"మాలిక" పత్రికలో నా తొలి కథ- బొమ్మల పెండ్లి

Thursday, August 25, 2011

నేను మెల్లగ నడుస్తున్న. గౌను అంచు పైకి వట్టుకున్న. మెల్లగ లంబడోల్ల గుట్ట మీదికి నడిచిన. ఆల్లు జాకెట్ల మీన అద్దాలు కుడతరు. గుట్ట పురాగ ఎక్కక మునుపే రెండు అద్దం ముక్కలు దొరికినయి. గౌన్ల ఏసుకొని ఆండాలోల్ల ఇంటికి నడుస్తున్న. ఒక గాజు పెంక కాలికి తలిగింది. మందు సీసాది కావొచ్చు. అది భీ గౌన్ల ఎసుకున్న . బాగ ఎండున్నప్పుడు దాంట్ల కెంచి చూస్తే సల్లగ్గొడతది. ఆండాలోల్ల ఇంటి లోపటికి బొయ్యిన. అవ్వ పొద్దుగాల సావిడి అలికినట్టుంది. సావట్లకి పోంగనె, పెండ జాజు కలిపిన మంచి వాసనొస్తుంది. అండాలు ఉర్కొచ్చింది. “ఒచ్చినావె ఏందెచ్చినవ్ “అని నా గౌను గుంజింది. నేను మడత వెట్టి పట్టుకున్న గౌన్ల కెంచి అమ్మ చేతికున్న పంచ వొన్నెల గాజు ముక్కలు, పక్కింటి అర్వోల్ల పొల్ల సీరకు కుడుతున్న చెమ్కీలు, నాయిన సెల్ల అంచుకు ఉండేటి మెరుపు తీగెలు, అద్దాలు , గాజు పెంక అన్ని రాలి పడ్డయి. “అంత ఆత్రమేంది పొల్లా జెర్ర సైసు” అవ్వ అరిచింది. బొమ్మలేవే" అన్నది అండాలు. “మా అమ్మమ్మోల్ల ఊరికి పొయ్యినప్పుడు మా అత్త రెండు చెక్కబొమ్మలిచ్చింది. వాటి గురించడుగుతుంది. రెండు రాదారానోల్లకిచిన్నే పోయినయంటుర్రు "అన్నా. అట్లెట్లనే అన్నది అండాలు. రాదారానోల్ల నాయిన వొడ్ల పని చేస్తడు కద. ఆడ బొమ్మకి చెవులు కుట్టిపిస్తనని తీస్కుంది. నేను మెరుపు దారాలతోని కమ్మలు చేసిన. రేపు మాపు అనుకుంట ఇప్పుడు వాల్ల నాయిన కోపానికొచ్చి ఎటొ ఇసిరేసిండని చెప్తుంది.. నాకు మస్తు కోపమొస్తుంది” అన్న. “మొగ బొమ్మనెందుకిచ్చినవ్ “అన్నది. “ఆడ బొమ్మకి మంచిగ చేతులు దూరముంటయే. చీర కట్టనీకొస్తది. మొగ బొమ్మకి చేతులు మొండానికి అంటుకోనుంటయి. బట్టలు కట్టనీకొస్తల్లేదంటే చేతుల కాడ రంపం తోని కొయిపిచ్చి తీస్కొస్తనంటె ఇచ్చిన”. “అయ్యొ అవునావే. అవ్వ బట్ట బొమ్మలు చేస్తదే. ఆడుగుదాం, చిట్టీ నువ్వు రాజ్ కుమారక్క మిషీను కాడికెంచి బట్ట పేగులు తీస్కరా పో" అన్నది. ఇద్దరం అలికిన సావిడి మీద చెమక్కుమంటున్న చెమ్కీలు ఏరవట్టినం. అవ్వ నన్ను జూచి నవ్వింది. అక్కేది అవ్వా అన్న. జెర పానం సుస్తుందని పన్నది బిడ్డా,ఈడ గూకోని గమ్మున ఆడుకోన్రి, లొల్లి జెయ్యద్దు అన్నది అవ్వ. తమ్ముడెప్పుడొస్తడవ్వా అని అడిగిన. “ఇగ రెండు మూడు దినాలు గావొచ్చు” అన్నది అవ్వ. “అవ్వా బొమ్మల పెండ్లి చేస్తము బొమ్మలు చేసిస్తావా” అన్న. “బట్టలున్నై బిడ్డా పిండినంక జేద్దం “అన్నది అవ్వ. “ఎయ్ మనం బాసింగాలు చేద్దామావె “అన్నా. “ఎంత బాగుంది కదనె !అక్కా, ఆండాలక్కి పెండ్లికి బాసింగాలు కొనొద్దని మా నాయినకి చెప్తా..నువ్వే చేద్దువు” అన్నది అన్ను. .. “అవ్వా బొమ్మలు..” అండాలు నసిగింది. మా చెల్లొచ్చింది. రాజ్ కుమారక్క మిషీను కాడికెంచి బట్ట పేగులు తెచ్చింది. అవ్వ ఒక గలాసల లీల్లు తెచ్చింది. బట్ట పేగుల్ల మంచివి ఏరి లీల్లల్ల ముంచింది. పీట మీద బట్ట పేగు లేసి దాని మీద చీపురు పుల్లలు వెట్టి పేనింది. పెద్ద పుల్లకు జుట్టిన బట్ట పేగును నడిమిట్లకి మడతవెట్ట్, ఇంకో బట్ట పేగుని ఏసు కీస్తు సిలువ లెక్క వెట్టి కాల్ల కింద ఉన్న గోనె దారం పీకి గట్టిగ కట్టింది. అండాలు పలక బలపం తెచ్చింది. “ఎవలను పిలుద్దామె పెండ్లికి పేర్లు రాయి పలక మీద “అన్నది. “నువ్వు జెప్పు ఎవలని పిలుద్దాం” అన్న నేను పలక చేతికి తీసుకుంట. “అయితె రాయి, గజ్జి కుక్క, కోమటోడు, పెరుగుల బుడ్డి, నిమ్మి, రాదారాని, ఆనంది ఇంకా”.. ఆండాలు చెప్తా పోతుంది. “ఈల్లెవలక్కా” అన్నది అన్ను. “గజెందర్ గాన్ని గజ్జికుక్క అనవట్టిన్రు ఇస్కూల్ల. కోమటోడు ఎర్కలేదా నీకు..