ఇంటెల్ " లేడీ "

Wednesday, September 28, 2016

అది 2011. ఫోన్ కార్డులు కొనుక్కుని గంటలు గంటలు మాట్లాడ్డం అలవాటయ్యింది నాకు , మా అత్తగారికీ. ఈ మధ్యన ఎందుకో ఫోన్ మాటిమాటికీ కట్ అవుతోంది. వర్షాల వల్లనో లేక ఎక్కువమంది మాట్లాడే టయిములో మాట్లాడడం వల్లనో అని అనుకున్నాం గానీ అలా ఎందుకు కట్ అవుతోందో కారణం తెలియదు. అడగ్గా అడగ్గా ఫోన్ కింద పడిందని నెమ్మదిగా చెప్పారు ఒక రోజు. ఒక స్నేహితురాలు ఇండియా వెళుతున్నానని చెప్పగానే, ఒక ఫోను కొని పంపించాము. అది తను తీసుకెళ్ళి ఇవ్వగానే మళ్ళీ మామూలుగా మాట్లాడేసుకోవచ్చని వెయిటింగు . మాటలంటే గంటలు గంటలు మాట్లాడేస్తా కానండీ, నేను టెక్నాలజీలో పరమ పూరు. కొత్తగా వస్తున్న ఫోన్ ల గురించి కానీ, వాటి లాక్ అన్లాక్ విషయాలు కానీ నాకు బొత్తిగా తెలియదు. నా అంత నాకు ఓల్డు ఈస్ గోల్డు. ఎన్నేళ్ళయినా బీసీ నాటి నా చిట్టి ఫోన్ ని వాడేస్తానే తప్ప కొత్తవి కొనుక్కోమని ఎవరైనా చెప్తే "పాతది బానే పనిచేస్తున్నప్పుడు కొత్తది మార్కెట్లోకి వచ్చిందని కొనెయ్యడమేనా" అని చిరాకు పడిపోతాను కూడా. మొన్ననే కొత్తగా కెమేరా ఉన్న ఫోన్ లు వచ్చాయని అంటగట్టాడు రోజర్స్ వాడు. ఆ ఫోన్ కూడా ఇంకో స్నేహితురాలు ఇండియా వెళుతుంటే మా చెల్లికి పంపేసా. అప్పుడెప్పుడో మాటల్లో కెమేరా ఫోన్ భలే ఉంటుందక్కా అంది, అలా సరదా పడేవాళ్ళకి ఇస్తే సంతోషం కదా మరి. *** వారం అయ్యాక ఫోన్ చేసినప్పుడు మేము పంపిన ఫోన్ అందింది కానీ అన్ లాక్ అవలేదని చెప్పారు అత్తగారు. సరే, ఇంకెవరైనా వెళుతుంటే ఇంకొకటి పంపాలని అనుకున్నాము. ఆ తరువాత ఏదో కారణాల వల్ల మరో వారం లో నేను బయల్దేరి వెళ్ళిన నా భారత దేశ యాత్ర మీకు తెలుసు కదా ! అలా వెళుతూ వెళుతూ మా సీతయ్య ఇక్కడ కెనడాలో అన్లాక్ చేయించి ఇచ్చిన ఫోన్ ఒకటి పట్టుకెళ్ళా..బట్ ఎందుకో అది కూడా అక్కడ పని చేయ్యలేదు. బజార్లో నాలుగైదు చోట్ల తిప్పినా అది మొండికేసింది. సీతయ్యతో ఆ విషయం చెప్పగానే, " ఇంక ఇక్కడి నించి పంపడం వేస్ట్ కానీ, అక్కడే ఒక ఫోన్ కొనియ్యి" అన్నారు. సరే అలా సర్ప్రయిజ్ చేద్దాంలే అనుకున్నా. ఎప్పుడొచ్చినా, పది రోజుల కోసం రావడమే. పది రోజులూ పది నిమిషాల్లా అయిపోతాయి. ప్రయాణం దగ్గర పడడంతో ఆ సాయంత్రం అతి ముఖ్యులైన చుట్టాలని కలవడానికి వెళ్ళి, తిరిగి వస్తున్నాం. స్కూళ్ళు వదిలే సమయం కావడం తో ఆటోలు దొరకడం కష్టమయింది. కొంత దూరం నడిచి, వెతగ్గా వెతగ్గా ఒక ఆటో దొరికింది. మాటల్లో ఆ అబ్బాయి మా ఇంటి దగ్గరే ఉంటానని చెప్పాడు అంటే, ఆదరాబాదరా మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలని సతాయించడు అన్నమాట. "మధ్యలో కొంచెం ఆగాలి బాబూ" అన్నాను. "ఫర్వాలేదు అక్కా, ఎక్కడ ఆపాలో చెప్పండి" అన్నాడు. దారిలో ఏవైనా ఫోన్ అమ్మే దుకాణాలు కనబడతాయా అని చూస్తున్నా. స్కూల్స్ పిల్లలతో దారంతా బాగా రష్ గా ఉంది. మధ్యలో ఎక్కడా ఆటో ఆపడానికి వీలు అవలేదు. అటూ ఇటూ చేసి గోల్నాకా వచ్చేసింది. ఇంకో స్టాప్ దాటితే మా ఇల్లు వచ్చేస్తుంది.. రేపు నా ప్రయాణం..