మా పెద్దావిడ

Wednesday, January 8, 2014

 మా శైల ఇండియా వెళ్ళినప్పుడల్లా ఆవిడని తీసుకొస్తా అంటుంది. "నువ్వు తెచ్చుకోవాంటే తెచ్చుకో కానీ నా మీద నమ్మకంతో మాత్రం తేకు నాకు ఓపిక , తీరిక లేవు" అని చెప్పా. అయినా వినకుండా బతిమాలుతూనే ఉంటుంది. తను దాదాపు ప్రతి సంవత్సరం వెళుతుంది. ఏదో ఒక సారి చెప్పా పెట్టకుండా తీసుకొచ్చేస్తుందేమో అని భయంగా కూడా ఉంటుంది నాకు. "చూసావుగా ఇల్లు చిన్నది ఎక్కడ కుదురుతుంది " అని వాయిదా వేస్తూ వచ్చా ఈ ఏడేళ్ళూ. "అయినా నువ్వు తీసుకురాలేవు శైలా కష్టం "అని అని కన్విన్స్ చెయ్యడానికి కూడా చూసా. "నీకెందుకు నేను చూసుకుంటాగా, ఏం ఫర్వాలేదు"అంటుంది. ఓ సారి మా సీతయ్య ఉండగా అడిగింది  " ఇంటికెళుతున్నా అన్నయ్యా, ఆవిణ్ణి తీసుకొద్దామని ఉంది, నువ్వు చెప్పు వింటుందేమో" అని . "ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం" అన్నా . "అమ్మాయి అన్ని సార్లు చెప్తుంటే కాదనడానికి నీకు నోరెలా వస్తుందీ. తను వెళుతోంది కాబట్టి తీసుకురానీ మళ్ళీ నీకు కావాలనిపించినప్పుడు ఇండియా వెళ్ళి తీసుకురాగలవా” అని మా సీతయ్య మందలించారు. "నాకు మాత్రం ఇష్టం లేకనా, ఈ చలికి ఆవిడ తట్టుకోవద్దూ" అని దబాయించా. "ఏం కష్టం, అయినా ఇంట్లో ఆవిడ ఉండడం వల్ల మనకి లాభమేగానీ నష్టం ఏంటీ " అంటూ వాదించారు. పైగా "పిల్లలకి జలుబొచ్చినా ,జ్వరమొచ్చినా  బయటికి తీసుకెళ్ళలేక నానా అవస్థలు పడుతున్నాం., ఆవిడుంటే ఆ అవసరం రాదుగా మరి నీ ఇష్టం " అని నా పిల్లల సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టారు. అయినా మొండిగా "నా చదువయ్యాక చూద్దాం "అన్నా.

                                             ****

 ఇల్లు కొన్న దగ్గర నించీ మరీ ఎక్కువగా బతిమాలింది శైల. "అప్పుడంటే స్థలం లేదు  అన్నావు ఇప్పుడేంటీ "అని .నేనూ కొంచెం మెత్తబడ్డా..