ఎంకటెంకటీ కోమటెంకటీ అంటవు గదనె” అన్నది అండాలు..”మరి పెరుగుల బుడ్డి ఎవలు” అన్నది అన్ను..”.ఆడేనే గోపాల్ రెడ్డి గాడు.. టీచర్లకు పాలు పెరుగు తెస్తడు అందుకే....గోపాల్ రెడ్డి పెరుగుల బుడ్డి అని అందరంటుంటె, నగీ నగీ సచ్చినం” అన్నది ఆండాలు. చిట్టి కి ,అన్నుకు మస్తు నవ్వొచ్చింది. “ఎక్వ మందిని చెయ్యకున్రి బిడ్డా నాయిన కోపానికొస్తడు పెద్ద సారు ఒస్తడంట ” అన్నది అవ్వ. “అవ్వా ఇయ్యాల ఆదివారం గదా.. సారు ఒచ్చుడేంది” అన్న నేను. “పెద్ద సారుకి పనుందంట మొగోల్లని పిలకున్రి.. లొల్లి జేస్తరు.. ఆడోల్లని పిలిచి ఆడున్రి. సారొస్తె కష్టమైతది “అన్నది అవ్వ. “మంచిది తియ్..అన్నూ నువ్వు, చిట్టి పొయ్యి అందర్ని తోల్క రా పొండ్రి ” అన్నది అండాలు. “అక్కా నువ్వొస్తెనే పోతా “అన్నది చిట్టి . “అట్లంటె ఎట్లనే ఈడెన్ని పనులున్నయ్! పిలగానికి పిల్లకు బట్టలెయ్యాలె, పీటలెయ్యాలె, అన్నమొండాలె ,లడ్డూలు జెయ్యాలె” అన్నది అండాలు. “బిరాన రన్రి, మల్ల ఆకలయితది” అన్నది అవ్వ. వాల్లు పోతున్రు. “ఓ పొల్ల, సుజాతోల్లను, విమలోల్లను పిలువు యాద్ మర్వకు “అండాలు అరిచింది..”మంచిది” అన్నది అన్ను. ఆవ్ గానీ పున్యవతి, బాగ్యవతోల్లని పిలుద్దమా” అన్నది. “వొద్దే వాల్లిల్లు బొందల గడ్డ దిక్కుంటది గద. ఒక పారి వాల్లింటికి బొందల గడ్డ మీదికెంచి పోతుంటె ఆనందన్న జూసి అమ్మకి చెప్పిండు. అటు దిక్కు పోవద్దని మా అమ్మ ఒట్టేసింది. ఒడ్లోల్ల మనెమ్మకి అటు తిరుగుతుండంగ దయ్యం బట్టిందంట. ఆనందన్నోల్ల గురువు కాడికి తోల్కబొయ్యిన్రంట” అని చెప్పిన.” అవునా” ఇగ మట్టి లద్దూలు చేసినం. అవ్వ ఉడుకుడుకు బువ్వొండి చింతకాయతొక్కు, సల్ల పోసి పెట్టింది. ఫెద్దోల్లు చూడకుంట మట్టి లడ్డులు తిన్నము. పోయిన నెల గొల్ల మల్లమ్మత్త బిడ్డ లలితక్క పెండ్లిల యేమేం చూసినమో అవన్ని చేసినం. అక్క మస్త్ మురిసింది. ఆమెకు చదువుకున్న పిల్లలంటే మస్త్ ఇష్టం. అండి గాన్ని 10 పాస్ చెయిపియ్యాలె అంటంది. సదువు మంచిగొస్తదని అండాలని పేరు పెట్టుకుందంట. అరునకి కాంపు చేసిన డాక్టరమ్మ పేరు పెట్టిందంట ఆమె లెక్క మంచిగ సద్వాలని. మంచిగ సద్వాలె బిడ్డా పెద్ద సారు బిడ్డ లెక్క అంటంది. అండాలోల్లకొక తమ్ముడు పుట్టిండు. టాం సవ్యెర్ లెక్క చింతపందు గొల్కలు, బిస్కట్ పుడీలకెంచి బిస్కట్లు, షివ్లింగాలు, పాన్ బీడాలు అన్ని అదుగుతుండె తమ్ముని తోని ఆడుకోనీకి. ఇంకొక కాంపుల ఆండాలోలమ్మకి ఆడవిల్ల పుట్టి, అక్క సచ్చిపోయింది. ఇగ ఆటపాటలు బంద్ జేసినం. ఇస్కూలుకు పోతున్నప్పుడు అండాలు కానొచ్చింది. “అండీ ఇస్కూలుకి రావానే” అన్న. “రానే అవ్వకు చాతనైతల్లేదు ఈ దయ్యాన్ని చూడనీకి ఇంట్లుండమన్నడు నాయిన” అని చిన్న పాపని కాల్లతోని తన్నుకుంట అన్నది అండాలు. “పేరేందే” అనుకుంట ఎత్తుకున్న.. “దాన్నెత్తుకోకు అది దయ్యం “అన్నది అండాలు. అవ్వొచ్చింది. “అవ్వా ఇగ ఇప్పుడెట్ల అండాలు ఇస్కూల్కి రాదా “అన్న. “అది జెర్ర సమజ్ జేస్కోని చెప్పిన మాటింటె ఇస్కూల్కి పోవచ్చు ఈ పిల్లకి దయ్యం పట్టింది ఎంత జెప్పిన ఇంటల్లేదు.. నువ్వైన జెర చెప్పు బిడ్డా ఇంటదేమొ” అన్నది అవ్వ . నాకేం సమజ్గాలే . “ఇస్కూలిడిసి ఇంట్ల ఎన్నిదిన్నాలుంటరు బిడ్డా, నాకేమొ చాతగాక పాయే. ఊర్లె ఒక పిల్లను మామకు మాట్లాడి వొచ్చినం. ఇటుదిక్కు రోజుల పిల్ల , అటుదిక్కు అంజి గాడు, ఇంకో దిక్కు ఆడ పిల్లలు. మామకు డూటి . పిల్లలకు ఆసరైతదని మామ ఒప్పుకుండు. ఇంత ఒండి, పిల్లలని చూసుకుంటె, నేను నిమ్మలంగ తాత తానికి పోత. ఆ ముసలోడు ఆ ఊరిడ్సవెట్టి రాదు. ఇట్లైతె నేనేంగావాలె బిడ్డా “అన్నది అవ్వ. “మంచిగనే చెప్తుందిగదనే అవ్వ, నువ్వు ఇస్కూల్కి రావచ్చు.. అవ్వ చెప్పింది ఇను” అనుకుంట చూసిన.” ఎ చీ.. అమ్మ పోతె ఇంకో అమ్మ ఒస్తదానే , నాకిష్టం లే ఒక దినం ఈ దయ్యం దాన్ని కొంచవొయ్యి బాయిల పడేస్త “అన్నది అండాలు . “చూసినావ్ బిడ్డ ఎట్ల మాట్లాడుతుందో! దేవునింట్ల పీనుగెల్ల ఆడు అమ్మని కొంచవొయ్యిండు ఏదో చేసి ఇంకో అమ్మని తెచ్చుకోవాలే” కండ్లు తూడ్సుకున్నది అవ్వ. అండాలు ఇస్కూలుకొస్తల్లేదు. మల్ల ఊరికి పొయ్యిన్రు. నెలయినంక తలుపు తీసుందని సూడబోయిన. ఎవలో కొత్తామె ఉంది.”ఎవులమ్మా” అన్నది.”అండాలు లేదా” అన్న. “అండాలూ ఎవలో ఒచ్చిన్రు బిడ్డా “అన్నది ఆమె. అండాలొచ్చింది. చీర కట్టింది. కొత్తగ్గొడుతుంది. “ఈమె నా దోస్తు “అన్నది అండాలు. ప్రభనెత్తుకోని అండాలు దిక్కు చూసిన. అండాలు మాట్లాడుతల్లేదు. “ఏందే మాట్లాడుతల్లేవు చీరగట్టినవేంది ఇస్కూల్కి రావా ఇగ” అన్న. “మీ దోస్తుకు పెండ్లయ్యిందమ్మా. రెండు రోజులల్ల అత్తగారింటికి తోలిస్తం. ఈ రెండ్రోజులు జెర అట్కాయించిపో” అన్నదామె. నేను అండాలు మొకం చూసిన. “అమ్మ పోయిన యాడాది లోపు పెండ్లి చేస్తె మంచిదంటనె” అండాలు అన్నది మెల్లగ. “పిలగాని తమ్ముడున్నడు. 9వది చదువుతుండు. అన్నుకి మంచిగుంటదని మాట ముచ్చట అయ్యింది. వొచ్చే యాడాది చెయ్యమంటున్రు ” అన్నది కొత్తామె. “అండాలోల్ల అమ్మ వొయసున్న మా అక్కకు మొన్న పెండ్లి చేసిన్రు. అన్నుకు అప్పుడే పెండ్లా” అన్న నేను పరెషాన్ అవుకుంట. “మిమ్ములను మీ నాయన చదివిపిస్తడు. మా నాయన అట్ల కాదు గద “అన్నది అండాలు. అన్ను పెండ్లికి పిలిచిన్రు. అండాలుని అన్నుని చూస్తుంటె బొమ్మల లెక్కనే ఉన్నరు. అన్ను పెండ్లి చూస్తె బొమ్మల పెండ్లి లెక్కనె ఉన్నది. మా నాయినకు వొరంగల్లుకు బదిలీ అయ్యింది. మల్ల ఇగ అండాలోల్ల ముచ్చట్లెవ్వి తెల్వలే. ఆడ 9 ఏండ్లుండి నా డిగ్రీ అయినంక మా ఊరొచ్చినం. మంచి కొలువే దొరికింది. అండాలోల్లింటికి పొయ్యిన.. మామొచ్చిండు “బాగున్నరామ్మా” అనుకుంట. “బాగున్నం మామా మీరెట్లున్నరు” అన్న. “మంచిగనె ఉన్నం, కొలువు చేస్తున్నవంట” అన్నడు. అవునన్న. ప్రభ ను చూసి,” అక్కను చూసినవా ఎంత మంచిగ సదివిందొ, కొలువు చేస్తుంది చూడు మస్త్ పైసలొస్తున్నయి” నవ్వుకుంట అన్నడు. “నేను భీ సదువుత నాయినా “అన్నది ప్రభ.” అవును మామ ప్రభని సదివిపియ్యాలె “అన్న . “నాకు సదివిపియ్యాలని ఉంటది బిడ్డా, కానీ ఏంజెయ్యాలె అంజిగాన్ని ఇస్కూల్కే మస్త్ పైసలైతున్నై, ఇగ ఈమె మీద పెడ్తె పెండ్లికెట్ల. పిల్లని అడగొచ్చిన్రు. మాట ముచ్చటకి పోవాలె రేపో మాపో “అన్నడు. “మామా అప్పుడే పొల్లకు పెండ్లేంది. ఇంక 10 ఏండ్లన్న లెవ్వు ” అన్న. “అండి గానికి , అన్నుకు చెయ్యలేదార ,అట్లనే “అన్నడు. “అవ్వు గానీ గీ 10 ఏండ్లల్ల ఎంత మారింది. ఈ ఊళ్ళె అందరు పిల్లలని సదివిపిస్తున్రు. నువ్వొక్కనివే” అన్న. “ఆడవిల్లలకు సదువెందుకు బిడ్డా” అన్నడు మామ. “అగో! ఇప్పటిదాంక నన్ను మీదికెత్తినవ్, ఇప్పుడు గిట్లంటున్నవ్ “అన్న. “మీది వేరేరా.. ఆడవిల్లలు ఎంత సదువుకుంటె అంతకన్న ఎక్కువ సదువుకున్నోన్ని తేవాలె..ఏడికెంచి తెద్దం, మా దాంట్ల పోరగాండ్లు అంత సద్వరు ,అవన్ని ఒద్దుతియ్ “అన్నడు. “మామ, ఇప్పుడు మీ కులపు పిలగాల్లు మంచిగనె సదువుతున్రు. దొరుకుతరు తియ్, అప్పటికి సూద్దారి “అన్న. “నా తోని కాదు బిడ్డా ,మస్త్ పైసలైతై . సూస్తల్లెవ్వా గీ పదేండ్ల సంది పురుల్లు ,పున్యాలు, పిల్లలు ,జెల్లలు మస్త్ కష్టమైతుంది బిడ్డా.. ఇల్లమ్మి ప్రభకు పెండ్లి చేసేస్తె ఇద్దరం ఇగ ఏడ్నో ఓ తాన క్రిష్నా రామా అనుకుంటం “అన్నడు. “ఫైసల్ కాకుంటె సదివిపిస్తవా “అన్న.” ఏంది నువ్వెత్తుకుంటవా..