పరకాయ ప్రవేశం...

Sunday, February 6, 2011

జయుడుని చంపిన భటులు అతని శరీరాన్ని వెంటనే కాల్చి బూడిద చెసేశారు. జయుడి ఆత్మ చింతిస్తూ తిరుగుతుండగా, చెట్టు కింద ఒక కళేబరము కనిపించింది...అది రాజు శక్తివర్మ శరీరం గా గుర్తించిన జయుని ఆత్మ శక్తి వర్మ శరీరం లో ప్రవేశించి కోట వైపు నడవసాగెను....చంద మామ లో చదువుతున్న కథ చాలా ఆసక్తి గా ఉంది...మళ్ళీ మళ్ళీ చదివానేమో, రాత్రంతా అవే కలలు...

ఆ వారం లో మా గోపాల రావు మాస్టారు..చంద్రహాసుడి కథ పాఠం చెబుతూ ఆ రోజుల్లో పరకాయ విద్య ఉండేదని చెప్పారు....నేను పరకాయ ప్రవేశం కథ చందమామలో చదివానని చెప్పాను. మాస్టారు కూడా ఒక కథ చెప్పారు. అల్లరికి మారు పేరని స్కూల్లో ఫేమసు అయిన మా కొండ గాడికో డవుటు. 'మాస్టారండీ, పర కాయ అని ఎందుకంటారండీ,,...పర 'పండూ' అనొచ్చుగా అనడిగాడు..."గుడ్డి పీనుగా (మా మాస్టరికి ఇది ఊతపదం) ఎప్పుడూ తిండి గోల మాని కొంచెం బుధ్ధి ఉపయొగించు...కాయ అంటే మావిడి కాయో , పనస కాయో కాదు...కాయమంటే శరీరం..పర కాయ విద్య అంటే..ఆత్మ ఇతర శరీరాల్లోకి ప్రవేశించే విద్య. చాలా యేళ్ళు అడవిలో ఉండి, గురువులకి సేవ చేసి నేరుచుకునేవారు యీ విద్యని" ..అని చెప్పారు."మాస్టారండీ, మీరు అడవిలో ఉంటారా ? నేనొచ్చి మిమ్మల్ని సేవిస్తాను" అన్నాడు. మాస్టారికి డవుటు వచ్చ్చింది.. ఒరేయ్, సేవించడమంటే  ఏవిట్రా  అని అడిగారు...సేవించడమంటే తినడం లేక టాగటం అని గడ గడా చెప్పాడు మన కొండ గాడు... నిన్నొదిలేస్తే మమ్మల్ని అడవులకేంటీ యేకంగా స్వర్గానికే పంపేస్తావ్.గుడ్డి పీనుగా...ఇక్కడ మమ్మల్ని తింటున్నది చాలు గానీ....ఇంక కూచో...యే టీచరుని కదిపినా నీ లీలలే అన్నారు మాస్టారు...

 

 

మేమందరం ఇంక ఆ పరకాయ విద్య గురించి ఒకటే డిస్కషన్స్. ఆ విద్య ఒస్తే ఎంత బాగుంటుంది కదా..నేనైతే, నాకు చాలా ఇష్టమైన మా బుచ్చిరెడ్డి మామ దగ్గరున్న చిన్ని తెల్ల తువ్వాయి లోకి వెళ్ళిపోతా.అబ్బ ఎంత ముద్దుగా ఉంటుందో ఆ చిట్టి తువ్వాయి.మా విజ్జి కి పాలు పెరుగు అంటే తెగ ఇష్టం...మరి ఇంట్లో నేమో లిమిటెడ్ గా ఉంటాయిగా. అందుకని అది దానికిష్టమైన పిల్లి పిల్లలోకి వెళ్ళిఅందరి ఇంట్లో పాలు, పెరుగు  తాగేస్తుందిట.మా లల్లి కేమో దాని వీపు విమానం మోత మోగించే లెక్కల మాస్టారి పై పగ తీర్చుకోడానికి హెడ్ మాస్టర్ లోకి వెళ్ళడం ఇష్టం...

