అందరిలో మావయ్య

Monday, December 27, 2010

చలి గారి రివ్వున వీస్తోంది. ఆటోమేటిక్ మాల్ తలుపులు వచ్చేపోయే వాళ్ళ అలికిడి  తగలగానే తెరుచుకుంటున్నాయి. అలా తలుపులు తెరుచుకున్నప్పుడల్లా చలికి ప్రాణాలు కొడగడుతున్నాయి.  ఇదొక పాత మాల్. హీటింగ్ సిస్టం సరిగా పని చేయదు."ఈ మాల్ లో చలికి గడ్డ కట్టేస్తున్నాను బాబోయ్ "అని చెప్పాను బాసాసురిడితో. చిన్న హీటర్ ఇస్తాడేమో అని నాకు 'చిన్ని చిన్ని ఆశ '.'ఇంకొక లేయర్ క్లోత్స్ వేసుకో అంటాడు'. ఇప్పటికే పెద్ద సయిజు గంగిరెద్దులా వేసుకుంటున్నాను. నాకు అర గజం ముందు  గజం వెనక నా దుప్పట్లు రాజసంగా నడుస్తుంటాయి. ఇంకా 'అమ్మగారికి దండం బెట్టు, అయ్యగారికి దండం బెట్టు' సీన్ వదిలేసి   'నీ  ఆశ, అడియాసా ...లలల ...లలల ...లంబాడోళ్ళ రామదాసా' అని అర్థం అయిపోయి అడగటం మానేసాను. 'నీకు ఎలా డ్రెస్ చేసుకోవాలో అర్థం అయిపొయింది, అందుకే చలి అని కంప్లయింట్ చెయ్యట్లేదు నువ్వు, వెరీ గుడ్ 'అని నవ్వుతు అంటుంటాడు.  ఒక వెర్రి నవ్వు విసురుతుంటాను, సమాధానంగా .

చయినీస్ షాప్ ఉండటంతో ఈ మాల్ రద్దీగా ఉంటుంది.  ఈ చయినా మార్కెట్ లో దొరకని వస్తువంటూ ఉండదు.ఇదే మాల్ లో ఒక శ్రీ లంక వాళ్ళ బట్టల కొట్టు, డ్రయివర్ లయిసేన్స్ ఇస్స్యు ఆఫీసు, ఇంకా కొత్తగా వచ్చిన వాళ్లకి సహాయం చేసే కమ్మ్యునిటి సెంటరు , రెండు రెస్టారెంట్లు , రెండు బార్బర్ షాపులు, ఒక డాలర్  స్టోరు ఉన్నాయి....అందువలన మాల్ చిన్నదయినా ఎప్పుడు బిజీగా ఉంటుంది. అందుకే మా బాస్ ఇక్కడ ఈ టయిములో కొంత స్థలం అద్దెకి తీసుకుని క్యుబికాల్ నిర్మించి ఆఫీస్ సెటప్ చేస్తారు.

ఇది టాక్స్ సమయం. ప్రతి ఒక్కరు ఇన్ కం టాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చెయ్యాలి. ప్రయివేటు సంస్థలు ఈ మూడు నెలలు ఇలా రద్దీగా ఉన్న స్థలాల్లో టెంపరరీ ఆఫీసులు పెట్టి జనాల దగ్గర ఫీజు వసూలు చేసి టాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసి పెడతారు. 

ఇది సీసనల్ వర్కు. ఇప్పటి వరకు నెల రోజులు గా హెడ్ ఆఫీసులోనే పని.
బాస్ దగ్గర పనిచేసే పదిహేను  మందీ  పర్మనెంటు ఎంప్లాయీస్ సంవత్సరం పొడుగునా హెడ్ ఆఫీసులో పని చేసినా ఈ టయిములో మాత్రం బాస్ సెట్ అప్ చేసే పదిహేను టెంపరరీ ఆఫీసుల్లో ఏదో ఒక చోట పని చెయ్యాలి. టాక్స్ సీసన్ స్టార్ట్ అయ్యే రెండు నెలల ముందు ఒక కోర్స్ పెట్టి, టెంపొరరీగా చాలామందిని మూడు నెలల కోసం అపాయింటు చేసుకుంటారు.   మొదటి సంవత్సరం హెడ్ ఆఫీస్లోనే పని .  కానీ పర్మనెంటు ఎంప్లాయీ ఒకతను సడెన్ గా మానేయ్యడంతో పని బాగా అలవాటయిందని  ఒక్క వారం క్రితం నన్ను  మొదటి సారి ఇక్కడికి పంపారు.