మీ నాయిన నిన్ను నన్ను కలిపి ఉతుకుతడు” అన్నడు. “నాయినేమంటడు మామా మీ కంటె ఎక్కువనా గానీ ,ఇప్పుడొక ఇస్కూలు పెట్టిన్రు సర్కరోల్లు. మంచిగ చదివే పిల్లలకు 12 దాంక ఉత్తగనే చెప్తరు. తిండి, బట్టలు, పుస్తకాలు అన్ని వాల్లవె. కాని పరీక్ష రాయాలె. అంద్ల పాస్ అయితెనె ఇస్కూల్ల జైన్ చేస్కుంటరు” అని చెప్పిన.” ఏయ్ పోనితియ్ బిడ్డా ఏడేడికి పంపుతరొ ఆడవిల్లలని ఎప్పుడు అట్ల ఇడ్వలే, ఒక్కతి ఎట్లుంటది” అన్నడు. “అయ్యో మామా ఏడ్కి పోవొద్దు లింగం పల్లి కాడ ఈడనే ఉంది. ఒక్కతి కాదు మా సిరిని తోలిద్దామనుకుంటున్నం. ఇద్దరుంటరు ముద్దుగ వారంకొక్క పారి పొయ్యి చూసి రావచ్చు. శెలవులల్ల పిల్లలు ఇంటికొస్తరు” అన్న. “అవునంట మా పెద్ద సారోల్ల పిలగాన్ని తోలిచ్చిన్రంట మంచిగనే ఉన్నదంట గానీ ఏమో బిడ్డ నాకు సమజ్ అయితల్లె “అన్నడు. “మామా, ఇప్పుడేం కాదు గదనె పరీక్ష పాస్ అయినప్పటి ముచ్చట. ఇది నవంబరు గద, పరీక్ష ఫిబ్రవరి రెండొ వారం ఉంటది. మే ల చెప్తరంట పాస్ అయిన్రా లేదా అని. జూన్ కి పొవ్వాలె ఇస్కూల్ల జైన్ కానీకి . డాక్టరు లెక్క సదువుతదని అన్నుకు అక్క డాక్టరమ్మ పేరు పెట్టలేదా.. పరీక్ష అయితె రాయనియ్యి రాదు చూద్దారి” అన్న. “సరె తియ్.. దాంట్లేం పొయ్యేడిది లేదు గద “అన్నడు. అప్పటికెంచి దినాం సిరి తోని ప్రభని కూసోబెట్టి పరీక్షకి చద్విపిస్తున్న. ఫరీక్ష రాసిన్రు ఇద్దరు. ఇద్దరు మంచిగనే రాసినమన్నరు. సూడాలె ఇద్దరికొస్తే మంచిది. ఫ్రభని ఎట్లన్న చదువుకోనియ్యాలె అనుకుని దేవునికి మొక్కిన. పెద్ద పరీక్షలు అయినయ్. “అక్కా మీరు బొమ్మల పెండ్లి మంచిగ చేస్తున్రంట కద అవ్వ చెప్పింది ,మల్ల చేసిన్రా ” అని అడిగింది ప్రభ. “లేదు చెల్లె, నువ్వు పుట్టక ముందు రోజు చేసిందే మల్ల చెయ్యలే, మనసిరిగింది చెల్లె ఇగ చెయ్యబుద్ది కాలే, మీ అక్కల పెండ్లుల్లు చూసినంక ఇగ బొమ్మలెందుకనిపిచ్చింది ” అన్న. మే నెలొస్తుంది. ఇగ రెండు రోజులల్ల నవోదయ రిసల్ట్స్ వొస్తయి. పాసయితె గిన 15 దినాలల్ల పొయ్యేది లేనిది చెప్పాల్నంట. ఒక దినం ఆఫీసుకెంచి ఒస్తున్నప్పుడు అమ్మ, నాయిన ఎదురయిన్రు. “ఏడికే అమ్మ చీకటైనంక పోతున్రు” అన్న. నర్సింలు మామ పోయిండని చెప్పిన్రు. “పాపం జెర సుస్తుందని పనికి పోలేదంట. 11 గంటలకింత తిని పండుకున్నోడు ఇగ లెవ్వలేదంట. రేపు బొయ్యి అండాలుని, అన్నుని మందలించి రా బిడ్డా “అన్నది అమ్మ. “నాకు పోబుద్ది అయితలేదమ్మా మనసు బాదయితుంద”న్న. “మంచిగుంటాది బిడ్డా పోకుంటె పొయిరా పో “అన్నది అమ్మ. పొయ్యొచ్చిన. పెద్దోల్లందరు మాట్లాడుతున్రు. అక్కను ఊరికి తోల్కపోతరంట. ప్రభకు చూసిన పిలగానోల్లు వొచ్చిన్రంట.. అంజి గానికి చదువెట్ల అని అనుకుంటున్రు. బోడింగు స్కూల్ల ఎయ్యచ్చనుకుంటున్రు. అన్ను, అండాలు మస్తు ఏడుస్తున్నరు. అన్ను చెక్కరొచ్చి పడ్డది. పిల్లలు దాని మీద పడి ఏడుస్తున్నరు. ఎవ్వలు తీస్కున్న ఒస్తల్లేరు. అన్ను బల్మీకి లేచి, పిల్లగాడ్నెత్తుకోని, పిల్లను దగ్గర కూసుండవెట్టుకుంది. అండాలు మొకం 50 ఏండ్ల దానిలెక్క ఉంది. బుచ్చెడ , పెద్ద బొట్టు, పెద్దోల్లు కట్టుకునేటి చీర. 20 తులాల కడియాలు, 20 తులాల పట్టగొలుసులు, 10 తులాల మట్టెలు దాని కాల్లు మొయ్యలేక పోతున్నయి. ఇంట్ల 10 మంది ఉంటరంట ఇది ఒండకుంటె ఒక్క రోజెల్లదంట. అందరు మొగ పిల్లలేనంట ఇది పెద్ద కోడలంట. పనోల్లు దొరకరంట. బర్రెలున్నయంట. అత్తకు బాలేని