"చూద్దాం లే "అనేసా. వేసవిలో ఏవో ఆస్థి తాలూకా వ్యవహారాల కోసం హడావిడిగా  10 రోజుల కోసం ఇండియా వెళ్ళిందని కూడా నాకు తెలియదు. తిరిగి వచ్చాక 4 రోజులాగి తీరిగ్గా ఫోన్ చేసింది " ఆవిడని తీసుకొచ్చా, ఈ రోజు సాయంత్రం దింపనా " అని. "కొన్ని రోజులు శైలా, నాకు  పరీక్షలవుతున్నాయి. అవగానే నేనే స్వయంగా వచ్చి తీసుకొస్తా "అని చెప్పా. కానీ పరీక్షలైపోయినా ఆ పనీ ఈ పనీ వల్ల వెళ్ళలేక పోయా. పరీక్షలయిన వారానికి వర లక్ష్మీ పూజ. "ఆ రోజు ఎలాగూ నువ్వు వస్తావుగా ఆ రోజు తీసుకురా "అన్నా. సరేలే ఆ రోజు మంచి రోజు కదా అని ఆవిడనీ వెంటబెట్టుకొచ్చింది. వద్దు వద్దు అన్నా కానీ మరి బంధాలు ఎక్కడికి పోతాయండీ...చూడగానే భలే సంబరమేసింది. కాళ్ళకి దణ్ణం పెట్టి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా. చిన్నగా తల ఊపి నవ్విందావిడ. మా శైల కళ్ళు మెరిసాయి. బాగానే చూసుకుంటానని భరోసా వచ్చినట్టుంది. "హమ్మయ్య ఇంక నీ ఇష్టం, నా పని తీసుకొచ్చేవరకే "అంది. "అదేంటీ, నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే నీ దగ్గర దింపచ్చుగా" అన్నా. "ఆ ,అంత హడావిడిగా నువ్వెక్కడికెళతావ్ "అని నవ్వింది. "అదేంటదీ మీ అన్నయ్య అమెరికాలో ఉద్యోగం చేస్తుంటే వెళ్ళి 10 , 15 రోజులుండి రావద్దూ" అన్నా. " పది రోజులకైతే నువ్వేమీ ఖంగారు పడక్కరలేదు. ఆవిడ చూసుకో గలదు. ఇండియా వెళ్ళినప్పుడు 2, 3 నెలలుంటావనుకుంటే నా దగ్గర దింపు, నాకేం ఫర్వాలేదు "అంది. భోజనాలవీ అయ్యాక శైల వెళతానంది. సరే ఎలాగూ తీసుకొచ్చింది కాబట్టి బొట్టు పెడుతూ "థ్యాంక్ యూ" అన్నా. "భలే దానివే ఇలా థ్యాంక్ యూ లు అవీ ఏంటి మన మధ్య! ఆవిడని బాగా చూసుకో చాలు "అని చెప్పి వెళ్ళిపోయింది . శైల అటు వెళ్ళగానే మా సీతయ్య నన్ను పిలిచి, ఆవిడకి ఇక్కడైతే సౌకర్యంగా ఉంటుందేమొ కదా  అని హాల్ లో చూపించారు. నాకు  చిర్రెత్తింది. "మొదటి నించీ చెపుతున్నా నాకు ఆవిడ ఇష్టమే కానీ ఇంట్లో చచ్చినా పెట్టుకోను. మీరు తీసుకురమ్మన్నారు  కాబట్టి పెరట్లో అరేంజ్ చెయ్యండి " అన్నా. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కాబట్టి "అని విసుక్కుంటూ పలుగూ పార పట్టుకుని పెరట్లోకివెళ్ళారు. అప్పటి నించీ అక్కడే ఆవిడ మకాము. ఈ లోపు నేను ఆవిడకి పసుపు రాసి బొట్టు పెట్టా. రెండు చామంతుల్ని తలలో తురిమా. దప్పికతో ఉన్నట్టనిపించి మంచి నీళ్ళిచ్చా. ఆవిడ మొదటి నించీ అంతే. అస్సలు మాట్లాడదు. అన్నీ మనమే చూసుకోవాలి. సంతోషమేస్తే చిన్నగా తల ఊపుతూ నవ్వుతుందంతే.