కొత్త రూటు.  మూడు బస్సులు మారి ఎనమిది కల్లా రావడం కష్టంగానే ఉంది.  రాత్రి  తేలిక పాటి మంచు జల్లులతో మొదలయి మంచు  వాన  పెద్దదయింది. అన్నిచోట్లా మోకాళ్ళ లోతు  మంచు. సయిడు వాక్స్ మాత్రం వీలయిననంత త్వరగా క్లియర్  చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. పొడి మంచులో నడవడం కొంచెం ఫర్వాలేదు. మంచు గట్టిపడిపోయిగ్లాస్ లా తయారయినప్పుడు మాత్రం చాలా జారుతూ ఉంటుంది. అంత చలిలో నెమ్మదిగా నడవాల్సి వస్తుంది, గడ్డ కట్టేస్తూ .  ఇంకా కెనడా వచ్చి  మూడు నెలలు అయింది అంతే. ఇదే మొదటి జాబ్. ఇంకా చలికి అలవాటు పడలేదు. ఉదయం ఎనమిది నుండి రాత్రి ఎనమిది వరకు పని చెయ్యాలి కానీ ఒకొక్కసారి తొమ్మిది  గంటల వరకు  పని చెయ్యాలి. 'అధికస్య అధికం ఫలం' అని ఎన్ని గంటలయినా పని చెయ్యడానికి రెడీ, కానీ చలి,  చలి చలి.....క్లయింట్లు వస్తు ఉంటె  సమయం గడిచిపోతుంది చలీ పులీ తెలియకుండా. ఎవరు లేకపోతె మాత్రం 'నా తరమా భవ సాగర మీదను నలిన దళేక్షణ రామా' అనుకుంటూనే చలి సాగరాన్ని రాత్రి తొమ్మిది గంటల వరకు ఈదేయ్యాలి.

టాక్స్ చెయ్యడం,టాక్స్ తగ్గడానికి కొన్ని సలహాలివ్వడం, బిల్ చెయ్యడం, ఫోను కాల్స్ అటెండ్ చెయ్యడం , సాయంత్రం డెబిట్/క్రెడిట్ కార్డ్లను క్లోసు  చెయ్యడం, బ్యాంకులో క్యాష్ డిపాసిట్ చెయ్యడం , అకౌంట్ రికన్సయిల్ చెయ్యడం, కాష్ సరిచూడడం, లాస్ట్ అండ్ ఫైనల్ హెడ్ ఆఫీసుకి రిపోర్ట్ పంపడం ఇదీ పూర్తి దినచర్య...

మొదట  భయపడ్డాను కానీ ఇక్కడి వాళ్ళు  చాలా సరదాగా ఉంటారు. ఇంటిదగ్గర ఎవరూ వినేవారు లేకపోవడం వల్లనేమొ చాల మంది బాగా కబుర్లు చెపుతారు.ఆ కబుర్లలో కనీసం ఒక్కసారయినా "నేను నేటి మహిళను"  పయిన డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ బొట్టు పెట్టుకునే వారిని ఎవరినయినా శ్రీ లంకన్లని అనేసుకుంటారు , బొట్టుపెట్టుకుని కనిపించేది ఎక్కువగా వాళ్ళే మరి . "కాదు బాబూ , భారత వర్షే, భారత ఖండే, మేరోర్ దక్షిణ దిగ్భాగే, గంగా గోదావరి మధ్య ప్రదేసే, శ్రీ శైలస్య  ఈశాన్య  దిగ్భాగే, నేను నా ఆంద్ర ప్రదేశం వెరసి పవిత్ర భారత దేశం...."అని చెప్పుకునే లోపు ,  పనిలో పనిగా  'సింధూరం-దాని ప్రశస్తి " మీద కూడా ఒక క్లాసు వేసేసుకునే అవసరం  వస్తుంది లేకపోతె, నేనే తెప్పించుకుంటాను....
ఇక్కడ  అందరికీ ప్రతి పే చెక్ లోంచీ నిర్నీతమయిన మొత్తంలో టాక్స్ కట్ చేసి ఎంప్లాయర్ గవర్నమెంటుకి కట్టేస్తాడు.  సంవత్సరం చివర లెక్కలు కట్టి, ఎక్కువ కట్ చేస్తే తిరిగి ఇయ్యడం, తక్కువ కట్ చేస్తే కట్టించుకోవడం జరుగుతుంది. రిఫండ్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాప్పీగా వెళతారు. తిరిగి డబ్బు కట్టాల్సిన వాళ్ళను కూడా నవ్వుతు పంపించడం బానే అలవాటయ్యింది. రిఫండ్ రాలేదుగా ఫీజు కట్టక్కర లేదా అని జోక్ చేస్తారు.  సారీ సార్ నా సొంత కంపెనీ అయ్యుంటే మీకు ఫీజు చార్జీ చేసేదాన్ని కాదు అంటాన్నేను.   చాలా మంది వర్క్ అయిపోయాక సాయంత్రం వస్తారు టాక్స్ రిటర్న్స్ చెయ్యడానికి. భోజనాలు అవీ కానిచ్చి  చివరి నిముషంలో వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ. మళ్ళీ రండి అంటే, బిసినేస్స్ పోయినట్టే. అందుకని టయిము అయిపోయే సమయానికి వచ్చినా టాక్స్ చెయ్యాలి. అలాంటప్పుడు రిపోర్టులకి  చాలా హడావిడి అయిపోతుంది. పైగా  తొమ్మిది గంటలకి మాల్ క్లోస్ . 