కాడికెంచి అన్ని పనులు ఇదొక్కతే చేస్తదంట. ఇంటుంటెనే కడుపుల తిప్పుతుంది. ఎట్ల చేస్తుందో అంత పని. నేను ఎవ్వలని మందలియ్యలె. జెర్రంత సేపు కూకోని బయటికొచ్చిన. నవోదయ పరీక్షల సిరి , ప్రభ పాస్ అయ్యిన్రు. ఎట్ల చెప్పాల్నో తెలుస్తల్లేదు. ఐదొద్దులు అయినంక మాపటికి టీచరమ్మని తోల్కపొయ్యిన .. “ప్రభకి పిలగాడిని చూస్తున్నం” అన్నది . “అదింక చిన్న బొమ్మ లాగుంది. దానికి పెండ్లేంది ” అన్నది టీచరమ్మ. “మరి దాన్ని చూసేటోల్లెవలు బిడ్డా తల్లి ,తండ్రి లేని బిడ్డ “అన్నది అవ్వ. “తల్లున్నది గదా.. ఎందుకు లేదు “అన్న నేను. “తల్లుంటే ఏమైతది బిడ్డా చదివిపిస్తదా..తండ్రి ఉన్నట్లైతదా” అన్నది అవ్వ. “తండ్రి ఉండంగ అండాలు, అన్ను ఏంచదివిన్రు” అన్నది టీచరమ్మ. “మీ కులపోల్ల లెక్క మా కులపోల్లు సదువుకుంటారు బిడ్డ.. ఏదో ఇంత బువ్వ ఒండి పిల్లలను చూసుకుంటె అదే ఎక్కువ, సూడు అండాలోల్ల అత్తకు బాగలేదంటె పదొద్దులు కాంగనె పొయ్యింది. ఆడ పిల్లలకు అదే ఉండాలె బిడ్డా.. అత్త , మామ, పిల్లలు” అన్నది అవ్వ. “అవ్వా దానికి 20 ఏండ్లయిన ఉన్నయా అంత బరువు మోస్తుంది , అన్నును చూడు పానాలు కండ్లల్లకొచ్చినయ్. దానికి నిల్వ చాతనయితల్లేదు కూసున చాతనయితల్లేదు. ఆస్పతాల్ల చూపిచ్చిన్రా” అన్నది టీచరమ్మ. “ఇగ పిల్లలతోని ఎట్లుంటరు బిడ్డా.. అదే మంచిగయితది తియ్యి” అన్నది అవ్వ. “అక్కనెవలు తోల్కపోతరు” అన్న నేను. “ఆ పొల్ల సుట్టాలేవలో ఉన్నరంట. ఆడ్నే ఉంటది ,దిక్కు మొక్కు ఎవలున్నరు దానికి “అన్నది అవ్వ. ” అన్న పించను ఒస్తది కదా.. ఈడ ఇల్లుండంగ అక్క సుట్టాల కాడికి పొవ్వుడెందుకు.. అంజి గాన్ని చదివించుకుంటె కాదా బోడింగు స్కూలుకెందుకు పోవాలె పిలగాడు ” అన్నది టీచరమ్మ. “ప్రభ పరీక్ష పాస్ అయ్యింది నవోదయ ఇస్కూల్కి పొవ్వచ్చు” అని చెప్పిన . ప్రభ కండ్లు మెరుస్తున్నై . అక్క నన్ను చూసింది. “అక్కా నువ్వుండగనె మామ ఒప్పుకుండు గద ప్రభను తోలియ్యనీకి” అన్న. ఎవ్వలేమి పట్టిచుకుంటలేరు. నేను చిన్నపిల్లనని తీసి పారేసిన్రు . మల్లొక్క పారి చెప్దారని చూసిన. ” ఓ పొల్ల ఏంది సదువు సదువు అని పట్టినవ్. దాని నాయిన పొయినంక ఇగ సదువేంది. పెండ్లి చేస్తె మగడు , అత్త, మామ చూస్తరు. ఈడెవలున్నరు” అన్నడొక పెద్దాయిన. ” ఎవ్వరు అవుసరం లేదు, సర్కారోల్లు చూస్తర”న్నది టీచరమ్మ.”సర్కారోల్లు చూసేదేంది ఆడువిల్లలని ఏడికి పంపేది లేదు. ఇటు తల్లిగారిల్లు అటు అత్త గారిల్లు సమజ్ అయ్యిందా”గట్టిగ అన్నడు. గమ్మున ఊకున్న గానీ ఎట్ల చెయ్యాలని మస్తు పరేషాన్ అయిన. అయ్యో దేవుడా, మాముంటె చెప్పి సంఝాయిస్తుంటి ఇప్పుడెట్ల అనుకున్న.. టీచరమ్మ చెప్పినంత చెప్పింది. ఈ ఊరోల్లైతె టీచరమ్మ మాట ఇంటరు. ఈడ అక్కనిడ్సవెడితె అందరు ఇంకో తాన్నుంచొచ్చినోల్లె. టీచరమ్మ మాట లెక్క చెయ్యలే. రాత్రంత నాకు నిద్ర రాలే. భగ్గ ఏడుపొచ్చింది. ఎంకన్నకు మొక్కుకుంట నిద్రలకి జారిన. కలల పంచాయతాఫీసుల పెద్ద సారు కానొచ్చిండు. ఉలికిపడి నిద్ర లేచిన. పొదుగాల 7 దాటింది. ఆయనెందుకొచ్చిండొ నా కలలకి అనుకున్న .