 

 

ఇంక చంద మామ పుస్తకాలు, చంపక్, అప్పుడప్పుడే పరిచయమవుతున్న కామిక్ పుస్తకాలు ప్రతి నెల తప్పకుండా కొనగల సత్తా ఉన్న రఘు గాడు అందరి కంటే సన్నగా కనబడే ఎవ్వరి శరీరం లోకి జంపమన్నాజంపెయ్యడానికి రెడీ. మా సత్య కి రఘుగాడి రిచ్ నెస్ మీద మోజు.వాడు తొక్కే చిన్ని సైకిల్, వాళ్ళ ఇంట్లో ఉన్న ఉయ్యాల బల్ల అంటే, దానికి పిచ్చి పిచ్చి ఇష్టం..సో, ఆ రిచ్ నెస్ కోసం బాడీ పెద్దదయినా, వాడి శరీరం లోకి ట్రాన్స్ ఫర్ అవడానికి అదీ పరకాయ విద్య ఎక్కడ నేర్చుకోవచ్చూ అని అందరు ట్యూషన్ మాస్టార్ల దగ్గరా కనుక్కుంటోందిట..

 

 

స్కూల్ కి ఎక్కువగా గుంపులు గుంపులుగా నడచి వెళ్ళేవాళ్ళం.. ఒకొక్కసారి సుగుణ కోసం వెయిట్ చేసి చేసీ అది రాదని డిసయిడు అయ్యి కొంచెం లేటు అయితే మంద మిస్స్ అయిన మేక పిల్లలా ఉండేది పరిస్థితి.. ఒక్కదాన్నీ కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం నడవడం  పరమ బోర్..కానీ యీ పరకాయ విద్య గురించి తెలుసుకున్నాకా దారిలో కనిపించే ప్రతి జంతువు/మనిషి లోకి వెళ్ళిపోతూ మూడు కిలో మీటర్లు అవలీలగా నడిచేసేదాన్ని..

 

 

ఇంట్లో పెద్దగా యేం చదువుతున్నామా అని పట్టించుకోరు.దీపాలు పెట్టే వేళకి కాళ్ళు కడుక్కుని, పుస్తకాలు ముందు వేసుకుని, దీపాల వెలుతురు లో కూచుంటే చాలు. అమ్మ పిలిచి అన్నం పెట్టగానే నిద్ర లోకి జారుకోవచ్చు.కానీ మూడు నెలల కోసారి యమ గండం,అదే ప్రోగ్రస్ కార్డులు ఇచ్చే రోజు అమ్మైతే సంతకం పెట్టేస్తుంది.యీ సారి నాన్న కి దొరికిపోయింది చెల్లి.. చెల్లికీ సయిన్స్ కీ చుక్కెదురు....

 

 

నాన్నకి కోపం రాలేదు కానీ చెత్త మార్కులకి రీసన్ తెలుసుకున్నారు.దానికి వాళ్ళ సయిన్సు టీచరంటె అస్సలు ఇష్టం లేదుట.ఆవిడ చాలా స్ట్రిక్టు ట. ఒక్క తప్పయినా మొత్తం మళ్ళీ వ్రాయమంటారుట.ఆవిడ మీద కోపం తో అది సయిన్సు చదవడం మానేసానంది.

నాన్న చెప్పారు...ఆవిడ అలా చెయ్యడం మాకే మంచిదట..అలా ఉండటం వల్ల ఆవిడకి యేమీ లాభం లేదుట.. ఆవిడ మనకి బాగా చదువు రావడం కోసమే అలా డ్రామా చేస్తారుట కానీ, ఆవిడకి అస్సలయితే పిల్లలందరూ చాల ఇష్టం ట..ఎవరి మీదయినా కోపం వస్తే, వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు...దాని వల్ల వాళ్ళకి లాభం ఏంటీ అని ఆలోచిస్తే చాలా సార్లు మనకి వాళ్ళ మీద కోపం రాదుట. నాన్న చిన్నప్పటి నుండీ చెపుతూనే ఉండేవారు  కోపం వద్దు, తన కోపమె తన శత్రువు అని..కానీ యీ సారి చెప్పినప్పుడు నాకు ప్రత్యేకంగా అనిపించింది..ఈ సారి వివరణ నాకు తెలిసిన పరకాయ విద్యకి అర్థం మార్చింది. అంటే కోపం వచ్చినప్పుడల్లా మనం పరకాయ ప్రవేశం చెయ్యాలన్నమాట.  అదిగో  అప్పటి నుంచి ప్రతి రోజు ఎవరో ఒకరి బుర్ర కాయలోకి పరకాయ ప్రవేశం చెయ్యడం తప్పలేదు.(మరి మనకి చీటికి మాటికి ఎవరో ఒకరి మీద కోపమొస్తుందిగా)..ఇలా క్రమంగా కోపమొచ్చినప్పుడు అనే కాకుండా సరదాగా ఎడ పెడా పర బుర్ర ప్రవేశం అలవాటయ్యిపోయింది..

