ఓ స్త్రీ రేపు రా

Wednesday, January 5, 2011


"ఓ  స్త్రీ  రేపు రా"....యీ పదం విన్నరా మీరెప్పుడయినా? నాకయితే అమ్మో ఈ పదం తలచుకుంటేనే గుండె ఝల్లు మంటుంది...అందమయిన  ఝల్లు కాదండీ..భయం ఝల్లన్నమాట. ఇంటి తలుపుల మీద  ఈ పదం చూస్తేనే వణుకు స్టార్ట్ అయ్యేది. కారణం ఏంటని మీరు అడిగినా అడక్కపోయినా నేను చెప్పేస్తానన్నమాట. చెప్పక పోతే పాపం మీకెలా తెలుస్తుందీ, తెలియక పోతే నాలాగ మీరు ఎలా భయపడతారూ? అంటే మిమ్మల్ని భయపెట్టడమే నా లక్ష్యం అనుకుంటారేమో...ఛ్చ ఛ..నేనలాంటి దాన్ని కాదండీ. ...నేను సెల్ఫు లెస్సు...నా దగ్గర ఏమున్నా అందరితో పంచుకోమని అమ్మ చెప్పిందీ...మరి అన్నీ పంచుకోవడం కుదరదు కాబట్టీ, అప్పుడప్పుడు భయ్యాన్నీ..నాకొచ్చే జలుబునీ...అప్పుల్నీ . ఇంకా వైరల్ జ్వరాన్నీ...ఇలా నాకున్న సమస్తమయిన మంచి వస్తువుల్నీ అందరితో పంచుకుని...తుఛ్చమయిన డబ్బునీ, సుఖాన్నీ, బంగారాన్నీ, నేనే కష్ట పడి భరిస్తూ ఉంటాను..అయినా యెందుకో యెవరూ నా త్యాగ నిరతిని కానీ...నా నిస్వార్థ సుగుణాన్ని కానీ కొనియాడిన పాపాన పోలేదు...పాడు లోకం అంతే అని పక్కింటి పాపాయమ్మమ్మ చిన్నప్పటి నుంచీ చెబుతూనే ఉంది... చిన్న తనం కదా..తెలీలేదు..ఇప్పుడు కొంచెం కొంచెం అర్థం అవుతోండి లెండి...పాపం మీరందరూ నా మిత్రులు... ఆ పాడు లొకం లాగా కాదని నాకు తెలుసు.నేనేమయినా పంచానని మీకనిపిస్తే ..మీరయినా నా నిస్వార్ధ -పంచుకోడాన్ని అభిలషించి...ఒక భారత రత్నో, ఒక పద్మ భూషణో ఇస్తారేమో అని చిన్న ఆశ. మరి వినండి.