ఇప్పుడు తప్పితే ఫోన్ కొనడానికి కుదరదు. అదృష్టం కొద్దీ, గోల్నాక చౌరాస్తా మలుపులో ఒక దుకాణం కనబడింది. అన్ని రకములైన ఫోన్ లు అమ్మబడును, రిపెయిర్లు కూడా చెయ్యబడును అని కనబడేసరికి ప్రాణం లేచి వచ్చింది. ఆటో ఆపమని "అత్తయ్యా మీరు, వల్లి ఆటోలో కూర్చోండి..ఇక్కడ ఫోన్ అన్ లాక్ చేస్తాడేమో అడిగి వస్తా" అన్నాను. సరే అన్నారు. నేను లోపలికెళ్ళి ఫోన్ చూపించా. ముందు ఊహించినట్టే, అన్ లాక్ అవలేదు. సరే, కొత్త ఫోన్ చూపించమన్నా. "ఎవరికండీ? ఏ రేంజ్ లో" అని అడిగాడు షాప్ అతను. "అదిగో, ఆటోలో కూచున్నారే! ఆవిడకి" అని చేతితో ఆటో వైపు చూపించా. తొంగి చూసి, "పెద్దావిడకా" అంటూ..పెద్ద పెద్ద అక్షరాలున్న ఫోన్ చూపించారు. "కాదమ్మా మామూలువి చూపించండి, ఆవిడ కళ్ళు చక్కగా పని చేస్తాయి" అన్నాను. వాళ్ళు చూపించిన వాటిలో నాకున్న పరిజ్ఞానంతో కాకుండా వాళ్ళనే అడిగి, మంచిది అని అనిపించినవి మూడు పక్కన పెట్టి, చెల్లిని అత్తయ్యనీ లోపలికి పిలిచా... "వీటిలో మీకు నచ్చింది తీసుకోండి అత్తయ్యా" అన్నాను సర్ప్రైస్ చేద్దామని. "ఇవే ఉన్నాయా" అన్నారు అత్తయ్య. "ఇంకా చాలా ఉన్నాయండీ" అని ఇంకా చాలా చూపించారు షాప్ వాళ్ళు . "టచ్ స్క్రీన్ లేవా" అని అడిగారు అత్తయ్య. ఆ పిల్లాడు అమాంతం నోరు తెరిచాడు. ఆవిడ ఆ మాట పలికే తీరుకి తెగ మురిసిపోయి "ఉన్నాయి ఆంటీ" అని వాటిని తెచ్చి చూపించాడు.. నాకు వాటి గురించి పెద్దగా తెలియదు కాబట్టి, నేను పక్కన నించుని చూస్తున్నా. అత్తయ్య వాటిని పరీక్షగా చూసి, ఒకటి సెలక్ట్ చేసారు. "ఇది బాగుంది కదూ" అని నన్నూ, వల్లినీ అడిగారు. మేమిద్దరం తెల్లమొహాలేసి, "దాంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయో లేదో చూడడం మాకు తెలీదత్తయ్యా, బుజ్జాయిని రమ్మని ఫోన్ చేద్దామా" అన్నాము. అత్తయ్య పట్టించుకోకుండా ఫోన్ ని అటూ ఇటూ తిప్పి చూస్తున్నారు. ఈ లోపు ఆ షాప్ కుర్రాడు "ఆంటీ ఆగండి, మీకు దీన్ని ఎలా వాడాలో చూపిస్తా" అని తాపత్రయ పడ్డాడు. "దాంట్లో చూపించడానికేముంది నాయనా..ఇక్కడ నొక్కితే ఓపెన్ అవుతుందీ..ఇలా స్క్రోల్ చేస్తే కాంట్టాక్ట్స్ వస్తాయి, ఇది నొక్కితే పాటలొస్తాయి" అని టపా టపా అన్నీ ఆ అబ్బాయికి చూపించేసారు. ఆ అబ్బాయి చూపిచ్చిన ఎక్స్ప్రెషను చూసో, ఆవిడ మాటలు విని సరదా వేసో కానీ, అక్కడున్న 4గురు సేల్స్ పిల్లలూ, షాప్ ఓనరానీ కూడా మా దగ్గరికి వచ్చేసారు. వాళ్ళూ అడుగుతున్న ప్రశ్నలకి మా అత్తయ్య అష్టావధానిలాగా జవాబులు చెప్తున్నారు. ఈ హంగామా విని లోపల రిపెయిర్ పని చేసుకుంటున్న ఇద్దరబ్బాయిలు, ఆటో అబ్బాయి కూడా కుతూహలంగా వచ్చి నించుని చూస్తున్నారు. ఇంతలో మా అత్తయ్య "ఇది ఎన్ని జీబీ" అని అడిగారు. డేటా కార్దు అవీ ఇవీ అన్నీ అడుగుతున్నారు. పిల్లలెవరినీ సహాయానికి పిలవక్కరలేదని మా ఇద్దరికీ అప్పటికే అర్థమయిపోయి చూస్తూ ఉన్నామంతే. బేరసారాలు అన్నీ అయిపోయాయి. ఓనరు గారు ఫోన్ ప్యాక్ చేసేస్తూ, "ఆంటీ, మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది... మీకు 2 జీబీ ఎక్స్ట్రా ఇస్తా..