 

 

వివాహం విద్యా నాశనం కదా? వచ్చిన అన్ని విద్యలతో పాటు.. పరకాయ విద్యా పత్తా లేకుండా పోయింది..పెళ్ళయిన కొత్తల్లో నాన్న దగ్గర ఒక  విషయాన్ని భూతద్దం లో చూపించి మరీ  చెప్పా..నాన్న చాల నిదానంగా పర కాయ విద్యని  క్రాష్ కోర్స్ బేసిస్ మీద రిఫ్రెష్ చేసి పంపారు. ఆ తర్వాత ఎప్పుడూ ఏ విషయం నాన్నతో చర్చించే అవకాశం రాలేదు. అందుకే నాన్నంటే నాన్నే మరి!

చిన్నప్పుడు చాలా యేళ్ళ వరకూ చెప్పులూ బూట్లూ లాంటి ఎగస్ట్రాఫిట్టింగ్స్ లేకుండా నా స్వంత పాదాలతో నడవడం నాకు అలవాటు.. దీనికి కారణాలున్నయి...

1.చెప్పులు కొనిచ్చిన రోజే సాయంత్రం సత్యా టాకీస్ వెనకున్న ఇసక మేటల్లో ఆడుకుంటూ పక్కన వదలడం/మర్చిపోవడం..అవి రెండో నిముషం మాయమవడం.

2.మా పాఠశాలలో యూనిఫారం అని పిలవబడే ఆకుపచ్చ తెలుపు కాంబినేషన్ లో బట్టలు యేదో ఒక రూపం లో కట్టుకురమ్మనడం తప్ప ఇంక ఒక్క ఇంచీ ఎక్కువ రూల్స్ పెట్టినా...స్కూల్‌నే అమ్యూస్మెంట్ పార్కూ, ఎంటర్ టైన్మెంటూ ప్లేసు అనుకుని స్కూల్‌కి రావడమంటే ప్రాణం పెట్టే కొండ గాడితో సహా ఎవ్వరూ స్కూల్‌కి రారు. అందుకని చెప్పులున్నాయా బూట్లున్నాయా లాంటి యక్ష ప్రశ్నలు మా పీటీ మాస్టరు అస్సలు వేసేవోరు కాదు.

ఇత్యాది కారణముల వల్ల నేను 'చెప్పులు జాగర్త' అనబడే అతి పెద్ద బాధ్యత నుంచి విముక్తి పొందడానికి బేర్‌ఫుట్ తొ తిరిగేదాన్ని...కొంచెం పెద్దయ్యాక కాలేజీ కి అలా వెళితే బాగుండదు కదా..అదిగో అప్పుడు చెప్పుల్లోకి ప్రమొషన్ తీసుకున్నా. విషయమేంటంటే..షూలూ గట్రా అలవాటు అసలు లేదు...అలా అలవాటు లేదూ అని వదిలేస్తే ఇక్కడ ఇంకేమైనా ఉందా..మంచుకి కాళ్ళు గడ్డ కట్టేసి కాళ్ళు తొలగించాల్సి వస్తుంది..యేదో అలవాటు చేసుకున్నా, మా ఫ్రెండ్

తో ప్రతి రోజు...'యీ బూట్లేంతో , యీ ప్యాంట్లేంటో,యీ పాట్లేంటో అని వాపోయేదాన్ని.

రామాయణం లో పిడకల వేటలా యీ చెప్పుల రామాయణమేంటీ అంటారా!అదిగో అక్కడికే వస్తున్నా..