మా  వెంకన్న గుడి  పక్కన  ఉన్న జగన్నాధ స్వామీ గుడిలో కొంత మంది కాపురముండే వారు...వారిలో ఒక తండ్రి ఇద్దరు ఆడ పిల్లలు ఉండేవారు. ఆ అమ్మాయిలిద్దరి పేర్లు ఉమ, ఉష. వాళ్ళిద్దరూ గుడికి వచ్చిన వాళ్ళందరినీ  నవ్వుతు పలకరించే వారు .ఇద్దరికీ వయసులొ నాలుగయిదేళ్ళు  తేడాయే అయినా ఉమక్క ఉషక్కని తల్లిలా చూసుకుంటుందని అందరు చెప్పుకునే వారు..మరి ఏం జరిగిందో.. ఒక రోజు ఉమక్క రోజు కంటే ఉషక్కని ఎక్కువ ప్రేమగా చూసుకుందిట...జడలు వేసి, అన్నం పెట్టి ఒళ్లో కూడా కుర్చోపెట్టుకుందిట   ..(ఉషక్క మరీ చిన్న పిల్ల కాదు పదహారేళ్ళు ఉంటాయేమో అప్పటికి ). సాయంత్రం అయ్యేటప్పటికి ఊరిలో వార్త   ఉమక్క నిప్పు అంటిన్చుకుందని ..మర్నాడు హాస్పటల్ నించి శవాన్ని మాత్రమె తీసుకు  రాగలిగారు..చాలా కాలిపోయిందిట...ఆమెను చూసి ఉషక్క కళ్ళు తిరిగి పడిపోయి చాలా సేపు లేవలేదు...అందరు ఆ అమ్మాయి కూడా షాక్ కి గురి అయి చని పోయిందని అనుకున్నారు కానీ చాలా గంటల తర్వాత మెలకువ వచ్చి ఒకటే ఏడ్చింది పాపం(అన్ని గంటలు ఆ అమ్మాయిని హాస్పటల్ కి తీసుకెళ్ళాలని ఎవరు అనుకోలేదు ఎందుకో. )...నేను ఆ అమ్మాయిని  తలుచుకునీ ఒకటే ఏడుపు.ఇంకా వణుకు..నాకు చని పోయిన వాళ్ళను చూడ్డం చాలా భయం..అమ్మ కుడా చూడ నిచ్చేది కాదు చిన్నపిల్లలమని. ఇంకా ఈ కాలి పోయిన అమ్మాయిని గురించి చెప్పుకుంటుంటే వినడానికి భయం కానీ వినకుండా ఉంటె ఇంకా భయం...(నిజం కంటే ఎక్కువ ఊహించేసుకుని) . ఆ అమ్మాయి అంత్య క్రియలు మా ఇంటి దగ్గర చెరువు పక్కన ఉన్న స్మశానం లో చేసారు...ఇంక మాకు చెరువు గట్టు వయిపు ఆటలు బంద్. నాలుగు రోజులు అందరి నోట్లో ఇవే కబుర్లు . రాను రాను ఎలా కాలిపోయిందని టాపిక్ మారిపోయి ఎందుకు కాల్చుకుని ఉంటుందీ అని స్టార్ట్ అయ్యింది. చిలవలు పలవలు గా ఏవేవో చెప్పుకున్నారు. చిన్న తనం వల్ల నాకు ఒక్క ముక్క కుడా  అర్థం అయ్యేది కాదు..కానీ సీరియస్ మ్యాటర్ ఏదో ఉందని మాత్రం అర్థం అయ్యేది. అలా మా ఊళ్ళో అందరు డిటెక్టివు లయ్యారు.పదకొండో రోజు కర్మ కాండలు అవ్వగానే ఇంకొక న్యూసు..ఉమక్క దయ్యమయిందని...ఇంకేముందీ అందరు చీకటి పడే వేళకి ఇంటికెళ్ళి పోవాలని రూల్ పాస్ చేసేసారు. పెద్దా చిన్నా అని లేకుండా అందరికీ భయమే. భయమేమో గానీ ఊరికి ఒక డిసిప్లిన్ వచ్చింది...నా లాగా చదువు సంధ్య లేకుండా గోపాల్ శేట్ దుక్నం దగ్గర బెల్లం ముక్క కోసం తారాడే పిల్లలందరూ ఇంట్లో ఉండి బుద్ధిగా చదువుకోవడం మొదలెట్టారు. గోపాల్ శేట్ కుడా చీకటి పడకుండానే కొట్టు కట్టేస్తాడు  కాబట్టి కొనే వస్తువులేవో అందరు ఆరు లోపే కోనేసుకుంటున్నారు. సారా దుక్నం చెరువు గట్టు చివరన ఉండటం చేత గవుండ్లోల్ల  'గుడుంబా శంకరన్న' కుడా చీకటి పడే సమయానికి  'ఖేల్ ఖతం దుక్నం బంద్' అనేసాడు కాబట్టి మందు బాబులు  మాపటి కల్లా ఇంటికోచ్చేయ్యడం మొదలెట్టారు. కొంత మంది మాత్రం దెయ్యం గియ్యం జాన్తా నై అని గోల్నాకా రోడ్డు మీదున్న మందు కొట్లో మందు(???) కొనుక్కుని లేట్ గా రావడం మొదలెట్టారు.  అలా రాత్రిళ్ళు తిరగ డానికి ట్రయి చేసిన వాళ్ళందరూ , , దయ్యాన్ని చూసామని, ఎవరో అమ్మాయి తల మీద కుంపటి పెట్టుకుని వీధుల్లో తిరుగుతోందని చలీ జ్వరం తెచ్చేసుకుని మంచమేక్కేసారు.భూత వయిద్యుడొకడు దయ్యం మన జోలికి రాకుండా ఉండాలంటే ఇంటి ఆడ వాళ్ళందరూ ఆకు పచ్చటి గాజులు ధరించాలని చెప్పి మా గాజుల  కిష్టయ్యకి గిరాకీ పెంచాడు. మా అమ్మ చాదస్తంగా మా నలుగురికీ కుడా చేతుల నిండా పచ్చ గాజులు వేయించి ఎప్పటి నుండో నాకు తీరని కోరికని తీర్చేసింది. ఇంక దర్గా దగ్గర ఒకటే సందడి. మా ఖాన్ సాహేబు మామ చారానా తీసుకుని తాయెత్తు లిచ్చేవాడు. ఉమక్క పుణ్యమాని వాళ్ళింట్లో కొన్ని రోజులకు సరిపడా కాసుల గల గల. ఎవరో ఇంకొక ఊరికి వెళ్లోచ్చి అక్కడ కూడా ఇలాంటి దయ్యం ఉండేదనీ , తలుపుల మీద 'ఓ స్త్రీ రేపు రా" అని వ్రాస్తే,  ఎడ్యు కేటేడ్ దయ్యం అది చదివి 'అయ్యో ఇవాళ మనని రమ్మని అనలేదు కదా రేపు వద్దాం  లే' అని ప్రతి రోజు అనుకుందనీ, . అలా రోజు చూసీ చూసీ, ఛీ ఈ ఊర్లో అందరు నన్ను  రేపు రమ్మంటారు ఒక్కళ్ళు కుడా నన్ను రమ్మనట్లేదు అని విసుక్కుని ఫీల్ అయ్యి ఊరు వదిలి పోయిందిట  అని చెప్పారు. ఇది బాగా నచ్చి ..అందరు ఇంక తలుపుల మీద 'ఓ స్త్రీ రేపు రా' అని పసుపు  తోనూ, కుంకుమ తోను, ఇంకా థిక్ గా  బొగ్గు, సున్నం తోనూ రాసి పడేసారు...ఆ పదం చూస్తె నాకు భయం...మా ఇంట్లో జమా జెట్టీ ల్లాంటి  ముగ్గురు మగ పిల్లలున్నారని తలచి అమ్మ మనింటి పయిన అక్కర్లేదులే అనేసింది...(మీరేదో సుమో రేజ్లిలర్లని ఊహించేసుకుంటారేమో! మా అన్నలు ముగ్గురూ పిచ్చిక పిల్లల్లా ఉండేవారు.. అంతా మా మాతా శ్రీ భ్రమ).....హమ్మయ్య బతికి పోయాను, లేక పొతే ఇల్లొదిలి స్మశానంలో ఉండేదాన్నేమొ...ఆ పదం అంటే నాకు స్మశానం కంటే యెక్కువ భయం యెందుకో ...నాన్న నన్ను , చెల్లినీ పక్కలో పడుకో బెట్టుకుని 'రామ స్కందం హనుమంతం వయినతేయం వృకోదరం శయనే యః పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నస్యతే ' అని వల్లే వేయించి మన ఇంటికి దయ్యాలు గియ్యలు ఏమీ రావు గాక రావు, పీడ కలలు కుడా రావు హనుమంతుడు మనల్ని రక్షిస్తాడు  అని ధయిర్యం చెప్పేవారు.   ఒక ఎండా కాలం , ఒక వానాకాలం గడిచాక  కొన్ని నెలలకి వర్షం వల్లనో కాలం వల్లనో కానీ నెమ్మదిగా ఉమక్క దయ్యం తో పాటు తలుపులపైన  ఉన్న ' 'ఓ స్త్రీ రేపు రా" కూడా కరగిపోయింది. మళ్ళీ చీకటి పడ్డాక  కుడా మా ఊర్లో సందడి మొదలయ్యింది....