ఒక బిజీ  సాయంత్రం చివరి నిముషంలో వచ్చారు మిస్టర్ స్కేమ్బారిస్. డాకుమెంట్స్ అన్నీ నా చేతికిస్తూ, మీరు చేస్తూ ఉండండి , పక్క షాప్లో చిన్న పని ఉంది , పది నిముషాల్లో  వచ్చేస్తాను అన్నారు. నా టెన్షన్ నాది. ప్రతి అరగంటకి ఒక బస్ ఉంది... ఒకటి మిస్ అవుతే ఇంటికి వెళ్ళాల్సిన  మూడు బస్లూ మిస్ అవుతాయి...కానీ ఏమీ చెయ్యలేం. అలాగే సార్, పదిహేను నిమిషాల్లో ఇక్కడుంటే చాలు, మరీ లేట్ అవకుండా అన్నాన్నేను. ఓ శూర్ , త్యాంక్ యు అంటూ వెళ్ళాడు ఆయన. పేపర్లన్నీ పొందిగ్గా అరేంజ్ చేసి ఉన్నాయి. అదృష్టం కొద్దీ ఇతను పాత క్లాయింటే. పేరు కొట్టగానే డీటెయిల్స్ అన్నీ వచ్చాయి...బతికానురా దేవుడా....చాలా టయిము కలిసొచ్చిందని అనుకుంటూ కంప్లీట్ చేసే సమయానికి స్కేమ్బారిస్ గారు వచ్చేసారు. అయిపోయిందండీ, మీరు లేట్ అవుతారేమో అని భయపడ్డాను అన్నాను...నో నో మీకు లేట్ అవ్వనివ్వనుగా అని ఎదురు ఖుర్చీలో కూచున్నారు రిసల్ట్స్ కోసం చూస్తున్నట్టు. మీరు లకీ అండీ 2,112 డాలర్స్ రిఫండ్ వచ్చ్సింది అన్నాన్నేను ప్రింట్స్ తీసుకోడానికి ప్రింటర్ వయిపు తిరిగి. ఈ లోపు ఆయనకీ ఫోన్ వచ్చింది .

