండీ...అలా ఎన్ని కావలంటే అన్ని పెట్టుకోవచ్చు.

కానీ ఆ లేబుళ్ళు మీ బ్లాగ్లో కనపడాలంటే..'లేబిల్ ' అనె గాడ్జెట్ ని పైన చెప్పినట్టు ముందు మీరు ఆడ్ చేసుకోవాలి. సరేనా? మీ సందేహలకి సాధ్యమైనంతవరకు రెలవెంట్ గానే సమాధానాలు ఇచ్చాను అని అనుకుంటున్నా..నేను చెప్పినది అర్ధం కాకపోతే.. మన గురువుగారు..'జ్యొతి ' గారు ఎటూ ఉన్నారు.వారిని అడగండీ..

వేణూశ్రీకాంత్ said...

భలే రాస్తున్నారండీ సీతయ్యగారి ధోరణి రామమ్మ గారి కష్టాలు విని అదేలెండి చదివి అయ్యోపాపం అనుకుంటూ నవ్వుకున్నాను :)

ramadevi said...

Laxmi garu...
Ennela chala bavundi...pandu vennela ga vundi chaduvuthu vunte indulo konni live ga mari konni already chala sarlu vinnanu ayina malli malli chadavalani anipistunayi.....mee intlo sethaiah maa intlo ramaiah

Ennela said...

ఇందూ గారి బ్లాగుకి వెళ్ళి
చెప్పాలి థ్యాంకులు మళ్ళీ మళ్ళీ

వేణూ గారూ కృతజ్ఞతలండీ. చూసారా మీరు నవ్వుతున్నారు..ప్చ్ ప్చ్

రమ గారూ కృతజ్ఞతలండీ. మీరు లైవ్ గా చూస్తున్నారు కాబట్టి మీకు సీతయ్య బాగా యీ పాటికి అర్థమయ్యి పోయి ఉంటారు. చూసినవి చదివితే భలే ఉంటుంది కదూ!

ఆ.సౌమ్య said...

హ హ హ బావున్నయండీ మీ సీతయ్య కబుర్లు...మీకెంత కష్టమో పాపం. :) ఈసారి మీరి ఇండియా వస్తే మా ఇంటికి తప్పకుండా రండి. నేనెక్కడికీ వెళ్ళిపోను, మీకోసం వేచిచూస్తానులెండి.

ఒక సందేహం....మీ బ్లాగుని మాకెవరికీ చూపించకుండా ఇన్నాళ్ళు ఇలా దాచి ఉంచుటకు గల కారణమేమి? సోదాహరణముగా వివరింపుము (అంటే మీరు పరీక్షలు, ప్రశ్నలు, జవాబులు అలవాటుకదా అందుకే ఆ పద్ధతిలోనే అడుగుతున్నాను). :D

Ennela said...

సౌమ్య గారు, కృతజ్ఞతలండీ, మా సీతయ్యనొప్పించి మీ ఇంటికి వచ్చేస్తాగా! అయితే ఒప్పించా నొప్పించా అని మాత్రం అప్పుడే చెప్పలేను.
నేను మొన్న కార్తిక పౌర్నమి రోజున బ్లాగు మొదలు పెట్టి, మమ అనుకున్నానంతే..... యీ మధ్యనే వ్రాయడం మొదలు పెట్టాను. కొత్త బిచ్చగాడు టైపులో రోజుకొక పొస్టింగ్ పెట్టెయ్యాలని తాపత్రయం.... దాంతో.... మిగిలిన విషయాలు యేమీ చూసుకోలేదు. ఇందూ గారు కూడలి అని చెప్పే దాకా అలాంటివి ఉన్నట్టు తెలీదు. ఇవి ఓన్లీ మనకు తెలిసిన వాళ్ళకేనేమో అనుకున్నాను. ఇందు గారు నాకు గురువు ఇంకా జ్యొతి గారు గుగ్గురువు.
సౌమ్య గారూ, పాస్ మార్కులు వేసారా మేడం?

ఆ.సౌమ్య said...

హ హ హ అలాగా అయితే వాకే...పాస్ చేసేసానులెండి. :)

కూడలితో పాటు హారం, మాలిక ల లో కూడా కలపండి మీ బ్లాగుని.

ఇందు said...

భలే ఉంది టెంప్లేట్. మీకు సమయం ఉన్నప్పుడు కాస్త శోధించారు అంటే..ఇంకా మంచి మంచి టెంప్లేట్లు దొరుకుతాయి.ఈ బ్లాగ్ ప్రయాణంలో అన్నీ తెలుస్తాయిలేండీ...మీరు ఇంకో పోస్ట్ వేస్తారేమో అని చూస్తున్నా! త్వరత్వరగా వేసేయాలి మరి :))

Ennela said...

ఇందు గారూ యీ టెంప్లెట్ ఎలా వచ్చిందో తెలియాలంటే మీరు కొంచెం వేచి ఉండాలి. దీని వెనక కొంచెం పెద్ద కథే ఉంది...కంప్యుటర్ ఖాళీగా దొరకట్లేదండీ. రాసేస్తాను తొందరగా.

సౌమ్య గారూ కృతజ్ఞతలండీ..కనీసం మీరన్నా నన్ను పాస్ చేసారు...

భాను said...

ఎన్నెల గారూ
బ్లాగ్లోకానికి స్వాగతం. భలే ఉన్నాయి మీ సీతయ్య పెట్టె కస్టాలు. మీరో పెట్టేస్తే పోలా. ట్రై చెయ్యండి. బాగుంది మీ టపా. పనిలో పని మా టపాలు కూడా చదివెయ్యండి నచ్చితే కమేన్టండి లేకపోతె ...కూడా కామేన్టండి

pravasarajyam said...

http://pravasarajyam.com/1/ladiescorner/2011/11/30/seetayya-he-is-the-monarch/