                                                     ***

రెండు నెలలు సరదాగానే గడిచాయి. నేనూ బాగానే చూసుకుంటున్నా. ఆవిడ మొహం సంతోషం తో కళ కళలాడుతోంది. సెప్టెంబరు రాగానే చలి మొదలయ్యింది. బయటికి నీళ్ళు వెళ్ళే పంపులన్నిటిలో నీళ్ళు గడ్డ కట్టి పగిలిపోకుండా  బయటకి నీళ్ళు వచ్చే పంపులన్నిటికీ నీటి సరఫరా ఆపేసి, పైపులన్నీ లోపల పడేసాము. సీతయ్య నెమ్మదిగా నా దగ్గరకొచ్చి "నీళ్ళు లేకుండా ఆవిడ ఎలా” అన్నారు. "ఇంట్లోకి తేనని ముందే చెప్పాగా కావాలంటే శైల దగ్గర దింపేద్దాం. వాళ్ళది మన కంటే పెద్ద ఇల్లు "అన్నా. "అలా మాటి మాటికి శైల ని ఎలా ఇబ్బంది పడతాము ఇంక కష్టమైనా  నష్టమైనా మనతోనే "అన్నారు. సరే అయిష్టంగానే ఒప్పుకున్నా.రెండు రోజులు బాగానే ఉంది కానీ మూడో రోజు నించీ ఆవిడ ముఖం అదోలా పెట్టు కుంది. "ఆవిడ ఎందుకో లోపలికి వచ్చినప్పటి నించీ సంతోషంగా లేనే లేదు" ఈయనతో అన్నా."కొంచెం గాలి మార్పు కదా వాతావరణం కూడా మారిందిగా అలవాటు పడుతుందిలే నెమ్మదిగా "అన్నారు. ఇక్కడ చలి కాలం అందరం బాగా నీళ్ళు తాగాలి. లేకపోతే ఒంట్లో నీటి శాతం తగ్గి శరీరం నల్లగా అయిపోతుంది. అది తెలుసు కాబట్టి నేనూ సమయానికి నీళ్ళూ అవీ ఇస్తున్నా. అయినా ఆవిడ ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. నాకు చాలా బాధగా ఉంది. ఇంతకన్నా ఏం చెయ్యగలం అని. పోనీ సాయంత్రం శైలాని అడుగుదాం అనుకున్నా. సాయంత్రం నా పంజాబీ స్నేహితురాలొచ్చింది. ఆవిడని చూసి పలకరింపుగా నవ్వి నమస్కారం పెట్టింది. ఆవిడ పెద్దగా పట్టించుకోలేదు. "చూడబ్బా ఇదీ పరిస్థితీ" అన్నా. "ఫరవాలేదులే నీకు తెలుసుగా ఇక్కడ డి-హైడ్రేషన్ అవుతుంది. దాని వల్ల నీరసంగా ఉంటుంది ,  ఆరారగా నీళ్ళు ఇవ్వు సరిపోతుంది అంది.  సరే అన్నా.  పిల్లలు హాస్టల్ ల కెళ్ళిపోతుంటే అవీ ఇవీ కొనడం, వండడం తో పెద్దగా చూసుకోలేదు కానీ ఇంకో నాలుగు రోజులవగానే ఆవిడ మరీ నీరస పడింది.  నీళ్ళల్లో ఉప్పూ పంచదారా వేసి పట్టించా... నీళ్ళన్నీ ఉమ్మేసిందావిడ. ఇల్లంతా పడ్డాయి. నాకు తెగ కోపమొచ్చింది.   అయ్యో ఏం తప్పు చేసాననండీ ఇలా బాధ పెడుతున్నారు అని నొచ్చుకున్నా. ఏమీ మాట్లాడకుండా మొహం ధుమధుమ లాడించింది. సీతయ్యని తీసుకొచ్చి చూపించా " అసలేమిటీ ఈవిడ ప్రాబ్లం " అని. 