మా అబ్బాయికి ఎంత రిఫండ్ వచ్చిందండీ, ఫస్ట్ టయిం కదా చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాడు, వాడే ఫోను అన్నారాయన...నేను గబా గబా పేపర్లన్నీ చెక్ చేసాను. అన్నీ ఆయన డాకుమెంట్సే.  కంప్యూటర్లో డీటైల్స్ చూసాను.పిల్లవాడికి మొన్ననే పద్దెనమిది యేండ్లు నిండాయని చూపిస్తోంది డేట్ ఒఫ్ బర్త్ కాలం.. సారీ అండీ మీ అబ్బాయి డాకుమెంట్లు మరిచిపోయినట్లున్నారు మీరు అన్నీ మీవే ఉన్నాయి అన్నాను. లేదండీ ఇక్కడే ఉందీ అంటూ ఒక కాగితం బయటికి లాగారాయన. పేరు ఊరు అన్నీ ఆయనవే. అదే అన్నాన్నేను. ఆయన నవ్వుతు,వాడిదీ నాదీ ఒకటే పేరండీ..సోషల్ ఇన్సురెన్స్ నంబరు చూడండీ అన్నారు..అవును అప్పుడు చూసాను నంబరు....సారీ సార్ నేను ఇప్పటి వరకు తండ్రీ కొడుకులను ఒకే పేరుతొ చూడలేదు అంటూనే అబ్బాయి రిటర్న్స్ చెయ్యడం మొదలెట్టాను. బస్సు 'ఏడుకొండల వాడా వెంకట రమణా' అయ్యింది కాబట్టి ఇంక లేట్ గా వెళ్ళడానికి  మెంటల్ గా ప్రిపేర్ అయ్యి, మాల్ మూసే లోపు అయితే చాలు అని గబా గబా చేస్తున్నాను...స్కేమ్బారిస్ గారన్నారు.. మీరు ఇక్కడికి కొత్తనుకుంటాను...ఇక్కడ ఇలా పేర్లుండటం కామన్...ఇంకా వింత ఏంటంటే మా నాన్నది కుడా ఇదే పేరు... అయితే నా  పేరు చివర జునియర్ అని ఆడ్ చేసారు.  నాకు అలా  ఇష్టం లేదు  తరవాత తీసేసాను అన్నారు.

దేవుడా...., ప్రపంచంలో పేర్లే లేనట్టు తాత తండ్ర కొడుకు అందరికీ ఒకే పేరట బావుంది కత అనుకుంటూ తొందరగా కంప్లీట్ చేసాను. మీరు ఇక్కడ సంతకాలు పెట్టండీ, అబ్బాయిని సంతకాలు పెట్టడానికి రేపు తీసుకొస్తారా అన్నాన్నేను రిఫండ్ వివరాలు చెబుతూ..."తప్పకుండా, మీకు చాలా థ్యాంక్స్ , మీకు లేట్ అయినట్లుంది..నేను డ్రాప్ చెయ్యనా సెంటర్ వరకు "అన్నారు. ఈ లోపు..."హహహ్హ తెలుండ!" యముండ టైపులో వినిపించింది..నాలో నాకు.  తెలుండు మేల్కొని "అయ్యా మేము తెలుగు బాబూ, అంత తొందరగా ముక్కు మొఖం తెలియని వాడి దగ్గర హెల్పు తీసుకోవడమే..మేమెక్కడ ,మా ఆత్మాభిమానమెక్కడ!ఎల్లేల్లెహే -అనేసాడు నేను గబుక్కున వాణ్ని దాచేసి ...థ్యాంక్స్ సార్, నాకు క్లోసింగ్ వర్క్ ఉంది ఇంకా, మీరు వెళ్ళండి... గుడ్ నయిట్ అన్నాను...గుడ్ నయిట్ సి యు అగెయిన్ అని ఆయన వెళ్ళిపోయారు... నేను క్లోసింగ్ కంప్లీట్ చేసి మాల్ మూసే లోపు బయట పడ్డాను. తరవాత రెండు మూడు కేసులు వచ్చాయి ఇలాంటివి...(అబ్బ, పెద్ద డాక్టరు లా పోసు కొట్టాను కాదు ఈ డయిలాగ్ కొట్టి) ..ఇది నాకొక పెద్ద లెసన్.అప్పటి నుండీ 'పేరులోనేముందీ' అనుకుంటూ పేర్లని పక్కన పడేసి ,పేపర్లని సోషల్ ఇన్సురెన్స్ నంబరు తో కొలవడం మొదలు పెట్టాను.