ఇక్కడికొచ్చాకా ప్రతి ఒక్కరూ ‘be in his shoes'..అని అనడం విన్నాను...నా బూట్లతో నడవడమే నాకు చాతవట్లే ఇంక వేరే వాళ్ళ బూట్ల గొడవ నాకెందుకులే అనుకున్నా...కొంచమయ్యాక అలోచిస్తే.. కొత్త సీసాలో పాత సారాయి.సరేలే పరకాయ ప్రవేశం అని పబ్లిక్ లో పాత చింత కాయ మాటలెందుకూ స్టయిల్ గా ఉంటుందిలే అని నేను అందరి బూట్లల్లో కాళ్ళు పెట్టేప్రయత్నం చేసా...ఉహూ ..ఎవ్వరివీ పట్టాలా ! కొందరివి మరీ పెద్దవి, కొందరివి మరీ చిన్నవీ...మనకి పట్టవులే అని వదిలేదాన్ని వదిలేసి ఊరుకోకుండా మరి కొందరి బూట్లల్లో కాళ్ళు పెట్టి అనవసరంగా వాళ్ళ కాళ్ళకున్న అదేదో వ్యాధి కూడ అంటించేసుకున్నా..ఇంక ఇదంతా మనకెందుకులే అని అన్నీ వదిలేసి అన్నీ మరచి నా వ్యాపకాలతో నేను జీవించెయ్యడం మొదలు పెట్టా.

 

 

క్రమంగా కొంచెం విసుగు మొదలయ్యింది,అలసట వల్ల అనుకున్నా. చిరాకు నేనున్నానంది....కష్ట పడిపోతున్నా పాపం అని సరిపెట్టుకున్నా.కస్సుబుస్సు లాడ్డం జత కలిసింది..సహాయం చెయ్యడానికెవరూ లేరు అని నా మీద నేను జాలి పడ్డా... నిర్లిప్తత ఆవహించింది.ప్రపంచం లో నేను ఒంటరి దాన్ని అని గట్టి ఫీలింగ్. ‘నీకూ  నీ వారు లేరు నాకూ నా వారు లేరు ,మంచు లోనా ఇల్లు కడదామా చల్ మోహన రంగా’ అంటూ ఇక్కడికొచ్చినప్పుడు ఉన్న  ఉత్సాహం అంతా పోయి.”ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు..ఇల్లు నీకెక్కడిదె చిలుకా”...అనీ, “వస్తా వట్టిదె పోతా వట్టిదే ఆశ ఎందుకంటా” అనీ “నానాటి బ్రతుకు నాటకమూ” అనీ “స్థిరతా నహి నహి రే మానస, స్థిరతా నహి నహి రే” దగ్గర ఆగిపోయింది. అందరి మీదా విసుగు, కోపం, చిరాకు మనసుని మంచుతో కప్పేసింది..

 

దాన్లోభాగంగా ప్రతి వారం ఇంటికి ఫోన్ చెయ్యడం లో నిరాసక్తత..ఎప్పుడూ నేనేనా అని పంతం . జవాబు ఆశించకుండా ప్రతి చిన్న విషయానికీ మెయిల్స్ వ్రాసే నేను జవాబు రాదే అని ఎదురు చూడ్డం నిరాశ చెందడం.. చివరికి మొన్న పెద్ద పండక్కి ఇంట్లొ అందరి మీదా అలిగి “ఇంక యెవరికీ మెయిల్స్ రాయట్లేదు..ఇదే ఆఖరు” అని మెయిల్స్ కూడా పడేసా... నాలుగు రోజులు కస్సు బుస్సు ఇంట్లో బయటా అందరి మీదా....ఇంక మెయిల్స్ చూడ్డం కూడా మానేసా. ఐదో రోజున ఒక ఇంపార్టెంట్ మెయిల్ కోసం ఎదురు చూస్తూ ఇన్ బాక్స్ ఓపెన్ చేసా....ఖుల్ జా సిం సిం ఖజానా...!

  

అబ్బో ఎన్ని మెయిల్స్ అనుకున్నారూ? మెయిళ్ళు నెమళ్ళలా నాట్యం ఆడేసాయి ఇన్ బాక్స్ లో ..అవి చూసి విజయ గర్వం తో వికటాట్టహాసం చేసా....హహా...హ్హహ్హహ్హహ్హ...హహ్హహహ్హహ్హ్హ్హహ్హ్హ్హహ్హ్హ్హ . ఆ అట్టహాసం నాలో శక్తిని పెంచింది.. శక్తి వచ్చింది అన్న మాట అనుకోగానే నాకు అకస్మాత్తుగా శక్తి వర్మ గుర్తొచ్చాడు..దానితో పాటే పరకాయ విద్య., వెంటనే ఇతరుల బుర్రలోకి ప్రవేశించడం .., దాని వెనుక కొత్త సీసాలో పాత సారాయి..,, వెనువెంట be in others shoes...,,, చివరగా నాన్న.నాన్న, నాన్న.మత్తు వదిలి పోయింది. అందరి మీద కోపం హాంఫట్..

