
ఆ రోజు ఆదివారం అవడంతో అమ్మతో రిహార్సల్ కి నేనూ, చెల్లి కూడా వెళ్ళాం. చెల్లికి 5వ యేడు, నాకు 7వ యేడు.
నాటకం రిహార్సల్ మొదలయ్యింది. అది జరుగుతుండగా అన్నపూర్ణ గారొచ్చారు. ఈవిడ మా చెల్లి స్కూల్ లో టీచరు. అందుకు చెల్లి కొంచెం భయం భయం గా దూరం జరిగింది. టీచరు గారికి నమస్తే చెప్పమ్మా అంది అమ్మ. నమస్తే టీచర్ అంది చెల్లి. ఆవిడ హాయిగా నవ్వారు.ఆవిడ వెంట ఇంకో ఆవిడ కూడా వచ్చారు. "ఈవిడ మా తోటికోడలి తల్లి అండీ..మా తోటికోడలి పురిటికని వచ్చారు. మధ్యాహ్నం కాస్త తోస్తుందని తీసుకొచ్చా " అన్నారు అన్నపూర్ణ గారు. "నమస్కారమండీ" అన్నారావిడ. అందరూ చిరునవ్వుతో చూసారు. "రండి కూర్చోండి" అన్నది జానకత్త.

అమ్మ మధ్య మధ్య ఆ కొత్తావిడని చూస్తోంది. ఆవిడ కూడా అమ్మని అదోలాగా చూపు తిప్పకుండా చూస్తున్నారు. నేనెందుకో ఇద్దరి వైపు చూసా.నా కళ్ళకి ఇద్దరూ ఒకే లాగా కనిపించారు. నేను కొద్దిగా అయోమయం లో పడ్డా. అమ్మతో గుస గుసగా "అమ్మా ఆవిడ నీ లాగే ఉన్నారు" అన్నా. అమ్మ కూడా " నాకూ అలాగే అనిపిస్తోంది" అంది ఇంకా గుస గుసగా. నాటకం పూర్తి అయ్యింది, జోక్స్ చెప్పే వాళ్ళు, వ్యాసం చదివే ఆవిడ అయ్యాక అమ్మ పాడింది. రెండు సార్లు మొత్తం మళ్ళీ రిపీట్ చేసారు. "అన్నీ బానే వచ్చాయి, కానీ ఇంకా బాగా ప్రాక్టిస్ చెయ్యాలి. సరే మరి, రేపు మధ్యాహ్నం 2 కల్లా అందరూ వచ్చెయ్యండి, పిల్లలు ఇంటికొచ్చేటప్పటికి అవచేసేద్దాం" అన్నది భాస్కరమ్మత్త. అందరూ వెళ్ళిపోవడానికి లేచారు.
కొత్తావిడ అమ్మ దగ్గరకొచ్చి, మీ పాట భలే బాగుందండీ అన్నారు. అమ్మ చిరునవ్వు నవ్వింది. (అప్పట్లో థ్యాంక్యూలూ అవీ అనడం నాకు పెద్దగా గుర్తు లేదు) ."మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది.మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు కూడా ఉంది , మీది ఏ ఊరు" అని అన్నారావిడ. ఫలానా ఊరు అని అమ్మ చెప్పింది. "కొంప దీసి నువ్వు సరోజవు కాదు కదా" ఆశ్చర్యంగా అన్నారావిడ. అమ్మఇంకా ఆశ్చర్య పోయింది, "నా పేరెలా తెలుసు మీకూ" అని! "అయితే నువ్వు.. ..నువ్వు సరోజవేనా " అని ఆవిడ గట్టిగా అరిచారు..."అవునండీ మీరు?" ఏదో గుర్తుకొస్తున్నట్టు అమ్మ కంఠం రుధ్ధమయింది. "నేను సీతనే" అన్నారావిడ అమ్మ చేయి పట్టుకుంటూ. అందరూ వింతగా చూస్తున్నారు. అప్పటికే వీళ్ళిద్దరూ మాటల్లేకుండా ఒకరి భుజాన ఒకరు తల పెట్టుకుని వెక్కి వెక్కి ఒకటే ఏడుపు. అవి ఆనంద భాష్పాలని అందరికీ అర్థం అయ్యింది కానీ, ఇద్దరూ వాటిని తట్టుకునే పరిస్థితిలో లేరు. అన్నపూర్ణ గారు ఖంగారు పడి," పిన్ని గారూ,పిన్ని గారూ " అని సీత గారి చెయ్యి లాగుతున్నారు. ఎవరో ఒకరు కల్పించుకోకపోతే లాభం లేదనుకుందేమో, భాస్కరమ్మ అత్త దగ్గరగా వచ్చి, "ఊర్కోండెహె...ఏమిటీ ఈ సస్పెన్సూ! సినెమాల్లో కంటే ఎక్కువగా ఉందీ,ఇంతకీ కథా కమామీషూ ఏంటొ చెపితే మేమూ ఆనందిస్తాంగా, ఇలా ఏడుస్తూ మా అందరినీ ఏడిపిస్తే ఎలా " అని పరాచకాలాడింది. వెళ్ళబోతున్న వారంతా ఆగి చూస్తున్నారు. ఇద్దరూ వెక్కిళ్ళు ఆపి బలవంతంగా నవ్వారు.