సడన్ గా ఒక రాత్రి బస్సు దిగి ఇంటికొస్తున్న విమలక్క ని పోలీసు స్టేషన్ దగ్గర ఎవరొ గట్టిగా పట్టుకుని మెడలో గొలుసు కత్తిరించుకు పోయారు. దొంగలో దయ్యమొ తెలియ లేదు కానీ ఆ అమ్మాయి నెల రోజులు మంచం దిగలేదు..దడుసు కుందనీ, దిష్టి తగిలిందనీ, దయ్యం పట్టిందనీ నానా విధములయిన దిష్టి మంత్రాలు, దిగదుడుపులూ , పూజలు అన్నీ  జరిగాయి...అందరూ బంగారు గొలుసులు మానేసి (నిజ్జం బంగారమనుకునేరు..మాకెవ్వరికీ అంత సీను లేదు. మా గాజుల కిస్టయ్య ఇరవై పైసల నాణాలతొ చేయించిన గొలుసులేవొ అమ్మేవాడు...మా దగ్గర ఉన్న అత్యంతధనవంతులు అవి కొనుక్కునేవారు...)ఎవో వెండి రంగు నగలేసుకోవడం మొదలెట్టారు...మళ్ళీ ఊరంతా గప్ చుప్ అయిపోయింది...రాత్రిళ్ళు తలుపులు చప్పుళ్ళయేవి...యెవరో  నడుస్తున్నట్టు అడుగుల శబ్దం..యెప్పుడు తెల్లారుతుందా అని ఒకటే ఎదురు చూపు. పనిలో పనిగా నాలుగు రోడ్లు కలిసిన చిన్న చిన్న కూడళ్ళలో నిమ్మకాయలు, పసుపు కుంకుమలు దర్శనమిచ్చేవి.అలాంటివి కనిపిస్తే వాటి వయిపు చూడకుండా, తొక్క కుండా, దాట కుండా వెళ్ళాలని అమ్మ చెప్పేది...దాంతో దూరంగా యే వస్తువు కనిపించినా కొంచెం దూరం కళ్ళు మూసుకుని మనసులో జామెట్రీ లెక్కలు వేసుకుని ఊహా పటం మ్యాప్ గీసుకుని, తొక్కకుండా, దాటకుండా, చూడకుండా అని అమ్మ చెప్పిన రూల్సు తూ చా తప్పకుండా పాటించేవాళ్ళం. ఇంక దార్లో ఎర్రగా పచ్చగా ఏం కనిపించినా భయమే...ఎవరిదో ఒక సారి ఎర్ర రుమాలు పడిపోయింది  రోడ్డు మీద..అప్పుడు  కుడా 'తొక్కకుండా, దాటకుండా, చూడకుండా' రూలుతో బాటు  మా జామెట్రీ పనికొచ్చింది మరి. అలా  ప్రాక్టిస్  అవ్వడం  వల్లనేనేమో, నేను  ఇప్పటికీ  నిద్రలో  ఎక్కడికయినా  నడిచి  వెళ్లి  మళ్ళీ  కరెక్టుగా  ఇంటికి ఒచ్చేస్తున్నానని  మా  ఇంట్లో  వాళ్ళు తిడుతుంటే ...ఇందేంటి  ఇంత  మంచి  విషయానికి  మెచ్చుకోరు ...నిజానికి   ఇంటర్ నేషనల్   లెవెల్  లో  ఉండాలి  నేను  అని  ఫీల్  అయ్యాను  కూడా.


ఇంకొద్ది రోజులవగానే సత్యా థియేటర్ వెనుక ఉన్న ఖాళీ మయిదానం లో తల లేని మొండెములు తిరుగుతున్నాయని వార్త.
అప్పట్లో ఊర్లోకి బస్సులు లేవు. మయిన్ రోడ్డు మీద బస్సు దిగి చింత చెట్ల కింద నించి నడిచి రావాల్సి వచ్చేది...సో అందరికీ భయమే. లేట్ రాత్రిళ్ళు ఇంక బస్సులు ఆపెస్కోవాల్సి వచ్చిందేమో RTC కి..ఒకళ్ళు చూసామంటే, ఇంకొకళ్ళు వాళ్ళని వెంటాడిందని చెప్పుకునేవారు...ఎవ్వరికీ మొహం కనిపించలేదుట గానీ పెద్ద పెద్ద గోళ్ళు చూసారుట.మొండెం డ్యాన్సు చేస్తూ వస్తుందిట వెంట .( మీరు అనుమానించ కండి...అప్పటికి ఇంకా  ప్రభు దేవ ముక్కాలా  డాన్సు రాలేదు )..ఎవ్వరు దొరికినా పట్టి రక్తం తాగేస్తుందని చెప్పుకున్నారు. (నోరు లేనిదే తాగటం ఏంటో ..పాపం మనం నమ్మేద్దాం లెండి ఈ సారికి) .  కొందరు నాస్తికులు మాత్రం ఇది దొంగల పనే అని పోలీసు స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చారు. కానీ ఈ కేసులో  పోలీసు స్టేషన్లొ పోలీసులు కూడా భయ పడి పోయారు. (వీళ్ళు భయపడ కూడదని సెక్షన్లు ఏమీ లేవుగా )మళ్ళీ మా ఊర్లో డిసిప్లిన్ తో పాటు 'ఓ స్త్రీ రేపు రా" రిపీటు....


యీ భయాలన్నిటితో పాటు...మా ఇంటి దగ్గరే పంచాయతీ ఆఫీసు. మా ఆండాళ్ వాళ్ళ నాన్న అక్కడ యేదో పని చేసేవారు...వాచ్మాన్ అనుకుంటా..(తెలుసుకునే అవసరం రాలేదు). ఎత్తైన పెద్ద హాల్కి రెండు వైపుల ఐదెసి మెట్లు. హాల్ (కచేరి)లో బోల్డు మంది పని చేసేవారు..హాల్ ఆనుకుని చిన్న గది(కొటీడు) . హాల్ వెనుక ఓపెన్ చావడి..పక్కన చిన్న కిచెన్(పోయ్యిల్లు) ..మా ఆండాళ్ వాళ్ళకి ఆ గది ,, వెనకున్న చావడి కిచెన్ ఇచ్చారు...రాత్రి పడుకొవడానికి మాత్రమే వాళ్ళు చిన్న గది వాడుకునేవారు. పగలు ఆఫీసు ఉన్నప్పుడు ఎవరూ  గది లోకి రాకూడదు. ఆండాళ్ వాళ్ళ అవ్వ  చావడి అంతా  అలికి నీటుగా ఉంచేది, స్కూల్ నించి వచ్చాక మేము అక్కడ గొడవ చెయ్యకుండా  ఆడుకునే వాళ్ళం. సాయంత్రాలు బయట మెట్ల మీద జారే ఆట ...ఆది వారాలు మాత్రం మాకు ఆ ఆఫీసంతా ఆట స్థలమే. తలుపులు తియ్యకూడదు ,లయిట్లు వెయ్యకూడదు కొంచెం చీకట్లోనే దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం...సరదాగా టయిపు మిషన్లని టక టక లాడించడం, టీచర్ల ఆట...ఆఫీసు ఆట అవీ ఆడుకునే వాళ్ళం కాబట్టి ఆ చీకటికి భయం వేసినా వెళ్ళే వాళ్ళం . ....కానీ అందరం గప్చుప్గా దాక్కున్నప్పుడు సడెన్గా  ఫ్యాక్స్   మిషను వింత శబ్దం చేసేది...చీకట్లో ఆ శబ్దం నాకు యేదొ దయ్యం కథలతో రిలేట్ అయ్యింది..... చూసారా అన్ని శబ్దాలూ ఫ్యాషన్ గా మారాయి కానీ నా దురదృష్టం కొద్దీ  ఫ్యాక్సు మిషన్లు ఇప్పటికి కూడా కీచుమని  అదే  శబ్దం చేస్తాయి..నవ్వుకోకండి కానీ ఇప్పటికి కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్యాక్సు వచ్చిందంటే మాత్రం నా గుండె గుభేల్... ....