చాల కాలం తర్వాత పెదవుల మీద చిరు నవ్వు, మనసు లో ఉత్సాహం. సంతోషం గా వెంటనే ఫోన్ అందుకున్నాఇంటికి ఫోన్ చెయ్యడానికి.....

నాన్నా నీకు జోహార్లు..నువ్వు నేర్పిన పరకాయ విద్యకి జేజేలు...

21 వ్యాఖ్యలు:

SHANKAR.S said...

పరకాయ ప్రవేశం. చిన్నప్పుడు జంధ్యాల గారి రావు గోపాలరావు సినిమా చూసి కనబడ్డ ప్రతీదాంట్లో కి ప్రవేశించేయాలని ఉండేది. మా వీధి కుక్క నుంచి అప్పటి ప్రధాని వీపీ సింగ్ వరకు అందరి శరీరాలలోకి ప్రవేశించి వాళ్ళ వాళ్ళ లైఫ్ లు ఎలా ఉంటాయో చూడాలని ఉండేది.(వాళ్ళూ ఒప్పుకోవద్దూ అన్న ఆలోచన అప్పట్లో ఉండేది కాదండీ).

అన్నట్టు అన్ని మెయిళ్ళలో నాది కూడా ఉందా? :)

Anonymous said...

:))

ఆ.సౌమ్య said...

హహహ బావుంది..ఎక్కడినుండో ఎక్కడికో ముడెట్టేసారు. మీ కొండా గారు మాత్రం సూపరు..."పరపండు"..ఇది చదివి గంట సేపు నవ్వాను.

మీకు మైల్స్ చూసి పరకాయప్రవేశం, నాన్నగారు గుర్తొచ్చినటు..మీ "మెయిళ్ళు" చూసి నాకింకేదో గుర్తొచ్చింది.

తమిళ్ లో మెయిల్ అంటే నెమలి అని అర్థం. మెయిళ్ళు అనగానే నెమళ్ళు గుర్తొచ్చాయి. మీరు చాల కోపంగా కూర్చుని inbox తెరిచినట్టు. అక్కడ బోలెడు నెమళ్ళు కనిపించినట్టు....వాటిని చూడగానే మీ మొహం నెమ్మది నెమ్మదిగా ఆనందంగా మారినట్టు చిన్న ఊహ వచ్చింది. :)

..nagarjuna.. said...

situation కు తగ్గట్టు పాటను సెట్ చేయడంలో మీరు ఆరితేరిపోయారు ఎన్నెలగారు....

సుమలత said...

చాల బావుంది నవ్వు కోవడానికి ఇది ఒక ప్రవేశం

Sasidhar Anne said...

Akka post chadavala.. kani comments lo naa peru first lo vundali ani comment eduthunna..

motham chadivaka..malla vastha

అశోక్ పాపాయి said...

పరకాయ ప్రవేశంతో భలే నవ్వించారు..అయితే ఇప్పుడు మీ పరకాయ విద్య పత్తాలేకుండా పోయిందా హ హ హ..అదేంలేదు మీ పరకాయ విద్య ఇప్పుడు మాకు కూడ నేర్పించరుగా ఇప్పుడు అది ఖుల్ జా సిం సిం ఖజానా అయ్యింది :)

అశోక్ పాపాయి said...

మీ పరకాయ ప్రవేశం ..పువ్వుల్ పువ్వుల్ :) నవ్వుల్ నవ్వుల్ :)

ఇందు said...

'పరపండూ' ఆ? ఇంకా నయం...పర దుంప,పర కూర అనలేదు ;) ఎక్కడ మొదలుపెట్టి...ఎక్కడ ఆపారండీ బాబూ! అలా చదువుతునే ఉన్నా! చదువుతునే ఉన్నా! ఎమన్న కొత్త పరకాయ విద్యలు నేర్పిస్తారేమొ అని ;)కాని అసలు అర్ధం వేరు అన్నమాట. సర్లేండీ ఈసారికి ఇలా కానిచ్చేద్దాం! పరయక,పాత సీసలో కొత్త సారా,be in other shoes...Gud Gud.హ్మ్! మంచి టపా!

హరే కృష్ణ said...