" నువ్వు అతిగా పట్టించుకుంటే అంతే. ఆవిడ మానాన ఆవిణ్ణి వదిలెయ్యి కొన్ని రోజులు ఆవిడకేంకావాలో ఆవిడే చూసుకుంటుందిలే "అన్నారు. నా భయం నాది. ఈ పరిస్థితిలో శైల వచ్చి చూసిందంటే ఏమనుకుంటుందీ అంత దూరం వెళ్ళి తీసుకొస్తే ఇదా నువ్వు చూసేదీ అనుకోదూ అని బెంగ పడ్డా. ఆవిడకి చలిగా ఉందేమోనని అనుమానం వచ్చి ఆవిడ మంచాన్ని వేడి  గాలి వచ్చే వెంట్ కి కొంచెం దగ్గరగా జరిపా. రెండు రోజులక్కూడా ఏమీ మార్పు రాలేదు. రాను రాను ఎంత బాగా చూసుకున్నా కూడా ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. "అనవసరంగా తెచ్చామేమో ఆవిడ అక్కడుంటేనే బాగుండేది"అన్నా.. "ఏడుస్తూ వ్యవసాయం చేస్తే కాడీ మోకూ దొంగలెత్తుకెళ్ళారుట. మొదట్నించీ ఏడుస్తూనే ఉన్నావ్..కానీలే ఏంచేస్తాం "అన్నారు ." అంత పరుషం మాటలెందుకండి ఏదో నాకు అలా అనిపించిదంతే "అన్నా నెమ్మదిగా. రాను రాను పరిస్థితి విషమించింది. శైల కి ఫోన్ చేసి "శైలా ఆవిడ బతకదేమో"అన్నా భయంగా . ఒక వైపు తనేమనుకుంటుందో అన్న భయం ఉన్నా.. మళ్ళీ చెప్పలేదెందుకని అంటుందేమో, పైగా తను ఎప్పుడైనా అకస్మాత్తుగా ఇటు వైపు వచ్చి చూసినా ఇంత దాకా ఏం చేస్తున్నారు అని కోప్పడుతుందేమో అనిపించి చెప్పా. తను చాలా తేలిగ్గా తీసుకుని "ఫర్వాలేదు భయపడకండి..ఏమీ అవ్వదు నేను చెప్తున్నాగా నాలుగు రోజుల్లో బాగవుతుంది "అంది. ఎలా చెప్పగలుగుతున్నావిలా అన్నా బేలగా..."పిల్లా, బయటి నించి ఇంట్లోకి తెస్తే వాతావరణం మార్పు అలవాటు పడడానికి సమయం పట్టదా. వచ్చే సంవత్సరం ఇంకొంచెం ముందుగానే ఇంట్లోకి తీసుకురా, ఈ సారి కొంచెం ఆలస్యం గా తెచ్చినట్టున్నావు "అంది. "నేను ఆవిడ్ని బయట పెట్టానని నీకు తెలుసా, ఎవరు చెప్పారు!" అని ఆశ్చర్య పోయా."నువ్వు తీసుకురావద్దని చెప్పినప్పుడే నాకు అర్థమయ్యింది నువ్వు ఇంట్లో పెట్టుకోవని.   అసలు చలికాలం ఇంట్లో పెట్టుకోవలసి వస్తుందనేగా నువ్వు తీసుకురావద్దన్నావు "అంది. "అయితే ఫరవా లేదా నువ్వేమీ అనుకోవా "అన్నా.

 అనుకోవడానికేముంటుందీ, మనుషులకే లేదు ఇంక చెట్ల గురించేమనుకుంటాం. బతక్క పోతే మళ్ళీ తెస్తాలే "అంది. "మీ అన్నయ్య తెగ సంబర పడ్డారు పిల్లలకి దగ్గొచ్చినా జ్వరమొచ్చినా చిన్నప్పుడు అత్తయ్య తులసి రసంలో తేనె కలిపి ఇచ్చేవారు. మాటి మాటికీ డాక్టర్ల దగ్గరికేం వెళతాం. ఇంట్లో  చెట్టుంటే భలే ఉంటుందీ అని..పైగా నువ్వేమో అంత దూరం నించీ తెచ్చావయ్యే "అన్నా. "ఏం చేస్తాం మనకి అదృష్టం ఉంటే బతుకుతుందీ లేకపోతే లేదు..ఇంక నీళ్ళు పొయ్యకు ఎక్కువయినట్టున్నాయి ఇంక చూసీ చూడనట్టు వదిలెయ్యి "అంది. ఆకులన్నీ రాలిపోయాయి. ఇంక బయట పెట్టేద్దాం అనుకుని తియ్యబోయా. ఒక కణుపులో చిన్నగా చిగురు కనిపించింది.. పిచ్చి పిచ్చిగా సంతోషమేసింది.  “మా పెద్దావిడ బతికింది శైలా థ్యాంక్యూ యూ థ్యాంక్యూ” అని అరిచి అరిచి చెప్పి , మళ్ళీ అరిచి అరిచి సీతయ్యని పిలిచి చూపించా...

బతికిందని సంతోషంతో అలికి, ముగ్గులేసి, ప్రదక్షిణలు చేసి, మల్లెల్లు, మొల్లలు , మందారాలు అవీ తెచ్చి పూజించడం ......అవీ లేకపోయినా రోజూ చిటికెడు నీళ్ళు జల్లుతున్నా.