సంగతేంటయ్యా అంటే వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ముల బిడ్డలుట. ఉమ్మడి కుటుంబం . ఇద్దరికీ 3 నెలల వయసు తేడా. 13వ ఏట ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసారుట. పెళ్ళిళ్ళయ్యాక ఒక్క సారెప్పుడో ఇద్దరూ ఒకేసారి పుట్టింటికి వెళ్ళిన గుర్తుట. పెద్ద కుటుంబాలవడం వల్ల అమ్మకి పుట్టింటికి పెద్దగా వెళ్ళే అవకాశం రాలేదనుకుంటా. తరవాత ఇద్దరూ ఒక్కసారి ఎప్పుడూ పుట్టింటికి వెళ్ళలేదుట. అమ్మమ్మ , తాతయ్య చనిపోవడం,నాన్నకి ట్రాన్స్ఫర్లవడం ఇత్యాది కారణాల వల్ల అమ్మ ఇద్దరన్నయ్యలు పుట్టాక పుట్టింటికి ఇంక వెళ్ళలేదు. ఫోన్లు అవీ లేని కారణంగా ఒకళ్ళ వివరాలు ఒకళ్ళకి తెలీలేదు..ఆ మాటకొస్తే చూచాయగా అమ్మ సికందరాబాదులో ఉంటోందని కూడా సీత పిన్నికి తెలీదుట.

అక్కణ్ణుంచీ ఇంక చెప్పేదేముందండీ..అక్కా వాళ్ళింట్లోంచి సీత పిన్ని మకాం మా ఇంటికి మారింది. అక్కా చెల్లెళ్ళిద్దరికీ పగలూ లేదు రాత్రి లేదు.ముప్ఫై ఐదేళ్ళ సంఘటనలు, ఊరి విషయాలు ఏ ఒక్క రోజు సంగతులూ విడవకుండా చెప్పుకుంటూనే ఉన్నారు.మాకు అర్ద్థ రాత్రి ఎప్పుడు మెళకువ వచ్చి చూసినా ఇద్దరూ తెగ ముచ్చట్లు. మాకూ ఒక కొత్తక్క దొరికింది. బోనస్ గా చిన్నారి పాపాయి. పిన్ని ఊరెళ్లి పోయినా అక్క బావగారు ప్రతి రోజూ సాయంత్రం బుజ్జి పాపాయిని తీసుకుని ఇంటికొచ్చేవారు. పిన్ని కూడా తరచుగా వస్తుండేది లెండి.ఏతా వాతా అన్నపూర్ణ గారంటే మా చెల్లికి భయం పోయింది. పాపాయి కోసం అక్కా వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా అన్న పూర్ణక్కా అంటూ పలకరిస్తోంది కూడా!
సినిమాల్లో చిన్నప్పుడు తిరునాళ్ళలో తప్పిపోయిన అక్కా చెల్లెళ్ళో , అన్నదమ్ములో మళ్ళీ దొరికితే నవ్వుకుంటాం కానీ, నేను మాత్రం ఇలా ప్రాక్టికల్ గా చూశేసానండీ అమ్మ ఆనందాన్ని. ఇద్దరినీ చూస్తే మాత్రం కవల పిల్లలేమో అనిపించేది. విశేషం ఏంటంటే, వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దో, ఎవరు చిన్నో ఇద్దరికీ గుర్తు లేదుట. మేము వాళ్ళని సీత పిన్ని, బాబాయని పిలిస్తే, సీత పిన్ని పిల్లలు అమ్మా నాన్నని పిన్ని బాబాయ్ అని పిలిచేవారు.(తరవాతెప్పుడో, ఏవో పౌర్ణమి అమావాస్య లెక్కలేసి తేల్చుకున్నారు కానీ అప్పటికే టూ లేట్ అయిపోయింది. పైగా ఇలా పిలిపించుకోవడం వాళ్ళిద్దరికీ సరదాగా ఉండేది).