ఇప్పుడు యీ పోస్టింగ్ రాస్తున్నప్పుడు..అక్కడ మా ఊర్లో ఉన్న ఫీలింగ్ వచ్చి...కొంచెం భయం తోను..కొంచెం ఇంటి వాళ్ళు హీట్ పెంచడం వల్లనూ చమటలు పడుతున్నాయి..

పోనీ ఇప్పుడు కెనడా కొచ్చేసానని సుఖంగా ఉన్నాననుకుంటున్నారా? హబ్బే, లేదండీ, ఆరు నెలల క్రితం సెయింట్ కాథరిన్స్ అనే ఊర్లో ఒక రేడియో టేషన్లో కొన్ని నెలల కోసం కొలువుకి కుదిరానా? చాలా  పెద్ద అందమయిన పురాతన భవనం ఇది. దీన్ని ముద్దుగా వైట్ హౌస్ అని పిలుచుకుంటారు...ఇది ఒక హాంటెడ్ హౌసుట. ఒక సామంత రాజు యీ భవనం లొ ఉండేవాడట. అతని పని మనిషి(బెట్టీ) కి అన్నిటి కంటే టాప్ ఫ్లోర్ లో అటక మీద టూ బెడ్ రూం అపార్ట్మెంట్ ఇచ్చారుట. ఆమె ఎలా చనిపోయిందో ఎవరికీ తెలియదు కానీ కుటుంబం తో సహా దయ్యాలయి పోయారుట అందరు .మిగిలిన దయ్యాలు ఎక్కడికి పోయాయో కానీ  ..  ఆమె దయ్యం మాత్రం ఈ భవనం లో తిరుగుతూ ఉంటుందని చెప్పుకుంటారు..రేడియో వాళ్ళు ఈ భవనం కొన్న కొత్తల్లో నయిట్ షిఫ్ట్ లొ జనాలు యెవ్వరు పని చెయ్యడానికి ఒప్పుకోలేదుట..ఇంకా మా జీ ఎం గారికి కూడా ఎవరో మెట్ల పై నుండి తోసేసినట్టు అనిపించిందిట..తన సొంత ఖర్చుతో ఎవరో పండితులని పిలిచి పూజలు అవీ చేయిన్చిందిట. 'ఆ ఖర్చులు  ఏ ఎక్కవుంట్లో వేసారు...దయ్యం ఖర్చులు అని రాసారా' అని నేను సరదాగా జీ ఏం ని అడిగా..అలా రాస్తే బాగుండదని నా సొంత ఖర్చు పెట్టి చేయించా అంటున్దావిడ. ప్రస్తుతం  నా ఆఫీసులో ఫయిలింగ్ కాబినెట్ అరలు కొంచెం లూసుగా ఉండి ఆటోమేటిగ్గా ఓపెన్ అవుతాయి ఒక్కొక్క సారి. ఆ సమయం లోఎవరయినా నా  ఆఫీసులో ఉంటె 'బెట్టీ గో అవే ' అని జోక్ చేస్తారు...ఇంక ఆఫీసులో కంప్యూటర్లు పని చెయ్యక పోయినా , తలుపులు గాలికి ధడేల్మని మూసుకున్నా , డెస్క్ మీద ఏమైనా ఒలికినా ..ఇది బెట్టీ పనే అని అనేస్తారంతా. నా ఆఫీసు ముందే  బెట్టీ అపార్త్మేంట్ అటక మీదకి మెట్లు. బెట్టీ గనక కిందికి దిగితే మొదట నా ఆఫీసే కనబడుతుంది. అందరు ఐదింటికల్లా వెళ్ళిపోతారు. నాకు చాలా సార్లు ఎనమిది వరకు పని ఉంటుంది. చుట్టూ కిటికీ లోంచి చిక్కటి చీకటి .ఇంకొక వైపు బెట్టీ కిందకి దిగుతుందేమో అని భయం. ఒక్కదాన్నీ ఈ ఫ్లోర్ లో పని చెయ్యాలి. బెస్మేన్టులో ఇద్దరు అన్నవున్సర్లు పని చేస్తారు ఎనమిది వరకు . అంతకు తప్ప ఎవ్వరు ఉండరు.  దానికి తోడూ ఈ ఫ్యాక్స్ మెషిను అప్పుడే కీచుమని అరుపులు. ఈ మధ్య క్లీనర్ని అప్పాయింటు చేసాము. పగలు అందరికీ ఇబ్బంది కదా సాయంత్రం వస్తావా అని అడిగాను ఇంటర్ వ్యూ చేస్తున్నప్పుడు( రీసన్ తెలుసుగా) ...ఆ పిల్లోడు సంతోషంగా పగలు కాలేజీకి వెళ్ళాలి సాయంత్రమయితే ఒకే అనేసాడు. రోజు  క్లీనర్ అబ్బాయిని కొంచెం నువ్వు  వెళ్ళేటప్పుడు చెప్పవా అనిబతిమాలుకుంటాను...ఆ పిల్లాడు చేసే చీపురు చప్పుళ్ళు , నీళ్ళ చప్పుళ్ళు, వాక్యుం చప్పుళ్ళు విని ధయిర్యం గా పని చేసుకుంటాను. ...ఆ పిల్లాడు వెళుతున్నానని చెప్పగానే, ఎంత పని ఉన్నా నేను కూడా బిల్డింగ్ లోంచి జంపు. (అయ్యో ఆత్మ హత్య కాదండీ ..తొందరగా బయట పడతానూ అని) . మా బెట్టీ అల్లరి రోజు రోజుకీ ఎక్కువయిపోతోంది. అంతెందుకు ఈ పోస్టు రాసానా, మొత్తం రాసాక సేవు చేసిన టపా మొత్తం ఎగిరి పోయింది. ఇది బెట్టీ పనే అని నాకు అనిపిస్తోంది..బెట్టీ నా జోలికి రావద్దంటే ఏమ్చేయ్యాలా అని ఆలోచిస్తుంటే మా ఊర్లో చెప్పిన ఉపాయం గుర్తొచ్చింది. మరి  నా ఆఫీస్ తలుపు మీద ' ఓ  స్త్రీ  రేపు రా' అని రాద్దామని డిసయిడు అయ్యా!  మరి బెట్టీ కి మన భాష అర్థమవుతున్దంటారా?

36 వ్యాఖ్యలు:

SHANKAR.S said...

ఇంత ధైర్యం గా దయ్యలకి భయపడగలుగుతున్నందుకు మీకు "పరమ వీర చక్ర" ఇచ్చేస్తున్నాం.
అన్నట్టు బెట్టీ ని అడిగానని చెప్పండి.

నీహారిక said...