తరవాత వారం కాష్ డిపాసిట్ చెయ్యడానికి బ్యాంకుకి  వెళ్లాను. మెటర్నిటీ సెలవలో ఉన్న రిసెప్షనిస్టు జో-ఆన్ కనిపించింది, పిల్లాడితో సహా. వాడికి మూడో రోజు .. వావ్ ఎలా ఉన్నావ్, ఐ మిస్ యు....అని కవుగిలించుకుని అరిచినంత పని చేసింది...ఈ అరుపులు కవుగిలింతలు నాకు కొత్త...మొహమాటం గా "ఐ యాం గుడ్...బేబీ చాల బాగున్నాడు ఏం పేరు పెట్టారు? "అన్నాను బేబీ  చేతుల్ని నెమ్మదిగా స్పృశిస్తూ (ముట్టుకోవచ్చ లేదా అని అనుమానం..మా అమ్మ అయితే పడేసి తన్నేది అలా  చేతులు కడుక్కోకుండా ఎవరయినా పిల్లల్ని ముట్టుకుంటే ) . పేరు జకారియా అంది...అవునా మీ హస్బెండ్ పేరు అదే కదూ అన్నాను...అవును ఆయన పేరే పెట్టుకున్నాడు అంది...నేను నవ్వుతు "కానీ జునియర్ అని చివరన కలిపారు కదూ" అన్నాను అస్సలు ఆశ్చర్య పోకుండా( స్కేమ్బారిస్ దెబ్బతో...బోల్డు లోక జ్ఞానం వచ్చేసింది మరి)..."జాక్ వర్క్ కి వెళ్ళాడు  .....బాబుని మీ అందరకీ చూపిద్దామని ఆఫీసుకి  తీసుకెళ్ళాను, ఓకే మరి కొంచెం షాపింగ్ చెయ్యాలి " అని చెప్పి వెళ్ళిపోయింది. శాపింగా? ఇంత చలిలో!   ఇక్కడ విచిత్రంగా ఏదో కొంపలు మునిగి పోయినట్లు మూడో రోజే ఇలా పిల్లాడ్ని తీసుకుని బయట తిరుగుతుంటారు..మా ఊర్లో అయితేనా, మూడు నెలలు బయటికి రాము అనుకుంటూ క్యాష్ డిపాసిట్ చేసి బయలుదేరాను.

 నేను డిపాసిట్ చేసిన క్యాష్ తీసుకుని పల్లీలు, సమోసా షాపింగ్  చెయ్యండి మీరు...షాపింగ్ అయ్యాక దయచేసి మీ సీట్ నంబరు లోనే కూర్చోండి...ఎదుర్ సీట్ల మీద కాళ్ళు పెట్ట రాదు..గోడలపై ఉమ్మరాదు. మీ నగలు వస్తువులకి  మీదే  బాద్యత ...సిగరెట్ తాగుట ఆరోగ్యానికి హాని కరం...ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.... గోల్డ్ స్పాట్ ది జింగ్ థింగ్ .....గోల్డ్ స్పాట్. .....

అర్థం కాలేదా......ఇంటర్వెల్ అండీ బాబూ.....

13 వ్యాఖ్యలు:

అశోక్ పాపాయి said...

.....ఇంకా 'అమ్మగారికి దండం బెట్టు, అయ్యగారికి దండం బెట్టు'....ఇంటర్వెల్ అండీ బాబూ.....చలికాలం కదా ఇంత టీ తాగి వస్తాము ఉండండి...))))

తృష్ణ said...

"జంబూ ద్వీపే" మిస్సయినట్లున్నారు....:)

ఆఫీసుకి కాదు కానీ మూడు బస్సులు ఎక్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ నాకూ ఉందండీ.

ఇంతకీ ఇంటర్వెల్ ఎంతదాకా...?

ఆ.సౌమ్య said...

అట్టానా ఇంట్రబిల్లా....సరే అయితే ఓ టీచుక్క పోసుకొనొస్తాం...ఈలోగ మీరు రీలు రెడీ చేసుకోండి.

అశోక్ పాపాయి said...

సరదాగ భలే చెప్పారండి మీ కెనడ జాబ్ మళ్లి మీరు పడుతున్న శ్రమ కూడ వివరించడం చాల గొప్ప విషయం. మీరు ఏమి అనుకోకపోతే చిన్నా మాట మీ అక్షరాలు చిన్నగా వుంటే బాగుటుంది కావచ్చు అని అనిపిస్తూంది.

కొత్త పాళీ said...

చాలా బాగా రాశారు.

"పెద్ద డాక్టరు లా పోసు కొట్టాను"
డాక్టర్లైనా టాక్స్ టైములో ఎకౌంటెంటు ముందు తలవంచాల్సిందే కదండీ, అంచేత ఆ మాత్రం పోజు కొడితే ఏం పర్లేదు. :)

ఈ పేర్ల విషయం - జార్జి ఫోర్మెన్ అని ఒక బాక్సింగ్ వీరుడున్నాడు. ఎప్పుడో మనవడి దాకా ఎందుకు అని చెప్పి తన ముగ్గురు కొడుకులకీ జార్గి 1, 2, 3 అనీ, కూతురికి జార్గెట్ (లేక జార్గియా?)అనీ పెట్టేశాడు. నిజమే ఏదో పేర్లకి కరువొచ్చినట్టు, వెధవ కక్కుర్తి! :)

వేణూశ్రీకాంత్ said...