రేపు పొద్దున్న ఎవరినైనా పంపండి. మీకు కావలసిన పాటలన్నీ పెట్టిస్తా, ఏం పెట్టమంటారో ఇప్పుడే చెప్పెయ్యంది.. సుప్రభాతం, విష్ణుసహస్రనామం పెట్టనా" అన్నాడు. "అవి నా దగ్గర ఉన్నాయమ్మా. వీలైతే మంచి పాటలు పెట్టు" అన్నారు అత్తయ్య. "సరే లెండి ఘంటసాల భక్తి గీతాలు పెడతా" అన్నాడా అబ్బాయి. "అబ్బే ఆ కలెక్షనంతా ఉందమ్మా..కావాలంటే మంచి కొత్తపాటలు పెట్టు" అంటూ నాకు తెలియని కొత్త సింగర్ల పేర్లేవో చెప్పారు అత్తయ్య. సారీ అండీ నాకు కొత్త ఆ సింగర్ల పేర్లు తెలియక పోవడం వల్ల మీకు చెప్పలేకపోతున్నాను. నా అజ్ఞానానికి అప్పటికే నేను బోల్డు చింతిస్తున్నా.ఇంక మీరు మరీ జెనరల్ నాలెడ్జీ కొచ్చన్లు అడక్కండి నేను హర్ట్ అవుతా...! ఇంక ఫోన్ తీసుకుని వస్తుండగా షాప్ పిల్లాడొకడు.." ఆంటీ, మీరు మాకంటే ఫాస్ట్ ఉన్నారు! మీకు ఇవన్నీ ఎలా తెలుసూ? చూడబోతే, మీ కోడళ్ళకి కూడా తెలిసినట్టు లేదు " అన్నాడు. "అదేముంది నాయనా, నా కోడళ్ళకంటే ఇవన్నీ తెలుసుకునే తీరిక ఉండదు. ఇంటి పనులు, పిల్లలు, చదువులూ ఉంటాయి. నాకు అలా కాదుగా.. నా మనవలందరూ పెద్ద పెద్ద చదువులు చదువుతారు. వాళ్ళకి తగ్గట్లు నేను ఉండాలా వద్దా? అందుకే నేర్చుకున్నా..అయినా ఇదేమన్నా బ్రహ్మ విద్యా..?" అని అంటూ చిరునవ్వుతో అందరికీ బై చెప్పి, ఆటోలో కూర్చోవడంతోనే ఫోన్ సెట్ చేసుకుని, అందరికీ కొత్త నంబరు ఇచ్చే ప్రయత్నంలో పడ్డారు అత్తయ్య. ఈ సంఘటన్ని మా ఆఫీస్ లో అందరూ మరీ మరీ గుర్తు చేసుకుంటుంటారు. మొన్ననే మా బాస్ అడిగింది "మీ అత్తయ్యకి ఇంకా ఐపాడ్ కొనలేదా" అని..."కొంటానండీ, ఇండియా వెళ్ళే స్నేహితులు ఎవరూ దొరకట్లేదు..వెళితే తప్పకుండా పంపిస్తా" అన్నా. "మీ అత్తగారికి అయి పాడా? మరి ఆవిడకి వాడడం వస్తుందంటావా" అని అంది కొత్తగా వచ్చిన కొలీగ్. కథలు చక్కగా చెప్పే మా బాసిణి, నేను గతం లో చెప్పిన పైనున్న ఫోన్ కథ మొత్తం పూస గుచ్చినట్టు చెప్పారు ఆ కొత్త కొలీగ్ కి. "మై గుడ్నెస్! వెంటనే ఈ కథ మా అమ్మకి చెప్పాలి. తను ఎప్పుడూ తోచదంటుంది..ఏదైనా కొనిస్తే వద్దంటుంది.. మీ అత్తయ్య దగ్గరికి పంపనా కొన్ని రోజుల కోసం, త్రైనింగ్ ఇమ్మందాం" అంది తను సరదాగా. "పంపండి కానీ జమైకా నించి ఇండియా కి టికెట్ మాత్రం మీదే సుమా" అని నవ్వాన్నేను. ( 2012 లో కథ వ్రాసి పెట్టి ఏ కారణం వల్లో మరి పోస్ట్ చెయ్యడం మరచిపోయాననుకుంటా. విమల గారి కామెంటు పుణ్యమాని నా బ్లాగ్ ని చాలా రోజుల తర్వాత చూసాను. అరె ఇక్కడొక డ్రాఫ్ట్ ఉందే అని చూస్తే పోస్ట్ చెయ్యడానికి రెడీగా కనిపించింది. . ఇలా గుర్తుచేసుకునే అవకాశం వచ్చినందుకు బోల్డు ఆనందంగానూ, ఈ మధ్యనే మా 'ఇంటెల్లేడీ'ని కోల్పోయినందుకు బోల్డు దుఖం గానూ ఉంది)