1. మీకు ఇంత పెద్ద పెద్ద పోస్టులు రాయడానికి టైం ఎలా దొరుకుతుంది?
2. మీరు రచయిత్రా?
3, మీరు బాగా రాస్తారు.
4.మీ ఎన్నెల రామాయణం మా వారికి బాగా నచ్చింది.
5. మీరు ఏదైనా పత్రికలలో రాసారా?
6. రాసి ఉండకపోతే ఇకమీదట మీరు పత్రికల్లో వ్రాయవచ్చు కదా? మీ టాలెంట్ ఇక్కడ వేస్ట్ చెయ్యడం ఎందుకు?

kannaji e said...

హ హః వెన్నెల గారూ..భలే ..మరచి పోతున్న విషయాలు మళ్లీ గుర్తుకు తీసుకు వచ్చారు...ఒక సారి ఎలావచ్చిందో గుర్తులేదు గాని ..అన్ని వూళ్ళలోను ఒకటే రాతలు..ఆ స్త్రీని రేపు రమ్మని ...!అన్ని తలుపులు,గోడలు పైన పసుపు తో రాసిన వంకరి టింకరి అక్షరాలూ...మా వీధి చివర ప్రతి సంవత్సరం ఒక జాతర అయ్యేది..ఒక చెట్టు దాని కింద మా పేటలోని ఒక కుటుంబం వాళ్ళు ఎరేంజ్ చేసేవాళ్ళు అన్ని ఎరేంజ్మెంట్లు..కొన్ని సంవత్సరాలు బానే ఎంజాయ్ చేసాం కాని ఒక ఫ్రెండ్ ఒక సారి కొన్ని నిజాలు చెప్పాడు..ఆ చెట్టు ఉన్న ప్రదేశం లో ఒక ఆవిడ అగ్ని గుండం వేసుకొని అందులో దూకి చచ్చి పోయిందని..అప్పట్నించి ఆ చెట్టుని చూస్తే దడ పుట్టేది... ఇప్పుడు ఎలాగు మా వూళ్ళో లేను...అందు వల్ల ఇప్పుడు ధైర్యంగానే ఉన్నా..


http://kannajie.blogspot.com/
http://buzzitram.blogspot.com/
http://4rfactor.blogspot.com/

Anonymous said...

మీకు భారత రత్న కావాలో , పద్మ భూషణ్ కావాలో
మొదట నిర్ణయించుకోండి.మీకు ఆ బిరుదు నేను ఇచ్చేస్తాను :)

మాలా కుమార్ said...

ఈ ఓ స్త్రీ రేపురా , పచ్చగాజులు వగైరా అన్నీ విన్నాను . కాని ఇంత వివరం గా తెలీదు :)
దయ్యం ఫొటోలతో సహా పెట్టి మరీ దడిపించాలా ?

మనసు పలికే said...

హహ్హహ్హ.. ఎన్నెల గారు, మీ భయం ఝల్లు సంగతేమో కానీ, నాకు మాత్రం కితకితలు పెట్టారు మీ టపాతో:)) మీకు పద్మ విభూషణో, భారత రత్నో ఇచ్చెయ్యడానికి నా తరపు వోటు వేసేస్తున్నాను. మీ నిస్వార్థ సేవలకి ఇవే నా ధన్యవాదాలు, కృతఙ్ఞతలు, అభినందనలు.. అన్నీనూ..
>>బెట్టీ గో అవే
హహ్హహ్హా. నాకు తెలిసి, దయ్యాలకి కూడా తెలివితేటలు ఎక్కువయ్యిపోయాయండీ.. "ఓ స్త్రీ రేపు రా" అంటే బెట్టీ కి కూడా అర్థమైపోతుంది, రావొద్దని చెప్పడానికి ఇలా రాస్తున్నారని.జనరేషన్ గ్యాప్. కాబట్టి నా మాట విని, "బెట్టీ, కమిన్ డియర్" అని పెట్టెయ్యండి ;)ఇదేదో నన్ను హతమార్చడానికి ప్రయత్నం అని భయపడిపోయి పారిపోతుంది..:)))

శివ చెరువు said...

Very Nice narration..

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఈ హ్హిఃహిహి ఓహ్హూహ్హూ రేపు వచ్చి కామెంటు పెట్టేస్తా.

తృష్ణ said...

అలాగన్నారనే కామెంటడానికి ఇవాళ వచ్చా..:):)

అశోక్ పాపాయి said...

అమ్మో మాతో పంచుకుంటే పంచుకున్నారు కాని అప్పుడే నవ్వించి ఇప్పుడు ఇలా భలే భయపెడుతున్నారు:))

ఇందు said...

హ్హహ్హహ్హా! ఎన్నెలగారూ...మీరు సూపరో సూపర్! ఎందుకో మీకు మెయిల్ కొడతాగా! ;)

ఇక మీ పోస్ట్ సంగతికి వస్తే....నన్ను బాగా భయపెట్టేసారు...సరిగ్గ నిన్న రాత్రి పడుకోబొయే ముందు ఒకసారి మీ బ్లాగ్లోకి తొంగి చూసి..బాబొయ్ అని దడుచుకుని పారిపోయా! :)) నాకసలే దయ్యలంటే స్పెషల్ ఇంటరెస్ట్ కదా ;)

ఇంకా మీ పోస్ట్లో నాకు బెట్టీ భలే నచ్చేసింది.దాని ముద్దు ముద్దు చేష్టలు కూడా....నాలాగా అల్లరిదయ్యం అనుకుంటా ;) మీకు బెట్టీ కనపడితే..ఇటు పక్కకి రావొద్దని చెప్పండే!... ;)

ఇక్కడ ఎవరెవరో...మీకు పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చేస్తున్నరట...నేను మీకు...'బెట్టీ చక్ర ' అని బిరుదు ఇస్తా! ఎలా ఉంది ;)

Ennela said...

నాకు బిరుదులివ్వడానికి ధయిర్యం చేసిన శంకీ గారికీ, అను గారికీ, మనసు పలికే గారికీ ఇందు గారికీ భయాందోళనలతో కృతజ్ఞతలు...మరి బిరుదు ప్రదానం అవీ ఎప్పుడొ చెబితే కాస్త జయ గారినడిగి మూడు/నాలుగు పట్టు చీరలు అరువు తెచ్చుకుంటాను...(జయ గారి బీరువాలో ఎక్కువయి పోయాయని చెప్పారు లెండి)

శంకీ గారూ, ఇప్పటి నుండీ నా పేరుకి ముందు పరమ వీర చక్ర అని పెట్టేసుకోవచ్చా?

కన్నాజీ గారికి కృతజ్ఞతలు..అవునా...మీ ఊళ్ళొ కూడానా!.ఆ చెట్టు ఇప్పుడుందా? పాపం గుర్తు చేసి భయపెట్టానా?సారీ అండీ...

అను గారూ, రెండిటిలో ఏది బెటరో తెలియ లేదండీ..పోనీ రెండూ ఇచ్చెయ్య కూడదూ..