ఇంత పెద్ద పోస్ట్ ఆ :(
>>be in others shoes
http://www.imbecile.me/wp-content/uploads/2010/01/big-shoes-to-fill-500x750.jpg

Ennela said...

శంకర్ గారూ కృతజ్ఞతలండీ..
//అన్నట్టు అన్ని మెయిళ్ళలో నాది కూడా ఉందా?//
అసలు నేను మెయిల్ బాక్స్ ఓపెన్ చేసిందే మీ మెయిల్ కోసం కదా!

అను గారు, కృతజ్ఞతలండీ

సౌమ్య గారు, కృతజ్ఞతలండీ. అవునా మీరు భలే ఊహించారు..నిన్న ఒక బ్లాగ్ లో తెల్ల నెమళ్ళు కూడా చూసా..అవి చూసాకే అలాంటి పద ప్రయోగం చేసానన్నమాట..మీ ఊహ కరెక్టే సుమండీ!

నాగార్జున గారు, కృతజ్ఞతలండీ...ఇక్కడికొచ్చాక పాడుకోవడం అస్సలు కుదరట్లేదండీ...ఒక సారి ట్రై చేస్తే..ఇల్లు ఖాళీ చేసెయ్యమన్నారు..అందుకని మనసులో ఉన్న లిస్ట్ అంతా..అలా వెళ్ళగక్కుతున్ననన్నమాట

సుమలత గారూ కృతజ్ఞతలండీ...//నవ్వు కోవడానికి ఇది ఒక ప్రవేశం//యీ పదం భలే వాడారు మీరు..నాకు నచ్చేసింది భలేగా...

Ennela said...

శశీ కృతజ్ఞతలండీ..పూర్తిగా చదివి చెప్పండి మరి!..మీరు మీ బొమ్మ మార్చారు కదూ? బాగుంది చాలా..చిన్ని కుందేలు తొంగి చూస్తూ

అశోక్, కృతజ్ఞతలండీ..మీకూ వచ్చేసిందా అయితే పరకాయ విద్య.పోయిందని భయ పడ్డా కానీ ఇప్పుడు పత్తా తెలిసిపోయింది లెండి.పోయినా మళ్ళీ నేర్చుకోవచ్చు మీ దగ్గర ..

ఇందూ, కృతజ్ఞతలు. అరె మీరు వ్రాసేటప్పుడు చెప్పకూడదూ...కొండ గాడికి చెప్పి అవి కూడా అనిపించేదాన్ని. అవునా, నాకు అలాంటి విద్య వస్తే ఇక్కడెందుకుంటానండీ..ఒకవేళ నేను నేర్చుకుంటే మీకు నేర్పే పూచీ నాదీ ఓకేనా?

హరే కృష్ణ గారూ, కృతజ్ఞతలండీ...అన్నిటికన్న ఇది చిన్న టపా అనుకున్నా..నన్ను హర్ట్ చేసారు మీరు...వా..ఆ...ఆ...అ ఆ ఫుటొలో మీరు నన్ను సరిగ్గా ఎలా గుర్తుపట్టగలిగారండీ...కనడా వచ్చిన కొత్తల్లోది ఆ ఫుటొ...మళ్ళీ కృతజ్ఞతలు ఫుటో చూపించినందుకు..భలే ఉంది ఫుటో ...

Sasidhar Anne said...

ha ha.. prathi class lo evaro okkalu alaga piccha doubts vese vallu vundalsindhey.

mee nanna garu cheppina concept raccha.... pakka vallu enduku ala behave chesthunnaro.. valla view nunchi chusthe assalu mis understandings ee ravu.
entha aligithey mathram mari valla nunchi mails vacchindaka matladakunda koorchovala?

మనసు పలికే said...

ఎన్నెల గారూ.. అసలు మీరు సూ...పర్ అండీ:) ఎక్కడ పరకాయ ప్రవేశం, ఎక్కడ be in others shoes సూక్తి:) భలే కలిపేసారుగా. చాలా చాలా బాగుంది మీ టపా.

kiran said...

ఎన్నెల గారు..
:):)..be in other shoes....ఆ పార్ట్ బాగుంది..
ఇంక..ఆ పాటలు ఏవేవో కలిపేసారు..గ... :):)
బాగుంది...:)

Unknown said...