10 వ్యాఖ్యలు:

sarma said...

ముసలాళ్ళు వీళ్ళకేం తెలుసనుకోకండీ, మీకంటే మేమే మేలు. :) అయ్యో! పనిలేక తీరుబడిగా కూచుని నా మటుకు నేను కంప్యూటర్ ఆపరేట్ చెయ్యడం నేర్చుకుని బ్లాగ్ రాసే దశకు చేరుకున్నా! తెలుసా :)

Ennela said...

అలా అనుకోనే అనుకోము మాస్టారూ. అందుకేగా మాకందరికీ మీరంటే అంత గౌరవం. పోస్ట్ చదివినందుకు బోల్డు ధన్యవాదాలు మాస్టారూ. అత్తయ్య గారి జ్ఞాపక శక్తి, సూక్మ గ్రాహత్వం చూసి ఎప్పటికప్పుడు ఆశ్చర్య పడడం అడ్మయిరు చెయ్యడం బోల్డు సార్లు జరిగింది. ఈ సీన్ అన్నిటిలోకి బాగా విస్మయం కలిగించింది నన్ను.

Unknown said...

లక్ష్మీ ఇది చదివాక నన్ను నేను చూసుకున్నట్లుంది సేమ్ మీ అత్తగారిలాగే నాకున్న నాలెడ్జ్ పెంచుకున్నాను మా అమ్నకేమి తెలీదు అనకూడదు అన్న పంతంతో మా కోడలు కన్నా ఇంటర్నెట్ నేనే వాడతాను మొబైల్ లోను పిసి లో కూడా

Lalitha said...

మీ ఇంటి "ఇంటెల్" లేడీ కబుర్లు ఎంతో బావున్నాయి - పంచుకున్నందుకు Thanks :)

Ennela said...

ఇదే కథ మీ కోడలు గారు వ్రాసారనుకుని ఇంకోసారి చదివెయ్యండి కామేశ్వరి గారు.. ఈ కథ మీ లాంటి (మా అత్తయ్య లాగా సూపర్ ఫాస్ట్ గా ఉన్న) ఇంటెల్లేడీస్ కి అంకితం...

Ennela said...

లలిత గారూ చదివినందుకు, మెచ్చినందుకు బోలెడు ధన్యవాదాలండీ

Unknown said...

రచన బావుంది. మీ వ్యక్తీకరణ కూడా ఇంటెలిక్ట్యుయల్ గా వుందని తెలియచేయడానికి ఆనందంగా వుంది లక్ష్మి గారు.
గాప్ ఇవ్వకండి.
తరచూ రాస్తుండండి.
ఆల్ ద బెస్ట్.

Unknown said...

కధ బాగుందండి.
తరానికి, తరానికీ అంతరం ... ప్రతి కాలంలో ఇలాంటి అత్తయ్య, మామయ్యలు ఉంటూ మనసుకు వయసుతో నిమిత్తం లేదని మనకు ... చెబుతారు.
సాయిరామ్

Ennela said...

ధన్యవాదాలు సాయిరాం గారూ.మీ రచనలూ చదవాలని కుతూహలంగా ఉందండీ

Ennela said...

ధన్యవాదాలు సాయిరాం గారూ.మీ రచనలూ చదవాలని కుతూహలంగా ఉందండీ