మాలా గారు, కృతజ్ఞతలండీ భయపడ్డందుకూ...యీ సారి మా ఊరెళితే..ఇక్కడ పొలీస్ స్టేషనుందీ...ఇక్కడ పంచాయతీ ఆఫీసుందీ, ఇక్కడ ఎన్నెల ఆడుకుందీ అని తెలిసిపోతాయి...మరి జగన్నాధ స్వామి గుడికెళ్ళడం మరచి పోకండే...మరి ఉమక్కా వాళ్ళు ఉండే స్తలం తెలియాలిగా....

మనసు పలికే గారు, మీ మాట వినీ యీ రోజు...'బెట్టీ కమిన్ డియర్ ...యువర్ లవింగ్లీ ఎన్నెలా' అని తాటికాయంత అక్షరాలతో ప్రింట్ తీసి తలుపు మీద పెట్టేసాను...కాని మీరు చెప్పిన సలహాకి కొంచెం ఎక్కువ రియాక్టు అయ్యా కదా ..ఆ చివరి పదాలు చూసి వచ్చేస్తుందెమోనని భయం గా ఉందండీ!రేపు వెళ్ళగానే కట్ చేసేస్తా...

శివ గారు...కృతజ్ఞతలండీ..మీకు నచ్చినందుకు నేను చాల హ్యాప్పీ

సుబ్రహ్మణ్యం గారు, మాట మీద ఉండాలి మరి...అసలే బెట్టీ ఫ్రెండుని నేను...కృతజ్ఞతలండీ

తృష్ణ గారు...చ చ మీకు కాదండీ...మీరు యీ రోజే, ఇప్పుడే, యీ నిముషమే, యీ క్షణమే రావచ్చు....అమ్మో మిమ్మల్ని అంత మాట అనడమే...కళ్ళు పోతాయి నాకు..కృతజ్ఞతలండీ.

అశోక్ గారు కృతజ్ఞతలండీ, మరీ మొదట్లోనే భయపెట్టేస్తే, మీరు పూర్తిగా కథ చదవరేమొనని..కొంచెం జోకా..అదీ సంగతి...

ఇందు గారూ, కృతజ్ఞతలండీ, మీకు స్పెషల్ ఇంటెరెస్టు అని చెప్పి మళ్ళీ అటు కేసి రావద్దని చెపితే ఎలాగండీ....మీ ఇంటెరెస్టు తెలుసుకుని వచ్చేస్తుంది మా బెట్టీ..మనసు పలికే గారి కామెంటు చూసారుగా...'రమ్మంటె పొమ్మనిలే, పొమ్మంటే రమ్మనిలే..బెట్టి గారి భాషలో అర్థాలే వేరులే'..అదీ సంగతి మరి మీ ఇష్టం..

నీహారిక గారు కృతజ్ఞతలండీ...మీ పేరు బాగుంది...
1. మొన్నటి దాకా చదువుతో బిజీ అండీ..మళ్ళీ మొదలు పెట్టెయ్యాలి...యీ కొంచెం ఖాళీలో ఇలా బ్లాగుతున్ననన్నమాట
2.అమ్మొ, అంత పెద్ద పదమే!..లేదండీ...నేను కాదు
3. మీకు నచ్చినందుకు...నేను చాలా హ్యాప్పీ..
4. రామాయణమ్మ్ నచ్చినందుకు మీ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలండీ
5. యెప్పుడు ఎక్కడా వ్రాయలేదండీ
6. ఇక్కడయితే ఏవీ చెత్త బుట్టలోకి వెళ్ళవుగా..దూరం గా ఉన్న కుటుంబ సభ్యులు, ఇంకా మన మిత్రులు చదువుతారు కదా..అందుకన్న మాట..
మరి మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇచ్చానా? పాస్ మార్కులు వేసారా లేదా?

Ennela said...

అరే, ఇలా ఒక్క సారు పబ్లిష్ అని నొక్కితే మూడు సార్లు పడిందేంటబ్బా..ఇది బెట్టీ పనా అందామంటే, నేను ఆఫీసులో లేను...పోనీ డిలీట్ చేద్దామంటే..ఎలాగో తెలీయదు..
బేట్టీ హెల్ప్ మీ.ఈ...ఈ..ఈ..ఈ...ఈ..ఈ ..

Anonymous said...

అలాగే .మీరు జయ గారి దగ్గర్నుంచి చీరలు తీసుకుని వచ్చేటప్పటికి లేట్ అవుతుందని ఇలా మీ బ్లాగ్ లోనే రెండు బిరుదులు ఇచ్చేశాను.పుచ్చుకోండి.
భారత రత్న ,పద్మ భూషణ్ ఎన్నెల గారు.

Ennela said...

అను గారు, అంత ఈసీగా ఇచ్చేసి అలా చేతులు దులిపేసుకుంటే ఎలా? జనాలుండాలీ చప్పట్లుండాలీ, స్పీచులుండాలీ, శాలువాలు కప్పాలీ, దండలెయ్యాలీ...ప్చ్చ్ ప్చ్చ్..ఇదేం నాకు నచ్చలా.

నీహారిక said...

మీరు బ్లొగర్ లోకి వెళ్ళాక , పోస్టు దగ్గరకి వచ్చి కమెంట్స్ చూస్తే అక్కడ ఒక కాన్ లాగా కనిపిస్తుంది దానిని నొక్కి మీకు కావలిసిన కమెంట్ ని డెలిట్ చేయండి.

Ennela said...

Thanks neeharika gaaru..mee blog lo chaala saarlu comments pettaanu kaani publish avakundaa bounce ayyaayi....endukani?

శిశిర said...

హహ.. మీకు పరమ వీర చక్రే కన్ఫర్మ్ అండి. :) బాగా రాస్రారు మీరు. ఇంతకీ ఆ అమ్మాయి అలా ఎందుకు చేసిందో పాపం.

Anonymous said...

ఎన్నెల గారూ,
ఈసారికి ఇలా కానిచ్చేయ్యండి.రెండు బిరుదులతోనే సరిపెట్టుకుంటారా? ఇంకోసారి ఇంకా కొన్ని కొత్త బిరుదులతో ఘనంగా సన్మానం చేస్తాం.

Anonymous said...

--

ఆ.సౌమ్య said...