మేము చిన్నగున్నప్పుడు ఆయన మమ్ములను మస్త్ బయపిస్తుండె. ఆ మీసాలు చూడంగనె బుగులయితుండె. ఎప్పుడు మేము ఆయనకెదురు పోకపోదుము.. “పెయ్యి ఉడుకుందని లేపలె బిడ్డా ,ఇంక జెర పండుకుంటవేమొ” అన్నది అమ్మ. “లేదమ్మా పనుంది” అని లేచిన. ఆఫీసుకి రానని స్రవంతి తోని చెప్పంపిన. తయారయ్యి పంచాయతాఫీసు కాడికి పొయ్యినరామయ్యొచ్చి సారు రమ్మంటుండని చెప్పిండు. బుగులయింతాంది గాని పని గావాలని తెగింపుతోని పొయ్యిన. నా గుండె కొట్టుకునుడు నాకే ఇనిపిస్తుంది. సారు రెండు మాటలు మాట్లాడంగనె భయమెగిరిపొయ్యింది. ఈన మంచోడే. “ఇంత ప్రయత్నం చేస్తున్నవు చూడు అది నాకు నచ్చింది.. ఆఫీసు కాంగనె నిర్సింలు ఇంటికాడికొస్త , ఆడుండుపొమ్మ”న్నడు. సగం పని అయినట్లే అనుకుంట ఇంటికి పొయ్యి, పొద్మీకి మల్ల అండాలొల్లింటి తాన నిలవడ్డ. లోపటికి పోలె. సారొచ్చిండని రామయ్య చెప్పొచ్చిండు. ఆందరు బయటకొచ్చి తోల్కపొయ్యిన్రు. గోడ పొంటి కుర్సీలేసి కూసోమన్నరు. చాయి చెయ్యుమని ఆడోల్లకి చెప్పొచ్చిన్రు. నేను బయట గోడ పక్కపొంటి నిలవడ్డ. సారెందుకొచ్చిండో అని చూస్తున్నరు. సారెంబడి నలుగురైదుగురొచ్చిన్రు. ఫొలీసు పటేలుని ఎంట తెచ్చిండు సారు ఎందుకో. “నర్సింలు పించను గురించి మాట్లాడదామని ఒచ్చిన. పెద్దోల్లు రండ్రి” అన్నడు. ఇద్దరు మొగోల్లు అక్క చుట్టాలు గావొచ్చు వచ్చిన్రు. “నర్సింలు దిక్కోల్లు ఎవ్వలు లేరా “అన్నడు సారు. ఒక పెద్దమనిషొచ్చిండు.. జగ్మోహనంట ఆయన పేరు. “ఫించను పెండ్లాం పేరుకే పోతది. ఇగ మిలిగిన పైసలొస్తయ్ అవేంచెయ్యాల్నో చెప్పున్రి ” అన్నడు సారు. “పిల్ల పెండ్లికున్నది గద సారూ దాని పెండ్లి మందమొస్తయా “అన్నడు జగ్మొహన్. “పిలగాన్నేం చేస్తరు “అన్నడు సారు. ” పిలగానికేం కావాలె పైసలొస్తె పిల్ల పెండ్లి చేసేస్తం “అన్నడు జగ్మోహన్. “ఏంది పిల్లను చదివిపియ్యర” అన్నడు సారు. “లేదు సారు ఇప్పుడందరమున్నము . ఇది అయినంక ముందుకి ఎవలకెవలో అందరున్నప్పుడైతె మంచిగుంటది “అన్నడు జగ్మోహన్. “ఇప్పుడేం ముంచుకొచ్చింది పిల్ల పెండ్లికి “అన్నడు సారు. “గదేంది దొరా ఎవ్వులైన ఆడువిల్లలనుంచుకుంటరా “అన్నడు జగ్మోహన్. ” నేను మా ఆఫీసుల మాట్లాడిన. అందరు ఒక్కటే అంటున్నరు. పైసల్ ఒక తాన పిల్ల పేరుమీదెస్తె, ఇటు సదువు కాంగనె పెండ్లికొస్తయ్.. ఏమంటరు” అన్నడు. ఎవ్వలేం మాట్లాడలె,. సారు చెప్పంపిండేమొ టీచరమ్మొచ్చింది.” ఏమ్మా నవోదయ పరీక్షలేమైనయ్ “అన్నడు సారు. “ఆరుగురికొచ్చింది సారూ మన ఇస్కూల్లకెంచి. మస్తు పేరొచ్చింది మన ఇస్కూల్కి “అన్నదామె. “మల్ల పిల్లలేమంటున్రు పోతరంటనా” అన్నడు. “ఐదుగురు పోతరంట , ఇగో నర్సింలు బిడ్డదే తెలుస్తల్లేదు. ఏంత మంది జైన్ అయితరో లీస్టు రేపటికి పంపుమన్నరు” అన్నది. “సూడున్రి, పొల్ల ముద్దుగ పాస్ అయింది. మీకేంది కష్టం సర్కారోల్లు ఇస్తమంటుంటే “అన్నడు సారు. “పైసలయిపోతయ్ పెండ్లికి మిల్గవు “అన్నడు జగ్మోహన్.” ఫైసలు నర్సింలు పెండ్లాము, ముగ్గురు బిడ్డలు, కొడుకు పేరు మీద 10 ఏండ్లకేద్దాం . మిత్తి కలుపుకుంట మూడింతలయితది. 10 ఏండ్లైనాంక అసలు ఎవరిది వాల్లు తీస్కోన్రి. మిత్తి మందం పిల్ల పెండ్లికియ్యున్రి , ఇంటి కిరాయిలల్ల తల్లి కొడుకులు బతుకుతరు” అన్నడు సారు. “ఇదంత ఆగామాగముంది, పెండ్లి చేద్దారి “అనుకుంట వొచ్చిండు తాత. “ఆవ్ మాకు గుడంగ గదే మంచిగ్గొడుతుంది “అన్నరు అందరు. ముందుకయితుంది ఎన్క కయితుంది. ఎటూ తెగుతల్లేదు. “మీ ఇష్టమయ్య నేను చెప్పినంత చెప్పిన ఇగ మీరు ఆలోచిచ్చుకోన్రి “అనుకుంట సారు లేచిండు. “పైసల కి ఎవలు రావాలె సారు , పిల్లలందరు ఉండాల్నా “అన్నడొకాయన.” ఆ ఉండాలె గద మల్ల అందరున్నప్పుడు చెప్పిపంపున్రి. కాగిదాలు చేపిద్దం” అన్నడు సారు. ఇగ మాటలన్ని పైసల మీదకు పొయ్యినయ్.. సారు కదిలిండు. ఏమయ్యిందో ఒకాయన గట్టిగ మాట్లాడవట్టిండు, ఇంకిద్దరు ఎగబడి మాట్లాడుతున్నరు. సారు కంపవుండు బయటికొచ్చిండు .