హ హ భలేరాశారండీ :-) ఇంటర్వెల్ స్టైల్ అదిరింది..

Ennela said...

అశొక్ గారు,కృతజ్ఞతలండీ...టీ తాగేసి బేగెల్లిపొచ్చీసీండి...
ఒక స్నేహితురాలు చిన్న అక్షరాలు చదవలేక పొతున్నను అన్నారని ఫాంట్ పెద్దగా పెడుతున్నాను.. చిన్నది చెసి చూస్తాను నెక్స్ట్ టపాలొ...

తృష్ణ గారు,కృతజ్ఞతలండీ,,అరే అవునండీ జంబు ద్వీపం వ్రాయలేదు... మీరు కూడ ఇలా మూడు బస్సులు మారి ప్రయాణం చేసారా?ఇప్పుడు కొంచెం ఓకే అండీ, కొత్తల్లో ప్రాణం పోయేది...ఎస్పెషల్లీ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు..

సౌమ్య గారు కృతజ్ఞతలు...అట్నే అమ్మయ్యా..బిరానొచ్చెయ్ మాక, రీలు ఇంకో హాల్ల ఆడుతాంది, కొద్దీ టయము పట్టుద్ది...


కొత్త పాళీ గారు, కృతజ్ఞతలండీ, అజ్జిబాబో ఎంత మాటనీసినారండీ బాబో...ఇప్పుడు సెకండ్ పార్ట్ రాయాలంటె చెడ్డా భయమేస్తాందండీ బాబో...


వేణూ గారు, కృతజ్ఞతలండీ..మీకు నచ్చిందా..నాకు చిన్నప్పుడు అవన్నీ చూడ్డం ఇష్టం...మీకు అర్థం అయిపొయ్యి ఉంటుంది....నా జింగ్ థింగ్ ఆడ్ వీరాభిమానం....

శిశిర said...

మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది. ఏ విషయమైనా చాలా సింపుల్‌గా చెప్తారు మీరు.

ఇందు said...

హా బాగుంది ఎన్నెలగారు...మీ ఆఫీసు..దాని పని..మీ మేనెజరు..ఆ గంగిరెద్దు డైలాగ్...హ్హహ్హహ్హా!

>>'అమ్మగారికి దండం బెట్టు, అయ్యగారికి దండం బెట్టు' ఇది కేక!

>>తరవాత రెండు మూడు కేసులు వచ్చాయి ఇలాంటివి...(అబ్బ, పెద్ద డాక్టరు లా పోసు కొట్టాను కాదు ఈ డయిలాగ్ కొట్టి) నాకు సేం అదే అనిపించిందీ ;)

>> స్కేమ్బారిస్ ఈ పేరు మాత్రం భలె వింతగా ఉంది.అదేదో వైరస్ లాగా :))

శివరంజని said...

ennela మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను"

Ennela said...

శిశిర గారు కృతజ్ఞతలండీ, నెక్స్ట్ పార్ట్ మాత్రం కష్టంగా ఉంది..వెరీ టఫ్ క్వస్చన్ పేపర్....హహహహ

ఇందు గారు కృతజ్ఞతలండీ... మీకూ అనిపించిందా పోసె కొట్టినట్టు..కొత్తపాళీగారు చెప్పారుగా అంత కొట్టచ్చు ఫర్వాలేదని..అక్కడ డిసైడు అయిపొయ్యాను మరి..
అవునండీ స్కెంబారిస్ గారి ఇంటి పేరు కూడ గుర్తుంది నాకు paraskavopulous. Greece వాళ్ళని చెప్పినట్టు గుర్తు.

శివ రంజని గారు, కృతజ్ఞతలండీ. మీకు , మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు....కొత్త సంవత్సరంలో మీరు పోస్టులు పోస్టాలని, మీ బ్లాగు కళ కళ లాడాలని కోరుకుంటున్నా...

అశోక్ పాపాయి said...

ennelగారు ....మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Ennela said...

Ashok garu Kritajnatalandee
Meeku, mee kutumbaanikee nutana samvatsara shubhaakaankshalu