హహహ్హ ఈ ఓ స్త్రీ ప్రేపు రా"...దావానలంగా ఆంధ్ర అంతటా వ్యాపించేసింది అనుకుంటా. నేను ఇది మొట్టమొదటిసారిగా విజయవాడలో చూసాను. మేము సెలవులకి మా మామయ్య ఇంటికి విజయవాడ వెళ్ళినప్పుడు అన్ని గోడల మీద, ఇంటి తలుపుల మీద ఇదే రాసి ఉంది. ఏమిటబ్బా అని ఆరా తీస్తే బెజవాడలో దెయ్యం తిరుగుతున్నది అని చెప్పారు. ఓ వారం తరువాత ఇంటికొచ్చేసాం. విజయనగరంలో అడుగు పెట్టగానే మొదట ఇదే కనిపించింది...మా ఊళ్ళో కూడా అన్ని గోడల మీద ఇవే రాతలు. నాకసలే చిన్నప్పుడు దెయ్యాలంటే చచ్చేంత భయం. సాయంత్రం 7.00 దాటాక గుమ్మం దాటి బయటికొచ్చేదాన్ని కాదు.

మీ చిన్నతనం అంటున్నారు, నా చిన్నతనంలో కూడా చూసాను. మీ చిన్నతనం నా చిన్నతనం ఒకటి కావని నా అనుమానం..కాదు నమ్మకం ( అంటే మీకన్నా చిన్నదాన్నని నమ్మకం అన్నమాట). ఓ పక్కేమో మాల గారు కూడా ఇవన్నీ చూసినట్టు చెబుతున్నారు. ....అంటే ఈ రాతలు ఎన్ని సంవత్సరాలుగా ఆంధ్రలో రాజ్యమేలాయో కదా!

kiran said...

అమ్మో..ధైర్యంగా బానే రాసారు..!! :ద
నది జస్ట్ ౨ నెలల కింద ఇలాంటి పరిస్థతి...
మా వాళ్ళు పిరికి దాన అనే వాళ్ళు...వాళ్ళకేం తెల్సు మనం ఎన్ని రకాలు గ ఊహిన్హ్కుకున్తమొ.. :ప
నాకు బాగా నచేసింది..మీ educated దయ్యం... :)...
బెట్టి ని రేపు అడిగాను అని చెప్పండి ఎన్నెల గారు..:)
ఆఫీసు లో నుండి జుంప్...హహ్హహః :D

మంచు said...

:-) నేను చాలా స్టోరీలు విన్నాను... కొన్ని పుట్టించాను :-) మీరు భలే రాసేస్తారండి... tak tak mani

Ennela said...

అనూ గారూ, మీరు కప్పబోయే శాలువాల్లో ఒకటిన్నీ, పూలదండలు మొత్తమున్నూ, జయ గారికి ప్రామిస్ చేసేసాను, చీరలిస్తున్నందుకు బదులుగా...ఏంచేస్తాం...యీ సారికిలా సరిపెట్టుకుంటా..ప్చ్ ప్చ్

శిశిర గారు, కృతజ్ఞతలండీ, మీరూ ఇచ్చేస్తారా..మీరయినా మంచి మనసు చేసుకుని, పూల దండలూ, శాలువాలు, చప్పట్ల మధ్య ప్రదానం చేస్తే బాగుణ్ణూ యీ బిరుదుని..

సౌమ్య గారు , "మీ చిన్నతనం అంటున్నారు, నా చిన్నతనంలో కూడా చూసాను. మీ చిన్నతనం నా చిన్నతనం ఒకటి కావని నా అనుమానం..కాదు నమ్మకం (అంటే మీకన్నా చిన్నదాన్నని నమ్మకం అన్నమాట)"హన్నన్నా! హెంత మాటనేసారూ? మా జానీ లాగే నేనూ ఇక్కడ వన వాసం చేసీ చేసీ ఇలా అయిపోయాను కానీ నేనూ చిన్నదాన్నే తెలుసా...ఎక్కడా మొన్నే18 వెళ్ళి 19వచ్చాయి..ఇది నిజ్జం..ప్రామిస్ .(2తోనొ మూడు తోనొ నాలుగు తోనొ..గుణించుకుంటానంటే మీ ఇష్టం)కానీ ..మీ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు క్షమించాలి అధ్యక్షా.హహహ్హ కృతజ్ఞతలండీ.

కిరణ్ గారూ, కృతజ్ఞతలు..మీరు ఇక్కడ బెట్టీతో కలిసి నాలుగు రోజులుంటే, ఇంక అస్సలు భయమెయ్యదు..నన్ను నమ్మండి...నిన్న మీరు అడిగినట్టు చెప్పమన్నానని చెప్పానా? ఎప్పుడు తీసుకొస్తావూ కిరణ్ గారిని మనతో ఉండడానికీ అని అడిగింది..యేంటో నండీ...యీ పోస్ట్ మ్యాన్ పనులు చెయ్యలేక యీ సారి నిజ్జంగానే భవనం లోంచి జంపు చెయ్యాలనిపిస్తోంది....

Ennela said...

శిశిర గారు, తెలీలేదండీ, పాపం ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు..చిన్నపిల్ల కదా,అమ్మ కూడా లేదు..తనే పెద్దరికంగా ఉండెది... ఏదో చిన్న రీసన్ కే హర్ట్ అయ్యిందేమో పాపం...ఎవరితోనయినా ఇదీ విషయం అని చెప్పి ఉంటే బాగుండేది..ఇంత దూరం రాకుండా సలహా అయినా ఇచ్చేవాళ్ళేమో! అఫ్ఫట్లో చిన్న వాటికే భయపడిపోయేవారు అమ్మాయిలు...యీ అమ్మాయినీ, ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక బావిలో దూకి చనిపోయిన ఇంకొక అమ్మయినీ తలుచుకుంటే ఎంత బాధేస్తుందో....

Ennela said...

మంచు గారు, కృతజ్ఞతలండీ...మా బెట్టీ ఇక్కడ టిక్ టిక్ మని ఆఫీసు తలుపు కొట్టడం వల్ల వచ్చిన భయం తో నేను అలా టక టక మని వ్రాసానన్నమాట,,సో, ద క్రెడిట్ గోస్ టు బెట్టీ

ఇందు said...

ఎన్నెలగారూ....బెట్టీని రవొద్దని చెప్పండీ...నాకసలె ఇలాంటి దయ్యలంటే బయ్యం.ఎంటి ఏదో ప్రాబ్లం అన్నారు..బెట్టీ సాల్వ్ చేసిందా మరి?? ఎడ్యుకెటెడ్ యే కాదు...టెక్నికల్ సపోర్ట్ దయ్యంలా ఉందే! హ్హహ్హహ్హా! ఇంతకీ మీ ఆఫీస్ గోడమీద రాసారా...'ఓ బెట్టీ రేపు రా' అని??మీకు 'బెట్టి చక్ర ' ఎక్కడకొచ్చి ప్రధానం చేయను??? నయగారలో పెటుకుందం సన్మాన సభ :) వాకే??!!

Ennela said...

ఇందు గారు, అబ్బా, మళ్ళీ అర్థం చేసుకోవట్లేదు మీరు....రమ్మని చెప్పాలండీ, అప్పుడు రాదుట...మనసు పలికే గారు చెప్పారు కదా మనకీ?