ఇంతల పోలీసు మామ అందుకున్నడు. “అరే ఇక్కడున్నోల్లకొక్కల్లకైన తెల్వి ఉన్నాదయ్య. అంత పెద్ద సారు చెప్తుండు ఇనాలని తెల్వదా.. ఆయన తల్చుకుంటె పైసా రానియ్యకుంట జేస్తడు. ఏడ్చుకుంటరు మల్ల అన్నడు” అందరు ఖామూష్ అయ్యిన్రు. “ఇంకొక మాట ఇనున్రి. మీకు తెలుసు కావొచ్చు. ఆడవిల్లకు 18 రాకుంట పెండ్లి చేసుడు తప్పు. ఈడ నేనున్ననని మరిచి మాట్లాడుతున్నరు. అందరినీ బొక్కల ఏస్తా..ఏంది 10 ఏండ్ల పిల్లకి పెండ్లేంది “అన్నడు . నేను నవ్వుకున్న. అటు తిప్పి ఇటు తిప్పి ఆలోచన చేసిన గానీ పోలీసు మామ యాదికే రాలేదు. పోలీసులకి బయపడనోడుంటడా.. అవ్వ ఉర్కొచ్చి ” నీ బాంచను బిడ్డా నువ్వెట్లంటె అట్లనే అన్నది” అందరికి బుగులయ్యినట్టుంది. “మాకు తెల్వక మాటలయ్యా పిల్లను చదివిపిద్దాం గదే మంచిది”అన్నరు . “అమ్మా ఇగ నీ చెల్లె చదువు నీ బాధ్యత.. సల్లగుండు బిడ్డా. ఇగ పోతున్న” అన్నడు పెద్ద సారు. పదమూడో దినం కాంగనె మూడాలున్నయంట గవి రాకుంట అక్కను తోల్కపోనీకి తయారయ్యిన్రు. అంజి గాడు ఇప్పటికి అండాలోల్ల తానికి పోతడంట. పెద్ద సారు ఆస్టలు మాట్లాడి పిలిపిస్త అన్నడు. “ప్రభ మాతోనొస్తది” అన్నది అక్క. ఊరికి పొయ్యినంక పెండ్లి చెయ్యరని నమ్మకం లేదు. “ఒద్దక్క ఈడ ఇస్కూల్ల కాగిదాలు గిట్ల తీస్కోవాలె, ఫోట్వలు తీపియ్యాలె ,ఇగ వారమే ఉన్నది గద, ప్రభ మా తానుంటది తియ్యి. సిరి గూడ ఉన్నది గదా “అన్న. పాపం పోలీసు మామ రోజు ఒచ్చి పోతున్నడు ఎవలన్న మనసు మార్చుకుంటరేమో అని. ప్రభని తోల్కపోతా “మామకు మొక్కు చెల్లె “అన్న. ప్రభ మొక్కింది. మామ “సల్లగుండు బిడ్డా.. మంచిగ సదవాలే ,ఏంది” అన్నడు. ప్రభ బట్టల సంచి తీస్కోని నా చెయ్యి పట్టుకుంది. జూన్ 1 కి నవోదయకి ఇద్దరిని తోలిచ్చొచ్చినము. అమ్మా సాల్సాలయ్యింది అనుకుంటుండంగ అన్ను కి బాలేదని తెలిసింది. పురాగ పానం మీదికొచ్చిందంట. ఇద్దరు పిల్లలు ఆగమైతున్నరని అన్ను మొగనికి పిల్లనెవలనైన చూస్తున్నరంట. ప్రభ అయితె ఇంట్ల పిల్ల, పిల్లలను మంచిగ చూసుకుంటదని అనుకుంటున్రంట. నాకు డగ్గుమన్నది. అయ్యొ దేవుడా మల్ల మొదటికొచ్చిందనుకున్న. ఈ పిల్లకు పాపము దినామొక గండమొస్తదేందో అనుకున్నము. ఇస్కూల్ కి పొయ్యి తోలియ్యమని అడిగిన్రంట. నేను ఫారం నింపుతున్నప్పుడు గార్డియన్ అని ఉన్న కాడ నాయిన పేరు కాకుంట పోలీసు మామ పేరు రాసి సంతకం పెట్టిపిచ్చిన. ఇస్కూలోల్లు గార్డియను చెప్తే తోలిస్తము ఆయనను రమ్మన్నరంట. ఇగ ఎవ్వలు మల్ల ఇస్కూల్ తానికి పోలే. దసరా సెలవులకి సిరిని ప్రభని తోల్కొచ్చిన.. సుట్టుముట్టు పిల్లలు ఆడనీకొచ్చిన్రు. “అక్కా ఒకటడగాల్నా “అన్నది ప్రభ. “చదువు మానేస్తా అని కాకుంట ఇంకేమన్న అడుగు” అన్న.”బొమ్మల పెండ్లి చేద్దామా , అవ్వ చెప్తుంటె ఎంత బాగుంటదొ మీరు చేసిన బొమ్మల పెండ్లి” అన్నది. “మంచిది చేద్దాము గానీ మన బొమ్మలు అవ్వ చేసిన బట్ట బొమ్మలో ,మట్టి బొమ్మలో కావు. గట్టి బొమ్మలు . చదువుకోని కొలువు చేస్తున్న బొమ్మలు. కొలువొచ్చినంక మంచిగ చదువుకున్నోల్లని చూసి పెండ్లి చేసుకుంటయ్” అన్నా. అందరు నవ్విన్రు. ” అక్కా బొమ్మలు కొత్తవైతె మానె, పెండ్లయితె మీరు చేసిన అట్లనే చేస్తం గదా “అన్నది ప్రభ. నేను నవ్వుకుంట.. ” ఏడికెంచి షురూ చేద్దాం? చిట్టి చిట్టి మిరియాలు కాడికెంచా” అన్న. “కాదు కాదు మట్టి లడ్డూల కాడికెంచి “అన్నది సిరి. అమ్మ పిల్లలొచ్చిన్రని లడ్డూలు మురుకులు చేసింది. నాయిన కట్నాలప్పుడు అందరికి నోటు పుస్తకాలు , పెన్నులు ఇచ్చిండు పిల్లందరు ఆటలు పాటలు. ప్రభ సదువు పురాగ సాగుతదని చెప్పనీకి అయితల్లేదు గానీ ఎందుకో చాన దినాలకి మనసుల ఏడనో మంచిగ్గొడుటుంది. ప్రభ మొఖం ల అక్క నవ్వు కానొచ్చింది..ఈ దినం అక్క ఏడున్నా మురుస్తది ..బొమ్మల పెండ్లి చేసినందుకు కాదు ఒక బొమ్మ పెండ్లి ఆపినందుకు……….