ఎన్నెల గారు .. పర పండు సూపర్ .. :)
కాని ఒక్కోసారి అలా అనిపించడం సహజం .. కాని అప్పుడు అమ్మని గుర్తుకు తెచ్చుకుంటే అది అంత పోతుంది .. ఎందుకంటార ..
మనకి కొంచెం సాయం కావాలంటే అమ్మోస్తుంది .. కాని అమ్మకి ఎవరైనా వస్తార ..
చిన్నప్పుడు సినేమకేల్లోస్తే నేను అన్నయ్య నన్నా రెస్టు రెస్టు అనుకుంటూ కుర్చున్దిపోఎవాళ్ళం .. కాని అమ్మ మాత్రం అలా వంట చేసి మాకు వడ్డించేది ..
అందుకే నేను బాగా విసుగ్గా ఉన్నప్పుడు .. అలసటగా ఉన్నప్పుడు అమ్మ అమ్మ అనుకుంట :) అంతే నూతన ఉత్సాహం తన్నుకోచ్చేస్తుంది అంతే :)

జయ said...

బాగుంది పరకాయప్రవేశం. భలే ఉంది. ఎక్కడా వదలకుండా చదివించేసారు. చాలా సరదాగా ఉంది. నేర్చుకోవాల్సిన టెక్నిక్ లు చాలానే ఉన్నాయి:)

బులుసు సుబ్రహ్మణ్యం said...

చిన్నప్పుడు నేను మా లెఖ్ఖల మాష్టారు లో పరకాయ ప్రవేశం చేసేవాడిని. ఆ లెఖ్ఖల మాష్టారు నాముందు చేతులు కట్టుకొని నుంచోని "నాయనా సుబ్రహ్మణ్యం లెఖ్ఖల హోం వర్కు చేయఖ్ఖర్లేదు. పరీక్షల్లో తెల్ల పేపరు ఇచ్చినా 100 మార్కులు ఇచ్చేస్తాను" అని చెప్పినట్టు ఊహించుకొనేవాడిని.

>>క్రమంగా కొంచెం విసుగు మొదలయ్యింది,అలసట వల్ల అనుకున్నా. చిరాకు నేనున్నానంది.......

ఇది మనందరికీ అప్పుడప్పుడు అనుభవం లోకి వస్తుంది. కానీ అవన్నీ పాసింగ్ మూమెంట్స్. We lift ourselves.

గుడ్ మంచి పోస్ట్.

Unknown said...

www.telugupustakalu.com

andariki teliyacheyandi pustaka priyulaku idi oka vindu

Ennela said...

శశీ, //ఎంత అలిగితే మాత్రం, మరి వాళ్ళ నుంచి మయిల్స్ వచ్చేదాకా మాట్లాడకుండా కూర్చోవాలా?//అమ్మో యెన్ని చాన్సులు ఇచ్చానో మీకు తెలియదు..ఇది ఇంక ఆఖరి అస్త్రం అన్నమాటా..మరి దాని తర్వాతేగా అందరూ వ్రాసారు!

అపర్ణా, కృతజ్ఞతలు...మీకు నచ్చినందుకు..

కిరణ్, కృతజ్ఞతలు..మీకు కూడా నచ్చినందుకు...

కావ్యా మీకు స్వాగతం...//అందుకే నేను బాగా విసుగ్గా ఉన్నప్పుడు .. అలసటగా ఉన్నప్పుడు అమ్మ అమ్మ అనుకుంట//..నేను అమ్మని అయ్యేదాకా, అలసిపోయినపుడు అలాగే అనుకునే దాన్ని..ఇప్పుడు అలా అనుకోవాలని కూడా గుర్తు రానంత అలసట. మయిండ్ బ్లాక్ అంటారే అలా అన్నమాట .హహహ

జయ గారు కృతజ్ఞతలండీ...పంతులమ్మలకి నేర్చుకోడానికేముంటాయండీ..నేర్పించడం తప్ప!

సుబ్రహ్మణ్యం గారు, కృతజ్ఞతలండీ...మీ లెక్కల మాస్తారిలోకి పరకాయ ప్రవేశం మమూలే అయినా....మీ ముందు ఆయన చేతులు కట్టుకుని నిలబడి మరీ మిమ్మల్ని రిక్వెస్టు చేసారు చూసారా..తెల్ల కాయితం ఇచ్చేమని...అల్లది..అదరహో...


తెలుగు గారూ కృతజ్ఞతలండీ

ramya said...

chala baga rasaru ennela. Good post.