ఫాంటు, పార గ్రాఫులు ప్రాబ్లం అండీ, పాపం బెట్టీని అనవసరంగా ట్రబుల్ చెయ్యడం ఎందుకు అని నేనే ఏదో మ్యానేజీ చేస్తున్నా...ఆయ్

ఆయ్ అవునండీ...."బెట్టీ కమిన్ డియర్ "అని మాత్రమే ఉంచి ..."యువర్ లవింగ్ ఎన్నెల" అని వ్రాసి కట్ చేసేసాను.

అబ్బో, నయగరా లోనా..నేను రెడీ....సకుంటుంబం గా, బ్లాగ్మిస్త్రులందరినీ కూడా పిలుచుకొస్తానేం ..మరి బ్యాంకెట్ హాల్ బుక్ చేసెయ్యండి..మళ్ళీ దొరకవు..

మంచు said...

నయాగర లొ అయితే నాకు ఒకే... రైంబొ బ్రిడ్జ్ మీద పెట్టుకుందాం...:-)

sunita said...

అబ్బ! చూసినవే ఎన్నిసార్లు చూడమంటారు. నయగరా కెనడా వైనుండీ అమెరికావైపునుండీ కూడా చూసి చూసి విరక్తి వచ్చేసింది. ప్లేసు సారీ వేదిక మార్చండి. జనాలెవ్వరూ లేకుండా సన్మాన సభ పెడతారా? ఏమిటీ? మరీ చొద్యంగా!

ramya said...

Very Nice narration..

ఓ స్త్రీ రేపు రా ఇది నేనూ చూశాను. స్టోరీ ఏమిటో కనుక్కోలేదుగాని దెయ్యం తిరుగుతుందని దానికోసమే రాశారనీ మాత్రం చెప్పుకునేవారు. చేతి గుర్తులూ లాంటివీ కూడా వేసేవారు కదా.
ఎన్నెల గారు బాగా రాస్తున్నారు. మీ బ్లాగు మొత్తం తీరిగ్గా చదవాలి. రామాయణం ఎప్పటికి చదువుతానో చెప్పలేను :) చాలా పొడవాటి టపాలు కదా :(

ఇందు said...

ఓహ్! చూసారా! బెట్టీ చాతుర్యం! నా కాన్సంట్రెషన్ అంతా బెట్టీ మీదే! అందుకే మనసుపలికే(అపర్ణ)గారి కామెంట్ చూడలేదు....ఏంటో...అంతా బెట్టీ మాయ :))) చిలిపి దయ్యం కదా! చెప్పండీ...మంచుగారికి కూడా నయాగారా ఓకే అట.మీరు కూడా ఓకే అనేస్తే...నేను డెట్రాయిట్ బ్లాగర్లందరినీ కలుపుకుని తీసుకొచ్చేస్తా!

'రైంబో బ్రిడ్జ్ మీద..ఎన్నెలమ్మకి సత్కారం..ఇదే అందరికీ ఆహ్వానం'

ఎలా ఉంది కాప్షన్ ;)???

ఇందు said...

సునీత గారు..అందుకేనండీ....అమెరికాకి..కెనడాకి మధ్యలో రైంబో బ్రిడ్జ్ మీద పెడదాం.వెరైటీగా ఉంటుంది.అబ్బె లేదండీ....అటు వెస్ట్ నించి జనాల్ని లారీల్లో..బస్సుల్లొ...సారి...అదే ఏరొప్లెనలొ తోలుకు వచ్చే ప్రొగ్రాం మంచుగారిది..ఇక ఈస్టు...సౌతు...కెనడా జనాల్ని పటుకొచ్చే ప్రొగ్రాం నాది.అందరి మీటిన్ ప్లేస్...రైంబో బ్రిడ్జ్ :)) ఏమంటారు? ;)

Ennela said...

రమ్య గారు, నా బ్లాగ్ కి స్వాగతం అండీ, కృతజ్ఞతలు.
సారీ అండీ, ఏదయిన టాపిక్ వస్తే మొత్తం చెప్పెయ్యాలని ఒక తిక్క ఫీలింగ్...తగ్గించాలని ప్రయత్నం చేసి..ఒక లయిన్ కట్ చేసి రెందు లయిన్లు పెడుతుంటాను..హాహహ్..అందుకని పెద్దవి అయిపోతున్నాయి...చిన్నప్పుడు ప్రెసిస్ రయిటింగులో కూడ ఎప్పుడూ సున్నాలొచ్చెవి..మెల్లిగా తగ్గించడం అలవాటు చేసుకుంటాను...

మంచు గారు, కృతజ్ఞతలండీ, మీరు ఎరక్క పోయి, ఇరుక్కుపోయారు పాపం, మీ మీద అందరినీ తొల్కొచ్చే పెద్ద భాద్యత పడిపోయింది పాపం.

సునీత గారు,నా బ్లాగ్ కి స్వాగతం అండీ, కృతజ్ఞతలు. అయ్యో, మరి ఎలాగా? జనాలు లేకపోతే నేనొప్పుకోనంతే

ఇందు గారూ, మరి లారీల్లొ బస్సుల్లో (సారీ విమానాల్లో ) వచ్చిన వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు అవీ ఎలా? అయినా నాకేందుకు లెండి, మీరు కదా అవన్నీ చూసుకోవాలీ!

జయ said...

అమ్మో నేను ఈ పోస్ట్ మిస్ అయ్యానండి. ఇక్కడ కూడా ఇంత కథ జరిగిందన్నమాట. ఇప్పుడర్ధమయ్యింది. ఆ బిరుదుల పేర్లన్నీ చెప్పి నన్నెందుకు చీరలడిగారో. అయ్యయ్యో చాలా మొద్దు బుర్రే నాది. నేను కూడా ఆ బెట్టీ దయ్యాన్ని చూస్తే కాని నా బుర్ర షార్ప్ కాదని ఇంత లేట్ గా తెలుసుకున్నాను.:) నేను చా ఆ ఆ ఆ లా పెద్ద పార్టీ యే మిస్ అయ్యాను:(

Ennela said...

జయ గారు, మీరు చదివేసారు అనుకున్నా ఇక్కడి విషయాలన్నీ....మీరు చాలా షార్ప్ అండీ...అన్నీ సందర్భానుసారం గానే బదులిచ్చారు..నాకు అస్సలు అనుమానం రాలేదు..మీరు చదవలేదని...అయినా మీరు బెట్టీని ఒక సారి కలవాల్సిందే...కదండీ మీకూ నచ్చేసింది కదా? నాకు అక్కడ కాంట్రాక్టు అయిపోయిందండీ...బెట్టీ మీద ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా?
పార్టీదేముందండీ మళ్ళీ చేసుకుందాం.