6 వ్యాఖ్యలు:

కృష్ణప్రియ said...

మీ కథ ఒకసారి బ్రౌజ్ చేసి, తర్వాత తీరిగ్గా చదివి,కథనాన్ని,మాండలికం మీద మీకున్న పట్టు ని చూసి చాలా సంతోషించాను. అభినందనలు!

మురళి said...

Congratulations...

Ennela said...

Thanks Murali garuu

kanthisena said...

ఎన్నెలగారూ,
ఏదో ఒక మేరకు స్వంత అనుభవం లేకుంటే ఇంత సజీవంగా కథను మీరు రాసి ఉండేవారు కాదని మొదటే అనిపించింది. మాండలికంలో రాయడానికి ఇకపై మీరు తటపటాయించవలసిన పనిలేదు. మీ యాస శైలి చాలా బాగుంది. మీ ఊరి గురించి, మీ చిన్ననాటి ఇప్పటి జ్ఞాపకాల గురించి ఇకపై మీ జీవ భాషలోనే రాయండి. అలా రాసిన ప్రతి రచనకూ సంబందించిన లింకును నాకు పంపించండి.
rajasekhara.raju@chandamama.com
krajasekhara@gmail.com

చదువుకోసం, ఉద్యమాల కోసం, తర్వాత జీవితం కోసం ఇరవయ్యేళ్లు మా సొంత ఊరికి దూరమైపోయాను.. బాధాకరమైన విషయమేమిటంటే, ఇప్పుడు మా కడపజిల్లా రాయచోటి భాషలో నేను రాయలేను. కన్న ఊరికి దూరమైపోతే, స్వంత ప్రజల జీవితాలకు, స్వంతమాటలకు దూరమైతే ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా అనుభవమవుతోంది.

మాటలో, రాతలో, వ్యక్తీకరణలో పుస్తక భాష పూర్తిగా ఆక్రమించుకున్న జీవితం నాది. ఏ రెండు మూడేళ్లకో ఊరికి పోతే, జీవం ఉట్టిపడే వారి యాసను చూస్తే ఏం కోల్పోయానో గుర్తుకొచ్చి ఏడుపొస్తుంటోంది.

నోరు తెరిస్తే నాది కాని భాష. రాస్తే నాది కాని పుస్తక భాష.. సారూ, గీరూ అంటూ గౌరవాలందుకుంటున్న నగర నాగరికతలో దశాబ్దాలుగా చిక్కుకుపోయి, ఎప్పుడన్నా మా ఊరివాళ్లు కనబడి ‘అన్నా’ అంటూ పిలిస్తే ప్రాణం లేచి వస్తుంది నాకు. నాగరికతను నిలువునా సవాలు చేసే అమృతమయమైన పిలుపు అది.

ఈ నెల మాలిక వెబ్ పత్రికలోనే ‘చేపకు సముద్రం భాషకు మాండలికం’ అనే శ్రీరాములు గారు రాసిన వ్యాసం చూడండి. అలాగే రహంతుల్లా గారి “చిన్న భాషల్ని మింగేస్తున్న పెద్ద భాషలు” వ్యాసం కూడా చూడండి. వేయి సంవత్సరాల తర్వాత మన భాష పునాదే ప్రమాదంలో పడిన సూచిక. మొత్తంగా తెలుగు భాషకే దిక్కు లేకుండా పోతోందిప్పుడు..

జీవితంలో ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో మాత్రమే చదివి చాలా మంచి పని చేశాను. ఎవరెన్ని చేసినా జీవితంలో తెలుగు మర్చిపోలేను. కాని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ ప్రధానమై కూర్చుంది. ప్రభుత్వ పాఠశాలలనుంచి కూడా తెలుగు మాయమైపోతే ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా ఏమీ మిగలదు.

మీరు మీ భాషలో, మీ యాసలో రాయడాన్ని మర్చిపోకండి. మన ఇంటి భాషకన్నా మించింది ఏదీ లేదు. అలా రాసిన ప్రతి సారీ నాకు లింకు పంపండి. నేను కోల్పోయిన దానికోసం ఆరాటం తప్ప మరే ఉద్దేశం ఇందులో లేదు.
అభినందనలు.
వీలయితే చందమామ బ్లాగు కూడా చూడండి.
blaagu.com/chandamamalu

ఇందు said...

Congrats :)

ee post chudaneledu ippatidaka :(

Ennela said...

కృష్ణ ప్రియ గారికీ,మురళి గారికీ, రాజ శేఖర్ గారికీ, ఇందు కీ కృతజ్ఞతలు