అమ్మ పోయాక మేమూ దేశాలు పట్టి తిరుగుతూ చుట్టాల గురించి పెద్దగా పట్టించుకో లేదు. మొన్న గుర్తొచ్చి మా చెల్లిని అడిగా "సీత పిన్ని ఎలా ఉందీ" అని. "అదేంటక్కా పిన్ని పోయి అప్పుడే మూడేళ్ళయిందిగా నీకు తెలీదా" అంది..ఫోన్ లు లేని అమ్మా వాళ్ళ కాలం కంటే వెనకబడి ఉన్నందుకు నన్ను నేను తిట్టుకున్నా. అంతకంటే ఏంచేస్తాం చెప్పండి!!!
12 వ్యాఖ్యలు:
ఎన్నెల గారు వెనుకటి కాలం కన్నా మనం బాగా వెనుకబడి ఉన్నామనేది నిజం. మనవారి గురించి మనం తెలుసుకునే తీరిక లేనంత బిజీ జీవితంలో ఉరుకులు పరుగులు పెడుతున్నాం.
మీ జ్ఞాపకాలు బావున్నాయి. అన్నట్టు రేడియో FM లో ఇప్పుడు "వీరి వీరి గుమ్మడిపండు" అన్నది గంటసేపు ప్రసారం అయ్యే ఒక కార్యక్రమం.
వనజ గారు ధన్యవాదాలండీ.. ఈ ఒక్క టపా మాత్రం నేను ఒక్క వాఖ్య కూడా రాదు అనుకుని వ్రాసాను...ఎందుకంటే ...ఏమో చెప్పడం రావట్లేదు కానీ మీ వాఖ్య చూసి అసలు కిందా మీదా మన్నట్లేదంటే నమ్మండి!కృతజ్ఞతలండీ..
అన్నట్టు వీరి వీరి గుమ్మడి సంగతి నాకు తెలీదు సుమండీ...యీ సారి ఇంటెర్నెట్ లో వెతికి చూస్తా దొరుకుతుందేమో...ఇలా కలుసుకున్న వారి కథలా?
Interesting. అప్పట్లో అవకాశం లేక వాళ్ళు కలుసుకోలేకపోయినా మనస్సుల్లో అభిమానాలు మాత్రం అలానే ఉండేవి. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నా అభిమానాలు కరువవుతున్నాయి. మన పక్క వీథిలో ఉన్న బంధువులని పలకరించటానికి కూడా మనకు తీరదు.
మువ్వ గారూ నిజమేనండీ...నాకు అదే బాధగా ఉంటుంది. ఫోన్లూ , ఇంటర్నెట్టు అవీ పెట్టుకుని కూడా నాకు చాలా విషయాలు 2 యేళ్ళు అయ్యాక తెలుస్తాయి. నేను అందరి గురించీ అడుగుతూనే ఉంటాను. అయితే దూరంగా ఉంటాను కదా బెంగ పడతానేమోనని చాలా విషయాలు నాకు తెలియక్కరలేదు అని కుటుంబ సభ్యులు నిర్ణయించేస్తారు. రెండు మరణాలు కనక సంభవిస్తే, బాగా దూరపు బంధువుల మరణ వార్త చెప్పి, నాకు బాగా దగ్గర అనుకున్న వాళ్ళది చెప్పరు. తరవాతెప్పుడో తెలిసినప్పుడు...ఆ ఫలానా వారు చనిపోయినప్పుడే వీరు చనిపోయారు నీకు చెప్పామనుకున్నాము అని కవర్ చేస్తారు..చాలా సార్లు తిట్టాలనిపిస్తుంది..కానీ దాని వెనక వాళ్ళ మంచి మనసు తెలుసుకుని ఊరుకోవాల్సి వస్తుంది మరి!
ఈ పోస్ట్ మొదటసారి చదివినప్పుడు నా కంట్లో తడి .. .. ఎన్నిసార్లు చదివిన అదే భావన..
వాళ్ళు నా కళ్ళ ముందే కదిలారండి...
ఈ పోస్ట్ మొదటసారి చదివినప్పుడు నా కంట్లో తడి .. .. ఎన్నిసార్లు చదివిన అదే భావన..
వాళ్ళు నా కళ్ళ ముందే కదిలారండి...
శ్రీ గారు కృతజ్ఞతలండీ..మీరు నా కళ్ళతో చూసారన్నమాటా...థ్యాంకూ థ్యాంక్యూ
మరుపురాని అనుభవాలు చాలా మధురం.. లక్ష్మి గారూ.. బాగా వ్రాసారు
ఇలాటి అనుభవాలు వర్ణనాతీతం చాలా బాగుంది
ఇలాటి అనుభవాలు వర్ణనాతీతం చాలా బాగుంది
Vimala gaaru chaalaa thanks andee...
Dhanyavaadaalammaa nedunuri rajeswari gaaru
Post a Comment